సంపద సృష్టి అంటే అప్పులు చేయడమేనా.?
ప్రొద్దుటూరు : కూటమి ప్రభుత్వంలో సంపద సృష్టి అంటే అప్పులు చేయడం.. కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారం వేయడమేనా అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన వైఎస్సార్‌సీపీ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేవలం ఉద్దేశ పూర్వకంగానే తాను నివాసం ఉన్న దొరసానిపల్లె గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవితను ఆహ్వానించారన్నారు. 130 ఎకరాల భూమి ఉన్న తన గ్రామాన్ని కాకుండా మిగతా గ్రామాల్లో సమావేశం నిర్వహించి ఉంటే రైతులకు ఫలితం దక్కేదన్నారు. ఈ సదస్సులో 99 శాతం మంత్రి తమ పార్టీ గొప్పలు చెప్పుకోవడానికి, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శించడానికే సరిపోయిందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏమి సంపద సృష్టించారో తెలపాలని కోరారు. వేల కోట్ల రూపాయలు అప్పులు చేయడమే సంపద సృష్టినా అని ప్రశ్నించారు. ప్రజల జేబులకు కన్నం వేసి రూ.15వేల కోట్లు కరెంటు బిల్లులు పెంచారన్నారు. దీనికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయన్నారు. మద్యం షాపులను ఏర్పాటు చేసి ఊరూరా మద్యం అమ్మకాలను నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేయడమే అభివృద్ధా అని ప్రశ్నించారు. ప్రజలంతా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తుంటే గడిచిన ఆరు నెలల్లో లక్షా 57వేల పింఛన్లను తొలగించారన్నారు. త్వరలో గ్రామీణ రహదారులపై కూడా టోల్ గేట్లు వసూలు చేసే ప్రణాళికను తయారు చేస్తున్నారన్నారు. పరిశ్రమలు అభివృద్ధి చెందాయని మంత్రి తెలిపారన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. పోలవరం డ్యాంను చంద్రబాబు ఏటీఎంలా వినియోగించుకుంటున్నారని స్వయంగా గతంలో ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కేవలం తన సామాజిక వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకే అమరావతి నిర్మాణం చేపడుతున్నారన్నారు. మంత్రి చెప్పిన వాటిలో ఇది మాత్రం వాస్తవం అన్నారు.
ఎకరా భూమి ఆక్రమించినట్టు నిరూపిస్తే
ఇక పోటీ చేయను
తాను ఎకరం భూమి ఆక్రమించినట్టు నిరూపించినా జీవిత పర్యంతం ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్యే రాచమల్లు తెలిపారు. ప్రస్తుతం మీదే అధికారం, మీ ప్రభుత్వంలో చట్టాన్ని ఉపయోగించి తనపై విచారణ చేయించాలని కోరారు. ప్రభుత్వ భూమి కానీ, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూములు కానీ ఆక్రమించినట్లు నిరూపిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, మాజీ వైస్ ఎంపీపీ మల్లేల రాజారాంరెడ్డి, కౌన్సిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, లావణ్య, జయంతి, భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, సత్యం, నూకా నాగేంద్రారెడ్డి, హౌస్ బిల్డింగ్ సొసైటీ చైర్మన్ ద్వార్శల భాస్కర్‌రెడ్డి, తొగటవీర క్షత్రియ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ చౌడం రవిచంద్ర, పోసా భాస్కర్, జంగమయ్య పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment