రెవెన్యూ సదస్సులతో భూ సమస్యల పరిష్కారం
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్: ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో దీర్ఘ కాలికంగా అపరిష్కృతంగా ఉన్న భూసమస్యల పరిష్కారానికి ఒక చక్కటి అవకాశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ – రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమానికి కడప కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్ శ్రీధర్‌తోపాటు జేసీ అదితిసింగ్ హాజరయ్యారు. మంత్రి వీసీ ముగిశాక కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ గ్రామాల్లో భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆ మేరకు జిల్లాలో ప్రణాళిక ప్రకారం నిర్ణయించిన తేదీ సమయాల్లో, నిర్దేశించిన గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించాలన్నారు. సదస్సులపై ముందుగా గ్రామాలలో అవగాహన కల్పించాలన్నారు. రెవెన్యూ సదస్సులలో మ్యూటేషన్లు, భూ వివాదాలు, భూ ఆక్రమణలు 22(ఎ) దుర్వినియోగం మొదలగు అంశాలపై గ్రామస్తుల నుండి అర్జీలను స్వీకరించాలన్నారు. రెవెన్యూ సదస్సు నిర్వహించిన రోజు నుండి 40 రోజుల్లోగా విచారణకు వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ సదస్సుల్లో కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు జారీ చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న జెడ్‌హెచ్‌డీసీ భూముల వివరాలను సేకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆర్డీవోలను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వర్ నాయుడు, కడప, జమ్మలమడుగు, బద్వేలు, ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్రమోహన్, ఎస్డీసి ఎల్.ఏ. శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment