నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరం
సాక్షి ప్రతినిధి కడప: సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించే ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో బెల్లన జగన్నాథం, చిరుమామిళ్ల శ్రీనివాసరావులు వేర్వేరుగా రిట్ పిటీషన్లు దాఖలు చేశారు. మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ (ఎన్నికల నిర్వహణ) రూల్స్, 2018 రాజ్యాంగంలోని ఆర్టికల్–19 (1)(ఎ) ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కల్పించేవిగా ఉన్నాయన్నారు. ఎన్నికలు నిర్వహిస్తున్న ప్రక్రియ ఏకపక్షమైనదిగా ఉందంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లు ఏకాభిప్రాయంతో నీటి సంఘాలను ఎన్నుకోవడం, బ్యాలెట్ పద్ధతి, చేతులెత్తే పద్ధతిలో ఉన్నాయన్నారు. ఇందులో చేతులెత్తే పద్ధతి వల్ల రాజ్యాంగం ప్రసాదించిన రహస్య ఓటింగ్ విధానానికి పూర్తి విఘాతాన్ని కలిగిస్తుందన్నారు. ఇందువల్ల పోటీ చేస్తున్న అభ్యర్థుల నుంచి ఓటర్లకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నారు. 2020 నాటి లక్ష్మిసింగ్, ఇతరులు వర్సెస్ రేఖాసింగ్, ఇతరులు కేసులో రహస్య ఓటింగ్ అనేది రాజ్యాంగపరమైన ప్రజాస్వామ్యంలో కీలకమైనదంటూ అపెక్స్ కోర్టు తన తీర్పులో స్పష్టం చేసిన విషయాన్ని పిటీషనర్లు పేర్కొన్నారు. ఈ పిటీషన్లు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాగూర్, రవి చీమలపాటి న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్లింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ కేసు లిస్టు కానుంది. ప్రతివాదిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తరుపు ఉన్న అడ్వకేట్ జనరల్‌కు వాదనలు వినిపించేందుకు విషయాన్ని పంపారు.
చేతులెత్తే పద్ధతి భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధం
హైకోర్టులో రిట్ పిటీషన్ల దాఖలు
Comments
Please login to add a commentAdd a comment