ఒక్కటై తోడేస్తున్నారు!
సైదాపురం –మాసాయిపేట వాగు వెంట విచ్చలవిడిగా తవ్వకాలు
నెలవారీ మామూళ్లు
వాగు పొడవునా ఫిల్టర్ ఇసుక దందా సాగుతున్నా అధికారులు నోరు మెదపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అండదండలతోనే దందా నడుస్తుందని, ఇందుకు గాను ప్రతి నెలా నెలవారీ మామూళ్లు వెళ్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి ఫిల్టర్ ఇసుక దందాపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్నారు.
ఫ అధికారుల అండతో
పెద్ద ఎత్తున ఫిల్టర్ ఇసుక తయారీ
ఫ పగలు డంపింగ్ చేసి.. రాత్రి లోడింగ్
ఫ రోజూ రూ.లక్షల్లో వ్యాపారం
ఫ తెలిసినా పట్టని మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖలు
యాదగిరిగుట్ట రూరల్ : అడ్డదారుల్లో సంపాదనకు అలవాటుపడిన కొందరు వ్యక్తులు.. అధికారుల అండదండలతో సైదాపురం – మాసాయిపేట వాగును తోడేస్తున్నారు. నిషేధమని తెలిసినా వాగు వెంట తవ్వకాలు జరుపుతూ.. మోటార్ల సాయంతో ఫిల్టర్ చేసి ఇసుక తీస్తున్నారు. పగటి పూట డంప్ చేసి.. రాత్రి సమయంలో ట్రాక్టర్ల ద్వారా పట్టణాలకు రవాణా చేస్తున్నారు.
వాగు పొడవునా తవ్వకాలే..
యాదగిరిగుట్ట పట్టణానికి కూతవేటు దూరంలో సైదాపురం – మాసాయిపేట, మైలార్‌గూడెం గ్రామాలను కలుపుతూ వలిగొండ చెరువుకు వెళ్లే వాగు ఉంది. ఇది దాదాపు మూడు కిలో మీటర్ల పొడవునా ఉంటుంది. ప్రస్తుతం వాగులో గోదావరి జలాలు ప్రవహిస్తుండడంతో ఇసుక తరలించేందుకు వీలుగా లేదు. దీంతో అక్రమార్కులు కొత్తమార్గం ఎంచుకున్నారు. వాగు ఒడ్డు భూములను జేసీబీలసాయంతో తవ్వుతూ మోటార్ల ద్వారా మట్టిని ఫిల్ట ర్ చేస్తున్నారు. యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం, జంగపల్లి, దాతర్‌పల్లి, ధర్మారెడ్డిగూడెం గ్రామాల్లోనూ ఫిల్టర్ ఇసుక దందా జోరుగా నడుస్తుందని, రోజూ 50 ట్రాక్టర్ల వరకు ఇసుక తీస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా వ్యవసాయ పొలాలు దెబ్బతింటున్నాయని, బోర్లు కూడా పూడిపోయే ప్రమాదం ఉందని సమీప రైతులు వాపోతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ట్రాక్టర్ ఇసుక రూ.4వేల వరకు..
ఫిల్టర్ ఇసుకను అక్రమార్కులు రాత్రి సమయంలో ట్రాక్టర్ల ద్వారా పట్టణాలకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ రూ.4వేల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాగు పరీవాహకంలో 300 ట్రాక్టర్ల వరకు ఇసుక డంపులు ఉన్నాయి.
మా దృష్టికి రాలేదు
సైదాపురం – మాసాయిపేట వాగు వెంట ఫిల్టర్ ఇసుక తయారు చేసి విక్రయిస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. తవ్వకాలపై విచారణ చేపట్టి వాస్తవమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
–దేశ్యానాయక్, యాదగిరిగుట్ట తహసీల్దార్
Comments
Please login to add a commentAdd a comment