News
-
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బదిలీ
యాదాద్రి: జిల్లా కలెక్టర్ టి.వినయ్‌కృష్ణారెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. వినయ్ కృష్ణారెడ్డి నల్లగొండ జిల్లాకు కూడా కలెక్టర్ పని చేశారు. అయితే ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజులు పాటు రాష్ట్రంలో పర్యటించి సమీక్ష సమావేశాలు నిర్వహించింది. మునుగోడు ఉప ఎన్నికల్లో ధన, మద్యం ప్రవాహం, డబ్బులు పంచలేదని ఓటర్లు ధర్నాలు చేయడం, పోలింగ్ కేంద్రాలకు వెళ్లకపోవడం, కొందరు అధికారుల పనితీరుపై ఆరోపణలు రావడం వంటి విషయాలను ఎత్తి చూపింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అధికారులపై ఫిర్యాదులు రావడాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు స్థానభ్రంశం కలిగించింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డిని కూడా బదిలీ చేసింది. వినయ్ కృష్ణారెడ్డి యాదాద్రి జిల్లా కలెక్టర్‌గా రెండు నెలలకు పైగా పని చేశారు. ఆయన స్థానంలో గురువారం సాయంత్రం 5 గంటల లోగా నూతన కలెక్టర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. -
సీఎం కేసీఆర్ "ప్రజా ఆశీర్వాద "సభకు 30వేల మంది...
యాదాద్రి: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈనెల16న భువనగిరిలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్‌పై భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా భువనగిరిలో జరుగుతున్న తొలి బహిరంగసభను విజయవంతం చేయడానికి మున్సిపాలిటీలు, మండలాల వారీగా జనసమీకరణ చేయనున్నారు. అదే విధంగా జిల్లాలో భువనగిరితో పాటు ఆలేరు, తుంగతుర్తి, మునుగోడు, నియోజకవర్గాల్లోనూ అధినేత బహిరంగ సభల తేదీలను ఖరారు చేసి ప్రకటించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభ 16వ తేదీన జగామ, భువనగిరిలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. తొలుత జనగామలో ఆ తర్వాత భువనగిరి సభలో పాల్గొంటారు. భువనగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా 30 వేలకు పైగా జనాన్ని సమీకరించనున్నారు. ఇందుకు అనుగుణంగా 100 మంది కూర్చునేందుకు వీలుగా వేదిక, సభకు హాజరైన వారికి నీడ కోసం సూపర్ స్ట్రక్చర్ టెంట్లు, పండాలాలు ఏర్పాటు చేయనున్నారు. సన్నాహక సమావేశాలు ఆశీర్వాద సభను విజయవంతం చేయడానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, పార్టీ నాయకులు జన సమీకరణపై దృష్టి సారించారు. ఇందుకోసం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం భూదాన్‌పోచంపల్లి, సాయంత్రం భువనగిరి మండల సన్నాహక సమావేశాలు నిర్వహించారు. గురువారం వలిగొండ, భువనగిరి మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించనున్నారు. మంగళవారం బీబీనగర్ మండల సన్నాహక సమావేశం ఉంటుంది. సభను విజయవతం చేయాలి సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజైర విజయవంతం చేయాలి. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపిన మన నాయకుడు కేసీఆర్‌ను మూడో సారి ముఖ్యమంత్రిని చేయాలి. ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు ప్రజలకు అందజేస్తున్నారు. మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలి. సభకు వేలాదిగా ప్రజలు తరలిరావాలి. –ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, భువనగిరి -
నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సిద్ధం కావాలి
కొత్తగూడెం: నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విధులు కేటాయించిన సిబ్బంది ఎన్నికల నిర్వహణ పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల నియామవళి అమల్లో ఉన్నందున పటిష్ట పర్యవేక్షణ జరగాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి 1950, సీ – విజిల్ యాప్‌నకు వచ్చిన ఫిర్యాదులను తక్షణమే విచారించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా రూట్ మ్యాప్‌లు, సమస్యాత్మక ప్రాంతాలకు మ్యాపింగ్ చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల సంఘ నియమావళి ప్రకారం కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఏదైనా సమస్య వస్తే సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని కోరారు. లైసెన్స్డ్ పిస్టళ్లను పోలీస్ శాఖకు సరెండర్ చేయాలని, లేదంటే రద్దుచేస్తామని అన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతిలేదని చెప్పారు. నగదుతో రవాణా చేసే వారు తగిన ఆధారాలు చూపించకుంటే సీజ్ చేస్తామని తెలిపారు. ఆ నగదు విడుదలకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఉంటుందని, పరిశీలన తర్వాత విడుదల చేస్తామని చెప్పారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో వచ్చే వార్తలపై పర్యవేక్షణ ఉంటుందని, తప్పుడు సమాచారంతో పోస్టు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ ప్రతీక్‌జైన్, డీఎఫ్ఓ కిష్టగౌడ్, అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్‌రాజు, డీఆర్ఓ రవీంద్రనాథ్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ తదితరులు పాల్గొన్నారు. నోడల్ అధికారుల నియామకం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులను నియమించినట్లు ప్రియాంక ఆల తెలిపారు. జిల్లాలో ఎన్నికల కోడ్ ఉన్నందున నోడల్ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. మ్యాన్‌పవర్ మేనేజ్మెంట్కు నోడల్ అధికారులు(ఎన్ఓ)గా డీఈఓ వెంకటాచారి, ఇరిగేషన్ డిప్యూటీ ఎస్ఈ కె. మహేశ్వరరావు, కోఆర్డినేటర్‌గా మైనార్టీ సంక్షేమాధికారి కె.సంజీవరావు వ్యవహరిస్తారని తెలిపారు. ట్రైనింగ్ మేనేజ్మెంట్ ఎన్‌ఓగా సీపీఓ శ్రీనివాసరావు, కోఆర్డినేటింగ్, మాస్టర్ ట్రైనర్లుగా డీఈఓ కార్యాలయ ఏపీఓ కిరణ్‌కుమార్, పి సాయికృష్ణ వ్యవహరిస్తారని, మెటీరియల్ మేనేజ్మెంట్ ఎన్‌ఓగా భూగర్భ జల శాఖాధికారి ఎం.బాలు కోఆర్డినేటింగ్ అధికారిగా డీఏఓ అభిమన్యుడు ఉంటారని తెలిపారు. ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్కు ఎన్‌ఓగా ఎంవీఐ జైపాల్‌రెడ్డి, కో ఆర్డినేటర్లుగా ఆర్టీఓ పి.వేణు, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డీఎంలు వ్యవహరిస్తారు. కంప్యూటరైజేషన్, సైబర్ సెక్యూరిటీకి ఎన్‌ఓగా డీఐ సీహెచ్ సంపత్, స్వీప్ ఎన్‌ఓగా సివిల్ సప్లై డీఎం త్రినాథ్‌బాబు, కో ఆర్డినేటర్‌గా డీఆర్డీఓ మధుసూదన్‌రాజు ఉంటారు. ఈవీఎం మేనేజ్మెంట్ ఎన్‌ఓగా అదనపు కలెక్టర్ పి.రాంబాబు వ్యవహరిస్తారు. ఎంసీసీ ఎన్‌ఓగా జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగలక్ష్మి, కో ఆర్డినేటర్లుగా సీఈఓ విద్యాలత, డీఎల్పీఓ పవన్ ఉంటారని కలెక్టర్ వివరించారు. -
తేలని పొత్తులు.. కామ్రేడ్లతో కాంగ్రెస్ సర్దుబాటుపై సందిగ్ధం..
భద్రాద్రి: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఎన్నికల కదన రంగంలో కలిసి నడుస్తామని ఆయా పార్టీల అగ్రనాయకులు చెబుతుంటే క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. సీట్లపైనే పేచీ ఈ ఏడాది ఆరంభంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో అంటీముంటనట్టుగా వ్యవహరించారు. భారతీయ జనతా పార్టీకి ధీటుగా బదులిస్తున్న భారత రాష్ట్ర సమితితోనే ఎన్నికల్లో కలిసి నడుస్తామని నేరుగా ఆ పార్టీ అగ్రనేతలు ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఇటు సీపీఐ, అటు సీపీఎం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలోని కీలక సీట్ల కోసం పట్టుబట్టాయి. ముఖ్యంగా కొత్తగూడెం, వైరా సీట్లను సీసీఐ.. పాలేరు, భద్రాచలం సీట్లను సీపీఎం కోరాయి. ఈ అంశంపై నాలుగైదు దఫాలుగా ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగినా ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏకపక్షంగా దాదాపు అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో కమ్యూనిస్టులతో పొత్తు ప్రస్థావన అనేది లేకుండా పోయింది. కాంగ్రెస్‌తో కలిసి.. ఎన్నికల పొత్తుపై మాట వరుసకై నా చెప్పకుండా బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం కమ్యూనిస్టు పార్టీలకు మింగుడు పడలేదు. దీంతో అనివార్యంగా కాంగ్రెస్‌కు స్నేహ హస్తం అందించాయి. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో కమ్యూనిస్టు నేతలు ఇప్పటికే పలుమార్లు సంప్రదింపులు జరిపారు. పై స్థాయిలో చర్చలు జరుగుతుండటంతో పార్టీ హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్థానిక హస్తం నేతలు ప్రకటించారు. అయితే పొత్తులపై ఎంతకీ స్పష్టత రావడం లేదు. మరోవైపు రోజులు గడుస్తున్న కొద్దీ ఆశావహులు సైతం తమ వంతు ప్రయత్నంగా టికెట్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఏకై క జనరల్ స్థానంగా ఉన్న కొత్తగూడెం నుంచి హస్తం పార్టీ తరఫున పోటీ ఎక్కువగా ఉంది. కొత్తగూడెంపై పట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుంచి ఎలాగైనా పోటీ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. దీంతో జాతీయ స్థాయిలో పార్టీ పరంగా మంతనాలు సాగిస్తున్నారు. కొత్తగూడెంలో సీపీఐకి గతంలో ఎన్నడూ లేనంత అనుకూల పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయంటూ పార్టీ పెద్దలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్‌తో ఎన్నికల అవగాహన ఉంటే కొత్తగూడెం నుంచి సీపీఐ బరిలో ఉండాల్సిందేనని ఖరాఖండీగా చెబుతున్నారు. దీంతో కూనంనేని పట్టుదల కాంగ్రెస్ నేతల్లో కలవరపాటు కలిగిస్తోంది. టికెట్‌పై ఆశతో.. కొత్తగూడెం సీటు నుంచి కాంగ్రెస్ తరఫున పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే తాను పోటీ చేయబోయే స్థానాన్ని పార్టీ పెద్దలు నిర్ణయిస్తారంటూ పొంగులేటి ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. ఇదే స్థానం నుంచి పోటీ చేసేందుకు బీసీ వర్గాల నుంచి ఎడవల్లి కృష్ణ, నాగ సీతారాములు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కృష్ణ ఏడాది కాలంగా క్షేత్రస్థాయిలో పని చేసుకుంటూ పోతున్నారు. మరోవైపు నాగ సీతారామలు సైతం గడపగడపకూ తిరుగుతూనే ఢిల్లీ–కొత్తగూడెం మధ్య చక్కర్లు కొడుతున్నారు. ఇలా నేతలంతా పోటీ కోసం రాత్రీ పగలు తేడా లేకుండా శ్రమిస్తున్నారు. హస్తం ఉండాల్సిందే కొత్తగూడెం సీటును కమ్యూనిస్టులకు కేటాయించారంటూ జోరుగా ప్రచారం జరగడం కాంగ్రెస్ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. దీంతో ఎవరికి వారు తమ గాడ్ఫాదర్లకు ఫోన్లు చేసి పొత్తుల చిక్కులపై వాకబు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు పొత్తు కారణంగా అన్యాయం జరగకుండా చూడాలంటూ విన్నవించుకున్నారు. పొత్తు విషయంలో ముందుగానే ఓ స్పష్టత ఇస్తే బాగుండేదని, ఎంతకీ తేల్చక పోవడం వల్ల తాము ఈ సీటుపై నమ్మకం పెట్టకుని పని చేస్తున్నామని టికెట్ ఆశిస్తున్న నేతలు అంటున్నారు. ఇదే సమయంలో పార్టీ హై కమాండ్‌కు ఎదురు సమాధానం చెబితే అసలుకే ఎసరు వస్తుందనే భయం కూడా లేకపోలేదు. దీంతో నేరుగా నేతలు బటయకు రాకుండా తమ అనుచరులు, మద్దతుదారులతో ప్రెస్మీట్లు పెట్టిస్తున్నారు. కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీనే బరిలో ఉంటుందంటూ ప్రకటనలు ఇప్పిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ఉండాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. -
సర్వం సర్వేమయం!.. అయితే ప్రామాణికత ఎంత..?
ఖమ్మం: ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక మొదలు బలాబలాలు తెలుసుకునేందుకు సర్వే చేయించుకోవడం పరిపాటిగా మారింది. సర్వేల్లో వచ్చిన ఫలితాలను సమీక్షించుకుంటూ ఎక్కడ బలహీనంగా ఉన్నామో సరిచేయించుకోవడంలో ఆశావహులు నిమగ్నమయ్యారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు, ఆశావహులు నెలకు రెండు, మూడు సార్లు సర్వే చేయించుకుంటూ గెలుపోటములను బేరీజు వేసుకుంటున్నారు. ఫలానా పార్టీ, ఫలానా అభ్యర్థి బలం గత నెలలో ఇలా ఉండగా.. ఈసారి పెరిగింది, లేదంటే తగ్గింది అని ఎదుటి వర్గం వారు ప్రచారం చేస్తున్నారు. ఇక సొంత పార్టీల వారైతే తమ అభ్యర్థి, నేత బలం పెరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఎన్నికల రంగంలో దూసుకెళ్తున్నారు. సొంత సర్వేలతో బిజీ ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో సంస్థకు సర్వే బాధ్యతలను అప్పగించింది. అయితే, పోటీ చేసే అభ్యర్థులు సైతం సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీ నుంచి ఫలానా అభ్యర్థి పోటీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది.. అధికార పార్టీ అభ్యర్థి అనుకూల అంశాలు ఏమిటి... పోటీలో ఎవరెవరు ఉంటారు, ఎవరికి గెలిచే అవకాశముందందనే అంశాలపై సర్వే చేయిస్తూ నివేదికలు తెప్పించుకుంటున్నారు. సమాచారం ఉంది... సర్వే చేయించుకున్న నేతలు ఏ గ్రామంలో ఏ పార్టీ, ఏ నాయకుడికి ఎంత ఇమేజ్ ఉందో తెలుసుకుంటున్నారు. అనంతరం ఆ గ్రామానికి వెళ్లినప్పుడు సమాచారం తన వద్ద ఉందని చెబుతూ సర్వే చేసిన వారికి ఎవరెవరు ఏం చెప్పారో కూడా తెలుసు.. ఇకనైనా సీరియస్‌గా పని చేయకపోతే ఫలితాలు మారనున్నందున తీరు మార్చుకోవాలని సూచనలు చేస్తున్నట్లు తెలిసింది. జర జాగ్రత్త సర్వే కోసం ఎవరైనా వస్తే వారు అడిగిన ప్రశ్నలకు ఇష్టముంటే సమాధానం చెప్పడం లేదంటే దాటవేయడమే మంచిదని పలువురు సూచిస్తున్నారు. అలాకాకుండా ఏదో ఒక మాట అంటే సరిపోతుందిగా అనే భావనతో సమాధానమిస్తే సదరు వ్యక్తి ఫలానా పార్టీకి అనుకూలమనే ముద్ర వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక నలుగురు కూడిన చోట రాజకీయాలపై చర్చించడం.. అదికాస్తా పెద్దదై నిందించుకోవడం ఇటీవల సాధారణమైందని తెలుస్తోంది. ఎవరైనా అతి ఉత్సాహంతో మాట్లాడితే సెల్ఫోన్లో రికార్డు చేసి సంబంధిత నాయకులకు చేరవేస్తున్నట్టు సమాచారం. ప్రామాణికత ఉందా? ఒకప్పుడు సర్వేలకు ప్రాధాన్యత ఉండగా.. నివేదికలకు ఒక కచ్చితత్వం ఉంటుందని నమ్మేవారు. కానీ రానురాను ఏ పార్టీకి ఆ పార్టీ అనుకూలంగా సర్వే నివేదికలు వస్తుండడంతో ప్రజలు విశ్వసించడం లేదు. సర్వే చేయించిన వ్యక్తికి అనుకూలంగా నివేదిక ఇవ్వకపోతే ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే భావనతో నిర్వాహకులు అదే మాదిరి చేస్తున్నట్లు సమాచారం. ఇక 2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓ సంస్థ ఇచ్చిన సర్వే నివేదిక ఆధారంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు పందేలు కాసి భారీగా నష్టపోయి ఇప్పటికీ కోలుకోలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయి మానసికంగా కుంగిపోయిన వారు పలువురు కనిపిస్తారు. -
ఇప్పుడు ప్రజల చేతుల్లోనే పవర్.. ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోండి..
ఖమ్మం: ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతోనే కోడ్ అమలులోకి వచ్చింది. ఇప్పుడు ప్రజల చేతుల్లోనే పవర్ ఉంది. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. గత ఎన్నికల్లో జిల్లాలో 90 శాతం వరకు పోలింగ్ నమోదు కాగా, ఈసారి మరింత పెరిగేలా అవగాహన కల్పిస్తున్నాం... అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీ.పీ. గౌతమ్ తెలిపారు. సీపీ విష్ణు ఎస్.వారియర్‌తో కలిసి ఆయన జెడ్పీ హాల్లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్థలాల్లోని రాజకీయ నేతల ఫ్లెక్సీల తొలగింపు, విగ్రహాలకు ముసుగు కప్పడం వంటి పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో సభలు, సమావేశాల నిర్వహణ, సొంత ఖర్చులతో హోర్డింగ్స్ పెట్టుకోవాలనుకునే వారు మున్సిపాలిటీల్లో అనుమతి తీసుకోవాలని సూచించారు. ఖమ్మంకు మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, వైరాకు అదనపు కలెక్టర్, సత్తుపల్లికి కల్లూరు ఆర్డీఓ, మధిరకు ఖమ్మం ఆర్డీఓ, పాలేరుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్‌ఓలుగా వ్యవహరిస్తారని చెప్పారు. డబ్బు, మద్యం పంపకంపై సమాచారం ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ సీ విజిల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. కాగా, కొత్త కోడళ్లు తమ పుట్టింటి నుంచి ఓటు హక్కును అత్తింటి వద్దకు మార్చుకోవడానికి ఫామ్–18ను దరఖాస్తు చేసుకోవాలని, వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేసుకునే హక్కు ఉందని చెప్పారు. ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ప్రతీ నియోజకవర్గంలో ఐదు మోడల్పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. జింకలతండా గోదాంలో లెక్కింపు వచ్చేనెల 30న పోలింగ్ ముగిశాక ఈవీఎంలను రఘునాథపాలెం మండలం జింకలతండాలోని గోడౌన్‌కు తరలిస్తామని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. జిల్లాలో గతంతో పోలిస్తే 63 పోలింగ్‌కేంద్రాలు పెరగగా, ఓటర్లకు ఇబ్బంది రాకుండా అన్ని ఆవాసాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీపీ విష్ణు ఎస్.వారియర్ మాట్లాడుతూ సోమవారం జిల్లావ్యాప్తంగా రూ.53 లక్షలు సీజ్ చేసి 17 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. గత ఎన్నికల్లో 10 వేల మందిని బైండోవర్ చేయగా, ఈసారి వారంలోగా ప్రక్రియ పూర్తిచేస్తామన్నారు. ఇక జిల్లాలో 131 మంది గన్ లైసెన్స్ కలిగి ఉండగా.. 128 మంది వద్ద తుపాకులు ఉన్నాయని చెప్పారు. వీరిలో బ్యాంక్ లైసెన్స్‌దారులు మినహా మిగతా వారు డిపాజిట్ చేయాలని సూచించినట్లు తెలిపారు. జిల్లాలో 390 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లుచేయనున్నట్లు చెప్పారు. కొత్త జాబితాలో తొలగింపులు ఉండవు.. ఎన్నికల నియమావళిని అన్ని పార్టీలు తప్పక పాటించాలని కలెక్టర్ గౌతమ్ సూచించారు. గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో సీపీ వారియర్‌తో కలిసి సమావేశమైన ఆయన మాట్లాడారు. కొత్తగా ఓటరు జాబితాలో తొలగింపులకు అవకాశం లేకపోగా, అర్హులు ఉంటే పేర్ల నమోదుకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం వ్యయ పర్యవేక్షణ అమలు కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అనుమానాస్పద లావాదేవీలపై రిటర్నింగ్ అధికారులకు బ్యాంకర్లు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వైన్స్‌లో అమ్మకాలకు సంబంధించి గత మూడు నెలల నివేదిక సేకరించాలన్నారు. ఎంసీఎంసీ ప్రారంభం.. కలెక్టరేట్లోని జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ – మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) సెల్‌ను కలెక్టర్ గౌతమ్, సీపీ వారియర్ ప్రారంభించారు. ఎన్నికల సంబంధ వార్తలపై నిఘా వేయడమే కాక ఫిర్యాదులపై దృష్టి సారించాలని చెప్పారు. అనంతరం డబ్బు, మద్యం, ప్రలోభాల నియంత్రణకు ఏర్పాటుచేసిన ఎంసీసీ, ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ బృందాలకు కేటాయించిన వాహనాలను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలో 15 ఫ్లయింగ్ స్క్వాడ్, 24 ఎంసీసీ, 15 ఎస్ఎస్టీ బృందాలను ఏర్పాటుచేశామని, ఈ బృందాలు షిఫ్ట్‌ల వారీగా 24గంటలు పనిచేస్తాయని తెలిపారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, అడిషనల్ డీసీపీ ప్రసాదరావు, వ్యయ పర్యవేక్షణ జిల్లా నోడల్ అధికారి సాయికుమార్, డీటీఓ కిషన్‌రావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్‌రెడ్డి, డీసీఓ విజయకుమారి, ఎల్డీఎం శ్రీనివాసరెడ్డి, ఏసీపీ గణేష్, డీఆర్డీఓ విద్యాచందన, సీపీఓ ఏ.శ్రీనివాస్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణుమనోహర్, డీపీఆర్వో ఎం.ఏ.గౌస్, ఏపీఆర్వో వి.శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 1950, 90632 11298 నంబర్లతో కంట్రోల్‌రూం ఎన్నికల నేపథ్యాన కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ గౌతమ్, సీపీ వారియర్ పరిశీలించారు. ఏ ఫిర్యాదు ఏ అధికారికి అందజేయాలో చార్జ్ ఏర్పాటుచేయాలని సూచించారు. ఓటర్లు తమ ఫిర్యాదులను 1950, 90632 11298 నంబర్లకు ఇచ్చేలా ప్రచారం చేయాలని తెలిపారు. -
ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి..కలెక్టర్
కుమరం భీం: జిల్లాలో ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, ఎస్పీ సురేశ్‌కుమార్‌తో కలిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి పై పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అ ధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖర్చుల పరిశీలకులు, సహాయ పరిశీలకులు, ఫ్లయింగ్ స్క్వాడ్– స్టాటిక్ సర్వేయలెన్స్, వీడియో సర్వేయలెన్స్ బృందాలు, అకౌంటింగ్ బృందం, ఎక్సైజ్ బృందం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. బృందాలను నియోజకవర్గాల వారీగా విభజించి విధులు కేటాయించామన్నారు. అధికారులు అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ప్రత్యేక వీడియో సర్వేయలెన్స్ టీం నియోజకవర్గంలో జరిగే ర్యాలీలు, బహిరంగ సభలు, ఎన్నికలకు సంబంధిత అంశాలను వీడియో రికార్డింగ్ చేస్తుందని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఫిర్యాదులపై స్పందించాలని, మద్యం, నగదు, కానుకల పంపిణీపై నిఘా ఉంచాలన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించి ఖర్చులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. 1950, 08733279411 నంబర్లతో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఆధారాలు లేకుండా రూ.50 వేల కంటే అధికంగా నగదు, రూ.10 వేల కంటే ఎక్కువ విలువైన మద్యం తరలిస్తే సీజ్ చేస్తామని తెలిపారు. ఎంసీఎంసీ బృందం దినపత్రికలు, టీవీ చానళ్లు, మొబైల్ సందేశాలు, సోషల్ నెట్‌వర్క్‌లపై దృష్టి సారించాలన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార సమయంలో ఎంసీఎంసీ అనుమతి పొందాలన్నారు. ప్రతిరోజూ ఫ్లయింగ్ స్క్వాడ్ నివేదికలు అందించాలని ఆదేశించారు. -
సరిహద్దులపై పోలీస్ ఫోకస్
కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలో మొత్తం 5 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అవి హైదరాబాద్ రూట్లో రేణికుంట టోల్‌ప్లాజా, పెద్దపల్లి మార్గంలో మొగ్దుంపూర్, జమ్మికుంట వైపు సిరిసే డు, వరంగల్ రూట్లో పరకాల ఎక్స్‌రోడ్ వద్ద, మంచిర్యాల రూట్లో చొప్పదండి ఆర్నకొండ వద్ద ఉన్నాయి. ఒక్కో చెక్‌పోస్టులో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ స్థాయి అధికారి, ఒక ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లు, ఎకై ్సజ్ శాఖ నుంచి ఒకరు, అటవీశాఖ నుంచి ఒకరు, రవాణా శాఖ నుంచి ఒకరు విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేల డబ్బులు, మద్యం, ఇతరత్రాలను కట్టడి చేసేందుకు వాహన తనిఖీలు చేపడుతున్నారు. నిబంధనలు పాటించాలి ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీపీ సుబ్బారాయుడు అన్నారు. మంగళవారం హుజూరాబాద్శివారులోని కేసీక్యాంపు, ఇల్లందకుంట మండలం సరిసేడు, తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్టులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆర్నకొండ చెక్‌పోస్టును రూరల్ ఏసీపీ కరుణాకర్‌రావు తనిఖీ చేశారు. సీపీ సుబ్బారాయుడు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ నేపథ్యం నగదు, బంగారం తీసుకెళ్లేవారు రశీదులు వెంట ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి, ఎలాంటి ఆధా రాలు లేని నగదు, బంగారాన్ని సీజ్ చేస్తామని తెలిపారు. వాహనదారులు అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో అనుమతి పొందిన ఆయుధాలపై నిషేధాజ్ఞలు అమలుచేస్తున్నట్లు తెలిపారు. గన్స్‌ను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేయాలని తెలిపారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. రూ.1.50 లక్షలు సీజ్ కరీంనగర్ టూటౌన్ పరిధిలోని తెలంగాణచౌక్ వద్ద మంగళవారం బైక్‌పై వెళ్తున్న వ్యక్తి వద్ద నుంచి ఎలాంటి ఆధారాలు లేని రూ.1.5 లక్షలు సీజ్ చేశారు. 10మంది పాతనేరస్తులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. త్రీటౌన్ పరిధిలోని కాపువాడలో ఓ బెల్ట్‌షాపులో 23 మద్యం బాటిళ్లు చేశారు. జమ్మికుంట మండలం కోరపల్లిలో ఓ బెల్టుషాపు నుంచి రూ.3,800 విలువ చేసే మద్యం సీజ్ చేశారు. వీణవంక మండలంలో 13మందిని తహసీల్దార్ తిరుమల్‌రావు ఎదుట భైండోవర్ చేసినట్లు ఎస్సై ఆసిఫ్ తెలిపారు. మండలంలోని మామిడాలపల్లి గ్రామంలోని ఓ బెల్టుషాపులో మద్యంబాటిళ్లను సీజ్ చేశారు. -
రోడ్డు వేస్తేనే.. ఓట్లు వేస్తాం.. లేదంటే ఎన్నికల బహిష్కరనే
నిర్మల్: తమ గ్రామానికి రోడ్డు వేస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని మండలంలోని గంగాపూర్, రానిగూడ, కొర్రతండా జీపీల పరిధిలోని 12 గ్రామాల ప్రజలు నిర్ణయించారు. ఆయా గ్రామాల నుంచి కడెం వరకు పాదయాత్రగా వచ్చేందుకు ప్రజలు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గంగాపూర్ గ్రామ సమీపంలోని వాగు వద్ద నిరసన తెలిపారు. నాయకులు, ప్రభుత్వాలు మారుతున్నా తమ ఊళ్ల రాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి పక్కా రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని తెలిపారు. గ్రామాల్లోకి అధికారులను, నాయకులను కూడా రానివ్వమని హెచ్చరించారు. మూడు గ్రామ పంచాయతీల కార్యదర్శులు, పాఠశాలల ఉపాధ్యాయులు ఇక నుంచి విధులకు రావొద్దని తెలిపారు. నిరసనలో గంగాపూర్, రానిగూడ, కొర్రతండా సర్పంచులు శాంత, భీంబాయి, సదర్లాల్, నాయకులు చంద్రహాస్, ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
స్వేచ్ఛగా అసెంబ్లీ ఎన్నికలు
నిర్మల్: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, స్వచ్ఛంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ వరుణ్‌రెడ్డి కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సమష్టిగా పని చేయాలని ఎస్పీ ప్రవీణ్‌కుమార్ సూచించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమీకృత కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ కిషోర్‌కుమార్, భైంసా ఏఎస్పీ కాంతిలాల్పటిల్, నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డితో కలిసి మంగళవారం సమావేశం నిర్వహించారు. కోడ్ దాటొద్దు.. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచే కోడ్ అమలులోకి వచ్చిందని కలెక్టర్ వరుణ్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఎవరూ నియమావళిని దాటొద్దని హెచ్చరించారు. పబ్లిక్ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పోస్టర్లు, చిహ్నాలను తొలగిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొత్తం 922 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నవంబర్ 30న ఎన్నికలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. జిల్లాలోని ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టామన్నారు. చునావ్ గ్రామసభ, సెల్ఫీ విత్ పోలింగ్ స్టేషన్ వంటి వినూత్న కార్యక్రమాలనూ నిర్వహిస్తామని తెలిపారు. సీనియర్ సిటిజన్స్, దివ్యాంగుల ఓటు నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు వివరించారు. ఓటు నమోదు చేసుకోవచ్చు.. జిల్లాలో 7,11,190మంది ఓటర్లు ఉన్నారని, కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించామన్నారు. ఇప్పటికీ ఓటు హక్కు లేని వారు ఈనెల 31లోపు నమోదు చేసుకోవాలని తెలిపారు. పెద్ద క్యూలైన్లు లేకుండా.. ఈసారి ఎన్నికలకు పెద్ద క్యూలైన్లు లేకుండా ప్రశాంతంగా ఓటువేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతీ పోలింగ్ స్టేషన్లో 1,500 దాటకుండా ఓటర్లు ఉండేలా చూస్తున్నామన్నారు. ఓటరుకు కేవలం 2కి.మీ. లోపే పోలింగ్ కేంద్రం ఉంటుందని చెప్పారు. కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్లు, ఫర్నిచర్, వృద్ధులు, దివ్యాంగులకు ర్యాంపులు, వీల్చైర్లు, ప్రత్యేకంగా వాలంటీర్లు వంటి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. జిల్లాలోని 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఉంటుందన్నారు. తొలిసారి ఎన్నికల కమిషన్ వృద్ధులు, దివ్యాంగుల కోసం ఇంటి నుంచి ఓటువేసే ప్రత్యేక అవకాశం కల్పించిందన్నారు. ఇలా ఓటు వేసేవారికి బీఎల్ఓలు ఫామ్–12డి ఇస్తారని, దీన్ని నవంబర్ 8లోపు రిటర్నింగ్ అధికారికి చేరేలా పంపించవచ్చని చెప్పారు. దివ్యాంగులు ఈ ఫామ్‌తోపాటు సదరం సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ జతచేయాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్నవారు ఎలక్ట్రానిక్/పోస్టల్ ఓటు వినియోగించుకోవచ్చని కలెక్టర్ వివరించారు. రూ.50 వేల లోపే అనుమతి.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తిచేసేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని ఎస్పీ ప్రవీణ్‌కుమార్ కోరారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పారదర్శకంగా ఎన్నికలు పూర్తిచేద్దామన్నారు. కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచే జిల్లాలో సరిహద్దుల్లో ఐదుచోట్ల, అంతర్గతంగా ఐదుచోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. మద్యం, డబ్బు, మత్తుపదార్థాలు రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నగదు కేవలం రూ.50 వేలకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. అంతకంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకెళ్తే స్వాధీనం చేసుకుని గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామన్నారు. సరైన లెక్కలు లేకపోతే ఆ డబ్బు ఐటీ అధికారులు జప్తు చేసుకుంటారని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు ఉన్నవారు సంబంధిత పత్రాలను చూపించాల్సి ఉంటుందని తెలిపారు. వాటిని నిర్ధారించుకున్న తర్వాతే అనుమతిస్తారని చెప్పారు. గన్‌లైసెన్స్ ఉన్నవారు ఆయుధాలను సమీప పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేయాలని తెలిపారు. రౌడీషీట్, కమ్యూనల్ కేసులు ఉన్నవారిని బైండోవర్ చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 153 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 17 మావోయిస్టు ప్రభావి త ప్రాంతాల్లో ఉన్నాయని వివరించారు. ఇక కనీసం సిగ్నల్ వ్యవస్థలేని 10 షాడో జోన్లో ఉన్నవాటికి శాటిలైట్ ఫోన్స్, కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా ఏర్పాట్లు చేస్తామన్నారు. సీ–విజిల్, డయల్ 100, కంట్రోల్‌రూం నంబర్లను ఉపయోగించుకుని పారదర్శక ఎన్నికలకు సహకరించాలని ఎస్పీ కోరారు. -
ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు.. కలెక్టర్
వనపర్తి: ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ తేజస్ పవార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నోడల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సర్వేలెన్స్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికల విధులపై సూచనలు చేశారు. జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సర్వేలెన్స్ బృందాల బాధ్యతలను వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరికి సమానంగా వర్తిస్తుందన్నారు. జిల్లాలో 4 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటాయని, జిల్లా నలుమూలల చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి నిఘా పెంచినట్లు తెలిపారు. అక్రమంగా డబ్బు, మద్యం సరఫరా చేస్తూ.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, బహుమతులు ఇవ్వడం లాంటివి నియంత్రించాలని ఆదేశించారు. సి–విజిల్ యాప్‌తో గాని టోల్‌ఫీ నంబర్ 1950, కంట్రోల్ రూంకు ఫిర్యాదు చేస్తే 15 నిమిషాల్లో ఘటన స్థలానికి చేరుకునేందుకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చేయాలని.. స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్ చురుగ్గా పని చేయాలని సూచించారు. రూ.50 వేల కన్నా అధికంగా పట్టుబడితే వెంటనే సీజ్ చేయాలన్నారు. రూ.10 లక్షల వరకు సరైన ఆధారాలు ఉంటే సీజ్ చేయబోమని.. ఇన్‌కం టాక్స్ వారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఎక్కువ విలువ గల వస్తువులు గుర్తిస్తే వీడియో కవరేజ్ చేస్తూ సీజ్ చేయాలని ఆదేశించారు. ఓటర్లను భయభ్రాంతులు, ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఎస్పీ ఆనంద్‌రెడ్డి పాల్గొన్నారు. -
సమస్యల ‘వాణి’ కి అందిన 400 దరఖాస్తులు..
కరీంనగర్: కలెక్టరేట్ సముదాయంలో సోమవారం జనసందోహం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందన్న సమాచారంతో ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి, తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అత్యధికంగా భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి 400కు పైగా దరఖాస్తులు రాగా ఆన్లైన్, మాన్యువల్‌గా స్వీకరించారు. కలెక్టర్ బి.గోపి, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. భూమి విషయంలో బెదిరిస్తున్నడు ఏళ్లుగా భూమిని అనుభవిస్తున్నం. పంటల సాగుతోనే కుటుంబాన్ని పోషిస్తున్నం. కానీ మా భూమితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి అతని భూమి అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నడు. సర్వే నంబర్ 126బి/3, 126ఎ/3 తదితర సర్వే నంబర్లలో మా భూమి ఉంది. అధికారులు న్యాయం చేయాలి.– బండారి కుటుంబసభ్యులు, చామనపల్లి, కరీంనగర్ రూరల్ పట్టాదారు పేరు మార్చండి చల్లూరు గ్రామంలో సర్వే నంబర్ 91, 728/2లో మూడెకరాల భూమి ఉంది. భూ రికార్డుల్లో తాతల కాలం నుంచి మేమే ఉన్నాం. కానీ సంబంధం లేని వ్యక్తి పేరిట మార్చారు. ఈ విషయంలో గత కొన్నేళ్లుగా తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. అయినా స్పందన లేదు. అధికారులు మోకాపై విచారణ జరిపి, న్యాయం చేయాలి. – గాజుల ప్రసాదరావు, చల్లూరు, వీణవంక వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి మాది కరీంనగర్‌లోని 42వ డివిజన్. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న. ఇప్పుడు శరీరం సహకరించడం లేదు. పని చేయాలంటే చేతకాని పరిస్థితి. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. రేపుమాపంటూ తిప్పుకుంటున్నరు. – బాసం మల్లయ్య, ప్రశాంత్‌నగర్, కరీంనగర్ వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి మాది కరీంనగర్‌లోని 42వ డివిజన్. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న. ఇప్పుడు శరీరం సహకరించడం లేదు. పని చేయాలంటే చేతకాని పరిస్థితి. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. రేపుమాపంటూ తిప్పుకుంటున్నరు. – బాసం మల్లయ్య, ప్రశాంత్‌నగర్, కరీంనగర్ పరిహారం ఇయ్యలే.. మాది కొత్తపల్లి మండలంలోని ఎలగందుల గ్రామం. మా ఇల్లు ఎస్సారెస్పీ ముంపునకు గురైంది. సర్వే నంబర్ 271లో ఇంటి నంబర్ 10–84 కాగా పరిహారం ఇచ్చే సమయంలో నా సోదరికి పక్షవాతం రావడంతో ఆస్పత్రిలో ఉన్నారు. అధికారులు కాలయాపన చేస్తున్నరు. – గడ్డం ఆంజనేయులు, రేకుర్తి, కరీంనగర్ -
బీజేపీతోనే అవినీతిరహిత పాలన సాధ్యం
ఆదిలాబాద్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అవినీతి రహిత పాలన సాధ్యమవుతుందని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జనగర్జన సభ ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజలను సీఎం కేసీఆర్ పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కుటుంబ అభివృద్ధికి మాత్రమే సీఎం కృషి చేశారని, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మరోవైపు ప్రధాన మోదీ నాయకత్వంలో కేంద్రంలో నీతిమంతమైన పాలన సాగుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలోని గిరిజనులు విద్య, ఉద్యోగ పరంగా మరింత ముందుకు వెళ్లేందుకు స్వయంగా ప్రధాని మోదీ గిరిజన వర్సిటీ ప్రకటించారన్నారు. జిల్లాలో బీజేపీకి ఎంతో ప్రజాదరణ ఉందని, ఇక్కడి నుంచి పార్లమెంట్ స్థానాన్ని గెలవడంతో పాటు గతంలో పలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ నుంచి పూరించనున్నట్లు వెల్లడించారు. ఈ బహిరంగ సభకు ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అంతకు ముందు సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు.. కలెక్టర్..
ఆదిలాబాద్: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన క్రమంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్‌రాజ్ అ న్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల కోడ్ వివరాలు వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమి షన్ సోమవారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వి డుదల చేసిందని తెలిపారు. దీంతో నియమావళి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుందని, 10 వరకు నామినేషన్ల గడువు, 13న పరిశీలన, 15న ఉపసంహరణ, 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుందని వివరించారు. ఓటర్లు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఓటరు లిస్టుతో తమ పేర్లు ఉన్నయో లేవో పరిశీలించుకోవాలన్నారు. ఎవరైనా పేర్లు లేకపోతే నామినేషన్లకు పది రోజుల ముందు వరకు ఫారం–6 ద్వారా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులకు నిబంధనలతో కూడిన బుక్లెట్ అందజేస్తామన్నారు. నియమావళిని పరిశీలించేందుకు ఫ్లయింగ్‌స్క్వాడ్ నియమించినట్లు తెలిపారు. అలాగే అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్కడ నిరంతరం సీసీ నిఘా, వీడియో చిత్రీకరణ ఉంటుందన్నారు. వీటిని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు అనుసంధానం చేశామన్నారు. ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తామన్నారు. అలాగే సర్వేలైన్ అధి కారుల ద్వారా పరిస్థితులను సమీక్షిస్తామన్నారు. ఒకవ్యక్తి రూ.50వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లరాదని, అంతకు మించి తీసుకెళితే సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే డబ్బును సీజ్ చేస్తామన్నారు. అలాగే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని, సభలు, సమావేశాలు నిర్వహించే ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రజలు స్వేచ్ఛాయూత వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొ ని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా రు.ఎన్నికల నిర్వహణ కోసం అన్నిఏర్పాట్లు చేస్తా మన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పె డుతామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సంక్షే మ పథకాలు సూచించే ఫ్లెక్సీలు తొలగించామన్నారు. ఇందులో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఐటీడీఏ పీవో చాహత్‌బాజ్‌పాయ్ పాల్గొన్నారు. -
లక్ష మందితో బీజేపీ ‘జనగర్జన’..
ఆదిలాబాద్: షెడ్యూల్ విడుదలతో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరిస్తుంది. ప్రచారంలో భా గంగా రాష్ట్రంలోనే తొలి బహిరంగ సభ ఆదిలాబాద్‌లో నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మంగళవారం జిల్లా కేంద్రానికి విచ్చేయనున్నారు. ఈ బహిరంగసభకు జనగర్జనగా నామకరణం చేశా రు. డైట్ మైదానంలో మధ్యాహ్నం ఒంటి గంటకు సభ ప్రారంభం కానుంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నేతలు బండి సంజయ్, ఈటల ఇతరత్రా ము ఖ్యనేతలతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాలు చూసే జాతీయనేతలు కూడా హాజరు కానున్నారు. ఈ స భ కోసం కొద్ది రోజులుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నా రు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ సభ ద్వారా బీజేపీ ఎన్నికల సమరశంఖం పూరించనుంది. లక్ష జనసమీకరణ.. ఈ సభ కోసం బీజేపీ భారీగా ఏర్పాట్లు చేసింది. డైట్ మైదానంలో నిర్వహిస్తుండగా ప్రాంగణంలో జర్మన్ టెంట్ ఏర్పాటు చేశారు. ఎలాంటి వాతావరణంలోనైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు లక్ష జనాన్ని సమీకరించేలా ప్రణాళిక చేశారు. ఆయా నియోజకవర్గాల బాధ్యులు జనసమీకరణపై దృష్టి సారించారు. కాషాయమయం.. బీజేపీ జనగర్జన సభ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రం పూర్తిగా కాషాయమయంగా మారిపోయింది. పట్టణంలోని డివైడర్ పొడవునా, ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చౌక్‌లను పార్టీ జెండాలతో నింపేశారు. ఎన్నికల తొలి బహిరంగ సభ కావడం, కేంద్ర హోంమంత్రితో పాటు జాతీయ, రాష్ట్ర ముఖ్య నేతలు వస్తుండటంతో భారీ ఏర్పాట్లు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. హోంమంత్రి హెలీక్యాప్టర్ అక్కడ దిగనుంది. అక్కడి నుంచి ప్రత్యేక వాహనం ద్వారా డైట్ మైదానానికి చేరుకుంటారు. అడుగడునా బందోబస్తు ఏర్పాటు చేశారు. అమిత్ షా జెడ్‌ప్లస్ సెక్యూరిటీలో ఉండడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ డి.ఉదయ్‌కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. హెలీప్యాడ్ స్థలంతో పాటు బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కడప: కడప – తాడిపత్రి ప్రధాన రహదారిలో వల్లూరు మండల పరిధిలోని తోల్లగంగనపల్లె సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వల్లూరు ఎస్ఐ పెద్ద ఓబన్న తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగుంట్లకు చెందిన రాజుల మధుసూదన్‌రెడ్డి (28) కడపలోని రైల్వే విద్యుత్ కేంద్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తుండే వాడు. ఆయన విధులు ముగించుకుని సోమవారం ఉదయం ఎర్రగుంట్లకు ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. మార్గంమధ్యలో తోల్లగంగనపల్లె బస్టాపు వద్ద గంగాయపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు లక్ష్మీనరసింహ, మధు పాఠశాలకు వెళ్లడానికి లిఫ్ట్ అడిగారు. దీంతో వారిని ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని బయలుదేరాడు. అక్కడి నుంచి కొద్ది దూరంలో ఏ ఓబాయపల్లెకు చెందిన నిరంజన్‌రెడ్డి వస్తున్న ద్విచక్ర వాహనం, మధుసూధన్‌రెడ్డి ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. వారి వెనుకే కడప వైపు నుంచి ఎర్రగుంట్ల వైపు వస్తున్న లారీ ద్విచక్ర వాహనాలను ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు చెల్లాచెదురుగా పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు చికిత్స కోసం కడప ఆసుపత్రికి తరలించారు. కాగా తీవ్రంగా గాయపడ్డ మధుసూదన్‌రెడ్డిని ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్య కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. కాగా ఆయనకు ఈ నెల 25వ తేదీన వివాహం జరగాల్సి వుందని సమాచారం. -
ముగిసిన ఎస్జీఎఫ్ ఫుట్‌బాల్ పోటీలు
కడప: స్థానిక జెడ్పీ హైస్కూల్ మైదానంలో మూడు రోజులుగా నిర్వహించిన 67వ ఎస్జీఎఫ్ అంతర్‌జిల్లాల ఫుట్‌బాల్(అండర్–19) పోటీలు సోమవారం సాయంత్రం ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల ప్రాతిపాదికన జట్లు పాల్గొన్నాయి. బాలికల విభాగంలో మొదటి స్థానంలో కడప, రెండో స్థానంలో అనంతపురం, మూడో స్థానంలో గుంటూరు, నాలుగో స్థానంలో విశాఖపట్నం నిలిచాయి. హోరాహోరీగా జరిగిన ఫైనల్స్‌లో 2–1 స్కోర్‌తో అనంతపురంపై కడప జట్టు జయకేతనం ఎగురవేసింది. బాలుర విభాగంలో ప్రథమస్థానంలో అనంతపురం, ద్వితీయస్థానంలో గుంటూరు, మూడోస్థానంలో కడప, నాలుగోస్థానంలో చిత్తూరు నిలిచాయి. ఫైనల్స్‌లో 4–3 స్కోర్‌తో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు మదనపల్లె ఆర్డీఓ ఎం.ఎస్.మురళీ, ఎస్జీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ జయరామయ్య చేతుల మీదుగా కప్‌లు, మెడల్స్, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు వరదారెడి గారి నారదరెడ్డి ఫుట్‌బాల్ పోటీల నిర్వహణకు రూ.10,116, విజేతలుగా నిలిచిన కడప(బాలికలు), అనంతపురం(బాలురు) జట్టులకు ఒక్కొక్క జట్టుకు రూ.10,116 చొప్పున మొత్తం రూ.30,348 ప్రోత్సాహక బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎం.ఎస్.మురళీ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పాటైన తర్వాత మదనపల్లెలో తొలిసారిగా 67వ ఎస్జీఎఫ్ అంతరజిల్లాల ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎస్జీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ జయరామయ్య మాట్లాడుతూ 67వ అంతరజిల్లాల ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపిక చేశామన్నారు. వీరు రాష్ట్రం తరఫున జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకరరెడ్డి, రాజగోపాల్, ఏసీటీఓ నాగేంద్ర, హెచ్ఎం సుబ్బారెడ్డి, మహమ్మద్‌ఖాన్, పీఈటీలు అన్సర్, సుధాకర్, రమేష్, నాగరాజు, కరుణానిధి, 13 జిల్లాల జట్ల మేనేజర్లు, కోచ్‌లు పాల్గొన్నారు. అండర్–19 జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక చేసినట్లు ఎస్జీఎఫ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ జయరామయ్య తెలిపారు. సెలక్షన్ కమిటీ సభ్యులుగా ఉదయ్‌భాస్కర్, శ్రీనివాసులు, రమేష్ వ్యవహరించారు. జాతీయస్థాయి జట్టుకు ఎంపికైన బాలురు ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 4 వరకు జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో, బాలికలు నవంబర్‌లో పంజాబ్‌లో జరిగే జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. బాలికలజట్టు: ఎస్.భానుశ్రీ, కె.మనీషా, ఆర్.భువన, ఎం.సావిత్రి(కడప), పి.కావ్యశ్రీ, యు.హారిక, కె.మమత(అనంతపురం), ఎం.పవిత్రపావని, ఎం.జ్యోతి, పి.టి.వి.హరిప్రియ(గుంటూరు), పి.సులోచన, జి.హేమహాసిని(వైజాగ్), పి.సుహర్ష, ఏ.బెహ్హప్మన్ జున్నా(కృష్ణా), కె.పావని(చిత్తూరు), జి.కావేరి(ప్రకాశం), ఎం.శిరీషా(నెల్లూరు), వి.సత్యసౌమ్య(ఈస్ట్‌గోదావరి) రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యారు. స్టాండ్‌బైలుగా కె.జొన్నాప్రహర్షిత(కృష్ణ), ఎం.వెంకటసుప్రజ (కడప), ఎల్.గాయత్రి(విజయనగరం), వి.ప్రజ్ఞారమణ(కర్నూలు), జీవిత(నెల్లూరు). బాలుర జట్టు: ఆసిఫ్, ఎ.నందకిశోర్, భరత్, జి.నరేంద్ర(అనంతపురం), జి.కౌశిక్, ఎస్.డి.రవూఫ్, ఎస్.కె.నాగషరీఫ్(గుంటూరు), సీతుమాధవ్, పి.విఘ్నేష్(కడప), సుఫియాన్, సి.అరవింద్(చిత్తూరు), జె.మైఖేల్(ప్రకాశం), అభి(కర్నూలు), వైడియస్ అశ్వథ్(వైజాగ్), జే.రాముడు(కృష్ణ), కెల్విన్కెన్నెట్(చిత్తూరు), వై.కల్యాణ్(విజయవాడ), కె.అశోక్‌కుమార్(నెల్లూరు) స్టాండ్‌బైలుగా అఖిల్‌యాదవ్(చిత్తూరు), వి.విజయ్(గుంటూరు), డి.వీరబాబు(ఈస్ట్‌గోదావరి), టి.రోహిత్.శ్రీ.ఫణిధర్(వెస్ట్‌గోదావరి), జ్ఞానేశ్వర్(శ్రీకాకుళం). -
‘జగనన్న ఆరోగ్య సురక్ష’కు విశేష స్పందన
కడప: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని జిల్లా నోడల్ అధికారి మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని వి.కొత్తపల్లె గ్రామంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష పనితీరుపై తెలుసుకునేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాలకు నోడల్ అధికారులను నియమించిందన్నారు. వైద్యశిబిరానికి వచ్చిన రోగులను అడిగి.. అందుతున్న సేవలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన బీపీ చెకప్ చేయించుకున్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ స్టాల్స్‌ను పరిశీలించి అక్కడి గర్భవతులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓ అర్జున్ రావు, ఎంపీడీఓ విజయరాఘవరెడ్డి, తహసీల్దార్ వెంకటసుబ్బయ్య, మండల ఉపాధ్యక్షురాలు లీలావతి, సర్పంచ్ గంగరాజు, వైద్యులు పాల్గొన్నారు. -
చిత్తూరు, అనంత జట్ల జయకేతనం
కడప: ఏసీఏ అండర్–23 అంతర్ జిల్లాల మల్టీడేస్ క్రికెట్ టోర్నమెంట్లో చిత్తూరు, అనంతపురం జట్లు జయకేతనం ఎగురవేశాయి. కడప నగరంలోని కేఓఆర్ఎం మైదానంలో 41 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం బరిలోకి దిగిన చిత్తూరు జట్టు 11.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 72 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. జట్టులోని శశాంక్ శ్రీవాత్సవ్ 29 పరుగులు చేశాడు. కర్నూలు బౌలర్ సాత్విక్ 2 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 54.4 ఓవర్లలో 220 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని సాయిసూర్యతేజారెడ్డి 140 పరుగులు చేశాడు. చిత్తూరు బౌలర్లు ఆశిష్‌రెడ్డి 4, మల్లేశన్ 3 వికెట్లు తీశారు. కాగా చిత్తూరు జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 550 పరుగులు చేయగా, కర్నూలు జట్టు 226 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చిత్తూరు జట్టు 176 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. ‘అనంత’ విజయం కేఎస్ఆర్ఎం మైదానంలో 282 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన అనంతపురం జట్టు 64.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. జట్టులోని దత్తారెడ్డి 87 పరుగులు చేశాడు. కడప బౌలర్లు అస్లాం 3, విజయ భువనేంద్ర 2, ఆదిల్ హుస్సేన్ 2, సాయికుమార్‌రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 38.4 ఓవర్లలో 172 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. జట్టులోని శివకేశవరాయల్ 24 పరుగులు చేశాడు. అనంతపురం బౌలర్లు లోహిత్సాయికిశోర్ 6 వికెట్లు, మల్లికార్జున 3 వికెట్లు తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో అనంత జట్టు 207 పరుగులు చేయగా, కడప 171 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అనంతపురం జట్టు 182 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. -
అదరగొట్టిన కడప బాలికలు
కడప: మైదుకూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ పోటీల్లో కడప, విజయనగరం జట్లు అదరగొట్టాయి. మైదుకూరు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన ఈ పోటీలు సోమవారం ఫైనల్ మ్యాచ్‌లతో ఘనంగా ముగిశాయి. స్థానిక మేథా డిఫెన్స్ అకాడమి మైదానంలో ఒకటో కోర్టులో సోమవారం బాలుర విభాగంలో విజయనగరం – పశ్చిమగోదావరి జిల్లాల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా విజయనగరం విజేతగా నిలిచింది. రెండో కోర్టులో బాలికల విభాగంలో కడప– గుంటూరు జిల్లాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కడప జట్టు ఘన విజయం సాధించింది. బాలుర విభాగంలో సెమీ ఫైనల్లో విజయనగరం జట్టు చేతిలో ఓడిపోయిన శ్రీకాకుళం, బాలికల విభాగంలో సెమీ ఫైనల్లో గుంటూరు జట్టుతో ఓడిపోయిన ప్రకాశం మూడో స్థానంలో సరిపెట్టుకున్నాయి. క్రీడా స్ఫూర్తితో పోటీలు జరగడం హర్షణీయం రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు మైదుకూరులో క్రీడా స్ఫూర్తితో జరగడం హర్షణీయమని ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డి తెలిపారు. వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలు మైదుకూరులో నిర్వహించడం నియోజకవర్గానికి ప్రతిష్టగా నిలిచిందన్నారు. టోర్నమెంట్ ప్రారంభ వేడుకల్లో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఆయన తనయుడు నాగిరెడ్డి సోమవారం పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు నగదు బహుమతులను అందజేశారు. బాలికల, బాలుర విభాగంలో విజేతలుగా నిలిచిన కడప, విజయనగరం జట్లకు రూ.20 వేల చొప్పున, రెండో స్థానంలో నిలిచిన పశి్చమగోదావరి, గుంటూరు జట్లకు రూ.10 వేల చొప్పున నగదు బహుమతులను ఆయా జట్ల కెపె్టన్, కోచ్ మేనేజర్లకు అందజేశారు. మూడో స్థానంలో నిలిచిన శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల జట్లకు రూ.5 వేల నగదును అందించారు. మైదుకూరు మున్సిపల్ వై.రంగస్వామి మాట్లాడుతూ పోటీల్లో గెలుపోటములు సహజమేనని అన్నారు. మైదుకూరులో వాలీబాల్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ చూపి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని సూచించారు. శెట్టిపల్లె నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్‌తోపాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల కార్యనిర్వాహక కార్యదర్శులు అరుణకుమారి, వసంత, మేధా డిఫెన్స్ అకాడమి చైర్మన్ సి.నరసింహులు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర నాయకులు విజేతలుగా నిలిచిన జట్లలోని క్రీడాకారులకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ బహూకరించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాల సంఘం నాయకులు సాజిద్, రమేష్ యాదవ్, నిత్య ప్రభాకర్, ప్రవీణ్ కుమార్, కిరణ్, శ్రీకాంత్, రమేష్ బాబు, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జట్లకు ఎంపిక శ్రీనగర్‌లో వచ్చే నెలలో జరిగే జాతీయ స్థాయి అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్లను ఎంపిక చేశారు. అండర్–17 బాలుర, బాలికల వాలీబాల్ టోర్నమెంట్ ముగిసిన అనంతరం రాష్ట్ర బాలుర, బాలికల జట్లను ఎంపిక చేశారు. బాలికల జట్టు : జి.ప్రవల్లిక (విశాఖపట్నం), ఎం.విజయలక్ష్మి (విజయనగరం), వి.కుసుమప్రియ, పావని (కడప), సోని, ఎం.సుమశ్రీ(గుంటూరు), పి.జశి్వత(అనంతపురం), ఇ.షణ్ముఖ ప్రియ (చిత్తూరు), కె.ప్రీతి (తూర్పుగోదావరి), ఎస్.పూజిత (ప్రకాశం), సీహెచ్ శ్రీపద్మజ(కృష్ణ), స్టాండ్ బైగా డి.కీర్తన (గుంటూరు), ఎస్.మానస (అనంతపురం), ఎం.వెంకటలక్ష్మి (నెల్లూరు), ఎస్.ఉన్నత సత్యశ్రీ(కృష్ణ), డి.సమైక్య (ప్రకాశం). బాలుర జట్టు : ఎ.ప్రేమ్ కుమార్, ఎస్.తోషన్ రాము (శ్రీకాకుళం), టి.రాహుల్, ఎన్.మౌర్య (విశాఖపట్నం), బి.రంజిత్ (విజయనగరం), వి.రాజు (పశ్చిమ గోదావరి), టి.సు«దీర్ (అనంతపురం), కె.డేవిడ్ రాజు (గుంటూరు), పి.కిరణ్‌బాబు (ప్రకాశం), ఎన్.అజయ్‌కుమార్ (కడప), స్టాండ్‌బైగా ఎస్.భరత్ (కృష్ణ), వై.రోహిత్(కడప), ఎం.ఆర్యన్ (నెల్లూరు), బి.కార్తీక్(అనంతపురం), వై.రాంబాబు (తూర్పుగోదావరి), కె.రాము (పశ్చిమ గోదావరి). -
ఎన్నికల కోసం ఇలా.. సిద్థంగా వున్నాము..
జిల్లాలో 1,338 పోలింగ్ స్టేషన్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్–14 టీంలు, స్టాటిస్టిక్ సర్వైలైన్స్–14 టీంలు,వీడియో సర్వైలైన్స్ టీంలు–09, వీడియో వీవింగ్ 05,మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహణకు 19 టీంలు కరీంనగర్: ఎన్నికల కోడ్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం నుంచి అమలులోకి వచ్చిందని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) నిర్వహణలో భాగంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని కరీంనగర్ కలెక్టర్ బి.గోపి వెల్లడించారు. సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీఐజీ రమేశ్‌నాయుడు, సీపీ సుబ్బారాయుడుతో కలిసి మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 2,807 బ్యాలెట్ యూనిట్ లు, 2,222 కంట్రోల్ యూనిట్ లు, 2,187 వివి పాట్ లు సిద్ధంగా ఉంచాం. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులను సి–విజిల్‌యాప్ ద్వారా చేయొచ్చని సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహణకు సంబంధించి ఫిర్యాదులను కంట్రోల్ రూమ్‌కు 1950కు 24 గంటలపాటు ఫిర్యాదు చేయొచ్చన్నారు. కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రచారానికి సంబంధించిన ప్రభుత్వ, రాజకీయ ప్రకటనల తొలగింపు ప్రారంభమైందని ప్రభుత్వ పరిధిలోని ఆస్తులపై 24 గంటల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవాటిని 48 గంటల్లో ... ప్రైవేటు ఆస్తులపై ఉన్న యాడ్స్‌ను 72 గంటల్లో తొలగిస్తామని కలెక్టర్ తెలిపారు. నగదు రవాణాపై ఆంక్షలు ఉన్నాయని.. రూ.50 వేలకు మించి నగదు రవాణా చేయాల్సి వస్తే.. డాక్యుమెంట్లు దగ్గర ఉంచుకోవాలన్నారు. ఐటీ, ఎక్సైజ్, ఫారెస్ట్, జీఎస్టీ, ఆర్టీవో డిపార్ట్మెంట్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయని, ఒకవేళ ఎలాంటి నగదు సీజ్ చేసినా.. డీఆర్డీవో నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వాటిని పరిశీలించి చర్యలు చేపడుతుందని వివరించారు. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ–సువిధ యాప్ ద్వారా పర్మిషన్ల కోసం్ల దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మీడియా ప్రసారాలు, వార్తా కథనాలు, పెయిడ్ ఆర్టికల్స్, సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఉంఉంటుందని పేర్కొన్నారు. ఏమైనా అనుమానాస్పదంగా అనిపిస్తే.. వాటిని అభ్యర్థి ఖర్చులో జమ చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరువ్యవహరించినా వారిపై కేసులు నమోదు చేస్తాం అని స్పష్టంచేశారు. జిల్లాలో తనిఖీల కోసం ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు సీపీ సుబ్బారాయుడు చెప్పారు. ఇందులో మిగిలిన డిపార్ట్మెంట్లు కూడా ఉంటాయన్నారు. ఎన్నికలపై నిఘా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక టీంలతో ఎప్పటికప్పుడు సమన్వయంతో చేసుకుంటామని తెలిపారు. అక్రమ ఆయుధాలు, లైసెన్స్డ్ ఆయుధాలు వెంటనే సరెండర్ చేయాలని ఆయన ఆదేశించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తామని సీపీ పేర్కొన్నారు. -
ఎవరు ఎంత కమీషన్ ఇచ్చారో.. లెక్కరాసుకుంటున్న సీక్రెట్ ఏజెంట్లు!
నిజామాబాద్: నగరంలో రాములు (పేరుమార్చాం)అనే వ్యక్తి తనకు సంబంధించిన డివిజన్ కార్పొరేటర్ వద్దకు వెళ్లి దళిత బంధు విషయంపై విన్నవించుకున్నారు. సదరు కార్పొరేటర్ నాకు రూ. 7 లక్షలు, నీకు రూ. 3 లక్షలు అయితేనే నీ పేరు జాబితాలో పెట్టిస్తానన్నాడు. ఇదేం బాగోలేదని మరో కీలక నాయకుడిని సంప్రదిస్తే నీకు రూ. 5 లక్షలు, నాకు రూ. 5 లక్షలు అని ఒప్పందం చేసుకున్నాడు. నీవు ఎక్కడికి వెళ్లినా ఇదే పరిస్థితి అని దబాయించాడు సదరు నాయకుడు. దీంతో ఏమీ చేయలేని స్థితిలో రాములు సరేనన్నాడు. ఇలా దళితబంధు విషయంలో నగరంలో కమీషన్ దందా నడుస్తోంది. నిజామాబాద్ నగరంలో ప్రజాప్రతినిధి ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి అంగీకారం తెలిపినప్పటికీ షాడోబాస్ కూడా ఓకే చెప్పాల్సిందే.. లేకపోతే ఆ పని అక్కడే ఆగిపోతుంది. ప్రస్తుతం ఈ సంఘటనలు నగరంలో చర్చనీ యాంశంగా మారాయి. ముఖ్యంగా దళిత బంధు రెండో విడత అర్హుల జాబితా అంతా ప్రజాప్రతినిధి వెనక షాడో వ్యక్తి కనుసన్నల్లోనే జరిగింది. తన సీక్రెట్ ఏజెంట్ల ద్వారా ముందస్తుగానే పెద్ద ఎత్తున లక్షల్లో ముడుపుల బాగోతాన్ని నడిపించాడని చర్చించుకుంటున్నారు. ఎవరు ఎంత మొత్తంలో కమీషన్ ఇచ్చారో లెక్కరాసుకుని మరీ జాబితాను సిద్ధం చేశారని వినికిడి. 1100 మందితో కూడిన దళితబంధు రెండో జాబితాలో సుమారు 1000 మందికి పైగా లబ్ధిదారుల నుంచి ముందస్తుగా కమీషన్లు తీసుకున్నాకే పేర్లు నమోదు చేశారని సమాచారం. రూ. 30 కోట్లకు పైనే.. దళితబంధు రెండో విడత డబ్బులు రిలీజ్ కాకముందే సదరు ప్రజాప్రతినిధి వద్ద ఉండే షాడో వ్యక్తి తన సీక్రెట్ ఏజెంట్లతో కమీషన్లు వసూళ్లు చేసేశారు. దళితబంధు కింద లబ్ధిదారుడికి రూ.10లక్షలు వ స్తుండగా ముందుగానే ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ. 3 లక్షలు, మరీ అమాయకులైతే రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో మాజీ డివిజన్ ప్రజాప్రతినిధులకే కాకుండా, ప్ర స్తుత డివిజన్ ప్రజాప్రతినిధులు కూడా తమవారి పేర్లు దళితబంధు లిస్ట్‌లో చేర్చేందుకు షాడోకు ముందుగానే కమీషన్లు ఇచ్చేశారు. మొదటి విడతలో 100 మంది లబ్ధిదారుల్లో రూ. 3 కోట్ల వరకు వసూలు చేస్తే, రెండో విడత 1100 మంది లబ్ధిదారుల వద్ద సుమారు రూ. 30 కోట్లకు పైనే వసూళ్లు చేశారని అధికార పార్టీ నాయకులే చర్చించుకోవడం గమనార్హం. ప్రజాప్రతినిధికి షాడోనే పక్కనుంచి మచ్చతెస్తున్నా గుర్తించలేకపోతున్నాడని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ముందుగానే డబ్బులు.. సదరు ప్రజాప్రతినిధికి మచ్చ తెస్తున్న షాడో వ్యక్తి ఈసారి నేరుగా కాకుండా సీక్రెట్ ఏజెంట్ల వ్యవస్థను తయారు చేసుకున్నా డు. తనకు అత్యంత నమ్మకంగా ఉండే వ్యక్తుల ను తయారు చేసుకున్నారు. వారితోనే నగరంలోని ఆయా డివిజన్లలో దళిత బంధు రెండో వి డత జాబితాను రూపొందించారు. సీక్రెట్ ఏజెంట్లు కూడా షాడో పేరు బయటకు రాకుండా క్షేత్రస్థాయిలో దళితబంధు బాగోతాన్ని చక్కబెడుతున్నారు. దళితబంధు కా వాలంటే లబ్ధిదారుడితో కమీషన్‌ను ముందే మాట్లాడుకుని వసూళ్లు చేశారు. రెండు నెలలుగా ఈ సీక్రెట్ ఏజెంట్లు, షాడో వ్యక్తికి మధ్య దళితబంధు విషయంలో రూ. కోట్లల్లో వ్యవహారం నడిచిందని వినికిడి. సీక్రెట్ ఏజెంట్లతో పాటు ఇద్దరు, ముగ్గురు నాయకులు, సదరు పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జీలు సైతం షాడో గ్రూప్‌లో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. -
కోడ్ కూయక ముందే సరిహద్దులో తనిఖీ కేంద్రాలు..
మంచిర్యాల : రానున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేదుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ యంత్రాంగం ప్రత్యేక కార్యచరణకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల కోసం ముందస్తు కసరత్తు ప్రారంభించింది. జిల్లా సరి హ ద్దు ప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశా రు. మంచిర్యాల–జగిత్యాల, జిల్లాల సరిహ ద్దు ప్రాంతమైన దండేపల్లి మండలం గూడెం అటవీ చెక్‌పోస్టు వద్ద, దండేపల్లి పోలీసులు తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు. వచ్చి పోయే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. అక్రమ మద్యం, డబ్బు, ఓటర్లను ప్రలోభ పె ట్టేందుకు తరలించే వస్తువులపై ప్రత్యేక నిఘా పెట్టి, తనిఖీలు ముమ్మరం చేశారు. గతంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చాక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈసారీ మాత్రం ముందుగానే తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయడం గమనార్హం. -
డబుల్ కల నెరవేరేది ఎప్పుడు..?
మంచిర్యాల: పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించింది. నిర్మాణాలు పూర్తి కావడంతో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. గత మార్చి 17న కలెక్టర్ బదావత్ సంతోష్ ఆధ్వర్యంలో లక్కీడ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఇళ్లు అప్పగించలేదు. నేడో రేపో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఇప్పట్లో పేదల డబుల్ కల నెరవేరే అవకాశం కనిపించడం లేదు. షెడ్యూల్ వస్తే మరింత జాప్యం అనర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు డ్రాలో వచ్చిందని మున్సిపల్ అధికారులకు, రెవె న్యూ అధికారులకు, కలెక్టర్‌కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 85 ఫిర్యాదులను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వారి సిబ్బందితో మరోసారి సర్వే చేసి, 50 మందిని అనర్హులుగా గుర్తించారు. వారికి మినహా మిగతా వారికి డబుల్ బెడ్రూంలను ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయితే మరింత ఆలస్యంగా ఇళ్లు కేటాయించే అవకాశం ఉంది. పునఃపరిశీలన పేరుతో అసలైన లబ్ధిదారులకు ఇప్పటికీ ఇళ్లు అప్పగించడం లేదు. రెండు నెలలుగా కాలయాపన చేస్తున్నారు. మున్సిపల్, రెవె న్యూ అధికారులు ఉమ్మడిగా సర్వే చేస్తున్నా అనర్హులను గుర్తించడంలో ఇంకా జాప్యం జరుగుతోంది. ఎన్నికల కోడ్ రాకముందే డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 360 నిర్మాణాలు పూర్తి.. జిల్లా కేంద్రంలో 650 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టగా, అందులో 360 నిర్మాణ పనులు పూర్తయ్యాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన 30 కుటుంబాలకు గతంలోనే 30 ఇళ్లను మంజూరు చేశారు. మిగిలిన 330 ఇళ్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. 5 వేల దరఖాస్తులు.. ఇక 330 ఇళ్ల కోసం 5 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు మొదటగా 2,958 మందిని అర్హులుగా గుర్తించారు. మండల రెవెన్యూ అధికారులతోపాటు, జిల్లాస్థాయి అధికారులు రెండుసార్లు సర్వే చేసి, అర్హులు 1,616 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వారికి టోకెన్లు అందించారు. మార్చి 17న జిల్లా కలెక్టర్ అధ్యక్షతన టోకెన్లు తీసుకున్న వారి సమక్షంలోనే లక్కీడ్రా పద్ధతిలో 330 మందిని ఎంపిక చేశారు. స్థలం ఉన్నవారికి, ఒకే ఇంట్లో ఇద్దరికి సైతం డబుల్ బెడ్రూం ఇళ్లు లక్కీడ్రాలో పొందారని ఆధారాలతో ఫిర్యాదు చేయగా, 50 మంది వరకు స్వచ్ఛందంగా డబుల్ బెడ్రూం ఇళ్లను వదులుకున్నారు. కానీ అన్ని అర్హతలు ఉన్నవారికి మాత్రం ఇప్పటి వరకు ఇళ్లను అప్పగించలేదు. -
రోడ్డు కోసమని రోడ్డున పడేస్తున్నారు...
నారాయణ్‌పేట్: కేంద్ర ప్రభుత్వం మహబూబ్‌నగర్– చించోలి రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించింది. బెంగుళూరు– ముంబాయి మధ్య జాతీయ రహదారులను అనుసంధానం చేసేందుకు మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని భూత్పూర్ నుంచి కర్ణాటకలోని మన్నెకలి వరకు ఉన్న 192 కి.మీ., మేర రోడ్డును జాతీయ రహదారిగా విస్తరించడానికి గతేడాది రూ.703 కోట్లు మంజూరయ్యాయి. తెలంగాణలో మూడు జిల్లాలను కలుపుతూ వెళ్తున్న ఈ రోడ్డును 167 జాతీయ రహదారిగా గుర్తించారు. మొదటి ప్యాకేజీలో భాగంగా భూత్పూర్ నుంచి దుద్యాల వరకు ఈ ఏడాది మార్చిలో పనులు ప్రారంభించగా.. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల బీటీ వేయగా.. అవసరమైన చోట కల్వర్టుల నిర్మాణం దాదాపుగా పూర్తిచేశారు. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు తొలగిస్తుండటంతో గూడు కోల్పోవడమే కాక.. పలువురి ఉపాధికి ఎసరు వచ్చింది. దీంతో జాతీయ రహదారి వచ్చిందని సంతోషపడాలో.. లేక తమ గూడు చెదిరిందని బాధపడాలో అర్థం కాక గొడోమంటున్నారు. 400 ఇళ్ల వరకు.. 5 మండలాల్లోని 17 గ్రామాల్లో 50 ఫీట్లలోపు ఉన్న 400 ఇళ్ల వరకు తొలగిస్తుండడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రూ.లక్షలు వెచ్చించి నిర్మించుకున్న ఇళ్లు కళ్ల ముందే కూల్చివేస్తుండడంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం సైతం లేకపోవడం.. అటు ప్రభుత్వం వేరే దారి చూపకపోవడంతో రోడ్డుపాలవుతున్నారు. 50 ఫీట్లలోపు ఉన్న ఇళ్లకు, వ్యవసాయ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వమని అధికారులు తేల్చిచెప్పారు. భూత్పూర్ నుంచి దుద్యాల వరకు కేవలం 100 మాత్రమే 50 ఫీట్ల బయట ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటికి మాత్రమే పరిహారం ఇస్తామనడంతో బాధితులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. 81.5 ఎకరాల భూమి.. భూత్పూర్ నుంచి దుద్యాల వరకు 60 కి.మీ., రోడ్డు విస్తరణకు గాను 81.5 ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. 5 మండలాల్లోని 17 గ్రామాలకు చెందిన 547 మంది రైతులు తమ భూములు కోల్పోతున్నారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయ పొలాలతోపాటు ప్లాట్లు కూడా ఉన్నాయి. ఆయా గ్రామాల్లో బాధితుల వారిగా ఎవరి భూమి, ఇల్లు ఎంతెంత పోతుంది అని గతేడాది అక్టోబర్‌లోనే అధికారులు సర్వే చేసి మార్కింగ్ ఇచ్చారు. ఇళ్లు, భూ నిర్వాసితులకు కలిపి పరిహారం ఇవ్వడానికి రూ.135 కోట్లు కేటాయించారు. అయితే పనులు ప్రారంభమై 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేకపోయారు. ఇటీవల రంగారెడ్డిపల్లి సర్పంచ్ లక్ష్మీదేవి పరిహారం చెల్లించాలని విస్తరణ పనులు అడ్డుకున్నారు. హోటల్ పోయింది.. గండేడ్‌లో మంచి అడ్డా దొరకడంతో తాత్కాలికంగా షెడ్డు వేసుకొని హోటల్ నిర్వహిస్తున్నా. నిత్యం రూ.2–3 వేల వరకు గిరాకీ అయ్యేది. ఇప్పుడు దాన్ని తీసేయమంటున్నారు. హోటల్‌నే నమ్ముకున్న మేము ఎలా బతకాలో అర్థం కావడం లేదు. ఇంటిల్లిపాది దానిపైనే ఆధారపడ్డాం. కనీసం ఇంకోచోట బతికే పరిస్థితి లేకపోవడంతో ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. – ఆంజనేయులు, చెన్నాయిపల్లి ఒక్క గదే మిగిలింది.. నాకు మూడు షెట్టర్లు, రెండు గదులు ఉండగా.. ఒక్క దాంట్లో మొబైల్ షాపు పెట్టుకొని మిగతావి అద్దెకు ఇచ్చాం. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునే వాళ్లం. అధికారులు వచ్చి రెండు రోజుల్లో మార్కింగ్ చేసిన వరకు తీసేయాలని.. లేదంటే జేసీబీతో కూల్చేస్తామన్నారు. అలా చేస్తే మొత్తం పోతుందని సొంతంగా కూల్చేయడం వల్ల ఒక్క గది మిగిలింది. – ఇజాజ్ హుస్సేన్, మహమ్మదాబాద్ పనులు జరుగుతున్నాయి.. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా 50 ఫీట్ల లోపు ఉన్నవాటికి ఎలాంటి పరిహారం ఇవ్వం. ఇక భూమి పోతున్న నిర్వాసితులకు సంబంధించి ఇప్పటికే అధికారులు వివరాలు సేకరించి బ్యాంకు ఖాతా నంబర్లు తీసుకున్నారు. ఎవరికి ఎంతెంత రావాలో నిర్ణయించారు. నిర్వాసితులకు నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. భూ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చాకే పనులు చేపడతాం. ప్రభుత్వ భూములు ఉన్నచోట పనులు జరుగుతున్నాయి. – రమేష్, డీఈ, నేషనల్ హైవే సల్కర్‌పేట్‌కు చెందిన గిరమోని రవికుమార్‌కు 37 గుంటల తరిపొలం ఉండగా జాతీయ రహదారి నిర్మాణంతో మొత్తం పోతుంది. అయితే భాగాలు పంచుకోవడం మూలంగా ఇతని ఆధీనంలో ఉన్న సర్వే నంబర్ వేరే వారి పేరిట ఉండడంతో పరిహారం అందడం కష్టంగా ఉంది. అటు భూమి పోవడమే కాక.. ఇటు పరిహారం అందే పరిస్థితి లేకపోవడంతో అయోమయంలో పడ్డాడు. దాదాపు 25 ఏళ్లుగా అదే భూమిని నమ్ముకున్నాడు. రోడ్డు విస్తరణ కారణంగా సర్వం కోల్పోతున్నాడు. జానంపల్లికి చెందిన చెన్నారం వెంకటయ్య ఆర్సీసీ ఇల్లు నిర్మించుకొని అందులోనే హోటల్ నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. 15 రోజుల క్రితం అధికారులు వచ్చి మార్కింగ్ ఇచ్చి కూల్చివేస్తామని చెప్పారు. ఆ తర్వాత జేసీబీతో మార్కింగ్ ఇచ్చిన వరకు ఇల్లు కూల్చివేయడంతో ప్రస్తుతం ఒక్క గోడ మాత్రమే మిగిలింది. ప్రస్తుతం అతనికి ప్రత్యామ్నాయం లేకపోవడంతో బంధువుల ఇంట్లో తల దాచుకుంటున్నాడు. ఉపాధి కూ డా పోవడంతో బతుకు భారంగా మారింది. ఉపాధికి ఎసరు.. చాలా గ్రామాల్లో రోడ్డుకిరువైపులా పలు రకాల దుకాణాలు నిర్వహిస్తున్నారు. కిరాణం, మెకానిక్, జిరాక్స్, ఫర్టిలైజర్, మెడికల్ షాపు, హాస్పిటల్, హోటళ్లతో జీవనం సాగిస్తున్నారు. అయితే రోడ్డు విస్తరణ పేరిట ఇవన్నీ తొలగిస్తుండడంతో వారంతా ఉపాధి కోల్పోతున్నారు. మహమ్మదాబాద్‌లో రోడ్డుకిరువైపులా కనుచూపు మేర కనీసం ఒక్క టీ షాపు కూడా లేదు. రోజూవేలు సంపాదించే వారు కనీసం రూ.100 కూడా వచ్చే పరిస్థితి లేక.. కుటుంబాలు ఎలా పోషించాలో అని దిక్కుతోచని స్థితిలో పడ్డారు.