News
-
బెడిసికొట్టిన జనసేన వ్యూహం! నాణ్యతకు కాంట్రాక్టర్ సవాల్!
సాక్షి, భీమవరం: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జనసేన పార్టీ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. పవన్‌కల్యాణ్ వలంటీర్ల వ్యవస్థపై చేసిన ఆరోపణలతో పరువు పొగొట్టుకోగా భీమవరం పట్టణంలో ఆ పార్టీ నాయకులు చేసిన మరో చిల్లర ప్రయత్నం బెడిసికొట్టింది. భీమవరం పట్టణంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. పట్టణంలోని పైపుల చెరువు వద్ద విస్సాకోడేరు లేఅవుట్లో సుమారు 3 వేలకు పైగా ఇళ్లు నిర్మించాల్సి ఉండగా పేరొందిన కాంట్రాక్టర్‌తో మాట్లాడి లబ్ధిదారుల ఇష్ట్రపకారం ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 200 ఇళ్ల శ్లాబ్ నిర్మాణం పూర్తికాగా మరో 300 ఇళ్లు శ్లాబ్ లెవల్‌కు, 600 ఇళ్లు బెస్మెంట్ లెవల్లో ఉన్నాయి. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నాణ్యతలో రాజీపడకుండా నిర్మిస్తున్నాయి. అయితే జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావుతోపాటు కొంతమంది పార్టీ నాయకులు గత వారం ఇళ్ల నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి ఇళ్ల నిర్మాణంపై విమర్శలు చేశారు. వారి ఆరోపణల్ని కాంట్రాక్టర్ పళ్ల ఏసుబాబు తిప్పికొట్టారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించినట్లు నిరూపిస్తే ఆయా ఇళ్లను కూలగొట్టి తిరిగి నిర్మిస్తానని బహిరంగ సవాల్ విసిరారు. జగనన్న కాలనీ మునిగిపోతుందని, రోడ్డు అధ్వానంగా ఉందంటూ జనసేన చేసిన ఆరోపణను ఖండించారు. కాలనీకి రోడ్డు సౌకర్యం లేకుంటే ప్రతి రోజు 20 లారీల్లో వెయ్యి టన్నుల మెటీరియల్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. గునుపూడి లే అవుట్ భూముల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ చేసిన మరో ఆరోపణను అక్కడ భూముల కొనుగోలుకు సహకరించిన తిరుమల విజయ్‌రామ్, భూములు విక్రయించిన రైతులు తప్పుపట్టారు. లేఅవుట్‌కు 70 ఎకరాలు కొనుగోలు చేయగా ఎకరాకు రూ.కోటి 6 లక్షల చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమచేశారని, రైతుల నుంచి ఎవరికై నా ముడుపులిచ్చినట్లు జనసేన నాయకులు మావుళ్లమ్మ ఆలయంలో దీపం ఆర్పి ప్రమాణం చేసి నిరూపించగలరా? అని సవాల్ చేశారు. -
జాతీయ చేనేత ఐక్య వేదిక అధికార ప్రతినిధిగా అక్షిత
కరీంనగర్: జాతీయ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధిగా కరీంనగర్‌కు చెందిన డాక్టర్ అక్షితను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కష్టపడేవారికి సరైన గుర్తింపు ఉంటుందని, సంఘం బలోపేతానికి పాటుపడుతున్న కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు అక్షిత సేవలను మరింతగా వినియోగించుకునేందుకు రాష్ట స్థాయి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్, రాష్ట్ర ఇన్చార్జి కాటా రాందాస్, అధ్యక్షుడు మాడ రాజా, గౌరవ అధ్యక్షులు తిరందాస్ వేణుగోపాల్, కోట దామోదర్, యువజన విభాగం అధ్యక్షుడు చిలివేరి రామకృష్ణ, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఎలుబాక సుజాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రజలను మభ్యపెట్టెందుకే బీఆర్ఎస్పై విమర్శలు..
రాజన్న: కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోతోందనే భయంతో ప్రజలను మభ్యపెట్టేందుకే ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారని మున్సిపల్ చైర్ప్ర్సన్ జిందం కళ అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత మంత్రి కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మంత్రి కేటీఆర్ చొరవతోనే సిరిసిల్ల పట్టణం అభివృద్ధి చెందిందన్నారు. పద్మశాలీల అభివృద్ధికి కృషిచేస్తున్న మంత్రి కేటీఆర్‌ను పద్మశాలీ మహిళంతా ఓడిస్తామని కాముని వనిత పేర్కొనడం సరికాదన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, మహిళా కౌన్సిలర్లు ధర్నాం అరుణ, గడ్డం లత, పోచవేణి సత్య, ఒగ్గు ఉమ, జాగీరు శైలు, అడ్డగట్ల మాధవి, ఆడెపు సౌజన్య, కల్లూరి లత, రాపెల్లి అరుణ, బుర్ర లక్ష్మి, దార్ల కీర్తన, దిడ్డి మాధవి, తదితరులున్నారు. -
నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు..
భద్రాద్రి: ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల పిలుపునిచ్చారు. ఐడీఓసీలో సోమవారం నిర్వహించిన సమావేశంలో వారోత్సవాల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లిపాల ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, మధుసూదన్‌రాజు, డీఎంహెచ్ఓ డాక్టర్ శిరీష, ఆస్పత్రుల సమన్వయ అధికారి రవిబాబు, మహిళా, శిశు సంక్షేమాధికారి సబిత, ఉపాధి కల్పన అధికారి విజేత పాల్గొన్నారు. వరద నష్టాల నివేదిక అందించాలి జిల్లాలో వరద నష్టాల నివేదికలను అందజేయాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ఐడీఓసీలో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద సహాయక చర్యల్లో అధికారుల పనితీరును అభినందించారు. వర్షాలు, వరదలతో దెబ్బతిన్న పంటలు, పశువులు, ఇళ్లు, పిడుగుపాటు తదితర అంశాలపై సమగ్ర నివేదికలు రూపొందించాలని సూచించారు. ఆర్అండ్బీ శాఖ పరిధిలో నాలుగు వంతెనలు దెబ్బతిన్నాయని, పంచాయతీరాజ్ పరిధిలో 97 రహదారులు మరమ్మతులకు గురి కాగా 60 పనులు పూర్తి చేశామని తెలిపారు. 11 చోట్ల దెబ్బతిన్న పైపులైన్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. వచ్చిన దరఖాస్తులలో కొన్ని.. ► ఇల్లెందు సీఎస్పీ బస్తీకి చెందిన ఆదివాసీ వ్యవసాయదారులు.. తాము 1987 నుంచి పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నామని సింగరేణి అధికారులు జేకే 5 ఓసీ ఏర్పాటుకు సర్వే నిర్వహించి ఏర్పాటు చేసిన హద్దుల ప్రకారం తమ భూములను కోల్పోతున్నామని, జీవనోపాధి కల్పించాలని దరఖాస్తు చేయగా రెవెన్యూ అధికారులకు ఎండార్స్ చేశారు. ►పాల్వంచ నవభారత్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో సౌకర్యాలు లేక విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారని, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యంతో తప్పుదోవ పడుతున్నారని విద్యార్థి, యువజన సంఘాలు దరఖాస్తు చేయగా త్వరలో పరిశీలించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ►కొత్తగూడెం మున్సిపాలిటీ నాలుగో వార్డులో కాలువల నిర్మాణం మంజూరైనా ప్రారంభించ లేదని బీజేపీ పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ అగర్వాల్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు జోగు ప్రదీప్ తదితరులు ఫిర్యాదు చేయగా కమిషనర్‌ను పిలిచి సమస్యపై ఆరా తీశారు. సంబంధిత వార్డు కౌన్సిలర్, చైర్‌పర్సన్‌ను ఆహ్వానించి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. -
'అర్ధ శతాబ్దం' తరువాత.. మళ్లీ కలుసుకున్న మా జ్ఞాపకాలు !
ఖమ్మం: చిన్నతనంలో కలిసి చదువుకున్నారు... ఆతర్వాత ఉన్నత చదువులు, ఆపై ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారందరూ మళ్లీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలుసుకుని జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సమ్మేళనంలో సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి సైతం పాల్గొని మాట్లాడారు. తల్లాడలోని జెడ్పీహెచ్ఎస్లో 1973–74 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు యాభై ఏళ్ల తర్వాత ఖమ్మంలో సోమవారం సమావేశమయ్యారు. ఈ బ్యాచ్‌కు పాఠాలు బోధించిన సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో చదువుకుని ఇక్కడే గురువుగా పాఠాలు బోధించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇన్నాళ్లకు కలుసుకున్న పూర్వ విద్యార్థులు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని.. చదువుకున్న పాఠశాల అభ్యున్నతికి తోడ్పాటునందించాలని సూచించారు. పూర్వ సమాజం పూనుకుంటేనే విద్యారంగం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. అనంతరం గురువులు రామచంద్రమూర్తితో పాటు చిమ్మపూడి శ్రీరామమూర్తి, కె.శ్రీనివాసరావు, జె.సత్యనారాయణ, నారాయణరెడ్డి తదితరులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దామోదర్ ప్రసాద్, పూర్వ విద్యార్థులు అనుమోలు బుద్దిసాగర్, బేబి శంకర్, ఎన్.సత్యనారాయణ, మంగపతిరావు, జి.సునంద, పూనాటి పిచ్చయ్య, భాస్కర్‌రావు, శంకర్రావు, నంబూరు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
రెండున్నర దశాబ్దాలైనా.. వీడని ఎస్ఎస్సి బంధం
కరీంనగర్: ప్రతీ ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయి. తను చదువుకునే రోజులు… చేసే అల్లరి… వారితో కలిసి ఆడిన ఆటలు… చిన్న చిన్న గ్యాంగ్‌లు… అవన్నీ ఓ మధురమైన క్షణాలు. మళ్లీ అవన్నీ గుర్తు చేసుకుంటూ 26 సంవత్సరాల తర్వాత కలుసుకుని ఆనందంగా గడిపారు. పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ ప్రగతి ఉన్నత పాఠశాల పదవ తరగతి 1996-97 పూర్వ విద్యార్థులు. తిరిగి ఒకే గూటికి చేరిన జ్ఞాపకాలు.. ప్రగతి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు. 26 సంవత్సరాల తర్వాత అదే పాఠశాలలో.. అదే తరగతి గదిలో.. అదే బెంచ్ పై కూర్చుని, వారు ఒకరినొకరు పలకరించుకుంటూ.. కలుసుకోవడంతో.. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి కరెస్పాండెంట్ కేశవరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయురాలు నాగరాజకుమారి అధ్యక్షతన జ్యోతి ప్రజల్వను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారి జీవితంలో సాధించిన విజయాలు, కష్టాల గురించి చర్చించుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా పూర్వ విద్యార్థులు అందరూ మాట్లాడుతూ.. వారు చదివిన పాఠశాలలో ఒకే చోట కలుసుకొని మరపురాని మధురమైన సంఘటనలను, చిలిపి చేష్టలను గుర్తుకు తెచ్చుకున్నారు. గుర్తుకొస్తున్నాయి.. ఉన్నది కొద్ది గంటలైనా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ.. ఆనందభాష్పాలతో ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. నాడు పాఠశాలలో వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను కూడా గుర్తుకు తెచ్చుకొని సరదాగా గడిపారు. ఈ సందర్భంగా వారికి చదువు చెప్పిన గురువులకు ఘనంగా శాలువాతో సత్కరించి మెమొంటో ప్రధానం చేశారు. పూర్వ విద్యార్థులను ఉద్దేశించి కరీంనగర్లో స్థిరపడిన అబు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. 26 సంవత్సరాల తర్వాత మనమందరం ఈ విధంగా మనం చదివిన పాఠశాలలో ఒకే చోట కలుసుకోవడం నాకు చాలా ఆనందాన్నిచ్చిందన్నారు. గడిచిపోయిన కాలాన్ని ఎలాగూ మనం తెచ్చుకోలేమని ఇప్పటినుండి అయినా ఒకరినొకరు మొబైల్ ద్వారా మాట్లాడుకుంటూ.. వీలైనప్పుడల్లా అప్పుడప్పుడు కలుసుకుంటూ.. తమ తమ బాగోగుల గురించి మాట్లాడుకోవడం మన అందరి బాధ్యత అన్నారు. పూర్వ విద్యార్థుల సమావేశానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. మనకు చదువు చెప్పిన గురువులను సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సమావేశానికి మనమందరం ఈ విధంగా కలుసుకోవడం మనకు చాలా ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీబీజీకేఎస్ జనరల్ సెక్రెటరీ మిర్యాల రాజిరెడ్డి, కరెస్పాండెంట్ కేశవరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయురాలు నాగరాజకుమారి, విద్యార్థులు అబు సత్యనారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి, విష్ణు రెడ్డి, శ్రీనివాస్, అంజనీ ప్రసాద్, కుమార్, సురేష్, వనజ, కళాజ్యోతి, శ్రావణి తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
కట్లపాము ఇది కాటేసిన క్షణాల్లోనే విషం రక్త కణాల్లో కలుస్తోంది...
సంగారెడ్డి: పొలంగట్లు, కాలువగట్లు, వాగులు, పశువుల పాకలు, పిచ్చిమొక్కలతో నిండిన పొదలు, గడ్డి వాములు, పాడుబడ్డ ఇళ్లు, గృహాల ఎదుట పేర్చిన కట్టెలు, పెంటకుప్పల్లో పాములు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఆహారం కోసం బయటకొచ్చి ఎలుకలు, బల్లులు, తొండలు, పక్షులను తింటాయి. ఇలాంటి ప్రాణులు ఎక్కడ ఎక్కువగా సంచరిస్తాయో పాములు అక్కడ తిష్ట వేస్తాయి. పాములకు శరీరం కింది భాగంలో ఉండే ప్రత్యేక పొలుసుల ద్వారా శబ్దం గ్రహిస్తాయి. వేడిరక్తం ప్రసవించే, జంతువులు, మనుషులు సమిపిస్తే వెంటనే గుర్తిస్తాయి. కదులుతున్న ప్రాణులను గుర్తించి కాటేస్తాయి. నాగుపాము, కట్ల పాము, రక్తపింజర తదితర పాములు విషపూరితమైనవి. వీటి కాటుకు గురైనా బాధితులకు వెంటనే వైద్యమందక ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. సాధారణంగా పంట పొలాలు, కాలువల్లో తిరిగే పాములు చాలా వరకు విషపూరితమైనవి కావు. సర్పాలకు ప్రాణభయం ఉన్నప్పుడు ఏకాంతానికి భంగం వాటిల్లినప్పుడు, ఎవరైనా తొక్కినప్పుడు, వేటాడేటప్పుడు కాటేస్తాయి. అన్ని ప్రమాదం కాదు.. పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. తాచు. కట్లపాము వంటి 15 శాతం ప్రమాదకరమైన సర్ప జాతుల్లోనే ప్రమాదముంటోంది. సాధారణంగా 50 శాతం పాముకాట్లు విషం, ప్రమాదంలేని మాములు గాయాలే. చికిత్స తీసుకుంటే నయమవుతాయి. పాముల కన్నా చాలా మంది షాక్‌తో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంట్లో వారు. ఇరుగుపొరుగు వారు ధైర్యం చెప్పడానికి బదులుగా ఏడుపులు ప్రారంభిస్తే బాధితులు భయాంతోళనకు గురైతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా తయారవుతోంది. పాములు వాటి విషప్రభావం కట్లపాము: ఇది కాటేసిన క్షణాల్లోనే విషం రక్త కణాల్లో కలుస్తోంది. వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి. నాగుపాము: ఇది కాటేసిన 15 నిమిషాల్లోనే శరీరంలోకి విషం ఎక్కుతోంది. రక్తపింజర: ఇది కాటేసిన 2 గంటల తర్వాత విషం ఎక్కుతోంది. జెర్రిపోతు, నీరుకట్ట: ఇవి కాటేసిన విషం ఉండదు. కాటు వేసిన చోట చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకువెళ్లడం ఉత్తమం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాత్రివేళల్లో తిరిగేవాళ్లు, అక్కడే నిద్రించేవాళ్లు టార్చ్‌లైట్‌ను వెంట తీసుకుపోవాలి. పాములు చేరడానికి అవకాశం లేకుండా పరిసరాలు ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవాలి. పెట్రోల్, కిరోసిన్, వెల్లుల్లి, ఇంగువ వాసనలను భరించలేవు. పాములు ఎక్కువగా ఉన్నాయనిపిస్తే సమయానుకూలంగా వీటిని ఉపయోగించుకోవాలి. రాత్రి వేళల్లో పొలాల గట్లపై, గడ్డివాముల్లో తిరిగే రైతులు, కూలీలు మోకాళ్ల వరకు రబ్బరు బూట్లు, చేతులకు రబ్బరు తొడుగులు ధరించాలి. ఇళ్లు, కార్యాలయాలు, పాఠశాలలు పరిసరాలల్లో పిచ్చిమొక్కలు, పొదలు ఉండకుండా చూసుకోవాలి. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లాలి పాముకాటుకు గురై వ్యక్తి ఆందోళన చెందొద్దు. పక్కవారు బాధితుడికి ధైర్యం చెబుతుండాలి. పాముకాటేసిన పైభాగంలో వెంటనే తాడు, గుడ్డతో బిగుతుగా కట్టాలి. కాటేసిన చోట బ్లేడు గాయం చేసి రక్తం కారనివ్వాలి. నోటిలో పుండ్లు, గాట్లు లేకుంటే రక్తం పీల్చి ఉమ్మివేయాలి. పాముకాటుకు గురైనా వ్యక్తిని నడిపించడం, పరిగెత్తించడం చేయొద్దు. నాటువైద్యం పేరిట పసర్లు, వేర్లు, మంత్రాలు అంటూ కాలయాపన చేయకుండా వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. – డాక్టర్ శాలిని, పీహెచ్సీ టేక్మాల్ -
జాబితా సిద్ధం..! గ్రీన్‌సిగ్నల్ కోసం ఆరాటం..!!
వరంగల్: కులవృత్తుల ఆర్థికాభివృద్ధి కాంక్షిస్తూ... ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రూ.లక్ష ఆర్థిక సాయం స్కీంలో చెక్కుల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. మొదటి విడతలో అర్హుల జాబితాను సిద్ధం చేసిన అధికారులు.. సర్కారు నుంచి గ్రీన్‌సిగ్నల్ కోసం చూస్తున్నారు. వేలల్లో వచ్చిన దరఖాస్తులను స్క్రూటినీ చేసిన అధికారులు.. అనర్హులను తొలగించారు. మండలాల వారీగా గ్రామానికి రెండు కూడా వచ్చే పరిస్థితి లేక పోవడంతో... రేపటి ఎన్నికల సమయంలో ఓట్లకు వెళితే ఎలా అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. జిల్లాలో రూ.లక్ష స్కీం కోసం 8,978 దరఖాస్తులు వచ్చాయి. జూన్ 6వ తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ అదే నెల 20వ తేదీన ముగిసింది. ఎంపీడీఓల సమక్షంలో వాటిని పరిశీలన చేసి 6,439 మంది అర్హత ఉన్నట్లు గుర్తించి, 2,359 దరఖాస్తులను తిరస్కరించారు. మొదటి విడుతలో 15 కులాలకు అవకాశం ఇవ్వగా, బీసీ కులంలోని ఇతరులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు క్షేత్రస్థాయి విచారణ తర్వాత, వాటిని అనర్హత జాబితాలో ఉంచారు. మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను జిల్లా కమిటీ కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య నేతృత్వంలో రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డీఆర్డీఓ పీడీ సమక్షంలో తుది జాబితాను సిద్ధం చేశారు. నియోజకవర్గానికి 300 చొప్పున.. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గానికి 300 చొప్పున మొత్తంగా 900 రూ.లక్ష స్కీం లబ్ధిదారులను కేటాయించారు. ఇందులో జనగామ నియోజకవర్గంలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాలు సిద్దపేట పరిధిలో ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్, వేలేరు మండలా లు హనుమకొండ జిల్లాలో కలువగా, పాలకుర్తిలో ని తొర్రూరు, పెద్దవంగర మహబూబాబాద్ జిల్లా, వరంగల్ జిల్లాలో రాయపర్తి ఉంది. దీంతో జనగామ జిల్లాలో ఉన్న 12 మండలాలకు 520, ఇతర జిల్లా పరిధిలో ఉన్న 9 మండలాలకు 380 యూ నిట్లను కేటాయించారు. ఈ లెక్కన జనగామకు 230, స్టేషన్‌ఘన్‌పూర్‌కు 150, పాలకుర్తి నియోజకవర్గానికి 140 యూనిట్లు ఇచ్చారు. దీంతో గ్రామానికి రెండు యూనిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారిన స్కీం జిల్లాలో బీసీ కులాల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వం ఈ జాబితాలో మొదటి విడుతలో 15 కులాలకు మాత్రమే ఈ స్కీం వర్తింప జేస్తుంది. కానీ దరఖాస్తులు మాత్రం ఇందులోని ఇతరులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఎంక్వరీలో వీటిని అధికారులు పక్కన బెట్టారు. దీంతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఇతర ప్రజా ప్రతినిధులు వచ్చే ఎన్నికల్లో ఈ పథకంతో మైనస్ లేదా ప్లస్ అవుతుందా అనే ఆందోళనలో ఉన్నారు. ఒక్కో ఊరిలో సుమారు 100 నుంచి 500 వందలకు పైగా బీసీ కులాలకు చెందిన కులవృత్తి దారులు రూ.లక్ష స్కీం కోసం ఎదరుచూస్తున్నారు. వారంలో పంపిణీకి సిద్ధం జిల్లాలో అర్హత సాధించిన లబ్ధిదారులకు రూ.లక్ష స్కీం చెక్కును మరో వారం రోజుల్లో అందించేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. తుది జాబితా సిద్ధమైనప్పటికీ, ఇంకా బయట పెట్టడం లేదు. రూ. 5.20 కోట్ల మేర మొదటి విడుతలో అందించనుండగా... ప్రభుత్వం నుంచి బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్ లభించగానే.. చెక్కులను పంపిణీ చేస్తారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. దళారులను నమ్మొద్దు.. రూ.లక్ష స్కీం కోసం దళారులను ఆశ్రయించవద్దు. ఇందుకు ఎవరికీ కూడా రూపాయి ఇవ్వొద్దు. ప్రభుత్వం కులవృత్తులపై ఆధారపడిన అర్హులైన నిరుపేదలకు రూ.లక్ష సాయం చేస్తుంది. దీనిద్వారా వృత్తిని మరింత అభివృద్ధి చేసుకుని, ఆర్థికంగా ఎదగాలి. ఎవరైన స్కీం ఇప్పిస్తామని డబ్బులు డిమాండ్ చేస్తే, వెంటనే తమకు ఫిర్యాదు చేయాలి. – రవీందర్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ -
కుమారులే.. కాడ్డెదులుగా..
మహబూబ్‌నగర్: పుడమితల్లిని నమ్ముకున్న ఓ రైతు చివరికి కన్న కొడుకులను కాడెద్దులుగా మార్చారు. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని గోకులపాడుకు చెందిన అయ్యన్న ఉల్లిపంట సాగుచేశాడు. ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు కలుపు ఏపుగా పెరిగింది. దీంతో కలుపుతీతకు ఇటు కూలీలు దొరకక.. అటు కాడెద్దులు లేకపోవడంతో తన ఇద్దరు కుమారులు యశ్వంత్, రుద్రప్రతాప్‌లను కాడెద్దుల మాదిరిగా గుంటుక కట్టి కలుపు తీశారు. ఆదివారం చంద్రశేఖర్‌నగర్ శివారులో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. – మానవపాడు -
వామ్మో.. రోడ్లపైకి మొసళ్లు..!
మహబూబ్‌నగర్: మండలంలోని గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు అనుబంధంగా ఉన్న చెరువులు, కుంటల నుంచి రాత్రిళ్లు మొసళ్లు రోడ్లపైకి వస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గోవర్ధనగిరి గ్రామ కత్వా, కామదేనుపల్లి ఊరకుంట సమీపంలో రాత్రి వేళల్లో తరుచూ సంచరిస్తూ రోడ్డుపైనే వస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు భయాందోళనకు గురై కిందపడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందించడం లేదని గోవర్ధనగిరి, గోపల్‌దిన్నె, వీపనగండ్ల, రంగవరం గ్రామాల రైతులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్లపైకి రాకుండా అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. -
జాతీయస్థాయి స్విమ్మింగ్ టోర్నీకి ఎంపిక.. మిట్టపల్లి రిత్విక
నిజామాబాద్: హైద్రాబాద్‌లోని పబ్లిక్స్కూల్లో ఈ నెల 29, 30 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ సబ్ జూనియర్, జూనియర్ టోర్నీలో జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక సత్తా చాటింది. జిల్లా తరఫున 50, 100, 200మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో బంగారు, 200మీటర్లలో కాంస్య పతకంతో సాధించింది. ఆగస్టు 16 నుంచి 20వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జరగనున్న జాతీయస్థాయి సబ్‌జూనియర్ టోర్నీకి ఆమె ఎంపికైంది. ఈ సందర్భంగా రాష్ట్ర స్విమింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, ఉమేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడీల శ్రీరాములు, మహిపాల్‌రెడ్డి తదితరులు ఆమెను అభినందించారు. -
బాగా తాగు..! తాగి ఊగు..! దొరికితే అంతే సంగతులు..!!
నిజామాబాద్: ‘తాగాలి.. తాగి ఊగాలి..’ అనేది పాత సామెత. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. ‘మరింతగా తాగాలి.. డ్రంకెన్ డ్రైవ్‌కు చిక్కి వేసినంత జరిమానా కట్టాలి’ అనేలా పరిస్థితి తయారైంది. ఈ నేపథ్యంలో వైన్స్ వ్యాపారులను లిక్కర్ అమ్మకాలు పెంచాలంటూ ఆబ్కారీ అధికారులు మెడమీద కత్తి పెట్టినట్లు వ్యవహరిస్తుండడంతో గగ్గోలు పెడుతున్నారు. బీర్ల అమ్మకాలను నామమాత్రం చేసి లిక్కర్ అమ్మకాలు భారీగా పెంచాలంటుండడంతో వ్యాపారులు గుస్సా అవుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 180 వైన్స్‌లు ఉన్నాయి. కాగా గతంలో ఎన్నడూ లేనివిధంగా తాజాగా ఉమ్మడి జిల్లాలోని అన్ని వైన్స్‌లకు రూ. 10 లక్షల మేర అరువు మీద సరుకు అంటగట్టారు. వ్యాపారులు అయిష్టంగానే తీసుకున్నా రు. ఇందుకు సంబంధించి వ్యాపారుల వద్ద నుంచి బలవంతంగా ఇప్పటివరకు రూ. 13 కోట్ల మేర చె క్కులు వసూలు చేశారు. ఈ చెక్కులకు సంబంధించిన మొత్తాన్ని ఆగస్టు 3న చెల్లించాలని డెడ్‌లైన్ వి ధించారు. ఇది చాలదన్నట్లు ఈ నెలాఖరుకు సంబంధించిన టార్గెట్ మేరకు కూడా నగదు చెల్లించి సరుకు తీసుకోవాల్సిందేనని హుకుం జారీ కావడంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనా భా ఆధారంగా, గతంలో జరిగిన అమ్మకాల మేరకు లక్ష్యం విధించారు. అమ్మకాలు తగ్గితే సదరు వైన్స్‌లపై కేసులు నమోదు చేయాలని కమిషనరేట్ నుంచి ఆదేశాలు రావడంతో క్షేత్రస్థాయిలో అధికారులు కూడా వాపోతున్నారు. వర్షం కారణంగా అమ్మకా లు తగ్గినా ఊరుకునేది లేదని కమిషనరేట్ నుంచి కోప్పడుతుండడంతో అధికారులు సైతం టెన్షన్ ప డుతున్నారు. అమ్మకాల పెంపు కోసం ఆబ్కారీ అధికారులు సర్కిల్స్ వారీగా నిరంతరం స మావేశాలు పెడుతున్నారు. అమ్మకాలు తగ్గితే మా త్రం ఆయా ప్రాంతాల్లో నాటుసారా, ఇతర రాష్ట్రాల మద్యం వస్తుందంటూ వైన్స్ వ్యాపారులను తిడుతుండడం విశేషం. ఉమ్మడి జిల్లాలో కొందరు ఆబ్కారీ సీఐలు దగ్గరుండి వ్యాపారులకు అప్పులిప్పించి మరీ సరు కు కొనిపించిన సందర్భాలు అనేకమున్నాయి. మరోవైపు పోలీస్‌శాఖ.. మద్యం అమ్మకాల విషయంలో ఆబ్కారీ శాఖ ఒక్క చిన్న అవకాశం కూడా వదలట్లేదు. ప్రభుత్వం కూడా అమ్మకాల విషయంలో తగ్గేదే లేదంటోంది. 2021 నవంబర్‌లో లాటరీ ద్వారా వైన్స్‌లు దక్కించుకున్నవాళ్లు డిసెంబర్ 1 నుంచి షాపులు ప్రాంరంభించాల్సిన నేపథ్యంలో నవంబర్ 28వ తేదీనే వాళ్లకు సరుకు అంటగట్టారు. షాపులు సమయానికి దొరకని వాళ్లు టెంటు వేసైనా సరే డిసెంబర్ 1న అ మ్మకాలు ప్రారంభించాలని ప్రభుత్వం తహసీల్దార్ల ద్వారా ఆదేశాలు జారీ చేయించడం గమనార్హం. అ యితే వైన్స్ వ్యాపారులు, పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ విషయమై ప్రస్తావించారు. ఆబ్కారీ అధికారులు పోలీసులకు చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం తమ టార్గెట్ తమకుందని, డ్రంకెన్ డ్రైవ్ ను ఆపడం కుదరదని తేల్చిచెప్పడంతో తకరారు ప డింది. ఇటీవల ఉమ్మడి జిల్లాలోని ఒక చోట ఈ డ్రంకెన్ డ్రైవ్ నేపథ్యంలో ఒక వ్యక్తి వైన్స్ షెట్టర్‌ను కిందికి లాగి అమ్మకాలు చేయవద్దని గొడవ చేశాడు. దీంతో సదరు వ్యక్తిపై ఆబ్కారీ అధికారులు పోలీసు కేసు పెట్టారు. ఇలాంటి ఘటనలు పలుచోట్ల గతంలోనూ చోటుచేసుకున్నాయి. మొత్తంమీద ఆబ్కారీ అధికారులే దగ్గరుండి బెల్ట్ షాపులు మరిన్ని ఏ ర్పాటు చేసి అమ్మకాలు చేస్తుండడం విశేషం. అధికారులే అనుమతులిచ్చి.. మద్యం బెల్టు దుకాణాలను నిర్మూలించాల్సిన ఆబ్కారీ అధికారులే వాటిని మరింతగా పెంచేందుకు కృషి చేస్తుండడం విశేషం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో వీడీసీలు, మ రికొన్ని ప్రాంతాల్లో సర్పంచ్‌లు, పెద్దలు మద్యం అమ్మకాలను లేకుండా చేసేందుకు ఆయా గ్రామాల్లో బెల్టు షాపులను పెట్టకుండా కట్టుబా ట్లు విధించారు. ఈ నేపథ్యంలో లిక్కర్ అమ్మకాలను పెంచేందుకు గాను ఆబ్కారీ అధికారులే బెల్టు షాపులు నిర్వహించేందుకు సహకరించాలని ఆయా గ్రామాల పెద్దలను, సర్పంచ్‌లను కలిసి మాట్లాడి ఒప్పిస్తుండడం విశేషం. ఎక్కువమంది సర్పంచ్‌లు బీఆర్ఎస్ వాళ్లే కావడంతో ఆబ్కారీ అధికారులు సంక్షేమ పథకాల కు డబ్బులు అవసరమనే మాటలు చెప్పి వారిని ఒప్పిస్తున్నారు. మరో విశేషమేమిటంటే బెల్టు షాపుల జోలికి వెళ్లొద్దంటూ పోలీసులకు సైతం చెప్పడం కొసమెరుపు. -
కళ్ల ‘కలక’లం! రోజురోజుకు పెరుగుతున్న కేసులు!
ఆదిలాబాద్: కళ్లకలక.. ప్రజలను కలవరపెడుతుంది. వర్షాకాలం ప్రారంభంలో ఏటా ఇది ప్రబలడం మామూలే అయినా ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంది. ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందుతుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కంటి ఆసుపత్రుల్లో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఐదు రోజులుగా పాఠశాలలకు సెలవు ఉండటంతో దీని ప్రభావం అంతగా కనిపించలేదు. సంక్షేమ వసతి గృహాల్లో మాత్రం ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. నేటి నుంచి బడులు తిరిగి ప్రారంభం కానుండగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పులతోనే ... ఏటా వర్షాకాలం ప్రారంభంలో సంభవించే వాతావరణ మార్పులతో కళ్లకలక ప్రబలుతుండటం సాధారణమేనని వైద్యులు చెబుతున్నారు. బ్యాక్టీరియా, వైరస్, అలర్జీతో ఇది వ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడుతున్నారు. రెండు, మూడేళ్లుగా జిల్లాలో దీని ప్రభావం అంతగా కనిపించలేదు. ఈ ఏడాది మాత్రం గడిచిన వారం వ్యవధిలోనే తీవ్రత అధికమైంది. ఈ లక్షణాలతో వచ్చే వారితో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రితో పాటు పలు ప్రైవేట్ కంటి ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. లక్షణాలు.. చికిత్స బ్యాక్టీరియా, వైరస్ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. కళ్లలో నీరు కారడం, ఎరుపెక్కడం, దురద లక్షణా లు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువగా ఉంటే కళ్లు ఉబ్బ డం, కంటి రెప్పలు అతుక్కుంటాయి. వెలుగును చూసేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ఈ లక్షణాలుంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. వారం రోజుల్లో తగ్గే అవకాశముంటుంది. రెండు, మూడు రోజుల పాటు తీవ్రమైన లక్షణాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇంటి వద్ద ఉండటం శ్రేయస్కరం వాతావరణ మార్పులతో కంజెక్టివాకు వైరస్, బ్యాక్టీరియా సోకడం ద్వారా కళ్లకలక వ్యాపిస్తుంది. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం ద్వారా త్వరగా బయటపడవచ్చు. చిన్న పిల్లలకు వేగంగా వ్యాప్తి చెందే అవకాశమున్నందున బాధితులు ఇంట్లో ప్రత్యేకంగా ఉండాలి. వారు ఉపయోగించిన దుస్తులు, వస్తువులు మరొకరు వాడకూడదు. పరిశుభ్రత పాటించాలి. కళ్లలో ఏ మాత్రం నలతగా అనిపించినా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం శ్రేయస్కరం. – డా.చంపత్రావు, కంటి వైద్య నిపుణులు -
ఏడడుగుల బంధానికి ఏడేళ్ల గుర్తుగా.. చెట్టుకి పుట్టినరోజు..
వికారాబాద్: ఆలుమగల అనుబంధానికి గుర్తుగా మిగిలింది ఆ వృక్షం. భర్త బతుకున్న రోజుల్లో కలిసి నాటిన మొక్క నేడు మానువైనా.. మనువాడినవాడికి తీపపిగుర్తుగా మలచుకొని.. ఆ పచ్చని చెట్టువద్దే ఏటా అతడి జన్మదిన వేడుకలు నిర్వహిస్తోంది ఓ ఇల్లాలు.తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి, వెంకటయ్య భార్యభర్తలు. ఏడేళ్ల క్రితం వెంకటయ్య జన్మదినం సందర్భంగా చించోళి రోడ్డు మార్గంలో ఉన్న వారి నివాసం ఎదుట ఇద్దరూ కలిసి ఓ మొక్క నాటారు. ఏడాది తర్వాత వెంకటయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. నాటి నుంచి కుటుంబసభ్యులతో కలిసి ఆ చెట్టువద్దే వెంకటయ్య జయంతి వేడుకలు నిర్వహించే వారు. రోడ్డు విస్తరణలో భాగంగా చెట్టును అక్కడి నుంచి తొలగించాల్సి రావడంతో వేర్లతో సహా చెట్టును తీసుకెళ్లి తాండూరు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో నాటారు. కాగా శనివారం భర్త వెంకటయ్య జయంతి కావడంతో అదే చెట్టు వద్ద భార్య, బంధువులు వేడుకలు నిర్వహించారు. -
సర్వస్వం పోయింది.. ఆదుకోండి..!
వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామస్తులు వరద ఉధృతిలో సర్వం కోల్పోయారు. కట్టుబట్టలు మాత్రమే మిగిలాయి. వరదలో నిత్యావసరాలు, వాహనాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కోల్పోయారు. కట్టుకోవడానికి బట్టలు.. కప్పుకోవడానికి దుప్పటి కుడా లేని దుస్థితి నెలకొంది. వరదల నుంచి తేరుకొని మూడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో నష్టపరిహారం ఇస్తుందా లేదా అని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఆపన్నహస్తాల కోసం ఎదురు చుస్తున్నారు. గ్రామంలో ఏ ఒక్కరిని కదిలించినా క‘న్నీరే’ ఉబికివస్తోంది. కాగా, నిత్యావసర వస్తులు అందించేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందని తక్షణ సాయం ఊరికి ఊరంత వరదలో మునగడంతో కట్టుబట్టలతో బయటికి వచ్చిన బాధితులకు ప్రభుత్వం నుంచి కనీసం తక్షణ సాయం కూడా అందలేదు. నిత్యావసర వస్తువులు, బియ్యం కూడా పంపిణీ చేయలేదు. నష్టపోయిన ఆస్తికి, పశువులకు పరిహారం కింద ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. 10 ఇళ్లు వరద తాకిడి దెబ్బతినగా చెంచుకాలనీకి చెందిన 18 గుడిసెలు వరదలో కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో బాధితులు అందోళన చెందుతున్నారు. ఒక్కొక్క ఇంటిలో రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు నష్టం జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోరంచపల్లి బస్టాండ్ సమీపంలోని సంతోషిమాత సూపర్మార్కెట్లో రూ. 20లక్షల విలువైన కిరాణా సామగ్రి తడిసి పాడైంది. ముందుకు వస్తున్న పలువురు.. మోరంచపల్లిలో జరిగిన నష్టాన్ని చూసిన పలువురు చలించిపోతున్నారు. పగవారికి కూడా ఇలాంటి కష్టం రావొద్దని వేడుకుంటున్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల నాయకులు ముందుకు వచ్చి బియ్యం, కూరగాయలు, వంట సామాను, చద్దర్లు, మ్యాట్లు, పండ్లు, పప్పులు, చీరలు, ఇతర వస్తువులు ఇంటింటికీ తిరుగుతూ బాధితులకు అందజేస్తున్నారు. రూ.20 లక్షల నష్టం జరిగింది మోరంచపల్లిలో వచ్చిన వరదతో మా సూపర్మార్కెట్లో రూ.20లక్షల విలువైన వస్తువులు తడిసి పాడయ్యాయి. చక్కెర, పప్పు, పిండి, బియ్యం ఇతర వస్తువులు పాడయ్యాయి. అప్పు తెచ్చి షాపు ఏర్పాటు చేసుకున్న. వస్తువులు కొనుగోలు చేసిన సెట్లకు ఇంకా డబ్బు ఇవ్వలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి. – దొడ్డశాని సంతోష్, సూపర్ మార్కెట్ నిర్వాహకుడు ఇంటికి రూ. 4లక్షలు ఇవ్వాలి వరద ఉధృతిలో సర్వం కోల్పోయాం. ప్రతి ఇంటికీ ప్రభుత్వం రూ.4లక్షలు ఇచ్చి ఆదుకోవాలి. వరదలో 3 తులాల బంగారం, రూ.15వేల నగదు, వంట గ్యాస్, భూమి పాస్‌పుస్తకాలు, ఇతర వస్తువులు కొట్టుకుపోయాయి. మిగిలిన వస్తువులను కడుకుంటున్నాం. ఇప్పటికీ ఒక్క అధికారి కూడా వచ్చి నష్టం గురించి సర్వే చేయలేదు. – సూరం రాజయ్య, వరద బాధితుడు -
కళ్ల ‘కలక’లం
ఆదిలాబాద్: కెరమెరి మండలంలోని అనార్పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆరురోజుల క్రితం ఇద్దరు విద్యార్థులకు కళ్ల కలక వ్యాధి సోకింది. పరీక్షించిన పీహెచ్సీ వైద్యాధికారి వినోద్‌కుమార్ వైద్యం చేసి తగిన సలహాలు, సూచనలు ఇచ్చి పంపించారు. శనివారం అదే ఆశ్రమ పాఠశాలలో వైద్య పరీక్షలు నిర్వహించగా 11 మంది విద్యార్థులకు వైరస్ సోకినట్లు గుర్తించారు. దీంతో ఆ పాఠశాలలో కలకలం రేగింది. ఈ ఒక్క పాఠశాలనే కాదు జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో విద్యార్థులు, చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కళ్ల కలక (కంజెక్టివైటీస్) వ్యాధి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వ్యాపించింది. ముఖ్యంగా చిన్నారులకు అధికంగా సోకుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 213 కేసులు నమోదయ్యా యి. దగ్గు జలుబు, మాదిరి సీజనల్లాగా వచ్చే వ్యాధి. వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా ప్రభా వం చూపుతుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వ్యాపించింది. ఎక్కువగా చిన్నారులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. వ్యాధి సోకిన వారి కళ్లను తదేకంగా చూడడం వల్ల కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయితే రోగిని ప్రత్యేక గదిలో ఉంచాలి. రోగి వాడిన టవల్, ఇతర వస్తువులు ఇతరులు ఉపయోగించకూడదు. పెద్ద ప్రమాదం ఏమీ లేకపోయినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాధి లక్షణాలు వ్యాధి సోకిన వారి కళ్లు మంట అనిపిస్తాయి. కళ్లవెంట నీరుకారడం, దురద, రెప్పలు వాపెక్కడం, ఊసులురావడం, నిద్రపోయిన సమయంలో రెప్పలు అతుక్కోవడం కళ్ల కలక లక్షణాలు. ఒక కన్నుతో మొదలై మరోకంటికి వ్యాపిస్తుంది. ఒకరితో మొదలై ఏకకాలంలో పలువురికి వ్యాప్తి చెందుతుంది. రోగ నిరోధకశక్తి ఆధారంగా మూడు నుంచి వారం రోజుల పాటు వేధిస్తుంది. వాతావరణం ఒక్కసారిగా మారడంతో వ్యాధి ప్రభావం అధికంగా చూపుతోంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యాధి సోకిన వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. రోగి టవల్, సబ్బు ఇతరులు వాడవద్దు. బయటికి వెళ్లినప్పుడు నల్ల కళ్లద్దాలు పెట్టుకోవాలి. ఇతరులకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు సోకితే వ్యాధి తగ్గేవరకూ ఇంటివద్దే ఉండాలి. వైద్యుల సూచనలతో యాంటీబయాటిక్స్ డ్రాప్స్ వాడాలి. ఆందోళన చెందవద్దు కళ్ల కలక వ్యాధి సోకినవారు ఆందోళన చెందవద్దు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాధికి సంబంధించిన డ్రాప్స్ అందుబాటులో ఉన్నాయి. వ్యాధి సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులు మరింత అప్రమత్తంగా ఉండాలి. రోగి కళ్లల్లోకి చూసినా అతను వాడిన టవల్ ఉపయోగించినా ఇతరులకు వ్యాధి సోకే ప్రమాదం ఉంది. – రామకృష్ణ, జిల్లా వైద్యాధికారి -
ఇంకా ఉత్కంఠే.. నీటి మట్టం 60 అడుగుల వరకూ..
ఖమ్మం: గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతుండడంతో తీర ప్రాంత వాసుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. స్థానికంగా వర్షాలు తగ్గినా ఎగువ నుంచి వరద వస్తుండడంతో గోదావరి శాంతించడం లేదు. అయితే అంతే స్థాయిలో వరద దిగువకు వెళుతుండడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతోంది. వరద తీవ్రత, తీసుకోవాల్సిన చర్యల గురించి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కలెక్టర్ ప్రియాంక ఆల ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఐఏఎస్ అధికారి దురిశెట్టి అనుదీప్, ఎస్పీ డాక్టర్ జి.వినీత్, ఏఎస్పీ పరితోశ్ పంకజ్, ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ తదితరులు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. నేడూ వరద పోటు.. శనివారం రాత్రి 12 గంటల సమయంలో భద్రాచలం వద్ద గోదావరి 15,96,899 క్యూసెక్యుల నీటి ప్రవాహం దిగువకు వెళుతుండగా నీటి మట్టం 56.10 అడుగులుగా ఉంది. గోదావరికి ఎగువ ప్రాంతాన ఉన్న సమ్మక్క బ్యారేజీ వద్ద నీటిమట్టం శనివారం రాత్రి 9 గంటలకు 13 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. సమ్మక్క బ్యారేజీ భద్రాచలనికి ఎగువన 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ శనివారం మధ్యాహ్నం వదిలిన గరిష్ట వరద భద్రాచలం చేరేందుకు 24 గంటల సమయం పడుతుంది. దీంతో ఆదివారం మధ్యాహ్నం వరకు వరద పోటు కొనసాగే అవకాశం ఉంది. గరిష్ట వరద భద్రాచలం చేరుకునే సమయానికి నీటి మట్టం 60 అడుగుల వరకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి భద్రాచలం దగ్గర నీటి మట్టం 53 అడుగుల దిగువకు తగ్గి, ఎగువ నుంచి వరద రాకుంటే పునరావాస శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేందుకు ముంపు బాధితులకు అనుమతి ఇస్తామని అధికారులు చెబుతున్నారు. -
పదహారేళ్లకు తల్లి, కొడుకులను కలిపిన బేకరీ షాప్..
ఆదిలాబాద్: పద్నాలుగేళ్ల వయస్సులో తప్పిపోయిన బాలుడు పదహారేళ్ల తర్వాత తల్లి చెంతకు చేరాడు. చిన్నతనంలోనే దూరమైన కొడుకు ఇక తమకు దొరకడేమోనని నిత్యం కన్నీటి పర్యంతమైన ఆ తల్లికి ఎదిగిన కొడుకు దరిచేరడంతో ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజీపూర్ జిల్లా మహ్మదాబాద్ తహసీల్ పరిధిలోని యూసుఫ్పూర్ గ్రామానికి చెందిన సంత్రదేవి, మున్నాకుమార్ బింద్ దంపతులకు నలుగురు కుమారులు, కూతురు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు మహేందర్ బింద్ అలియాస్ మనోజ్‌ను చిన్నతనంలో దగ్గరి బంధువు ముంబయి తీసుకెళ్లి హోటల్లో పనికి కుదిర్చాడు. కొద్ది రోజుల తర్వాత హోటల్లో పని మానేసి వెళ్లిపోయాడు. ఆ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివ్‌కుమార్ యాదవ్ అనే యువకుడికి తారసపడ్డాడు. తనదీ అదే రాష్ట్రమని, పని కోసం వెతుకుతున్నానని మహేందర్ బింద్ చెప్పడంతో వెంట తీసుకొచ్చి బెల్లంపల్లిలోని బేకరీలో పనికి కుదిర్చాడు. అప్పటి నుంచి ఇక్కడే పని చేస్తుండగా ఓ రోజు ఇంటిపై ధ్యాస మళ్లి బేకరీ యజమాని సుశీల్‌కుమార్ యాదవ్‌కు తన ఇంటి అడ్రస్ కనుక్కోవాలని కోరాడు. దీంతో సుశీల్‌కుమార్ ఆ రాష్ట్రంలోని తన బంధువులకు చెప్పి ఆరా తీశాడు. ఘజీపూర్ జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యూసుఫ్‌పూర్‌లో ఉంటున్న తల్లిదండ్రుల వివరాలు ఇచ్చారు. దీంతో తల్లి సంత్రదేవి, బాబాయ్ కమలేష్బింద్, పిన్నీ బసంత్ బింద్ శుక్రవారం బెల్లంపల్లికి చేరుకున్నారు. ఆపరేషన్ చేసిన గాయం చూసి... కొడుకును వెతుక్కుంటూ రాష్ట్రాలు దాటొచ్చిన తల్లి అతడిని చూసి ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురైంది. కొడుకూ కన్నీటి పర్యంతమయ్యాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నతనంలో గొంతుకింద చేసిన ఆపరేషన్ గాయాన్ని పరిశీలించి మహేందర్ బింద్ తన కొడుకేనని సంత్రదేవి మురిసిపోయి ముద్దాడింది. కుటుంబసభ్యులను కలిసేలా చేసిన బేకరీ షాప్ యజమాని సుశీల్ కుమార్‌యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మహేందర్ బింద్ తల్లి, బంధువులతో కలిసి రైలులో ఉత్తరప్రదేశ్‌కు బయల్దేరి వెళ్లాడు. -
గ్రామదేవతలే భరత సంస్కృతికి ఆధారం!
నిజామాబాద్: భారతీయ సంస్కృతికి ఆధారం గ్రామ దేవతలేనని, ఆ గ్రామ దేవతలే గ్రామాలను, దేశాన్ని రక్షిస్తున్నాయని విశ్రాంత అధ్యాపకుడు డాక్టర్ గంగల్ లక్ష్మీపతి వ్యాఖ్యానించారు. శనివారం ఇందూరు ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో స్థానిక హరిచరన్ మార్వాడీ విద్యాలయంలో శ్రీగ్రామ దేవతలు – ఆరాధనా సంస్కృతిశ్రీ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనిషి తాను చేసే ప్రతి పనిలో భగవంతుని దర్శించడమే సంస్కృతి అని పేర్కొన్నారు. శ్రీరాముడు, పాండవులు సైతం అయోధ్య గ్రామ దేవతను, రాజ్యలక్ష్మీ దేవతను ఆరాధించినట్లు ఇతిహాసాలు చెబుతున్నాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 145 రూపాల్లో గ్రామ దేవతల్ని ఆరాధిస్తున్నారని వెల్లడించారు. ఇతిహాస సంకలన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి కందకుర్తి ఆనంద్ మాట్లాడుతూ చరిత్ర అధ్యయనం కోసమే ఇతిహాస సంకలన సమితి అంకితమైన సంస్థ అన్నారు. ఈ కార్యక్రమంలో భోగరాజు వేణుగోపాల్, ఆకాశవాణి అధికారి మోహన్ దాస్, బొడ్డు సురేందర్, డా వారె దస్తగిరి, బలగం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్..
నిజామాబాద్: ఆర్టీసీ ద్వారా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు.. వారి ఆర్థికభారాన్ని తగ్గించేందుకు అధికారులు వివిధ రకాల ప్యాకేజీలను తీ సుకొచ్చారు. గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా మ హిళా ప్రయాణికులకు అనువుగా ఉండేందుకు టీ 9–30, టీ9–60 వంటి పథకాలను తీసుకొచ్చింది. ఆటోల్లో ప్రయాణికులు వెళ్లకుండా పల్లెవెలుగు ద్వారా ప్రయాణం చేయడానికి ఈ పథకాలు ఉపయోగపడుతాయని ఆర్టీసీ భావిస్తోంది. అంతేకాకుండా తిరుపతి, అరుణాచల క్షేత్రంకు భక్తులు అధిక సంఖ్య లో వెళ్తున్నారు. వీరు టూరిస్టు బస్సులను నమ్మి మోసపోయిన ఘటనలున్నాయి. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి తిరుపతి, అరుణాచలం వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అరుణాచలం గిరి ప్రదర్శనకు.. తమిళనాడులోని అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణకు నిజామాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సులకు సంస్థ నియమ నిబంధనలకు అనుసరించి ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా నడుపుతారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం వారి కాలనీల్లో 30 మంది ప్రయాణికులు ఉంటే కాలనీకే బస్సు పంపిస్తారు. దీంతోపాటు కాణిపాకంతో పాటు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం గిరి క్షేత్రం ఉంటుంది. ఈ నెల 30న నిజామాబాద్ నుంచి ప్రారంభించే బ స్సును పౌర్ణమి రోజు చేర్చేందుకు ఏర్పాటు చేశారు. టీ9–30 కి.మీ వెళ్లే వారికి రాయితీ.. రెండు రోజుల క్రితం ఉమ్మడి జిల్లాలోని ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు ఆర్టీసీ టీ9–30 పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రూ. 50 చెల్లిస్తే 30 కి.మీ ప్రయాణం చేయవచ్చు. టీ 9 పథ కాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అమలు ఉపయోగం ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి రా త్రి 9 గంటల వరకు ప్రయాణించవచ్చు. టీ9 టిక్కెట్లు పల్లెవెలుగు బస్సు కండక్టర్ల వద్ద అందుబాటు లో ఉంటాయి. ఈ టికెట్ తీసుకుంటే ఒక్కొక్కరికి రూ.10 నుంచి రూ.30 వరకు ఖర్చు తగ్గుతుందన్నా రు. రూ.20 కాంబోతో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయా ణించే సదుపాయం ఉంది. ఆటోల్లో ప్రయాణించకుండా పల్లెవెలుగు ద్వారా ప్రయాణం చేయడానికి సులువుగా ఉంటుంది. నిజామాబాద్ నుంచి తిరుపతికి.. గతేడాది ఆర్టీసీ తిరుపతికి ప్రత్యేక దర్శనం కల్పించడానికి బస్సులను ఏర్పాటు చేసింది. జిల్లా నుంచి ప్రతిరోజు తిరుపతి వెంకటేశ్వర దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటారు. అయితే ఆర్టీసీ తిరుపతి బస్సు టికెట్‌తో పాటు దర్శనం టికెట్ అందించడంతో ఈ బస్సులో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. జిల్లా కేంద్రం నుంచి తిరుపతికి బస్సులు వెళ్తున్నాయి. తిరుపతికి పెద్దలకు రూ. 3,190 కాగా పిల్లలకు రూ. 2,280 టికెట్ ధర ఉంది. ఈ బస్సులో ప్రయాణించడానికి నెలరోజుల ముందు బుకింగ్ చేసుకుంటే సీటు దొరికే అవకాశాలున్నాయి. టీ9 టికెట్‌తో 60 కి.మీ వరకు.. ఉమ్మడి జిల్లాలోని ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించడానికి ఆర్టీసీ టీ9–60 పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రూ.100 చెల్లిస్తే 60 కి.మీ ప్రయాణం చేయవచ్చు. టీ9 పథకాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. టీ9 టికెట్లు పల్లెవెలుగు బస్సు కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్ ద్వారా ఒక్కొక్కరికి రూ. 20 నుంచి రూ. 40 వరకు ఖర్చు తగ్గుతుందన్నారు. రూ. 20 కాంబితో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే సదుపాయం ఉందన్నారు. సద్వినియోగం చేసుకోవాలి దైవదర్శనానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించేవారికి ఆర్టీసీ టీ9–30, టీ9–60 వంటి పథకాలను తీసు కొచ్చింది. ఈ పథకాలతో ప్రయాణించే వారికి ఆర్థికభారం తగ్గుతుంది. ఆటోలలో ప్రయాణించే బదులు బస్సుల్లో ప్రయాణించాలి. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. – జానీ రెడ్డి, ఆర్ఎం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా -
పెట్రోల్‌కు బదులు నీళ్లు.. కొంత దూరం వెళ్లగానే..
మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్‌కు బదులు నీళ్లు రావడంతో ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... వాహనదారులు శనివారం హెచ్‌పీ పెట్రోల్ బంక్‌లో తమ వాహనాల్లో పెట్రోల్ పోసుకొని కొంత దూరం వెళ్లగానే వాహనాలు ఆగిపోయాయి. దీంతో మెకానిక్‌లను సంప్రదించగా ఇంజన్‌లోకి పెట్రోల్‌కు బదులుగా నీళ్లు చేరాయని తెలిపారు. వాహనంలోని పెట్రోల్‌ను తీసి పరిశీలించగా నీరు ఉండడంతో కల్తీ జరిగినట్లు గుర్తించారు. పెట్రోల్‌ను బాటిల్లో తీసుకుని వాహనదారులు వందల సంఖ్యలో బంక్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో బ్లూ కోర్ట్ సిబ్బంది జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమనిగించారు. పెట్రోల్ బంక్ సిబ్బంది మా తప్పిదం ఏమి లేదని ట్యాంకర్ వచ్చి బంక్‌ల్లో పెట్రోల్ పోసి వెళ్లిపోయిందని తెలుపడం గమనార్హం. మరి పెట్రోల్ కల్తీ ఎక్కడ జరిగిందనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. జరిగిన పొరపాటుకు వాహనదారుల బండి నంబర్లు ఫోన్ నంబర్ రాసుకుని మళ్లీ ఎంత పెట్రోల్ పోయించుకున్నారో అంత పోసేందుకు ఒప్పందం చేసుకోవడంతో ఆందోళన సద్దుమనిగింది. -
బోల్సాలో కలెక్టర్ పర్యటన!
నిర్మల్: భారీ వర్షం, వరదలకు ముంపునకు గురైన బోల్సా గ్రామంలో కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి శుక్రవారం పర్యటించారు. నీట మునిగిన ఇళ్లను, కొతకు గురైన రోడ్లను పరిశీలించారు. వరదలతో నష్టపోయిన బాధితుల వివరాలు సేకరించి వారికి పరిహారం అందేలా చూస్తామన్నారు. విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. ముంపు బాధితులకు బియ్యం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ కొతకు గురైన రోడ్లుకు మరమ్మతు చేపట్టేలా చూస్తామని తెలిపారు. సంబంధిత అధికారులతో పంట నష్టం సర్వే నిర్వహించి బాధితులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. వారివెంట డీఎల్పీవో శివకృష్ణ , మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, నాయకులు పోతారెడ్డి, పంచాయతీ కార్యదర్శి గోపీనాథ్, గ్రామస్తులు ఉన్నారు. భారీ వాహనాలను అనుమతించొద్దు అర్లి వంతెన నుంచి భారీ వాహనాలను అనుమతించొద్దని కలెక్టరు వరుణ్‌రెడ్డి సూచించారు. హవర్గ గ్రామ సమీపంలోని అర్లి వంతెనను శుక్రవారం పరిశీలించారు. వంతెనకు వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తిచేసి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. సుద్దవాగు పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సరిత, ఎంపీడీవో సోలమాన్‌రాజ్, విద్యుత్ ఏఈ శివకుమార్, ఆర్‌ఆండ్‌బీ డీఈ కొండయ్య, స్థానిక సర్పంచ్ భూజంగ్‌రావు ఉన్నారు. -
వరద బాధితుల కోసం ఎయిర్ బోట్స్..
నిర్మల్: వరద నీటిలో చిక్కుకున్న బాధితులను సులువుగా రక్షించేందుకు ఎయిర్ బోట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్ అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెస్క్యూ సిబ్బందికి జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ చెరువులో ఎయిర్ బోట్స్ శిక్షణను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాల కారణంగా కడెం, స్వర్ణ, గడ్డన్న ప్రాజెక్టులు దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నట్లు తెలిపారు. వరదలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలు రోడ్లు కూడా ధ్వంసమయ్యాయన్నారు. మరోవైపు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నిన్నటి వరకు సుమారు 210 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని పేర్కొన్నారు. భైంసా డివిజన్లో చాలా మందిని పోలీస్ శాఖ ద్వారా రెస్క్యూ చేశామని వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న సుమారు 60 మందిని పోలీసులు ప్రాణాలు పణంగా పెట్టి, రోప్‌తో, లైవ్ జాకెట్స్‌తో కాపాడారని వివరించారు. ఎయిర్ బోట్స్ ఉంటే ఇంకా సులువుగా, సిబ్బందికి కష్టం కలగకుండా కాపాడవచ్చన్నారు. ఎస్పీ, పోలీస్ శాఖతో చర్చించి, ఎయిర్ బోట్స్ శిక్షణకు నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. దీంతో ఎయిర్ బోట్స్, లైవ్ జాకెట్లు రోప్స్ తెప్పించామన్నారు. అనంతరం ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాల వల్ల వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎయిర్ బోట్స్, లైవ్ జాకెట్లు, రోప్స్ కొనడానికి సహకరించిన కలెక్టర్‌కు పోలీస్ శాఖ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ప్రజలను మరింత సురక్షితంగా కాపాడలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(ఏఆర్) వెంకటేశ్వర్లు, నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పట్టణ సీఐ పురుషోత్తం, ఆర్ఐలు రమేశ్, రామకృష్ణ, ఎంపీవో వినోద్, ఆర్ఎస్ఐలు సాయికిరణ్, రవికుమార్, దేవేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
తెలంగాణ రాబిన్‌హుడ్.. పండుగ సాయన్న
మహబూబ్‌నగర్: పేదల పాలిట ఆపద్భాందవుడిగా, ఆకలికి అలమటించే నిరుపేదల ఆకాలి తీర్చే సాయన్న ఇక్కడి ప్రాంత ప్రజల ఇష్టమైన నాయకుడు. తెలంగాణ ప్రాంతంలో కనుమరుగైన వీరుడి చరిత్ర ఉందంటే అది పండుగ సాయన్నదే. ఈయన కేవలం ధనవంతులపై, భూస్వాములపై దాడులు చేసే వ్యక్తిగానే సమాజానికి పపరిచయం చేసిన పెత్తందార్లు, ఆయన నిజాం పాలనకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను, చరిత్రను కనుమరుగు చేశారు. అసలు సాయన్న తిరుగుబాటుకు కారణాలు, పరిస్థితులు మాత్రం ఎవరూ వివరించలేదు. మొహర్రం రోజు నాడే పండుగ సాయన్న జయంతిని చేయడం ఆనవాయితీగా వస్తుంది. మెరుగోనిపల్లి జన్మస్థలం మండలంలోని కేశవరావుపల్లి పరిధిలో ఉన్న కిలాట్‌నగర్ (మెరుగోనిపల్లి) గ్రామం ఈయన జన్మ స్థలం. తల్లి సాయమ్మ, తండ్రి అనంతయ్య. దాదాపుగా 1858 నుంచి 1860 మధ్యలో జన్మించినట్లు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఆయనపై భూస్వాములు పెట్టిన కేసులు, జైలు శిక్ష పడిన విషయాలను బట్టి ఆయన జన్మించిన సంవత్సరాలు అంచనా వేశారు. 1860లో రజాకార్ల రాజ్యం కొనసాగుతుండేది. అప్పట్లో రజాకార్లు, భూస్వాములను చెప్పుచేతుల్లో పెట్టుకుని పాలనచేస్తుండే వారు. ఈ తరుణంలో భూస్వాములు పండుగ సాయన్న కుటుంబం భూమిని ఆక్రమించుకున్నారు. ఈ విషయంలో తిరగబడ్డ కుటుంబాన్ని వేధించారు. మొదటి సారి సాయన్న భూస్వాములను పొలంలో నాగళ్లు కట్టిన సమయంలో వారిని ఎదురించాడు. సాయన్నను ఏమైనా చేస్తారని కుటుంబ సభ్యులు అతన్ని చౌడూర్ సమీపంలోని మేక గుండు చెంత దాచి పెట్టారు. భూస్వాములు దాడులు చేసి కుటుంబాన్ని మరింత భయానికి గురిచేయాలని సాయన్న చిన్నమ్మపై లైంగిక దాడి చేశారు. అజ్ఞానంతంలో ఉన్న సాయన్న భూస్వాములపై దాడికి పథకాలు చేస్తూ తరుచు దాడులు చేయటం మొదలు పెట్టాడు. దీంతో కొందరు అనుచరులను సైతం సమీకరించుకుని దాడులకు దిగేవాడు. పలుమార్లు నిజాం పోలీసుల బలగాలతో సాయన్న కోసం వేట సాగించారు. సాయన్న నిజాం పోలీసులను అడవులు వెంట తిప్పి వారిని తరిమివేసేవాడు. పండుగ సాయన్నపేరు ఎలా వచ్చిందంటే.. సాయన్న నిజాంలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తరుణంలో చాలా గ్రామాలు ఆకలితో ఆలమటించేవి. ఇవి చూసి చలించిన సాయన్న గ్రామాలకు తిండి పెట్టాలని ఆలోచించి ఊర్లకు ఊర్లను ఒక చోట చేర్చి వారికి కావాల్సిన ఆహారధాన్యాలు దోపిడి చేసి తీసుకుని వచ్చి వారికి ఇచ్చేవాడు. అలాగే మండల సమీపంలోని మైసమ్మ అడవి ప్రాంతంలో సాయన్న పండుగ చేసి చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు భోజనం పెట్టి ఆకలి తీర్చేవాడు. అప్పట్లో ఆకలి తీరాలంటే సాయన్న ఎక్కడో ఒక చోట దారిదోపిడి చేసి వంటలు వండించి పండుగలు, కందుర్లు చేసేవాడు. అప్పల్లో ప్రజలకు ఇష్టమైన దసర, పీర్లపండగ కలిసి వచ్చిన ఏడాది జన్మించటంతో అతన్ని పండుగ సాయన్నగా ప్రజలు పిలుచుకోవటం మొదలు పెట్టారు. అప్పటి వరకు సాయన్న తెలుగు సాయన్నగా సుపరిచితుడు. -
అర్ధరాత్రి గురుకులంలో యువకుడి హల్చల్.. దాచిన వైనం..
మహబూబ్‌నగర్: అర్ధరాత్రి గురుకుల పాఠశాలలో యువకుడు హల్చల్ చేసి విద్యార్థుల కాళ్లు పట్టిలాగడంతో భయాబ్రాంతులకు గురయ్యారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగినా ఉపాధ్యాయులు బయటకు పొక్కనివ్వలేదు. శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండలంలోని సల్కర్‌పేట్ ప్రభుత్వ గిరిజన బాలికల మినీ గురుకుల పాఠశాలలోకి బుధవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని యువకుడు ప్రవేశించాడు. విద్యార్థినులు మొదటి అంతస్తు రెండు డార్మెంట్లలో పడుకుంటారు. యువకుడు మెట్ల ద్వారా విద్యార్థినీలు నిద్రిస్తున్న గదుల్లోకి వెళ్లి కాళ్లు పట్టి లాగాడు. దీంతో విద్యార్థినీలు భయాబ్రాంతులకు గురై లేవడంతో వారిని బెదిరించాడు. రెండో డార్మెంట్లోకి వెళ్లి అక్కడ విద్యార్థినీలు కాళ్లు లాగి వారిని బెదిరించడంతో అరవకుండా ఉండిపోయారు. 150 మంది విద్యార్థినీలున్న గురుకులంలో యువకుడు పదినిమిషాలు తిరుగాడినట్లు సీసీపుటెజిలో నిక్షిప్తమైంది. గురువారం ఉదయం ఈ విషయాన్ని పిల్లలు ఉపాధ్యాయులకు చెప్పారు. రెండు రోజులైన ఈ విషయాన్ని బయటికి రాకుండా ఆరోజు విధుల్లో ఉన్న ప్రిన్సిపాల్ పద్మ జాగ్రత్త పడ్డారు. ఈ విషయం తెలియడంతో శుక్రవారం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యానాయక్ గురుకులానికి వెళ్లి ఉపాధ్యాయులను నిలదీశాడు. ఘటన జరిగి రెండు రోజులైన పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపాడు. గతంలో పాపా కూడా గురుకులం నుంచి పారిపోయింది. అప్పుడు కూడా ప్రిన్సిపాల్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇన్చార్జి ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా రెండో రోజు కూడా యువకుడు వస్తాడేమోనని కారంపొడి, రాళ్లు దాడి చేయడానికి పెట్టుకున్నామన్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆమె తెలిపారు.