ఎగిరిపడి భూమిలో కూరుకుపోయిన బాయిలర్
ఖమ్మం: ఖమ్మం 8వ డివిజన్ పరిధి గోపాలపురం పంచాక్షరినగర్‌లోని ఓ ప్రైవేట్ మిల్క్ డెయిరీలో శనివారం పెద్ద ఎత్తున పేలుడు చోటుచేసుకుంది. ఒకేసారి భారీ శబ్దం రావడంతో స్థానికులు హడలిపోయారు. 2017లో హనుమాన్ పాల డెయిరీ పేరుతో ఏర్పాటు చేయగా, గత ఏడాది నుంచి శ్రీ సుదర్శన్ మిల్క్‌గా పేరు మార్చారు. అయితే, ఈ డెయిరీకి ఎలాంటి అనుమతి లేకపోగా, పేలుళ్ల తర్వాత వచ్చిన అధికారులు ఇక్కడ డెయిరీ నడుస్తున్న విషయమే తమకు తెలియదని పేర్కొనడం గమనార్హం.
భవనం లీజ్‌కు తీసుకుని..
2017లో ఖమ్మంకు చెందిన రజిత పేరుతో కృష్ణం రాజేశ్ పంచాక్షరీ కాలనీలో భవనాన్ని లీజ్‌కు తీసుకొని హనుమాన్ మిల్క్ ప్రొడక్ట్ పేరిట డెయిరీ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఆయన ఏడాది కిందట గుంటూరుకు చెందిన రవీందర్‌బాబుకు సబ్ లీజుకు ఇచ్చాడు. అయితే, మొదటి నుంచి ఫ్యాక్టరీ అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
కాగా, శనివారం రోజు మాదిరిగానే బాయిలర్‌లో పాలు వేస్తుండగా, ఆపరేటర్ నరేశ్ తన కుమారుడికి ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రికి వెళ్లాడు. దీంతో బాయిలర్ కింద మంట అలాగే కొనసాగుతూ ఆవిరి ఎక్కువై ఒకేసారి పెద్ద శబ్దంతో పేలింది. రెండున్నర టన్నుల సామర్థ్యం కలిగిన బాయిలర్ భారీ శబ్దంతో పేలి ఎగిరి అర కిలోమీటర్ దూరంలో పడింది. ఈ సమయాన వచ్చిన శబ్దంతో ఏంజరిగిందో తెలియక స్థానికులు భయాందోళన చెందారు. కాగా, పేలుడు ధాటికి బాయిలర్ ఉన్న ప్రాంతంలోని ప్రహరీ కుప్పకూలగా, పెచ్చులు ఎగిరి సమీప ప్రాంతాల్లో పడ్డాయి.
అనుమతి లేకుండానే నిర్వహణ..
బాయిలర్ పేలిన విషయం తెలియగానే ఖమ్మం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కిరణ్, ఫ్యాక్టరీస్ శాఖ జూనియర్ అసిస్టెంట్ అబీద్ ఘటనాస్థలానికి వచ్చారు. ప్రస్తుతం డెయిరీని సబ్ లీజ్‌కు నడుపుతున్న రవీంద్రబాబు గుంటూరు వెళ్లినట్లు తెలియగా, ఆయన వచ్చాక విచారణ చేపడుతామని తెలిపారు. ప్రస్తుతం అనుమతి లేకుండానే డెయిరీని నిర్వహిస్తున్నట్లు గుర్తించగా, శాంపిల్స్ సేకరించినట్లు చెప్పారు. అలాగే, కార్పొరేటర్ లకావత్ సైదులు పరిశీలించి వివరాలు ఆరా తీశారు.
ఫోన్ రావడంతో దక్కిన ప్రాణాలు..
ఆస్పత్రికి వెళ్లిన సూపర్‌వైజర్ నరేశ్ అక్కడి నుంచి డెయిరీకి ఫోన్ చేశారు. దీంతో అప్పటి వరకు బాయిలర్ వద్ద కట్టెలు ఎగవేస్తున్న ఇద్దరు మహిళలు కార్యాలయంలోకి వెళ్లగానే బాయిలర్ పేలింది. దీంతో రెప్పపాటు వ్యవధిలో వారిద్దరు ప్రాణాలతో బయటపడినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment