రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది
కడప అర్బన్ : రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోంది. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బి అంజాద్‌బాషా అన్నారు. మంగళవారం సాయంత్రం కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో వున్న వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పరామర్శించారు. అనంతరం మీడియాతో రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోందన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తే కేసులను పెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా భయపెట్టేందుకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులను అన్యాయంగా పెడుతున్నారన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పోలీసులు నిజానిజాలు తెలుసుకోకుండా అరెస్ట్ చేయడం భావ్యం కాదన్నారు. టీడీపీ నేతలు చెప్పినట్లే పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి 2021లో సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టినట్లుగా ఐటిడిపి టీంకు సంబంధించిన వారు పోస్టులు పెట్టారనీ, అదే సాకుగా తీసుకుని అక్రమ కేసులను పెట్టారన్నారు. ఈక్రమంలోనే వర్రా రవీంద్రారెడ్డికి ఓ కేసులో 41ఏ నోటీసును ఇచ్చి, మరో ఎస్సీ, ఎస్టీ కేసును బనాయించి, ఇంకా సెక్షన్‌లను పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారన్నారు. వర్రా రవీంద్రారెడ్డితో పాటు ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు, సానుభూతిపరులకు వైఎస్‌ఆర్‌సీపీ అండగా వుంటుందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై అక్రమ కేసులను పెట్టిన అధికారులు జాగ్రత్తగా వుండాలన్నారు. అలాంటి వారికి ఖచ్చితంగా అంతకు పదిరెట్లు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బి అంజాద్‌బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో డైవర్షన్ పాలన జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా వైఎస్‌ఆర్‌సీపీకి ఓట్లు వేసిన వారిపై, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై, సానుభూతిపరులపై కక్షసాధింపు చర్యలలో భాగంగా కేసులను బనాయించి అక్రమంగా అరెస్ట్‌లు చేస్తున్నారన్నారు. జమిలి ఎన్నికలు వస్తే వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుందని, అపుడు కక్షసాధింపు చర్యలకు పాల్పడిన అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కడప నగర డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ చైర్మన్ పులి సునీల్‌కుమార్, వైఎస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వినోద్‌కుమార్, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర యువజన నాయకుడు షఫీ, వైఎస్‌ఆర్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ కువైట్ అధ్యక్షుడు సీహెచ్ ఇలియాస్, కార్పోరేటర్ ఎస్‌ఎండీ షఫీ, నాయకులు దాసరి శివ, రాయల్ బాబు, షఫీ, వైఎస్‌ఆర్‌సీపీ 3వ డివిజన్ ఇన్‌ఛార్జ్ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
ప్రభుత్వాలు శాశ్వతం కాదు..
ప్రజలు శాశ్వతం
పోలీసులు నిజానిజాలు తెలుసుకోకుండా అరెస్ట్ చేయడం భావ్యం కాదు
రిమాండ్‌లో వున్న వర్రా రవీంద్రారెడ్డిని పరామర్శించిన వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బి అంజాద్ బాషా
రిమాండ్ ఖైదీలకు పరామర్శ
కడప అర్బన్ : వైఎస్‌ఆర్ జిల్లా మైదుకూరు నియోజక వర్గ పరిధిలో పెద్దశెట్టిపల్లెకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లేట్లపల్లి శివరాం, లేట్లపల్లె రామాంజనేయులుపై పోలీసులు ఇటీవల అక్రమ కేసును బనాయించి కడప కేంద్రకారాగారానికి రిమాండ్‌కు తరలించారు. రిమాండ్‌లో వున్న వీరితో పాటు, మైదుకూరులోని సర్వరాయపల్లెకు చెందిన ఓ హత్య కేసులో జీవితఖైదు విధించబడిన 13 మందిని మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర నాయకుడు, ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ రెడ్యెం వెంకటసుబ్బారెడ్డిలు పరామర్శించారు. ఇంకా వీరితో పాటు మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ శ్రీమన్నారాయణ, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి నాగిరెడ్డి, ఖాజీపేట మండలం వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఓబయ్యయాదవ్, శివాల్‌పల్లె మాజీ సర్పంచ్ శివయ్యయాదవ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment