News
-
అంగన్వాడీలో కుళ్లిన గుడ్లు!
వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలని చేపట్టిన సంకల్పాన్ని పలువురు మధ్య దళారులు చిన్నాభిన్నం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్న అధికారుల నిర్లక్ష్యంతో పలువురు నీరు గార్చుతున్నారు. కొన్నె గ్రామంలో సోమవారం కోడిగుడ్లను పంపిణీ చేయగా అవి వండుకున్న వారు గుడ్లు కుళ్లిపోయి వాసన వస్తుందని, అవి తింటే అనారోగ్యం పాలుకావడం ఖాయమని వాపోతున్నారు. అధికారులు సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
ద్విచక్రవాహనం ఎక్కిన పాము..
ఖమ్మం: మండలంలోని పాలేరు గ్రామంలో ఓ వ్యక్తి టీవీఎస్ మోపెడ్ పైకి పాము ఎక్కడంతో సదరు వ్యక్తి భయాందోళనకు గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి.. సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాలేరు కిరాణా సరుకుల నిమిత్తం రాగా అతను సరుకులను కొనుగోలు చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. కొద్దిదూరం వెళ్లగానే హ్యాండిల్పైకి పాము పాకుతూ కనిపించింది. దీంతో అతను కంగారుగా వాహనాన్ని నిలిపివేయగా అటుగా వెళ్తున్నవారు పామును చంపివేశారు. -
వరినారుతో మంత్రి కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్!
కరీంనగర్: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌కు ఆదివారం పాలకుర్తి జెడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన స్వగ్రామమైన లింగాపూర్‌లో ఇండ్ల నరేష్, స్వప్న పొలంలో వరినారుతో హ్యాపీ బర్త్ డే కేటీఆర్ అంటూ విషెస్ చెప్పి, కూలీలకు మిఠాయిలు పంచిపెట్టారు. -
కొమురవెల్లిలో బ్లాస్టింగ్లు!
సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందులోభాగంగా గుడి పక్కన కొండ రాళ్లు తొలగించడానికి సదరు కాంట్రాక్టర్ బ్లాస్టింగ్లు జరుపుతుండటంతో ఆదివారం ఆలయ కార్యాలయానికి, స్థానిక భవనాల గోడలకు బీటలువారాయి. దీంతో స్వామివారి మూల విరాట్టుకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. పదేపదే బ్లాస్టింగ్లు చేయడం వల్ల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రమాదం బారిన పడే అవకాశముందని, బ్లాస్టింగులు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు ఆలయ అధికారులను కోరుతున్నారు. ఈ విషయమై ఆలయ ఈవోకు వినతి పత్రం అందించడానికి వెళ్లిన సమయంలో బ్లాస్టింగ్ జరిగి పెద్ద బండరాయి వచ్చి ఆలయ కార్యాలయం వద్ద పడింది. ఈ విషయంపై ఈవో బాలాజీని వివరణ కోరగా తక్షణమే బ్లాస్టింగ్‌ను నిలిపివేసి, కెమికల్‌తో బండరాళ్లను తొలగించాలని సూచించినట్లు తెలిపారు. -
డుమ్మా టీచర్లకు చెక్!
సూర్యాపేట: పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల హాజరుపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. చాలా మంది ఉపాధ్యాయులు సెలవు కోసం దరఖాస్తు చేయకుండా అనధికారికంగా దీర్ఘకాలం విధులకు గైర్హాజరవుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో హాజరుపై ప్రత్యేక నిఘా పెట్టాలని పాఠశాల విద్యా శాఖ సంచాలకురాలు దేవసేన ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అనధికారికంగా విధులకు డుమ్మా కొడుతున్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్జేడీలు, డీఈఓలకు ఆదేశాలు ఇచ్చారు. అనుమతిపై విదేశాలకు వెళ్లిన వారు గడువు ముగిసినా విధుల్లో చేరకుండా నిర్లక్ష్యం చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇలాంటి వారి విషయంలో ప్రధానోపాధ్యాయుల నుంచి ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం అందడం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనధికారిక గైర్హాజరుతో విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి సెలవుల వివరాలను వెంటనే ఆనన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా శాఖ ముందుకెళ్తోంది. 950 స్కూళ్లు.. 3,900 మంది టీచర్లు.. జిల్లా వ్యాప్తంగా 950 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 70వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 3,900 మంది వరకు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అయితే మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో కొంత మంది ఉపాధ్యాయులు ఎలాంటి సమాచారం లేకుండా సెలవు పెట్టి వెళ్తున్నట్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని విద్యా శాఖ సెలవుల కంప్యూటీకరణకు కసరత్తు చేపట్టింది. కాంప్లెక్స్ హెచ్ఎంలకు బాధ్యతలు.. ఉపాధ్యాయుల సెలవుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసే బాధ్యతలను కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అప్పగించారు. ప్రతి హెచ్ఎం 10 నుంచి 15 పాఠశాలలను పర్యవేక్షించనున్నారు. కాంప్లెక్స్ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సెలవుల వివరాలను ప్రధానోపాధ్యాయుల నుంచి తీసుకొని ప్రతినెలా 5వ తేదీలోగా ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. సెలవుల రిజిస్టర్‌ను పాఠశాల హెచ్ఎం మాత్రమే ఆనన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు. ప్రతి ఉపాధ్యాయుడు ఏ నెలలో ఎన్ని సీఎల్‌లు, ఓసీఎల్లు వినియోగించుకున్నారో ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేలా చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉపాధ్యాయుల అనధికారిక గైర్హాజరుకు బ్రేక్ పడనుంది. అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొడితే సీసీఏ నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పారదర్శకత పెరుగుతుంది ఉపాధ్యాయుల హాజరును ఇప్పటికే బయోమెట్రిక్ ద్వారా నమోదు చేస్తున్నాం. దీనికి తోడు సెలవుల కంప్యూటరీకరణ వల్ల పారదర్శకత మరింత పెరుగుతుంది. స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్లర్లు కంప్యూటరీకరణ బాధ్యతలను నిర్వర్తించడం వల్ల పకడ్భందీగా రికార్డులను నిర్వహించే అవకాశాలుంటాయి. ఉపాధ్యాయుల డుమ్మా ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ఇది దోహదపడుతుంది. – అశోక్, డీఈఓ, సూర్యాపేట -
వరల్డ్ యూనివర్సిటీ పోటీలకు అనన్యశ్రీ
మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలోని మక్తల్‌కు చెందిన అనన్యశ్రీ వాలీబాల్‌లో విశేష ప్రతిభ కనబరుస్తుంది. 2019లో ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా అథ్లెట్ పథకం కింద కేరళలోని పట్టణమిట్టలోగల వాలీబాల్ అకాడమీకి ఎంపికై శిక్షణ తీసుకుంటుంది. ఈమె తెలంగాణతో పాటు కేరళ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం విశేషం. తెలంగాణ నుంచి 2018 పంజాబ్‌లో జూనియర్ నేషనల్ వాలీబాల్ టోర్నీలో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించింది. 2019లో తమిళనాడు రాష్ట్రం ధర్మపురి, 2020 కడపలో జూనియర్ నేషనల్ వాలీబాల్ పోటీల్లో పాల్గొంది. కేరళ రాష్ట్రం తరపున గతేడాది ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రాపూర్‌లో 23వ జాతీయస్థాయి, మహారాష్ట్ర సాంగ్లి జిల్లా ఇస్లాంపూర్‌లో 24వ జాతీయస్థాయి యూత్ వాలీబాల్ పోటీల్లో పాల్గొంది. కేరళలో సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ, మహారాష్ట్ర రాష్ట్రం కొల్హాపూర్‌లో సీనియర్ లీగ్ (హరియంట్ చసాక్) వాలీబాల్ టోర్నీలో పాల్గొంది. ఈ మూడు టోర్నీల్లో కేరళ జట్టు విన్నర్‌గా నిలిచింది. అస్సాం రాష్ట్రం గౌవహాటిలో ఈ ఏడాది ఫిబవరిలో 71వ ఉమెన్ సీనియర్ నేషనల్ వాలీబాల్ పోటీలకు కేరళ రాష్ట్ర జట్టుకు అనన్యశ్రీ ప్రాతినిథ్యం వహించింది. సీనియర్ నేషనల్ వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో కేరళ మహిళా జట్టు విజేతగా నిలవడంతో అనన్యశ్రీ బంగారు పతకం సాధించింది. పాండిచ్చేరిలో ఫెడరేషన్ కప్ వాలీబాల్ పోటీల్లో పాల్గొనగా కేరళ రాష్ట్ర జట్టు రన్నరప్‌గా నిలిచింది. వరల్డ్ యూనివర్సిటీ పోటీలకు.. అనన్యశ్రీ తొలిసారిగా విదేశీగడ్డపై వాలీబాల్ పోటీల్లో పాల్గొననుంది. చైనా దేశం చెంగ్డ్ నగరంలో ఈనెల 28 నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకు నిర్వహించే శ్రీవరల్డ్ యూనివర్సిటీ చాంపియన్షిప్శ్రీకు ఎంపికైంది. కేరళ యూనివర్సిటీ నుంచి చైనాకు వెళ్లే ఆలిండియా యూనివర్సిటీ వాలీబాల్ జట్టులో అనన్యశ్రీ చోటు దక్కించుకుంది. ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్‌లో ఈనెల 19 నుంచి 24 వరకు నిర్వహించిన ప్రత్యేక కోచింగ్ క్యాంపులో పాల్గొంది. -
జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్!
ఆదిలాబాద్: పెన్‌గంగలో శనివారం రాత్రి వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. మండలంలోని డొల్లార వద్ద గల బ్రిడ్జిని తాకుతూ ప్రవాహం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బ్రిడ్జి మీదుగా రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిప్పర్వాడ టోల్‌ప్లాజా వద్దనే వాహనాలను అపేసారు. వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్రిడ్జికి ఇరు వైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం ఉదయం ప్రవాహ ఉధృతి తగ్గడంతో రాకపోకలను అనుమతించారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
కిన్నెరసానిలో సందడి!
ఖమ్మం: మండలంలోని కిన్నెరసానికి ఆదివారం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చిన పర్యాటకులు డీర్ పార్కులోని దుప్పులు, డ్యాం పైనుంచి జలాశయాన్ని వీక్షించి ఉల్లాసంగా గడిపారు. 746 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్‌కు రూ.29,985.. 270 మంది బోటింగ్ చేయడం ద్వారా రూ.16,730 ఆదాయం టూరిజం శాఖకు లభించిందని నిర్వాహకులు తెలిపారు. -
భారీగా ఏసీపీ, ఇన్స్పెక్టర్ల ట్రాన్స్ఫర్.. బదిలీలకు ఈనెల 31 టార్గెట్..
వరంగల్: పోలీసుశాఖలో బదిలీలు భారీగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి అనధికారికంగా ప్రారంభమైంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీసీపీ స్థాయి అధికారి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ అధికారి వరకు ఎన్నికల ఎఫెక్ట్‌లో భాగంగా బదిలీలు జరుగుతున్నాయి. జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనరేట్ల కమిషనర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించారు. దీంతో ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. దీనికి అనుగుణంగా ఎన్నికల సమయంలో కీలకపాత్ర పోషించే పోలీస్ శాఖలో భారీగా మార్పులు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారుల ఎంపిక విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మార్గ నిర్దేశం చేసినట్లు సమాచారం. దానికి అనుగుణంగా ఎన్నికల నిబంధనలు వర్తించే పోలీస్ అధికారులను ఆయా నియోజకవర్గాలకు సాగనంపుతున్నారు. దీంతోపాటు ఎన్నికల సమయంలో సామాజిక సమీకరణాలతో పాటు ఏమేరకు ఎన్నికల విధుల్లో ఉపయోగపడుతారనే కోణంలో క్షుణంగా పరిశీలించిన తర్వాతనే పోస్టింగ్‌లకు సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల బదిలీ.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేసే ఇద్దరు డీసీపీలు పుల్లా కరుణాకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీగా, కర్రి పుష్పారెడ్డి తెలంగాణ కమాండ్ కంట్రోల్ విభాగం ఎస్పీగా బదిలీ అయ్యారు. వీరితో పాటు పరకాల, కాజీపేట, మామునూరు, క్రైం, ఏసీపీలు బదిలీ అయ్యారు. ఇన్స్పెక్టర్లు.. పరకాల, గీసుకొండతో పాటు కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. దీంతోపాటు చాలా కాలంగా ఖాళీగా ఉన్న హసన్‌పర్తి, కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లకు ఖమ్మం, కొత్తగూడెం నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్‌లు కేటాయించారు. కోడ్ ఎఫెక్ట్‌లో భాగంగా సుబేదారిలోని రూరల్ మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్, భరోసా ఇన్స్పెక్టర్లను బదిలీ చేశారు. గత నాలుగైదు రోజుల్లో వరుసగా సబ్ ఇన్స్పెక్టర్లను వివిధ పోలీస్స్టేషన్లకు బదిలీ చేస్తూ.. వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనా«థ్ ఉత్తర్వులు జారీ చేశారు. నేతల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు! ఎన్నికల ముందు ప్రశాంతత కోసం కొంత మంది అధికారులు లూపులైన్ల కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా.. మరికొంత మంది ఎన్నికల కోడ్ వర్తించని చాలామంది అధికారులు సిఫారసు లేఖల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈసమయంలో నాయకులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏమేరకు ఉపయోగపడతారని వారి అనుచర గణంతో లెక్కలు వేసుకుంటున్నారు. అధికారి పనితీరుతో పాటు సామాజిక అంశాన్ని ప్రధానంగా చూస్తున్నారు. ఒక్కో పోస్టింగ్ కోసం పదుల సంఖ్యలో అధికారులు క్యూ కట్టడం విశేషం. ఏసీపీ పోస్టుల కోసం కూడా అధికారులు ఒక్కో ప్రజాప్రతినిధిని పలుమార్లు కలుస్తున్నారు. ప్రస్తుతం పని చేస్తున్న కొంత మంది అధికారులు వారి పీరియడ్ పూర్తి కాకపోయినప్పటికీ పోస్టింగ్ ఉంటుందో? ఉడుతుందో.. తెలియని అయోమయ స్థితిలో ఉద్యోగం నెట్టుకొస్తున్నారు. వరంగల్ సబ్ డివిజన్లో మిల్స్‌కాలనీ, ఇంతేజార్గంజ్ వర్ధన్నపేట, ధర్మసాగర్, కమలాపూర్, నర్సంపేట, రఘునా«థపల్లి, నర్సంపేట రూరల్, నర్మెట్ట పోలీస్స్టేషన్లకు కొత్త అధికారులు రానున్నారు. ఈపోస్టింగ్ల కోసం ఇప్పటికే చాలా మంది అధికారులు ప్రజాప్రతినిధుల నుంచి లెటర్లు పోలీస్‌బాస్‌కు అందించినట్లు సమాచారం. ఇందులో కొంత మందికి ఎలక్షన్ ఎఫెక్ట్ ఉండగా.. మరికొంత మంది ప్రవర్తన సరిగ్గా లేక మార్పు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అరెస్ట్‌లకు రంగం సిద్ధం! పోలీసు అధికారుల లెక్కల ప్రకారం వివిధ కేసుల్లో ఇప్పటి వరకు అరెస్టు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న సుమారు 180 మంది నిందితుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. వీరిని అరెస్ట్ చేయడానికి ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఎస్హెచ్ఓలకు నిర్ధిష్టమైన ఆదేశాలు అందాయి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపనున్నారు. దీంతో పాటు ఆయా పోలింగ్స్టేషన్ల వారీగా మాజీలతో పాటు గతంలో జరిగిన ఎన్నికల్లో ఇబ్బదులు సృష్టించిన వ్యక్తుల జాబితాలు కూడా ఆయా పోలీస్స్టేషన్లలో సిద్ధంగా ఉన్నాయి. తుపాకుల జాబితా రెడీ.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తుపాకుల లైసెన్స్‌లు 230 ఉన్నాయి. ప్రస్తుతం తుపాకుల లైసెన్స్ కలిగిన వ్యక్తులు వివిధ గొడవల్లో చిక్కుకున్న, కేసులు నమోదైన వారి లైసెన్స్‌లు రద్దు చేశారు. దీంతో కమిషనరేట్ పరిధిలో 180 వరకు లైసెన్స్ తుపాకులున్నాయి. ఎన్నికల ముందు వీటిని ఆయా పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తుపాకుల లెక్కలను సైతం పోలీసు అధికారులు సిద్ధం చేసి ఉంచారు. ఈనెల 31 వరకు ప్రక్రియ పూర్తి చేస్తాం.. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఈనెల 31వ తేదీ వరకు ఎన్నికల బదిలీ ప్రక్రియను పూర్తి చేస్తాం. సొంత జిల్లా, సొంత నియోజవర్గం ఉన్న అధికారులతో పాటు చివరి నాలుగేళ్లలో మూడు సంవత్సరాలు ఒకే దగ్గర పనిచేసే అధికారులను నిబంధనల ప్రకారం బదిలీ చేస్తాం. ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పని చేస్తున్న అధికారులను రెవెన్యూ జిల్లాను ప్రతిపాదికన బదిలీలు చేపడుతున్నాం. ఏసీబీ, క్రిమినల్ కేసులు ఉన్న అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతాం. – ఏవీ. రంగన్నాథ్, వరంగల్ పోలీస్ కమిషనర్ -
కస్తూరిబాలో పాము కలకలం!
ఆదిలాబాద్: మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో శనివారం రాత్రి 8గంటల ప్రాంతంలో ఇద్దరు బాలికలు మూత్రశాలలకు వెళ్తుండగా పాము వారి కాళ్ల మధ్యలో నుంచి వెళ్లింది. దీంతో వారు ఆందోళనకు గురికావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు ప్రమాదం ఏమి లేదని తెలిపాడు. అనంతరం పరిశీలన కోసం భైంసాలోని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై కసూ్తరిబా పాఠశాల ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించగా విద్యార్థినులు పామును చూపి బయపడ్డారని, పరిశీలన కోసం ఆస్పత్రికి తరలించామని తెలిపారు. -
రన్ రాజా రన్ ! హాఫ్ మారథాన్ !!
మెదక్: ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా సిద్దిపేట ముందుకు సాగుతోంది. మనిషి జీవన ప్రమాణాలతోపాటు ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు వస్తున్నాయి. బిజీ ప్రపంచంలో శారీరక శ్రమలేక ఎన్నో అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం సిద్దిపేట వేదిక అవుతోంది. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్, జిల్లా పోలీస్ శాఖ సమన్వయంతో ఆగస్టు 6న హాఫ్ మారథాన్ నిర్వహిస్తున్నారు. అందులో 5, 10, 21 కిలో మీటర్ల విభాగాలు ఏర్పాటు చేశారు. అందుకోసం ఇప్పటికే ఆసక్తి ఉన్న వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. హాఫ్ మారథాన్ అంటే.. మారథాన్ అంటే 42.195 కిలో మీటర్లు(26.385 మైళ్లు), హాఫ్ మారథాన్ అంటే 21.0975 కిలో మీటర్లు(13.192 మైళ్లు) అంటారు. ఇలాంటి రన్లను అరుదుగా నిర్వహిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరంలో సుమారుగా 800 పైగా జరుగుతున్నాయి. 2021 సంవత్సరంలో ఉగాండాకు చెందిన జాకబ్ కిప్లిమో హాఫ్ మారథాన్‌ను 57.31నిమిషాల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించగా, మహిళల విభాగంలో 1.02గంటలో హాఫ్ మారథాన్‌ను ఇథియోపియాకు చెందిన లెటెన్బెట్ పూర్తి చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. రంగనాయకసాగర్ వేదికగా.. హాఫ్ మారథాన్‌కు సిద్దిపేటలోని రంగనాయకసాగర్ వేదిక కాబోతుంది. ఆగస్టు 6(ఆదివారం)న ఉదయం 5.30గంటలకు హాఫ్ మారథాన్(21.0975 కిలో మీటర్లు) సిద్దిపేట పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి ప్రారంభమై రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్ట పైన రన్ సాగనుంది. అదే రోజు ఉదయం 5:30 గంటలకు 5, 10 కిలో మీటర్ల పరుగు పందెం రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్ట పై జరగనుంది. ఈ రన్లో ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, సినీ నటులు, ప్రముఖ క్రీడాకారులు పాల్గొననున్నారు. గెలుపొందిన వారికి నగదు పురస్కారాలు హాఫ్ మారథాన్‌లో గెలుపొందిన విజేతలకు నగదు పురస్కారాలు అందించనున్నారు. పురుషులు, మహిళలకు వేరువేరు విభాగాలుగా విభజించి అందించనున్నారు. హాఫ్ మారథాన్ విజేతలకు ప్రథమ బహుమతి రూ.50వేలు, ద్వితీయ రూ.25వేలు, తృతీయ రూ.10వేల నగదును, పది కిలోమీటర్ల పందెంలో ప్రథమ రూ.25వేలు, ద్వితీయ రూ.15వేలు, తృతీయ బహుమతి రూ.10వేలు, 5కిలోమీటర్లలో ప్రథమ రూ.15వేలు, ద్వితీయ రూ.10వేలు, తృతీయ రూ.5వేల నగదు పురస్కారంతో పాటు జ్ఞాపికను అందించనున్నారు. ఇలా మొత్తంగా నగదు పురస్కారాలు రూ3.30లక్షలను అందించనున్నారు. ఈ నెల 25తో ముగియనున్న ఎంట్రీలు హాఫ్ మారథాన్ రన్లో పాల్గొనే వారు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే 5కిలోమీటర్ల రన్‌కు సంబంధించిన ఎంట్రీ గడువు ముగిసింది. జ్ట్టి ఞట://టజిఝ23.జ్ఞీ301.ఛిౌఝ లింక్‌ను ఓపెన్ చేసి వివరాలను నమోదు చేయాలి. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు హాఫ్ మారథాన్, 10 కిలో మీటర్ల రన్‌కు 14 సంవత్సరాలు నిండిన వారు అర్హులు, 5కిలో మీటర్ల రన్లో 10 సంవత్సరాలు నిండిన వారు పాల్గొనేందుకు అర్హులు. పోస్టర్ ఆవిష్కరణ చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నకోడూరు ఎంపీడీఓ కార్యాలయంలో హాఫ్ మారథాన్ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం సిద్దిపేట ఏసీపీ సురేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనే వారు రిజిస్ట్రేషన్ చార్జీలు 5కే రన్‌కు రూ.200, 10కే రన్‌కు రూ.300, 21కే రన్‌కు రూ.500 చెల్లించి ఆన్లైన్లో పేరు నమోదు చేయించుకోవాలన్నారు. -
అనాథను అక్కున చేర్చుకున్న అన్నపూర్ణ సేవా సంస్థ
నల్గొండ: మతిస్థిమితం కోల్పోయిన ఓ మహిళ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో వారం రోజులుగా రోడ్డు వెంట ఉండి యాచక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. స్థానికులు ఆరా తీయగా ఆమెది మధ్యప్రదేశ్ అని, తన కుటుంబ సభ్యులు కొట్టడంతో పారిపోయి ఇక్కడకు వచ్చినట్లు తెలిసింది. జడ్చర్ల– కోదాడ ప్రధాన రహదారిపై వీధి లైట్ల కింద నాలుగు రోజులుగా వర్షానికి తడుస్తూ ఉంటుండంతో స్థానికులు ఆమె ధీనస్థితిని వీడియో తీసి ‘ఈ అనాథకు దిక్కెవరు’ అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. స్పందించిన ఆర్ఎస్ఎస్ సేవా భారతి సభ్యుడు రాము ఆమెకు శనివారం అల్పాహారం అందించి నల్లగొండలోని సేవా భారతి స్వచ్ఛంద సంస్థ సభ్యులు భీమనపల్లి శ్రీకాంత్‌కు సమాచారం అందించాడు. ఆయన అంబులెన్స్‌లో నేరేడుచర్లకు వచ్చి సేవా భారతి సభ్యులు, స్థానిక పోలీసులు, మున్సిపల్ శాఖ సిబ్బంది సహకారంతో మతిస్థిమితం కోల్పోయిన మహిళళను సూర్యాపేట సమీపంలో గల దురాజ్‌పల్లిలోని అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ అనాథ ఆశ్రమంలో ఆశ్రయం కల్పించారు. కార్యక్రమంలో సేవా భారతి సభ్యులు మెట్టు వేణుగోపాల్‌రెడ్డి, చామకూరి వీరయ్య, సంపత్, రాములు, రాము, నాగిరెడ్డి, సైదిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, స్థానికులు వెంకన్న, శంకర్‌రెడ్డి, కోటేశ్వర్రావు, వెంకటకృష్ణ తదితరులున్నారు. -
సీఆర్ఆర్ మరణం తీరని లోటు!
ఆదిలాబాద్: మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డి మర ణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులకు తీరని లో టని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. శనివారం సీఆర్ఆర్ నివాసంలో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం ఎంపీ మాట్లాడుతూ, సీఆర్ఆర్ మరణం తనను దిగ్బ్రాంతికి గురిచేందన్నారు. ఆదివాసుల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి పోయారని తెలిపారు. రాజకీయాలు శాశ్వతం కాదని, చేసిన అభివృద్ధి పనులు ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. బోథ్‌లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, ఆదివాసీల సమస్యల పరిష్కారంలో ఆయన కృషి మరవలేనిదని కొనియాడారు. ఆయన వెంట బీజేపీ నాయకులు రమణ, డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, జెడ్పీటీసీ మల్లెపూల నరసయ్య, కాంగ్రెస్ నాయకులు నరేష్ జాదవ్, తదితరులున్నారు. -
‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కవిత మాటలు’
నిజామాబాద్: అవినీతి గురించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి అన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు, ఆమె తండ్రి సీఎంగా ఉన్నా.. జిల్లాలో కవిత చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. మాధవ్‌నగర్ ఆర్వోబీ పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ ఈమె కమీషన్లకు భయపడి పారిపోయి న మాట వాస్తవం కాదా అన్నారు. అర్వింద్ ఎంపీ గా గెలిచిన తర్వాత గోవింద్‌పేట ఆర్వోబీ పనులు పూర్తి చేయించారని, మాధవ్‌నగర్, ఆర్మూర్ మామిడిపల్లి, అడవి మామిడిపల్లిలో ఆర్వోబీల పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. తాను చేసిన అ వినీతి గురించి అర్వింద్ రుజువు చేయాలని, లేకపో తే పూలాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయాలన్న కవిత వ్యాఖ్యలపై స్రవంతిరెడ్డి స్పందించారు. ముందు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న సీఎం కేసీఆర్ తల నరుక్కోవాలన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసును ఈడీ విచారిస్తుందని, నిందితులు ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. జిల్లాకు రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరైతే భవన నిర్మాణాల పనులు కవిత ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. రింగ్ రోడ్డుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తే పనులు పూర్తయ్యాయని చెప్పారు. స్పైస్ బోర్డు తానే తెచ్చానని కవిత చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అర్వింద్‌ను వెంటాడి ఓడిస్తానన్న కవిత ఇప్పుడు మాట మార్చి, అర్వింద్ మీద ఎవరు నిలబడ్డా గెలిపించుకుంటామని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన సర్వేలో కవిత ఓడిపోతారని తెలవడంతో అర్వింద్‌పై వేరే వారిని పోటీలో దించాలని చూస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే అర్వింద్‌పై పోటీ చేసి గెలవాలన్నారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పంచరెడ్డి ప్రవళిక, కార్పొరేటర్లు సౌజన్య, మమత, ఇందిరా, నాయకురాలు వరలక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు. -
కవి రాజేశంకు సినారె పురస్కారం!
మంచిర్యాల: మండలంలోని ఆవుడం గ్రామానికి చెందిన ప్రముఖ కవి, విమర్శకుడు, జిల్లా రచయితల వేదిక అధ్యక్షుడు తోకల రాజేశం డాక్టర్ సీ.నారాయణరెడ్డి రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 30న జడ్చర్లలో జరిగే కార్యక్రమంలో మహాకవి సినారె కళాపీఠం పురస్కారం ప్రదానం చేస్తారు. పద్య, వచన, కవిత్వంతోపాటు సాహిత్య విమర్శ రంగంలోనూ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు కళాపీఠం అధ్యక్షుడు మల్లెకేడి రాములు, సమన్వయకర్త డాక్టర్ పోరెడ్డి రంగయ్య ప్రకటించారు. రాజేశం 2006లో తెలుగు బాల శతకం, 2010లో చమట చుక్కలు, 2013లో పాతాళగరిగే, 2017లో అడవిదీపాలు, మంచిర్యాల జి ల్లా సాహిత్య చరిత్ర అనే గ్రంథాలను ముద్రించారు. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. -
బాహుబలి గని!
కరీంనగర్: రాబోయే రోజుల్లో వంద మిలి యన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా యాజ మాన్యం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ప్రసుత్తం 78 మిలియన్ టన్నుల లక్ష్యంగా ముందుకు సాగుతుండగా, రాబోయే రో జుల్లో మరో 22మిలియన్ టన్నులు పెంచేందు కు నిర్ణయించింది. దీనిలో భాగంగా ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే మరో భా రీ ఓపెన్‌కాస్ట్ ఏర్పాటుకు వడివడిగా ముందుకు సాగుతోంది. నాలుగు గనులు కలిపి రామగుండం కోల్‌మైన్ పేరుతో కొత్త ఓసీపీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 633.45మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్న ఈ ప్రాజెక్టు రెండేళ్లలో ప్రారంభమయ్యేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆర్జీ–3ఏరియాకు అనుబంధంగా.. సింగరేణి సంస్థ రామగుండం రీజియన్‌లోని ఆర్జీ–3 ఏరియాకు అనుబంధంగా రామగుండం కోల్‌మైన్ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోంది. భవిష్యత్‌లో అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టును కలుపుకుని ఆర్జీ–2 ఏరియాలోని వకీల్‌పల్లి గని, ఆర్జీ–3 ఏరియాలోని ఓపెన్‌కాస్ట్–1, 2, మూసివేసిన జీడీకే–10 గనిని కలుపుకుని మెగా ప్రా జెక్టు ఏర్పాటుకు సిద్ధమైంది. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు ఆర్జీ–2, 3 జీఎంలతో ఎ ప్పటికప్పుడు ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరుపుతున్నారు. రెండు ఏరియాల అధికారులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రాజెక్టు పనులు సిద్ధం చేసేందుకు ప్రత్యేక అధికారిని యాజమాన్యం నియమించింది. పెరుగనున్న బొగ్గు ఉత్పత్తి రామగుండం కోల్‌మైన్ ప్రాజెక్టు ఏర్పాటుతో ఏ టా 10మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి పెరగనుంది. ప్రస్తుతం విడివిడిగా ఉత్పత్తి కొనసాగిస్తున్నప్పటికీ కాలానుగుణంగా అన్ని గనులను ఒకే ఓసీపీ కిందకు తీసుకరానున్నారు. నూతన మెగా ఓసీపీ మూలంగా వకీల్‌పల్లి గనిని మరో రెండేళ్లలో మూసివేయనున్నారు. ఇప్పటికే మూ సివేసిన జీడీకే–10గనితో పాటు నాలుగు గనులను ఒకే ప్రాజెక్టు పరిధిలోకి తీసుకరానున్నారు. దీనివల్ల సరిహద్దు సమస్య లేకుండా ఉండనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఓసీపీ–2 ప్రాజెక్టు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, భూసేకరణ, ఎస్ఆర్ఎస్పీ కెనాల్ మార్పు తదితర పనుల మూలంగా ఉత్పత్తి వెనకపడింది. ఇదే ప్రాజెక్టు పరిధిలో ఉన్న అడ్రియాల లాంగ్ ప్రాజెక్టు గని కూడా ఇందులో అంతర్భాగంగా కొనసాగించనున్నారు. రెమిడేషన్ ప్లాన్‌లో వకీల్‌పల్లి, ఓసీపీ–1 పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి అధిక ఉత్పత్తి తీసిన వకీల్‌పల్లిగని, ఓసీపీ–1 ప్రాజెక్టు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం రెమిడేషన్ ప్లా న్ చేయాల్సింది ఉంది. ఈ మేరకు రెండు గనుల అధికారులు సమీప గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఇవి పూర్తయితే రెండు గనులకు సంబందించిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వస్తుంది. క్లియరెన్స్ రాగానే రామగుండం కోల్‌మైన్ ఓసీపీ కోసం యాజమాన్యం ఎన్విరాన్మెంట్ విభాగానికి దరఖాస్తు చేసుకోనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈఏడాది నవంబర్‌లో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించే అవకాశాలున్నాయి. 2024 నాటికి నాలుగు గనుల సరిహద్దు కలిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు ప్రొఫైల్ వివరాలు.. ప్రాజెక్టు పేరు: రామగుండం కోల్‌మైన్, విస్తరణ: 3445హెక్టార్లు, బొగ్గు నిల్వలు: 633.45మిలియన్ టన్నులు, ఏటా బొగ్గు ఉత్పత్తి: 14మిలియన్ టన్నులు(భూగర్భగనితో కలిపి), ఓవర్‌బర్డెన్: 2,846 మిలియన్ క్యూబిక్‌మీటర్లు, ప్రాజెక్టు జీవిత కాలం: సుమారు 30ఏళ్లు, అటవీభూమి: 719హెక్టార్లు. -
మద్యం మత్తులో ఇద్దరు కానిస్టేబుళ్ల హల్చల్!
నల్గొండ: నేరేడుచర్లలో ఇద్దరు కానిస్టేబుళ్లు మద్యం మత్తులో హల్చల్ చేసిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నెల 19వ నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని నర్సయ్యగూడెంలో ఓ బెల్ట్‌షాపు నిర్వాహకుడికి, ఇద్దరు కానిస్టేబుళ్లకు గొడవ జరిగింది. అడ్డు చెప్పబోయిన మరో వ్యక్తిపై కానిస్టేబుళ్లు దాడి చేశారు. దీంతో బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మద్యం తాగిన కానిస్టేబుళ్లు డబ్బుల విషయంలో ఘర్షణకు దిగారని, మద్యం తాగి డబ్బులు ఇవ్వకుండా గొడవ చేశారని, బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. వీరు ఇటీవల హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్‌ను పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. -
ముగ్గురి ప్రాణాలను కాపాడిన ఈఎన్టీ
ఆదిలాబాద్: 108 అంబులెన్స్‌లో ఓ నిండు గర్భిణికి ఈఎన్టీ ప్రసూతి చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడారు. వివరాలు.. కెరమెరి మండలం పెద్ద సాకడ గ్రామానికి చెందిన ఆత్రం గంగుబాయికి పురిటి నొప్పులు రాగా శుక్రవారం కుటుంబీకులు ఆమెను కెరమెరి పీహెచ్సీలో చేర్పించారు. కవల పిల్లలున్నారని, బీపీ కూడా అధికంగా ఉందని గుర్తించిన వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం ఆమెను ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్చేశారు. 108 అంబులెన్స్‌లో ఉట్నూర్‌కు తరలిస్తున్న క్రమంలో జైనూర్ మండలం ఉశేగాం సమీపంలో ఆమెకు నొప్పులు అధికమయ్యాయి. దీంతో అంబులెన్స్‌లోనే ఈఎన్టీ శ్రీనాథ్ డెలివరీ చేయగా కవలలకు జన్మనిచ్చింది. బీపీ అధికంగా ఉన్నప్పటికీ ధైర్యంగా డెలివరీ చేసి ముగ్గురి ప్రాణాలు కాపాడిన ఈఎన్టీ శ్రీనాథ్‌ను పలువురు అభినందించారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉన్నారు. కాగా, గంగుబాయికి ఇది రెండో కాన్పు. ఈఎన్టీ శ్రీనాథ్‌తో పాటు పైలెట్ రమాకాంత్ ఉన్నారు. -
మా డాక్టర్.. మాకు కావాలి!
ఆదిలాబాద్: జైనూర్ మండలంలోని ఉషెగాం ప్రాథమి ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు రాజును అక్రమంగా బదిలీ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం గిరిజనులు అందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఆర్మీలో విధులు నిర్వహించి గతేడాది నుంచి ఉషెగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు రాజును అక్రమంగా లింగాపూ ర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బదిలీ చేశారని ఆరోపించారు. మా డాక్టర్ మాకు కావాలని, లేదంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్‌రావు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఐదు రోజుల్లో రీపోస్టింగ్ ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినా జిల్లా వైద్యశాఖ కార్యాలయంలోని కిందిస్థాయి అధికారులు అక్రమంగా బదిలీ చేస్తూ వైద్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. లింగాపూర్‌లో పనిచేస్తున్న వైద్యుడిని కాగజ్‌నగర్ ప్రాంతానికి బదిలీ చేసి నిస్వార్థంగా పనిచేస్తున్న డాక్టర్ రాజును అక్రమంగా ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. కలెక్టర్ చొరవ తీసుకుని అక్రమ బదిలీని నిలిపి వేయాలని, లేకుంటే కలెక్టరెట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్, యూత్ పాల్గొన్నారు. -
రైతులు వ్యవసాయ సూచనలు పాటించాలి!
జోగులాంబ: ఆలస్యంగానైనా వర్షాలు సమృద్ధిగా కురవడంతో జిల్లాలో పంటల సాగుకు ఆశాజనకమైందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం ఐడీవోసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది జూన్‌లో సాధారణ వర్షపాతం కంటే 23శాతం తక్కువగా వర్షపాతం నమోదైందన్నారు. అయితే జూలైలో జిల్లా వ్యాప్తంగా 73.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 52.8 మి.మీ. నమోదైందన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో వానాకాలం పంటల సాగుకు ఇబ్బందులు లేవన్నారు. రైతులందరు కూడా వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన మేరకు పంటలను సాగుచేసుకోవాలన్నారు. గతేడాది వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 4,01,764 ఎకరాలలో వివిధ పంటలు సాగు చేయగా, అదే ఏడాది జూలైలో 1.75లక్షల ఎకరాలలో వివిధ పంటలు సాగయ్యాయన్నారు. ఈ ఏడాది జూలై 20వ తేదీ నాటికి కేవలం 83,041ఎకరాలలో మాత్రమే వివిధ రకాల పంటలను సాగుచేశారన్నారు. ఆలస్యంగా వర్షాలు కురవడంతోనే పంటలు సాగు ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రైతులకు ఇబ్బందులు తొలగాయని వరి, మిరప, మొక్కజొన్న, రాగి, కొర్ర, వేరుశనగ, ఆముదాలు, పొద్దుతిరుగుడు, కందులు వంటి పంటలు సాగుచేసేందుకు అనుకూలంగా ఉంటాయన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వరి, ఆముదం, రాగి, కొర్ర, పొద్దుతిరుగుడు, మిర్చి పంటలు వేసుకోవచ్చన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటాం జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన సీడుపత్తి పంట సాగుచేసిన రైతులకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. నివేదిక వచ్చిన తరువాత దానిని ప్రభుత్వానికి పంపి నష్టపోయిన రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే దీనిపై సీడుపత్తి కంపెనీలు, రైతులు, అధికారులతో సమీక్షించినట్లు వివరించారు. అప్రమత్తంగా ఉండాలి ముసురు వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివాసం ఉండరాదని, దీనిపై ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా పిడుగుపాటుకు గురి కాకుండా ప్రజలు బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద, నీటికుంటలకు దూరంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు. సమావేశంలో డీఏఓ గోవిందునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్‌పై విస్తృత ప్రచారం ఎలక్ట్రానిక్ ఓటింగ్‌పై ప్రజలకు విస్తృతమైన ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈవీఎం యంత్రాలలో పదిశాతం యంత్రాలను వీవీ ప్యాట్లను సిబ్బంది శిక్షణ, ఓటర్లలో అవగాహన కార్యక్రమాల కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. ఓటు ప్రతిఒక్కరి హక్కు అని, తప్పకుండా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈమేరకు జిల్లాలోని గద్వాల, అలంపూరు తహసీల్దార్ కార్యాలయాలు, గద్వాల ఆర్డీవో కార్యాలయం, కలెక్టర్ కార్యాలయంలో యంత్ర ప్రదర్శన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ వరలక్ష్మి సురేష్, రఘు, డీటీ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులా.. రజాకార్లా..?
మహబూబ్‌నగర్: జిల్లాలోని పోలీసులు నిజాం కాలంలోని రజాకార్లలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మండిపడ్డారు.30 ఏళ్లుగా తనవెంటే ఉన్న నాయకుడు కృష్ణారెడ్డిని దొంగను చూసినట్టు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఆయనపై చేయి చేసుకునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎవరైనా తప్పు చేస్తే అందుకు శిక్ష అనుభవించాల్సిందేనని, అయితే పోలీసులకు కొట్టే అధికారం ఎవరిచ్చారని అన్నారు. వ్యక్తులు తప్పు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని చెప్పారు. అంతేకాని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడితే పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టడం అమానుషమన్నారు. మొదటగా ఎమ్మెల్యేకు సంబంధించిన పీఏ సోషల్ మీడియాలో తనను దూషిస్తూ అసభ్యకరంగా పోస్టు పెట్టాడని చెప్పారు. దీనిపై స్పందించిన కృష్ణారెడ్డిపై ఎస్సై చేయి చేసుకున్నాడన్నారు. ఎమ్మెల్యే అనుచరులపై పోలీసులు కేసు పెట్టకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి చిల్లర రాజకీయాలు చూడలేదని చెప్పారు. నాగం జనార్దన్రెడ్డితోనూ తనకు 20 ఏళ్ల పాటు వైరం కొనసాగినా ఏనాడూ తిట్టుకోలేదని వివరించారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో సగం మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కౌన్సిలర్లుగా ఎమ్మెల్యే అవకాశం ఇచ్చాడని చెప్పారు. వారంతా ప్రజల భూములపై పడ్డారని విమర్శించారు. ఇటీవల వట్టెంలో ఎమ్మెల్యేపై ప్రజలు తిరగబడ్డారన్నారు. తన అనుచరులు, కార్యకర్తలపై కక్షగడితే తానే స్వయంగా పోరాటానికి దిగుతానని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో అరాచకాలకు ప్రజలే ఓటు ద్వారా బుద్ధిచెబుతారని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హబీబ్, కావలి శ్రీను, తిరుపతయ్య, రాంచందర్ పాల్గొన్నారు. పోలీసులే బీఆర్ఎస్ను ముంచుతారు రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థనే బీఆర్ఎస్ పార్టీని ముంచుతుందని దామోదర్‌రెడ్డి అన్నారు. వారి అరాచకాలతో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు చెప్పినా వాళ్లు సర్దుకునే పరిస్థితుల్లో లేరని చెప్పారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేల మెప్పుకోసమే పనిచేస్తున్నారని చెప్పారు. పోలీసుల తీరుతో చాలామందికి అన్యా యం జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు చెబితేనే పోలీసులకు పోస్టింగులు ఇచ్చే పరిస్థితి నెలకొందన్నారు. త్వరలో కొల్లాపూర్‌లో నిర్వహించే సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకాగాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. -
ఆక్సిజన్ కుంభకోణంపై సీఐడీ చార్జ్‌షీట్!
వరంగల్: వరంగల్‌కు ధర్మాస్పత్రిగా పేరుగాంచిన ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఆక్సిజన్ కుంభకోణాన్ని 2013లో ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తేగా.. విషయ తీవ్రతను గమనించిన సీఐడీ అధికారులు 2015లో కేసు నమోదు చేశారు. నెలలు, ఏళ్ల తరబడిగా విచారణ చేసిన అధికారులు శుక్రవారం ఎట్టకేలకు కుంభకోణం జరిగిన విధానంపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. 2007 నుంచి 2013 వరకు జరిగిన ఆక్సిజన్ టెండర్ విధానంలో నాలుగు కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో రూ.180కు సరఫరా జరిగే ఆక్సిజన్ టెండర్‌ను రూ.385 కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు. అలాగే ఈ కుంభకోణానికి సహకరించిన 13 మంది అడ్మినిస్ట్రేటివ్ అధికారులతోపాటు వరంగల్ తులసీ ఏజెన్సీ నిర్వాహకులను నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. సంచలనంగా మారిన ఆక్సిజన్ దందా... ఆక్సిజన్ కాంట్రాక్టర్ వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ ఏకంగా ఓ సూపరింటెండెంట్ స్థాయి వ్యక్తి ఏసీబీకి పట్టుబడడంతో రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు ఎంజీఎం ఆస్పత్రి పాలనపై ప్రత్యేక దృష్టి సారించారు. అసలు ఆక్సిజన్ కాంట్రాక్టర్ లక్షల రూపాయలు సూపరింటెండెంట్‌కు లంచం ఇచ్చేందుకు ఎందుకు ఒప్పుకున్నారు. ఆక్సిజన్ సరఫరాలో ఏం జరుగుతుంది? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం విజిలెన్స్, సీఐడీ విచారణకు ఆదేశించింది. అధికారులపై కేసు నమోదు.. ఆక్సిజన్ కుంభకోణంలో తులసీ ఏజెన్సీ నిర్వాహకులు నరహరి బిందురెడ్డి, నరహరి మనోహర్‌రెడ్డి, 2007 నుంచి 2013వ వరకు అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పని చేసిన 13 మంది అధికారులను నిందితులుగా చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఆ కాలవ్యవధిలో పని చేసిన డాక్టర్ రఘురాం, అశోక్‌కుమార్, ఏ.ఎన్.ఆర్ లక్ష్మి, బలభద్ర పా త్రుని శ్యాంసుందర్‌రావు, తుంగతుర్తి సురేందర్, డాక్టర్ సత్యదేవ్, నరేంద్రకుమార్, బెంజీమెన్ సామెల్, కొండ్రు నాగేశ్వర్రావు, సుద్దాల లక్ష్మి రాజం, పిల్లి సాంబశివరావు, గంధన్ శేషాచారి నరసింహన్, వరికొటి విష్ణుమోహన్లను నిందితులుగా చార్జ్‌షీట్‌లో పేర్లు నమోదు చేశారు. కుంభకోణం వెలుగుచూసింది ఇలా... ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెండర్ల విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రమంలో వేలాది మంది పేద ప్రజలకు సేవలందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి వైద్యసేవల్లో ఆక్సిజన్ టెండర్ కీలకంగా మారింది. ఇందులో అక్రమాలు జరుగుతున్నట్లు ‘సాక్షి’ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో 2013 మే నెలలో ఆస్పత్రిలోని ప్రధాన వార్డులకు ఆక్సిజన్ ఎలా సరఫరా చేస్తున్నారు.. ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారనే విషయాన్ని పరిశీలించిన ప్రతినిధులకు ఖంగుతినే విషయాలను గమనించాల్సి వచ్చింది. బహిరంగ మార్కెట్లో రూ.180కు లభించే ఆక్సిజన్ సిలిండర్‌ను ఏకంగా డబుల్ ధరకు రూ. 385కు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు పెద్ద గండి కొడుతున్న విషయాన్ని గమనించి 2013 మే 17వ తేదీన ఆక్సిజన్ ‘టెండర్’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనంలో సిలిండర్‌లో ఎంత కెపాసిటీ గేజ్‌తో ఆక్సిజన్ నింపాలి.. ఎంత గేజ్‌తో నింపుతున్నారు అనే విషయం సమగ్రంగా వచ్చింది. ఈ కథనాన్ని ఆసరా చేసుకున్న అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ.. కాంట్రాక్టర్ మనోహర్‌రెడ్డి వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఆతర్వాత కాంట్రాక్టర్ మనోహర్‌రెడ్డి.. 2013 జూలై నెలలో డాక్టర్ రామకృష్ణకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తీగ లాగితే డొంక కదిలింది.. ప్రభుత్వం విచారణకు ఆదేశించగానే ‘సాక్షి’లో వచ్చిన కథనంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. 2007 నుంచి 2013 వరకు ఆస్పత్రిలో నామినేషన్ పద్ధతిన టెండర్ కేటాయించడంతోపాటు సరఫరా చేసిన సిలిండర్లకు సైతం అద్దె కట్టించుకున్నారు. ఈ విషయం సైతం ‘సాక్షి’ కథనంలో క్షుణ్ణంగా వచ్చింది. ఒక్కో సిలిండర్‌కు అదనంగా రూ.190తోపాటు, 2007 నుంచి 2013 వరకు ఎంజీఎం ఆస్పత్రి నుంచి రూ.35.29 లక్షల అద్దె చెల్లించినట్లు.. ఈ రకంగా ప్రతి సంవత్సరం లక్షల రూపాయల దోపిడీ జరిగినట్లు గుర్తించారు. -
సాధన చేశారు.. సాధించారు..
నిజామాబాద్: సర్కార్ బడుల్లో చదువుతున్న విద్యార్థుల ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపాధ్యా యుల ప్రోత్సాహంతో అందిపుచ్చుకుంటున్నారు. ఇటీవల ప్రకటించిన జాతీయ ప్రతిభా ఉపకార వేత నాల(ఎన్ఎంఎంఎస్) ఫలితాలే అందుకు నిదర్శ నం. ఈ స్కాలర్షిప్కు ఉమ్మడి జిల్లాలో 205 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సాహించాలని కేంద్ర ప్రభు త్వం మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ అందజేస్తుంది. ఎనిమిది, తొమ్మది తరగతి విద్యార్థులకు పరీక్ష పెట్టి ఎంపికైన ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇంటర్ వరకు ఉపకారం వేతనం అందజేస్తోంది. ఈ ఏడాది నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్షలో ఉమ్మడి జిల్లా విద్యార్థులు సత్తాచాటి 205 మంది ఉపకార వేతనానికి ఎంపికయ్యారు. నిజామాబాద్ జిల్లా నుంచి 130 మంది, కామారెడ్డి జిల్లా నుంచి 75 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. చొరవ చూపితే మరింత ప్రయోజనం ఉమ్మడి జిల్లాలో కొన్ని పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల చేత దరఖాస్తు చేయించాడనికే పరిమితం కాకుండా విద్యార్థులు పరీక్షలో విజయం సాధించే విధంగా శిక్షణనిస్తున్నారు. దీంతో ఆయా పాఠశాల విద్యార్థులు స్కాలర్షిప్కు ఎంపికవుతున్నారు. కానీ చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులు దీనిపై చొరవ చూపడం లేదు. కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నా.. ఉపాధ్యాయుల అలసత్వంతో ఉమ్మడి జిల్లాలో అనేకమంది విద్యార్థులు ఉపకార వేతనానికి దూరమవుతున్నారు. ఆయా ప్రభుత్వ పాఠశాల పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులతో దరఖాస్తులు చేయించి పరీక్ష రాయించాల్సి ఉన్నా.. కొందరు మాత్రమే చొరవ తీసుకొని దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఉపాధ్యాయులు చొరవ చూపి విద్యార్థులను పరీక్షకు సిద్ధం చేస్తే మరింత మందికి ప్రయోజనం కలుగుతుంది. ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు అందేలా టీచర్లు ప్రోత్సహించాలి. దీంతో విద్యార్థులు లబ్ధి పొందుతారు. అన్ని పాఠశాలల్లో టీచర్లు ఈ విధంగా కృషి చేయాలి. – దుర్గాప్రసాద్, డీఈవో ఈ చిత్రంలో కనిపిస్తున్న వేల్పూర్ మండలం మోతె ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ ప్రతిభా ఉపకార వేతనాని(ఎన్ఎంఎంఎస్)కి ఎంపికయ్యారు. ఈ పాఠశాల ఉపాధ్యాయులు చొరవ చూపి విద్యార్థులతో దర ఖాస్తులు చేయించి పరీక్షలో విజయం సాధించే విధంగా శిక్షణ ఇస్తున్నారు. దీంతో ప్రతిసారి ఈ పాఠశాల నుంచి విద్యార్థులు స్కాలర్షిప్కు ఎంపిక అవుతున్నారు. -
ఆర్టీసీ డ్రైవర్ రాములుకు సజ్జనార్ అభినందన!
జగిత్యాల: ఆర్టీసీ డ్రైవర్ రాములును ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సు కిందపడి ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించగా, డ్రైవర్ రాములు వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. ఈ సంఘటనలో ఆమెకు ప్రాణాప్రాయం తప్పింది. గాయాలతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న ఎండీ సజ్జనార్.. డ్రైవర్‌ను అభినందించారు. ‘చాకచక్యం, అప్రమత్తతతో నిండు ప్రాణం నిలిచింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ మహిళ ప్రా ణాలు కాపాడిన డ్రైవర్ రాములుకు అభినందనలు’ అని సజ్జనార్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సమయస్పూర్తితో వ్యవహారించి ఓ మహిళ ప్రాణాలు కాపాడిన మెట్పల్లి డిపో డ్రైవర్ పి.రాములుకు అభినందనలు. డ్రైవర్ చాకచాక్యం, అప్రమత్తత వల్ల ఓ నిండు ప్రాణం నిలిచింది. మెట్పల్లిలో జగిత్యాలకు వైపునకు వెళ్తొన్న బస్ కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ మహిళ యత్నించింది. బస్ కదలిక గమనించిన… pic.twitter.com/fylJs7zsH5 — V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 21, 2023 -
నేను దేవుడిని.. గుడి కట్టించండి! రోడ్డు వెంట దిమ్మె కింద వెలిశాను
ఖమ్మం: నేను దేవుడిని... నాకు గుడి కట్టించండి... రోడ్డు వెంట దిమ్మె కింద వెలిశాను అంటూ ఓ బాలుడు పూనకంతో చెప్పడం, ఆయన ఓ పార్టీకి చెందిన దిమ్మెను అర్ధరాత్రి పగలగొట్టేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకోవడంతో నేలకొండపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు... మండల కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన బాలుడు బుధవారం అర్ధరాత్రి పూనకంతో ఊగిపోతూ ఓ పార్టీ నిర్మించిన దిమ్మె కింద వెలిసినందున గుడి కట్టాలని చెప్పాడు. దీంతో కుటుంబీకులు దిమ్మె పగలగొట్టి పసుపు, కుంకుమ చల్లుతుండగా స్థానికులు అడ్డగించారు. ఇలా గొడవ పెరగడంతో బాలుడి కుటుంబం ఇంట్లోకి వెళ్లిపోయింది. ఈమేరకు గురువారం ఉదయం గ్రామపెద్దలు, స్థానికులు కలిసి వారిని నిలదీయగా వివాదం ముదురుతుండడంతో పోలీసులు చేరుకుని ఇరువర్గాలకు చెదరగొట్టారు.