బీసీ కుల గణన చేపట్టాలి
జమ్మలమడుగు : దేశ వ్యాప్తంగా బీసీ కుల గణన చేపట్టాలి. బీసీ లెక్కలు తీసి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి. బీసీ కులాల లెక్కలు కేంద్రం చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకోవాలి.. అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్, రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం బీసీ సంక్షేమ సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక నాగులకట్టలోని చౌడేశ్వరి దేవి కల్యాణ మండపంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు జొల్లు కొండయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యధికంగా 60 శాతం బీసీలు ఉన్నా వారికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసింది ఏమీ లేదన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోవాలంటే జాతీయ స్థాయిలో బీసీ కులగణన జరిగితేనే సాధ్యమవుతుందన్నారు. జాతీయ స్థాయిలో కులగణన జరిగేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. అలాగే జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీలకు మొదటి నుంచి అన్యాయం జరుగుతోందన్నారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలంటే బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నారు. కడప జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఒక్కసీటు మాత్రమే బీసీలకు ఇచ్చారన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నా రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ఇక్కడ పెద్దపీటవేసి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించడం బాధాకరమన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఏకమై రాయితీలతో రాజీ పడకుండా రాజకీయ అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. అనంతరం బీసీ రాష్ట్ర నాయకుడు బడిగించల చంద్రమౌళి మాట్లాడుతూ అన్ని కుల సంఘాలను కలుపుకుని ఉద్యమం చేపడితే బీసీలదే రాజ్యాధికారం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర నాయకులు కుమ్మర క్రాంతికుమార్, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, బొర్రా రామాంజనేయులు, లింగమూర్తి, కాటా రామదాసు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం నాయకులు
శ్రీనివాసగౌడ్, శంకర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment