దాడి ఘటనపై విచారణ
గుర్రంపోడు: మండలంలోని జూనూతుల గ్రామానికి చెందిన మారపాక సుధాకర్‌పై ఈ నెల 3వ తేదీన బ్రాహ్మణగూడెం గ్రామంలో అదే గ్రామానికి చెందిన బెల్లి వెంకన్న, పగడాల సైదులు మరికొందరు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనపై సోమవారం దేవరకొండ ఏఎస్పీ మౌనిక విచారణ జరిపారు. బాధితుడితో పాటు సాక్ష్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఏఎస్పీ వెంట కొండమల్లేపల్లి సీఐ ధనుంజయగౌడ్, గుర్రంపోడు ఎస్‌ఐ పసుపులేటి మధు ఉన్నారు.
సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు
నల్లగొండ: సంక్రాంతి సెలవుల్లో ఊర్లకు వెళ్లేవారికి నల్లగొండ టూటౌన్ పోలీసులు పలు సూచనలు చేశారు. ఊరికి వెళ్లే సమయంలో విలువైన వస్తువులని వెంట తీసుకెళ్లాలని, డబ్బులు, బంగారం బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని సూచించారు. ఊరికి వెళ్లే వారు పక్కన ఇంటి వారికి, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇంటి చుట్టూ లైట్లు వేసి ఉంచాలని, ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే 100కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలని, రద్దీగా ప్రదేశాల్లో, బస్టాండ్, రైల్వే స్టేషన్‌లో ఉన్నప్పుడు లగేజ్ బ్యాగ్‌లతో పాటు సెల్‌ఫోన్లు జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు.
పెంచిన రేట్ల జీఓ విడుదల చేయాలని ధర్నా
నల్లగొండ టౌన్: సివిల్ సప్లయ్ హమాలీ కార్మికులకు పెరిగిన రేట్ల జీఓను విడుదల చేసి అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ అధికారులు జీఓను విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో దొనకొండ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, భద్రయ్య, ఆంజనేయులు, నాగరాజు, వెంకటయ్య, లింగయ్య, లింగస్వామి, జానయ్య, మహేష్, నాగయ్య, శ్రీను, కృష్ణయ్య, రఘు, చంటి, సత్యం, లక్ష్మయ్య, అశోక్, అంజి, లింగం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment