News
-
‘కారు’లో.. మూడు ముక్కలాట!
నారాయణ్‌పేట్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్లో అసంతృప్త సెగలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య విభేదాలు.. మరో ముఖ్యనేత అసమ్మతి రాగం వెరసి ‘కారు’లో కీచులాటలు తారస్థాయికి చేరాయి. శుక్రవారం ప్రగతిభవన్‌కు చేరిన అలంపూర్ పంచాయితీయే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎమ్మెల్యే అబ్రహంకు టికెట్ ఇవ్వొద్దని.. అభ్యర్థిని మార్చాలని వందలాది వాహనాల్లో తరలివెళ్లిన పార్టీ నాయకులు మంత్రి కేటీఆర్‌ను కలిసి ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. మరోవైపు గులాబీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, ఢిల్లీలో అధికార ప్రతినిధి మందా జగన్నాథం సైతం పార్టీ అభ్యర్థిని మార్చాలని.. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని బహిరంగంగానే విమర్శలు గుప్పించడం హాట్‌టాపిక్‌గా మారగా.. పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ‘చల్లా’రుతాయా.. లేక.. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. వచ్చే నెల మూడో తేదీన ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. త్వరలో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫాం ఇచ్చేందుకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అలంపూర్‌లో చల్లారినట్లే చల్లారిన అసమ్మతి సెగలు మళ్లీ భగ్గుమనడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసమ్మతి నేతలు భేటీకి అలంపూర్‌ను ఎంచుకున్నప్పటికీ.. ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లికి మార్చారు. ఎమ్మెల్సీ చల్లా సూచనతోనే సమావేశ వేదికను మార్చినట్లు సమాచారం. సమావేశం అనంతరం అసమ్మతి నేతలు హైదరాబాద్‌కు వెళ్లి అలంపూర్ అభ్యర్థిని మార్చాలని ఏకవాక్య తీర్మానంతో వినతిపత్రం సమర్పించిన క్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ ‘మీరు ఏదైతే వినతిపత్రం ఇచ్చారో యథాతథంగా సీఎం కేసీఆర్‌కు అందజేస్తాను. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మీ మనోభావాలను మీరు స్పష్టంగా చెప్పారు.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను.. వారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు.’అని వెల్లడించడంపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అభ్యర్థిని మార్చని పక్షంలో చల్లా నిర్ణయం ఏవిధంగా ఉంటుందోననే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ‘మందా’ సైతం అసమ్మతి గళం.. ‘అలంపూర్ బీఆర్ఎస్ ఎదగడానికి నాతో పాటు నా కుమారుడు మందా శ్రీనాథ్ కృషి చేశారు.. అయితే కేసీఆర్ మమ్మల్ని విస్మరించారు.. అభ్యర్థిని మార్చకపోతే బీఆర్ఎస్ ఓడిపోతుందని శ్రేణులే చెబుతున్నాయి.. ఇప్పుడు ప్రకటించిన అలంపూర్ అభ్యర్థిని గెలిపించలేం.. ఆయనను మార్చాలన్నదే మా డిమాండ్.. ఎమ్మెల్సీ చల్లాది కూడా అదే డిమాండ్’ అని మాజీ ఎంపీ మందా జగన్నాథం బహిరంగంగానే చెబుతున్నారు. ‘మందా శ్రీనాథ్‌కు బీఫాం ఇవ్వండి.. చల్లా సహకారం తీసుకుంటాం.. గెలుస్తాం’ అని సైతం వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో అలంపూర్ బీఆర్ఎస్లో రాజకీయాలు మూడు ముక్కలాటను తలపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి నుంచి పెరిగిన గ్యాప్.. అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు చల్లా వెంకట్రామిరెడ్డిని పార్టీలో చేర్చుకుని.. ఆ వెంటనే ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జోగుళాంబ ఆలయ చైర్మన్, తదితర పరిణామాల క్రమంలో ఎమ్మెల్యే అబ్రహం, ఆయన మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుగానే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తారనే ప్రచారం ఊపందుకోగా.. ఎమ్మెల్యే అబ్రహానికి కాకుండా ఇతరులకు పార్టీ టికెట్ ఇప్పించేందుకు చల్లా ప్రయత్నించినట్లు సమాచారం. ఉమ్మడి పాలమూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేలనే అభ్యర్థులుగా ఖరారు చేస్తూ సీఎం కేసీఆర్ జాబితా ప్రకటించగా.. నియోజకవర్గంలోని పలు మండలాల్లో నాయకులు అబ్రహానికి వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించారు. వీటి వెనుక ఎమ్మెల్సీ చల్లా హస్తం ఉందని ఎమ్మెల్యే సైతం పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. ఇన్చార్జ్గా నియామకం.. ఆ మరునాడే.. బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల ఖరారు తర్వాత అలంపూర్‌తో పాటు పాలమూరులోని కల్వకుర్తి తదితర సెగ్మెంట్లలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి. బుజ్జగింపులు, పార్టీలో ప్రాధాన్యం, పదవుల భర్తీ వంటి చర్యలతో అసంతృప్త నేతలకు చెక్ పెట్టే వ్యూహాన్ని పార్టీ పెద్దలు అమలు చేశారు. కొంతకాలం నిశ్శబ్దంగానే ఉన్నప్పటికీ.. అలంపూర్‌లో మళ్లీ అసమ్మతి రాజుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని ఎన్నికల క్యాంపెయిన్ ఇన్చార్జిగా నియమిస్తూ బీఆర్ఎస్ అధిష్టానం గురువారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. ఆ మరునాడే ఆయన వర్గీయులుగా ముద్రపడిన నేతలు అబ్రహం అభ్యర్థిత్వాన్ని మార్చాలంటూ హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
TS Election 2023: ఢిల్లీకి చేరిన ప్యానల్ జాబితా..!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌పై ఆకస్మికంగా వేటు పడింది. దీంతో తక్షణ కొత్త కొత్వాల్ నియామకం అనివార్యంగా మారింది. ముగ్గురు అధికారుల పేర్లతో కూడిన ప్యానల్ లిస్ట్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఈసీకి పంపారు. ఈ ముగ్గురిలో ఒకరిని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఎంపిక చేస్తుందా? లేక మరికొన్ని పేర్లు పంపాల్సిందిగా కోరుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా.. నేటి సాయంత్రానికి కొత్త కొత్వాల్ పేరు ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) హోదాలో ఉన్న సీవీ ఆనంద్ 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. సీనియారిటీ ప్రకారం ఆయన తర్వాత స్థానాల్లో జితేందర్ (1992 బ్యాచ్), సందీప్ శాండిల్య (1993 బ్యాచ్), విజయ్ ప్రభాకర్ ఆప్టే (1994 బ్యాచ్) ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆప్టే కేంద్ర సర్వీసుల్లో ఉండటంతో అదే బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి పేరును ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జితేందర్, సందీప్ శాండిల్య, శ్రీనివాస్‌రెడ్డి పేర్లతో రూపొందించిన ప్యానల్ లిస్టును కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. గతంలోనూ ఐదు సందర్బాల్లో.. హైదరాబాద్ పోలీసు కమిషనర్ పోస్టు అదనపు డీజీ క్యాడర్ అధికారికి సంబంధించింది. ఆనంద్ 2021 డిసెంబర్ 25 నుంచి నగర పోలీసు కమిషనర్‌గా పని చేశారు. ఆయనకు ఈ ఏడాది ఆగస్టు 8న డీజీపీగా పదోన్నతి వచ్చినప్పటికీ ఎక్స్ క్యాడర్ పోస్టు సృష్టించిన ప్రభుత్వం హైదరాబాద్ కొత్వాల్‌గా కొనసాగించింది. గతంలోనూ ఐదు సందర్భాల్లో డీజీపీగా పదోన్నతి పొందిన అధికారులు హైదరాబాద్ సీపీగా పని చేశారు. ఈ హోదాలో ఉన్న వారిని నగర కొత్వాల్‌గా నియమించిన దాఖలాలు లేవు. కేవలం ఈ పోస్టులో పని చేస్తూ, పదోన్నతి పొంది, ఎక్స్ క్యాడర్ పోస్టులో కొనసాగిన వారే ఉన్నారు. తెరపైకి కొత్త పేర్లు? ఆనంద్‌తో పాటు పదోన్నతి పొందిన వారిలో జితేందర్ కూడా ఉన్నారు. ఈయన గతంలో నగర ట్రాఫిక్ చీఫ్‌గా, పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా, అదనపు డీజీపీగా (శాంతిభద్రతలు) పని చేసి ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన పేరును కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంటుందా? లేక అదనపు డీజీ హోదాలో ఉన్న మరో అధికారి పేరును పంపాల్సిందిగా కోరుతుందా? అనే సందేహం నెలకొంది. అలా కోరితే 1994 బ్యాచ్‌కే చెందిన బి.శివధర్‌రెడ్డికి జాబితాలో చోటు దక్కుతుంది. సందీప్ శాండిల్యకు దక్షిణ మండల డీసీపీ, సైబరాబాద్ సీపీ, రైల్వేస్ డీజీగా పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఏడీజీ ఆపరేషన్స్ హోదాలో ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సుదీర్ఘకాలంగా లూప్లైన్లోనే ఉన్నారు. ఎన్నికల సంఘం సీనియారిటీ, గతంలో చేసిన పోస్టులు, సమర్థత ఆధారంగా హైదరాబాద్ సీపీని ఎంపిక చేయాలని భావిస్తే కొత్తగా మరికొన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
యువతకు ఇందులో అవకాశాలున్నాయి! : సెలబ్రిటీ డిజైనర్ 'షబ్నమ్ గుప్తా'
సాక్షి, హైదరాబాద్: యువతలకు ఇంటీరియర్ డిజైనింగ్‌లో అద్భుతమైన అపారమైన అవకాశాలు ఉన్నాయని, సృజనకు పదును పెట్టుకుంటే విజయాలు సుసాధ్యమని సెలబ్రిటీ డిజైనర్ షబ్నమ్ గుప్తా అన్నారు. నగరంలోని ఫిలిమ్నగర్లో ఏర్పాటు చేసిన కోషా ఇంటీరియర్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను ఆమె గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన పీకాక్ లైఫ్ బ్రాండ్‌ను నగరానికి పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉందన్నారు. తన ఇంట్లో వేసిన కలర్స్ నచ్చక సొంతంగా రంగులు వేయడం అనే అభిరుచి నుంచి ప్రస్తుతం బాలీవుడ్ స్టార్స్ పరిణితి చోప్రా, ఇర్ఫాన్ ఖాన్, కంగనారనౌత్ తదితరుల ఇళ్లకు డిజైన్ చేసే దాకా సాగిన తన 3 దశాబ్దాల ప్రయాణాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. శతాబ్దాల నాటి ఇంటీరియర్ వస్తువులకు కొత్త సొబగులు అద్దుతూ కోషాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలోని ఉత్పత్తుల విశేషాలను సంస్థ సీఈఓ అజితా యోగేష్ వివరించారు. కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు పేజ్ త్రీ సోషలైట్స్, డిజైనింగ్ రంగ ప్రముఖులు.. హాజరయ్యారు. -
ఎన్నికల నిర్వాహణ ఏర్పాట్లలో అధికారులకు క్షణం తీరిక దొరకడం లేదు..!
సూర్యాపేట: అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. కలెక్టరేట్లోని దాదాపు అన్ని శాఖల జిల్లా అధికారులకు, సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు. రోజూ కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చలు జరపడం, సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా మారారు. కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఎన్నికలకు సంబంధించి సమీక్షలు, సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు కమిటీలు.. జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కలెక్టర్ ఎస్. వెంకట్రావు 17 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలకు జిల్లా అధికారులను నోడల్ అధికారులుగా విధులు కేటాయించారు. ఇందులో మోడల్ కోడ్ అమలు, ఈవీఎం, వీవీ ప్యాట్ల పర్యవేక్షణ, ఉద్యోగులకు విధుల కేటాయింపు, అభ్యర్థి తరఫున ఏజెంట్లకు లైసెన్స్ ఇవ్వడానికి, పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతుల కల్పన, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఓటరు నమోదుపై అవగాహన, ఎన్నికల వ్యయ నిర్ధారణ, మీడియా కమ్యూనికేషన్, పోస్టల్ బ్యాలెట్– ఈవీఎం బ్యాలెట్ కమిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, గెస్ట్ హౌస్‌ల ఏర్పాటు, మైక్రో అబ్జర్వర్, హెల్ప్‌లైన్ అండ్ కంట్రోల్ యూనిట్, ఎంసీఎంసీఏ, పోలీస్ కోఆర్డినేషన్, హెలిపాడ్ కోఆర్డినేషన్ వంటి వాటికి వివిధ శాఖల అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఇటు శాఖా పరమైన విధులు.. అటు ఎన్నికల పనులు కలెక్టరేట్లో ఎన్నికల విభాగం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారికి సహాయకులుగా మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఎన్నికల సూపరింటెండెంట్, డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు కాగా మరో నలుగురు కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. వీరంతా నెల రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వీరే కాకుండా ఆయా శాఖల అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా మారారు. జిల్లా స్థాయి అధికారులైతే ఇటు తమ శాఖకు సంబంధించిన పనులు చేస్తూ అటు ఎన్నికల ఏర్పాట్లపై తమకు కేటాయించిన మండలాలు, గ్రామాలకు వెళ్లి క్షేత్ర పర్యటన చేస్తున్నారు. అక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సదుపాయాలు, ఇంకా కావాల్సిన అవసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను ఇప్పటికే కేటాయించారు. తుంగతుర్తి నియోజకవర్గానికి జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, హుజూర్నగర్ నియోజకవర్గానికి జగదీశ్వర్‌రెడ్డి, సూర్యాపేట నియోజకవర్గానికి సూర్యాపేట ఆర్డీఓ వీరబ్రహ్మచారి, కోదాడ నియోజకవర్గానికి కోదాడ ఆర్డీఓ సూర్యానారాయణలను రిటర్నింగ్ అధికారులుగా నియమించారు. అదే విధంగా నియోజకవర్గాల పరిధిలోని తహసీల్దార్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దగ్గర నుంచి పోలింగ్, కౌంటింగ్ వరకు అన్ని బాధ్యతలను వీరు నిర్వర్తించనున్నారు. అదే విధంగా అభ్యర్థుల వ్యయ నిర్ధారణ, ఫిర్యాదులు, చర్యలు వంటివి రిటర్నింగ్ అధికారులు చూసుకుంటారు. పోలింగ్ నిర్వహణకు సుమారు 12 వేల మంది పోలింగ్ నిర్వహణకు సిబ్బందిని కేటాయించే పనిలో జిల్లా అధికారులు ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు, ఇతర శాఖల ఉద్యోగులను పోలింగ్ నిర్వహణకు వినియోగించుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సరిపడక పోతే ప్రైవేట్ ఉపాధ్యాయులను విధులకు వాడనున్నారు. జిల్లాలో 1,201 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పోలింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ పోలింగ్ అధికారి, ఇద్దరు, లేదా ముగ్గురు పోలింగ్ సిబ్బందిని కేటాయించనున్నారు. దీని ప్రకారం 1,201 మంది పోలింగ్ అధికారులు, 1,201 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు , ఇద్దరు సిబ్బందిని వాడితే 2,402 మంది, లేదా ముగ్గురిని కేటాయిస్తే 3,603 మంది ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయించనున్నారు. -
ఓటరుగా నమోదు అవడానికి ఈనెల 31 వరకు అవకాశం.. సద్వినియోగం చేసుకోండి..
సూర్యపేట్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో కేంద్ర ఎన్నికల సంఘం అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు మరో అవకాశం కల్పించింది. ఓటరు నమోదుకు గత నెల 19వ తేదీ వరకు గడువు ఉండగా, ఈ నెల 4వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల చేశారు. ఇంకా ఓటరుగా నమోదు చేసుకోని వారెవరైనా ఉంటారనే ఆలోచనతో ఈ నెల 31వ తేదీ వరకు కొత్తగా ఓటరు నమోదుకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారే కాకుండా ఇప్పటివరకు ఓటు హక్కు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కోవాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఇలా తెలుసుకోవచ్చు ప్రజలు తమకు ఓటు హక్కు ఉందా లేదా అనే వివరాలను తెలుసుకునేందుకు వివిధ రకాల వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన వెబ్సైట్ www.nvsp.in, voters.eci.gov.inతో పాటు రాష్ట్రానికి సంబంధించి www.ceotelangana.nic.in వెబ్సైట్ చూసుకోవచ్చు. అంతేకాకుండా ఓటరు హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. 1950 నంబర్‌కు ఫోన్ చేసినా ఓటు హక్కు సంబంధించిన సమాచారం ఇస్తారు. కాగా ఓటు లేని వారు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చిరునామా మార్పునకు ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. పూర్తిగా పేరు తొలగింపునకు మాత్రం ఇప్పుడు అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. అవగాహన కల్పిస్తున్నాం అక్టోబర్ 31వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకోవాలని ప్రజలతో పాటు జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్, ఇతర వృత్తివిద్యా కోర్సుల కళాశాలలో అవగాహన కల్పిస్తున్నాం.కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికి ఎలా ఓటు వేయాలని అని వీవీ ప్యాట్లతో అవగాహన కల్పిస్తున్నాం. – భట్టు నాగిరెడ్డి, భువనగిరి జిల్లా నోడల్ అధికారి -
చైతన్య ఖిలా.. భువనగిరి నుంచి గెలిచి మంత్రులయ్యారు ఇలా..!
సూర్యపేట్: నాటి రాచరికం నుంచి నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ వరకు భువనగిరికి ఎంతో విశిష్టత ఉంది. ఆంధ్ర మహాసభ, తొలిదశ తెలంగాణ ఉద్యమం భువనగిరి కేంద్రంగా ప్రారంభమయ్యాయి. కాలానుగుణంగా సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో అనేక మార్పులతో ప్రగతి వైపు పయనిస్తోంది. హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఉన్న భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం మూడోంతులు హెచ్ఎండీఏ పరిధిలో ఉంది. జిల్లాల పునర్విభజనలో జిల్లా కేంద్రంగా మారింది. భువనగిరిలో ఇప్పటి వరకు 17 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీడీఎఫ్ రెండు సార్లు, సీపీఐ ఒకసారి, కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐలు కలిపి ఐదు సార్లు, టీడీపీ ఏడు సార్లు, టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్) రెండుసార్లు విజయం సాధించాయి. భువనగిరి నేతలు జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పారు. నియోజకవర్గం భౌగోళిక చరిత్ర.. భువనగిరి నియోజకవర్గంలో భూదాన్‌పోచంపల్లి, భువనగిరి, బీబీనగర్, వలిగొండతో పాటు కొత్తగా ఏర్పాటవుతున్న మత్య్సాద్రి వేములకొండ అర్రూరు మండలం ఉన్నాయి. నియోజకవర్గంలో ప్రస్తుతం 257 పోలింగ్ కేంద్రాల్లో 2,11,362 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,05,404 మంది పురుషులు, 1,05,968 మంది మహిళా ఓటర్లు ప్రస్తుతం ఉన్నారు. ఈ నియోజకవర్గం సెమీ అర్బన్‌గా ఉంది. హెచ్ఎండీఏ పరిధిలో భువనగిరి పట్టణం, మండలం, బీబీనగర్, పోచంపల్లి మండలాలు చేరాయి. నియోకవర్గంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. అన్ని మండలాలకు మూసీ జలాలు అందుతాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి టై అండ్ డై చీరల తయారీ, భువనగిరి, బీబీనగర్‌లో పారిశ్రామిక వాడల ఏర్పాటుతో ఎందరికో ఉపాధి కలుగుతోంది. ప్రఖ్యాతి గాంచిన పోచంపల్లి పట్టు చీరలు పుట్టింది ఇక్కడే. ఆచార్య వినోభాబావే భూదా నోద్యమం ప్రారంభించింది పోచంపల్లిలోనే. ఈ నియోజకవర్గం మీదుగా హైదరాబాద్– భూపాలపట్నం జాతీయ రహదారి 163 ఉంది. సంగారెడ్డి– భువనగిరి– చౌటుప్పల్ మీదుగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కాబోతుంది. దాని వెంట రీజినల్ రైల్ లైన్ మంజూరైంది. ఓఆర్ఆర్ నుంచి కొత్తగూడెం వరకు నూతన జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్– కాజీపేట, బీబీనగర్– నడికుడి రైలు మార్గాలున్నాయి. బీబీనగర్‌లో ఎయిమ్స్ వైద్య సేవలు అందిస్తోంది. సీసీఎంబీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు మంజూరు కానున్నాయి. పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ‘రావి’ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా పోరుబాట నడిపారు రావి నారాయణరెడ్డి. 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, నల్లగొండ ఎంపీగా పోటీ చేసిన రావినారాయణరెడ్డి రెండు చోట్లా విజయం సాధించారు. ఎంపీగా అప్పటి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో పార్లమెంట్ భవనాన్ని రావి నారాయణరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం భువనగిరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. భువనగిరి నుంచి గెలిచి మంత్రులయ్యారు.. భువనగిరి నియోజవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన ముగ్గురు మంత్రులయ్యారు. వారిలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి వరుసగా నాలుగుసార్లు గెలుపొంది ఎన్టీఆర్ ప్రభుత్వంలో హోంమంత్రి, ఆరోగ్యశాఖా మంత్రిగా.. చంద్రబాబు మంత్రివర్గంలో హోంమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన సతీమణి ఉమామాధవరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు మంత్రివర్గంలో భుగర్భ వనరుల శాఖ మంత్రి అయ్యారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇక్కడి నుంచి గెలిచి కాసు బ్రహ్మానందరెడ్డి, దామోదరం సంజీవయ్య మంత్రి వర్గాల్లో పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన తొలిదశ ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. -
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. లైసెన్స్డ్ తుపాకులు రద్దు!
యాదాద్రి: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లైసెన్స్డ్ తుపాకులు (గన్స్) పొందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారస్తులు, ప్రముఖుల నుంచి పోలీస్ శాఖ ఆయుధాలను వెనక్కి తీసుకుంటోంది. ఈ మేరకు వారందరికి నోటీసులు జారీచేసింది. నోటీసు అందిన వారం రోజుల్లోగా తమ వద్ద ఉన్న తుపాకులను సంబంధిత పోలీస్ స్టేషన్లలో అందజేయాలని స్పష్టం చేసింది. దీంతో లైసెన్స్డ్ తుపాకీలు కలిగిన వారంతా పోలీసు స్టేషన్ల బాటపట్టారు. ఉమ్మడి జిల్లాలో 455 మంది లైసెన్స్ తుపాకులు తీసుకున్న వారు ఉన్నారు. అందులో అత్యధికంగా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులే. ఆ తరువాత బడా వ్యాపారులు ఉన్నారు. ఒక్క నల్లగొండ జిల్లాలో 227 మందికి లైసెన్స్డ్ గన్స్ ఉండగా, వారిలో దాదాపుగా ఇప్పటికే పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేశారు. సూర్యాపేట జిల్లాలో 154 మందికి లైసెన్స్డ్ గన్స్ ఉండగా, 110 మంది ఇప్పటికే తిరిగి అప్పగించారు. యాదాద్రి జిల్లాలో 74 మందికి లైసెన్స్డ్ గన్స్ ఉండగా, వారిలో కొంతమంది తిరిగి అప్పగించారు. మిగతా వారు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అలాంటి వారిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఇతర నాయకులు ఉన్నారు. తగ్గిన లైసెన్స్డ్ గన్లు నల్లగొండ జిల్లాలో గన్ కల్చర్ కొంత మేర తగ్గింది. గతంలో భారీ సంఖ్యలో వ్యక్తిగత తుపాకులు కలి గిన వారు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రాణ భయంతో వ్యక్తిగత భద్రత కోసం గన్ లైసెన్స్‌లను ఎక్కువ మంది తీసుకున్నారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1500 వరకు వ్యక్తిగత ఆయుధాలను సమకూర్చుకోగా, ఇప్పుడు వారి సంఖ్య 455కు తగ్గిపోయింది. గత ఎన్నికల సమయంతో పోల్చితే సూర్యాపేట, యాదాద్రి జిల్లాలు మినహా నల్లగొండలో ఈ ఐదేళ్లలో గన్ లైసెన్స్ తీసుకున్నవారి సంఖ్య తగ్గింది. 2018 ఎన్నికల సమయంలో నల్లగొండలో 257 మంది లైసెన్స్డ్ గన్స్ కలిగిన వారు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 227కు తగ్గింది. దుర్వినియోగం చేయవద్దనే.. ఎన్నికల సమయంలో, సభలు, సమావేశాలు నిర్వహించినప్పుడు, ప్రతిపక్ష పార్టీలు తారసపడినప్పుడు వాటిని దుర్వినియోగం చేసే అవకాశాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం ఈ నిబంధన తీసుకువచ్చింది. అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఎవరూ వ్యక్తిగతంగా భయబ్రాంతులకు గురిచేయకుండా ఉండేందుకు తమ వద్ద ఉన్న గన్లను పోలీసు స్టేషన్లలో అప్పగించేలా నిబంధన విధించింది. వీటికి మినహాయింపు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కోడ్ అమల్లో ఉన్న సమయంలో గన్స్ పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేయడంలో కొన్ని విభాగాలను మినహాయించారు. ముఖ్యంగా బ్యాంకుల సెక్యూరిటీ, టోల్ ప్లాజాలు, క్రీడలకు సంబంధించిన ఈవెంట్స్‌లో ఉన్న వాటిని డిపాజిట్ చేయడం నుంచి మినహాయించారు. -
అలాగైతే మాకేంటి.. అసంతృప్తుల సూటి ప్రశ్నలు..?
యాదాద్రి: ప్రధాన రాజకీయ పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో అక్కడక్కడా అసంతృప్తి స్వరం వినిపిస్తుండగా.. దానికి చెక్ పెట్టేందుకు ఆయా పార్టీల నాయకత్వాలు ప్రయత్నిస్తున్నాయి. తమకు ప్రాధాన్యం దక్కడం లేదని కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ పార్టీలోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ద్వితీయ శ్రేణి నాయకులతో ఎమ్మెల్యే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని ఓ రిసార్ట్‌లో ఆలేరు బీఆర్ఎస్ నాయకులు సమావేశమయ్యారు. అదేవిధంగా భువనగిరి కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోంది. బుధవారం బీబీనగర్, భువనగిరి శివారులో ఆ పార్టీ నేతలు, ఆశావహులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందరూ హాజరు కాకపోవడంతో గురువారం మళ్లీ ఉప్పల్ శివారులోని ఓ హోటల్లో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. తమకు చేకూరే లబ్ధిపై హామీ ఇవ్వాలని ప్రస్తావన.. ఉప్పల్ సమీపంలోని ఓ హోటల్లో గురువారం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి సమన్వయ కర్తగా భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఆశావహుల సమావేశం జరిగింది. టికెట్ ఆశిస్తున్న కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో సహా జిట్టా బాలకృష్ణారెడ్డి, తంగెళ్లపల్లి రవికుమార్, పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్, పంజాల రామాంజనేయులుగౌడ్, పోత్నక్ ప్రమోద్‌కుమార్, బర్రె జహంగీర్ మరికొందరు ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశంలో ముందుగా ఆశావహులు కొందరు తీవ్ర వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ స్కీంలను ప్రజల్లోకి తీసుకుపోకుండా గ్రూపులుగా విడిపోయి అడ్డుకుంటే ఎన్నికల్లో జరిగే నష్టంపై చర్చించారు. అధిష్టానం టికెట్ ప్రకటించే వరకు ఎవరూ తానే అభ్యర్థినని ప్రకటించుకోవద్దని నిర్ణయించారు. శుక్రవారం పోచంపల్లిలో జరిగే కాంగ్రెస్ సమావేశానికి ఆశావహులందరూ హాజరవుతామని అంగీకారానికి వచ్చారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఏవిధమైన లబ్ధిచేకూరుతుందో ముందుగానే హామీ ఇవ్వాలని పలువురు సమావేశంలో ప్రస్తావించారు. జిల్లాకు చెందిన సీనియర్ నేతలు జానారెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను త్వరలో కలవాలని నిర్ణయించారు. జానారెడ్డిని కలిపించే బాధ్యతలను కసిరెడ్డి తీసుకున్నారు. మాకేంటి.. అసంతృప్తుల సూటి ప్రశ్న..? కొండమడుగులో బీఆర్ఎస్ సమావేశం ఆలేరు నియోజకవర్గంలోని కొందరు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని ఓ రిసార్టులో ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాఽధించే క్రమంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆమె ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. పార్టీలో ఉండి అసమ్మతి పేరుతో నష్టం చేసేవారు పద్ధతి మార్చుకోవాలని లేదంటే తప్పుకోవాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. కొత్త, పాత నాయకులంటూ తేడాలు లేకుండా విభేదాలు పక్కన పెట్టి పార్టీ విజయం కోసం పనిచేయాలని సూచించారు. వంద మంది ఓటర్ల బాధ్యత ఒక్కరు తీసుకుని పక్కాగా పనిచేయాలని నిర్ణయించారు. రానున్న 40 రోజులు అత్యంత ముఖ్యమైన సమయం కనుక ఎవరూ ఊరు విడిచి వెళ్లొద్దని సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులకు సూచించారు. కొందరు పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా చర్చిస్తున్నారని అలాంటి వారిని గుర్తించి సరిచేయాలని ఆదేశించారు. ఆలేరు కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అసంతృప్తి.. ఆలేరు నియోజకవర్గంలో సైతం అసంతృప్తులు కొనసాగుతున్నాయి. పీసీసీ కార్యదర్శి బీర్ల అయిలయ్య నియోజవకర్గంలో తనకు టికెట్ వస్తుందన్న ధీమాతో విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే మిగతా నేతలు ఎవరూ ఆయనతో కలిసి రావడంలేదు. టికెట్ ఆశిస్తున్న నేతలు ఎవరికి వారే టికెట్ల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నగేష్ ఢిల్లీలో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి ఇప్పటికే ఢిల్లీ వెళ్లి వచ్చారు. అయితే కొందరు నేతలను బుజ్జగించేందుకు అయిలయ్య ప్రయత్నిస్తున్నా సఫలం కావడం లేదని సమాచారం. -
అక్కడ పాలి'ట్రిక్స్' అంతా కూడాను పాలమూరు చూట్టే..!
నారాయణ్‌పేట్: రాజకీయ సమీకరణలకు కేరాఫ్‌గా నిలిచే పాలమూరుపైనే ప్రధాన రాజకీయ పార్టీలు కన్నేశాయి. ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ మరింత క్రియాశీలకంగా రంగంలోకి దిగుతున్నాయి. దక్షిణ తెలంగాణలో పాగా వేయాలంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లానే కీలకమని భావించిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఇందుకనుగుణంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. పీఆర్ఎల్ఐఎస్తో షురూ.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు బీఆర్ఎస్ ఏడు, కాంగ్రెస్ ఐదు, టీడీపీ రెండు స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిణామాల క్రమంలో నారాయణపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి గెలిచిన రాజేందర్‌రెడ్డి, మక్తల్‌లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి కారెక్కారు. అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో 13 స్థానాలను బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నుంచి ఒకే ఒక్కడు బీరం హర్షవర్ధన్‌రెడ్డి గెలుపొందినా.. ఆయన సైతం గులాబీ చెంతన చేరారు. ఈ గణాంకాలు బీఆర్ఎస్ ఆధిక్యతకు నిదర్శనంగా నిలుస్తుండగా.. ఆధిక్యాన్ని నిలుపుకునేందుకు ఆ పార్టీ పాలమూరునే ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి పాలమూరుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొల్లాపూర్‌లో మొదటి పంప్‌ను ప్రారంభించిన ఆయన.. పరోక్షంగా ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. కమలదళం సైతం.. ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత పాలమూరులోని జోగుళాంబ సాక్షిగా బీజేపీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. పలు నియోజకవర్గాల గుండా సాగిన యాత్ర ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అప్పటి నుంచి బీజేపీ ముఖ్యనేతలు క్రమం తప్పకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పర్యటించారు. మరోవైపు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరులో భారీ బహిరంగసభను నిర్వహించడం ద్వారా అసెంబ్లీ ఎన్నికల శంఖరావాన్ని పూరించారు. ఇప్పటి వరకు ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయనప్పటికీ.. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి నిత్యం వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. మొత్తానికి ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలలు ప్రత్యేక దృష్టి సారించడం వెనుక బృహత్తర ప్రణాళిక ఉందని.. దక్షిణ తెలంగాణలో పాగా వేసేలా ముందుకు సాగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ బస్సు యాత్ర కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే పాలమూరులో భారత్ జోడో యాత్ర నిర్వహించారు. వివిధ నియోజకవర్గాల గుండా సాగిన పాదయాత్రతో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. అదేవిధంగా సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పాలమూరు గుండానే కొనసాగింది. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, భట్టి తదితర ముఖ్యనేతలు ఉమ్మడి జిల్లాపైనే నజర్ వేసి పలు పర్యాయాలు పర్యటించారు. తాజాగా వారంలో అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే తదితర స్టార్ క్యాంపెయినర్లతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు సన్నద్ధమవుతున్న హస్తం నేతలు జోగుళాంబ అమ్మవారి సాక్షిగా అలంపూర్ నుంచి కొనసాగించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. -
కోట్లు పెట్టి భవనాలు, లక్షలు పోసి పరికరాలు.. కాని ఏం లాభం..!
నారాయణ్‌పేట్: ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న’ చందంగా తయారైంది మద్దూరు 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ) పరిస్థితి. రూ.కోట్లు వెచ్చించి ఆస్పత్రి భవనం, రూ.లక్షలు వెచ్చించి అధునాతన యంత్రాలు, సౌకర్యాలు కల్పించినా చివరికి వైద్యులు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది జూన్ 16న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు 30 సీహెచ్‌సీని ప్రారంభించారు. అప్పటి నుంచి వైద్యారోగ్యశాఖ అధికారులు ఈ భవనాన్ని వైద్యవిధాన పరిషత్‌కు అప్పగించారు. దీంతో జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రి కిందకు ఈ సీహెచ్‌సీ వెళ్లింది. జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక డాక్టర్‌తో పాటు పీహెచ్‌సీలోని స్టాఫ్ నర్స్‌లతో ఇక్కడ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ఉదయం సయమంలో పీహెచ్సీలో పనిచేస్తున్న ఓ డాక్టర్ ఓపీ చూస్తున్నారు. అత్యవసర సమయంలో వైద్యం కావాలంటే గతంలో మాదిరిగానే జిల్లా కేంద్రానికి లేదా మహబూబ్‌నగర్‌కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎనిమిది మంది డాక్టర్లకు ఒక్కరే..? సీహెచ్‌సీ అసుపత్రిలో గైనిక్ సేవలు, జనరల్ సర్జన్, చిన్నపిల్లలకు వైద్య నిపుణుడు, మత్తు వైద్యుడు, దంత, అత్యవసర సేవలకు ఇలా మొత్తం ఎనిమిది మంది డాక్టర్లు, ఒక సూపరింన్డెంట్, ఇద్దరు ఫార్మసిస్టులు, ఒక అయూష్ మెడికల్ అధికారి, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ, అఫ్తాలమిక్ అసిస్టెంట్, డెంటల్ అసిస్టెంట్, ఓటి టెక్నీషియన్ 10 మంది నర్సులు, ఇతర సిబ్బందితో పాటు మరో 20 మంది పనిచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నారు. పీహెచ్సీలో, జిల్లా అసుపత్రిలో పనిచేసే స్టాఫ్‌నర్స్‌లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలాఉండగా, ఈ సీహెచ్‌సీకి ఎలాంటి పోస్టులు ఇంకా మంజూరు కాకపోవడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అసుపత్రిలో పనిచేస్తున్న వారిని ఇక్కడి పంపించినట్లు అధికారులు తెలిపారు. అన్నీ ఉన్నా.. రూ.3.67 కోట్లతో సీహెచ్‌సీ భవన నిర్మాణం చేపట్టారు. ఈ ఆస్పత్రిలో అప్పటి కలెక్టర్ హరిచందన చొరవతో 2022 డిసెంబర్ 27న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(యూఎస్ఏ) సంస్థ సహకారంతో రూ. 10లక్షల వ్యయంతో 10 బెడ్లకడ్లాక్సిజన్ అందించేందుకు వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఈసీజీ, స్కానింగ్, తదితర వైద్య పరీక్షల సామగ్రి కూడా అందుబాటులో ఉంది. అన్నీ ఉన్నా డాక్టర్లే లేకపోవడం గమనార్హం. వైద్యం అందింటే నా భార్య బతికేది.. నెలలు నిండిన నా భార్య కాన్పు కోసం మద్దూరు సీహెచ్‌సీకి వచ్చింది. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన నర్సులు కాన్పు చేస్తామన్నారు. తీరా డెలవరీ సమయంలో రక్తస్రావాన్ని అరికట్ట లేకపోవడంతో నా భార్య, బిడ్డ ఇద్దరూ చనిపోయారు. ఒకవేళ డాక్టర్లు అందుబాటులో ఉండి ఉండే నా భార్య, పాప చనిపోయి ఉండేవారు కాదు. – కృష్ణ, తిమ్మారెడ్డిపల్లి, మద్దూరు, మండలం పోస్టులు మంజూరు కాలే.. వైద్యవిధాన పరిషత్ నుంచి మద్దూరు, కోస్గి ఆస్పత్రులకు పోస్టులు మంజూరు కాలేదు. జిల్లా ఆస్పపత్రి నుంచి ఒక డాక్టర్‌ను డిప్యూటేషన్‌పై ఓపీ చూడడానికి అక్కడికి పంపిస్తున్నాం. జిల్లా ఆస్పత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు వెళ్లిపోయారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పోస్టులు మంజూరు అవ్వొచ్చు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. – రంజిత్‌కుమార్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, నారాయణపేట అత్యవసర వైద్యం అందక.. గతేడాది ఆగస్టు 5న మండలంలోని తిమ్మారెడ్డిపల్లి చెందిన నిండు గర్భిణి కృష్ణవేణి(26) పురుటినొప్పులు రావడంతో ఇదే సీహెచ్‌సీ రాగా... వైద్యులు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్ నర్స్‌లు కాన్పు చేసేందుకు యత్నించారు. శిశువు పురిటిలోనే మృతి చెందగా.. శిశువు మృతదేహాన్ని బయటకు తీసే క్రమంలో తీవ్ర రక్తస్రావం కావడంతో గర్భిణిని హుటాహుటీనా 108లో జిల్లా అసుపత్రికి తరలించారు. అప్పటికే తీవ్ర రక్త స్రావం కావడంతో ఆమె సైతం మృతి చెందింది. ఒకవేళా అందుబాటులో వైద్యులు ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని మృతురాలి భర్త కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సీహెచ్‌సీ.. మద్దూరు, దామరగిద్ద, దౌల్తాబాద్, మండలాల నుంచి దాదాపు 80 గ్రామాల ప్రజలకు అనుకూలంగా ఉంటుంది. -
బంగారుమయం అయ్యింది "తెలంగాణ" కాదు "కేసీఆర్ కుటుంబం".. కేంద్ర సహయ మంత్రి..!
నారాయణ్‌పేట్: రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం నడుస్తోందని, బంగారు తెలంగాణ కాలేదు కానీ.. సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారుమయం అయిందని కేంద్ర సహాయ మంత్రి భగవత్కూబ అన్నారు. గురువారం జడ్చర్లలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లాకేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల డబ్బులు దారిమళ్లిస్తూ.. మైనార్టీ ఓట్ల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్కరికి కూడా దళితబంధు చేరలేదని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల రాజనీతి ఒకటేనని.. రాష్ట్ర అభివృద్ధి వారికి ఏమాత్రం పట్టదన్నారు. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో ఆదరణ కోల్పోయిందని, ఇప్పుడు మరోసారి ఉచితాల పేరుతో ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని, నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ వంటి హామీలు గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. అధికారమే లక్ష్యంగా ఐదు గ్యారంటీ పథకాల పేరుతో కాంగ్రెస్ కర్ణాటకలో అధికారంలోకి వచ్చిందని, ఐదు నెలలు గడుస్తున్నా.. ఒక్కటీ అమలు చేయలేదన్నారు. అదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ మంత్రుల్లో అత్యంత అవినీతిపరుడు ఎవరైనా ఉన్నారా అంటే పాలమూరు మంత్రి పేరు వినిపిస్తుందన్నారు. వారి సమాధులపై బీఆర్ఎస్ పాలన ప్రత్యేక రాష్ట్రం కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వారి సమాధులపై కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు పరిపాలన చేస్తున్నారని కేంద్ర మంత్రి విమర్శించారు. బంగారు తెలంగాణ చేస్తానని అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. మూడున్నరకోట్ల ప్రజల కోసం రూ.7లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని, దీంతో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. తమ పార్టీ అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించినప్పటికీ కమలం పువ్వు వలే వికసిస్తారన్నారు. 60 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి రావటం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలతో హంగ్ వస్తుందని సామాజిక మాద్యమాల్లో ప్రచారాలను విశ్వసించరాదన్నారు. ఆయా కార్యక్రమంలో కార్యక్రమాల్లో జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్, జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, పద్మజారెడ్డి, ఎగ్గని నర్సింహులు, పవన్‌కుమార్‌రెడ్డి, మధుసూదన్‌యాదవ్, కృష్ణయ్య, సీతారాం జవహర్, కుమ్మరి రాజు, సామల నాగరాజు పాల్గొన్నారు. -
అత్తగారిఇంటిలో 'అత్త'ను చంపిన అల్లుడి..!
మంచిర్యాల: గ్రేటర్ వరంగల్ పరిధిలోని రెండవ డివిజన్ గుండ్లసింగారంలో గురువారం జరిగిన కాల్పుల ఘటన మంచిర్యాల జిల్లాలోనూ కలకలం రేపింది. అప్పుగా ఇచ్చిన డబ్బు ఇవ్వలేదని ఓ కానిస్టేబుల్ పోలీసు సర్వీస్ రివాల్వర్‌తో అత్తపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. వరంగల్ నగరంలోని కీర్తినగర్‌కు చెందిన అడ్డె ప్రసాద్‌కు గుండ్లసింగారానికి చెందిన రమాదేవితో 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రసాద్‌తోపాటు అత్త కుటుంబసభ్యులు గుండ్లసింగారంలో వేర్వేరు ఇళ్లలో అద్దెకు ఉంటున్నారు. ప్రసాద్ మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలం క్రితం ప్రసాద్ తన అత్త కమలాదేవి(58)కు రూ.4లక్షల అప్పుగా ఇవ్వగా తిరిగి ఆమె ఇవ్వలేదు. దీంతోపాటు అతని కాపురంలోనూ విభేదాలు వచ్చాయి. వారిపై కోపం పెంచుకున్న ప్రసాద్ అత్తతోపాటు భార్య, బావమరిదిని టార్గెట్ చేశాడు. అత్తను చంపిన తర్వాత ఇంట్లోనే ఉన్న బావమరిదిని.. అనంతరం తన ఇంటికి వెళ్లి భార్యను తుదముట్టించాలని భావించాడు. బుధవారం కోటపల్లి పోలీస్‌స్టేషన్‌లో స్టేషన్‌హౌజ్ ఆఫీసర్ తన రివాల్వర్ని క్లీన్‌చేసి భద్రపర్చమని ప్రసాద్‌కు చెప్పాడు. కానీ ప్రసాద్ ఆ రివాల్వర్‌ను భద్రపరిచి ఆ తరువాత ఎవరికీ తెలియకుండా తీసుకున్నాడు. అనంతరం గుండ్లసింగారం వచ్చాడు. గురువారం ఉదయం స్టేషన్‌కు వచ్చిన స్టేషన్‌హౌస్ ఆఫీసర్ రివాల్వర్ తీసుకునేందుకు వెళ్లగా కనిపించలేదు. దీంతో స్టేషన్‌లోని సీసీ ఫుటేజీని పరిశీలించి రివాల్వర్‌ను ప్రసాద్ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. అతడికి పోలీసులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని సమాచారం. కోటపల్లి నుంచి గురువారం ఉదయం గుండ్లసింగారం చేరుకున్న ప్రసాద్ నేరుగా అత్త కమలాదేవి ఇంటికి వెళ్లి ఆమెను కాల్చాడు. అప్పటికే స్థానికులు గుమిగూడడం, కుటుంబ సభ్యులు రావడం.. అతనిపై దాడి చేయడంతో ముందుగా అనుకున్న ప్లాన్ వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. తూటా శబ్దంతో కలకలం కమలాదేవిపై రివాల్వర్‌తో ఒక రౌండ్ కాల్పులు జరపడంతో ఆమె ఇంటి గేటు నుంచి రోడ్డుమీదికి రక్తమోడుతూ వచ్చి కింద పడింది. ఒక్కసారిగా పెద్దశబ్ధం రావడంతో ఇరుగుపొరుగు వారు ఆందోళనకు గురయ్యారు. కొద్దిదూరంలో ఉన్న ప్రసాద్ భార్య రమాదేవితోపాటు ఆమె కూతుళ్లు, సోదరుడు హుటాహుటిన వచ్చి చూసేసరికి తల్లి చనిపోయి కనిపించడంతో బోరున విలపించారు. ఓ వైపు తల్లి మృతదేహం.. మరో వైపు ప్రసాద్ దర్జాగా కుర్చీలో కూర్చొని ఉండడంతో ఆగ్రహానికి గురయ్యారు. అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో అతని తల, శరీరంపై తీవ్రగాయాలై రక్తంతో తడిసిపోయాడు. ఆధారాల సేకరణ.. సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారి, వరంగల్ ఏసీపీ బోనాల కిషన్, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు ఘటనస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై ఇరుగుపొరుగు వారిని, కమలాదేవి కూతురు రమాదేవిని అడిగి తెలుసుకున్నారు. రక్తనమూనాలు సేకరించారు. కాల్చిన బుల్లెట్ షెల్ కోసం దాదాపు గంటరన్నపాటు వెతికినా లభ్యం కాలేదు. కొంతకాలంగా వేర్వేరుగా.. ప్రసాద్, రమాదేవిలు కుటుంబ కలహాలతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. కొద్దిరోజుల క్రితం తనను వేధింపులకు గురి చేస్తున్నాడని రమాదేవి నగరంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ విషయాన్ని ప్రసాద్ అవమానకరకంగా భావించినట్లు చర్చ జరుగుతోంది. దీనంతటికి భార్యతోపాటు అత్త, బావమరిది కారణమని కోపం పెంచుకున్న అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సమగ్ర దర్యాప్తు – ఎంఏ బారి, డీసీపీ హత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారి తెలిపారు. ఈ హత్యకు ఆర్థిక, ఇతరత్రా కారణాలు ఉన్నాయనే అంశంపై విచారణ చేపడతామన్నారు. ప్రస్తుతం నిందితుడి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. మృతురాలి కూతురు రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మిస్సింగ్‌పై విచారణ కోటపల్లి పోలీసుస్టేషన్లో గన్ మిస్సింగ్‌పై రామగుండం కమిషనరేట్ పోలీసులు గురువారం విచారణ చేపట్టారు. మంచిర్యాల డీసీపీ సుధీర్‌రాంనాథ్ కేకన్ స్టేషన్‌కు చేరుకుని సుమారు ఆరు గంటలపాటు విచారణ జరిపారు. నిందితుడు ఉపయోగించింది సర్వీస్ గన్ కావడంతో పోలీసు అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆయుధం అతడి చేతికెలా వచ్చింది..? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ప్రసాద్ షార్ట్ వెపన్ తీసుకెళ్లడంపై సమగ్ర విచారణ చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు. రామగుండం సీపీ రెమా రాజేశ్వరి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించిన డీసీపీ పలువురి వాంగ్మూలం తీసుకున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పదుడే.. ప్రసాద్ వైఖరి మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. గతంలో హోంగార్డుగా పని చేసిన ప్రసాద్ 2012–13 కానిస్టేబుల్ ఉద్యోగం రావడంతో పెద్దపల్లి జిల్లాలో పని చేశాడు. మద్యానికి బానిసై విధుల్లో నిర్లక్ష్యం, ఆర్థిక ఇబ్బందులతో గొడవ పడేవాడని సమాచారం. మూడు నెలల క్రితమే పెద్దపల్లి జిల్లా నుంచి మారుమూల ప్రాంతమైన కోటపల్లి పోలీసుస్టేషన్‌కు బదిలీ అయ్యాడు. విధుల్లో చేరినప్పటి నుంచి ఎక్కువగా విధులకు డుమ్మా కొట్టడం, తోటి సిబ్బందితో అమర్యాదగా వ్యవహరించడంతో సిబ్బంది అతడికి దూరంగా ఉండేవారని తెలిసింది. దొంగతనం కేసు కానిస్టేబుల్ ప్రసాద్‌పై దొంగతనం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్.సురేష్‌కుమార్ తెలిపారు. స్టేషన్‌లోని ఆయుధ కారాగారంలో ఉంచిన పిస్టల్‌ను అపహరించుకుపోయాడని పేర్కొన్నారు. -
ఒక్క రోజులోనే మార్కెట్‌కు 6వేళ క్వింటాళ్ల వరి ధాన్యం
జనగామ: వానాకాలం సీజన్లో ముందస్తు సాగు చేసిన వరి ‘కోతలు’ ముమ్మరంగా సాగుతున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు మార్కెట్ బాట పట్టారు. దీంతో రికార్డు స్థాయిలో వస్తున్న ధాన్యం రాశులతో జనగామ వ్యవసాయ మార్కెట్ నిండి పోతున్నది. గురువారం ఒక్కరోజే ఆరువేల క్వింటాళ్లకు పైగా ధాన్యం కొనుగోలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు రూ.500 తక్కువగా వ్యాపారులు కొనుగోలు చేస్తుండడంతో మరో రూ.200 పెచేలా చూడాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో వానాకాలం సీజన్ 1.72 లక్షల ఎకరా ల్లో వరి సాగు చేశారు. ఏటా ఈ సీజన్లో కత్తెర సాగుతో పాటు రెగ్యులర్ పంట వేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. సెప్టెంబర్ రెండవ వారం వరకు కత్తెర కోతలు పూర్తి కాగా.. ప్రస్తుతం ముంద స్తు నాట్లు వేసిన రైతులు వరి కోతలు ప్రారంభించారు. ధాన్యంతో జనగామ మార్కెట్‌కు ఉదయం వచ్చిన రైతులు, సాయంత్రాని ఇంటికి వెళ్లేలా పాలకమండలి, అధికారులు చర్యలు చేపట్టారు. రోజూ ఉదయం 5 నుంచి 10 గంటల వరకు సరుకును లోనికి అనుమతిస్తూ.. మధ్యాహ్నం రెండు గంటల వరకు మార్కెట్ గేటు మూసి వేస్తున్నారు. ఎంట్రీ చేసిన సరుకుకు ఈ–నామ్లో టోకెన్ కేటాయించి గేట్ ఎంట్రీ వద్ద లాట్ నంబర్ ఇస్తున్నారు. ఉద యం బిడ్డింగ్ మొదలైన తర్వాత ఆలస్యంగా వచ్చిన ధాన్యం వాహనాలను అనుమతించి మరుసటి రోజు కొనుగోలు చేస్తున్నారు. 43 లక్షల క్వింటాళ్ల ధాన్యం వానాకాలం సీజన్లో 43 లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్లో ప్రభుత్వం 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతుండగా.. ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్లో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. 2023–24 సంవత్సరం కేంద్ర ప్రభుత్వం వరి పంటకు కనీస మద్దతు ధర ఏ–గ్రేడ్ రూ.2,203, సాధారణ గ్రేడ్‌కు రూ.2,183 ప్రకటించింది. కత్తెర, ముందస్తు సాగు చేసిన వరి కోతలు మొదలై మార్కెట్లోకి పెద్ద ఎత్తున సరుకు వస్తున్నప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు నేటికి ప్రారంభం కాలేదు. దీంతో మార్కెట్లో ప్రైవేట్ వ్యాపారులు మద్దతు ధరకు సుమారు రూ.500 తక్కువగా కొనుగోలు చేస్తున్నారు. తేమ అధికంగా ఉండడం వల్లే ధర ఇవ్వలేక పోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. 56వేల క్వింటాళ్ల కొనుగోళ్లు ఈ ఏడాది ఆగస్టు 30 నుంచి గురువారం వరకు జనగామ వ్యవసాయ మార్కెట్లో 1,262 మంది రైతుల వద్ద 56,074(85,169 బ్యాగులు) క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. క్వింటాకు ధర గరిష్టంగా రూ.2,079, రూ.1,961, రూ.1,859, కనిష్టంగా రూ.1,911, 1,720, రూ,1,609, రూ.1,405, మోడల్ ప్రైజ్ రూ.1,899, రూ.1,913, రూ.1,779, రూ.1,889 ధర పలికింది. ధర తక్కువగా వచ్చింది పదెకరాల్లో వరి సాగు చేసినం. పెట్టుబడికి రూ.2.50లక్షలు ఖర్చయింది. ముందుగా నాట్లు వేసిన ఆరు ఎకరాల్లో కోతలు పూర్తి చేసినం. 180 బస్తాల దిగుబడి రాగా జనగామ మార్కెట్‌కు వచ్చినం. ప్రభుత్వ మద్దతు ధరకంటే.. తక్కువగా కొనుగోలు చేశారు. సరుకు పచ్చిగా ఉందని క్వింటాకు రూ.1,765 మాత్రమే ధర ఇచ్చారు. విధిలేక అమ్ముకున్నాం. ధర మరో రూ.150 ఎక్కువ వస్తే బాగుండేది. శ్రమకు ఫలితం రావడం లేదు. – బాలోతు కళమ్మ, మహిళా రైతు, పెద్దపహాడ్(ఎర్రకుంటతండా) కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి ఐదెకరాల్లో వరి సాగు చేస్తే రెండు ఎకరాల్లో కోతలు పూర్తయ్యా యి. 90 బస్తాల దిగుబడి రాగా మార్కెట్‌కు తెచ్చిన. క్వింటాకు రూ.1,708 ధర పెట్టిండ్లు. రూ.1,800 ఇవ్వాలని కొట్లాడినా ఫలితంలేదు. ధాన్యానికి సరైన ధర రావాలంటే ప్రభుత్వం వెంట నే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – భూక్యా సరక్రూ, రైతు, మచ్చుపహాడ్, నర్మెట ధర పడిపోకుండా చూస్తున్నాం.. మార్కెట్‌కు వచ్చిన ప్రతి గింజకు మంచి ధర వచ్చేలా చూస్తున్నాం. ఈ–నామ్ పద్ధతిలో విక్రయాలు జరుగుతున్నాయి. ఎక్కువగా పచ్చి సరుకు రావడంతో ధర పడిపోకుండా చూస్తున్నాం. ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా పర్యవేక్షిస్తున్నం. – బాల్దె సిద్ధిలింగం, మార్కెట్ చైర్మన్ -
పైరవీ పోస్టింగ్ లపై వేలాడుతున్న కత్తి..!
జనగామ: ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి.. పైరవీలతో కోరుకున్నచోట పోస్టింగ్‌లు కొట్టిన రెవెన్యూ, పోలీస్ అధికారులపై బదిలీ కత్తి వేలాడుతోంది. వరంగల్, కరీంనగర్, రామగుండం కమిషనరేట్లతోపాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జగిత్యాల జిల్లాల్లో 51మంది పోలీస్ అధికారుల బదిలీల్లో ఎన్నికల నిబంధనలు పాటించలేదని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అత్యధికంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్స్పెక్టర్ నుంచి ఏసీపీల వరకు 21 మంది ఈ తరహా పోస్టింగ్‌లు పొందారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలను నివేదిక ద్వారా అందజేయాలని ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి అవినాష్ కుమార్‌కు, సంబంధిత అధికారులకు లేఖ నం. 434/1/టీఈఎల్/ ఎస్‌ఓయు3/ 2023 ద్వారా రాశారు. వరంగల్ కమిషనర్‌తోపాటు మహబూ బాబాద్, ములుగు ఎస్పీలు బదిలీల్లో నిబంధన ఉల్లంఘన లేదంటూ వివరాలు పంపారు. ఇది జరిగి సుమారు రెండు నెలలు కావస్తుండగా.. తాజాగా బుధవారం వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్, మహబూబాబాద్, భూపాలపల్లి ఎస్పీలు చంద్రమోహన్, పుల్లా కరుణాకర్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసు, రెవెన్యూ అధికారులపైనా త్వరలోనే బదిలీ వేటు పడనుందన్న చర్చ జరుగుతోంది. నిబంధనల ఉల్లంఘనపై ఈసీఐ ఆరా... వరంగల్ సీపీ, భూపాలపల్లి, మహబూబాబాద్ ఎస్పీలపై బదిలీ వేటు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం.. రెవెన్యూ, పోలీసుశాఖల్లో జరిగిన అన్ని బదిలీల్లో నిబంధనల ఉల్లంఘనపై ఆరా తీస్తోంది. ఎన్నికల నేపథ్యంలో పారదర్శకంగా బదిలీలు, పోస్టింగ్‌లు ఇవ్వాలని జూన్‌లోనే కమిషన్ సూచించింది. జిల్లాలు, కమిషనరేట్లలో పోలీస్ అధికారులకు సంబంధించి పలు మార్గదర్శకాలను పంపింది. అందుకు విరుద్ధంగా నాలుగేళ్లలో మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అనేక మంది తిరిగి జిల్లాలోనే పోస్టింగ్‌లు పొందారు. ఈ తరహాలో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌తో పాటు ఉమ్మడి జిల్లాలో 27 మంది పోస్టింగ్‌లు పొందినట్లు ఎన్నికల సంఘానికి లిఖితపూర్వమైన ఫిర్యాదులు అందాయి. రాజకీయ ఒత్తిళ్లు, ఎమ్మెల్యేల సిఫారసుల కారణంగా అడుగడుగునా ఉల్లంఘనలు జరిగాయంటూ వెల్లువెత్తిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణకు మరోసారి గురువారం ఎన్నికల సంఘం ఆదేశించడం పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది. ‘రెవెన్యూ’లోనూ ఇదే తంతు.. మరోవైపు రెవెన్యూలోనూ అదే పరిస్థితి నెలకొంది. హనుమకొండ ఆర్డీఓగా రెండున్నర సంవత్సరాలకు పైగా పని చేసిన వాసుచంద్రను ఎన్నికల సంఘం నిబంధనల పరిధిలోకి వస్తారని మొదట హైదరా బాద్‌కు బదిలీ చేశారు. హనుమకొండ, వరంగల్ జిల్లాలు గ్రేటర్ వరంగల్ పరిధిలోకి వస్తాయి కూడా. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు బదిలీ చేసిన ఐదారు రోజులకే ఆయనను వరంగల్ జిల్లాలో ఆర్డీఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీని వెనుక ఓ కీలక ప్రజాప్రతినిధితో పాటు మరో ఇద్దరు నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖలు ఉన్నట్లు రెవెన్యూశాఖలోని కొందరు ఫిర్యాదు చేశారు. హనుమకొండ జిల్లాకు చెందిన చాలామంది తహసీల్దార్లు పొరుగు జిల్లా అయిన వరంగల్‌కు బదిలీ అయ్యారు. పలు నియోజకవర్గాలు రెండు జిల్లాల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు ఒక జిల్లాలో పనిచేసిన ఇద్దరు తహసీల్దార్లు ఇప్పుడు వరంగల్‌కు బదిలీ అయినా పాత నియోజకవర్గంలోకే మళ్లీ వచ్చారు. ఇలా జరిగిన చాలా బదిలీలు, పోస్టింగ్‌లపైనా ఎన్నికల సంఘం ఆరా తీస్తుండటం కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల్లాలో ఏడు సంవత్సరాలు పనిచేసిన ఎస్ఐ ఎస్కే యాసిన్, నాలుగేళ్లు పూర్తయిన శ్రీనునాయక్‌ను అదే జిల్లాలో కొనసాగిస్తున్నారు. క్రిమినల్ కేసులో భాగస్వామన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణాప్రతాప్‌ను గూడూరు ఎస్ఐగా కూడా నియమించారు. ములుగు జిల్లా డీఎస్‌బీగా ఉన్న సట్ల కిరణ్, ఆర్ఐ కిరణ్, సీసీఎస్‌లో ఉన్న శివకుమార్‌లు దీర్ఘకాలికంగా అదే జిల్లాలో పనిచేసినా.. తిరిగి అక్కడే నియమించారన్న చర్చ ఉంది. ఎనిమిదేళ్లుగా వరంగల్ జిల్లాలో పనిచేసి ఎస్బీ ఏసీపీ నుంచి అదే కమిషనరేట్ పరిధిలోని నర్సంపేటకు ఏసీపీగా పి.తిరుమల్ బదిలీ అయ్యారు. పరకాల ఏసీపీగా పోస్టింగ్ తీసుకున్న కిషోర్ ఏడేళ్లుగా ఇదే జిల్లాలో పనిచేస్తున్నారు. డేవిడ్‌రాజ్ కాజీపేట ఏసీపీగా నియమితులయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జిల్లాలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన ఆయన కేయూసీ తదితర పీఎస్‌లలో పని చేశారు. సి.సతీష్‌ను జూలై 15న మామునూరు ఏసీపీగా నియమించారు. గతంలో దుగ్గొండి సీఐతోపాటు ఆరేళ్ల పాటు వరంగల్ జిల్లాలో పని చేశారు. ఇది ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదులో ఉంది. .. ఇలా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 21 మంది పోస్టింగ్‌లపై ఫిర్యాదులు ఉన్నాయి. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో ముగ్గురు, ములుగు జిల్లాలో ముగ్గురి పోస్టింగ్‌లు వివాదాస్పదమయ్యాయి. అడుగడుగునా ఉల్లంఘనలు జరిగాయంటూ వెల్లువెత్తిన ఫిర్యాదుల నేపథ్యంలో వీరిపై ఎన్నికల సంఘం ఆరా తీస్తుండటం కలకలం రేపుతోంది. -
బైక్ పై వెళ్తు ఆగి ఉన్న లారీని ఢీకొన్న యువకుడు..
కామారెడ్డి: ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి శివారులో విశ్వ ఆగ్రోటెక్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చంద్రయాన్‌పల్లికి చెందిన అనిల్(33) మృతి చెందినట్లు డిచ్పల్లి ఎస్సై మహేశ్ తెలిపారు. వివరాలు.. అనిల్ బుధవారం సాయంత్రం డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామానికి బైక్‌పై వెళ్లి వస్తుండగా ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాదు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య నవనీత ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కారు ఢీకొని ఒకరు.. కారు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్ బైపాస్ సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిపినగండ్ల గ్రామానికి చెందిన దూదెకుల బాబు (55) సెంట్రింగ్ పనుల నిమిత్తం కామారెడ్డికి వచ్చాడు. ఉదయం 7 గంటల ప్రాంతంలో టేక్రియాల్ సమీపంలో నడుచుకుంటు వెళ్తుండగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి అతడిని వెనక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. దేవునిపల్లి పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. మృతుడి తమ్ముని కుమారుడు సలీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. -
‘కారు’ దిగితే అట్లుంటది మరీ..!
కామారెడ్డి: సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంపై బీఆర్ఎస్ నాయకత్వం ఫోకస్ పెట్టింది. కార్యక్రమాలను వేగవంతం చేసింది. వంద మంది ఓటర్లకు ఒకరు చొప్పున పోలింగ్ బూత్‌కు పది మంది బాధ్యులను నియమిస్తున్నారు. ఈ పదిమంది కమిటీలో కొరు ఇన్‌చార్జీగా ఉంటారు. నియోజకవర్గంలో మొత్తం 266 బూత్‌లకు కమిటీలను వేసి, ఇన్చార్జీలను నియమించనున్నారు. వారంతా పార్టీ నిర్దేశించే కార్యక్రమాలను అమలు చేస్తారు. పార్టీ కార్యకలాపాల కోసం జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న శుభం ఫంక్షన్ హాల్‌ను అద్దెకు తీసుకున్నారు. ఎన్నికలు పూర్తయ్యేదాకా అన్నీ అక్కడి నుంచే నడిపించనున్నారు. అలాగే మీడియాకు సమాచారం ఇవ్వడానికి విద్యానగర్‌లోని ఓ అపార్టుమెంటులో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు పార్టీ ముఖ్య నేతలు వచ్చినపుడు ఉండడానికి వీలుగా పలు ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. రెండు మూడు రోజుల్లో అద్దె ఇళ్లను ఎంపిక చేసి అందులో మకాం పెడతారు. మంత్రి కేటీఆర్ దిశానిర్దేశంతో ప్రచార పనులు వేగవంతమయ్యాయి. సీఎంవో నుంచి ఎమ్మెల్సీ షేరి సుభాష్‌రెడ్డి రెగ్యులర్‌గా వచ్చిపోతున్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ముఖ్య నేతలను సమన్వయం చేస్తూ కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. ముఖ్య నేతలతో సమావేశం నిర్వహణకు.. నియోజకవర్గంలో ఒక్కో మండలం/పట్టణం నుంచి ఇరవై మంది చొప్పున వంద మందితో ప్రగతి భవన్లో సమావేశం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేస్తారని, అవసరమైతే సీఎం కేసీఆర్ కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమావేశాన్ని శుక్రవారమే నిర్వహించాల్సి ఉండగా.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి తల్లి మరణంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై దృష్టి కాంగ్రెస్, బీజేపీలలో క్రియాశీలకంగా ఉన్న నేతలపై బీఆర్ఎస్ నేతలు దృష్టి సారించారు. వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్‌కు ఇటీవల కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పారు. మండలాలవారీగా నాయకుల జాబితాలను రూపొందించి వారిని ఏదోరకంగా కారెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో.. కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ ఇప్పటికే మొదలైంది. బూత్‌కు పది మందితో కమిటీని ఏర్పాటు చేసి, జాబితాను కంప్యూటరీకరిస్తారు. వారికి ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా సమాచారాన్ని చేరవేస్తారు. అలాగే సోషల్ మీడియాల టీంలను ఇప్పటికే అలర్ట్ చేశారు. ప్రభుత్వ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో గత పాలకుల విధానాలతో జరిగిన ఇబ్బందులను వివరిస్తూ, ప్రస్తుతం జరిగిన మేలును కళ్లకు కట్టేలా రూపొందించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కామారెడ్డి క్యాంపెయిన్ ఇన్‌చార్జీగా కేటీఆర్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి పోరులో ముందున్న బీఆర్ఎస్.. తాజాగా పలు నియోజకవర్గాలకు ప్రచార ఇన్చార్జీలను ప్రకటించింది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గం బాధ్యతను ముగ్గురికి అప్పగించింది. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ బాధ్యతలను మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్కు ఇచ్చారు. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలకు ఇంకా ఎవరినీ నియమించలేదు. ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ అర్బన్‌తోపాటు బోధన్ నియోజకవర్గాల ప్రచార బాధ్యతలు అప్పగించారు. క్యాంపెయిన్ ఇన్చార్జీల నాయకత్వంలో ఆయా నియోజకవర్గాలలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
అసమ్మతుల చూపు.. ప్రగతి భవన్ వైపు..!
భద్రాద్రి: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే టికెట్లు దక్కించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు, టికెట్లపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు అంతా ‘చలో హైదరాబాద్’ అంటున్నారు. ఇప్పటికే కొందరు రాజధానిలో మకాం వేయగా.. మరికొందరు నేడు, రేపు హైదరాబాద్ బాట పట్టనున్నారు. చల్లారని ఇల్లెందు సెగ.. ఇల్లెందు నియోజవకర్గంలో బీఆర్ఎస్లో చెలరేగిన అసమ్మతి ఎంతకీ చల్లారడం లేదు. రెండు వారాల క్రితం మంత్రి హరీశ్‌రావుకు తమ ఇబ్బందులు చెప్పుకున్న అసమ్మతి వర్గం నేతలు గురువారం హైదరాబాద్ వెళ్లి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవితతో కలిసి ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ డీవీ, పార్టీ అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, కృష్ణప్రసాద్, మధుకర్‌రెడ్డి కేటీఆర్‌ను కలిశారు. సుమారు రెండు గంటల పాటు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని వివరించారు. అసమ్మతి నేతలు చెప్పిన అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ నుంచి వచ్చే ఏ ఆదేశాలనైనా పాటించేందుకు సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. సోమవారం తొలి జాబితా.. కమలం పార్టీకి సంబంధించి ఇల్లెందు నుంచి ఊకె అబ్బయ్య, భద్రాచలం నుంచి కుంజా సత్యవతి వంటి మాజీ ఎమ్మెల్యేలు ఆయా స్థానాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. కొత్తగూడెం నుంచి పోటీకి రంగాకిరణ్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పినపాక నుంచి కేంద్ర సర్వీసులకు చెందిన కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతారనే ప్రచారం జరుగుతోంది. కాగా బీజేపీ మొదటి జాబితా వచ్చే సోమవారం వెలువడుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతో ఆశావహులు తమ వంతు ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ‘గులాబీ’ అభ్యర్థుల పయనం.. అధికార భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. గత నెల రోజులుగా వీరంతా నియోజకవర్గాల స్థాయిలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు తదితర అధికారిక కార్యక్రమాల్లో బిజీగా గడిపారు. అయితే ఎన్నికలు సమీపించిన వేళ ఇల్లెందు, అశ్వారావుపేటలో అసమ్మతి చెలరేగడం అభ్యర్థులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఈనెల 15న హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ సమావేశం జరగనుంది. టికెట్లు కేటాయించిన అభ్యర్థులకు ఆ సమావేశంలోనే బీ ఫామ్‌లు ఇస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో కొత్తగూడెం అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా, రేగాకాంతారావు, హరిప్రియనాయక్, మెచ్చా నాగేశ్వరరావు, తెల్లం వెంకట్రావు నేడు, రేపు హైదరాబాద్ వెళ్లనున్నారు. ఢిల్లీ టు హైదరాబాద్.. కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు అంశం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో ఆ పార్టీకి చెందిన ఆశావహులంతా గత పది రోజులుగా ఢిల్లీ కేంద్రంగా లాబీయింగ్ చేయడంలో బిజీగా ఉన్నారు. నిన్నా మొన్నటి వరకు టికెట్ల కేటాయింపు కోసం నియమించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు ఢిల్లీలో జోరుగా సాగాయి. దీంతో ఆశావహులు తమకు సానుకూలంగా ఉన్న అంశాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు అక్కడే మకాం వేశారు. లంబాడా సామాజిక వర్గానికే ఇల్లెందు టికెట్ ఇవ్వాలంటూ ఆజ్మీరా శంకర్‌నాయక్, ప్రవీణ్ నాయక్, రామచంద్రునాయక్ తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఇక కొత్తగూడెం టికెట్ బీసీలకే ఇవ్వాలంటూ ‘గూడెం’ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గుర్రుగా ఉన్న పొదెం.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌తో వామపక్షాలకు పొత్తు కుదిరితే భద్రాచలం అసెంబ్లీ స్థానం సీపీఎంకు కేటాయిస్తారనే ప్రచారం విపరీతంగా జరగడంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఆమీతుమీ తేల్చుకునేందుకు భద్రాచలం సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య రెండు రోజుల క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని పొత్తులో ఇతర పార్టీకి టికెట్ కేటాయించడమేంటని ఆయన పార్టీ పెద్దలను నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ పొత్తుల్లో భద్రాచలం స్థానాన్ని సీపీఎంకు ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైతే పినపాక నుంచి పోటీ చేయాలని పొదెం వీరయ్యకు కాంగ్రెస్ ఆఫర్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. అయితే భద్రాచలం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వకుంటే ములుగు నుంచి పోటీకి సిద్ధమని ఆయన పార్టీ పెద్దలకు కబురు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. భద్రాచలం, ములుగు తప్ప మరో స్థానం నుంచి పోటీ చేసే ప్రసక్తి లేదని పొదెం వీరయ్య కుండబద్ధలు కొట్టినట్టు గాంధీభవన్ వర్గాల సమాచారం. -
అధికారపార్టీలో వుంటేనే అర్హులు.. లెదంటే..
సూర్యాపేట: ఆత్మకూర్ మండల పరిధిలోని నెమ్మికల్ గ్రామంలో ఎన్నికలకు ముందు దళితబంధు లొల్లి మొదలైంది. అనర్హులకు ఇచ్చారంటూ ఏకంగా సర్పంచ్ ఇంటికే తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. నెమ్మికల్ గ్రామానికి 24 దళితబంధు యూనిట్లు మంజూరయ్యాయని, వాటి ని మాదిగ సామాజిక వర్గానికి 12, మాల సామాజిక వర్గానికి 12 చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ యూనిట్ల పంపిణీ సక్రమంగా జరగలేదని దళితులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఆర్థికంగా బలంగా ఉన్న దళితులకు, ప్రజాప్రతినిధులు, వారి బంధువులు, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్తలుగా పనిచేస్తున్న వారికే ఈ పథకం మంజూరు చేశారని, ఇదే విషయమై బుధవారం ఎస్సీ వర్గానికే చెందిన గ్రామసర్పంచ్ గంపల సతీష్‌ను కొందరు ప్రశ్నించారు. ఈ సమయంలో సర్పంచ్ కుటుంబ సభ్యులు దురుసుగా ప్రవర్తించడంతో ఆగ్రహంతో దళితులు ఆందోళన చేశారు. దళిత బంధులో అక్రమాలు జరిగాయని గ్రామంలోని సూర్యాపేట – దంతాలపల్లి రహదారిపై రాస్తారోకో చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేసిన గోడ గడియారాలను తీసుకొచ్చి పగులగొట్టారు. గృహలక్ష్మి పొందిన వారే తిరిగి దళితబంధు తీసుకుంటున్నారని, నిజమైన నిరుపేద దళితులు అన్యాయానికి గురవుతున్నారని ఆరోపించారు. ఉదయం 7గంటలకే రోడ్డు ఎక్కి 11గంటల వరకూ ఆందోళన విరమించకపోవడంతో రహదారికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ వెంకట్‌రెడ్డి ఆందోళన కారులకు నచ్చజెప్పినా వినిపించుకోకుండా వాగ్వాదానికి దిగడంతో పాటు అతని కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్‌కు తరలివెళ్లారు. ఇదిలా ఉండగా అసలు మండలానికి దళితబంధు యూనిట్లు రాలేదని తెలుస్తోంది. కేవలం ఆ పార్టీకి చెందిన నాయకులు దళితబంధు మంజూరైందని చెప్పి దళితుల మెప్పుపొందేందుకు ప్రయత్నించారని, ఇది బెడిసి కొట్టినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు మండలంలో దళితబంధు ఊసెత్తని వారు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మంజూరైందని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ మల్సూర్‌నాయక్‌ను వివరణ కోరగా తమకు దళితబంధు పథకంపై ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా రాస్తారోకో చేసి ప్రజారవాణాకు ఆటంకం కలిగించిన గంపల కరుణాకర్, గంపల లెనిన్, చంద్రు, పురం శివక్రిష్ణ, జానకిరాములు, గరిగంటి రాంబాబులతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. -
అరచేతిలో పంచాయతీ సమాచారం! మళ్ళీ కొత్త హంగులతో..
ఆదిలాబాద్: గ్రామపంచాయతీ ఆదాయ, వ్యయాల విషయంలో పారదర్శకత పాటించేలా కేంద్ర ప్రభుత్వం మేరీ పంచాయతీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధుల వివరాలను పంచాయతీ కార్యాలయాలకు వెళ్లకుండానే యాప్ ద్వారా పరిశీలించవచ్చు. పంచాయతీలకు సంబంధించిన పద్దుల వివరాలు ప్రజల ముందుకు వచ్చాయి. ఈ యాప్‌ను 2019 లోనే రూపొందించగా కొన్ని కారణాలతో వివరాలన్నింటినీ నిక్షిప్తం చేయలేదు. గతేడాది నుంచి అన్నింటినీ ఇందులో పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని అన్ని పంచాయతీలకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచారు. ఎప్పటికప్పుడు వివరాలు అప్లోడ్.. గ్రామపంచాయతీకి సంబంధించిన నిధుల వివరాలే కాకుండా సర్పంచ్, కార్యదర్శి, గ్రామ కమిటీలు, ఆస్తుల సమాచారాన్ని సైతం యాప్ ద్వారా సులువుగా తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా మంజూరు చేసే నిధుల వివరాలతో పాటు ఏయే పనులకు ఎంత మొత్తం వెచ్చించారు. పనులు ఏ దశల్లో ఉన్నాయనే సమాచం యాప్‌లో దర్శనమిస్తుంది. జిల్లా - పంచాయతీలు ► ఆదిలాబాద్ - 467 ► నిర్మల్ - 396 ► మంచిర్యాల - 311 ► ఆసిఫాబాద్ - 335 పారదర్శకతకు ప్రాధాన్యం.. పంచాయతీ నిధుల వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నిక్షిప్తం చేయడంతో పాలనలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేపడుతున్నాయనేది ప్రజలు సులువుగా తెలుసుకోవచ్చు. గ్రామంలో చేపట్టే పనులను జీపీఆర్ఎస్ ద్వారా గుర్తిస్తుండడంతో ఒక్కసారి నిధులు మంజూరైన పనికి మరోసారి బడ్జెట్ కేటాయించడానికి వీలుండదు. పద్దుల వివరాలు ప్రజల వద్దకు వెళ్లడంతో పాలకవర్గాలు పొరపాట్లు చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ తప్పుడు నివేదికలు రూపొందిస్తే ప్రజలు ప్రశ్నించవచ్చు. పంచాయతీ వివరాలు ఇలా.. ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్లేస్టోర్‌కు వెళ్లి ‘మేరీ పంచాయతీ’ అని టైప్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని తెరవగానే ఆర్థిక సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, పంచాయతీ వివరాలు దర్శనమిస్తాయి. వాటిని నమోదు చేయగానే గ్రామపంచాయతీకి సంబంధించిన అంశాలు కనిపిస్తాయి. గ్రామం పేరు లేదా పిన్‌కోడ్‌తో సైతం సంబంధిత పంచాయతీ వివరాలు తెలుసుకోవచ్చు. సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చు.. గ్రామపంచాయతీలకు సంబంధించిన వివరాలను నెలకోసారి ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా నిక్షిప్తపరుస్తారు. దీంతో ప్రజలు తమకు కావాల్సిన సమాచారాన్ని సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. నిధుల కేటాయింపు, పనుల వివరాల్లో సందేహాలు ఉంటే గ్రామసభల్లో ప్రశ్నించవచ్చు. – అరుణ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
బాసరలో దేవీ నవరాత్రి ఉత్సవాలు.. జర జాగ్రత్త! ఇదివరకే..
నిర్మల్: మరో మూడు రోజుల్లో బాసరలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలిరానున్నారు. బాసరకు వచ్చే భక్తులంతా సమీపంలోని గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తారు. అయితే గోదావరి తీరం.. ప్రమాదభరితంగా మారింది. భక్తుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోతుంది. ఈయేడు భారీ వర్షాలతో గోదావరి ప్రస్తుతం నిండుగా ప్రవహిస్తోంది. వరదలకు కొట్టుకువచ్చిన నల్లమట్టి స్నాన ఘట్టాలపై పేరుకుపోయింది. దీంతో స్నానాలు చేసే భక్తులు జారి నదిలో డుతున్నారు. ఒకపక్క గోదావరిలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరోపక్క అధికారుల నిర్లక్ష్యంతో పుణ్యస్నానాలకు వెళ్లిన భక్తులు మృత్యువాతపడుతున్నారు. ఇదివరకే ఇలా.. ► 'అక్టోబర్ 1న నిజామాబాద్‌లోని పాములబస్తీకి చెందిన సంతోష్(18) స్నేహితులతో కలిసి బాసరకు వచ్చాడు. గోదావరి నదిలో స్నానాల కోసం దిగి మృతిచెందాడు.' ► 'అక్టోబర్ 6న నిజామాబాద్‌లోని గాజులపేట్‌కు చెందిన దుబ్బాక ఒడ్డయ్య(35) కూతురు పుట్టు వెంట్రుకలు తీసేందుకు బాసరకు వచ్చాడు. ఆనవాయితీ ప్రకారం గోదావరి నదిలో తెప్పను వదిలేందుకు దిగాడు. నీటిలోనే మునిగి మృతిచెందాడు.' ► 'ఈనెల మొదటి వారంలోనే ఇద్దరు భక్తులు నదిలో ముగిని చనిపోయారు. గోదావరి నది వద్ద తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా అధికారులు రక్షణ చర్యలు చేపట్టడం లేదు.' 15 నుంచి ఉత్సవాలు.. ఈనెల 15 నుంచి 23 వరకు బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగనున్నాయి. దసరా సెలవుల నేపథ్యంలో భారీగా భక్తులు తరలిరానున్నారు. ఉత్సవాల నేపథ్యంలోనైనా స్నానఘట్టాల వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. స్నానఘట్టాల నిర్మాణ సమయంలో లోపాల కారణంగా కాలుజారితే లోపలికి వెళ్లిపోయే పరిస్థితి ఉంది. బాసర గోదావరి నదిలో ప్రస్తుతం ఐదు అడుగుల లోతు నీటి వద్ద కంచెలాంటిది ఏర్పాటు చేయాలి. ప్రమాదవశాత్తు స్నానాలు చేసే సమయంలో భక్తులు జారిపడ్డా ఐదు అడుగుల కంచె వద్దే ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఈ విషయం ఆలయ అధికారులకు తెలిసినా చర్యలు చేపట్టడంలేదు. యువకులు ఆందోళన చేసినా.. బాసర యువకులు గతంలో ఆందోళన చేసినా స్నానఘట్టాల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. గోదావరి తీర ప్రాంతంలో స్నానఘట్టాల వద్దే ఈప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నీళ్లు చూస్తే ప్రతి ఒక్కరికీ అందులోదిగి స్నానం చేయాలన్న ఆతృత ఉంటుంది. ఇక స్నేహితులతో కలిసి వచ్చేవారు నది నీటిలో గంటలతరబడి స్నానాలు చేస్తుంటారు. కొత్తగా వచ్చే ఈ యువకులు ఆనందంలో నీటి లోతును అంచనా వేయలేక లోపలికి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు. బాసర ఆలయ అధికారులకు యువకులు గతంలో వినతిపత్రాలు ఇచ్చారు. జరుగుతున్న సంఘటనలపై బాసర పోలీసులు సైతం ఫిర్యాదు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలోనైనా భక్తులకు ఇబ్బంది కలుగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని యువకులు కోరుతున్నారు. -
ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించాలి.. కలెక్టర్..
నారాయణపేట: ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల నియామవళి అమలు, విధివిధానాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల్లో విధులు నిర్వర్తించే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు, సలహాలను కలెక్టర్ నిర్దేశించారు. ఎన్నికలు సజావుగా , ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనుసరించి ఎన్నికలు సాఫీగా, సజావుగా జరిగేలా సహాకరించాలన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమర్థవంతంగా పని చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామ స్థాయి నుంచి వివిధ పార్టీలకు సంబంధించిన ప్లెక్సీలు, బ్యానర్లు, గోడలపై ఉన్న రాతలను వెంటనే తొలగించేందకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పార్టీలు గానీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అనుమతులు లేకుండా ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి ఎన్నికల నిబంధనల ఉల్లంఘనను పాల్పడితే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రచార ఖర్చుల లెక్క పక్కా.. ఎన్నికల ప్రచార ఖర్చు గరిష్ట పరిమితిని రూ.40 లక్షలుగా నిర్ణయించినట్లు, సమావేశాలు, ర్యాలీలు, వాహనాల కోసం, తాత్కాలిక ఎన్నికల కార్యాలయం, లౌడ్ స్వీకర్ల. హెలికాప్టర్లు ల్యాండింగ్‌కు హెలిప్యాడ్లకు ప్రతి సబ్ డివిజన్లో ప్రతి ఆర్ఓ స్థాయిలో ఉంచబడిందన్నారు. ఆప్లికేషన్ వివరంగా పూర్తి ఆకృతిలో చేయాలని, తద్వారా ఖర్చు గణన సులభం అవుతుందని, హైటెక్ డిజిటల్ ఎన్నికల ప్రకటన అండ్ ఎల్ఈడీ స్క్రీన్ స్థిరంగా ఉండేలా ప్రామాణిక రేట్లు వర్తించబడతాయన్నారు. సమావేశంలో వ్యయ నోడ్‌ల్ అధికారి కోదండరాములు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సలీం, వినయ్‌మిత్ర, వెంకట్రామరెడ్డి, రఘురామయ్య గౌడ్, సుదర్శన్‌రెడ్డి, ఎండి అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. రూ.50వేల నగదుతో పట్టుబడితే సీజ్ చెక్‌పోస్టును ఏర్పాటు చేయడం జరిగిందని, రూ.50 వేల కంటే పైబడి నగదుతో పట్టుబడితే వాటిని సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. షాడో రిజిస్టర్ పెట్టాలని, సర్వేలైన్ టీం రికార్డ్ చేయాలన్నారు. ఈసమావేశంలో ఎస్డీసీ రాజేందర్‌గౌడ్, డీపీఓ మురళీ, అధికారులు పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు ఎన్నికల ప్రచార సామగ్రి ముద్రణను నిబంధనల ప్రకారం ప్రింటింగ్ ప్రెస్ యాజమానులు నిర్వహించాలని.. లేదంటే ప్రింటింగ్ ప్రెస్ లైసెన్స్‌ను రద్దు చేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కరపత్రాలు, పోస్టర్లు, ఇతర మెటీరియల్ ముద్రించినప్పుడు లేదా ప్రచురించినప్పుడు తప్పనిసరిగా ప్రింటర్, ప్రచురణ కర్త పేర్లు, చిరునామా , సెల్‌ఫోన్ నంబర్లు ప్రింట్ లైన్లో స్పష్టంగా సూచించాలని, ముద్రించబడిన ప్రతులను మూడు అదనపు ప్రింట్లతో పాటు ప్రింట్ చేసిన మూడు రోజుల్లోపు ప్రచురణ కర్త నుంచి కలెక్టర్ కార్యాలయం నందు ప్రజాప్రాతినిధ్యం చట్టం 1951 సెక్షన్ 127(ఏ) ప్రకారం పంపాలన్నారు. -
రాబోయేది మన పార్టీ ప్రభుత్వమే..ఎంపీ ఉత్తమ్
సూర్యపేట్: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మఠంపల్లి మండలం బక్కమంతుల గూడేనికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు చింతారెడ్డి విజయ భాస్కర్‌రెడ్డి, అనుచరుల కుటుంబాల వారు హుజూర్‌నగర్‌లోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌లో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఉప సర్పంచ్ వి. నాగలక్ష్మి, నాయకులు వి. సైదులు, కో– ఆప్షన్ సభ్యుడు ఎస్. సీతారామి రెడ్డి, ఐ. చిన శంభిరెడ్డి, జి. వీరస్వామి, బి. ఉపేందర్ రెడ్డి, ఎన్. బొర్రయ్య, టి. కోటయ్య, కె. నాగయ్య, నర్సింహ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోతి సంపత్‌రెడ్డి, మంజూ నాయక్, ఎస్. గోవింద రెడ్డి, వై .నర్సింహారావు, ఎస్. వెంకట్ రెడ్డి, జి. నాగిరెడ్డి, చంద్రం, వీర నాగిరెడ్డి, రాజ మోహన్ రెడ్డి, పూర్ణ చందర్ రావు పాల్గొన్నారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల అమలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఎంపీ ఉత్తమ్ చెప్పారు. బుధవారం హుజూర్‌నగర్‌లోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఆరుగ్యారంటీల ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఆరు గ్యారంటీలను గడపగడపకూ తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బి. గిరిబాబు, వీరారెడ్డి, శివరాం, మల్లయ్య, గురవయ్య, యో హాన్, రామాంజి, వెంకన్న, చందు పాల్గొన్నారు. -
ఈ నెల 15వ తేదీ తర్వాత గెలుపు గుర్రాలను ప్రకటించనున్న బీజేపీ.. మరీ అసంతృప్తులకు..!
సూర్యపేట్: ఉమ్మడి జిల్లాలో పోటీలో ఉండే అభ్యర్థుల విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో ఒకరి పేరునే మొదటి ప్రాధాన్యంగా తీసుకొని అధిష్టానానికి పంపించగా.. మరికొన్ని నియోజకవర్గాలో రెండవ పేరుతో కూడిన జాబితాను పంపించినట్లు తెలిసింది. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన పార్టీ స్క్రీనింగ్ కమిటీ వాటి వడబోత కార్యక్రమాన్ని పూర్తి చేసింది. నియోజవకర్గాల్లో పోటీలో ఉండబోయే అభ్యర్థుల పేర్లను ఈ నెల 15వ తేదీ తరువాత ప్రకటించనుంది. అయితే, అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టతకు వచ్చిన పార్టీ.. మిగతా వారిని బుజ్జగించే పనిలో ఉంది. నాలుగు రకాలుగా వడబోత అభ్యర్థుల ఎంపికలో నాలుగు రకాల జాబితాలను సేకరించినట్లు తెలిసింది. ఇందులో ముఖ్యమైన నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ నుంచి ప్రతి నియోజకవర్గానికి చెందిన ఆశావహులపై అభిప్రాయాలను తీసుకున్నట్లు పార్లీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు బీజేపీకి వెన్నెముకగా వ్యవహరించే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి కూడా నియోజకవర్గాల వారీగా పేర్లను తీసుకున్నట్లు తెలిసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి కూడా ఇలా అభిప్రాయ సేకరణ చేసిన తరువాత వాటన్నింటని క్రోడీకరించి కొన్ని నియోజకవర్గాల్లో ఒక్కరి పేరును, మరికొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరి పేర్లను, ఇంకొన్ని నియోజకవర్గాల్లో ముగ్గురి పేర్లతో కూడా జాబితాను పార్టీ అధిష్టానానికి పంపించింది. నాలుగు చోట్ల ఒక్కరి పేరే.. నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల విషయంలో నాలుగు రకాల జాబితాల్లో ఒక్కరి పేరును మొదటిదిగా పేర్కొన్నట్లు తెలిసింది. అందులోని ఆ ఒక్కరి విషయంలో ఏకాభిప్రాయం రావడంతో వారికే టికెట్‌ను పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. మునుగోడు నియోజకవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సూర్యాపేట నియోజకవర్గం నుంచి సంకినేని వెంకటేశ్వర్రావు, భువనగిరి నుంచి గూడురు నారాయణరెడ్డి, తుంగతుర్తి నుంచి కడియం రామచంద్రయ్య పేర్లను ఖరారు చేసినట్లు తెలిసింది. అనుకోని పరిణామాలు ఎదురైతే తప్ప వారి విషయంలో మార్పు ఉండే అవకాశం లేదు. రంగంలోకి జిల్లా ఎన్నికల ఇన్చార్జీలు.. పార్టీ అధిష్టానం జిల్లా ఎన్నికల ఇన్చార్జీలను రంగంలోకి దింపుతోంది. టికెట్ ఎవరికి ఇచ్చినా పనిచేసేలా బుజ్జగింపులకు తెర తీసింది. అసంతృప్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా ఎన్నికల ఇన్చార్జి, కేంద్ర మంత్రి శోభ కరాండ్లజే జిల్లాకు చేరుకున్నారు. వివిధ నియోజకవర్గాల నేతలతో భేటీ అవుతున్నారు. యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోనూ మూడు నాలుగు రోజుల్లో జిల్లా ఎన్నికల ఇన్చార్జీల సమావేశాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇద్దరి పేర్లను ప్రతిపాదించిన నియోజకవర్గాలు.. ఉమ్మడి జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లో ఒక్కో సెగ్మెంట్ నుంచి ఇద్దరి పేర్లను అధిష్టానానికి పంపించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రధానంగా పోటీపడుతున్న వారిలో నల్లగొండ నుంచి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, నాగం వర్షిత్‌రెడ్డి టికెట్ ఆశిస్తుండగా.. వారిలో ఇద్దరి పేర్లను పంపించినట్లు సమాచారం. నకిరేకల్ నుంచి చేపూరి రవీందర్, నకిరేకంటి మొగిలయ్య, దేవరకొండ నుంచి కేతావత్ లాలూనాయక్, జర్పుల కల్యాణ్‌నాయక్, నాగార్జునసాగర్ నుంచి కంకణాల నివేదితారెడ్డి, బుసిరెడ్డి పాండురంగారెడ్డి, మన్నెం రంజిత్‌యాదవ్, మిర్యాలగూడ నుంచి సాదినేని శ్రీనివాసరావు, రేపాల పురుషోత్తంరెడ్డి, పల్నాటి వెంకట్‌రెడ్డి, ఆలేరు నుంచి పడాల శ్రీనివాస్, కాసం వెంకటేశ్వర్లు, సూదగాని హరిశంకర్‌గౌడ్, కోదాడలో నూకల పద్మావతిరెడ్డి, ఓర్సు వేలంగిరాజు, హుజూర్‌నగర్‌లో బొబ్బా భాగ్యరెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, చల్లా శ్రీలతారెడ్డి టికెట్ కోసం పోటీపడుతున్నారు. వారిలో ఇద్దరి పేర్లతో కూడిన జాబితాను పంపించింది. -
కలసికట్టుగా పనిచేస్తేనే ఎన్నికల నిర్వహణ సాధ్యం.. కలెక్టర్..
సూర్యాపేట: జిల్లాలో ఎన్నికల నిర్వహణలో భాగంగా ఏర్పాటు చేసిన టీములు నిబద్ధతతో పనిచేస్తూ రోజు వారీ నివేదికలను అందించాలని కలెక్టర్ యస్. వెంకట్రావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఇంటలీజెన్స్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో అక్రమ మద్యం, నల్లబెల్లం, నాటుసారా, నగదుపై గట్టి నిఘా ఉంచి తనిఖీలు చేపట్టాలన్నారు. పట్టుకున్న నగదు ను సత్వరమే అకౌంట్లో జమ చేయాలని ఆదేశించారు. రూ. 5 లక్షల విత్‌డ్రాలను నిరంతరం పరిశీలించి నివేదికలు అందించాలన్నారు. చెక్ పోస్ట్‌ల్లో నిఘా పెంచి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, నగదు దొరికితే గ్రీన్ కమిటీకి అన్ని ఆధారాలతో సమర్పించాలని, రూ. 50 లక్షలకు పైబడి పట్టుబడితే వెంటనే డబ్బులతో పాటు వాహనాన్ని సీజ్ చేయాలని సూచించారు. లావాదేవీలు నిరంతర పరిశీలన చేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. రోజూ వాణిజ్య పరమైన లావాదేవీలపై నిరంతరం నిఘా ఉంచాలని , గృహోపకరణ గోదాంలను తని ఖీలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనవు కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, అదనవు ఎస్పీ నాగేశ్వర రావు, ఏజీయం జ్యోతి, ఎకై ్సజ్ పర్యవేక్షకురాలు అనిత, ఎల్డీయం బాపూజీ, డీటీఓ రవి కుమార్, డీసీఓ శ్రీధర్, సీటీఓ యాదగిరి, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వసతుల పరిశీలనకు టీములు పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల పరిశీలనకు నియోజకవర్గానికి ఒక టీము చొప్పున ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ యస్. వెంకట్రావు ఓ ప్రకటనలో వెల్లడించారు. సూర్యాపేట నియోజక వర్గానికి జెడ్పీ సీఈఓ సురేష్, కోదాడకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామారావునాయక్, హుజూర్‌నగర్‌కు డీపీఓ యాదయ్య, తుంగతుర్తి నియోజకవర్గానికి డీఆర్డీఓ కిరణ్‌కుమార్‌ను నియమించామని వీరి ఆధ్వర్యంలో టీములు పనిచేస్తాయని తెలిపారు. ఈ టీముల్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖ అధికారులు ఉంటారని పేర్కొన్నారు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ... రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్
యాదాద్రి : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. బుధవారం ఉప్పల్‌లోని ట్రాఫిక్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన భునవగిరి జోన్ సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని, పోలింగ్ కేంద్రాల వివరాలు తెలిసి ఉండాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాలకు సామగ్రి తీసుకెళ్లే రూట్‌ను చెక్ చేసుకోవాలని, చెక్‌పోస్టుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. సమస్యలు సృష్టించేవారిపై నిఘా ఉంచాలి అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గతంలో జరిగిన ఎన్నికల్లో సమస్యలు సృష్టించిన వారిపై నిఘా ఉంచాలని పోలీసు అధికారులకు సీపీ సూచించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్, హిస్టరీ షీట్ ఉన్నవారిని బైండోవర్ చేయాలన్నారు. సోషల్ మీడియా ద్వారా పంపే సందేశాలు, వీడియోలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందజేయాలని కోరారు. ప్రశాంతమైన వాతావరణలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ అంబర్ కిషోర్, డీసీపీ రాజేష్ చంద్ర, రాచకొండ ట్రాఫిక్ డీసీసీ–1 అభిషేక్ మహంతి, మల్కాజిగిరి డీసీపీ ధరావత్ జానకి, ఎస్ఓటీ డీసీపీ–1 గిరిధర్, మహేశ్వరం డీసీపీ శ్రీని వాస్, ఎస్బీ డీసీపీ బాలస్వామి, సెబర్ క్రైమ్ డీసీపీ అనురాధ, అడ్మిన్ డీసీపీ ఇందిరా, ఎల్పీనగర్ డీసీపీ సాయిశ్రీ, ట్రాఫిక్ డీసీపీ–2 శ్రీనివాసులు, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషావిశ్వనాథ్, క్రైమ్ డీసీపీ అరవింద్, అడిషనల్ డీసీపీలు పాల్గొన్నారు.