ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీఎంబర్స్‌మెంట్, వసతి దీవెన డబ్బులను విడుదల చేయాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.వలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశంపై శనివారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2100 కోట్ల బకాయిలు, వసతి దీవెన కింద రూ. 1480 కోట్లు విడుదల చేయాల్సి ఉందన్నారు. ప్రతి యేటా విద్యార్థులకు నాలుగు క్వార్టర్లలో డబ్బులు జమ అయ్యేవన్నారు. గత ఏడాది ఒక క్వార్టర్ మాత్రమే విడుదలైందని, మిగతా మూడు క్వార్టర్లు విడుదల కావాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో సుమారు 9.5 లక్షల మందికి రీఎంబర్స్‌మెంట్ నిధులు అందాల్సి ఉందన్నారు. కానీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రీఎంబర్స్‌మెంట్ మొత్తాలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులకు కోర్సులు ముగిసినప్పటికీ కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే జీఓ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీఎంబర్స్‌మెంట్ వర్తింపజేస్తామని యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.శివశంకర్, సహాయ కార్యదర్శి అరుణ్, నగర అధ్యక్ష, కార్యదర్శులు అఖిరానందన్, తేజ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment