ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో జైలు | - | Sakshi
Sakshi News home page

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో జైలు

Published Sat, Nov 23 2024 12:31 AM | Last Updated on Sat, Nov 23 2024 12:31 AM

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో జైలు

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో జైలు

బద్వేలు అర్బన్‌ : ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఓ వ్యక్తికి తిరుపతి ఎర్రచందనం కేసుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి 5 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.6 లక్షలు జరిమానా విధించినట్లు బద్వేలు ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ నయీమ్‌అలీ తెలిపారు. శుక్రవారం సిద్దవటం రోడ్డులోని ఫారెస్టు బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 2018 డిసెంబర్‌ 17వ తేదీన లంకమల అభయారణ్యంలోని గోపాలపురం పాత నర్సరీ సమీపంలో దుంగలను తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించగా సిద్దవటం మండలం వెంకటాయపల్లె గ్రామానికి చెందిన యాతగిరివీరభాస్కర్‌ను అదుపులోకి తీసుకుని ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అప్పటి నుంచి తిరుపతి ఎర్రచందనం కేసుల ప్రత్యేక కోర్టులో విచారణ జరిగి విచారణలో వీరభాస్కర్‌పై నేరం రుజువు కావడంతో ఐదేళ్ల కఠిన కారాగారశిక్షతో పాటు రూ.6 లక్షలు జరిమానా విధించారని, జరిమానా కట్టని నేపథ్యంలో మరో 6 నెలలు శిక్ష అదనంగా అనుభవించాల్సి వస్తుందని తీర్పు వెల్లడించినట్లు ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు.

తెలుగుగంగ కాలువలో పడి వ్యక్తి మృతి

కాశినాయన (కలసపాడు) : మండలంలోని కొండ్రాజుపల్లె గ్రామానికి చెందిన బసిరెడ్డి ఈశ్వర్‌రెడ్డి (39) తెలుగుగంగ కాలువలో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఈశ్వర్‌రెడ్డి గత సంవత్సరం కాలం నుంచి మానసిక పరిస్థితి బాగా లేక పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తుండేవాడు. అతని బాగోగులను అన్న బసిరెడ్డిబాలిరెడ్డి చూసుకుంటుండేవాడు. గురువారం గ్రామానికి పడమర వైపు ఉన్న తెలుగుగంగ కాలువకు వెళుతుండగా అదే గ్రామానికి చెందిన బి.ఈశ్వర్‌రెడ్డి పొలం నుండి గ్రామానికి వస్తూ బసిరెడ్డిఈశ్వర్‌రెడ్డిని ఎక్కడికి వెళుతున్నావని అడిగాడు. ఎక్కడికి వెళ్లలేదని, కొద్దిసేపటి తర్వాత ఇంటికి వస్తానని చెప్పాడన్నారు. అతను కొద్ది దూరం వచ్చి వెనక్కి తిరిగి చూడగా మతిస్థిమితం లేని ఈశ్వర్‌రెడ్డి కనిపించకపోవడంతో అతడి అన్న బాలిరెడ్డికి సమాచారం ఇచ్చారు. బాలిరెడ్డి గ్రామస్తులతో తెలుగుగంగ కాలువ చుట్టూ వెతికినా కనబడలేదు. శుక్రవారం సాయంత్రం తెలుగుగంగ కాలువలో బసిరెడ్డి ఈశ్వర్‌రెడ్డి మృతదేహం నీటిపై తేలుతూ కనిపించింది. విషయం కాశినాయన పోలీసులకు తెలిపారు. తన తమ్ముడు ప్రమాదవశాత్తు కాలుజారి ఉండవచ్చునని, అతడి మరణంపై కుటుంబ సభ్యులకు ఎటువంటి అనుమానం లేదని పోలీసులకు బాలిరెడ్డి తెలిపారు.

రెవెన్యూ కార్యాలయంలో వీఆర్‌ఓకు దేహశుద్ధి

– ప్రేమ పేరుతో సాటి వీఆర్‌ఓను మోసం చేసిన వైనం

రామకుప్పం : ప్రేమ పేరుతో సాటి వీఆర్‌ఓను నమ్మించి పెళ్ళి చేసుకోకుండా కాలయాపన చేస్తున్న వీఆర్‌ఓపై ప్రియురాలి బంధువులు దేహశుద్ధి చేసిన ఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలి బంధువులు తెలిపిన వివరాలిలా.. వైఎస్సార్‌ జిల్లాకు చెందిన శ్రవణ్‌ రామకుప్పం మండలంలోని కొంగనపల్లి వీఆర్‌ఓగా పనిచేస్తున్నాడు. రామకుప్పం మండలంలోని ఓ పంచాయతీ వీఆర్‌ఓగా పనిచేస్తున్న యువతి గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. శ్రవణ్‌ యువతిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి ప్రేమాయణం సాగించాడు. ఈ క్రమంలో తనను వివాహం చేసుకోవాలని యువతి శ్రవణ్‌ను కోరగా కాలయాపన చేస్తూ వచ్చాడు. అతని ప్రవర్తనలో మార్పును గమనించిన ఆమె జరిగిన విషయాన్ని బంధువుల దృష్టికి తీసుకెళ్ళింది. దీంతో బంధువులతోపాటు యువతి స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఉన్న శ్రవణ్‌ను నిలదీసింది. అతని నుంచి పెళ్లి విషయమై సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహించిన యువతి బంధువులు అతనికి దేహశుద్ధి చేశారు. శనివారం స్థానిక తహసీల్దార్‌తో చర్చించి వీఆర్‌ఓకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు యువతి బంధువులకు చెప్పారు.

లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష

నెల్లూరు(లీగల్‌) : లారీలో ప్రయాణిస్తున్న బాలికపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నేరం రుజువు కావడంతో వైఎస్సార్‌ జిల్లా పోరుమామిళ్లకు చెందిన పప్పర్తి సుబ్బరాయుడు అనే వ్యక్తికి 20 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ. 22 వేల జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సి.సుమ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. 2020 మే నెలలో 14 ఏళ్ల బాలిక, ఆమె చిన్నాన్న ఆత్మకూరు సమీపంలోని నెల్లూరుపాళెం వద్ద లారీ ఎక్కారు. డ్రైవర్‌ సుబ్బరాయుడు సంగం వద్ద లారీని ఆపి హోటల్లో టిఫిన్‌ ఉందేమో కనుక్కోవాలని బాలిక చిన్నాన్నను పంపాడు. అతను వెళ్లగా సుబ్బరాయుడు వేగంగా లారీని కృష్ణపట్నం పోర్టు వైపునకు తీసుకెళ్లాడు. జాతీయ రహదారి పక్కన ఆపి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఆమె చిన్నాన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంగం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో పైమేరకు నిందితుడికి శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

మామను చంపిన అల్లుడికి జీవిత ఖైదు

మదనపల్లె : తండ్రి మరణానికి కారకుడనే నెపంతో మామను హత్యచేసిన అల్లుడికి ఏడేళ్ల విచారణ అనంతరం మదనపల్లె రెండో అడిషనల్‌ జిల్లాకోర్టు జీవితఖైదు శిక్షను ఖరారుచేస్తూ జడ్జి అబ్రహాం తీర్పునిచ్చారు. చిత్తూరు జిల్లా సోమల మండలం నెల్లిమంద గొల్లపల్లెకు చెందిన వెంకటసిద్ధులు (63)ను 2017 ఆగస్ట్‌ 7వ తేదీన కలికిరి మండలం గుట్టపాళ్యం గొల్లపల్లె పొలాల వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. తండ్రి హత్యపై వెంకటసిద్ధులు కుమారుడు నాగరాజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అప్పి సోమల ఎస్‌ఐ లక్ష్మీనారాయణ అప్పట్లో కేసు నమోదు చేశారు. విచారణ బాధ్యతను అప్పటి చౌడేపల్లె సీఐ రవీంద్రకు అప్పగించారు. పోలీసు విచారణలో వెంకటసిద్ధులు అల్లుడు పి.సుధాకర (45)ను నిందితుడిగా గుర్తించారు. పోలీసు విచారణలో అల్లుడు మామను హత్యచేసినట్లుగా నిర్ధారణ కావడంతో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. ఏడు సంవత్సరాల పాటు కేసు విచారణ మదనపల్లె రెండో అదనపు జిల్లా కోర్టులో జరిగింది. శుక్రవారం జిల్లా కోర్టు జడ్జి అబ్రహాం నిందితుడిపై నేరం రుజువు కావడంతో జీవితఖైదు శిక్షతో పాటు రూ.3వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన సీఐ రవీంద్ర, ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, సీఐ రాంభూపాల్‌, సోమల ఎస్‌ఐ శివశంకర్‌, కోర్టు కానిస్టేబుల్‌ సునీల్‌కుమార్‌, కోర్ట్‌ మానిటరింగ్‌ సెల్‌ సిబ్బందిని చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్‌.మణికంఠ చందోలు అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement