జిల్లా ఆస్పత్రి నుంచి వృద్ధుడి అదృశ్యం
ప్రొద్దుటూరు క్రైం : జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అప్పలరెడ్డి వెంకటసుబ్బారెడ్డి అనే 70 ఏళ్ల వృద్ధుడు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మైదుకూరు మండలంలోని గంజికుంట గ్రామానికి చెందిన వెంకటసుబ్బారెడ్డి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గురువారం ఉదయం జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి తోడుగా భార్య వెంకటలక్షుమ్మ కూడా ఉండేది. చికిత్స పొందుతున్న అతను గురువారం సాయంత్రం ఎవరికీ చెప్పకుండా వార్డులో నుంచి వెళ్లిపోయాడు. భార్య వెంకటలక్షుమ్మ ఆస్పత్రి అంతా తిరిగినా అతను ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమె ఔట్‌పోస్టు పోలీసులకు సమాచారం అందించింది. వృద్ధుడి ఆచూకి తెలిసిన వారు ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్‌స్టేషన్ లేదా ఔట్‌పోస్టు పోలీసులకు సమాచారం అందించాలని ఔట్‌పోస్టు ఇన్‌చార్జి షబ్బీర్‌బాషా తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
ఫొటోగ్రాఫర్ మృతి
మైదుకూరు : మైదుకూరు పట్టణంలోని బద్వేలు రోడ్డులో గల సెయింట్ జాన్స్ స్కూల్ ఎదురుగా గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కంచర్ల చంటిబాబు(28) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై స్థానికులు తెలిపిన వివరాల మేరకూ.. మండల పరిధిలోని ఎన్.ఎర్రబల్లి గ్రామానికి చెందిన కంచర్ల చంటిబాబు మైదుకూరులో ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. గురువారం యధావిధిగా తన విధులు ముగించుకుని మోటార్ బైక్‌పై గ్రామానికి బయలుదేరాడు. స్థానిక బద్వేలు రోడ్డులో ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను దాటుకుని వెళుతుండగా ట్రాక్టర్ తగిలి చంటిబాబు రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో బద్వేలు వైపు వెళుతున్న లారీ అతనిపై దూసుకెళ్లడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు 3, 4 ఏళ్ల కుమార్తెలు ఉన్నారు.
ఆటో బోల్తాపడి ఇద్దరికి గాయాలు
చక్రాయపేట : మండలంలోని గండి వీరాంజనేయస్వామి దేవస్థానానికి సమీపంలో గురువారం మధ్యాహ్నం ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయని ఆర్‌కే వ్యాలీ ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా తలుపుల మండలం వేపపేట నుంచి పెండ్లిమర్రి మండలానికి వస్తున్న ఆటోలో ఎర్రబొమ్మనపల్లి గ్రామం సిద్ధారెడ్డిపల్లి బీసీ కాలనీకి చెందిన వెంకటేష్, కుమార కాల్వ గ్రామానికి చెందిన వెంకట సుబ్బమ్మలు వేంపల్లెకు వెళ్లడానికి ఆటో ఎక్కారు. ఆటో గండిక్షేత్రం సమీపంలోకి రాగానే వేంపల్లె వైపు నుంచి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో వెళుతున్న వెంకటసుబ్బమ్మ, వెంకటేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కడప రిమ్స్‌కు తరలించారు. ఆటోలో ఉన్న డ్రైవర్, అతని భార్య, కూతురికి అలాగే ద్విచక్ర వాహనంలో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి.
అనుమానాస్పద స్థితిలో
వృద్ధుడి మృతి
కడప అర్బన్ : కడప నగరం రామాంజనేయపురం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో గురువారం సి.మునిరెడ్డి (73) అనే వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రిమ్స్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు చెన్నూరుకు చెందిన సి. మునిరెడ్డి ప్రస్తుతం కడప కో–ఆపరేటివ్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో పాటు, ఇతర సమస్యలతో బాధపడుతుండేవాడని తెలిపారు. గురువారం రామాంజనేయపురం చర్చి వద్ద కూర్చుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment