Telangana News: పోరు రసవత్తరం.. తీర్పు విలక్షణం
Sakshi News home page

TS Elections 2023: పోరు రసవత్తరం.. తీర్పు విలక్షణం

Published Wed, Oct 18 2023 1:38 AM | Last Updated on Wed, Oct 18 2023 10:48 AM

- - Sakshi

కరీంనగర్‌: కరీంనగర్‌ చైతన్యానికి ప్రతీక. చరిత్రలో ఎన్నో ఎన్నికలు చూశారు ఇక్కడి ప్రజలు. ఎన్నికలు అనగానే.. ఎత్తులు, పైఎత్తులు, రాజకీయ సమీకరణలు ఉంటాయి. ఉమ్మడి జిల్లాలో 1952లో మొదటిసారి ఎన్నికలు జరగగా.. ఇప్పటివరకు 71 ఏళ్లలో 15 సార్లు జరిగాయి. అనేక మంది రాజకీయ భవిష్యత్‌ తలకిందులుకాగా, కొందరి తలరాత మారింది. తొలి రెండు ఎన్నికల్లో పీడీఎఫ్‌ (ప్రొగ్రెసివ్‌ డెమోక్రటివ్‌ ఫ్రంట్‌) సత్తా చాటగా.. ఆరుసార్లు కాంగ్రెస్‌ ఆధిక్యాన్ని చాటింది. మూడుసార్లు టీడీపీ, నాలుగుసార్లు బీఆర్‌ఎస్‌ పైచేయి సాధించాయి.

1952: జిల్లాలో తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ 2, పీడీఎఫ్‌ 10 స్థానాల్లో విజయం సాధించాయి. పీడీఎఫ్‌ తిరుగులేని రాజకీయశక్తిగా అవతరించింది. విజేతల్లో నిజాం వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములైనవారే అధికం.

1957: ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, పీడీఎఫ్‌ పార్టీల మధ్యపోటీ తీవ్రంగా ఉండె. కాంగ్రెస్‌ 5 సీట్లు, పీడీఎఫ్‌–4, స్వతంత్రులు–3 సీట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో తొలితరం రాజకీయ నేతలు చెన్నమనేని రాజేశ్వర్‌రావు, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావులు గెలుపొంది, శాసనసభకు వెళ్లారు.

1962: ఈ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థులందరూ ఓడిపోయారు. కాంగ్రెస్‌ 8, స్వతంత్రులు 4 చోట్ల విజయం సాధించారు. పీవీ నర్సింహారావు, చెన్నమనేని రాజేశ్వర్‌రావులు విజయం సాధించి, రెండోసారి అసెంబ్లీ మెట్లు ఎక్కారు.

1967: ఈ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ హవా కొనసాగింది. కాంగ్రెస్‌ 9, స్వతంత్రులు మూడు సీట్లు సాధించారు. జగిత్యాలలో కాంగ్రెస్‌ అభ్యర్థి కాసుగంటి లక్ష్మీనర్సింహారావు ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం.

1972: కాంగ్రెస్‌ పార్టీ 7, సీపీఐ 1, స్వతంత్రులు నాలుగు స్థానాల్లో గెలిచారు. ఈ ఎన్నికల్లో పీవీ నర్సింహారావు సమీప బంధువు వొడితెల రాజేశ్వర్‌రావు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జిల్లాలో కాంగ్రెస్‌ మరోసారి ఆధిక్యాన్ని చాటుకుంది.

1978: ఈ ఎన్నికల్లో జిల్లాలో 13 అసెంబ్లీ స్థానాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్‌ 10, సీపీఐ 2, జనతా పార్టీ ఒక సీటు సాధించాయి. ఇది జనతా పార్టీకి తొలి విజయం. ఇందుర్తి నుంచి తొలిసారిగా దేశిని చినమల్లయ్య సీపీఐ అభ్యర్థిగా విజయం సాధించారు.

1983: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో జరిగిన ఎన్నికలు ఇవి. హోరాహోరీ పోరులో టీడీపీ 7, కాంగ్రెస్‌ 6 స్థానాలు దక్కించుకున్నాయి. జగిత్యాలలో జీవన్‌రెడ్డి తొలిసారి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

1985: ఇవి మధ్యంతర ఎన్నికలు. నాదెండ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో అసెంబ్లీ రద్దవడంతో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ జిల్లాలో కనుమరుగైంది. టీడీపీ 8, మిత్రపక్షాలైన సీపీఐ 2, జనతా పార్టీ 1, బీజేపీ 1 సీటు గెలుచుకున్నాయి. మెట్‌పల్లి నుంచి తొలిసారి చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

1989: ఈ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్‌ 5, టీడీపీ 2, సీపీఐ 1, బీజేపీ 1, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పుంజుకోగా.. సిరిసిల్లలో జనశక్తి నక్సలైట్లు మద్దతు ఇచ్చిన ఎన్వీ కృష్ణయ్య తొలిసారి విజయం సాధించారు.

1994: ఈ ఎన్నికల్లో టీడీపీ మళ్లీ పుంజుకుంది. కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగైంది. టీడీపీ 9, సీపీఐ 2, బీజేపీ, స్వతంత్రులు ఒక్కో స్థానం దక్కించుకున్నారు. అప్పటి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎల్‌.రమణ తొలిసారి జీవన్‌రెడ్డిపై గెలుపొందారు.

1999: హోరాహోరిగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పుంజుకుంది. కాంగ్రెస్‌ 6, టీడీపీ 5, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించాయి. టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగాయి. దీంతో మెట్‌పల్లి, పెద్దపల్లిల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.

2004: తొలిసారి టీఆర్‌ఎస్‌ బరిలోకి దిగింది. టీఆర్‌ఎస్‌ 5, కాంగ్రెస్‌ 4, టీడీపీ 2, సీపీఐ, జనతా పార్టీ ఒక్కో చోట గెలిచాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ కూటమి విజయం సాధించగా... తొలిసారి మెట్‌పల్లిలో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి కొమొరెడ్డి రామ్‌లు గెలుపొందారు.

2009: జిల్లా రాజకీయ చిత్రపటంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఈ ఎన్నికల్లో టీఆ ర్‌ఎస్‌ 4, కాంగ్రెస్‌ 3, టీడీపీ 5, స్వతంత్రులు ఒక స్థానం దక్కించుకున్నారు. రెండోసారి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగా.. టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. 2010 ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యం కనబరించింది.

2014: రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. టీఆర్‌ఎస్‌ 12 సీట్లలో గెలుపొందగా.. కాంగ్రెస్‌ ఒక సీటు దక్కించుకుంది. జిల్లా నుంచి ఈటల రాజేందర్‌, కేటీఆర్‌ మంత్రివర్గంలో ఉన్నారు.

2018: ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థులు పోటీ చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఒంటరిగానే 13 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. కాంగ్రెస్‌ పార్టీ 12 స్థానాల్లో పోటీ చేయగా.. సీపీఐ ఒక స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో రామగుండంలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ అభ్యర్థి చందర్‌, మంథనిలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎమ్మెల్యేలుగా గెలుపొందగా, మిగతా 11 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. రామగుండం నుంచి గెలుపొందిన చందర్‌ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల బీజేపీ తరఫున పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌పై గెలుపొందారు.

2023: ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు ఫుల్‌జోష్‌తో రంగంలోకి దిగుతున్నాయి. పార్టీపేరు మార్చుకున్న టీఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌గా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలో నిలిపింది. కాంగ్రెస్‌, బీజేపీలు అభ్యర్థుల జాబితా పూర్తిస్థాయిలో ప్రకటించాల్సి ఉంది. ఆయా నియోజకవర్గాలపై బీఎస్పీ కన్నేసింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ తప్పేలా లేదు. అదే సమయంలో టికెట్లు ఆశించి భంగపడ్డ అభ్యర్థులు రెబల్స్‌గా బరిలోకి దిగే అవకాశాలూ కనిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement