News
-
ప్రపంచ బ్యాంకులో ఏపీ పలుకు‘బడి’
సాక్షి, అమరావతి: పేదరికం, అసమానతలను తగ్గించేందుకు విద్య అత్యంత శక్తివంతమైన సాధనమని, అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో విద్యా సంస్కరణలను చేపట్టారని రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న 10 మంది విద్యార్థుల బృందం అమెరికాలో ఐక్యరాజ్యసమితి సదస్సుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐక్యరాజ్యసమితి స్పెషల్ స్టేటస్ మెంబర్ ఉన్నవ షకిన్ కుమార్ నేతృత్వంలో వాషింగ్టన్ వెళ్లిన విద్యార్థుల బృందం అక్కడ ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో సోమవారం బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, సీఎం జగన్ సంక్షేమ పథకాల ద్వారా అందిస్తున్న మేలును ఇంగ్లిష్‌లో చక్కగా వివరించారు. ఈ సందర్భంగా బ్యాంకు ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యార్థులు సోదాహరణంగా సమాధానాలు చెప్పారు. విద్యా సంస్కరణలతో ఎంతో మార్పు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు సమాజంలో ఎంతో మార్పును తీసుకొచ్చాయని రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించారు. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా మారాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న తాము నేడు ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు వరకు వచ్చి మాట్లాడుతున్నామంటే.. ఏపీలో పేదరిక నిర్మూలన, విద్యకు సీఎం వైఎస్ జగన్ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నాడు–నేడు: మనబడి, పేద పిల్లలు అంతర్జాతీయంగా ఉన్న పోటీని తట్టుకుని ఎదిగేందుకు విద్యకు ఇస్తున్న ప్రాధాన్యం, డిజిటల్ ఎడ్యుకేషన్, టోఫెల్ శిక్షణ, ట్యాబ్స్ పంపిణీ వంటి అంశాలను ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు విద్యార్థులు వివరించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలవారు ఉన్నత చదువులు అభ్యసించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. నాడు నేడు కింద పాఠశాలల్లో సకల వసతులు కల్పించడమే కాకుండా జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, ట్యాబ్స్ పంపిణీ తదితరాల గురించి వివరించారు. సాధారణ ప్రభుత్వ స్కూళ్ల నుంచి వచ్చిన తాము ఇలాంటి అంతర్జాతీయ వేదికలపై మాట్లాడడం రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు అందిన గౌరవంగా పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సహకారం అందిస్తాం! ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు.. విద్యార్థులు చెప్పిన అంశాలను ఆసక్తిగా విని విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పేదరిక నిర్మూలన, విద్యారంగం అభివృద్ధికి సీఎం జగన్ చేస్తున్న కృషిని వారు అభినందించారు. ఈ రంగంలో తాము కూడా పాలుపంచుకోవాలనుకుంటున్నట్టు తెలిపారు. విద్యా సంస్కరణలను ప్రభావవంతంగా అమలు చేసేందుకు కావాల్సిన యంత్రాంగంపై అభిప్రాయాలు చెప్పాలని విద్యార్థులను కోరారు. రాష్ట్రంలో విద్యా సంస్కరణలు విజయవంతం కావడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా తల్లులను చైతన్యవంతం చేసిందని విద్యార్థులు వెల్లడించారు. ఈ విధానం ఎంతో ఉత్తమమైందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు తమ ఆలోచనలను మారి్పడి చేసుకునేందుకు, వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై చర్చించేందుకు ఒక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను కోరారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో విద్యా మారి్పడి కార్యక్రమాలను ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పర్యావరణం, సంస్కృతిపై క్లబ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని దేశాల్లో మోడల్ యునైటెడ్ నేషన్స్ కాన్సెప్ట్‌ని ప్రవేశపెట్టి రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించాలని విద్యార్థులు కోరారు. చరిత్ర సృష్టించిన ప్రభుత్వ పాఠశాలల విధ్యార్ధులు భారత్‌లో సాంకేతిక విద్యను మెరుగుపరచడం, విద్యార్థులకు మరిన్ని కెరీర్ అవకాశాలను అందించడం కోసం జూన్ 23న ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు 255.5 మిలియన్ల డాలర్ల రుణాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భారత్‌లో పేద విద్యార్థుల ప్రగతి కోసం సహకారం అందిస్తామని హామీ కూడా ఇచి్చంది. ఈ క్రమంలో ఏపీ విద్యార్థులు ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ప్రసంగించడం, రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, విద్యా సంస్కరణలను లబ్ధి పొందిన విద్యార్థులే స్వయంగా వివరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపికైన విద్యార్థుల బృందం అంతర్జాతీయ సమావేశాల్లో పాల్గొని చరిత్ర సృష్టించింది. వరల్డ్ బ్యాంకు ప్రతినిధులతో సమావేశంలో ప్రపంచ బ్యాంక్ సీనియర్ అనలిస్ట్ ట్రేసీ విల్లిచౌస్కీ, సీనియర్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ లారా గ్రెగొరీ, లీడ్ హెల్త్ స్పెషలిస్ట్ రిఫత్ హసన్, పబ్లిక్ ఎంగేజ్మెంట్ ఆఫీసర్ లిలౌతో పాటు సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు, కేజీబీవీ కార్యదర్శి మధుసూదనరావు, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ పాల్గొన్నారు. -
కవిత్రయం తరువాత సిసలైన కవి జాషువా
ఏఎన్‌యూ: కవిత్రయం తరువాత తెలుగులో సిసలైన కవి గుర్రం జాషువా అని అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు అన్నారు. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యూనివర్సిటీ తెలుగు విభాగం, ఏపీ అధికార భాషా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి ముందస్తు వేడుకలు మంగళవారం జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన విజయబాబు మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న ఛీత్కారాలను సత్కారాలుగా మలచుకున్న దార్శనికుడు జాషువా అని చెప్పారు. వీసీ పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. జాషువా విశ్వజననీయమైన రచనలు చేశారన్నారు. జాషువా తన సాహిత్యం ద్వారా విశ్వాన్ని జాగృతం చేశారన్నారు. రెక్టార్ పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ బి.కరుణ, పాలక మండలి సభ్యురాలు సీహెచ్.స్వరూపరాణి, సీడీసీ డీన్ కె.మధుబాబు, ప్రిన్సిపాల్స్ పి.సిద్దయ్య, శ్రీనివాసరెడ్డి, ప్రమీలారాణి ప్రసంగించారు. సాహితీ పురస్కారాలు ప్రదానం తెలుగు భాషా సాహిత్యంలో విశేష సేవలు అందించిన దుగ్గినపల్లి ఎజ్రయ్య, కొమ్మవరపు విల్సన్‌రావు, విడదల సాంబశివరావు, పోగుల విజయశ్రీ, కొండపల్లి సుదర్శనరాజు, గుమ్మ సాంబశివరావు, కాకాని సుధాకర్, సీహెచ్ స్వరూపరాణి, గుమ్మడి విజయ్‌కుమార్, డి.అనిల్‌కుమార్, పీవీ సుబ్బారావుకు సాహితీ పురస్కారాలు ప్రదానం చేశారు. వ్యాసరచన, వక్తృత్వం పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. -
ఫుట్‌బాల్‌కు అత్యంత ఆదరణ కల్పిస్తాం..!
అనంతపురం: రాష్ట్రంలో ఫుట్‌బాల్ క్రీడకు అత్యంత ఆదరణ కల్పిస్తామని ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు. అనంతపురం నగర శివారులోని అనంత క్రీడా గ్రామం (ఆర్డీటీ స్టేడియం)లో మంగళవారం ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలుర జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్–2023 పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ.. మన గ్రామీణ ప్రాంతాలకు సరిపోయే క్రీడ ఫుట్‌బాల్ అని, ఇందులో యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వివిధ స్థాయిల్లో పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇకనుంచి క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ కూడా ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలకమైన క్రీడగా ఉండాలని భావిస్తున్నామన్నారు. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఫైనల్‌కు చేరితే మ్యాచ్‌ను వీక్షించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌దరెడ్డిని ఆహ్వానిస్తామని చెప్పారు. కలెక్టర్ ఎం.గౌతమి, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ సెక్రెటరీ, శాప్ బోర్డు డైరెక్టర్ డానియల్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఆంధ్రప్రదేశ్, సిక్కిం జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ 1–1 స్కోరుతో డ్రాగా ముగిసింది. -
ఇద్దరు ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు ఉత్తమ సేవా పురస్కారాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎన్ఎస్ఎస్ వలంటీర్లు జాతీయ ఉత్తమ సేవా పురస్కారాలకు ఎంపికైనట్లు ఏపీ జాతీయ సేవా పథకం అధికారి డాక్టర్ పి.అశోక్‌రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని జాతీయ సేవా పథకం కింద వివిధ సేవలను సమర్థవంతంగా నిర్వహించినందుకు 2021–22గానూ కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ పురస్కారాలను ప్రకటించిందన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమ సింహపురి వర్సిటీ పరిధిలోని జగన్స్ డిగ్రీ–పీజీ కళాశాలకు చెందిన పెళ్లకూరు సాత్విక, అనంతపురం జిల్లా శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీకి చెందిన కురుబ జయమారుతి ఉత్తమ వలంటీర్లుగా ఎంపికయ్యారని చెప్పారు. ఈ నెల 29న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము ఇద్దరు వలంటీర్లకు రూ.లక్ష నగదు, మెడల్, సర్టిఫికెట్తో కూడిన పురస్కారాన్ని ప్రదానం చేస్తారన్నారు. -
జస్టిస్ సోమయాజులు పదవీ విరమణ!
సాక్షి, అమరావతి: హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు çపలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్ సోమయాజుల కుటుంబ సభ్యులు, విశ్రాంత న్యాయమూర్తు లు, రిజి్రస్టార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. అడ్వొ కేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్, బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకిరామిరెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎన్. హరినాథ్ మాట్లాడారు. అన్ని రకాల కేసులను పరిష్కరించారు : సీజే తొలుత.. సీజే జస్టిస్ ధీరజ్‌సింగ్ మాట్లాడుతూ, న్యాయవ్యవస్థకు జస్టిస్ సోమయాజులు అందించిన సేవలను కొనియాడారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా విజయవంతంగా విధులు నిర్వర్తించారన్నారు. కుటుంబం నుంచి న్యాయ వారసత్వాన్ని కొనసాగించారని తెలిపారు. జిల్లా కో ర్టులో న్యాయవాదిగా ఉంటూ న్యాయమూర్తి అయి న తొలి వ్యక్తి రాష్ట్రంలో సోమయాజులేనన్నారు. ఆయన పదవీ విరమణతో న్యాయవ్యవస్థ ఓ మంచి న్యాయమూర్తి సేవలను కోల్పోయిందన్నారు. ఆయన విశ్రాంత జీవితం ప్రశాంతంగా, ఆయురారోగ్యాలతో కొనసాగాలని సీజే ఆకాక్షించారు. మంచి వాదనలతోనే మంచి తీర్పులు : జస్టిస్ సోమయాజులు అనంతరం.. జస్టిస్ సోమయాజులు మాట్లాడుతూ, ఓ న్యాయమూర్తిగా కక్షిదారులకు న్యాయం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశానన్నారు. న్యాయమూర్తిగా తన ఇన్నేళ్ల ప్రస్తానంలో తనకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదులు వినిపించే మంచి వాదనలతోనే మంచి తీర్పులు ఇవ్వడం సాధ్యమైందన్నారు. జస్టిస్ సోమయాజులు దంపతులను హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. వారికి శాలువా కప్పి చిత్రపటం బహూకరించారు. -
ఆహా పాము రుచి..! తినరా మైమరచి!!
సాక్షి, హైదరాబాద్: పాము దొరికిందంటే అతనికి పసందైన విందే.. దాన్ని చంపి తోలు ఒలిచి పచ్చిదే ఆరగిస్తుంటాడు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం శనగలగూడూరు గ్రామానికి చెందిన పుల్లన్నకు పాములు తినే అలవాటుంది. గతంలో చిన్నచిన్న పాములను పట్టుకుని తినే పుల్లన్న సోమవారం చనిపోయిన ఆరడుగుల పామును మెడలో వేసుకుని కొరుక్కుని తింటూ గ్రామ వీధుల్లో తిరిగాడు. ఈ ఘటన చూసిన గ్రామస్తులు విస్తుపోయారు. దీనిపై పుల్లన్నను ప్రశ్నించగా పామును తినడం తనకు అలవాటేనని, కోడికూర తిన్నట్లే ఉంటుందని చెప్పాడు. అయితే ఈ పాము బాగా ముదిరిపోయి ఉన్నందున మూరెడు ముక్క మాత్రమే తినగలిగానని చెప్పాడు. – పుట్లూరు -
వినబడకున్నా.. కనిపిస్తుంది! ఖమ్మం కుర్రాడి ఆవిష్కరణ!
సాక్షి, హైదరాబాద్: ద్విచక్రవాహనాలు నడిపే చెవిటి, మూగ దివ్యాంగులకు శుభవార్త. వెనుక నుంచి వస్తున్న వాహనాల హారన్ శబ్దం వినిపించక దివ్యాంగులు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటివారి కోసం ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్కే రజలిపాషా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వినూత్న హెల్మెట్‌ను తయారు చేశారు. వెనుక నుంచి వచ్చే వాహనాలు హారన్ మోగించినప్పుడు.. వెంటనే హెల్మెట్ ముందుభాగంలో దీపం వెలుగుతుంది. అలా వెలగడంతో ఆ కాంతి హెల్మెట్ అద్దంపై కనిపిస్తుంది.దీంతో అప్రమత్తమై వాహనాన్ని మరింత జాగ్రత్తగా నడపవచ్చు. హారన్ నుంచి వచ్చే ధ్వని తరంగాల ఆధారంగా ఈ హెల్మెట్ దీపాలు వెలిగేలా రూపకల్పన చేయడం విశేషం. -
రంగులు మార్చే చీర!
సాక్షి, సిరిసిల్ల, హైదరాబాద్: చీరను కదిలిస్తే చాలు.. రంగులు మారతాయి.. బంగారు, వెండి పోగులు మెరిసిపోతాయి. వనితల దేహంపై మెరిసిపోతాయి. బంగారం, వెండి పోగులు, పట్టుదారంతో పట్టు చీర నేశాడు సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్. నెల రోజులపాటు మగ్గంపై శ్రమించి ఈ చీరను నేశాడు. 30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండిపోగులతోపాటు పట్టు పోగులతో రూపొందించాడు. ఈ చీర పొడవు 6.30 మీటర్లు ఉండగా.. 48 అంగుళాల వెడల్పుతో 600 గ్రాముల బరువుంటుంది. ప్రముఖ వ్యాపారి దూరపూడి విష్ణు ఆర్డర్ మేరకు రూ.2.8 లక్షలు వెచ్చించి ఈ చీరను నేసినట్లు విజయ్‌కుమార్ తెలిపారు. ఈ చీరను మంత్రి కె.తారక రామారావు సోమవారం సెక్రటేరియట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేత కళాకారుడు నల్ల విజయ్‌కుమార్‌ను మంత్రి అభినందించారు. -
కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో బీటీ రోడ్డు..!
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో సరికొత్త మార్పులు, ప్రయోగాలకు సిద్దిపేట కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణంలో మరో కొత్త విధానానికి ఇక్కడే శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో కాయిర్ జియో టెక్స్టైల్ (కొబ్బరినార) సాంకేతికతతో తొలిసారిగా రోడ్డు నిర్మించడంతో.. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సాధారణంగా రోడ్ల నిర్మాణం చేసేటప్పుడు ముందుగా నేలను చదును చేస్తారు. ఆ తర్వాత వివిధ సైజుల్లో ఉన్న కంకరను పొరలు పొరలుగా పోసి రోలర్ సాయంతో తొక్కిస్తారు. ఆ మార్గం గట్టిపడిందని నిర్ధారించుకున్న తర్వాత బ్లాక్‌టేప్ (బీటీ) మిశ్రమంతో రోడ్డును నిర్మిస్తారు. లేదంటే నేరుగా సిమెంట్ రోడ్డును నిర్మించడం ఇప్పటివరకు చూశాం. అయితే, ఇటీవల సిద్దిపేటలో కొత్తగా కొబ్బరినారతో రోడ్డును నిర్మించారు. కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో హుస్నాబాద్‌లో ఉమ్మాపూర్ నుంచి పోతారం(ఎస్) వరకు నాగారం మీదుగా 3.5 కి.మీ. నిడివితో బీటీ రోడ్డు వేశారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ.2.31 కోట్లు కేటాయించారు. అయితే నేషనల్ రూరల్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌ఆర్‌ఆర్‌డీ) సూచనలతో కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో ఈ రోడ్డు నిర్మించారు. ఈ విధానంలో తాగి పడేసిన కొబ్బరి బొండాల నుంచి నారును వేరు చేశారు. దీన్ని ఒక మిషన్‌లో వేసి జాలీ మాదిరిగా అల్లారు. ముందుగా నేలను చదునుగా చేసి రోలర్‌తో తొక్కించిన తర్వాత కొబ్బరి నారతో చేసిన జాలీని పరిచారు. దీనిపై 5 అంగుళాల సన్న కంకరను ఒక పొరగా వేసి.. దానిపై 6 అంగుళాల మందంతో కంకరను మరో పొరగా పోసి రోలర్‌తో తొక్కించారు. అనంతరం పై నుంచి బ్లాక్‌టేప్ డాంబర్ వేసి రోడ్డును వేశారు. రాష్ట్రంలో తొలిసారిగా వేసిన ఈ రోడ్డును పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఇటీవల పరిశీలించారు. ఇలాంటి రోడ్ల నిర్మాణానికి డబ్బు ఆదా అవుతుందని, నాణ్యత కూడా బాగా ఉంటుందని ఆయన చెప్పారు. ఖర్చు తక్కువ.. సాధారణ రోడ్ల నిర్మాణంలో 9 అంగుళాలు, 6 అంగుళాల మందంతో కూడిన కంకరను వినియోగిస్తారు. దీని వల్ల ఖర్చు పెరుగుతుంది. పైగా రోడ్డు వాడకంలోకి వచ్చాక వాహనాల బరువుతో కలిగే ఒత్తిడి వల్ల 9 అంగుళాల మందమున్న కంకర స్థానభ్రంశం చెంది రోడ్డు కుంగిపోతుంది. ఇలా వచి్చన పల్లపు ప్రాంతంలో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు నిలుస్తుంది. దీని వల్ల బ్లాక్‌టేప్‌లో ఉండే పటుత్వం తగ్గుతుంది. ఫలితంగా రోడ్డులో గుంతలు ఏర్పడతాయి. అదీగాక, 15 అంగుళాల ఎత్తుతో రోడ్డు నిర్మించడం వల్ల రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల కంటే రోడ్డు ఎక్కువ ఎత్తుగా కనిపిస్తుంది. రోడ్డు నిర్మాణంలో కొబ్బరి పీచు వాడితే నిర్మాణ వ్యయం ప్రతీ కిలోమీటరుకు రూ.2 లక్షల వరకు తక్కువ అవుతుంది. దీంతోపాటు వృథాగా ఉంటూ దోమల పెరుగుదలకు కారణమయ్యే కొబ్బరి బొండాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. రోడ్డుపై వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా హుస్నాబాద్‌లో కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో రోడ్డు నిర్మించాం. రోడ్డు పైన పడే వర్షపు నీరు భూమిలోకి వెళ్లకుండా కొబ్బరి పీచులోకి ఇంకుతుంది. తర్వాత ఈ నీరు బయటకు రావడం వల్ల రోడ్డు చాలా రోజులు మన్నికగా ఉంటుంది. గుంతలు పడే అవకాశాలు తక్కువ. ఇదే విధంగా మరిన్ని రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం చెప్పింది. –సదాశివరెడ్డి, డీఈ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ -
వామ్మో..! చిరుత పులి పిల్లలా.. అడవి పిల్లులా ?
సాక్షి, నల్గొండ: దామరచర్ల మండలం ఇర్కిగూడెంలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో చిరుత పులి పిల్లలవిగా భావిస్తున్న పాదముద్రలు కలకలం రేపాయి. స్థాని కులు ఫారెస్ట్, పోలీసు శాఖల అధికారులకు సమాచారం ఇవ్వడంతో శనివారం ఇర్కిగూడెం అటవీ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అద్దంకి– నార్కట్‌పల్లి రహదారి పక్కన కృష్ణానది సమీపంలో రెండు చిరుతపులి పిల్లలు తిరుగుతున్నాయని కొందరు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, పోలీసు అధికారులు పరిసర ప్రాంతాలను గాలించారు. పాదముద్రలను పరిశీలించి ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అవి చిరుత పిల్లలు కావని అడవి పిల్లికి చెందిన పాదముద్రలుగా ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. రాత్రి వేళ అటవీ సిబ్బందిని నిఘా ఉంచామని, అవి పులి పిల్లలా, అడవిపిల్లులా అనేది నిర్ధారణ అవుతుందన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ ఆనంద్‌రెడ్డి, మిర్యాలగూడ సీఐ సత్యనారాయణ, వాడపల్లి ఎస్ఐ రవికుమార్, బీట్ ఆఫీసర్ ముఖేష్, బీట్ ఆఫీసర్లు ప్రవీణ్‌కుమార్, ఆజం పాల్గొన్నారు. -
‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన! కమిషనర్ శ్రీహరిరాజు
నాగర్‌కర్నూల్: పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తామని, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, కౌన్సిలర్లు, ప్రజల సహకారంతో పట్టణాన్ని అన్నిరంగాల్లో ముందుంచుతామని అచ్చంపేట మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు అన్నారు. శనివారం ‘సాక్షి’ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు కమిషనర్‌కు నేరుగా ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పగా.. ఆయన పరిష్కార మార్గాలు వివరించారు. అన్ని వార్డులను పర్యవేక్షిస్తున్నామని, మున్సిపల్ పాలకవర్గంతో చర్చించి అవసరం ఉన్నచోట అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని, ఇప్పటికే పలు వార్డుల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కుక్కలు, పందులను పట్టణ శివారు బయట ఉంచేలా చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఆహార, ఇతర వ్యర్థ పదార్థాలను బయట పడేయకుండా ఇళ్ల వద్దకు వచ్చే చెత్తబండికి అందించాలన్నారు. కుక్కలు ఏయే కాలనీల్లో అధికంగా ఉన్నాయో పరిశీలించి వాటి పరిస్థితులను గమనించడానికి శానిటరీ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో 4 టీంలను ఏర్పాటు చేశామన్నారు. పెంపుడు కుక్కలకు మున్సిపల్ కార్యాలయం నుంచి సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్‌హౌస్, చికెన్, మటన్, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి ఆహార వ్యర్థాలను రోడ్లకు ఇరువైపులా వేయకుండా సూచిస్తామన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరి సహకారం అవసరమన్నారు. ప్రశ్నలకు బదులుగా.. ► ప్రశ్న: మా కాలనీలో డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగు రోడ్లపైనే పారుతుంది. దుర్వాసన, దోమల బెడద అధికంగా ఉంది. వీధిలైట్లు వెలగడం లేదు. – నిరంజన్, వెంకటస్వామి– ఏడో వార్డు, మహేష్, వాణి– జూబ్లీనగర్, కుమార్– ఆదర్శనగర్, మోతీలాల్– మధురానగర్, రతన్‌కుమార్– సాయినగర్. కమిషనర్: వీధిలైట్లను వెంటనే ఏర్పాటు చేస్తాం. సిబ్బందితో కాల్వలు శుభ్రం చేయిస్తాం. కొత్త కాల్వల నిర్మాణానికి కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తా. ► ప్రశ్న: టీచర్స్‌కాలనీలో ఇళ్లపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలి. – శ్రీశైలం, ఉపాధ్యాయుడు కమిషనర్: సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేస్తాం. సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం. ► ప్రశ్న: మధురానగర్ మూడో రోడ్డులో కంపచెట్లను తొలగించాలి. – లాలయ్య, మధురానగర్ కాలనీ కమిషనర్: రెండు రోజుల్లో కంప చెట్లను తొలగిస్తాం. ► ప్రశ్న: ఆర్టీసీ బస్ డిపో వెనక వీధిలైట్లు ఏర్పాటు చేయాలి. – అష్రఫ్, పట్టణవాసి కమిషనర్: రెండు రోజుల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయిస్తాం. ► ప్రశ్న: పట్టణంలోని నాగర్‌కర్నూల్ ప్రధాన రహదారి మంజు టెంట్ హౌజ్ వెనక భాగంలో వర్షపు నీరు నిలిచి దుర్గంధం వస్తుంది. – తాహేర్‌పాష, టీచర్ కమిషనర్: పరిశీలించి పరిష్కరిస్తాం. ► ప్రశ్న: అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. – మండికారి బాలాజీ, మణికంఠ, అచ్చంపేట కమిషనర్: నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టకపోతే చర్యలు తీసుకుంటాం. ► ప్రశ్న: వెంకటేశ్వరనగర్కాలనీలో మురుగు కాల్వలు నిర్మించాలి. – శ్రీధర్ టీచర్, రాణాప్రతాప్, మాజీ ఆర్మీజవాన్, వెంకటేశ్వరనగర్ కాలనీ కమిషనర్: మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తాం. త్వరలోనే సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాం. ► ప్రశ్న: పట్టణంలోని 18వ వార్డు, విద్యానగర్ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మిషన్ భగీరథ నీరు సరిగా రావడం లేదు. మూడో వార్డులో బోరు మోటారు రిపేర్ చేయాలి. – మాధవి– 18వ వార్డు, శివకుమార్– 3వ వార్డు, పద్మ– విద్యానగర్‌కాలనీ, కృష్ణ– జూబ్లీనగర్, సాయిరాం– 18వ వార్డు. కమిషనర్: వాటర్మెన్లతో కలిసి వార్డును పరిశీలిస్తాం. సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరిస్తాం. 3వ వార్డులో బోరు మోటారు రిపేర్ చేయిస్తాం. ► ప్రశ్న: పందుల పెంపకందారులకు స్థలాన్ని కేటాయించి పట్టణానికి దూరంగా ఉంచేలా చూడాలి. – ఖలీల్, విష్ణు, జ్యోతి, మారుతీనగర్. కమిషనర్: ఇప్పటికే పందుల పెంపకందారులకు నాలుగు సార్లు నోటీసులు అందించాం. పట్టణ శివారుకు దూరంగా ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశాం. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. ► ప్రశ్న: పట్టణంలో కుక్కలు, పందులు, కోతుల బెడద తీవ్రంగా ఉంది. – ప్రియాంక, 9వ వార్డు, రాంమోహన్‌రావు, అడ్వకేట్ కమిషనర్: కుక్కలను పరిశీలించడానికి పట్టణంలో 4 టీంలు ఏర్పాటు చేశాం. పందుల పెంపకం దారులకు నోటీసులు అందించాం. కోతులను పట్టుకునే వారిని త్వరలోనే పిలిపిస్తాం. ► ప్రశ్న: సాయినగర్‌కాలనీ మల్లంకుంట ప్రదేశంలో, హాస్టళ్ల సమీపంలో చికెన్ వ్యర్థాలు పడవేస్తున్నారు. దుర్గంధం వెదజల్లుతోంది. – అరవింద్, సాయినగర్ కమిషనర్: చికెన్ సెంటర్ నిర్వాహకులను పిలిపించి హెచ్చరికలు చేస్తాం. ప్రత్యామ్నాయ ఏర్పా ట్లు చేసుకునేలా చూస్తాం. నిబంధనలు పాటించకపోతే జరిమానా విధించి చర్యలు తీసుకుంటాం. ► ప్రశ్న: పాతబజార్‌లో మోడల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలి. – గౌరీశంకర్, కౌన్సిలర్ కమిషనర్: పాతబజార్‌లో త్వరలోనే టాయిలెట్లు ఏర్పాటు చేస్తాం. కౌన్సిల్ తీర్మానం కూడా ఆమోదం పొందింది. -
ఆడపిల్ల భారం కాదు.. ప్రోత్సహిస్తే అండగా నిలుస్తుంది!
పెద్దపల్లి: కూతురు భారం కాదు.. ఆమెను ప్రోత్సహిస్తే కుటుంబానికి అండగా నిలుస్తూ ఇంటికి వెలుతురునిస్తుంది. ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే బరువు అనుకునేవారికి ఆ భావన తప్పు అని నిరూపిస్తున్నారు నేటి అమ్మాయిలు. కళలు, క్రీడలు, చదువులు, ఉద్యోగాల్లో రాణిస్తూ మగవాళ్లకు తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు. తల్లిదండ్రులకు తమను చూసుకునే కొడుకుల్లేరనే బాధను మర్చిపోయేలా చేస్తున్నారు. వారి ఆశలను తీరుస్తూ.. కలలను నిజం చేస్తూ ఇంట్లో ఆనందాన్ని పంచుతున్నారు. నేడు అంతర్జాతీయ కూతుళ్ల దినోత్సవం. ఈ సందర్భంగా పలువురు తమ మనోభావాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ముగ్గురూ ఉద్యోగులే.. మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామానికి చెందిన మండల కిష్టయ్య–సత్తమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు సరిత, సవిత, కీర్తి ఉన్నారు. వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. సరిత పీజీ, బీఎడ్ పూర్తి చేసి, పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించి, ఇబ్రహీంపట్నం మండలంలో విధులు నిర్వహిస్తోంది. సవిత డిగ్రీ పూర్తి చేసి ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తోంది. కీర్తి 2020లో పోలీస్‌శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి, కథలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. తాము కూతుళ్లనే కొడుకులు భావించి, ఉన్నత చదువులు చదివించామని, వారు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించడంతో తమ కల నెరవేరిందని ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పేద కుటుంబంలో పుట్టాం.. మాది జగిత్యాల జిల్లా కొడిమ్యాల గ్రామం. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. పేద కుటుంబంలో పుట్టాం. అమ్మానాన్న జడల రామస్వామి, లక్ష్మి. నాన్న ఇంటివద్దే దుస్తులు అమ్మి, కుటుంబాన్ని పోషించేవారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదువుకున్నాం. ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఉన్న మమ్మల్ని అమ్మానాన్న ప్రోత్సహించారు. అక్క రాజమణి ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా కరీంనగర్లో పని చేస్తోంది. నేను 2012లో ఐఏఎస్ సాధించా. ప్రస్తుతం పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్‌గా పని చేస్తున్నా. భర్త శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఇద్దరు అహిలన్, అభిషన్ సంతానం. చెల్లెలు జ్యోతి హైదరాబాద్‌లో బ్యాంకింగ్ రంగంలో అకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేస్తోంది. నాలుగు మాసాల క్రితం నాన్న చనిపోవడం తీరని బాధను మిగిల్చింది. కష్టపడి లక్ష్యం చేరుకున్నా.. మాది ప్రకాశం జిల్లా. నేను హైదరాబాద్‌లో పుట్టి, పెరిగాను. మేం నలుగురు అక్కాచెల్లెల్లం. నాన్న షేక్ యూసుఫ్ పాషా ఎక్స్ సర్వీస్‌మెన్, తల్లి షబీరా హౌస్ వైఫ్. నలుగురు కూతుళ్లలో నేనే పెద్దదాన్ని. పెళ్లి జరిగి, ఇద్దరు పిల్లలు పుట్టాక ఇంటి వద్దే ఉంటూ వంట చేయడం, పిల్లలను చూసుకోవడం వంటివే జీవితం అనుకోలేదు. కష్టపడి చదివి, లక్ష్యాన్ని చేరుకున్నాను. 2003లో గ్రూప్–1 రాసి, ఎంపీడీవోగా, 2009లోనూ రాసి, డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యాను. 2011లో మహబూబ్‌నగర్‌లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టాను. 2016లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా వచ్చాను. 2020లో వనపర్తికి కలెక్టర్‌గా వెళ్లాను. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన జగిత్యాల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టాను. పెద్ద చెల్లెలు నజీబీ లండన్‌లో స్థిరపడగా రెండో చెల్లెలు పర్వీన్ టీఎస్ ఎస్‌లో మంచి పొజిషన్లో ఉంది. చిన్న చెల్లెలు బీఫార్మిసీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది. అమ్మానాన్న అందరూ ఆడపిల్లలే అని బాధ పడలేదు. చదువుల్లో ప్రోత్సహిస్తూ మా వెన్నంటి ఉన్నారు. వారి వల్లే మేము ఈ పొజిషన్లో ఉన్నాం. తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించాలి. అమ్మ గర్వపడుతోంది.. మా స్వగ్రామం మేడిపల్లి మండలంలోని తొంబర్రావు పేట. కోరుట్లలో స్థిరపడ్డాం. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. నాన్న బుచ్చిలింగం గల్ఫ్ కార్మికుడు, అమ్మ లక్ష్మి బీడీ కార్మికురాలు. పిల్లలు ఆడవాళ్లనే భావన ఎప్పుడూ వారిలో చూడలేదు. అందరినీ ఉన్నత చదువులు చదివించారు. నేను బీఎస్సీ అగ్రికల్చర్ చదివి, వ్యవసాయ అధికారి ఉద్యోగం సాధించాను. చెల్లెళ్లు విశాల, రమ్య పీజీ పూర్తి చేసి, ప్రస్తుతం ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నారు. నాన్న గల్ఫ్ నుంచి వచ్చి, అనారోగ్యం బారిన పడినా అమ్మ బీడీలు చుట్టి, మా చదువులు పూర్తి చేయించింది. ప్రస్తుతం ప్రయోజకులుగా మారిన మమ్మల్ని చూసి, మా అమ్మ గర్వపడుతోంది. మా కల నిజం చేసింది.. మాది సిరిసిల్ల. మా అమ్మాయి శివాని పదోతరగతి నుంచి చదువుల్లో జిల్లా స్థాయిలో ప్రతిభ చాటుతూ ముందుకు సాగుతోంది. పదోతరగతిలో జిల్లా టాపర్‌గా నిలిచింది. ఇంటర్మీడియట్లో 968 మార్కులు సాధించింది. బీటెక్ ఈసీఈ పూర్తి చేసి, ప్రస్తుతం ఓ కంపెనీలో ఏడాదికి రూ.32 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగిగా పని చేస్తోంది. అమ్మాయి మా కల నిజం చేసినందుకు సంతోషంగా ఉంది. -
ప్రైవేట్ డెయిరీలో భారీ పేలుళ్లు! ఫోన్ రావడంతో ఒక్కసారిగా..
ఖమ్మం: ఖమ్మం 8వ డివిజన్ పరిధి గోపాలపురం పంచాక్షరినగర్లోని ఓ ప్రైవేట్ మిల్క్ డెయిరీలో శనివారం పెద్ద ఎత్తున పేలుడు చోటుచేసుకుంది. ఒకేసారి భారీ శబ్దం రావడంతో స్థానికులు హడలిపోయారు. 2017లో హనుమాన్ పాల డెయిరీ పేరుతో ఏర్పాటు చేయగా, గత ఏడాది నుంచి శ్రీ సుదర్శన్ మిల్క్‌గా పేరు మార్చారు. అయితే, ఈ డెయిరీకి ఎలాంటి అనుమతి లేకపోగా, పేలుళ్ల తర్వాత వచ్చిన అధికారులు ఇక్కడ డెయిరీ నడుస్తున్న విషయమే తమకు తెలియదని పేర్కొనడం గమనార్హం. భవనం లీజ్‌కు తీసుకుని.. 2017లో ఖమ్మంకు చెందిన రజిత పేరుతో కృష్ణం రాజేశ్ పంచాక్షరీ కాలనీలో భవనాన్ని లీజ్‌కు తీసుకొని హనుమాన్ మిల్క్ ప్రొడక్ట్ పేరిట డెయిరీ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఆయన ఏడాది కిందట గుంటూరుకు చెందిన రవీందర్బాబుకు సబ్ లీజుకు ఇచ్చాడు. అయితే, మొదటి నుంచి ఫ్యాక్టరీ అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నట్లు తెలిసింది. కాగా, శనివారం రోజు మాదిరిగానే బాయిలర్‌లో పాలు వేస్తుండగా, ఆపరేటర్ నరేశ్ తన కుమారుడికి ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రికి వెళ్లాడు. దీంతో బాయిలర్ కింద మంట అలాగే కొనసాగుతూ ఆవిరి ఎక్కువై ఒకేసారి పెద్ద శబ్దంతో పేలింది. రెండున్నర టన్నుల సామర్థ్యం కలిగిన బాయిలర్ భారీ శబ్దంతో పేలి ఎగిరి అర కిలోమీటర్ దూరంలో పడింది. ఈ సమయాన వచ్చిన శబ్దంతో ఏంజరిగిందో తెలియక స్థానికులు భయాందోళన చెందారు. కాగా, పేలుడు ధాటికి బాయిలర్ ఉన్న ప్రాంతంలోని ప్రహరీ కుప్పకూలగా, పెచ్చులు ఎగిరి సమీప ప్రాంతాల్లో పడ్డాయి. అనుమతి లేకుండానే నిర్వహణ.. బాయిలర్ పేలిన విషయం తెలియగానే ఖమ్మం ఫుడ్ ఇన్స్పెక్టర్ కిరణ్, ఫ్యాక్టరీస్ శాఖ జూనియర్ అసిస్టెంట్ అబీద్ ఘటనాస్థలానికి వచ్చారు. ప్రస్తుతం డెయిరీని సబ్ లీజ్‌కు నడుపుతున్న రవీంద్రబాబు గుంటూరు వెళ్లినట్లు తెలియగా, ఆయన వచ్చాక విచారణ చేపడుతామని తెలిపారు. ప్రస్తుతం అనుమతి లేకుండానే డెయిరీని నిర్వహిస్తున్నట్లు గుర్తించగా, శాంపిల్స్ సేకరించినట్లు చెప్పారు. అలాగే, కార్పొరేటర్ లకావత్ సైదులు పరిశీలించి వివరాలు ఆరా తీశారు. ఫోన్ రావడంతో దక్కిన ప్రాణాలు.. ఆస్పత్రికి వెళ్లిన సూపర్వైజర్ నరేశ్ అక్కడి నుంచి డెయిరీకి ఫోన్ చేశారు. దీంతో అప్పటి వరకు బాయిలర్ వద్ద కట్టెలు ఎగవేస్తున్న ఇద్దరు మహిళలు కార్యాలయంలోకి వెళ్లగానే బాయిలర్ పేలింది. దీంతో రెప్పపాటు వ్యవధిలో వారిద్దరు ప్రాణాలతో బయటపడినట్లయింది. -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో.. 'సింగరేణి గుర్తింపు ఎన్నికలు' వాయిదా!
కుమరం భీం: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలపై మళ్లీ కొర్రీ పడింది. షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటిస్తారని అనుకుంటే ఎటూ తేలకుండా మళ్లీ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 27న తిరిగి సమావేశమై చర్చిస్తామని ఎన్నికల రిట్నరింగ్ అధి కారి, డెప్యూటీ సీఎల్సీ శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఎన్నికలపై సమావేశం జరిగింది. దీనికి 14 కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉదయం నిర్వహించి న సమావేశంలో ఇంతకుముందు జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఎన్నికల షెడ్యూ ల్ విడుదల చేయాలని కార్మిక సంఘాల నేతలు రిటర్నింగ్ అధికారిని కోరారు. దీనిపై కార్మిక సంఘాల నేతలంతా తమ వాదనలు వినిపించారు. అ నంతరం సాయంత్రం మళ్లీ సమావేశం నిర్వహించా రు. దీనికి కంపెనీ నుంచి డైరెక్టర్ (పా) ఫైనాన్స్ బలరాం హాజరయ్యారు. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండనున్నందున ప్రస్తుతం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కలెక్టర్లు పేర్కొంటున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చినట్లు బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, హెచ్ఎమ్మెస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. ఇదే విషయమై కంపెనీ హైకోర్టుకు తిరిగి వెళ్లడం.. దీనిపై వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టడంతో ఉన్న ఫలంగా షెడ్యూల్ ఇవ్వద్దని కంపెనీ కోరింది. దీంతో ఈ నెల 27న తిరిగి సమావేశం అవుదామని చెప్పి రిటర్నింగ్ అధికారి షెడ్యూ ల్ ఇవ్వకుండా సమావేశాన్ని వాయిదా వేశారు. ఉత్తర్వులు జారీ.. గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసి ఎన్నికలు నిర్వహించడానికి జాప్యం జరుగుతున్నందున ఎన్నికలు నిర్వహించేదాకా అన్ని కార్మిక సంఘాలను సమానంగా గుర్తిస్తూ, ప్రాతినిధ్యం కల్పించాలని కార్మిక సంఘాల నేతలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఈ సమావేశంలోనే డైరెక్టర్ (పా) ఉత్తర్వుల కాపీని నేతలకు అందించారు. ఎన్నికలు జరిగేదాకా 14 రిజిస్ట్రర్డ్ సంఘాల ప్రతినిధులను గుర్తింపు సంఘం నాయకులతో పాటు సమానంగా గనులు, ఏరియా, కంపెనీ స్థాయిలో జరిగే అధికారిక సమావేశాలు, చర్చలు, సంప్రదింపులు, కార్యక్రమాలకు ఆహ్వానించేలా ఏరియా జీఎంలకు డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు. -
చైనాలో.. అదరగొట్టనున్న.. తెలంగాణ బిడ్డ! అరుదైన అవకాశం!!
సాక్షి, మహబూబాబాద్: చైనాలోని హాంగ్జౌ వేదికగా శనివారం నుంచి ఆసియా గేమ్స్ ప్రారంభం కానున్నాయి. బ్యాడ్మింటన్ విభాగంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారిణి సిక్కిరెడ్డి ప్రతిభ కనబర్చనున్నారు. పతకం సాధించి తెలంగాణకు పేరు తేవాలని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, జిల్లాకు చెందిన ప్రముఖులు కోరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన నెలకుర్తి కృష్ణారెడ్డి, మాధవి దంపతుల కుమార్తె సిక్కిరెడ్డి. బాల్యంలో ఇక్కడే ఆటలో ఓనమాలు దిద్దారు. తండ్రి ఉద్యోగరీత్యా ఖమ్మం, హైదరాబాద్‌లో పని చేయడంతో అక్కడ బ్యాడ్మింటన్‌లో పూర్తి మెలకువలు నేర్చుకున్నారు. ఎడమ చేతివాటంతో చిన్నతనం నుంచి ప్రతిభ కనబర్చిన సిక్కిరెడ్డి 2014 మే నెలలో ఢిల్లీ ఉబర్ కప్‌లో కాంస్యం, 2015లో నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకం, కామన్వెల్త్లో కాంస్యం.. ఇలా అనేక పతకాలు కైవసం చేసుకున్నారు. అరుదైన అవకాశం.. ఆసియా గేమ్స్‌లో 40 దేశాలకు పైగా.. 41 క్రీడాంశాల్లో 655 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఇందులో తెలంగాణ నుంచి 16 మంది పాల్గొంటున్నారు. వీరిలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన సిక్కిరెడ్డి ఉండడం గర్వకారణం. -
తుపాకీతో.. కలకలం రేపిన ‘క్రెడాయ్’ అధ్యక్షుడు!
సాక్షి, వరంగల్: పరకాల పట్టణంలోని ఓ ఫంక్షన్ విందులో ఈ నెల 15న గాల్లోకి కాల్పులు జరిపిన బిల్డర్, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి తిరుపతిరెడ్డిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపర్చినట్లు పరకాల సీఐ జె.వెంకటరత్నం తెలిపారు. ఈ ఘటనపై గురువారం సదరు ఫంక్షన్ హాల్ వద్ద విచారణ చేపట్టారు. ఫంక్షన్ హాల్ యజమాని రాజేశ్వర్‌రావుతోపాటు సిబ్బందిని విచారించారు. తనకు పార్టీలో ప్రాధాన్యం లేకపోవడంతో కొందరిని బెదిరించడంతోపాటు భయపెట్టడానికే తిరుపతిరెడ్డి తన వద్ద ఉన్న రివాల్వర్‌ను ప్రదర్శించి మద్యం మత్తులో రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తేలిందని సీఐ వెంకటరత్నం వెల్లడించారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా భయభ్రాంతులకు గురై వెళ్లిపోయారని తెలిపారు. ఈ మేరకు తిరుపతిరెడ్డిని అరెస్ట్ చేసి పరకాల కోర్టులో హాజరుపర్చినట్లు చెప్పారు. కాగా, పోలీసులు అతడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. వ్యక్తిగత భద్రత పేరిట.. మావోయిస్టుల ప్రాబల్యం లేనప్పటికీ వ్యక్తిగత భద్రత పేరిట గన్‌కల్చర్‌పై పలువురు ఆసక్తి చూపుతుండగా.. ఇప్పుడది భద్రత కంటే హోదా, ఫ్యాషన్‌గా మారిపోయింది. ఫలితంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రౖపైవేట్ ‘గన్’లు గర్జిస్తున్నాయి. తాగిన మైకంలో మాటలు పెరిగి పట్టరాని ఆవేశంతో ‘ట్రిగ్గర్’ నొక్కుతున్న ఘటనలు వివాదాస్పదం అవుతున్నాయి. ‘క్రెడాయ్’ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, బిల్డర్ ఎర్రబెల్లి తిరుపతి రెడ్డి (సిద్ధార్థ తిరుపతిరెడ్డి) పరకాలలో ఆర్ఆర్ గార్డెన్లో ఓ దశ దినకర్మకు హాజరై తాగిన మత్తులో రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ నెల 15న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూడగా.. గురువారం అతడిని పోలీసులు పరకాల కోర్టులో హాజరుపర్చి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కలకలం రేపుతున్న ‘తుపాకులు’.. హైదరాబాద్, ముంబై వంటి మెట్రో పాలిటన్ నగరాల్లో అక్రమంగా తుపాకులు కలిగి ఉండటం, బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటనలు ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్ పరిధిలో సైతం పాకాయనే చర్చ కొనసాగుతోంది. ఏదో సాకు చూపి రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థల నిర్వాహకులు ఎక్కువగా తుపాకీ లైసెన్స్‌లు తీసుకుంటున్నారు. కమిషనరేట్ పరిధిలో ఇలాంటివారే ఆయుధాల లైసెన్సులు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మ రక్షణకు తీసుకున్న వీరిలో కొందరు బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితులు ఫిర్యాదు చేస్తేనే తప్ప తెలవడం లేదు. పరకాలలో కాల్పులు జరిపిన ఘటన కూడా ఐదు రోజుల తర్వాత వెలుగు చూసింది. ఆగని ఆగడాలు.. 2014 ఫిబ్రవరి ఆఖరు వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 314 ఆయుధ లైసెన్స్‌లు ఉన్నాయి. వీటిలో బ్యాంకులు, బ్యాంకుల వద్ద పనిచేసే వారి కోసం ఇచ్చినవి 74, ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినవి 240 ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తుల కోటాలో తీసుకున్న వారిలో రాజకీయ నాయకులే ఎక్కువగా ఉన్నారు. 2015 జనవరి 25న వరంగల్ అర్బన్ పోలీస్ జిల్లా... వరంగల్ పోలీస్ కమిషనరేట్‌గా మారింది. 2016 అక్టోబర్ 11న జరిగిన జిల్లాల పునర్విభజన సమయంలో కమిషరేట్ పరిధి పెరిగింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాలు కమిషనరేట్ పరిధిలోకి వచ్చాయి. ప్రస్తుత వరంగల్ పోలీస్ కమిషరేట్ పరిధిలో 180 లైసెన్స్ తుపాకులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. లైసెన్స్‌లు పొందినప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడం, ఇతరులను బెదిరించడం, తాను ఆయుధం కలిగిఉన్నానని ఇతరులను ఆందోళనకు గురి చేసినా ఆ లైసెన్సు రద్దు చేసే అవకాశం ఉంది. ఆత్మరక్షణ కోసం మినహా ఏ సందర్భంలోనూ ఆయుధం ప్రదర్శించినా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనలు కఠినతరం చేసినా ఆగని ఆగడాలపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. తిరుపతిరెడ్డి గన్ లైసెన్స్‌పై ఆరా.. పరకాల ఆర్ఆర్ గార్డెన్స్‌లో క్రెడాయ్ అధ్యక్షుడు, బీఆర్ఎస్ నేత గాల్లోకి రివాల్వర్‌తో రెండు రౌండ్ల కాల్పులు జరిపిన ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నట్లు తెలిపారు. పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు పరకాల పోలీసులతోపాటు స్పెషల్ బ్రాంచ్ అఽధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ప్రాంతంలో నక్సలైట్ల ప్రాబల్యం లేనప్పటికీ.. తిరుపతిరెడ్డికి లైసెన్స్ ఇవ్వడంలో గతంలో ఓ పోలీస్ ఉన్నతాధికారి బంధువు కావడమేనన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తుపాకీ లైసెన్స్ ఎప్పుడు జారీ అయ్యింది? సిఫారసు చేసిన అఽధికారి ఎవరు? నిజంగానే తిరుపతిరెడ్డి లైసెన్స్‌కు అర్హుడా? అనే అంశాలతోపాటు పలు కోణాల్లో విచారిస్తున్నట్లు స్పెషల్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. -
అధికారమదంతోనే.. 'సాక్షి విలేకరి'పై దాడి!
సంగారెడ్డి: అల్లాదుర్గం సాక్షి విలేకరి వీరేందర్‌పై దాడి చేసిన ఎంపీపీ అనిల్‌రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని దౌల్తాబాద్ ప్రెస్‌క్లబ్ సభ్యులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అండతోనే ఎంపీపీ అనిల్‌రెడ్డి దాడి చేశారన్నారు. పోలీసులు ఎంపీపీపై చర్యలు తీసుకోకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళ చేస్తామని హెచ్చారించారు. కార్యక్రమంలో దౌల్తాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రెస్‌క్లబ్ సభ్యులు శంభులింగం, సంతోష్, నగేష్, బాబు, భాస్కర్ గౌడ్, యాదగిరి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. అల్లాదుర్గం సాక్షి విలేకరి వీరేందర్‌పై ఎంపీపీ అనిల్‌కుమార్‌రెడ్డి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మెదక్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేశ్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రియాజ్ పేర్కొన్నారు. బుధవారం మెదక్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలికితీసే జర్నలిస్టును అధికారమదంతో దాడికి పాల్పడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. అందిన సమాచారాన్ని బట్టి వార్తలు రాస్తే దుర్భాషలాడుతారా అని ప్రశ్నించారు. ఒకవేళ వార్తలో తప్పుంటే ఖండించాల్సిందిపోయి భౌతిక దాడులకు దిగడం సరైందికాదన్నారు. చంటి క్రాంతికిరణ్ జర్నలిస్టు నాయకుడిగా ఉండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినా నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యా నించారు. ఎంపీపీ అనిల్‌కుమార్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, పదవి నుంచి బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపాలన్నారు. లేకుంటే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మెదక్ ప్రెస్‌క్లబ్ నాయకులు రాజశేఖర్, బీవీకే రాజు,ప్రకాష్, చింతల రమేశ్, రహమత్, చంద్రశేఖర్ గౌడ్, మువ్వ నవీన్, శ్రీని వాస్చారి, లక్ష్మీనారాయణ, కార్తీక్, రఘు, దుర్గేష్, నర్సింలు, వంశీ ,శ్రీకాంత్, నవీన్‌రెడ్డి, ఊశ య్య, కృష్ణమూర్తి, సాయిలు, హమీద్ పాల్గొన్నారు. టేక్మాల్‌లో ర్యాలీ.. అల్లాదుర్గం విలేకరిపై దాడిని ఖండిస్తూ బుధవారం టేక్మాల్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నల్లాబడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎంపీపీ అనిల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్ మల్లయ్యకు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. అధికారమదంతో జర్నలిస్టులపై దాడులు చేయడం అమానుషమన్నారు. కార్యక్రమంలో టేక్మాల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు బాగయ్య, సీనియర్ పాత్రికేయులు ఆనంద్, మహేదర్‌రెడ్డి, బీరప్ప, నర్సింలు, పులిరాజు, ధనుంజయ, రాజు, రమేష్, నాయికోటి రాజు, సాయిలు, ప్రేమ్‌కుమార్, నరేందర్, రాము, అశోక్, కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అల్లాదుర్గంలో.. జర్నలిస్టులపై అధికార పార్టీ నాయకుల దాడులు సహించేది లేదని కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బలరాం, బీజేపీ జిల్లా నాయకుడు బ్రహ్మం హెచ్చరించారు. బుధవారం తహసీల్దార్ సతీశ్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. అల్లాదుర్గం ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగున్నరేళ్లుగా ఎంపీపీగా ఉన్న మీరు అల్లాదుర్గంకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ దుర్గయ్య, వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నరేష్ నాయకులు సదానందం,, కేశనాయక్, వంకిడి రాములు, సాయిబాబా, వీరబోయిన సాయిలు, ముసిరిగారి శ్రీను, నితీశ్, లక్ష్మణ్, రాజు ఉన్నారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.. అల్లాదుర్గం సాక్షి విలేకరి వీరేందర్‌పై దాడి చేసిన ఎంపీపీ అనిల్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ ప్రెస్‌క్లబ్ గౌరవ అధ్యక్షుడు అలీం బుధవారం డిమా ండ్ చేశారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోని దాడులకు పాల్పడడం అప్రజాస్వామ్యమన్నారు. జర్నలిస్టుపై దాడులు చేయడం.. బెదిరించడం రాజకీయ నాయకులకు ఫ్యాషన్‌గా మారిందన్నారు. -
'సాక్షి' ప్రచురిత కథనానికి.. రిమ్స్ అక్రమార్కులపై స్పందించిన కలెక్టర్!
ఆదిలాబాద్: రిమ్స్‌లో అవినీతి, అక్రమార్కులపై కలెక్టర్ రాహుల్‌రాజ్ సీరియస్ అ య్యారు. డైరెక్టర్ జైసింగ్ రా థోడ్‌ను మంగళవారం సాయంత్రం పిలిపించి తాజా ఘటనలపై ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈనెల 18న ‘సాక్షి’లో ‘అవుట్సోర్సింగ్ మోసాలు.. ’శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించారు. నిరుద్యోగి నుంచి డబ్బులు వసూలు చేసిన సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయమై డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ, విచారణ కమిటీ ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
డెంగీతో.. 'పసి హృదయం' విలవిల..! ఆదుకోవాలంటూ కన్నోళ్ల వేదన..!!
మహబూబాబాద్: ఓ పసి హృదయం విష జర్వంతో విలవిలాడుతోంది. పట్టుమని పది నెలలు కూడా నిండని ఆ శిశువును డెంగీ మహమ్మారి ఆవహించింది. వాంతులు, విరోచనాలతో చుట్టుముట్టింది. దీనికి ఆందోళన చెందిన తల్లిదండ్రులు.. చిన్నారిని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఎక్కడా తగ్గలేదు. వైద్యుల సూచన మేరకు చివరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ రోజుకు రూ. 2 లక్షలు ఖర్చు చేస్తూ చిన్నారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై దాతలు స్పందించి ఆర్థిక చేయూతనందించాలని వారు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ముల్కనూరు గ్రామ పంచాయతీ పరిధి దుబ్బగూడెం గ్రామానికి చెందిన చిన్నారి తోటకూర బాలకృష్ణ, లలిత దంపతుల 9 నెలల పాప ప్రణిద ఉంది. ఈ క్రమంలో ప్రణితకు ఈనెల 13న జ్వరం రావడంతో బయ్యారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అక్కడ జ్వరం తగ్గకపోవడంతో 14వ తేదీన ఖమ్మంలోని జాబిల్లి ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఖమ్మంలో కూడా జ్వరం తగ్గకపోగా, వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో అక్కడి వైద్యులు ఈనెల 17న హైదరాబాద్ రెయిన్బో ఆస్పత్రికి రెఫర్ చేయగా చిన్నారిని అక్కడికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పాప ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే వైద్యఖర్చుల రోజుకు రూ.2 లక్షలు అవుతుందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీనిపై దాతలు స్పందించి 9949803665 నంబర్‌కు ఫోన్ పే చేసి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. కాగా, దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ముల్కనూరు పీహెచ్సీ ఆధ్వర్యంలో బుధవారం దుబ్బగూడెంలో వైద్యశిబిరం నిర్వహించారు. -
TS Election 2023: అభివృద్ధి, సంక్షేమమే 'మా నినాదం!' : మంత్రి గంగుల కమలాకర్
సాక్షి, కరీంనగర్: మహానీయుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు సాగాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం జాతీయ సమైక్యత దినోత్సవం నిర్వహించి, జాతీయజెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17కు ఒక విశిష్టత ఉందని, 75 ఏళ్లక్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. వీరులకు జోహార్లు.. ఇటీవలే దేశస్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకున్నామని, దానికి కొనసాగింపుగానే తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని స్పష్టం చేశారు. ఆదివాసీ వీరుడు కుమ్రంభీం, దొడ్డి కొమురయ్యతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు బద్ధం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, మగ్దూం మొహియుద్దీన్, భీంరెడ్డి నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మ, ఆరుట్ల రామచంద్రారెడ్డి, బొమ్మగాని ధర్మభిక్షంగౌడ్ వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకోవాలని సూచించారు. చేతివృత్తులకు చేయూత.. చేతివృత్తిదారుల జీవనాన్ని మెరుగుపర్చేందుకు బీసీ చేయూత పథకం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 1,700మందికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించామని తెలిపారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 174మందికి రూ.లక్ష చొప్పున రూ.1.74 కోట్ల విలువైన చెక్కులు అందించామని అన్నారు. అవార్డుల్లో ప్రథమం.. దివ్యాంగులకు ఫించన్ రూ.4016కు పెంచామని, బీడీ టేకేదారులకు రూ.2016 అందిస్తున్నట్లు తెలి పారు. జిల్లాలోని తొమ్మిది మండలాల్లోని 15గ్రామాలకు స్వచ్ఛసర్వేక్షణ్ గ్రామీణ–2023 అవార్డులు, గన్నేరువరం మండలం ఖాసింపేట, రామడుగు మండలం వెలిచాల రాష్ట్రస్థాయి అవార్డులు సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తితో దళితబంధు ప్రవేశపెట్టి రాష్ట్రంలోనే మొట్టమొదటగా.. హుజూరాబాద్ నియోజకవర్గంలో 18,021 కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున రూ.1784 కోట్లు అందించినట్లు తెలి పారు. జిల్లాలోని 49,544మంది రైతుల బ్యాంకుఖాతాల్లో రూ.261.19 కోట్లు జమచేశామన్నారు. వైద్యరంగానికి పెద్దపీట.. వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని ఏ రాష్ట్రంలో లేని విధంగా మెడికల్ కళాశాలలను స్థాపించుకున్నామని, 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయని అన్నారు. నగరం ఏ మూలన చూసిన అద్భుతమైన రోడ్లు, విద్యుత్‌లైట్లు, కేబుల్బ్రిడ్జితో విరాజిల్లుతోందన్నారు. మానేరు రివర్ ఫ్రంట్‌లో ఏర్పాటు చేయనున్న అతిపెద్ద వాటర్ ఫౌంటెన్ పనులు ఏడాదిలో పూర్తిచేసి, బోటింగ్ ఏర్పాటు చేస్తామని వివరించారు. సత్కారాలు.. సాంస్కృతిక కార్యక్రమాలు! అనంతరం మంత్రి కమలాకర్ స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీసుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మేయర్ వై.సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ.రామక్రిష్ణారావు, కలెక్టర్ గోపి, సీపీ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు లక్ష్మీకిరణ్, ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, గ్రంథాలయ చైర్మన్ అనిల్‌కుమార్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ రెడ్డవేని మధు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు. -
'రిమ్స్ అక్రమ ప్రావీణ్యుడి' బాగోతం తెరపైకి..!
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో అక్రమార్కుల దందా జోరుగా సాగుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొంతమంది ఘరానా మోసగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. రిమ్స్‌లో తవ్వినకొద్దీ బండారం బయటపడుతోంది. కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, సెక్యూరిటీగార్డు, పేషెంట్‌కేర్, రికార్డు అసిస్టెంట్ తదితర పోస్టులు ఇప్పిస్తామంటూ వారి నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇప్పించడం పక్కనబెడితే వారు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా నానా ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ఇటీవల టర్మినెట్ చేయగా, తాజాగా మరో అక్రమ ‘ప్రావీణ్యు’డి బాగోతం తెరపైకి వచ్చింది. చాలామంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇప్పించకపోగా, తిరిగి ఇచ్చేందుకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. విషయం రిమ్స్‌లో బహిరంగ రహస్యమే అయినప్పటికీ రాజకీయ నాయకులు, యూనియన్ అండదండలతో అతడు తప్పించుకొని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కుల్లో ఓ ‘ప్రావీణ్యు’డు.. ► కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరికి చెందిన ఓ నిరుద్యోగి ఐటీఐ పూర్తి చేశాడు. కూలీనాలి చేస్తేనే ఆ కుటుంబ సభ్యుల జీవనం సాగేది. తనకు తెలిసిన మిత్రుడు ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో రికార్డు అసిస్టెంట్ ఉద్యోగం ఉందని చెప్పడంతో తండ్రి అప్పు చేసి రూ.లక్ష ఇచ్చాడు. దీంతో ఆ యువకుడు రిమ్స్‌లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో ఆ మొత్తం ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే డబ్బులు తీసుకున్న సదరు వ్యక్తి ఉద్యోగం ఇప్పించకపోగా, ఏడాదిన్నరగా రేపూమాపు అంటూ తిప్పుకుంటున్నట్లు బాధితుడు వాపోయాడు. ► కుమురంభీం జిల్లా కెరమెరికి చెందిన మరో నిరుద్యోగి ల్యాబ్ టెక్నీషియన్ పూర్తి చేశాడు. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానని ఈ అక్రమార్కుడే నిరుద్యోగి నుంచి రూ.లక్ష తీసుకున్నాడు. ఐదారు నెలలుగా తిప్పుకున్నాడు. దీంతో బాధితుడు ఓ రాజకీయ పార్టీ నాయకుడి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. రిమ్స్ డైరెక్టర్‌తో పాటు కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో ఆ బాధితుడికి డబ్బులు తిరిగి ఇచ్చేశాడు. ఇలా ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, ఖానాపూర్, తదితర ప్రాంతాలకు చెందిన అనేక మంది నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి అందినకాడికి దండుకుంటున్నాడు. ఇతనొక్కడే కాదు.. అంగట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అనేలా పలువురు ఈ దందా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో చాలామంది పెద్దల హస్తమున్నట్లు సమాచారం. ఇటీవల పలు ఘటనలు వెలుగు చూసినా ఉన్నతాధికారులు కఠిన చర్యలకు వెనుకాడడం అనుమానాలకు తావిస్తోంది. అక్రమాలకు పాల్పడుతున్న తీరిలా.. జిల్లాలో పలువురు అక్రమార్కులు అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ముఖ్యంగా రిమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అందులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువ శాతం ఈ దందాకు తెరలేపుతున్నారు. కొన్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఆ ఏజెన్సీల వారు తమకు తెలుసని, అదేవిధంగా రాజకీయ నాయకులతో పరిచయం ఉందని మాయమాటలు చెబుతున్నారు. రిమ్స్ ఆస్పత్రితో పాటు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పడటం అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నాయని మోసాలకు తెర లేపుతున్నారు. విద్యార్హతలు, ఇంటర్వ్యూలు లేకుండానే కొలువు ఇప్పిస్తామని చెప్పడంతో అమాయక నిరుద్యోగులు వీరి వలలో చిక్కుకుంటున్నారు. డబ్బులు ఇచ్చిన తర్వాత మోసపోయామని లబోదిబోమంటున్నారు. కొంత మంది ఈ విషయాన్ని బహిర్గతం చేస్తుండగా, మరికొంత మంది ఎవరికై నా చెబితే తమ డబ్బులు రావనే భయంతో మానసికంగా కుంగిపోతున్నారు. ఇలాంటి బాధితులు వందలాదిగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన సదరు అక్రమార్కుడు దాదాపు 50 మందికి పైగా నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఏకంగా గెజిటెడ్ సంతకాలు పెట్టి ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది. తనతో పాటు దందాలో కుటుంబీకులను కూడా కలుపుకొని ఇంటి వద్ద నుంచే ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. విధులు నిర్వహించకుండా ఇదే పనులపై దృష్టి పెడుతున్నారని రిమ్స్‌లో పనిచేసే ఉద్యోగులు సైతం పేర్కొనడం ఆయన పాల్పడిన అక్రమాలకు అద్దం పడుతోంది. నా దృష్టికి రాలేదు.. రిమ్స్‌లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. బాధితులెవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. రిమ్స్‌లో ప్రస్తుతం ఎలాంటి ఉ ద్యోగాలు లేవు. నిరుద్యోగులు మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దు. ఎవరికి డబ్బులు ఇవ్వొద్దు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే మా దృష్టికి తీసుకురావాలి. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్ -
పర్యాటక మంత్రి హామీతోనైనా.. చంద్రగఢ్ దశ మారేనా?
వనపర్తి: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యంత పురాతన కట్టడాల్లో చంద్రగఢ్ కోట ఒకటి. చుట్టూ రాతితో నిర్మించిన కోట చూడగానే అప్పటి నిర్మాణశైలి గుర్తుకొస్తుంది. అలాంటి కోట శిథిలావస్థకు చేరడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధికి నోచుకోకపోవడంతో చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. 18వ శతాబ్దంలో మరాఠా రాజుల కాలంలో బాజీరావు పీశ్వా ఆత్మకూర్ సంస్థానానికి సంబంధించి పన్ను వసూలు చేయడానికి చంద్రసేనుడిని నియమించారు. చంద్రసేనుడు ఈ ప్రాంతంలోని ధర్మాపురం గ్రామానికి ఉత్తర దిశగా ఉన్న ఎత్తైన కొండపై ఈ కోట నిర్మించారు. చంద్రసేనుడు ఇక్కడి నుంచే వివిధ సంస్థానాధీశుల నుంచి పన్నులు వసూలు చేసి మరాఠాకు పంపేవాడు. చంద్రసేనుడు నిర్మించిన కోట కావడంతో దీనికి చంద్రగఢ్ కోటగా నామకరణం చేశారు. నేడు ఇక్కడ ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయంలో నిత్య పూజలతో పాటు ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శత్రువుల కదలికలను గుర్తించేందుకు.. కోట పైభాగంలో ఉండే సైనికులు శత్రు సైనం దండెత్తడానికి వస్తే సుమారు పది కిలోమీటర్ల దూరం నుంచి పసిగట్టి ఫిరంగులతో దాడి చేసేందుకు వీలుగా కోటగోడ భాగంలో భారీ రంధ్రాలను ఏర్పాటు చేశారు. పర్యాటక మంత్రి హామీతోనైనా.. అమరచింతలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చంద్రగఢ్ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు నివేదిక సిద్ధం చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి సూచించారు. మంత్రి హామీతో చంద్రగఢ్ కోట పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంతవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోటకు మరమ్మతులు చేయించి పార్క్‌లు ఏర్పాటుచేస్తే వివిధ ప్రాంతాల నుండి పర్యాటకులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మంత్రి చొరవతో చంద్రగఢ్‌కు పూర్వ వైభవం రావాలని, ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరుతున్నారు. ‘చుట్టూ పచ్చని పంట పొలాలు, ఆహ్లాదకర వాతావరణంలో ఎత్తైన కొండపై 18వ శతాబ్దంలో నాటి సంస్థానాదీశుడైన చంద్రసేనుడు చంద్రగఢ్ కోటను నిర్మించారు. కోట మధ్యలో రామలింగేశ్వరస్వామి ఆలయంతో పాటు తాగునీటి కోసం రాతిపొరల మధ్య ఏర్పాటుచేసిన ఎనిమిది చిన్న చిన్న కొలనులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికీ ఏడాది పొడవునా నీరు ఉండటం విశేషం.’ ఇదీ ప్రస్తుత పరిస్థితి.. ప్రస్తుతం కోటలోని రాతి గోడలు శిథిలావస్థకు చేరాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కోటను సందర్శించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అప్పట్లో కేవలం కోటపైకి వెళ్లడానికి వీలుగా సీసీ రహదారి నిర్మించి వదిలేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు చంద్రగఢ్ కోటను పట్టించుకునే వారే కరువయ్యారు. -
సెప్టెంబర్ 17 : BRS పునరుజ్జీవనం vs BJP విమోచనం
సెప్టెంబర్ 17 వచ్చిందంటే రాజకీయ పార్టీలు కొత్త వివాదాన్ని తీసుకొస్తున్నాయి. చరిత్రలో ఇలా జరిగింది.. ఇది మా వాదన అంటూ ఒక్కో రకంగా చెప్పుకుంటున్నాయి. నిజంగా ఏం జరిగిందన్నది మరుగునపడి పార్టీలు తీసుకొస్తున్న కొత్త వాదన మీద వర్తమానం నడుస్తోంది. నాడు ఏం జరిగిందన్న లోతుల్లోకి వెళ్తోన్న రాజకీయనాయకులు జరిగిన దానికి తమదైన భాష్యం చెప్పుకుంటున్నాయి. సాక్షికి ఇచ్చిన వ్యాసాల్లో రెండు విరుద్ధ భావాలను పంచుకున్నాయి బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు. బీఆర్ఎస్ తరపున మంత్రి శ్రీనివాసగౌడ్, బీజేపీ తరపును విద్యాసాగర్‌రావు అందించిన ప్రత్యేక వ్యాసాలు ఇవి. BRS : పునరుజ్జీవనం : ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యమంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. కృష్ణా–గోదావరీ జలాలను తెలంగాణలోని చేను చెల్కలను తడపడానికీ, చెరువులను నింపడానికీ, తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకి మళ్లించే కార్యక్రమానికీ ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది. అలా చేపట్టిన ప్రాజెక్టుల్లో ప్రతిష్ఠాత్మకమైనది ‘పాలమూరు–రంగారెడ్డి.’ తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్ ‘నీళ్లు, నిధులు, నియామకాలు.’ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ ఆకాంక్ష, ప్రజల స్వప్నంగా ఉన్న కృష్ణా–గోదావరీ జలాలను చేను చెల్కలకు, చెరువులను నింపడానికి తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకి మళ్లించే కార్యక్రమాన్ని ప్రథమ ప్రాధాన్యం రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. వింధ్య సాత్పురా పర్వతాల మధ్య ఉన్న దక్కన్ పీఠభూమి శిఖరంగా ఉన్న తెలంగాణను ఆకుపచ్చ సీమగా మలిచే బృహత్తర కార్యక్రమాన్ని కేసీర్ నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. నూతన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సమాంతరంగా నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాల పెంపు ప్రాతిపదికగా ప్రజల భాగ స్వామ్యంతో చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ అపూర్వ ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ గ్రామీణ ఆర్థిక సామాజిక సాంస్కృతిక వికాసం పునరుజ్జీవం పొందుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకుల దాష్టీకాల వలన తెలంగాణ సంక్షుభితంగా మారింది. పాలమూరు జిల్లాలో మానవ జీవన విధ్వంసం పతాక స్థాయికి చేరుకుంది. ఇక్కడ మనిషికి మనుగడకు మహా యుద్ధమే జరిగింది. ‘నీరు పల్లమెరుగు’ అనే కాలం చెల్లిన నమూనాతో తెలంగాణలో అత్యధిక చెరువులు ఉన్న ఉమ్మడి పాలమూరుపై నిర్లక్ష్యం చేసి బిరా బిరా కృష్ణమ్మను రానివ్వకుండా దగా చేశారు. తమ కళ్ళముందు పారుతున్న నీటిని కూడా చెరువులో నిల్వ కాకుండా చేశారు. అదే కృష్ణా– గోదావరులతో కోస్తా ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చుకున్నారు. గతి తప్పిన రుతువులు, బోర్ బావులతో వ్యవసాయం బావురుమన్నది. నీరు లభ్యం కాని స్థితిలో తీవ్ర దుర్భిక్షం నడుమ జీవితం నిత్య మరణంగా మారిన నేపథ్యంలో బతకడానికి దేశ విదేశాలలో వలస కూలీలుగా కట్టు బానిస జీవితం వెల్లబోస్తున్న దైన్యానికి పాలమూరు ప్రజానీకం నెట్టబడింది. మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని అంతిమ విజయతీరం వైపు చేర్చడానికి కేసీఆర్ చేపట్టిన అనేక ప్రజాస్వామ్య ఉద్యమ వ్యూహాల్లో భాగంగా 2009 లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ నుండి ఎన్నికైనారు. ఈ ప్రాంత ప్రజల అవసరాలు, భోగోళిక స్థితిగతులను అవగాహన చేసుకున్నారు. జీవ వైవిధ్యానికి అనువుగా నల్ల రేగళ్లు, ఎర్ర చెల్కలు, ఇసుక భూములు ఉన్నాయక్కడ. నీరు అందితే దక్కన్ అన్నపూర్ణగా విలసిల్లే భవిష్యత్ ఉందని నిర్ధారించుకున్నారు. వలసలు వెళ్లిన ఇక్కడి ప్రజలు తిరిగి రావడమే కాదు, పక్క ప్రాంతాల నుండి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చే దశకు చేరుకోవాలని కోరుకున్నారు. ఈ ప్రాంత లోక్‌సభ సభ్యుడిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం సాధించిన సంతోషంలో కృతజ్ఞతను చాటుతూ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలనుకున్నారు. పాలమూరును పడావు పెట్టి కృష్ణా నీటిని తరలించుకుపోయిన అప్పటి ప్రాంతీయ ద్రోహులను ఎండగట్టారు. 2014లో రాష్ట్ర సాకారం తర్వాత ఉద్యమ క్రమంలోనే రూపకల్పన చేసుకున్న ఉత్తర తెలంగాణ కోసం ‘కాళేశ్వరం’, దక్షణ తెలంగాణ కోసం ‘పాలమూరు–రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం కార్యాచరణ ప్రారంభించారు. చైనా నిర్మించిన సుప్రసిద్ధ ‘త్రీ గార్జెస్’ ప్రాజెక్ట్ కంటే గొప్పగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ సాంకేతికతతో, ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ అద్భుతాలతో కూడిన ‘పాలమూరు –రంగారెడ్డి' సాగునీటి ప్రాజెక్ట్‌కు 2015 జూన్ 11న శంఖు స్థాపన చేశారు. శ్రీశైలం ఎగువ భాగాన కొల్లాపుర్ మండలం ‘ఎల్లూరు’ గ్రామం వద్ద వర్షాకాలంలో 120 టీఎంసీల కృష్ణా జలాలను తరలిస్తూ పాలమూరు జిల్లాలో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 5 లక్షల ఎకరాలు, నల్లగొండలో 30 వేల ఎకరాల భూమికి సాగునీరు, అలాగే 1,228 గ్రామాలకి త్రాగునీరు అందించడం దీని లక్ష్యం. కృష్ణమ్మ నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా నార్లాపూర్ అంజనగిరి, ఏదుల వీరాంజనేయ, వట్టెం వెంకటాద్రి, కరివేన కురుమూర్తి జలాశయాల గుండా ప్రవహించి లిఫ్ట్ ద్వారా రంగారెడ్డిలోని ఉద్దండాపూర్, లక్ష్మీ దేవిపల్లి జలాశయాలకు చేరుతుంది. సెప్టెంబర్ 16న ‘రంగారెడ్డి–పాలమూరు’ ప్రాజెక్ట్‌ను కొల్లాపూర్ మండలంలో ‘సింగోటం’ వద్ద కేసీర్ ప్రజలకి అంకితం చేస్తున్నారు. నీటి శబ్దం, నీటి స్పర్శ మానవ భావోద్వేగాలకు ప్రతీకగా ఇక్కడ జరిగే ఉద్వేగ మహత్తర అంకిత సభకు ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామాల సర్పంచ్‌లతో పాటు అశేష ప్రజానీకం తరలి రానున్నారు. కృష్ణమ్మ నీటిని కలశాలలో తీసుకొని వెళ్లి ఆయా గ్రామ దేవాలయాల స్వామి పాదాలకు అభిషేకం చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఆనతి కాలంలోనే తెలంగాణలో 78 శాతం ప్రజలు ఆధారపడే వ్యవసాయాన్ని పండుగగా మార్చే గౌరవప్రద జీవన భూమికను కేసీఆర్ పోషిస్తున్నారు. పరవళ్ళు తొక్కుతూ వస్తున్న నీటిని, కళ్ళ ముందునుంచి పారిపోతున్న నీటిని దోసిళ్ళతో ఒడిసిపట్టుకుంటున్న సంస్కృతిని సాగుచేస్తున్నారు. జీవన సంక్షోభం ద్వారా వచ్చిన ఆత్మన్యూనత స్థానంలో అభివృద్ధి సుభిక్ష ఆత్మ గౌరవ పతాకాన్ని జన మనో కేతనంగా మార్చిన యుగ కర్తగా నిలిచిపోతారు కేసీఆర్. పాలమూరు బిడ్డగా, ఇక్కడి ప్రజల విధేయుడిగా, కేసీఆర్ ఉద్యమ సహచరుడిగా, ప్రభుత్వ పాలనలో తన అనుచరుడిగా ఇతిహాసాన్ని తలపించే పాలమూరు పునరుజ్జీవన చరిత్ర నిర్మాణంలో నేనూ ఒకడిగా ఉండడం పరమానందంగా ఉంది. నిరసనోళ్ల శ్రీనివాస గౌడ్ - వ్యాసకర్త రాష్ట్ర మంత్రివర్యులు ------------- BJP : విమోచనం : హైదరాబాదు సంస్థానంలో ఉన్న వారందరూ భారతదేశంలో అంతర్భాగంగా ఉండి సామాజికంగా, సాంస్కృతికంగా కలిసి వున్నారు. ఈ సంస్థానాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనీ, ఉర్దూను అధికార భాషగా రుద్దాలనీ నిజాం విషపూరితంగా ఆలోచించిన తర్వాతే పరిస్థితులు మారిపోయాయి. భారత ప్రభుత్వం ‘పోలీసు చర్య’ను మొదలుపెట్టి, ప్రజలకు ఆ నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించింది. హైదరాబాద్ సంస్థాన విమోచనకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలిస్తే ‘భారత ప్రభుత్వ దౌత్యం, సామాన్య ప్రజల త్యాగం, యుద్ధం, విలీనం’ లాంటివి చరిత్ర పుటలలో కనబడుతాయి. ఆనాడు, తెలంగాణా, మరాఠ్వాడ, కర్ణాటకలో విస్తరించి ఉన్న ప్రాంతాలలో ఇప్పటికీ వీటి భయానక ఛాయలు కనబడతాయి. హైదరాబాద్ సంస్థానంలో బ్రిటిష్ వారికీ, నిజాముకూ మధ్య జరిగిన ఒప్పందానికి వ్యతిరేకంగా 1800 సంవత్సరంలోనే స్వాతంత్య్ర పోరాటం పురుడు పోసుకుంది. హిందువులు, ముస్లింలు కలిసి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. హిందూ – ముస్లిం ఐక్యతకు ఇది దర్పణం. ఆంగ్లేయులు సంపదను విచ్చలవిడిగా దోచుకొని దేశాన్ని ఆర్థికంగా నిర్వీర్యం చేశారు. 1857 జూలై 17న మౌల్వి అల్లాఉద్దిన్, తుర్రేభాజ్ ఖాన్ నాయకత్వంలో వందలాది మంది హిందూ, ముస్లింలు కోఠీలో గల బ్రిటిష్ రెసిడెన్సీపై దాడిచేశారు. ఫలితంగా తుర్రేభాజ్ ఖాన్‌ను హతమార్చి శవాన్ని కోఠీలో వేలాడదీశారు. అల్లాఉద్దిన్ అండమాన్ జైళ్లో 1884లో కన్నుమూశారు. అప్పుడే పుంజుకున్న రాంజీ గోండ్ తిరుగుబాటు తరువాత, వీరులను ప్రభుత్వం నిర్మల్ పట్టణంలో మఱి -
ఆకట్టుకున్న ఎన్సీసీ విద్యార్థుల.. ఫ్లాష్ మాబ్..!
వరంగల్: వరంగల్‌లోని ఎంజీఎం, హనుమకొండలోని అంబేడ్కర్ జంక్షన్లలో శుక్రవారం నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ ఆకట్టుకుంది. ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0 కార్యక్రమంలో భాగంగా ‘జాయిన్ ది ఫైట్ ఫర్ గార్బేజ్ ఫ్రీ సిటీస్’ అంశంపై ఫ్లాష్‌మాబ్ కొనసాగింది. జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమానికి చైతన్య డీమ్డ్ యూనివర్సిటీ, ఎంజీఎం ఒకేషనల్, ఎల్బీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చి నృత్యాలు చేశారు. ఈసందర్భంగా కార్పొరేషన్ సీఎంహెచ్ఓ రాజేశ్ మాట్లాడుతూ.. ఈనెల 17న మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయ పరిసరాల్లో స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఫ్లాష్ మాబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఈఈ సంజయ్, సూపరింటెండెంట్ దేవేందర్, ఎస్ఐలు శ్యాంరాజ్, వెంకన్న, గొల్కొండ శ్రీను, భీమయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థుల భవిష్యత్‌కు బంగారుబాట పడింది: సీఎం కేసీఆర్
నిర్మల్: తెలంగాణ అంతటా మెడికల్ కళాశాలల ఏర్పాటుతో వైద్య విద్యార్థుల భవిష్యత్‌కు బంగారుబాట పడిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్యకళాశాలతోపాటు రాష్ట్రంలో మరో ఎనిమిది కళాశాలలను సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం వర్చువల్ విధానంలో ఒకేసారి ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 26 మెడికల్ కాలేజీలున్నాయని.. భవిష్యత్‌లో మరో ఎనిమిదింటిని ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణ ఏటా 10వేల మంది వైద్యులను దేశానికి అందించబోతోందని తెలిపారు. లక్ష జనాభాకో 22 మెడికల్ సీట్లు ఉన్న ఏకై క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. 500 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని, రాష్ట్రంలో 10 వేల సూపర్ స్పెషాలిటీ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పేద గర్భిణులకు కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు ఇస్తున్నామని, గర్భిణులకు ఇబ్బంది లేకుండా అమ్మఒడి వాహనాలు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టామని, ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 76 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. వైద్యరంగంలో అరుదైన ఘట్టం.. జిల్లా వైద్యరంగంలో మెడికల్ కళాశాల ఏర్పాటు అరుదైన ఘట్టమని స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వర్చువల్‌గా వైద్యకళాశాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ చొరవతో నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ చేతుల మీదుగానే నిర్మల్‌లో మెడికల్ కాలేజీ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. పేదలకు ప్రభుత్వ వైద్యం మరింత చేరువైందని తెలిపారు. నిర్మల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి పెట్టారని కొనియాడారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. పేదలకు కార్పొరేట్ స్థాయి సేవలు.. జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని, ఇక పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా యువత వైద్యవిద్య కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదని తెలిపారు. సంతోషంగా ఉంది.. మా నాన్న జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌గా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. డాక్టర్ చదవాలనే నా లక్ష్యానికి అంకురార్పణ ఇక్కడే జరిగింది. సొంత జిల్లాలోనే నాకు సీటు రావడం సంతోషంగా ఉంది. ఈ జిల్లా బిడ్డగా బాగా చదివి మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకుంటా. కళాశాలకు మంచిపేరు తెస్తా. – జారా నవాల్, నిర్మల్ అమ్మ కల నిజం చేస్తా.. డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కలగన్న. మా అమ్మ జిల్లా ఆస్పత్రిలో 20 ఏళ్లుగా స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్నారు. అమ్మ నన్ను డాక్టర్‌ను చేయాలనే ఆశతో చదివించారు. అమ్మ కల నిజం చేసేరోజు వచ్చింది. సీటు సాధించేందుకు కష్టపడ్డా. సొంత జిల్లాలో చదివే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. – ఎస్.భానుతేజ, నిర్మల్ నేను చదువుకోలేకపోయినా.. నేను ఆటో నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న. నేను చదువులో అంతగా రాణించలేదు. నాలాగా నా కుమారుడు కావద్దని అతడిని కష్టపడి చదివించిన. ఇప్పుడు పక్క జిల్లాలోనే మెడికల్ కాలేజీలో సీటు రావడం సంతోషంగా ఉంది. నా కుమారుడు మంచి డాక్టర్ కావాలన్నదే నా కోరిక. – విజయ్‌కుమార్, ఆదిలాబాద్, విద్యార్థి తండ్రి మంచి డాక్టర్‌గా ఎదుగుతా.. ఎంతో కష్టపడితేనే నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. ఈరోజు నుంచి క్లాసులు ప్రారంభం కావడం.. నాన్నతో వచ్చి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. కష్టపడి చదివి మంచి డాక్టర్‌గా ఎదుగుతా. – సమ్మిత్, ఆదిలాబాద్ సైకియాట్రిస్ట్‌ను అవుతా.. తెలంగాణలో మెడికల్ సీట్లు పెంచడం వల్లే నాకు అవకాశం వ చ్చింది. నేను సైకియాట్రిస్ట్‌ను అవుతా. డాక్టర్ కోర్సు పూర్తిచేశాక పేదలకు సేవ చేస్తా. ఇక్కడి కళాశాలలో సేవలు సంతృప్తికరంగా ఉన్నాయి. – నందిని, నిజామాబాద్ చాలా దగ్గరగా ఉంది.. గతంలో ఎంబీబీఎస్ చదవాలంటే ఇబ్బందిగా ఉండేది. కాలేజీ నాకు దగ్గరగా ఉంది. ఇక్కడకు వచ్చి వెళ్లడం చాలా సులభం. చదువు పూర్తిచేశాక పేదలకు సేవలందిస్తా. మా నాన్న వైద్యుడే. ఆయన ప్రోత్సాహంతో డాక్టర్ కావాలనుకుంటున్నాను. – మహిన్, ఆర్మూర్ అక్కలాగే కావాలని.. మా అక్కయ్య వికారాబాద్‌లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. నేను కూడా మా అక్క లాగే డాక్టర్ కావాలనుకుని కష్టపడి చదివి సీటు సంపాదించాను. మన జిల్లాలోని మెడికల్ కాలేజీలో సీటు రావడం ఆనందంగా ఉంది. – ఆదుముల్ల శశివర్ధన్, భైంసా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ.. జిల్లా కేంద్రంలో నూతన మెడికల్ కళాశాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ శకటం ముందు నడవగా రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ చైర్మన్ అప్పాల గణేశ్, ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్, నాయకులు అల్లోల గౌతమ్‌రెడ్డి, పాకాల రాంచందర్, అల్లోల మురళీధర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, రామ్‌కిషన్‌రెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, రాము, లక్ష్మణాచారి, విద్యార్థులు, ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు, వైద్యసిబ్బంది, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ పండుగ వాతావరణంలో మంచిర్యాల చౌరస్తా మీదుగా దివ్యాగార్డెన్స్ వరకు కొనసాగింది. దారి పొడవునా డీజే పాటలతో విద్యార్థులు, యువకులు నృత్యాలు చేశారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కాగా, ర్యాలీ సందర్భంగా మంత్రి ఐకేరెడ్డి నృత్యం చేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం దివ్యాగార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.