నకిలీ డాక్యుమెంట్లతో పంట రుణం తీసుకున్న వ్యక్తి అరెస్టు
కమలాపురం : అక్రమ ధనార్జన కోసం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పంట రుణాలను తీసుకున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కమలాపురం సీఐ ఎస్‌కే రోషన్, ఎస్‌ఐ ప్రతాప్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మండలంలోని చెన్నంపల్లెకు చెందిన మూల నాగేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అక్రమ ధనార్జన కోసం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి పంట రుణాలు తీసుకుని రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నాడన్నారు. గతంలో ఎల్లారెడ్డిపల్లెలో పనిచేసిన ఒక వీఆర్‌ఓ ఇతరులకు చెందిన భూములను, కొండలను, గుట్టలను, డీకేటీ భూములను తనకు అనుకూలమైన వారికి నకిలీ పత్రాల ద్వారా ఆన్‌లైన్‌లో ఎక్కించి బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేసి రుణాలు పొందేవారన్నారు. ఈ నేపథ్యంలో నాగేశ్వరరెడ్డి, ఎల్లారెడ్డిపల్లె గ్రామ పంచాయతీలోని సర్వే నంబర్ 645లో గండి సుబ్బలక్షుమ్మ అనే మహిళా రైతుకు చెందిన భూమి రికార్డులను నకిలీ ఆధార్ కార్డు ద్వారా తన పేరుపై మ్యుటేషన్ చేసుకుని నకిలీ పాసు బుక్కులు పొందాడన్నారు. తద్వారా ప్రొద్దుటూరులోని కెనరా బ్యాంకులో 2022 సెప్టెంబర్‌లో రూ.2.5 లక్షల రుణం పొందాడన్నారు. బాధిత మహిళా రైతు సుబ్బలక్షుమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు నాగేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశామన్నారు. అతడి వద్ద ఉన్న నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ పాస్ బుక్కులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామన్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి ప్రమేయం ఉన్న మరి కొందరిని త్వరలో అరెస్ట్ చేస్తామని వారు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment