బోటు షికారు లేదాయె.. బోలెడన్ని సమస్యలాయె.!
కడప కల్చరల్ : లాహిరి లాహిరి లాహిరిలో ... అంటూ, అలా అలా చెరువు నీళ్లలో షికారు చేయాలని అందరికీ ఆశ ఉంటుంది. గమ్మత్తైన ఆ అనుభూతి కోసం అంతో ఇంతో ఖర్చు చేసేందుకు కూడా ప్రజలు వెనుకాడరు. కానీ సమీపంలోని చెరువుల్లో నీరు నిండుగా ఉన్నా బోట్లు అందుబాటులో లేకపోవడం, ఉన్నవి కూడా నిత్యం మరమ్మతులకు గురికావడంతో పర్యాటకుల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. ఫలితంగా ఈ రంగానికి అనువుగా ఉన్నచోట కూడా ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది.
ఉన్న బోటింగ్ యూనిట్లు
మూసివేయాల్సిన పరిస్థితి
జిల్లాలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని బోటింగ్ యూనిట్లు నానాటికి తీసి కట్టు అన్నట్లు మారుతున్నాయి. ఒక్కసారి పెట్టుబడికి సంవత్సరాల తరబడి ఆదాయం అందించే అవకాశం ఉంది. కానీ సౌకర్యాలు లేక ఉన్న బోట్లు తరచూ మరమ్మతులకు గురవుతుండడంతో పనికిరాకుండా పోతున్నాయి. మంచి ఆదాయాన్ని చేకూర్చిపెట్టే బోటింగ్ యూనిట్లు నానాటికి నష్టాలనే మిగిలిస్తున్నాయి
దేవుని కడప చెరువు యూనిట్
దేవుని కడప చెరువులోని బోటింగ్ యూనిట్ కేవలం ఒక్క బోటుతోనే కొనసాగుతోంది. అది కూడా తరచూ మరమ్మతులకు గురవుతోంది. టిక్కెట్ ధర రూ. 100 కావడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు. ఎక్కువ మంది సభ్యులుగల కుటుంబం ఒకేసారి ఎక్కేందుకు అవకాశం లేకపోవడం కూడా ప్రజలను నిరాశకు గురి చేస్తోంది. నిజానికి ఇక్కడ పెట్రోలు బోట్ల కంటే పెడలింగ్ బోట్లు కనీసం రెండైనా అవసరం. కానీ ఆ సౌకర్యాలేవీ లేకపోవడంతో ఇది నగరంలోనే అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉన్నా కలెక్షన్లు పూర్తిగా తగ్గిపోయి దాదాపు మూసివేసే స్థితికి చేరింది.
ఒంటిమిట్ట
ఒంటిమిట్ట చెరువులో బోటింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. టికెట్ల విక్రయాల కోసం కౌంటర్‌ను కూడా నిర్మించారు. కానీ అప్పడప్పుడు (బ్రహ్మోత్సవాల సందర్భంగా) ఒకటి, రెండు బోట్లు తెప్పించి మమ అనిపిస్తున్నారు. ఆ తర్వాత షరామామూలుగా మూసి వేస్తున్నారు. రెండు, మూడేళ్లుగా ఈ యూనిట్ బ్రహ్మోత్సవాల సమయంలో కూడా మూసివేసే ఉంది.
మైలవరం...ప్రత్యేకం
ఈ యూనిట్‌కు అంటూ ప్రత్యేకంగా ఒక్క బోటు కూడా లేదు. దీన్ని అవకాశంగా తీసుకున్న స్థానికులైన ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకపోయినా బోట్లు నిర్వహించుకుంటూ అక్రమంగా ఆదాయం గడిస్తున్నారు. ఏళ్ల తరబడి ఇక్కడ ఇదే పరిస్థితి ఉందని సమాచారం. వ్యతిరేకుల ఫిర్యాదుతో అక్రమంగా తిరుగుతున్న బోటుని ఇటీవల అధికారులు సీజ్ చేశారు. కొన్ని రోజుల తర్వాత ఆ బోటులోని ఇంజిన్ చోరీకి గురైంది. అక్కడ సీసీ కెమెరాలు, వాచ్‌మెన్ కూడా ఉండగా బోటు ఇంజిన్ ఎలా చోరీకి గురయిందో దర్యాప్తులో తేలాల్సి ఉంది.
నీళ్లున్నా.. నిధులు, బోట్లు కరువు
నీరసించిన బోటు షికారు
యూనిట్లు ఎక్కువ.. వసతులు తక్కువ
Comments
Please login to add a commentAdd a comment