పంచాయతీ అవినీతిపై విచారణ
వేంపల్లె : వేంపల్లె గ్రామపంచాయతీలో జరిగిన అవినీతి ఆరోపణలపై ఆరుగురు కమిటీ సభ్యులతో విచారణ చేపట్టారు. గురువారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో జమ్మలమడుగు డీఎల్‌పీఓ తిమ్మక్క ఆధ్వర్యంలో రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎల్‌పీఓ మాట్లాడుతూ 2023 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలో పంచాయతీ ఈఓ వెంకటసుబ్బారెడ్డి అవినీతికి పాల్పడ్డారని టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో డీపీఓ రాజ్యలక్ష్మి ఆదేశాల మేరకు ఈఓపీఆర్డీలు రామచంద్రారెడ్డి, షాకీర్ అలీఖాన్, శివారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు బషీర్, శ్రీనివాసులు, మాధవరెడ్డిలతో కమిటీ వేశారు. దీంతో అందుకు సంబంధించిన 15వ ఫైనాన్స్ కమిషన్, ఇంటి పన్ను, నీటి పన్ను, జనరల్ ఫండ్, టాక్స్, నాన్ టాక్స్ వసూళ్ల రికార్డులను పరిశీలించారు. అన్ని రికార్డులను జమ్మలమడుగు డీఎల్‌పీఓ కార్యాలయానికి తీసుకెళుతున్నామని తెలిపారు. ఇంకా కొన్నింటికి సంబంధించి రికార్డులు పరిశీలించాల్సి ఉందన్నారు. త్వరలో పూర్తి రికార్డులను పరిశీలించి, విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదికలను పంపుతామన్నారు. కార్యక్రమంలో పంచాయతీ ఈఓ వెంకటసుబ్బారెడ్డి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
వర్గ పోరుతో అవినీతి ఆరోపణలు..?
పంచాయతీ కార్యాలయంలో టీడీపీ నాయకుడు బీటెక్ రవి వర్గానికి సంబంధించి 13 మంది వ్యక్తులకు ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగాలు వేసుకోవాలని కోరగా... మరో వర్గం టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తమకు సంబంధించి 9మంది వ్యక్తుల లిస్టు పంపారు. అందుకు ఈఓ సహకరించలేదని ఈఓపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది. కలెక్టర్ అప్రూవల్ చేసినంతవరకు ఎవరిని కూడా కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగంలోకి తీసుకునే పరిస్థితి లేదు. రెండు వర్గాలు పోటీ పడడంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతోందని.. ఒక వర్గానికి చేస్తే, మరో వర్గం ఇలా అవినీతి ఆరోపణలు అంటగట్టడం పరిపాటిగా మారుతోందని తెలుస్తోంది. దీంతో మండలంలోని అధికారులు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో తలలు పట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment