News
-
అర్జీలు ఫుల్.. పరిష్కారం నిల్!
వరంగల్: అర్జీలకు పరిష్కారం చూపాలని ప్రతీవారం ఉన్నతాధికారులు ఆయా విభాగాల అధికారుల్ని ఆదేశిస్తున్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవట్లేదు. దీంతో ప్రజలు గ్రీవెన్స్ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అర్జీలు వెల్లువెత్తుతున్నా.. ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి లోపిస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గ్రీవెన్స్‌పై ‘సాక్షి’ పరిశీలన – కరీమాబాద్ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ప్రతీ వారం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ నగరంతోపాటు జిల్లాలోని 13 మండలాలకు చెందిన ప్రజలు కలెక్టరేట్‌కు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వివిధ కారణాలతో స్థానికంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో ప్రజలు గ్రీవెన్స్ చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరైతే.. పలుమార్లు గ్రీవెన్స్‌లో అర్జీలు పెట్టుకున్నారు. వాటిని ఆయా శాఖల అధికారులకు బదలాయిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిష్కారం దొరకట్లేదు. గ్రీవెన్స్‌లో ఎక్కువగా భూములకు సంబంఽధించిన అర్జీలు వస్తున్నాయి. తర్వాత పింఛన్ల కోసం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. సదరం క్యాంపు స్లాట్ బుక్ చేసుకునే క్రమంలో సైట్ ఓపెన్ కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సోమవారం అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. అర్జీలు ఇలా.. వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో మొత్తం 97 ఆర్జీలు వచ్చాయి. వాటిలో జీడబ్ల్యూఎంసీ 4, బీసీ డెవలప్మెంట్ 3, వ్యవసాయశాఖ 9, రెవెన్యూ 36, మైనార్టీ వెల్ఫేర్ 3, ఏసీపీ ఖిలా వరంగల్ 1, వెటర్నరీ 1, లీడ్ బ్యాంక్ 5, పంచాయతీ అధికారి 6, డీఆర్డీఓ 11, ఉపాధి శాఖ 1, ఎస్సీ డెవలప్మెంట్ 1, జిల్లా సంక్షేమ శాఖ 5, సివిల్ సప్లయ్ 1, ఎస్సీ కార్పొరేషన్ 2, యుజవన క్రీడలు 1, ‘కుడా’ 2, పంచాయతీ రాజ్ శాఖ ఈఈ 1, ఎంజీఎం 1, ఎన్పీడీసీఎల్ 1, ఈఈ ఇరిగేషన్ 1, విద్యాశాఖ అధికారికి సంబంఽధించిన అర్జీ 1 వచ్చాయి. కాగా.. ప్రజావాణి కార్యక్రమానికి 35 శాఖలకు చెందిన అధికారులు హాజరవ్వాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో జిల్లా స్థాయి అధికారులు రాలేని పరిస్థితిలో ఆయా శాఖలకు చెందిన అధికారులు వస్తుంటారు. ఈక్రమంలో సోమవారం పలువురు హాజరు కాలేదు. కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్లు శ్రీవత్స, అశ్విని తానాజీ వాకడే, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ ఫోటోలో ఉన్న బాలుడు దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బూరుగు మణిదీప్. ఇతడికి మానసిక దివ్యాంగుల పెన్షన్ కోసం మూడేళ్లుగా దరఖాస్తు చేస్తున్నా.. ఇప్పటికీ మంజూరు కాలేదు. సదరం క్యాంపులో 75 శాతం చూపుతున్నా.. రిజెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికి ఐదు సార్లు వచ్చామని బాలుడి తండ్రి చెబుతున్నాడు. ఇప్పటికై నా పెన్షన్ మంజూరు చేయాలని ఆయన వేడుకుంటున్నాడు. -
శోభ.. 'నిజాయితీ' కి మారుపేరు..!
మహబూబ్‌నగర్: ఆర్టీసీ బస్సులో దొరికిన బంగారు ఆభరణాల పర్సును బాధిత మహిళకు అందజేసి నిజాయితీ చాటుకుంది ఓ ప్రయాణికురాలు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పునుంతల మండలం కాంసానిపల్లికి చెందిన నెల్లోజు ప్రసన్న ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి కల్వకుర్తి నుంచి ఉప్పునుంతల వరకు అచ్చంపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఎక్కింది. ఉప్పునుంతలలో దిగి గ్రామానికి వెళ్లి హ్యాండ్‌బ్యాగ్‌లో చూడగా బంగారు ఆభరణాలు (సుమారు రూ.3 లక్షల విలువ)న్న పర్సు కనిపించలేదు. అదే బస్సులో ప్రయాణించిన సదగోడుకు చెందిన శోభకు బస్సులోనే ఆభరణాల పర్సు దొరకగా కండక్టర్ నారాయణమ్మకు అందజేసింది. సోమవారం అచ్చంపేట డిపో ఆవరణలో బాధితురాలు ప్రసన్నకు పర్సును అందజేసి నిజాయితీని చాటుకుంది. -
రోడ్లు ఛిద్రం..! దుమ్ముతో నిత్యం నరకం అనుభవిస్తున్నాం..!!
కుమరం భీం: ప్రకృతి వనరులు కొల్లకొడుతూ క్వారీల నుంచి యాజమాన్యాలు భారీగా ఆదాయం అర్జిస్తున్నాయి. అయితే క్రషర్ల నుంచి కంకర తరలించే వాహనాలతో స్థానిక రహదారులన్నీ ధ్వంసమవుతున్నా మరమ్మతులకు కనీస మొత్తంలో నిధులు కేటాయించడం లేదు. గనులశాఖకు ఏటా సీనరేజీ నిధులు వస్తున్నా ప్రభావిత పల్లెల అభివృద్ధికి పైసా ఖర్చు చేయడం లేదు. పరిశ్రమల శాఖ, మైనింగ్, విద్యుత్ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి వంటి శాఖల అధికారులు నిబంధనల అమలులో చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గుంతలతో తిప్పలు.. కౌటాల మండలం ముత్తంపేట నుంచి పార్డీ గ్రామానికి వెళ్లే మార్గంలో ఐదు కంకర క్వారీలు, క్రషర్లు ఉన్నాయి. జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులకు నిత్యం వందలాది భారీ వాహనాల్లో ఇక్కడి నుంచే కంకర తరలిస్తున్నారు. ఫలితంగా వాహనాలు వెళ్లే కాగజ్‌నగర్, కౌటాల, ముత్తంపేట, తలోడి, సిర్పూర్(టి), టోంకిని గ్రామాల వద్ద ప్రధాన రహదారి అనేకచోట్ల గుంతలతో అధ్వానంగా మారింది. పరిమితికి మించిన లోడ్‌తో డ్రైవర్లు అతివేగంగా లారీలను నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం నరకం.. దుమ్ముతో నిత్యం నరకం అనుభవిస్తున్నాం. వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుండడంతో కంకర దుమ్ము పంటలపై పడుతుంది. దిగుబడి తగ్గుతోంది. క్రషర్లతో మా గ్రామానికి వెళ్లే రోడ్డు ఎప్పుడూ గుంతలతోనే ఉంటుంది. రోడ్డుకు మరమ్మతులు చేపట్టి బీటీ రోడ్డు వేయాలి. – డి.సంజీవ్, పార్డి, మం.కౌటాల ► ఐదేళ్ల క్రితం కౌటాల – కాగజ్‌నగర్ మార్గంలో డబుల్ రోడ్డు నిర్మించారు. ఈ రోడ్డు పైనుంచి అధిక లోడుతో వాహనాలు వెళ్తుండడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ముత్తంపేట సమీపంలో గుంతల్లో వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారు. ► కౌటాల మండలం పార్డీ, సాండ్‌గాం, వీరవెల్లి పంచాయతీలతోపాటు కౌఠి గ్రామానికి 20 ఏళ్ల కిందట ప్రపంచ బ్యాంకు నిధులతో మొరం రోడ్డు వేశారు. మ్తుతంపేట ప్రధాన ఆర్అండ్బీ రోడ్డు నుంచి పార్డీ మీదుగా సాండ్‌గాం వరకు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు ఉంది. రోడ్డును ఆనుకుని ఉన్న స్టోన్ క్రషర్ల నుంచి లారీలు వెళ్తుండడంతో గుంతలు పడుతున్నాయి. ఇటీవల భారీ వర్షాలకు రోడ్డు బురదమయంగా మారింది. మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామాలకు ఇప్పటికీ తారురోడ్డు సౌకర్యం లేకపోవడం గమనార్హం. మరమ్మతులు చేయిస్తాం.. అధిక లోడు వాహనాలతో బీటీ రోడ్లపై గుంతలు పడుతున్నాయి. గతేడాది రోడ్లకు మరమ్మతులు చేపట్టాం. మూడు నెలల క్రితం వేసిన బీటీ రోడ్డుపై కూడా పగుళ్లు వచ్చాయి. గుంతలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. నిధుల మంజూరు కాగానే గుంతలు పడిన చోట మరమ్మతులు చేయిస్తాం. – లక్ష్మీనారాయణ, ఆర్అండ్బీ డీఈ, కాగజ్‌నగర్ పంటలకు తీవ్ర నష్టం.. కంకర లారీలతో రోడ్లు ఛిద్రం కావడంతోపా టు రహదారుల వెంబడి సాగు చేస్తున్న పంట పై దుమ్ము ప్రభావం పడుతోంది. పార్డీ– సాండ్‌గాం గ్రామాల సమీపంలో సాగు చేస్తున్న పంటలపై విపరీతమైన దుమ్ము పడుతోంది. దీంతో పంట దిగుబడి సగానికి పడిపోతుంద ని రైతులు వాపోతున్నారు. పంటలకు పరిహా రం చెల్లించాలని కొంతమంది అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా లారీ ల నుంచి పడుతున్న కంకరతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. అదుపు తప్పి బైక్‌లు కిందపడిపోతున్నాయి. ఇప్పటికైనా స్పందించి ఓవర్‌లోడ్‌తో కంకర తరలిస్తున్న క్రషర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
'ఇక్కడ ఉండు.. ఇప్పుడే వస్తాం'..! రెండ్రోజులుగా.. బిక్కు బిక్కుమంటూ..
కరీంనగర్: ‘ఇక్కడ ఉండు.. ఇప్పుడే వస్తాం’ అని చెప్పి ఓ మహిళను వదిలేసి వెళ్లిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఐబీ రోడ్డులో చోటు చేసుకుంది. సదరు మహిళ రెండు రోజులుగా దిక్కుమొక్కు లేక చలిలో..వానలో వాటర్ ట్యాంక్ కింద ఉండి తనవాళ్ల కోసం ఎదురుచూస్తోంది. ఆమె దీనస్థితి అందరినీ కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం కొందరు ఆటోలో వచ్చి ఐబీ రోడ్డు వాటర్ ట్యాంక్ దగ్గర అనారోగ్యంతో ఉన్న మహిళ(45)ను వదిలేసి వెళ్లారు. అదే ఏరియాలో ఉండే మైనార్టీ యూత్ యువకులు అబుబకర్, షోయబ్ రెండు రోజులుగా వాటర్ ట్యాంక్ కింద ఉన్న మహిళను గుర్తించి ప్రశ్నించగా తనను రెండు రోజుల క్రితం తమవాళ్లు ఆటోలో తెచ్చి ఇక్కడ వదిలేశారని చెప్పింది. దీంతో ఆమె అనారోగ్య పరిస్థితిని గుర్తించిన యువకులు.. వెంటనే వార్డు కౌన్సిలర్ పేర్ల సత్యంకు సమాచారం ఇచ్చారు. స్పందించిన వార్డు కౌన్సిలర్ సత్యం.. సోమవారం రాత్రి అక్కడికి వచ్చి అనారోగ్యంతో పడిఉన్న మహిళ వివరాలు తెలుసుకున్నారు. తన పేరు మిర్యాల లక్ష్మి అని, తనది నిజామాబాద్ జిల్లా అని, తమవాళ్లు తనను ఇక్కడ వదిలేసి వెళ్లారని అస్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. కాగా ఆమె చేయిపై విజయ అని పచ్చబొట్టు ఉందని కౌన్సిలర్ పేర్ల సత్యం చెప్పారు. అనారోగ్యంతో ఉన్నసదరు మహిళను యూత్ ప్రతినిధులు అబుబకర్, షోయబ్‌తో కలిసి కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ సరైన సమాధానాలు చెప్పకపోగా ఆమె కాలుకు తీవ్రమైన గాయంతో పుండు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు.. ఆమెకు ప్రాథమిక చికిత్స చేయించి జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న పనులు..! సొంతింటి కల నెరవేరేనా..?
మెదక్: గూడులేని నిరుపేదలకు ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం నత్తనడకన కొనసాగుతోంది. ఆర్థికంగా స్తోమత లేని పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి అందిస్తామని 2014 లో బీఆర్ఎస్ ప్రబుత్వం ప్రకటించింది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులను సైతం స్వీకరించారు. బడ్జెట్లో కేటాయించిన ప్రకారం జిల్లాకు 4,776 ఇళ్లు మంజూరు చేశారు. లక్ష్యం ఘనంగా ఉన్నా.. ఆచరణ మాత్రం అంతంతే అన్నట్లుగా మారింది జిల్లాలో ఇళ్ల కేటాయింపు. చాలా చోట్ల నిర్మాణాలు పూర్తికాక, పూర్తయిన వాటిని పంపిణీ చేయకుండా వదిలేయడంతో ఎనిమిదేళ్లుగా అర్హులకు ఎదురు చూపులు తప్పడంలేదు. జిల్లా వ్యాప్తంగా.. ప్రభుత్వం మెదక్ జిల్లాలో అర్హులకు 4,776 ఇళ్లను మంజూరు చేసింది. అందులో 3,779 ఇళ్లకు టెండర్ పిలువగా, 3,644 గృహాల పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 2,440 ఇళ్లు పూర్తి కాగా, 1,204 పనులు జరగాల్సి ఉంది. చాలా వరకు పునాది స్థాయిలో, మరికొన్ని స్లాబ్ వేసి వదిలేశారు. పూర్తి అయిన కొన్నింటిని మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని పిల్లకొటాల్ శివారులో 950 ఇళ్లు మంజూరవగా, 540 ఇళ్లు పూర్తయ్యాయి. వీటిని గతేడాది ఆగస్టులో మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా 410 ఇళ్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి సూచించినా.. పనులు ముందుకు సాగడంలేదు. నర్సాపూర్‌కు 500 ఇళ్లకు 250 మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి. పూర్తయిన వాటిని పంపిణీ చేయకపోవటంతో అవి శిథిలావస్థకు చేరాయి. చేగుంట మండలానికి 1,250 ఇళ్లు మంజూరవగా, 108 మాత్రమే పూర్తయ్యాయి. వాటిని ఇంకా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. ఇదే మండలం కొండాపూర్ గ్రామంలో 20 ఇళ్ల నిర్మాణం పూర్తయినా.. అధికారికంగా పంపిణీ చేయలేదు. దీంతో గ్రామానికి చెందిన కొందరు పేదలు ఇళ్లను ఆక్రమించి నివాసం ఉంటున్నారు. మెదక్ మండలం పాతూర్, రాయినిపల్లి గ్రామాలకు 40 చొప్పున కేటాయించినా.. నేటికి పనులు మొదలుకాలేదు. కొల్చారం మండలంలోని కొల్చారం, ఎనగండ్లలో ఇదే పరిస్థితి. చిన్నశంకరంపేట మండలంలో కామారం, మీర్జాపల్లి, కొర్విపల్లిలో కూడా నిర్మాణాలు పూర్తికాలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలకే పంపిణీ.. జిల్లాలో మొదటి దశలో పూర్తయిన 2,440 ఇళ్లలో పంపిణీ చేసినవి 1,568 కాగా ఇంకా 872 పంపిణీ చేయాల్సి ఉంది. కాగా ఇప్పటివరకు పంపిణీ చేసిన వాటిలో బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. లబ్ధిదారుల ఎంపికను సర్పంచులు, కౌన్సిలర్లు చేశారు. ఈ నెల 21న రెండో విడత ప్రారంభించాలని, అర్హుల ఎంపికను అధికారులకు అప్పగించాలని కోరుతున్నారు. ఇప్పుడైనా అర్హులకు ఇళ్లు అందుతాయో లేదో వేచి చూడాల్సిందే. -
మా రేషన్ కార్డు ఎప్పుడు వస్తది సారు..?!
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే తెల్లరేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తరువాత ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులను ఇవ్వలేదు. 2016లో మాత్రం ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. ఆ సందర్భంలో చాలా మంది కొత్తగా కార్డులు, పేర్ల మార్పిడి, పిల్లల పేరు ఎక్కించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అలాంటి సమస్యలు అన్ని పరిష్కారం కాకపోను చాలా మందికి కొత్తగా రేషన్ కార్డులు అందని పరిస్థితి నెలకొంది. ఆతరువాత ప్రభుత్వం రేషన్ కార్టులకు సంబంధించి ఆన్లైన్ సైట్‌ను బందు పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వం సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలంటే అధికారులు రేషన్ కార్డులు తప్పనిసరిగా ఉండాలని చెబుతుండడంతో చాలామంది పేదలు పథకాలకు దూరమవుతున్నారు. రేషన్ కార్డుల్లేక.. వేలాది దరఖాస్తుల తిరస్కరణ.. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు సొంతిల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థికసాయం చేస్తోంది. ఇందుకోసం ఇటీవల జిల్లా వ్యాప్తంగా పేదల నుంచి దరఖాస్తులను స్వీకరించగా మొత్తం 78,890 మంది దరఖాస్తు వచ్చాయి. అందులో నియోజకవర్గానికి 3 వేల మందికి ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల పరిధిలో 18 వేల మందికి మొదటి విడతగా లబ్ధి పొందనున్నారు. అయితే ఈ పథకానికి వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో కేవలం 11 వేల మందిని మాత్రమే అధికారులు అర్హులుగా గుర్తించారు. ఇందులో తెల్ల రేషన్ కార్డులు లేక చాలా మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇదిలా ఉంటే బీసీ కులవృత్తిదారులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది. ఈ పథకానికి మొత్తం41,863 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కూడా రేషన్ కార్డులేని వారి వేలాది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. వీటితోపాటు మైనార్టీ బంధు పథకంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా తాము ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కొత్త రేషన్ కార్డులతోపాటు పేర్ల మార్పులు, కొత్తగా పిల్లల పేర్లు ఎక్కించి కొత్త కార్డులు పంపిణీ చేయాలని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు కోరుతున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే.. ప్రస్తుతం ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన గృహలక్ష్మి, బీసీలకు ఆర్థిక సాయం, మైనార్టీ బంధు, దళిత బంధు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రతిఒక్క దరఖాస్తుదారు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. లేదంటే దరఖాస్తు చేసుకున్నా కూడా ఆన్లైన్లో తీసుకోని పరిస్థితి. అయినా కొందరు ఆన్లైన్లో కాకుండా కొన్ని పథకాలకు నేరుగా తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఆ దరఖాస్తుల ఆధారంగా అక్కడ ఆన్లైన్ చేశారు. కానీ, రేషన్ కార్డులేక పోవడంతో చాలా మంది దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ కాకపోవడంతో అధికారులు వాటిని తిరస్కరిస్తున్నారు. రేషన్ కార్డు అందించాలి తెల్ల రేషన్ కార్డు లేకపోవడంతో మేము గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోలేక పోయాము. గతంలో డబుల్ బెడ్రూం ఇల్లు కూడా రాలేదు. 2016లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఉంటేనే పథకాలకు అర్హులని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికై నా రేషన్ కార్డు ఇచ్చి ఆదుకోవాలి. – అంబటి సంధ్య, పెద్దదేవులపల్లి తెల్ల రేషన్‌కార్డు లేక దరఖాస్తు చేసుకోలేదు నాకు రేషన్ కార్డు లేదు. చాలా కాలం క్రితం దరఖాస్తు చేసుకున్నాను. అయినా కార్డు రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం బీసీలకు రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తుంది. కానీ, రేషన్ కార్డులేక నేను దరఖాస్తు చేసుకోలేక పోయాను. ప్రభుత్వ పథకాలన్నింటికీ రేషన్ కార్డు తప్పనిసరి చేసి పేదలకు అవి పంపిణీ చేయకపోవడంతో పథకాల ఫలాలు అందరికీ అందడం లేదు. – శ్రీకాంత్, హనుమాన్ పేట, మిర్యాలగూడ -
నచ్చితే తీస్కో..! లేదంటే మూస్కో..!! గొర్రెల పంపిణీలో ‘గోల్మాల్’..
ఆదిలాబాద్: గొల్ల, కుర్మలు, యాదవుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం జిల్లాలో క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫలితాలు అందించడంలో విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్క యూనిట్ ధర రూ.1.75లక్షలు ధర నిర్ణయించిన ప్రభుత్వం తన వాట కింద రూ.1,31,250 చెల్లించగా, లబ్ధిదారుడు రూ.43,750 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 20 గొర్రెలు, ఒక పొటెలు కొనుగోలుకు రూ.1.50 లక్షలు పోగా, మిగిలిన రూ. 25వేలతో గొర్రెల తరలింపు మందులు కొనుగోలు, ఇన్సురెన్స్ కోసం నిధులు కేటాయించడం జరిగింది. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రభుత్వం రెండో విడత పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 3597 మంది లబ్ధిదారులు డీడీలు కట్టారు. ఒక్కొక్క లబ్ధిదారుడు రూ.43,750 చొప్పున మొత్తం రూ.15.73 కోట్ల డీడీలు చెల్లించారు. దాదాపు సంవత్సర కాలంగా ఎదురుచూడగా ఈ ఏడాది జూలైలో యూనిట్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవీ విధివిధానాలు... మొదటి విడత గొర్రెల పంపిణీలో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల అక్రమాలు జరిగినట్లు తేలడంతో ప్రభుత్వం పంపిణీ విధివిధానాలను మరింత కఠినతరం చేసింది. గొర్రెల ఎంపికలో మండల పశువైద్యాధికారుల పాత్రను తగ్గించి జిల్లా , రాష్ట్ర స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. దీనికోసం జిల్లా పశువైద్యాధికారి పర్యవేక్షణలో జిల్లా అధికారి, రాష్ట్ర స్థాయి అధికారితో కూడిన టీంను సిద్ధం చేశారు. లబ్ధిదారులు అధికారులతో కలిసి స్వయంగా గొర్రెల విక్రయించే వారి వద్దకు వెళ్లి కొనుగోలు చేసేలా, కొనుగోలు సమయంలో ప్రత్యేకమైన ట్యాబ్‌ల్లో ఆన్లైన్లో తమ ఇష్టపూర్వకంగా గొర్రెలను ఎంపిక చేసుకున్నట్లు వాయిస్ మెసెజ్ అప్లోడ్ చేసేలా నిబంధనలు చేర్చారు. 447 యూనిట్ల పంపిణీ... ఈ ఏడాది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో జిల్లా వ్యాప్తంగా రూ.7.80 కోట్లతో మొత్తం 447 యూనిట్లు (9387 గొర్లు) పంపిణీ చేశారు. మొత్తం 3597 మంది డీడీ కట్టగా, ఇప్పటి వరకు కేవలం 447 మందికే గొర్లు పంపిణీ చేశారు. ఇంకా 3150మందికి గొర్లు రావాల్సి ఉంది. వీరంత సంవత్సర కాలంగా ఒక్కొక్కరు రూ. 43,750 చొప్పున డీడీలు చెల్లించారు. ఎన్నికల కోడ్ వస్తుందని సర్వత్రా చర్చలు నడుస్తుండటంతో తాము కట్టిన డబ్బులు అయిన తిరిగి వస్తే చాలు అన్న పంథాలో లబ్ధిదారులు ఉన్నారు. దీంతో కొంత మంది అధికారులు, నాయకులు వీరి నిస్సహాయతను సొమ్ము చేసుకుంటున్నారు. నచ్చితే తీస్కో.. లేదంటే మూస్కో.. గొర్రెల పంపిణీలో అక్రమాలను నివారించడానికి ప్రభుత్వం కఠినమైన విధివిధానాలను రూపొందించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆగడం లేదు. పక్క రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కోదాడ మండలం నుంచి మాత్రమే గొర్రెలు కొనుగోలు చేస్తున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. కోదాడ మండలంలోని నాలుగు గ్రామాల్లో గొర్రెల లభ్యత ఉండగా లబ్ధిదారులను అక్కడికే పంపించి గొర్రెలను తీసుకునేలా బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ అప్పటికే అనారోగ్యంతో ఉన్నవి, చెవికి ట్యాగ్ గాయాలతో ఉన్న (పలుమార్లు ఏమార్చి ఇన్ష్యూరెన్స్ చేయబడినవి) గొర్లను కట్టబెడుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. మా దృష్టికి రాలేదు.. జిల్లాలో గొర్రెల పంపిణీలో ఎలాంటి అక్రమాలు మా దృష్టికి రాలేదు. నిబంధనల ప్రకారం, లబ్ధిదారులు స్వయంగా వెళ్లి గొర్రెలు తెచ్చుకుంటున్నారు. గొర్రెల రవాణా కోసం వినియోగించే వాహనాలకు సైతం జీపీఎస్ ట్రాకింగ్ అమర్చడం జరిగింది. లబ్ధిదారుల గ్రామాలకు గొర్రెలు చేరిన తరువాత కూడా ఫొటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైన అక్రమాలు జరిగినట్లు మా దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. –కిషన్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి కట్టింది రూ.43వేలు.. ఇచ్చేది రూ.90వేలే... లబ్ధిదారులు గొర్రెలను ఎంపిక చేసుకున్న తరువాత అధికారులు జీపీఎస్ ట్యాగ్ ఉన్న ఐచర్ వాహనాల్లో, ఒక్కొక్క వాహనంలో ఆరు యూనిట్ల చొప్పున గొర్రెలను లబ్ధిదారుల గ్రామాలకు తరలిస్తున్నారు. అక్కడ సర్పంచ్, గొల్లకుర్మ కమిటీ అధ్యక్షుడు, లబ్ధిదారుడు, స్థానిక పశువైద్యాధికారి సమక్షంలో ఐచర్ ఫొటోలు, గొర్రెల ఫొటోలు తీసీ ఆన్లైన్లో పెడుతున్నారు. అనంతరం రెండు, మూడు రోజుల్లో గొర్రెలు అమ్మిన వ్యక్తి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం ఒక్కొక్క యూనిట్‌కు రూ.1.50లక్షలు జమ చేయడం జరుగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ అసలు కథ ఇక్కడే ప్రారంభం అవుతుంది. ముందుగానే కుదుర్చుకున్న డీల్ ప్రకారం తన ఖాతాల్లో డబ్బులు పడగానే సదరు గొర్రెలు అమ్మిన వ్యక్తి ఒక లారీతో ఆయా గ్రామాలకు వచ్చి లబ్ధిదారులకు యూనిట్‌కు రూ.90వేలు చెల్లించి తాను ఇచ్చిన గొర్రెలను మరల లారీలో ఎక్కించుకొని వెళ్లిపోతాడు. లబ్ధిదారులే అమ్ముకుంటున్నారని వారిని బద్నాం చేసే పనులు అధికారులు చేస్తున్నప్పటికీ అధికారులు, నాయకుల అండదండలతోనే ఇదంతా జరుగుతుందని లబ్ధిదారుల వాదన. -
'శ్రద్ధ' ప్రచారం పైనే.. పనులపై మాత్రం కాదు..!
ఆదిలాబాద్: రాజకీయ లబ్ధి కోసం చేయని పనులను చేసినట్లుగా భారీ హోర్డింగ్‌ల ద్వారా ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యే జోగు రామన్న పనుల పురోగతిని విస్మరించడం హాస్యస్పదంగా ఉందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని డాల్డా కంపెనీ వద్ద నిర్మిస్తున్న రైల్వే ఫ్లైఓవర్ వంతెన పనులను ఆదివారం ఆమె పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై అక్కడి ఇంజినీరింగ్ అధికారితో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు నత్తనడకన సాగుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము అభివృద్ధికి ఏ మాత్రం వ్యతిరేకం కాదని ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని స్వీకరిస్తామన్నారు. కానీ ఫ్లై ఓవర్ వంతెనకు సంబంధించి ఫిల్లర్ల నిర్మాణం కూడా కాకుండానే ప్రజలను మభ్యపెట్టేలా పూర్తి అయినట్లుగా దాని ఫొటోలతో హోర్డింగుల ద్వారా ప్రచారం చేయడం శోచనీయమన్నారు. పనులు ప్రారంభించి మూడు నెలలు దాటినా నేటికీ ఫిల్లర్ల నిర్మాణాలు జరుగకపోవడం ఎమ్మెల్యే చిత్తశుద్ధికి అద్దం పడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేస్తే నిర్వాసితులకు పరిహారం ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అల్లూరి సంజీవ్ రెడ్డి , అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
'ప్రతిభ ప్రతిబింబించేలా'.. సైన్స్ ప్రయోగాలకు బీజం!
జగిత్యాల: విద్యార్థి దశ నుంచి సైన్స్‌పై ఆసక్తి కలిగించడం, శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో భారతీయుల కృషి తెలియజేసే ఉద్దేశమే విద్యార్థి విజ్ఞాన్ మంథన్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ), విజ్ఞాన భారతి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం సంయుక్తంగా విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పేరుతో విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఏటా ఆన్లైన్ వేదికగా ప్రతిభ పరీక్ష నిర్వహిస్తోంది. పరిశోధన సంస్థల సందర్శన.. ► పలు జాతీయ ప్రయోగశాలల సందర్శనతో పాటు నగదు ప్రోత్సాహకాలు అందుకునే అరుదైన అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తోంది. ► ఇందులో డీఆర్డీవో, బార్క్, సీఎస్ఐఆర్ వంటి ప్రఖ్యాత పరిశోధన సంస్థలున్నాయి. వాటిని సందర్శించే అవకాశంతో పాటు మూడు వారాలు ఇంటర్న్‌షిప్ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్ష నిర్వహిస్తోంది. ► ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆ ప్రయోగశాలల సందర్శనతో కొత్త స్ఫూర్తి పొందే అవకాశముంది. 2024 సంవత్సరానికి సంబంధించి జాతీయస్థాయి పరీక్ష మే 18, 19న నిర్వహించనున్నారు. ► నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ), విజ్ఞాన భారతి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 6 నుంచి 11వ తరగతి (ఇంటర్ ప్రథమ సంవత్సరం) విద్యార్థులకు ఆన్లైన్ వేదికగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. ► 6 నుంచి 8వ తరగతి వరకు జూనియర్లుగా, 9 నుంచి 11 వరకు సీనియర్లుగా పరిగణిస్తారు. ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, రాష్ట్ర బోర్డు విద్యార్థులు పరీక్ష రాసేందుకు అర్హులు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష.. అక్టోబరు 1న నమూనా పరీక్ష ఉంటుంది. అదే నెల 29 లేదా 30న జిల్లాస్థాయిలో పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. సీనియర్, జూనియర్ విభాగంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. గణితం, సామాన్య శాస్త్ర పాఠ్య పుస్తకాల నుంచి 50 శాతం, విజ్ఞానశాస్త్రం రంగంలో దేశ కృషిపై 20 శాతం, లాజిక్ రీజనింగ్‌కు 10 శాతం, శాస్త్రవేత్త బీర్బల్ సహానీ జీవిత చరిత్రకు 20 శాతం బహుళైచ్చిక ప్రశ్నలు ఉంటాయి. జిల్లాస్థాయిలో ఇలా.. జిల్లాలో ఆరో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం వరకు ప్రతి తరగతిలో ప్రతిభచూపిన మొ దటి ముగ్గురు చొప్పున మొత్తం 18 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలను ఆన్లైన్లో అందిస్తారు. రాష్ట్రస్థాయిలో.. పాఠశాల స్థాయి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారీగా ప్రతిభచూపిన మొదటి 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి మొత్తం 120 మందిని రాష్ట్రస్థాయికి పంపుతారు. అత్యంత ప్రతిభకనభర్చిన 18 మందిని రాష్ట్రస్థాయి విజేతగా ప్రకటిస్తారు. వారిలో మొదటి ముగ్గురికి రూ.5వేలు, రూ.3వేలు, రూ.2వేల చొప్పున నగదు ప్రోత్సహకాలిస్తారు. జాతీయ స్థాయిలో.. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనభర్చినవారి నుంచి 18 మందిని జాతీయ స్థాయి ప్రతిభావంతులుగా గుర్తిస్తారు. వీరిని హిమాలయన్స్ అంటారు. వారికి రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు నగదు ప్రోత్సాహకాలు ఇస్తారు. వీటితో పాటు నెలకు రూ.2 వేల చొప్పున ఏడాది పాటు ఉపకారవేతనం అందిస్తారు. దరఖాస్తు ఇలా.. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్లైన్ ద్వారా విద్యార్ధి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పరీక్ష నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోటీలు పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో నిర్వహిస్తారు. www. vvm. org. in వెబ్సైట్లో రూ.200 ఫీజు ఆన్లైన్లో చెల్లించి ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబరు 1న నమూనా పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు, హిందీ, ఆంగ్లం విభాగాల్లో పరీక్ష ఉంటుంది. విద్యార్థులకు మంచి అవకాశం.. విద్యార్థుల విజ్ఞానానికి మంచి అవకాశం. పరీక్షను విద్యార్థులు వ్యక్తిగతంగా, పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సైన్స్ ప్రయోగాలకు బీజం పాఠశాల స్థాయి నుంచే కలగాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏటా దీన్ని నిర్వహిస్తోంది. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, అభిరుచి కలిగించడం, వారిలోని నైపుణ్యాలు, సృజనాత్మకతను వెలికితీయడం ఈ పరీక్ష ఉద్దేశం. వీవీఎం పరీక్షలో విద్యార్థులు పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. – బి.రవినందన్‌రావు, జిల్లా సైన్స్ అధికారి, పెద్దపల్లి -
ప్రబలుతున్న జ్వరాలు.. ఆందోళనలో ప్రజలు..!
చింతలమానెపల్లి మండలం నందికొండ గ్రామానికి చెందిన భీంరావుకు జ్వరం రావడంతో కాగజ్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. కొద్దిగా కోలుకోవడంతో ఇంటికి వెళ్లాడు. మళ్లీ ఆరోగ్య పరిస్థితి విషమించి పదిరోజుల క్రితం ఇంటి వద్ద మృతి చెందాడు. భీంరావు మరణంతో భార్య, పిల్లలు పెద్దదిక్కును కోల్పోయారు. కుమరం భీం: పల్లెలు మంచం పడుతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఫ్లూజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాలతోపాటు గ్రామీణ మండలాల్లోని ప్రజలు జ్వరాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. నాణ్య మైన వైద్యం అందక ఇటీవల పెంచికల్పేట్ మండలంలోని కొండెపల్లిలో ఓ మహిళ, చింతలమానెపల్లి మండలం నందికొండలో యువకుడు మృత్యువాత పడ్డారు. అయితే జిల్లావ్యాప్తంగా జ్వరాల వ్యాప్తిపై అధికారికంగా రికార్డులు లేవు. కేవలం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోని పరీక్షలనే రికార్డులుగా అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్న వారే అధికంగా ఉండటం గమనార్హం. జ్వరాల వ్యాప్తి గ్రామీణ మండలాల్లో విద్యుత్ సరఫరా అంతరా యంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ కారణంగా నే దోమలతో వ్యాప్తిచెందే మలేరియా, డెంగీ వి జృంభిస్తున్నాయి. కలుషితమైన వాతావరణం, ఆహారం కారణంగా టైఫాయిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. వాతావరణ మార్పులతో చిన్నారులపై ఫ్లూజ్వరం ప్రభావం చూపుతోంది. జలుబు, దగ్గు, స్వల్ప జ్వరంతో అస్వస్థతకు గురవుతున్నారు. టైఫాయిడ్ సోకిన వ్యక్తికి తీవ్రమైన జ్వరం, వాంతులు, విరోచనాలు ఉంటాయి. డెంగీ వ్యాధిగ్రస్తులకు జ్వరంతోపాటు ఒళ్లు నొప్పులు, కళ్ల వెనుక భాగంలో తలనొప్పి ఉంటుంది. వీపు భాగంలో ద ద్దుర్లు, మచ్చలను కూడా గమనించవచ్చు. మలేరియా బానిన వారిలో చలి జ్వరం ఎక్కువగా ఉంటుంది. పీహెచ్‌సీల్లో పరీక్షలు టైఫాయిడ్, మలేరియా, డెంగీ జ్వరాలకు బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాపిడ్ పరీక్షల ద్వారా మలేరియాను నిర్ధారిస్తున్నా.. టైఫాయిడ్, డెంగీ శాంపిళ్లను జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఫలితాలు రావడానికి ఒక రోజు సమయం పడుతోంది. దీంతో కొన్నిచోట్ల అనుమానిత లక్షణాల ఆధారంగానే చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. కట్టడి చర్యలేవి.? జ్వరాల కట్టడికి చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలు పంచాయితీ కార్యాలయాల్లో ఉన్నాయి. ప్రమాదాలు జరుగుతుండడంతో ఫాగింగ్ నిలిచిపోయింది. మరోవైపు పారిశుధ్యం అధ్వానంగా ఉండడం కూడా దోమలు ఉధృతికి కారణమవుతోంది. మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో కలుషిత నీరే ప్రజలకు దిక్కవుతోంది. నియంత్రణకు చర్యలు జ్వరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. తిర్యాణి వంటి ఏజన్సీ ప్రాంతాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎలిసా పరీక్ష ద్వారా డెంగీని కచ్చితంగా నిర్ధారిస్తున్నాం. ఈ ఫలితాలకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నాం. – కృష్ణప్రసాద్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డెంగీతో ఒకరి మృతి పెంచికల్పేట్ మండలం అగర్‌గూడ గ్రామానికి చెందిన గోలేటి మారుతి(42) డెంగీతో ఆదివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మారుతికి నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానికంగా ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకున్నాడు. జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం ఈస్గాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లగా అక్కడ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య శారద, కుమార్తె ఉన్నారు. కాగా.. మారుతి తెలంగాణ సాంస్కృతిక సారథిలో కళాకారుడిగా 20 ఏళ్లుగా సేవలందిస్తున్నాడు. -
ముంబైలోని శ్రద్ధ ఫౌండేషన్‌తో.. నాలుగేళ్లకి ఇంటికి చేరిన మహిళ!
మహబూబ్‌నగర్: మతిస్థిమితం లేకుండా తిరుగుకుంటూ వెళ్లిన ఓ మహిళా నాలుగేళ్ల తర్వాత ఇంటికి చేరుకుంది. ఈ ఘటన మండలంలోని కానాయపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దేవరకుంట సరళమ్మ, కర్రెన్నల కుమార్తె వివాహిత గిరమ్మ మతిస్థిమితం లేకుండా గ్రామంలో తిరుగుతుండేది. నాలుగేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. రెండేళ్లు వెతికినా ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో ఆశలు వదులుకున్నారు. ముంబైలోని శ్రద్ధ ఫౌండేషన్ సభ్యులు గిరమ్మను చేరదీశారు. మతిస్థిమితం నుంచి కోలుకునేవిధంగా చికిత్స అందించి గిరమ్మ నుంచి చిరునామా కనుకున్నారు. ఆదివారం శ్రద్ధ ఫౌండేషన్ సభ్యులతో కలిసి ఇంటికి వచ్చిన గిరమ్మను చూసిన కుటుంబ సభ్యులు ఆనందంలో ముగిగిపోయారు. ఫౌండేషన్ సభ్యుడు ప్రదీప్‌కుమార్‌కు గిరమ్మ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
'జూరాల' కు 10వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
మహబూబ్‌నగర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో మరింత తగ్గుముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం 7 గంటల వరకు ప్రాజెక్టుకు ఎగువ నుంచి 16,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో 10వేలకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడ్డెందొడ్డి లిఫ్టు–1 వద్ద ఒక పంపు ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఆవిరి రూపంలో 94, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 738, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 60, సమాంతర కాల్వకు 850, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 8,737 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.929 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 115.058 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 11వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 25.77 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 10,899 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఎలాంటి అవుట్ ఫ్లో లేదని అధికారులు తెలిపారు. స్వల్పంగా విద్యుదుత్పత్తి.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో స్వల్పంగా ఉత్పత్తి కొనసాగుతుంది. ఆదివారం 2 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ రామసుబ్బారెడ్డి, డీఈ పవన్‌కుమార్ తెలిపారు. ఎగువలో ఒక యూనిద్ ద్వారా 39 మెగావాట్లు, 80.437 ఎం.యూ దిగువలో ఒక యూనిట్ ద్వారా 40 మెగావాట్లు, 86.813 ఎం.యూ విద్యుదుత్పత్తిని చేపడుతున్నామన్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 167.250 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని తెలిపారు. మదనాపురం మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం నాటికి పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు వచ్చి చేరింది. శ్రీశైలంలో 854.7 అడుగుల నీటిమట్టం.. శ్రీశైలం జలాశయంలో ఆదివారం 854.7 అడుగుల వద్ద 91.1 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 5,385 క్యూసెక్కుల నీటిని శ్రీశైలంకు వదులుతున్నారు. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 1,583, మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు 1,455, రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 800 క్యూసెక్కుల నీటిని వదిలారు. జలాశయంలో 197 క్యూసెక్కుల నీరు ఆవిరైంది. -
పాములుంటాయ్..! జాగ్రత్త..!!
నిర్మల్: జిల్లాలో ఏటా పదుల సంఖ్యలో పాముకాటుతో మృత్యువాత పడుతున్నారు. ఇందులో రైతులు, చిన్నారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. పొలాల్లో పనులు చేస్తూ కొందరు, ఇంటి పరిసరా ల్లో ఆడుకుంటూ మరికొందరు, రాత్రిళ్లు ఇంట్లో నిద్రపోతుండగా ఇంకొందరు పాము కాటుతో మృతి చెందిన ఘటనలున్నాయి. పాముకాటు వేసిన సమయంలో బాధితులు కంగారులో నాటు వైద్యులను ఆశ్రయిస్తుంటారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా మూఢవిశ్వాసాలతో మంత్రాలు చేయించడం, పసరు మందులు వాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నా రు. జిల్లాలో ప్రస్తుతమున్న చల్లని వాతావరణానికి పచ్చని చెట్లు, పొదలు తోడు కావడం, వర్షానికి వరదనీటి ప్రవాహం వస్తుండడంతో పాములు ఆరుబయట విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని కాలనీల్లో జనావాసాల మధ్య, నిల్వ నీరున్న కుంటల్లో దర్శనమిస్తున్నాయి. కప్పలు, ఎలుకలను వేటాడే క్రమంలో ఇళ్ల సమీపంలో ఉండే గుంతలు, చెట్లపొదల వద్ద ఎక్కువగా సంచరిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో అటుగా వెళ్లి ఆడుకుంటున్న చిన్నపిల్లలు పాముకాటుకు గురవుతున్నారు. అంతే కాకుండా ఇళ్ల ముందు, ఆరుబయట నిలిపి ఉంచుతున్న ద్విచక్ర వాహనాలు, కారు ఇంజిన్లు, బస్సుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ పాములు కనిపిస్తుండడంతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా తరచూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పాము కాటును ఇలా గుర్తించాలి.. పాము కరిస్తే ముందుగా ఏ ప్రాంతంలో కాటు వేసింది.. నేరుగా శరీరంపై కాటు వేసిందా? లేక దుస్తుల పైనుంచి వేసిందా? అనేది పరిశీలించాలి. శరీరంపై కాటు వేస్తే ఎన్నిగాట్లు పడ్డాయో చూడాలి. త్రాచుపాము, కట్లపాము, రక్తపింజర కాటేస్తే రెండు గాట్లు పడుతాయి. అంతకంటే ఎక్కువ గాట్లు కనిపిస్తే అది సాధారణ పాముగా గుర్తించవచ్చు. విష సర్పం కాటేస్తే సూదితో గుచ్చితే చుక్కగా రక్తం వచ్చినట్లు ఉంటుంది. కరిచిన చోట రెండు రక్తపు చుక్కలు కనిపిస్తాయి. ఇవీ.. జాగ్రత్తలు పొలం పనులకు వెళ్లే రైతులు, అడవుల్లో పశువుల వెంట తిరిగేవారు పాముకాటుకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రిపూట పొలాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా టార్చిలైట్ వెంట తీసుకెళ్లాలి. పాములు ఎక్కువగా మోకాలు కింది భాగంలో కాటువేస్తాయి. కాబట్టి కాళ్లను కప్పి ఉండే చెప్పులు ధరించాలి. కాళ్ల కిందకు ఉండే దుస్తులు వేసుకోవాలి. కప్పలు, ఎలుకలు ఎక్కువగా ఉండే చోట పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అది దృష్టిలో పెట్టుకుని పనులు చేసుకోవాలి. ఎవరైనా పాముకాటుకు గురైతే ఆందోళనకు గురికాకుండా వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ప్రథమ చికిత్స ఇలా.. పాముకాటు వేసినప్పుడు నోరు లేదా బ్లేడ్‌తో గాటు పెట్టకూడదు. కంగారులో నాటువైద్యులను ఆశ్రయించవద్దు. పాము కాటు వేసిన చోట సబ్బుతో శుభ్రంగా కడగాలి. పాముకాటుకు గురైన వ్యక్తికి ప్రమాదం ఏమీ లేదని చెప్పాలి. కాటు వేసిన భాగంలోని మూడు అంగుళాల పైభాగాన గుడ్డతో కట్టాలి. మందులు అందుబాటులో ఉంచాం అన్ని ప్రభుత్వ దవా ఖానలు, పీహెచ్‌సీల్లో పాముకాటుకు సంబంధించిన యాంటీ స్నేక్ వీనం మందులు అందుబాటులో ఉంచాం. పాము కాటేస్తే దాని లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. ఏటా పాముకాటు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. వానాకాలం జాగ్రత్తగా ఉండడం మంచిది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. – ధన్‌రాజ్, జిల్లా వైద్యాధికారి -
అది చెత్తకుండి కాదు..! కంట్రోల్ వాల్వ్..!!
కరీంనగర్: నగరంలోని పలు రిజర్వాయర్లకు తాగునీటిని సరఫరా చేసే మెయిన్ కంట్రోల్ వాల్వ్ అది. కానీ చెత్తచెదారం.. మూత్రవిసర్జనకు నిలయంగా మారింది. నగరంలోని ఫిల్టర్‌బెడ్ నుంచి తాగునీటి ప్రధాన పైప్‌లైన్ భగత్‌నగర్‌లోని అంబేడ్కర్ స్టేడియం నుంచి రిజర్వాయర్లకు వెళ్తుంది. అంబేడ్కర్ స్టేడియం మెయిన్ గేట్ సమీపంలోని నాలా పక్కన దీనికి కంట్రోల్ వాల్వ్ ఉంది. దీని నిర్వహణపై అధికారులు ఇన్నాళ్లు దృష్టి పెట్టకపోవడంతో డస్ట్‌బిన్‌గా మారింది. సమీపంలోని వ్యాపారులు చెత్తాచెదారాన్ని ఇందులో పడేస్తుండటంతో గుట్టలుగా పేరుకుపోయింది. అలాగే ఈ ప్రాంత వాసుల కువాల్వ్ చాంబర్ సులభ్ కాంప్లెక్స్‌గా మారింది. రిజర్వాయర్లకు సరఫరా చేసే తాగునీరు కలుషితమ య్యే ప్రమాదం ఏర్పడింది. శనివారం నగరపాలక సంస్థ సిబ్బంది వాల్వ్‌కు మరమ్మతు చేసేందుకు వచ్చారు. వారు చెత్త గుట్టను చూసి, ఖంగుతిన్నారు. వెంటనే దాన్ని తొలగించారు. వాల్వ్‌కు భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి రాకూడదంటే చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. -
ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల నిర్వహణ వాయిదా.. ఇక నాలుగో ప్రయత్నంగా
ఖమ్మం: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణ అంశం ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల నిర్వహణ వాయిదా పడింది. తాజాగా నాలుగో ప్రయత్నంగా ఇదే అంశంపై కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సిద్ధమైంది. ఈ మేరకు కార్మిక సంఘాలు, సింగరేణి అధికారులతో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో సోమవారం హైదరాబాద్‌లో సమావేశం జరుగనుంది. ఇందులో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఓటర్ల జాబితా ఎప్పుడు ప్రకటించాలి తదితర అంశాలపై చర్చించనున్నారు. రెండేళ్లుగా వాయిదా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు తొలిసారిగా 1998లో జరగగా, చివరిసారి 2017 అక్టోబర్‌లో నిర్వహించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపొందింది. ఈ సంఘం గుర్తింపు కాలపరిమితి 2021తో ముగిసింది. ఆతర్వాత వివిధ కారణాలతో యాజమాన్యం వాయిదా వేస్తూ వస్తోంది. ఈ అంశంపై సీపీఐ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ యూనియన్ (ఏఐటీయూసీ) హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ కార్మిక సంఘాలకే అనుకూలంగా తీర్పు వచ్చినా సాంకేతిక కారణా లను సాకుగా చూపుతూ సింగరేణి సంస్థ ఎన్నికలు వాయిదా వేస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ ఆదేశాల మేరకే ఎన్నికల నిర్వహణలో వెనుకంజ వేస్తోందనే విమర్శలు సంస్థపై ఉన్నాయి. కారు జోరుకు బ్రేకులు.. ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలో సింగరేణి బొగ్గు గనులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ సంస్థలో 42 వేల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణికి సంబంధించిన అంశాలు గెలు పోటమలును ప్రభావితం చేసే పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014, 2018లో రెండుసార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో మిగిలిన ప్రాంతాల్లో కారు పార్టీ జోరు చూపించింది. కానీ కోల్‌బెల్ట్ ఏరియాల్లో మాత్రం ఆ పార్టీకి భంగపాటు ఎదురైంది. దీంతో గత రెండేళ్లుగా గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వస్తే రానీ.. పోతే పోనీ.. సింగరేణి ఎన్నికల నిర్వహణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో ఇటీవల మార్పు వచ్చిందంటున్నారు. ఇప్పటికే కమ్యూనిస్టులతో తెగదెంపులు చేసుకున్న బీఆర్ఎస్.. తొలి జాబితా ప్రకటన తర్వాత అసమ్మతి నేతలు పార్టీని వీడి వెళ్తున్నా డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక విషయంలోనూ ఏది జరిగినా సరే అనే భావన పార్టీలో నెలకొందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల సాధ్యాసాధ్యాలను కేంద్ర కార్మిక శాఖ చూసుకుంటుందని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు తగ్గట్టుగా ముందుకు పోవడమే మంచిదనేది గులాబీ నేతల అభిప్రాయంగా చెబుతున్నారు. -
'మనకు మరో జన్మంటూ ఉంటుందా..???' ఆత్మహత్య సరికాదు! ఓ క్షణం ఆలోచించు!!
నిర్మల్: పుట్టిన ప్రతి మనిషికి జీవితంలో ఎదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. సమస్య ఎంత పెద్దదైనప్పటికీ దానికి పరిష్కారం ఉంటుంది. అయితే ఆ సమస్యను స్వీకరించే తీరు, దాన్ని పరిష్కరించుకునే విధానమే కీలకం. తమకు ఎదురైన సమస్యను తెలుసుకుని దానిని అధిగమించే మార్గాలను వెతుకుంటే సమస్య కన్న పరిష్కార మార్గాలే ఎక్కువగా కన్పిస్తాయి. తమకున్న సమస్యనే పెద్దదిగా భావించి విచక్షణ కొల్పోయి క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎదురైన సమస్యతో బాధపడకుండా మన అనుకునేవారికి చెప్పుకుంటే సగం పరిష్కారం అప్పుడే లభిస్తోంది. పిల్లల భవిష్యత్తు ఏమిటని ఆలోచన చేయకుండా ఆత్మహత్యకు పాల్పడి పిల్లలను వీధి పాలు చేస్తున్నారు. పిల్లలు తెలిసి, తెలియని వయస్సులోనే ఆత్మహత్యకు ఒడిగట్టి తల్లిదండ్రులకు తీరని దుఖాన్ని మిగుల్చుతున్నారు. ► ‘భీంపూర్ మండలంలోని అందర్‌బంద్ ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే అనురాగ్ (13) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువుకోవాల్సిన వయస్సులో బడి మానేసి ఇంటి వద్ద ఉండడంతో బుద్దిగా బడికి వెళ్లి చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించారనే కారణంతో తన నూరేళ్ల జీవితానికి ముగింపు పలికి తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిల్చాడు.’ ► ‘ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న తాంసి మండలం పాలోది గ్రామానికి చెందిన అడెపు శృతి(17) మొహర్రం సెలవులకు ఇంటికి వచ్చింది. తనతో చనువుగా ఉంటున్న గ్రామంలోని యువకుడి ఇంటికి వెళ్లిన విషయం తండ్రికి తెలిసి తనను మందలిస్తాడనే భయంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంది.' ► ‘జైనథ్ మండలం మేడిగూడ గ్రామానికి చెందిన డౌరే రవీందర్ అనే కౌలు రైతు తనకున్న మూడెకరాలతో పాటు మరో 14ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి పంట సాగుచేశాడు. వర్షాభావ పరిస్థితులతో పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడం, పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కన్పించకపోవడంతో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడం ఆయన భార్య, ఇద్దరు పిల్లలు రోడ్డునపడ్డారు. భార్య స్వప్న కూలీ పనిచేస్తు పిల్లలను పోషించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.' ► 'బోథ్ మండలం ధన్నూర్ గ్రామానికి చెందిన పాముల సంతోష్ ఆటో నడుపు తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆ టోను ఫైనాన్స్‌పై తీసుకున్నాడు. గీరాకి ఆశించనంతగా రాకపోవడం, కుటుంబ పోషణ భారమవుతుందనే కారణంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని భార్య, ఇద్దరు పిల్లలు ఆధారాన్ని కొల్పోయి దిక్కులేని వారిగా నానా అవస్థల నడుమ కాలం వెల్ల దీయాల్సి వస్తోంది.' బతికే మార్గం చూడాలి.. చేతినిండా పనిదొరక్క, ఉపాధి అవకాశాలు లేక కుటుంబ భారాన్ని మోయలేక చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. పంటలు సరిగ్గా పండక, గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలా చేసుకోవడం ద్వారా వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఆత్మహత్యలను అరికట్టేలా చర్యలు చేపట్టాలి. – సంగెపు బొర్రన్న, రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం.. ఆత్మహత్యలు చేసుకోకుండా ఎస్సైలు తమ పరిధిలో రెగ్యులర్‌గా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి ఆత్మహత్యలు చేసుకోకుండా వాటి వల్ల ఎదురయ్యే పరిణామాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఆత్మహత్యలనేవి సమస్యకు ఏ మాత్రం పరిష్కారం కావు. సమస్యలు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా విచక్షణతో ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. – డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యలు.. మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతుంటాయి. డిప్రెన్సన్లో ఉన్న వ్యక్తి నడవడిలో మార్పు వస్తుంది. గమనించి వైద్యుల వద్ద చికిత్స, కౌన్సెలింగ్ అందిస్తే వారిని ఆత్మహత్యలకు పాల్పడకుండా కాపాడవచ్చు. మానసిక సంఘర్షణకు గురై, సహనం లేనటువంటి వారు క్షణికావేశాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్ చేస్తే వారు ప్రాణాలు తీసుకోకుండా చూడవచ్చు. – డాక్టర్ ఓంప్రకాశ్, రిమ్స్ మానసిక వైద్య నిపుణులు ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పల్లెచిత్రాల 'తోట'! వైకుంఠం గీసిన చిత్రాలకు క్రేజీ..!!
కరీంనగర్: పల్లె జీవనం.. పడచుల కట్టుబొట్టు.. భారతీయ సంస్కృతి.. ఆయన చిత్రాలకు మూలాధారం. తోట వైకుంఠం కుంచె పడితే చిత్రాలకు జీవం వచ్చి, కాన్వాస్‌పై నాట్యం చేస్తాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూర్గుపల్లిలో జన్మించిన వైకుంఠం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏడేళ్ల క్రితం గీసిన చిత్రానికి ఇటీవల ముంబయిలోని ఆస్తాగురు యాక్షన్ హౌస్ నిర్వహించిన వేలంలో రూ.1,41,35,220 ధర పలకడం విశేషం. బూర్గుపల్లిలో విద్యాభ్యాసం.. బూర్గుపల్లిలో 1942లో జన్మించిన తోట వైకుంఠం స్వగ్రామంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేశా రు. బోయినపల్లి, శాత్రాజ్పల్లి, వేములవాడ, సిరి సిల్లలో ఉన్నత విద్య చదివారు. హైదరాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చిత్రలేఖనం పూర్తి చేశా రు. అనంతరం మహారాజ సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడాలో ప్రముఖ చిత్రకళా కారుడు సుబ్రమణియన్ దగ్గర శిష్యరికం చేశారు. రంగుల ఆయన ప్రత్యేకత.. డస్కీస్కిన్‌తో మహిళల చిత్రాలు గీయడం ఆయన ప్రత్యేకత. సాదాగా కనిపించే మహిళలు రూపం ఆయన చిత్రంగా మలిస్తే అందంగా కనిపిస్తారు. ఆయన గీసిన అందమైన మహిళల చిత్రాలను సిరిసిల్ల చీరెలుగా అభివర్ణిస్తారు. అమ్మ.. మహిళలే స్ఫూర్తి! చిత్రకారుడిగా గుర్తింపు పొందడానికి అమ్మ స్ఫూర్తి అని వైకుంఠం చెబుతుంటారు. చిన్నప్పుడు గ్రామంలో చిందు కళాకారులు నాటకాలు ప్రదర్శిస్తుంటే వారు వేసిన వేశాలకు తగినట్లుగా మేకప్ వేసి రంగులు దిద్దే అలవాటు ఉండేదని తెలిపారు. అలా చిన్నప్పటి నుంచే రంగులు, బొమ్మలు గీయడంపై అనురక్తి కల్గిందని చెబుతుంటారు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులు తనకు ఇష్టమని.. తన చిత్రాలలోనూ ఎక్కువగా వాటినే వాడుతానని తెలిపారు. ఎన్నో అవార్డులు! భోపాల్‌లో రెండేళ్లకోసారి ఇచ్చే భారత్ భవన్ అవార్డుతోపాటు భారత ప్రభుత్వం అందించే జాతీయ అవార్డు, ఉమ్మడి రాష్ట్రంలో హంస అవార్డు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ చిత్రకళాకారుడిగా అవార్డు లభించింది. దాసి, మాభూమి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిశారు. దాసి చిత్రానికి ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్‌గా జాతీయ అవార్డు అందుకున్నారు. వైకుంఠంపై పలు డాక్యుమెంటరీలు.. వైకుంఠంపై పలు డాక్యుమెంటరీలు వచ్చాయి. 2015లో కోల్‌కతాకు చెందిన పార్థూరాయ్ డాక్యుమెంటరీ నిర్మించారు. గ్రామాభివృద్ధికి విరాళాలు.. స్వగ్రామం బూర్గుపల్లిలో పాఠశాల అభివృద్ధికి రూ.40 వేలు విరాళంగా అందించారు. యువత చదువుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని తెలుపుతున్నారు. మాకు గర్వంగా ఉంది.. అంతర్జాతీయ చిత్రాకారుడిగా పేరు పొందిన తోట వైకుంఠం మా గ్రామస్తుడని చెప్పుకోవడం గర్వంగా ఉంది. ఆయనతో మా గ్రామానికి పేరు రావడం గొప్పగా భావిస్తున్నాం. ముంబయిలో జరిగిన వేలంలో ఆయన గీసిన చిత్రానికి కోటిన్నర పలకడం చాలా సంతోషంగా ఉంది. – కమటం అంజయ్య,మాజీ సర్పంచ్, బూర్గుపల్లి చిందు నాటకాలు ఇష్టపడేవారు.. వైకుంఠం సారు చిన్నప్పుడు మా గ్రామంలో చిందునాటకాలు వేసేవారు. పదేళ్ల కింద గ్రామానికి వచ్చినప్పుడు పాతతరం చిందు కళాకారులతో వేశాలు వేయించి డాక్యుమెంటరీ తీశారు. చిందుకళను ఇష్టపడేవారు. – గజ్జెల సాయిలు,చిందు కళాకారుడు గ్రామాభివృద్ధికి తోడ్పాటు.. తోట వైకుంఠం గ్రామంలో యువతకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి. స్వగ్రామంలోని పాఠశాల అభివృద్ధికి గతంలో రూ.40 వేలు సాయం చేశారు. ఆయన గీసిన చిత్రాలతో మా ఊరికి పేరు రావడం గర్వంగా ఉంది. – పెరుక మహేశ్, యువకుడు -
‘నిమ్స్ ది గ్రేట్’ : మంత్రి హరీష్‌రావు ప్రశంసలు..!
హైదరాబాద్: అవయవ మార్పిడి ఆపరేషన్లలో నిజాం వైద్య విజ్ఞాన సంస్ధ(నిమ్స్) తన ప్రత్యేకతను మరోసారి చాటి చెప్పింది. గతంలో ఎన్నో విజయాలను పదిలపర్చుకున్న నిమ్స్ తాజాగా మారో అరుదైన రికార్డు సృష్టించి వైద్య రంగాలలోనే సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఎనిమిది నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా చేసి అరుదైన రికార్డును వైద్యులు సొంతం చేసుకున్నారు. ఇందులో 61 లైవ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయగా, 39 దాతల ద్వారా సేకరించినవి.. గ్రహీతల్లో 11, 12 ఏళ్ల వయసువారు కూడా ఉండడం చెప్పుకోదగ్గ అంశం. శుక్రవారం వందో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్య బృందంలో యూరాలజీ వైద్యనిపుణులు ప్రొఫెసర్ రామ్‌రెడ్డి, విద్యాసాగర్, రామచంద్రయ్య, తదితరులు ఉన్నారు. వీరంతా యూరాలజీ హెచ్ఓడీ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స మార్పిడిలు చేస్తున్నారు. గత నెలలో రూ.32 కోట్లతో సమకూర్చుకున్న అడ్వాన్స్డ్ పరిజ్ఞానం ఉన్న రోబోటిక్స్ సాయంతో యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాల్లో అత్యంత సంక్లిష్టమైన నెల రోజుల వ్యవధిలోనే 30 అపరేషన్లను చేశారు. గాల్‌బ్లాడర్, హెర్నియా, ఆచలాసియా కార్డియా సర్జరీలను చిన్న రంధ్రంతో సులువుగా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తున్నారు. సాధారణ పద్దతుల్లో చేసే సర్జరీలతో పోల్చితే రోబోటిక్ సర్జరీలు కూడా చాలా కచ్చితంగా జరుగుతున్నాయి. ఆపరేషన్ జరిగిన మూడు రోజుల్లోనే రోగి డిశ్చార్జి కావడం విశేషం. హరీష్‌రావు మంత్రి ప్రశంసలు.. అత్యధిక మార్పిడి ఆపరేషన్లు చేసి నిమ్స్ వైద్యులు చెప్పుకోదగ్గ రికార్డును నెలకొల్పారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ప్రశంసించారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ల్లో రికార్డు బ్రేక్ చేసి యూరాలజీ వైద్యులను మంత్రి ఎక్స్(ట్విట్టర్)లో అభినందించారు. ఈ అసాధారణ అవయవ మార్పిడి ద్వారా ప్రాణాలను కాపాడాలనే తమ అచంచలమైన నిబద్ధతను హైలైట్ చేస్తోందన్నారు. ఎంత పెద్ద శస్త్రచికిత్స అయినా.. ఎంత పెద్ద శస్త్రచికిత్సనైనా సులువుగా చేయవచ్చు. రోబోటిక్ సర్జరీలను ప్రారంభించిన అనతికాలంలోనే పెద్ద సంఖ్యలో విజయవంతంగా ఆపరేషన్లు చేయడం నిమ్స్ వైద్యుల ప్రతిభకు తార్కాణం. ఇప్పడు ఆస్పత్రిలో నొప్పి తక్కువతో.. ఇన్ఫెక్షన్లకు తావులేకుండా చేస్తున్నాం. – ప్రొఫెసర్ నగరి బీరప్ప, సంచాలకులు, నిమ్స్ -
'తపాల శాఖ' ద్వారా.. ఇక విదేశాలకు పార్సిళ్లు..!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ ప్రధాన తపాల కార్యాలయం నుంచి డాక్ నిర్యాత్ కేంద్ర సర్వీస్ ద్వారా తక్కువ ఖర్చుతో విదేశాలకు సులభంగా పార్సల్స్ పంపే సేవలు ప్రారంభించినట్లు ఆదిలాబాద్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ సుజిత్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ఉట్నూర్ పరిధిలోని బ్రాంచి పోస్ట్ మాస్టర్లతో సమావేశం నిర్వహించారు. విదేశాలకు పార్సల్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. శుక్రవారం ప్రధాన తపాల కార్యాలయంలో సైతం విదేశాలకు పార్సెల్ సర్వీస్ కరపత్రాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు సమీప పోస్టు ఆఫీసుల్లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎం తిరుపతి, రమేశ్, బీపీఎంలు చంద్రశేఖర్, ప్రవీన్, గోకు ల్, విజయ్, సాద్ తదితరులు పాల్గొన్నారు. -
'గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై'.. కలెక్టర్ సమీక్ష..!
పెద్దపల్లి: జిల్లా వ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని, అందుకనుగుణంగా సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం మండపాల నిర్వహణ, నిమజ్జనం ఏర్పాట్లపై అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, డీసీపీ వైభవ్‌గైక్వాడ్‌తో కలిసి సమీక్షించారు. అన్ని మండలాలు, గ్రామాల్లో ఏర్పాటు చేసే గణేశ్‌మండప నిర్వాహకులు అధికారుల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పోలీసు, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు స్థానికంగా సమావేశమై ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. నిమజ్జనానికి అవసరమైన క్రేన్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గణపతి ఉత్సవాల సందర్భంగా గట్టి నిఘా ఉంటుందని, వివాదాలు సృష్టిస్టేందుకు యత్నించే వారిపై చట్టపరమైన చర్యలుంటాయని డీసీపీ పేర్కొన్నారు. ఆర్డీఓలు మధుమోహన్, హనుమనాయక్, ఏఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
భూగర్భ గనుల్లో ఉత్పత్తి పెంచాలి.. సింగరేణి డైరెక్టర్ల దిశానిర్దేశం..!
పెద్దపల్లి: భూగర్భగనుల్లో బొగ్గు ఉత్పత్తి పెంచాలని సింగరేణి డైరెక్టర్లు జి.వెంకటేశ్వర్‌రెడ్డి, ఎన్వీకే శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. శుక్రవారం అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూగర్భ గనుల్లో పూర్తిస్థాయి యంత్రాల వినియోగం పెంచాలన్నారు. షిఫ్ట్‌ల వారీగా భూగర్భ గనుల్లో మ్యాన్‌పవర్ గురించి తెలుసుకున్నారు. రక్షణ చర్యలు తదితర అంశాలపై చర్చించారు. కాన్ఫరెన్స్‌లో ఆర్జీ–1 జీఎం చింతల శ్రీనివాస్, ఏరియ ఇంజినీర్ రామ్మూర్తి, ఓసీ–5 ప్రాజెక్ట్ అధికారి కె.చంద్రశేఖర్, ఏజెంట్ చిలక శ్రీనివాస్, బానోతు సైదులు, ఏజీఎం ఐఈడీ ఆంజనేయులు, క్వాలిటీ డీజీఎం శ్రీధర్, మేనేజర్లు నెహ్రూ, రమేష్‌బాబు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. వకీల్‌పల్లిగనిలో.. రామగుండం డివిజన్–2 వకీల్‌పల్లిగనిలో బొగ్గు ఉత్పత్తి పెంచాలని డైరెక్టర్లు సూచించారు. శుక్రవారం ఆర్జీ–2 జీఎం ఎల్వీ సూర్యనారాయణతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డైరెక్టర్లు మాట్లాడారు. ప్రణాళికా బద్ధంగా ముందుకెళ్లి భూగర్భగనుల్లో ఉన్న యంత్రాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ఎల్‌హెచ్‌డీ, ఎస్డీఎల్, కంటిన్యూస్ మైనర్యంత్రాల పనితీరు మరింత మెరుగుపర్చాలన్నారు. వకీల్‌పల్లిగని ఆగస్టులో 119శాతం బొగ్గు ఉత్పతి సాధించడంపై అభినందించారు. కాన్ఫరెన్స్‌లో ఐఈడీ డీజీఎం మురళీకృష్ణ, ఇన్చార్జి మేనేజర్ తిరుపతి, గ్రూప్ ఇంజినీర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
ఎలివేషన్ సెంట్రింగ్ పనులు చేస్తుండగా.. ఘోర ప్రమాదం!
హైదరాబాద్: కూకట్పల్లి సర్కిల్ అడ్డగుట్ట సొసైటీలోని ఓ భవన నిర్మాణం ఎలివేషన్ సెంట్రింగ్ పనులు చేస్తుండగా ఆరో అంతస్తుపై ఉన్న పిట్టగోడ కూలిపోయింది. దీంతో భవన నిర్మాణానికి ఏర్పాటు చేసిన గోవా కర్రలు విరిగిపోయాయి. ఈ ఘటనలో కర్రలపై నిల్చుని ప నిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురు కార్మికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఉదయం 8.30 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డగుట్ట సొసైటీలోని ఓ భవన నిర్మాణం చేపడుతున్నారు. ఎలివేషన్ కోసం సెంట్రింగ్ పనుల్లో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆరుగురు కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారు. సెంట్రింగ్ తొలగిస్తున్న సమయంలో పిట్టగోడ కూలి సానియా బట్నాయక్ (19), సామ బట్నాయక్ (23), సానియా చలాన్ (20)లు మృతి చెందారు. వీరితో పాటు పని చేస్తున్న ముదాబత్ నాయక్, బలరాం, సుప్రా బట్నాయక్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సామ బట్నాయక్, సానియా చలాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, సానియా బట్నాయక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భవనం పిట్టగోడ కూలిన విషయం తెలుసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో గురువారం పెద్దగా జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మృతదేహాలను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ భవనం దాసరి సంతోష్, దాసరి సాయిరాం పేరుపై 2022 డిసెంబర్ 2వ తేదీన జీ 5 అంతస్తులకు అనుమతులు తీసుకున్నారు. అదనంగా మరో ఫ్లోర్ అక్రమ నిర్మాణం చేపట్టారు. ఆ అంతస్తులోనే పని చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. నాణ్యత లేకపోవడంతోనే.. ఆరో అంతస్తుపై పిట్టగోడ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకోకపోవటంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గోడలు, గోవా కర్రలు తడిచిపోయాయి. పిట్టగోడ కోసం నిర్మించిన సిమెంట్ పెళ్లలు గోవా కర్రలపై పడిపోగా అవి విరిగి వాటిపై నిల్చుని పని చేస్తున్న కార్మికులు కింద పడిపోయారు. అనుమతులు పొందిన దానికంటే అక్రమంగా అంతస్తులు నిర్మాణం చేపట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ముందుగానే అక్రమ అంతస్తులను అధికారులు అడ్డుకొని ఉంటే ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసేవి కావంటున్నారు. క్రిమినల్ కేసులు పెడతాం.. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ కూకట్పల్లి డిప్యూటీ కమిషనర్ హరికృష్ణ స్పందించారు. ఈ ఘటనలో ముగ్గురి కార్మికుల మృతికి కారణమైన భవన యజమానులు, ఆర్కిటెక్ట్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అనుమతులు పొందిన దానికంటే అక్రమంగా నిర్మించిన మరో ఫ్లోర్ నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేస్తామని పేర్కొన్నారు. గతంలోనే రెండుసార్లు భవన యజమానికి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ.. ప్రమాదవశాత్తు పిట్టగోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందడం, ముగ్గురు కార్మికులకు గాయాలు కావటం దురదృష్టకరమని స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. భవన యజమాని, బిల్డర్, సంబంధిత అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిజేస్తామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని, ప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని ఆయన చెప్పారు. -
అపార్ట్మెంట్లో కొండచిలువ కలకలం..!
హైదరాబాద్: ఓ అపార్ట్మెంట్లోకి కొండ చిలువ ప్రవేశించడంతో స్థానికంగా కలకలం రేపింది. నిజాంపేట్ కార్పొరేషన్ ప్రగతినగర్‌లోని సాయి ఎలైట్ అపార్ట్‌లోని పార్కింగ్ ప్రదేశంలోకి కొండ చిలువ ప్రవేశించడంతో అపార్ట్మెంట్ వాసులు భయబ్రాంతులకు లోనయ్యారు. ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ సభ్యుడు అంకిత్ శర్మకు ఫోన్ చేయడంతో వెంటనే అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నాడు. తన వెంట తెచ్చిన బ్యాగ్‌లో కొండ చిలువను తీసుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు. ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద నీటితో కొండ చిలువ కొట్టుకుని వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. -
రైలొచ్చింది.. 21 కి.మీ దూరంలో ఉన్నది!
కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో రైల్వే పనులు ఊపందుకున్నాయి. కొత్తపల్లి– మనోహరాబాద్ లైన్ పనులు వడివడిగా సాగుతున్నాయి. ఈ మార్గంలో ఇప్పటికే సిద్దిపేట వరకు రైలొచ్చింది. మిగిలిన రూట్లలోనూ పనులు స్పీడందుకున్నాయి. సిద్దిపేట తర్వాత గుర్రాలగొంది, చిన్నలింగాపూర్, సిరిసిల్ల స్టేషన్ల నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే టెండర్లు జారీ చేసింది. ప్లాట్‌ఫాంలు, భవనాలు, గదులు, అప్రోచ్ రోడ్లు, లైటింగ్, విద్యుత్ యార్డు తదితర పనుల కోసం టెండర్లు జారీచేశారు. మొత్తం టెండరు విలువ రూ. 5,30,27,277గా అధికారులు పేర్కొన్నారు. ఈనెల 25న మధ్యాహ్న 3 గంటలకు టెండరు ముగింపు గడువుగా తెలిపారు. పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలని టెండరులో సూచించారు. 21 కి.మీ. దూరంలో పాత కరీంనగర్.. సిరిసిల్ల–సిద్దిపేట మధ్యలో 30 కి.మీ దూరానికి ట్రాక్ వేసేందుకు దాదాపు రూ.440 కోట్ల వ్యయంతో జనవరిలోనే దక్షిణ మధ్య రైల్వే బిడ్డింగులు పిలిచింది. తాజాగా సిరిసిల్ల, గుర్రాలగొంది, చిన్నలింగాపూర్లలోనూ స్టేషన్ నిర్మాణాలకు దక్షిణ మధ్య రైల్వే టెండర్లు పిలవడంతో ఈ మార్గంలో జరుగుతున్న పనుల వేగానికి నిదర్శనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను హైదరాబాద్‌తో కలిపే కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైను ప్రస్తుతం సిద్ధిపేట వరకు పూర్తయింది. ఇటీవల సిద్ధిపేటను రైలు కూడా పలకరిచింది. సిద్దిపేట తర్వాతి స్టేషన్ గుర్రాలగొంది కేవలం 10 కి.మీ దూరంలో ఉంటుంది. గుర్రాలగొంది– చిన్నలింగాపూర్ మధ్య దూరం 11 కి.మీ. చిన్నలింగాపూర్–సిరిసిల్ల మధ్య 9.కి.మీ దూరం వస్తుంది. గుర్రాలగొంది సిద్దిపేట జిల్లా కాగా, చిన్నలింగాపూర్ సిరిసిల్ల జిల్లాలో ఉంటుంది. ఈ లెక్కన కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే మార్గం పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రవేశించేందుకు కేవలం 21.కి.మీల దూరంలో ఉంది. 77 కి.మీ. మేర పూర్తయిన మార్గం.. మనోహరాబాద్ –కొత్తపల్లి (కరీంనగర్) వరకు మొత్తం 151.36 కిలో మీటర్లు బ్రాడ్‌గేజ్‌లైన్. ఈ మార్గంలో ప్రస్తుతం సిద్దిపేట స్టేషన్ (77కి.మీ) వరకు లైన్ పూర్తయింది. ఇక్కడి నుంచి దాదాపు 30 కి.మీ దూరంలో ఉన్న సిరిసిల్ల స్టేషన్ (106.88 కి.మీ) వరకు ప్రస్తుతం పనులు వేగంగా నడుస్తున్నాయి. అక్కడ నుంచి కరీంనగర్ వరకు (151.36 కి.మీ) అంటే దాదాపు 44.48 కి.మీ వరకు ట్రాక్ పనులు సాగాలి. ఇవి 2025 మార్చి వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సిరిసిల్లలో కావాల్సిన భూసేకరణకు అధికారులు ఇప్పటికే పచ్చజెండా ఊపారు. దక్షిణ మధ్యరైల్వే అడిగిన భూమిని అటవీ భూమిని ఇచ్చేందుకు ఇటీవల సిరిసిల్ల కలెక్టర్ అనుమతించారు. భూసేకరణ విషయంలో రైల్వే అధికారులతో సిరిసిల్ల–కరీంనగర్ కలెక్టర్లు కూడా పలుమార్లు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ మార్గం పూర్తయితే జగిత్యాల, పెద్దపల్లి వాసులకు ఢిల్లీ, హైదరాబాద్ వెళ్లేందుకు రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ప్రాజెక్టు నేపథ్యం ఇదీ.. వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట ప్రజలకు రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 2006–07లో 151 కి.మీ కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్ కోసం రూ.1,167 కోట్ల అంచనా వ్యయం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. తర్వాత ఈ మార్గం ఆర్థికంగా భారమని చెప్పి రైల్వేశాఖ సుముఖత చూపలేదు. మొత్తం బడ్జెట్లో 1/3 వంతు ఖర్చుతోపాటు 100 శాతం భూమిని సేకరించి ఇవ్వడం, ఈ మార్గంలో ఐదేళ్లపాటు వచ్చే నష్టాలను భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చింది. దీంతో 2016లో ఈ ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కింది. ఈప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
విదేశీ పర్యటనకు చిన్నారి.. 'అభి తుమనిషా'
కర్ణాటక: ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉపన్యాస పోటీల్లో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం సంపాదించి మలేషియా పర్యటనకెళ్లడం సంతోషకరమని హోసూరు కార్పొరేషన్ విద్యాకమిటీ అధ్యక్షుడు శ్రీధర్ తెలిపారు. హోసూరు పారిశ్రామికవాడ జూజువాడి ప్రభుత్వ ఉన్నతోన్నత పాఠశాలలో అభి తుమనిషా గత ఏడాది ప్లస్‌టూ చదువుతూ రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీల్లో మొదటి స్థానం సంపాదించుకొంది. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యామొళితో కలిసి మలేషియా పర్యటనకు తీసుకెళ్లారు.