పనులొదిలేసి వెళ్లకపోతే ప్రాణాలుండవ్
సాక్షి ప్రతినిధి, కడప : అనకాపల్లి బీజేపీ ఎంపీ రమేష్‌నాయుడుకు చెందిన రిత్విక్ కాంట్రాక్టు సంస్థ పనులను అదే పార్టీకి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. తక్షణమే పనులు వదిలేసి వెళ్లాలని, లేదంటే ప్రాణాలు దక్కవంటూ సైట్ ఇంజనీర్లపై దాడి చేశారు. యంత్ర సామగ్రిని ధ్వంసం చేశారు. వైఎస్సార్ జిల్లాలోని గండికోట ప్రాజెక్టు ఆధారంగా వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఆదాని హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంకల్పించింది.
కొండాపురం మండలం దొబ్బుడుపల్లె, రావికుంట, తిరువాలయపల్లె గ్రామాలతోపాటు మైలవరం మండలం బొగ్గులపల్లె పరిధిలో 250 ఎకరాలు ప్రభుత్వ భూమి, 150 ఎకరాల ఫారెస్టు భూమిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. తొలి విడతగా రూ.1,800 కోట్లతో నిర్మాణ సంస్థ పనులకు శ్రీకారం చుట్టింది. టెండర్లలో అనకాపల్లె ఎంపీ రమేష్‌నాయుడుకు చెందిన రిత్విక్ సంస్థకు పనులు దక్కాయి. క్షేత్ర స్థాయిలో పనులు మొదలు పెట్టింది. ఈ వ్యవహారం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులకు నచ్చలేదు. ఆ పనులు తామే చేయాలంటూ పట్టుబట్టారు. ఆ మేరకు ఎమ్మెల్యే ఆది.. ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను ఇటీవల సందర్శించి, స్థానికుల సమస్యలు పరిష్కారించాలంటూనే.. నిర్మాణ పనులు తమ వర్గీయులకు అప్పగించాలని కోరినట్లు సమాచారం. ఈ మేరకు కొన్ని పనులు ఆది వర్గీయులకు అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా, మొత్తం పనులన్నీ తమ వర్గీయులకే దక్కాలని, అప్పుడే ప్రాజెక్టు పనులు కొనసాగుతాయని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇవేవి పరిగణనలోకి తీసుకోకుండా రిత్విక్ సంస్థ నిర్మాణ పనులు కొనసాగిస్తుండగా మంగళవారం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున దొబ్బుడుపల్లె వెళ్లి విధ్వంసం సృష్టించారు.
తక్షణమే ఖాళీ చేసి వెళ్లిపోండి..
కొండాపురం, మైలవరం మండలాలకు చెందిన ఎమ్మెల్యే ఆది వర్గీయులు దేవగుడి శివ నారాయణరెడ్డి, రాజేష్‌రెడ్డిల నేతృత్వంలో మంగళవారం వంద వాహనాలకుపైగా అనుచరులతో దొబ్బుడుపల్లె ప్రాంతానికి వెళ్లారు. రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన సైట్ ఇంజనీర్లపై దాడి చేశారు. యంత్రాలను ధ్వంసం చేశారు. ఇక్కడి నుంచి తక్షణమే ఖాళీ చేయాలని హెచ్చరించారు. కాదు, కూడదని పనులు చేస్తే ప్రాణాలతో ఉండరంటూ తీవ్ర స్థాయిలో బెదిరించారు. తాము కూడా జమ్మలమడుగు నియోజకవర్గ వాసులమే అని చెప్పుకొచ్చినా.. ‘ఎక్కడ పోట్లదుర్తి, ఎక్కడ కొండాపురం.. మేమంతా చచ్చాం అనుకుంటున్నారా? పనులంటూ చేస్తే మేమే చేయాలి? లేదంటే లేదు. మళ్లీ ఇక్కడ పనులు కొనసాగితే జాగ్రత్త’ అంటూ విరుచుకుపడ్డారు. కాగా, ఈ విషయం తెలిసినప్పటికీ ఎంపీ రమేష్‌నాయుడు సోదరుడు సురేష్‌నాయుడు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని సమాచారం. ఈ ఘటనపై ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.
ఎంపీ రమేష్ కాంట్రాక్ట్ సంస్థకు
ఎమ్మెల్యే ఆది వర్గీయుల బెదిరింపు
రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన సైట్ ఇంజనీర్లపై దాడి
దొబ్బుడుపల్లె వద్ద రూ.1,800 కోట్లతో
ఆదానీ హైడ్రో పవర్ ప్లాంట్
నిర్మాణ పనులు చేస్తున్న ఎంపీ వర్గీయులు
ఆ పనులు తామే చేపట్టాలంటూ ఎమ్మెల్యే ఆది వర్గీయుల హుకుం
వంద వాహనాలల్లో వెళ్లి సిబ్బందిపై దాడి, వాహనాలు ధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment