ఫోర్జరీ సంతకాలతో రుణం స్వాహా
కోదాడ: మున్సిపల్ కమిషనర్ సంతకాలను ఫోర్జరీ చేసి రూ.10లక్షల రుణం తీసుకొని, తమకు రూ.3లక్షలు మాత్రమే ఇచ్చారని కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ సమభావన సంఘం సభ్యులు బుధవారం ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వివరాలు.. కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డుకు చెందిన 10 మంది మహిళలు గాంధీ సమభావన సంఘం పేరుతో గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. వీరు రుణం కోసం కోదాడ యూనియన్ బ్యాంక్‌లో అకౌంట్ తీశారు. వీరికి ముందుండి రుణం ఇప్పించడంలో మహిళా కౌన్సిలర్ కీలకపాత్ర పోషించారు. అనంతరం బ్యాంక్ రుణం ఇచ్చిందని చెప్పి సభ్యులకు ఒక్కొక్కరికి రూ.30వేల చొప్పున రూ.3లక్షలు పంచారు. కానీ బ్యాంక్ జారీ చేసిన నోటీసులో ఒక్కొక్కరు రూ.లక్ష రుణం చెల్లించాలని పేర్కొన్నారు. దీంతో సభ్యులు లబోదిబోమంటూ బ్యాంక్‌ను ఆశ్రయించగా.. తాము రీసోర్స్‌పర్సన్ కెజ్జమ్మ సమక్షంలోనే రూ.10లక్షలు రుణం మంజూరు చేసినట్లు చెప్పడంతో అవాక్కయ్యారు. తమకు రూ.3లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా రూ.7 లక్షలను వార్డు కౌన్సిలర్, ఆర్‌పీ కాజేశారని గ్రూప్ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే సదరు గ్రూప్ ఏర్పాటు చేసిన సమయంలో ము న్సిపల్ కమిషనర్‌గా మహేశ్వరరెడ్డి ఉన్నారు. కానీ సభ్యులకు రుణం ఇవ్వాలని మున్సిపాలిటీ నుంచి సిఫారసు చేసిన పేపర్లపై కమిషనర్ రామానుజులరెడ్డి సంతకం చేయడం గమనించదగ్గ విషయం. ఉద్దేశపూర్వకంగానే రుణాన్ని కాజేయడానికి ము న్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు స్పష్టమవుతుందని పలువురు సభ్యులు అంటున్నారు. ఈ విషయంలో మున్సిపాలిటీ అధికారులు, బ్యాంక్ సిబ్బది విచారణ చేయకుండానే రుణాలు మంజూరు చేయడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఫ రూ.10లక్షలు రుణం మంజూరు
ఫ రూ.3లక్షలు మాత్రమే ఇచ్చారని
ఆరోపిస్తున్న మహిళా సంఘం సభ్యులు
ఫ అధికారులకు ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment