పాలకొండల్లో శ్రీరామ అఖండ జ్యోతి
కడప కల్చరల్ : కడప నగరంలో బుధవారం శ్రీరామ మహా శోభాయాత్ర విజయవంతంగా పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం పాలకొండల్లో భక్తులు అఖండ విజయజ్యోతిని వెలిగించారు. అయోధ్య ఐక్యవేదిక కమిటీతోపాటు పుష్పగిరి తీర్థ క్షేత్ర పరిరక్షణ కమిటీలతో హౌసింగ్‌బోర్డు శ్రీ కోదండ రామాలయ ధర్మకర్త దేసు వెంకటరెడ్డి బృందం కలిసి రావడంతో కార్యక్రమాన్ని మరింత శోభాయమానంగా నిర్వహించారు. పాలకొండల దిగువన ఆర్చి వద్ద కొండపై ప్రత్యేకంగా చదునుచేసిన ప్రాంతంలో 250 మీటర్ల వస్త్రాన్ని 50 లీటర్ల నేతిలో తడిపి చుట్టలుగా చుట్టి శివలింగం ఆకారానికి తెచ్చారు. శివ, రామ నామ స్మరణల మధ్య జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షుడు విజయ్‌భట్టర్ బృందం, న్యాయవాది భారవి తన బృందంతో జయజయధ్వానాలు చేశారు.
ఫ్లైయాష్ టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మండల పరిధిలోని పి.వెంకటాపురం గ్రామ ప్రజలు ఫ్లైయాష్‌ను సరఫరా చేసే టిప్పర్లను అడ్డుకున్నారు. బూడిద తమ ఇళ్లలోని సామగ్రిపైన, కళ్లల్లో పడుతోందని, అంతేకాకుండా టిప్పర్ల డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తుండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గురువారం రాత్రి గ్రామస్తులంతా ఏకంగా రోడ్డుపైకి వచ్చి ఫ్లైయాష్ టిప్పర్లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పి.వెంకటాపురం గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఈ బూడిద వల్ల చర్మ, శ్వాస కోశ వ్యాధులు వస్తున్నాయని వాపోయారు. ఈ మార్గంలో బూడిద ట్యాంకర్లు, టిప్పర్లను రానివ్వమని వారు హెచ్చరించారు.
భక్తిశ్రద్ధలతో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
కడప కల్చరల్ : తిరుమల తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో గురువారం ఆలయంలో తిరుమంజనం సేవలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయాన్ని పూర్తిగా శుద్ధి చేసేందుకు తిరుమంజన సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ సంవత్సరం జనవరి 28వ తేది నుంచి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఆలయ అర్చకులు, సేవకులు ఆలయ ప్రాకారం, మండపం, గర్భాలయం, బలిపీఠంతోపాటు పూజా సామగ్రిని శుద్ధి చేసి పవిత్రీకరించారు. ఆలయ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వన్‌టౌన్ సీఐకి మెజిస్ట్రేట్ షోకాజ్ నోటీసు
ప్రొద్దుటూరు క్రైం : ఓ కేసులోని నిందితుడిని చితక బాదిన ఘటనపై ప్రొద్దుటూరు వన్‌టౌన్ సీఐ రామకృష్ణారెడ్డికి మెజిస్ట్రేట్ షోకాజ్ నోటీసు ఇచ్చారు. కోర్టు వర్గాలు తెలిపిన మేరకు ఈ నెల 19న రాత్రి సుందరాచార్యుల వీధికి చెందిన పఠాన్ మహ్మద్ ఆలీఖాన్, కేహెచ్‌ఎం స్ట్రీట్‌కు చెందిన హనీఫ్‌ల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో పఠాన్ ఆలీఖాన్‌ను హనీఫ్ కత్తితో పొడిచాడు. ఈ ఘటనపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో హనీఫ్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ క్రమంలో 21న వన్‌టౌన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా వన్‌టౌన్ పోలీసులు అతన్ని బాగా కొట్టినట్లు తెలుస్తోంది. రిమాండు నిమిత్తం పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. అయితే కేసులోని నిందితుడు హనీఫ్ తనను వన్‌టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి ఒళ్లంతా గాయాలయ్యేలా చితకబాదినట్లు మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో మెజిస్ట్రేట్ వన్‌టౌన్ సీఐకి షోకాజ్ నోటీసు ఇచ్చారు. ఈ విషయమై వన్‌టౌన్ సీఐ రామకృష్టారెడ్డిని వివరణ కోరగా తనకు మెజిస్ట్రేట్ షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వాస్తవమేనని చెప్పారు.
అంధ ఉపాధ్యాయుడిపై ఆటో డ్రైవర్ దాడి
కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం పోరుమామిళ్ల నుంచి కడపకు వచ్చిన ఓ అంధ ఉపాధ్యాయుడిపై ఆటో డ్రైవర్ దాడి చేశాడు. తాను అటుగా వెళుతున్నానని పాతబస్టాండ్ నుంచి అతన్ని ఆటోలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లాడు. అతని వద్ద ఉన్న బంగారు ఉంగరం, చైనుతో పాటు, రూ. 5వేలు నగదును దోచుకుని వెళ్లినట్లు సమాచారం. బాధితుడు ఎట్టకేలకు స్థానికుల సహాయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తన గ్రామానికి వెళ్లిపోయాడు. ఈ సంఘటనపై పోలీసులు విచారిస్తున్నట్లు కడప తాలూకా పోలీసులు తెలిపారు. బాధితుడు వచ్చి ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment