విజ్ఞాన సదస్సును విజయవంతం చేయాలి
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పట్టణంలో ఈనెల 22న గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయస్థాయి ‘గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు –2024’ను విజయవంతం చేయాలని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గున్నా రాజేందర్‌రెడ్డి, సదస్సు కన్వీనర్ పడమటి పావనిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాటూరి అశోక్ పేర్కొన్నారు. యాదగిరిగుట్టలో శుక్రవారం విజ్ఞాన సదస్సు ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. సుస్థిర విద్య, ప్రకృతి వైద్యం, సేంద్రియ వ్యవసాయం, గ్రామీణ పరిశ్రమలు, ఇంధన వనరులు, పర్యావరణం, క్రీడలు, మహిళా సాధికారత, నీటి సంరక్షణ అంశాలపై సదస్సులో చర్చించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా గాంధీ ఫొటో గ్యాలరీ, చరక ప్రదర్శన, గ్రామ నిర్మాణం, పురాతన, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, ప్రకృతి పంటలు, ఎద్దు గానుగ, యోగా, మల్కం గేమ్ ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. వీటితో పాటు పది రాష్ట్రాల్లో సేంద్రియ వ్యవసాయం, సమీకృత వ్యవసాయం, వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న రైతులు, అనుబంధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, జర్నలిస్టులకు కిసాన్ సేవారత్న అవార్డులు ప్రదానం చేసి సత్కరించనున్నట్లు తెలిపారు. అలాగే మున్సిపల్ కార్యాలయంలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు వివరించారు. సదస్సుకు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మెరుగు మధు, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ జిల్లా అధ్యక్షుడు కొత్త బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకూర వెంకటేశం, మండల అధ్యక్షులు వెల్ధుర్తి భాగ్యలక్ష్మి, కాధూరి అచ్చయ్య, మిర్యాల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment