News
-
కీలక విధుల్లో కేంద్ర బలగాలు
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల క్రతువును ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి నగర పోలీసు విభాగం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, పక్షపాతానికి తావు లేకుండా కొత్వాల్ సందీప్ శాండిల్య చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా కీలక ఎలక్షన్ డ్యూటీల్లో స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరించాలని నిర్ణయించారు. ఎన్నికల విధుల కోసం ఇప్పటి వరకు నగరానికి 11 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు వచ్చాయి. వీటికి నేతృత్వం వహించే కమాండింగ్ ఆఫీసర్లతో సందీప్ శాండిల్య సోమవారం భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో జరిగిన ఈ కీలక సమీక్షలో అదనపు సీపీ (శాంతిభద్రతలు) విక్రమ్ సింగ్ మాన్ సైతం పాల్గొన్నారు. నగరంలో ఉన్న కీలక పోలింగ్ స్టేషన్లు, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై కేంద్ర బలగాల అధికారులకు అవగాహన కల్పించారు. వీరిని నిఘా, తనిఖీలతో పాటు చెక్‌పోస్టుల్లోనూ వినియోగించాలని నిర్ణయించిన కొత్వాల్ శాండిల్య ఆ అంశాలను వారికి వివరించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్స్ విధులు, బాధ్యతలను వారికి తెలియజేశారు. ఈ బలగాలకు అవసరమైన సదుపాయాలు, బస ఏర్పాటు చేసే బాధ్యతలను స్థానిక ఏసీపీలకు అప్పగించారు. విధి నిర్వహణ, తనిఖీల సమయంలో సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీపీ స్పష్టం చేశారు. మరోపక్క ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెవెన్యూ జిల్లాను యూనిట్‌గా నిర్ణయించారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున నగర కమిషనరేట్ నుంచి ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. అనేక ఠాణాలకు కొత్త ఇన్స్పెక్టర్లు రాగా వీరిలో చాలామంది నగరానికి, ఏరియాకు పూర్తి కొత్త. అత్యంత కీలక పరిణామాల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల నేపథ్యంలోనే కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్లకు తమ పరిధిలోని ప్రాంతాలపై పట్టు వచ్చేలా చేయాలని నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఫ్లాగ్ మార్చ్లుగా పిలిచే పాదయాత్రలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సందర్భంలో కమిషనరేట్‌లో ఉన్న పోలింగ్ బూత్ సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, సున్నితమైనవిగా విభజించారు.వీటిలో పోలింగ్ సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటారు. మరోపక్క పోలింగ్ స్వేచ్ఛగా జరుగుతుందని ప్రజల్లో స్థైర్యాన్ని నింపడంతో పాటు అసాంఘిక శక్తులకు చెక్ చెప్పడానికీ భారీ కసరత్తులు చేస్తారు. ఇందుకు ఉపకరించే ఫ్లాగ్‌మార్చ్‌లుగా పిలిచే కవాతులను పోలింగ్ ముగిసే వరకు నిర్వహించనున్నారు. కేంద్ర బలగాలతో కలిసి చేసే ఈ కవాతులు చేయాలని అధికారులకు కొత్వాల్ స్పష్టం చేశారు. తమ పరిధిలో ఎక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి? ఎటు నుంచి అసాంఘికశక్తులు విరుచుకుపడే అవకాశం ఉంది? అనే అంశాలపై ఇన్స్పెక్టర్లకు పట్టుండాల్సిందేనని కొత్వాల్ స్పష్టం చేశారు. -
దేవరగట్టు బన్నీ ఉత్సవం.. ఈసారైనా ప్రశాంతంగా జరుగుతుందా..!?
సాక్షి, కర్నూలు: దేవరగట్టులో ప్రతీ ఏడాది దసరా పండుగ రోజున బన్నీ ఉత్సవం కర్రల యుద్ధంగా జరుగుతుంది. అర్ధరాత్రి వేళ మాలమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో అక్కడి స్థానిక ప్రజలు బన్నీ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సాంప్రదాయం, ఆచారం పేరిట ఈ భక్తి పోరాటం కొనసాగుతుంది. ఈ ఉత్సవంతో అక్కడి వాతావరణం ప్రతీసారి ఓ వైపు కోలాహలంగానూ, మరోవైపు నెత్తురుమయంగానూ వేడుక జరుగుతుంది. ఈ వేడుక ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. అక్కడి ఆచార సాంప్రదాయం ఇలా.. ఈ బన్నీ ఉత్సవ యుద్దానికి పూర్వ చరిత్ర ఉంది. మాలమల్లేశ్వర విగ్రహం కోసం దేవరగట్టుతో పాటు చుట్టుపక్కల గ్రామాలవారు కర్రలతో కొట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దసరా రోజున అర్ధరాత్రి వేళా స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజల నమ్మకంతో.. ఉత్సవం యుద్ధానికి సిద్ధమవుతున్నారు అక్కడి ప్రజలు. ప్రతీ ఏడాది జరుగుతున్న ఈ సమరంలో అనేక మందికి గాయాలయ్యి, తలలు పగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఇదివరకూ అనేకసార్లు జరుగుతూ వస్తుంది. అయినా ఈ ఉత్సవం ఇలా జరగడంలోనే బాగుందంటున్నారు అక్కడి స్థానికలు. మా ఆచార సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తాం.. మాళమల్లేశ్వర స్వామిని దక్కించుకోవడంలో వెనుకడుగు వేసేది లేదంటున్నారు స్థానిక భక్తులు. పూర్తి బందోబస్తు.. ప్రతి ఏటా ఇలాగే జరుగుతున్న బన్నీ ఉత్సవాలలో ప్రశాంతత నెలకొల్పడానికి పోలీసు, పై అధికారశాఖ సిద్ధంగా ఉందా? అనే విషయాలపై పోలీసుశాఖ అవుననే అంటుంది. దేవరగట్టులో రక్తపాతం జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈసారి బందోబస్తు ముమ్మరం చేశామన్నారు. ఆచారం పేరిట కొనసాగుతూ వస్తున్న ఈ అపశ్రుతి పోరాటాన్ని నిలపనున్నారు. భక్తులు నాటుసారా సేవించకుండా కట్టడి చేయనున్నారు. ఇనుప చువ్వల కట్టెలు వాడకుండా చర్యలు తీసుకుంటూ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రశాంతమైన వేడుక జరిగేలా ఉత్సవ కమిటీతో మాట్లాడారు. ఈ ఏడాది కఠినమైన రక్షణ చర్యలు తప్పవంటున్నారు. ఈ ఉత్సవంలో వేల సంఖ్యల్లో భక్తులు పాల్గొననున్నారు. ప్రమాదమైన ఈ సంప్రదదాయ ఆచారాన్ని ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నానికి పూనుకుంటున్నారు అక్కడి పొలిసు అధికారులు. -
'వామ్మో.. పులి' కాదు ‘గ్రామ సింహం..' అసలు విషయం తెలిస్తే షాక్..
ఆదిలాబాద్: మండలంలోని సావర్గాంలో ఆదివా రం పులిని పోలిన శునకం దర్శనమిచ్చింది. ఇది పులి పిల్లనా? లేక శునకమా? అని సందిగ్ధంలో పడ్డారు. గ్రామానికి చెందిన రంగన్న అనే మేకల కాపరి తన మేకలకు కాపలాగా శునకాన్ని పెంచుతున్నాడు. ఈ మధ్య తాంసి, భీంపూర్ అటవీ ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తన పెంపుడు కుక్కకి పులిని పోలిన రంగులను అద్దాడు. విచిత్రంగా ఉన్న శునకం గ్రామంలోకి రావడంతో అంతా అవాక్కయ్యారు. శునకాన్ని పెంచుతున్న మేకల కాపరిని గ్రామస్తులు టైగర్ రంగన్న అని పిలుస్తున్నారు. -
పోలీసులపై స్థానిక ప్రజల ఎదురుదాడి.. 'సీఐ' ను వ్యవసాయ పొలాల్లో వెంబడించి.. మరీ
సాక్షి, మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని చిత్తనూర్‌లో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీ వ్యర్థాలను ఎక్లాస్పూర్, జిన్నారం, చిత్తనూర్, చిన్నచింతకుంట మండలం ఉంద్యాల గ్రామాల శివారుల్లో పారబోస్తుండడంతో అనారోగ్యం బారిన పడుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఓ ట్యాంకర్ వ్యర్థాలను నింపుకొని బయటికి రావడాన్ని గమనించిన గ్రామస్తులు.. ఎక్లాస్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద అడ్డుకున్నారు. ఇథనాల్ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. 16 గంటలపాటు ఆత్మకూర్ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. పోలీసులు నచ్చజెప్పేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. ఆదివారం ఉదయం తహసీల్దార్ సునీత అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఈ నెల 25న ఆర్డీఓ సమక్షంలో కంపెనీని పరిశీలిస్తామని చెప్పినా వినలేదు. ట్యాంకర్లో ఉన్న కెమికల్‌ను పరీక్షించే వరకు ఆందోళన విరమించేది లేదని గ్రామస్తులు భీష్మించారు. నారాయణపేట డీఎస్పీ సత్యనారాయణ ఆదేశాల మేరకు మరికల్, మక్తల్, నర్వ, ధన్వాడ పోలీసులతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. గ్రామస్తులపై లాఠీచార్జ్ చేయడంతో పలువురికి గాయాలవగా.. పొలాల వెంబడి గ్రామస్తులు పరుగులు పెట్టారు. ఇదే సమయంలో ఇథనాల్ కంపెనీ ట్యాంకర్‌ను పోలీసుల బందోబస్తు మధ్య తరలించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోలీసులపై ఎదురుదాడికి పాల్పడ్డారు. రాళ్లు, ఇటుకలు, కర్రలతో దూసుకురావడంతో అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడేందుకు పోలీసులు పరుగులు పెట్టారు. మక్తల్ సీఐ రాంలాల్‌ను వ్యవసాయ పొలాల్లో వెంబడించి తీవ్రంగా గాయపర్చారు. గాయపడిన మరికొందరు పోలీసులు పక్కనే ఉన్న నరసింహస్వామి ఆలయ గదిలోకి వెళ్లారు. అనంతరం అరెస్ట్ చేసిన ఆందోళనకారులను వదిలిపెట్టి, గదిలో ఉన్న పోలీసులను విడిపించుకున్నారు. గాయపడిన పోలీసులు.. చిత్తనూర్ ఇథనాల్ కంపెనీ ఆందోళనలో పోలీసులు, గ్రామస్తులకు మధ్య జరిగిన ఘర్షణలో మక్తల్ సీఐ రాంలాల్తోపాటు కృష్ణ ఎస్ఐ విజయభాస్కర్, కానిస్టేబుళ్లు అనిత, అరుణ, వెంకటేశ్వరమ్మ, చెన్నరాయుడు, నవ్వు శ్రీనులకు గాయాలయ్యాయి. అలాగే పోలీస్ టీఆర్ గ్యాస్ వాహనంతోపాటు రెండు బైక్‌లకు గ్రామస్తులు నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయాయి. డీఎస్పీ వాహనంతోపాటు మరో మూడు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. కంపెనీకి వెళ్లే 8 లారీల అద్దాలను ధ్వంసం చేయడంతోపాటు టైర్లలో గాలి తీశారు. ఈ ఘటనకు కారణమైన వారి ఆచూకీ కోసం చిత్తనూర్, ఎక్లాస్పూర్, జిన్నారం గ్రామాలను జల్లెడ పడుతున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు. కాలు విరగొట్టారు.. పోలీసులు కర్రలతో కొట్టడంతో కాలు విరిగిపొయింది. కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాల నుంచి తమకు ప్రాణహాని ఉందని రెండేళ్ల నుంచి ఆందోళన చేస్తున్నాం. పిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా పోలీసులు కొట్టడం వల్ల చాలామంది గాయపడ్డారు. ఇంకా కంపెనీని రద్దు చేసే వరకు నిద్రపోం. – చంద్రమ్మ, జిన్నారం ప్రాణం పోయినా.. పట్టువదలం! ఇక్కడి నుంచి కంపెనీ ఎత్తివేసే వరకు తమ పోరాటం ఆగదు. ఇథనాల్ కంపెనీ నుంచి ప్రమాదం కలిగించే కెమికల్స్‌ను గ్రామ శివారులో వేయడం వల్ల దుర్వాసన వస్తోంది. వ్యర్థాలను తరలించే ట్యాంకర్‌ను అడ్డుకొని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు దాడిచేసి గాయపర్చారు. అక్కడి నుంచి పరుగు తీసినా వదిలిపెట్టలేదు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు.. కంపెనీని తొలగించే వరకు ఆందోళన చేస్తాం. – హన్మమ్మ, మానస, ఎక్లాస్పూర్ డీఎస్పీదే బాధ్యత.. ఇథనాల్ కంపెనీ నుంచి బయటకు తెచ్చి పారబోస్తున్న విష రసాయనాల ట్యాంకర్‌ను అడ్డుకొని ఆందోళన చేస్తున్న గ్రామస్తులపై పోలీసు లను రెచ్చగొట్టి లాఠీచార్జీ చేయించిన డీఎస్పీపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యు డు చక్రవర్తి అన్నారు. కంపెనీ నుంచి ట్యాంకర్ల ద్వారా వ్యర్థాలను తీసుకువచ్చి జిన్నారం, ఎక్లాస్పూర్, చిత్తనూర్, ఉంద్యాల గ్రామాల పక్కన పారపోయడంపై తహసీల్దార్‌తో మాట్లాడుతుండగా డీఎస్పీ పోలీసులను రెచ్చగొట్టి లాఠీచార్జీ చేయించారని, ఇందుకు ఆయనే బాధ్యత వహించాలని చెప్పారు. -
సీఎం జగన్ సార్.. మా బిడ్డకు ప్రాణభిక్ష పెట్టారు! : బాధితురాలు లక్ష్మి
సాక్షి, అనంతపురం: కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న భర్త పదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి వరకూ గడప దాటి ఎరుగని ఇల్లాలిపై ఇద్దరు చిన్న పిల్లల పోషణ భారం పడింది. దిక్కుతోచని పరిస్థితి. అయినా బిడ్డల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని బతుకు పోరాటాన్ని సాగిస్తూ వచ్చింది. అయినా విధి ఆమె పట్ల వక్రీకరించింది. ఏడేళ్ల వయసున్న చిన్న కుమారుడు క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డాడు. తన వద్ద ఉన్న ఆస్తి మొత్తం అమ్మినా.. చికిత్సకు అవసరమైన డబ్బు సమకూరదు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి స్పందించారు. చిన్నారి అంశాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రూ.14 లక్షల ఆర్థిక సాయం అందేలా చొరవ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని ఆదివారం బాధిత కుటుంబానికి విప్ అందజేసినప్పుడు నిస్సహాయురాలైన ఆ తల్లి భావోద్వేగానికి లోనైంది. ఆ వేదన ఆమె మాటల్లోనే... చిన్న వయసులోనే పిల్లల తండ్రి పోయాడు.. నా పేరు వడ్డే లక్ష్మి. రాయదుర్గంలోని పదో వార్డులో నివాసముంటున్న వడ్డే లోకేష్‌తో నాకు వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. పెద్దొడు చిన్మయ్ 8వ తరగతి, చిన్నోడు లక్షిత్ 3వ తరగతి చదువుకుంటున్నారు. వీరిద్దరూ చిరుప్రాయంలో ఉన్నప్పుడే నా భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ పరిస్థితుల్లో నాకు దిక్కు తోచలేదు. ఇద్దరు చిన్న పిల్లలను పట్టుకుని ఎలా బతకాలో అర్థం కాలేదు. అయినా పిల్లలిద్దరినీ ప్రయోజకులను చేయాలనే ఆశ నన్ను బతుకు పోరాటం సాగించేలా చేసింది. రూ.20 లక్షలు అవుతుందన్నారు.. మా చిన్నోడు లక్షిత్ ఒక రోజు స్కూల్ నుంచి వస్తూ సొమ్మసిల్లి పోయాడు. ఏమైందోనని చాలా భయపడ్డాను. ఆస్పత్రికి తీసుకెళ్లా. పరీక్షించిన వైద్యులు అదేదో క్యాన్సర్ జబ్బు సోకిందన్నారు. నాకేమీ అర్థం కాలేదు. హైదరాబాద్‌లోని అమెరికన్ సిటిజన్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. అతి కష్టంపై పిల్లాడిని తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లా. ఆస్పత్రిలో పరీక్షించిన డాక్టర్లు పిల్లాడికి బోన్‌మ్యారో చికిత్స చేయాలని, ఇందు కోసం రూ.20 లక్షలు ఖర్చు అవుతుందంటూ ఓ లెటర్ చేతికి ఇచ్చారు. ఆలస్యం చేస్తే పిల్లాడి ప్రాణాలకు ముప్పు తప్పదన్నారు. ఆ సమయంలో అంత డబ్బు ఎలా తీసుకురావాలో అర్థం కాక నాలో నేను ఎంతగా ఏడ్చానో ఆ దేవుడికే తెలుసు. దేవుడిలా మా బాధను అర్థం చేసుకున్నారు.. హైదరాబాద్ నుంచి తిరిగొచ్చిన నేను నెల రోజుల క్రితం మా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సార్‌ను కలిసేందుకు ఆయన ఇంటి వద్దకెళ్లా. అప్పటికే ఇంటి వద్ద చాలా మంది ఉన్నారు. కాసేపటి తర్వాత సార్ నన్ను చూసి ఆగారు. వెంటనే నేనెళ్లి బిడ్డ పరిస్థితి తెలిపి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకున్నా. గొప్ప మనసుతో ఆయన మా బాధను అర్థం చేసుకున్నారు. విషయాన్ని సీఎం జగనన్న దృష్టికి తీసుకెళ్లారు. దేవుడిలా మమ్మల్ని ఆదుకున్నారు. వైద్యం కోసం రూ.14 లక్షలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత ఆస్పత్రికి ఉత్తర్వులు పంపారని, నేరుగా అక్కడికెళ్లి పిల్లాడికి చికిత్స చేయించుకుని రమ్మని మా ఎమ్మెల్యే సార్ ధైర్యం చెప్పారు (ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ). లెటర్ కూడా నా చేతికి ఇచ్చారు. మాకు నిజమైన దసరా ఈ రోజే వచ్చింది. నా కుమారుడికి ప్రాణభిక్ష పెట్టిన సీఎం జగనన్న, విప్ కాపు రామచంద్రారెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. చిన్మయ్‌కు అభినందన.. సీఎం కార్యాలయం నుంచి అందిన లెటర్ ఆఫ్ క్రెడిట్ పత్రాన్ని ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో బాధిత కుటుంబానికి విప్ కాపు రామచంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే గొప్ప మనసున్న సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. సమస్యను వివరించగానే రూ.14 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరు చేయించారన్నారు. అంతేకాక బాధితుడికి అవసరమైన బోన్‌మ్యారో ఇవ్వడానికి ముందుకు వచ్చిన సోదరుడు చిన్మయ్‌ని అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు ఏటూరి మహేష్ పాల్గొన్నారు. -
బతుకమ్మ మీరే చేస్తారా..!? మాకు మనసుంది.. పండుగ మేము చేస్తామంటూ..
సాక్షి, కరీంనగర్: తీరొక్క పూలతో బతుకమ్మను తయారు చేసి వేడుకల్లో పాల్గొన్న ముస్లిం యువతి సుల్తానా బేగం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. మండలంలోని బూర్గుపల్లికి చెందిన సుల్తానాబేగం ఆదివారం బతుకమ్మను పేర్చి గ్రామస్తులతో కలిసి సంబురంగా వేడుకల్లో పాల్గొంది. సుల్తానా బేగంను ఎమ్మెల్యే రవిశంకర్, సర్పంచ్ రమ్య, ఎంపీటీసీ లక్ష్మి అభినందించారు. -
ఘనంగా బతుకమ్మ వేడుకలు!
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ రోజున 'గౌరమ్మను' పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పండుగను అంగరంగా వైభవంగా జరుపుతారు. ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. పార్వతి గురించి పాటలాగా పాడుతూ.. ఆనందంతో బతుకమ్మను జరుపుకుంటారు. ఆడపడచులు, యువకులు, పిల్లలు, పెద్దలు తమ ఆనందాన్ని చూపే కన్నుల పండుగగా.. తెలంగాణ ప్రజలకు ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ ఈ బతుకమ్మ. ఈ సందర్భంగా పల్లెలు, పట్టణాల్లో ఆలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో పల్లెలు, పట్టణాలు తీరొక్క పూల శోభ సంతరించుకోనుంది. ఈ క్రమంలో చెరువుల వద్ద నిమజ్జన ప్రదేశాల్లో రంగుల ఆహ్లాదం ఎంతో చూడముచ్చట. పౌష్టికాహారం, చిరుధాన్యాలు, కూరగాయలు, గాజులు, చేతివృత్తులతో తయారు చేసిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణీయం. బతుకమ్మ పండుగ కేవలం కటుంబాలకు, ఇంటికే పరిమితం కాదు, తెలంగాణలోని అన్నీ రంగాలవారిగా.. విద్యా, వైద్యా, సాంకేతిక, వివిధ పరిశ్రమల్లో బతుకమ్మ వేడుకల నిర్వహణ ఎంతో కన్నుల పండుగగా చెప్పవచ్చు అనడానికి నిదర్శనంగా.. 'డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయంలో' శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. 'డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగం' డైరెక్టర్ వి ఫణిభూషణ్‌శర్మ ఈ వేడుకలకు హాజరయ్యారు. 'జాయింట్ డైరెక్టర్లు' హెచ్ శైలజారాణి, పి రజిని, తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. రంగారెడ్డి హైదరాబాద్ 'పే అండ్ అకౌంట్ ఆఫిసర్స్' మహ్మద్ ఆరిఫ్, ఆర్ వి రామగోపాల్ అండ్ స్టాఫ్, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగ సిబ్బంది, తదితరులు బతుకమ్మ వేడుకల సందర్భంగా హాజరయ్యారు. బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళల్ని మరింత ప్రోత్సహించే దిశలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఇలాంటి మరెన్నో పండుగలు జరుపుకోవాలని డైరెక్టర్ కోరుతూ.. అందుకు అందరి ప్రోత్సాహం ఎంతో అవసరమని తెలిపారు. -
TS Election 2023: పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు.. 13 శాఖలను గుర్తించిన ఈసీ..
సాక్షి, ఆదిలాబాద్: తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా జర్నలిస్ట్‌లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సదుపాయాన్ని కల్పించింది. అయితే ఆరోజు జర్నలిస్ట్‌లు ఎన్నికల వార్తల సేకరణ విధుల్లో ఉండాలి. అంతే కాకుండా ఎన్నికల కమిషన్ నుంచి పాసులు పొందాలి. జర్నలిస్ట్‌లతో పాటు ఎన్నికలతో సంబంధం లేని 12అత్యవసర సేవల రంగానికి చెందిన ఉద్యోగులు సైతం ఇకపై పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. గెజిట్ జారీ.. చాలా మంది అత్యవసర సేవల రంగాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగ స్వభావం రీత్యా ఓటు హక్కు ఉన్న ప్రాంతానికి దూరంగా ఉంటున్నారు. వారు తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరికి సైతం ఓటు హక్కు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 10న ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 60(సీ) కింద ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం.. ఇప్పటి వరకు కొంత మందికి మాత్రమే బ్యాలెట్ ఓటు వేసే అవకాశం ఉండేది. వారిలో ఎన్నికల విధుల్లో పనిచేసే సిబ్బంది, సర్వీసు ఓటర్లు (సాయుధ బలగాలు), ప్రవాస ఓటర్లు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేవారు. అయితే ఈసారి ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 40శాతం, ఆపై వైకల్యం కలిగిన దివ్యాంగులు, 80ఏళ్లకు పైబడిన ఓటర్లకు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనుంది. అలాగే జర్నలిస్టులు, ఎన్నికల విధులతో సంబంధం లేని అత్యవసర సేవల విభాగాల ఉద్యోగులకు సైతం పోస్టల్ సదుపాయం కల్పిస్తోంది. ప్రత్యేక నోడల్ అధికారి.. జర్నలిస్టులు, అత్యవసర విభాగాల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడానికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. నోడల్ అధికారుల వద్ద ఫారం–12డీ అందుబాటులో ఉంచాలని కోరింది. బ్యాలెట్ ఓటు వేయదలిచిన వారు దానిని నింపి స్థానిక ఎన్నికల అధికారికి సమర్పించాలి. వచ్చే నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. అప్పటి నుంచి 5 రోజుల్లోగా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కోరుతూ ‘ఫారం–12డీ’ దరఖాస్తులను స్థానిక ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. నవంబర్ 7నాటికి దరఖాస్తులు రిటర్నింగ్ అధికారికి చేరితే వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తారు. ఎవరెవరికి బ్యాలెట్ ఓటు వేసే అవకాశం.. కేంద్ర ఎన్నికల కమిషన్ పలు విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసే అవకాశం కల్పిస్తోంది. ఎయిర్‌పోర్టు ఆథారిటి ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, విద్యుత్‌శాఖ, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ), పౌర సరఫరాల శాఖ, బీఎస్ఎన్ఎల్, పోలింగ్ రోజు వార్తల సేకరణ కోసం ఎన్నికల సంఘం నుంచి పాస్ పొందిన జర్నలిస్ట్‌లు, అగ్నిమాపక శాఖ అధికారులు బ్యాలెట్ ఓటు వేయవచ్చు. -
శ్రీమిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా–2023 'రన్నరప్' గా నిర్మల్ యువతి
సాక్షి, ఆదిలాబాద్: ఫ్యాషన్‌రంగంపై మక్కువతో అందులో ఎదుగుతున్న నిర్మల్ యువతి అరుదైన స్థానంలో నిలిచింది. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన శ్రీమిస్ క్వీన్ ఆఫ్ ది వరల్డ్ ఇండియా–2023శ్రీ పోటీల్లో జిల్లా కేంద్రానికి చెందిన నిషిత తిరునగరి ఒక్క మార్కు తేడాలో రన్నరప్‌గా నిలిచింది. స్థానిక ఈద్గాంకు చెందిన సరళ, మనోహర్‌స్వామి దంపతుల కూతురు నిషిత బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివింది. భవిష్యత్తుపై తనకున్న నమ్మకం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఫ్యాషన్‌రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె 18రాష్ట్రాల మహిళలు, యువతులకు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్‌డిఫెన్స్ కోర్సును నేర్పిస్తుండడం గమనార్హం. ఢిల్లీలో జరిగిన పోటీల్లో నిషిత రన్నరప్‌గా నిలువడంపై కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి: అలనాడే పాన్ ఇండియా నటుడు అక్కినేని -
దయచేసి.. మా కుమారుడిని కాపాడండి!
ఖమ్మం: మెదడులో నీరు చేరడంతో అనారోగ్యం పాలైన ఓ విద్యార్థి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. బ్రెయిన్‌కు సర్జరీ చేస్తేనే బతుకుతాడని వైద్యులు సూచించడంతో కన్నీరుమున్నీరవుతున్న ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం వేచిచూస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని గాదెపాడు గ్రామానికి చెందిన భూక్యా సంతు, ప్రమీల దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడైన భూక్యా హర్షిత్ కారేపల్లిలోని మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. కాగా మూడేళ్ల కిందట హర్షిత్‌కు జ్వరం రావడంతో ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చూపించగా.. చిన్నారి బ్రెయిన్లో నీరు చేరిందని అక్కడి వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని రెయిన్బో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో హర్షిత్‌కు రెండుసార్లు బ్రెయిన్ సర్జరీ జరిగి కోలుకుంటున్న క్రమంలో ఇటీవల తిరిగి అనారోగ్యానికి గురికావడంతో రెయిన్‌బోకు తీసుకొచ్చారు. చికిత్స అనంతరం మరోసారి బ్రెయిన్ సర్జరీ చేయాలని, సుమారు రూ.7 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యు లు తెలపడంతో ఇప్పటికే ఇల్లు, వాకిలి అమ్ముకోవడంతో పాటు స్నేహితుల సహకారంతో రూ.12 లక్షల వరకు ఖర్చుచేశామని వాపోయారు. ఇదిలా ఉండగా హర్షిత్ తండ్రి సంతుకు 2021వ సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు గాయమై బ్రెయిన్ సర్జరీ కావడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలతో రోడ్డున పడాల్సిన పరిస్థితి దాపురించింది. తమ కుమారుడి ప్రాణాలైనా కాపాడుకుందామని, దాతలు సహకరించాలని హర్షిత్ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. చదవండి: బ్యాంకుల వద్ద మఫ్టీలో ఉండి మరీ అరాచకం..! ఒక్కసారిగా ఇలా.. -
భార్య కాపురానికి రావడం లేదని.. పురుగుల మందు తాగి..
నల్గొండ: భార్య కాపురానికి రావడం లేదని పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. ఈ ఘటన చందంపేట మండలం పోలేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటిగానితండాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటిగానితండాకు చెందిన సపావత్ చీన్య(35)కు 13ఏళ్ల క్రితం పోల్యనాయక్తండాకు చెందిన సునీతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు హైదరాబాద్‌లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సునీత తన తల్లిగారింటికి వెళ్లి అక్కడే ఉంటుంది. భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపానికి గురైన చీన్య మంగళవారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా బుధవారం మృతిచెందాడు. జీవితంపై విరక్తితో.. జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తిప్పర్తి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నాయిగూడెం గ్రామానికి చెందిన బత్తుల భద్రయ్య(75) 5 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యాడు. జీవితం మీద విరక్తి చెంది మంగళవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి కుమారుడు బత్తుల సోమరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎన్. ధర్మ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉరేసుకొని ఆత్మహత్య పెళ్లి కాలేదని జీవితంపై విరక్తితో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండలంలోని లింగాల గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఏఎస్ఐ వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల గ్రామానికి చెందిన తడకమళ్ల మధుకుమార్(53)కు పెళ్లి కాకపోవడంతో తన ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేకుకొని వివరాలు సేకరించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, జీవితంపై విరక్తితో చనిపోతున్నానని మృతుడు రాసిన సూసైడ్ నోట్ లభించినట్లు ఏఎస్ఐ తెలిపారు. మృతుడి సోదరుడు యాదగిరి లక్ష్మీనరసింహారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి బలవన్మరణం ఉరేసుకొని గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని కేటీ అన్నారం రోడ్డులో గల జాహ్నవి టౌన్షిప్ వద్ద బుధవారం ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతుడి వివరాల కోసం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ముదిరాజ్‌లను విస్మరించిన పార్టీలను ఓడించాలి
సూర్యాపేట: రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న ముదిరాజ్‌లను రాజకీయంగా విస్మరించిన పార్టీలను త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు బోళ్ల కరుణాకర్ పిలుపునిచ్చారు. బుధవారం సూ ర్యాపేట పట్టణంలో నిర్వహించిన ముదిరాజ్‌ల రాజకీయ నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ సీట్లలో ఒక్కటి కూడా ముదిరాజ్‌లకు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. మిగతా రాజకీయ పార్టీలు ముదిరాజ్‌లకు జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీ సీట్లు కేటాయించకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని రెండు అగ్రకులాలు మాత్రమే తమ గు ప్పెట్లో పెట్టుకొని అధికారాన్ని చెలాయిస్తున్నాయని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా ఒక్కటై రానున్న ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలను గెలిపించుకుంటామని తెలిపారు. ముదిరాజ్‌లకు ప్రాధాన్యమిచ్చిన పార్టీ గెలుపునకు పనిచేస్తామన్నారు. యువత రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మరగోని రాజు ముదిరాజ్ మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో ముదిరాజ్‌లకు అవకాశం ఇస్తే ముది రాజులమంతా కలిసి గెలిపించుకుంటామన్నా రు. ఈర్యాలీలో అరిగే సైదులు ముదిరాజ్, పిట్టల శంకర్ ముదిరాజ్, కోల కరుణాకర్ ముదిరాజ్, చెక్కల వీరభద్రం, సిరికొండ సురేష్, నీలం కృష్ణ , గంగరబోయిన శ్రీను ముదిరాజ్, లొంక అశోక్ ముదిరాజ్, బైరి రామ్మూర్తి ముదిరాజ్, జోర్క లింగయ్య ముదిరాజ్, కర్కాల రమేష్ ముదిరాజ్, చింతల సైదులు ముదిరాజ్, చెక్కల నాగరాజు ముదిరాజ్ పాల్గొన్నారు. -
ప్రచారం.. ఉధృతం
యాదాద్రి: రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు సైతం జోరు పెంచాయి. భువనగిరిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభతో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజాక్షేత్రంలోకి దిగారు. ఆలేరు, నకిరేకల్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు కావడంతో వారు కూడా ప్రజా క్షేత్రంలోకి వెళ్తున్నారు. ఇక భువనగిరి, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించనప్పటికీ కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, చల్లమల కృష్ణారెడ్డి జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులను నేడో, రేపో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పార్టీ సంస్థాగతంగా సమావేశాలు నిర్వహిస్తోంది. బీఆర్ఎస్లో జోష్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 16వ తేదీన భువనగిరిలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సభ విజయవంతం కావడంతో కేడర్‌లో జోష్ నెలకొంది. ఉత్సాహంతో ప్రచారాన్ని ఉధృతం చేశారు. భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆలేరులో గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, తుంగుతుర్తిలో గాదరి కిశోర్‌కుమార్, నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య, మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లను నేరుగా కలుస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తున్నారు. సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలకలు.. బుజ్జగింపులు అధికార బీఆర్ఎస్ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచా రాన్ని ముమ్మరం చేసింది. అయితే కొంతమంది నాయకులు, ద్వితీయ శ్రేణి కేడర్ వివిధ కారణాలతో అలకబూని ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. వారిని బుజ్జగించేందుకు అభ్యర్థులు రంగంలోకి దిగారు. వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి చర్చలు జరిపి ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు. ప్రధానంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎమ్మెల్యేల తీరుపై గుర్రుగా ఉంది. తెలంగాణ ఉద్యమ కాలంనుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉంటున్నా తమకు ఒరిగిందేమీ లేదని నేరుగానే ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారు. పార్టీలో కొత్తగా చేరిన వారికే ప్రాధాన్యం ఇచ్చారని, తమను నిర్లక్ష్యం చేశారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ క్షేత్రస్థాయి సమావేశాలు బీజేపీ నేడో, రేపో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల్లో విజయం కోసం ఆ పార్టీ ఇప్పటికే విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించిది. మరోమారు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌ను సమాయత్తం చేస్తోంది. రెండు రోజుల క్రితం భువనగిరి, ఆలేరు నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించింది. పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన తీరుపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా ఎన్నికల ఇన్చార్జ్ సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ సమావేశాల్లో పాల్గొన్నారు. భువనగిరిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి టికెట్‌పై ఆశలు పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మరో నాయకుడు పాశం భాస్కర్ కూడా టికెట్ రేసులో ఉన్నారు. ఆలేరులో పడాల శ్రీనివాస్, సూదగాని హరిశంకర్‌గౌడ్, వట్టిపల్లి శ్రీనివాస్‌గౌడ్ టికెట్ ఆశిస్తున్నారు. అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాతే ప్రచారం చేయనున్నారు. ఆలేరు, నకిరేకల్‌లో కాంగ్రెస్ జోరు కాంగ్రెస్ అభ్యర్థులుగా ఆలేరు నుంచి బీర్ల అయిలయ్య, నకిరేకల్ నుంచి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో వారు ప్రచారంలో స్పీడ్ పెంచారు. బీర్ల అయిలయ్య ప్రచారం కొనసాగిస్తూనే చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. టికెట్ ఖరారు కావడంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ప్రచారాన్ని ఉధృతం చేశారు. సోమవరం రామన్నపేటలో కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఇక భువనగిరి, మునుగోడు టికెట్లను కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ తమకే టికెట్ వస్తుందన్న నమ్మకంతో భువనగిరి నుంచి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మనుగోడులో చల్లమల కృష్ణారెడ్డి ప్రచారం సాగిస్తున్నారు. ప్రధానంగా ఆరు గ్యారంటీ స్కీంలను గడపగడపకు తీసుకెళ్తున్నారు. దీంతో పాటు స్థానిక ఎమ్మెల్యేల వైఫల్యాలను సైతం ఎండగడుతున్నారు. -
శరీరాన్ని స్ప్రింగ్, బొంగరంలా మెలికలు తిప్పేస్తున్నారు..
కరీంనగర్: ప్రస్తుతం యోగా దైనందిన జీవితంలో ఆరోగ్యానికి ఔషధంలా దోహదపడుతుంది. కొందరు యోగాతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే. ఇక్కడ కనిపిస్తున్న క్రీడాకారులు మాత్రం ప్రతీరోజు యోగా సాధన చేస్తూ దేశానికి పతకాలు సాధించే క్రీడాకారులుగా తయారవుతామని అంటున్నారు. కరీంనగర్ జిల్లా యో గా సంఘం ఆధ్వర్యంలో మానేరు సెంట్రల్ స్కూల్ వేదికగా రాష్ట్ర స్థాయి యోగా పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలకు అధి క సంఖ్యలో క్రీడాకారులు హాజరై ప్రతిభ చాటుతున్నా రు. శరీరాన్ని స్ప్రింగ్, బొంగరంలా మెలికలు తిప్పుతూ యోగాసనాలు వేసి, ఆకట్టుకుంటున్నారు. యోగాలో మేం రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించాం... జాతీయ స్థాయిలో పతకాలు సాధించడమే లక్ష్యమంటున్న పలువురు క్రీడాకారుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. యోగా అంటే ఇష్టం.. యోగా చేయడమంటే చాలా ఇష్టం. సోషల్ మీడియా ద్వారా యోగాసనాలు ప్రాక్టీస్ చేశాను. ఏడాదిలోనే పూర్తి స్థాయిలో యోగాసనాలు సులువుగా వేయగలిగాను. ఇటీవల కరీంనగర్లో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో, ఇప్పుడు రాష్ట్రస్థాయి పోటీల్లో ఫెర్మామెన్స్ ఇచ్చాను. జాతీయస్థాయికి ఎంపికవుతాననే నమ్మకం ఉంది. 25–30 విభాగంలో పోటీపడ్డాను. – జె ఆమని, సుల్తానాబాద్ జాతీయస్థాయిలో పతకం సాధించాలి.. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం, దుమాలలో ఇంటర్ బైపీసీ చదువుతున్నాను. ప్రస్తుతం 16–18 విభాగంలో పోటీ పడుతున్నాను. గతంలో 9కి పైగా రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించాను. పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి యోగా చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్నాను. ప్రస్తుతం జరుగుతున్న పోటీలకు బాగా ప్రాక్టీస్ చేశాను. జాతీయ స్థాయి పోటీల్లో పతకం సాధించడమే లక్ష్యం. – ఎల్ రంజిత, అగ్రహారం పిల్లలకు ప్రాక్టీస్ చేయిస్తూ.. మాది హన్మకొండ, యోగా ట్రైనర్‌గా స్కూల్లో పిల్లలకు ప్రాక్టీస్ చేయిస్తూ ఇటు యోగా కాంపిటీషన్‌కు ప్రిపేరవుతున్నాను. మా అమ్మాయి వర్షిణి యోగా క్రీడాకారిణి. ప్రస్తుతం రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నాం. ఇదివరకు జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన జాతీయ పోటీల్లో పాల్గొన్నాను. పతకం సాధించడమే లక్ష్యం. – సీహెచ్.రమాదేవి, హన్మకొండ నాలుగుసార్లు పోటీల్లో పాల్గొన్నా.. జాతీయ స్థాయి యోగా పోటీల్లో ఇప్పటివరకు నాలుగుసార్లు పాల్గొన్నాను. ప్రస్తుతం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో యోగా ట్రైనర్‌గా పనిచేస్తున్నాను. పిల్లలకు కోచింగ్ ఇస్తూ యోగా పోటీల్లో పాల్గొంటున్నాను. ప్రస్తుతం 21–25 కేటగిరిలో పాల్గొన్నాను. – బి ప్రవీణ, కరీంనగర్ -
TS Election 2023: డబ్బు, మద్యం అరికట్టేందుకు చర్యలు
మహబూబ్‌నగర్: ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహాన్ని అరికట్టేందుకు ఎఫ్ఎస్టీ కదలికలు చాలా ముఖ్యమని, వాటిని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు డీజీ సంజయ్‌కుమార్ జైన్‌తో కలిసి ఉమ్మడి జిల్లాలోని ఎన్నికల అధికారులు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులతో అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయం ఏర్పాటు చేసి కంట్రోల్ రూం నుంచి ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాల కెమెరాలకు అనుసంధానం చేయాలన్నారు. సీవిజిల్తోపాటు జిల్లా ఎన్నికల అధికారులు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంప్లెయింట్ మానిటరింగ్ సెల్‌కు సంబంధించిన సమాచారాలపై విస్తృత ప్రచారం కల్పిస్తే ప్రజలు ఫిర్యాదు చేయడానికి సులభంగా ఉంటుందన్నారు. అలాగే సీ విజిల్ యాప్ సైతం చాలా ముఖ్యమని, అన్ని గ్రామాల్లో పోస్టర్లను ఏర్పాటు చేసి ప్రజలందరికీ తెలిసేలా చూడాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చే ఫిర్యాదులపై కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఓటరు టర్న్ అవుట్ పెంచే అంశాలపై ప్రత్యేక శ్రద్ధవహించాలని, ఓటు వినియోగం, ఓటుహక్కు ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కొత్త ఓటరుగా నమోదు చేసుకున్న వారి గుర్తింపు కార్డులు సక్రమంగా ప్రింట్ వచ్చేలా పునఃపరిశీలన చేసుకోవాలన్నారు. ఈవీఎంల ర్యాండమైజేషన్ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, సువిధ యాప్ ద్వారా అన్ని అనుమతులు ఒకేచోట ఇవ్వాలన్నారు. మహబూబ్‌నగర్ కలెక్టర్ రవినాయక్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నారాయణపేట కలెక్టర్ శ్రీహర్ష, జోగుళాంబ గద్వాల కలెక్టర్ వల్లూరి క్రాంతి, వనపర్తి కలెక్టర తేజాస్ నందులాల్ పవార్, నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఆయా జిల్లాల ఎస్పీలు హర్షవర్ధన్, రితిరాజ్, యోగేష్ వర్ధన్, రక్షిత కె.మూర్తి, వైభవ్ గైక్వాడ్ ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలను వివరించారు. సమావేశానికి జోగుళాంబ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, మక్తల్ రిటర్నింగ్ అధికారి మయాంక్ మిట్టల్, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కుమార్ దీపక్, గద్వాల రిటర్నింగ్ అధికారి అపూర్వ చౌహాన్, ఉమ్మడి జిల్లా అసెంబ్లీ రిటర్నింగ్ అధికారులు, పోలీస్, నోడల్ అధికారులు హాజరయ్యారు. మహబూబ్‌నగర్ సమీపంలోని జేపీఎన్సీఈ కళాశాలలో ప్రతిపాదించనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని, జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సీఈఓ వికాస్‌రాజ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో సౌకర్యాలు, క్యూలైన్లు, బారికేడింగ్, వాహనాల పార్కింగ్ తదితర అంశాలను పరిశీలించారు. అక్కడే ఉన్న బీఎల్ఓలతో మాట్లాడుతూ ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు.. కొత్తగా ఎంత మంది చేరారు.. చనిపోయిన వారు, డబుల్ ఓట్ల తొలగింపు, తుది ఓటరు జాబితాలో తప్పొప్పుల గురించి ఆరాతీశారు. మహబూబ్‌నగర్ రిటర్నింగ్ అధికారి అనిల్‌కుమార్, అర్బన్ తహసీల్దార్ నాగార్జున, రూరల్ తహసీల్దార్ సుందర్రాజు, డీటీ శ్యాంసుందర్‌రెడ్డి, ఆర్ఐలు కాంత్రికుమార్గౌడ్, చైతన్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. శాంతిభద్రతల సమస్య రావొద్దు ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని వికాస్‌రాజ్ చెప్పారు. మోడల్ పోలింగ్ కేంద్రాల్లో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని గ్రామాల నుంచి పటిష్టమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆయా పోస్టులు ఖాళీ లేకుండా చూసుకోవాలని, నామినేషన్ల సందర్భంగా రిటర్నింగ్ అధికారుల చాంబర్లు సరిపోయేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాలెట్ పేపర్ల విషయంలో అవసరమైనన్ని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. నియోజకవర్గాల్లో శాంతిభద్రతల పరిస్థితి, పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల కల్పన, మహిళా, పీడబ్ల్యూడీ పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంల ర్యాండమైజేషన్, సిబ్బందికి శిక్షణ, శాంతిభద్రతల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారంపై సీఈఓ సమీక్షించారు. -
పరారీలో ‘ప్రవళిక’ కేసు నిందితుడు
మహబూబ్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ప్రవళిక ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శివరాం రాథోడ్ స్వగ్రామం నారాయణపేట జిల్లా కోస్గి మండలం పీసీతండా ఒక్కసారిగా వార్తాల్లోకి రావడంతో గిరిజనులు ఉలిక్కి పడుతున్నారు. విచారణ నిమిత్తం కొత్త కొత్త వ్యక్తులు తండాకు వస్తుండటంతో భయంతో తండావాసులు ఉదయం వెళ్లి రాత్రికి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. నిందితుడి కుటుంబం ఆర్థికంగా బాగా ఉండి పలుకుబడి కలిగినది కావడంతో వివరాలు చెప్పడానికి జనాలు ముందుకు రావడం లేదు. నిందితుడు శివరాం తల్లిదండ్రులు కిషన్ రాథోడ్, సుశీల మహారాష్ట్రలోని ముంబయిలో కాంట్రాక్టర్లుగా అక్కడే స్థిరపడ్డారు. కిషన్ రాథోడ్‌కు ఇద్దరు కుమారులు, ఓ కూతురు కాగా పెద్ద కుమారుడు శివరాం రాథోడ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కోచింగ్ సెంటర్లో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. రెండో కుమారుడు మణిరాం రాథోడ్ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువుతుండగా యుద్ధం నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చాడు. కూతురు అనురాధ మహబూబ్‌నగర్‌లో బీటెక్ చదువుతుంది. పీసీతండాలో తాత హేమ్లానాయక్, నానమ్మ మోనెమ్మ, మాణిక్యమ్మల దగ్గరకు పిల్లలు అప్పుడప్పుడు వచ్చి పోతుండేవారు. రాజకీయంగా దుమారం.. ప్రవళిక ఆత్మహత్య సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారడంతోపాటు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసులో నిందితుడిగా శివరాం రాథోడ్‌ను నిర్ధారించడంతో అతని కుటుంబం మొత్తం అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. నిందితుడి స్వగ్రామంలోని ఇంటికి సైతం తాళం వేసి కుటుంబ సభ్యులు ముఖం చాటేశారు. ఈ విషయమై తండావాసులు ఎవరూ నోరు మెదపకపోవడంతో నిశ్శబ్దం అలుముకుంది. ఏదేమైనా రాష్ట్రవ్యాప్త సంచలన కేసుకు కోస్గి మండలం మరోమారు వేదికై ంది. ప్రవళికతో ప్రేమాయణం.. మరో యువతితో పెళ్లి ఏర్పాట్లు ఆత్మహత్య చేసుకున్న ప్రవళికతో ప్రేమాయణం నడిపిన శివరాం రాథోడ్ వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని ఓ తండాకు చెందిన యువతితో పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించడంతో 15 రోజుల క్రితం పెళ్లిచూపుల తతంగాన్ని ఇరు కుటుంబాల వారు పూర్తి చేసుకున్నారు. దసరా తర్వాత ముహూర్తాలు వస్తాయని, అప్పుడే ఎంగేజ్మెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు. తాను ప్రేమించిన యువకుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధం కావడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. -
తాగుడుకు పైసలు లేవని.. ఓ వ్యక్తి తీవ్ర నిర్ణయం..
నల్గొండ: మద్యం తాగడానికి డబ్బులు లేక పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మునుగోడు మండలంలోని కొరటికల్ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కొరటికల్ గ్రామానికి చెందిన బోడిశ సత్తయ్య(45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల సత్తయ్య మద్యానికి బానిసయ్యాడు. సోమవారం రాత్రి మద్యం తాగేందుకు అతడి వద్ద డబ్బులు లేకపోడంతో తట్టుకోలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తయ్య కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చేసరికి అప్పటికే అతడు మృతిచెందాడు. మృతుడి కుమారుడు మహేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com రోడ్డు ప్రమాదంలో క్లీనర్ మృతి విద్యుత్ స్తంభాల లోడ్‌తో వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలోని నీలంనగర్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. గుడిపల్లి ఎస్ఐ రంజిత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలంలోని ఆలగడప నుంచి గద్వాల్ జిల్లాకు విద్యుత్ స్తంభాలు లోడ్‌తో వెళ్తున్న లారీ పెద్దఅడిశర్లపల్లి మండలం నీలంనగర్ సమీపంలో కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభాలు తీసుకెళ్తున్న లారీ క్లీనర్ గుగులోతు నితిన్(20) క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. తీవ్రగాయాలైన అతడిని స్థానికులు 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి సక్రాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఈతకు వెళ్లి బాలుడు మృతి
నల్గొండ: చెరువులో ఈతకు వెళ్లి బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం పోచంపల్లి మండలంలోని మెహర్‌నగర్ శివారులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి మండలం అంతమ్మగూడేనికి చెందిన బండారి ఈశ్వరయ్య, లలిత దంపతులకు యశ్వంత్(12), కుమార్తె ఉన్నారు. ఈశ్వరయ్య, లలిత దంపతులు స్థానికంగా ఓ రసాయన కంపెనీలో పనిచేస్తున్నారు. యశ్వంత్ చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని ప్రగతి స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఇవ్వడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. తల్లిదండ్రులిద్దరూ మంగళవారం ఉదయం కంపెనీలో పనికి వెళ్లగా.. యశ్వంత్ తన స్నేహితుడైన వస్పరి జశ్వంత్‌తో కలిసి మధ్యాహ్నం ఈత కొట్టేందుకు సైకిల్‌పై మెహర్‌నగర్ శివారులోని సిద్దప్ప చెరువు వద్దకు వెళ్లారు. ఇద్దరు చెరువు ఒడ్డున బట్టలు, చెప్పులు విడిచి చెరువులోకి దిగారు. కాగా యశ్వంత్ చెరువు ఒడ్డు నుంచి కొద్దిదూరం వెళ్లగానే పెద్ద గుంతలో మునిగిపోయాడు. అక్కడే ఉన్న వస్పరి జశ్వంత్ భయపడి ఊర్లోకి వెళ్లి యశ్వంత్ ఇంటి వద్ద సైకిల్ పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దుస్తులను చూసి గుర్తించి.. ఇంటికి వచ్చిన యశ్వంత్ తల్లిదండ్రులు కొడుకు కనిపించకపోయేసరికి ఊరిలో వెతికారు. ఇరుగుపొరుగు వారిని కుమారుడి గురించి వాకబు చేశారు. మధ్యాహ్నం యశ్వంత్, జశ్వంత్ కలిసి చెరువు వైపు వెళ్లడం చూశానని గొర్రెల కాపరి వస్పరి పార్వతమ్మ చెప్పడంతో గ్రామస్తులతో కలిసి వెళ్లి చూడగా చెరువు ఒడ్డున యశ్వంత్ దుస్తులు, చెప్పులు కన్పించాయి. చెరువులోకి దిగి వెతకగా యశ్వంత్ మృతదేహం లభ్యమైంది. ఈ విషయం తెలుసుకొన్న చౌటుప్పల్ రూరల్ సీఐ మహేశ్, స్థానిక ఎస్ఐ విక్రంరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వ్యాపారంలో నష్టం వచ్చిందని..తనువు చాలించిన యువకుడు..
నల్గొండ: వ్యాపారంలో నష్టం రావడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకొని మృతిచెందాడు. ఈ ఘటన మంగళవారం డిండి మండల పరిధిలోని సింగరాజుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఏటెల్లి మల్లేష్(25) హైదరాబాద్‌లో ఉంటూ కారు నడపడంతో పాటు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతడు చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చింది. దీంతో మూడు రోజుల క్రితం అతడు స్వగ్రామమైన సింగరాజుపల్లికి వచ్చాడు. మంగళవారం గ్రామ శివారులోని ఇతరుల వ్యవసాయ పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అటువైపుగా వెళ్తున్న రైతులు గమనించి కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, చిన్న పాప ఉంది. కాగా ఈ ఘటనపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ సైదులు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com మద్యానికి బానిసై బలవన్మరణం మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొనిఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం దేవరకొండ మండల పరిధిలోని ఉచ్చరాలతండాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉచ్చరాలతండాకు చెందిన జపుల హరి(31) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన హరి తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తితో హరి సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకన్నాడు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ద్విసభ్య నియోజకవర్గాలు అంటే..
నల్గొండ: హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు 1952లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలోని కొన్ని భాగాలు కలిసి ఉండేవి. 1952 శాసనసభ ఎన్నికల్లో కొన్ని ఏక సభ్య నియోజకవర్గాలు, కొన్ని ద్వి సభ్య నియోజకవర్గాలు ఉండేవి. ఏక సభ్య నియోజకవర్గాల్లో ఒకస్థానంలో ఒక పార్టీ నుంచి ఒక్కరే పోటీ చేసే వీలుండేది. ద్విసభ్య నియోజకవర్గాల్లో ఒక స్థానంలో ఒక పార్టీ నుంచి ఇద్దరు పోటీ చేసేవారు. (అప్పటి వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ స్థానాలు లేవు) దీనిలో ఒకరు జనరల్ సభ్యుడిగా.. రెండవ వారు రిజర్వు కేటగిరీకి చెందిన సభ్యుడు (ఎస్సీ లేదా ఎస్టీ) ఉండే వారు. ద్విసభ్య నియోజకవర్గం నుంచి ఇద్దరు గెలిచే వారు. వీరికి సమాన అధికారాలు ఉండేవి. కాకపోతే.. రిజర్వు సభ్యుడు తన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీల సమస్యలు, హక్కుల గురించి చట్టసభల్లో ప్రస్తావించేవారు. ఈ ఎన్నికల సమయానికి హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం 142 శాసన సభ నియోజకవర్గాలు ఉండేవి. వీటిలో 33 ద్విసభ్య నియోజకవర్గాలు ఉండడంతో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 175 ఉండేది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, హుజూర్నగర్, సూర్యాపేట నియోజకవర్గాలు ద్విసభ్య నియోజకవర్గాలుగా ఉండేవి. అయితే, ద్విసభ్య నియోజకవర్గాలకు ఎన్నిక ప్రక్రియ క్లిష్టంగా ఉండడంతో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 1961 సంవత్సరంలో ద్విసభ్య నియోజకవర్గ విధానాన్ని రద్దు చేసి ఎస్టీ, ఎస్సీలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించింది. మాల్ చెక్‌పోస్టు పరిశీలన ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో చింతపల్లి మండలంలోని మాల్ వెంకటేశ్వరనగర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును మంగళవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ డ్యూటీ చేస్తున్న పోలీసులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో చెక్‌పోస్టు తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న వాహనాల తనిఖీలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్రమంగా మద్యం తరలించకుండా పకడ్బందీగా తనిఖీలు చేయాలని సిబ్బందికి సూచించారు. సరైన ఆధారాలు చూపని నగదును సీజ్ చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డీవో శ్రీరాములు, తహసీల్దార్ శంషొద్దీన్, ఎంపీడీఓ రాజు తదితరులున్నారు. -
బయటికొచ్చిన అసమ్మతి
నల్లగొండ: ప్రధాన రాజకీయ పార్టీల్లో అసంతృప్త నేతలు బయటకు వస్తున్నారు. టికెట్ ఆశించిన వారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అంసతృప్తితో ఉన్న వారు ఆయా పార్టీలను వీడుతున్నారు. కొందరు ఇతర పార్టీల్లో చేరి పోటీలో దిగేందుకు సిద్ధం కాగా, మరికొందరు ఉన్న పార్టీ నుంచి మరో పార్టీలో చేరుతున్నారు. ఎన్నికల ప్రచారం మొదలు కావడంతో వలసలు జోరందుకున్నాయి. నల్లగొండ, కోదాడలలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వలసలు మొదలు కాగా, సూర్యాపేట, నల్లగొండలో అసమ్మతి నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. మిర్యాలగూడ, మునుగోడులో పొత్తుల రచ్చ సాగుతూనే ఉంది. మిర్యాలగూడలో ‘సేవ్ కాంగ్రెస్’ పేరుతో ఆందోళనకు దిగగా, మునుగోడులో ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేద్దామంటూ సీపీఐ కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. నల్లగొండ బీఆర్ఎస్కు షాక్ నల్లగొండ నియోజకవర్గంలో రెండు రోజుల కిందట కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్లగొండ ఎంపీపీ మనిమద్దె సుమన్‌ను అధికార పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వగా.. కాంగ్రెస్ పార్టీ మంగళవారం హైదరాబాద్‌లో ఎంపీ కోమటిరెడి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌తోపాటు మరో ఐదుగురు కౌన్సిలర్లు ప్రదీప్ నాయక్, సందీప్, భాస్కర్, ఖయ్యూమ్ బేగ్, అసిమా సుల్తానా భర్త బషీర్, తిప్పర్తి మండలం జంగారెడ్డి గూడెం ఎంపిటిసి ముత్తినేని అనుషా భర్త నాగేశ్వర్రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే తిరుగుబాటు జెండా ఎగురవేసిన గులాబీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన బీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షుడు, కౌన్సిలర్ి పిల్లి రామరాజు ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. నాగార్జునసాగర్‌లోనూ వలసలు నాగార్జునసాగర్ బీఆర్ఎస్లోనూ అసమ్మతి కొనసాగుతోంది. ఎమ్మెల్యే నోముల భగత్‌పై అసంతృప్తితో హాలియా మున్సిపాలిటీకి చెందిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేత, ఎడమకాలువ మాజీ వైస్ చైర్మన్ మలిగిరెడ్డి లింగారెడ్డి సోమవారం మాజీ మంత్రి జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తిరుమలగిరి సాగర్ గ్రామ సర్పంచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి, నిడమనూరు మండల రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అంకతి వెంకటరమణతోపాటు పలు గ్రామాల కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. పెద్దవూర మండలంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు కొట్టి రమేష్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్‌లో చేరారు. మంగళవారం గుర్రంపొడు మండలంలోని జెడ్పీటీసీ సభ్యురాలు గాలి సరిత భర్త గాలి రవికుమార్‌తో పాటు పది గ్రామాల సర్పంచులు కాంగ్రెస్‌లో చేరారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి ప్రధాన అనుచరుడు మన్నెం రంజిత్ యాదవ్ బీజేపీలో చేరారు. నకిరేకల్‌లోనూ మొదలైన అసంతృప్తి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరికతో అసంతృప్తికి గురైన కాంగ్రెస్ పార్టీకి చెందిన చిట్యాల మున్సిపల్ కౌన్సిలర్లు ఇద్దరు, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కలిసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కాగా, మండలంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మూడు గ్రామాలకు చెందిన సర్పంచులు, ఒక ఎంపీటీసీ, ఇద్దరు సింగిల్ విండో డైరెక్టర్లు తోపాటు పలువురు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు వేముల వీరేశం ఆధ్వర్యంలో ఇటీవల కాంగ్రె్స్ పార్టీలో చేరారు. నివురుగప్పిన నిప్పులా.. మునుగోడు నియోజకవర్గంలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడు జెడ్పీటీసీ నారబోయిన స్వరూపరాణి భర్త నారబోయిన రవిముదిరాజ్ ఇటీవల నల్లగొండ, చండూరు ప్రాంతాల్లో తమ సామాజిక వర్గం ఓటర్లతో సమావేశాలు నిర్వహించారు. టికెట్ ముదిరాజ్‌లకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా ఇక్కడ తమకు టికెట్ ఇవ్వాలని సీపీఐ పట్టుపడుతోంది. అందుకు కాంగ్రెస్ ససేమిరా ఆంటోంది. అక్కడి నుంచి సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ ఈ స్థానాన్ని తమకు కేటాయించకపోతే ఫ్రెండ్లీ కంటెస్ట్ చేస్తామని సీపీఐ కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. మిర్యాలగూడలో పొత్తు రేపిన చిచ్చు.. మిర్యాలగూడ టికెట్‌ను పొత్తులో భాగంగా సీపీఎంకు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దీంతో అక్కడి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళలో పడ్డాయి. ముఖ్యంగా అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న బత్తుల లక్ష్మారెడ్డి సేవ్ కాంగ్రెస్ పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. దామరచర్ల మండలం రాళ్లవాగుతండా నుంచి మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. అసమ్మతి సద్దు మణిగిందా? దేవరకొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అభ్యర్థిత్వాన్ని బహిరంగంగానే స్థానిక నేతలు వ్యతిరేకించారు. బీఆర్ఎస్ అధిష్టానం వరకు వెళ్లారు. ప్రస్తుతం అంతా మిన్నకుండిపోయారు. ఇక కాంగ్రెస్‌లో బాలునాయక్, వడ్త్యా రమేష్నాయర్, కిషన్ నాయక్ టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ ఎవరికి ఇస్తారనేది ఇంకా తేలకపోవడంతో.. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. సూర్యాపేట బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో వర్గ పోరు సూర్యాపేట నియోజకవర్గంలో బీఅర్ఎస్లో అసమ్మతి తప్పలేదు. కొంత కాలంగా మంత్రి జగదీశ్‌రెడ్డికి వ్యతరేకంగా వ్యవహరిస్తున్న డీసీఎంఎస్ మాజీ చైర్మన్ జానయ్య యాదవ్ బీఎస్పీలో చేరారు. సోమవారం సూర్యాపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆయన భార్య, కౌన్సెలర్ రేణుక, మరో కౌన్సిలర్ నీలబాయి కూడా బీఎస్పీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, పటేల్ రమేష్‌రెడ్డి మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది. కాంగ్రెస్ గూటికి అసంతృప్త నేతలు కోదాడ నియోజకవర్గంలో మంగళవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్ఎస్ నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ కన్మంత్‌రెడ్డి శశిధర్‌రెడ్డి ఇంటికి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల ఎంపీపీలు ఆశా శ్రీకాంత్ రెడ్డి, చుండూరు వెంకటేశ్వరరావు, బండ్ల ప్రశాంతి కోటయ్య, జెడ్పీటీసీ సభ్యులు పుల్లారావు, ఉమా శ్రీనివాస్, బొలిశెట్టి శిరీష నాగేంద్రబాబు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని బాబు, నలుగురు కౌన్సిలర్లు, పలువురు సర్పంచులు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో చర్చలు జరిపారు. మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు ఇంటికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెళ్లారు. ఆయన నివాసంలో సమావేశమయ్యారు. చందర్రావును కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు ఉన్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌పై వ్యతిరేకతతోనే వారు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో వలసలు మొదలయ్యాయి. బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ ఛైర్పర్సన్ గెల్లి అర్చనరవి, కౌన్సిలర్లు భవాని, సతీష్, గాయత్రి ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
ఎట్లున్న సిరిసిల్ల ఎట్లయిందో..
కరీంనగర్: కన్నీళ్లు తప్ప నీళ్లు లేని సిరిసిల్ల.. ఇప్పుడు సజీవ జలధార అయ్యిందని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు. మండుటెండల్లోనూ అప్పర్ మానేరు మత్తడి దూకుతుందని, స్వరాష్ట్రం మనం సాధించుకున్న ప్రగతికి చిహ్నమన్నారు. బీడు భూములకు సాగునీరు వచ్చింది.. రైతులు పంటలు పండిస్తుండ్రు.. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు కుదుటపడుతున్నారని పేర్కొన్నారు. సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మహత్యలు తనను కదిలించాయని, ఉద్యమ సమయంలోనే నేతన్నలు చావొద్దని చెబుతూ, పార్టీ పరంగా రూ.50లక్షలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బతుకమ్మ చీరలతో కార్మికుల జీవితాలకు కొంత భరోసా దొరికిందన్నారు. విద్యా కేంద్రంగా సిరిసిల్ల అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఎట్లున్న సిరిసిల్ల ఎట్లయ్యిందో మీరే ఆలోచించాలే అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గురించి పొగిడితే తనను తానే పొగిడినట్లు అవుతుందన్నారు. సిరిసిల్ల ప్రాంత సమస్యల గురించి తెలిసిన వాడిగా, భవిష్యత్‌లో మరిన్ని మంచి పనులు జరుగుతాయని సీఎం పేర్కొన్నారు. కేటీఆర్ మంచి భవిష్యత్ ఉన్న నాయకుడని స్పష్టం చేశారు. మరోసారి ఆయన్ని గెలిపించాలని కోరారు. అన్నిరంగాల్లో అభివృద్ధి ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లోనూ రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి సాధించిందని, రాష్ట్రంలోనే కేజీ టూ పీజీ క్యాంపస్ గంభీరావుపేటలో ఉందన్నారు. ఆరున్నర మీటర్ల భూగర్భ జలాలు పెరిగి ఐఏఎస్‌లకు పాఠ్యాంశంగా రాజన్న సిరిసిల్ల మారిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తెలంగాణ ఉద్యమ సమయంలోని అంశాలను ప్రస్తావిస్తూ, ప్రతీ సమయంలో కేసీఆర్‌కు అండగా సిరిసిల్ల ప్రాంతం నిలిచిందన్నారు. ఈసందర్భంగా సిరిసిల్లలోని పద్మశాలీ సంఘం, అంబేద్కర్ సంఘం, పాలిస్టర్ అసోసియేషన్, టెక్స్‌టైల్‌పార్క్, యాదవ సంఘం, రజక సంఘం, శాలివాహన సంఘం ప్రతినిధులు కేటీఆర్‌కు మద్దతు ప్రకటించారు. సభలో ఎమ్మెల్సీలు ఎల్.రమణ, రఘోత్తమరెడ్డి, మధుసూదనాచారి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ అరుణ, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెడ లక్ష్మీనర్సింహారావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతుబంధు సమితి చైర్మన్ గడ్డం నర్సయ్య, బీఆర్ఎస్ నాయకులు చీటి నర్సింగరావు, అక్కరాజు శ్రీనివాస్, బొల్లి రామ్మోహన్, కల్వకుంట్ల గోపాల్‌రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బతుకమ్మలతో సభకు.. సిరిసిల్లలో ప్రజా ఆశీర్వాదసభ సక్సెస్ కావడం బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతోనోత్సాహం నిండింది. సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు సభకు తరలివచ్చారు. సిరిసిల్ల పట్టణంలోని అన్ని వార్డుల నుంచి మహిళలు బతుకమ్మలతో హాజరయ్యారు. -
TS Elections 2023: పోరు రసవత్తరం.. తీర్పు విలక్షణం
కరీంనగర్: కరీంనగర్ చైతన్యానికి ప్రతీక. చరిత్రలో ఎన్నో ఎన్నికలు చూశారు ఇక్కడి ప్రజలు. ఎన్నికలు అనగానే.. ఎత్తులు, పైఎత్తులు, రాజకీయ సమీకరణలు ఉంటాయి. ఉమ్మడి జిల్లాలో 1952లో మొదటిసారి ఎన్నికలు జరగగా.. ఇప్పటివరకు 71 ఏళ్లలో 15 సార్లు జరిగాయి. అనేక మంది రాజకీయ భవిష్యత్ తలకిందులుకాగా, కొందరి తలరాత మారింది. తొలి రెండు ఎన్నికల్లో పీడీఎఫ్ (ప్రొగ్రెసివ్ డెమోక్రటివ్ ఫ్రంట్) సత్తా చాటగా.. ఆరుసార్లు కాంగ్రెస్ ఆధిక్యాన్ని చాటింది. మూడుసార్లు టీడీపీ, నాలుగుసార్లు బీఆర్ఎస్ పైచేయి సాధించాయి. 1952: జిల్లాలో తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 2, పీడీఎఫ్ 10 స్థానాల్లో విజయం సాధించాయి. పీడీఎఫ్ తిరుగులేని రాజకీయశక్తిగా అవతరించింది. విజేతల్లో నిజాం వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములైనవారే అధికం. 1957: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, పీడీఎఫ్ పార్టీల మధ్యపోటీ తీవ్రంగా ఉండె. కాంగ్రెస్ 5 సీట్లు, పీడీఎఫ్–4, స్వతంత్రులు–3 సీట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో తొలితరం రాజకీయ నేతలు చెన్నమనేని రాజేశ్వర్‌రావు, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావులు గెలుపొంది, శాసనసభకు వెళ్లారు. 1962: ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులందరూ ఓడిపోయారు. కాంగ్రెస్ 8, స్వతంత్రులు 4 చోట్ల విజయం సాధించారు. పీవీ నర్సింహారావు, చెన్నమనేని రాజేశ్వర్రావులు విజయం సాధించి, రెండోసారి అసెంబ్లీ మెట్లు ఎక్కారు. 1967: ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. కాంగ్రెస్ 9, స్వతంత్రులు మూడు సీట్లు సాధించారు. జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి కాసుగంటి లక్ష్మీనర్సింహారావు ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. 1972: కాంగ్రెస్ పార్టీ 7, సీపీఐ 1, స్వతంత్రులు నాలుగు స్థానాల్లో గెలిచారు. ఈ ఎన్నికల్లో పీవీ నర్సింహారావు సమీప బంధువు వొడితెల రాజేశ్వర్‌రావు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లాలో కాంగ్రెస్ మరోసారి ఆధిక్యాన్ని చాటుకుంది. 1978: ఈ ఎన్నికల్లో జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ 10, సీపీఐ 2, జనతా పార్టీ ఒక సీటు సాధించాయి. ఇది జనతా పార్టీకి తొలి విజయం. ఇందుర్తి నుంచి తొలిసారిగా దేశిని చినమల్లయ్య సీపీఐ అభ్యర్థిగా విజయం సాధించారు. 1983: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో జరిగిన ఎన్నికలు ఇవి. హోరాహోరీ పోరులో టీడీపీ 7, కాంగ్రెస్ 6 స్థానాలు దక్కించుకున్నాయి. జగిత్యాలలో జీవన్‌రెడ్డి తొలిసారి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1985: ఇవి మధ్యంతర ఎన్నికలు. నాదెండ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో అసెంబ్లీ రద్దవడంతో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ జిల్లాలో కనుమరుగైంది. టీడీపీ 8, మిత్రపక్షాలైన సీపీఐ 2, జనతా పార్టీ 1, బీజేపీ 1 సీటు గెలుచుకున్నాయి. మెట్పల్లి నుంచి తొలిసారి చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989: ఈ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ 5, టీడీపీ 2, సీపీఐ 1, బీజేపీ 1, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకోగా.. సిరిసిల్లలో జనశక్తి నక్సలైట్లు మద్దతు ఇచ్చిన ఎన్వీ కృష్ణయ్య తొలిసారి విజయం సాధించారు. 1994: ఈ ఎన్నికల్లో టీడీపీ మళ్లీ పుంజుకుంది. కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. టీడీపీ 9, సీపీఐ 2, బీజేపీ, స్వతంత్రులు ఒక్కో స్థానం దక్కించుకున్నారు. అప్పటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎల్.రమణ తొలిసారి జీవన్‌రెడ్డిపై గెలుపొందారు. 1999: హోరాహోరిగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంది. కాంగ్రెస్ 6, టీడీపీ 5, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించాయి. టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగాయి. దీంతో మెట్పల్లి, పెద్దపల్లిల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. 2004: తొలిసారి టీఆర్ఎస్ బరిలోకి దిగింది. టీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 4, టీడీపీ 2, సీపీఐ, జనతా పార్టీ ఒక్కో చోట గెలిచాయి. ఇందులో టీఆర్ఎస్ కూటమి విజయం సాధించగా... తొలిసారి మెట్పల్లిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కొమొరెడ్డి రామ్‌లు గెలుపొందారు. 2009: జిల్లా రాజకీయ చిత్రపటంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఈ ఎన్నికల్లో టీఆ ర్ఎస్ 4, కాంగ్రెస్ 3, టీడీపీ 5, స్వతంత్రులు ఒక స్థానం దక్కించుకున్నారు. రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా.. టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరారు. 2010 ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఆధిక్యం కనబరించింది. 2014: రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. టీఆర్ఎస్ 12 సీట్లలో గెలుపొందగా.. కాంగ్రెస్ ఒక సీటు దక్కించుకుంది. జిల్లా నుంచి ఈటల రాజేందర్, కేటీఆర్ మంత్రివర్గంలో ఉన్నారు. 2018: ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు పోటీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే 13 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో పోటీ చేయగా.. సీపీఐ ఒక స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో రామగుండంలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి చందర్, మంథనిలో కాంగ్రెస్ పార్టీ తరఫున దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా, మిగతా 11 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. రామగుండం నుంచి గెలుపొందిన చందర్ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల బీజేపీ తరఫున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై గెలుపొందారు. 2023: ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఫుల్‌జోష్‌తో రంగంలోకి దిగుతున్నాయి. పార్టీపేరు మార్చుకున్న టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల జాబితా పూర్తిస్థాయిలో ప్రకటించాల్సి ఉంది. ఆయా నియోజకవర్గాలపై బీఎస్పీ కన్నేసింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ తప్పేలా లేదు. అదే సమయంలో టికెట్లు ఆశించి భంగపడ్డ అభ్యర్థులు రెబల్స్‌గా బరిలోకి దిగే అవకాశాలూ కనిపిస్తున్నాయి. -
సారొస్తున్నారు..
మహబూబ్‌నగర్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం జడ్చర్ల వేదికగా ప్రజా ఆశీర్వాద సభతో ఉమ్మడి పాలమూరులో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. మధ్యా హ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దగ్గరుండి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం ఉమ్మడి జిల్లాలో తొలిసభ నిర్వహిస్తున్న క్రమంలో నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలను తరలించేలా జనసమీకరణకు సన్నాహాలు మొదలుపెట్టారు. కల్వకుర్తి రూట్లో పట్టణ శివారులోని గంగాపూర్ ప్రధాన రహదారిని ఆనుకు ని ఏర్పాట్లు చేస్తున్న సభకు సుమారు లక్ష మంది వ రకు హాజరవుతారని నేతలు అంచనా వేస్తున్నారు. ‘పాలమూరు’ వేదికగా పాగా వేసేలా.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో 13 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) అభ్యర్థులు గెలుపొందారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి సైతం ఆ తర్వాత పరిణామ క్రమాల్లో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో సైతం అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల కంటే ముందస్తుగా కేసీఆర్ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. ఉమ్మడి పాలమూరులోని అన్ని స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలనే అభ్యర్థులుగా ఖరారు చేస్తూ ఆగస్టు 21న జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే ప్రచారం ఊపందుకున్న క్రమంలో సెప్టెంబర్ 16న నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లపూర్ వద్ద పంప్‌హౌస్‌లో మొదటి మోటారును స్విచాన్ చేసి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని (పీఆర్ఎల్ఐఎస్) ప్రారంభించారు. మళ్లీ కేసీఆరే సీఎం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో హ్యాట్రిక్ సాధిస్తామని.. మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ఆయన మంగళవారం జడ్చర్ల శివారులో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను, ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది, అభివృద్ధి చేసింది కేసీఆరేనని పునరుద్ఘాటించారు. తమ మేనిఫెస్టో సబ్బండ వర్గాల ప్రజలకు ఎంతో దగ్గరగా ఉందన్నారు. జెడ్పీ వైస్ చైర్మెనన్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాను సస్యశామలం చేసే ఈ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేయడాన్ని బట్టి పాలమూరు వేదికగా దక్షిణ తెలంగాణలో సత్తా చాటేలా సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు స్పష్టమవుతోంది. వరాల జల్లు కురిపించేనా.. జడ్చర్లకు సీఎం కేసీఆర్ రానున్న సందర్భంగా ఎలాంటి హామీలు గుప్పిస్తారనే దానిపై నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా జడ్చర్లను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని, జడ్చర్లకు బైపాస్ రోడ్డు నిర్మించాలనే డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. అదేవిధంగా మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కోడ్గల్ను మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. 26న అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌లో.. బుధవారం జడ్చర్లలో మధ్యాహ్నం, మేడ్చల్‌లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్.. ఈ నెల 26 నుంచి మళ్లీ జిల్లాల పర్యటన కొనసాగించనున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి 26న అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌లో.. అనంతరం వచ్చే నెల ఆరో తేదీన గద్వాల, మక్తల్, నారాయణపేటలో జరగనున్న సభల్లో ఆయన పాల్గొననున్నారు. హామీ నెరవేరుతోందంటూ.. 2018 ఎన్నికల సందర్భంగా నవంబర్ 21న సీఎం కేసీఆర్ జడ్చర్లకు రాగా.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి కరువు జిల్లాగా పేరుగాంచిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు, ఉదండాపూర్ రిజర్వాయర్‌ను పూర్తి చేసి జడ్చర్ల నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నా రు. ఈ నియోజకవర్గంలోని ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తామని చెప్పా రు. ప్రస్తుతం ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. త్వర లో కృష్ణా జలాలు రానున్నందున ప్రతిష్టాత్మక హామీ నెరవేరుతోందని.. అన్ని అడ్డంకులను దాటి ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుస్తాన్నామంటూ కేసీఆర్ పాలమూరులో ప్రజా ఆశీర్వాద సభలకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు ఎలాంటి లోటు పాట్లు లేకుండా సభ సజావుగా సాగేలా దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్లీ కేసీఆరే సీఎం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో హ్యాట్రిక్ సాధిస్తామని.. మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ఆయన మంగళవారం జడ్చర్ల శివారులో ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను, ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది, అభివృద్ధి చేసింది కేసీఆరేనని పునరుద్ఘాటించారు. తమ మేనిఫెస్టో సబ్బండ వర్గాల ప్రజలకు ఎంతో దగ్గరగా ఉందన్నారు. జెడ్పీ వైస్ చైర్మెనన్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
మన స్నేహం మరణంలో కూడ.. మిత్రమా..!
మహబూబ్‌నగర్: కలిసి తిరిగిన ఇద్దరు స్నేహితులు ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చి మృత్యుఒడికి చేరారు. స్కూటీని కర్ణాటక బస్సు ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందిన సంఘటన నారాయణపేట జిల్లా గుడిగండ్లలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. హైదరాబాద్‌లోని గౌలిగూడకు చెందిన ఉదయ్‌కుమార్(28) ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి అంబర్‌పేటకు చెందిన అఖిల్ (26)తో పరిచయం ఏర్పడింది. అఖిల్ ఐటీఐ ఫెయిల్ అయ్యి ఖాళీగా ఉంటున్నాడు. అయితే సోమవారం రాత్రి ఉదయ్‌కుమార్, అఖిల్ ఇద్దరు కలిసి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా స్కూటీపై హైదరాబాద్ నుంచి బయలుదేరి మక్తల్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని గుడిగండ్ల దగ్గర రాయచూర్ నుంచి మహబూబ్‌నగర్ వెళ్తున్న కర్ణాటక బస్సు ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టడంతో ఉదయ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా.. అఖిల్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే 108లో అఖిల్‌ను మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అనంతరం సమాచారం అందుకున్న ఎస్ఐ పర్వతాలు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఉదయ్‌కుమార్ మృతదేహాన్ని మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అఖిల్ తల్లి ఉమ, ఉదయ్‌కుమార్ తండ్రి మహేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.