ఐదు ఇంటర్ చేంజ్ కూడళ్లు!
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఉత్తర రింగ్‌లోని యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఐదు ఇంటర్ చేంజ్ కూడళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు జాతీయ రహదారులు, ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు వాటిని ఏర్పాటు చేయనున్నారు. రహదారి నిర్మాణం పూర్తయితే జిల్లా రూపురేఖలు మారనున్నాయి. వివిధ ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగడం ద్వారా ఈ ప్రాంతం ఎకనమిక్ కారిడార్ గా, వ్యాపారపరంగా మరింత అభివృద్ధి చెందనుంది.
పల్లెలు, పట్టణాలను కలిపేలా..
పల్లెలు, పట్టణాలను కలిపేలా ఐదు ఇంటర్ చేంజ్‌లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు వరుసల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం ఇటీవల ఐదు ప్యాకేజీల్లో రీజినల్ రింగ్ రోడ్డు పనులకు ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు. హైదరాబాద్ మహానగరంపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడం, గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి నమూనాతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రీజినల్ పనులు చేపడుతున్నాయి. జిల్లాలోని తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లో 59.33 కిలోమీటర్ల రోడ్డు కోసం 235 హెక్టార్ల భూమి అవసరం ఉంది. రాయిగిరి, చౌటుప్పల్ మినహా మిగతాచోట్ల భూసేకరణ, పరిహారం కొలిక్కి వచ్చింది. టెండర్లు ప్రకటించిన నేపఽథ్యంలో యంత్రాంగం పనుల్లో వేగం పెంచింది.
జాతీయ, రాష్ట్ర రహదారులను దాటుకుంటూ..
జిల్లాలో ఐదు చోట్ల జాతీయ, రాష్ట్ర రహదారులను దాటుకుంటూ రీజినల్ రింగ్ రోడ్డు వస్తోంది. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు ఉన్న 161 కిలోమీటర్ల ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్డులో భాగంగా జిల్లాలో 59.33 కిలోమీటర్ల పొడవున గ్రామాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాలకు ఉన్న ప్రధాన రహదారులపై జిల్లాతో లింక్ ఉన్న రోడ్లపై ఇంటర్ చేంజ్ జంక్షన్లు నిర్మిస్తారు. వీటితోపాటు కొన్నిచోట్ల టోల్‌ప్లాజాలు, రెస్ట్ ఏరియాలు, ఆర్‌ఓబీలు నిర్మిస్తారు. ఇందులో అండర్‌పాస్‌లు, ఓవర్, మేజర్, మైనర్ బ్రిడ్జీలు, బాక్స్ కల్వర్టులు రానున్నాయి.
భూ సేకరణ ఈ గ్రామాల నుంచే..
చౌటుప్పల్ మండలం : చిన్నకొండూరు, చౌటుప్పల్, తాళ్ల సింగారం, లింగోజు గూడెం, నేలపట్ల, తంగెడుపల్లి.
వలిగొండ మండలం : పహిల్వాన్‌పూర్,రెడ్ల రేపాక, పొద్దటూరు, వర్కట్ పల్లి, గోకారం.
భువనగిరి మండలం : రాయిగిరి, కే సారం, పెంచికల్‌పహాడ్, తుక్కాపూర్, గౌస్‌నగర్, ఎర్రంబెల్లి.
యాదగిరిగుట్ట మండలం : మల్లాపూర్, దాతర్‌పల్లి.
తుర్కపల్లి మండలం : వీరారెడ్డి పల్లి, కోనాపూర్, దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్, వేల్పల్లి.
రీజినల్ రింగ్ రోడ్డులో భాగంగా రూపుదిద్దుకోనున్న ఇంటర్ చేంజ్‌లు
పట్టణాలు, పల్లెలతో అనుసంధానం
హైదరాబాద్‌పై ట్రాఫిక్
ఒత్తిడిని తగ్గించడమే లక్ష్యం
పూర్తయితే మహానగరంతో
లింక్ లేకుండా ప్రయాణం
ఉత్తర రింగ్‌పై సీఎస్ సమీక్ష
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం భూ సేకరణపై ప్రభుత్వం వేగం పెంచింది. ఇప్పటికే రోడ్డు పనులకు ఐదు బిట్లుగా టెండర్లు ఆహ్వానించిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం హైదరాబాద్ సెక్రటేరియట్‌లో సీఎస్ శాంతకుమారి రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణపై కలెక్టర్ హనుమంతరావుతోపాటు జిల్లా రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భువనగిరి, చౌటుప్పల్ పరిధిలోని భూసేకరణ, పరిహారం చిక్కులతోపాటు రాయిగిరి, చౌటుప్పల్ రైతులు అలైన్‌మెంట్ మార్చాలని చేస్తున్న ఆందోళనపై చర్చించారు. రైతుల ఆందోళనలతోపాటు, భూములకు ఇచ్చే నష్టపరిహారం పెంపు విషయంపై కలెక్టర్.. సీఎస్‌కు వివరించినట్టు సమాచారం. కాగా కాగా తుర్కపల్లి, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సేకరించే భూమి 235 హెక్టార్లుగా తేలింది.
జిల్లా పరిధిలో నిర్మాణ వివరాలు
రోడ్డు నిడివి 59.33 కి.మీ.
అవసరమైన భూమి 235 హెక్టార్లు
జంక్షన్లు ఎక్కడెక్కడంటే..
భువనగిరి–ప్రజ్ఞాపూర్ (స్టేట్ హైవే–17) దగ్గర రోటరీ కమ్స్ ఫ్లైఓవర్ విధానంలో ఇంటర్ చేంజ్ జంక్షన్ నిర్మిస్తారు.
యాదాద్రి–కీసర రోడ్డులో రోటరీ కమ్స్ ఫ్లై ఓవర్ విధానంలో నిర్మాణం.
హైదరాబాద్–వరంగల్ (ఎన్‌హెచ్–163) మార్గంలో డబుల్ ట్రంపెట్ పద్ధతిన నిర్మించనున్నారు.
భువనగిరి–నల్లగొండ రోడ్డులో రోటరీ కమ్స్ ఫ్లై ఓవర్ విధానంలో ఉండనుంది.
హైదరాబాద్–విజయవాడ (ఎన్‌హెచ్–65)మార్గంలో సింగిల్ ట్రంపెట్ విధానంలో వీటిని నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment