బస్సుల కోసం పడిగాపులు
● రాయచోటిలో ప్రయాణికుల కష్టాలు
● పాఠశాలలు తెరుస్తుండడంతో వెళ్లేందుకు బస్టాండులో నిరీక్షణ
సాక్షి రాయచోటి: సంక్రాంతి పండుగకు చాలా రోజులు సెలవులు రావడంతో దూర ప్రాంతాల నుంచి సొంతూర్లకు వచ్చిన స్థానికులకు వెళ్లేందుకు కష్టాలు తప్పడం లేదు. దాంతోపాటు వివిధ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు పండుగకు వచ్చి తిరుగుప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడూ లేని తరహాలో ఆదివారం జిల్లాలోని రాయచోటి బస్టాండులో పరిస్థితి చూస్తే..ఔరా అనిపించక మానదు. జనాలంతా బస్టాండులో వేచి ఉన్నా బస్సులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్న పరిస్థితులు కనిపించాయి. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని బస్టాండులో ఎప్పుడూ లేని తరహాలో భారీ ఎత్తున ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉన్నారు.
పాఠశాలలకు సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం నుంచి పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటు తిరుపతి, అటు కడప, పీలేరు, చైన్నె, హైదరాబాద్, బెంగళూరులకు వెళ్లే విద్యార్థులు అధిక సంఖ్యలో వేచి ఉన్నారు. దీంతో రాయచోటి బస్టాండు ఎటువైపు చూసినా జనమే కనిపించారు. రోజువారి సర్వీసులు కూడా తక్కువగా ఉండడంతో వివిధ పాంతాలకు వెళ్లేవారు కూడా ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రమైన రాయచోటితోపాటు మదనపల్లె బస్టాండు కూడా ఆదివారం ప్రయాణీకులతో కిటకిటలాడింది ఏది ఏమైనా కిక్కిరిసిన ప్రయాణీకుల మధ్య బస్టాండ్లలో పండుగ కష్టం కళ్లకు కట్టినట్లు కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment