![ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/05kdp241-170061_mr-1738781058-0.jpg.webp?itok=8iW0tTDJ)
ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్: వివిధ కార్పొరేషన్ల ద్వారా అందిస్తున్న స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక పీజీఆర్‌ఎస్ హాలులో రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా వెనుకబడిన వర్గాల వారికి అందిస్తున్న స్వయం ఉపాధి రుణ సహాయ సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆయా కార్పొరేషన్ల జిల్లా అధికారులతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బీసీ కార్పొరేషన్, బీసీ జనరిక్ మెడికల్ షాపులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈ డబ్ల్యూ ఎస్ )కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ జనరిక్ మెడికల్ షాపులు, కాపు చంద్రన్న స్వయం ఉపాధి, ఎస్సీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులైన వారిని గుర్తించాలని ఎంపీడీవోలు, కమిషనర్లకు సూచించారు. ఏపీ ఓబీ ఎంఎంఎస్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితా ప్రకటిస్తామన్నారు. గ్రామా ల్లో మండలాల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు పథకాలకు అర్హులని అన్నారు. రుణ సహాయాన్ని పొందడానికి బ్యాంకుల నిర్ధారించిన నిబంధనలను పాటించాలన్నారు. ఇందులో మహిళలకు 33 శాతం ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారులకు 30 నుంచి 50 శాతం వరకు వివిధ సెక్టార్లలో సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. జిల్లాలో బీసీ కార్పొరేషన్ ద్వారా 1550 యూనిట్లు, బీసీ జనరిక్ మెడికల్ షాపులు 32 యూనిట్లు, కార్పొరేషన్ ద్వారా 240 యూనిట్లు, ఈడబ్ల్యూఎస్ జనరిక్ మెడికల్ షాపులు 41 యూనిట్లు, కాపు చంద్రన్న స్వయం ఉపాధి ద్వారా 379 యూనిట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1026 యూనిట్లు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 1723 యూనిట్లు, క్రిస్టియానిటీ మైనారిటీ ద్వారా 7 యూనిట్లు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఎనిమిది కార్పొరేషన్ల ద్వారా మొత్తం 4998 యూనిట్లకు గాను రూ 80.15 కోట్ల లక్ష్యంతో స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తుండగా.. ఇందులో 1651 యూనిట్లు గాను రూ 20.29 కోట్లు లక్ష్యంతో మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే రుణ సహాయాన్ని అందించడానికి 8 కార్పొరేషన్లకు గాను బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందన్నారు. లబ్ధిదారుల ఎన్నిక పారదర్శకంగా జరగాలని, అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. అలాగే సబ్సిడీ సకాలంలో లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ నిధులను స్వాహా చేసిన అధికారులపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. జిల్లాలో స్వయం సహాయక బృందాలకు 10 నుంచి 20 లక్షల వరకు రుణ సహాయం అందించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయన్నారు. అలాగే ప్రజా ఫిర్యాదుల పరిష్కారక వేదికలో ఇచ్చిన అర్జీ దారుని ఇంటికి వెళ్లి, అర్జీదారులతో సెల్ఫీ దిగి సమస్యను నిశితంగా పరిశీలించి పరిష్కార మార్గం అందించాలన్నారు. డ్వామా ిపీడీ ఆదిశేషా రెడ్డి, ఎస్సి కార్పొరేషన్ ఈడి డా.హెచ్ వెంకట సుబ్బయ్య,డి.ఆర్.డి.ఎ పిడి ఆనంద్ నాయక్, మెప్మా పీడీ కిరణ్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఈడీ జయసింహ,కడప కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి, డిఎల్‌డీ ఓ సుబ్రమణ్యం, ఎల్డిఎం జనార్దనం, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, తదితర అధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment