బద్వేలు అర్బన్ : పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో మంగళవారం తెల్లవారుజామున ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ రెండు భాగాలుగా విడిపోయింది. పట్టణంలోని సుమిత్రానగర్‌కు చెందిన నరసింహులు తెల్లవారుజామున తన ట్రాక్టర్‌లో వస్తుండగా నాలుగు రోడ్ల కూడలి వద్దకు వచ్చేసరికి నెల్లూరు నుండి బళ్ళారికి బొగ్గు లోడుతో వెళుతున్న లారీ వేగంగా ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ట్రాక్టర్ ఇంజన్ భాగం రెండు ముక్కలుగా విరిగిపోయింది. ప్రమాదం తెల్లవారుజామున జరిగిన నేపథ్యంలో జనసంచారం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్‌లైంది. విషయం తెలుసుకున్న అర్బన్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన ట్రాక్టర్‌ను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అలాగే ప్రమాదానికి కారణమైన లారీని స్టేషన్‌కు తరలించారు. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఉత్సాహంగా జిల్లాస్థాయి స్విమ్మింగ్ ఎంపికలు
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ క్రీడాపాఠశాలలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి సబ్‌జూనియర్, జూనియర్ విభాగం స్విమ్మింగ్ ఎంపికలకు క్రీడాకారుల నుంచి చక్కటి స్పందన లభించింది. ఈ ఎంపికలను క్రీడాపాఠశాల ప్రత్యేకాధికారి కె. జగన్నాథరెడ్డి ప్రారంభించారు. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్. రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు డిసెంబర్ 7, 8 తేదీల్లో విశాఖపట్నంలోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపికలు నిర్వహించి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్విమ్మింగ్ కోచ్‌లు రాజేంద్ర, ధనుంజయరెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.
జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు..
బాలుర విభాగం : యశ్వంత్, కార్తికేయదేవ రాయల్, నాగవర్ధన్, జ్ఞాన అఖిలేష్, లక్ష్మినారాయణ, త్రిభువన్‌రెడ్డి, మాధవ, షణ్ముఖ్, శ్రీవెంకటసాయి, వెంకటశ్రీరామ్, ఆదిశేషారెడ్డి.
బాలికల విభాగం : మోక్షప్రియ, ఎస్. ఆల్ అమీన్.
కార్మికుల హక్కులను నిర్వీర్యం చేయడం తగదు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కార్మిక వర్గంపై దాడులు చేస్తూ, కార్మిక హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.నాగ సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ పిలుపునిచ్చారు. మంగళవారం కడప నగరంలోని హోచిమన్ భవన్‌లో ఏఐటీయూసీ జిల్లా ఆఫీస్ బేరర్స్, అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున రెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేసి. బాదుల్లా, ఉపాధ్యక్షులు మంజుల, చాంద్ బాషా కార్యదర్శులు మద్దిలేటి, శ్రీరాములు అనుబంధం సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై కేసు నమోదు
ప్రొద్దుటూరు క్రైం : ప్రభుత్వ నిధులు దుర్వినియోగం వ్యవహారానికి సంబంధించి గోపవరం మాజీ సర్పంచ్ కే దేవీప్రసాద్‌రెడ్డిపై రూరల్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రూ.61.36 లక్షల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం వ్యవహారంలో రకవరి చేయడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని లోకాయుక్త ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీఎల్‌పీఓ తిమ్మక్క రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవీప్రసాద్‌రెడ్డి సర్పంచ్‌గా పని చేసిన కాలంలో 13,14 ఆర్థిక సంఘం నిధులను దుర్వినియోగం చేసినట్లు డీఎల్‌పీఓ ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
పందిని ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం
తొండూరు : మండల పరిధిలోని గంగనపల్లె గ్రామానికి చెందిన నల్లమేకల శివ కుమార్ అనే వ్యక్తి పులివెందులకు మంగళవారం ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో ప్రమాదవశాత్తు పంది అడ్డు రావడంతో ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో శివకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో హుటాహుటిన 108 వాహనంలో పులివెందులలోని ఓ ప్రవేటు ఆసుపత్రికి అతడిని తరలించారు. తొండూరు ఎస్‌ఐ పెద్ద ఓబన్న కేసు నమోదు చేస్తామన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మండల పరిశీలకుడు బండి రామమునిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వ్యక్తిని పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment