News
-
ఏంటి..? నిజాయితీగా పని చేస్తే ఇలా చేస్తారా..!?
కుమరం భీం: నిజాయతీగా పని చేసిన అధికారులకు వేధింపులు తప్పడం లేదు. కుమురంభీం జిల్లా రవాణా శాఖ అధికారిపై అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. జిల్లాలో ఇసుక, కంకర తదితర రవాణా చేసే టిప్పర్లు నిబంధనలకు విరుద్ధంగా భారీ లోడ్‌తో వెళ్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కౌటాల తదితర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీనిపై ‘సాక్షి’ గత నెల 24న ‘కిల్లింగ్.. ఓవర్ లోడ్’ శీర్షికన ఓ కథనం ప్రచురించింది. స్పందించిన జిల్లా రవాణా శాఖ అధికారి జి.లక్ష్మీ తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అదే రోజున ఐదు టిప్పర్లు అధిక లోడ్‌తో వెళ్తున్న వాటిని గుర్తించి సీజ్ చేశారు. వాటిని విడిచిపెట్టాలంటూ ఓ ప్రజాప్రతినిధి ఫోన్ చేసి అడిగారు. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో తాము చెప్పినా వినిపించుకోకుండా, ఫైన్ వేస్తారా? అనే కోపంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, రవాణాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఆ ఫిర్యాదు ప్రభుత్వ పరి శీలనలో ఉంది. దీంతో ఆమెను ఇక్కడి నుంచి బదిలీ వేటు వేస్తారా? అని అధికారుల్లో చర్చ నడుస్తోంది. అయితే తన విధులు తాను నిర్వర్తించానని, ఇందులో రాజకీయం జోక్యం చేసుకున్నా తనకేం ఇబ్బంది లేదని, ఎక్కడైనా పని చేస్తామనే ధీమాతో ఉన్నట్లు తెలిసింది. -
సంక్షేమంపై దూకుడు
సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లా అధికార యంత్రాంగం సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతిష్టాత్మక పథకాలను వీలైనంత త్వరగా లబ్ధిదారుల చెంతకు చేరేలా చర్యలు చేపట్టింది. ప్రధానంగా గొర్రెల పంపిణీ, దళితబంధు వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో తొలి విడతలో 18,754 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. అయితే రెండో విడతలో 10,331 మందికి ఈ యూనిట్లను అందించాల్సి ఉండగా, ఈ పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్బంగా ఈ యూనిట్లను పంపిణీ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ, గొర్రెలు కొనుగోళ్లు ఆలస్యం కావడంతో ఈ పంపిణీ ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రొక్యూర్మెంట్ టీంలు గొర్రెలను కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పటికీ వాటిని ఇక్కడికి తేవడంలో జాప్యం జరుగుతోంది. దీంతో సుమారు 10 వేల యూనిట్లు పంపిణీ చేయాలని భావించినప్పటికీ ఇప్పటి వరకు కేవలం 342 యూనిట్లు మాత్రమే పంపిణీ చేయగలిగారు. ఇటీవల జిల్లా కేంద్రంలో కొందరు లబ్ధిదారులకు ఈ యూనిట్లకు సంబంధించిన గొర్రెలను ఇచ్చారు. దళితబంధు జాబితా వెరిఫికేషన్.. ప్రతిష్టాత్మక పథకాల్లో ప్రధానమైన దళితబంధు పథకం రెండో విడత అమలు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన లబ్ధిదారుల జాబితాను అధికారులు వెరిఫికేషన్ చేస్తున్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి వంద చొప్పున దళితబంధు లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ యూనిట్లు ఇప్పటికే గ్రౌండింగ్ పూర్తయింది. అయితే తొలి విడతలో నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి సాచ్యూరేషన్ పద్ధతిన ఆ గ్రామంలోని దళితులందరికి ఈ పథకం కింద యూనిట్లను మంజూరు చేసిన విషయం విదితమే. ఇప్పుడు నియోజకవర్గానికి 1,100 చొప్పున యూనిట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల నుంచి లబ్ధిదారుల జాబితాలను అందజేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి లబ్ధిదారుల జాబితాలు కలెక్టరేట్‌కు రాగా, ఒక్క జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఈ జాబితా రావాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో ఇది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు మెదక్ జిల్లా పరిధిలో ఉండటంతో ఆయా మండలాల జాబితాలు మెదక్ జిల్లా కలెక్టరేట్‌కు పంపుతున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే దళితబంధు యూనిట్లను మంజూరు చేసేందుకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ సమీక్షలు ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలపై కలెక్టర్ శరత్ తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు, సన్నాహాలు చేస్తూనే.. మరోవైపు ఈ సంక్షేమ పథకాల అమలు తీరుపై సంబంధిత శాఖ అధికారులు, మండలాల్లోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. దళితబంధు, గొర్రెల పంపిణీ పథకం అమలుపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేసిన కలెక్టర్.. ఈ రెండు పథకాల అమలును వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద ఎన్నికల కోడ్ వచ్చేలోగా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. -
దేశ శాంతి కోసం.. సైకిల్‌పై ఏకంగా 17 రాష్ట్రాలా..! వామ్మో..!!
మహబూబ్‌నగర్: దేశంలో శాంతి నెలకొల్పాలని, ఎలాంటి మత ఘర్షణలు లేకుండా చూడాలని ప్రార్థిస్తూ ఒక వ్యక్తి 17 రాష్ట్రాలు చుట్టేశాడు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూర్ పట్టణానికి చెందిన విజయ గోపాలకృష్ణ దేశ శాంతి కోసం 2022 మార్చి 11వ తేదీన సింధనూర్‌లో సైకిల్ యాత్ర ప్రారంభించాడు. నిర్విరామంగా యాత్ర కొనసాగిస్తూ 17 రాష్ట్రాలను చుట్టేసి చివరగా తన సొంత ఊరుకు బయలు దేరాడు. సోమవారం దేవరకద్ర పట్టణానికి చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, యానం, తెలంగాణ మీదుగా తిరిగి కర్ణాటక వెళ్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 514 రోజులు సైకిల్ యాత్రను కొనసాగించినట్లు తెలిపారు. దేశంలో 12 పుణ్య నదులు ఉండగా, 11 పుణ్యనదుల్లో స్నానం చేసి ప్రముఖ దేవాలయాలను సందర్శించుకుని పూజలు చేశానన్నారు. త్వరలో తన సొంత పట్టణానికి చేరుకుంటున్నట్లు తెలిపారు. -
నాణ్యమైన చదువులు, స్మార్ట్క్లాస్లు, ఐఐటీల పేరిట.. ఫీజుల మోత..
మహబూబ్‌నగర్: ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లకు అడ్డు, అదుపు లేకుండాపోతోంది. నాణ్యమైన చదువులు, స్మార్ట్క్లాస్లు, ఐఐటీల పేరిట తల్లిదండ్రులను మభ్యపెట్టి.. ఎల్కేజీ, యూకేజీల నుంచే ఫీజుల మోత మోగిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకుని తక్కువలో తక్కువ రూ.20 వేల నుంచి మొదలుకొని రూ.లక్ష వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇంత పెద్దఎత్తున ఫీజులు వసూలు సంబంధిత విద్యాశాఖ అధికారులు మాత్రం తమ కేమి సంబంధం లేదనట్లుగా వ్యవహరించడం గమనార్హం. ప్రతిఏటా పెరుగుదల.. వాస్తవానికి ఫీజుల పెంపు వ్యవహారం పాఠశాల సొసైటీ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల కమిటీ సమన్వయంతో ప్రతి సంవత్సరం పెంచాల్సిన ఫీజులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, జిల్లాలోని ఏ పాఠశాలలో కూడా విద్యార్థుల తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే ఎన్నో రెట్ల ఫీజులు పెంచుకుంటున్నారు. ఎల్కేజీ నుంచి ఎస్సెస్సీ వరకు రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన కొన్ని పాఠశాలల్లో 6 నుంచి 7వ తరగతి వరకు రూ.40– 50 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక 8, 9, 10వ తరగతుల వారికి రూ.50– 70 వేలకుపైగా రాబడుతున్నారు. వీటిలో కొన్ని పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తూ ప్రతి సంవత్సరం అదనంగా రూ.50 వేలకుపైగా వసూలు చేస్తున్నారు. రెండు చేతులా సంపాదన.. విద్యార్థికి ఫీజుల చెల్లింపు ఒక ఎత్తయితే.. పుస్తకాలు, నోట్‌బుక్స్, టై, బెల్టులు, షూ, యూనిఫాంలు, రికార్డులు, బస్సు ఫీజుల వంటివి మరో ఎత్తు అవుతున్నాయి. బయటి నుంచి విద్యార్థులు ఏం కొన్నా.. వాటిని అనుమతించని పాఠశాలలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇందులో ముఖ్యంగా 6– 8వ తరగతుల పుస్తకాల కోసం రూ.6,500 తీసుకుంటున్నారు. ఇందులో ఐఐటీ వంటి ప్రత్యేక సంస్థల కరిక్యూలం ఉన్న పుస్తకాలకు రూ.8 వేల వరకు వసూలు చేస్తున్నారు. నోట్‌పుస్తకాలు ఏకంగా పాఠశాల పేరు మీదనే ముద్రిస్తున్నారు. యూనిఫాం రూ.2,800, షూ, బెల్టులు రూ.1,200, బస్సు ఫీజు రూ.15– 18 వేల వరకు వసూలు చేస్తున్నారు. చాలా వరకు పాఠశాలల్లోనే అమ్ముతుండగా.. కొన్ని మాత్రం తెలిసిన బుక్సెంటర్ల ద్వారా విక్రయిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. -
'తగ్గేదే లే' ! అంతా బూడిద మయం..!! ఇదేం దోపిడీ..?
భద్రాద్రి: ఏదైనా మంచి విషయం సత్ఫలితాలు ఇవ్వడంలో విఫలమైతే బూడిదలో పోసిన పన్నీరు అనే సామెతను ఉపయోగిస్తాం. కానీ అలాంటి బూడిద నుంచి సైతం కాసులు దండుకునే విద్య తెలిసిన వాళ్లు జిల్లాలో ఉన్నారు. వాళ్ల జాడ తెలియాలంటే భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు వెళ్లాల్సిందే.. భారీగా బూడిద.. దేశమంతటా థర్మల్ పవర్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అయితే టీఎస్ జెన్కో మాత్రం నడుస్తున్న ట్రెండ్‌కు విరుద్ధంగా పాత కాలం నాటి సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ టెక్నాలజీ వాడటం వెనుక కారణాలు ఏమైనా.. దీంతో ప్లాంట్ నుంచి బూడిద అధికంగా విడుదలవుతోంది. ఇలా వచ్చిన బూడిదకు నీటిని కలిపి కొంత భాగం యాష్ పాండ్‌కు తరలిస్తే మరికొంత బూడిదను సిమెంట్, ఇతర పారిశ్రామిక అవసరాలకు తరలిస్తున్నారు. నిత్యం టన్నుల కొద్దీ వెలువడుతున్న బూడిదను వదిలించుకోవడం బీటీపీఎస్‌కు అనివార్యం. అయితే ఉచితంగా బూడిదను పరిశ్రమలకు ఇవ్వకుండా నామమాత్రపు ధరకే థర్మల్ పవర్ ప్లాంట్లు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ విధానం అమల్లో ఉంది. లారీకి రూ.400 అదనం.. ఎలాంటి లెక్కాపత్రం లేకుండా యాష్ కోసం వచ్చిన లారీల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. బూడిద కొనుగోలుకు సంబంఽధించిన రసీదు ఇవ్వడం, లోడ్ చేసిన బూడిదకు తగ్గ వే బిల్లులు ఇవ్వడం వంటి పనుల్లో కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రాసెసింగ్ ఫీజు పేరుతో రూ. 200 వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత వే బిల్లులు జారీ చేసే దగ్గర రూ.100, ప్లాంటు గేటు దగ్గర ఇన్, ఔట్లకు కలిపి రూ.100 వంతున లారీల దగ్గర నుంచి డబ్బులు లాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్లాంట్ నుంచి నిత్యం 100కు పైగా లారీల్లో యాష్ బయటకు వెళ్తుంది. అంటే ఒక్కో లారీ నుంచి రూ.400 చొప్పున రోజుకు రూ. 40,000 ఎలాంటి లెక్కా పత్రం లేకుండా జేబులో వేసుకుంటున్నారు. ఇలా నెలకు రూ.12 లక్షల వరకు యాష్ నుంచే కాసుల వర్షం కురిపిస్తున్నారు. ఈ దందా నిత్యం జరుగుతున్నా అధికారులెవరూ ఇదేంటని ప్రశ్నించరు. అధికారుల అండదండలను ఆసరాగా చేసుకుని కాంట్రాక్టర్లు మరింతగా రెచ్చిపోతున్నారు. టన్ను బూడిద ధర రూ.109 ఉండగా వీళ్లు రూ.150 వరకు కూడా అమ్ముతున్నారు. ఇదేం దోపిడీ..? గతంలో పాల్వంచలోని కేటీసీఎస్ కేంద్రంగా బూడిద దందాలో ఖజానా నింపుకున్న కాంట్రాక్టర్లలో కొందరు ఇప్పుడు బీటీపీఎస్‌పై కన్నేశారు. బీటీపీఎస్‌లో అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ప్లాంట్ ప్రతిష్టకు మచ్చ కలుగుతోంది. దశాబ్దాల తరబడి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లలో సైతం లేని అవినీతి ఇటీవలే ప్రారంభమైన ప్లాంట్‌లో ఉండడం ఏంటని పారిశ్రామిక వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇంత అవినీతి జరుగుతున్నా ఇక్కడి అధికారులు, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బూడిద దందాపై వివరణ కోరేందుకు బీటీపీఎస్ డీఈకి ఫోన్ చేయగా.. ఆయన అందుబాటులోకి రాలేదు. చెప్పిందే ధర.. బీటీపీఎస్ ఆరంభంలో టన్ను బూడిద రూ.69 చొప్పున సిమెంట్, ఇటుక పరిశ్రమలకు అమ్మేవారు. ఇటీవల ఈ ధరను రూ.109కి పెంచారు. ప్రత్యేకమైన కంటైనర్లు కలిగిన లారీల్లో బూడిదను తరలిస్తారు. సగటున ఈ ట్యాంకర్ల కెపాసిటీ 25 టన్నుల వరకు ఉంటుంది. అంటే ఒక్కో యాష్ కంటైనర్ లారీలో బూడిదను నింపుకునేందుకు రూ.2,725 నామమాత్రపు ఫీజు చెల్లిస్తే 25 టన్నుల బూడిద తీసుకెళ్లొచ్చు. అయితే సిమెంట్ కంపెనీలు లేదా లారీ కంటైనర్ల ఓనర్లు బూడిద కోసం ప్లాంట్‌కు చెల్లిస్తున్న ధర పెద్దగా లెక్కలోకి తీసుకోరు. అంతకంటే వాళ్లకు ప్రధానమైనది లోడింగ్, అన్ లోడింగ్. ఈ పనిలో ఆలస్యం జరిగితే విలువైన సమయం వృథా అవుతుంది. కంటైనర్లకు వచ్చే కిరాయి, డ్రైవర్ ఖర్చులు, క్లీనర్ బేటాలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకుని బూడిద అమ్మకాల్లో కొత్త దందాకు తెరలేపారు. -
సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. ప్రయాణికులు ఒక్కసారిగా..
మంచిర్యాల: న్యూఢిల్లీ నుంచి చెన్నయ్ వెళ్తున్న తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో పొగలు వ్యాపించడం కలకలం రేపింది. ఈ ఘట న ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకోగానే ఎస్–3 బోగీ వద్ద క్రమంగా పొగలు రావడంతో ప్రయాణికులు భయపడ్డారు. వెంటనే రైల్వే అధికారులు రైలును స్టేషన్లో ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేయించారు. రైల్వే టెక్నికల్ టీమ్ నిశితంగా తనిఖీ చేసి ప్రమాదమేమీ లేదని, కేవలం రైలు బ్రేక్‌లు చక్రాలకు గట్టిగా పట్టుకోవడంతో పొగలు వ్యాపించినట్లుగా గు ర్తించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బ్రేక్‌లను సరి చేసి గంట తర్వాత రైలుకు పచ్చజెండా ఊపారు. దీంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోగా.. అప్పటివరకు ఏర్పడిన ఆందోళనకు తెరపడింది. -
ఆగిన కోట్లాది గానం..! మూగబోయిన విప్లవ గొంతుక..!!
వరంగల్: ఎక్కడ అన్యాయం జరిగినా.. తనకే జరుగుతున్నట్లు అన్వయించుకుని.. అందుకు తగ్గట్టుగా పాటలు అల్లి.. తన దరువుతో ఉర్రూతలూగించిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్. ఆయన ఇక లేరనే వార్త విన్న ఉమ్మడి వరంగల్ కళాకారులు, కవులు, రచయితలు, ప్రజలు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. తన ఆటపాటలతో ఉద్యమాలను రగిల్చిన ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు.. ఓరుగల్లుతో విడదీయరాని అనుబంధం ఉంది. తన గళంతో మేధావులు, భూస్వాముల బిడ్డలను సైతం సాయుధ పోరాటం వైపు ఆకర్షితులను చేశారు. అనేక మందిని పీపుల్స్ ఆర్మీగా తయారుచేశారు. ఇప్పుడా పాట మూగబోయింది. పీపుల్స్‌వార్(మావోయిస్టు) పార్టీ కీలక ఘట్టాలకు వేదికై న ఓరుగల్లులో.. గద్దర్ ఉద్యమ ప్రస్థానం ఇలా.. కారంచేడు దళితులపై జరిగిన దాడిని నిరసిస్తూ గద్దర్ చేపట్టిన ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ నుంచి ఉద్యమకారులు, ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. ► 1979 నుంచి 1983 వరకు చాపకింద నీరులా కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ వ్యాప్తి క్రమంలో జనగామ జిల్లాలో మేథావి, విద్యార్థి, ప్రజాకవులతో ప్రజాగాయకుడిగా సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జన నాట్యమండలి రాష్ట్ర సారధిగా గద్దర్ వ్యవహరించడంతో జిల్లా నుంచే అత్యధిక కళాకారుల చేరారు. ► 1989 : పీపుల్స్‌వార్ పార్టీకీ అప్పటి సీఎం చెన్నారెడ్డి లీగల్ పీరియడ్ ఇచ్చారు. దీంతో తొలుత జనగామలోనే గద్దర్ బహిరంగ సభ నిర్వహించి ప్రజాసమస్యల సాధనతోపాటు సమసమాజ స్థాపన లక్ష్యంగా పెద్దఎత్తున యువత చేరేలా తన ఆటాపాటలతో చైతన్యం కలిగించారు. ► 1997 : సెప్టెంబర్‌లో వరంగల్ డిక్లరేషన్ సదస్సుకు హాజరయ్యారు. ► 1999 : కరీంనగర్ కొయ్యూరు ఎన్కౌంటర్లో అశువులు బాసిన జనగామ జి ల్లా కడవెండికి చెందిన మావోయిస్టు ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి అలియాస్ మహేష్ అంత్యక్రియలకు ప్రభుత్వం నిర్భందాలను అధిగమించి వేలాది మంది నివాళురి్పంచేలా తన ఆటపాటలతో చైతన్య పరిచారు. మైదనా ప్రాంతంలో నక్సల్ పార్టీ ప్రభావం తగ్గిన క్రమంలో దొడ్డి కొమురయ్య స్వగ్రామం కడవెండిలో పలు సామాజిక ఉద్యమ పోరా టాల్లో పాల్గొనడం అనివార్యంగా మారింది. ► 2007 : మలివిడద తెలంగాణ సాధన ఉద్యమంలో జనగామ డివిజన్ పరిధి బైరాన్‌పల్లి నుంచి కడవెండి మీదుగా తెలంగాణ అమరుల దీపయాత్ర ప్రారంభించారు. మణుగూరు వద్ద గోదావరి నుంచి ప్రారంభమైన కళాకారుల శాంతియాత్ర అన్ని జిల్లాల్లో 24 రోజులపాటు సాగింది. ► 2008 మే 25, 2009 : హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ సాంస్కృతిక కళాకారుల సమావేశంలో పాల్గొన్నారు. ► 2009 : వరంగల్ ప్రజాసంఘాలతో కలిసి తెలంగాణ ప్రజాఫ్రంట్, ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరిలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జిల్లా ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, కళాకారులతో కలిసి తెలంగాణ ఉద్యమంపై ధూంధాం నిర్వహించారు. ► 2010 : ప్రత్యేక తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని ఐదు రోజులు జిల్లాకు చెందిన ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, కళాకారులతో కాజీపేట, హనుమకొండ, వరంగల్‌లో పాదయాత్ర చేశారు. చివరిరోజు ఆజంజాహి మైదానంలో జరిగిన సభలో గద్దర్ తన పాట, ప్రసంగంతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని నింపారు. ► 2010 అక్టోబర్ 6 : హనుమకొండ టీఎన్జీఓ భవన్లో జరిగిన వరంగల్ జిల్లా జేఏసీ స్టీరింగ్ సమావేశంలో గద్దర్ పాల్గొన్నారు. 2011 : బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లిలో అంబేడ్కర్ విగ్రహాన్ని గద్దర్ ఆవిష్కరించారు. రాష్ట్ర సాధనలో గద్దర్ తనదైన శైలిలో దీపారాధన, గీతారాధనతో కార్యక్రమం చేపట్టారు. ► 2012 : ‘ఓపెన్ కాస్ట్ హఠావో సింగరేణి బచావో’ నినాదంతో చేపట్టిన బొగ్గు గనుల సంరక్షణ ఉద్యమం సందర్భంగా ములుగులో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలి వరకు ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ► 2022 జూన్ : గద్దర్ వరంగల్‌లో జరిగిన తెలంగాణ అమరవీరుల సంతాపసభలో పాల్గొన్నారు. -
పురిటి కష్టాలు.. ఏడుగురు వైద్యులున్నా.. సేవలు అంతంతే..
ఆదిలాబాద్: గర్భిణులకు రిమ్స్‌లో పురిటి కష్టాలు తప్పడం లేదు. నవమాసాలు మోసి ప్రసవం కోసం ఇక్కడికి వస్తున్న వారిలో ఇటీవల పలువురు మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొంతమంది వెద్యుల నిర్లక్ష్యం కారణంగా బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకుంటున్నాయి. రూ.కోట్లాది నిధులతో సర్కారు ఆసుపత్రి నిర్మించినా పేదల కష్టాలు మాత్రం దూరం కావడం లేదు. మెటర్నిటీ వార్డులో పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కాన్పుకు రూ.వేలాది చెల్లించుకోలేని పేదలు రిమ్స్‌లో చేరితే వైద్యం అందక అష్టకష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటీవలే ఇద్దరు బాలింతలు మృతిచెందడం ఆందోళనకు గురిచేస్తుంది. గైనిక్ వార్డులో పర్యవేక్షణ కరువవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. వార్డును పర్యవేక్షించాల్సిన అధికారి చుట్టపు చూపుగా రావడం, వచ్చినా పట్టించుకోకపోవడం, బాలింతలకు సరైన వైద్య సేవలు అందించకపోవడమే కష్టాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ అధికారి లేకపోతే రిమ్స్‌కు పీజీ సీట్లు రావనే ఆలోచనతో ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రూ.లక్షల వేతనం తీసుకుంటున్న ఆ ఉద్యోగి నిర్లక్ష్యం కారణంగా గైనిక్‌వార్డు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే విమర్శలు లేకపోలేదు. ఏడుగురు వైద్యులున్నా.. సేవలు అంతంతే.. జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలతో పాటు ఉమ్మడి జిల్లా, మహారాష్ట్ర, ఇతర జిల్లాల నుంచి జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి వైద్యం కోసం వస్తుంటారు. రిమ్స్‌లో పలు వార్డులు ఉండగా, అందులో మెటర్నిటీ, ఎమర్జెన్సీ వార్డులే కీలకం. ప్రసవం కోసం ఇన్పెషేంట్స్ దాదాపు 200కు పైగా ఉంటారు. అయితే ఈ కీలక వార్డుల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదనే ఆరోపణలున్నాయి. గైనిక్ వార్డులో హెచ్‌వోడీతో పాటు మరో ఏడుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వీరితో పాటు రిమ్స్‌లో నలుగురు పీజీ చేస్తున్న గైనిక్ వైద్యులున్నారు. అలాగే షిఫ్టుల వారీగా ముగ్గురు చొప్పున హౌస్ సర్జన్లు ఈ వార్డులో ఉంటారు. ఓపీలో ఇద్దరు, ఆపరేషన్ థియేటర్లో మరో ఇద్దరు ఉన్నప్పటికీ మిగతా వైద్యులు గైనిక్ వార్డులో ఉండాలి. కానీ వారు చుట్టపుచూపులా కనిపిస్తుండడంతో గర్భిణులకు కష్టాలు తప్పడం లేదు. ప్రసవం అయిన తర్వాత రక్తస్రావం, బీపీ, తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే అవేమి పట్టించుకోకుండా మధ్యాహ్నానికే ఇంటి ముఖం పడతారు. అందుబాటులో ఉన్న సిబ్బందిని పిలిచినా వారు విసుక్కోవడం, వస్తాం.. వెళ్లండనే సమాధానాలు తప్పా వచ్చి చూసిన దాఖలాలు ఉండవని బాధితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రిమ్స్‌లో స్టాఫ్‌నర్సులు, హౌస్సర్జన్లు, పీజీ డక్టర్లతోనే నెట్టుకొస్తున్నారు. 24 గంటల పాటు మెటర్నిటీ వార్డులో ఉండాల్సిన వైద్యులు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే తప్ప రాత్రి వేళల్లో రావడం లేదు. దీంతో గతంలో ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన ఓ గర్భిణి సకాలంలో వైద్యం అందక పురిటి నొప్పుల్లోనే మృత్యువాత పడిన విషయం తెలిసిందే. మారని రిమ్స్ తీరు.. ఎన్ని విమర్శలొస్తున్నా ఇక్కడి వైద్యుల తీరు మాత్రం మారడం లేదు. ఇక్కడ పనిచేసే చాలా మంది వైద్యులకు ప్రైవేట్ క్లినిక్‌లు ఉండడంతో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంతో రిమ్స్‌లో ఉన్న వారికి నాణ్యమైన వైద్యసేవలు అందకుండా పోతున్నాయి. కాసులిస్తేనే.. సేవలు గైనిక్ వార్డులో కొంతమంది సిబ్బంది తీరుపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సిజేరియన్, సాధారణ ప్రసవమైన తర్వాత సిబ్బందికి ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే. లేకుంటే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. మగ బిడ్డ పుడితే రూ.వెయ్యి, ఆడబిడ్డ పుడితే రూ.500.. ఇలా రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇంద్రవెల్లి మండలంలోని మర్కగూడకు చెందిన సొనాలి కాంబ్లే(22) రిమ్స్‌లో జూలై 25న మగబిడ్డకు జన్మనిచ్చిన ఐదారు గంటల్లోనే మృతి చెందింది. డెలివరీ కోసం రెండు రోజుల ముందుగానే ఆస్పత్రిలో చేరిన ఆమె సాధారణ ప్రసవం అయ్యింది. ఉదయం 7గంటలకు బిడ్డకు జన్మనివ్వగా, 10 గంటల సమయంలో చనిపోయింది. అయితే వైద్యులు మాత్రం ఉమ్మ నీరు ఊపిరితిత్తులో చేరి శ్వాస ఆడక చనిపోయిందని చెప్పడం గమనార్హం. గత నెలలో సిరికొండ మండలానికి చెందిన ఓ గర్భిణి రిమ్స్‌లో ప్రసవం కోసం చేరింది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అనారోగ్యం (కాలేయ సమస్య) కారణంగా మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. అయితే ప్రసవం కోసం వచ్చిన సమయంలో వైద్య పరీక్షలు చేయాల్సి ఉండగా, తీరా చనిపోయిన తర్వాత అనారోగ్య సమస్య అని చెప్పడం వారి పనితీరుకు నిదర్శనం. ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నాం. వైద్యులు 24 గంటల పాటు అందుబాటులో ఉంటున్నారు. గైనిక్ వార్డులో నాణ్యమైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపడతాం. ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తా. – జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ -
వ్యవసాయం చేస్తూనే.. మూడు ఉద్యోగాల ఘనత తనది..
ఆదిలాబాద్: ఆయనది వ్యవసాయ కుటుంబం. అటు చదువుతూనే, ఇటు పొలం పనులు చేస్తూనే మూడు ఉద్యోగాలు సాధించాడు. అయినా అవి తనకు సరిపోదని సివిల్ ఎస్సైగా ఉద్యోగం సాధించాడు సారంగపూర్ మండలంలోని మలక్‌చించోలికి చెందిన సామ శ్రీనివాస్. ఆదివారం వెల్లడించిన ఎస్సై ఫలితాల్లో సత్తా చాటాడు. సామ హన్మంతు–పర్వవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్దవాడైన ప్రవీణ్, రెండోకు మారుడు నవీన్. మూడో కుమారుడు శ్రీనివాస్ చదువుతూనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. మొదట వీఆర్వో రాగా, ప్రభుత్వం వేరే శాఖల్లో విలీనం చేయడంతో ఆయనకు ఫైర్ సర్వీసెస్‌లో ఉద్యోగం వచ్చింది. రెండోసారి ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా సెలక్ట్ అయ్యాడు. ఇది నచ్చక ఎస్సైగా ప్రిపేర్ అయి పరీక్ష రాస్తే సివిల్ ఎస్సైగా బాసర జోన్ సర్కిల్లో ఉద్యోగాన్ని సాధించాడు. -
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో.. ఆడ జెర్రిపోతు!
మహబూబ్‌నగర్: పట్టణంలోని బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భద్రపర్చిన ఆడ జెర్రిపోతు పాము శుక్రవారం పది గుడ్లను పెట్టిందని వృక్షశాస్త్ర అధ్యాపకుడు డా.సదాశివయ్య శనివారం విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ.. సాధారణంగా కొన్ని పాములు గుడ్లను పెడతాయి. మరికొన్ని ప్రత్యక్షంగా పిల్లలను కంటాయి. అయితే ప్రజలు జెర్రిపోతును మగదిగాను నాగుపామును ఆడదిగాను అపోహపడుతుంటారన్నారు. కానీ జెర్రిపోతు పాముల్లో ఆడ, మగ ఉంటాయని తెలియజేశారు. ఐదు రోజుల క్రితం పట్టణంలోని ఓ ఇంట్లో పట్టుకు వచ్చిన ఆడ జెర్రిపోతును కళాశాల వృక్షశాస్త్రవిభాగంలో భద్రపరిచారు. శుక్రవారం రాత్రి పాము పది గుడ్లను పెట్టిందని తెలిపారు. గుడ్లను పొదిగించేందుకు సరైన పరికరాలు కళాశాలలో లేనందున హైదరాబాద్ అటవీశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి పంపించినట్లు ఆయన పేర్కొన్నారు. కళాశాలలోని జీవ వైవిధ్య పరిశోధన విద్యా కేంద్రంలో ఇప్పటికే మూడు సార్లు గుడ్లను హైదరాబాద్ పంపగా అవి పిల్లలు తీశాయని ప్రిన్సిపాల్ డా. అప్పియాచిన్నమ్మ తెలిపారు. సాధారణంగా జెర్రిపోతు పాములు జూలై, ఆగస్టు నెలల్లో ఒక్కో పాము 6 నుంచి 22 వరకు గుడ్లు పెడతాయన్నారు. -
తప్పుడు పత్రాలను జతచేసిన ఫలితం.. పడిన వేటు..
ఆదిలాబాద్: జిల్లాలోని ఐదు ఆధార్ కేంద్రాలపై యూనిక్ ఐడేంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) వేటు వేసింది. ఆ కేంద్రాల ద్వారా అందించే సేవలను నిలిపివేస్తూ నిర్వాహకుల ఆథరైజేషన్‌ను సస్పెండ్ చేసింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాల నిర్వాహకులు ఆధార్ సంబంధిత సేవలందించేందుకు దూరమవాల్సిన దుస్థితి నెలకొంది. అడ్రస్ మార్పునకు సంబంధించి తప్పుడు వివరాలతో కూడిన ధృవీకరణ పత్రాలను జత చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యల ద్వారా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం, భుక్తాపూర్‌లోని సెంటర్‌తో పాటు, తలమడుగు, బేల, ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లోని ఆధార్ కేంద్రాలపై వేటు పడింది. ఇందులో ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఆధార్ సెంటర్‌ను ఇది వరకే సస్పెన్షన్ వేటు వేయగా తాజాగా మిగతా సెంటర్లపై చర్యలు చేపట్టింది. ఆధార్ సంస్థ చేపట్టిన చర్యల విషయం తెలియకపోవడంతో నిత్యం ఆధార్ సంబంధిత సేవల కోసం వస్తున్న ప్రజలు ఆ సెంటర్లు మూసి ఉండటంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. కేంద్రాలపై చర్యలు చేపట్టిన విషయాన్ని ప్రజలకు సమాచారమందించాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఏమరుపాటుగా ఉంటే వేటు తప్పదు... ఆధార్ కేంద్రాల నిర్వాహకులు ఏమాత్రం ఎమరుపాటుగా వ్యవహరించినా శాఖపరంగా చర్యలు ఎదుర్కొనక తప్పదని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ, అభివృద్ధి పథకాలు పొందాలన్నా, పోటీ పరీక్షలు, విద్యా, ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలన్న ప్రభుత్వాలు ఆధార్ కార్డును తప్పనిసరి చేశాయి. అంతటి కీలకమైన ఆధార్ కార్డుల జారీలో తప్పుడు సమాచారం పొందుపరిచినట్లు తేలితే ఆధార్ సేవ కేంద్రాలనే బాధ్యులను చేస్తూ ఆధార్ సంస్థ వారిపై చర్యలు చేపడుతోంది. -
డబుల్ బెడ్రూం కోసం నడిరోడ్డుపై హల్చల్.. ఇంతలో ప్రమాదం..
సంగారెడ్డి: కేటాయించిన డబుల్ బెడ్రూం ఇంటిని త్వరగా అందజేయాలని ఓ వ్యక్తి రోడ్డుపై హల్చల్ చేసి ప్రమాదానికి గురయ్యాడు. మండల కేంద్రం పుల్కల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పుల్కల్ గ్రామానికి చెందిన బట్టు చిరంజీవి రాజుకు అతని భార్య మమత పేరుపై పుల్కల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం మంజూరైంది. అయితే వాటిలో కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులకు కేటాయించలేదు. దీంతో ఇల్లు మంజూరైనా కాలయాపన జరుగుతుండటంతో అసహనానికి గురైన చిరంజీవి రాజు శుక్రవారం ఉదయం పెట్రోలు సీసాతో పుల్కల్ ప్రధాన రోడ్డుపై హల్చల్ చేశాడు. వచ్చిపోయే వాహనాలను ఆపుతు ఇబ్బంది కలిగించారు. ఇదే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపేందుకు ప్రయత్నిస్తుండగా కింద పడిపోయాడు. గమనించిన డ్రైవర్ ఆపే ప్రయత్నం చేస్తుండగానే వెనుక చక్రాలు కాళ్లపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ విజయ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై తహసీల్దార్ రాజయ్య మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులను గుర్తించామని, ఇళ్లను కూడా కేటాయించామని తెలిపారు. చిన్న చిన్న పనులు మిగిలిపోవడంతో కేటాయింపులో జాప్యం జరుగుతోందన్నారు. -
వైద్య ఆరోగ్యశాఖలో ఆధార్ బయోమెట్రిక్ విధానం.. అదుర్స్..!
వికారాబాద్: ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు పొందాలంటే ఇక నుంచి ఆధార్ నంబర్ తప్పనిసరి. ఔట్ పేషెంట్లో వైద్య సేవలు పొందాలనుకునే రోగులు రిజిస్ట్రేషన్ కౌంటర్లో ఆధార్ నంబర్ చెప్పి బయోమెట్రిక్ యంత్రంలో వేలు పెడితే రోగి వివరాలు, చిరునామా ప్రత్యక్షమవుతాయి. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ఓపీ రోగుల సంఖ్య ఇక నుంచి పక్కాగా నమోదు కానుంది. గతంలో రోజు వారి ఓపీ వివరాలను ఓ రిజిస్టర్లో రాసి, భాదితుడి ఆరోగ్య సమస్యలను బట్టి ఫలానా డాక్టర్‌ను కలవాలని ప్రిస్క్రిప్షన్ ఇచ్చేవారు. కొన్ని సార్లు అక్కడి సిబ్బంది ఓపీ సంఖ్యను ఎక్కువ చేసి చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మాన్యువల్‌గా తీసుకునే ఓపీ వివరాలను ప్రతీ రోజు ఉన్నతాధికురాలకు పంపించాలంటే సిబ్బందికి సైతం ఇబ్బందులు తలెత్తేవి. ఈ ఇబ్బందులను తొలగించడంతో పాటు, రోజు వారీగా ఓపీ సేవలు ఎంతమంది పొందుతున్నారనే విషయం తెలుసుకునేందుకు వైద్య ఆరోగ్యశాఖ బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీ చీటీ పొందాలంటే పేషెంట్ పేరు, ఊరు, ఆధార్ నెంబర్ తప్పకుండా చెప్పాల్సిందే. వెంటనే బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా పూర్తి వివరాలు నమోదు చేస్తుండటంతో ఓపీ సేవలపై నజర్ వేసేందుకు అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు వెల్లడిస్తున్నారు. ఈ బయోమెట్రిక్ విధానం ప్రారంభమై వారం రోజులే కావడంతో ఈ సమాచారం తెలియక చాలా మంది ఆధార్ కార్డు లేకుండానే ఓపీ సేవలకు వస్తున్నారు. ప్రస్తుతం ఆధార్ నెంబర్ చెప్పని వారి వివరాలు నమోదు చేసుకుని ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు. రెండోసారి ఆస్పత్రికి వచ్చేటప్పుడు తప్పకుండా ఆధార్ నెంబర్ తీసుకురావాలని సిబ్బంది రోగులకు సూచిస్తున్నారు. -
భారీగా ఉబ్బిన కడుపు.. క్రమంగా 15 కిలోల బరువు.. ఇంతలో ఇలా..
మహబూబ్‌నగర్: ఆదివాసి మహిళకు కడుపులో పెరుగుతున్న బరువు ప్రాణాల మీదకు తెచ్చింది. ఎలాగైనా వైద్యం అందించి ఆదుకోవాలని ఆమె వేడుకుంటుంది. అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్(బీకే) గ్రామానికి చెందిన ఈదమ్మ, భర్త బిక్షమయ్య నిరుపేద కుటుంబం. వారికి ముగ్గురు ఆడపిల్లలు, జీవాలు మేపుతూ జీవనం గడుపుతున్నారు. ఇంతలోనే ఈదమ్మ కడుపులో ఏదో పెరుగుతుంది. క్రమంగా 15 కిలోల బరువు వరకు వచ్చింది. వారికి ఉన్న స్థోమతలో ఆర్ఎంపీల వద్ద చూయించుకున్నా తగ్గలేదు. కడుపులో కణతి పెరుగుతుందని ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు తెలిపారని ఈదమ్మ బోరుమంటుంది. ఆపరేషన్ చేయించుకునే స్థోమతలేక అలాగే ఉన్నామని క్రమంగా బరువు పెరుగుతుండటంతో శ్వాసతీసుకోవడం కష్టం అవుతుందని ఈదమ్మ విలపిస్తోంది. తనకేమన్న అయితే పిల్లలు అనాథలు అవుతారని, ప్రభుత్వం వైద్యం అందించి ఆదుకోవాలని వేడుకుంటుంది. -
రిజర్వుడ్ వైన్‌షాపుల గుర్తింపు..! నేడు నోటిఫికేషన్ జారీ..
ఆదిలాబాద్: జిల్లాలోని రిజర్వుడ్ వైన్‌షాపులను లాటరీ విధానంలో ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు అధికారికంగా ప్రకటన జారీ చేయాల్సి ఉంది. కలెక్టర్ రాహుల్‌రాజ్ గురువారం రిజర్వేషన్ షాపుల గుర్తింపునకు లాటరీ తీసి ఆయా షాప్ నంబర్లను ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 40 వైన్‌షాపులుండగా ఇందులో 15 రిజర్వ్ కాగా, 25 జనరల్ కేటగిరీలో ఉన్నాయి. రిజర్వ్ చేసిన 15 షాపుల్లో గౌడ్స్‌కు జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి షాపు–1 వచ్చింది. ఎస్సీలకు 5 షాపులు కేటాయించగా, ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్‌లోని షాపు నంబర్ 9, రైల్వేగేటు సమీపంలోని షాపు నంబర్ 10, బేలలోని షాపు నంబర్ 11, భీంపూర్ మండల కేంద్రంలోని షాపు నంబర్ 18, బజార్హత్నూర్ మండలం గిర్నూర్లోని షాపు నంబర్ 29 కేటాయించారు. ఎస్టీలకు తొమ్మిది షాపులు రిజర్వ్ కాగా, ఇవన్నీ ఉట్నూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వచ్చాయి. నేడు నోటిఫికేషన్ జారీ.. నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం శుక్రవారం జారీ చేయనుంది. వెంటనే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించనుంది. ఈనెల 18న సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తుకు గడువు ఉంది. 21న లాటరీ పద్ధతిలో వైన్‌షాపులను కేటాయిస్తారు. దరఖాస్తు వివరాలు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే వెల్లడించనున్నట్లు డీపీఈవో హిమశ్రీ ‘సాక్షి’కి తెలిపారు. -
దాతలు దయచూపరూ..! నేను చదువుకుంటాను..!! విద్యార్థి సన్నీ..
మహబూబాబాద్: కడుపేదరికం.. రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబం.. కూలీకి వెళ్తేనే కూడు. లేనిపక్షంలో కుటుంబ మొత్తం ఆకలికి అలమటించుడే. ఇలాంటి పరిస్థితి ఉన్నా ఓ విద్యార్థి పట్టుదలతో చదివాడు. అనుకున్న లక్ష్యం చేరుకున్నాడు. అయితే ఉన్నత చదువుకు లక్ష్మీ కటాక్షం లేక ఓ నిరుపేద విద్యార్థి ఇబ్బందులు పడుతున్నాడు. ఎవరైన ఆర్థిక సాయం అందిస్తే ఉన్నతంగా చదువుకుంటానని పేర్కొంటున్నాడు. దాతల సాయం కోసం వేయికండ్లతో ఎదురుచూస్తున్నాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బాపునగర్ గ్రామానికి చెందిన మంతెన ప్రభుదాస్, స్వప్న దంపతులకు ముగ్గురు కుమారులు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. వ్యవసాయ కూలి పనులకు వెళ్లి కుమారులను పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడు సన్నీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి వరకు చదువుకున్నాడు. 5వ నుంచి 10వ తరగతి వరకు మరిపెడలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్ ఎంపీసీ రాంపూర్‌లోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకున్నాడు. బీటెక్ చదవడానికి ఎంసెట్ రాశాడు. అలాగే, జేఈఈ మెయిన్స్ రాయడంతో పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నిట్ కళాశాలలో ప్రవేశం వచ్చినట్లు మెయిల్ద్వారా సమాచారం పంపించారు. దీంతో తనను ఎలాగైనా చదివించాలని తల్లిదండ్రులను ఒప్పించాడు. అప్పుతెచ్చి రూ. 20 వేలు ప్రవేశం కోసం ఆన్లైన్ ఫీజు చెల్లించారు. కళాశాలలో చేరగానే మరో రూ. 36 వేలు చెల్లించాలని తెలిపినట్లు చెప్పారు. అంతేకాకుండా సుమారు రూ. లక్షకు పైగా ఖర్చు అవుతుందని, చేతిలో డబ్బు లేక చదువు ఆపేయాల్సి వస్తుందని విద్యార్థి సన్నీ మనోవేదన చెందుతున్నాడు. పట్టుదలతో చదవగా సీటు వచ్చినా లక్ష్మీకటాక్షం లేకపోవడంతో కుమారుడి పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 10 తేదీ వరకు కళా శాలలో చేరాలని సమాచారం అందించడంతో వారికి వేదన ఎక్కువైంది. దీనిపై దాతలు స్పందించి ఆర్థిక సాయం అందించాలని సన్నీతోపాటు తల్లిదండ్రులు వేడుకుకుంటున్నారు. దాతలు 9052001950 ప్రభుదాస్, చెన్నారావుపేట ఎస్బీఐ అకౌంట్ నంబర్ 62202764705, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్ 0021352 కి సాయం అందించాలని కోరారు. -
కస్తూర్బాలో ఆకలి కేకలు..! విద్యార్థులు అర్ధాకలితో..
మహబూబ్‌నగర్: బాలానగర్ మండలంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో గురువారం విద్యార్థులు ఆకలితో అలమటించారు. సరైన భోజనం పెట్టకపోవడంతో విసిగిపోయిన విద్యార్థినులు ఒక్కసారిగా పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 384 మంది ఉన్నారు. వీరికి ప్రతిరోజు వంట చేసేందుకు ఐదుగురు సిబ్బంది ఉండాల్సి ఉంది. అయితే రెండేళ్లుగా ఇద్దరు సిబ్బంది లేకపోవడంతో ముగ్గురే వంట చేస్తున్నారు. ఇటీవల ఒకరు పని మానేసి వెళ్లిపోగా.. మిగిలిన ఇద్దరు బుధవారం సాయంత్రం నుంచి అనారోగ్యం కారణంగా సెలవు పెట్టారు. దీంతో రాత్రి భోజనం వండకపోవడంతో విద్యార్థులు బొరుగులు తిని అర్ధాకలితో పడుకున్నారు. గురువారం ఉదయం ప్రిన్సిపాల్ జ్ఞానేశ్వరి ఎలాగోలా ఉప్మా చేసి అందించారు. అయితే అది రుచిగా లేకపోవడంతో చాలా మంది తినలేదు. మధ్యాహ్నం కూడా వంట చేసే పరిస్థితి లేకపోవడంతో పాటు అప్పటికే ఇద్దరు విద్యార్థినులు నీరసించి పడిపోయారు. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థులు పాఠశాల ఆవరణలో ధర్నాకు దిగారు. సమస్యలను పలుసార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని విద్యార్థులు తెలిపారు. ఉన్నతాధికారులు వచ్చి సమస్యలకు పరిష్కారం చూపే వరకు ఇక్కడే ఉంటామని భీష్మించుకుని కూర్చున్నారు. పరిష్కారం కాని సమస్యలు పాఠశాలలో నిత్యం అందించే ఆహారాన్ని నాసిరకంగా వడ్డిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. పాఠశాలకు తనిఖీ సమయంలో వచ్చిన అధికారులకు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే సమయంలో సమస్యలు, ఇబ్బందులు చెబితే తర్వాత తమపై మండిపడుతారన్నారని ఆరోపించారు. దీనికి తోడు తనిఖీలకు సంబంధించి ముందస్తు సమాచారం ఉండడంతో ఆ సమయంలో ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తారన్నారు. ఇతర రోజుల్లో నీళ్లతో కూడిన కూరలు వడిస్తారని విద్యార్థులు చెబుతున్నారు. పాఠశాల ఆవరణలో ఉన్న మినరల్ వాటర్ పనిచేయకపోవడంతో బోరు నీళ్లే తాగుతున్నామని తెలిపారు. గదులకు కిటీకీలు లేక వర్షం పడితే విద్యార్థులు నిద్రపోలేని పరిస్థితి ఉందన్నారు. పాఠశాలలో బాత్రూంలు ఉన్నా కొన్నింటికి తలుపులు లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. వంట చేసే ఆయాలు తమతో సేవలు చేయించుకుంటారని ఈ విషయాన్ని ప్రశ్నిస్తే ఉపాధ్యాయులకు చెప్పి బెదిరిస్తారని తెలిపారు. పాఠశాల ప్రహరీ గోడ దూకి ఆకతాయిలు ఆవరణలోకి ప్రవేశిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా మొక్కుబడిగా 4, 5 సార్లు పాఠశాలకు వచ్చి పరిశీలించారే గానీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాగా.. గురువారం విద్యార్థినులను చూసేందుకు వచ్చిన కొందరు తల్లిదండ్రులు పరిస్థితిని గమనించి..పాఠశాల ప్రిన్సిపాల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళన గురించి తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ నాయకులు అక్కడకు చేరుకుని వారికి మద్దతుగా నిలిచారు. ప్రిన్సిపాల్, సిబ్బందిపై మండిపడిన వారు సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అధికారుల విచారణ.. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి బాబురావు పాఠశాల వద్దకు చేరుకుని విచారించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి బాలికలకు భోజనం పెట్టడంతో పాటు విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న డీఈఓ రవిందర్ సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
కోడి కోసం.. కొండచిలువ..! అంతలోనే..
భద్రాద్రి: మండలంలోని వినాయకపురం గ్రామంలో ఉన్న ఇర్ఫాన్ చికెన్ షాపులోకి ఓ కొండ చిలువ చొరబడి కలకలం సృష్టించింది. షాపు యజమాని సయ్యద్ ఇర్ఫాన్ బుధవారం ఉదయాన్నే షాపు తెరిచి కోళ్లు ఉన్న ఫారమ్‌లోకి వెళ్లగా, కొండ చిలువ కోళ్లను మింగుతూ కనిపించింది. స్థానికుల సమాచారంతో వచ్చిన ఫారెస్ట్ సిబ్బంది సుమారు 12 అడుగుల కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. -
త్వరలో షురూ..! కిక్కెక్కించే... లక్కెవరికో..?
నిజామాబాద్: వైన్ దుకాణాలకు టెండర్లు నవంబర్‌లో జరగాల్సి ఉండగా ముందస్తుగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న వైన్స్‌లకు మరో రెండునెలల పాటు లైసెన్స్‌లు ఉండగానే ముందుస్తుగా టెండర్లు వేసేందుకు ప్రణాళికలు వేస్తోంది. అక్టోబర్‌లో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశాలుండడంతో ఆ సమయంలో లాటరీల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడుతాయని ఎక్సైజ్ శాఖ ఉన్నతస్థాయి అధికారులు జిల్లాలోని డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో ముందుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. 2021–2023 పిరియడ్ ముగియకముందే 20 23–2025 సంబంధించి వైన్స్ దుకాణాలకు లైసెన్స్ లు ఇచ్చేందుకు జీవో నం. 86ను ఎక్సైజ్ శాఖ జారీ చేసింది. దీంతో ఈనెల 4వ తేదీ నుంచి ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు అందించనున్నారు. టెండర్లు ఇలా.. ఎక్సైజ్ శాఖ కొత్త ఎకై ్సజ్ పాలసీ ప్రకారం దరఖాస్తులు స్వీకరిస్తుందని డిప్యూటీ ఎకై ్సజ్ కమిషనర్ ద శరథం పేర్కొన్నారు. ఈనెల 3న జిల్లా కలెక్టర్ సమక్షంలో ఎస్సీ, ఎస్టీ, గౌడ, ఓపెన్ అభ్యర్థులకు వైన్ షాప్‌లు కేటాయిస్తారు. ఈనెల 3న వైన్ దుకాణాల కు నోటి ఫికేషన్ విడుదల చేస్తారని, 4న జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ దరఖాస్తులు నింపి రూ. 2 లక్షలు డీడీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈనెల 18న సాయంత్రం 6 గంటలకు దరఖాస్తులను తీసుకుంటామని, 21న వైన్స్ లైసెన్స్‌లకు సంబంధించిన డ్రా తీస్తామన్నారు. వైన్స్ లైసెన్స్‌లు లాటరీలో వచ్చిన వారు అదే రోజు గాని మరుసటి రోజు (21, 22 తేదీల్లో) మొదటి ఇన్స్టాల్ మెంట్ చెల్లించాలని, వైన్స్‌లకు మద్యంను ఈనెల 30న అందిస్తామని, డిసెంబర్ 1 నుంచి షాపులను లైసెన్స్ పొందినవారు నడిపించుకోవాలన్నారు. దరఖాస్తుల ద్వారా రూ. 35.24 కోట్ల ఆదాయం జిల్లాలో 102 వైన్స్‌షాపులు ఉండగా వీటిని దక్కించుకోవడానికి 2021 నవంబర్‌లో 1,762 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 1,762 దరఖాస్తుదారులకు సంబంధించి రూ. 35.24 కోట్లు ఆదాయం చేకూరింది. ఒక్కో దరఖాస్తుదారుడు ప్రస్తుతం లాటరీలో పాల్గొనేందుకు రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బులు తిరిగి ఇవ్వరు. ఈ ఏడాది ఎన్నికల సీజన్ కావడంతో జిల్లాలో వైన్స్‌లకు టెండర్లు సంఖ్య పెరిగి, రూ. 42 కోట్ల నుంచి 45 కోట్ల ఆదాయం వస్తుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. నవంబర్‌లో పాత లైసెన్స్‌లు క్లోజ్.. 2021–2023కు గాను వైన్ దుకాణాల లైసెన్స్‌లు నవంబర్‌లో పూర్తవుతాయి. అసలైతే నవంబర్లోనే వైన్స్‌లకు దరఖాస్తులు ఆహ్వానించి మూడో వారంలో లాటరీ తీసేవారు. ఈ లాటరీలో వచ్చిన వారికి ఎక్కడ వచ్చిందో అక్కడ డిసెంబర్ 1 నుంచి వైన్స్లలో మద్యం అమ్మకాలు సాగించాల్సి ఉండేది. కాని ఈసారి ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకునేందుకు ముందుగానే టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు సమాచారం. -
చివరి ఊరుపై చిన్నచూపు!
నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ మండ లం చివరి గ్రామమైన ధర్మారం తండా అభివృద్ధి వి షయంలో పాలకులు, అధికారులు చిన్నచూపు చూ స్తున్నారు. అన్నిగ్రామాల్లో పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తుండగా ధర్మారం తండాలో మాత్రం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. తండాలను గ్రామ పంచాయతీగా మార్చాలనే ప్రభుత్వ నిర్ణయంతో ధర్మారం గ్రామం నుంచి తండాను వేరు చేశారు. గ్రామంలో సరైన రోడ్లు, డ్రెయినేజీలు లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ భవనం మంజూరైనా.. ధర్మారం తండాలో గ్రామ పంచాయతీ భవనం ప్రస్తుతం ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలోని ఓ గదిలో నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా స్థలం లేకపోవటంతో పనులు చేపట్టడం లేదు. గ్రామ సమీపంలో ఉన్న అటవీశాఖకు చెందిన స్థలం కొంత కేటాయిస్తే తప్పా భవన నిర్మాణం పనులు ముందుకుసాగేలా లేదు. ప్రజాప్రతినిధులు, ఫారెస్టు అధికారులు కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తే తప్పా భవనం నిర్మాణం నోచుకుంటుంది. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఈ రుణమాఫీ..!
కరీంనగర్: సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అన్నదాతల ఆశలు ఫలించాయి. లక్షలోపు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా సదరు ప్రక్రియ నాలుగేళ్ల అనంతరం తుదిదశకు చేరుకోవడం గమనార్హం. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రధానమైంది సాగురంగమే. ఉభయ గోదావరి జిల్లాలతో పోటీపడే ఉమ్మడి కరీంనగర్‌ది ప్రత్యేక ముద్ర. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, పసుపు, చెరకు పంటలకు ప్రసిద్ధి కాగా చిన్న, సన్నకారు రైతులే ఎక్కువ. ఈక్రమంలో బ్యాంకు రుణంతోనే ఏటా రెండు పంటలను సాగు చేస్తుంటారు. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుండగా దిగుబడులు ఒక్కోసారి దిగదుడుపే. ఈ నేపఽథ్యంలో ప్రభుత్వం ప్రకటించే రుణమాఫీ ప్రకటనే రైతులకు ధైర్యాన్నిస్తుండగా మాఫీ అమలు ఆగుతూ సాగింది. 2018 డిసెంబర్ 11 వరకు రూ.లక్షలోపు రుణం తీసుకున్నవారికి రుణమాఫీ ప్రకటించగా ఉమ్మడి జిల్లాలో 3,49,474 మంది లబ్ధి చేకూరనుంది. రూ.1200 కోట్ల మేర రుణమాఫీ జరగనుంది. ఆగుతూ సాగిన ప్రక్రియ టీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించగా నాలు గు విడతలుగా మాఫీ చేస్తామని గతంలో ప్రకటించింది. రూ.25 వేలలోపు రుణం తీసుకున్న రైతులకు ఒకసారి, రూ.50 వేలలోపు మరోసారి, రూ.75 వేలు, రూ.లక్ష చివరిసారి ఇలా నాలుగు విడతలుగా మాఫీ ఇలా 2019లోనే సదరు ప్రక్రియ పూర్తికావాలి. కానీ.. కేవలం రూ.25 వేల లోపు రుణం తీసుకున్నవారికి మాత్రమే మొదటి విడత మాఫీ చేశారు. ఆ త ర్వాత మిగతా ప్రక్రియ ఆగిపోయింది. ఓసారి సమాచారం సేకరించడం మళ్లీ అటకెక్కించడం చేశారు. మొదటి విడతలో కరీంనగర్ జిల్లాలో 15,200 మంది లబ్ధిపొందగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4,663, పెద్దపల్లి జిల్లాలో 14,636, జగిత్యాల జిల్లాలో 27 వేల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. వడ్డీ డబ్బులు తిరిగొచ్చేనా? ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కర్శకులు రుణమాఫీ కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం నాలుగు విడతల్లో మాఫీ చేస్తుందని ప్రకటించడంతో చాలామంది రుణాలు తిరిగి చెల్లించలేదు. వడ్డీ డబ్బులు కడుతూ వచ్చారు. మొత్తంగా రూ.400ల కోట్ల వరకు వడ్డీ చెల్లించినట్లు సమాచారం. ధాన్యం డబ్బులు ఖాతాలో జమైతే చాలు బ్యాంకర్లు వాటిని రుణానికి మిత్తికింద జమచేశారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 50 శాతానికి పైగా రైతులది ఇదే పరిస్థితి. 2019లోనే పూర్తిగా రుణమాఫీ జరగాల్సి ఉండగా నాలుగేళ్లుగా వడ్డీ డబ్బులు చెల్లించి రెన్యువల్ చేసుకున్నారు. ఈ క్రమంలో సదరు డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమచేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే మాఫీ చేసినా పెద్దగా రైతులకు ఒరిగిందేమి లేదని అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్ జిల్లాలో 76,791 మందికి ఇంకా రుణమాఫీ కావాల్సి ఉండగా రాజన్న సిరిసిల్ల 57,210, పెద్దపల్లి 78,064, జగిత్యాల జిల్లాలో 76 వేల మంది రైతులు ఇప్పటికీ రెన్యువల్ కింద వడ్డీ చెల్లిస్తూ రుణాలు తీసుకుంటున్నారు. రైతుబాంధవుడు సీఎం దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా, రైతాంగ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కరోనా వంటి విపత్కర పరిస్థితులు, ఎప్ఆర్బీఎం పరిమితులు, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కేంద్ర అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయం పడిపోయినా తెలంగాణలో రైతుల కోసం కృషి చేస్తున్నారు. నేడు రూ. 19 వేల కోట్ల భారాన్ని భరిస్తూ తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయం విప్లవాత్మకం. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్, విత్తనాలు, ఎరువులు, కాళేశ్వరం జలాలతో రాష్ట్రాన్ని ధాన్యగారంగా తీర్చిదిద్దారు. – గంగుల కమలాకర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి -
నాకు చెప్పేదెవడ్రా?.. నా కొడుకల్లారా..! కలెక్టరేట్ సాక్షిగా బూతులు..
కరీంనగర్: ‘నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా...మీరెవర్రా నాకు చెప్పేది. మీరు చెబితే వినాల్నారా? నా...కొడుకల్లారా’ అంటూ నగరపాలక సంస్థకు చెందిన ఓ డీఈ తన పైఅధికారులపై చిందులు వేశారు. బల్దియా వర్గాల్లో సంచలనం సృష్టించిన సంఘటన వివరాలు విశ్వసనీయ వర్గాల కథనం మేరకు ఇలా ఉన్నాయి. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు నగరపాలకసంస్థ ఇంజినీరింగ్ అధికారులు బుధవారం కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ మేరకు పైస్థాయి అధికారులు డీఈలు, ఏఈలకు కలెక్టరేట్‌కు రావాలని సమాచారం ఇచ్చారు. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చే సమయంలోనే సదరు డీఈ ‘నేను రాను...నాకు పని ఉంది...కలవడం అవసరమా?’ అంటూ పెడసరిగా మాట్లాడడంతోనే సదరు అధికారి మిన్నకుండిపోయారు. అతను లేకుండానే అదనపు కలెక్టర్‌ను కలిసి బయటకు వస్తున్న క్రమంలో సదరు డీఈ సైతం కలెక్టరేట్‌కు వచ్చి తారసపడ్డారు. ‘పని ఉంది రానంటివి కదా?’ అని పైస్థాయి అధికారి ఒకరు అనడంతోనే డీఈ తిట్లదండకం అందుకున్నాడు. పరుషపదజాలంతో దూషించడంతో పాటు, నానా బూతులు తిట్టడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ సమయంలో అధికారులతో పాటు కొంతమంది కిందిస్థాయి ఉద్యోగులు కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. సాక్షాత్తు కలెక్టరేట్లో తన పైఅధికారులను ఇష్టారీతిన డీఈ బూతులు తిట్టడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. చెప్పుకునే దిక్కేది...? నగరపాలకసంస్థ కార్యాలయంలో ‘పనిమంతుడు’గా గుర్తింపు పొందిన సదరు డీఈ కొంతకాలంగా ప్రదర్శిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతోంది. నగరంలో జరిగే అభివృద్ధి పనుల్లో ఎక్కువ పనులు తన ‘చేతుల మీదుగా’ జరుగుతుండడం, ప్రజాప్రతినిధులతో ఉన్న సాన్నిహిత్యం అతడిని దారితప్పేట్లు చేస్తున్నాయనే ప్రచారం ఉంది. కోట్లాది రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో అక్రమాలకు ఇతనే బాధ్యుడని, అంచనాలు, బిల్లులు పెంచడంలోనూ అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఫిర్యాదులు కూడా ఉన్నాయి. తన పై అధికారులను లెక్కచేయడని, బెదిరింపులకు గురిచేస్తాడని ఇతనికి పేరుంది. ఇటీవల వరుసగా తన పైఅధికారులను, సహచర అధికారులను ఇష్టారీతిన బూతులు తిట్టినా.. అతనికి చిన్న మెమో కూడా జారీ కాలేదంటే అతడి పలుకుబడి ఏంటో అర్థమవుతోంది. బాధిత అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సదరు డీఈని మందలించే సాహసంకూడా ఎవరూ చేయడంలేదు. ఏదిఏమైనా సదరు అధికారి తీరు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
Greater Hyderabad: నలుదిశలా మెట్రో పరుగులు.. మారనున్న ముఖచిత్రం
సాక్షి, హైదరాబాద్: మెట్రో విస్తరణతో గ్రేటర్ హైదరాబాద్ రవాణా ముఖచిత్రం మారనుంది. నగరానికి నలుదిశలా మెట్రో సేవలను అందుబాటులోకి తేవాలని తాజాగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో సుమారు 7,220 చదరపు కిలోమీటర్ల పరిధిలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి మెట్రో మణిహారంగా పరుగులు తీయనుంది. ఔటర్చుట్టూ మెట్రో, ఎంఎంటీఎస్ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణ సమయంలోనే ప్రత్యేకంగా కొంత భూమిని కేటాయించారు. దీంతో ఆ మార్గంలో మెట్రో విస్తరణపైన ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. అన్ని వైపులా మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రజారవాణా వేగవంతమవుతందని, ప్రజలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకై నా తేలిగ్గా రాకపోకలు సాగిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రెండో దశకింద బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాఫూల్ వరకు, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో పొడిగించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అలాగే రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణానికి కార్యాచరణ మొదలైంది. మెట్రో మొదటిదశలో మిగిలిపోయిన ఎంజీబీఎస్–ఫలక్‌నుమా రూట్లో 5.5 కి.మీ.మార్గానికి లైన్ క్లియర్ అయింది. ఈ లైన్ పూర్తయితే మొదటిదశలో ప్రతిపాదించిన 72 కిలోమీటర్ల మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. శంషాబాద్ నుంచి తుక్కుగూడ వరకు విస్తరించాలనే ప్రతిపాదన ఉంది. అలాగే ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు కూడా మెట్రో విస్తరణపైన ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది. 2021 నాటికే హైదరాబాద్ నగరానికి 200 కిలోమీటర్ల వరకు మెట్రో సేవలు అవసరమని లీ అసోసియేషన్ తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఈ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇవీ లీ అసోసియేషన్ ప్రతిపాదనలు ... ► హైదరాబాద్ మహానగర రవాణా రంగంపై 2011లోనే సమగ్రమైన అధ్యయనం చేపట్టిన లీ అసోసియేషన్ ప్రభుత్వానికి అందజేసిన నివేదిక ప్రకారం 2041 నాటికి మహానగర జనాభా 2.5 కోట్లు దాటుతుంది. ఈ మేరకు భువనగిరి.సంగారెడ్డి, షాద్‌నగర్ వరకు సుమారు 420 కిలోమీటర్ల వరకు మెట్రో సదుపాయం కల్పించవలసి ఉంటుంది. ► మెట్రో నగరాల్లో కనీసం 20 శాతం రోడ్లు అందుబాటులో ఉండాలి. కానీ నగరంలో ప్రస్తుతం 5 శాతం రోడ్లే ఉన్నాయి. కానీ రోడ్లపైన ప్రతి రోజు సుమారు 75 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ► వేగంగా విస్తరిస్తున్న నగర అవసరాలకు అనుగుణంగా అంతేవేగవంతమైన రవాణా సేవలకు మెట్రో ఒక్కటే పరిష్కారం. 2011 నాటికే 72 కిలోమీటర్ల మేరకు మెట్రో సదుపాయం కల్పించాలని లీ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్టు మెట్రోతో ఊరట... రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు సుమారు రూ.5 వేల కోట్లకు పైగా అంచనాలతో చేపట్టిన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వే కార్యాచరణవేగవంతమైంది. టెండర్ల ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం రెండు దిగ్గజ సంస్థలో పోటీలో ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి ఎయిర్‌పోర్టు మెట్రోను దక్కించుకోనుంది. దీంతో ఈ ఏడాదిలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎయిర్‌పోర్టు మెట్రో విస్తరణ వల్ల కేవలం ప్రయాణికులకే కాకుండా జీవో 111 ప్రాంతాలకు కూడా మెట్రో అందుబాటులోకి వస్తుంది. ఆ 38 కిలోమీటర్లు ఎంతో కీలకం... అత్యధిక వాహన సాంద్రత కలిగిన మార్గాల్లో బీహెచ్ఈఎల్, పటాన్చెరు నుంచి హయత్‌నగర్ వరకు ఉన్న మార్గం ఎంతో కీలకమైంది. ఈవైపు నుంచి ఆ వైపు చేరుకోవాలంటే కనీసం 3 గంటల సమయం పడుతుంది. కానీ మెట్రో అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. అలాగే వాహనాల వినియోగం కూడా చాలావరకు తగ్గుతుంది. మెట్రో రెండోదశపైన ప్రభుత్వం ఇప్పటికే సమగ్రమైన నివేదికను సిద్ధం చేసింది. నగరం నలువైపులా మెట్రో.... ► ఇప్పటికే రెండో దశలో బీహెచ్ఈఎల్ నుంచి లకిడికాఫూల్ వరకు ప్రతిపాదించిన మార్గాన్ని అటు బీహెచ్ఈఎల్ నుంచి పటాన్చెరు, ఇస్నాపూర్ వరకు సుమారు 13 కిలోమీటర్ల వరకు విస్తరించాలని నిర్ణయించారు. ► అలాగే ఎల్బీనగర్ వరకు ఉన్న మెట్రోను హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట్ వరకు మరో 13 కిలోమీటర్లు పొడిగిస్తారు. ► శంషాబాద్ నుంచి కొత్తూరు. షాద్‌నగర్ వరకు మరో 25 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉప్పల్ వరకు ఉన్న మెట్రోను ఘట్కేసర్ , బీబీనగర్ వరకు పొడిగిస్తారు.శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ప్రస్తుతం నిర్మించ తలపెట్టిన మెట్రో కారిడార్‌ను మరో 26 కిలోమీటర్లు పొడిగించి తుక్కుగూడ, మహేశ్వరం, కందుకూరు వరకు మెట్రో సదుపాయం కల్పిస్తారు. ► తార్నాక నుంచి ఈసీఐఎల్ వరకు 8 కిలోమీటర్ల ఎలివేటెడ్ మార్గాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ 158 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి తూంకుంట, ప్యారైడెజ్ నుంచి కండ్లకోయ, కొంపల్లి, తదితర ప్రాంతాలకు కూడా మెట్రోను విస్తరించే ప్రతిపాదనలు ఉన్నాయి. సుమారు రూ.60 వేల కోట్ల అంచనాలతో 400 కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరణపై కేబినెట్ లో తాజాగా చేసిన ప్రతిపాదనలు హైదరాబాద్ మహానగర రవాణా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చనున్నాయి. -
యాదాద్రి రైల్వే స్టేషన్‌కు సరికొత్త హంగులు
యాదాద్రి: యాదాద్రి రైల్వే స్టేషన్ సరికొత్త హంగులు సంతరించుకోనుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అత్యున్నత ప్రమాణాలు, సౌకర్యాలతో తీర్చిదిద్దనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 6న వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. రూ.320 కోట్లతో ఘట్కేసర్ నుంచి (రాయగిరి) యాదాద్రి వరకు రెండో దశ ప్రాజెక్టును పూర్తి చేస్తానని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఇటీవల యాదాద్రి రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు 33 కిలో మీటర్ల మేర అదనపు ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. రూ.24.5 కోట్లతో ఆధునీకరణ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా యాదాద్రి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. యాదాద్రి ఆలయ క్షేత్ర నమూనాతో రైల్వే స్టేషన్ముఖ ద్వారం నిర్మించనున్నారు. ఎంఎంటీఎస్ నూతన లైన్ కోసం స్టేషన్‌ను తూర్పు వైపు విస్తరించనున్నారు. ఇందులో భాగంగా నూతన స్టేషన్ బిల్డింగ్ నిర్మాణం, ప్లాట్‌ఫాం ఎత్తు పెంపు, పైకప్పుల ఆధునీకరణ, ప్రయాణికులకు వెయిటింగ్ హాల్, మంచినీరు, టాయ్‌లెట్స్ పార్కింగ్ ఏరియా పనులను చేపట్టనున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్లో నూతనంగా నిర్మించి ప్లాట్‌ఫాంలను అభివృద్ధి చేయనున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న రేల్వే స్టేషన్లు భువనగిరి, బీబీనగర్, ఘట్కేసర్ స్టేషన్లలో అదనపు మౌళిక వసతులు కల్పిస్తారు. రెండో దశలో కదలిక 2016 లో మంజూరైన ఎంఎంటీఎస్ రెండో దశ పనులు నిధులలేమితో నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించక ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.330 కోట్ల నుంచి రూ.430 కోట్లకు పెరిగింది. అయితే తమ నిధులతోనే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగిస్తామని ప్రకటించి పనులకు శ్రీకారం చుట్టింది. అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. ఇచ్చినమాట ప్రకారం ఎంఎంటీఎస్ యాదాద్రి రైల్వే స్టేషన్‌కు ఈనెల 6వ తేదీన ప్రధాని మోదీ శంఖుస్థాపన చేయనున్నారు. రైల్వేస్టేషన్ నిర్మాణం కోసం రూ.24.5 కోట్లు కేటాయించారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి నుంచి ఆదేశాలు అందాయి. యాదాద్రి నుంచి వయా ఆలేరు జనగామ వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించాలని రైల్వే మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశాం. కేంద్రం ఇప్పటికే బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు చేసింది. ఏడాదిలోగా నూ తన భవన సముదాయాన్ని ప్రారంభిస్తాం. –పీవీ శ్యాంసుందర్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంగపల్లి వరకు పొడిగింపు ప్రతిపాదన యాదాద్రి (రాయగిరి) వరకు ఉన్న ఎంఎంటీఎస్ లైన్‌ను వంగపల్లి వరకు పొడిగించేందుకు రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాయగిరి రైల్వే స్టేషన్ ఇరుకుగా ఉన్నందున విస్తరించాల్సి ఉంటుంది. అయితే వంగపల్లి స్టేషన్ అనుగుణంగా ఉన్నందున అక్కడి వరకు ఎంఎంటీఎస్ పొడిగించే యోచనలో రైల్వే శాఖఉంది. వంగపల్లి నుంచి కూడా యాదాద్రి పుణ్యక్షేత్రం ఐదున్నర కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.అయితే వంగపల్లి వరకు పొడిగించే విషయం ఇంకా ఫైనల్కాలేదని రైల్వే శాఖఅధికారి ఒకరు చెబుతున్నారు. -
మామునూరులో.. ఎగరనున్న విమానం !
వరంగల్: సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి వరకు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు పది రోజుల పాటు కురిసిన వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంతో పాటు పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టులపై ఈ కేబినెట్లో స్పష్టత ఇచ్చింది. ప్రధానంగా మామునూరులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 253 ఎకరాల భూమి ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఏళ్లతరబడిగా ఎయిర్పోర్ట్ అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన నలుగుతోంది. వెయ్యి ఎకరాల స్థలానికి గాను 270 ఎకరాలు అన్యాక్రాంతం కాగా 730 ఎకరాలకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) ఫెన్సింగ్ చేసింది. అయితే మరో 431 ఎకరాలు కావాలని సూచించిన అధికారులు చివరకు 253 ఎకరాలైనా పరవాలేదన్నారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌కు 253 ఎకరాల స్థలం ఇచ్చేందుకు కేబినెట్లో ఆమోదం తెలపడంతో త్వరలోనే మామునూరు నుంచి విమానాలు ఎగరవచ్చన్న చర్చ మొదలైంది. ఇదిలా ఉండగా.. మహబూబాబాద్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు ప్రయోజనం కలిగించే ఉద్యానవన కళాశాలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులు.. రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో ఏళ్ల తరబడి పని చేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ విలీనం చేసుకోవడానికి కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ఆ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈనెల 3న అసెంబ్లీలో బిల్లు పెట్టి అమల్లోకి తేనున్నారు. దీంతో వరంగల్ రీజియన్ పరిధిలోని 9 ఆర్టీసీ డిపోలకు చెందిన 3,627 మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లతో పాటు వివిధ కేడర్లకు చెందిన కార్పొరేషన్ ఉద్యోగులు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఉమ్మడి జిల్లాకు ‘వరద’ సాయం.. ఉమ్మడి వరంగల్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పది రోజుల పాటు కురిసిన వర్షాలు, వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో తక్షణ సహా యక చర్యల కోసం రూ.500 కోట్లు కేబినెట్ కేటాయించింది. ఇందులో సుమారు రూ.237 కోట్ల వరకు ఉమ్మడి వరంగల్‌కు దక్కే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. గ్రేటర్ వరంగల్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సుమారు రూ.587 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు సర్వే చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ శాఖల పరిధిలో వరదల వల్ల రూ.1,000 కోట్లకుపైనే నష్టం జరిగి ఉంటుందని అంచనా. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతి చెందిన 32 మందికి సంబంధించి ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో రోడ్లకు వెంటనే తాత్కాలిక మరమ్మతు చేపట్టేందుకు నిధులు కేటాయించారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఈసారి భారీగా నష్టం జరిగిందని అభిప్రాయపడిన మంత్రివర్గం.. అన్ని విధాల అండగా ఉండాలని, సీనియర్ అధికారులను ఇన్‌చార్జ్‌లుగా నియమించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని నిర్ణయించింది.