రేషన్ కోసం రోడ్డెక్కిన మహిళలు
పులివెందుల రూరల్ : గత ఏడు నెలలుగా రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయకపోవడంతో పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీ పరిధిలోని నల్లపురెడ్డిపల్లె గ్రామంలో సుంకులమ్మపేటకు చెందిన గ్రామస్తులు, మహిళలు గురువారం రోడ్డుపై బైఠాయించారు. అందరికీ రేషన్ పంపిణీ చేసిన తర్వాత సుంకులమ్మపేటలో పంపిణీ చేస్తుండటంతో చాలామందికి రేషన్ బియ్యం అందడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కంది బేడలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదంటూ వారు వాపోతున్నారు. తమతో మాత్రం వేలిముద్రలు వేయించుకుంటున్నారని, కంది బేడలు, రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇదేమని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వారు అంటున్నారు. రేషన్ సక్రమంగా పంపిణీ చేసేంతవరకు రోడ్డుపైనే బైఠాయిస్తామని వారు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు హుటాహుటిన రేషన్ బియ్యం తీసుకెళ్లి సుంకులమ్మపేట గ్రామస్తులకు పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment