టీడీపీ వర్గీయుల ఘర్షణ
చాపాడు : మండల పరిధిలోని వి.రాజుపాళెం గ్రామంలో టీడీపీకి చెందిన ఇరువర్గాల వారు బుధవారం మధ్యాహ్నం ఘర్షణ పడ్డారు. వెదురూరు, నరహరిపురం గ్రామాల్లో సంక్రాంతి కనుమ సందర్భంగా రెండు చోట్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఇరు గ్రామాలకు చెందిన నిర్వాహకులు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను ఆహ్వానించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే పుట్టా కాన్వాయ్ రాజుపాళెం గ్రామంలో ఆపారు. ఎమ్మెల్యే కారు దిగి కార్యకర్తలతో మాట్లాడుతుండగా ఇదే గ్రామానికి చెందిన పల్లెం శ్రీనివాసులు తన ఇంటికి రమ్మని ఎమ్మెల్యేను ఆహ్వానించాడు. దీంతో నరహరిపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తాము ఎమ్మెల్యేను ఆహ్వానించామని నీవేలా ఇంటికి పిలుస్తావంటూ శ్రీనివాసులును అడ్డుకున్నారు. ఈ సమయంలో టీడీపీకి చెందిన ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అక్కడి నుంచి ఎమ్మెల్యే పుట్టా నరహరిపురం వెళ్లి అక్కడి నుంచి వెదురూరుకు వెళ్లి అక్కడ సంగమేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్లిపోయారు. అనంతరం గ్రామంలో ఉన్న శ్రీనివాసులుకు చెందిన ఫ్లెక్సీ, రాజుపాళెం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు, మాజీ ఎంపీటీసీ ఓబులేసు, రమణకు చెందిన ఫ్లెక్సీలను చించేశారు. ఈ నేపథ్యంలో నరహరిపురానికి చెందిన కొందరు టీడీపీ వర్గీయులు రాజుపాళెం వెళ్లారు. అక్కడ తిరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. గ్రామంలో గొడవలు జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. గత నాలుగైదు నెలలుగా ఈ గ్రామాల్లో టీడీపీకి చెందిన ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment