News
-
వరంగల్: 'మేడారం జాతర'కు ఆరు నెలలే గడువు.. అయినా ఇలా..??
వరంగల్: 2024 ఫిబ్రవరిలో జరిగే సమ్మక్క సారలమ్మల మహాజాతరకు ఇంకా ఆరు నెలల గడువు మాత్రమే ఉంది. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరగనున్న మహాజాతరలో భక్తుల సౌకర్యార్థం 18 శాఖల ద్వారా ఏర్పాట్ల కోసం రూ.75కోట్ల నిధులు అవసరమని అప్పటి కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అయితే జాతర సమీపిస్తున్నా.. నిధుల కేటాయింపుల్లో జాప్యం చేయడంతో ఈ జాతరలో కూడా హడావుడి పనులతోనే నిర్వహించేలా కనిపిస్తోందని భక్తులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల బిజీలోనే నిమగ్నం కావడంతో జాతర పనుల్లో జాప్యం తప్పేలా లేదు. నిధులు సరిపోయేనా..? మేడారం జాతరలో భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వానికి రూ.75కోట్ల మంజూరు కోసం అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయితే జూలై చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు మేడారంలో శాశ్వతంగా నిర్మించిన కల్యాణ కట్ట షెడ్లు, రోడ్లు, విద్యుత్, గెస్ట్‌హౌజ్‌లు దెబ్బతిన్నాయి. జాతరకు రోడ్డు మార్గాలే చాలా అవసరం కానీ, వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో పాటు గుండ్లవాగు బ్రిడ్జి దెబ్బతినడంతో నెలరోజుల పాటు తాడ్వాయి నుంచి మేడారం మీదుగా ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలు మళ్లించడంతో ఈ మార్గాన రోడ్లు మరింతగా ధ్వంసమయ్యాయి. అధికారులు మాత్రం రూ.75కోట్ల ప్రతిపాదనలు మాత్రమే ప్రభుత్వానికి పంపించారు. కానీ, జాతర ఏర్పాట్లు, ఇప్పుడు అత్యవసరంగా కావాల్సిన మరమ్మతుల పనులకు ఈ నిధులు ఏ మూలన సరిపోతాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటు అసెంబ్లీ ఎన్నికలు, అటు జాతర సమీపిస్తుండంతో అధికా రులు, ప్రజాప్రతినిధులు ముందుగా ఎన్నికల ఏర్పాట్లకే పరిమితమయ్యే అవకాశం ఉంది. జాతరకు ఆరు నెలలే గడువు.. మేడారం మహాజాతరకు ఇంకా ఆరునెలల సమయమే మిగిలింది. ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు కూడా ముందుకు సాగే పరిస్థితి లేదు. నిధులు మంజూరు చేయడం, టెండర్ల ప్రక్రియ, టెక్నికల్ ఆర్డర్లు పొందడం లాంటి వాటికే నెలకు పైగా సమయం పడుతుంది. ముందస్తుగా నిధులు మంజూరైతేనే పనులు నాణ్యతగా చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు జాతర నిధులను ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో జాతర వరకు కూడా పనులు పూర్తయ్యే అవకాశాలు లేవని భక్తులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే జాతరకు నిధులు అసలు మంజూరవుతాయా.. లేదా.. అనే అనుమానం కలుగకమానదు. జాతర నిధుల మంజూరు విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎన్నికల బిజీలో నిమగ్నమయ్యారు. నిధులు మంజూరు చేయాలి.. మేడారం జాతర నిధులను ప్రభుత్వం త్వరగా మంజూరు చేయాలి. జాతరలో భక్తుల సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి సారించి, సరిపడా నిధులు కేటాయించాలి. మంత్రులు, ప్రజాప్రతినిధులు చొరవచూపి జాతరకు ముందే పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలి. – సిద్దబోయిన జగ్గారావు, పూజారుల సంఘం అధ్యక్షుడు -
కెమెరా పట్టిన్నడే సీమ దసర సిన్నోడు.. రాత్రికి రాత్రే స్టార్ సింగర్
మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం గ్రామానికి చెందిన మాడపోళ్ల ఆశప్ప, మాణిక్యమ్మ దంపతులకు ఉష, మంజుల ఇద్దరు కూతుళ్లు. ఉష గ్రామంలోని పాఠశాలలో 3వ తరగతి వరకు చదివి మానేసింది. చిన్నప్పటి నుంచే పొలం పనులకు వెళ్లేది. అయితే వీరి తల్లిదండ్రులు అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో బంధువులు చేరదీసి వరుసకు మామ అయిన వ్యక్తితో పెళ్లి చేశారు. బాబు, పాప పుట్టి అనారోగ్యంతో నెలలు నిండకుండానే మృతిచెందారు. భర్తకు సైతం మతిస్థిమితం లేకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో గ్రామంలో జీవనోపాధి కష్టంగా మారడంతో హైదరాబాద్‌కు వలస వెళ్లింది. అక్కడే భవన నిర్మాణ రంగంలో కూలీ పనులు చేస్తూ ఒంటరి మహిళగా జీవనం సాగిస్తుంది. పొట్ట చేతపట్టుకొని పట్నం వెళ్లిన ఓ ఒంటరి మహిళ జీవితాన్ని ఒక్కపాట సెన్సేషన్‌గా మార్చేసింది. చిన్నప్పటి నుంచి జానపద పాటలంటే ఉన్న విపరీతమై ఇష్టమే అదృష్టం వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. ‘కెమెరా పట్టిన్నడే సీమ దసర సిన్నోడు’ అనే పాటతో రాత్రికి రాత్రి స్టార్ సింగర్‌గా మారింది. పాట రాసి, స్వరం కలిపి ప్రాణం పోసి అచ్చం తెలంగాణ యాస, భాషతో పల్లె జానపదాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన ఆ కళాకారిణి నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం గ్రామానికి చెందిన మాడపోళ్ల ఉష. ఈమె ఈ ఏడాది జూన్ 29న పాట పాడగా ఇప్పటి వరకు యూట్యూబ్‌లో 26 మిలియన్ల వ్యూస్ అంటే 2.60 కోట్ల మంది చూశారంటే పాట క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు.. తాను వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో ఆడవాళ్లు పాడుకునే జానపద పాటలను శ్రద్ధగా గమనించి పాడుతూ ఉండేది. గత పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడే కూలీ పనులు చేసుకుంటూ తీరిక సమయంలో జానపద పాటలు పాడుతూ ఉండేది. యూట్యూబ్‌లో జానపద పాటలకు ఆదరణ పెరగడం చూసి తాను సైతం పాటలు పాడాలనే కోరికతో కొన్ని పాటలు రాసి వీడియోలు చేసింది. సరైన ఆదరణ రాకపోయినా.. పట్టువిడవకుండా పాటలు రాస్తూ.. ట్యూన్లు కలుపుతూ అవకాశాల కోసం ఎదురుచూసింది. గతంలో జగిత్యాల జోగుల వెంకటేశ్‌తో రెండు పాటలు, గొల్లపల్లి శివన్న సిరిసిల్లతో ఒక పాట పాడింది. ఓ రోజు జానపద పాటల కవర్‌పై హరీశ్ పాటేల్ ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ చేసి.. తాను జానపద పాటలు రాసి, పాడతానని అవకాశం ఇవ్వాలని కోరింది. ఆయన దగ్గరకు వెళ్లి మూడు పాటలు పాడి వినిపించింది. ఈ క్రమంలోనే కెమెరా పట్టిన్నడే సీమ దదర సిన్నోడు అనే పాట నచ్చడంతో గజ్వేల్‌లో అమూల్య స్టూడియోలో ఆమె దగ్గర పాడించి జూన్ 29న రిలీజ్ చేశారు. యూట్యూబ్‌లో వస్తున్న సెన్షేషన్ చూసి ఉష రాత్రికి రాత్రి జానపద స్టార్ సింగర్‌గా మారిపోయింది. చిన్నపిల్లలతో మొదలుకొని పెద్దల వరకు యూట్యూబ్‌లో పాట వింటూ మురిసిపోతున్నారు. చేయూత ఇవ్వండి..గ్రామంలో రేకుల షెడ్డు ఇల్లు మాత్రమే ఉంది. ప్రభుత్వం నా పరిస్థితిని గుర్తించి గృహలక్ష్మి ఇల్లుతోపాటు జీవనోపాధి కోసం దళితబంధు పథకాన్ని మంజూరు చేయాలి. నాకు జానపద పాటలంటే ఎంతో ఇష్టం. భవిష్యత్‌లో అవకాశం వస్తే సినిమా పాటలు పాడతా. పదేళ్లుగా కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నా. కళాభిమానులు నా జానపద పాటలను ఆదరించి చేయూతనివ్వండి. – ఉష, జానపద కళాకారిణి, పెద్దజట్రం -
ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..! ఇక అంతే సంగతులు..!!
వరంగల్: ప్రస్తుత కాలంలో ఆన్లైన్ షాపింగ్‌పై అన్ని వర్గాల వారు ఆసక్తి కనబరుస్తున్నారు. షోరూంలలో కనిపించని వస్తువులు అనేకం ఆన్లైన్ షాపింగ్‌లో దర్శనమిస్తున్నాయి. అయితే నెట్లో కనిపించే ఆన్లైన్ షాపింగ్ ప్రకటనలన్నీ నమ్మితే మోసపోవడం ఖాయం. ప్రచారంలో చెప్పేదొకటి.. ఆర్డర్ ఇవ్వగానే డెలివరీ అయ్యేది మరోటి. పైగా ధరల్లో తేడాలు. దీని గురించి ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్‌లో చాలా తక్కువ ధరలకే వివిధ రకాల ఉత్పత్తులను లభిస్తున్నాయి. ప్రత్యేకించి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఉత్పత్తులతో పాటు ఫర్నిచర్, రెడీమేడ్స్, లేడీస్ యాక్సెసరీస్, కాస్మోటిక్స్, స్మార్ట్ఫోన్లు ఇలా అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి. ఆర్డర్ చేసిన కొద్దిరోజుల్లోనే ఆయా కంపెనీలు వాటిని ఇంటికే నేరుగా సరఫరా చేస్తాయి. ఇంట్లో కూర్చోనే కావాల్సిన వస్తువులను హాయిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే చూడడానికి, వినడానికి ఇది ఎంతో బాగున్నా కొన్ని సందర్భాల్లో ఆన్లైన్ షాపింగ్ చేసేవారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆర్డర్ ఇచ్చిన వస్తువులు ఇంటికి రాగానే వాటిని చూసి అవాకై ్కపోతున్న వారు అధిక శాతం మంది ఉన్నారు. ఆకర్షణలకు లొంగొద్దు.. ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చే కంపెనీల్లో నమ్మకమైనవే కాకుండా కొన్ని బోగస్ కంపెనీలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఒక స్మార్ట్‌ఫోన్‌కు ధర చెల్లిస్తే ఉచితంగా ఇంటికి చేరుస్తామని చెప్పారు. తీరా ఆర్డర్ చేసిన తర్వాత ఇంటికి వచ్చిన ప్యాక్‌ను తెరిస్తే బొమ్మ ఫోన్ లేదా రాళ్లు నింపి పంపించిన ఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే రెడీమేడ్ వస్తువులు ఆర్డర్ ఇస్తే నాసిరకం ఉత్పత్తులు పంపించిన సందర్భాలు ఉన్నాయి. తీరా వారిచ్చిన నంబర్‌కు ఫోన్ చేసినా ఫలితం ఉండదు. దీంతో తాము మోసపోయమని గ్రహించిన పట్టించుకునే వారు ఉండరు. అందుకే ఆన్లైన్ షాపింగ్ చేసే ముందు ఆయా కంపెనీల గురించి తెలుసుకుని ఉండడం మంచిది. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు.. ► సదరు కంపెనీ ఎలాంటి ఉత్పత్తులపై వ్యాపారం చేస్తుందో గమనించాలి. ► కంపెనీకి సంబంధించిన వివరాలు ముందే తెలుసుకోవాలి. ► ఆన్లైన్లో విక్రయించే వస్తువులు, షాపింగ్ మాల్స్‌లో లభించే వస్తువుల ధరల్లో ఏమైనా తేడాలు ఉన్నాయో లేదో గమనించాలి. ► ఆయా ఉత్పత్తులపై ఇచ్చే డిస్కౌంట్స్, వివిధ రకాల ఆఫర్ల గుర్తించి అవగాహన ఉండాలి. ► బోగస్ కంపెనీల గురించి తరచూ పత్రికల్లోకానీ, పోలీసులు చెబుతుంటారు. వాటిని పరిశీలిస్తూ ఉండాలి. ► ఆన్లైన్ మోసాలపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా సైబర్ క్రైం విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ► ఎప్పుడైనా మోసపోయినట్లు తెలిస్తే వెంటనే సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేయొచ్చు. ► ఆన్లైన్ కంపెనీలకు సంబంధించిన ఫోన్ నంబర్లను దగ్గర ఉంచుకోవాలి. వాటి అడ్రస్ గురించి తెలుసుకోవాలి. ఎప్పుడైనా మోసం జరుగుతుందని అనుమానం వస్తే సదరు నంబరుకు ఫోన్ చేయాలి. ► ఆన్లైన్లో విక్రయించే వస్తువుల ప్యాకింగ్‌పై కంపెనీల చిరునామా, ఎప్పుడు తయారయ్యాయే? గమనించడంవంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకర్షణీయ ప్రకటనలు, ఆఫర్లను నమ్మితే ఇక అంతే.. డిస్కౌంట్లు.. డిస్కౌంట్లు. అప్టు 50 పర్సంట్, 75 పర్సంట్ వరకు తగ్గింపు.. ఒక వస్తువు కొంటే మరోటి ఫ్రీ.. పైగా ఉచిత డోర్ డెలివరీ.. ఇలా ఒకటేమిటి ఆన్లైన్ షాపింగ్‌లో అన్నీ ఇలాంటి ఆఫర్లే దర్శనమిస్తాయి. బోగస్ ప్రకటనలెన్నో. ఇందులో కొన్ని నిజం కూడా కావొచ్చు.. అయితే ఉద్యోగాలు, ఇంటి పనులతో సమయం చిక్కని వారికి ఆన్లైన్ షాపింగ్ వరమే. కానీ ఆన్లైన్ షాపింగ్‌లో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. తగిన సూచనలు పాటిస్తూ, విచక్షణ ఉపయోగించి ఆన్లైన్ షాపింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీల విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకోవాలి ఆన్లైన్లో కనిపించే ప్రతి ప్రకటన నిజమేననే భ్రమ వీడాలి. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఆయా కంపెనీలకు ఉన్న విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే వినియోగదారుడు మోసపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. –సార్ల రాజు సీఐ, కాజీపేట -
భవనం పై నుంచి కిందపడ్డ యువకుడు.. 10 గంటలు చీకట్లో నరకయాతన..
రాజన్న: ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడ్డ యువకుడు చీకట్లో ఎవరూ చూడకపోవడంతో దాదాపు 10 గంటలు నరకయాతన పడ్డాడు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లికి చెందిన శాతాని లింగారెడ్డి కుమారుడు శాతాని చిన్ను(26) గురువారం రాత్రి భోజనం అనంతరం భవనంపైకి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు జారీ కిందపడ్డాడు. చీకటి కావడంతో ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లలేదు. శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్లే రైతులు గమనించి చిన్ను కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
చిరుత ఎదురుపడితే ఇలా చేయండి చాలు..! వెంటనే..
కుమరం భీం: ఎవరైనా అడవిలోకి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా చిరుతపులి ఎదురుపడితే ఏం చేయాలి? దాని భారినుంచి ఎలా తప్పించుకోవాలి? అనే అంశాలపై డెప్యూటీ కన్జర్వేటర్, జన్నారం ఎఫ్‌డీవో మాధవరావు పలు సూచనలు చేశారు. ఇటీవల తిరుమలలో కాలినడకన వెళ్లిన బాలికను చిరుతపులి హతమార్చిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో వాటి ద్వారా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు తప్పించుకునే మెలకువల గురించి వివరించారు. ఆయన మాటల్లోనే.. పిల్లి జాతి జంతువు.. చిరుతపులి పిల్లి జాతికి చెందిన సిగ్గరి. మనుషుల కంట పడేందుకు ఇష్టపడదు. మనుషుల అలికిడి వినిపిస్తే దూరంగా వెళ్లిపోతుంది. సాధారణంగా ఫారెస్ట్ సఫారీకి వెళ్తే పులి కనిపిస్తుంది. కానీ చిరుతపులి కనబడటం చాలా తక్కువ. అది ఒంటరిగా నివసించేందుకు ఇష్టపడుతుంది. కలయిక సమయంలో సహచరిణితో, చిన్న పిల్లలతో ఉన్నప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. అడవిలో ఇవి గుహల్లాంటి ఆవాసాల్లో నివసిస్తాయి. జింకలు, సాంబర్లు, అడవి పందులను చిరుతలు ఎక్కువగా వేటాడుతాయి. పైకి చూస్తే శరీరంపై మచ్చలు చూడటానికి ఒకేలా కనిపించినా రెండు చిరుతలకు ఒకే విధంగా ఉండవు. ఎదురుపడితే ఎలా తప్పించుకోవాలి? దేశంలో పులుల సంఖ్య కంటే చిరుతల సంఖ్య ఎక్కువగా ఉంది. కవ్వాల్ టైగర్ జోన్లో సుమారుగా 80 వరకు చిరుతలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చిరుత పులుల జాతి ఉంది. చిరుతలు జనావాసాల్లోకి ఊరికే రావు. వాటికి ఆహారం, నీటి సమస్యలు ఏర్పడినప్పుడు మాత్రమే జనావాసాల్లోకి వస్తాయి. చిరుత వేగంగా కదిలే జంతువు కావడంతో జనాల్లోఎక్కువ అలజడి సృష్టిస్తుంది. జనాల మఽ ద్యకు వచ్చిన చిరుతను బంధించడం సులువుకాదు. చిరుత పులి ఎంతదూరంలో ఎదురుపడిందన్న అంశంపై ప్రమాద తీవ్రత ఆధారపడి ఉంటుంది. దూరంగా ఎదురుపడితే సాధారణంగా అదే పక్కకు వెళ్లిపోతుంది. అలాంటి సమయంలో మనుషులపై దాడి చేయాల్సిన అవసరం చిరుతకు ఉండదు. అనుకోని పరిస్థితుల్లో అతి సమీపంలో ముఖాముఖిగా ఎదురుపడితే దాడి చేసే అవకాశాలున్నాయి. అలాంటి సమయంలో రెండు చేతులు పైకెత్తి గట్టిగా అరవాలి. అడవి జంతువుల సైకాలజీ ప్రకారం ఆకారంలో తమకన్నా పెద్దగా ఉన్న జంతువులపై సాధారణంగా చిరుతలు దాడికి దిగవు. చిరుత పులి ఎదురుపడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి పరుగెత్తడం, లేదా పొదల చాటున దాక్కోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే చిరుత వెంటపడి దాడిచేసే అవకాశం ఉంది. ఒకవేళ పారిపోతే ఎంత పరుగెత్తినా చిరుత వేగం ముందు మనం నిలువలేం. కాబట్టి చిరుత కాస్త దూరంలో ఎదురుపడితే చేతులు పైకెత్తి నెమ్మదిగా వెనక్కి నడవడం, దగ్గరగా ఉంటే చేతులు పైకెత్తి గట్టిగా అరుస్తూ వెనక్కి నడిస్తే చిరుత అక్కడి నుంచి వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం చెట్లు ఎక్కినా వేటాడాలనుకునే చిరుత సులభంగా చెట్లు ఎక్కుతుంది. కూలీలు ఏంచేయాలి? అడవిలోకి పనికి వెళ్లే కూలీలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చిరుత పులి వెనుక వైపు నుంచి వేటాడుతున్నందున కూలీలు మాస్కులు, తలకు వెనుకవైపు ఫేస్ మాస్కులు పెట్టుకోవడం మంచిది. వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు ఫేస్ మాస్కులు ధరించి, మాట్లాడుకుంటూ వెళ్లాలి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చిరుత పులి బారి నుంచి తప్పించుకోవచ్చని మాధవరావు సూచించారు. -
ఎన్‌హెచ్–363 నిర్మాణంలో అదే జాప్యం.. మరోవైపు టోల్ వసూలు..
మంచిర్యాల: జాతీయ రహదారి–363 పనులు నాలుగేళ్లు అవుతున్నా ఇంకా కొనసాగుతూ నే ఉన్నాయి. ఓ వైపు రోడ్డుపై ప్రయాణం చేస్తున్నందుకు టోల్ వసూలు.. మరోవైపు పూర్తి కాని చోట పనులు సాగుతున్నాయి. రెండేళ్లలో పూర్తి కావాల్సిన రోడ్డు నిర్మాణం కరోనా, తర్వాత కూడా గడువు పొడగిస్తూనే ఉన్నారు. గత ఏడాది ఆగస్టు వరకే పూర్తి కావాలి. కానీ ఈ ఏడాది ఆగస్టు గడుస్తున్నా అందుబాటులోకి రాలేదు. మరోసారి జనవరి వరకు పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్‌కు గడువు ఇచ్చారు. ఏళ్లుగా నిర్మాణంలోనే.. రాజీవ్ రాష్ట్రీయ రహదారిని శ్రీరాంపూర్ జీఎం ఆఫీ సు నుంచి మహారాష్ట్ర సరిహద్దు కుమురంభీం జిల్లా వాంకిడి మండలం గోయగాం వరకు జాతీయ రహదారిగా మార్చుతూ 2016లో కేంద్రం గెజిట్ ఉత్తర్వులు ఇచ్చింది. 2017లో పని ఉత్తర్వులు, 2018లో భూ సేకరణ, 2019లో బిడ్డింగ్ పూర్తయ్యాయి. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో రెండేళ్ల నిర్మాణం, 15ఏళ్ల నిర్వహణ చేపట్టాలి. రెండు భాగాలుగా మొత్తం 94.602కిలోమీటర్లు నిర్మించాలి. కాంట్రాక్టర్ రూ.1356.90 కోట్లకు బిడ్ వేయగా.. అదనపు పనులతో నిర్మాణ వ్యయం రూ.1948కోట్లకు చేరింది. జిల్లాలో శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం నుంచి తాండూర్ మండలం గోయగాం వరకు 42కిలోమీటర్లు నిర్మించాలి. గత ఏడాదిగా పది శాతం పనుల నిర్మాణమే చేస్తున్నారు. వాస్తవానికి ఈ పనులు 24 నెలల్లో అంటే 2022 ఆగస్టులోపే చేయాలి. నిర్ణీత సమయంలో పూర్తి చేయకపోతే రోజుకు రూ.5లక్షల చొప్పున కాంట్రాక్టర్ పరిహారం వేయాలనే నిబంధనలు కూడా ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్ గడువు పెంచాలని కనీసం కోరకున్నా అధికారులే జనవరి వరకు పెంచేందుకు ఆసక్తి చూపినట్లు సమాచారం. రక్షణ చర్యలు కరువు.. నిర్మించిన రోడ్డుకు టోల్‌ప్లాజా నుంచి రోజు రూ.లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. ప్రయాణికులకు అవగాహ న, భద్రత చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవల ప్ర మాదాలు జరిగి పలువురు మృత్యువాత పడ్డారు. శ్రీరాంపూర్ బైపాస్ రోడ్డు, బెల్లంపల్లి బైపాస్ రో డ్డుపై రాత్రివేళ వెలుతురు సరిగా లేక భారీ వాహనా లు అదుపు తప్పుతున్నాయి. బోయపల్లి బోర్డు, క న్నాల, సోమగూడెం చర్చి సమీపంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొత్తగా రోడ్డు వేయడంతో అతివేగంతోనూ కొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాల నియంత్రణకు ఎన్హెచ్ఏఐ అధి కారులు చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటివరకు అవేమీ చేపట్టడం లేదు. సిగ్నల్స్, మలుపులు, భద్ర త సూచికలు, రాత్రివేళ రేడియం స్టిక్కర్లు మెరిసేవి, అంబులెన్స్, ప్రథమ చికిత్స కిట్లు, టోల్‌ప్లాజా వద్ద జనరల్, మహిళలకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి. ఇవేమీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. నెలలో రెండుసార్లు ఉన్నతాధికారులు స్థానిక డ్రైవ ర్లు, వాహనదారులకు సలహాలు, సూచనలు ఇవ్వా లి. ఇక వర్షాలు కురిస్తే సోమగూడెం, గాంధారి వనం సమీపంలో డ్రెయిన్స్ సరిగా లేక సమీపంలో వరద నీరు చేరుతోంది. వాహనదారుల భద్రత కోసం ప్ర త్యేక కన్సల్టెన్సీ పర్యవేక్షణకు నిధులు మంజూరవుతున్నా ఖర్చుకు అలసత్వం వహిస్తున్నారు. జాప్యంతో ఇబ్బందులు.. మందమర్రి పాత బస్టాండ్ వద్ద వంతెన నిర్మాణం జాప్యంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ట్రాఫిక్ జామ్‌తోపాటు ప్రమాదాలు జరగుతున్నాయి. కొత్తగా పిల్లర్లు వేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం మంచిదే కానీ, జా ప్యం కావడంతో ఇబ్బందులు పడుతున్నాం. త్వరగా పూర్తి చేయాలి. – కొట్టె కొమురయ్య, మందమర్రి వచ్చే జనవరిలో పూర్తి చేస్తాం.. మందమర్రి వద్ద రోడ్డు నిర్మాణం ఉన్న చోట ఉన్న పైపులు మార్చడంలో జాప్యం ఏర్పడింది. దీంతో అక్కడ నిర్మాణంలో జాప్యం జరిగింది. వచ్చే జనవరి వరకు పనులు పూర్తి చేసేందుకు గడువు ఉంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు వాహనదారులు నిబంధనలు పాటించాలి. రోడ్డు భద్రత చర్యలపై స్థానిక పోలీసు, ఆర్టీఏ అధికారులతో అవగాహన చేపడతాం. – కే.ఎన్.అజయ్మణికుమార్, పీడీ, ఎన్హెచ్ఏఐ, మంచిర్యాల -
నేను బతికే ఉన్నాను.. అయినా నన్ను చంపేశారు!
జగిత్యాల: రాయికల్ మండలం కుర్మపల్లి గ్రామానికి చెందిన పుల్ల వెంకటేశ్‌కు గ్రామంలో రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు 2021 వరకు మంజూరయ్యాయి. తర్వాత ఖాతాలో డబ్బులు జమకాకపోవడంతో సందేహం వచ్చిన వెంకటేశ్ మీసేవలో సంప్రదించగా చనిపోయినట్లుగా ఉండటంతో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిలిచిపోయినట్లు చూపించింది. దీంతో అవాక్కయిన వెంకటేశ్ సంబంధిత వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఎక్కడో తప్పిదం జరిగిందని, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులు మంజూరయ్యేలా చూస్తామని అధికారులు తెలిపారు. ఏదేమైనా తాను బతికుండగా చనిపోయినట్లుగా ఆన్లైన్లో నమోదైందని వెంకటేశ్ వాపోయాడు. -
ముడుపులు అందజేసి నచ్చిన చోట పోస్టింగ్..
వరంగల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖలో భారీగా బదిలీలు చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీఐజీ, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–1,గ్రేడ్–2 స్థాయిలో బది‘లీలలు’ జరిగాయి. పదేండ్లకు పైబడి ఒకే స్థానంలో విధులు నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్లకు స్థానచలనం కల్పించేందుకు చేపట్టిన బదిలీల్లో భారీగా ముడుపులు చేతులు మారినట్లు సమాచారం. ఉన్నతాధికారుల ఆశీర్వాదంతో నచ్చిన దగ్గర పోస్టింగ్ పొందినట్లు రిజిస్ట్రేషన్ శాఖలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. బదిలీలు ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డీఐజీ, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–1,గ్రేడ్–2 అధికారులను బదిలీ చేస్తూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఐజీ నవీన్ మిత్తల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ డీఐజీగా – ఎం.సుభాషిణి మహబూబాబాద్–తస్లీమా మహమ్మద్ జనగామ–టి.సంపత్‌కుమార్ వరంగల్ రూరల్–మసీయుద్దీన్ వరంగల్ ఫోర్ట్– ఏ.కార్తీక్ వరంగల్ ఆర్వో–ఎండీ.అమ్జద్ అలీ నర్సంపేట– రామ కిశోర్ రెడ్డి డీఐజీ కార్యాలయం–డి.సుజాత ఎట్టకేలకు కదిలారు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏండ్లుగా లాంగ్ స్టాండింగ్‌లో విధులు కొనసాగిస్తున్న సబ్ రిజిస్ట్రార్లు ఎట్టకేలకు బుధవారం వెలువడిన బదిలీలతో కదిలారు. ఉమ్మడి వరంగల్ జిల్లా దాటని సబ్రిజిస్ట్రార్లు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లాంగ్‌స్టాండింగ్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్–1,గ్రేడ్–2 అధికారులు మల్టీ జోన్–1లో భాగంగా రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఉన్నతాధికారుల అండతో ఉమ్మడి వరంగల్ జిల్లా దాటకుండా తాము ఎంచుకున్న రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పోస్టింగ్ సాధించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గ్రేడ్–1,గ్రేడ్–1 సబ్ రిజిస్ట్రార్ల బదిలీలు మ్యూచువల్‌ను తలపించాయి. వరంగల్ ఆర్వోలో విధులు నిర్వహిస్తున్న సంపత్‌కుమార్ జనగామ, జనగామలో విధులు నిర్వహిస్తున్న అమ్జద్అలీ వరంగల్ ఆర్వో, ములుగు సబ్‌రిజిస్ట్రార్ తస్లీమా మహబూబాబాద్, వరంగల్ ఫోర్ట్‌లో విధులు నిర్వహిస్తున్న మసీయుద్దీన్ వరంగల్ రూరల్, వరంగల్ రూరల్‌లో విధులు నిర్వహిస్తున్న సుజాత డీఐజీ కార్యాలయానికి , నర్సంపేటలో విధులు నిర్వహిస్తున్న కార్తీక్ వరంగల్ రూరల్‌కు కేటాయించారు. ఈ విధంగా ఏ అధికారి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా దాటలేదు. చక్రం తిప్పిన ఉద్యోగ సంఘాల నాయకులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గ్రేడ్–1,గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్ల బదిలీల్లో ఉద్యోగ సంఘాల నేతలు చక్రం తిప్పి ఉమ్మడి వరంగల్ దాటకుండా అడ్డుపడ్డారని తెలుస్తోందని పలువురు పేర్కొన్నారు. భారీగా బదీలీలు జరుగుతాయనే సమచారంతో లాంగ్ స్టాండింగ్ గ్రేడ్–1,గ్రేడ్–2 సబ్ రిజిస్ట్రార్లు లాంగ్ లీవ్ పెట్టి హైదరాబాద్‌కు మకాం మార్చి ఉన్నతాధికారుల అధికారుల ఆశీర్వాదం కోసం ఉద్యోగ సంఘాల నేతలతో జతకట్టారు. -
వరంగల్: 'భూక్య రమేష్' ఇస్రోలో శాస్త్రవేత్తగా..
వరంగల్: మహబూబాబాద్ మండలం సోమ్లతండా గ్రామానికి చెందిన భూక్య రమేష్ ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. చంద్రయాన్–3 ప్రయోగం సందర్భంగా ఇస్రోలోని ప్రధాన శాస్త్రవేత్తలతో కలిసి రమేష్ కూడా పాల్గొన్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన భూక్య భీముడు, లక్ష్మి దంపతుల మూడవ కుమారుడు అయిన రమేష్ ఇస్రోలో నాలుగేళ్లుగా కమ్యూనికేషన్ విభాగంలో పని చేస్తున్నారు. చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ప్రయోగం సమయంలో ఇక్కడే ఉండడం తనకు ఎంతో గర్వంగా ఉందని రమేష్ చెప్పారు. ఈసారి విజయవంతం కావడం భారత దేశ ప్రజల గొప్పతనమని పేర్కొన్నారు. -
పరీక్ష ఒకటి.. పేపర్ మరొకటి.. రాసినా 'నో ప్రాబ్లమ్'..!?
ఆదిలాబాద్: కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య విధానం ఎస్డీఎల్సీఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో మంగళవారం జరిగిన ఓ పరీక్షలో విచిత్రం చోటు చేసుకుంది. విద్యార్థులు రాయాల్సిన పరీక్షకు బదులు మరో పరీక్ష పత్రాన్ని అందించారు. తర్వాత విద్యార్థులు తాము రాసే పరీక్షకు ఈ ప్రశ్న పత్రంతో సంబంధం లేదని గుర్తించారు. ఈ విషయాన్ని లెక్చరర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు తర్వాత విద్యార్థులకు సంబంధిత పరీక్ష పత్రాన్ని అందించి పరీక్ష రాయించారు. పరీక్ష సమయం ముగిసిన తర్వాత అదనంగా కొంత సమయం కేటా యించి పరీక్ష రాయించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. బుధవారం ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విద్యార్థులు చర్చించుకోవడంతో బండారం బయటపడింది. తెలంగాణ హిస్టరీకి బదులు ఇండియన్ హిస్టరీ పేపర్‌ను విద్యార్థులకు ఇచ్చారు. ఈ విషయమై కేయూ పరీక్షల విభాగం అడిషనల్ కంట్రోలర్ నరేందర్‌ను వివరణ కోరగా హిస్టరీలో మూడు విభాగాలు ఉంటాయని, ఇందులో ఏ విభాగం రాసినా ఇబ్బంది లేదని తెలిపారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్‌ను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. -
ఆ 'డీఈ' మరోసారి నోరుపారేసుకున్నాడు.. చివరికి..
కరీంనగర్: ఆ డీఈ మరోసారి నోరుపారేసుకున్నాడు. వరుస వివాదాలు చుట్టుముట్టినా తనను ఎవరూ ఏమి చేయరనే ధీమా మళ్లీమళ్లీ మాటలు తూలేలా చేస్తోంది. తన పైఅధికారులనే లెక్కచేయని సదరు డీఈ ఈ సారి మున్సిపల్ ప్రైవేట్ డ్రైవర్లపై బూతులందుకున్నారు. డీఈ బూతులను తట్టుకోలేని డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. మేయర్‌కు , అధికారులకు ఫిర్యాదు చేశారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో పార్కింగ్ టైల్స్ పనులు కొనసాగుతున్నందున, అద్దెకార్లను కళాభారతి వైపు పార్క్ చేస్తున్నారు. కళాభారతి వైపున్న గేట్‌ను మూసివేయడంతో కార్ల పార్కింగ్‌కు ఇబ్బంది కూడా లేదు. మంగళవారం సాయంత్రం సదరు డీఈ మూసి ఉన్న గేట్‌ను తీయించుకుని లోనికివచ్చాడు. రావడంతోనే ‘ఎవడ్రా నా కొడుకుల్లారా..కార్లిక్కడ పెట్టింది’ అంటూ బూతులతో దూషణకు దిగాడు. డీఈ వైఖరిపై తీవ్ర ఆవేదనకు లోనైన డ్రైవర్లు బుధవారం కార్యాలయంలో నిరసన తెలిపారు. సదరు డీఈపై చర్యతీసుకోవాలని మేయర్ సునీల్‌రావుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాగా డీఈ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. బూతుల డీఈని ఉన్నతాధికారులు నియంత్రించాలని బాధితులు కోరుతున్నారు. ఫిర్యాదు చేసినవారిలో ప్రైవేట్ డ్రైవర్లు గిరిభవన్కుమార్, ప్రశాంత్, సంపత్, శేఖర్ ఉన్నారు. -
ఏంటీ ఈ 'లిపి'..? గవర్నర్ సైతం.. 'వాహ్ శభాష్' అంటూ..
వరంగల్: ఏటా నిర్వహించే సైన్స్‌ఫేర్‌లో ఎవరూ చేయని అద్భుతాన్ని ఆవిష్కరించాలనుకున్నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఫిజికల్సైన్స్ స్కూల్ అసిస్టెంట్ మడ్క మధు. అతడి దృఢ సంకల్పానికి విద్యార్థుల ఆసక్తి తోడైంది. దీంతో నోటితో మాట్లాడకుండా, చెవితో వినకుండా కళ్ల సైగలతో, చెవుల కదలికలతో మాట్లాడే ఓ లిపిని విద్యార్థులు, ఉపాధ్యాయుడు కలిసి తయారు చేశారు. విద్యార్థుల ప్రతిభను చూసి 'గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వాహ్ శభాష్' అంటూ అభినందించారు. విద్యార్థుల్ని, టీచర్‌ను ప్రత్యేకంగా సన్మానించారు. మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఆకుతోట మల్లిక, సల్పాల దేవిక, ఆరెందుల రాజశేఖర్, మద్దిరాల శివ నవదీప్, సల్పాల నందిని, సల్పాల సంకీర్తన ‘ఐ’ కోడింగ్, ‘ఇయర్’ కోడింగ్‌లో ఉపాధ్యాయుడు మధు వద్ద శిక్షణ పొంది ప్రతిభ కనబరుస్తున్నారు. వీటితోపాటు గారడి, ఐబ్రోస్ (కనుబొమ్మలు)సైగలతో భావవ్యక్తీకరణ జరుపుతున్నారు. లిప్(పెదవు)ల మూవ్‌మెంట్‌ను బట్టి మాట్లాడింది చెప్పేస్తున్నారు. విద్యార్థులు వీటిపై మరింత శిక్షణ పొందుతున్నారు. ఇప్పటికే పాఠశాలలో 10 మందికి పైగా ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయుడు మధు శిక్షణ ఇస్తున్నారు. ఏంటీ ఈ లిపి..? ‘ఐ’కోడింగ్ అంటే కను సైగలతో మాట్లాడడం. ఏ, బీ, సీ, డీ ఒక్కో అక్షరానికి ఒక్కో కోడ్ ఉంటుంది. వీటిని కనుసైగలతో వ్యక్తీకరిస్తారు. చెవుల కదలికలతో సైతం భావాల్ని వ్యక్తపరుస్తున్నారు. దీనికీ ప్రత్యేకంగా ఓ లిపిని తయారు చేశారు. ఐ, ఇయర్ కోడింగ్ భాష దేశ రక్షణకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం సీబీఐ, ఆర్మీ, ఇంటెలిజెన్స్, రా ఇతర నిఘావర్గాలకు ఈ లిపి ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయుడు మధు, విద్యార్థులు చెబుతున్నారు. ఒక పేపర్లో ఉన్నది చదివి విద్యార్థి నోటిని తెరవకుండా కళ్లు మూస్తూ.. తెరుస్తూ... మీదకు, కిందికి ఎగరేస్తూ.. చెవులను కదిలిస్తూ సైగలతో భావాల్ని వ్యక్తీకరిస్తే.. మరో విద్యార్థి ఆ సైగలు చూసి పొల్లుపోకుండా పేపర్‌పై రాసి చూపిస్తుంది. విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని చేతిలో ఏముందో చెబుతూ మంత్రాలు, తంత్రాలు లేవని గ్రామీణులకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. దేశ రక్షణకు ఉపయోగం.. గవర్నర్ కితాబిచ్చారు.. ‘చెవులను కదిలించడం జంతువులకే సాధ్యం అలాంటిది మీరు చేస్తున్నారంటే గ్రేట్’ అని గవర్నర్ మేడమ్ కితాబిచ్చారు. మా టీచర్ల ప్రోత్సాహంతో బాగా శిక్షణ పొందుతున్నాం. మేం, మా భాష దేశ రక్షణకు ఉపయోగపడితే చాలు. పోలీస్ జాబ్ చేయాలనేది నా కోరిక. – శివ నవదీప్, ఎనిమిదో తరగతి మరిచిపోలేని అచీవ్మెంట్.. ఐ కోడింగ్ గురించి మా గైడ్ టీచర్ మధు చెప్పారు. ఆసక్తితో నేర్చుకున్నాను. ఈ భాషను భవిష్యత్‌లో దేశానికి ఉపయోగపడేలా సాధన చేస్తాం. గవర్నర్ మేడమ్ మమ్మల్ని మెచ్చుకోవడం మరిచిపోలేని అచీవ్మెంట్. – ఆకుతోట మల్లిక, పదో తరగతి ప్రపంచంలో ఎక్కడా లేని భాష.. సైన్స్‌ఫేర్‌లో కొత్తగా ఉండాలని ఐ, ఇయర్ కోడింగ్ రెండు ప్రత్యేక భాషలు ఎంచుకున్నా. దీనికి ప్రత్యేకంగా లిపిని తయారు చేశా. దీనికి మాప్రాంతంలో మంచి ఆదరణ వస్తోంది. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఈ భాష లేదని అనుకుంటున్నా. గవర్నర్‌ను విద్యార్థులతో కలవడం మరిచి పోలేం. విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి దేశానికి ఉపయోగపడేలా చేయాలనేది నా లక్ష్యం. ఇంకా గారడి, ఐబ్రోస్, లిప్ మూవ్‌మెంట్‌పై సాధన జరుగుతోంది. – మడ్క మధు, ఫిజికల్సైన్స్ ఎస్ఏ, మహదేవపూర్ -
నేటితో ‘వరంగల్’ పదవీకాలం ముగింపు! తదుపరి మరెవరికీ?
వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం పదవీకాలం నేటి (శుక్రవా రం)తో ముగియనుంది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఉద్యమకారులకే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ అప్పటి టీఆర్ఎస్ పార్టీలో వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే డిమాండ్ రావడంతో అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చైర్మన్ పదవికి రిజర్వేషన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఐదేళ్ల వరకు రిజర్వేషన్లు వర్తింపజేస్తూ డ్రా పద్ధతిలో చైర్మన్ల పదవీ కాలాన్ని నిర్ణయించారు. రిజర్వేషన్ ఇలా.. మొదటిసారి జనరల్, రెండోసారి బీసీ, మూడోసారి ఎస్సీ మహిళ, నాలుగో సారి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కాంగ్రెస్‌కు చెందిన మంద వినోద్‌కుమార్ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన 02–09–2013లో చైర్మన్‌గా నియమితులై 28.02.2015 వరకు కొనసాగారు. రిజర్వేషన్ అమల్లోకి రావడంతో తొలి శాసనసభ స్పీకర్‌గా ఉన్న మధుసూదనాచారి అనుయాయుడు పరకాల నియోజకవర్గానికి చెందిన కొంపెల్లి ధర్మరాజుకు వరంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కింది. ఆయన 15–10–2016 నుంచి 06–10–2018 వరకు పూర్తిగా రెండేళ్ల పాటు చైర్మన్‌గా పని చేశారు. మరోసారి పదవి పొడిగించుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఉద్యమకారుడి కోటాలో అదే నియోజకవర్గానికి చెందిన చింతం సదానందం చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఆయన 21 డిసెంబర్ 2019లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అయినప్పటికీ మరో ఆరు నెలల పాటు పొడిగింపు పొందడంతో 19–06–2021వరకు ఏడాదిన్నర పాటు పదవిలో కొనసాగారు. మరో ఆరునెలలు పొడిగింపునకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ గ్రేటర్ కార్పొరేషన్ మేయర్ పదవి దిడ్డి కుమారస్వామికి దక్కకపోవడంతో మార్కెట్ పదవి కావాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే పట్టుబట్టి దిడ్డి కుమారస్వామి సతీమణి భాగ్యలక్ష్మిని చైర్‌పర్సన్‌గా చేశారు. కాగా.. కాజీపేట, పరకాలకు చెందిన నాయకులకు చైర్మన్ పదవీ ఇవ్వాలని ఇతర పెద్ద నాయకులు ప్రయత్నించినప్పటికీ గ్రేటర్ రాజకీయాల వల్ల ఉద్యమకారులకు ద క్కకుండా పోయింది. దిడ్డి భాగ్యలక్ష్మి చైర్‌పర్సన్‌గా 19–08–2021నుంచి 18–07–2022 వరకు కొనసాగారు. మరో ఏడాది పాటు కమిటీ గడువు పెంచాలని తీవ్రంగా ప్రయత్నాలు చేసినా పొడిగించలేదు. ఈసమయంలోనే పరకాల నియోజకవర్గానికి చెందిన ఒక నాయకుడికి ఈ పదవి కట్టబెట్టాలని జిల్లాకు చెందిన మంత్రి తీవ్రంగా ప్రయత్నించడం వల్ల ఉన్న కమిటీ పొడిగింపులో జాప్యం జరిగింది. కొత్త చైర్మన్ నియామకానికి రిజర్వేషన్ అడ్డంకిగా మారడంతో చివరికి ఇదే కమిటీ కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో దిడ్డి భాగ్యలక్ష్మి 18–08–2023 వరకు చైర్‌పర్సన్‌గా రెండేళ్ల పాటు పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. ఈసారైనా దక్కేనా? వరంగల్ మార్కెట్ కమిటీ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆప్రాంతానికి చెందిన వారికి చైర్మన్ పదవి దక్కలేదు. గతంలో చైర్మన్ పదవి తన నియోజకవర్గానికే ఇవ్వాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ పట్టుబట్టినప్పటికీ వచ్చేసారి రిజర్వేషన్ అమలు అవుతున్నందున తప్పకుండా అవకాశం ఇస్తామని పార్టీ అధిష్టానం చెప్పడంతో ఆయన మిన్నకుండిపోయారు. అందువల్ల ఈసారి వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన వారికే పదవి అనే ప్రచారం జరుగుతోంది. కానీ ఎన్నికల ముందు నూతన కమిటీ ఏర్పాటు చేసి తలనొప్పి ఎందుకు తెచ్చుకోవాలన్న ఆలోచన సైతం నాయకులు చేస్తున్నట్లు తెలిసింది. శుక్రవారంతో మార్కెట్ పాలకవర్గం పదవీకాలం పూర్తి అవుతున్నందున కొత్త కమిటీని నియమిస్తారా? ఎన్నికలు ముగిసే వరకు స్పెషల్ ఆఫీసర్‌తో పూర్తి చేస్తారా? అనేది వేచి చూడాలి. -
మేం 'తెలంగాణ బిడ్డలం' కాదా..? మరెందుకు మాపై ఇలా..
మెదక్: మేం తెలంగాణ బిడ్డలం కాదా? అందరినీ రెగ్యులరైజ్ చేస్తున్న సీఎం కేసీఆర్ 15 నుంచి 20 ఏళ్లుగా రోగులకు సేవలందిస్తున్న తమను ఎందుకు పట్టించుకోవడం లేదని సెకండ్ ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు తన్వీర్ మాట్లాడుతూ.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, హెల్త్ డిపార్ట్మెంట్లో కొందరిని, వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసిన సీఎం తమను ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. ఎప్పటికైనా రెగ్యులరైజ్ అవుతుందన్న ఆశతో ఉన్నామని, కొత్తగా నోటిఫికేషన్ వేసి తమ కుటుంబాలను రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. 15 రోజులుగా ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం స్పందించక పోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో తులసి, సంగీత, సులోచన, రమ్య, యాదమ్మ పాల్గొన్నారు. -
బడిలో ఏడు పాములు.. ఒకేసారి విద్యార్థిపైకి..
సంగారెడ్డి: మండల పరిధిలోని ముస్లాపూర్ ప్రాథమిక పాఠశాలలో పాములు కలకలం రేపాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడుపాములు బయట పడడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం తరగతి గదిలోకి వెళ్లిన విద్యార్థులు పామును చూసి అరిచారు. అక్షయ పాత్ర సిబ్బంది, స్థానికులు అక్కడికి చేరుకుని పామును చంపివేశారు. అయితే మరోవైపు నుంచి ఒక్కో పాము రావడంతో వారు విస్తుపోయారు. మొత్తం ఆరు పాములను చంపివేశారు. తరగతి గది అపరిశుభ్రంగా ఉండడంతో పాములు సంచరిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
పల్లె సైనికుడా.. దేశ రక్షకుడా..
నిర్మల్: జవాన్ అంటే ఉద్యోగం కాదని దేశ సేవ చేయడమేనని నిరూపిస్తున్నారు బోథ్‌కు చెందిన జవాన్లు. మండల కేంద్రం నుంచి దాదాపు 181 మంది జవాన్లు ఉన్నారు. వివిధ హోదాల్లో వీరు సేవలందిస్తున్నారు. రాబోయే రోజుల్లో అకాడమీ ఏర్పాటుకు పలువరు సైనికులు సన్నాహాలు చేస్తున్నారు. స్థానిక యువతకు సైనికులు ఆదర్శంగా నిలుస్తున్నారు. కాగా బోథ్ మండలానికి చెందిన యువత జవాన్‌గా మారడానికి సన్నద్ధమవుతున్నారు. వీర మరణం పొందిన జవాన్.. 'బోథ్ మండలం మర్లపెల్లికి చెందిన లింగాగౌడ్ కుమారుడు గొడిసెల సతీశ్‌గౌడ్ సీఆర్పీఎఫ్లో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 2016లో గడ్చిరోలి, చత్తీస్ఘడ్ సరిహద్దు ప్రాంతంలో మావోలు, సీఆర్పీఎఫ్ బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో సతీశ్‌గౌడ్ మృతిచెందారు. ఆయన స్వస్థలం మర్లపెల్లిలో ఆయన జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిఏటా ఆయన వర్ధంతిని గ్రామస్తులు ఘనంగా నిర్వహిస్తారు.' ఒకే కుటుంబం నుంచి ఏడుగురు సైనికులు.. బోథ్‌లోని కదం భోజారామ్, ముకుంద్, శంకర్, నర్సింగ్‌రావులు అన్నదమ్ములు. దివంగత భోజారామ్‌కు ఐదుగురు కుమారుల్లో ప్రవీణ్ కుమార్, ప్రతాప్ సైనికులు. ముకుంద్‌కు ముగ్గురు కుమారుల్లో ఇద్దరు సైనికులే. పెద్దకుమారుడు సుధాకర్ సైనికుడిగా సేవలందించి ఇటీవల రిటైర్డ్ అయ్యాడు. రెండో కుమారుడు మధుకర్ సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. శంకర్ కుమారుడు ప్రశాంత్, కదం నర్సింగ్‌రావు కుమారుడు విజయ్ సైనికులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఏడుగురు జవాన్లుగా దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. -
వామ్మో.. పాకాల వాగులో మొసలి.. భయాందోళనలో రైతులు..
వరంగల్: మండల కేంద్రానికి సమీపంలోని పాకాల వాగు నీటిలో ఆదివారం రైతులకు మొసలి కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని వారు తమకు తెలిసిన ఓ ఫొటోగ్రాఫర్‌కు సమాచారం అందించడంతో అతను వీడియోలో బంధించాడు. గూడూరు నుంచి నెక్కొండ, కేసముద్రం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిపై పాకాల వాగు బ్రిడ్జికి సమీపంలో పెద్దమర్రి ఉంది. వాగుకు రెండు వైపులా పంటపొలాలు సాగవుతున్నాయి. నిత్యం రైతులు దుక్కులు దున్నిన తరువాత పశువులను వాగు నీటితో శుభ్రం చేస్తారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు వాగు పొంగిన విషయం తెలిసిందే. ఆ నీటిలో కొట్టుకు వచ్చిన మొసలి గూడూరు సమీపంలోని నీటి గుంతలలో సంచరిస్తోంది. రెండు మూడు రోజులుగా పెద్దమర్రి ప్రాంతంలో నీరు తాగడానికి వెళ్లిన గేదెలు, పశువులను చంపడానికి యత్నించగా అవి బెదిరి బయటికి వచ్చాయి. ఈ ఘటనను చూసిన ఓ రైతు మొసలిగా గుర్తించాడు. ఎవరూ నీటిలో దిగొద్దని సహచర రైతులకు తెలిపారు. -
'ఆకాశవీధిలో'.. డ్రోన్ల లేజర్ షో..
మహబూబ్‌నగర్: పాలమూరులోని మినీట్యాంకుబండ్పై ఆదివారం రాత్రి రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 450 డ్రోన్ల ద్వారా నిర్వహించిన మెగా లేజర్ షో ఆకాశంలో కనువిందు చేసింది. 15 నిమిషాల పాటు ఆకాశంలో నిర్వహించిన వివిధ ప్రదర్శనలు అద్భుతంగా అనిపించాయి. కొన్నిరోజులుగా జిల్లా అధికారులు ఈ ప్రదర్శనపై విస్తృతంగా ప్రచారం కల్పించడంతో వేలాది మంది తరలివచ్చారు. సాయంత్రం ఐదు గంటల నుంచే జనం రాక మొదలైంది. ఒకవైపు మినీ ట్యాంక్‌బండ్ ప్రధాన ద్వారమైన మోడ్రన్ రైతుబజార్ పక్క నుంచి, మరోవైపు షాషాబ్‌గుట్ట–భగీరథకాలనీచౌరస్తా మధ్యనున్న కట్ట నుంచి స్టేజీ వద్దకు అనుమతించారు. ముందుగా హైదరాబాద్ నుంచి వచ్చిన కళాకారులు తెలంగాణపై పాడిన పాటలు ఆహుతులను అలరించాయి. ముఖ్యంగా రేలారేలారే.. నా తెలంగాణ, బలగం సినిమాలోని ఊరు.. పల్లెటూరు.. తదితర పాటలకు యువత కేరింతలు కొట్టారు. కార్యక్రమం రాత్రి 8 గంటలకు ముగియగా జనం ఒక్కసారిగా బయటకు వస్తుండగా రెండు మార్గాల్లోనూ గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోగా.. పోలీసులు క్లియర్ చేశారు. అట్టహాసంగా ప్రారంభం.. లేజర్ షో ప్రదర్శనకు ముఖ్య అతిథి హాజరైన రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ శ్రీనివాస్‌గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ఇంత పెద్ద డ్రోన్‌షో నిర్వహించడం దేశంలోనే మొదటిసారి అన్నారు. క్రమం తప్పకుండా ఇలాంటి ఈవెంట్స్ భవిష్యత్‌లోనూ ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీచైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ మనోహర్, కలెక్టర్ రవినాయక్, ఎస్పీ కె.నరసింహ, డీసీసీబీ ఇన్చార్జ్ చైర్మన్ వెంకటయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, జిల్లా గొర్రెల పెంపకందారుల సంక్షేమ సంఘం అధ్యక్షు డు శాంతన్న యాదవ్, అదనపు కలెక్టర్ మోహన్‌రావు, ఏఎస్పీ రాములు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్‌చైర్మన్ గణేష్‌కుమార్, కమిషనర్ ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
'పంద్రాగస్టు'కు ప్రధాని నుంచి పిలుపు
కరీంనగర్: పంద్రాగస్టు సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాలని మానకొండూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన పాకాల పురుషోత్తంరెడ్డి, పద్మజ దంపతులకు ప్రధాని నుంచి పిలుపు అందింది. పురుషోత్తం రెడ్డి ప్రస్తుతం మానకొండూర్ ప్రగతి రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. జమ్మికుంట రైతు ప్రగతి, రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం చైర్మన్ సంద మహేందర్, కవిత దంపతులకు సైతం ఆహ్వానం అందినట్లు శనివారం తెలిపారు. -
‘కాసులిస్తే’ అన్నీ ఓకే.. లేదంటే 'నో పర్మిషన్'!
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహణ కొనసాగిస్తోంది. ఈ విషయం విద్యా శాఖాధికారులకు తెలిసినప్పటికీ మామూలుగా వ్యవహరిస్తున్నారు. పాఠశాల యాజమాన్యానికి రాజకీయ అండదండలు, రాష్ట్ర ఉన్నతాధికారులతో సంబంధాలు ఉండడంతో జిల్లా విద్యాశాఖాధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్‌లో గల ఈ పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు నిర్వహిస్తున్నారు. అనుమతుల కోసం అక్టోబర్ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో వీరు ఆన్లైన్ చేసుకోలేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులతో ప్రత్యేక అనుమతి తీసుకున్నప్పటికీ ఆన్లైన్లో మాత్రం ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేదని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం నిబంధనలు మాత్రం పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాఠశాలకు అనుమతి లేదని విద్యానగర్‌కు చెందిన యువజన సంఘాలు, కాలనీవాసులు డీఈవోకు ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. ఇదిలా ఉండగా పాఠశాల యాజమాన్యానికి చెందిన పలువురు డీఈవో కార్యాలయానికి వెళ్లి త్వరగా అనుమతులు ఇవ్వాలని ఉద్యోగులను బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘కాసులిస్తే’ అన్నీ ఓకే.. గతంలో విద్యానగర్‌లోని ఇదే పాఠశాల భవనంలో ఓ ప్రైవేట్ పాఠశాల కొనసాగేది. ఆ భవనానికి ఫైర్ అధికారులు ఫైర్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. పాఠశాల భవనం చుట్టూ వెళ్లే విధంగా లేదని, ఫైర్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో ఆ యాజమాన్యం మరోచోట పాఠశాల నిర్వహణ కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ భవనంలోనే కొనసాగుతున్న ఓ పాఠశాల యాజమాన్యానికి మాత్రం ఫైర్ అధికారులు అనుమతినివ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కాసులిస్తే ఎలాంటి పనులైనా చేసుకోవచ్చనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ పాఠశాలకు ఫైర్ సర్టిఫికెట్ ఏ నిబంధనల మేరకు ఇచ్చారని ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యులు అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివరణ కోరిన ఉన్నతాధికారులు జిల్లాకు చెందిన పలువురు ఫైర్ అధికారులకు మెమోలు జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయమై స్టేషన్ ఫైర్ అధికారి శివాజీని వివరణ కోరగా ఉన్నతాధికారి సెలవులో ఉన్నారని, తనకు ఈ విషయం తెలియదని వివరించారు. తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం.. అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహణ కొనసాగించరాదు. ఆ పాఠశాల యాజమాన్యం గడువు లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఉన్నతాధికారులతో ప్రత్యేక అనుమతి పొందారు. అయినప్పటికీ ఇంతవరకు ఆన్లైన్లో ప్రక్రియ పూర్తి కాలేదు. మాకు ఎలాంటి పత్రాలు సమర్పించలేదు. పాఠశాలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం. – ప్రణీత, డీఈవో -
మందుబాబుల హల్చల్.. పార్కింగ్ హడల్..! అధికారుల పట్టింపు మాత్రం ఫుల్ నిల్..!!
ఆదిలాబాద్: జిల్లాకేంద్రంలోని పలు వైన్స్ షాపుల ఎదుట మందుబాబులు హల్చల్ చేస్తున్నారు. పర్మిట్ రూమ్‌లు ఉన్నప్పటికీ రోడ్డుపైనే మద్యం తాగుతూ మత్తులో తూగుతున్నారు. ప్రధానంగా రోడ్లను ఆనుకొని ఉన్న వైన్స్‌ల వద్ద మహిళలు, విద్యార్థినులకు భద్రత కరువవుతోంది. ఈ దారిగుండా వెళ్లాలంటేనే జంకుతున్నారు. జిల్లాకేంద్రంలోని దస్నాపూర్, కలెక్టర్‌చౌక్, వినాయక్‌చౌక్, బస్టాండ్ ప్రాంతం, తెలంగాణచౌక్, పంజాబ్చౌక్లలో వైన్స్‌లు, బార్లు రోడ్డుకు ఆనుకొని ఉండడంతో మందుబాబులు రోడ్లపైనే ఇష్టారాజ్యంగా మందు తాగుతున్నారు. కట్టడి చేయాల్సిన పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. -
చీకటి పడితే చాలు.. అక్కడ అంతే సంగతులు..!
వరంగల్: లక్కపురుగుల బాధతో కాజీపేట పరిధిలోని రహమత్ నగర్, వెంకటాద్రి నగర్, విష్ణుపురి కాలనీల ప్రజలకు కంటి మీద కునుకు కరువైంది. వెంకటాద్రి నగర్లో ఉన్న ఎఫ్‌సీఐకి కిలోమీటరుకుపైగా దూరం ఉన్న ఈకాలనీలవాసులు లక్కపురుగుల బాధపడలేక ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్నారు. ఎఫ్‌సీఐ అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేని తనంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా సిబ్బంది జీతభత్యాలు కలిపి రూ.10 లక్షలకు పైగా లక్కపురుగుల నివారణకు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. కానీ.. ఆచరణలో మాత్రం విఫలమవుతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. చీకటిపడితే ఇంట్లోనే బందీ.. చీకటి పడిందంటే చాలు.. పలు కాలనీల వాసులు తలుపులు, కిటికీలు మూసుకుని ఇళ్లలోనే బందీలవుతున్నారు. అసలే వర్షాకాలం, ఆపై దోమల బెడద, వీటికి తోడు పట్టణవాసులకు లక్క పురుగులు చుక్కలు చూపెడుతున్నాయి. నీళ్లలో, బియ్యం, వంట పదార్థాల్లో కుప్పలుతెప్పలుగా పడిపోతున్నాయి. దీని వల్ల అన్నం నోట్లోకి వెళ్లట్లేదు. కనీసం కంటి నిండా నిద్రపోదామంటే ఒంటిపై వాలుతూ.. చెవుల్లో చేరుతూ లక్కపురుగులు ప్రత్యక్ష నరకాన్ని చూపుతున్నాయి. లక్కపురుగులు వాలిన చోట దద్దుర్లు వస్తున్నాయని, వీటితో ఆస్పత్రుల పాలవుతున్నామని పలు కాలనీల వాసులు వాపోతున్నారు. పిల్లల బాధ మరీ వర్ణనాతీతంగా మారింది. ఒంటిపై దద్దుర్లు, దురదతో బాధపడుతున్నారు. వణికిస్తున్న లక్కపురుగులు.. పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకుని ఇంటికి చేరిన రాధమ్మ బువ్వ తిందామని కూర్చుంది. కూర వాసనకు నోరూరింది. నోట్లో బుక్క పెట్టుకుందామనేలోపే గిన్నెలో లక్కపురుగు కనిపించింది. ఆకలి మంటతో ఉన్న రాధమ్మకు ఆ పురుగులు చూడగానే ముద్ద దిగలేదు. ఈ పరిస్థితి ఒక్క రాధమ్మదే కాదు.. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) సమీపంలోని కాలనీల వారందరిదీ. పట్టించుకోని అధికారులు.. లక్కపురుగుల నివారణకు లక్షలాది రూపాయలు మంచినీళ్లప్రాయంగా ఖర్చు పెడుతున్నట్లుగా అధికారులు లెక్కలు చూపుతున్నారు. అయినప్పటికీ ఫలితం కన్పించట్లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్కపురుగుల వల్ల పడుతున్న నష్టాలు తెలుపుతూ ఏరియా మేనేజర్‌కు పట్టణవాసులు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా.. అవన్నీ చెత్తబుట్టలోనే చేరుతున్నాయంటూ బాధిత కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్క పురుగులను నివారించడంలో అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ గతంలో రాజకీయ పార్టీలకతీతంగా ఆందోళనలు చేపట్టారు. అప్పుడు ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. జనవాసాల మధ్య గోదాంలు ఉన్నందున అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణంగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికైనా ఎఫ్‌సీఐ అధికారులు లక్కపురుగుల నివారణ చర్యలను ముమ్మరం చేసి ఇబ్బందులను తొలగించాలని కాజీపేటవాసులు కోరుతున్నారు. -
అరుస్తూ.. కరుస్తూ.. ఆపై ఆ ఊర్లో ఒక్కసారిగా..!
వికారాబాద్: పిచ్చికుక్క వీరంగం చేసింది.. బిగ్గరగా మొరుగుతూ (అరుస్తూ) కనిపించిన వాళ్లందరినీ కరుస్తూ భయభ్రాంతులు సృష్టించింది. ఈ సంఘటన గురువారం ఉదయం రేగడిమైలారంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇందిరానగర్ కాలనీలోని పలు ఇళ్లలో దూరిన వీధికుక్క చిన్నారులపై దాడికి పాల్పడింది. ఆరుగురిని కరిచి, తీవ్రంగా గాయ పరిచింది. వీరి అరుపులు, కేకలతో భయపడిన తల్లిదండ్రులు పరుగున వచ్చి పిల్లలను ఆస్పత్రికి తరలించే టెన్షన్లో ఉండగా.. ఒకరి తర్వాత ఒకరిని కరుస్తూ వెళ్లింది. దీని దాడిలో నెల్లి శ్రీనివాస్ కొడుకు ఆదిత్య(ఎల్కేజీ), బంటు అంజిలయ్య కూతురు నందిని(యూకేజీ), నెల్లి వెంకటప్ప కూతురు నవ్యశ్రీ(ఎల్కేజీ), మంగలి శ్రీనివాస్ కూతురు దివ్యశ్రీ(ఎల్కేజీ), మమత, నర్మద గాయపడ్డారు. అలాగే ఇందిరానగర్‌కు చెందిన వృద్ధుడు కుమ్మరి రాములును కరిచిన కుక్క.. అక్కడి నుంచి గ్రామంలోని జాతీయ రహదారిపైకి వచ్చి డీప్లానాయక్ తండాకు చెందిన పూల్‌సింగ్ అనే వ్యక్తిని గాయపర్చింది. దీనిదాడిలో మొత్తం పది మంది గాయపడ్డారు. వీరందరినీ కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రథమచికిత్స చేశారు. గాయాలు ఎక్కువగా ఉన్న నలుగురు చిన్నారులను హైదరాబాద్‌లోని నల్లకుంట ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితులు ఇళ్లకు చేరుకున్నారు. ఈ సంఘటనతో ఊరంతా ఉలిక్కిపడింది. పది మందిపై దాడిచేసిన కుక్క మాత్రం తప్పించుకుపోయింది. దీంతో వీధుల్లో కుక్కలను చూస్తే గ్రామస్తులు హడలిపోతున్నారు. కుక్కలను అరికట్టాలని కోరుతున్నారు. -
ఆ గ్రామ పెద్దలకే అలా జరగడంతో.. భయంతో వణికిపోతున్న జనం
ఆదిలాబాద్: పదిరోజుల వ్యవధిలో మండలంలోని డోంగర్‌గామ్ గ్రామపెద్దలు మడావి దేవ్‌రావ్, గ్రామపటేల్ పెందోర్ బాదుపటేల్ కంటిచూపు పోగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. 10రోజుల క్రితం గ్రామానికి చెందిన మడావి దేవ్‌రావ్ కంటిచూపు కోల్పోయాడు. అతడి కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించినా చూపు రాలేదు. నాలుగు రోజుల క్రితం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించినా ఫలితం లేకపోయింది. బుధవారం రాత్రి ఉన్నట్టుండి గ్రామపెద్ద, గ్రామపేటల్ పెందోర్ బాదుపటేల్ కంటిచూపు పోయింది. పదిరోజుల వ్యవధిలో ఇద్దరు గ్రామపెద్దల చూపు పోవడంతో గ్రామ ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, 40రోజుల క్రితం ఓ ప్రజాప్రతినిధి డోంగర్‌గామ్ గ్రామాన్ని సందర్శించాడు. గ్రామ పొలిమేరలోని హనుమాన్ విగ్రహానికి బంగారు కళ్లు చేయిస్తానని అప్పటికే ఉన్న వెండికళ్లు తీసుకువెళ్లాడు. బంగారు కళ్లు చేయిస్తానన్న సదరు ప్రజాప్రతినిధి జాప్యం చేయడంతోనే గ్రామపెద్దలు వరుసగా చూపు కోల్పోతున్నారని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు దృష్టి సారించి కంటిచూపు కోల్పోతున్న వారిని పరీక్షించి చూపు వచ్చేలా చూడాలని కోరుతున్నారు. -
ఇవి తిన్నారంటే చాలా డేంజర్.. ఎందుకంటే?
కరీంనగర్: ప్రజారోగ్యానికి పారిశుధ్యం ఎంత ముఖ్యమో.. తినే పదార్థాలు శుచిగా ఉండాలనేది అంతే ముఖ్యం. కానీ కరీంనగర్లో రోడ్డు పక్కన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లే కాదు.. ఎక్కువ శాతం హోటళ్లలోనూ శుచీ, శుభ్రత, సరఫరా చేసే ఆహారపదార్థాల నాణ్యత దారుణంగా ఉంటోంది. కల్తీ మయంగా మారిన ఈ పరిస్థితిని నివారించేందుకు కొరడా ఝళిపించాల్సిన ఆహార తనిఖీ అధికారులు మొద్దు నిద్ర పోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏడాదికి ఒకసారో.. రెండుసార్లో మొక్కుబడిగా హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై దాడులు చేస్తూ ఒకటి రెండు కేసులు నమోదు చేస్తూ మమ అనిపిస్తున్నారు. ఆహార పదార్థాల శాంపిళ్లను సేకరించి ప్రయోగశాలలకు పంపి ఇక తమ పని అంత వరకేనన్నట్లుగా వ్యవహరించడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఇలా జరిగింది.. సరదాగా కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లిన తిరుపతి చికెన్ మంచూరియా కోసం నగరంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ వద్దకు వెళ్లారు. అక్కడ సుష్టుగా తిని ఇంటికి వచ్చారు. కొద్ది సేపటికే వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి వెళ్తే ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇలా జరిగిందని వైద్యులు తేల్చారు. కృష్ణకుమార్ పుట్టిన రోజు అని సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి రోడ్డు పక్కన ఫాస్ట్ సెంటర్ వద్ద చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నారు. మరుసటి రోజు కడపునొప్పి రావడం, కొద్ది సేపటికే విరోచనాలు మొదలవడంతో నీరసించిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రిలో చేర్పించగా ఫుడ్ పాయిజన్ అని చెప్పి వైద్యులు చికిత్స అందించారు. హోటల్ పెట్టాలంటే.. గతంలో హోటల్ పెట్టాలంటే కార్పొరేషన్ ఇచ్చే ట్రేడ్ లైసెన్సుకు తోడు వివిధ రకాల అనుమతులు పొందాల్సి వచ్చేది. మారిన పరిస్థితులు, నిబంధనల దృష్ట్యా ట్రేడ్, ఫుడ్ లైసెన్సులు పొందితే చాలు. ఇవీ ప్రమాణాలు ► వంట కోసం ఉపయోగించే నూనెను ఒకసారి కంటే ఎక్కువ వాడరాదు. ► వండిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లలో నిల్వచేయొద్దు. ► తాగునీటికి తప్పనిసరిగా ఫిల్టర్ వినియోగించాలి. ► కుళ్లిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగదారుడికి సరఫరా చేయరాదు. ► కోడి, మేక మాంసంలను ఒకేచోట పెట్టరాదు. పదార్థాలను సరైన వాతావరణంలో నిల్వ ఉంచాలి. ► వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి. మురుగునీటి వ్యవస్థ చుట్టుపక్కల ఉండరాదు. తనిఖీలతో సరి హోటళ్లు, ఫాస్ట్సెంటర్లు, బేకరీలు.. ఇతర సంస్థలపై అప్పుడప్పుడు అధికారులు తనిఖీలు చేస్తున్నా వాటి యాజమాన్యాల తీరులో మార్పు ఉండటం లేదు. అపరిశుభ్ర పదార్థాలను సరఫరా చేస్తూనే ఉన్నారు. కారణం.. తనిఖీలు చేసినా అంతగా ఇబ్బంది పెట్టే చర్యలు ఉండవన్న ధీమా వారిలో నెలకొంది. పూర్తిస్థాయిలో ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్న ఉదంతాలు మచ్చుకై నా లేవు. హెచ్చరికలు, ట్రేడ్ లైసెన్సులను ఉపసంహరించడం వంటి చర్యలతో సరిపెడుతున్నారు. స్కిన్ అలర్జీలు వస్తాయి.. కల్తీ నూనెలు, కల్తీ వస్తువులతో చేసే ఫాస్ట్, జంక్ ఫుడ్ తినడం వల్ల స్కిన్ అలర్జీలు ఎక్కువగా వస్తాయి. కండ్ల వద్ద వాపు, పెదాలు వాపు రావడం, అక్కడితో ఆగకుండా గొంతు వాపు వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో అత్యవసరంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. – డాక్టర్ రాచకొండ రమేశ్, చర్మ వ్యాధి నిపుణులు జంక్ ఫుడ్‌తో ప్రమాదం.. హోటల్స్, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తినే జంక్‌ఫుడ్‌తో చాలా ప్రమాదాలు ఉన్నాయి. రెగ్యులర్‌గా తినే వారు గ్యాస్ట్రబుల్, అల్సర్ వంటి వ్యాధుల భారినపడుతున్నారు. ఈ మధ్య కాలంలో కేసులు 20 శాతం పైగా పెరిగాయి. సహజసిద్ధమైన ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం కాపాడుకోవచ్చు. – డాక్టర్ అనిల్‌కుమార్, జనరల్సర్జన్ నియంత్రణ ఉండాలి.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఇష్టారీతిన సెకండ్ క్వాలిటీ వస్తువులు, అడ్డగోలుగా కెమికల్స్ వాడుతూ ఫుడ్ రుచికరంగా తయారుచేస్తున్నారు. దీంతో జనాలు సైతం రుచికి అలవాటు పడి తింటున్నారు. అది తినడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్నారు. వాటిపై నియంత్రణ ఉండాలి. – శ్యాంసుందర్, కరీంనగర్ నిరంతర తనిఖీలు చేపట్టాలి.. ఆహార కల్తీకి పాల్పడుతున్న హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై నిరంతరం తనిఖీలు చేపట్టాలి. రుచి కోసం హానికరమైన కెమికల్స్ వాడినట్లు గుర్తిస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. నూనెను ఎక్కువ రోజులు వాడడం వల్ల వివిధ రకాల రోగాలు వస్తున్నాయి. – భాస్కర్, కరీంనగర్ ఊబకాయులుగా తయారవుతారు.. కల్తీ ఆహారపదార్థాలు, చీజ్, బట్టర్ వంటివి వాడడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఊబకాయులుగా తయారయ్యే ప్రమాదం ఉంది. మనిషికి ఊబకాయంతో పాటు బ్లడ్‌లో కొవ్వు చేరడం వల్ల రక్తనాళాలు మూసుకుపోతాయి. దీంతో రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. – డాక్టర్ ఉపేందర్‌రెడ్డి, క్రిటికల్‌కేర్ నిపుణులు