ఫిజికల్ టెస్ట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
● జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు
కడప అర్బన్: కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరక సామర్థ్య పరీక్షల ఏర్పాట్లను ఇన్‌చార్జ్ ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం (డి.టి.సి) మైదానంలో కలియతిరిగారు. అక్కడ చేపట్టాల్సిన పనులపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలక్ట్రిసిటీ, ఇంటర్‌నెట్, ఆహారం, నీటి సౌకర్యం, టాయిలెట్‌లు, వైద్యం వంటి వసతుల ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. 1600 మీటర్లు, లాంగ్‌జంప్, 100 మీటర్ల పరుగుపందెం నిర్వహించే ప్రదేశాలను పరిశీలించారు. అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రాథమిక రాతపరీక్షలో అర్హత సాధించిన ఉమ్మడి కడప జిల్లా అభ్యర్థులకు 2024 డిసెంబర్ 30వ తేదీ నుంచి 2025 ఫిబ్రవరి 01వ తేదీ వరకు పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు (పీఎంటీ/పీఈటీ) శారీరక దేహధారుఢ్య సామర్థ్య పరీక్షలు జరుగనున్నాయని ఎస్పీ తెలిపారు. ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్‌బాబు, అదనపు ఎస్పీ (ఏఆర్) బి. రమణయ్య, డి.టి.సి ఇన్‌స్పెక్టర్ వినయ్‌కుమార్‌రెడ్డి, రిమ్స్ పిఎస్ సీఐ సీతారామిరెడ్డి, ఆర్‌ఐలు ఆనంద్, శివరాముడు, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment