News
-
108కు దారి కష్టాలు!
ఆదిలాబాద్: జిల్లాలోని పలు రహదారులు చినుకుపడితే చిత్తడిగా మారుతున్నాయి. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు కూడా వెళ్లలేని స్థితికి చేరుతున్నాయి. వైద్యసేవలు అవసరమైనపుడు అంబులెన్స్‌లు గ్రామానికి రాక పేషెంట్లు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా నిండు గర్భిణులు పడుతున్న పాట్లు వర్ణనాతీతం.. గురువారం జిల్లాలో రెండు చోట్ల జరిగిన ఈ ఘటనలే ఇందుకు నిదర్శనం.. బురదలో చిక్కుకున్న 108 అంబులెన్స్ నేరడిగొండ మండలంలోని శంకరాపూర్ గ్రామానికి చెందిన పూజకు గురువారం పురిటినొప్పులు వచ్చాయి. ఆమె కుటుంబీకులు 108కు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న 108 వాహనం పూజను ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో రోడ్డుపై బురదలో చిక్కుకుంది. గ్రామానికి చెందిన యువకులు బురదలోంచి అంబులెన్స్‌ను తోసి రోడ్డుపైకి చేర్చారు. వెంటనే నిర్మల్ ఆస్పత్రికి పూజను తరలించారు. అర కిలోమీటర్ నడిచిన నిండు గర్భిణి మండలంలోని అంకాపూర్ పంచాయతీ పరిధి చిన్న మారుతిగూడకు చెందిన ఆత్రం సావిత్రీబాయికి గురువారం పురుటి నొప్పులు వచ్చాయి. రోడ్డు సరిగా లేకపోవడంతో 108 వాహనం ఊరిలోకి రాని పరిస్థతి. పైగా ఓ వైపు వర్షం కురుస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ నిండు గర్భిణిని ఆమె కుటుంబీకులు 500 మీటర్ల బురదరోడ్డు, పంట చేన్ల మీదుగా నడిపించుకుంటూ బీటీ రోడ్డుకు చేరుకున్నారు. అక్కడికి వచ్చిన 108 అంబులెన్స్‌లో ఆమెను ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
కూల్చేయండి..! లేదంటే మేమే కూల్చేస్తాం..!!
కరీంనగర్: ‘ఇందు మూలంగా మీకు తెలియచేయునది ఏమనగా.. మీ భవనం శిథిలావస్థలో ప్రమాదకరంగా ఉన్నదని గుర్తించడమైనది. కావున ఇంటిలో నివసించే వాళ్లు తక్షణమే ఖాళీ చేసి.. ఇల్లును కూల్చుకోమని.. మరమ్మతులు చేసుకోమని హెచ్చరించనైనది. లేని యెడల సెక్షన్ 182, మున్సిపల్ చట్టం 2019 ప్రకారం కూల్చివేసి చట్టరీత్యా చర్యలు తీసుకోబడును.’ ఇది వర్షాలకు కూలిపోయే ప్రమాదం ఉన్న ఇళ్లకు నగరపాలకసంస్థ అంటిస్తున్న హెచ్చరిక నోటీ సు. తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలోని శిథిలావస్థలో (కూలడానికి సిద్ధంగా) ఉన్న ఇళ్లపై నగరపాలకసంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. పురాతన నిర్మాణాలతో ప్రమాదాలు పొంచి ఉన్నందున ముందు జాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేస్తోంది. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేసుకోవాలని లేదంటే మరమ్మతులు చేసుకోవాలని నోటీసులు జారీ చేస్తోంది. 57 ఇళ్లకు హెచ్చరిక నోటీసు వర్షాలతో కూలే ప్రమాదం ఉన్న ఇళ్లను మూడురోజులుగా గుర్తించే పనిలో నగరపాలకసంస్థ అధికా రులు బిజీగా ఉన్నారు. గురువారం నాటికి ఇలాంటి పడిపోయే 57 ఇళ్లను టౌన్‌ప్లానింగ్ అధికారులు గుర్తించారు. యజమానులకు నోటీసులు జారీ చేశా రు. కార్ఖానగడ్డ, సాయినగర్ తదితర ప్రాంతాల్లో గుర్తించిన ఇండ్లను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తాత్కాలికంగా బసకోసం తరలాలని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. వర్షాలకు కూలే ప్రమాదం ఉండడంతో ముందుగానే ఇండ్లను స్వచ్ఛందంగా కూల్చుకోవాలని, మరమ్మతులు చేసుకోవాలని సూచించారు. స్పెషల్ టీమ్స్ ఆన్ డ్యూటీ మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అప్రమత్తమైన నగరపాలకసంస్థ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడం తెలిసిందే. ఎనిమిది గంటలకు ఒక బృందం చొప్పున మూడు విడుతలుగా 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయి. నగరంలో ఎక్కడ వర్షపు నీళ్లు నిలిచినా, డ్రైనేజీలు పూడుకుపోయినా, చెట్లు విరిగి పడిపోయినా ఈబృందాలు ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాయి. కట్టరాంపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో విరిగిన చెట్లను రెస్క్యూ టీం గురువారం తొలగించింది. నగరంలోని ప్రధాన రహదారుల నుంచి డ్రైనేజీలకు వెళ్లే హోల్స్ మట్టి, చెత్తతో మూసుకుపోగా సిబ్బంది తొలగించారు. రోడ్లు, పల్లపు ప్రాంతాల్లో నిలుస్తున్న నీళ్లను డ్రైనేజీలకు వెళ్లేలా మళ్లిస్తున్నారు. ప్రజల రక్షణే ముఖ్యం.. వర్షాలు కురుస్తున్న సమయంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు తొలగించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాంటి గృహ యజమానులకు నచ్చచెప్పి తొలగిస్తాం. పురాతన ఇండ్ల సమాచారాన్ని అధికారులకు ఇవ్వాలి. రెస్క్యూ టీం 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సహకరించాలి. – మేయర్ యాదగిరి సునీల్‌రావు -
ప్రకృతే ‘ప్రీతి’పాత్రం
కరీంనగర్: తన చుట్టూ ఉన్న ప్రకృతి, జీవరాశుల గురించే అద్భుతమైన కవితలు రాస్తున్న కరీంనగర్‌కు చెందిన ప్రీతి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ నోబల్ అవార్డుకు ఎంపికైంది. ఇండియన్ నోబల్ సోసైటీ కౌన్సిల్ ద్వారా బుధవారం అవార్డును స్వీకరించింది. జగిత్యాలలో జన్మించిన ప్రీతి తండ్రి విజయకుమార్ ఎస్బీఐలో బ్యాంక్ ఉద్యోగి కాగా తల్లి సౌజన్య గృహణి. ప్రీతి ఇంటర్ సమయంలో కరీంనగర్‌లోని బ్యాంక్‌కాలనీలో స్థిరపడ్డారు. స్కూల్ సమయంలో తన చుట్టూచూస్తున్న ప్రకృతిపై కవితలు రాయడం ప్రారంభించింది. తరువాత ఫేస్బుక్లో, అనంతరం పుస్తకాలు రాసి ఇండియాతో పాటు మలేషియా, సింగపూర్, బంగ్లాదేశ్ కాిపీరైట్స్ సంపాదించింది. 2019లో నెకెడ్‌లవ్, 2021లో సోలిటస్‌సోల్స్ అనే కవితల సంపుటిని సొంతంగా రాసి విడుదల చేసింది. 2020లో పెటెల్స్ అనే కవిత పుస్తకం రాయడంలో తన సహకారం అందించింది. పలు దేశాల్లో తన పుస్తకాలు అమ్మకాలు జరిగాయి. ప్రీతి రచనలు హైదరాబాద్‌లోని రైట్‌క్లబ్‌లో రెండో బహుమతి సాధించగా 2021లో ఢిల్లీలోని బుక్ ఫెయిర్‌కు ఎంపికై ంది. అమెరికాలోని పోయమ్‌హంటర్‌తో పాటు హెలో పొయోట్రీలలో ఆన్లైన్ ద్వారా పంపించి మంచి ప్రతిభ కనిబరించి వారి నుంచి ప్రశంసలు అందుకుంది. తాను రాసిన మూడు కవిత సంపుటాలకు మూడు ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. -
నేను తప్పు చేయలేదని చెప్పండి!
నిజామాబాద్: తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తమని చెప్పాలని ఓ హెచ్ఎం తన బడిలోని ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తున్నారు. తనపై చర్యలు తీసుకోకుకుండా అడ్డుకోవాలని వారిని డీఈవో కార్యాలయం చుట్టు తిప్పుతున్నారు. ఇందల్వాయి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాల హెచ్ఎంపై వచ్చిన ఫిర్యాదులపై ఇటీవల విద్యాశాఖ అధికారు లు విచారణ చేపట్టారు. విచారణలో సదరు హెచ్ఎం నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయుల కు వేతనాలు మంజూరు చేసినట్లు తేలింది. అతడి పై చర్యలు తీసుకోవడానికి జిల్లా అధికారులు సిద్ధమయ్యారు. దీంతో ఆయన కొన్ని రోజులుగా జిల్లా విద్యాశాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడు. తన పాఠశాలకు చెందిన పది మంది టీచర్లను వెంటబెట్టుకొని తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, తనకు సహకరించాలంటూ ఉపాధ్యాయులపై ఒత్తిడి తీసుకు వస్తున్నాడు. బడి వదిలేసి అందరు టీచర్లను తన వెంట తిప్పుకోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళ టీచర్లకు సైతం ఫోన్లు చేస్తూ తాను చెప్పిన చోటుకు రావాలంటూ హుకుం జారీ చేస్తున్నాడు. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై డీఈవోకు ఫిర్యాదు చేసేందుకు ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. సదరు హెచ్ఎం గతంలో మరో ప్రాంతంలో పని చేసినప్పుడు కూడా మహిళా ఉపాధ్యాయులను పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఉన్నాయి. అంతేగాక జిల్లా విద్యాశాఖ, మండల విద్యాశాఖ అధికారులు చేపట్టే సమావేశాలకు గైర్హాజరు అవడం, వారి ఆదేశాలను పాటించకపోవడం అనే ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎం వేధింపులపై ఉపాధ్యాయులు ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. -
గూడ్స్ రైలు నుంచి విడిపోయిన బోగీలు
మహబూబ్‌నగర్: రన్నింగ్‌లో ఉన్న గూడ్స్ రైలు నుంచి బోగీలు విడిపోయిన సంఘటన వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలోని ఆరేపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం కర్నూలు వైపు నుంచి సికింద్రాబాద్ వైపు ఓ గూడ్స్ రైలు వెళుతుండగా 11.15గంటల సమయంలో దానికి సంబంధించిన బోగీలు విడిపోయాయి. ఇది గమనించకపోవడంతో ఇంజన్ ఇంచార్జ్ రైలును అలాగే ముందుకు తీసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన గూడ్స్‌రైలు గార్డు వాకీ టాకీ ద్వారా లోకో పైలెట్‌కు సమాచారం అందించడంతో అప్రమత్తమయ్యారు. సుమారు నాలుగు కిలోమీటర్ల వరకు గూడ్స్ రైలు ముందుకు వెళ్లిపోయింది. వెంటనే ఇంజన్‌ను ట్రాక్‌పై వెనక్కి తీసుకొచ్చి బోగీలను జోడించుకుని 20 నిమిషాల్లో మళ్లీ ముందుకు బయల్దేరింది. ఘటన జరిగిన సమయంలో గుంటూరు, తుంగభద్ర రైళ్లు రావాల్సి ఉండగా.. ముందస్తు సమాచారంతో వాటిని కాసేపు నిలిపివేశారు. బోగీలకు మధ్య ఉన్న హెయిర్పంపు కప్ లింగ్ ఊడిపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. -
ప్రమాద స్థాయిలో.. భద్రాద్రి గోదావరి!
భద్రాచలం: తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. దీంతో భద్రాచలం వద్ద గురువారం మధ్యాహ్నమే నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కలెక్టర్ ఎ.ప్రియాంక వరద తీవ్రత, సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పొంగి పొర్లుతున్న ఉపనదులు.. ఉప నదులైన ప్రాణహిత, ఇంద్రావతి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పెరుగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ నుంచి బుధవారం 5.20 లక్షల క్యూసెక్కులు, గురువారం మధ్యాహ్నం 6.20 లక్షల క్యూసెక్కుల గరిష్ట వరదను దిగువకు వదిలారు. దీనికి ఇంద్రావతి నుంచి వస్తున్న సుమారు నాలుగు లక్షల క్యూసెక్కుల జల ప్రవాహం జతవుతోంది. దీంతో భద్రాచలం వద్ద నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజాము వరకు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి అయిన 48 అడుగులకు చేరుకోవచ్చని అధికారుల అంచనా. ప్రవాహం ఇలాగే కొనసాగితే నేటి సాయంత్రానికి 53 అడుగులకు చేరి మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉంటేనే నష్ట నివారణ గోదావరి నీటిమట్టం గతేడాది అత్యధికంగా 71.3 అడుగులకు చేరి బీభత్సం సృష్టించడంతో.. అధికారులు ఈ ఏడాది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జూలై ప్రారంభంలోనే జిల్లా, డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించి మండల, డివిజన్ స్థాయి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మూడో ప్రమాద హెచ్చరిక దాటితే ఏజెన్సీలోని పలు గ్రామాలు ముంపునకు గురవుతాయి. భద్రాచలం నుంచి ఇతర మండలాలకు రాకపోకలు స్తంభిస్తాయి. ప్రధానంగా దుమ్ముగూడెం మండలం తూరుబాక, రేగుపల్లి, నడికుడి, గంగోలు, బైరాగులపాడు గ్రామాల వద్ద, చర్ల మండలం కుదునూరు, సుబ్బంపేట గ్రామాల వద్ద ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరి రాకపోకలు నిలిచిపోతాయి. దీంతో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు, నెల్లిపాక, కూనవరం మండలాలకు సైతం పూర్తిగా రవాణా స్తంభిస్తుంది. పునరావాస శిబిరాలు సిద్ధం వరద తీవ్రత పెరిగితే బాధితులను తరలించేందుకు ముందుగానే పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. మండలానికో ప్రత్యేక అధికారికి బాధ్యతలు అప్పగించడంతో పాటు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. నిత్యావసర సరుకులకు ఇబ్బంది లేకుండా బఫర్ స్టాక్ ఉంచారు. ప్రజలను తరలించేందుకు ట్రాక్టర్లు, జేసీబీలు, లైఫ్ జాకెట్లు, పడవలను సిద్ధంగా ఉంచారు. నేడు మంత్రి పువ్వాడ రాక మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. శుక్రవారం ఆ స్థాయికి వరద వచ్చే అవకాశం ఉండటంతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ భద్రాచలంలో మకాం వేయనున్నారు. వరద తగ్గుముఖం పట్టే వరకు ఆయన ఇక్కడే ఉంటారు. మంత్రితో పాటు ఇటీవల బదిలీపై వెళ్లిన కలెక్టర్ అనుదీప్ సైతం ప్రత్యేక సేవలు అందించేందుకు ఇక్కడికి వస్తున్నారు. గతేడాది 71 అడుగుల స్థాయికి వరద వచ్చినా, ప్రాణ నష్టం జరగకుండా వీరిద్దరూ పక్కా ప్రణాళికతో పని చేశారు. దీంతో ఈసారి వరద సహాయ కార్యక్రమాల కోసం మరోసారి భద్రాచలం వస్తున్నారు. -
తస్మాత్.. జాగ్రత్త !
హైదరాబాద్: నగరంలో రానున్న రెండు మూడు రోజుల పాటు భారీ వర్ష సూచనలున్నందున ఎలాంటి పరిస్థితులెదురైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా ప్రాణనష్టం జరగకుండా ఉండాలనే ఏకైక లక్ష్యంతో పని చేయాలని ఆదేశించారు. బుధవారం నానక్‌రామ్‌గూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో జీహెచ్ఎంసీ, పురపాలకశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. జలమండలి, విద్యుత్, రెవెన్యూ, ట్రాఫిక్ పోలీస్ తదితర అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో జీహెచ్ఎంసీ పని చేయాలని ఆయన సూచించారు. సంసిద్ధంగా ఉన్నాం: అధికారులు వర్షాకాల ప్రణాళికలో భాగంగా అన్ని ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉన్నామని జీహెచ్ఎంసీ అధికారులు మంత్రికి తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం కాకుండా డీవాటరింగ్ పంపులు, సిబ్బంది అందుబాటులో ఉంచామన్నారు. ఎస్ఎన్డీపీఓ భాగంగా ఇప్పటి వరకు జరిగిన పనులతో వరదప్రభావిత ప్రాంతాల్లో ఈ సంవత్సరం ఇబ్బందులుండవనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం మెరుగవ్వాలి.. పారిశుద్ధ్య నిర్వహణపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. గతంలో పోల్చుకుంటే మెరుగైనప్పటికీ, దీంతోనే సంతృప్తి చెందకుండా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. నగరం వేగంగా విస్తరిస్తుండటం.. జనాభా పెరుగుతుండటంతో చెత్త ఉత్పత్తి కూడా పెరుగుతోందని, అందుకనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణా ప్రణాళికలను నిర్దేశించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ పాల్గొన్నారు. -
దొంగలు దొరికారు !
వికారాబాద్: పనిచేసిన యజమాని ఇంటికే కన్నం వేశాడు ఓ వ్యక్తి.. ఇంట్లో భారీగా నగదు ఉందనే పక్కా సమాచారంతో రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డాడు. ఇటీవల తాండూరు పట్టణంలో జరిగిన చోరీ కేసును పోలీసులు 72 గంటల్లో ఛేదించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రూ.19లక్షలను రికవరీ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. బుధవారం ఎస్పీ కోటిరెడ్డి తాండూరు పట్టణ పోలీసు స్టేషన్లో డీఎస్పీ శేఖర్ గౌడ్, పట్టణ సీఐ రాజేందర్ రెడ్డితో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. పట్టణానికి చెందిన వ్యాపారి ఎండీ వాజీద్ ఇటీవల ప్లాట్ విక్రయించగా రూ. 20 లక్షలు వచ్చాయి. ఈ మొత్తాన్ని ఇంట్లో పెట్టి ఈ నెల 14న హైదరాబాద్‌లో బంధువుల వివాహానికి వెళ్లాడు. తరువాతి రోజు ఇంట్లో చోరీ జరిగింది. రూ. 20లక్షలు దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. తెలిసిన వ్యక్తి పనే.. వాజీద్ వద్ద అబూబాకర్ ఖురేషి అనే వ్యక్తి గతంలో పనిచేశాడు. ఇంట్లో డబ్బు ఉందన్న సమాచారంతో దొంగతానికి ప్లాన్ చేశాడు. తన పెద్దమ్మ కొడుకు అబూ సోఫియాన్ ఖురేషికి విషయాన్ని చెప్పాడు. అదే కాలనీలో ఉంటున్న ఖలీల్, తౌసిఫ్, దీపక్ అలియాస్ కిట్టుతో కలసి ప్లాన్ వేశాడు. ఈ నెల 15న రాత్రి అబూబాకర్, ఖలీల్‌లు రాడ్‌తో తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. మిగిలిన ముగ్గురు బయటనే ఉండి పరిసరాలను గమనిస్తూ ఉన్నారు. బీరువాలో ఉన్న రూ. 20 లక్షలను ఎత్తుకెళ్లారు. అందులో రూ.లక్షను మొదట అందరూ పంచుకున్నారు. మిగిలిన రూ. 19 లక్షలను యాదిరెడ్డి చౌక్ సమీపంలోని ఓ హోటల్ వద్ద ఉన్న చెత్తకుప్పలో దాచి పెట్టారు. తరువాత వచ్చి నగదును తీసుకెళ్లి పంచుకుందామనుకున్నారు. సీసీ కెమెరాలే పట్టించాయి బాధితుడి ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను, పలు ముఖ్య కూడళ్లలోని కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అయితే మాణిక్ నగర్ వద్ద ఉన్న కెమెరాలో అబూబాకర్ ఖురేషి అనుమానాస్పద కదలికలను పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ చేసింది ఒప్పుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు అబూ సోఫియాన్ ఖురేషిని అరెస్టు చేశామని, మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. ఈ కేసు ఛేదనకు సీసీ కెమెరాలు ముఖ్య భూమిక పోషించాయన్నారు. 72 గంటల్లోనే నిందితుల అరెస్టులో కీలకపాత్ర వహించిన కానిస్టేబుళ్లు అమ్జద్, శివ, సాయికుమార్, షబీల్అహ్మద్లను ఎస్పీ అభినందించి, రివార్డు అందజేశారు. పట్టుబడిన నిందితులు ఇద్దరినీ బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. నిందితులు ఉపయోగించిన ఆటో, బైక్‌ను సీజ్ చేశామన్నారు. త్వరలోనే మిగిలిన ముగ్గురు నిందితులను కూడా పట్టుకుంటామన్నారు. -
బోరుబావి బాధితురాలి కాలికి శస్త్రచికిత్స !
నల్గొండ: మండలంలోని సోలీపేట్ గ్రామంలో మంగళవారం బోరుబావిలో కాలు ఇరుక్కొని 4గంటల పాటు నరకయాతన అనుభవించిన బాధితురాలు ఐనబోయిన పద్మ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆ గ్రామ సర్పంచ్ పూడూరి నవీన్‌గౌడ్ బుధవారం తెలిపారు. జేసీబీ సహాయంతో బోరుబావి కేసింగ్ నుంచి పద్మను బయటకు తీసి మంగళవారం రాత్రి భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషయంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. నాలుగు గంటలకు పైగా బోరు బావిలో పద్మ కాలు ఇరుక్కుపోవడంతో ఆమె కాలుకు రక్తప్రసరణ ఆగిపోయి రక్తం గడ్డకట్టుకుపోవడంతో బుధవారం కాలుకు మూడు చోట్ల వైద్యులు శస్త్రచికిత్స చేశారు. గడ్డకట్టుకుపోయిన రక్తాన్ని తొలగించి దాతల రక్తం ఎక్కిస్తున్నట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు.. బోరు బావిలో పద్మ ఇరుక్కుపోయిన స్థలాన్ని తహసీల్దార్ పద్మసుందరి ఆదేశాల మేరకు ఎంఆర్ఐ వెంకట్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. గత రెండు రోజులుగా ముసురు వర్షం పడుతుండడంతో ఘటన జరిగిన చోటు పూర్తిగా నీటితో మునిగిపోయిందని, బోరు బావిని పూర్తిగా మట్టితో పూడ్చివేయాలని భూమి యజమానికి సూచించినట్లు ఎంఆర్ఐ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఆయన వెంట వీఆర్ఏ మల్లేష్, గ్రామస్తులు ఉన్నారు. -
పథకం వెల్..! పబ్లిసిటీ డల్..!!
హనమకొండ: నిరుపేద మైనార్టీ (వితంతువులు, ఒంటరి, విడాకులు తీసుకున్నవారు) మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం.. స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇటీవల ‘కేసీఆర్ కా తోఫా ఖవాతీన్ కా భరోసా’(కేసీఆర్ మహిళల కానుక) పేరుతో నూతన పథకం ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా నియోజకవర్గానికి వంద చొప్పున ఉచిత కుట్టుమిషన్లు అందించనుంది. మైనార్టీలు అధికంగా ఉన్న నియోజకవర్గాలకు అదనంగా మరో వంద మిషన్ల చొప్పున అందించనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 నియోజకవర్గాలకు నియోజకవర్గానికి వంద చొప్పున 12 వందల మందికి కుట్టుమిషన్లు అందజేయనుంది. అలాగే, మైనార్టీలు అధికంగా ఉన్న వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు మరో వంద కుట్టుమిషన్లు పంపిణీ చేయనుంది. దరఖాస్తులకు నేటితో గడువు పూర్తి.. పథకం ప్రారంభించిన అనంతరం అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆ గడువు నేటితో(గురువారం) ముగియనుంది. అయితే పథకం బాగున్నా సరైనా ప్రచారం కల్పించడం లేదు. దీంతో పథక ఫలాలను అందుకోలేకపోతున్నామని నిరుపేద మైనార్టీ మహిళలు వాపోతున్నారు. దరఖాస్తులను స్థానిక ఎమ్మెల్యే ద్వారా అందజేయాలని మైనార్టీ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నా.. తమకు ఎలాంటి సమాచారం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు వెనక్కి పంపిస్తున్నారు. కాగా, దరఖాస్తు చేసుకోవడానికి ఆయా జిల్లాలోని మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయాల చుట్టు పేద మైనార్టీ మహిళలు ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం విధించిన గడువును వెంటనే పొడగించాలని మైనార్టీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయోమయంలో మహిళలు.. ‘కేసీఆర్ కా తోఫా ఖవాతీన్ కా భరోసా’ పథకానికి సరైనా ప్రచారం కల్పించక పోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మైనార్టీ మహిళలు దరఖాస్తులు చేసుకోలేదని తెలుస్తోంది. ఈ పథకం స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా అమలు చేయాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేల ద్వారా ఈనెల 20 వతేదీ వరకు దరఖాస్తులు స్వీకరించి వాటిని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారుల ద్వారా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పథకం గురించి ప్రజాప్రతినిధులకే తెలియకపోవడంతో అర్హులు అయోమయానికి గురవుతున్నారు. పథకానికి అర్హతలు... ఈ పథకానికి అత్యంత నిరుపేద మైనార్టీ మహిళలు అర్హులు. (వితంతువులు, ఒంటరి, విడాకులు తీసుకున్న మహిళలు) 21 నుంచి 55 ఏళ్ల వయసు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2లక్షల లోపు ఆదాయ ఉండాలి. ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు, 5వ తరగతి విద్యార్హత, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు జతచేసి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గడువు సమీపిస్తుండడంతో రెండు రోజుల నుంచి ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లిన మైనార్టీ మహిళలు అక్కడ పడిగాపులు కాస్తున్నారు. నిరుపేద మహిళల ద్వారా దరఖాస్తులు తీసుకున్న ప్రజాప్రతినిధులు వాటిని ఈనెల 21వ తేదీ వరకు కలెక్టర్లకు అందజేయాలి. కలెక్టర్ ఈ దరఖాస్తులను పరిశీలించి ఈనెల 27తేదీ వరకు స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సమర్పించాల్సి ఉంది. గడువు పెంచి, విస్తృత ప్రచారం చేయాలి గడువు తేదీని పొడిగించాలి. పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలి. దళితబంధు మాదిరి యూనిట్లను అందించాలి. యూనిట్ కాస్ట్లను పెంచి పేదమహిళలకు స్వయం ఉపాధి అందించాలి. ఉచిత కుట్టు మిషన్ పథకం యూనిట్లను నియోజకవర్గానికి ఐదువందల చొప్పున పొడిగించాలి. – రాజ్ మహ్మద్, అధ్యక్షుడు మైనార్టీ రైట్స్ ప్రొటెక్షన్ ఫ్రంట్, ఉమ్మడి వరంగల్ -
బీఆర్ఎస్లో గౌరవం దక్కడం లేదు
కామారెడ్డి: బీఆర్ఎస్లో సరైన గౌరవం దక్కడం లేదని, స్థానిక నాయకులు పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని బీబీపేట బీఆర్ఎస్ ఎంపీటీసీ 2 కొరివి నీరజ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆమె వీడియోలో మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టిన కనీస గౌరవంగా పిలువడం లేదని, పార్టీ నేతలు చిన్నచూపు చూస్తున్నారని ఆమె వాపోయారు. ప్రొటోకాల్ ప్రకారం కూడా పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా అవ మాన పరుస్తున్నారన్నారు. బీ ఆర్ఎస్ మండల నేతల వల్లే ఇలాంటి అవమానం జరుగుతుందని పేర్కొన్నారు. ఆమె భర్త నర్సింలు వీడియోలో మాట్లాడుతూ స్థానిక పార్టీ నేతలతోనే అవమానం ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే స్పందించాలని కోరారు. -
భయం గుప్పిట్లో చదువులు..!
మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లా మద్దూరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సోమవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే పాఠశాలకు సోమవారం సెలవు కావడం, విద్యార్థులు బడిలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఒక్క చోటే కాకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎన్నో పాఠశాలలు శిథిలావస్థకు చేరి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి దాపురించింది. మంగళవారం కూడా ఎడతెరిపి లేకు ండా వాన ముసురు కురవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొన్ని పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులను మధ్యాహ్నం నుంచే ఇళ్లకు పంపించా రు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కుస్తున్న నేపథ్యంలో పాఠశాలల నిర్వహణ విషయంలో జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రమాదకరంగా.. ఉమ్మడి జిల్లాలోని 3,162 ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఇందులో కొన్ని శిథిలావస్థకు చేరిన పాఠశాలల్లో పైకప్పు పెచ్చులూడడం, నెర్రెలు రావడంతో వర్షం వచ్చిన ప్రతిసారి తరగతి గదల్లోకి వర్షపు నీరు చేరుతుంది. దీంతో కొన్నిచోట్ల పైకప్పు పెచ్చులు ఊడి పడుతుండగా.. మరికొన్నిచోట్ల భవనాలే కూలిపోతా యా అన్న ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికే పలు చోట్ల పైకప్పు పెచ్చులు ఊడిపడగా.. విద్యార్థులు గా యపడటం, త్రుటిలో ప్రాణాపాయ పరిస్థితుల నుంచి బయటపడిన సందర్భాలు లేకపోలేదు. అలాగే కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు సైతం ప్రత్యేక గదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. – మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ -
బాల్యాన్ని 'నులి'పేస్తోంది..!
ఎందుకీ పరిస్థితి: మహబూబ్‌నగర్: చిన్నారుల అనారోగ్య సమస్యలకు మూల కారణం పేగుల్లో ఏలిక పాములు, నులి, కొంకి పురుగులు సంక్రమించడమేనని వైద్యులు అంచనా వేశారు. పిల్లలు తినే ఆహారాన్ని ఈ నులిపురుగులు పొట్టలోని పేగుల నుంచి తీసుకొని అవి వృద్ధి చెందుతాయి. వీటి మూలంగా పిల్లలకు పౌషకాహార అందకుండా పోతుంది. ఫలితంగా రక్తహీనత ఏర్పడి అనారోగ్య సమస్యలు తలెత్తి శారీరకంగా, మానసికంగా వృద్ధి చెందలేకపోతారు. -
ఆడిటర్ కం డిక్టేటర్!
నిజామాబాద్: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లో ఆడిటింగ్ విభాగం అవినీతిమయంగా మారింది. వ్యవస్థలో తప్పులను సరిదిద్దాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. లోపాలను ఎత్తిచూపి వాటిని బయటకు రానివ్వకుండా ‘ముడుపు లు’ అందుకుంటున్నారు. ఇవ్వకపోతే బయపెట్టి మరీ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇందు లో ప్రధానంగా ఓ ఆడిట్ అధికారి(సీబీవో) పేరు గట్టిగా వినిపిస్తోంది. ఎంతలా అంటే శాఖతో పాటు అందులోని అధికారులను శాసించే స్థాయికి చేరా డు. నియంతలా మారి అందినకాడికి దండు కోవడమే పరమావధిగా పని చేస్తున్నాడని శాఖలో జోరు గా ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారుల అండదండలతో బదిలీ కాకుండా ఏళ్లకు ఏళ్లు ఒకే చోట తిష్ట వేయడంతో అక్రమాలకు పాల్పడే విషయంలో ఆరితేరాడని తీవ్ర విమర్శలు సైతం వస్తు న్నాయి. ఆడిటర్ ఉద్యోగంతో ఐకేపీ సిబ్బందిని బలవంతపె ట్టి ‘చిట్టీల’ దందాను నడిపిస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ‘నేనింతే’.. ‘నన్నేం చేయలేరు’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని, ఆయనతో వేగలేకపోతున్నామని బాధిత వీవోఏలు, సీసీ లు ఉన్నతాధికారులకు అంతర్గతంగా చాలాసార్లు మొరపెట్టుకున్నా ఉన్నతాధికారులు చర్యలు తీసు కోవడానికి వారు మీనమేషాలు లెక్కించడం గమనార్హం. ఫోన్‌పే, గూగుల్‌పే, దావత్‌లు.. ఐకేపీ శాఖ ద్వారా ప్రభుత్వం మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలను అందిస్తోంది. అ యితే, రుణాలందించడానికి క్షేత్రస్థాయిలో వీవోఏలు కీలకంగా పనిచేస్తారు. మహిళా సంఘాల పు స్తకాల నిర్వహణ, రికార్డులు రాయడం అంతా వీరే చూస్తారు. పుస్తకాల్లో రాసిన రికార్డులు సక్రమంగా ఉన్నాయో లేదో చూసేందుకు ప్రతి ఆర్నెళ్లు, ఏడా దికోసారి ఆడిటింగ్ చేస్తారు. ఏమైనా లోపాలు బ యటపడితే ఆడిట్ రికార్డుల్లో రాయాల్సిన బాధ్యత ఆడిటింగ్ అధికారులదే. కానీ, ఆరేడు మండలాల కు కలిపి ఆడిటర్‌గా పనిచేస్తున్న ఒక అధికారి అక్రమాలకు తెరలేపినట్లు ప్రచారం జరుగుతోంది. ఆడి ట్ వ్యవస్థను తనకు అనుకూలంగా చేసుకుని లోపాలతో వీవోఏల దగ్గర వసూళ్లకు పాల్పడినట్లు, ఇంకా పాల్పడుతున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఒక గ్రామ సమాఖ్య నుంచి రూ. 2లక్షలు అప్పుగా తీసుకున్న విషయాన్ని ఆడిట్లో చూపకుండా ఉండేందుకు సదరు వీవోఏ నుంచి రూ. లక్ష వరకు వసూలు చేసినట్లు తెలిసింది. లెక్కలు రాయలేదని మరో వీవోఏ వద్ద రూ. వేలల్లో దండుకున్నట్లు స మాచారం. వసూళ్లు చేసే క్రమంలో లిక్విడ్ క్యాష్ లే కున్నా పర్వాలేదని ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా డ బ్బులు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆడిట్లో అభ్యంతరం తెలుపకుండా తన వద్ద చిట్టీ వేయాలని బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా తాను టూర్లకు వెళితే కూడా డబ్బులు ఆశిస్తాడని, అధికారులకు తెలిసినా వారిని మచ్చిక చేసుకునేందుకు దావత్‌లు ఇచ్చి మేనేజ్ చేస్తారనే పేరు కూడా ఉంది. ‘ఆడిటర్’ బాధితుల్లో సీసీలు కూడా ఉన్నారని, వారిని చులకన చేసి మాట్లాడతారనే ఆరోపణలున్నాయి. ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న సద రు ఆడిటర్‌ను బదిలీ చేయడమో, చర్యలు తీసుకోవడమో ఏదో ఒకటి చేయాలని ఐకేపీ శాఖకు చెందిన బాధిత ఉద్యోగులు కొందరు కోరుతున్నారు. ఒకసారి హెచ్చరించా.. మహిళా సంఘాల పుస్తకాలను ఆడిట్ చేసే అధికారుల్లో ఒక ఆడిటర్‌పై గతంలో ఆరోపణలు వచ్చాయి. సదరు అధికారిని పిలిచి హెచ్చరించా. బాధిత ఉద్యోగులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. – చందర్ నాయక్, డీఆర్డీవో, నిజామాబాద్ -
బాలలపై లైంగిక దాడులను నివారిద్దాం !
నిజామాబాద్: బాలలపై లైంగిక వేధింపులు, దాడులు నిరోధించడానికి వీలుగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నదని సంస్థ చైర్పర్సన్, జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. పోక్సోచట్టంపై లఘుచిత్రం చిత్రీకరణ సందర్భంగా జిల్లాకోర్టు ఆవరణలోని న్యాయసేవ సదన్‌లో ఆమె సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సలహాదారు సాయిప్రసాద్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో పొక్సో చట్టంపై విస్తృత అవగాహన కల్పించడానికి దశ్యమాధ్యమ లఘుచిత్రం చిత్రీకరణ జరుగుతుందని వివరించారు. 18 ఏళ్ల లోపు బాలల పురోభివద్ధికి అన్ని ప్రభుత్వ, ప్రైవే టు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం తోడ్పాటు, సహకారం అందించాలని ఆమె కోరారు. నేటి ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్లు విరివిగా వినియోగిస్తు న్నారని వాటిలో లఘుచిత్రం ప్రసారం వలన ప్రజ ల్లో పోక్సోచట్టంపై చైతన్యం కలుగుతుందన్నారు. సినిమా థియేటర్లు, లోకల్ చానళ్లలో కూడా లఘుచిత్రం ప్రసారం చేయడానికి ప్రణాళికలు ఉన్నాయన్నారు. బాలలపై జరుగుతున్న లైంగిక హింసకు సంబంధించిన క్రిమినల్ కేసులను విచారించడానికి జిల్లాకోర్టు ప్రాంగణంలో ప్రత్యేక పోక్సో కోర్టు తన విధులను నిర్వహిస్తున్న విషయం జిల్లా ప్రజలకు ఎరుకనేనని ఆమె గుర్తుచేశారు. న్యాయ విచారణకు హాజరయ్యే బాధితులకు ప్రత్యేక వసతి సౌకర్యాలు ఉన్నాయని ఒక స్నేహపూర్వక వాతావరణంలో నేరన్యాయ విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. పోక్సో కేసుల్లో బాధితులకు న్యాయసేవా సంస్థ తగిన పరిహారం అందిస్తుందన్నారు. సమావేశంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ యెండల ప్రదీప్, న్యాయసేవ సంస్థ న్యాయవాదులు జగన్ మోహన్ గౌడ్, మానిక్ రాజు, సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బాలికను వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు
నిజామాబాద్: బోధన్‌లోని శక్కర్‌నగర్ చౌరస్తాలో బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సోహైల్ అనే యువకుడు బాలికను ఏడాదిన్నరగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఎవరు లేని సమయంలో బాలిక ఇంట్లోకి చొరబడ్డ యువకుడిని కుటుంబ సభ్యులు పట్టుకొని పోలీసులకు అప్పగించారని చెప్పారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా సదరు యువకుడు ఏడాదిన్నరగా వేధిస్తున్నాడని, ఎవరికి చెప్పుకున్నా అండగా నిలువలేదని బాలిక తండ్రి ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. -
బాల్యవివాహాలను అరికట్టాలి!
నారాయణపేట: బాల్యవివాహాలను అరికట్టాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యుడు దేవయ్య అన్నారు. బుధవారం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో బాలల హక్కుల పరిరక్షణ అంశాలపై ఓరియంటేషన్ కమ్ సెన్సిటిజషన్ ప్రోగ్రాం ఆన్చైల్డ్ రైట్స్‌పై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. పోక్సో కేసుల విషయంలో ఎంతో సున్నితంగా ఉండాలన్నారు. పోక్సో కేసులపై సీరియస్‌గా ఉంటుందని పీఎస్‌లలో వారికి రక్షణ కల్పించాలన్నారు. ప్రొటెక్షన్, ప్రాసిక్యూషన్ అనే అంశాలపై పోలీసులు ఫోకస్ చేయాలన్నారు. జిల్లా మ్యాపింగ్ తీసుకొని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సక్సెస్ స్టోరీపై పిల్లలకు గెట్ టు గెదర్ ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ హాస్టళ్లను చక్కగా నిర్వహించాలని ఎస్సీ అధికారికి ఆదేశించారు. అదేవిధంగా డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్ దేశ భవిష్యత్ గర్వపడేలా అధికారులు పనిచేస్తున్నట్లు తెలిపారు. పోక్సో చట్టం ద్వారా కేసులు నమోదు చేసి చార్జీషీట్ వేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. షీటీమ్స్ ద్వారా కళాశాలల్లో, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. సీడబ్ల్యూసీ చైర్మన్ అశోక్శ్యామల మాట్లాడుతూ సీడబ్ల్యూసీ కమిటీ పరిధిలో 675 కేసులు నమోదైనట్లు తెలిపారు. డీడబ్ల్యూఓ వేణుగోపాల్ మాట్లాడుతూ బాల్యవివాహాలను అరికట్టడానికి 24గంటలు పని చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు శాఖ సహాయంతో 300 మంది పిల్లలను గుర్తించి, వారిని గురుకుల పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్, స్మైల్ ప్రోగ్రాం, షీటీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వస్తున్నట్లు తెలిపారు. డీఎంహెచ్ఓ మాట్లాడూతూ బాలబాలికల ఆరోగ్య పరిస్థితులను తన సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని తెలిపారు. జిల్లాలోని 704 అంగన్వాడీ కేంద్రాల్లో 50,276 మందిలో బాలికలు 24,823 , బాలురు 25,453 ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి నివేదికలు పంపుతున్నట్లు తెలిపారు. జిల్లాలో నార్మల్ డెలవరీలలో మొదటిస్థానంలో ఉందని డీఎంహెచ్ఓ అన్నారు. టీఎస్సీపీసీఆర్ కమిటీ సభ్యులు దేవయ్య సంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులు, అధికారులు ఉన్నారు. -
వేములవాడలో కుక్కల బీభత్సం !
వేములవాడ: వేములవాడలో బుధవారం కుక్కలు రెచ్చిపోయాయి. వివిధ అవసరాల కోసం బయటకు వచ్చిన 25 మందిపై దాడి చేశాయి. గాంధీనగర్, జాతరాగ్రౌండ్, ఉప్పుగడ్డ, ముదిరాజ్వీధి ప్రాంతాల్లో దాదాపు 25 మందిని కరిచాయి. వీరంతా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. అందిరికీ యాంటీ రెబీస్ ఇంజక్షన్లు ఇచ్చి పంపించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రేగులపాటి మహేశ్‌రావు తెలిపారు. కుక్కల దాడులపై ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. -
పేదలులేని ‘పెద్ద’పల్లి
కరీంనగర్: పేదరిక నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. తాజాగా ‘జాతీయ బహుముఖ పేదరిక సూచి (ఎంపీఐ)– ఒక ప్రగతి సమీక్ష’ పేరిట నీతి ఆయోగ్ విడుదలచేసిన నివేదిక గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జాతీయస్థాయిలో నిర్వహించిన ఈసర్వేలో పలుఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా దేశంలో పేదరికం తగ్గి, ఆర్థిక అంతరాలు క్రమంగా సమసిపోతున్నాయని నివేదిక పునరుద్ఘాటించింది. నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే (ఎన్హెచ్ఎఫ్ఎస్)–4తో ఎన్హచ్ఎఫ్ఎస్–5తో పోల్చి ఈ సర్వే వివరాలను నీతి ఆయోగ్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఉమ్మడి జిల్లాలోనూ పేదరికం తగ్గింది. జగిత్యాలలో 4.77 శాతం, రాజన్న సిరిసిల్లలో 3.68 శాతం, కరీంనగర్లో 2.50 శాతం, పెద్దపల్లిలో 2.17 శాతంగా నమోదైంది. ఇందులో పెద్దపల్లి అతితక్కువ 2.17 శాతం పేదరికంతో రాష్ట్రంలో అత్యంత తక్కువ సంఖ్యలో పేదలు ఉన్న జిల్లాగా రికార్డు సృష్టించింది. జిల్లాలో అధికశాతం పారిశ్రామిక ప్రాంతం కావడం, రోడ్డు రవాణా, రైల్వే కనెక్టివిటీ, విద్యా, వైద్యం తదితర సదుపాయాల దృష్ట్యా మొదటి నుంచి పెద్దపల్లి జిల్లా ముందువరుసలో నిలిచింది. తాజాగా నీతిఆయోగ్ విడుదలచేసిన నివేదికలోనూ ఇదే విషయం పునరావృతం కావడం గమనార్హం. -
మెనూ మారినా.. భోజనం మారలే..!
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మెనూ మార్చినప్పటికీ పాఠశాలల్లో మాత్రం తీరు మారలేదు. వారికి నాసిరకం భోజనమే దిక్కవుతుంది. దీంతో విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నా రు. గతంలో పలుమార్లు చిన్నారులు ఆస్పత్రి పా లైన ఘటనలు ఉన్నా మేమింతే.. మా తీరు మారద న్న విధంగా అధికారులు, కొంత మంది ఉపాధ్యాయులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా సర్కారు బడుల్లో చదివే పేద విద్యార్థుల కు అవస్థలు తప్పడం లేదు. ఉడకని అన్నం, నీళ్లప ప్పు పెడుతున్నట్లు విద్యార్థులు పేర్కొంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమే కారణంగా తెలుస్తోంది.సంఘటనలు జరిగినప్పుడు మెమోలు ఇవ్వడం, సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం తప్పా శాశ్వ త పరిష్కారం చూపడం లేదనే విమర్శలున్నాయి. గుడ్డు మింగేస్తున్నారు.. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారానికి మూడు రోజులు కోడిగుడ్ల ను అందజేస్తోంది. ఇందు కోసం ఒక్కో గుడ్డుకు రూ.5 చొప్పున కేటాయిస్తుంది. ప్రాథమిక విద్యార్థులకు కుగింగ్ కాస్ట్ కోసం రూ.5.45, 6నుంచి 8 తరగతుల విద్యార్థులకు రూ.8.17లతో పాటు 9,10 త రగతుల విద్యార్థుల కోసం రూ.10.67లను కేటాయిస్తుంది. అయితే చాలా పాఠశాలల్లో వారానికి ఒక రోజు మాత్రమే గుడ్డు పెడుతున్నారు. మిగతా రోజుల్లో మామూలు భోజనం అందిస్తున్నారు. పర్యవేక్షణ కరువు.. అధికారుల పర్యవేక్ష లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు ఆకుకూరలు, కూరగాయలు, పప్పు, కోడిగుడ్డుతో భోజనం వండి పెట్టాల్సి ఉండగా, చాలా పాఠశాలల్లో నాసిరకం భోజనమే అందిస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు ఇంటికెళ్లి భోజనం చేస్తుండగా, మరికొంత మంది టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటున్నారు. ఎంఈవోలు రోజుకు మూడు పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉండగా, కార్యాలయానికే పరిమితం కావడంతో పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్‌లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బుధవారం కేవలం పప్పు, అన్నం మాత్రమే వడ్డించారు. కోడిగుడ్డు ఇవ్వలేదు. అలాగే కూరగాయలు, ఆకుకూరలతో భోజనం పెట్టాల్సి ఉండగా, కేవలం నీళ్ల పప్పే దిక్కయ్యింది. నార్నూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఏకలవ్య ఆదర్శ గురుకులంలో గత మార్చిలో నాసిరకం భోజనం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సమస్యతో ఆస్పత్రి పాలయ్యారు. ఇదివరకు ఆదిలాబాద్ పట్టణంలోని రూరల్ కేజీబీవీలో, అలాగే జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న భీంపూర్ కేజీబీవీలో, నేరడిగొండ కేజీబీవీలో, తాంసి మండలంలోని ఘోట్కురి పాఠశాలల్లో నాసిరకం భోజనం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయినా జిల్లాలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులకు నాసిరకం భోజనమే దిక్కవుతుంది. మెనూ ఇది.. వారం పెట్టాల్సిన భోజనం, సోమ కిచిడీ, మిక్స్డ్ వెజిటెబుల్ కర్రి, కోడిగుడ్డు, మంగళ అన్నం, పప్పు, మిక్స్డ్ వెజిటెబుల్ కర్రి, బుధ అన్నం, ఆకుకూరలతో పప్పు, మిక్స్డ్ వెజిటెబుల్ కర్రి, కోడిగుడ్డు, గురు వెజిటెబుల్ బిర్యానీ, మిక్స్డ్ వెజిటెబుల్ కర్రి, శుక్ర అన్నం, సాంబార్, మిక్స్డ్ వెజిటెబుల్ కర్రి, కోడిగుడ్డు, శని అన్నం, ఆకుకూరలు, వెజిటెబుల్ కర్రి. మెనూ ప్రకారం భోజనం పెట్టాలి పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం తప్పనిసరిగా భోజనం పెట్టాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటాం. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు మఽ ద్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించాలి. వంట గదులు శుభ్రంగా ఉంచాలి. వారానికి మూడు సార్లు కోడిగుడ్లు అందించాలి. – ప్రణీత, డీఈవో -
అనాథ వృద్ధుడిని కాపాడిన పోలీసులు
నిజామాబాద్: అటవీ ప్రాంతంలో చలనం లేకుండా పడి ఉన్న అనాథ వృద్ధుడిని కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ పోలీసులు కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం పోచారం శివారు అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వృద్ధుడు వానకు తడిసి చలనం లేకుండా పడి ఉండడాన్ని పశువుల కాపరులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై కోనారెడ్డి తన సిబ్బందితో వెళ్లాడు. వృద్ధుడిని కిలో మీటర్ దురం నుంచి చేతులపై మోసుకొచ్చి పోలీసు వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వృద్ధుడి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఎస్సై కోనారెడ్డి మాట్లాడుతూ.. రెండ్రోజుల కిందట ఈ వృద్ధుడు అటవీ ప్రాంతానికి వచ్చినట్లు స్థానికులు తెలిపారన్నారు. వృద్ధుడు వానకు తడిసి శరీరం బిగిసిపోయి ఉన్నందున వివరాలు చెప్పలేక పోయాడన్నారు. కాగా సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించి వృద్ధుడిని కాపాడిన పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు. ఎస్సైతో పాటు ఏఎస్సై రాములు, సిబ్బంది అంజి, సంజీవ్ తదితరులు ఉన్నారు. -
ఐదేళ్లుగా ఆరని అరిగోస !
జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం (సరస్వతీ) బ్యారేజీ బ్యాక్‌వాటర్‌తో ఐదేళ్లుగా సమీప ప్రాంత ప్రజలు, రైతులు ఐదేళ్లుగా అరిగోస పడుతున్నారు. పంటలు నీటమునిగి తీవ్రంగా నష్టపోతున్నారు. భారీవర్షాలతో వరద ఉధృతి పెరిగితే పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న పరిస్థితి ఉంది. రూ.50కోట్లతో కరకట్ట నిర్మాణానికి గతేడాది అధి కారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు నిధులు విడుదల కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండడంతో వరద కష్టాలను తలుచుకుంటూ ఆందోళనకు గురవుతున్నారు. కాటారం మండలం లక్ష్మిపూర్ వద్ద మానేరు వాగు వచ్చి గోదావరి నదిలో కలుస్తుంది. రెండు నదులు ఒకే చోట కలవడంతో వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రవాహ ఉధృతి విలాసాగర్, దామెరకుంట, గుండ్రాత్‌పల్లి గ్రామాల వరకు కొనసాగుతుంది. 2019లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మహదేవపూర్ మండలం అన్నారం సమీపంలోని గోదావరిపై ప్రభుత్వం సరస్వతీ బ్యారేజీ నిర్మించింది. బ్యారేజీ నిర్మాణానికి ముందు రెండు నదుల్లోని నీరు దిగువకు సులువుగా వెళ్లిపోయేది. భారీ వర్షాలు కురిసినప్పుడు మాత్రమే తీరప్రాంతాల్లో కొంత మేర నష్టం వాటిల్లేది. కానీ ప్రస్తుతం బ్యారేజీ బ్యాక్‌వాటర్‌తో ఐదేళ్లుగా పంటలు పూర్తిగా మునిగిపోతున్నాయి. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో బ్యారేజీ గేట్లు తెరవడంతో పంట పొలాల్లో ఇసుక మేటలు పెడుతున్నాయి. బ్యాక్ వాటర్ గ్రామాలను చుట్టేయడంతో దామెరకుంట, లక్ష్మిపూర్, గుండ్రాత్‌పల్లి, మల్లారం, విలాసాగర్, గంగారం గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో ఇరుక్కుపోతున్నాయి. రైతులు జూలైలో పత్తి, వరి, మిర్చి పంటలు సాగుచేస్తే ఆగస్టు, సెప్టెంబర్‌లో వచ్చే వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో రైతులు, ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ప్రతిపాదనలకే పరిమితం.. కాటారం మండలం లక్ష్మీపూర్ సమీపంలో మానేరు నది గోదావరిలో కలుస్తుండటంతో గోదావరి నీరు వెనక్కి వచ్చి మానేరుకు పోటెత్తడంతో రెండుతీరాలు తీవ్ర కోతకు గురవుతున్నాయి. ఈ కారణంతో గతేడాది దామెరకుంటను గోదావరి వరదనీరు చుట్టేసింది. మండలంలోని గంగారం, విలాసాగర్, లక్ష్మీపూర్, దామెరకుంట, గుండ్రాత్‌పల్లి తదితర గ్రామాలకు గోదావరి వరద నీటితో ముంపు నెలకొంది. ఇది గ్రహించిన ప్రభుత్వం, అధికారులు లక్ష్మీపూర్ నుంచి గంగారం వరకు తొమ్మిది కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. రూ.50 కోట్లతో ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు గతేడాది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మూడు నెలల్లో పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటివరకు పైసా నిధులు ఇవ్వకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలి.. తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని అన్నారం బ్యారేజీ బ్యాక్‌వాటర్ ముంపు ప్రభావిత ప్రాంతాల బాధితులు అధికారులను వేడుకొంటున్నారు. ప్రతి ఏటా సుమారు 800ఎకరాల పంటపొలాలను బ్యాక్‌వాటర్ ముంచేస్తుంది. అధికారులు మాత్రం వందలోపు ఎకరాలు నష్టపోతున్నట్లు నివేదిక ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ముంపు గ్రామాలైన దామెరకుంట, లక్ష్మీపూర్. గుండ్రాత్‌పల్లి గ్రామాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని కోరుతున్నారు. తమ పంట పొలాలను ప్రభుత్వం తీసుకొని నష్టపరిహారం చెల్లించడంతో పాటు తమకు పునరావాసం కల్పించి ఆదుకోవాలని వేడుకొంటున్నారు. ఈ విషయంలో ఆందోళనలు చేయడంతో పాటు కలెక్టర్‌కు వినతిపత్రాలు సైతం సమర్పించారు. అందని నష్టపరిహారం.. బ్యారేజీ బ్యాక్‌వాటర్ ద్వారా వందలాది ఎకరాల పంటపొలాలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ నష్టపరిహారం అందడం లేదు. ఐదేళ్లుగా ప్రతీ ఏడాది పెద్ద ఎత్తున పంట నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందించలేదని బాధిత రైతులు అంటున్నారు. పంటలు మునిగినపుడు అధికారులు గ్రామాల్లోకి వచ్చి పంట నష్టం లెక్కలు రాసుకొని ప్రభుత్వానికి నివేదించినప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు స్పందించి ముంపు ప్రాంత ప్రజలు, రైతులకు శాశ్వత పరిష్కారం చూపించాలని పలువురు కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపించాం.. లక్ష్మీపూర్ నుంచి గంగారం వరకు కరకట్ట నిర్మాణం, గతంలో నిర్మించిన కరకట్ట పునరుద్ధరణ పనుల కోసం రూ.50కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కరకట్ట నిర్మాణ పనులు చేపడుతాం. – రవిచంద్ర, ఇరిగేషన్ డీఈఈ ఏటా మునుగుడే.. దామెరకుంట శివారులో నాకు ఎనిమిది ఎకరాల పొలం ఉంది. ప్రతి ఏడాది వరి పంట సాగు చేస్తా. వరి ఎదిగే సమయానికి బ్యాక్‌వాటర్ పంటను నిండా ముంచేస్తుంది. ఐదేళ్లుగా ఇదే పరిస్థితి. నష్టపోతున్నప్పటికీ తప్పక పంట సాగుచేయాల్సి వస్తుంది. బ్యాక్ వాటర్ సమస్య తీరితేనే మా పరిస్థితులు మారుతాయి. – రౌతు మల్లన్న, రైతు, గంగపురి కౌలుకు తీసుకొని నష్టపోతున్నా.. నాకు స్వంత భూమి లేదు. వ్యవసాయమే నా కుటుంబానికి దిక్కు. దీంతో ఐదెకరాల చేను కౌలుకు తీసుకొని మూడేళ్లుగా సాగుచేస్తున్న. ప్రతి ఏడాది బ్యాక్‌వాటర్ పత్తిపంటను దెబ్బతీస్తుంది. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు, కౌలు డబ్బులు కలుపుకొని రెండు, మూడు లక్షల వరకు అప్పు అవుతున్నా. – అంకయ్య, రైతు, గుండ్రాత్‌పల్లి -
20న నులిపురుగుల నిర్మూలన దినోత్సవం
వరంగల్: జిల్లాలో ఈ నెల 20న నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా 1,91,380 మందికి ఆల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. 1–19 ఏళ్లలోపు వారందరికీ వారి అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మాత్రలు వేస్తారని తెలిపా రు. 20న తప్పినవారికి 27వ తేదీన వేయనున్నట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో అల్బెండజోల్ మాత్రలు వేసుకోవడానికి ముందుకు రారని, అలాంటి సంస్థలను గుర్తించి వారి యాజమాన్యాలను వైద్యాధికారులు, సిబ్బంది హెచ్చరించాలని సూచించారు. నులిపురుగులతో శారీరక, మానసిక ఎదుగుదల మందగిస్తుందని తెలిపారు. రక్తహీనత, చదువుపై శ్రద్ధ తగ్గటం, చిరాకు, మతిమరుపు లక్షణాలు ఉంటాయని తెలిపారు. పిల్లలు భోజనం చేసిన తర్వాత మాత్రలు వేసుకోవాలని, 1–2 సంవత్సరాల బాలబాలికలకు సగం ట్యాబ్లెట్‌ను నీటిలో కలిపి అందించాలన్నారు. ఆ పై వయస్సు ఉన్న వారికి పూర్తి ట్యాబ్లెట్ వేయాలని చెప్పారు. ఈ మాత్రలు వేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని, ఒక వేళ వస్తే తమ సిబ్బంది వైద్య సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటారన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ చల్లా మధుసూదన్, డిప్యూటీ డెమో రాజ్‌కుమార్, హెచ్ఈఓ విద్యాసాగర్‌రెడ్డి తదితరు లు పాల్గొన్నారు. -
విద్యార్థి భవితకు మొదటిమెట్టు..!
నిజామాబాద్: విద్యార్థుల్లో గుణాత్మక విద్యను పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఏడాది మళ్లీ తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. గతేడాది నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు కొంత మెరుగయ్యారు. దీంతో అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా తొలిమెట్టు కార్యక్రమా న్ని నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి విద్యా శాఖ ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు గుణాత్మక విద్యను పెంపొందించడం తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడం, గణితంలో కనీస అభ్యసన సామర్థ్యాలు పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. మండలానికి ఆరుగురు టీచర్లకు శిక్షణ జిల్లాలో తొలిమెట్టు కార్యక్రమానికి సంబంధించి ఈ నెల 21, 22, 24 తేదీల్లో జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మండలం నుంచి ఆరుగురు ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం మండల స్థాయిలో తెలుగు, గణితం, ఆంగ్లం బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. అనంతరం తొలిమెట్టు కార్యక్రమాన్ని పాఠశాల స్థాయిలో ఆగస్టు నుంచి ప్రారంభించనున్నారు. జిల్లాలో డీఈవో పరిధిలో 666 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 192 మంది ఉపాధ్యాయులు ఆయా బడుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. తొలిమెట్టుతో పాటు ఎఫ్‌ఎల్‌ఎం కార్యక్రమాన్ని కూడా ఇది వారికే అమలు చేశారు. ఇందులో విద్యార్థుల సామర్థ్యాలు గుర్తించిన అధికారులు రెండోసారి తొలిమెట్టు కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చదవడం, రాయడం నేర్పిస్తారు. వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించి చదువులో ముందుకు వెళ్లేలా ప్రోత్సహించారు. ఉన్నత విద్యార్థులకు ‘లిప్’ ఆరు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్(లిప్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో దీనిని సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అమలు చేయనున్నారు. విద్యార్థులకు మాతృభాషతో పాటు ద్వితీయ భాష, తృతీయ భాషలో స్పష్టంగా మాట్లాడడం, తప్పులు లేకుండా రాయడం నేర్పడం దీని ఉద్దేశం. స్వీయ సామర్థ్యాల పెంపు, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాల్లో విద్యార్థులు ప్రతిభ చాటేలా కార్యక్రమాన్ని రూపొందించారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగం గతేడాది తొలిమెట్టు కార్యక్రమం నిర్వహించారు. దీంతో ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యా లు మెరుగయ్యాయి. ప్రస్తు తం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడంతో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. – వెనిగళ్ల సురేశ్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పకడ్బందీగా చేపడుతాం ఈ ఏడాది తొలిమెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతాం. ఇప్పటికే రాష్ట్ర స్థా యిలో రిసోర్స్సర్సన్లు శిక్ష ణ తీసుకున్నారు. 21 నుంచి జిల్లాలో శిక్షణ కార్యక్రమాలు చేపడతాం. విద్యార్థుల్లో గుణాత్మక విద్యను పెంపొందించే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. – దుర్గాప్రసాద్, డీఈవో -
జిల్లాలో జోరుగా హైటెక్ వ్యభిచారం ! యువకులకు నచ్చితే రేటు నిర్ణయం !!
జగిత్యాల క్రైం: జిల్లాలో హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతోంది. అందమైన యువతులు, మహిళల ఫొటోలను వాట్సాప్‌లో స్టేటస్‌గా పెడుతున్న దళారులు.. యువకులను ఆకర్షిస్తున్నారు. కేవలం తమకు పరిచయం ఉన్నవారితోనే వాట్సాప్ గ్రూపులు తయారు చేస్తూ వ్యభిచారం దందా విస్తరిస్తున్నారు. పట్టణ శివారు ప్రాంతాలు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లను అడ్డాలుగా చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంతోపాటు, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి, మల్యాల, కొండగట్టు తదితర ప్రాంతాల్లో దందా జోరుగా సాగుతోందనే సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గత జనవరి నుంచి ఇప్పటివరకు ఏడుగురు నిర్వాహకులపై మూడు కేసులు నమోదు చేశారు. అయినా, వ్యభిచారం ఆగడంలేదు. ప్రముఖులకూ సరఫరా.. ► దళారులు అందమైన యువతులను ఎరగా చూపుతూ యువకులను ఆకర్షిస్తున్నారు. కొందరు ప్రముఖులకు కూడా సరఫరా చేస్తున్నారు. ఇలాంటివారు కోరుకుంటే ఫామ్‌హౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లు, అత్యాధునిక వసతులు కలిగిన భవనాలు ఎంచుకుంటున్నారు. ఖరీదైన వాహనాల్లో యువతలను తరలిస్తున్నారు. యువతులు అడిగినంత సొమ్ము చెల్లిస్తూ వ్యాపారం విస్తరిస్తున్నారు. నెల టర్నోవర్ రూ.20లక్షల పైనే.. జిల్లాలో జరిగే హైటెక్ వ్యభిచారంలో సుమారు 150మంది దళారులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వీరు నిజామాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, వైజాగ్, వరంగల్, హైదరాబాద్, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లోంచి యువతులను రప్పిస్తున్నారు. తమతో టచ్‌లో ఉండే యువకులకు వీరి ఫొటోలను వాట్సాప్ స్టేటస్‌లో పెడుతూ, వాట్సాప్‌లో పంపిస్తూ ఆకర్షిస్తున్నారు. యువకులకు నచ్చితే.. ఆ ఫొటోలోని యువతికి రేటు నిర్ణయిస్తున్నారు. ఇళ్లలో అయితే రూ.1,500 నుంచి రూ.2,000 వరకు, బయటకు తీసుకెళ్తే రూ.5వేల నుంచి రూ.6వేల వరకు రేట్ కుదుర్చుకుంటున్నారు. ఈ సొమ్మును ఫోన్‌పే, గూగుల్‌పే తదితర డిజిటల్ పద్ధతుల్లో చెల్లింపులు చేసుకుంటున్నారు. మరోవైపు.. జిల్లాలో సుమారు వంద మంది వరకు వ్యభిచార నిర్వాహకులు ఉన్నట్లు తెలిసింది. వీరితోనే దళారులు దందా సాగిస్తున్నారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా ప్రతినెలా సుమారు రూ.20లక్షల వరకు టర్నోవర్ సాగుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిఘా పటిష్టం చేశాం ► జిల్లాలో వ్యభిచారాన్ని అరికట్టేందుకు నిఘా పటిష్టం చేశాం. దందా ప్రాంతాల్లో పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇళ్లలో దాడులు చేస్తున్నారు. ఇప్పటివరకు నిర్వాహకులను అరెస్టు చేశాం. ఇంకా చాలామంది ఉన్నట్లు మాకు సమాచారం ఉంది. వారిని కూడా పట్టుకుంటాం. – భాస్కర్, ఎస్పీ ► జగిత్యాల శివారు అంతర్గాం రోడ్డులోని ఓ ఇంటిపై పోలీసులు సోమవారం మధ్యాహ్నం దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ, నిర్వాహకులతోపాటు ముగ్గురు యువతులను పట్టుకున్నారు. యువతులను సఖీ కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు, విటుడిని రిమాండ్‌కు తరలించారు. ► జగిత్యాల శివారు తిమ్మాపూర్ రోడ్డులో కొత్త ఇంటిని అద్దెకు తీసుకున్న ఓ మహిళ కరీంనగర్, మంచిర్యాల ప్రాంతాలకు చెందిన ఇద్దరుయువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. నిందితులను పట్టుకుని కేసు నమోదు చేశారు. ఐదు నెలల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. ► మల్యాల మండలం నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలోని ఓ ఆలయం సమీపంలోగల ఇంట్లో కొద్దిరోజులుగా వ్యభిచారం జరుగుతోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు దాడి చేయగా అప్పటికే నిందితులు తప్పించుకుని పారిపోయారు. ► నెల క్రితం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు ఉండేచోట ఓ మహిళ, ఇద్దరు యువతులు వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.