గండికోట పర్యాటక ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో.. జిల్లా పర్యాటక శాఖ అధికారి సురేష్ కుమార్, సంబంధిత ప్రాజెక్టు ఏజెన్సీతో కలిసి గండికోట పర్యాటక అభివృద్ధిపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాంతమైన ‘గండికోట పర్యాటక కేంద్రం‘ భవిష్యత్తులో ప్రపంచ పర్యాటక రంగాన్ని శాసిస్తుందన్నారు. ఆ దిశగా ఇప్పటికే గండికోట డెవెలప్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేసి అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. గండికోట వారసత్వం, సంస్కృతి ప్రతిబింబించే విధంగా ప్రత్యేకమైన, సృజనాత్మకమైన నిర్మాణాలు చేపడతామన్నారు. ప్రజలకు వినోదంతోపాటు వారి భద్రత, సౌకర్యాల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే పోలీసు భద్రతలో భాగంగా 24/7 అందుబాటులో ఉన్న ఒక ఔట్ పోస్టు నిర్వహణలో ఉందన్నారు. అనంతరం.. గండికోట పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు రిపోర్టు వివరాలను పీపీటీ ద్వారా కలెక్టర్ పరిశీలించి టూరిజం శాఖ అధికారికి పలు సూచనలు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment