కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటి, రెండు తరగతులు బోధించే ఉపాధ్యాయులకు ఎఫ్‌ఏల్‌ఎన్ 8వ విడత శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ మీనాక్షి తెలిపారు. సంబంధిత శిక్షణ కార్యక్రమాన్ని రెండు కేంద్రాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో కడప మండల పరిధిలోని శేషగారిపల్లె వద్ద ఉన్న గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో, రాయచోటి బైపాస్ రోడ్డు జయరాజ్‌గార్డెన్ ఎదురుగా గీతం డిగ్రీ కళాశాలలో శిక్షణ ఉంటుందని వివరించారు. జాబితాలో పేర్లు ఉన్న ఉపాధ్యాయులందరూ తప్పకుండా ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణకు హాజరుకావాలని డీఈఓ మీనాక్షి సూచించారు.
కడప మహిళా అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ డీఎస్పీగా బాలస్వామిరెడ్డి
కడప అర్బన్: కడప మహిళా అప్‌గ్రేడ్ పోలీస్‌స్టేషన్ డీఎస్పీగా ఈ. బాలస్వామిరెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రంలో పలువురు డీఎస్పీలను బదిలీచేస్తూ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో బాలస్వామిరెడ్డి ప్రస్తుతం కర్నూలులోని స్టేట్ హ్యుమన్‌రైట్స్ కమీషన్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తూ కడప మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీగా బదిలీ అయ్యారు. అలాగే కడప మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీగా పనిచేస్తున్న ఎస్. రమాకాంత్‌ను ‘ఈగల్’ విభాగానికి బదిలీ చేశారు.
గ్రామీణ నిరుద్యోగ
యువతకు ఉచిత శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్: కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో టైలరింగ్, బ్యూటీ పార్లర్‌లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలకు ఈనెల 27 నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని సంస్థ డైరెక్టర్ ఎం.ఆరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. 18–45 ఏళ్లలోపు కలిగిన నిరుద్యోగ మహిళలు ఇందుకు అర్హులన్నారు. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తారన్నారు. ఇతర వివరాలకు 94409 05478, 99856 06866, 94409 33028 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
నేడు కలెక్టరేట్‌లో
ప్రజా ఫిర్యాదుల స్వీకరణ
కడప సెవెన్‌రోడ్స్: కడప కలెక్టరేట్‌లో సోమ వారం ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాలు జరుగుతాయని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. 9.30 నుంచి 10.00 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు ల్యాండ్ లైన్ నెంబరు 08562–244437కు ఫోన్ చేసి సమస్యలను తెలియజేయవచ్చన్నారు. అలాగే ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ’ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు అర్జీలు స్వీకరిస్తారన్నారు. అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతోపాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని వివరించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో కూడా అందజేయవచ్చని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment