ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని కొత్త కలమల్ల గ్రామంలో నివాసం ఉండే చిత్రాల జాషువా కుమార్తె చిత్రాల కీర్తి(17) ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కలమల్ల పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు కొత్త కలమల్ల గ్రామంలో నివాసం ఉండే జాషువాకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద అమ్మాయి చిత్రాల కీర్తి కాగా, మరో ఇద్దరు కుమారులు ఉన్నారు. జాషువా లారీ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కీర్తి కడపలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటికి వచ్చింది. కడుపునొప్పి తాళలేక సాయంత్రం ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. తల్లిదండ్రులు ఇంటికి రాగా తలుపు వేసి ఉంది. తలుపును పగులగొట్టి లోపలికి చూడగా కీర్తి ఉరి వేసుకుని వేలాడుతూ ఉండటం గమనించారు. వెంటనే కొన ఊపిరితో ఉన్న ఆమెను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తిమోతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment