రాష్ట్రంలో డిక్టేటర్ పాలన
పులివెందుల రూరల్ : రాష్ట్రంలో డిక్టేటర్ పాలన నడుస్తోందని, ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడితే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదు చేస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడం తథ్యమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గాలికి వదిలేసిందని మండిపడ్డారు. పథకాలను అడిగిన వారిపై కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 2027లో ఎన్నికలు వచ్చినా, 2029లో వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు వైఎస్‌ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలను జగనన్న ప్రవేశపెట్టి అర్హులందరికీ అందించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడితే కేసులు నమోదు చేస్తున్నారు
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది
మీడియాతో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment