News
-
త్వరలో తహసీల్దార్ల బదిలీలు!
నిజామాబాద్: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారుల బదిలీలను ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే అదనపు కలె క్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోల బదిలీ ప్రక్రియ పూర్తయ్యింది. ఇక మిగిలింది తహసీల్దార్ల బదిలీలే. దీంతో జిల్లావ్యాప్తంగా దాదాపు 25మందికిపైగా స్థానచలనం కలిగే అవకాశముంది. మాక్లూర్ సహా మరో ఐదారుగురు ఎన్నికల నిర్వహణ బాధ్యతల నిమిత్తం జిల్లాలో కొనసాగనున్నారు. డిప్యూటీ కలె క్టర్ల పదోన్నతుల ప్రక్రియ కొలిక్కి వచ్చిన వెంటనే తహసీల్దార్ల బదిలీలపై ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. జులై 31లోపు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. జిల్లాలో 33మంది తహసీల్దార్లు.. జిల్లాలో 33మంది తహసీల్దార్లు విధులు నిర్వర్తిస్తున్నారు. మండలాలతోపాటు కలెక్టరేట్లో ఆయా సెక్షన్లకు తహసీల్దార్ స్థాయి హోదా కలిగిన అధికారులు ఉన్నారు. మాక్లూర్ తహసీల్దార్ శంకర్ మినహా మిగతా 32మంది తహసీల్దార్లు మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. కానీ ఐదారుగురు జిల్లాలోనే ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నారు. వీరు కాకుండా జిల్లా నుంచి 25 మందికిపైగా బదిలీ అయ్యే అవకాశముంది. కోరుకున్న స్థానాలకు.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ తప్పనిసరి అని భావించిన తహసీల్దార్లు కోరుకున్న స్థానాలకు వెళ్లేందుకు చకచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీసీఎల్ఏ నిర్ణయం మేరకే బదిలీలు ఉంటాయని చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో ఎవరు ఎక్కడికి వెళ్తారో తహసీల్దార్లకు ఇప్పటికే స్పష్టత ఉంది. ఆర్డీవోలు, తహసీల్దార్లు మల్టీజోన్ పరిధిలోకి వస్తారు. సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వరాదు. మన జిల్లా నుంచి కామారెడ్డి, నిర్మల్, మెదక్ జిల్లాలకు బదిలీపై వెళ్తారు. ఆయా జిల్లాల్లో మండలాలను అలాట్ చేస్తారు. కాగా స్థానిక ఎమ్మెల్యేలు సైతం తమకు అనుకూలంగా ఉండే వారినే నియోజకవర్గాల్లో పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు.. రెవెన్యూ అధికారుల బదిలీల ప్రక్రియ తుది అంకానికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 81మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్ పదోన్నతులను (ఆర్డీవోలుగా) ఇటీవల కల్పించింది. ప్రస్తుతం 21 మందికి అవకాశం కల్పించింది. వారి సర్దుబాటు ప్రక్రియ పూర్తికాగానే తహసీల్దార్ల బదిలీలపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) యాదిరెడ్డి, మూడు డివిజన్ల ఆర్డీవోలు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. రిటర్నింగ్ అధికారులుగా ఆర్డీవోలు, అసిస్టెంట్ ఎలక్షన్ రిజిస్ట్రేషన్ అధికారులుగా తహసీల్దార్లు వ్యవహరించనున్నారు. ఇంకా సమాచారం లేదు.. తహసీల్దార్ల బదిలీలకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు సీసీఎల్ఏ నుంచి వస్తాయి. బదిలీ ఉత్తర్వులు ఎప్పుడిస్తారో సమాచారం లేదు. – యాదిరెడ్డి, అదనపు కలెక్టర్, నిజామాబాద్ -
ఊరూవాడ గోదావరే..! మరో 24 గంటలు హైఅలర్ట్..!
భద్రాద్రి: ఊహించినట్టుగానే భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది తొలిసారిగా మూడో ప్రమాద హెచ్చరికను దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వచ్చిన గోదావరి ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టుల నుంచి వరద నీటిని విడుదల చేస్తుండగా భద్రాచలం వద్ద రాత్రి నది నీటిమట్టం 53 అడుగులను దాటింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయడంతోపాటు హైఅలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. మరో 24 గంటలపాటు గోదావరి తీరం వెంబడి ప్రాంత ప్రజలను, సిబ్బందిని జిల్లా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వేగంగా పెరుగుతున్న వరద రెండు రోజులుగా స్వల్పంగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన గోదావరి శుక్రవారం అతి వేగంగా పెరిగి రెండో, మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని చేరుకుంది. ఉదయం 6 గంటలకు 46.20 అడుగులుగా ఉన్న గోదావరి 10 గంటలకు 11,44,645 క్యూసెక్కుల నీటి ప్రవాహం దిగువకు వెళ్తుండగా, నీటిమట్టం 48 అడుగులుగా నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అంతే వేగంగా పెరుగుతూ సాయంత్రం 5 గంటలకు 51.40 అడుగులకు చేరింది. రాత్రి 8.43 గంటలకు 53 అడుగులకు చేరుకోగా అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 12 గంటలకు 14,54,937 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా, నీటిమట్టం 53.60 అడుగులుగా నమోదైంది. మరో 24 గంటలు హైఅలర్ట్.. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద నీరు ఇంకా వచ్చే అవకాశం ఉండటంతో మరో 24 గంటలు గోదావరి తీర ప్రాంతాల వెంబడి అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి సుమారు 2 లక్షల 58 క్యూసెక్కులు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 9 లక్షల 11 వేలు, మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి 13 లక్షల 17వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీరు శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం భద్రాచలం చేరుకునే అవకాశం ఉందని, దీంతో 58 అడుగుల నుంచి 60 అడుగుల వరకు వరద చేరుకునే అవకాశం ఉందని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లోని ముంపు గ్రామాల ప్రజలను ట్రాక్టర్ల ద్వారా పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు 30 రెవెన్యూ గ్రామాల నుంచి 3,077 కుటుంబాలకు చెందిన 9,798 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. గ్రామాలకు రాకపోకలు బంద్ ► గోదావరి వరద నీరు ఏజెన్సీలో పలు చోట్ల ప్రధాన రహదారులపైకి రావడంతో గ్రామాల నడుమ రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలో తూరుబాక, బుర్రవేముల ప్రధాన రహదారిపై నీరు చేరటంతో భద్రాచలం నుంచి ఆ మండలానికి వెళ్లే పరిస్థితి లేదు. ► బైరాగులపాడు, సున్నంబట్టి గ్రామాల నడుమ, పర్ణశాల గ్రామంలో వెళ్లే చోట్ల వరద నీరు చేరటంతో ఆయా గ్రామాలకు మండల కేంద్రం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ► చర్ల మండలంలో కుదునూరు, దేవరపల్లి గ్రామాల నడుమ, సుబ్బంపేట వద్ద ప్రధాన రహదారుల నడుమ గోదావరి వరద చేరటంతో ఇటు భద్రాచలం నుంచి చర్లకు, అటు చర్ల నుంచి వెంకటాపురం, వాజేడు మండలాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కొత్తపల్లి, గండుపల్లి గ్రామాల నడుమ రాకపోకలు నిలిచిపోయాయి. ► బూర్గంపాడు, రెడ్డిపాలెం మధ్య రోడ్డుపైకి నీరు చేరటంతో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. బూర్గంపాడు నుంచి కుక్కునూరు రోడ్డుకు, భద్రాచలం నుంచి నెల్లిపాక గ్రామాలకు రవాణా ఆగిపోయింది. ► అశ్వాపురం మండలంలో రామచంద్రాపురం, ఇరవెండి గ్రామాల మధ్య రహదారిపైకి గోదావరి వరద చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా అధికారులు హెచ్చరించినట్లు 60 అడుగులకు చేరితే ఏజెన్సీలో అనేక గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. -
పులి గాండ్రింపులు ఏవీ?!
భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా అటవీ ప్రాంతం ఉన్నా పులులు కన్పించకుండా పోయాయి. జాతీయ జంతువైన పులుల నివాసానికి జిల్లా అడవులు అనువైనవే అయినా... మనుగడ సాగడం లేదు. రెండేళ్లక్రితం ఓసారి జిల్లా అటవీ ప్రాంతంలో పులుల అడుగుజాడలు కనిపించాయి. కానీ ఆతర్వాత మళ్లీ జాడ లేదు. జిల్లా అటవీ విస్తీర్ణం 4,33,446 హెక్టార్లు కాగా, ఇందులో కిన్నెరసాని అభయారణ్యం విస్తీర్ణం 634.4 చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది. అటవీప్రాంతంలో గుత్తికోయలు నివాసం ఏర్పాటుచేసుకోవడం, పోడు సాగుకు అడవులు నరికివేయడంతో పాటు రహదారుల నిర్మాణంతో పులుల మనుగడ కష్టమవుతోందనే భావన వ్యక్తమవుతోంది. శనివారం ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో పులుల మనుగడ, రాకపోకలు, నివాసం ఏ ర్పాటుచేసుకోకపోవడానికి గల కారణాలపై కథనం. గతంలో పులుల కదలికలు 2001 సంవత్సరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు పులుల అడుగు జాడలను అధికారులు గుర్తించారు. ఇక 2005లో మూడు, 2008లో నాలు గు, 2011, 2012లో మూడేసి పులులు, 2013లో రెండు, 2014, 2015లో ఒక్కో పులి కనిపించినా ఆతర్వాతజాడలేదు. 2018లో చేపట్టిన పులుల గణనలో ఉమ్మడి జిల్లా అటవీ ప్రాంతంలో ఎక్కడా పులిని గుర్తించలేకపోయారు. వలన వచ్చినట్లే వచ్చి... జిల్లా అడవుల్లోకి పులుల వలస వస్తున్నాయి. జిల్లా అటవీ ప్రాంతాని ఆనుకుని ఏపీలోనిపాపికొండలు, అటు ఛత్తీస్‌గఢ్, ఇటు ఏటురూనాగారం అటవీ ప్రాంతాలు ఉండటంతో పెద్దపులులు అతిథులుగా వచ్చివెళ్తున్నాయే తప్ప స్థావరం ఏర్పాటుచేసుకోవడం లేదు. 2020 నవంబర్, 2021 డిసెంబర్, జనవరి నెలల్లో పెద్ద పులులు జిల్లా అటవీ ప్రాంతంలో సంచరించాయి. ఇక్కడ కిన్నెరసాని అభయారణ్యం పెద్దపులులకు సంరక్షణగా అనువుగా ఉన్నా పులులు మాత్రం ఉండడం లేదు. అనేక కారణాలు పొరుగు రాష్ట్రాల నుంచి గోదావరి నది దాటి జిల్లా అటవీప్రాంతానికి పెద్దపులులు అప్పుడప్పుడు వస్తున్నా స్థిర స్థావరం ఏర్పాటుచేసుకోవడం లేదు. అటవీప్రాంతం ఉన్నా పులులకు కావాల్సిన శాఖాహా ర జంతువులైన జింకలు, దుప్పులు, సాంబార్ వంటి జంతువుల సంఖ్య తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో గుత్తికోయ గుంపులు విస్తరించడం, అడవుల్లోనూ రహదారుల నిర్మాణం కూడా ఇంకో కారణం కావొచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పులి ఉండాలంటే.. జిల్లా అటవీ ప్రాంతంలో పులులు మనగడ కొనసాగించాలంటే వాటికి ఆహారమైన దుప్పులు, కణుజులు, సాంబారులు అధికంగా ఉండాలి. అవి అధికంగా ఉన్నచోట పెద్దపులి నివాసం ఉండే అవకాశం ఉంటుంది. అయితే జిల్లా అటవీ ప్రాంతంలో జింకలు ఉన్నా ఎక్కువ లేవు, ఉన్నవాటిని అటవీ ప్రాంతంలోగుత్తికోయ గిరిజనులు మాయం చేస్తున్నారని ఫారెస్టు అధికారులు అంటున్నారు. -
హనుమాన్ విగ్రహం లభ్యం!
ఆదిలాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని కన్నెపెల్లి శివారులోని వాగులోకి కొట్టుకువచ్చిన హనుమాన్ విగ్రహం బాలుడికి లభించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కన్నెపెల్లికి చెందిన స్వాతిక్ అనే బాలుడు పత్తి చేనులో పక్కనే ఉన్న వాగు పరిసర ప్రాంతాల్లో ఆడుకుంటున్నాడు. అక్కడ రంగులతో కూడిన రాయి కనిపించగా వెళ్లి చూసే సరికి హనుమాన్ విగ్రహం ఉందని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ విషయం ప్రజలకు తెలియడంతో పెద్ద ఎత్తున విగ్రహాం వద్దకు చేరుకుని పూజలు చేశారు. ఈ విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్టిస్తామని గ్రామస్తులు తెలిపారు. -
ట్రాక్టర్ మునిగినా.. ఈదుతూ బయటపడిన రైతు..
మహబూబాబాద్: మానుకోటి జిల్లా కురవి మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజి) శివారు బంగారుగూడెం జీపీ పరిధిలోని చౌళ్ల తండా వద్ద పొలాలు దున్నేందుకు వెళ్లిన ట్రాక్టర్ మున్నేరువాగు వరద నీటిలో గురువారం మునిగిపోయింది. బంచరాయి తండా గ్రామానికి చెందిన రైతు బానోత్ లచ్చిరాం చౌళ్ల తండాకు చెందిన పొలాలను దున్నేందుకు ట్రాక్టర్ తీసుకుని వెళ్లాడు. ఈక్రమంలో మున్నేరు వాగు ప్రవాహం పెరిగింది. రెండువైపులా నీరు వచ్చి చేరుతుండడంతో నీటిలో ట్రాక్టర్ మునిగిపోయింది. దీంతో లచ్చిరాం ట్రాక్టర్‌ను అక్కడే వదిలి ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. నీటిలో ట్రాక్టర్ మునిగిపోయిన విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. -
వర్షాకాలమైనా.. తీరని దాహం.. వీడని కష్టాల తంటా..!
సిద్ధిపేట్: అంగట్లో అన్నీ ఉన్నా...అల్లుడు నోట్లో శని ఉందన్న చందంగా తయారైంది అక్కన్నపేట మండలం కుందనవానిపల్లి గ్రామ పరిధిలోని చౌటకుంటతండా పరిస్థితి. ఓ వైపు దంచికొడుతున్న వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతుంటే తండాలో తాగడానికి గుక్కెడు నీరు కరువైంది. తండాలో దాదాపుగా 83 పైగా కుటుంబాలు ఉన్నాయి. 310వరకు జనాభా ఉంది. ఇక్కడ వ్యవసాయం చేసుకుని జీవించే వారు.. పదుల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ జవాన్లు సైతం ఉన్నారు. అయితే దాదాపు 20రోజులుగా తాగునీరు సరఫరా నిలిచింది. గ్రామపంచాయతీ ద్వారా సరఫరా చేసే బోరు మోటార్ పాడైంది. మరమ్మతులు చేయించాలని పలుమార్లు తండావాసులు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని తండావాసులు చెబుతున్నారు. అలాగే నెలరోజులుగా మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం బంద్ అయ్యాయని తెలిపారు. తండాలో ఉన్న సోలార్ పాడై మూడునెలల గడుస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. నీటి కోసం వర్షాల్లో కిలో మీటరు మేర పొలాల వద్దకు పరుగులు తీస్తున్నామని కన్నీటి పర్యతమవుతున్నారు. మోటార్ రిపేర్ చేయిస్తాం.. చౌటకుంటతండాలో బోరు మోటార్ పాడైంది వాస్తవమే. రిపేర్ చేయిద్దామంటే వారంరోజులుగా వానలు దంచికొడుతు న్నాయి. మిషన్ భగీరథ అధికారులకు ఫోన్ చేస్తే ఎవరూ స్పందించడంలేదు. గత పాలకులు బోరుబావిని వాగులో తవ్వించారు. దీంతో వానాకాలం వస్తే తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. – అన్నాడీ దినేష్‌రెడ్డి, సర్పంచ్, కుందనవానపల్లి -
శ్వాసే.. ఆ‘ఐ’శ !
వికారాబాద్: పిల్లలకు చిన్న గాయమైతేనే కన్నపేగు అల్లాడిపోతుంది.. అలాంటిది ఏడేళ్లుగా నయం కాని వ్యాధితో చిన్నారి కళ్ల ముందు నేలకే పరిమితమైతే ఆ తల్లిదండ్రుల బాధ, వ్యథ చెప్పడానికి కూడా వీలుకాదు.. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది చౌడాపూర్ మండలంలోని అబ్దుల్ ఉస్మాన్ కుటుంబం. మందిపల్ గ్రామానికి చెందిన అబ్దుల్ ఉస్మాన్, నస్రీన్ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. ఐదేళ్ల వరకు పెద్ద కూతురు అబ్దుల్ ఐశ(15) ఎంతో ఆరోగ్యంగా ఉండేది. రెండో తరగతి చదువుకునే సమయంలో ప్రమాదం జరిగి కాలు విరిగిపోయింది. అప్పుడు సర్జరీ చేశారు. అప్పటి నుంచి బాలికలో ఎదుగుదల నిలిచిపోయింది. దీనికి తోడు క్యాల్షియం లోపం వెంటాడింది. ఐశను గట్టిగా పట్టుకున్నా ఎముకలు విరిగిపోయేవి. దీంతో తల్లిదండ్రులు బాలికను పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. కానీ ఫలితం కనిపించలేదు. పేద కుటుంబ కావడంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా అప్పులు చేసి వైద్యం చేయిస్తున్నారు. ఇటీవల ఐశ ఆరోగ్యం మరింత దెబ్బతింది. దీంతో రెండు నెలల పాటు ఆస్పత్రిలో ఉంచారు. ఖర్చులు ఎక్కువ కావడంతో ఇటీవలే ఇంటికి తెచ్చారు. అయితే ప్రస్తుతం ఆమె ఆక్సిజన్‌పై నెట్టుకొస్తోంది. కదలలేని స్థితిలో ఉన్న కూతుర్ని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆటో నడిస్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితిలో కూతురి వైద్యం కోసం నెలకు రూ.10 వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందని అబ్దుల్ ఉస్మాన్ తెలిపారు. ఇన్వర్టర్, కరెంటు బిల్లు రూ. 2వేలు, వాతావరణం వేడిగా ఉండడం కోసం ఓ యంత్రం, ఆక్సిజన్ మిషన్‌కు నెలకు రూ. 6 వేలు, ఇతర ఖర్చులు మరో రెండు వేలు వెచ్చించాల్సి వస్తోందని తల్లిదండ్రులు తెలిపారు. ఐశ స్వతహాగా ఏ పని చేసుకోలేదని, భోజనం కూడా తినిపించాలి ఉంటుందని, ధ్రవ పదార్థాలే ఎక్కువ ఇస్తున్నట్లు తెలిపారు. కదలలేని స్థితిలో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని, ఎవరో ఒకరు పక్కనే ఉండి చూసుకోవాలని తల్లి తెలిపింది. ఆక్సిజన్ మిషన్ పెట్టడం వల్ల కరెంటు పోకుండా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇటీవల మూడు గంటలపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఐశను సబ్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడే పడుకోవాల్సి వచ్చిందని బోరున విలపించారు. ప్రస్తుతం వికలాంగ పింఛను రూ.3,016 వస్తోందని చెప్పారు. కొంత కాలం పాటు మందులు వాడితే బాలిక ఆరోగ్యం కుదటపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పినట్లు బాలిక తల్లిదండ్రులు అబ్దుల్ ఉస్మాన్, నస్రీన్ తెలిపారు. దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. బాలిక తండ్రి ఫోన్ నంబర్ 7036042976. -
గద్దెలను తాకిన మేడారం జంపన్నవాగు..
మహబూబాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు మేడారాన్ని ముంచెత్తింది. జంపన్నవాగు రెండు వంతెనల పైనుంచి సుమారు 10 అడుగుల ఎత్తున వరద ప్రవహిస్తోంది. దీంతో మేడారం సమ్మక్క సారలమ్మ ఐలాండ్ ప్రాంత్రం, గ్రామంలోని బొడ్రాయి సమీపానికి వరద రావడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్నాయి. గద్దెలను చుట్టిన వరద మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల చుట్టూ వరద చేరింది. జంపన్నవాగు ప్రవాహం వరద అమ్మవార్ల గద్దె చుట్టూ చేరడం ఇదే మొదటి సారి. ఎప్పుడు వర్షాకాలంలో ఐటీడీఏ కార్యాలయం వరకే వరద చేరేది. జంపన్నవాగు చిలకలగుట్ట దారి నుంచి ప్రవాహం భారీగా చేరడంతో వరద మరింత ముంచెత్తింది. రెండంతస్తుల భవనాలు సైతం నీట మునిగిపోవడం గమనార్హం. మునిగిన ఊరట్టం.. గుట్టపైకి చేరిన జనం భారీ వరదకు ఊరట్టం నీట మునిగిపోయింది. జంపన్నవాగు, తూముల వాగు వరద గ్రామంలోకి చేరడంతో డబుల్ బెడ్రూం ఇళ్లతోపాటు మొత్తం మునిగింది. బాలికల ఆశ్రమ పాఠశాలలో భవనం మొదటి అంతస్తు వరకు వరద చేరడంతో విద్యార్థులు భ యాందోళనకు గురయ్యారు. ప్రజలంతా కట్టుబట్టలతో ఇళ్లను వదిలి సమీప గుట్టపైకి చేరుకున్నారు. జలదిగ్బంధంలో గ్రామాలు.. మండలంలోని నార్లాపూర్, పడిగాపూర్, ఎల్బాక, వెంగళాపూర్, కాల్వపల్లి గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వెంగళాపూర్‌లో ఇళ్లు నీట మునిగాయి. నార్లాపూర్‌లో బొడ్రాయి వరకు వరద కమ్మేసింది. కాల్వపల్లిలోని 40 ఇళ్లలోకి వరద చేరింది. ఇంతకు ముందెప్పుడు ఇలాంటి పరిస్థితి గ్రామాల్లో చూడలేదని వెంగళాపూర్, నార్లాపూర్ ప్రజలు తెలిపారు. వ్యాపారులకు భారీ నష్టం జంపన్నవాగు వరద మేడారంలోకి చేరడంతో చిరు వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లింది. గతంలో హరిత హోటల్ నీడ చెట్టుకు వరకు మాత్రమే జంపన్నవాగు వరద వచ్చేది. బుధవారం అర్ధరాత్రి వరకే వరద ఐటీడీఏ క్యాంప్ కార్యాలయం వరకు చేరడంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. షాపుల్లోకి వరద చేరడంతో నీటిలో నుంచి సామగ్రి, సరుకులను బయటకు తీసుకునేందుకు నానా తంటాలు పడ్డారు. 16 మందిని రక్షించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మేడారాన్ని వరద ముంచెత్తడంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గాస్ ఆలం ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తాడ్వాయి ఎస్సై ఓంకార్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్పెషల్ పార్టీ బృందం బోట్లతో జంపన్నవాగు వద్ద వరదలో ఓ ఇంటిపై చిక్కుకున్న వారిని, మేడారానికి వచ్చిన భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ బృందాలు మొత్తంగా వరదల్లో చిక్కుకున్న 16 మందిని కాపాడారు. కాగా, ఎమ్మెల్యే సీతక్క, జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి పరిస్థితిని పర్యవేక్షించారు. -
రైలుబోగీల్లోనే 10 గంటలు..
మహబూబాబాద్: ఎడతెరిపిలేని వర్షాలతో కాజీపేట టౌన్ రైల్వేస్టేషన్ సమీపంలోని వడ్డేపల్లి చెరువు రిజర్వాయర్‌పై నిర్మించిన రైల్వే వంతెన ట్రాక్‌పైకి వరద నీరు ఉధృతంగా చేరడంతో గురువారం రైల్వే అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దీంతో సుమారు 10గంటలపాటు ప్రయాణికులు రైలు బోగీల్లోనే నిరీక్షించారు. వడ్డెపల్లి చెరువు కట్టపై 364/27–25 కి.మీ నంబర్ వద్ద రైల్వే ట్రాక్ డేంజర్‌గా మారడంతో కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో తిరుపతి–కరీంనగర్, ఎర్నాకులం–బిలాస్పూర్, యశ్వంత్‌పూర్–లక్నో, బెంగళూర్–నిజాముద్దీన్ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఉదయం 10:30 గంటల నుంచి నిలిపివేశారు. కాజీపేట–ఢిల్లీ, వరంగల్–ఢిల్లీ అప్ అండ్ డౌన్ రూట్లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. సికింద్రాబాద్ బ్రిడ్జి, ట్రాక్ ఇంజనీర్స్, కాజీపేట జంక్షన్‌కు చెందిన అధికారులు వడ్డెపల్లి రైల్వే ట్రాక్ వద్ద నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించారు. ట్రాక్ సామర్థ్యం టెస్టింగ్ కోసం ట్రాక్‌పై గూడ్స్ రైలును నిలిపి ఉంచారు. రాత్రి 8 గంటల వరకు ఇదే పరిస్థితిలో రైల్వే అధికారులు సెక్యూరింగ్ చేశారు. కాగా కాజీపేట రైల్వే చరిత్రలో వడ్డెపల్లి చెరువు రైల్వే ట్రాక్‌పైకి వరద నీరు చేరడం ఇదే మొదటిసారి. అయితే రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు రైలు పట్టాలపై నడుచుకుంటూ సమీప దుకాణాల వద్దకు వెళ్లి తిను బండారాలు కొనుగోలు ఆకలితీర్చుకున్నారు. వరంగల్ సమీప గ్రామాల ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లిపోయారు. సుమారు 10గంటల తర్వాత గురువారం రాత్రి రైళ్ల రాకపోకలకు రైల్వే అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ట్రాక్ వద్ద వరద ప్రవాహం తగ్గడంతో రైల్వే ఇంజనీరింగ్ అధికారులు ట్రాక్ కెపాసిటిని పరిశీలించి మొదటి, రెండో లైన్లకు రాత్రి 8:30 గంటలకు క్లీయర్ ఇచ్చారు. ముందుగా లైట్ ఇంజన్ నడిపించి ఆతర్వాత 10 నుంచి 30 కెంఎంపీహెచ్ స్పీడ్‌తో ఢిల్లీ వైపు యశ్వంత్‌పూర్– బిలాస్పూర్, తర్వాత రాజధా, లక్నో, తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లను పంపించినట్లు తెలిపారు. కాజీపేట జంక్షన్ జలమయం వర్షపునీరు కాజీపేట జంక్షన్‌లోని టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్దకు, ఎంట్రెన్స్ ఎదుట, ప్లాట్‌ఫాం పైకి చేరడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ► న్యూ ఢిల్లీ వెళ్లే ఏపీ, తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను అధికారులు గురువారం ఉదయం 11.30 గంట ల సమయంలో వరంగల్ రైల్వే స్టేషన్ రెండు, మూడు ప్లాట్ ఫాంలలో నిలిపివేశారు. రైళ్లలో శు క్రవారం ఐఐటీ ఢిల్లీ కళాశాలలో చేరేందుకు వెళ్తు న్న విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఉదయం చైన్నె నుంచి న్యూఢిల్లీ వెళ్లే గ్రాండ్ ట్రంక్(జీటీ) ఎక్స్‌ప్రెస్‌కు వరంగల్ రైల్వే స్టేషన్లో ప్లా ట్ ఫాం రేకు తగలడంతో రైలు ఆగిపోయింది. ► రఫ్తీసాగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (గోర్కపూర్– కొచువేలి) రైలు నెక్కొండ రైల్వేస్టేషన్లో గురువారం ఉదయం 11గంటలకు నిలిచిపోయింది. స్టేషన్లో ఎలాంటి సౌకర్యాలు లేక పోవడం.. తినుబండారులు సైతం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యామని ప్రయాణికులు తెలిపారు. -
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ సమీక్ష!
ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ఉధృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు తమిళసై సౌందర్‌రాజన్ జిల్లాలో వరదల పరిస్థితిని సమీక్షించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ప్రతినిధి యాటకారి సాయన్న జిల్లా పరిస్థితిని గవర్నర్‌కు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై జిల్లా ప్రస్తుత పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలు, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కడెం మండలం పాండవాపూర్ తాండ నుంచి 50 ఇళుల్ల ఖాళీ చేసి సమీపంలోని తాత్కాలిక గృహాల్లో, నవాబ్‌పేట గ్రామపంచాయతీలో 100 నివాసగృహాలు ఖాళీ చేసి 350 మందిని సమీపంలోని రైతువేదికలో ఉంచారని వివరించారు. అంబర్‌పేటలో 50 గృహాలను ఖాళీ చేసి 200 మందిని నారాయణరెడ్డి షెడ్లో తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేశారన్నారు. ఖానాపూర్‌లో 70 గృహాలను ఖాళీ చేయించి 150 మందిని సమీపంలోని ఎల్ఎంఆర్ డిగ్రీ కాలేజీలో ఉంచారు. దస్తురాబాద్ మండలం దేవునిగూడా గ్రామంలో 15 ఇళ్లు ఖాళీ చేసి 60 మందికి దేవుని గూడా గ్రామపంచాయతీలో, భుక్తాపూర్ గ్రామాలో 11 ఇండ్లు ఖాళీ చేసి 45 మందికి బుక్తాపూర్ పాఠశాలలో, మున్యాల్ గ్రామం 30 ఇళ్లు ఖాళీ చేసి 156 మందికి మున్యాల్ స్కూల్లో, గొడిసెర్యాల్ గ్రామంలో 12 ఇళ్లకు చెందిన 55 మందికి, గుడిసెల స్కూల్లో పునరావాసం ఏర్పాటు చేశారని వివరించారు. నిర్మల్ కేంద్రంలో జీఎన్ఆర్ కాలనీలోని 60 ఇళ్లను ఖాళీ చేయించి, 300 మందికి అల్ఫోర్స్ స్కూల్లో, సోఫి నగర్‌లోని పది ఇళ్లకు చెందిన 32 మందిని కమ్యూనిటీ హాల్లోని వసతికి తరలించారని తెలిపారు. భైంసా మండలం గుండెగాం లో 50 ఇళ్లకు చెందిన 200 మందిని భైంసాలోని డబుల్ బెడ్రూం ఇళ్లలో వసతి కల్పించినట్లు పేర్కొన్నారు. -
జల ప్రళయం.. మునిగిన 44వ జాతీయ రహదారి..
ఆదిలాబాద్: భారీ వర్షాలకు హైదరాబాద్–నాగ్‌పూర్ 44వ జాతీయ రహదారి నీట మునిగింది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షంలకు స్వర్ణ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సోన్ మండలంలోని కడ్తాల్ వద్ద 44వ జాతీయ రహదారిపై వర్షం నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గురువారం సాయంత్రం నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడ్తాల్‌లో 44 వ జాతీయ రహదారి హైదరాబాద్–నాగ్‌పూర్ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇరు వైపుల జాతీయ రహదారిపై గంటల తరబడి వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సోన్ ఎస్సై సంతోషం రవీందర్ తన సిబ్బందితో అక్కడకు చేరుకొని ఎవరు వెళ్లకుండా తగిన చర్యలు చేపడుతున్నారు. -
ఇండియా రికార్డ్స్‌లో ‘వేదాన్షి’కి స్థానం!
కాకినాడ: రౌతులపూడి మండలంలోని ములగపూడి గ్రామానికి చెందిన యామల గజ్జన్నదొర, వరలక్ష్మి దంపతుల రెండున్నరేళ్ల కుమార్తె ‘వేదాన్షి’కి ఇండియా రికార్డ్స్–2023లో స్థానం లభించింది. ఈ విషయాన్ని చిన్నారి తండ్రి గజన్నదొర గురువారం విలేకర్లకు తెలిపారు. అతి చిన్న వయస్సులో జంతువులు, పండ్లు, కూరగాయలు, వాహనాలు, రంగులు, ఆకారాలు, శరీర అవయవాలు వంటి 26 రకాల పేర్లను సులభంగా గుర్తించి, పలకడంతో ఆమెకు ఇండియా రికార్‌ుడ్సలో స్థానం లభించినట్టు వివరించారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి అవార్డును కొరియర్ ద్వారా అందుకున్నట్లు తెలిపారు. ఇండియా రికార్డ్స్‌లో స్థానం సాధించిన వేదాన్షి, ఆమె తల్లిదండ్రులను పలువురు అభినందించారు. -
యాదాద్రిని సందర్శించిన బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్
నల్గొండ: బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఒవెన్ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ను సందర్శించారు. కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి పరిపాలన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి మొక్కను అందజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు జిల్లాలో అమలవుతున్న తీరును హై కమిషనర్‌కు కలెక్టర్ పమేలా సతప్పతి వివరించారు. అనంతరం బ్రిటీష్ హైకమిషనర్ గారెత్ విన్ ఒవెన్ యాదగిరిగుట్టకు వెళ్లి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యులు ఆయనకు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. -
ధాన్యం కొనుగోళ్లలో నెం.1
జగిత్యాల: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లలో సహకార సంఘాలు యాసంగి సీజన్లో రూ.607.52 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాయి. రాష్ట్రంలోనే సహకార సంఘాల ద్వారా అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసిన జిల్లా జగిత్యాల కావడం విశేషం. ఒకప్పుడు రైతులకు పంట రుణాలు ఇవ్వడం, తీసుకోవడానికే పరిమితమైన సహకార సంఘాలు, ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తూ కమీషన్ రూపంలో మంచి అదాయాన్ని ఆర్జిస్తున్నాయి. అంతేకాకుండా సహకార సంఘంలోని సభ్యులైన రైతులకు ఇబ్బందులు కలుగకుండా, ఎక్కడికక్కడే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. 252 కొనుగోలు కేంద్రాలు జిల్లాలోని సహకార సంఘాల ద్వారా గ్రామాల్లో 252 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 306 గ్రామ పంచాయతీలుండగా చిన్న గ్రామాలను మినహాయించి, అన్ని గ్రామ పంచాయతీల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రం పరిధిలోని రైతుల ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2.060 చొప్పున కొనుగోలు చేసి, రైస్‌మిల్లులకు పంపించారు. జిల్లా సహకార అధికారుల పర్యవేక్షణలో సహకార సంఘం చైర్మన్లు, డైరెక్టర్లు ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను రోజూ పర్యవేక్షించి, కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూశారు. 29.49 లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు యాసంగి సీజన్లో వరిపంట సాగులో ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో, రైతులు ఎక్కువగా దొడ్డురకం వరిని సాగుచేశారు. దీంతో అనుకున్న స్థాయిలో జిల్లాలో ధాన్యం ఉత్పత్తి అయ్యింది. ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడంతో, రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా సంఘాల కంటే ముందే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. యాసంగిలో 39,025 మంది రైతుల నుంచి, రూ 607.52 కోట్ల విలువ గల 29.49 లక్షల క్వింటాళ్లను కొనుగోలు చేశారు. రూ.9.43 కోట్ల కమీషన్ వరి ధాన్యం కొనుగోలు చేసినందుకు సివిల్ సప్లై సంస్థ సహకార సంఘాలకు క్వింటాల్‌కు రూ.32 కమీషన్ ఇస్తుంది. ఇలా జిల్లాలోని సహకార సంఘాలకు రూ. 9.43 కోట్ల కమీషన్ రానుంది. సహకార సంఘం పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసి, పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తే ఆ మేరకు కమీషన్ డబ్బులు వస్తాయి. దీంతో సహకార సంఘాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చేసేందుకు పోటీపడ్డాయి. కొనుగోలు సీజన్ పూర్తికాగానే, కమీషన్ డబ్బులు అందించాల్సిన సివిల్ సప్లై సంస్థ తాత్సారరంతో ప్రతి సంఘానికి ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్‌లో ఉంటున్నాయి. ధాన్యం కొనుగోలు కమీషన్ డబ్బులతో మరిన్ని వ్యాపారాలు చేసేందుకు సహకార సంఘాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల వ్యాపారంలో ఉన్న సంఘాలు, పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. గ్రామాల్లో సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేసేందుకు, కూలీల శ్రమను తగ్గించేందుకు ఆధునిక పరికరాలు కొనుగోలు చేసి, రైతులకు అద్దెకిచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. రైతుల ధాన్యం నిల్వ చేసేందుకు, ఎరువుల బస్తాల నిల్వకోసం గోదాంలు నిర్మిస్తున్నారు. పంట రుణాలే కాకుండా వాహన, బంగారం తాకట్టు రుణాలు, విదేశీ విద్యా రుణాలు కూడా ఇస్తున్నారు. మంచి ఆదాయం వరి ధాన్యం కొనుగోళ్లు సహకార సంఘాలకు వరంగా మారాయి. గతంలో ఎలాంటి ఆదాయం లేక సహకార సంఘాలు మూతపడే పరిస్థితి నెలకొంది. మా సహకార సంఘం పరిధిలోనే దాదాపు 10 వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మంచి అదాయం సంపాదించాం. – మహిపాల్ రెడ్డి, సహకార సంఘం చైర్మన్, ధాన్యం కొనుగోళ్లలో పోటీ సహకార సంఘాలు ధాన్యం కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నాయి. కొన్ని సంఘాలు ఆ సంఘాల పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఐకెపీకి పోటీగా కొనుగోలు చేస్తున్నాయి. కమీషన్లో వచ్చిన డబ్బులను సంఘం సభ్యులు చర్చించి, వ్యాపారాలు చేసేందుకు ఉపయోగిస్తున్నారు. –రామానుజాచారి, జిల్లా సహకార అధికారి, జగిత్యాల ధాన్యం కొనుగోళ్ల వివరాలు మండలం కొనుగోలు చేసిన ధాన్యం.. బీర్పూర్ 71,328, బుగ్గారం 70,207, ధర్మపురి 2,57,371, గొల్లపల్లి 2,26,217, ఇబ్రహీంపట్నం 1,27,659, జగిత్యాల రూరల్ 1,03,154, జగిత్యాల అర్బన్ 44,074, కథలాపూర్ 2,27,888, కొడిమ్యాల 1,34,717, కోరుట్ల 1,79,902, మల్లాపూర్ 1,35,886, మల్యాల 1,59,621, మేడిపల్లి 2,16,537, మెట్పల్లి 2,29,731, పెగడపల్లి 2,46,720, రాయికల్ 1,40,624, సారంగాపూర్ 1,01,727, వెల్గటూర్ 2,75,769. -
కూలిన విరాటపర్వం శంకరన్న ఇల్లు..
కరీంనగర్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అప్పటి పీపుల్స్‌వార్ కార్యదర్శిగా పనిచేసిన దొంత మార్కండేయ ఉరఫ్ శంకరన్న ఇల్లు గురువారం కూలిపోయింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శంకరన్న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌లో 1993 జనవరి 25న రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఈ మధ్యనే శంకరన్న పాత్రతో కూడిన విరాటపర్వం సినిమా తెరకెక్కించారు. శంకరన్న పాత్రలో దగ్గుబాటి రాణా హీరో పాత్ర పోషించారు.మూడు దశాబ్దాల క్రితం ఉద్యమానికి ఆకర్షితుడై పార్టీలోచేరి ఉత్తర తెలంగాణ కార్యదర్శి స్థాయిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యాడు. ఆయన జ్ఞాపకంగా ఉన్న ఒక్క ఇల్లు కూలిపోవడంపై గ్రామస్తులు విచారం వ్యక్తం చేశారు. -
రైలు ప్రయాణంలో తకరారు.. వరంగల్ వరకే తిరుపతి–కరీంనగర్ రైలు..
కరీంనగర్: భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దయ్యాయి. కొన్నింటిని అధికారులు పాక్షికంగా రద్దు చేయగా, ఇంకొన్నింటిని దారి మళ్లించారు. ఈ ఆకస్మిక పరిణామంతో జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రద్దు, పాక్షిక రద్దు, దారి మళ్లిన రైళ్ల వివరాలిలా ఉన్నాయి.. ► సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ గురు, శుక్రవారాల్లో రద్దయ్యాయి. ► సిర్పూర్ కాగజ్‌నగర్–సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ గురువారం రద్దవగా శుక్రవారం ఉదయం కూడా రద్దు చేశారు. ► సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే కాగజ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఘన్పూర్–సికింద్రాబాద్ మధ్య నడుపుతున్నారు. ఘన్పూర్–కాగజ్‌నగర్ వరకు రద్దు చేశారు. ఈ మూడు రైళ్ల వల్ల నిత్యం హైదరాబాద్ వెళ్లాల్సిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ► తిరుపతి–కరీంనగర్ బైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను వరంగల్‌కే పరిమితం చేశారు. వరంగల్–కరీంనగర్ మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు. పిల్లాపాపలతో తిరుమల దర్శనానికి వెళ్లిన వారంతా లగేజీతో వర్షంలో తడుస్తూ తిరిగి బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ► సికింద్రాబాద్–పాట్నా వెళ్లే దానాపూర్ ఎక్స్‌ప్రెస్ పెద్దపల్లి, రామగుండం నుంచి వెళ్లాల్సి ఉండగా విజయవాడ మీదుగా దారి మళ్లించారు. ► చైన్నె–అహ్మదాబాద్ వెళ్లాల్సిన నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌ను పెద్దపల్లి, మంచిర్యాల కాకుండా వాడి–సికింద్రాబాద్ మీదుగా మళ్లించారు. ► న్యూఢిల్లీ–హైదరాబాద్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను బల్లార్షా–ఆదిలాబాద్–ముత్కేడ్ జంక్షన్ మీదుగా నిజామాబాద్ నుంచి దారి మళ్లించారు. ► గోరక్‌పూర్–సికింద్రాబాద్ రైలును పెద్దపల్లి–కరీంనగర్– నిజామాబాద్ మీదుగా దారి మళ్లించారు. -
థ్యాంక్యూ సీఎం జగన్ సార్!
విశాఖపట్నం: ఉన్నత విద్య అభ్యసించాలని నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది. కానీ ఇంట్లో పరిస్థితులు ఎప్పటికప్పుడు ఆలోచనల్లో పడేశాయి. ఇక అది కలగానే మిగిలిపోతుందని అనుకున్నాను. మధ్యతరగతి కుటుంబాలకు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవడం సాధ్యం కాదని ఆశలు వదులుకున్నాను. కానీ జగనన్న ప్రవేశ పెట్టిన ఈ పథకం వల్ల నా కల నెరవేరింది. ప్రస్తుతం ఈ పథకం వల్ల అందిన సాయంతో న్యూయార్క్ యూనివర్సిటీలో మాస్టర్స్‌లో చేరబోతున్నాను. తీరదనుకున్న నా కలని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు. థాంక్యూ సీఎం సార్. – సీహెచ్ లక్ష్మీకిరణ్మయి, మాధవధార -
కర్ణాటక వందేభారత్ రైలుపై రాళ్ల దాడి!
కర్ణాటక: రామనగరలో మరోసారి వందేభారత్ రైలుపై ఆకతాయిలు రాళ్లు విసిరారు. బుధవారం మైసూరు నుంచి చైన్నెకి వెళ్తున్న ఈ రైలుపై రామనగరలో గుర్తుతెలియని దుండగులు రాళ్లు విసరడంతో ఒక బోగీ అద్దాలు ముక్కలయ్యాయి. ఎవరికీ ఏమీ కాలేదని తెలిసింది. రాష్ట్రంలో పలుచోట్ల వందేభారత్ రైళ్లపై రాళ్లు విసరడం తెలిసిందే. -
ఐక్యతకు ప్రతీక మొహర్రం..!
సత్యసాయి: హిందూముస్లింల ఐక్యతకు ప్రతీకగా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మొహర్రం వేడకలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామాల్లోని చావిడిలో పీర్లను కొలువుదీర్చి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. గుండం తవ్వకంతో మొదలు.. గ్రామాల్లో గుండం తవ్వకాలతో మొహర్రం వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం ప్రత్యేక ప్రదేశాల్లో భద్రపరచిన పీర్లను వెలికి తీసి శుభ్రం చేసి ప్రత్యేకంగా అలంకరించి 5వ రోజు చావిడిలో ప్రతిష్టిస్తారు. చావిడి వద్ద గుండంలో టన్నుల కొద్దీ కట్టెలు వేసి నిప్పంటిస్తారు. ముజావర్ల ఆధ్వర్యంలో ఆరాధన ప్రక్రియను నిర్వహిస్తారు. మొదటి ఐదు రోజులు చావిడిలో పీర్లను కొలువుదీర్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. 7వ రోజు చిన్న సరిగెత్తు నిర్వహించి పీర్ల గ్రామోత్సవం చేస్తారు. పదో రోజు పెద్ద సరిగెత్తులో భాగంగా పానకాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అదే రోజు వైభవంగా దీపారాధన ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 28న పెద్ద సరిగెత్తును అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అదే రోజు ఉపవాస దీక్షలతో అగ్ని గుండం ప్రవేశం చేస్తారు. అనంతరం నిప్పుల గుండం పూడ్చి దానిమ్మ, తదితర పండ్ల మొక్కలు నాటడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. మొహర్రంతో నూతన సంవత్సరం ఆరంభం మొహర్రం అంటే ఉర్దూలో త్యాగం, క్షమాపణ అని అర్థం. ఇస్లాం ధర్మం ప్రకారం మొహర్రం నుంచి ఇస్లామిక్ క్యాలెండర్ ఆరంభమవుతుంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహర్రం.. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ఈ నెల 19న ప్రారంభమై 29తో ముగుస్తుంది. ఇస్లాం ధర్మ పరిరక్షణలో భాగంగా ఇమామ్, హుస్సేన్, తదితర వీరుల సంస్మరణార్థం మొహర్రం నిర్వహిస్తున్నట్లు ముస్లిం మతపెద్దలు చెబుతున్నారు. క్రీ.శ.14వ శతాబ్దంలో ఇరాక్‌లోని కర్బలా ప్రాంతంలో శాంతి స్థాపనకు చేసిన యుద్ధంలో వారు తమ ప్రాణ త్యాగం చేసినట్లుగా చరిత్ర చెబుతోంది. దీంతో అప్పటి నుంచి మొహర్రంను ముస్లింలు సంతాప దినాలుగా నిర్వహిస్తున్నారు. -
ఆకాశమే హద్దు..!
సత్యసాయి: వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ చూపుతున్నారు. వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా విప్లవమే తీసుకురావచ్చని భావించి దేశంలో ఎక్కడా లేని విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత, రైతులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడంతోపాటు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విస్తృత ప్రయోజనాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు. డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు.. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ (ఏపీడీసీ)ను 2018 నవంబరులో ఏర్పాటు చేశారు. ఎం.మధుసూదన్‌రెడ్డి దీనికి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేయటంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు కార్పొరేషన్ కృషి చేస్తోంది. డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి, తయారీ, నిర్వహణ రంగంలో ఉన్న స్టార్టప్ కంపెనీలకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. డీజీసీఏ నిబంధనల మేరకు డ్రోన్ల నిర్వహణను క్రమబద్ధం చేయటంతో పాటు రక్షణాత్మక చర్యలు చేపడుతోంది. డ్రోన్ టెక్నాలజీలో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నతంగా నిలబెట్టేందుకు కార్పొరేషన్ కృషి చేస్తోంది. అన్ని రంగాల్లోనూ డ్రోన్ల వినియోగం.. రానున్న కాలంలో రైతులంతా డ్రోన్లను వినియోగించే నైపుణ్యం సాధిస్తారని ఏపీ డ్రోన్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆళ్ల రవీంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా డ్రోన్ల వినియోగం అన్ని రంగాల్లో పెరిగిపోతోందని చెప్పారు. పరిపాలన, పోలీస్, వ్యవసాయం, గనులు, ఇన్సూరెన్స్, మీడియా, వినోద రంగాల్లో డ్రోన్లను వినియోగించటం ద్వారా మానవ వనరులు, సమయం, డబ్బు ఆదా అవుతోందని, కచ్చితత్వం ఉంటోందని చెప్పారు. డ్రోన్ వినియోగ నిబంధనలను పౌర విమానయాన శాఖ సడలించినందున డ్రోన్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున స్టార్టప్ కంపెనీలు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. సమగ్ర భూ సర్వేతో ప్రాధాన్యం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూసర్వే కార్యక్రమంలో డ్రోన్లను పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా కిసాన్ డ్రోన్లను 50 శాతం సబ్సిడీపై రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. వచ్చే నెలలో మరో 500 కిసాన్ డ్రోన్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ ద్వారా రైతులకు డ్రోన్ల వినియోగంలో శిక్షణ ఇస్తున్నారు. పంటలకు ఎరువులు వేయటం, పురుగు మందులు చల్లడం వంటివి డ్రోన్ల ద్వారా చేపట్టటం ద్వారా వృథాను అరికట్టడంతో పాటు రైతులను ప్రమాదకర పురుగుమందుల బారి నుంచి రక్షించవచ్చు. నిబంధనలు సరళతరం.. డ్రోన్లు లేదా యూఏవీ (అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్)ల నిర్వహణను చట్టబద్ధం చేస్తూ 2021 ఆగస్టు 26న పౌర విమానయాన శాఖ కొత్త పాలసీని ప్రకటించింది. 2022లో నిబంధనలను మరింత సరళతరం చేస్తూ పాలసీలో సవరణలు తీసుకువచ్చింది. 2 కిలోల లోపు బరువు ఉన్న వినోదం కోసం ఉపయోగించే డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు ఎలాంటి రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ అవసరం లేదు. డ్రోన్లను ప్రభుత్వం అయిదు కేటగిరీలుగా వర్గీకరించింది. 250 గ్రాములలోపు బరువు ఉండేది నానో డ్రోన్. 250–2 కిలోల మధ్య బరువు ఉంటే మైక్రో డ్రోన్. 2 కిలోల నుంచి 25 కిలోల మధ్య బరువు ఉండేవి చిన్న డ్రోన్లు. 25–150 కిలోల మధ్య బరువు ఉండే డ్రోన్లను మధ్యస్థ డ్రోన్లుగానూ 150 కిలోల పైగా బరువు ఉండేవాటిని పెద్ద డ్రోన్లుగానూ వర్గీకరించారు. అనుమతులు తప్పనిసరి.. నానో, మైక్రో కేటగిరీల్లోని నాన్ కమర్షియల్ డ్రోన్లను మినహాయిస్తే మిగిలిన అన్ని రకాల డ్రోన్ల ఆపరేషన్‌కు డిజిటల్ స్కై ఆన్లైన్ ప్లాట్ ఫాం నుంచి ముందస్తు అనుమతులు పొందాల్సిందే...డ్రోన్ల ద్వారా సరుకుల రవాణా కోసం ప్రభుత్వం ప్రత్యేక కారిడార్లను నిర్దేశిస్తుంది. రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ పొందాలంటే అధీకృత సంస్థలో నిర్దేశిత కాలం పైలెట్ శిక్షణ పొంది ఉండాలి. శిక్షణ సంస్థ నుంచి పొందిన సర్టిఫికెట్తో పాటు నైపుణ్య పరీక్ష తర్వాత నిర్దేశిత ఫీజు చెల్లిస్తే డీజీసీఏ(సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం) పైలెట్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. ఇది పది సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది. కనీసం టెన్త్ పాసై 18 ఏళ్లకుపైబడి 65 సంవత్సరాలలోపు వయస్సు కలిగి, ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థలో శిక్షణ పొందిన ఎవరైనా రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ పొందేందుకు అర్హులే. డ్రోన్ల వేగంపై పరిమితులు.. మైక్రో డ్రోన్ భూమికి 60 మీటర్ల ఎత్తుకుపైన, సెకనుకు 25 మీటర్ల వేగానికి మించి ప్రయాణించరాదు. చిన్న డ్రోన్ 120 మీటర్ల ఎత్తుకుపైగా...సెకనుకు 25 మీటర్ల వేగానికి మించి ప్రయాణించరాదు. మధ్యరకం, పెద్ద డ్రోన్లు డీజీసీఏ అనుమతుల మేరకు ఆ పరిధిలోనే ప్రయాణించాలి. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లను ఆపరేట్ చేయటం నేరం. పౌరవిమానయాన శాఖ వెబ్‌సైట్‌లోని మ్యాప్‌లో ఆకుపచ్చ రంగు కలిగిన ప్రాంతంలో డ్రోన్లు ప్రయాణించవచ్చు. పసుపురంగు ప్రాంతంలో నిబంధనల మేరకు ప్రయాణించాలి. ఎరుపురంగు సూచించిన ప్రాంతంలో డ్రోన్లను అనుమతించరు. అంతర్జాతీయ విమానాశ్రయాల చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో, ఇతర ఎయిర్‌పోర్టులకు మూడు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను అనుమతించరు. అంతర్జాతీయ సరిహద్దులకు 25 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను నిషేధించారు. హోం మంత్రిత్వ శాఖ నిర్దేశించిన కీలక ప్రాంతాల్లో డ్రోన్ల ఆపరేషన్‌కు ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. రాష్ట్ర రాజధాని ప్రాంతాల్లో సెక్రటేరియట్ కాంప్లెక్సుకు మూడు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను అనుమతించరు. వీటితో పాటు నిషేధిత, ప్రమాదకర ప్రాంతాల్లో డ్రోన్లను ఆపరేట్ చేసేందుకు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. -
మా కొడుకును బతికించరూ..!
సంగారెడ్డి: మా కొడుకును బతికించరూ అంటూ బొల్లారం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీనగర్‌కు చెందిన సుభాష్, మంజుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బొల్లారం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీనగర్‌కు చెందిన సుభాష్, మంజుల కుమారుడు రోహిత్ (27) పరిశ్రమలో విధులు ముగించుకొని వస్తుండగా జరిగిన ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రోహిత్ చికిత్స పొందుతున్నాడు. రోహిత్ బ్రెయిన్ ఆపరేషన్ కోసం రూ.8లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారు. అప్పులు చేసి రూ. 4లక్షలు ఆపరేషన్ కోసం తల్లిదండ్రులు ఆస్పత్రిలో చెల్లించారు. మరో రూ.4లక్షలు అవసరం కాగా సాయం చేయాలనుకునే దాతలు 9666 493043 నంబర్లో సంప్రదించాలని కోరుతున్నారు. బొల్లారంలోని బీజేపీ నేత ఆనంద్కృష్ణారెడ్డి రూ.10వేల సాయాన్ని అందించారు. -
గర్భిణికి దారి కష్టాలు..
మంచిర్యాల: రోడ్డు సదుపాయానికి నోచుకోని గిరిజన గ్రామం అది. అత్యవసర సమయంలో ఆస్పత్రికి వెళ్లాలంటే కాలినడకన లేదా ఎడ్లబండే గతి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులు, వంకలు దాటాల్సిందే. 108 అంబులెన్స్ రాక, వైద్య సౌకర్యం అందక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నెన్నెల మండలం కోనంపేట పంచాయతీ పరిధిలోని పాటి గ్రామానికి చెందిన గిరిజన మహిళ రెడ్డి మల్లక్క మూడు నెలల గర్భిణి. మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో దారిలేక ఆస్పత్రికి వెళ్లలేకపోయింది. బుధవారం తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎడ్లబండిపై లంబాడితండా ఎర్రవాగు వరకు తీసుకువచ్చారు. అక్కడ ఆటోలో ఎక్కించి అందరూ కలిసి అతికష్టం మీద వాగు దాటించి బెల్లంపల్లిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గతంలో దమ్మిరెడ్డిపేటకు చెందిన గిరిజనుడు జ్వరంతో బాధపడుతూ వాగు దాటలేక మృతి చెందాడు. ఎన్నికల ముందు సర్పంచ్ హామీ ఇచ్చినప్పటికీ రోడ్డు సౌకర్యం కల్పించలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం వస్తే పాటి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకొని గిరిజనులు బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా నేతలు మారినా అధికారులు వచ్చి చూసినా దారిచూపే నేతలు లేక మా రాతలు మారడం లేదని గిరిజనులు గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు, నాయకులు స్పందించి గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. -
లక్ష్యం చేరేనా..?
మహబూబ్‌నగర్: ప్రతి వర్షపు చుక్కను భూమిలోకి ఇంకేటట్లుగా భూగర్భజలాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఇంకుడుగుంతల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. కానీ వాటి లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైంది. ప్రతి పల్లెలో మురుగుకాల్వల చివరన సామాజిక ఇంకుడుగుంత ఏర్పాటు చేయాలిన భావించారు. గతంలో ఇంటింటికీ ఇంకుడుగుంత ఉండాలని విస్తృత ప్రచారం చేసిన అధికారులు, ఆశించిన స్థాయిలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ పథకం కింద జిల్లాలో ప్రతి గ్రామానికి ఐదు సామాజిక ఇంకుడు గుంతలు నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నారు. గ్రామాల్లో మురుగుకాల్వల చివరి స్థలాల్లో వీటిని తవ్వాలని ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో 280 గ్రామ పంచాయతీల్లో 1,400 ఇంకుడుగుంతలు నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. నాలుగు నెలల్లో 279 మాత్రమే నిర్మించారు. వీటి నిర్మాణానికి డ్రెయినేజీల చివరన స్థలసమస్య శాపంగా మారింది. గతంలో నిర్మించినవి నిరుపయోగం.. గతంలో నిర్మించుకున్న ఇంకుడుగుంతల్లో వర్షపు నీటిని మళ్లించే విధంగా చర్యలు చేపట్టకపోవడంతో ఆవి నిరుపయోగంగా మారుతున్నాయి. లక్ష్యం కోసం నిర్మించిన వాటిలోకి వృథా నీటిని మళ్లిస్తే భూగర్భజలాలు పెరగడంతో పాటు వాటి పరిసర ప్రాంతాల్లో శుభ్రత నెలకొనే అవకాశం ఉంటుంది. జిల్లాలో వీటిపై ప్రజల్లో కొంత అవగాహన పెరిగి నిర్మాణాలపై దృష్టి సారించినప్పటికే కొన్నేళ్లుగా ప్రభుత్వం లబ్ధిదారులకు అందించే ప్రోత్సాహక డబ్బు సకాలంలో అందక లబ్ధిదారులు ఆసక్తిచూపడం లేదు. వెంటనే డబ్బు చెల్లించేలా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరంఉంది. పూర్తి చేస్తాం.. ప్రతి గ్రామానికి మంజూరైన సామాజిక ఇంకుడుగుంతల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 280 గ్రామ పంచాయతీలకు గాను 1400 గుంతలు తవ్వాలి. ప్రస్తుతం 279 పూర్తి చేశాం. మిగతా వాటిని కూడా పూర్తిచేయిస్తాం. – గోపాల్‌నాయక్, డీఆర్డీఓ నిర్మాణాలకు నిధులు ఇలా.. ఇళ్ల వద్ద ఇంకుడుగుంతలు తవ్వుకోవడం, గ్రామ పంచాయతీల్లో సామాజిక గుంతలను నిర్మిస్తే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ ద్వారా కుంటల పునరుద్ధరణ, అటవీ ప్రాంతాల్లో సమతుల కందకాలు, రైతుల పంట పొలాల్లోని వృథా నీటికి అడ్డుకట్టు వేసేందుకు నీటినిల్వ గుంతల నిర్మాణానికి చేపట్టేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇళ్లలో ఇంకుడుగుంతల నిర్మాణం చేపడితే రూ.6,616 చెల్లిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మురుగునిల్వ ఉండేందుకు పంచాయతీల్లో సామాజిక గుంతల నిర్మాణం చేపడితే రూ.13,496 వరకు చెల్లిస్తున్నారు. -
బ్యూటీపార్లర్ కోర్సుతో ఉపాధి
నిజామాబాద్: బ్యూటీపార్లర్ కోర్సుకు మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉందని, కోర్సు పూర్తి చేసిన తర్వాత స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందని ఎస్బీఐ సీనియర్ మేనేజర్ శాంసన్ అన్నారు. ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ (ఆర్ఎస్ఈటీఐ) అధ్వర్యంలో బ్యూటీపార్లర్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. వాటి నిర్వహణ ద్వారా పలువురు ఆర్థికంగా స్థిరపడ్డారని సంస్థ డైరక్టర్ సుంకం శ్రీనివాస్ తెలిపారు. శిక్షణ అనంతరం బ్యాంక్‌ల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. అనంతరం చీఫ్ మేనే జర్ను సన్మానించారు. ఫ్యాకల్టీ రామకృష్ణ, నవీన్, రంజిత్, భాగ్యలక్ష్మీ, ప్రణీత పాల్గొన్నారు. -
పాఠాలు సరే.. పుస్తకాలేవీ?
● ఇంటర్ కళాశాలలు ప్రారంభమై 50 రోజులు ● ఇప్పటికీ సరఫరా కాని బుక్స్ ● అయోమయంలో విద్యార్థులు ఇంటర్ కళాశాలలు ప్రారంభమై 50 రోజులు అవుతున్నా జిల్లాలో నేటికీ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందలేదు. అధ్యాపకులు చెప్పే పాఠాలు విని ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. దీంతో చదువులు ఎలా సాగుతాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోనే మెదక్ ఇంటర్ ఫలితాల్లో ఆఖరు స్థానంలో నిలిచింది. – మెదక్‌జోన్● జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు కలిపి మొత్తం 30 ఉండగా వాటిలో ఆరువేల పైచిలుకు విద్యార్థులు చదువుకుంటున్నారు. ● ఇంకా అడ్మిషన్లు జరుగుతుండడంతో వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధ్యాపకులు చెబుతున్నారు. ● జూన్ 1న కళాశాలలు ప్రారంభమైనా నేటికీ విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వకపోవడంతో అధ్యాపకులు చెప్పే పాఠాలు మాత్రమే వింటున్నారు. ● అయితే పుస్తకాలు లేకుండా బోధించటం కష్టమేనని.. వీటితో విద్యార్థులకు పెద్దగా ప్రయోజనం ఉండదని అధ్యాపకులు చెబుతున్నారు. ● ప్రభుత్వ కాలేజీల్లో ఎక్కువగా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులే చదువుకుంటారు. ● వీరు సొంతంగా డబ్బులు వెచ్చించి పుస్తకాలు కొనలేని పరిస్థితిలో ఉంటారు. ప్రభుత్వం ఉచితంగా అందించే పుస్తకాలపైనే ఆధారపడుతుంటారు. ● గతేడాది సైతం కళాశాలలు ప్రారంభమైన రెండు నెలలకు ప్రభుత్వం పుస్తకాలను సరఫరా చేసినట్టు విద్యార్థులు చెబుతున్నారు. ● ప్రతిసారి పుస్తకాలు అందించడంలో నిర్లక్ష్యమే జరుగుతుందని.. సకాలంలో అందక చదువు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాల్లో జిల్లా ఆఖరుస్థానం ● గడిచిన రెండేళ్లుగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో మెదక్ ఆఖరుస్థానంలో నిలుస్తోంది. ● ఈఏడాది మేలో వెలువడిన ఫలితాల్లో జిల్లావ్యాప్తంగా 6,364 మంది పరీక్షలు రాయగా 2,462 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. కేవలం 38శాతం మాత్రమే పాసయ్యారు. ● ద్వితీయ సంవత్సరంలో 5,320 మంది పరీక్షలు రాయగా 2,785 మంది ఉత్తీర్ణులు కాగా 52 శాతంతో రాష్ట్రంలో వెనకబాటులో నిలిచింది. ● అయినప్పటికీ అధికారుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. గతేడాది సైతం కళాశాలలు ప్రారంభమైన రెండు నెలలకు అందించారు. ● విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పాతవి సర్దుబాటు ఇప్పటికీ పుస్తకాలు రాకపోవడంతో గతేడాదికి చెందిన ద్వితీయ సంవత్సరం పుస్తకాలను కొంతమంది విద్యార్థులకు సర్దుబాటు చేస్తున్నారు. అవి కూడా కొంతమందికి మాత్రమే సర్దుబాటు చేయడంతో పుస్తకాలు రాని మిగితా పిల్లలు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కొనుగోలు చేద్దామన్నా బయట మార్కెట్లో సైతం దొరకడం లేదని చెబుతున్నారు.