News
-
ప్రజల భద్రతకే మెదటి ప్రాధాన్యం
వరంగల్: ‘ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వేస్తుంటాయి. వాటిని అరికట్టి ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు కల్పించాలి. అందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయడం పోలీసుల విధి. ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించే, అటువంటి ప్రయత్నం చేసేవారి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తాం.’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ అన్నారు. జిల్లాలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కావడం.. నోటిఫికేషన్‌కు సమయం దగ్గర పడుతుండడంతో కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై మంగళవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. భారీ బందోబస్తు గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. నలుగురు డీసీపీలు, 16 మంది ఏసీపీలు, 50 మంది ఇన్స్పెక్టర్లు, 141 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 525 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుళ్లు, 1,100 మంది కానిస్టేబుళ్లు, 550 మంది హోంగార్డులు, సుమారు 2,400 మంది పారామిలటరీ పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. కమిషనరేట్ పరిధిలో 11 నియోజకవర్గాలు కమిషనరేట్ పరిధిలో 11 నియోజకవర్గాలు (పరకాల, నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట నియోజవర్గాలు పూర్తి స్థాయిలో, పాలకుర్తి, జనగామ, హుజూరాబాద్, హుస్నాబాద్, భూపాలపల్లి నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు) ఉన్నాయి. కమిషనరేట్ వ్యాప్తంగా 21,55,057 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 10,69,716 మంది, స్త్రీలు 10,85,057, ట్రాన్స్జెండర్లు 284 మంది ఉన్నారు. పోలింగ్ స్టేషన్లు 2,125 ఉండగా, ఇందులో సమస్మాత్మకవి 551, సాధారణ పోలింగ్స్టేషన్లు 1,574 ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలు 1,126 ఉండగా వీటిలో సమస్యాత్మక 383, సాధారణ కేంద్రాలు 743 ఉన్నాయి. అడుగడుగునా తనిఖీలు ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టకుండా ఉండేందుకు స్థానిక పోలీసులతోపాటు ప్రత్యేకంగా 24 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. దీంతోపాటు ఎల్కతుర్తి, కేయూసీ, నర్సంపేట, మిల్స్‌కాలనీ, జనగామ, బచ్చన్నపేట, దేవరుప్పుల, రాయపర్తి దగ్గర చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. దీంతోపాటు 10 డైనమిక్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించాం. ఈ నెల 9న ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటినుంచి ఇప్పటికే రూ.1.01 కోట్ల నగదు, రూ.14.92 లక్షల విలువ గల 13,400 కిలోల బెల్లం, 1,636 లీటర్ల గుడుంబా, 560 కిలోల పటిక, రూ.87 లక్షల విలువ గల 351 కిలోల గంజాయి, రూ.4 లక్షల విలువ గల బ్యాగులు, చీరలు పట్టుకున్నాం. అడుగడుగునా తనిఖీలు చేపట్టి పంపిణీని ఎక్కడికక్కడ నిరోధిస్తాం. స్వచ్ఛందంగా ఫిర్యాదు చేయండి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మద్యం, డబ్బులు, ఇతర వస్తువులు పంపిణీ చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి. అది నేరుగా ఎన్నికల సంఘానికి వెళ్తుంది. దీంతోపాటు సీ విజిల్ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. కమిషనరేట్‌లో గత, ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. భూకబ్జాదారులు, రౌడీలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎవరైనా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకునేది లేదు. చర్యలు కఠినంగా ఉంటాయి. పీడీయాక్టు వంటి చట్టాలను ప్రయోగిస్తాం. ప్రజాస్వామ్యయుతంగా ముందుకు సాగాలి.. అందరికి ఎన్నికల నిబంధనలు వర్తిస్తాయి. రాజకీయ పార్టీలు కూడా ఐదుగురు దాటితే ఎన్నికల అధికారి అనుమతి తీసుకుని సమావేశాలు నిర్వహించుకోవాలి. ప్రతి రాజకీయ పార్టీ నేతలు ప్రజాస్వామ్యయుతంగా ముందుకు సాగాలి. స్థానిక పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలతో ప్లాగ్, రూట్ మార్చ్‌లు నిర్వహిస్తాం. ప్రజలు అన్ని రకాలుగా పోలీసులకు సహకరించాలి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఎన్నికల నిబంధనలను ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు ఉంటాయి. రాజకీయ పార్టీల నేతలకు ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. గతంలో ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించిన వారిని, వివిధ కేసుల్లో నిందితులను బైండోవర్ చేశాం. 2018 ఎన్నికల సమయంలో కమిషనరేట్ వ్యాప్తంగా 9,600 మందిని బైండోవర్ చేశారు. ప్రస్తుత ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటినుంచి 1,796 మందిని బైండోవర్ చేశాం. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఆరు నెలలుగా కసరత్తు ప్రతి ఓటరు తన ఓటు హక్కును ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరు నెలలుగా పోలీస్‌శాఖ కసరత్తు చేస్తోంది. దీనికోసం 24 గంటల పాటు కమిషనరేట్ వ్యాప్తంగా 11 నియోజకవర్గాల్లో 24 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. వీటితోపాటు 10 డైనమిక్ బృందాలు పనిచేస్తున్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలకు జీపీఎస్ అమర్చడంతోపాటు కెమెరాలను ఏర్పాటు చేశాం. ప్రతి బృందంలో ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. ప్రజలను ప్రలోభపెట్టేందుకు ఎవరు, ఎక్కడ ప్రయత్నం చేసినా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు వారిని పట్టుకుని సామగ్రిని సీజ్ చేస్తాయి. -
బీ-ఫాం అందుకున్న అరూరి,చల్లా
అరూరికి బీ–ఫాం అందజేత వరంగల్: వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేష్ బీ–ఫాం తీసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చేతులమీదుగా సోమవారం హైదరాబాద్‌లో అందుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మూడోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బీ–ఫామ్ అందుకున్న ‘చల్లా’ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో సోమవారం పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డి బీ–ఫామ్ అందుకున్నారు. తనపై నమ్మకంతో బీ–ఫామ్ అందించిన కేసీఆర్‌కు, సహకరించిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, తాను ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
ఎన్నికలకు పోలీసులు సిద్ధం
వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. సోమవారం రాత్రి కమిషనరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల నిర్వహణపై ఆయన మాట్లాడారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో రూ.1.23 కోట్ల విలువైన విదేశీ, దేశీయ మద్యం, బెల్లం, గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం.. నిషేధితాలను, అనుమానం ఉన్న అన్నింటినీ సీజ్ చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు రూ.50 వేలకు మించి వెంట ఉంచుకోరాదని, నగదును దగ్గర ఉంచుకుంటే దానికి సంబంధించి తగిన ఆధారాలు కలిగి ఉండాలని లేదంటే డబ్బులను ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు సీజ్ చేస్తారని తెలిపారు. 10 డైనమిక్ చెక్‌పోస్ట్‌లు.. ఎన్నికల సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి సారించి కమిషనరేట్ పరిధిలో 10 డైనమిక్ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ చెక్‌పోస్ట్‌లు ప్రతిరోజూ ఒక చోటి నుంచి మరో చోటికి మారుతాయని, దీని వల్ల మద్యం డబ్బులతో పాటు ఇతర వస్తువులు సరఫరా చేసే వ్యక్తులను సులభంగా పట్టుకోవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేలా వివిధ పార్టీల నేతలు నిబంధనలకు విరుద్ధంగా పంపిణీ చేస్తే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సీజ్ చేస్తాయన్నారు. ఎన్నికల నిర్వహణ బందోబస్తు కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు ప్రత్యేకంగా 6 పారామిలటరీ కంపెనీలు వస్తున్నాయని పేర్కొన్నారు. వాహనాలకు జీపీఎస్, కెమెరాలు డబ్బు, మద్యం, ఇతరత్రా నజరానాలతో ఓటర్లను ప్రభావితం చేయకుండా నియంత్రించడానికి ఏడు ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈబృందాల్లో పోలీస్ అధికారి నోడల్ ఆఫీసర్‌గా ఉంటారని పేర్కొన్నారు. పోలీసు వాహనాలకు జీపీఎస్ అనుసంధానం చేయడంతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలకు కెమెరాలు కూడా అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఫిర్యాదులు, సమాచారాన్ని 1950 నంబర్ ద్వారా తెలియజేయాలని కోరారు. తుపాకీ లైసెన్స్ కలిగిన వ్యక్తులు వాటిని పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేసేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మావోయిస్టులపై నిఘా.. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మావోయిస్టుల ప్రాబల్యం లేనప్పటికీ నిఘా మాత్రం కొనసాగుతోందని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి పథకాలు అందాయని, గతంతో పోలిస్తే ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి లేదని పేర్కొన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు. -
బీఆర్ఎస్లో చేరిన పొన్నాల లక్ష్మయ్య
వరంగల్: బహిరంగసభలో సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య.. సీఎం సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈసందర్భంగా ఆయననుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘పొన్నాల సీనియర్ నేత. కాంగ్రెస్‌లో అణగారిన వర్గాలకు అవకాశం లేదు.. నాలుగున్నర దశాబ్దాలుగా అంకిత భావంతో పనిచేస్తే చివరికి అవమానమే మిగిలింది.. నాకు బాధేసి ఫోన్లో మాట్లాడి.. పార్టీలోకి రమ్మన్నా.. ఇప్పడు గులాబీ జెండా కప్పుకున్నడు.. అన్ని వర్గాలను బీఆర్ఎస్ ఆదరించి పెద్ద పీట వేస్తుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. పొన్నాల మనసు గాయపడితే.. బీఆర్ఎస్ మందు వేసి నయం చేస్తుందని చెప్పుకొచ్చారు. -
చెరువులో ఈతకు వెళ్లి యువకుడు మృతి
నల్గొండ: చెరువులో ఈతకు వెళ్లిన యువకుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ యుగేంధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నారపల్లికి చెందిన వారణాసి తరుణ్(24) తన స్నేహితుడు డీకొండ నితిన్‌తో కలిసి ఆదివారం బీబీనగర్‌లో ఉంటున్న మరో స్నేహితుడిని కలిసేందుకు వచ్చారు. స్నేహితుడిని కలిసిన తర్వాత తరుణ్, నితిన్ కలిసి బీబీనగర్ మండలంలోని వరంగల్–హైదరాబాద్ హైవే పక్కన పెద్ద చెరువు వద్దకు వెళ్లారు. తరుణ్, నితిన్ చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. తరుణ్ చెరువులోరాళ్ల మధ్యన ఇరుక్కపోయాడు. నితిన్ బయటకు వచ్చి స్థానికులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చెరువు వద్దకు చేరుకొని తరుణ్ కోసం గాలింపు చర్యలు ఆచూకీ లభించలేదు. సోమవారం చెరువులో తరుణ్ మృతదేహం లభ్యం కావడంతో పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తరుణ్ ముఖంపై గాయాలు ఉండడంతో నితిన్‌పై అనుమానం ఉన్నట్లు మృతుడి తండ్రి గోవిందాచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మొదలైన ఎన్నికల ప్రచార పర్వం
నల్లగొండ: రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో ప్రచార పర్వంలోకి దిగుతున్నాయి. పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా ప్రకటించిన తెల్లవారి నుంచే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లారు. ఆదివారం బీఫారం తీసుకుని సోమవారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ముఖ్యంగా భువనగిరిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ద్వారా ఉమ్మడి జిల్లాలో ప్రచారానికి తెర తీశారు. మరోవైపు టికెట్ల జాబితాలో చోటు దక్కిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో అడుగు పెట్టారు. మునుగోడులో బీజేపీ నంచి పోటీ చేయబోమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పోటీలో ఉండబోయే అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రచారంలోకి దిగారు. వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం ఇలా.. ► భువనగిరి సీఎం కేసీఆర్ సభతో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రచారం ప్రారంభమైంది. ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత సోమవారం బీఫారం అందుకుని ఆ తర్వాత సీఎం బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల అయిలయ్య యాదగిరిగుట్టలో పూజలు చేసిన అనంతరం ఆయన సొంత గ్రామమైన సైదాపురం వీరభద్రస్వామి గుడిలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. ► మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అవంతీపురంలోని శ్రీవెంకటేశ్వరస్వామి, సరస్వతీ దేవాలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేములపల్లి మండలం ఆమనగల్‌లోని రామలింగేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ► నాగార్జునసాగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్ ఇప్పటికే ప్రజల్లో తిరుగుతుండగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జైవీర్‌రెడ్డి పార్టీ చేరికల కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ► మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే ప్రజల్లో ఉండి ప్రచారం చేస్తుండగా, బీజేపీ నుంచి పోటీ చేయబోయే కోమటిరెడి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌నుంచి టికెట్ ఆశిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డి చౌటుప్పల్‌లో తమ పార్టీ, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ► నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం నకిరేకల్‌లోని కనకదుర్గా దేవాలయంలో పూజలు చేసి రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం మంగళవారం కనకదుర్గ దేవాలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించనున్నారు. ► కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ బీఫారం తీసుకున్నాక ర్యాలీ వెళ్లి బొడ్రాయికి పూజలు చేశారు. ► హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఇదివరకే చింతలపాలెం మండలం బుగ్గమాదారంలోని పంచపట్టాభిరామస్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచారం రథనాన్ని ప్రారంభించి ప్రచారంలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇదివరకే బుగ్గమాదారంలోని పంచపట్టాభిరామస్వామి ఆలయంలో పూజలు చేసి, కృష్ణానదికి హారతి ఇచ్చి ప్రచారం ప్రారంభించారు. నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మార్నింగ్ వాక్‌తో ఇదివరకే తన ప్రచారాన్ని ప్రారంభించగా. సోమవారం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో తన ప్రచార రథానికి పూజలు నిర్వహించి ప్రచారంలోకి దిగారు. ఇప్పటికే ప్రజలతో మమేకం అవుతున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోమవారం పానగల్‌లోని వెంకటేశ్వర దేవాలయంలో పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీలో ఉండబోతున్న పిల్లి రామరాజు యాదవ్ కూడా అక్కడే పూజలు చేసి ప్రారంభించారు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సోమవారం అర్వపల్లిలోని యోగానాంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పూజలు చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ అక్కడే పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. పూజల అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి కిశోర్‌కు బీఫారం అందజేశారు. అక్కడి చౌరస్తాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. -
ప్రజల జీవన విధానంపై అధ్యయనం చేయాలి.. కలెక్టర్
మహబూబ్‌నగర్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ ఏఎస్‌ఓలకు సూచించారు. సోమవారం 25 మంది కేంద్ర ప్రభుత్వ సర్వీసుల నుంచి శిక్షణ నిమిత్తం నాగర్‌కర్నూల్ జిల్లాకు వచ్చిన ఏఎస్ఓ లతో వీడియో కాన్ఫరెన్స్ మందిరంలో కలెక్టర్ ఉదయ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఏఎస్ఓలు 5 రోజుల పర్యటనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాలని, రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు ఎలా ఉన్నాయో, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, వాటన్నిటిని డేటా రూపంలో సేకరించాలని అన్నారు. ప్రతి గ్రామంలో హరితహారం కింద నర్సరీలను ఏర్పాటు చేశామని, శ్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, ప్రతి గ్రామానికి ట్రాక్టర్, డంపింగ్ యార్డ్ వంటివి ఏర్పాటు చేశామని, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎలా ఉన్నాయో చూడాలన్నారు. ముఖ్యంగా తాగునీటి కల్పనకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతు బీమా పథకాలు గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయాలన్నారు. గ్రామస్థాయిలో సుమారు 40 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వారందరితో అన్ని వివరాలు తెలుసుకోవాలని సూచించారు. శిక్షణ నిమిత్తం వచ్చిన ఏఎస్‌ఓలకు ఐదు గ్రూపులుగా విభజించి నాగర్‌కర్నూల్, తాడూర్, తెలకపల్లి, కల్వకుర్తి నాలుగు మండలాలను కేటాయించి ఒక్కో ఏఎస్‌ఓకు ఒక ఇన్చార్జ్ అధికారితో పాటు, వారికి అవసరమైన సమాచారం ఇవ్వడం జరుగుతుందని వివరించారు. నేటి నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ఐదు రోజుల పాటు గ్రామీణ ప్రాంత ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్ర సచివాలయానికి సంబంధించిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు గ్రామీణ ప్రాంత అధ్యయనంలో పాల్గొన్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీపీఓ కృష్ణ, మహబూబ్‌నగర్ ట్రైనింగ్ సెంటర్ ఇన్చార్జ్ గోపాల్, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు ఉన్నారు. -
ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం
మహబూబ్‌నగర్: ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు న్యాయం చేకూరుతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ అలంపూర్ నుంచి నుంచి చేపట్టిన పాదయాత్ర సోమవారం మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లికి చేరింది. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ తాము ఏ పార్టీకి అనుకూలం కాదని, ఎస్సీ వర్గీకరణే ముఖ్యమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మార్పీఎస్ కేసీఆర్‌కు అండగా నిలిచిందని, మంత్రి వర్గంలో ఎస్సీలకు చోటు కల్పించకపోవడం దారుణమన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలేదని, ఇతర కులాల వారు మొదటిసారి గెలిస్తే మంత్రి పదవి కట్టబెట్టారని విమర్శించారు. తాము ఉద్యమాలు చేయడం వల్ల ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కమిషన్ వేసి నివేదికలు తెప్పించుకున్నా నేటి వరకు బిల్లుకు ఆమోదం తెలుపకపోవడం బాధాకరమని అన్నారు. నవంబర్‌లో నిర్వహించనున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదించాలని కోరారు. -
డబ్బే.. డబ్బు
వనపర్తి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించి రూ.1,11,96,570 నగదు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధితోపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఒక్కరోజే మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.99,61,370 నగదు సీజ్ చేశారు. ఇందులో మహబూబ్‌నగర్ వన్‌టౌన్ సీఐ సైదులు ఆధ్వర్యంలో క్లాక్‌టవర్ ఏరియాలో తనిఖీలు జరపగా ద్విచక్రవాహనంపై బ్యాగ్‌లో ఉదయ్‌కుమార్, రవికుమార్ అనే ఇద్దరు వ్యక్తులు రూ.28,73,000 తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేశారు. అలాగే రూరల్ సర్కిల్ పరిధిలో మొత్తం రూ.18,26,670, చిన్నచింతకుంట పోలీసులు లాల్కోట చౌరస్తాలో రూ.35,49,900, దేవరకద్ర పోలీసులు రూ.17,11,800 నగదు స్వాధీనం చేసుకుని కమిటీకి అప్పగించనున్నారు. అలాగే టూటౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సంజయ్‌నగర్, కొత్త చెరువు రోడ్, హనుమాన్‌నగర్ ఏరియాల్లో బెల్టు దుకాణాల్లో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురి ఇళ్లలో బెల్టు దుకాణాలు నిర్వహిస్తుండగా 60 లీటర్ల లిక్కర్ సీజ్ చేయడంతోపాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. నారాయణపేట జిల్లా మద్దూరులోని ఓ సినిమా థియేటర్ దగ్గర కారును తనిఖీ చేయగా దామరగిద్ద మండలాలనికి చెందిన అయ్యవారిపల్లి బాల్‌రెడ్డి, దూదేపల్లికి చెందిన వ్యక్తి వాహనంలో రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి కమిటీకి అప్పగిస్తామని కోస్గి సీఐ జనార్దన్ తెలిపారు. మరికల్‌లోని ఆత్మకూర్ ఎక్స్ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా మహబూబ్‌నగర్ నుంచి నర్వ వెళ్తున్న వెంకటరాజు కారులో రూ.3 లక్షలు, దేవరకద్ర నుంచి రాయిచూర్ వెళ్తున్న శ్రీశైలం కారులో రూ.50,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. అలాగే ఎలిగండ్లకు చెందిన శేఖర్‌గౌడ్ రూ.19 వేల విలువ గల మద్యం ఆటోలో తరలిస్తుండగా పట్టుకొని సీజ్ చేశామన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలో నిర్వహించిన తనిఖీల్లో దాసుపల్లికి చెందిన జంగిరెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వస్రుంనాయక్ తలిపారు. ఇందుకు సంబంధించి పత్రాలు చూపించి తీసుకెళ్లాలని సూచించామని పేర్కొన్నారు. వనపర్తి జిల్లా పరిధిలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.1.93 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రక్షితాకె.మూర్తి తెలిపారు. అలాగే ఆత్మకూరు, రేవల్లి, పెబ్బేరు, గోపాల్పేట, వనపర్తి టౌన్ ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లలో నిల్వ చేసిన 191 లీటర్ల మద్యంను సీజ్ చేశామన్నారు. శ్రీరంగాపురం మండలంలోని నాగరాలలో బెల్టు షాపుపై దాడి చేసి 11 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటస్వామి చెప్పారు. మక్తల్ సీఐ రాంలాల్, ఎస్ఐ పర్వతాలు మండలంలోని చందాపూర్ శివారులో వాహనాల తనిఖీ చేపట్టగా రవికుమార్ అనే వ్యక్తి కారులో రూ.2 లక్షలు, ఎదిర కిరణ్‌కుమార్‌కు చెందిన కారులో రూ.1.29 లక్షలు పట్టుకున్నట్లు చెప్పారు. దామరగిద్ద మండలంలోని కాన్కుర్తి చెక్‌పోస్టు దగ్గర పోలీసులు చేపట్టిన తనిఖీల్లో కర్ణాటక రాష్ట్రం కలబురిగి జిల్లా మోదేపల్లికి చెందిన వ్యాపారి రంజిత్‌కుమార్ నుంచి రూ.1.57 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీనివాసరావు చెప్పారు. అలాగే మరికల్‌కు చెందిన వ్యాపారి రాజు నుంచి రూ.1.85 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. -
‘ప్రవళికది ప్రేమ విఫలం' కాదు.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే!
సాక్షి, ఆదిలాబాద్: హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ప్రవళికది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గౌరాల సుభాష్, జగన్‌సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కుమురంభీం భవన్లో సోమవారం వారు మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం విద్యార్థులు, యువకుల బలిదా నాలతో స్వరాష్ట్రం సాధించుకున్నామన్నారు. అయి తే సీఎం కేసీఆర్ నీళ్ల పేరు చెప్పి నిధులను తన ఇంటికి మళ్లించుకున్నారని, ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. గ్రూప్–1 పరీక్ష ఇప్పటికే రెండుసార్లు రద్దయిందన్నారు. ఉద్యోగ ప్రకటనలిస్తూ నియామకాల ప్రక్రియ సరిగా పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరి కారణంగానే ప్రవళిక మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ప్రవళిక ఆత్మహత్య ప్రేమ విఫలం వల్లే జరిగిందని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. నిరుద్యోగ యువత ఇప్పటికై నా ఆలోచించాలన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే విప్లవ పార్టీలకు మద్దతుగా నిలవాలని కోరారు. ఇందులో నాయకులు అశోక్, దండేకర్ వామన్, నితిన్, సురేష్, కృపాకర్, శ్రవణ్ తదితరులున్నారు. -
కాంగి‘రేసు’లో ఎట్టకేలకు కదలిక వచ్చింది..
మహబూబ్‌నగర్: కాంగి‘రేసు’లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 55 అసెంబ్లీ స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది. ఇందులో ఉమ్మడి పాలమూరు నుంచి ఎనిమిది మందికి చోటు దక్కింది. ఇంకా ఆరు స్థానాలు పెండింగ్‌లో ఉండగా.. ఎవరెవరికి పోటీ చేసే అవకాశం దక్కుతుందనేది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీటికి సంబంధించి అభ్యర్థుల ఖరారు ప్రక్రియ పూర్తయినప్పటికీ.. బహుముఖ పోటీ నేపథ్యంలో అసమ్మతి పెల్లుబికుతుందనే భయంతో ఆచితూచి వ్యవహరిస్తూ పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో రెండో విడత జాబితా ప్రకటించనున్నట్లు ఏఐసీసీ పెద్దలు వెల్లడించగా.. ఆయా స్థానాలపై సస్పెన్స్ వీడనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఐదు పెండింగ్.. ఉమ్మడి పాలమూరులో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు కాగా.. మహబూబ్‌నగర్ పార్లమెంట్లో ఏడు (మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్, షాద్‌నగర్), నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఏడు (నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, గద్వాల, అలంపూర్) ఉన్నాయి. కాంగ్రెస్ తొలి విడతలో ఎనిమిది స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. పెండింగ్‌లో పెట్టిన ఆరు స్థానాల్లో నాగర్‌కర్నూల్ ఎంపీ నియోజకవర్గంలోని వనపర్తితోపాటు మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో అధికంగా ఐదు (మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట) సెగ్మెంట్లు ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆయా నియోజకవర్గాల్లో ఇద్దరికి మించి అభ్యర్థులు పోటీ పడుతుండడం.. సామాజిక వర్గ సమీకరణలు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఎవరికి అవకాశం కల్పిస్తారనే దానిపై పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. వర్గాల వారీగా ఇలా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 12 జనరల్ కాగా.. రెండు (అచ్చంపేట, అలంపూర్) ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు. తొలివిడతలో కాంగ్రెస్ ప్రకటించిన ఎనిమిది స్థానాల అభ్యర్థులను పరిశీలిస్తే ఆరు జనరల్ స్థానాల్లో ముగ్గురు రెడ్డి, ఒకరు వెలమతోపాటు బీసీ వర్గాలకు చెందిన ఇద్దరికి అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. రెండు రిజర్వ్డ్ స్థానాల్లో ఇద్దరు ఎస్సీ అభ్యర్థులను కేటాయించారు. కాంగ్రెస్ పాతకాపులు ముగ్గురే.. ఈసారి తొలి విడతలో ప్రకటించిన అభ్యర్థులు, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వారిని పరిశీలిస్తే.. రేవంత్‌రెడ్డి (కొడంగల్), చిక్కుడు వంశీకృష్ణ (అచ్చంపేట), సంపత్ (అలంపూర్) మాత్రమే ఉన్నారు. కొల్లాపూర్‌లో జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నుంచి, షాద్‌నగర్‌లో వీర్లపల్లి శంకర్ బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కసిరెడ్డి నారాయణరెడ్డి (కల్వకుర్తి) 2014లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి (నాగర్‌కర్నూల్), సరితా తిరుపతయ్య (గద్వాల) ఈ ఎన్నికల్లో తొలిసారిగా బరిలో నిలవనున్నారు. 1999లో జూపల్లి కాంగ్రెస్ నుంచే రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ ఎన్నికలో గెలుపొందారు. 2004లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న క్రమంలో 2011లో కాంగ్రెస్‌కు, మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్)లో చేరారు. బీఆర్ఎస్ నుంచి 2012 ఉప ఎన్నికలు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో గెలుపొందారు. 2018లో ఓటమి పాలయ్యారు. వారి దారెటు.. కాంగ్రెస్‌లో పలువురు నేతల చేరికల క్రమంలో ప్రధానంగా నాగర్‌కర్నూల్, కొల్లాపూర్‌కు సంబంధించి టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేతలు, వారి అనుచరుల్లో అసంతృప్తి పెల్లుబికింది. కూచుకుళ్లపై నాగం జనార్దన్‌రెడ్డి, జూపల్లిపై చింతలపల్లి జగదీశ్వర్‌రావు నిత్యం ఫైర్ అవుతూ వచ్చారు. నాగం వర్గీయులు ఇటీవల గాంధీభవన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన సైతం తెలిపారు. సర్వేల ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని.. ఇంకా టికెట్లు ఖరారు కాలేదని నేతలు సముదాయించడంతో వెనుదిరిగారు. ప్రస్తుతం కొల్లాపూర్ టికెట్ జూపల్లి, నాగర్‌కర్నూల్ టికెట్ కూచుకుళ్లకు కేటాయించిన నేపథ్యంలో నాగం, చింతలపల్లి వర్గీయులు గుర్రుగా ఉన్నారు. కొల్లాపూర్ కాంగ్రెస్ కార్యాలయంలో జగదీశ్వర్‌రావు అనుచరులు ఫ్లెక్సీలు చించివేశారు. తాను ఢిల్లీ నుంచి వస్తున్నానని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుందామని జగదీశ్వర్‌రావు వారిని వారించినట్లు తెలుస్తోంది. కొత్తగా చేరిన వారికే పెద్దపీట.. మారిన రాజకీయ పరిణామాల క్రమంలో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతలకు తొలిజాబితాలో పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటు పడిన తర్వాత కొల్లాపూర్‌కు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు నాగర్‌కర్నూల్‌కు చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి, గద్వాలకు చెందిన జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య చేయి అందుకున్నారు. ఆ తర్వాత కల్వకుర్తి చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరగా.. వీరందరికి తొలి జాబితాలోనే సీట్లు కేటాయించడం విశేషం. -
అసెంబ్లీ బరి నుంచి తప్పుకున్న జానారెడ్డి.. మొత్తంగా 13 శాఖలకు మంత్రిగా సేవలు
సూర్యపేట్: సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించిన కుందూరు జానారెడ్డి ఈసారి అసెంబ్లీ బరినుంచి తప్పుకున్నారు. తన కుమారుడు జైవీర్‌రెడ్డిని ఈసారి పోటీలో దింపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అనుముల గ్రామంలో జన్మించిన ఆయన రాజకీయ ప్రస్థానం 1974లో ప్రారంభమైంది. అప్పట్లో జయప్రకాష్ నారాయణ్ చేపట్టిన సంపూర్ణ క్రాంతి ఉద్యమానికి ఆకర్షితులై 1977లో జనతా పార్టీలో చేరి.. అదేపార్టీ నుంచి 1978లో ప్రత్యక్షంగా ఎన్నికల్లో దిగారు. 55 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటివరకు అసెంబ్లీకి 11సార్లు పోటీ చేయగా, నాలుగు సార్లు ఓడిపోయిన ఆయన ఏడుసార్లు గెలుపొందారు. అందులో 14 ఏళ్లకు పైగా మంత్రిగా సేవలు అందించారు. చలకుర్తి నుంచి మొదటిసారిగా పోటీ.. 1967లో చలకుర్తి నియోజకవర్గం ఏర్పాటు కాగా 2004 వరకు అదే పేరుతో కొనసాగింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009 నుంచి చలకుర్తిని నాగార్జునసాగర్ నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. జానారెడ్డి 1978లో చలకుర్తి నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరఫున తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మల రాములు చేతిలో ఓడిపోయారు. 1983 ఎన్నికల్లో జానారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఆ ఎన్నికల్లో నిమ్మల రాములుపై గెలిచి ఆ తరువాత టీడీపీలో చేరారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాగ్యానాయక్‌పై గెలిచారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన జానారెడ్డి 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగా, టీడీపీ అభ్యర్థి గోపగాని పెద నర్సయ్యపై గెలుపొందారు. 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ చేతిలో ఓడిపోయారు.1999, 2004లో జరిగిన ఎన్నికల్లో గుండెబోయిన రాంమూర్తి యాదవ్‌పై గెలుపొందారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి తేరా చినపరెడ్డిపైనా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల నర్సింహయ్యపై గెలుపొందారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయారు. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో జానారెడ్డి తన కుమారుడు జైవీర్‌రెడ్డిని రంగంలోకి దింపారు. రాష్ట్రంలోనే సీనియర్ మంత్రిగా జానారెడ్డి రికార్డు.. పలు కీలక శాఖల మంత్రి పదవుల్లో కొనసాగిన కుందూరు జానారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. అత్యధిక కాలం మంత్రిగా (14 ఏళ్ల 11 నెలలు) పని చేశారు. 1988లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయి సొంతంగా తెలుగు మహానాడు పార్టీని స్థాపించారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన జానారెడ్డి హోం, వ్యవసాయ, హౌజింగ్, సహకార, పంచాయతీ రాజ్, రవాణా, రోడ్లు, ఫారెస్ట్, తూనికలు, భవనాలు, గ్రామీణాభివృద్ధి తదితర 13 శాఖలకు మంత్రిగా సేవలందించారు. -
బీఆర్ఎస్ శంఖారావం... 50వేల మంది సభకు వచ్చే అవకాశం
యాదాద్రి: బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభకు భువనగిరి ముస్తాబైంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం జనగామలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు హెలికాప్టర్లో భువనగిరిలోని సభాస్థలికి చేరుకొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సభ విజయవంతానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పార్టీ నాయకులతో కలిసి వారం రోజులుగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. దగ్గరుండి సభా ఏర్పాట్లను పరిశీలించారు. భువనగిరి మున్సిపాలిటీ, భువనగిరి మండలం, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ మండలాల నుంచి 50 వేల మందిని సభకు తరలించేలా ప్రణాళిక రూపొందించారు. సభలో వేదికపై 100 మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. మహిళలు, వీఐపీలు, మీడియా, వృద్ధుల కోసం ప్రత్యేక గ్యాలరీలు సిద్ధం చేశారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సభ సందర్భంగా వేదికతోపాటు పట్టణం మొత్తం గులాబీమయంగా మారింది. సభా ఏర్పాట్లను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, డీసీపీ రాజేశచంద్ర పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. మూడుచోట్ల వాహనాల పార్కింగ్ సీఎం సభకు వచ్చే వాహనాలను పార్కింగ్ చేయడానికి మూడు చోట్ల ఏర్పాట్లు చేశారు. రాయగిరి రోడ్డులో ఎస్ఎల్ఎన్ఎస్ కళాశాల, గంజ్ మార్కెట్, వలిగొండ రోడ్డు ఖిలా దిగువన వెంచర్, తుర్కపల్లి రోడ్డులో బ్రిడ్జి దాటిన తర్వాత వెంచర్‌ను వాహనాల పార్కింగ్ కోసం కేటాయించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. స్పిన్నింగ్ మిల్ నుంచి సీఎం కాన్వాయ్ సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో హైదరాబాద్ రోడ్డులో గల పెద్ద చెరువు సమీపంలో స్పిన్నింగ్ మిల్ ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా సభావేదిక వద్దకు చేరుకుంటారు. వరాల జల్లు కురిపించేనా? ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనడానికి భువనగిరికి వస్తున్న సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తారా.. అన్న ఆసక్తితో నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలోనూ కేసీఆర్ పాల్గొన్నారు. ఆసందర్భంగా పలు హామీలు ఇచ్చారు. 2.65లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బస్వాపూర్ రిజర్వాయర్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బునాదిగాని, పిల్లాయపల్లి, ధర్మారెడ్డి కాలువల ఆధునీకరణ పూర్తికాలేదు. పర్యాటక ప్రాంతాలుగా భువనగిరి ఖిలా, బస్వాపురం రిజర్వాయర్లు, మూసీ ప్రక్షాళన హామీలు నెరవేరలేదు. భువనగిరి నియోజకవర్గ వాసులు కోరుతున్నవి హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారి వెంట భువనగిరి – బీబీనగర్ మధ్య ఐటీ హబ్ ఏర్పాటు చేయాలి. భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలు ఏర్పాటు చేయాలి. భువనగిరిలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలి. సంగెం – బొల్లేపల్లి మధ్య మూసీపై వంతెన నిర్మించి రవాణా ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో విశేష ప్రగతి ఎన్నికల మేనిఫెస్టోపై అన్ని వర్గాల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ అందుతున్నాయి. గడిచిన పదేళ్లలో రాష్ట్రం విశేష ప్రగతి సాధించింది. మూడవ సారి కూడా కేసీఆరే సీఎంకావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. భువనగిరిలో నేడు జరిగే ఆశీర్వాద సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో రానున్నారు. –పైళ్ల శేఖర్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే -
అలంపూర్ మినహా..
మహబూబ్‌నగర్: అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలవనున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ ఆదివారం బీఫారాలను స్వయంగా అందజేశారు. తొలి విడతలో మధ్యాహ్నం 51, రాత్రి 18 మందికి బీఫారాలను ఇవ్వగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క అలంపూర్ స్థానానికి మినహాయించి మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీఫారాలను అందించారు. అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అబ్రహంకు మళ్లీ టికెట్‌ను ప్రకటించినా, ఇటీవల ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గీయుల ఆందోళన నేపథ్యంలో సందిగ్ధత నెలకొన్నట్టు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థికి బీఫారాన్ని అందించనున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మిగిలిన ఎమ్మెల్యేలకు పార్టీ బీఫారాలు లభించడంతో పాటు మేనిఫెస్టో ప్రకటనతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. జనం గుండెల్లో కేసీఆర్ సీఎం కేసీఆర్ అంటేనే నమ్మకానికి మారు పేరు. ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను నెరవేర్చినందుకే జనం గుండెల్లో గూడు కట్టుకున్నారు. వరుసగా మూడోసారి సీఎం చేతులమీదుగా బీఫారం అందుకోవడం సంతోషంగా ఉంది. ఆయన ఆశీర్వాదం, ప్రజల దీవెనలతో ఈసారి లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధిస్తా. నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశా. వచ్చే ఏడాదికి పాలమూరు ప్రాజెక్టుతో జిల్లాను సస్యశ్యామలం చేస్తాను. కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా, ఆసరా పింఛన్లు, రైతుబంధు సాయం పెంపు, కేసీఆర్ ఆరోగ్య రక్ష– ఆరోగ్యశ్రీ రూ.15 లక్షలు, సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా పేద మహిళకు నెల రూ.3 వేల భృతితోపాటు రూ.400కే సిలిండర్ మేనిఫెస్టోలో పొందుపర్చదడం సంక్షేమంపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. -
చిక్కిన చిరుత.. అటవీ ప్రాంతంలో వదిలిన అధికారులు
మహబూబ్‌నగర్: రెండేళ్ల నుంచి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చిరుత పులి ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు పెట్టిన బోనులో శనివారం రాత్రి చిక్కింది. రెండు నెలల నుంచి మరికల్ మండలం రాకొండ శివారులోని గుట్టపై ఓ చిరుత రెండు పిల్లలకు జన్మనించి అక్కడే ఉంటుంది. నిత్యం రాత్రి కాగానే వ్యవసాయ పొలాల వద్ద కట్టేసిన పశువులపై ఎక్కడో ఒక చోట దాడి చేసి ఆకలి తీర్చుకుంటుంది. చిరుత పులిని పట్టుకోవాలని పది రోజుల కిందట గ్రామస్తులు నారాయణపేట అటవీ శాఖ అధికారులను సంప్రందించారు. మూడు రోజుల కిందట రాకొండ గుట్ట సమీపంలో బోనులో మేకపిల్లను ఉంచి చిరుతను పట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఎట్టకేలకు తల్లి చిరుత బోనులో చిక్కడంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఆదివారం మేకపిల్లను బయటకు పంపించి క్రేన్ సాయంతో బొలెరొ వాహనంలో శ్రీశైలం అడవిలోకి తరలించారు. బోనులో చిక్కిన చిరుత మండలంలో రాకొండ, పూసల్‌పహాడ్, మాద్వార్ తదితర గ్రామాల్లోని పశువులపై దాడి చేసి చంపేసిన ఘటనలు ఉన్నాయి. ఈ చిరుతకు సంబంధించిన రెండు చిరుత పిల్లలు తప్పించుకోవడంతో వాటిని కూడా పట్టుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. లేకుంటే తమ వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో వన్యప్రాణులు సంచరిస్తే తమ దృష్టికి తీసుకురావాలని అటవీశాఖ అధికారి వీణావాణి తెలియజేశారు. అటవీ ప్రాంతంలో వదిలిన అధికారులు పట్టుబడిన చిరుతను ఆదివారం అటవీ శాఖ వారు బోనులో బంధించి నల్లమల అటవీ ప్రాంతంలోని లింగాల మండలం గిరిజ గుండాల బేస్ క్యాంపు సమీపంలో అడవిలోకి వదిలిపెట్టారు. -
TS Elections2023: నేను గెలిస్తే ఎమ్మెల్యేగా కాదు.. పాలేరు లాగ పనిచేసస్తా..!
జనగామ: తనను గెలిపిస్తే జనగామ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద పాలేరుగా పనిచేస్తాను.. సీఎం కేసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకా న్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తరిగొప్పులలో కార్యకర్తల సమావేశం, బచ్చన్నపేటలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే బాధ్యతగా ప్రజాసమస్యలు పరిష్కరించడంతోపాటు అభివృద్ధి చేసి చూపించి ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తానని చెప్పారు. దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు సేవ విషయంలో పోటీకి రావాలే తప్ప నాన్‌లోకల్ అని ప్రచారం చేయడం మానుకోవాల న్నారు. జిల్లా కేంద్రంలో ఈనెల 16న జరిగే సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని, అద్భుతమైన మేనిఫెస్టో రాబోతోందని చెప్పారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జల్లి సిద్దయ్య, ఇర్రి రమణారెడ్డి, జెడ్పీటీసీ ముద్దసాని పద్మజావెంకట్రెడ్డి, ఎంపీపీలు నాగజ్యోతి, కల్లూరి అనిల్‌రెడ్డి, సర్పంచ్‌లు సతీష్‌రెడ్డి, మల్లారెడ్డి, అయిలుమల్లయ్య, దివ్య, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, పింగిళి జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. సీఎం సభ ఏర్పాట్లు పరిశీలన సిద్దిపేటరోడ్డు మెడికల్ కళాశాల మైదానంలో ఈ నెల 16న నిర్వహించే సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లను పల్లా రాజేశ్వర్‌రెడ్డి శుక్రవారం పరిశీ లించారు. సభా ప్రాంగణంతో పాటు సీఎం వచ్చే హెలికాప్టర్ కోసం వికాస్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ పనులను సందర్శించారు. గ్రామాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్‌కు సంబంధించి, ఎవరు ఎక్కడ అనే దానిపై అన్ని గ్రామాల బాధ్యులకు ముందస్తు సమాచారం చేరవేయాలని పేర్కొన్నారు. పల్లా వెంట పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్‌రెడ్డి, పార్టీ శ్రేణులు నీల యాదగిరి, జూకంటి శ్రీశైలం, దేవరాయ నాగరాజు, బండ వెంకటేష్, బండ హరీష్ సంకటి రాజు, బోల మహేష్, బోల వెంకటేష్, జిట్ట శ్రీశైలం యాదవ్, బక్క రవి తదితరులు ఉన్నారు. -
కాంగ్రేస్ పార్టీలో ‘పొన్నాల’ ప్రస్థానం ముగిసినట్టేనా..?
జనగామ: టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. సుమారు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఆయనకు ఏఐసీసీ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ఆవేదనతో రాజీనామా లేఖాస్త్రం సంధించడంపై ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. జనగామ డీసీసీ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాపరెడ్డిని నియామకాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పొన్నాలకు.. పార్టీ టికెట్ కూడా రావడం లేదనే సంకేతాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ కూడా ఉంది. మరోవైపు ఆయన రాజీనామాపై రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్న విషయాలు స్థానికంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీసీ నేతగా అంచెలంచెలుగా ఎదిగి పార్టీ కోసం అంకితభావంతో టీపీసీసీ స్థాయికి ఎదిగిన తనకే విలువ లేకపోతే.. సాధారణ బీసీ నాయకుల పరిస్థితి ఏంటని ఆయన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు పంపిన లేఖలో ఆవేదన వ్యక్తం చేయడంపై సానుకూలత ఉంది. అవమానం భరించలేక 45 ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం బాధ కలిగిస్తున్న దని కూడా పేర్కొనడంపైన పాజిటివ్ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసం సర్వేలు, ఏఐసీసీ పరిశీలనల ఆధారంగా తీసుకునే నిర్ణయాలకు సీనియర్లు ఎందుకు కట్టుబడి ఉండరన్న చర్చ కూడా ఉంది. ఏమీ కాలేని నేతలు కాంగ్రెస్ పార్టీ నీడలో ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ పదవులను అనుభవించి పార్టీ మేలు కోసం తగ్గితే తప్పేమిటన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌పై పొన్నాల లక్ష్మయ్య రాజీనామా ప్రభావం చూపి.. మరికొందరు టికెట్ రాదని భావించే నాయకులు పార్టీని వీడకుండా టీపీసీసీ చర్యలు చేపడుతోంది. అసంతృప్తి నేతలతో సంప్రదింపులు జరిపి చక్కదిద్దే పనిలో పడింది. టికెట్ రావడం లేదనే సంకేతం... తెలంగాణకు తొలి టీపీసీసీ అధ్యక్షుడిగా 119 స్థానాలకు టికెట్ల ఖరారులో కీలకంగా వ్యవహరించిన పొన్నాల లక్ష్మయ్యను.. తనకే టికెట్ రావడం లేదన్న సంకేతాలు ఆవేదనకు గురి చేశాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 12 సంవత్సరాలు మంత్రిగా, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనుల కేటాయింపు మొదలు పార్టీ కార్యకలాపాల్లో ‘కింగ్‌మేకర్’గా ఉన్న ఆయనకు కొద్ది రోజులు ఏఐసీసీ పెద్దలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మంత్రిగా, టీపీసీసీ చీఫ్‌గా ఉమ్మడి వరంగల్‌లో 1999 నుంచి 2014 వరకు ఓ వెలుగు వెలిగిన ఆయన గ్రాఫ్ 2016 తర్వాత పార్టీలో పడిపోయింది. ఏఐసీసీతో సైతం గ్యాప్ పెరగడంతోపాటు ఆయన నియోజకవర్గం జనగామకు కొత్త అభ్యర్థులు తెరమీదకు రావడాన్ని కూడా జీర్ణించుకోలేకపోయారు. తాను ఎంత వ్యతిరేకించినా.. కొమ్మూరి ప్రతాపరెడ్డిని డీసీసీ అధ్యక్షుడిని చేయడం మొదలు ఇవన్నీ తనకు టికెట్ రాకుండా చేయడమేనన్న సంకేతాలు ఆయనకున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత చివరి ప్రయత్నంగా ఏఐసీసీ పెద్దలను కలిసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాజీనామాకు సిద్ధమైన పొన్నాల లక్ష్మ య్య.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, పార్టీ వ్యూహకర్త సునీల్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు రాజీనామా లేఖను పంపడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే పొన్నాల లక్ష్మయ్య.. త్వరలోనే బీఆర్ఎస్ గూటికి చేరతారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నెల 16న జనగామలో సీఎం కేసీఆర్ సభ సందర్భంగా ఈ చేరిక ఉంటుందంటున్నారు. లేదంటే అంతకంటే ముందే మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరవచ్చని అంటున్నారు. 12 ఏళ్లు మంత్రిగా.. పొన్నాల లక్ష్మయ్య నాలుగున్నర దశాబ్దాలు, నలుగురు ముఖ్యమంత్రుల హయాంలో సుమారు 12 ఏళ్లపాటు రాష్ట్ర మంత్రిగా వివిధ శాఖలు నిర్వహించారు. ముఖ్య మంత్రులుగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, డా.వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వివిధ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలి టీపీసీసీ అధ్యక్షుడిగా 2014 మార్చి 10న పొన్నాల లక్ష్మయ్య పార్టీ కీలక పదవిని చేపట్టారు. ఏడు పర్యాయాలు జనగామ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన లక్ష్మయ్య నాలుగు సార్లు గెలుపొందారు. 1985లో సీపీఎం అభ్యర్థి అసిరెడ్డి నరసింహారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి చురగొండి రాజిరెడ్డిపై గెలిచిన పొన్నాల.. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో అదే చురగొండి రాజిరెడ్డిపై ఓటమి చెందారు. 1999లో ప్రేమలతారెడ్డి (టీడీపీ), 2004లో ఎ.బస్వారెడ్డి (టీడీపీ), 2009లో కొమ్మూరి ప్రతాపరెడ్డి (టీఆర్ఎస్ (బీఆర్ఎస్)పై పొన్నాల గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతిలో ఓటమి చెందారు. కాగా, పొన్నాల లక్ష్మయ్య రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో ముగిసినట్లేనా అన్న చర్చ జరుగుతోంది. ఆయన రాజీనామాను ఆమోదిస్తే ముగిసినట్లేనని, పెద్దలు విస్తృత సంప్రదింపులు జరిపితే ఆయన మెత్తబడి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకా శం లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. -
ఈ ఎన్నికల్లో అభ్యర్ధుల తలరాతలు మార్చబోయేది వీరే..!
యాదాద్రి: అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓట్లు కీలకం కాబోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం ఓటర్లలో 18 ఏళ్ల నుంచి 39 వారే సగానికంటే ఎక్కువమంది ఉన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల భవిత ఈ యువ ఓటర్లపైనే ఆధారపడి ఉంది. దీంతో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వారి నుంచి మొదలుకొని 39 ఏళ్లలోపు ఉన్న వారిపై అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను వారే ప్రభావితం చేయనుండడంతో వారిని ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. 40 ఏళ్ల పైబడిన వారు ఎలాగూ ఓ కచ్చితమైన అభిప్రాయంతో ఉంటారనే అంచనాతో 40 ఏళ్లకంటే తక్కువ వయస్సు ఉన్న వారిపైనే ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. జిల్లాల వారీగా యూత్ ఓట్లు ఇలా.. నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మొత్తం 14,26,480 మంది ఓటర్లు ఉన్నారు. అందులో కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న 18–19 ఏళ్ల వారు 48,909 మంది ఉండగా, 20 నుంచి 29 ఏళ్ల వారు 2,91,768 మంది ఉన్నారు. అంటే 29 ఏళ్లలోపు ఉన్న ఓటర్లే జిల్లాలో 3,40,677 మంది (23.89 శాతం) ఉన్నారు. ఇక 30 నుంచి 39 ఏళ్ల వయస్సు ఉన్న ఓటర్లు 4,10,842 మంది ఉన్నారు. ఈ రెండు కేటగిరీలు కలిపితే 7,51,519 మంది (52.69 శాతం) ఓటర్లు వీరే ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 9,63,701 మంది ఓటర్లు ఉండగా.. 18 నుంచి 39 సంవత్సరాల వయస్సు గల యువ ఓటర్లు 4,89,118 మంది ఉన్నారు. జిల్లా ఓటర్లలో 50.75 శాతం వీరే ఉన్నారు. యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 4,39,100 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18 నుంచి 29 ఏళ్ల లోపు ఓటర్లు 1,02,159 మంది ఉన్నారు. వీరిలో కొత్త ఓటర్లు 14,512 మంది ఉన్నారు. 30 నుంచి 39 ఏళ్లలోపు వారు 1,22,738 మంది ఉన్నారు. జిల్లాలో 39 ఏళ్లలోపు వారు మొత్తం 2,24,897 (51.21 శాతం) మంది ఉన్నారు. బీఆర్ఎస్.. వంద మందికి ఒక ఇన్చార్జి క్షేత్రస్థాయిలో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు నిత్యం వారికి అందుబాటులో ఉండేందుకు బీఆర్ఎస్ ఇప్పటికే ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని క్షేత్రస్థాయిలోకి పంపించింది. ముఖ్యంగా వారు కొత్త ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించి తమవైపు తిప్పుకునే కార్యాచరణను అమలు చేస్తున్నారు. నిరుద్యోగులను ఆకర్షించేలా.. ఉద్యోగాలు రాక, వచ్చినా నోటిఫికేషన్లు వాయిదా పడి తీవ్ర నిరాశలో ఉన్న నిరుద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ అడుగులు వేస్తున్నాయి. నియోజవర్గాల్లో తమ టికెట్ కన్ఫర్మ్ అనుకున్న అభ్యర్థులు వారిపై ప్రత్యేక దృష్టి సారించేలా తమ బృందాలను రంగంలోకి దింపారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. -
దసరాకు ఆర్టీసీ ‘ స్పెషల్’!
యాదాద్రి: తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన దసరాకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ ఏటా స్పెషల్ బస్సులు నడుపుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులతో మంచి ఆదాయాన్ని అర్జిస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 13వ తేదీ నుంచి 15 వరకు, తిరిగి 19 నుంచి 22వ తేదీ వరకు నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో 409 బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. గతేడాది మాదిరిగానే ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నారు. ఇక ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నియామకం తర్వాత వినూత్న కార్యక్రమాలతో ముందుకు వస్తుండగా.. రాఖీ సందర్భంగా సత్ఫలితాలు ఇచ్చిన గిఫ్ట్‌ల కార్యక్రమాన్ని ఈ పండుగకు ప్రవేశపెట్టనున్నారు. 10 మందికి రూ.9,900 చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నారు. 10 మంది ప్రయాణికులకు గిఫ్ట్‌లు ప్రయాణికుల ఆదరణ పొందడం.. తద్వారా మంచి ఆదాయాన్ని గడించేందుకు వినూత్న కార్యక్రమాలతో ఆర్టీసీ ముందుకు వస్తోంది. రాఖీ సందర్భంగా చేపట్టిన బహుమతుల పథకానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ దసరాకు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం రీజియన్ పరిధిలో ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులను ఎంపిక చేయనున్నారు. పండుగకు ముందు ఈనెల 21 నుంచి 23 వరకు, పండుగ తర్వాత 28నుంచి 30వ తేదీల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు తమ టికెట్ వెనుక పేరు, ఫోన్‌నంబర్ రాసి.. ఆర్టీసీ ఏర్పాటు చేసే బాక్సుల్లో వేయాల్సి ఉంటుంది. ఈ బాక్సులను నల్ల గొండ, దేవరకొండ, చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, కొండమల్లేపల్లి, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట హైటెక్ బస్టాండ్, కొత్తబస్టాండ్, యాదగిరిగుట్ట కొత్త బస్టాండ్, పాతబస్టాండ్, భువనగిరి బస్టాండ్లలో ఏర్పాటు చేయనున్నారు. రద్దీ రోజులను గుర్తించి.. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా నల్లగొండ, నార్కట్‌పల్లి, మిర్యాలగూడ, దేవరకొండ, కోదాడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట మొత్తం ఏడు ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి జిల్లావాసులు ఉద్యోగాలు, ఇతర పనులు, విద్య కోసం రాజధాని హైదరాబాద్‌లోనే అధికంగా ఉంటుంటారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ఉండడం, బతుకమ్మ, దసరా అతి పెద్ద పండుగలు కావడంతో పెద్దఎత్తున జనం సొంత గ్రామాలకు తరలి వస్తుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ఆయా డిపోలకు వచ్చే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. మొదట్లో విద్యాసంస్థలకు సెలవు ఉండడంతో ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు, తర్వాత సాధారణ జనం రద్దీ కారణంగా 19నుంచి 22వ తేదీ వరకు.. ఇలా మొత్తంగా ఏడు రోజుల పాటు ప్రయాణికుల రద్దీ ఉంటుందని భావించి ఆయా తేదీల్లో రాజధానికి అదనపు బస్సులు నడపనున్నారు. 409 బస్సులు.. సాధారణ చార్జీలు పండుగ నేపథ్యంలో ఆర్టీసీ నల్లగొండ రీజియన్ పరిధిలో మొత్తం 409 బస్సులతో అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. మొదటిరోజు శుక్రవారం ఏడు డిపోల నుంచి 56 బస్సులను నడిపారు. ఇక 14వ తేదీన 36 బస్సులు నడపనున్నారు. 15వ తేదీన 35 బస్సులు తిప్పుతారు. తిరిగి ఈనెల 19న 71 బస్సులు, 20వ తేదీన 56 బస్సులు, 21వ తేదీన 75 బస్సులు, 22వ తేదీన 80 బస్సులు నడపనున్నారు. అయితే గతంలో స్పెషల్ బస్సులను నడిపితే 20 శాతం మేర చార్జీలు అదనంగా వసూలు చేసేవారు. 2022లో బస్ చార్జీలు రెండుసార్లు పెంచడం, చిల్లర సమస్యతో మరోసారి పెంచడంతో గతేడాది దసరా స్పెషల్ బస్సులకు చార్జీలను పెంచలేదు. ఈ సారి కూడా రోజువారీగా వసూలు చేసే చార్జీలనే తీసుకోనున్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి బతుకమ్మ, దసరా పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని నల్లగొండ రీజియన్ పరిధిలో 409 ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ప్రయాణికులు స్పెషల్ బస్సులను సద్వినియోగం చేసుకోవాలి. ప్రయాణికుల రద్దీని బట్టి ఇంకా అదనంగా సర్వీసులు నడుపుతాం. ఈ పండుగకు నగదు బహుమతులు అందిస్తున్నాం. – ఎస్.శ్రీదేవి, ఆర్టీసీ ఆర్ఎం, నల్లగొండ -
TS Elections2023:‘హాత్ సే హాథ్ జోడో’ కార్యక్రమంతో దూకుడు పెంచిన హస్తం పార్టీ
కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఊళ్లను చుట్టేస్తూ సర్కారు వైఫల్యాలను వివరిస్తున్నారు. అధికారంలోకి వస్తే అమలు చేయబోయే ఆరు గ్యారంటీ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థి స్తున్నారు. కామారెడ్డి నియోజక వర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలోకి దిగిన మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ.. హాత్ సే హాథ్ జోడో పేరుతో ఇప్పటికే ఊళ్ల ను చుట్టేశారు. ఇక్కడినుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బరిలో నిలుస్తుండడంతో.. ఆయనను దీటు గా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న షబ్బీర్ అలీ.. 1989 నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంనుంచి ఏడుసార్లు బరిలో నిలిచిన ఆయన.. రెండుసార్లు గెలిచి ఐదుసార్లు ఓటమి పాలయ్యారు. ఎన్నికలలో ఓడిపోయినా నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలు, అనుచరులకు భరోసా ఇస్తూ వస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి నాయకులుగా ఎదిగిన ఎందరో తర్వాతి కాలంలో గులాబీ కండువా కప్పుకున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఎన్నికై న వారు చాలామంది పార్టీ మారారు. ఉన్న నేతలతోనే పార్టీని ముందుకు నడిపిస్తూ వస్తున్నారు. వరుస ఓటములతో జనంలో ఉన్న సానుభూతికి తోడు నిత్యం జనం మధ్య ఉంటుండడంతో ప్రజలు తనను గెలిపిస్తారన్న నమ్మకంతో ఉన్నారు. అధికార పార్టీ నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండడంతో పకడ్బందీగా వ్యూహాలు రచిస్తున్నారు. తన పార్టీ నేతలు జారిపోకుండా చూసుకుంటూ ప్రచారంలో స్పీడు పెంచుతున్నారు. సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ.. నిత్యం ఏదో ఒక ఊరిలో పర్యటిస్తున్న షబ్బీర్ అలీ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఉద్యోగాలు, కాళేశ్వరం ప్యాకేజీకి నిధులు మంజూరు చేయకపోవడం తదితర అంశాలను ప్రస్తావిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో నాణ్యతాలోపాన్ని ఎత్తి చూపుతున్నారు. దళితబంధు, బీసీ బంధు పథకాలను అర్హులకు కాకుండా అధికార పార్టీ వారికే ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. పథకాల అమలులో వసూళ్లపై ఆరోపణలు గుప్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరుతున్నారు. సీఎం ఓడిపోతే బీఆర్ఎస్ దుకాణం బంద్ కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓటమితో రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అవడం ఖాయమని మాజీ మంత్రి షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో విలే కరులతో మాట్లాడారు. బంగారు తెలంగాణ తీసుకువస్తామన్న కేసీఆర్ తాగుబోతు రాజ్యం తీసుకువచ్చారని విమర్శించారు. అచ్చేదిన్ తీసు కువస్తామన్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు.. జనం చచ్చే రోజులు తీసుకువస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఫిర్యాదు చేయగానే స్పందించి, అధికారులను బదిలీ చేసి న కేంద్ర ఎన్నికల అధికారికి ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా వచ్చిన అధికారులు పారదర్శకంగా పనిచేయాలని కోరారు. కామారెడ్డి పట్టణంలోని 32వ వార్డుకు చెందిన పలువురు, క్యాసంపల్లి తండా, రాఘవాపూర్ తండాకు చెంది న యువకులు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్, మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్, నాయకులు శ్రీనివా స్, పండ్ల రాజు, అశోక్‌రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ శివకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పితృఅమావాస్య రోజున.. జ్ఞాపకాలు పదిలం..
రాజన్న సిరిసిల్ల: చనిపోయిన పెద్దల జ్ఞాపకార్థం పితృ అమావాస్య నాడు బియ్యం ఇవ్వడం సంప్రదాయం. ఏటా పితృ అమావాస్య రోజున సిరిసిల్ల ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో ఉదయమే జంగమయ్యకు బియ్యం, కూరగాయలు ఇస్తుండడం కనిపిస్తుంటుంది. చనిపోయిన వారిని జ్ఞప్తికి తెచ్చుకోవడం.. వారి పేరిట దాన ధర్మాలు చేయడం దీని ఉద్దేశం. పితృ పక్షంలోనే.. మహాలయ పక్షంలోని పదిహేను రోజులు చనిపోయిన తమ కుటుంబాల్లోని పెద్దలకు బియ్యం ఇస్తుంటారు. శుక్రవారం నాటి అమావాస్యతో ఈ పక్షం ముగుస్తోంది. ఈ సమయంలో చాలా మంది ఈ ఆచారాన్ని అనుసరించి జంగమయ్యల ఇళ్లకెళ్లి బియ్యం ఇస్తుంటారు. పెద్దలు చనిపోయిన తిథులు గుర్తుండని వారు పితృఅమావాస్య రోజున బియ్యం ఇస్తుంటారు. ఉప్పు, పప్పు, నెయ్యి, కాశీలోన గయ లాంటి పుణ్య క్షేత్రాల్లోని వృక్షం కింద బ్రాహ్మణుల భోజనం నిమిత్తం తృప్తిగా ఇస్తినయ్యా అంటూ జంగమయ్యల ముందు ప్రణమిల్లుతారు. ఇలా సమర్పించిన బియ్యంలోంచి పిడికెడు బియ్యాన్ని తిరిగి తీసుకుని వంట చేసుకునే బియ్యంలో కలిపి ఆ రోజున శ్రాద్ధకర్మలకు అవసరమైన ఆహార పదార్థాలు తయారు చేస్తారు. బంధు మిత్రులతో కలిసి పూర్వీకులను స్మరిస్తూ తర్పణాలు వదిలి భుజిస్తారు. ఎందుకీ తర్పణాలు మనిషి ప్రయాణానికి నిజమైన గమ్యం మోక్షమే అని అందరి విశ్వాసం. గతించిన వాళ్లకు మోక్షం లభించాలంటే సశరీరంగా ఈ లోకానికి రావాలంటే వారికి ఆహారం అందిస్తేనే రుణం తీరి మోక్షం లభిస్తుందని ప్రజల నమ్మకం. ఇందులో భాగంగానే పితృ అమావాస్య రోజున తమ కుటుంబంలో మరణించిన పెద్దల పేరిట ఇలా చేస్తుంటారు. -
డెంగీ జ్వరంతో బాలింత మృతి
జైపూర్: మండలంలోని రామారావుపేట గ్రామ పంచాయతీ పరిధి దుబ్బపల్లికి చెందిన బాలింత కామెర రుచిత(22) జ్వరంతో శుక్రవారం మృతిచెందింది. కొడుకు పుట్టిన 12 రోజులకే కన్నతల్లి ప్రేమను పంచకుండానే దూరమైంది. వివరాలిలా ఉన్నాయి. రుచితకు దుబ్బపల్లికే చెందిన కామెర సంతోష్‌కుమార్‌తో ఏడాది క్రితం వివాహామైంది. 12రోజుల క్రితం మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె బాబుకు జన్మనిచ్చింది. వారం రోజుల తర్వాత ఇంటికి చేరింది. మూడు రోజులుగా రుచితకు జ్వరం వస్తుండడంతో గురువారం మంచిర్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. రక్తకణాలు తగ్గాయని, డెంగీ పాజిటివ్ ఉన్నట్లుగా గుర్తించి కరీంనగర్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు అక్కడి వైద్యులు నిర్దారించారు. కాగా, రుచిత తండ్రి లక్ష్మణ్ ఐదేళ్ల క్రితం మరణించాడు. తల్లి చంద్రమ్మ కూలీ పని చేస్తూ కూతురి వివాహం జరిపించింది. కొడుకు జన్మించిన సంతోషంలో ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. -
‘కారు’లో చల్లారిన అసంతృప్తి మంటలు..
మంచిర్యాల: గులాబీ పార్టీలో అసమ్మతి నాయకులు వెనక్కి తగ్గుతున్నారు. అధిష్టానం సూచనలతో తమ పట్టు వీడుతున్నారు. జిల్లాలో మంచిర్యాల బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి పార్టీ ఆదేశాలే శిరోధార్యంగా భావిస్తూ మరోసారి గెలుపునకు కృషి చేసేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం మంచిర్యాలలో గడ్డం అరవింద్‌రెడ్డి ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఖానాపూర్ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ దండె విఠల్, కార్మిక నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు. మంచిర్యాల సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని అరవింద్‌రెడ్డి పట్టుబట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే కోసం పని చేస్తామని ప్రకటించడంతో గులాబీ పార్టీలో ఐక్యత రాగం మొదలైంది. దీంతో మంచిర్యాల నియోజకవర్గంలో అసమ్మతి దాదాపు చల్లారినట్లేనని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇక బెల్లంపల్లిలో టికెట్ ఆశించిన రేణికుంట్ల ప్రవీణ్‌కుమార్‌ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమించడంతో అక్కడ అసంతృప్తి చల్లారింది. ఇక క్షేత్రస్థాయిలో పట్టణ, మండల, గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు, కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని చల్చార్చేందుకు జిల్లా నాయకత్వం ప్రణాళికలు వేస్తోంది. జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగరాలి : బాల్క సుమన్ మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ జెండా మళ్లీ ఎగరాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో పార్టీని గెలిపించేందుకు మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించామని తెలిపారు. శుక్రవారం మంచిర్యాలలో గడ్డం అరవింద్‌రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఎమ్మెల్సీ దండె విఠల్‌తో కలసి ప్రత్యేకంగా సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎన్నికల సంబంధించిన సమాలోచనలు చేశామని చెప్పారు. అందరం సమన్వయంతో ముందుకు సాగుతామని, మరోమారు సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. సీఎం ఈ నెల 15న అభ్యర్థులకు బీ ఫాం ఇస్తారని, 17నుంచి నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టనున్నారని తెలిపారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ మంచిర్యాల ప్రశాంతంగా ఉండాలన్నా, సమర్థవంతమైన అభివృద్ధి జరగాలన్నా బీఆర్ఎస్కే ఓటేయాలని అన్నారు. అరవింద్‌రెడ్డి గతంలోనూ, ప్రస్తుతం తమ గెలుపు కోసం పని చేస్తారని చెప్పారు. అరవింద్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణిలో కార్మికులకు సీఎం కేసీర్ బోనస్ ఇచ్చారని, గతంలో వచ్చిన దానికి కన్నా 20వేల మెజార్టీతో దివాకర్‌రావును గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో రెండు స్థానాలకు బీసీలకే టికెట్లు ఇచ్చామని, విపక్ష పార్టీలు ఎన్ని సీట్లు ఇస్తాయో చూస్తామని అన్నారు. అసంతృప్తులకే గెలుపు బాధ్యతలు గత కొంతకాలంగా పార్టీలో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డికి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతలు అప్పగించారు. ‘పురాణం’ను ముధోల్ నియోజకవర్గానికి ఎన్నికల ఇన్చార్జిగా నియమించారు. ఇక అరవింద్‌రెడ్డికి మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావును గెలిపించేందుకు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని పార్టీ నుంచి ఆదేశాలు రావడంతో ఆయన కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కోసం పని చేయనున్నారు. ఇక్కడ ఎన్నికల ఇన్చార్జిగా ఎమ్మెల్సీ భానుప్రసాద్ ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న అరవింద్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల షెడ్యూ ల్ వెలువడకముందే మంచిర్యాలలో ఈసారి ఎన్నికల్లో బీసీలకే బీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని పార్టీలో స్థానిక నాయకులు పట్టుబట్టడం, పలు కార్యక్రమాలు చేయడం తెలిసిందే. ఆ నాయకులకు అరవింద్‌రెడ్డి మద్దతు పలికా రు. సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. కొందరు పార్టీని వీడా రు. ఇదే విషయాన్ని పలుమార్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి, కేటీఆర్ దృష్టి తీసుకెళ్లారు. చివరకు అభ్యర్థిని మార్చే ప్రసక్తే లేకపోవడంతో పార్టీలో వెనక్కి తగ్గారు. -
అప్పుడెట్లనో.. ఇప్పుడట్లనే ఉండాలే..!
మంచిర్యాల: ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీల నాయకులు మద్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. దీంతో మద్యం పంపిణీని కట్టడి చేసేందుకు ఎక్సైజ్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా పెంచారు. 2018 ఎన్నికల సమయంలో ప్రధానంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో మద్యం అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పడు కూడా అలాగే ఉండాలని వైన్స్ యజమానులకు ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మద్యం ఏరులై పారకుండా ఐఎంఎల్ డిపో నుంచి భారీ మద్యం కొనుగోలు చేయడానికి వీలు లేకుండా కట్టడి చేశారు. జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట లిక్కర్ డిపో పరిధిలో 208 మద్యం దుకాణాలు, దాదాపు 45 వరకు బార్లు ఉన్నాయి. ఇప్పటికే వీటిపై నిఘా పెంచారు. పరిమితికి మించి మద్యం నిల్వలు ఉంచినా, మద్యం తరలింపు చేపట్టినా ఎక్సైజ్, పోలీస్ శాఖలు పట్టుకుని సీజ్ చేయడంతోపాటు కేసులు నమోదు చేయనున్నారు. ఒక వ్యక్తికి పరిమితికి మించి మద్యం విక్రయించినా ఆ వైన్ దుకాణాలను సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. నిరంతరం నిఘా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే మద్యం అమ్మకాలపై నిరంతరం నిఘా పెట్టాం. మద్యం అమ్మకాలు గతంలోని అమ్మకాలను పోల్చి చూస్తూ మద్యం విక్రయాలపై దృష్టి సారించాం. మద్యం నియంత్రణ చేపడుతూ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా చర్యలు చేపడుతున్నాం. మద్యం దుకాణా దారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి. అక్రమ మద్యం రవాణా కట్టడికి రెండు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశాం. అక్రమ మద్యం నిల్వలు, సరఫరా అరికట్టేలా మూడు తనిఖీ బృందాలు ప్రత్యేకంగా గస్తీ చేపడుతున్నాయి. – నరేందర్, సీఐ, ఎక్సైజ్ శాఖ, మంచిర్యాల -
ఆరెంజ్ ట్రావెల్స్.. సునీల్‌రెడ్డి ఇంట్లో విషాదం..!
నిజామాబాద్: కాంగ్రెస్ నాయకుడు, ఆరెంజ్ ట్రావె ల్స్ అధినేత ముత్యాల సునీల్‌రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. గురువారం రాత్రి ఆయన కుమార్తె సమన్వి (16) అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతి చెందింది. అదే రోజు రాత్రి మృతదేహన్ని మెండోరా మండలం సావెల్ గ్రామంలో ఆయన స్వగృహానికి తరలించారు. శుక్రవారం ఉదయం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. సునీల్‌రెడ్డిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ అర్వింద్, మాజీ ప్ర భుత్వ విప్ ఈరవత్రి అనిల్, డీసీసీ అధ్యక్షు డు మానాల మోహన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నా యకుడు ఏలేటి మల్లికార్జున్‌రెడ్డిలు శుక్రవారం ఆయన నివాసంలో పరామర్శించారు.