News
-
విద్యార్థిని చితకబాదిన ఇతర విద్యార్థులు! అసలు కారణమేంటి..?
వరంగల్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్‌సైన్స్ కళాశాలలో శనివారం సాయంత్రం విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. బీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు.. బీఏ ద్వితీయ ,ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఆ కళాశాలలో ఆడిటోరియంలో వెల్కమ్ పార్టీ నిర్వహించారు. మధ్యాహ్నం 3గంటల వరకు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ తరువాత చాలా మంది విద్యార్థులు కళాశాల ఆవరణకు చేరుకున్నారు. కొందరు ఫొటోలు దిగుతున్నారు. ఈ సమయంలో ఏమైందో తెలియదుగాని ఓ ఫస్టియర్ విద్యార్థిని ద్వితీయ సంవత్సరం విద్యార్థులుగా భావిస్తున్న కొందరు చితకబాదారని సమాచారం. ఆ విద్యార్థిని వెంబడించి మరి చితకబాదారని తెలుస్తోంది. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న పలువురు అధ్యాపకులు ఘటనాస్థలికి చేరుకుని ఈ గొడవను నిలువరించారని సమాచారం. అనంతరం విద్యార్థులను కళాశాల నుంచి బయటికి పంపారు. కాగా, విద్యార్థిని ఎందుకు చితకబాదారనే విషయం తెలియరాలేదు. ఈ గొడవ విషయంపై ఆ కళాశాల ప్రిన్సిపాల్ బన్న ఐలయ్య దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. గొడవ పడిన విద్యార్థులను ఈనెల 8న లేదా 9న పిలిపించి మాట్లాడాలని యోచిస్తున్నారని సమాచారం. దీనిపై ప్రిన్సిపాల్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. -
దళితబంధు జాబితాలో అనర్హులు
వైరారూరల్: రాష్ట్ర ప్రభుత్వం దళితులు ఆర్థికాభివృద్ధికి ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు అనర్హులకు కేటాయిస్తున్నారని మండలంలోని పాలడుగు దళితులు శుక్రవారం సీపీఎం నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. జగ్గయ్యపేట రాష్ట్రీయ రహదారిపై సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో చేపట్టారు. తమ గ్రామంలో ఐదుగురికి పథకం మంజూరు కాగా, వారు ఆర్థికంగా నిలదొక్కుకున్న వారేనని తెలిపారు. కాగా, రాస్తారోకోతో వాహనాలు నిలిచిపోగా వైరా ఎస్ఐ మేడా ప్రసాద్ చేరుకుని ఫోన్లో ఉన్నతాధికారులతో మాట్లాడించగా వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ధర్నా వద్ద ఆగిన డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రపాద్ మాట్లాడుతూ దళితబంధు లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. దళితబంధు రాలేదని దీక్ష కారేపల్లి: అన్ని అర్హతలు ఉన్నా తనకు దళిత బంధు రాలేదంటూ కారేపల్లికి చెందిన ఆదెర్ల రాధాగోవింద్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద శుక్రవారం దీక్ష చేపట్టారు. దళితబంధు జాబితాలో పేరు చేర్చేందుకు కొందరు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారని, తాను డబ్బు ఇవ్వకపోవడంతో గుర్తించలేదని వాపోయారు. ఆయన దీక్షకు వివిధ పార్టీల నాయకులు వై.ప్రకాశ్, బోళ్ల రామస్వామి, కొమ్ము ఉపేందర్, గౌసుద్దీన్, ప్రసాద్ మద్దతు తెలిపారు. -
తాను మరణించలేదు.. కానిస్టేబుల్ ఉద్యోగ ఫలితాల్లో.. బతికే ఉన్నాడు!
వరంగల్: రెండు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ యువకుడు గురువారం ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాల్లో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన నూనావత్ వేణు కానిస్టేబుల్ రాత పరీక్ష రాశాడు. ఫలితాలు వచ్చేంత వరకు ఇంటి వద్ద ఖాళీగా ఎందుకు ఉండాలని తండ్రితో కలిసి సూర్యాపేటలో సెంట్రింగ్ కూలీ పనులకు వెళ్లాడు. 2 నెలల క్రితం పనులు ముగించుకొని తండ్రితో కలిసి బైక్‌పై వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గురువారం ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాల్లో వేణు ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కుమారుడు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక అయిన విషయం తెలిసిన తల్లిదండ్రులు భద్రు, కేవూల్య కన్నీరు మున్నీరయ్యారు. ఒక్కగానొక్క కుమారుడు బతికుంటే తమను సాకేవాడని తల్లిదండ్రులు పేర్కొన్నారు. -
సర్వం కోల్పోయి.. 17 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన లక్ష్మణ్.. ఇన్నాళ్లు..
రాజన్న సిరిసిల్ల: పుట్టిన ఊరిలో ఉపాధి లేక గల్ఫ్‌బాట పట్టిన యువకుడు అక్కడ జరిగిన ఓ సంఘటనతో జైలుపాలై.. పదిహేడేళ్లకు స్వగ్రామానికి తిరిగొచ్చాడు. యుక్త వయసులో వెళ్లిన వ్యక్తి మానసికస్థితి సరిగ్గా లేని పరిస్థితిలో స్వగ్రామంలో అడుగుపెట్టాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన దండుగుల లక్ష్మణ్ 17 ఏళ్లకు శుక్రవారం ఇంటికి చేరాడు. దుబాయిలో ఘటన... ఇక్కడ విషాదం! కోనరావుపేటకు చెందిన దండుగుల లస్మవ్వ–నర్సయ్య దంపతుల కుమారుడు లక్ష్మణ్ 2005లో దుబాయ్ వెళ్లాడు. అదే సంవత్సరం డిసెంబర్ 29న అక్కడి జబల్అలీ ప్రాంతంలోని డాల్ఫిన్ మెకానికల్ సైట్లో కొందరు కేబుల్ వైరు దొంగతనానికి ప్రయత్నించారు. ఆ సైట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన వీరబహుదూర్ చూడడంతో దొంగతనానికి వచ్చిన దుండగులు అతన్ని హత్య చేసి పరారయ్యారు. ఈ కేసులో నిందితులుగా భావిస్తూ అక్కడి పోలీసులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో కోనరావుపేటకు చెందిన దండుగుల లక్ష్మణ్‌తోపాటు సిరిసిల్ల మండలం పెద్దూరుకు చెందిన సోదరులు శివరాత్రి రవి, మల్లేశం, చందుర్తికి చెందిన బొల్లి వెంకటి ఉరఫ్ నాంపెల్లి, మల్యాల మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతు, కొడిమ్యాల మండలం నమిలికొండకు చెందిన సయ్యద్ ఖరీం ఉన్నారు. వీరిలో సయ్యద్ ఖరీం 2014లో విడుదల అయ్యాడు. 24 ఏళ్ల జైలు శిక్ష! హత్య కేసులో నిందితులుగా భావించిన అక్కడి కోర్టు వీరికి 24 ఏళ్ల జైలుశిక్ష విధించింది. జైలు జీవితం గడుపుతున్న తమ వారిని రప్పించేందుకు వారి కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నాలు చేశారు. మంత్రి కేటీఆర్ నేపాల్‌కు వెళ్లి సెక్యూరిటీగార్డు కుటుంబాన్ని కలిసి రూ.15లక్షల పరిహారం అందించారు. వారితో క్షమాభిక్షపత్రాలపై సంతకాలు తీసుకుని.. దుబాయ్ కోర్టుకు పంపగా.. ఆ కోర్టు అంగీకరించలేదు. దీంతో వారు జైలు నుంచి విడుదల కాలేదు. ప్రస్తుతం లక్ష్మణ్ మానసికస్థితి సరిగ్గా లేదని విడుదల చేసినట్లు తెలిసింది. విడాకులు ఇచ్చిన భార్య లక్ష్మణ్ దుబాయి వెళ్తున్నప్పుడు భార్య పద్మ గర్భిణి. అతడు వెళ్లిన కొద్ది నెలలకు మగబిడ్డ జన్మించాడు. లక్ష్మణ్ దుబాయిలో జైలుపాలు కావడంతో భార్య పద్మ కొన్ని రోజులు అత్తవారింట్లోనే ఉంది. వీరి కుమారుడు ఏడాదికే మృతిచెందాడు. భర్త రాక కోసం ఎదురుచూసిన పద్మకు ఆశలు సన్నగిల్లడంతో పుట్టింటికి వెళ్లి విడాకుల కోసం నోటీసులను దుబాయి జైలులో ఉన్న లక్ష్మణ్‌కు పంపింది. లక్ష్మణ్ సంతకాలు చేయడంతో విడాకులు తీసుకుని వెళ్లిపోయింది. లక్ష్మణ్ తండ్రి నర్సయ్య కొన్నాళ్ల క్రితం మృతిచెందాడు. తల్లి నర్సవ్వ ఇన్నాళ్లు చేసిన పోరాట ఫలితంగా కుమారుడు లక్ష్మణ్ ఇంటికి చేరాడు. -
వందేళ్లు దాటితేనేం..? ఎన్నుకోవడంలో మా అధికారం మాకే..!
సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 4న తుది ఓటరు జాబితాను వెలువరించింది. అందులో పలు ఆసక్తికర అంశాలున్నాయి. జిల్లా ఎన్నికల సంఘం పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 6,61,163 మంది ఉండగా.. పురుషులు 3,21,104 మంది, సీ్త్రలు 3,40,022 మంది, ఇతరులు 37 మంది ఓటర్లుగా నమోదయ్యారు. యువ ఓటర్లలో యువతుల సంఖ్య తక్కువే.. జిల్లా ఓటర్లలో పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్య 18,918 మంది ఎక్కువగా ఉన్నారు. అయితే రెండు మూడు దశాబ్దాలుగా ఆడపిల్లలపై పెరిగిన వివక్షతో గర్భంలోనే చిదిమేస్తుండడంతో ఆడపిల్లల సంఖ్య తగ్గుతోంది. దాని ప్రభావం ప్రస్తుతం కనిపిస్తోంది. 18 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు ఉన్న నవ ఓటర్లు మూడు నియోజకవర్గాల్లో కలిపి 20,380 మంది ఉండగా.. ఇందులో మగవారు 12,039 మంది, ఆడవారు 8,339 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. అంటే ఓటర్లలో యువకులకన్నా 3,700 మంది యువతులు తక్కువగా ఉన్నారు. అలాగే 20 నుంచి 29 ఏళ్లలోపు ఓటర్లలో కూడా ఆడవాళ్లు తక్కువగా కనిపిస్తున్నారు. 71,353 మంది పురుష ఓటర్లు ఉంటే..66,090 మంది మహిళా ఓటర్లు, 20 మంది ఇతరులు ఉన్నారు. అంటే మగవారికన్నా ఆడవారు 5,263 మంది తక్కువగా ఉండడం గమనార్హం. 30 ఏళ్లు పైబడిన జాబితాలో మాత్రం మహిళా ఓటర్లే ఎక్కువగా నమోదయ్యారు. వందేళ్లు దాటినవారు.. నూరేళ్లు పిల్లాపాపలతో కలిసి సుఖ సంతోషాలతో జీవించు అంటూ పెద్దవాళ్లు ఆశీర్వదిస్తుంటారు. అయితే వందేళ్లు దాటి జీవించిన వాళ్లు చాలా తక్కువగా కనిపిస్తారు. జిల్లాలో శతాధిక వృద్ధులు 312 మంది ఉన్నారు. ఇందులోనూ 120 ఏళ్లు దాటినవారే 251 మంది ఉండడం గమనార్హం. జిల్లాలో 100 ఏళ్లు దాటినవారిలో 312 మందికి ఓటు హక్కు ఉంది. 100 నుంచి 109 ఏళ్ల మధ్య వయసువారిలో 61 మంది ఓటర్లున్నారు. ఇందులో 19 మంది మగవారు, 42 మంది సీ్త్రలు.. 110 నుంచి 119 ఏళ్ల మధ్యలో ఒక్క ఓటరూ లేరు. 120 ఏళ్లు దాటినవారు జిల్లాలో 251 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇందులో 115 మంది పురుషులు, 135 మంది సీ్త్రలు కాగా ఒకరు ట్రాన్స్‌జెండర్.. 120 ఏళ్లు దాటినవారిలో కామారెడ్డి నియోజకవర్గంలోనే 234 మంది ఉన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 16 మంది, జుక్కల్ నియోజక వర్గంలో ఒకరు ఉన్నారు. -
నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం మాది.. పోచారం
కామారెడ్డి: రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకై క ప్రభుత్వం మాదేనని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన కొల్లూర్‌లో రూ.98 కోట్ల నిధులతో నిర్మించిన 220/132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, వరంగల్ సీఎండీ గోపాల్‌రావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రాన్ని 15 ఏళ్లు సీఎంగా పాలించినా నేటికి అక్కడ కరెంటుకు దిక్కులేదన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించడం, సీఎండీగా ప్రభాకర్‌రావు డిస్ట్రీబ్యూషన్, ట్రాన్స్మిషన్, జనరేషన్లో తీసుకున్న విప్లవాత్మక చర్యల మూలంగా తెలంగాణలో విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్బవించిన సమయంలో మనకు 7,780 మెగావాట్ల విద్యుత్ వస్తే దాన్ని నేడు 20 వేల మెగావాట్లకు తీసుకెళ్లిన ఘనత సీఎం కేసీఆర్, సీఎండీ ప్రభాకర్రావులకే దక్కుతుందన్నారు. కొల్లూర్‌లో నిర్మించిన సబ్‌స్టేషన్‌తో ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలకు విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులు, బతుకమ్మ చీరలు, స్పోర్ట్స్కిట్లను పంపిణీ చేశారు. నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ నీరజా వెంకట్రారెడ్డి, జెడ్పీటీసీ పద్మాగోపాల్రెడ్డి, సర్పంచ్ తుకారాం, నాయకులు ద్రోణవల్లి సతీష్, అంజిరెడ్డి, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. తలసరి వినియోగంలో టాప్ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2,140యూనిట్లు అయితే దేశం సరాసరి విద్యుత్ తలసరి వినియోగం 1255 యూనిట్లు మాత్రమేనని తెలిపారు. వరంగల్ సీఎండీ గోపాల్‌రావు, ఎస్ఈ సూర్య నర్సింహారావు, తదితరులు ఉన్నారు. -
గులాబీ నేతల దూకుడు.. సుడిగాలి పర్యటనలలో మంత్రులు
కామారెడ్డి: ఎన్నికల షెడ్యూల్ రాకముందే అధికార బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఎమ్మెల్యేలు అన్ని నియోజకవర్గాల్లో వరుస కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తున్నారు. పనిలో పనిగా ఇతర పార్టీలకు చెందిన నాయకులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటిస్తున్న ఎమ్మెల్యేలకు పార్టీ కీలక నేతలైన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తోడయ్యారు. మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, మరో ముఖ్య నాయకుడు, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావులు అన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలోనూ ఇరువురు పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బాన్సువాడ పట్టణంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బహిరంగ సభలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రాకుండా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు రానున్నారు. అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో జుక్కల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి భారీ సంఖ్యలో జనాన్ని సమీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డిలో కేటీఆర్ సభ మున్సిపల్ ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం కామారెడ్డిలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా పది వేల మందితో సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇక్కడినుంచి సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీకి మరింత ఊపు తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. -
దళితబంధు కేవళం ఆ నేతలకేనా..!
కామారెడ్డి: అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులకే దళిత బంధు ఇస్తున్నారని భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన దళితులు ఆరోపించారు. గ్రామానికి చెందిన సుమారు 80 మంది దళితులు గురువారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్‌లోనికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీలు దళితబంధు తీసుకోవడంతో పాటు వారి అనుచరులు, బంధువులకు ఇప్పించుకున్నారన్నారు. గ్రామంలో 500 దళిత కుటుంబాలు ఉన్నాయని 15 మందికే పథకం లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. లబ్ధిపొందినవారిలో ఒక్కరు కూడా అర్హులు లేరన్నారు. ఇతర పార్టీల వారికి ఇవ్వబోమని బహిరంగంగానే చెబుతున్నారన్నారు. అధికారులు స్పందించి విచారణ జరిపించి, అర్హులకే దళితబంధు వచ్చేలా చూడాలని కోరారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందించారు. -
అవార్డుల.. హరిత
కడెం: కడెం ప్రాజెక్ట్ తీరాన.. పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైనా విడిది గదులతో పర్యాటకుల మనసు దోచుతుంది కడెం హరిత రిసార్ట్స్. పర్యాటకులకు చక్కని అతిథ్యాన్ని అందిస్తూ.. అవార్డులను సొంతం చేసుకుంటుంది. ఇటీవలే హైదరాబాద్ శిల్పారామంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, చైర్మన్ గెల్లు శ్రీనివాస్, ఎండి మనోహర్‌రావు చేతుల మీదుగా రిసార్ట్స్ మేనేజర్ నునవత్ తిరుపతి ఉత్తమ రిసార్ట్స్ అవార్డ్‌ను అందుకున్నారు. ఆహ్లాదకరంగా హరిత రిసార్ట్... కడెం ప్రాజెక్ట్ పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ప్రాజెక్ట్ తీరాన 2015లో పర్యాటకశాఖ 12 విడిది గదులు, రెస్టారెంట్, మీటింగ్‌హాల్‌తో హరిత ఏకో టూరిజం రిసార్ట్స్‌ను ఏర్పాటు చేసింది. ఏడేళ్ల కాలంలో పర్యాటకుల ఉత్తమ సేవలందిస్తూ మూడు సార్లు బెస్ట్ రిసార్ట్స్ అవార్డ్‌ను అందుకుంది. ప్రముఖులతో పాటు, వివిధ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడి విడిది చేస్తుంటారు. సెలవు దినాల్లో, వీకెండ్లో పర్యాటకులతో సందడిగా ఉంటుంది. పర్యాటకులు సేదతీరేందుకు విడది గదులతో పాటుగా, పిల్లలకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. పర్యాటకులతో పాటుగా ప్రీ వెడ్డింగ్, బర్త్‌డే షూట్లతో పాటుగా, ఫిల్మ్ షూట్లకు హరిత రిసార్ట్ ఫేమస్. అయితే ఇందులో తొమ్మిది మంది విధులు నిర్వహిస్తుండగా ఏడాదికి సుమారుగా రూ.4 నుంచి 5 లక్షల ఆదాయం సమకూరుతుంది. గదుల బుకింగ్ పర్యాటక శాఖ వెబ్సైట్ ద్వారా గదులను బుక్ చేసుకోవచ్చు. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.టీఎస్‌టీడీసీ.కామ్ ద్వారా గదులను బుక్ చేసుకోవచ్చు. వీకెండ్లో (శుక్ర, శని, ఆదివారల్లో) 1848, మిగాత రోజు ల్లో 1680(జీఎస్టీతో కలిపి). మరిన్ని వివరాలకు 9133053007 నంబర్లో సంప్రదించవచ్చు. సిబ్బంది సహకారంతో రాష్ట్రంలోనే బెస్ట్ రిసార్ట్‌గా కడెం హరితకు అవార్డ్ దక్కడం వెనుక సిబ్బంది సహకారం ఎంతో ఉంది. మూడుసార్లు హరిత రిసార్ట్స్‌కు అవార్డ్ దక్కడం అనందంగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. శుభాకార్యలు, వింధులు జరుపుకునేందుకు అవకాశం ఉంది. పర్యాటకుల టూరిజం శాఖ తరఫున సౌకర్యాలు అందిస్తున్నాం. – నునవత్ తిరుపతి, హరిత రిసార్ట్స్ మేనేజర్, కడెం -
ప్రతిభను కనబరిచి.. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో గెలిచి..
ఆదిలాబాద్: పోలీసు కానిస్టేబుల్ ఫలితాలు ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసింది. జిల్లాకు చెందిన 330 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యారు. ఇది వరకే దేహదారుఢ్య పరీక్షలు, ప్రిలిమినరీలో అర్హత సాధించి తుది పరీక్ష రాశారు. ఫలితాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 149 మంది, ఏఆర్‌కు 84 మంది, తెలంగాణ స్పెషల్ పోలీసు (టీఎస్ఎస్పీ)కి 97 మంది అర్హత సాధించి ఉద్యోగాలు పొందారు. కుటుంబీకులు, బంధువులు వారిని అభింనందించారు. అలాగే ఆదిలాబాద్ పట్టణంలోని డీఈవో కార్యాలయంలో సబార్డినెట్‌గా పనిచేస్తున్న రాథోడ్ కవిత కూతురు రాథోడ్ సింధు సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. సింధు తండ్రి శివాజీ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతిచెందాడు. తండ్రి ఆశయాన్ని ఆమె కొనసాగిస్తోంది. అలాగే భీంపూర్ మండలంలోని కరంజి(టి) గ్రామానికి చెందిన అంకిత కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. వీరిని వారి వారి గ్రామస్తులు అభినందించారు. ఎంపికైన యువకులు.. కానిస్టేబుల్ ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు ప్రతిభ కనబరిచి ఉద్యోగానికి ఎంపికయ్యారు. తాంసి గ్రామానికి చెందిన చిలుకూరి సాయిచరణ్‌రెడ్డి, బట్టు రాహుల్ ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. భీంపూర్, కరంజి(టి) గ్రామానికి చెందిన రవి ఏఆర్ కానిస్టేబుల్‌కి ఎంపిక కాగా, ఉద్యోగాలు సాధించిన యువకులను గ్రామస్తులు అభినందించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు పలువురి ఎంపిక.. కానిస్టేబుల్ ఫలితాల్లో మండలంలోని బాలాపూర్‌కు చెందిన వై. ప్రశాంత్, జి.బబ్లు, జి.వంశీ, మాకోడ గ్రామానికి చెందిన బి.అఖిల్, బెల్లూరికి చెందిన దశరథ్, ప్రణయ్, కూర గ్రామానికి చెందిన అఖిల్‌రెడ్డి ఎంపికయ్యారు. -
సమస్యలపై నిలదీస్తే అరెస్ట్ చేస్తారా?.. డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు
ఆదిలాబాద్: ప్రజాసమస్యలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను నిలదీయడానికి వస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తారా? అని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో దిలావర్పూర్ మండలం గుండంపల్లి హెలీప్యాడ్ వద్దకు వెళ్లిన శ్రీహరిరావును బుధవారం అరెస్ట్ చేసి సారంగపూర్ పోలీస్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో పోలీసుల తీరును నిరసిస్తూ సారంగపూర్ పోలీస్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. గుండంపల్లిలోని కాళేశ్వరం ప్యాకేజీ నంబర్ 27 అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారో.. చెప్పాలని డిమాండ్ చేశారు. దిలావర్పూర్ మండలంలో పచ్చని పంటపొలాల మధ్య విషవాయువు వెలువరించి ప్రజల ప్రాణాలు, పచ్చటి పంటపొలాలకు హాని కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించడం వెనుక మరమ్మమేమిటో తెలుపాలని పేర్కొన్నారు. వెంటనే దానిని రద్దు చేయాలని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని తెలిపారు. నిర్మల్ మున్సిపాలిటీలో అక్రమంగా 42 ఉద్యోగాలు అమ్ముకున్నారని తేలినప్పటికీ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత దారుణమైన పాలన సాగిస్తూ నియంతలా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రజలకు సమాధానం చెప్పలేని మంత్రులకు ప్రజలే తగిన బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరగబడతారని, ఓటు హక్కుతో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. సమర్థవంతమైన పాలన అందించే కాంగ్రెస్‌నే ప్రజలు కోరుకుంటున్నారని, తప్పకుండా రాష్ట్రంలో ఆ పార్టీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తంజేశారు. ఈయన వెంట కాంగ్రెస్ నాయకులు అరుగుల రమణ, విలాస్‌రావు, బొల్లోజి నర్సయ్య, రొడ్డ మారుతి, అబ్దుల్ హాదీ, న్యాయవాది మల్లారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వజీద్ అహ్మద్, పొడెల్లి గణేశ్ తదితరులున్నారు. -
నిలిచిన ఈ–సేవలు..! సమ్మె బాటలో ఈ–పంచాయతీ సిబ్బంది
సూర్యపేట్: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు సమ్మె బాట పట్టారు. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి జిల్లాలోని కలెక్టరేట్ ఎదుట నమ్మె చేస్తున్నారు. వీరి సమ్మె బుధవారం నాటికి ఆరో రోజుకు చేరుకుంది. సమ్మె కారణంగా గ్రామ పంచాయతీల్లో ఈ–సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సేవల్లో వేగం పెంచేందుకే.. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు సేవల్లో వేగాన్ని పెంచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ–పంచాయతీలను మంజూరు చేసింది. ఇందులో సేవలందించేందుకు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించింది. అయితే వారికి వేతనాలు గ్రామపంచాయతీలే చెల్లించాలని నిర్ణయించడంతో వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం వారి మొర ఆలకిస్తుందన్న నమ్మకంతో ఉద్యోగులు తమ డిమాండ్లతో సమ్మె బాటపట్టారు. 63 మంది ఆపరేటర్లు ఇంటర్నెట్ ఆధారంగా గ్రామ పంచాయతీల్లో ప్రజలకు అందిస్తున్న అన్ని రకాల సేవలను కంప్యూటరీకరించేందుకు ప్రభుత్వం ఈ–పంచాయతీ కార్యక్రమాన్ని 2014–15లో ప్రారంభించింది. ఇందులో భాగంగా ముందుగా జిల్లా పంచాయతీ కార్యాలయంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్(డీపీఎం)లను, తర్వాత గ్రామాల్లో క్లస్టర్ల వారీగా కంప్యూటర్ ఆపరేటర్లను నియమించింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో కార్వీ సంస్థ ద్వారా వీరిగా కంప్యూటర్ ఆపరేటర్లనను నియామకాలు జరిగాయి. ఆపరేటర్లందరికి 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి పరిపాలన నిధుల కింద 10శాతం కేటాయించింది. నెలకు రూ.8వేలకు తగ్గకుండా వేతనాలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలో ఒక డీపీఎంతో పాటు ఈ–పంచాయతీ, ఆర్జేసీ ఆపరేటర్లు 63 మంది పని చేస్తున్నారు. జిల్లాలో ఒక్కో ఆపరేటర్ 8 నుంచి 10 గ్రామ పంచాయతీల్లో చేస్తున్నారు. గ్రామాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేస్తూ అనుసంధానకర్తలుగా వీరు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అలాంటి తమకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ–పంచాయతీ సిబ్బంది కోరుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. జిల్లా స్థాయిలో పనిచేసే డీపీఎంలకు పే స్కేల్ అమలు చేయాలి. గ్రామాల్లో పని చేసే ఈ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు జూనియర్ అసిస్టెంట్ హోదా కల్పించి వేతనం చెల్లించాలి. మహిళ ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ఉద్యోగ సిబ్బందికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి. ఉద్యోగి మృతి చెందితే కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలి. ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలి. -
భూగర్భ గనులను కాపాడాలి
మంచిర్యాల: భూగర్భ గనులను కాపాడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే న్యూటెక్ గనికి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బుధవారం శ్రీరాంపూర్‌లోని సీఈఆర్ క్లబ్లో పునః ధ్రువీకరణ కింద ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, నిజామాబాద్ కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ జి.లక్ష్మణ్ హాజరయ్యారు. సభకు హాజరైన వారి అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. చాలామంది వక్తలో సభలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. సింగరేణిలో భూగర్భ గనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, జీవితకాలం దగ్గరపడ్డ గనుల్లోని నిక్షేపాలను అన్వేషించి వెలికితీత ద్వారా జీవిత కాలం పెరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. భూగర్భ గనులతోనే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, సింగరేణి గనుల వల్ల జరిగే కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత కంపెనీపై ఉందని, ఇందుకోసం మరిన్ని చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సింగరేణి సీఎస్ఆర్ నిధులు, శ్రీరాంపూర్ డీఎంఎఫ్టీ నిధులను సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలని, కానీ సింగరేణికి సంబంధం లేని ప్రాంతాలకు తరలించారని తెలిపారు. శ్రీరాంపూర్ ప్రాంతంలో ఆర్కే 6 గని పరిసరాల్లో సింగరేణి ప్రత్యేక శ్మశానవాటిక ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నుంచి కే.సురేందర్‌రెడ్డి, ఏఐటీయూసీ నుంచి ఎస్కే బాజీసైదా, ముస్కె సమ్మయ్య, ఐఎన్టీయూసీ నుంచి జే శంకర్రావు, బీఎంఎస్ నాయకులు పేరం రమేశ్, హెచ్ఎమ్మెస్ నేత తిప్పారపు సారయ్య, సీఐటీయూ నాయకులు భాగ్యరాజ్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఎన్విరాన్మెంట్ జీఎం జేవీఎల్ గణపతి, ఏరియా ఎస్ఓటు జీఎం రఘుకుమార్, ఓసీపీ పీఓలు పురుషోత్తంరెడ్డి, శ్రీనివాస్, ఏజెంట్లు రాముడు, డీజీఎం(పర్సనల్) అరవిందరావు, ఏరియా ఎన్విరాన్మెంట్ హనుమాన్‌గౌడ్ పాల్గొన్నారు. అభ్యంతరాలు పరిష్కరిస్తాం.. సభలో వక్తలు పేర్కొన్న అభ్యంతరాలను పరిశీలించి కంపెనీ పరిధిలో ఉన్న వాటిని తప్పనిసరిగా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. ఏరియా పరిధిలోని అంశాలను వెంటనే పరిష్కరిస్తాం. సింగరేణి అభివృద్ధి చెందితే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు పరిసర గ్రామాల్లో చేసుకొనే వీలుంది. –బీ.సంజీవరెడ్డి, జీఎం, శ్రీరాంపూర్ ప్రభుత్వానికి నివేదిస్తాం ఈ సభలో వక్తలు పేర్కొన్న అభ్యంతరాలు, సమస్యలను కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో రికార్డు చేయించడం జరిగింది. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సింగరేణితోనే ఈ ప్రాంతంలో అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి సంస్థను కాపాడుకోవాలి. – సబావత్ మోతీలాల్, జిల్లా అదనపు కలెక్టర్ -
'పాపం.. పసికందు' పొదల్లో పడేశారు! పిక్కటిల్లేలా గుక్కపెట్టి ఏడ్చేసరికి..
మహబూబాబాద్: పాపం.. పసికందు.. ఆడపిల్ల భారమనుకున్నారో..? లేదా నెలలు నిండకముందే జన్మంచిందనకున్నారో..? లేదా ఇతర కారణాల వల్లనో గాని శిశువును వదిలించుకున్నారు. తల్లి గర్భంలో ఎన్నో గండాలు.. మరెన్నో సుడిగుండాలు తట్టుకుని జీవం పోసుకున్న ఆ శిశువు.. ఆరు నెలల అనంతరం బహ్య ప్రపంచంలోకి అడుగిడింది. అయితే అమ్మ ఒడిలో హాయిగా సేదదీరాల్సిన ఆ శిశువు పొదల్లో దర్శనమిచ్చింది. దిక్కులు పిక్కటిల్లేలా గుక్కపెట్టి ఏడుస్తోంది. ఈ శబ్దం విన్న గ్రామస్తులు అక్కడి వెళ్లి చూడగా ఆ పసిమొగ్గ దీనస్థితిలో కనిపించింది. ఈ హృదయవిదారక ఘటనను చూసి వారు చలించిపోయారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని శిశువును ఆస్పత్రికి తరలించారు. ఎస్సై అశోక్ కథనం ప్రకారం మండలంలోని పాత్రాపురం శివారులోని పొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం ఆడ శిశువును పడేసి వెళ్లారు. ఈ శిశువును చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకుని శిశువును వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. ప్రస్తుం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ శిశువు తల్లిదండ్రుల వివరాలు ఎవరికై నా తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్సై అశోక్ పేర్కొన్నారు. కాగా, శిశువు పూర్తి నెలలు నిండకుండానే 7 నెలలో జన్మించిందని, పాపను వరంగల్ ఎంజీఎంకు తరలిస్తున్నట్లు వైద్యాధికారి విజిస్టర్ తెలిపారు. -
సాగులో.. సాంకేతికత.. ప్రయొజనాలు అధికం
సంగారెడ్డి: పంట సాగులో ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు కూలీల సమస్యను అధిగమించి అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా డ్రోన్లను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఎరువులు, పురుగు మందుల పిచికారీకి కూలీలు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు కూలీల సమస్యను అధిగమించి అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు సాంకేతికత బాట పడుతున్నారు. మందులు పిచికారీ చేసేందుకు డ్రోన్లు చాలా ఉపయోగపడుతున్నాయి. సంగారెడ్డి జిల్లాతో ఇప్పటికే చాలా మంది రైతులు డ్రోన్లను వినియోగించడం విశేషం. డ్రోన్ వినియోగంతో ప్రయోజనాలెన్నో .. ఎకరా విస్తీర్ణంలో పురుగు మందుల పిచికారీ ఆరు నిమిషాల్లో పూర్తవుతుంది. ఎరువులకై తే 12 నిమిషాల సమయం పడుతుంది. అంతే కాకుండా రోజుకు 2530 ఎకరాల్లో పిచికారీ చేసేందుకు వీలు ఉంటుంది. మనుషులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. డ్రోన్ ద్వారా ఎరువులు, పురుగు మందులు ఒకేసారి పిచికారీ చేయడం ద్వారా సులభంగా, చీడపీడల నివారణ అవుతుంది. ఎత్తు పల్లాలతో కూడిన పంట పొలాల్లోనూ సులభంగా మందులు చల్లవచ్చు. డ్రోన్ల ద్వారా పురుగుమందుల పిచికారీకి ఎకరాకు రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చవుతుంది. అదే కూలీకై తే రూ.800 రూ.1500) వరకు చెల్లించాల్సి వస్తుంది. రిమోట్ సాయంతో పనిచేసే ఈ డ్రోన్ల వల్ల పురుగు మందుల వృథా తగ్గడమే కాకుండా తగినంత ఎత్తు నుంచి పిచికారీ చేయడంతో సాగుకు సక్రమంగా మందు అందుతుంది. -
లక్ష్యం సాధిస్తే రూ.40 వేల కోట్ల టర్నోవర్
గోదావరిఖని: దేశవ్యాప్తంగా బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడుతోందని, మిగిలిన ఆర్నెల్లలో రోజూ కనీసం 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ సీ అండ్ ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో అన్నిఏరియాలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వచ్చేఏడాది మార్చి చివరికల్లా 72 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని అధిగమించాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆర్నెల్లలో వర్షాలతో కొంతఇబ్బంది కలిగినా అన్నిఅవరోధాలు అధిగమిస్తూ గతేడాది బొగ్గు రవాణాలో 12 శాతం వృద్ధి, ఉత్పత్తిలో 7శాతం, ఓవర్‌బర్డెన్ తొలగింపులో 15 శాతం వృద్ధి సాధించడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆర్నెల్లు కీలకమని పేర్కొన్నారు. ఈ క్రమంలో అన్నిఏరియాలకు అవసరమైన యంత్రాలు, అనుమతులు, ఓబీ కాంట్రాక్టులు ఇప్పటికే సమకూర్చామన్నారు. ఇకపై వర్షప్రభావం ఉండే అవకాశం లేదన్నారు. ఓపెన్‌కాస్ట్‌ల్లో నిలిచిన నీటిని బయటకు తోడేయాలని, బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపును మరింత వేగవంతం చేయాలని సూచించారు. లక్ష్యాలు సాధిస్తే రూ.3,500కోట్ల లాభాలు ఈఏడాది నిర్దేశిత 72మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే.. లక్ష్యానికి అనుగుణంగా రవాణా చేసే అవకాశం ఉందని సీఎండీ తెలిపారు. తద్వారా రూ.40 వేల కోట్ల టర్నోవర్, సుమారు రూ.3,500 కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. అంకిత భావంతో పనిచేయాలి సింగరేణి ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేదఫా రూ.1,750 కోట్ల వేజ్‌బోర్డు ఎరియర్స్ చెల్లించామని, సీఎం ప్రకటించినట్లు 32శాతం లాభాల బోనస్ రూ.711 కోట్లు కూడా దసరా పండుగకు ముందే విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. దీపావళి బోనస్‌ను పండుగకు ముందే కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. కంపెనీపై విశ్వాసం, విధుల్లో అంకితభావంతో కార్మిక, అధికారులు, సమష్టిగా కృషి చేయాలని కోరారు. లక్ష్యాల అధిగమించిన సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సింగరేణి నిర్దేశిత లక్ష్యాలు సాధించిందని శ్రీధర్ అన్నారు. ఈ ఏడాది బొగ్గు రవాణా లక్ష్యం 307 లక్షల టన్నులు కాగా 330 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి, 7 శాతం వృద్ధిని నమోదు చేసిందని వివరించారు. గతేడాది ఇదే సమయం కన్నా 12శాతం అధికమని పేర్కొన్నారు. సమావేశంలో డైరెక్టర్లు ఎన్.బలరాం, సత్యనారాయణరావు, వెంకటేశ్వర్‌రెడ్డి, అధికారులు సరేంద్రపాండే, అల్విన్, ఎం.సురేశ్, రమేశ్ పాల్గొన్నారు. -
యాప్ తప్పుడు సమాచారంతో.. ఆగని రైలు..! ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు..!!
మహబూబాబాద్: ‘షిర్డీ’ ఎక్స్‌ప్రెస్‌కు కేసముద్రం రైల్వేస్టేషన్లో హాల్టింగ్ లేదు. అయినా ఓ యాప్‌లో హాల్టింగ్ చూపడంతో ప్రయాణికులు సోమవారం ఆ రైలు ఎక్కారు. తీరా ఆగకుండా వెళ్లడంతో గందరగోళానికి గురయ్యారు. ‘షిర్డీ’ ఎక్స్‌ప్రెస్‌కు కేసముద్రం రైల్వేస్టేషన్లో హాల్టింగ్ ఉండగా, ఇటీవల రద్దు చేశారు. అయితే ఓ యాప్‌లో హాల్టింగ్ ఉన్నట్లు చూపడంతో కేసముద్రంలో దిగాల్సిన ప్రయాణికులు పలు రైల్వే స్టేషన్లలో ఆ రైలు ఎక్కారు. తీరా చూస్తే డౌన్‌లైన్‌లో కేసముద్రంలో ఆగకుండా వెళ్లడంతో మహబూబాబాద్‌లో దిగారు. అలాగే, అప్‌లో లూప్‌లైన్ మీదుగా ఆగకుండా వెళ్తుండడంతో రైలులో ప్రయాణిస్తున్నవారితోపాటు, ప్లాట్‌ఫాంపై ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు పెట్టారు. దీంతో స్టేషన్లో రైలును నిలిపారు. అనంతరం యథావిధిగా ముందుకు కదిలింది. మొత్తానికి ఓ యాప్ తప్పుడు సమాచారం చూపడంతో గందరగోళానికి గురైనట్లు పలువురు ప్రయాణికులు తెలిపారు. -
వరంగల్‌పై ఎన్ఐఏ గురి! సోమవారం మళ్లీ దాడులు..
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉద్యమాలకు కేరాఫ్ అయిన వరంగల్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురిపెట్టింది. సీపీఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భావానికి ముందు, తర్వాత విప్లవ రాజకీయాలకు అడ్డాగా మారిన ఈప్రాంతంలో కార్యకలాపాలపై ఆరా తీస్తోంది. పౌరహక్కులు, ప్రజాసంఘాల కార్యకలాపాలు, నాయకుల కదలికలపై నిఘా పెట్టింది. ఈమేరకు ఎన్ఐఏ వరంగల్ నగరంతోపాటు ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల తరచూ సోదాలు నిర్వహిస్తోంది. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి మండలం బీరెల్లి అడవుల్లో మావోయిస్టు అగ్రనేతలతో సమావేశమైనట్లు సమాచారం ఉందని.. 152 మందిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆతర్వాత హరగోపాల్ సహా ఆరుగురిపై కేసులు ఎత్తివేయగా.. ప్రొఫెసర్ ఖాసీం సహా 146 మందిపై విచారణ జరుగుతోంది. గత సెప్టెంబర్‌లో విశాఖపట్నంలో నమోదైన ఓ కేసు విషయంలో హనుమకొండ హంటర్‌రోడ్డులోని సముద్రాల అనిత ఇంట్లో సోదాలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9న కూడా వరంగల్‌లోని ఐదు ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. తాజాగా సోమవారం హంటర్‌రోడ్డు, ప్రకాశ్‌రెడ్డిపేట, పైడిపల్లిలో అధిక సంఖ్యలో పోలీసులను మోహరించి సోదాలు చేయడం సంచలనంగా మారింది. ఓ వైపు ‘ఉపా’.. మరోవైపు సోదాలు.. మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వాల వ్యూహంలో భాగంగా ఎన్ఐఏ నిఘా ముమ్మరం చేసింది. ప్రజాసంఘాలు, పౌరహక్కుల నేతలపై ఓ వైపు కేసులు.. మరోవైపు ఇళ్లల్లో సోదాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరెల్లి సమీపంలో మావోయిస్టు నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్, ఇతర మావోయిస్టులు సమావేశమవుతున్నట్లు సమాచారం అందడంతో ములుగు పోలీసులు కూంబింగ్ చేపట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, అమాయక గిరిజన యువతను దళంలో చేర్చుకోవడం.. అధికారులు, అమాయక పౌరులను హత్య చేయడం, నిధుల సేకరణ వంటి లక్ష్యాలతో ఈ సమావేశం జరగ్గా, పోలీసుల రాకతో వారంతా పారిపోయారు. ఈమేరకు పస్రా సీఐ ఫిర్యాదు మేరకు అక్కడ పంచనామా నిర్వహించి ఐపీసీ 120బీ, 147, 148 రెడ్ విత్ 149.. ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)’లోని సెక్షన్లు 10, 13, 18, 20, 38, ఆయుధాల చట్టంలోని సెక్షన్ 25 (1–బీ)(ఎ)ల కింద తాడ్వాయి పోలీసులు 152 మందిపై కేసు నమోదు చేశారు. మావోయిస్టు నేతలు, వారి సానుభూతిపరులు, సమావేశ స్థలం వద్ద లభించిన సాహిత్యంలో ఉన్న ఇతరుల పేర్లపై కేసులు నమోదు చేశారు. 2023 జూన్‌లో ఈ కేసు వెలుగు చూడగా.. ఈ కేసులో ప్రొఫెసర్ హరగోపా ల్, పద్మజా షా, రఘునాథ్, గడ్డం లక్ష్మణ్, గుంటి రవీందర్, సురేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లభించలేదని కేసులు ఎత్తివేశారు. ప్రొఫెసర్ కాశీం, పీఓడబ్ల్యూ నేత సంధ్య, విమలక్క సహా 146 మందిపై కేసు కొనసాగుతుంది. ఇదంతా సద్దు మణిగిన కొద్ది రోజులకే ఉమ్మడి జిల్లాలో ఎన్ఐఏ సోదాలు ఉధృతం చేయడం కలకలం రేపుతోంది. ‘కవర్ సంఘాల’ కట్టడి.. అనుమానంతో సోదాలు.. మావోయిస్టు పార్టీకి కవర్సంఘాలు పని చేస్తున్నాయంటూ పలు ప్రజాసంఘాల నాయకులపై తరచూ కేసులు నమోదు చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో రాధ అనే నర్సింగ్ విద్యార్థి కొన్నేళ్ల క్రితం కిడ్నాప్ కాగా.. మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం నాయకులే కిడ్నాప్ చేశారని ఆమె తల్లి పోచమ్మ 2017లో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై 2022న ఎన్ఐఏ కేసు టేకప్ చేసింది. ఈకేసులో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 22 మందిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈక్రమంలో చైతన్య మహిళా సంఘంలో గతంలో చురుగ్గా పని చేసిన సముద్రాల అనిత, ఆమె తల్లిగారిళ్లలో గతేడాది సెప్టెంబర్‌లో సోదాలు నిర్వహించారు. తాజాగా సోమవారం కూడా ఆమె ఇంట్లో మళ్లీ సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యురాలిగా వ్యవహరిస్తున్న కొత్తకొండ శాంతమ్మ ఇంట్లోనూ ఈసారి ఎన్ఐఏ సోదాలు చేసింది. పైడిపల్లిలోని ఆమె ఇంటిని ఉదయమే పోలీసులు చుట్టుముట్టగా.. తర్వాత ఎన్ఐఏ అధికారులు ఇల్లంతా తనిఖీ చేశారు. ఇంట్లో ప్రజాకవి వరవరరావుపై ప్రొఫెసర్ కాశీం రాసిన ‘కాగితం మీద అక్షరానికి కమిటైన కవి వరవరరావు’, ‘జన హృదయం జనార్దన్.. అమరుడు సూరపనేని జనార్దన్’ తదితర పుస్తకాలు లభ్యమయ్యాయి. 2016 మార్చి 1న ఎన్కౌంటర్లో మృతిచెందిన శాంతమ్మ కూతురు కొత్తకొండ సృజన అలియాస్ నవత ఫొటోలను పరిశీలించిన అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. కాగా.. ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు వివరాలు మాత్రం వెల్లడించలేదు. మొత్తంగా వరంగల్‌లో ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. -
దోస్త్ ద్వారా 6,843 సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) ఖాళీ సీట్ల భర్తీకి చేపట్టిన ప్రత్యేక దశ కేటాయింపులో 6,843 మంది సీట్లు పొందినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వీరిలో మొదటి ప్రాధాన్యత ద్వారా 6,061 మందికి, రెండో ప్రాధాన్యత ద్వారా 782 సీట్లు వచి్చనట్టు తెలిపారు. ఆర్ట్స్‌లో 1,026, కామర్స్‌లో 2,131, లైఫ్ సైన్స్‌లో 2,240, ఫిజికల్ సైన్స్‌లో 618, డేటాసైన్స్‌లో 61, బీఎస్సీ ఆనర్స్ (కంప్యూటర్ సైన్స్)లో 43, బీఎస్సీ (బయో–టెక్నాలజీ)లో 20, అప్రెంటిస్íÙప్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్‌లో 104, ఇతర బ్రాంచీల్లో 600 సీట్లు కేటాయించినట్టు వెల్లడించారు. సీట్టు పొందిన వారు శనివారంలోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఇదే రోజు నుంచి అక్టోబర్ 3 వరకూ అన్ని కాలేజీల్లో ఇంట్రా–కాలేజ్ ఫేజ్–2కి వెబ్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం కలి్పస్తున్నట్లు తెలిపారు. -
చోటు.. నీకు సెల్యూట్!
రహమత్‌నగర్(హైదరాబాద్): ఓ ముస్లిం యువకుడు తొమ్మిదేళ్లుగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ మత సామరస్యాన్ని చాటుకుంటున్నాడు. కార్మికనగర్‌కు చెందిన షేక్ చోటు స్థానికంగా స్టార్ కేబుల్‌ను నిర్వహిస్తుంటాడు. ఆటోస్టాండ్ వద్ద ఏటా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటాడు. గణనాథుడిని ప్రతిష్టించినప్పటి నుంచి నిమజ్జనం వరకు అన్నీ తానై చూసుకుంటాడు. ఈ క్రమంలోనే మట్టితో తయారు చేయించిన గణపతి విగ్రహాన్ని గురువారం రాత్రి మండపం వద్ద నిమజ్జనం చేశాడు. ఈ కార్యక్రమంలో బస్తీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
రేపు ‘భారత్ దాల్’ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: పప్పుధాన్యాలకు ప్రత్యామ్నాయంగా శనగపప్పు (చనా) వినియోగాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహార, ప్రజాపంపిణీ సంస్థ ‘భారత్ దాల్‘ బ్రాండ్ పేరుతో ప్యాక్ అందుబాటులోకి తెస్తోంది. కేంద్రం వద్ద ఉన్న శనగపప్పు స్టాక్‌లో 20 శాతం రిటైల్ సరఫరాగా మార్చి సబ్సిడీ ధరలకు అందించనుంది. ఈ మేరకు వన్ నేషన్ వన్ ప్రైస్ ధరలను అమలు చేస్తోంది. కిలో కేజీ శనగపప్పు ప్యాకెట్ రూ.60, 30 కిలోల ప్యాకెట్‌కు కిలోకు రూ.55 చొప్పున రూ.1,650కి అందించనున్నారు. హాకాకు 50 వేల టన్నులు.. ఇక దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలలో ‘భారత్ దాల్‘ బ్రాండ్ శనగపప్పు పంపిణీ బాధ్యతలను రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ (హాకా)కు అప్పగించింది. రిటైలర్లు, హోల్‌సేల్ వ్యాపారులకు, ప్రాథమిక సహకార సంఘాలు (ప్యాక్స్), మెట్రో, రిలయన్స్, టాటా రిటైల్ చైన్ హైపర్ మార్కెట్లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ వంటి ఇ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లకు హాకా నేరుగా సరఫరా చేయనుంది. రేపు అధికారికంగా ప్రారంభం హాకా పంపిణీ చేసే శనగపప్పు భారత్ దాల్ బ్రాండ్‌ను ఆదివారం అధికారికంగా ప్రారంభించనున్నారు. నెక్లెస్‌రోడ్‌లో ని అంబేడ్కర్ విగ్రహం వద్ద హాకాచైర్మన్ మచ్చా శ్రీనివాస్‌రావు అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రోహిత్‌కుమార్ సింగ్ పాల్గొననున్నారు. -
మళ్లీ మావోల పాగా!
సాక్షి ప్రతినిధి, వరంగల్: సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణలో ఎన్నికల బహిష్కరణ నినా దం వినిపించేందుకు సిద్ధమవుతోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు సమాయత్తమవుతోంది. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో తెలంగాణలో పాగా వేసేందుకు సరైన సమయంగా పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్వ ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి చేరే అవకాశం ఉందని పోలీసులను రాష్ట్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఇదే సమయంలో ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దు ములుగు జిల్లా పేరూరు శివారు కర్రెగుట్ట ప్రాంతంలో బుధవారం మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరగడం గమనార్హం. చంద్రన్న నేతృత్వంలో సాయుధ దళాలు.. రాష్ట్ర విభజనకు ముందు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా వ్యవహరించిన పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న నేతృత్వంలో సాయుధ దళాలు మళ్లీ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. కేంద్ర కమిటీ సభ్యుడిగా, తెలంగాణ ఇన్చార్జ్గా ఉన్న చంద్రన్న.. రాబో యే ఎన్నికలే లక్ష్యంగా భారీ దాడులకు వ్యూహరచనతో తెలంగాణలో ప్రవేశించే క్రమంలో పేరూరు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో 30–40 మంది మావోయిస్టులు ఈ నెల 26న సమావేశమైనట్లు చెబుతున్నారు. బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, కొయ్యడ సాంబయ్య అలియాస్ గోపన్న, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్‌లతోపాటు ఓగోలపు మల్లయ్య, భద్ద్రు, ముచ్చకి ఉంగల్ (రఘు), కొవ్వాసి గంగ (మహె‹Ù, జనార్దన్), నల్లమారి అశోక్ (విజెందర్), సాంబయ్య (అజాద్), ముస్సాకి దేవల్ (కరుణాకర్), పొడియం కొసయ్య అలియాస్ మాసాలతోపాటు సుమారు 40 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనిపై కచి్చతమైన సమాచారం అందుకున్న ములుగు, ఛత్తీస్‌గఢ్ పోలీసులు గ్రేహౌండ్స్ బలగాలతో 2రోజులు అడవులను జల్లెడ పట్టారు. పేరూరు అటవీ ప్రాంతం కర్రెగుట్ట వద్ద వారికి మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పు లు జరగ్గా ఆయుధాలతో మావోయిస్టులు తప్పించుకున్నారు. అయితే పెద్ద మొత్తంలో కిట్ బ్యాగులు, మందులు, బ్యాటరీ చార్జర్లు, వాట ర్ క్యాన్లు, సోలార్ ప్లేట్లు, సుతిలి బాంబులు, పార్టీ సాహిత్యం, వంట సామగ్రి లభ్యం కావడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. అగ్రనేతలు లక్ష్యంగా కూంబింగ్ మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మళ్లీ తెలంగాణ సరిహద్దుకు చేరారన్న సమాచారంతో పోలీసులు ఆ పార్టీ సాయు«ధ దళాల కదలికలపై దృష్టి పెట్టారు. ఉత్తర తెలంగాణ నుంచి మొత్తం 82 మంది వివిధ నక్సల్స్ గ్రూపులలో పనిచేస్తుండగా 8 మంది ప్రజాప్రతిఘటన, ఇద్దరు న్యూడెమోక్రసీలలో, మావోయిస్టు పారీ్టలో 72 మంది పనిచేస్తుండగా, 54 మంది ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఏవోబీ తదితర ప్రాంతాలలో వివిధ కేడర్లలో ఉన్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పనిచేస్తున్న వారిలో 16 మంది పూర్వ వరంగల్‌కు చెందినవారు కాగా, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ (కేకేడబ్ల్యూ), డివిజన్ కమిటీలను ఎత్తేసి ఎన్‌టీఎస్‌జడ్‌సీని తెలంగాణ రాష్ట్ర కమిటీ (టీఎస్సీ)గా మార్చింది. రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ మృతి తర్వాత చంద్రన్న పర్యవేక్షణలో ఆ బాధ్యతలను బడే దామోదర్ చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతోపాటు కంకనాల రాజిరెడ్డి, బండి ప్రకాశ్ అలియాస్ క్రాంతి అలియాస్ ప్రభాత్, మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్, కొయ్యడ సాంబయ్య తదితర నేతల నిర్బంధం కారణంగా దండకారణ్యానికి మారారు. ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో సాయుధ దళాల రక్షణతో మళ్లీ తెలంగాణలో అడుగిడుతుండగా పోలీసులు ఆ దళాలు లక్ష్యంగా కూంబింగ్ ముమ్మరం చేశాయి. -
కాలంచెల్లిన సాఫ్ట్వేర్.. రూ.12 కోట్లు పెన్షనర్ల అకౌంట్లోకి
సాక్షి,హైదరాబాద్: కాలంచెల్లిన కంప్యూటర్లు తెలంగాణ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్‌కు పెద్ద కష్టాన్నే తెచి్చపెట్టాయి. సాఫ్ట్వేర్ లోపాలు ఉద్యోగులకు శాపాలుగా మారాయి. నిధుల కొరతతో ప్రతి రూపాయి విడుదల కోసం ఆర్థికశాఖ ఆచీతూచి నిర్ణయాలు తీసుకుంటుంటే ఇక్కడ మాత్రం రూ.12 కోట్లను పెన్షనర్ల అకౌంట్లలో జమచేసింది. ప్రతినెలా వారికి ఇవ్వాల్సిన పెన్షన్ కంటే అధికంగా చెల్లించింది. ఇందుకు ప్రధానకారణం కాలంచెల్లిన సాఫ్ట్వేర్ కారణమని తేల్చారు. పెన్–13 నుంచి ఇంపాక్ట్ సాఫ్ట్‌వేర్‌గా మార్పు జరిగిన అనంతరం పెన్షన్ డేటాలో లోపాలున్నాయని పలు జిల్లాల నుంచి డైరెక్టరేట్‌కు ఫిర్యాదులొచ్చాయి. అయినా సరిదిద్దకపోవటం వల్ల ఒక నంబర్ టైప్ చేస్తే, మరో నంబర్ అటోమెటిక్‌గా అప్లోడ్ కావటంతో చాలాకాలంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పెన్షనర్ల ఖాతాలకు వాస్తవ పెన్షన్ కంటే ఎక్కువగా చెల్లించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ను థర్డ్‌పార్టీ తనిఖీ లేకుండానే నేరుగా తమపై రుద్దారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణాచర్యలంటూ సిబ్బందికి హెచ్చరికలు: తాము చెల్లించిన ఎక్కువ మొత్తాన్ని తిరిగి చెల్లించాలంటూ తాజాగా ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ అధికారులు పెన్షనర్లకు నోటీసులు పంపుతున్నారు. మరోవైపు అధికచెల్లింపులు చేసిన సిబ్బందిపై క్రమశిక్షణాచర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుండటంతో ట్రెజరీస్ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. లోపాలు, అధిక చెల్లింపుల విషయాన్ని తాము అనేకమార్లు డైరెక్టరేట్ దృష్టికి తీసుకుపోయినా, కనీస నివారణచర్యలు తీసుకోకుండా తమపై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని చూస్తే ఆందోళన చేస్తామని ట్రెజరీస్ అకౌంట్స్ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. పెన్షనర్లు కూడా తాము ఇప్పుడు చెల్లించలేమన్న నిస్సహాయతను వ్యక్తం చేస్తుండటంతో డైరెక్టరేట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
చాట్‌జీపీటీతో ఉద్యోగ మార్పులు తథ్యం!
వృత్తి నిపుణల నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డిన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇటీవలే ఈ సంస్థ జనరేటివ్ ఏఐ తీరుతెన్నులు ఎలా ఉన్నాయనేది తెలుసుకునేందుకు హైదరాబాద్‌లో ఓ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల్లో 79 శాతం మంది జనరేటివ్ ఏఐ తాము చేసే ఉద్యోగాల్లో కచి్చతంగా మార్పులు తీసుకొస్తుందని అనుకుంటున్నారు. అదే సమయంలో ఏఐ వల్ల తమ పని ఎంతో కొంత సులువు అవుతుందని 66 శాతం మంది భావిస్తున్నారు. కెరీర్లో ముందడుగు వేసేందుకు ఏఐ పనికొస్తుందని కూడా వారు విశ్వసిస్తున్నారు. కొంచెం వివరంగా చూస్తే చాట్‌జీపీటీ వంటి జనరేటివ్ ఏఐ సాఫ్ట్వేర్లు అందుబాటులోకి రావడంతో దాదాపు ప్రతి రంగంలోనూ వినూత్న మార్పులు రావడం తెలిసిందే. మార్కెటింగ్, సేల్స్ వంటివే కాకుండా చిన్నచిన్న ప్రోగ్రామ్‌లు రాయడం, కస్టమర్ల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడం వంటి అనేక విషయాల్లో ఇది ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలోనే లింక్డిన్ సర్వేకు ప్రాధాన్యం ఏర్పడింది. జనరేటివ్ ఏఐలో వస్తున్న మార్పులను, కొత్త అప్లికేషన్లను దృష్టిలో పెట్టుకుంటే ఏడాది కాలంలో టెక్ రంగంలోనూ గణనీయమైన మార్పులు వస్తాయని హైదరాబాద్‌లోని ఐటీ వృత్తి నిపుణులు అంటున్నారు. సర్వే చేసిన ప్రతి 10 మందిలో దాదాపు 8 మంది ఈ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. జనరేటివ్ ఏఐ విస్తృత వాడకంతో చాలా ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనపైనా టెకీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏఐ రంగంలో వస్తున్న మార్పులను పట్టించుకోకుంటే ఉద్యోగాలకు ఇబ్బందన్నది నిజమేనని 42 శాతం మంది పేర్కొన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఏఐ గురించి తెలుసుకొనేందుకు దాన్ని తమ ఉద్యోగాల్లో భాగం చేసుకునేందుకు సుమారు 69 శాతం మంది సిద్ధంగా ఉండటం! కంచర్ల యాదగిరిరెడ్డి మేమిప్పటికే వాడేస్తున్నాం.. సర్వే చేసిన వారిలో సుమారు 64 శాతం మంది ఇప్పటికే తాము ఏఐను ఉద్యోగాల్లో భాగంగా వాడుతున్నట్లు చెప్పారు. అలాగే చాట్‌జీపీటీ వంటి జనరేటివ్ ఏఐను వాడే ప్రయత్నం చేస్తున్నామన్న వాళ్లు సగానికిపైగా ఉన్నారు. దేశం మొత్తమ్మీద చూస్తే చాట్‌జీపీటీని వినియోగించే వాళ్లలో 54 శాతంతో మిలినియల్స్ ముందు వరుసలో ఉన్నారు. జెన్–జీకి చెందిన వారు 46 శాతంతో రెండోస్థానంలో ఉన్నారు. అంతేకాదు హైదరాబాద్‌లోని వృత్తి నిపుణులు జనరేటివ్ ఏఐతో జట్టు కట్టేందుకు కూడా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది. ఏఐతో అయ్యే పనులేమిటి? ఏఐతో చేయగల పనులకు హద్దుల్లేవని ఐటీ నిపుణులు అంటున్నారు. తమ ఉద్యోగ జీవితాన్ని మార్చేస్తుందని దాదాపు అందరూ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే తాము ఏఐని ఉద్యోగాల్లో ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని 98 శాతం మంది పేర్కొనడం గమనార్హం. ఇందుకు తగ్గట్టుగానే ఉద్యోగ ప్రకటనల్లోనూ చాట్‌జీపీటీ, ఏఐ టెక్నాలజీల ప్రస్తావన ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయిందని లింక్డిన్ చెబుతోంది. ‘జనరేటివ్ ఏఐ మీ ఉద్యోగ జీవితాన్ని ఎలా మెరుగు పరుస్తుంది?’అని హైదరాబాద్‌లోని వృత్తి నిపుణులను అడిగినప్పుడు కావాల్సిన సమాచారం తక్షణమే అందుబాటులోకి వస్తుంది కాబట్టి చేసే పనిని మరింత సమర్థంగా, విశ్వాసంతో చేయగలమని 66 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఉత్పాదకత విషయంలోనూ ఏఐ తమకు సహాయకారి కాగలదని భావిస్తున్నారు. పనిలో ఎదురయ్యే ఇబ్బందులను సులువుగా అధిగమించేందుకు ఏఐని వాడాలని 83 శాతం మంది ఆలోచిస్తుండగా సహోద్యోగులను అడిగేందుకు ఇబ్బంది పడే ప్రశ్నలకు ఏఐ ద్వారా సమాధానాలు తెలుసుకుంటున్నట్లు 77 శాతం మంది చెప్పారు. ఏఐ కోర్సులు.. - హౌ టు రీసెర్చ్ అండ్ రైట్ యూజింగ్ జనరేటివ్ ఏఐ టూల్స్ – డేవ్ బిర్స్ - వాట్ ఈజ్ జనరేటివ్ ఏఐ? – పినార్ సెహాన్ డెమిర్డాగ్ - జనరేటివ్ ఏఐ ఫర్ బిజినెస్ లీడర్స్ – టోమర్ కోహెన్ - నానో టిప్స్ ఫర్ యూజింగ్ చాట్‌జీపీటీ ఫర్ బిజినెస్ – రాచెల్ వుడ్స్ - మెషీన్ లెరి్నంగ్ విత్ పైథాన్: ఫౌండేషన్స్ – ఫ్రెడిక్ న్వాన్గాంగా - గెట్ రెడీ ఫర్ జనరేటివ్ ఏఐ – ఆష్లీ కెన్నెడీ - ఇంట్రడక్షన్ టు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫర్ జనరేటివ్ ఏఐ – రోనీ షీర్ - పైథాన్ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్ – రాబిన్ ఆండ్రూస్ - ప్రాంప్ట్ ఇంజనీరింగ్: హౌ టు టాక్ టు ద ఏఐస్ – జేవియన్ అమాట్రియాన్ - జీపీటీ–4, ద న్యూ జీపీటీ రిలీజ్ అండ్ వాట్ యూ నీడ్ టు నో – జోనథన్ ఫెర్నాండెజ్ సాఫ్ట్ స్కిల్స్ తోడైతే.. భవిష్యత్తులో వృత్తి జీవితంలో రాణించాలంటే కేవలం ఏఐపైనే ఆధారపడటం తగదని, సాఫ్ట్ స్కిల్స్‌ను పెంపొందించుకోవడమూ చాలా అవసరమని లింక్డిన్ సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం, వ్యూహాత్మక ఆలోచనల వంటి నైపుణ్యాలు ఉన్న వారి అవసరం భవిష్యత్తులో ఎక్కువగా ఉంటుందన్నది హైదరాబాద్‌లోని వృత్తి నిపుణల లెక్క. రోజువారీ చేయాల్సిన, బోర్ కొట్టించే పనుల భారాన్ని ఏఐ టూల్స్ చక్కబెట్టగలవు కాబట్టి తాము ఆసక్తికలిగించే, నైపుణ్యం ఉన్న విషయాలపై ఎక్కువ సమయం వెచి్చంచవచ్చునని, ఇది వృత్తి సంతృప్తిని అందిస్తుందని వారు విశ్లేషించారు. అలాగే వృత్తికి.. జీవితానికి మధ్య సమతౌల్యత పెరిగేందుకూ ఏఐ తోడ్పడుతుందని సర్వేలో పాల్గొన్న వారిలో 73 శాతం మంది అభిప్రాయపడ్డారు. ‘‘వచ్చే ఐదేళ్లలో ఏఐ తమ ఉద్యోగాల్లో ఎన్నో సానుకూల మార్పులు తీసుకొస్తుందని హైదరాబాద్ వృత్తినిపుణుల్లో 86% మంది భావిస్తున్నారు. ఏఐ రాకతో తమకు సమయం ఆదా అవుతుందని, దాన్ని కొత్త నైపుణ్యాలను నేర్చుకునేందుకు, సృజనాత్మక, వ్యూహాత్మక పనులు చేసేందుకు వాడుకుంటామని చెబుతున్నారు’’ – నిరాజితా బెనర్జీ, లింక్డిన్ -
‘పరిపాలన’కు విశాఖ ముస్తాబు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దసరా వచ్చిందయ్యా.. పరిపాలన రాజధాని తెచ్చిందయ్యా అంటూ విశాఖ నగరం అందంగా ముస్తాబవుతోంది! వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అధికారులకు నివాస భవనాలను సిద్ధం చేసే ప్రక్రియ వేగవంతమైంది. హిల్–3లో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనాలు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని గుర్తించినట్లు తెలుస్తోంది. హిల్ 1, 2ల్లో నివాసయోగ్యమైన భవనాలను అధికారులకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. అక్టోబరు చివరినాటికి నిర్మాణం పూర్తయ్యే పలు భవనాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. తుది దశ భవనాల వివరాల సేకరణ విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. హిల్ 1, 2ల్లో నివాసయోగ్యమైన భవనాల విస్తీర్ణం సుమారు 40 వేల చదరపు అడుగుల మేర ఉంటుందని లెక్కగట్టారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వివిధ ప్రైవేట్ భవనాలను కూడా గుర్తించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రధానంగా రానున్న రెండు నెలల్లోగా పూర్తయ్యే భవనాలపై దృష్టి సారించారు. జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంతో పాటు స్థానిక సచివాలయాల ద్వారా ఈ వివరాలను సేకరిస్తున్నారు. వీటి విస్తీర్ణం ఎంత మేర ఉంటుందనే వివరాలు ఈ నెలాఖరు నాటికి సిద్ధమవుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వివరాలు అందుబాటులోకి వచి్చన తర్వాత వాటిని లీజుకు తీసుకుని ఏయే విభాగాలను ఏర్పాటు చేయవచ్చనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఇప్పటికే ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్న అదనపు విస్తీర్ణం ఎంత? అక్కడ ఏ విభాగాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది? అనే వివరాలను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు.