News
-
చిన్నారి 'గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు'! మంత్రి హరీశ్‌రావు అభినందన!!
సంగారెడ్డి: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన మూడేళ్ల ఐదు నెలల వయసు ఉన్న అరుషి తన అద్భుత మేథాశక్తితో ఔరా అనిపిస్తుంది. బుడిబుడి అడుగులు వేస్తూ, ముద్దులొలికించే మాటలతో బుజ్జిగా కనిపించే చిన్నారి అరుషి ప్రపంచంలోని 195 దేశాల రాజధానుల పేర్లను 5 నిమిషాల 5 సెకన్ల సమయంలోనే చకాచకా చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. పట్టణానికి చెందిన సురేశ్, కావ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు అరోహి గౌడ, అరుషి గౌడ ఉన్నారు. తండ్రి బేకరీ షాపు నిర్వహిస్తుంటాడు. తల్లి కావ్య ఇంటి వద్ద ఉంటుంది. ఈ ఇద్దరు చిన్నారులు మేథస్సులో దిట్ట. చిన్న పాప అరుషి గౌడ పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదువుతోంది. అరుషి జ్ఞాపక శక్తిని గుర్తించిన తల్లి ఏదో ఒక అంశంలో ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాలని సంకల్పించింది. ప్రతీరోజు 5 దేశాల రాజధానులపై శిక్షణ.. చిన్నారి అరుషిగౌడకు తల్లి కావ్య ప్రతీ రోజు ఐదు దేశాలకు సంబంధించిన రాజధానుల పేర్ల గురించి ఆడుకునే సమయంలో, అన్నం తినేటప్పుడు ప్రాక్టీస్ చేయించేది. నెలన్నరలో 195 దేశాల రాజధానుల పేర్లు అతి తక్కువ సమయంలో సునాయసంగా చెప్పేలా కంఠస్తం చేయించింది. ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎలా పార్టిసిపేట్ చేయాలో ఆ ప్రొసీజర్‌ను యూట్యూబ్ ద్వారా తెలుసుకుంది. వెంటనే మూడేళ్ల 5 నెలల అరుషిగౌడతో 195 దేశాల రాజధానుల పేర్లు 5 నిమిషాల 5 సెకన్లలో చెప్పేలా ఆన్లైన్ యాప్ ద్వారా వీడియోను చిత్రీకరించి రికార్డు చేసింది. ఆ వీడియోను ఢిల్లీలోని ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు జూలై 31న పంపించారు. ఢిల్లీ కార్యాలయంలో ముగ్గురు జడ్జిల సమక్షంలో ఆ వీడియోను పరిశీలించారు. అరుషిగౌడ ప్రతిభకు గిన్నిస్ బుక్‌లో చోటు దక్కినట్లు చీఫ్ ఎడిటర్ డాక్టర్ బైస్వారూప్ రాయ్ చౌదరి ఆగస్టు 7న ప్రకటించారు. ఈ విషయాన్ని ఫోన్, మెయిల్ ద్వారా చిన్నారి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇటీవల ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు (2023) పుస్తకం, మెడల్, ప్రశంసా పత్రాలను అరుషి గౌడ తల్లిదండ్రుల అడ్రస్‌కు పోస్ట్ ద్వారా పంపించారు. పెద్ద కూతురు కూడా.. సురేష్, కావ్య దంపతుల పెద్దకూతురు అరోహిగౌడ సైతం మేథస్సులో దిట్ట. ఆ చిన్నారి సైతం 2021లో మూడెళ్ల 9 నెలల వయస్సులో ప్రపంచంలోని 195 దేశాల రాజధానుల పేర్లను 5 నిమిషాల 30 సెకన్లలో చెప్పి ఇండియన్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించింది. అలాగే భారత దేశంలోని 28 రాష్ట్రాల పేర్లను 1 నిమిషం, 28 సెకండ్లు, ఫ్రీడమ్ ఫైటర్ల పేర్లను 4 నిమిషాల్లో చెప్పి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు.. పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దానిని గుర్తిస్తే ఏదైనా సాధించగలుగుతారు. మాకు ఇద్దరు ఆడపిల్లలని ఏనాడూ బాధపడ లేదు. వీరిద్దరూ ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించడం సంతోషంగా ఉంది. – సురేష్, కావ్య దంపతులు, హుస్నాబాద్ మంత్రి హరీశ్‌రావు అభినందన.. అరుషి గిన్నిస్ బుక్‌లో స్థానం పొందడం పట్ల ఈ నెల 4న రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్‌లు అరుషిగౌడను అభినందించి సన్మానించారు. భవిష్యత్‌లో ఇంకా ఎన్నో మెడల్స్‌ను గెలుచుకోవాలని వారు ఆకాంక్షించారు. -
మీ బైక్ సైలెన్సర్ సౌండ్ మారిందో.. జర జాగ్రత్త..!
ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇటీవల అధిక శబ్దాలతో వెళ్లే వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో వాహనదారులతో పాటు వృద్ధులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే శబ్దకాలు ష్యంతో అవస్థలు పడుతున్నామని పలువురు పోలీ స్‌స్టేషన్ మెట్లెక్కారు. దీంతో ఇటీవల పట్టణ పోలీ సులు అలాంటి సైలెన్సర్లు అమర్చి వాహనాలు న డుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై కొరడా ఝులిపిస్తున్నారు. మెకానిక్ షాప్‌లకు నోటీసులు.. అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లను అమర్చే మెకానిక్ షాప్‌లకు నోటీసులు పంపిస్తాం. అయినా వినకుంటే కేసులు నమోదు చేస్తాం. అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లను అమర్చుకునే ద్విచక్ర వాహనదారులకు మొదటిసారిగా జరిమానా విధించి తర్వాత కేసులు నమోదు చేసి కోర్టుకు పంపుతాం. శబ్ద కాలుష్యం ద్వారా జరిగే అనర్థాలకు ఎవరు కారణం కావద్దు. లేదంటే తగిన చర్యలు తీసుకుంటాం. - గంగారెడ్డి, నిర్మల్ డీఎస్పీ సౌండ్‌తో ఇబ్బంది అవుతుంది.. సౌండ్ వచ్చే ద్విచక్ర వాహనాలతో పట్ట ణంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది. మైనర్లు సైతం ద్విచక్ర వాహనాలకు సౌండ్ వచ్చే సైలెన్సర్లు బిగించి రోడ్డు మీద వెళ్లేవారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలాగే ద్విచక్ర వాహనాలతో రోడ్లపై ఇష్టానుసారంగా నడుపుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీనిపై పోలీసులు సీరియస్‌గా వ్యవహరించాలి. - శంకర్ యాదవ్, మంజులాపూర్ కంపెనీ అమర్చిన సైలెన్సర్లు మార్చుతూ.. ద్విచక్ర వాహనానికి కంపెనీ అమర్చిన సైలెన్సర్లు మాడిపై చేస్తున్నారా..? అయితే మీకు షాక్ ఇచ్చేందుకు పట్టణ పోలీసులు సిద్ధమయ్యారు. శబ్ద కాలు ష్యంపై ప్రత్యేక దృష్టిసారించిన పోలీసులు అధిక శబ్దాలు చేసే వారి వాహనాల పని పడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వారి వాహనాలు సీజ్ చేస్తున్నారు. రోడ్డు రోలర్‌తో తొక్కిస్తూ.. అధిక సౌండ్ చేసే బైక్‌లను పట్టుకుని వాటి సైలెన్సర్లను తొలగించి పట్టణ నడి ఒడ్డున గల చౌరస్తాలో రోడ్‌రోలర్‌తో వాటిని పోలీసులు తొక్కించి నుజ్జునుజ్జు చేయిస్తున్నారు. 2023లో ఇప్పటివరకు 126 సై లెన్సర్లను తొలగించారు. ఇందులో నుంచి 100 ద్వి చక్ర వాహనాలకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు. మిగతా 26 ద్విచక్ర వాహనాలను ఆర్టీ వోకు అప్పజెప్పారు. దీంతో ఆర్టీవో ఒక్కొక్క వాహనానికి రూ.5వేల చొప్పున జరిమానా విధించారు. కొన్ని ద్విచక్ర వాహనాలకు పలువురు నేటికీ అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు పెట్టుకొని తిరుగుతున్నారు. శబ్ద కాలుష్యంపై ఫిర్యాదులు.. ఖరీదైన ద్విచక్ర వాహనాలు నడిపేవారు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు వాడుతున్నారని నిర్మల్‌లో ఫి ర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి సైలెన్సర్లు వాడడంతో శబ్ద కాలుష్యంతో పాటు, వృద్ధుల ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడనుంది. అంతేకాకుండా రో డ్డుపై వెళ్లే మిగతా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరుతున్నారు. విక్రయదారులపై చర్యలు శూన్యం.. మార్కెట్లో విచ్చలవిడిగా మెకానిక్ షాపుల్లో అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు విక్రయిస్తున్నారు. మొదట గా సైలెన్సర్లు విక్రయించే షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను వేడుకుంటున్నారు. వారిపై చర్యలు తీసుకుంటే అమ్మడం ఆపేస్తారని సూచిస్తున్నారు. పోలీసులు వారిని కట్టడి చేస్తే ఎవరు అధిక సౌండ్ వచ్చే సైలెన్సర్లు అమర్చుకోలేరని వాపోతున్నారు. -
అమ్మవారిని దర్శించుకున్న 'మాజీ మిస్ ఇండియా'..!
ఆదిలాబాద్: మాజీ మిస్ ఇండియా, తెలంగాణ ఐటీ హబ్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాగూర్ బుధవారం కుటుంబసమేతంగా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేసి, అమ్మవారి శేష వస్త్రంతో ఆశీర్వచనాలు అందజేశారు. -
మస్టర్ ఒకరిది! డ్యూటీలో మరొకరు!! అంతలోనే..
మంచిర్యాల: సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా అధికారుల పర్యవేక్షణ లోపంతో.. కార్మికుడి స్థానంలో మరొకరు విధులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం సంస్థ వ్యాప్తంగా సంచలనమైంది. సమాచారం అందుకున్న అధికారులు గని అధికారికి చార్జి మెమో జారీ చేసినట్లు తెలిసింది. ఉద్యోగులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏరియాలోని కేకే–5 గనిలో టెక్నికల్ ఉద్యోగి విధి నిర్వహణకు 15 రోజుల క్రితం గనిపైకి వచ్చి మస్టర్ పడ్డాడు. ఆరోజు ఆదివారం కావడంతో సహోద్యోగులు దావత్ ఏర్పాటు చేశారు. ఈమేరకు విధులకు వచ్చిన కార్మికుడికి కూడా సమాచారం అందించారు. దీంతో సదరు కార్మికుడు విధులకు డుమ్మా కొట్టలేక ఆ గనిలోనే విధులు నిర్వహించే మరో టెక్నికల్ ఉద్యోగిని పిలిపించి అతడితో డ్యూటీ చేయించాడు. ఈ విషయం ఇటీవల బయటకు వచ్చింది. విధులు నిర్వహించిన ఉద్యోగికి గని అధికారి నోటీస్ జారీ చేసినట్లు సమాచారం. సింగరేణి చరిత్రలో మస్టర్ ఒకరు పడి విధులు మరొకరు చేయడం ఇంత వరకు ఎరిగి ఉండమని, విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా ఉండేదని అధికారుల తీరుపై పలువురు మండిపడుతున్నారు. -
‘బలగం’ మూవీ.. సర్పంచ్‌కు కన్నీటి వీడ్కోలు..!
కరీంనగర్: బలగం సినిమాలో సర్పంచ్‌గా నటించిన కీసరి నర్సింగం అంత్యక్రియలు బుధవారం అభిమానుల కన్నీటి మధ్య పూర్తయ్యాయి. కోనరావుపేట మండలం నాగారం గ్రామానికి చెందిన కీసరి నర్సింగం కొన్నేళ్లుగా నాటక ప్రదర్శనలు చేస్తూ గుర్తింపు పొందారు. ఇటీవల వేణు డైరెక్షన్లో వచ్చిన బలగం సినిమాలో సర్పంచ్‌గా నటించి అందరి ప్రశంసలు పొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారుల సంఘం ప్రధానకార్యదర్శిగా పనిచేస్తున్న నర్సింగం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందారు. నర్సింగంకు భార్య భూమవ్వ, కుమారుడు శ్రీనివాస్, కూతురు అంజలి ఉన్నారు. అంత్యక్రియల్లో జెడ్పీచైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, వైఎస్సార్టీపీ జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, డీపీఆర్వో మామిండ్ల దశరథం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు, సర్పంచ్ లావణ్య–శ్రీనివాస్, బీజేపీ జిల్లా కార్యదర్శి గోపాడి సురేందర్‌రా వు, మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్, నాయకులు రాఘవరెడ్డి, పిట్టల భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మ్యుటేషన్ పంచాయితీ..! సమస్య ఏంటి..?
కరీంనగర్: ఇది పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలోని పరిస్థితే కాదు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెలకొన్న దుస్థితి. ఆస్తులు తమవే అయినా.. పేర్లు మారకపోవడం.. యజమానులు మరణించడం.. వెరిసి ఏంచేయాలో తెలియక వారసులు సతమతమవుతున్నారు. మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. అసలేం జరిగింది? ఒకప్పుడు గ్రామాల్లో ఆస్తుల బదిలీ రెండు రకాలుగా జరిగేది. మొదటిది వారసుల పేరు మీదికి.. రెండోది ఇంటిని కొన్న వారి పేర మ్యుటేట్ అయ్యేవి. ఇందుకు సంబంధించిన ‘ఇ–పంచాయత్’ వెబ్సైట్లో మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకునేవారు. ఇందుకోసం రెండు ఆప్షన్లు అందుబాటులో ఉండేవి. అందులో మొదటిది విరాసత్, రెండోది కోర్టు డిక్రీ. ఇందులో ఇంటి యజమానులు తమ ఆస్తులను విరాసత్ దరఖాస్తు ద్వారా వారసులకు ఇచ్చేవారు. రెండు కొనుగోలు చేసుకున్న వారు కోర్టు డిక్రీ ద్వారా దరఖాస్తు చేసుకునేవారు. ఈ దరఖాస్తులను గ్రామ పంచాయతీ సెక్రటరీ విచారణ జరిపిన తర్వాత ఆస్తి మ్యుటేట్ అయ్యేది. గతంలో ఎడిట్ ఆప్షన్ ఉండేది. దీంతో ఏమైనా తప్పులు ఉన్నా దాన్ని అక్కడే పరిష్కరించుకునేవారు. ఇది చాలా వేగవంతమైన ప్రక్రియ తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తయ్యేది. ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుంచి టీఎస్, బీపాస్ అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం.. గ్రాపపంచాయతీ ఆస్తుల రిజిస్ట్రేషన్లు అన్నీ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే జరుగుతున్నాయి. దీంతో ‘ఇ–పంచాయత్’ వెబ్సైట్లో విరాసత్, కోర్టు డిక్రీ ఆప్షన్లు మాయమయ్యాయి. ఫలితంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది ఇళ్లు బదిలీ కాక అలాగే మిగిలిపోతున్నాయి. సమస్య ఏంటి? నాలుగు జిల్లాల్లోని గ్రామాల్లో వేలాది ఇండ్లకు సరైన ధ్రువపత్రాలు లేవు. దశాబ్దాల తరబడి వారసత్వంగా ఇండ్లు చేతులు మారుతున్నాయి. వాటికి ఇంటి నెంబర్లు ఉంటాయి. ఏటా ఇంటి పన్నులు కడుతారు. కానీ.. ఆ ఇల్లు కొన్నట్లు, కట్టినట్లు ఎలాంటి పత్రాలు లేవు. వాస్తవానికి గ్రామపంచాయతీల ఆవిర్భవానికి ముందు నుంచే ఆ ఇళ్లు మనుగడలో ఉన్నాయి. ఇలాంటి ఇళ్ల పరిస్థితుల్లో ప్రధానమైన చిక్కులు తలెత్తుతున్నాయి. అడ్డంకులివే.. ► ఇంటి యజమానులు లేకుంటే ఆ ఇళ్లు వారసుల పేరిట బదిలీ కావడం లేదు. యజమాని బతికుంటే విరాసత్ సజావుగా సాగుతున్నాయి. ► ఇంటి నెంబరు, ఇంటి పన్నులు కట్టిన కాగితాలు తప్ప ఇంటికి సంబంధించిన ఇతర డాక్యుమెంట్లు ఏవీ లేని ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ► ఉమ్మడి జిల్లాలో నాలుగేళ్లు.. అంతకుముందు సరైన డాక్యుమెంట్లు లేని ఇండ్లను చాలామందే కొనుగోలు చేశారు. వీటిలో చాలామటుకు మ్యుటేషన్ కాలేదు. టీఎస్ బీపాస్‌తో ఆస్తులు మ్యుటేషన్ కాకపోవడంతో ఆఫీసర్లు పక్కన పెడుతున్నారు. ► గతంలో రేకుల ఇల్లు/ పెంకుటిల్లును కూల్చి, గ్రామంలో కొత్తగా జీ 2 నిర్మించుకున్నా సరే ఆన్లైన్లో ఇంకా పాత రేకుల ఇల్లు/ పెంకుటిల్లుగానే చూపెడుతోంది. ‘ఎడిట్’ ఆప్షన్ లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. దీంతో అన్ని అనుమతులతో ఇల్లు నిర్మించుకున్న యజమానులు, పన్నులు రాక పంచాయతీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇబ్బందులివీ.. ► కుటుంబ అవసరాలకు ఇంటిని విక్రయించాలనుకుంటున్న వారికి పేరుమార్పిడి నిబంధన ఇబ్బందికరంగా మారింది. ► పెళ్లీళ్లు, అనారోగ్య కారణాలతో సతమతమవుతున్న వారు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ► ఆస్తులు అమ్మాలనుకుంటున్న వారు పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు, వార్డు మెంబర్ల చూట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ► వృద్ధులు, నిరక్షరాస్యులు ఏంతెలియక సతమతమవుతున్నారు. ఇంకొన్నిచోట్ల ఇదే అదనుగా కొందరు ఇదిచేస్తాం.. అదిచేస్తామంటూ చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. ► గతంలో ఇంటిని కొన్నాక.. ఇప్పుడు మ్యుటేషన్ కాకపోవడంతో కొనుగోలుదారుడు, విక్రయదా రుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పేరు మారని ఆస్తులు మాకేందుకంటూ నిలదీస్తున్నారు. -
గాంధీ జంక్షన్లో.. బల్దియా అధికారుల కాకి లెక్కలు..
కరీంనగర్: 715 ఫీట్లలోతులో బోర్వెల్.. 492 ఫీట్ల మేర కేసింగ్ పైప్.. ఇది నగరంలోని కిసాన్‌నగర్ గాంధీ జంక్షన్ వద్ద వేసిన అధికారులు వేసిన బోర్వెల్ లెక్కలు. జంక్షన్ అభివృద్ధిలో భా గంగా ఇటీవల వేసిన బోర్వెల్కు సంబంధించిన లెక్కలు నగరపాలకసంస్థలో జరుగుతున్న అక్రమాలను తారాస్థాయికి తీసుకుపోయాయి. అవడానికి చిన్నబిల్లు అయినా, వేసిన కేసింగ్ పైప్ లెక్కలు చూసి కాంట్రాక్టర్లు కళ్లు తేలేస్తున్నారు. సింగరేణి మి నహా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోనే ఇంత లోతులో కేసింగ్ పైప్‌లైన్ వేసిన దాఖలాలు లేవని బోర్వెల్ యజమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 175 ఫీట్లలోతులో బోరు.. నగరంలోని కూడళ్ల ఆధునీకరణలో భాగంగా కిసాన్‌నగర్ గాంధీ జంక్షన్‌ను అభివృద్ధి చేసి నాలు గు నెలల క్రితం ప్రారంభించారు. జంక్షన్ అభివృద్ధిలో భాగంగా అక్కడ బోర్వెల్ వేశారు. ఈ బోర్ వెల్‌కు సంబంధించిన చెల్లింపులే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న ఎంబీ రికార్డ్ ప్రతులతో ఈ బోర్ 715 ఫీట్లు (218 మీటర్లు) వేసినట్లు, 492 ఫీట్ల (150 మీటర్లు) కేసింగ్పైప్ వేసినట్లు తేలింది. మట్టి వదులుగా ఉన్న ప్రాంతాల్లో కూడా 50, 60 ఫీట్లకు మించి కేసింగ్ వేయరు. గోదావరిఖని, మంచిర్యాల లాంటి సింగరేణి ప్రాంతాల్లో మాత్రమే కేసింగ్ పైప్‌లు ఎక్కువగా వేస్తారు. కానీ కరీంనగర్ సిటీలో ఈ స్థాయిలో కేసింగ్ పైప్‌లు వేసిన చరిత్ర ఇప్పటివరకు లేదని బోర్వెల్ యజమానులంటున్నారు. తాము ఇప్పటివరకు 492 ఫీట్ల కేసింగ్ పైప్ అనే ముచ్చటే వినలేదని ఆశ్చర్యపోతున్నారు. గ్రానైట్ పనులు నిత్యం నడిచే బావుపేట ప్రాంతంలో కూడా 70, 80 ఫీట్లకు మించి కేసింగ్ వేయలేదంటున్నారు. తన 35ఏళ్ల సీనియార్టీలో వంద ఫీట్ల కేసింగ్ పైప్ ఒక్కసారి కూడా వేయలేదని నగరానికి చెందిన ఓ సీనియర్ బోర్వెల్ యజమాని పేర్కొన్నారు. అవినీ తిలో చరిత్ర సృష్టించే ఘనత వహించిన కొంతమంది అధికారులు ఇష్టారీతిన చేస్తున్న అంచనాలు, బిల్లుల వ్యవహారానికి ఇది సజీవ తార్కాణం. సున్నా జత చేశారా...? చేసిన పనులకు సంబంధించిన బిల్లులకు సున్నా జత చేశారా అనే చర్చ సాగుతోంది. అక్కడ 15 మీటర్ల మేరనే కేసింగ్ పైప్ వేశారని, దానికి సున్నా జత చేసి 150 మీటర్లుగా రాశారని, అలాగే రూ.9,060 బిల్ అయితే సున్నా కలిపి రూ.90,600 గా మార్చారనే ఆరోపణలు వినవస్తున్నాయి. గతంలోనూ ఈ జంక్షన్లో గాంధీ విగ్రహాల కొనుగోలుపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా బోర్వెల్ లెక్కల్లో నమ్మలేని పనులు జరిగినట్లు బిల్లులు సృష్టించడం కలకలం సృష్టిస్తోంది. దీనిపై సమగ్రవిచారణ నిర్వహిస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలాఉంటే బోర్వెల్ కేసింగ్ పైప్ వ్యవహారంపై ఇంజినీరింగ్ అధికారులు స్పందించలేదు. ముందుగా తమ పరిధిలోకి రాదంటూ దాటవేశారు. సంబంధిత ఏఈ విషయం విన్న తరువాత స్పందించడం మానేశారు. -
భద్రాద్రి రామయ్య భక్తులకు.. రైల్వేశాఖ తీపి కబురు!
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి రామయ్య భక్తులకు రైల్వేశాఖ తీపి కబురు చెప్పింది. రామయ్య చెంతకు రైలు సౌకర్యం కల్పించే భద్రాచలం – మల్కన్‌గిరి (ఒడిశా) మార్గం నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైలుమార్గం నిర్మాణానికి ఫైనల్ లోకేషన్ సర్వేను మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్గొండ జిల్లాలో 4000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు సింగరేణి బొగ్గును మరింత వేగంగా వ్యాగన్ల ద్వారా సరఫరా చేసే లక్ష్యంతో డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వై లైన్‌కు రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మార్గానికి కూడా ఫైనల్ లొకేషన్ సర్వేను మంజూరు చేసింది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే బొగ్గు రవాణాలో డోర్నకల్ – భద్రాచలంరోడ్ బ్రాంచ్‌లైన్ మరింత కీలకంగా మారుతుంది. కొత్తగూడెం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని ఐరన్ ఓర్ గనులకు కేంద్రమైన కిరోండల్ వరకు కొత్త రైలు మార్గం నిర్మాణానికి ఫైనల్ లొకేషన్ సర్వేకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కొత్తగూడెం – కిరోండల్ మధ్య దూరం కేవలం 180 కిలోమీటర్లుగా ఉంది. ప్రస్తుతం కిరోండల్‌కు విశాఖపట్నం నుంచి మాత్రమే రైలుమార్గం అందుబాటులో ఉంది. ఈ మార్గం నిడివి 440 కి.మీ. దీంతో దగ్గరి దారిగా కొత్తగూడెం నుంచి కిరండోల్‌కు రైలుమార్గాన్ని నిర్మిస్తామంటూ 2014 – 15 సంవత్సర బడ్జెట్లో రైల్వేశాఖ ప్రకటించింది. సర్వే కోసం కేవలం రూ.10 లక్షలు మంజూరు చేసి చేతులు దులుపుకుంది. ఆ తర్వాత ప్రాథమిక సర్వేను 2018 బడ్జెట్లో మంజూరు చేసింది. తాజాగా ఫైనల్ సర్వే రిపోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. భద్రాలచం – మల్కన్‌గిరి రైల్వేలైన్ తెలంగాణ – ఆంధ్రా మీదుగా ఒడిశాకు వెళ్తుండగా కొత్తగూడెం – కిరోండల్ మార్గం తెలంగాణ మీదుగా నేరుగా ఛత్తీస్‌గఢ్ వెళ్లేలా నిర్మించే అవకాశం ఉంది. ప్రాథమిక సర్వేకు ఏడాది.. దట్టమైన ఏజెన్సీ ప్రాంతాలైన తెలంగాణలోని భద్రాచలం (పాండురంగాపురం రైల్వేస్టేషన్) నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరిని కలుపుతూ కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వేశాఖ 2021లో పచ్చజెండా ఊపింది. ఈ రెండు పట్టణాల మధ్య 173 కిలోమీటర్ల మేర లైన్ నిర్మించేందుకు ప్రాథమిక సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.3 కోట్లు కేటాయించింది. ఏడాది పాటు జరిగిన ప్రాథమిక సర్వే రిపోర్ట్ 2022 జూన్‌లో వచ్చింది. ఇందులో ఒడిశాలోని మల్కన్‌గిరిలో బయలుదేరితే.. బదాలి, కోవాసిగూడ, రాజన్‌గూడ, మహరాజ్‌పల్లి స్టేషన్లు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో కన్నాపురం, కూటుగుట్ట, పల్లు, నందిగామ స్టేషన్లు ఉన్నాయి. తెలంగాణ పరిధిలో భద్రాచలం, పాండురంగాపురంలో స్టేషన్లు నిర్మించాలని సర్వేలో పేర్కొన్నారు. ఈ రైలు మార్గం దారిలో గోదావరి, శబరితో పాటు చిన్నా పెద్దా కలిపి 213 వంతెనలు నిర్మించాల్సి వస్తుందని తేల్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,592 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ లైన్‌కు సంబంధించి ప్రాథమిక రిపోర్టు వచ్చి ఏడాది దాటింది. అప్పటి నుంచి ఈ రైల్వేలైన్ నిర్మాణంపై ఉలుకూపలుకు లేదు. దీంతో భద్రాచలంరోడ్ – కొవ్వూరు, కొత్తగూడెం – కొండపల్లి, మణుగూరు – రామగుండం రైల్వేలైన్ల తరహాలో ఇది కూడా సర్వేలకే పరిమితం అవుతుందనే భావన జిల్లా వాసుల్లో ఏర్పడింది. ఫైనల్ లొకేషన్ సర్వే.. దేశవ్యాప్తంగా ప్రాథమిక సర్వే రిపోర్టులను పరిశీలించిన రైల్వేశాఖ అందులో ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించి ఏ ప్రాజెక్టును నిర్మించాలనే నిర్ణయం తీసుకుంటుంది. ఒకసారి ఫలానా రైల్వే లైన్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత బడ్జెట్ కేటాయింపునకు ముందు ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్) చేపడుతుంది. ఈ సర్వేలో మరింత స్పష్టంగా వివరాలు సేకరిస్తుంది. అందులో రైలుమార్గం వెళ్లే దారిలో వర్షాల ప్రభావం, వరద, కాంటూరు లెవల్స్, వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి ఎలాంటి డిజైన్ ఉపయోగించాలి, నిర్మాణ ప్రదేశాలకు మ్యాన్ పవర్‌ను ఎలా పంపాలి, వారికి ఎక్కడ బస ఏర్పాటు చేయాలి, నిర్మాణ సామగ్రిని చేరవేయడం ఎలా అనే ప్రతీ అంశంలో క్షుణ్ణంగా వివరాలు సేకరించి రిపోర్ట్ తయారు చేస్తారు. దీని ఆధారంగా మొత్తం పనిని పలు బిట్లుగా విభజించి నిధులు మంజూరు చేస్తారు. రెండేళ్లలో పనులు.. రైల్వే లైన్ నిర్మించే మార్గంలో ఉండే భౌగోళిక అననుకూలతలను బట్టి ఫైనల్ లొకేషన్ సర్వేకు ఎంత సమయం పడుతుందనేది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఏడాదిలోగానే రైల్వేశాఖ ఫైనల్ సర్వేను పూర్తి చేస్తుంది. ఆ తర్వాత ఫైల్ రైల్వే బోర్డుకు చేరుతుంది. అక్కడ ఆర్థిక పరమైన మదింపు తర్వాత నిధులు కేటాయిస్తారు. ప్రస్తుత రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒడిశాకు చెందినవారు కావడంతో మల్కన్‌గిరి – భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో పురోగతి వేగంగా సాగుతోంది. ఇదే స్పీడ్ కొనసాగితే మరో రెండేళ్లలో ఈ రైలుమార్గం నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే భద్రాచలం నుంచి దేశంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలకు కొత్త రైళ్లను ప్రారంభించే అవకాశం కలుగుతుంది. ఫలితంగా జిల్లా వాసులకు రైలు ప్రయాణ సౌకర్యం మరింత విస్తృతం కానుంది. -
వెంటనే ఉత్తరం రాస్తే.. ఈ బహుమతి మీకే..!
ఆదిలాబాద్: నేటి సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్, ఈ–మెయిల్స్, వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నారు. ఐదు దశాబ్దాల ముందుకు వెళ్తే ఉత్తర ప్రత్యుత్తరాలు కేవలం లేఖల ద్వారానే జరిగాయి. దూరప్రాంతాల్లో ఉన్న వారి క్షేమ సమాచారాన్ని ఉత్తరం, టెలిఫోన్, టెలిగ్రామ్ ద్వారా తెలుసుకునే పరిస్థితి ఉండేది. సెల్‌ఫోన్ వినియోగం.. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడకం తర్వాత సమాచార వ్యవస్థలో విప్లవం వచ్చిందని చెప్పవచ్చు. నేటి తరానికి ఇంచుమించుగా ఉత్తరం అంటే తెలియని పరిస్థితి ఉంది. అందుకే ఉత్తరాన్ని తిరిగి పరిచయం చేసేందుకు, తెలిసిన వారికి మరోసారి గుర్తు చేసేందుకు తపాలాశాఖ నడుం బిగించింది. లేఖరులకు పోటీ పెడుతోంది. ‘డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా’.. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఉత్తరాలకు ప్రాధాన్యం తగ్గింది. దూర ప్రాంతాల్లో ఉన్న వారి క్షేమ సమాచారం తెలియజేయాలన్నా, వ్యాపార అవసరాల ని మిత్తం సమాచారం పంపించాలన్నా ఒకప్పుడు పె న్ను, పేపరు తీసుకుని లేఖలు రాసేవారు. ఇప్పుడా పరిస్థితి ఎక్కడా కానరాదు. మొబైల్ ఫోన్ ద్వారా స మస్త సమాచారాన్ని క్షణాల్లో వివిధ మార్గాల్లో చేరవేస్తున్నారు. ఫోన్లోనే ప్రత్యక్షంగా వాయిస్ కాల్, వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకునే పరిస్థితి ఉంది. ఖండాంతరాల్లో ఉన్న వారితో సైతం వీడియో కాల్ ద్వారా మాట్లాడే పరిస్థితి ఉండడంతో లేఖల ద్వారా ఉత్తర, ప్రత్యుత్తరాలు మర్చిపోయిన పరిస్థితి ఉంది. ఒకప్పటి సమాచార సాధనమైన ఉత్తరాన్ని నేటి యువతరానికి గుర్తు చేసేందుకు తపాలా శాఖ లేఖారచన పోటీలకు శ్రీకారం చుట్టింది. ‘డిజిటల్ ఇండియా ఫర్ న్యూ ఇండియా’ అనే అంశంపై లేఖలను ఆహ్వానిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ‘థాయి ఆఖర్’ పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. బహుమతులు ఇలా.. రెండు కేటగిరీల వారీగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో విజేతలను ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో ఒక్కో విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి 12 మందికి మించకుండా ప్రథమ రూ.25 వేలు, ద్వితీయ రూ.10 వేలు, తృతీయ బహుమతి రూ.5వేలు, జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ రూ.50 వేలు, ద్వితీయ రూ.25 వేలు, తృతీయ రూ.10 వేల నగదు అందజేస్తారు. సద్వినియోగం చేసుకోవాలి.. పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సదవకాశం. వయసుతో పనిలేకుండా ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇచ్చిన అంశానికి సంబంధించి స్వదస్తూరితో వ్యాసం రాసి పోస్ట్ చేయాలి. – ఎన్.అనిల్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తపాలా శాఖ పర్యవేక్షకులు రెండు విభాగాల్లో.. ఈ పోటీల్లో భారతదేశ పౌరులు పాల్గొనవచ్చు. 18 ఏళ్ల లోపు వారికి ఒక కేటగిరీ, ఆపై వారిని మరో కేటగిరీగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లో వ్యాసం రాయవచ్చు. డిజిటల్ విధానంలో పాలన, మౌలిక సదుపాయాలు, అక్షరాస్యత, డిజిటల్ పేమెంట్స్ తదితర అంశాలను అందులో పొందుపర్చారు. ఎ4 సైజ్ పేపరుపై రాసి ఎన్వలప్ కవర్లో పంపించవచ్చు. ఎన్వలప్ కవర్ అయితే వెయ్యి పదాలకు మించకుండా, ఇన్‌ల్యాండ్ లెటర్ అయితే 500 పదాలకు మించకుండా రాయాల్సి ఉంటుంది. కంప్యూటర్, ఇతర ఎలక్ట్రానిక్స్ సాధనాల్లో టైప్ చేసిన లేఖలను పోటీకి అనుమతించరు. వ్యాసం చేతితో మాత్రమే రాసి పంపించాలి. లేఖలు పంపించేవారు వారి వయసును నిర్ధారిస్తూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. పోటీలో గెలిస్తే వారి వయస్సు, ఐడీ ధ్రువీకరణకు అవసరమైన పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా రాసిన ఉత్తరాలను ఎస్పీవోఎస్, ఆదిలాబాద్ డివిజన్ చిరునామాకు అక్టోబరు 31లోగా పంపించాలి. -
వెంకూర్లో తోడేలు కలకలం..! ఒక్కసారిగా షాక్..!!
ఆదిలాబాద్: మండలంలోని పాత వెంకూర్ శివారులోని వాగు సమీపంలో మంగళవారం యువకుడినూ, ఎద్దుపై దాడి చేసింది. స్థానికుల వివరాల మేరకు... వెంకూర్ గ్రామానికి చెందిన రేకుల బద్రి, అతడి బావమర్ది శివతో కలిసి వ్యవసాయ పనులు ముగించుకొని పశువులను మేపుతున్నాడు. ఒకసారిగా తోడేలు బద్రిపై దాడిచేసింది. దీంతో అతడు చేతులతో పక్కకు పడేశాడు. దీంతో అక్కడే ఉన్న ఎద్దుపై దాడికి పాల్పడింది. దీంతో బద్రి, శివ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయింది. కుటుంబ సభ్యులు బద్రిని స్థానిక వైద్యశాలకు తరలించగా.. అవసరమైన మందులు లేకపోవడంతో నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. డీఆర్వో రేష్మ, ఎఫ్‌బీవో స్రవంతి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తోడేలు పాదముద్రలుగా అధికారులు గుర్తించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. -
రిమ్స్ మళ్లీ తెరపైకి.. స్టాఫ్‌నర్సుల నుంచి డబ్బులు వసూలు!
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ తరచూ వివాదంలోకి ఎక్కుతోంది. ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కొంతమంది ఉద్యోగుల తీరు మాత్రం మారడం లేదు. లంచం తీసుకుంటూ బయటపడుతున్నప్పటికీ నవ్వి పోదురుగా.. మాకేమిటి అన్న చందంగా మారింది వీరి పరిస్థితి. ప్రభుత్వం నుంచి రూ.వేలల్లో వేతనం తీసుకుంటున్నా అది చాలదనట్టుగా తోటి ఉద్యోగులను వేధించడం, డబ్బులు ఇస్తే గాని ఫైల్ కదలనివ్వడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా రిమ్స్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో కొంతమంది ఉద్యోగులు ముడుపులు ఇస్తే కానీ ఏ ఫైల్‌ను ముట్టడం లేదని కొంతమంది కాంట్రాక్ట్, అవుట్‌సో ర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగులు తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. గతంలో ఓ ఇద్దరు ఉద్యోగులు స్టాఫ్ నర్సుల నుంచి డబ్బులు తీసుకొని సస్పెన్షన్‌కు గురైన విషయాన్ని మరవక ముందే మరో ఉద్యోగి వసూళ్ల దందాలో తెరపైకి రావడం రిమ్స్‌లో చర్చనీయాంశంగా మారింది. స్టాఫ్‌నర్సుల నుంచి వసూళ్లు.. రిమ్స్‌లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల నుంచి ఓ ఉద్యోగి రూ.1లక్ష 40వేలు వసూలు చేసినట్లు అక్క డ పనిచేస్తున్న కొంతమంది బాధితులు చెబుతున్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన వీరికి ఫిబ్రవరిలో 12 సంవత్సరాల ఇంక్రిమెంట్ రావాల్సి ఉంది. అయితే వీరికి ఇంక్రిమెంట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని సదరు ఉద్యోగి వీరి దృష్టికి తీసుకొచ్చారు. మొదట రూ.2వేలు ఇవ్వాలని చెప్పారు. ఆ తర్వాత వెయ్యి పెంచి రూ.3వేలు అడగగా, చివరగా మరో వెయ్యి పెంచి రూ.4వేలకు ఒప్పందం కుదిరింది. డబ్బులు వసూలుకు సామాజిక మాధ్యమం (వాట్సాప్)లో ఏకంగా ఓ గ్రూప్ ఏర్పాటు చేశారు. అందులో మెస్సేజ్ రూపంలో డబ్బులు ఇవ్వాలని పోస్టులు పెడుతున్నారు. స్టాఫ్‌నర్సుగా పనిచేసే ఓ ఉద్యోగి నగదు రూపంలో వీటిని వసూలు చేసి సదరు ఉద్యోగికి ముట్టజెప్పినట్లు సమాచారం. మొత్తం 36 మందికి గాను 35 మంది డబ్బులు ఇచ్చినట్లు పేపర్‌పై రాసుకొని గ్రూప్‌లో వేశారు. ఇంక్రిమెంట్ కాకపోతే పీఆర్సీ, ఐఆర్‌లో తమ వేతనం పెరగదని భయంతో వారికి డబ్బులు ముట్టజెప్పాల్సి వచ్చిందని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ గ్రూప్‌ను డిలీట్ చేశారు. అయితే డబ్బులు వసూలు చేసిన తర్వాత ఉద్యోగి టేబుల్‌పై పెట్టిన ఫొటోలు, గ్రూప్ చాటింగ్ మెస్సేజ్‌లు బయటకు రావడంతో సదరు ఉద్యోగి అయోమయానికి గురవుతున్నారు. మంగళవారం ఆ ఉద్యోగి స్టాఫ్ నర్సులందరినీ పిలిపించి ఈ విషయం మన మధ్యలోనే ఉండాలని, తనకు డబ్బులిచ్చింది ఎవరికి చెప్పవద్దని వారికి సూచించారు. లేకపోతే మీ పని కాదని, తర్వాత మీరే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారిని హెచ్చరించడం గమనార్హం. అయితే విషయం బయటకు పొక్కడంతో ఎవరు బయటకు లీక్ చేశారంటూ ఆరా తీసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. సర్వీసు బుక్‌లో వివరాలు నమోదుకు గాను 2021లో కొత్తగా రిక్రూట్మెంట్ అయిన స్టాఫ్ నర్సుల నుంచి రిమ్స్‌లో కొంతమంది ఉద్యోగులు డబ్బులు వసూలు చేసిన విషయం తెలిసిందే. ‘సాక్షి’ కథనానికి స్పందించిన అప్పటి కలెక్టర్ ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. రిమ్స్‌లో స్టాఫ్ నర్సుల నుంచి ఓ అధికారి డబ్బులు వసూలు చేశారు. తన బర్త్‌డే సందర్భంగా కానుకలు తీసుకున్న విషయం విదితమే. తర్వాత అధికారులు సదరు అధికారిపై విచారణ చేపట్టినప్పటికీ ఎలాంటి చర్యలకు పూనుకోలేదు. తన కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇప్పిస్తానని రిమ్స్‌లో పనిచేసే ఓ ల్యాబ్ అసిస్టెంట్ నుంచి మరో ల్యాబ్ అసిస్టెంట్ రూ.లక్ష 50వేలు వసూలు చేశారు. ఈ విషయంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అందులో నుంచి కొంత డబ్బులు బాధితుడికి తిరిగివ్వడం జరిగింది. అయితే సదరు ఉద్యోగి నెలలు గడుస్తున్నా ఇంకా విధులకు హాజరుకాకపోవవడం గమనార్హం. నా దృష్టికి రాలేదు.. రిమ్స్‌లో స్టాఫ్‌నర్సుల ఇంక్రిమెంట్ల కోసం ఓ ఉద్యోగి డబ్బులు వసూలు చేసిన విషయం నా దృష్టికి రాలేదు. స్టాఫ్ నర్సులను పిలిపించి వివరాలు అడిగి తెలుసుకుంటాను. డబ్బులు వసూలు చేసినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఉద్యోగులు ఎవరూ డబ్బులు ఇవ్వొద్దు. ఎవరైనా డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకురావాలి. – జైసింగ్ రాథోడ్, రిమ్స్‌డైరెక్టర్ -
ఏడోసారి ఉత్తమ జాతీయ సహకార బ్యాంకుగా కేడీసీసీబీ ఎంపిక!
కరీంనగర్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మరో కీర్తిని అందుకోంది. ప్రతిష్టాత్మక నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్(నాఫ్స్కాబ్) ఆల్ఇండియా 2020–21కు గానూ రెండవ, 2021–22కు గానూ మొదటి ఉత్తమ అవార్డులు డీసీసీబీ గెలుచుకుంది. దేశంలో 393 డీసీసీబీలలో కరీంనగర్ డీసీసీబీ ఏడో సంవత్సరం ఏడుసార్లు వరుసగా అఖిలభారత అవార్డును కై వసం చేసుకోవడం గమనార్హం. ఈ నెల 26న రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగే కార్యక్రమంలో కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావు అవార్డులు అందుకోనున్నా రు. జాతీయ అవార్డు లభించడంతో నాబార్డు సీజీ ఎం సుఽశీల, టిస్కాబ్ ఎండీ ఎన్.మురళీధర్ అభినందనలు తెలిపారు. కేడీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు దార్శనికత, చైతన్యవంతమైన నా యకత్వంలోని బృందంతోనే సాధ్యమైందని కొని యాడారు. దేశంలోని మొత్తం 393 జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో గత మూడేళ్ల పనితీరును విశ్లేషించిన తరువాత దక్షిణ భారతదేశంలో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లి. ఉత్తమ సహకార బ్యాంకుగా ఎంపిక చేసింది. అవార్డు సాధించినందుకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈవో సత్యనారాయణరావు బ్యాంకు ఉద్యోగులకు, రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే పలు అవార్డులు కేడీసీసీబీ సొంతం.. కేడీసీసీబీ అందిస్తున్న ఉత్తమ సేవలకు గానూ గతంలోనూ పలు అవార్డులు పొందింది. నేషనల్ ఫెడరేషన్స్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంకు(నాస్కాబ్) బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డును అందజేసింది. 2015–16 నుంచి వరుసగా ప్రతిష్టాత్మకమైన అవార్డులు సాధి ంచింది. 2015–16లో ద్వితీయ, 2016–17లో తృతీయ, 2017–18లో ద్వితీయ, 2018–19లో ప్రథ మ బహుమతిని కై వసం చేసుకుంది. 2020–21లో ద్వితీయ, 2021–22లో ప్రథమ బహుమతిని అందుకోనుంది. 2018–19 ఏడాదికి గానూ డెమొక్రాటిక్ మేనేజ్మెంట్, గుడ్ గవర్నెన్స్ విభాగంలో చైర్మ న్ రవీందర్రావు ప్రత్యేక అవార్డు అందుకున్నారు. చొప్పదండికి ప్రత్యేక గుర్తింపు.. చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కూడ జాతీయ అవార్డును కై వసం చేసుకుంది. కరీంనగర్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చొప్పదండి 2021–22 ఆర్థిక సంవత్సరానికి దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన పీఏసీఎస్‌లో నాఫ్క్సాబ్ మొదటి బహుమతిని గెలుచుకుంది. గతంలోనూ 2017–18, 2018–19, 2019–20 ఆర్థిక సంవత్సరాలలో నాఫ్క్సాబ్ జాతీయ అవార్డులను గెలుచుకుంది. -
తునికి నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు.. అసలు ఏమైంది..??
మెదక్: తవ్వినకొద్దీ అక్రమాలే.. అన్నట్లుగా మారింది ఏడుపాయల ఆలయ ఈఓ వ్యవహార శైలి. వనదుర్గామాత ఆభరణాల వ్యవహారం ఇంకా సమసిపోకముందే తునికి నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు విషయం తెరమీదకు వచ్చింది. మొక్కులో భాగంగా 2018లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అమ్మవారికి బంగారు గొలుసును సమర్పించారు. దీనిని అప్పటి ఈఓ శ్రీనివాస్‌కు అప్పగించారు. కాగా ప్రస్తుతం ఆ గొలుసు రికార్డుల్లో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బయటకొచ్చింది ఇలా.. 2016 నుంచి 2019 వరకు కౌడిపల్లి మండలం తునికినల్ల పోచమ్మ ఆలయంలో శ్రీనివాస్ ఈఓగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అమ్మవారికి 5 తులాల బంగారు గొలుసును బహూకరించారు. 2019 జూన్‌లో ఈఓ శ్రీనివాస్ ఏడుపాయల ఆలయానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఎమ్మెల్యే దంపతులు నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి వస్తున్నారని, ఆయన అందించిన బంగారు గొలుసును అమ్మవారికి అలంకరించాలని ఆలయ చైర్మన్ గోపాల్‌రెడ్డి ప్రస్తుత ఈఓ మోహన్‌రెడ్డికి సూచించారు. కాగా.. శ్రీనివాస్ బదిలీ అయిన సమయంలో తనకు చెక్‌బుక్, క్యాష్‌బుక్‌లు మాత్రమే ఇచ్చారని, అమ్మవారి ఆభరణాలు ఏమీ ఇవ్వలేదంటూ మోహన్ రెడ్డి చెప్పడంతో అసలు విషయం బయటకువచ్చింది. ఆలయానికి సంబంధించిన లావాదేవీల వివరాలను ఎందుకు రికార్డు చేయలేదనే ప్రశ్న తలెత్తుతుంది. ఎమ్మెల్యే బహూకరించిన గొలుసునే రికార్డులో లేదంటే మామూలు భక్తులు అందించిన కానుకల మాటేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు విషయంపై ఈఓ సార శ్రీనివాస్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి బంగారు చైన్ బహూకరించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కాగా అది తన సంరక్షణలోనే ఉందని చెప్పడం కొసమెరుపు. -
'భారత ఆహార సంస్థ' కు నాసిరకం బియ్యం అప్పగింత..!
జగిత్యాల: జిల్లాలోని కొందరు రైస్‌మిల్లర్లు భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)కు నాసిరకం బియ్యం అప్పగిస్తున్నారు. రాష్ట్రస్థాయి విజిలెన్స్ బృందాల తనిఖీల్లో ఈ నిజాలు బహిర్గతం కావడంతో జిల్లా అధికారులు అయోమయంలో పడ్డారు. నిజానికి ఐకేపీ, సహకార సంఘాల ద్వారా పౌరసరఫరాల అధికారులు ఏటా రెండు సీజన్లలో రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. దీనిని రైస్‌మిల్లర్లకు అప్పగించి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్)గా మార్చి ఎఫ్‌సీఐకి అందజేస్తున్నా రు. ఇక్కడే కొందరు మిల్లర్లు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మర ఆడించిన బియ్యాన్ని గోదాములకు తరలిస్తున్న సమయంలో పాత బియ్యాన్ని కూడా కొత్తవిగా చూపుతున్నారు. కేసులు నమోదైనా మారని తీరు.. ► జిల్లాలో 2022లో పౌర సరఫరాలు, విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు పలు రైస్‌మిల్లుల్లో చాలాసార్లు తనిఖీలు చేశారు. ► నిబంధనలు అతిక్రమించిన వారిపై 133 కేసులు నమోదు చేశారు. వారినుంచి 4,734 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ► గత జనవరి నుంచి ఇప్పటివరకు 26 కేసులు నమోదు చేసి 275 క్వింటాళ్ల బియ్యం, 4,500 క్వింటాళ్ల ధాన్యం స్వాధీనం చేసుకున్నారు. బయటపడుతున్న నిజాలు.. గతనెల 28న కొడిమ్యాల మండలం నాచుపల్లి శివారు ప్రభుత్వ గోదాముల్లో విజిలెన్స్ అధి కా రులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వచేసిన అనుమానాస్పద బియ్యాన్ని సీజ్‌చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు.. ► నాచుపల్లి ప్రభుత్వ గోదాము పర్యవేక్షణాధికారులను మిల్లర్లు మచ్చిక చేసుకుని పాతవాటినే కొత్త బియ్యంగా అప్పగించారని విజిలెన్స్ తనిఖీల్లో తేలింది. ► 2021–22కి భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) నిబంధనల ప్రకారం రైస్‌మిల్లర్లు పంపించిన రైస్బ్యాగ్పై బ్లూకలర్ దారం ఉండాలి. ► చాప ప్రింటింగ్, స్టిక్కర్, కన్సైన్మెంట్ నంబరు వేయాలి. ► అయితే, ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో అవేమీ కనిపించలేదు. ► వాటిని పాత బియ్యంగానే పరిగణించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు.. రాజకీయ ఒత్తిళ్లతో వెనుకంజ వేస్తున్నారని తెలిసింది. ► 2022–23లో మిల్లర్లు తమ బ్యాగులకు రెడ్‌కలర్ దారం, రెడ్‌కలర్ చాప ప్రింటింగ్, రెడ్‌కలర్ స్టిక్కర్, కన్సైన్మెంట్ నంబరు బ్యాగ్‌పై వేయాలి. ► మొన్నటి తనిఖీల్లో ఇవేమీ కనిపించలేదు. దీంతో అక్కడ జరుగుతున్న అవినీతి బయటపడింది. ► నిబంధనల ప్రకారం.. బియ్యం రీసైక్లింగ్‌ను అరికట్టేందుకు ఒక ఏడాది ఒక కలర్ దారం, చాప, స్టిక్కర్, మరో ఏడాది మరో కలర్ దారం, చాప ప్రింటింగ్, స్టిక్కర్ ఉండాలి. ► చాలామంది మిల్లర్లు గోదాముల్లోని అధికారులను మచ్చిక చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా బియ్యం అప్పగిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు.. నాచుపల్లి గోదాముల్లో అనుమానాస్పద బియ్యం సరఫరా చేసిన మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. తమపై చర్యలు తీసుకోకుండా మిల్లర్లు అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారని తెలిసింది. కేసులు నమోదు చేస్తున్నాం నిబంధనలు పాటించని రైస్మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్నాం. కొడిమ్యాల మండలం నాచుపల్లి గోదాముల్లో తనిఖీలు చేయగా అనుమానిత బియ్యం లభించాయి. వాటిని పరీక్షల నిమిత్తం ల్యామ్‌కు తరలించాం. నివేదికలు రాగానే చర్యలు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి -
కృష్ణానదిలో పర్యాటకుల 'లాంచీ.. రెడీ'..!
మహబూబ్‌నగర్: ఇటీవల కురిసిన వర్షాలకు కృష్ణానదికి వరదలు రావడంతో శ్రీశైలం ప్రాజెక్టులో బ్యాక్‌వాటర్ క్రమంగా పెరుగుతోంది. దీంతో కృష్ణానది తీర ప్రాంతాలు ఆహ్లాదకరంగా మారాయి. నదీ అందాలతోపాటు ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు విచ్చేస్తున్నారు. సోమశిల సమీపంలోని కృష్ణానదిలో పర్యాటకులు విహరించేందు కోసం పర్యాటక శాఖ లాంచీలు ముస్తాబయ్యాయి. సోమశిల సమీప ప్రాంతాలతోపాటు శ్రీశైలం వరకు నదిలో ప్రయాణాలు సాగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిలలో పర్యాటక శాఖ రెండు లాంచీలను ఏర్పాటు చేసింది. ఎనిమిదేళ్ల క్రితం సోమేశ్వర అనే పేరుతో మినీ నాన్ ఏసీ లాంచీని ఏర్పాటు చేసి శ్రీశైలం వరకు నదీ ప్రయాణం కల్పించింది. అప్పట్లో లాంచీ ప్రయాణానికి పర్యాటకులు ఉత్సాహం చూపించారు. పర్యాటకుల తాకిడి పెరగడంతో 2019లో స్వదేశి దర్శన్ నిధులు రూ.2.5 కోట్లతో 120 మంది ప్రయాణించేందుకు వీలుగా మరో ఏసీ లాంచీని ఏర్పాటు చేశారు. దీనినే ప్రస్తుతం సోమశిల నుంచి శ్రీశైలం వరకు నదిలో ప్రయాణించేందుకు వినియోగిస్తున్నారు. మినీ నాన్ ఏసీ సోమేశ్వర లాంచీని మాత్రం సోమశిల పరిసర ప్రాంతాల్లోనే తిప్పుతున్నారు. సోమశిల పరిసరాల్లో.. ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో నదిలోకి నీరు చేరడం ఆలస్యమైంది. కొన్ని రోజులుగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద జలాలు చేరుతుండటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం సోమశిల సమీపంలో పుష్కర ఘాట్ల వద్దకు నీళ్లు చేరుకున్నాయి. దీంతో మినీ నాన్ఏసీ లాంచీ ప్రయాణాలను పర్యాటక శాఖ అధికారులు ప్రారంభించారు. ఇక శ్రీశైలానికి తిప్పే ఏసీ లాంచీ ప్రయాణాలు ప్రారంభమయ్యేందుకు మాత్రం కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. రెండు లాంచీలను శుభ్రం చేసి నది ప్రయాణాలకు సిద్ధంగా ఉంచారు. త్వరలోనే ప్రారంభిస్తాం.. కృష్ణానదిలో పర్యాటకులు విహరించేందుకు లాంచీ ప్రయాణాలు ప్రారంభించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమశిలలోని రెండు లాంచీలను నదీ ప్రయాణాల కోసం అందుబాటులోకి వచ్చాయి. అలాగే శ్రీశైలం టూర్‌కు దాదాపుగా 70 మంది ప్రయాణికులు ఉంటేనే లాంచీ తిప్పుతాం. లేదంటే నిర్వహణ భారం మీదపడుతుంది. మినీ లాంచీ టికెట్ల ధరలో ఇప్పుడు ఎలాంటి మార్పులు లేవు. శ్రీశైలానికి తిప్పే ఏసీ లాంచీ ధరలను ఈనెలాఖరులోగా అధికారులు నిర్ణయిస్తారు. – రాజేష్‌గౌడ్, లాంచీ నిర్వహణ పర్యవేక్షకుడు టూర్‌కు పర్యాటకుల కొరత.. శ్రీశైలం లాంచీని 2019లో ప్రారంభించాక ఇప్పటి వరకు కేవలం 20 సార్లు మాత్రమే సోమశిల– శ్రీశైలం మధ్య తిప్పారు. 2019లో నాలుగు సార్లు, 2020లో 11 సార్లు తిప్పగా.. 2021లో ఒక్కసారి కూడా తిప్పలేదు. 2022లో మాత్రం 5 సార్లు లాంచీ ప్రయాణం సాగింది. శ్రీశైలానికి లాంచీలో ప్రయాణించాలంటే కనీసం 70 మంది ప్రయాణికులు ఉండాలి. లేదా రూ.1.30 లక్షలకు పైగా చార్జీల రూపంలో చెల్లించాలి. అలా అయితేనే లాంచీ ప్రయాణం ప్రారంభిస్తారు. అంతమంది ఒకేసారి రాకపోవడంతో ఆశించిన స్థాయిలో శ్రీశైలం టూర్ ప్రయాణాలు పెద్దగా సాగడం లేదు. పాతాళగంగ వరకు.. సోమశిల నుంచి శ్రీశైలం వరకు పర్యాటకులను తీసుకువెళ్లేందుకు ఏసీ లాంచీ ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పుడు అది శ్రీశైలం వరకు కాకుండా ఈగలపెంట వద్దే ఆపుతున్నారు. అక్కడి నుంచి మరో 21 కి.మీ., మేరకు బస్సులో ప్రయాణించి శ్రీశైలం చేరుకోవాల్సి ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సరిహద్దుల కారణంగా పర్యాటక శాఖ లాంచీ పాతాళగంగ వద్దకు వెళ్లడం లేదు. పర్యాటక శాఖ అధికారులు స్పందించి పాతాళగంగ వద్దకు పర్యాటకులను చేర్చేలా చర్యలు చేపట్టాలి. అలాగే నదీ ప్రయాణంలో ఒకటి లేదా రెండుచోట్ల కొద్దిసేపు పర్యాటకులు విరామం తీసుకునేలా షెల్టర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – శ్రీనివాసులు, కొల్లాపూర్ మినీ లాంచీకి డిమాండ్.. సోమశిల పరిసరాల్లో మాత్రమే తిప్పే సోమేశ్వర లాంచీ (మినీ నాన్ఏసీ లాంచీ)లో విహరించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ లాంచీలో 15 నిమిషాలపాటు తిప్పేందుకు ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.50, చిన్నపిల్లలకు రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు. 20 మంది ప్రయాణికులు జమ అయితే ఈ లాంచీని నదిలో తిప్పుతారు. ఒకవేళ ఎవరైనా రూ.4 వేలు చెల్లిస్తే గంటపాటు వారి బృందం మొత్తాన్ని నదిలో తిప్పుతారు. ఈ ధరలు తక్కువగా ఉండడంతో చాలామంది పర్యాటకులు సోమేశ్వర లాంచీలో తిరిగేందుకు ఇష్టపడుతున్నారు. ఈ లాంచీ ద్వారా పర్యాటక శాఖకు ప్రతినెలా రూ.లక్షకుపైగా ఆదాయం లభిస్తోంది. శ్రీశైలం టూర్‌కు తిప్పే ఏసీ లాంచీ ప్రయాణ చార్జీలు అధికంగా ఉండటంతో పర్యాటకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. -
వామ్మో! ఏకంగా.. లారీ పై.. ఎక్కిన విమానం..!
మహబూబ్‌నగర్: సాధారణంగా విమానం ఆకాశంలో ఎగురుతుంది.. లేకపోతే విమానాశ్రయంలో ఆగుతుంది. కానీ, ఓ విమానం లారీపై ప్రయాణించడంతో ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. ఆదివారం హైదరాబాద్ వైపు నుంచి విమానం తీసుకెళ్తున్న ఓ లారీ జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఆగింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు రెక్కలు లేని విమానాన్ని ఆసక్తిగా గమనించారు. కర్నూలులో హోటల్ నిర్వహణ కోసం ఈ విమానాన్ని ఢిల్లీ నుంచి తీసుకెళ్తున్నట్లు తెలిసింది. -
మద్యం దుకాణాలకు.. బినామీల సునామీ..!
మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలో ఇతర ప్రాంతాలకు చెందిన వారికి కొన్ని మద్యం దుకాణాలు వరించాయి. ఇందులో జిల్లాకు చెందిన కొందరు వ్యక్తులు దుకాణాలు వచ్చిన ప్రాంతాల్లో మద్యం విక్రయించడానికి కొంత షేర్ కావాలంటూ వారిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సామాన్యులు దక్కించుకున్న దుకాణాలను సైతం కైవసం చేసుకునే పనిలో లిక్కర్ డాన్లు బిజీగా ఉన్నారు. రెండేళ్లపాటు మీకు సక్రమంగా నిర్వహించడానికి రాదని.. మీకు ఎంతో కొంత ఇస్తాం.. వ్యాపారం మేము చేస్తాం అంటూ నయానో.. భయానో సొంతం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఇటీవల మద్యం దుకాణాలు లక్కీడిప్ ద్వారా ఇతరులకు దక్కిన వాటిని చేజిక్కించుకునేందుకు లిక్కర్ కింగ్‌లు రంగంలోకి దిగారు. ఇప్పటికే పాత దుకాణాల్లో డిమాండ్ ఉన్న వాటిలో అంటిపెట్టుకోవడానికి గుడ్‌విల్‌తోపాటు ప్రత్యేక షేర్లు అడుగుతున్నారు. కల్తీ మద్యం విక్రయాల్లో ఆరితేరిన కొందరు వ్యాపారులు గుడ్‌విల్ ఇచ్చి ఎలాగైనా దుకాణాలు తమ ఆధీనంలోకి తీసుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఒక్కో దుకాణానికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు గుడ్‌విల్ చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. ఈ వ్యాపారంలో ఆ స్థాయిలో లాభాలు ఉన్నాయా అనే చర్చ మరోసారి ఇటు వ్యాపారుల్లో, అటు ప్రజల్లో సాగుతోంది. కల్తీ మద్యంలో ఆరితేరిన వ్యాపారులే దుకాణాలు కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. భారీ స్థాయిలో విక్రయాలు.. ఉమ్మడి జిల్లాలోని 230 మద్యం దుకాణాలలో విక్రయాలు గణనీయంగా ఉన్నాయి. ఏళ్లుగా మద్యం వ్యాపారంలో ఆరితేరిన వ్యక్తులే ఇక్కడ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఈసారి దుకాణాలు లక్కీడిప్‌లో ఇతరులకు దక్కినా.. లాభాలు రుచిమరిగి ఉండటంతో పాత వ్యాపారులు మళ్లీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో ఉండే బెల్టు షాపులకు దుకాణాల నుంచే మద్యం సరఫరా చేస్తారు. అయితే ప్రభుత్వం అందించే మద్యం విక్రయిస్తే ఎక్కువగా లాభం ఉండకపోవడంతో ఈ బెల్టు దుకాణాలు కల్తీ మద్యం విక్రయాలకు అడ్డాగా మారాయి. కల్తీ మద్యాన్ని కొందరు వ్యాపారులే సరఫరా చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఉమ్మడి జిల్లాలోని కొందరు మద్యం వ్యాపారులకు మహారాష్ట్రలోని నాందేడ్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారుచేసే వ్యాపారులతో సంబంధాలు ఉండటంతోనే ఉమ్మడి జిల్లాలో కల్తీమద్యం ఏరులై పారుతోందనే ఆరోపణలు ఉన్నాయి. మరికొన్నిచోట్ల మండలాల్లోనే మద్యం వ్యాపారులు తమ పలుకుబడి ఎక్కువగా ఉండే గ్రామాలను కల్తీ చేసేందుకు ఎంచుకుంటున్నారు. మద్యంలో రంగునీళ్లు కలిపి అన్ని బెల్టు షాపులకు పంపిణీ చేస్తున్నారు. బ్రాండెడ్ మద్యం సీసాల సీల్ విప్పి తిరిగి వేసే యంత్రాలు సైతం కొందరి దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యాపారంలో పేరుగాంచిన వ్యక్తులు అధిక లాభాలు ఉండటం వల్ల దుకాణాలు ఎవరికి వచ్చినా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు. చట్టప్రకారం నేరం.. లక్కీడిప్‌లో దుకాణం సొంతం చేసుకుని రిజిష్టర్‌లో సంతకం చేసిన వారి పేరిటే లైసెన్స్ ఇస్తాం. నవంబర్ 25 వరకు కొత్త దుకాణదారులకు లైసెన్స్ జారీ చేస్తాం. గుడ్‌విల్ ఇచ్చి దుకాణాలు తీసుకోవడం చట్టప్రకారం నేరం. అలా చేసుకున్న వారికి దుకాణంపై ఎలాంటి హక్కులు ఉండవు. ఎకై ్సజ్ శాఖ నుంచి లైసెన్స్ తీసుకున్న వారే మద్యం దుకాణాలు నడపాలి. అమ్మకాల్లో ఏదైనా సమస్య వస్తే మద్యం దుకాణ లైసెన్స్ ఎవరి పేరుపై ఉంటే వాళ్లే బాధ్యులు అవుతారు. భవిష్యత్‌లో ఎలాంటి ఘటనలు జరిగినా లైసెన్స్ ఉన్న వ్యక్తులపైనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. – దత్తరాజ్‌గౌడ్, ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ -
'అక్షర సేద్యం'.. వికీపీడియాలో 'కొలామి భాష'..!
మంచిర్యాల: ఆధునిక కాలంలో కాలానుగుణంగా తమ భాష, సంస్కృతి ఎక్కడ కనుమరుగవుతుందేమోనన్న తపనతో ఆదివాసీ కొలాం తెగ యువత ముందడుగు వేసింది. కొలామి భాష, తమ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే ఆలోచనతో వికీపీడియాను వేదికగా ఎంచుకున్నారు. భవిష్యత్ తరాలకు తమ భాష, సంస్కృతి, పదజాలం, జానపద పాటలు, నృత్య కళారూపాలు, చారిత్రాత్మక అస్తిత్వ పరిరక్షణకు తమ వంతు పాత్ర పోషిస్తూ తెలుగు లిపితో కొలాం భాషను వికీపీడియాలో పొందుపరుస్తూ.. పలువురు మన్ననలు పొందుతూ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఇది వరకే ఉట్నూర్ కేబీ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఐటీడీఏ పీవో పాల్గొని కొలామి భాషను వికీపీడియా ద్వారా ప్రపంచానికి తెలియచేయడంపై ఐటీడీఏ పీవో చాహత్ బాజ్‌పాయి బోలిచేతో (భాష చైతన్యం) ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. ఆదివాసీల్లో అత్యంత వెనుకబడిన తెగ.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 46,677 మంది కొలాం జనాభా ఉన్నారు. ఆదివాసీ తెగల్లో అత్యంత వెనుకబడిన తెగ ఆదివాసీ కొలాం. వారి సంస్కృతి, సంప్రదాయాలకు భిన్నంగా ఉంటాయి. కొలాం తెగకు చెందిన యువకులు, కళాకారులు తమ నైపుణ్యాన్ని వెలికితీసి భాషను నేరుగా వికీపీడియాలోకి మార్చి తమ ఔనత్యాన్ని చాటుతున్నారు. కొలామి భాషతో పాటు మహానీయులు, క్రీడాకారులు, రాజకీయ నాయకుల చరిత్రను కొలామిలో పొందుపర్చేందుకు సిద్ధమవుతున్నారు. కొలాం సంస్కృతి.. గిరిజన తెగల్లో కొలాం సంస్కృతి, ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. కొలాం ఆదివాసీలు కొలిసే ఆరాధ్యదైవం భీమయ్యక్, నడిదమ్ము, ముత్తేలమ్మ, దండారీ, దూరడి, పొలకమ్మ దేవతులు ముఖ్యమైనవి. వివాహ వేడుకల్లో పాడే జానపదులు ప్రత్యేకంగా ఉంటాయి. కొలాం మహిళలు, పురుషులు ఉత్సవాల సందర్భంగా కొలామి మాతృభాషలో పాడే పాటలు, నృత్య కళారూపాలను కాలానుగుణంగా వివిధ ఉత్సవాలకు సంబంధించిన నృత్యాలు సేకరించి పొందుపర్చనున్నారు. కొలామి వికీపీడియా ప్రస్థానం.. కొలామి వికీపీడియాను జూన్ 28న నేతి సాయి కిరణ్ ప్రారంభించారు. ప్రపంచంలో లిపి లేని ఆదివాసీ భాషలు రోజురోజుకూ అంతరించిపోతున్నాయి. భాష పదజాలం కోసం సంస్కృతి పరిరక్షణకు బోలిచేతో ఫౌండేషన్ స్థాపించారు సాయికిరణ్. భాష కోసం, ఆదివాసీలు సంస్కృతిక పంటలైన చిరుధాన్యాల బాహ్య ప్రపంచానికి తెలియచేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతరిస్తున్న భాషలపై పరిశోధన.. యునెస్కో ప్రకారం ప్రపంచంలో 7వేలకు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి. ఈ జాబితాలోని చాలా భాషలు అంతరిస్తున్నాయి. వైవిధ్యంగా ఉన్న భాషలు ప్రపంచ భాష వైవిధ్యతను కోల్పోయే దిశలో ఉన్నాయి. భాషను డిజిటల్ మాద్యమాల ద్వారా పునరుద్ధరణ చేయడమే నా లక్ష్యం. – నేతి సాయికిరణ్, తెలుగు వికీపీడియా, బోలిచేతో ఫౌండేషన్, వ్యవస్థాపకుడు, అస్సాం భవిష్యత్‌కు కొలామి వికీపీడియా అవసరం.. తెలుగు వికీపీడియాలోని తెలంగాణలోని జిల్లాలు, మండలాలు, గ్రామాలకు సంబంధించిన సమాచారాన్ని కొలామి భాషలో అనువాదం చేస్తున్నాం. సమకాలిన అంశాలపై రచనలు కొనసాగుతున్నాయి. వికీ బుక్స్‌లో నేను రచించిన కొలాం వీరుడు కుమురం సూరు, దండారీ కై తికాలు, దంతన్‌పల్లి భీమయ్యక్ మహాత్మ్యం, మోతీరాము శతకం పుస్తకాలు పొందుపర్చుతాను. – ఆత్రం మోతీరాం, కొలామి వికీపీడియా, కవి మా జీవన విధానాన్ని వికీలో భద్రపరుస్తాం.. మా కొలాం సంస్కృతికి సంబంధించిన వ్యవహారాలు, దేవుళ్లు, జానపద నృత్యాలు, పాటలు, మా చరిత్రాత్మక స్థానాలు, మా జీవన విధానం, పల్లెలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సేకరించి వికీ కామన్స్‌లో భద్రపరుస్తాను. – ఆత్రం రాజ్‌కుమార్, కొలామి వికీపీడియా ఇష్టంతో అనువాదం.. తెలుగు వికీపీడియాలోని సమాచారాన్ని కొలామి భాషలో అనువాదం చేయడం నాకెంతో ఇష్టం. జాతీయ నాయకులకు సంబంధించిన సమాచారాన్ని కొలామి భాషలో తెలుగు లిపితో అనువాదం చేస్తున్నాం. మా మాతృభాష కొలామి భాషకు సేవా చేయడం నాకెంతో గర్వకారణం. – మడావి జంగు, కొలామి వికీపీడియా వికీపీడియాలోకి.. తెలుగు లిపిని అలంబన చేస్తూ కొలామి భాషకు జీవం పోసి వందలాది వ్యాసాలతో ముందుకు సాగుతూ అంతర్జాతీయ వేదికగా నిర్మితమవుతున్న కొలామి వికీపీడియా అక్షర సేద్యంగా నిలువనుంది. కొలాం తెగ ప్రజలు రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్రలో యావత్మల్ జిల్లాలో నివసిస్తున్నారు. వీరిది ద్రావిడ భాష అయినా కొలామి భాషను మాట్లాడతారు. ప్రభుత్వ రికార్డుల్లో కొలామ్స్ అని నమోదు చేసింది. -
సిరిసిల్లలో పెళ్లికి సింగపూర్‌వాసులు.. వారితో స్థానికులు సెల్ఫీలు..
సిరిసిల్ల: సిరిసిల్లలో ఆదివారం జరిగిన ఓ పెళ్లికి సింగపూర్‌వాసులు హాజరయ్యారు. మున్సిపల్ కౌన్సిలర్ గూడూరి భాస్కర్ కూతురు వాణి వివాహం జేపీ నగర్‌కు చెందిన గౌడ లక్ష్మణ్ కుమారుడు బాలకృష్ణతో కల్యాణలక్ష్మి గార్డెన్స్‌లో జరిగింది. సింగపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన వరుడి ఆహ్వానం మేరకు సహోద్యోగులు ఆరుగురు పెళ్లికి హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా జరిగిన వివాహ క్రతువు, విధి విధానాలను చూసి, ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫోన్లలో ఫొటోలు తీశారు. తెలంగాణ వంటకాల రుచి చూశారు. వారితో స్థానికులు సెల్ఫీలు దిగారు. -
జిల్లాలో పనిచేయని మిషన్లు 34.. మూలుగుతున్న అప్లికేషన్లు..
వరంగల్: వరంగల్ సన్‌షైన్ ఆస్పత్రిలోని లింగ నిర్ధారణ పరీక్షల మిషన్ పనిచేయక రెన్యూవల్‌కు దరఖాస్తు ఇచ్చారు. అలాగే, ఆ మిషన్‌ను క్రాష్ (పగులగొట్టడానికి) చేయడానికి అనుమతివ్వాలని వైద్యారోగ్యశాఖకు అర్జీపెట్టుకున్నారు. ► వరంగల్ బాలాజీ ఆస్పత్రిలో 2001 నుంచి స్కానింగ్ ఉంది. ప్రస్తుతం వారు వాడుతున్నది మూడో మిషన్. రన్నింగ్‌లో లేని రెండు మిషన్లను ధ్వంసం చేస్తామని దరఖాస్తు పెట్టుకోగా.. పెండింగ్‌లోనే ఉంది. ► వరంగల్‌లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి లింగ నిర్ధారణ చేసే మిషన్ ఉంది. ఆస్పత్రిని హనుమకొండకు మార్చిన సమయంలో పాత ఆస్పత్రిని మూసివేశామని, మిషన్ వాడలేము.. క్రాష్ చేయాలని వేడుకున్నారు. ► వరంగల్, హనుమకొండ జిల్లాల విభజనలో భాగంగా వరంగల్ జిల్లాకు రెండు కోర్టు కేసులతో ఉన్న ఆస్పత్రులు వచ్చాయి. వీటిలోని స్కానింగ్ మిషన్లు ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉన్నాయి. ఇలా వివిధ కారణాలతో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే మిషన్లను పగులగొట్టేందుకు అనుమతివ్వాలని కొందరు దరఖాస్తు చేసుకుంటే.. ఇంకొందరు తమ వద్దకు ఏ కేసులు వస్తలేవని ప్రతి నెలా జిల్లా వైద్యారోగ్యశాఖకు పంపే ఎఫ్ ఆడిట్ ఫాంలో విన్నవిస్తున్నారు. అయితే ఏడాదిన్నర నుంచి వినతులు ఇస్తున్నా చర్యలు తీసుకోవడంలో అడుగు ముందుకు వేయడంలేదు. పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ కింద రన్నింగ్‌లో లేని మిషన్లపై చర్య తీసుకునే విషయమై ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. స్టేట్ రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ ఉన్నంత వరకు ఆ మిషన్ల ఫంక్షనింగ్ ఉండడంతో జిల్లాస్థాయిలో అధికారులు ఏమి చేయలేకపోతున్నారు. రాష్ట్ర వైద్య ఉన్నతాధికారులకు విన్నవించినా చట్టంలో స్పష్టత లేక ఈ మిషన్లను ఏం చేయాలన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని వైద్యవర్గాలు కోరుతున్నాయి. జిల్లాలో పనిచేయని మిషన్లు 34.. పీసీ అండ్ పీఎన్డీటీ యాక్ట్ కింద 2001 నుంచి అల్ట్రా సౌండ్ స్కానింగ్ క్లినిక్‌లు, ఇమేజింగ్ సెంటర్లు ఇప్పటివరకు 102 రిజిస్టర్ అయి ఉండగా.. 68 మాత్రమే నడుస్తున్నాయి. మిగిలినవి 34 రన్నింగ్‌లో లేవు. అయితే వీటిలో జిల్లా విభజనలో వరంగల్ అర్బన్ నుంచి కొత్త వరంగల్ జిల్లాలో చేరిన వరంగల్, ఖిలావరంగల్ మండలాలకు చెందినవే 22 ఉన్నాయి. ప్రతి నెలా ఐదో తేదీన జిల్లా వైద్యారోగ్య విభాగానికి వచ్చే ఎఫ్ ఆడిట్ ఫాంలో పనిచేయని మిషన్ల వివరాలు వస్తున్నాయి. వీటిపై వైద్యవిభాగాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి అవి వాస్తవంగా పనిచేయడం లేదా.. ఏమైనా లింగ నిర్ధారణ పరీక్షలు జరిగే అవకాశం ఉందా అన్న దిశగా దృష్టి సారించాలని ఇటీవల కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆరోగ్యశ్రీ కోసమే అక్కడ మిషన్లు.. ఆప్తమాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్ వైద్యం అందించే ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తించాలంటే పీసీ పీఎన్డీటీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడంతో ఆ మిషన్లు తీసుకుంటున్నారు. ఇలా దాదాపు 10లోపు మిషన్లు ఉన్న ఆస్పత్రుల యాజమాన్యాలు అవి రన్నింగ్‌లో లేవని చెబుతున్నాయి. ఇలాంటివి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే వాటిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రస్థాయిలో పాలసీ తేవాలి.. నిర్వహణలో లేని స్కానింగ్ మిషన్ల సెంటర్ల లైసెన్స్ రద్దు చేయాలి. ఆ మిషన్‌ను సీజ్ చేసి పరిశ్రమకు లేదా.. ఇతరులు ఎవరైనా కొనుగోలు చేసుకుంటే ఇచ్చేలా డీఎంహెచ్ఓ ద్వారా జరిగేలా చూడాలి. దీనిపై రాష్ట్రస్థాయిలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ పాలసీ తీసుకురావాలి. తిరిగి లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. స్కానింగ్ మిషన్లు తయారు చేసే పరిశ్రమలను కూడా పీసీ పీఎన్డీటీ చట్టంలోకి తేవాలి. – మండల పరశురాములు, అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు -
లద్నాపూర్ గ్రామంలో ఉద్రిక్తత..! ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆగ్రహం..!!
పెద్దపల్లి: మండలంలోని లద్నాపూర్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సింగరేణి అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శనివారం అర్ధరాత్రి గ్రామ దేవత పోచమ్మ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ ఆదివారం ఉదయం ఆర్జీ–3 పరిధి ఓసీపీ–2 గేట్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామానికి సంబంధించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ నిర్వాసితుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తోందని, తమ మనోభావాలను దెబ్బతీయడానికే ఇలా చేస్తోందని మండిపడ్డారు. అమ్మవారి విగ్రహన్ని ఆర్జీ–3 జీఎం దంపతులు తిరిగి ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. గేట్ వద్ద ఆందోళన అనంతరం సైట్ ఆఫీస్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోగా వారితో వాగ్వాదానికి దిగారు. గ్రామంలోని 284 మందికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వచ్చాకే పనులు చేపట్టాలని సింగరేణి అధికారులకు గతంలోనే చెప్పామన్నారు. అయినప్పటికీ గ్రామాన్ని బలవంతంగా ఖాళీ చేయించాలన్న ఉద్దేశంతోనే పోచమ్మ తల్లి విగ్రహాన్ని తొలగించారని ఆరోపించారు. మ్యాన్ వే రూంకు తాళం వేసి, కార్మికులను, క్వారీలో బ్లాస్టింగ్ పనులను అడ్డుకున్నారు. సింగరేణి యాజమాన్యం స్పందించి, యథాస్థానంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గోదావరిఖని వన్ టౌన్ సీఐ ప్రసాద్‌రావు, రామగిరి, ముత్తారం, మంథని ఎస్సై లు దివ్య, మధుసూదన్‌రావు, కిరణ్‌లు తమ సిబ్బందితో బందోబస్తు చేపట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆగ్రహం.. లద్నాపూర్‌లో పోచమ్మ తల్లి విగ్రహం తొలగించడం పట్ల ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతా ధికారులను కోరారు. అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. -
ఆర్టీసీ బస్సులో మహిళ ప్రసవం.. క్షేమంగా తల్లీబిడ్డలు!
మెదక్: ఆర్టీసీ బస్సులో ఓ మహిళ సుఖ ప్రసవం జరిగిన సంఘటన జహీరాబాద్‌లో చోటు చేసుకుంది. డిపో మేనేజర్ నారాయణ వివరాలు. పొట్పల్లి గ్రామానికి చెందిన హాజీ పాషా భార్య జరీనా బేగంకు పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవం కోసం బీదర్ ఆసుపత్రికి వెళ్లడానికి శుక్రవారం రాత్రి సహాయకులతో కలిసి జహీరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కింది. బస్సు పట్టణం దాటగానే ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. బస్సు డ్రైవర్ ఆనందం, కండక్టర్ కరుణాకర్ మార్గమధ్యలో ఉన్న మిర్జాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి బస్సును తరలించారు. నర్స్ సుధారాణిని బస్సు వద్దకు తీసుకుని వచ్చేలోపు మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. -
'సేవాలాల్ మహరాజ్.. దండి మేరమా'.. జ్ఞాపకంగా తీజ్ ఉత్సవం..!
మహబూబాబాద్: ఈ తీజ్ వేడుకల్లో మొదటి రోజు తండావాసులు గుమిగూడి తండా పెద్దమనిషి ఇంటి వద్ద సాయంత్రం వేళ గోధుమలు, శనగలు, నవధాన్యాలను నానబెడతారు. రెండో రోజు నాన బెట్టిన గోధుమలను చిన్న చిన్న బుట్టల్లో (దుస్సే రు తీగతో అల్లినవి) మట్టి, సేంద్రియ ఎరువు అలికిన తర్వాత పాటలు పాడుతూ బుట్టల్లో గోధుమలు విత్తుతారు. మూడో రోజు ఉదయం మంచె(ఢాక్లో) ఏర్పాటు చేసి గోధుమ చల్లిన బుట్టలను మంచెపై పెడతారు. అనంతరం పెళ్లి కాని అమ్మాయిలు తొమ్మిది రోజులపాటు రోజూ పాటలు పాడుతూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తీజ్ బుట్టల్లో నీరు పోస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు వీరి ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. ఉప్పు, కారం, మసాలాతో తయారు చేసిన ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో భుజించరు. నియమ నిష్టలతో ఉంటూ ఆకు కూరలు, జొన్నరొట్టెలు తింటూ తీజ్‌ను (గోధు మ నారును) కాపాడుకుంటారు. తీజ్ పండుగను సేవాలాల్ మహరాజ్, దండి మేరమా దేవతనే జరిపిస్తుందని గిరిజనుల విశ్వాసం. ఏడో రోజు ఢమోళీ పూజ ఘనంగా జరుపుకుంటారు. తొక్కుడు పడని నల్లమట్టి తెచ్చి (అబ్బాయి, అమ్మాయి ప్రతిమలు) బొమ్మలు తయారు చేస్తారు. వీటిని గణగోర్ అని పిలుస్తారు. ఈ సందర్భంగా బియ్యం పిండితో చేసిన రొట్టెల్లో బెల్లం కలిపి నైవేద్యం (చూర్మో) తయారు చేస్తారు. అనంతరం డప్పు చప్పుళ్లతో ప్రతి ఇంటికి వెళ్లి చూర్మో పంచుతూ నృత్యాలు చేస్తారు. రాత్రి సమయంలో అందరూ తీజ్ మంచె దగ్గర కలుసుకొని పాటలు పాడుతూ అమ్మాయిల చేత నెయ్యి, బెల్లం అన్నం కలిపి(దప్కార్) ఇస్తారు. చివరగా గణగోర్ బొమ్మలను తీజ్ వద్ద పెట్టి పూజలు నిర్వహిస్తారు. చివరి రోజు తీజ్ నిమజ్జ న కార్యక్రమంలో భాగంగా తండావాసులందరూ కలిసి సేవాలాల్ మహరాజ్‌కు బెల్లం అన్నం (కడవో) నైవేద్యంగా పెడతారు. మేరమా యాడికి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం వేళ మంచె ఢాక్లో పైనుంచి తీజ్ బుట్టలను అమ్మాయిలు తీసుకుని బాధాతప్త హృదయంతో తీజ్ తమను వదిలి వెళ్తోందని ఆటపాటలతో దగ్గరలోని కుంటలు, చెరువుల్లో బుట్టలను నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా అన్నదమ్ములు తమ అక్కాచెల్లెళ్ల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకుంటారు. -
దేవుని భూములను కొందరు కబ్జా.. చట్టారీత్యా నేరం..
కరీంనగర్: ధూప..దీప.. నైవేద్యం.. ఆలయాల పరిరక్షణకు దాతలు వితరణ చేసిన భూములను పర్యవేక్షించడంలో దేవాదాయశాఖ నిర్లక్ష్యంతో ఆలయ భూములు పరాధీనమవుతున్నాయి. ‘రాజుల సొమ్ము రాళ్లపాలు.. దేవుడి సొమ్ము దేశదిమ్మరుల పాలు’ అన్న చందంగా మారింది. దేవుడి సొమ్మే కదా అని తేరగా కబ్జాలకు పాల్పడుతుండడంతో వేలాది ఎకరాలు అన్యాక్రాంతమవుతున్నాయి. అధికారుల అలసత్వంతో ఇప్పటికే కొన్నిచోట్ల లీజుదారుల కబంధహస్తాల్లో భూమి చిక్కుకుపోయింది. భూములపై నిర్దిష్ట సమాచారం లేకపోవడం, సర్వే చేపట్టకపోవడంతో భూబకాసురుల చెర నుంచి విముక్తి చేయలేక కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో 85 ఆలయాల పరిధిలో 1,089.34 ఎకరాలు ఉండగా.. అందులో 15 నుంచి 20 శాతం భూములు ఆక్రమణలో ఉన్నట్లు సమాచారం. దేవాదాయ భూములకు సంబంధించి ఎక్కడికక్కడ హెచ్చరికబోర్డులు లేకపోవడం, వందల ఏళ్ల కిందటి భూములు కావడంతో రక్షణ కరువైంది. కాలక్రమేణా వీటి ఆనవాళ్లు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పెద్దపల్లి నుంచి ఓ ప్రజాప్రతినిధే అక్రమంగా దేవాదాయ భూములు పట్టా చేయించుకున్నాడని హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో జిల్లాలో దేవాదాయ భూముల పరిరక్షణపై చర్చ నడుస్తోంది. నేత, బంధువుల పేరిట పట్టాలు.. దేవుడి భూములు కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే వాటికి ఎసరు పెడుతున్నారు. పెద్దపల్లి మండలంలోని పాలితం, బొంపల్లి, కనగర్తి, కాసులపల్లి, ధర్మాబాద్ గ్రామాల్లో 462.33 ఎకరాలు రంగనాయకుల స్వామి భూములు ఉన్నాయి. ఈ భూములను లీజుకు తీసుకొని ఏళ్లుగా పేదరైతులు సాగు చేసుకుంటూ.. ప్రభుత్వానికి కాస్తు(లీజు) డబ్బులు చెల్లించేవారు. తాజాగా ధరణి పోర్టల్ వచ్చాక రెవెన్యూ రికార్డుల్లో ఆలయం పేరుకు బదులు కొందరు రైతులు పేర్లు ఎక్కించుకున్నారు. అందులో ప్రజాప్రతినిధి, వారి కుటుంబసభ్యులు సైతం ఉన్నారు. ధరణి పోర్టల్‌లో పలువురు రైతులతోపాటు ఆ నాయకుడి కుటుంబ సభ్యుల పేరిట పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. అయినా వాటిని ఇంకా దేవాదాయశాఖ భూములుగానే చూపెడుతుండడం గమనార్హం. పాసుపుస్తకాలు జారీకావడంతో సదరు ఆక్రమణదారులు రైతుబంధు పొందుతున్నారు. ఆ ఆలయ భూములను పరిరక్షించాలని రాష్ట్రీయ హిందూ పరిషత్ గోరక్షక్ జాపతి రాజేశ్‌పటేల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు సదరు నాయకుడితో సహా పలువురు రైతులకు, ప్రభుత్వ అధికారులకు నోటీసులు జారీచేసింది. ఎన్నికల అఫిడవిట్లో వ్యవసాయ భూములుగా.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సదరు నాయకుడు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన పేరిట ఉన్న భూముల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు. అందులో కాసులపల్లిలో తనకు వ్యవసాయ భూమి ఉన్నట్లు చూపించారు. సదరు భూమి ధరణి పోర్టల్‌లో చూస్తే ఆ నేత పేరు చూపుతూనే.. అవి దేవాదాయశాఖ భూములుగా చూపుతుండడం గమనార్హం. ఇంకా ఆ సర్వే నంబర్లలోని భూములకు నాయకుడు రైతుబంధు తీసుకుంటుండగా, ప్రస్తుతం పొజిషన్లో ఆ సర్వేనంబర్లలో నాయకుడికి సంబంధించిన ప్రైవేట్ పాఠశాల కొన్నేళ్లుగా కొనసాగుతోంది. దీంతో ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించడంతోపాటు అర్హత లేకున్నా రైతుబంధు పొందుతుండడంపై వివిధ రాజకీయ పక్షాల నేతలు మండిపడుతున్నారు. స్థానిక అధికారులపై రాజకీయ ఒత్తిళ్లతోనే చర్యలు చేపట్టడం లేదని కోర్టుల ద్వారా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. పేర్లు ఎక్కిస్తామని డబ్బుల వసూలు.. రంగనాయకులస్వామి పరిధిలోని భూములను కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న వారిలో చిన్న, సన్నకారు రైతులు, భూస్వాములు, రాజకీయనేతలు ఉన్నారు. ధరణి పోర్టల్ వచ్చాక పలువురు నేతలు భూములను రైతుల పేరిట ఎక్కిస్తామని ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారు. ఆ సొమ్ముతో కొందరు మాత్రమే తమ పేరిట భూములను ధరణిలో ఎక్కించుకోగా.. మిగతా సాధారణ చిన్న, సన్నకారు రైతులు మోసపోయారు. స్థానిక బడా నేత, ఆయన కుటుంబ సభ్యులు, మరికొందరు విజయవంతంగా ధరణిలో పేరు ఎక్కించుకోవడంతో వారికి రైతుబంధు అందుతుండడం విశేషం. ధరణిలో ఎండోమెంట్ భూములు అని చూపుతున్నా ప్రభుత్వం రైతుబంధు చెల్లిస్తుండడం గమనించాల్సిన విషయం. రెండేళ్ల కిందే ప్రభుత్వానికి నివేదించాం.. పాలితం గ్రామంలోని రంగనాయకుల స్వామికి చెందిన దాదాపు 400 ఎకరాలకుపైగా భూములు అన్యాక్రాంతమయ్యాయని గతంలోనే నివేదిక ఇచ్చాం. చాలా ఏళ్ల కింద స్థానికులు దేవుని మాన్యం భూములను సాగుపేరిట లీజుకు తీసుకున్నారు. వారిలో కొందరు అక్రమార్గంలో పట్టాలు పొందారు. అక్రమంగా రైతుబంధు కూడా పొందుతున్నారు. ఈ విషయాన్ని 2021లోనే పెద్దపల్లి కలెక్టర్‌కు, ప్రభుత్వానికి నివేదిక పంపాం. మా దేవాదాయశాఖ కమిషనర్ కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు. వారికి వెంటనే రైతుబంధు నిలిపివేయాలని నివేదికలో పొందుపరిచాం. – ఏసీ చంద్రశేఖర్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.. దేవాదాయ భూములను ఇతరులకు విక్రయించడం, వాటిని కొనుగోలు చేయటం చట్టరీత్యా నేరం. రాజకీయ పలుకుబడి కలిగిన నేత, అతని బంధువులు మాత్రమే పట్టాలు చేయించుకున్నారు. నిజంగా సాగు చేసుకునే పేద, సన్నకారు రైతుల పేర్ల మీద పట్టాలు జారీకాలేదు. చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సాగుచేసుకోకుండా అందులో వ్యాపారాలు చేసుకునే వారి భూములను ప్రభుత్వం స్వాఽధీనం చేసుకొని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. దీనిపై పలుసార్లు అధికారులను కలిసినా రాజకీయ ఒత్తిళ్లతో ఎవరూ పట్టించుకోవడం లేదు. – సత్యనారాయణరెడ్డి, న్యాయవాది -
నల్గొండ 'నాగిరెడ్డిపల్లి' లో ‘గేమ్ ఛేంజర్’ గా కనిపించిన హీరో రాంచరణ్..
నల్గొండ: భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలో గల శ్రీ భీమరావ్ రైస్ గోదాములో హీరో రాంచరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ శుక్రవారం కొనసాగింది. ఈ సందర్భంగా గోదాములోని కల్తీ బియ్యం పట్టుకునే సన్నివేశాలు చిత్రీకరించారు. శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజ్ నిర్మాతగా ఎస్వీసీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలోని గోదాముకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ శనివారం కూడా ఇక్కడే కొనసాగనుంది.