Sagubadi
-
మల్బరీ తోటలో.. సరికొత్త పరికరం గురించి మీకు తెలుసా!?
వ్యవసాయ పనుల్లో శారీరక శ్రమ తగ్గించే యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చిన కొద్దీ రైతులకు పని సులువు కావటంతో పాటు ఖర్చు కూడా తగ్గుతూ ఉంటుంది. పట్టు పురుగుల పెంపకంలో భాగంగా జరిగే మల్బరీ తోటలు సాగు చేసే రైతులు సాధారణంగా 28 రోజుల్లో ఒక విడత పట్టు గూళ్ల పెంపకం పని పూర్తి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మల్బరీ మొక్కల్ని పెంచి, కొమ్మల్ని కత్తిరించి వాటిని షెడ్లో పెరిగే పట్టు పురుగులకు ఆహారంగా వేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు బ్రష్ కట్టర్‌తో వ్యవసాయ కార్మికుడు కొమ్మ కత్తిరిస్తే, ఆ కొమ్మలను మరో కార్మికుడు కట్టకట్టి షెడ్డుకు చేరుస్తూ ఉంటారు. ఈ ప్రక్రియలో మూడు దశల్లో కార్మికుల అవసరం ఉంటుంది. కూలీల కొరతతో కూలి పెరిగిపోవటం వల్ల ఖర్చు పెరిగింది. కొడవళ్లతో కొమ్మ కత్తిరింపు, సేకరణ అధిక శారీరక శ్రమతో కూడిన పని కావటంతో పెరిగిన దశలో పట్టు పురుగులు అధిక మొత్తంలో మల్బరీ ఆకులు మేపాల్సి ఉంటుంది. ట్రాక్టరుకు జోడిండి వాడే పరికరం.. అయితే, గ్రామీణ ఆవిష్కర్త, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల గ్రామానికి చెందిన యువకుడు కొడిముంజ ప్రవీణ్ రూపొందించిన పరికరం ద్వారా సులువుగా, త్వరగా, తక్కువ మంది కూలీలతోనే ఏ రోజు కత్తిరించిన ఆకులను ఆ రోజు పురుగులకు మేపటం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని రైతులు చెబుతున్నారు. ప్రవీణ్ గత 12 ఏళ్లుగా రైతులకు ఉపయోగపడే పవర్ వీడర్లు, ట్రాక్టర్‌కు జోడించి ఉపయోగించే వ్యవసాయ పరికరాలను తయారు చేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పట్టుపురుగుల పెంపకందారుల సూచన మేరకు 2023 ఆగస్టులో మల్బరీ కొమ్మలు కత్తిరించే ట్రాక్టర్ అటాచ్‌మెంట్‌ను తయారు చేశారు. 3 అడుగుల దూరంలో వరుసలుగా నాటిన మల్బరీ మొక్కలను నేల నుంచి 5 అంగుళాల ఎత్తులో కత్తిరించి పక్కకు పడేసేలా దీన్ని రూపొందించారు. సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లోని నలుగురు రైతులకు ఈ పరికరాలను విక్రయించారు. పలమనేరు రైతుల సూచనలతో.. ప్రవీణ్ ఈ పరికరం గురించి పల్లెసృజన సంస్థకు తెలియజేయగా, మల్బరీ సాగు విస్తారంగా జరుగుతున్న చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంత రైతులకు ఈ పరికరాన్ని చూపించారు. కొమ్మ కత్తిరించటంతోపాటు కట్ట కట్టి పడేసేలా దీన్ని అభివృద్ధి చేస్తే కూలీల అవసరం బాగా తగ్గుతుందని రైతులు సూచించారు. ప్రవీణ్ రెండు నెలలు శ్రమించి ఈ పరికరాన్ని రైతుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయటంలో విజయం సాధించారు. నెల నెలా మల్బరీ కొమ్మ కత్తిరించడానికే కాకుండా.. ఏడాదికి, రెండేళ్లకోసారి మల్బరీ చెట్టు దుంప కొట్టడానికి కూడా ఈ పరికరం చక్కగా ఉపయోగపడుతోందని రైతులు సంతోషంగా చెబుతున్నారని ప్రవీణ్ తెలిపారు. బ్రష్ కట్టర్‌తో 8–9 గంటల్లో చేసిన పనిని తాను రూపొందించిన పరికరాన్ని ట్రాక్టర్‌కు జోడించి ఒక గంటలో పూర్తి చేయొచ్చని ప్రవీణ్ చెబుతున్నారు. 200 కిలోల బరువుండే ఈ పరికరాన్ని స్థానికంగా కొనుగోలు చేసిన ఇనుముతో తయారు చేయడానికి రూ. 1,65,000 వరకు ఖర్చయ్యింది. పెద్ద సంఖ్యలో తయారు చేస్తే 10–15% ఖర్చు తగ్గుతుందంటున్నారు ప్రవీణ్. పత్తి రైతులకూ ఉపయోగమే! మల్బరీ కొమ్మల కత్తిరింపు, సేకరణకు సంబంధించి 5–6గురు కూలీలు చేసే పనిని 2–3గురు కూలీలతోనే సులువుగా చేసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతోందని రైతులు సంతోషంగా చెబుతున్నారు. మల్బరీకే కాకుండా పత్తి తీత పూర్తయిన తర్వాత పత్తి కట్టె కొట్టడానికి, కంది కట్టె కొట్టడానికి, పశుగ్రాసం కోయడానికి కూడా ఈ పరికరం ఉపయోగపడుతుందని రైతులు చెబుతుంటే సంతోషంగా ఉంది. – కొడిముంజ ప్రవీణ్ (88863 81657), మల్బరీ కత్తిరింపు పరికరం రూపకర్త, జిల్లెళ్ల గ్రామం, తంగళ్లపల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రకృతి సేద్యానికి ప్రమాణాలు! మన దేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, రైతులు చాలా సంవత్సరాలుగా విస్తృతంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పటికీ నిర్దుష్ట ప్రమాణాలు లేవు. భారతీయ నమూనా ప్రకృతి సేద్యం అంతకంతకూ విస్తరించటం.. ఎఫ్.ఎ.ఓ. వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ప్రకృతి వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌కు సహకార వ్యవస్థ ఏర్పాటవుతున్నది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయానికి, ఉత్పత్తుల లేబులింగ్‌కు భారతీయ ప్రమాణాలను నిర్వచించుకోవాల్సిన అవసరం వచ్చింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) ఒక ముసాయిదా పత్రాన్ని వెలువరించింది. 27 పేజీల డ్రాఫ్ట్ స్టాండర్డ్స్‌ను వెబ్సైట్లో పెట్టింది. ప్రకృతి సాగు పద్ధతులు, ద్రావణాలు, కషాయాలు, అంతర పంటలు, మిశ్రమ పంటలు, ఆగ్రోఫారెస్ట్రీ.. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల బ్రాండింగ్, నిల్వ, ప్యాకేజింగ్‌తో పాటు.. సేంద్రియ–ప్రకృతి వ్యవసాయాల మధ్య వ్యత్యాసాలు ఇందులో ఉన్నాయి. శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద కార్యకర్తలు, రైతు శాస్త్రవేత్తలు, ఆహార నిపుణులు, సంస్థలు, ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నది. తుది గడువు 2023 డిసెంబర్ 26. 14 నుంచి విశాఖ ఆర్గానిక్ మేళావిశాఖపట్నంలో ఈ నెల 8–10 తేదీల్లో జరగాల్సిన ఆర్గానిక్ మేళా పెనుతుపాను కారణంగా ఈ నెల 14–17 తేదీలకు వాయిదా పడింది. గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ, సుస్థిర వ్యవసాయ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. విశాఖలో జరుగుతున్న నాలుగో వార్షిక ఆర్గానిక్ మేళా ఇది. 14న ఉ. 10 గంటలకు సేంద్రియ/ప్రకృతి రైతులు– రైతు శ్రేయోభిలాషుల సమ్మేళనం, 15న గ్రాడ్యుయేట్ ప్రకృతి వ్యవసాయదారులు, విద్యార్థుల సదస్సు, 16న ఏపీ ఛాంబర్ ఆఫ్ ఆర్గానిక్స్ సమావేశం, 17న ఇంటిపంటలు/మిద్దెతోటలపై సదస్సు జరుగుతుందని నిర్వాహకులు కుమారస్వామి తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 78934 56163, 86862 24466. -
వంట పండింది!
జీవితంలో సమస్యలు రావడం సాధారణం. ఒక్కోసారి ఇవి ఊపిరాడనివ్వవు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా వాటిని ఎదుర్కొనాలి. తానేమిటో నిరూపించుకోవాలి. అలానే చేసింది బిందు. తన కూతుళ్లకు మంచి చదువును అందించేందుకు ఒక పక్క గరిట తిప్పుతూనే మరోపక్క నాగలి పట్టి పొలం సాగు చేస్తూ ‘‘మనం కూడా ఇలా వ్యవసాయం చేస్తే బావుంటుంది’’ అనేంతగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. తమిళనాడులోని తెనై జిల్లా బొమ్మినాయకన్పట్టి గ్రామానికి చెందిన బిందు, పిచ్చయ్య దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పిచ్చయ్య సొంత పొలంలో చెరకు పండించేవాడు. అయితే ఏటా అప్పులు తప్ప ఆదాయం వచ్చేది కాదు. గ్రామంలో చాలామంది రైతులు చెరకు, పత్తిని పండించి నష్టపోవడాన్ని చూసి ఇతర పంటలను పండించాలని నిర్ణయించుకుంది బిందు. మొక్కజొన్న, వంగ పంటను పొలంలో వేసింది. మరోపక్క సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌లో చేరి చుట్టుపక్కల రైతులు ఏం పండిస్తున్నారో తెలుసుకునేది. ఇతర రైతుల సలహాలు, సూచనలతో సాగును మెరుగు పరుచుకుంటూ, ఎస్‌హెచ్‌జీ ద్వారా కృషి విజ్ఞాన్ నిర్వహించే వ్యవసాయ కార్యక్రమాలకు హాజరవుతూ మెలకువలు నేర్చుకుంది. అధికారులు చెప్పిన విధంగా పప్పుధాన్యాలు, మిల్లెట్స్, మినుములు కూడా సేంద్రియ పద్ధతి లో సాగుచేసింది. దీంతో మంచి లాభాలు వచ్చాయి. విరామంలో... పంటకు పంటకు మధ్య వచ్చే విరామంలో కూరగాయలు పండించడం మొదలు పెట్టింది. అవి నాలుగు నెలల్లోనే చేతికి రావడంతో మంచి ఆదాయం వచ్చేది. విరామ పంటలు చక్కగా పండుతుండడంతో.. కొత్తిమీర, కాకర, ఇతర కూరగాయలను పండిస్తోంది. పంటను పసుమయిగా ... ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో చాలా కూరగాయలు వృథా అయ్యేవి. అలా వ్యర్థంగా పోకుండా ఉండేందుకు ‘పసుమయి’ పేరిట ఎండబెట్టిన కూరగాయలు, పొడులను విక్రయిస్తోంది. ఇడ్లీ పొడి, నిమ్మపొడి, ధనియాల పొడి వంటి అనేక రకాల పొడులను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. నెలకు వందల సంఖ్యలో విక్రయాలు జరుగుతున్నాయి. ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వ్యాపారవేత్తగా ఎదిగింది బిందు. ఆమె పెద్దకూతురు ఎం.ఎస్. పూర్తి చేస్తే, చిన్నకూతురు బీఎస్సీ నర్సింగ్ చేస్తోంది. అలా సేద్యంతో పిల్లల చదువులనూ పండించుకుంది బిందు. -
‘నల్ల తామర’కు ముకుతాడు?
సాక్షి సాగుబడి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మిరప రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్న నల్ల తామరను తట్టుకునే మిరప రకాలను రూపొందించుకునే పరిశోధనల్లో వరల్డ్ వెజిటబుల్ సెంటర్ గణనీయమైన పురోగతి సాధించింది. తైవాన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వరల్డ్ వెజిటబుల్ సెంటర్ (డబ్ల్యూ.వి.సి.) దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధనా స్థానం పఠాన్‌చెరులోని ఇక్రిశాట్ ఆవరణలో ఉంది. ఈ కేంద్రంలో సాగులో ఉన్న నల్లతామరను తట్టుకునే గుణాలున్న 9 మిరప రకాలతో కూడిన ప్రదర్శన క్షేత్రాన్ని ఆసియా అండ్ పసిఫిక్ సీడ్ అసోసియేషన్(ఎపిఎస్‌ఎ)కు చెందిన 50 ప్రైవేటు విత్తన కంపెనీల ప్రతినిధులు పరిశీలించారు. ఆసక్తి కలిగిన విత్తన కంపెనీలతో కలసి త్వరలో చేపట్టనున్న బ్రీడింగ్ ప్రాజెక్టు ద్వారా నల్లతామర, తదితర చీడపీడలను చాలావరకు తట్టుకునే సరికొత్త సంకర వంగడాలను రూపొందించనున్నట్లు డబ్ల్యూ.వి.సి. ఇండియా కంట్రీ డైరెక్టర్ అరవఝి సెల్వరాజ్ తెలిపారు. 10 రాష్ట్రాల్లో మిరపకు నల్లతామర ప్రపంచంలో మిరపను అత్యధిక విస్తీర్ణంలో పండిస్తూ, వినియోగిస్తూ, ఎగుమతి చేస్తున్న దేశం భారత్. అంతేకాకుండా, దేశంలో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతున్న రెండో పెద్ద కూరగాయ పంట మిరప. హెక్టారుకు రూ. 2.5–3 లక్షల వరకు పెట్టుబడి అవసరమైన ఈ పంట దేశంలో సుమారు 7.30 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. తామర పురుగులు గతం నుంచి ఉన్నప్పటికీ అంత ప్రమాదకరం కాదు. అయితే, ఇండోనేసియా నుంచి బొప్పాయి ద్వారా మన దేశంలోకి ప్రవేశించిన నల్ల తామర 2015లో తొలుత మిరపను ఆశించి విధ్వంసం సృష్టిస్తోంది. గత రెండు–మూడేళ్లుగా ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో మిరప తోటలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. నల్ల తామర తాకిడిని తట్టుకోవడానికి అతి తరచూ పురుగుమందులు పిచికారీలు చేసినా దిగుబడి నష్టం 40–50 శాతం ఉంటుంది. ఏభయ్యేళ్ల పరిశోధన ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో దీన్ని తట్టుకునే వంగడాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కూరగాయ పంటలపై గత ఏభయ్యేళ్లుగా పరిశోధనలు చేస్తూ మెరుగైన వంగడాల అభివృద్ధికి, స్థానిక వంగడాల అభివృద్ధికి దోహదపడుతున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ వరల్డ్ వెజిటబుల్ సంస్థ. తైవాన్‌లోని ప్రధాన పరిశోధన స్థానం కలిగిన డబ్లు్య.వి.సి. ప్రధానంగా మిరప, టొమాటో, కాకర, గుమ్మడి, బెండ, పెసర, వెజ్‡సోయాబీన్స్, తోటకూర పంటలకు సంబంధించి చీడపీడలు తట్టుకునే మెరుగైన వంగడాల అభివృద్ధిపై ఈ సంస్థ గత ఐదు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తోంది. అయితే, పటాన్‌చెరులోని డబ్ల్యూ.వి.సి. కేంద్రంలో ముఖ్యంగా మిరప, టొమాటో, పెసర, వెజ్ సోయాబీన్ పంటలపై పరిశోధనలు జరుగుతున్నాయి. మెరుగైన వంగడాలు వాడితే తక్కువ పిచికారీలు చాలు తైవాన్‌లోని డబ్ల్యూ.వి.సి. పరిశోధనా కేంద్రంలో నల్ల తామరను తట్టుకునే లక్షణాలు 7 రకాల మిరప వంగడాల్లో గుర్తించారు. పటాన్చెరు కేంద్రంలో గుర్తించిన మరో 2 మిరప రకాలను గుర్తించాం. ఈ 9 రకాలపై రెండేళ్లుగా పరిశోధనలు చేయగా, ఇందులో 6 రకాల్లో నల్ల తామరను తట్టుకునే లక్షణాలు కనిపించాయి. ఈ లక్షణాలకు కారణమైన జన్యువులను, వాటికి సంబంధించిన మార్కర్లను గుర్తించాలి. ఇందుకు ఆసక్తి గల స్థానిక ప్రైవేటు విత్తన కంపెనీలతో కలసి తదుపరి దశ పరిశోధనలు సాగించాల్సి ఉంది. ఈ పరిశోధనలన్నీ పూర్తయి నల్లతామరను చాలా మటుకు తట్టుకునే మెరుగైన మిరప విత్తనాలు రైతులకు చేరటానికి మరో 3–4 ఏళ్ల సమయం పడుతుంది. ఇప్పుడు చాలా సార్లు పురుగుమందులు పిచికారీ చేయాల్సి వస్తున్నది. మెరుగైన విత్తనాలు వాడితే తక్కువ పిచికారీలు సరిపోతాయి. ఈ మెరుగైన విత్తనాలను వాడుతూ రైతులు మంచి వ్యవసాయ పద్ధతులను పాటించటం అవసరం. దీర్ఘకాలం పాటు చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునేందుకు అనువైన మిరప వంగడాల అభివృద్ధికి దోహదపడటమే మా లక్ష్యం. – డా. నల్లా మనోజ్‌కుమార్, అసిస్టెంట్ సైంటిస్ట్, వరల్డ్ వెజిటబుల్ సెంటర్, దక్షిణాసియా పరిశోధనా కేంద్రం, ఇక్రిశాట్ ఆవరణ, పటాన్చెరు -
నేల, నీరే జీవనాధారం!
వాతావరణ మార్పు వల్ల కరువు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు విరుచుకుపడుతున్న నేపథ్యం ఇది. పంటల సాగు, పశుపోషణ, ఆక్వా సాగులో రైతులు అనేక కష్టనష్టాలకు గురవుతున్న కలికాలం. మనతో పాటు సకల జీవరాశి మనుగడకు నేల, నీరే మూలాధారాలు. నేలను, నీటిని ప్రాణప్రదంగా పరిరక్షించుకుంటూనే సేద్యాన్ని కొనసాగించేలా ఐక్యరాజ్యసమితికి చెందిన వ్యవసాయ ఆహార సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రజలు, రైతులను చైతన్యవంతం చేస్తూ పాలకులకు దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది. రసాయనాల్లేకుండా, లోతుగా దుక్కి దున్నకుండా, ఒకటికి నాలుగు పంటలు కలిపి వేసుకోవటం ద్వారా పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అనుసరించటం ద్వారా నేలను, నీటిని సంరక్షించుకోవటం సాధ్యమవుతుందని సమాజంలో ప్రతి ఒక్కరం గుర్తించాల్సిన తరుణం ఇది. మానవాళికి 95% ఆహారాన్ని అందిస్తున్న నేలలను పరిరక్షించుకోవాలన్న స్ఫూర్తిని కలిగించడానికి ప్రతి ఏటా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ నేలల లేదా భూముల దినోత్సవాన్ని ఎఫ్.ఎ.ఓ. నిర్వహిస్తోంది. ఈ ఏడాది నినాదం: ‘నేల, నీరే జీవరాశి అంతటికీ జీవనాధారం’! ఎఫ్.ఎ.ఓ. ఇంకా ఏం చెబుతోందో చదవండి.. ఈ నెల 8,10 తేదీల్లో విశాఖ ఆర్గానిక్ మేళా గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 8,9,10 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. విశాఖలో జరుగుతున్న నాలుగో వార్షిక ఆర్గానిక్ మేళా ఇది. 8న ఉ. 10 గంటలకు రైతుల సమ్మేళనం, 9న గ్రాడ్యుయేట్ రైతుల సదస్సు, 10న ఇంటిపంటలపై సదస్సు, 11న సేంద్రియ ఉత్పత్తుల వ్యాపారుల చర్చాగోష్ఠి జరుగుతుందని నిర్వాహకులు కుమారస్వామి తెలిపారు. వివరాలకు.. 78934 56163, 86862 24466. 11న ప్రకృతి సేద్య కార్యకర్తల సమావేశం ప్రముఖ ప్రకృతి సేద్య నిపుణులు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాశ్ పాలేకర్ డిసెంబర్ 11న ఉ.10 నుంచి. మ.1 గం. వరకు హైదరాబాద్ దోమల్‌గూడలోని రామచంద్రమిషన్‌లో ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి కృషి చేసే కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో ముచ్చటిస్తారు. పర్యావరణ సంక్షోభం నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని స్వతంత్ర ఉద్యమంగా గ్రామస్థాయిలో రైతుల్లో విస్తరింపజేయటంపై చర్చిస్తారు. వివరాలకు.. సేవ్ స్వచ్ఛంద సంస్థ: 63091 11427. 14 నుంచి పల్లెసృజన శోధాయాత్ర ప్రకృతితో మమేకమై జీవించే గ్రామీణులు ముఖ్యంగా రైతులు, వృత్తిదారులు, కళాకారుల విజ్ఞానాన్ని తెలుసుకోవటం.. అజ్ఞాతంగా మిగిలిపోయిన గ్రామీణ ఆవిష్కరణలను వెలికితేవటమే లక్ష్యంగా పల్లెసృజన స్వచ్ఛంద సంస్థ శోధాయాత్రలు నిర్వహిస్తోంది. 47వ చిన్న శోధాయాత్ర అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి వెంకట రాజంపేట వరకు డిసెంబర్ 14 నుంచి 17 వరకు జరుగుతుంది. వలంటీర్లు కాలినడకన పయనిస్తూ ప్రజలతో ముచ్చటిస్తారు. ఆసక్తి గల వారు రిజిస్ట్రేషన్ చేసుకొని యాత్రలో పాల్గొనవచ్చు. వివరాలకు.. బ్రిగేడియర్ పి.గణేశం – 98660 01678, 99666 46276, 99859 19342. 9, 10 తేదీల్లో సుందర రామన్ శిక్షణ తమిళనాడుకు చెందిన ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఎస్.ఆర్. సుందర రామన్ డిసెంబర్ 9,10 తేదీల్లో సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని కామ్యవనంలో రైతులకు రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. రసాయనాలతో సాగుచేస్తున్న భూమిని ప్రకృతి వ్యవసాయంలోకి ఎలా మార్చాలి? నేలలో సేంద్రియ కర్బనం ఎలా పెంచాలి? ఉద్యాన పంటలకు పిచికారీ లేకుండా సమగ్ర పోషకాలు ఎలా అందించాలి? వంటి అనేక ప్రకృతి సేద్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ముందస్తు రిజిస్ట్రేషన్ల వివరాలకు.. 94495 96039, 99490 94730. 15న పాలేకర్ ఫైవ్ లేయర్ క్షేత్ర సందర్శన వికారాబాద్ జిల్లా థారూరు మండలం బూరుగడ్డ గ్రామంలో సేవ్ స్వచ్ఛంద సంస్థ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ సుభాశ్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో అభివృద్ధి చేసిన ఐదు అంతస్థుల ఉద్యాన పంటల నమూనా క్షేత్రాన్ని డిసెంబర్ 15 (శుక్రవారం)న ఉ. 10.–సా.5 వరకు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాశ్ పాలేకర్ సందర్శిస్తారు. ప్రతి అంశం వెనుక గల శాస్త్రీయతను పాలేకర్ వివరిస్తారు. 4 రాష్ట్రాల రైతులు పాల్గొంటున్నారు. ప్రసంగం తెలుగు అనువాదం ఉంటుందని విజయరామ్ తెలిపారు. 3 కి.మీ. నడవగలిగిన వారే రావాలి. భోజన ఏర్పాట్లు ఉన్నాయి. నేరుగా వచ్చే వారికి ప్రవేశ రుసుం రూ. 100. హైదరాబాద్ రామకృష్ణమిషన్ దగ్గర గల సేవ్ కార్యాలయం నుంచి బస్సులో వెళ్లే వారికి రూ. 500. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వివరాలకు.. 63091 11427. (చదవండి: ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్ !) -
చిరుధాన్యాలు నిరుపేదలకూ అందాలి!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: చిరుధాన్యాలను దైనందిన ఆహారంలో భాగం చేసుకుంటే పౌష్టికాహార లోపాన్ని సులువుగా జయించవచ్చని, నిరుపేదలు సైతం చిరుధాన్యాలను రోజువారీ ఆహారంగా తిసుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై అన్నారు. అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం సందర్భంగా భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐఐఎంఆర్)–న్యూట్రిహబ్ ఆధ్వర్యంలో నోవోటెల్ హోటల్లో సోమవారం ప్రారంభమైన అంతర్జాతీయ చిరుధాన్య సమ్మేళనం మంగళవారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో డా. తమిళిసై ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ చిరుధాన్యాలను తాను ప్రతి రోజూ తింటానన్నారు. వైద్యురాలిగా కూడా చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో తిరిగి ప్రజలంతా భాగం చేసుకోవటం అవశ్యమన్నారు. జొన్నలు, రాగులు, సజ్జలకు మాత్రమే పరిమితం కావద్దని అంటూ.. వీటితో పాటు కొర్రలు, సామలు, అరికెలు, అండుకొర్రలు, ఊదలు తదితర స్మాల్ మిల్లెట్స్‌ను కూడా మార్చి మార్చి తినాలని సూచించారు. ఒక్కో చిరుధాన్యంలో వేర్వేరు ప్రత్యేకతలున్నాయంటూ, ఒక్కో దాంట్లో ఒక్కో రకం వ్యాధుల్ని పారదోలే ప్రొటీన్లు, సూక్ష్మపోషకాలు, పీచుపదార్థాలు వేర్వేరు పాళ్లలో ఉన్నాయని డా. తమిళిసై వివరించారు. ఈ మిల్లెట్స్ చిన్నసైజులో ఉంటాయి కాబట్టి చిన్నచూపు చూడకూడదన్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ధతో యోగాతో పాటు చిరుధాన్యాలను ప్రపంచానికి తిరిగి పరిచయం చేయటం హర్షదాయకమన్నారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్‌లో శిక్షణతో పాటు ఆర్థిక సాయం పొంది చిరుధాన్యాల ఆహారోత్పత్తుల వ్యాపారం చేపట్టిన పలు స్టార్టప్‌ల వ్యవస్థాపకులకు గవర్నర్ తమిళిసై గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందించి ప్రశంసించారు. ముగింపు సమావేశానికి ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ సీఈవో డా. బి. దయాకర్‌రావు అధ్యక్షతవహించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (క్రాప్‌సైన్స్) డా. శర్మ ప్రసంగిస్తూ వచ్చే నెలతో ముగియనున్న అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం తర్వాత 2033 వరకు చేపట్టనున్న భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికతో కూడిన హైదరాబాద్ డిక్లరేషన్‌ను త్వరలో వెలువరిస్తామని ప్రకటించారు. క్లైమెట్ ఛేంజ్ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రాచుర్యంలోకి తెస్తున్నామని, మెరుగైన వంగడాలను రైతులకు అందిస్తున్నామన్నారు. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సిఎసిపి) చైర్మన్ డాక్టర్ విజయపాల్ శర్మ ప్రసంగిస్తూ ప్రస్తుతం చిరుధాన్యాలు పేదలకు అందుబాటులో లేవని, వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వాలపై ఉందన్నారు. కనీస మద్దతు ధర పెంపుదలలో కేంద్రం ఇప్పటికే చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. చిరుధాన్యాలకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడినందున రైతులకు మున్ముందు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. ఐఐఎంఆర్ డైరెక్టర్ డా. సి.తార సత్యవతి మాట్లాడుతూ మెరుగైన చిరుధాన్య వంగడాల తయారీకి జన్యు సాంకేతికతలను వినియోగిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్ !) -
ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: అన్ని విధాలుగా ఆరోగ్యదాయకమైన చిరుధాన్యాల ఆహారంపై అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం-2023 సందర్భంగా మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అద్భుతమైన ప్రజా చైతన్యం వెల్లివిరుస్తోందని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసిఎఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. సురేశ్ కుమార్ చౌదరి అన్నారు. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) తోడ్పాటుతో భారత ప్రభుత్వం సకల పోషకాల గనులైన చిరుధాన్యాలను శ్రీఅన్నగా పేర్కొంటూ ఫ్యూచర్ హెల్దీ సూపర్ ఫుడ్‌గా సరికొత్త రూపాల్లో తిరిగి పరిచయం చేయటంలో సఫలీకృతమైందని ఆయన తెలిపారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో మనుషుల ఆరోగ్యానికే కాకుండా భూగోళం ఆరోగ్యానికి కూడా దోహదపడే అసలైన ఆహార ధాన్యాలు చిరుధాన్యాలేనని జీ20 తదితర అంతర్జాతీయ వేదికల్లోను, దేశీయంగాను చాటి చెప్పటంలో మన దేశం విజయవంతమైందని అంటూ, భవిష్యత్తులో చిరుధాన్యాల ప్రాధాన్యం మరింత విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ప్రధాన జీవన స్రవంతిలోకి తిరిగి చిరుధాన్యాలు- ఇప్పుడు, తర్వాత’ అనే అంశంపై నొవోటెల్ హోటల్లో రెండు రోజుల అంతర్జాతీయ చిరుధాన్యాల సమ్మేళనం సోమవారం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థలోని న్యూట్రిహబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి డా. సురేశ్ కుమార్ చౌదరి అధ్యక్షతవహించారు. దేశంలో చాలా రాష్ట్రాలు మిల్లెట్ మిషన్లను ప్రారంభించాయని, ప్రజలు నెమ్మదిగా చిరుధాన్యాల వినియోగం వైపు మళ్లుతున్నారన్నారు. అయితే, చిరుధాన్యాల రైతులకు మరింత ఆదాయాన్ని అందించే పాలకులు విధాన నిర్ణయాలు తీసుకొని ప్రోత్సాహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 2023 తర్వాత కాలంలో చిరుధాన్యాలు మన ఆహారంలో మరింతగా భాగం కావాలంటే కేవలం ప్రభుత్వ చర్యలే సరిపోవని, ప్రభుత్వేర సంస్థలు, వ్యక్తులు, ప్రైవేటు ఆహార కంపెనీలు కూడా సంపూర్ణ సహకారం అందించాలని డా. సురేశ్ కుమార్ చౌదరి విజ్ఞప్తి చేశారు. ఐసిఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. సురేశ్ కుమార్ చౌదరి చిరుధాన్యాల పుట్టిల్లు భారత్: ఎఫ్.ఎ.ఓ. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) భారత్ ప్రతినిధి టకయుకి హగివర ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ చిరుధాన్యాలకు భారత్ పుట్టిల్లని, చిరుధాన్యాల వాణిజ్యానికి భారత్ మూలకేంద్రంగా మారే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. క్లైమెట్ ఎమర్జెన్సీ నేపథ్యంలో ఆకలి, పౌష్టికాహార లోపం, ఆహార అభద్రతలను అధిగమించడానికి చిరుధాన్యాలు ఉపకరిస్తాయని భారత్ ప్రపంచానికి శక్తివంతంగా చాటిచెప్పిందన్నారు. ఐసిఎఆర్, ఐఐఎంఆర్ చేసిన కృషి అనితరసాధ్యమైనదన్నారు. అంతర్జాతీయ సంస్థలతో పాటు, ఆహార వాణిజ్యంలో దిగ్గజాల్లాంటి బహుళజాతి కంపెనీలు కూడా చిరుధాన్యాల వైపు దృష్టి సారిస్తున్నాయన్నారు. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి చిరుధాన్యాలతో కూడిన సుస్థిర వ్యవసాయం దోహదం చేస్తుందన్నారు. రైతులకు దక్కుతున్నది స్వల్పమే చిరుధాన్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా 300కుపైగా అధునాతన, వినూత్న ఆహారోత్పత్తులను ఉత్పత్తి చేసే సాంకేతికతలను రూపొందించటంలో హైదరాబాద్‌లోని ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ విశిష్ట ప్రాతను పోషించిందని, ప్రపంచానికే ఇది మార్గదర్శకమని ఐసిఎఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డా. డి.కె. యాదవ్ తెలిపారు. గతంలో చిరుధాన్యాలు ఎగుమతి చేసేవారమని, ఇప్పుడు అధునాతన తినుబండారాలను ఎగుమతి చేసే దేశంగా భారత్ మారిందన్నారు. అయితే, ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను అమ్మి వ్యాపారులు సంపాదించే మొత్తంలో 15-20% మాత్రమే చిరుధాన్యాల రైతులకు దక్కుతున్నదని, కనీసం 50% దక్కేలా విధానపరమైన చర్యలు తీసుకోగలిగితే చిరుధాన్యాలు ప్రధాన ఆహార ధాన్యంగా ప్రధాన జీవన స్రవంతిలోకి వస్తుందన్నారు. రూ. 250 కోట్లతో ఐఐఎంఆర్ను అంతర్జాతీయ చిరుధాన్యాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేశామని డా. యాదవ్ వివరించారు. వరి, గోధుమలకు దీటుగా రైతులకు ఆదాయాన్నందించేలా అధిక దిగుడినిచ్చే 9 రకాల చిరుధాన్యాల వంగడాలను అందుబాటులోకి తెచ్చామని, సర్టిఫైడ్ సీడ్‌కు కొరత లేదన్నారు. భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐఐఎంఆర్) డైరెక్టర్ డాక్టర్ సి. తార సత్యవతి ప్రసంగిస్తూ చిరుధాన్యాలను పెద్దలతో పాటు పిల్లలు, యువత కూడా ఇష్టంగా తినేలా వినూత్న ఉత్పత్తులను న్యూట్రిహబ్ ద్వారా అందుబాటులోకి తెచ్చామన్నారు. గుంటూరు, బాపట్ల ప్రాంతాల్లో ప్రయోగాత్మక సాగులో మేలైన జొన్న వంగడాల ద్వారా హెక్టారుకు 7-8 టన్నుల జొన్నల దిగుబడి సాధించినట్లు తెలిపారు. గుజరాత్లో బంగాళదుంపలు సాగు చేసిన తర్వాత ఆ పొలాల్లో హెక్టారుకు 7-8 టన్నుల సజ్జ దిగుబడి వచ్చిందన్నారు. దశాబ్దాల నిర్లక్ష్యం తర్వాత చిరుధాన్యాలకు పునర్వైభవం రానుందన్నారు. ఐఐఎంఆర్ న్యూట్రిహబ్ సీఈఓ డా. బి. దాయకర్‌రావు ప్రసంగిస్తూ గతంలో చిరుధాన్యాలు కొనే వారే ఉండేవారు కాదని, ఇప్పుడు కొందామంటే 40% మేరకు కొరత ఏర్పడిందన్నారు. న్యూట్రిహబ్ ద్వారా వినూత్న ఉత్పత్తులు తయారీలో స్టార్టప్‌లకు, ఆహార కంపెనీలకు ప్రపంచంలోనే ఎక్కడా లేని అధునాతన సాంకేతికతను అందిస్తున్నందున ఎగుమతులు పెరిగాయని, ప్రపంచ దేశాలు ఇప్పుడు మన వైపే చూస్తున్నాయన్నారు. చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచి, రైతులకు మున్ముందు మంచి ఆదాయం వచ్చేలా స్టార్టప్‌లు, కంపెనీలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ఈ సమ్మేళనంలో రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. చిరుధాన్యాల సాగు, వినియోగం పెంపుదలకు విశిష్ట కృషి చేస్తున్న పలువురు శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు, పాత్రికేయులకు ఈ సందర్భంగా ‘పోషక్ అనాజ్’ జీవన సాఫల్య పురస్కారాలను అందించారు. పురస్కారాలు అందుకున్న వారిలో డాక్టర్ పివి వరప్రసాద్, డా. జీవీ రామాంజనేయులు, డా. హేమలత, డా. మీరా తదితరులతో పాటు ‘సాక్షి సాగుబడి’ సీనియర్ న్యూస్‌ఎడిటర్ పంతంగి రాంబాబు ఉన్నారు. మంగళవారం కూడా ఈ సమ్మేళనం కొనసాగుతుంది. ఈ సందర్భంగా నోవోటెల్లో ఏర్పాటైన స్టాళ్లలో సుమారు 200 స్టార్టప్‌లు చిరుధాన్యాల ఆహారోత్పత్తులు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. (చదవండి: వరి ఆకారపు మిల్లెట్లు! మిల్లెట్లు తినేవారిగా మార్చేలా) -
ఎర్ర బంగారం ఇక ఎంతైనా ఎగుమతి!
ఎర్ర చందనం.. ప్రపంచంలో కేవలం మన దేశంలో మాత్రమే ఉన్న అత్యంత అరుదైన, అత్యంత ఖరీదైన జాతి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో విస్తరించిన తూర్పు కనుమల్లోని అడవుల్లో సహజ సిద్ధంగా ఎర్ర చందనం అనాదిగా పెరుగుతోంది. దీనితోపాటు, కొందరు రైతులు వర్షాధార భూముల్లో ఎర్రచందనం తోటలను చాలా ఏళ్లుగా సాగు చేస్తున్నారు. అంతరించిపోయే ప్రమాదం అంచుల్లో ఉన్న అరుదైన జాతి కావటంతో ఎర్రచందనం కలప ఎగుమతిపై 19 ఏళ్లుగా అంతర్జాతీయంగా పరిమితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల కృషి మేరకు ఎర్రచందనం ఎగుమతులపై పరిమితులు ఇటీవలే తొలగిపోయాయి. ఇక ఎంతయినా రైతులు ఎగుమతి చేయొచ్చు. మంచి ధర వచ్చే వరకు నిల్వ చేసుకొని మరీ ఎగుమతి చేసుకోవచ్చు. మెట్ట ప్రాంతాల్లో ఎర్రచందనం సాగు పుంజుకునేందుకు దోహదపడనున్న ఈ తాజా పరిణామంపై ప్రత్యేక కథనం. అంతర్జాతీయంగా ఆర్థికంగా ముఖ్యమైన చెట్ల జాతుల్లో ఎర్రచందనం ఒకటి. ఎర్రచందనం చేవ కర్రకు ఔషధ గుణాలు ఉన్నాయి. మన దేశంలోని తూర్పు కనుమలు విస్తరించిన దక్షిణ ప్రాంతంలో సహజ అడువుల్లో విస్తారంగా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. రైతులు కూడా తమ భూముల్లో సాగు చేస్తున్నారు. సుదీర్ఘకాలం పెంచాల్సి రావటం, చెట్లు నరకడానికి, అమ్మకానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉండటం వంటి పరిమితులు ఉన్నప్పటికీ.. అంతర్జాతీయంగా గిరాకీ, అధిక ధర, మార్కెట్ డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవటం వల్ల ఎర్రచందనం సాగుకు కొంత మంది రైతులు ఆసక్తి చూపుతూ వచ్చారు. ఎగుమతిపై పరిమితులు ఇటీవల రద్దయిన నేపథ్యంలో ఎర్రచందనం సాగు మరింత పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నది నిపుణుల మాట. ఎర్రచందనం చెట్టు కాండం మధ్యలో పెరిగే ఎర్రటి చేవ కర్రను వస్త్రాలు, ఆహారం, ఔషధాల్లో సేంద్రియ రంగు కోసం వాడుతున్నారు. ఖరీదైన ఫర్నీచర్, బొమ్మలు, సంగీత వాయిద్యాల తయారీకి వాడుతున్నారు. షుగర్, చర్మవ్యాధులకు ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్నది. జపాన్, చైనా, ఐరోపా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతోంది. అడవుల్లోని ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు గతంలో విచక్షణారహితంగా నరికివేసిన కారణంగా ఈ వృక్ష జాతి అంతరించిపోయే ముప్పును ఎదుర్కొనే దశకు చేరింది. అందువల్ల ఎర్రచందనం జాతిని అంతరించిపోకుండా పరిరక్షించడానికి ప్రత్యేక చర్యలు అవసరమయ్యాయి. 2004 నుంచి ఎగుమతిపై పరిమితులు జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ చట్టబద్ధ సంస్థ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్డేంజర్డ్ స్పెసీస్ (సిఐటిఇఎస్ – ‘సైట్స్’)లో 1976 నుంచి భారత్ సభ్యదేశంగా కొనసాగుతోంది. ఎర్రచందనం దుంగల ఎగుమతిపై 2004లో ‘సైట్స్’ పూర్తిగా నిషేధించలేదు గానీ, పటిష్టమైన సంరక్షణ చర్యల్లో భాగంగా పరిమితిని విధించింది. ఏటేటా ఈ జాతి చెట్ల స్థితిగతులను పరిశీలించి ఎగుమతి పరిమాణాన్ని సైట్స్ స్థాయీ సంఘం నిర్దేశిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్రచందనం పరిరక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఈ చెట్ల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టింది. మరోవైపు అటవీ భూముల్లో ఎర్రచందనం మొక్కలు నాటడం కూడా జరిగింది. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు గుజరాత్లో కూడా కొందరు రైతులు బంజరు భూముల్లో ఎర్రచందనాన్ని దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. అటవీ భూముల్లోని ఎర్రచందనం చెట్లను పరిరక్షించటంతో పాటు రైతుల భూముల్లోనూ సాగు చేస్తుండటంతో ఈ జాతి అంతరించే ముప్పు నుంచి బయటపడింది. 19 ఏళ్ల తర్వాత.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నివేదికల ఆధారంగా తాజా పరిస్థితిని నవంబర్ 6–10 తేదీల్లో జెనీవాలో జరిగిన ‘సైట్స్’ 77వ స్థాయీ సంఘం సమావేశం సమీక్షించి సంతృప్తిని వ్యక్తం చేసింది. మన దేశం నుంచి సైట్స్ మేనేజ్మెంట్ అథారిటీ–ఇండియా తరఫున అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎస్.పి. యాదవ్ సారథ్యంలోని ఉన్నతాధికార బృందం ఈ సమావేశంలో పాల్గొని పరిస్థితిని వివరించింది. దీంతో, భారత్ నుంచి ఎర్రచందనం ఎగుమతులపై 19 ఏళ్లుగా అమల్లో ఉన్న పరిమితిని తొలగిస్తూ ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది. దీంతో, జెనీవాలోని సైట్స్ స్థాయీ సంఘానికి బదులు.. ఇక మీదట ఎర్రచందనం ఎగుమతుల వ్యవహారాలపై న్యూఢిల్లీలోని సైట్స్ మేనేజ్మెంట్ అథారిటీ–ఇండియా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలిగింది. రైతులకు గొప్ప ప్రోత్సాహం ఎర్రచందనం ఎగుమతిపై పరిమితిని రద్దు చేస్తూ సైట్స్ స్థాయీ సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధికారికంగా ప్రకటించారు. మన దేశం గత 19 ఏళ్లుగా సైట్స్ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించటమే కాకుండా ఎర్రచందనం వృక్ష జాతి పరిరక్షణ చర్యలు సమర్థవంతంగా పాటించినందున సైట్స్ సానుకూల నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ‘ఈ పరిణామం ఎర్రచందనం తోటలు సాగు చేసే రైతులకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంద’ని ఆయన అన్నారు. ఎర్రచందనం సాగు పద్ధతులు ఎగుమతిపై పరిమితి తొలగిన నేపథ్యంలో ఎర్రచందనం సాగు పద్ధతులపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ దూలపల్లిలోని అటవీ జీవవైవిధ్య సంస్థ (ఐఎఫ్బి) ఎర్రచందనం సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తోంది. గత ఏడాది కరదీపికను వెలువరించింది. ఆ వివరాలు...ఎర్రచందనం ప్రకృతిసిద్ధంగా తక్కువ నీటి వనరులున్న కొండ ప్రాంతాల్లో పెరుగుతుంది. అంతగా సారవంతం కాని గ్నీస్, క్వార్ట్జైట్, లాటరైట్ లోమ్ నేలలు బాగా అనుకూలం. సారవంతమైన నేలలు, నీటి సదుపాయం ఉన్న నేలలు ఎర్రచందనం సాగుకు అనువైనవి కావు. ఈ నేలల్లో సాగు చేస్తే చెట్లు బాగా ఎత్తుగా, లావుగా పెరుగుతాయి. అయితే, కాండం లోపల చేవదేలడానికి చాలా ఎక్కువ కాలం పడుతుంది. చేవను బట్టే ఎర్రచందనం నాణ్యత, ధర ఆధారపడి ఉంటాయి. పాక్షిక శుష్క ఉష్ణమండలంలోని ఆకురాల్చే అడవులు పెరిగే ప్రాంతం దీనికి అనుకూలం. 700 నుంచి 1200 ఎం.ఎం. మేరకు వార్షిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. కనీసం 700 ఎం.ఎం. వర్షం అవసరం. ఏడాదిలో అప్పుడప్పుడూ వర్షాలు పడుతూ ఉండే ప్రాంతాలు ఎర్రచందనం సాగుకు అనుకూలం. అధిక వర్షపాత ప్రాంతాలు అనుకూలం కాదు. పొడి వాతావరణంతో పాటు 26–28 డిగ్రీల సెల్షియస్ (గరిష్టంగా 48 డిగ్రీల సెల్షియస్) ఉష్ణోగ్రతలు ఉండాలి. నర్సరీ బెడ్లపై పెంచిన 1–2 ఏళ్ల నారు మొక్కల్ని నాటుకోవాలి. ఎర్రచందనం గింజలు చాలా తక్కువ శాతం మొలకెత్తుతాయి. అందువల్ల వీటికి బదులు కొందరు ప్రైవేటు నర్సరీ వాళ్లు రైతులకు ఏగిశ మొక్కల్ని ఎర్రచందనం మొక్కలని నమ్మబలికి అంటగడుతూ ఉంటారని, రైతులు అప్రమత్తతంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏగిశ మొక్కలు కొన్ని సంవత్సరాల వరకు ఎర్రచందనం మాదిరిగానే కనిపిస్తాయట. కాండం కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది. కాబట్టి మొక్కలను కొనుగోలు చేసేటప్పుడే రైతులు జాగ్రత్తవహించాలి. అటవీ శాఖ ద్వారా మొక్కల్ని కొనుగోలు చేయటం ఉత్తమం అని ఐఎఫ్బి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 30 ఏళ్లలో చెట్టుకు 59 కిలోల చేవ అటవీ జీవవైవిధ్య సంస్థ (ఐఎఫ్బి) సమాచారం ప్రకారం.. ఎర్రచందనం మొక్కల్ని 3“3 మీటర్ల దూరంలో (హెక్టారుకు 1,111 మొక్కలు) నాటుకోవచ్చు. ఎర్రచందనం చెట్టు కోతకు రావటానికి 30 ఏళ్లు పడుతుందని ఐఎఫ్బి నిపుణులు తెలిపారు. నాటిన 20 ఏళ్లకు కాండం లోపలి భాగం (హార్డ్ వుడ్) చేవదేలటం ప్రారంభమవుతుంది. కాండంపై బెరడు కింద తెల్ల చెక్క ఉంటుంది. దాని లోపల ఎర్రగా చేవదేలి ఉంటుంది. ఆ ఎర్రని చేవ గల కర్రే విలువైనది. 30 ఏళ్ల వయసున్న చెట్టు నుంచి 59 కిలోల చేవగల ఎర్రచందనం దుంగ వెలువడుతుంది. పోయిన చెట్లు పోగా 30 ఏళ్లకు హెక్టారుకు కనీసం 275 చెట్లు మిగులుతాయి. ఈ లెక్కన హెక్టారుకు 16.2 మెట్రిక్ టన్నుల బరువైన ఎర్రచందనం లభిస్తుంది. 40 ఏళ్లకు 38 మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని ఐఎఫ్బి అంచనా. 2017లో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వేలంలో మెట్రిక్ టన్ను ఎర్రచందనం దుంగలు రూ. 27.8 లక్షలకు అమ్ముడయ్యాయి. రాళ్ల భూముల్లో పెరుగుతుంది! ఎర్రచందనం ఎగుమతిపై పరిమితులు రద్దవటం వల్ల రైతులకు ఇబ్బందులు తొలగిపోతాయి. మధ్యవర్తులపై ఆధారపడకుండా రైతులు నేరుగా ఎగుమతిదారులను సంప్రదించడానికి వీలవుతుంది. ఎర్రచందనం తోటల సాగు విస్తీర్ణం పెరుగుతుంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో ఇతరత్రా పంటలు సాగుకు అనువుకాని రాళ్లు రప్పలతో కూడిన మెట్ట భూములు, గుట్టల్లో ఎర్రచందనం చెట్లు పెరుగుతాయి. ఒక సంవత్సరం మొక్కల్ని నీరు పోసి రక్షిస్తే చాలు. తర్వాత వాటికవే పెరుగుతాయి. ఎరువులు అవసరం లేదు. 30 ఏళ్లలో కోతకు వస్తాయి. ఐఎఫ్బిలో ఎర్రచందనం మీద చాలా ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నాం. వన విజ్ఞాన కేంద్రం ద్వారా ప్రతి ఏటా రైతులు, అటవీ సిబ్బంది, విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. ఎర్రచందనం పెంపకం మాన్యువల్, ఎర్రచందనం–ఏగిశ (బిజసాల్) మధ్య వ్యత్యాసాలు, ఎర్రచందనాన్ని ఆశించే చీడపీడలు, నియంత్రణ చర్యలపై కరపత్రాలను విడుదల చేశాం. – వెంకట్‌రెడ్డి, సంచాలకులు, అటవీ జీవవైవిధ్య సంస్థ (ఐఎఫ్బి), దూలపల్లి, హైదరాబాద్ director_ifb@icfre.org ఎర్రచందనం రైతులకు ప్రయోజనకరం అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న జీవజాతుల పరిరక్షణ చర్యలను జెనీవాలోని ‘సైట్స్’ అనే అంతర్జాతీయ సంస్థ నియంత్రిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎర్రచందనం దుంగలను ఈ సంస్థ నిర్ణయించే పరిమితి మేరకే ఏటా ఎగుమతి జరుగుతోంది. దీంతో ఆ కోటా కన్నా ఎక్కువ ఎర్రచందనం మన రైతుల దగ్గర ఉన్నా ఎగుమతి చేసే వీలుండేది కాదు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల కృషి మేరకు ఎగుమతిపై ఉన్న పరిమాణాత్మక పరిమితిని ‘సైట్స్’ ఇటీవల రద్దు చేసింది. దీంతో ఎర్రచందనం ఎగుమతుల నియంత్రణ అంశం మన దేశంలోని ‘సైట్స్’ ఇండియా అథారిటీ పరిధిలోకి వచ్చింది. ఎర్రచందనం ఎగుమతిదారులు ఇక మీదట సైట్స్ ఇండియా అనుమతి తీసుకుంటే సరిపోతుంది. ఎర్రచందనం సాగు చేసే రైతులకు ఇది ప్రోత్సాహకర పరిణామం. సాగు చేసిన ఎర్రచందనం దుంగలను అప్పటికప్పుడు అమ్మెయ్యాల్సిన అవసరం లేదు. నిల్వ చేసి అయినా మంచి ధరకు రైతులు అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది. ఎర్రచందనం సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. – వై. మధుసూదన్ రెడ్డి, అటవీ దళాల అధిపతి (పిసిసిఎఫ్), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ (చదవండి: పేదరికం తగ్గిన ఆహార వినియోగం పెరగలేదు!) -
పేదరికం తగ్గిన ఆహార వినియోగం పెరగలేదు!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: తలసరి ఆదాయం పెరిగి పేదరికం తగ్గిన దశలో శక్తినిచ్చే ఆహార వినియోగం పెరగటం ప్రపంచదేశాల్లో సర్వసాధారణం కాగా, భారత్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రముఖ వ్యవసాయ ఆర్థిక వేత్త డాక్టర్ రమేశ్ చంద్ అన్నారు. 2012కు ముందు 30 ఏళ్లలో తలసరి ఆదాయం పెరిగి, పేదరికం తగ్గినప్పటికీ శక్తినిచ్చే ఆహార వినియోగం మాత్రం తగ్గిందన్నారు. పేదరికాన్ని తగ్గించినంత సులువుగా శక్తినిచ్చే ఆహార వినియోగాన్ని పెంపొందించలేకపోవటం అనే విచిత్ర పరిస్థితి మన దేశంలో నెలకొన్నదన్నారు. ప్రపంచ దేశాల పోకడకు భిన్నమైన ఈ ఆహార వినియోగ ధోరణికి మూలకారణాన్ని శోధించాలన్నారు. శనివారం సాయంత్రం ఇక్కడి జాతీయ పోషకాహార సంస్థలో ఆయన డా. గోపాలన్ స్మారకోపన్యాసం చేశారు. ఆహార లభ్యత గత 50 ఏళ్లలో గణనీయంగా పెరిగినప్పటికీ శక్తినిచ్చే ఆహార వినియోగం తగ్గటం వెనుక మర్మాన్ని మన పౌష్టికాహార నిపుణులు శోధించాల్సిన అవసరం ఉందని డా. రమేశ్ చంద్ తెలిపారు. 1980 నుంచి 2012 నాటికి భారత్‌లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి శాతం 38 నుంచి 16కి తగ్గిందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార-వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.)చెబుతున్నదన్నారు. అయితే, హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్.ఐ.ఎన్.) గణాంకాల ప్రకారం మాత్రం వీరి శాతం 2012 నాటికి 77%గా ఉందన్నారు. ఎన్.ఐ.ఎన్. విశ్లేషణ నమూనాను ఎఫ్.ఎ.ఓ. నమూనాతో అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గతంతో పోల్చితే ప్రజలకు యాంత్రీకరణ పెరిగి, శారీరక శ్రమ చేయాల్సిన అవసరం తగ్గింది. కాబట్టి, ప్రొటీన్లు, ఐరన్ వంటి పోషకాలు తీసుకోవటం పెరిగినా శక్తినిచ్చే ఆహార ధాన్యాల వినియోగం తగ్గి ఉంటుందన్నారు. భారతీయ సంస్కృతిలోని ఆహారం తక్కువగా తినటం ఆరోగ్యదాయకం అన్న భావన కారణంగానే కేలరీల వినియోగం తగ్గిందని ఫ్రెంచ్ ఆంత్రపాలజిస్ట్ ఫ్రెడరిక్ లెండి విశ్లేషించారని, ఈ కోణంలో పరిశోధనలు చేయాలని డా. రమేశ్ చంద్ అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే ఆహార ధాన్యాలు మనుషులతో పాటు పశువులకు మేపుతున్నామా? లేకపోతే ఆహారధాన్యాలు ఏమవుతున్నాయన్నది అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. తక్కువ పరిమాణంలో ఆహార వినియోగం జరుగుతున్నందున పోషకాల సాంద్రత ఎక్కువగా ఉన్న ఆహారోత్పత్తి చేపట్టాలి. స్థానిక / సంప్రదాయ ఆహారాన్ని వినియోగించే దిశగా ప్రోత్సహించాలన్నారు. చిరుధాన్యాలను మధ్య, ఉన్నతి తరగతి ప్రజలు మరింతగా తింటున్నారని, అంటూ చిరుధాన్యాలకు మరింత ధర చెల్లిస్తే సాగుతో పాటు లభ్యత పెరుగుతుందని డా. రమేశ్ చంద్ అన్నారు. ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు. దేశీయంగా గత పదేళ్ల నేషనల్ శాంపుల్ సర్వే గణాంకాల సేకరణ ఫలితాలు వెలువడాల్సి ఉందన్నారు. 2012 తర్వాత ప్రజల ఆదాయం బాగా పెరిగిందని అంటూ.. ఈ గణాంకాల్లో ఎంత మార్పు కనిపిస్తుందో వేచిచూడాలన్నారు. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (చదవండి: సహకార ‘భారత్ ఆర్గానిక్స్’! -
సహకార ‘భారత్ ఆర్గానిక్స్’!
సహకార రంగంలో పాల ఉత్పత్తులకు కొండగుర్తుగా మారిన ‘అమూల్’ బ్రాండ్ మాదిరిగానే ప్రకృతి/సేంద్రియ ఆహారోత్పత్తుల విక్రయానికి ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్‌ను కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఇటీవల ఆవిష్కరించింది. ప్రకృతి /సేంద్రియ వ్యవసాయదారులు దేశవ్యాప్తంగా పండిస్తున్న ఆరోగ్యదాయక ఆహారోత్పత్తులకు ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్ ఇక చిరునామాగా మారనుంది. ఇందుకోసం రూ. 500 కోట్ల అధీకృత మూలధనంతో ‘నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్)’ పేరిట ఓ మెగా మల్టీస్టేట్ కోఆపరేటివ్ ఏర్పాటైంది. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పిఓల) నుంచి పంట దిగుబడులను ఎన్‌సిఓఎల్ కొనుగోలు చేస్తుంది. వాటిని శుద్ధి చేసి, విలువను జోడిస్తుంది. ఆ సేంద్రియ ఆహారోత్పత్తులను ‘భారత్ ఆర్గానిక్స్’ పేరిట దేశవిదేశాల్లో విక్రయిస్తుంది. ప్రస్తుతం బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, బెల్లం, రాజ్మా అమూల్ నెట్వర్క్ ద్వారా విక్రయాలు ప్రారంభమయ్యాయి. 2024 జనవరి నుంచి మరో 14 రకాలు కూడా అమ్ముతారు. లాభాల్లో 50%ను రైతులకు తిరిగి చెల్లించనున్న ఈ మెగా ఆర్గానిక్ మార్కెటింగ్ కోఆపరేటివ్ గురించి కథనం.. సేంద్రియ / ప్రకృతి సేద్యంలో పండించిన రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయక ఆహారోత్పత్తుల ప్రాధాన్యాన్ని ప్రపంచం అర్థం చేసుకుంటోంది. 27 లక్షల హెక్టార్లలో సేంద్రియ/ప్రకృతి సాగుతో ప్రపంచంలో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 34 లక్షల మంది సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులలో 16 లక్షల మంది మన దేశీయులే. అయినప్పటికీ, విశ్వ విపణిలో మన సేంద్రియ ఉత్పత్తుల వాటా మాత్రం 2.7% మాత్రమే. సేంద్రియ ఉత్పత్తులు పండించే రైతులు, సహకార సంఘాలు, ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పిఓ) నుంచి ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించి, కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి, మార్కెట్ చేయడానికి దేశంలో తగినన్ని ప్రభుత్వ /సహకార రంగంలో సదుపాయాలు లేకపోవటం ఇందుకు ఒక కారణంగా చెప్పొచ్చు. రసాయనిక అవశేషాల్లేని పంటలు పండించే రైతుల్లో చాలా మందికి ఆ పంట దిగుబడులను మంచి ధరకు అమ్ముకోవటం సమస్యగా మారింది. అదేమాదిరిగా, పూర్తిగా నమ్మదగిన సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తులను ప్రజలకు నేరుగా విక్రయించే దేశవ్యాప్త వ్యవస్థ కూడా ఇన్నాళ్లూ కొరవడింది. ఇప్పుడు ఆ కొరత తీరనుంది. రూ.500 కోట్ల అథీకృత మూలధనం ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు మూడు అతిపెద్ద మల్టీస్టేట్ కోఆపరేటివ్‌లను కేంద్ర సహకార శాఖ ఇటీవల నెలకొల్పింది. సర్టిఫైడ్ విత్తనాలు/దేశీ వంగడాల పరిరక్షణ, సరఫరా కోసం ఒకటి.. సహకార కళాకృతులు, ఇతర ఉత్పత్తుల మార్కెటింగ్‌కు మరొకటి.. ఈ కోవలోనిదే ‘నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్)’ కూడా. రూ.500 కోట్ల అథీకృత మూలధనంతో ఎన్‌సిఓఎల్ ఏర్పాటైంది. మల్టీ–స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 2002 కింద నమైదైంది. దేశంలోని 5 ప్రధాన సహకార సంఘాలు, సంస్థలు సేంద్రియ/ప్రకృతి రైతులకు సౌలభ్యకరమైన, ఆధారపడదగిన, శక్తివంతమైన, సహకార మార్కెటింగ్ వ్యవస్థను అందించటంతో పాటు.. దేశంలోనే కాదు విదేశాల్లోని వినియోగదారులకు విశ్వసనీయతతో కూడిన సేంద్రియ సహకార ఆహారోత్పత్తులను ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్ ద్వారా అందుబాటులోకి తేవటమే ఎన్‌సిఓఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. సేంద్రీయ రైతు ఉత్పత్తి సంస్థలకు మార్కెట్లోకి ప్రత్యక్ష ప్రవేశం కల్పించడం ద్వారా ఉత్పత్తులపై రాబడిని పెంచడం ఎన్‌సిఓఎల్ లక్ష్యం. బలమైన బ్రాండ్‌తో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశించటం ద్వారా సహకార సంఘాల్లో సభ్యులైన రైతులు తమ సేంద్రియ ఉత్పత్తులకు మెరుగైన రాబడిని పొందుతారు. సంబంధిత మంత్రిత్వ శాఖల సహకారంతో దేశవ్యాప్తంగా వివిధ సహకార సంఘాలు, సంబంధిత సంస్థలు ఉత్పత్తి చేసే సేంద్రియ ఉత్పత్తుల మొత్తం సరఫరా గొలుసును నిర్వహించడం ద్వారా ఎన్‌సిఓఎల్ ఒక గొడుగు సంస్థగా పనిచేస్తుంది. దక్షిణాది తొలి సభ్యత్వం ఏదైనా సహకార సంఘం లేదా వ్యక్తుల సంఘం (సెంట్రల్ రిజిస్ట్రార్ అనుమతించిన విధంగా) ఎన్‌సిఓఎల్‌లో సభ్యత్వం పొందవచ్చు. దాదాపు 2,000 సహకార సంఘాలు ఇప్పటికే ఎన్‌సిఓఎల్‌లో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎన్‌సిఓఎల్‌లో తొలి సభ్యత్వాన్ని పొందిన ఘనత ఎఎస్ఆర్ జిల్లాకు చెందిన ‘ఎం.నిట్టపుట్టు గిరిజన రైతు సేవా మరియు ఉత్పత్తిదారుల మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ’కి దక్కింది. ఎన్‌సిఓఎల్ మెంబర్షిప్ సర్టిఫికెట్‌ను అమిత్‌షా నుంచి సొసైటీ సీఈవో పి. గంగరాజు అందుకున్నారు. సభ్యత్వ ధృవీకరణ అందుకున్న తొలి ఐదుగురిలో ఈయన ఒకరు కావటం విశేషం. అతిపెద్ద బ్రాండ్ కానున్న ‘భారత్ ఆర్గానిక్స్’ రానున్న పదేళ్లలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్గానిక్ ఫుడ్ బ్రాండ్‌గా ‘భారత్ ఆర్గానిక్స్’ రూపుదాల్చుతుందని ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌సిఓఎల్ ఆవిర్భావ సభలో కేంద్ర సహకార మంత్రి అమిత్‌షా ఆశాభావం వ్యక్తం చేశారు. భూసారం, సేంద్రియ ఆహారోత్పత్తుల పరీక్షల కోసం ప్రతి జిల్లా, తహసీల్‌లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్(ఎన్‌పిఓపి) గుర్తింపు పొందిన లేబరేటరీలు ఏర్పాటు కానుండటం విశేషం. ప్రకృతి సేద్యానికి మరింత ప్రోత్సాహం నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్) ఆవిర్భావంతో సర్టిఫైడ్ ఆర్గానిక్ ఆహారోత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థ జాతీయ స్థాయిలో వ్యవస్థీకృతం అవుతుండటం ఆనందదాయకం. మార్కెటింగ్ సదుపాయం పెరిగితే ప్రకృతి సేద్య విస్తీర్ణం మరింత పెరగటానికి వీలవుతుంది. ఎన్‌సిఓఎల్ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏపీ రైతు సాధికార సంస్థ నోడల్ ఏజన్సీగా పనిచేస్తోంది. ఎన్‌సిఓఎల్‌లో వ్యక్తిగతంగా రైతులు సభ్యులుగా చేరలేరు. 1964 సహకార చట్టం, 1995 మాక్స్ చట్టం కింద రిజిస్టరైన ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘాలు, ఎఫ్పిఓలు (కంపెనీ చట్టం కింద నమోదైన ఎఫ్పిఓలు అర్హులు కాదు), మండల మహిళా సమాఖ్యలు ఎన్‌సిఓఎల్‌లో సభ్యులుగా చేరొచ్చు. కనీస మద్దతు ధర లేదా మార్కెట్ ధరలో ఏది ఎక్కువ ఉంటే దాని మీద అదనంగా 10–15 శాతం ప్రీమియం చెల్లించి ఎన్‌సిఓఎల్ కొనుగోలు చేస్తుంది. లాభాల్లో 50% సభ్యులకు తిరిగి చెల్లిస్తుంది. ఏపీలో ప్రతి జిల్లాకు రెండు చొప్పున ఎఫ్పిఓలు /సహకార సంఘాలు /మండల సమాఖ్యలను సభ్యులుగా చేర్చుతున్నాం. ప్రస్తుతానికి ప్రాసెసింగ్ చేసిన బియ్యం, బెల్లం, కందిపప్పు, పెసరపప్పు,శనగపప్పు, రాజ్మా గింజలను ఎన్‌సిఓఎల్ కొనుగోలు చేస్తున్నది. వచ్చే జనవరి నుంచి 20 రకాల సేంద్రియ ఆహారోత్పత్తుల్ని కొనుగోలు చేస్తుంది. చిత్తూరు జిల్లాలోని అమూల్ సంస్థ ఆవరణలో ప్రాసెసింగ్ యూనిట్‌ను ఎన్‌సిఓఎల్ నెలకొల్పనుంది. అమూల్ ఆర్గానిక్స్ బ్రాండ్‌తో ఈ ఉత్పత్తులు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్ ఉత్పత్తులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఉత్తరాదిలో సఫల్, మదర్ డెయిరీ, అమూల్ రిటైల్ ఔట్లెట్లలో సేంద్రియ ఆహారోత్పత్తుల విక్రయం ప్రారంభమైంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఎన్‌సిఓఎల్ ఆవిర్భావ సభలో ఏపీ ఆర్‌వైఎస్‌ఎస్ నుంచి వచ్చిన 55 మంది ప్రతినిధులం పాల్గొన్నాం. ప్రతి జిల్లాకు రెండు చొప్పున ఎఫ్పిఓలు, సహకార సంఘాలు, మాక్స్ చట్టం కింద నమోదైన మండల సమాఖ్యలను సభ్యులుగా చేర్పిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం విస్తారంగా జరుగుతున్న ఏపీ నుంచే ఎక్కువ సభ్యులు చేరే అవకాశం ఉంది. ఏపీ నుంచి ఎన్‌సిఓఎల్‌లో చేరదలచిన సంస్థలు మమ్మల్ని సంప్రదించవచ్చు. – బొడ్డు ప్రభాకర్ (97714 63539), మార్కెటింగ్ హెడ్, రైతు సాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. prabhakar@ryss.ap.gov. త్వరలో ఆన్లైన్ విక్రయాలు ప్రకృతి/సేంద్రియ వ్యవసాయోత్పత్తులను సహకార సంఘాలు, ఎఫ్పిఓల నుంచి కనీస మద్దతు ధరకన్నా కొంత అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తాం. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. ఎన్‌సిఓఎల్ పొందే నికర లాభాల్లో 50 శాతం మొత్తాన్ని రైతులకు తిరిగి చెల్లిస్తాం. ప్రకృతి/సేంద్రియ ఆహారోత్పత్తులను ‘భారత్ ఆర్గానిక్స్’ బ్రాండ్‌తో ప్రజలకు రిటైల్‌గా ఆన్లైన్లో విక్రయించే సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం ఈ ప్రయత్నాలు చివరి దశలో ఉన్నాయి. ఎన్‌సిఓఎల్‌లో సభ్యులుగా చేరదలచిన సహకార సంఘాలు, ఎఫ్పిఓలు, మండల సమాఖ్యలు ఏ రాష్ట్రం వారైనప్పటికీ ఈ కింది మెయిల్ ఐడి ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. – కోదండపాణి, మేనేజింగ్ డైరెక్టర్, నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ (ఎన్‌సిఓఎల్), న్యూఢిల్లీ. cooporganics@gmail.com వినియోగదారుల సందేహాలకు తావుండదు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆహారోత్పత్తులను కొనేటప్పుడు వినియోగదారులు వీటిని ఎవరు, ఎక్కడ పండించారు? నిజంగా ఆర్గానిక్గానే పండించారా అనే సందేహాలు వస్తుంటాయి. ఎన్‌సిఓఎల్ ద్వారా ‘భారత్ ఆర్గానిక్స్’ సేంద్రియ ఆహారోత్పత్తులు మార్కెట్లో అందుబాటులోకి వస్తే ప్రజలకు ఈ సందేహాలు తీరిపోతాయి. మా గిరిజన సహకార సంఘం దక్షిణాది నుంచి ఎన్‌సిఓఎల్‌లో తొలి సభ్యత్వం పొందటం ఆనందంగా ఉంది. గతంలో ఉన్న మార్కెటింగ్ సమస్యలు తీరిపోతాయి. ఎఎస్ఆర్ లల్లా జి. మాడుగుల మండలంలో 3683 మంది గిరిజన రైతులు మా సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. ఇందులో 2012 మంది సర్టిఫైడ్ ఆర్గానిక్ రైతులు. కాఫీ, మిరియాలు, పిప్పళ్లు, పసుపు, అల్లం, రాజ్మా ఎగుమతుల కోసం విక్రయిస్తున్నాం. ఇతర పంట దిగుబడులను స్థానిక మార్కెట్లలో అమ్ముతున్నాం. ప్రభుత్వ ధరకన్నా ఎక్కువ ధరనే రైతులకు చెల్లిస్తున్నాం. గత ఏడాది రూ. 4 కోట్ల కాఫీ, మిరియాలు విక్రయించాం. ఏపీ ఆర్‌వైఎస్‌ఎస్, ఉద్యానశాఖ తోడ్పాటుతో 10 టన్నుల గోదాములు నిర్మించాం. ప్రకృతి వ్యవసాయంలో ఆరితేరిన మా రైతులు 20 మంది మేఘాలయ వెళ్లి అక్కడి రైతులకు ప్రకృతి సేద్యం నేర్పిస్తున్నారు. గత ఏడాది మా సొసైటీకి జాతీయ జైవిక్ ఇండియా పురస్కారం కూడా లభించింది. ఎన్‌సిఓఎల్ ద్వారా రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుంది. – పి. గంగరాజు (63018 76177), సీఈఓ, ఎం.నిట్టపుట్టు గిరిజన రైతుల సొసైటీ, అరకు, ఎఎస్ఆర్ జిల్లా – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (చదవండి: వరి ఆకారపు మిల్లెట్లు! మిల్లెట్లు తినేవారిగా మార్చేలా) -
వరి ఆకారపు మిల్లెట్లు!
సాక్షి, హైదరాబాద్: మిల్లెట్ డైట్‌ను ప్రోత్సహించేందుకుగాను తాము చేపట్టిన కార్యక్రమాల్లో మిల్లెట్లను బియ్యం ఆకారంలోకి మార్చడం ఒకటని న్యూట్రీహబ్ సీఈవో డాక్టర్ రావు తెలిపారు. సాయిల్ టు సోల్ అనే అంశంపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్‌కు విచ్చేసిన మహిళా పారిశ్రామికవేత్తల బృందంతో డాక్టర్ రావు మాట్లాడారు. మిల్లెట్ డైట్‌పై అవగాహన కల్పించి, ఎక్కువ మంది వీటిని తమ డైట్లో భాగం చేసుకునేలా చేసేందుకే తాము ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు. చాలా మంది అన్నం తినడానికి ఇష్టపడతారు. అలాంటి వారికి మిల్లెట్లు అన్నంలాగా కనిపిస్తాయి. బియ్యం ఆకారంలో తృణధాన్యాలను అందజేస్తాం. తద్వారా వాటికి ఆమోదయోగ్యం పెరుగుతుంది మూడు వేల సంవత్సరాల నాటి తృణధాన్యాల సమూహానికి మరింత యాక్సెప్టెన్స్ పెంచడానికి ఇది ఒక చొరవ. మిల్లెట్లను బియ్యంగా పునర్నిర్మించేటప్పుడు వాటి పోషక విలువలు ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మిల్లెట్లను బియ్యం రూపంలోకి మార్చడం ద్వారా, మేము వాటి షెల్ఫ్-లైఫ్‌ను పెంచుతున్నాం. మిల్లెట్లు పురాతన ఆహార ధాన్యాలలో ఒకటని, వాటి సాగు దాదాపు క్రీస్తుపూర్వం మూడు వేల సంవత్సరాల నాటిదని ఆధారాలున్నాయి. ఇది ప్రపంచ విస్తీర్ణంలో 19 %, ప్రపంచ ఉత్పత్తిలో 20%తో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మిల్లెట్ ఉత్పత్తిదారుగా ఉంది. ప్రపంచంలో సాగవుతున్న 18 మిల్లెట్లలో 11 భారత్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. మిల్లెట్లు గుండె జబ్బులు, పెద్దపేగు క్యాన్సర్‌ను నివారిస్తాయి. టైప్-2 డయాబెటిస్‌ను నిరోధించడంలో సహాయపడతాయి. బరువు తగ్గిస్తాయి. మిల్లెట్లు గ్లూటెన్ రహిత ఆహారం. ఇది గర్భిణీ, బాలింతలకు మంచిది, పిల్లలలో పోషకాహార లోపాన్ని నివారిస్తుంది. భారతదేశంలో మిల్లెట్ డిమాండ్‌ను పునరుద్ధరించడానికి ఐఐఎమ్ఆర్ కృషి చేస్తోంది. వాణిజ్యపరంగా ఐఐఎంఆర్‌లో న్యూట్రిహబ్ టీబీఐఎస్సీ ఉంది. ఇది మిల్లెట్స్‌కు ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసింది. ఇది గత ఐదు ఏళ్లలో 400 స్టార్టప్‌లతో సుమారు రెండు కోట్ల వరకు మూలధనాన్ని సేకరించాయి. ప్రస్తుతం వందకు పైగా స్టార్టప్‌లు ఇంక్యుబేట్ చేపడుతున్నాయి. ఇది దాదాపు 70 సాంకేతికతలను అభివృద్ధి చేసిందని డాక్టర్ బి. దయాకర్ రావు తెలిపారు. అంతకుముందు ఐసీఏఆర్- డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి మాట్లాడుతూ, “మనము ఆహరం పేరిట కేలరీలను మాత్రమే తింటున్నాము. పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. తృణధాన్యాలతో ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రత దిశగా పయనిస్తున్నాం. మిల్లెట్‌ను సూపర్‌ఫుడ్‌గా ప్రదర్శించడం, మనం మర్చిపోయిన వంటకాలను పునరుద్ధరించడం తదితర వాటితో మిల్లెట్ పేద ప్రజల ఆహారం అనే కళంకాన్ని తొలగించే మన ప్రధాన ఆహారంలో భాగంగే చేసే యత్నం చేస్తోంది ఐఐఎంఆర్. ఇక మిల్లెట్ వాల్యూ చైన్‌లో 500కి పైగా స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని, ఐఐఎంఆర్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద మరో 250 స్టార్టప్‌లను ప్రారంభించామని ఐసీఏఆర్ డైరెక్టర్ సత్యవతి అన్నారు. దాదాపు 66 స్టార్టప్‌లకు సుమారు రూ. 6.2 కోట్ల నిధులను పంపిణీ చేయగా, మిగిలిన 25 స్టార్టప్లుకు కూడా నిధుల విడుదలకు ఆమోదం లభించినట్లు తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఎల్ఓ చైర్పర్సన్ రీతు షా మాట్లాడుతూ.. మిల్లెట్లు ప్రోటీన్, ఫైబర్, కీలకమైన విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలమని అన్నారు. ఇది అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం కాబట్టి ఎఫ్ఎల్ఓ తమ సభ్యులకు మరిన్ని వ్యాపార అవకాశాలను లభించాలని ఆశిస్తోంది. అందుకే ఈ టూర్ ప్లాన్ చేశామని ఆమె తెలిపారు. మిల్లెట్స్‌లో వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి ఆసక్తి ఉన్న పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు అనేక ప్రశ్నలు సంధించి..వివరణలు పొందారు. ఇక ఈ కార్యక్రమం చివర్లో వారు పారిశ్రామికవేత్తల కోసంఐఐఎంఆర్ సృష్టించిన సౌకర్యాలను కూడా సందర్శించి పరిశీలించారు. (చదవండి: ఆహారానికి ‘అనారోగ్య మూల్యం’ అంతింత కాదయా!) -
ఆహారానికి ‘అనారోగ్య మూల్యం’ అంతింత కాదయా!
వ్యవసాయ రంగం, ఆహార శుద్ధి పరిశ్రమల వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 కోట్ల మంది ప్రజల ఆకలి తీర్చుతూ, కోట్లాది మందికి ఉపాధి చూపుతున్నాయి. అయితే, అస్తవ్యస్థ వ్యవసాయ పద్ధతులు, ఆహార శుద్ధి–పంపిణీ గొలుసు వ్యవస్థల కారణంగా మన ఆరోగ్యంతో పాటు, భూగోళం ఆరోగ్యానికి కూడా పరోక్షంగా తీరని నష్టం జరుగుతోంది. నగదు రూపంలో అది ఎంత ఉంటుందో ఇప్పటి వరకూ ఇదమిత్దంగా తెలియదు. మొట్టమొదటి సారిగా ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రపంచవ్యాప్తంగా 154 దేశాల్లో ప్రజలు అపసవ్యమైన ఆహార వ్యవస్థల మూలంగా పరోక్షంగా చెల్లిస్తున్న ఈ మూల్యం ఎంతో లెక్కగట్టి తాజా నివేదికలో వెల్లడించింది. ప్రతి ఏటా మనం చెల్లిస్తున్న ఈ ‘పరోక్ష మూల్యం’ ఎంత ఎక్కువంటే.. అది మన ఊహకు కూడా అందదు! ఏకంగా 12.7 లక్షల కోట్ల డాలర్ల నష్టం జరుగుతోందట. ప్రపంచ దేశాల స్థూల జాతీయోత్పత్తిలో ఇది పది శాతం వరకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పరోక్ష మూల్యాన్ని ఎక్కువగా చెల్లిస్తున్న మొదటి రెండు దేశాలు చైనా (2.5 లక్షల కోట్ల డాలర్లు. 20%), అమెరికా (1.5 లక్షల కోట్ల డాలర్లు. 12.3%). ఆ తర్వాత స్థానం భారత్ (1.1 లక్షల కోట్ల డాలర్లు. 8.8%)దే. మూడేళ్ల క్రితం నాటి గణాంకాలు.. 2020 నాటి గణాంకాల ఆధారంగా, అప్పటి మార్కెట్ ధరలు, కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి, ఏయే దేశం ఎంత మూల్యం చెల్లించిందో ఎఫ్.ఎ.ఓ. లెక్కతేల్చింది. పర్చేజింగ్ పవర్ పారిటీ (పిపిపి) ప్రకారం డాలర్ మార్పిడి విలువను ఎఫ్ఎఓ నిర్థారించింది. భారత్‌కు సంబంధించి డాలర్ మార్పిడి విలువను రూ. 21.989గా లెక్కగట్టింది. 12.7 లక్షల కోట్ల డాలర్లలో భారత్ వాటా 8.8%. అంటే.. 1.1 లక్షల కోట్ల డాలర్లు. ఆ విధంగా చూస్తే మన దేశం వ్యవసాయ, ఆహార వ్యవస్థల మూలంగా ప్రతి ఏటా రూ. 25 లక్షల కోట్లను ‘పరోక్ష మూల్యం’గా చెల్లిస్తోంది. జబ్బులకు వైద్యం కోసం ప్రతి ఏటా రూ. 14.7 లక్షల కోట్లు చెల్లిస్తోంది. రూ. 6.2 లక్షల కోట్ల మేరకు ఏటేటా పర్యావరణ, జీవైవిధ్య నష్టాన్ని చవిచూస్తోంది. సాంఘిక అంశాలకు సంబంధించి రూ.4.1. లక్షల కోట్ల మేరకు ప్రతి ఏటా పరోక్ష మూల్యంగా చెల్లిస్తోంది. అయితే, ఈ జాబితాలోకి చేర్చని విషయాలు ఇంకా ఉన్నాయని, అవి కూడా కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఎఫ్ఎఓ వివరించింది. పిల్లల్లో పెరుగుదల లోపించటం, పురుగుమందుల ప్రభావం, భూసారం కోల్పోవటం, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్, ఆహార కల్తీ వల్ల కలిగే అనారోగ్యాలకు సంబంధించిన పరోక్ష మూల్యాన్ని గణాంకాలు అందుబాటులో లేని కారణంగా ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకోలేదని, అవి కూడా కలిపితే నష్టం మరింత పెరుగుతుందని ఎఫ్ఎఓ పేర్కొంది. ‘పరోక్ష మూల్యా’న్ని లెక్కించేదిలా? ఆహారోత్పత్తులను మనం మార్కెట్లో ఏదో ఒక ధరకు కొనుగోలు చేస్తూ ఉంటాం. పోషకాలు లోపించిన, రసాయనిక అవశేషాలతో కూడిన ఆ ఆహారోత్పత్తులకు నేరుగా మనం చెల్లించే మూల్యం కన్నా.. వాటిని తిన్న తర్వాత మన ఆరోగ్యంపై, పర్యావరణంపై కలిగే ప్రతికూల ప్రభావాల వల్ల దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉందని అమెరికాలో రాక్ఫెల్లర్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఆహారాన్ని కొన్నప్పుడు చెల్లించే ధరతో పాటు.. తదనంతర కాలంలో మనం మరో విధంగా (ఉదా.. వైద్య ఖర్చులు, పర్యావరణ నష్టాలకు..) చెల్లిస్తున్న మూల్యాన్ని కూడా కలిపి చూస్తేనే మనకు దానికి చెల్లిస్తున్న ‘అసలు ధర’ పూర్తిగా తెలుస్తుంది. అందుకే దీన్ని ‘హిడెన్ కాస్ట్’ అంటున్నారు. ‘ట్రూ కాస్ట్ అకౌంటింగ్’ అనే సరికొత్త మూల్యాంకన పద్ధతిలో ఆహారోత్పత్తులకు మనం చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యాన్ని’ ఎఫ్ఎఓ లెక్కగట్టింది. ఆ వివరాలను ‘వ్యవసాయ, ఆహార స్థితిగతులు–2023’ పేరిట తాజా నివేదికలో ఎఫ్ఎఓ వెల్లడించింది. వ్యవసాయం చేసే అస్థిర పారిశ్రామిక పద్ధతుల్లో పండించిన ఆహారానికి తోడైన ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల తినే ఆహారమే మన కు దీర్థకాలంలో జబ్బుల పాలు చేస్తోంది. ఊబకాయం, బీపీ, షుగర్, గుండె జబ్బులు, కేన్సర్ వంటి అసాంక్రమిత జబ్బులు ఇటీవల దశాబ్దాల్లో విజృంభించి ప్రజారోగ్యాన్ని హరించడానికి ఈ ఆహారాలే కారణమని ఎఫ్ఎఓ నివేదిక తేల్చింది. ఈ జబ్బులకు చికిత్స ఖర్చు, జబ్బుపడిన కాలంలో కోల్పోయే ఆదాయం కింద చెల్లిస్తున్న ‘పరోక్ష మూల్యం’ ప్రపంచవ్యాప్తంగా 70 శాతం ఉంటే, భారత్‌లో 60% మేరకు ఉంది. అంతేకాదు, మన దేశంలో నత్రజని ఎరువుల వినియోగం వల్ల వెలువడే ఉద్గారాల మూలంగా పర్యావరణానికి, జీవవైవిధ్యానికి మరో 13% చెల్లిస్తున్నాం. వ్యవసాయ కూలీలు, ఆహార పరిశ్రమల్లో కార్మికులు తక్కువ ఆదాయాలతో పేదరికంలో మగ్గటం వల్ల సామాజికంగా మరో 14% పరోక్ష మూల్యాన్ని భారతీయులు చెల్లిస్తున్నారని ఎఫ్ఎఓ తెలిపింది. మరింత సుస్థిరత వైపు.. సంక్షోభాలు, సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ వ్యవసాయ, ఆహార వ్యవస్థలను మరింత సుస్థిరత వైపు నడిపించే ఉద్దేశ్యంతో పాలకులకు ప్రాథమిక అవగాహన కలిగించడమే ప్రస్తుత నివేదిక లక్ష్యం. సమగ్ర విశ్లేషణతో వచ్చే ఏడాది రెండో నివేదిక ఇస్తాం. సుస్థిర వ్యవసాయ, ఆహార వ్యవస్థల నిర్మాణానికి ఏయే దేశాలు ఏమేమి చర్యలు తీసుకోవచ్చు.. రైతులు, వినియోగదారుల ప్రయోజనాల రక్షణకు ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు ఏయే చర్యలు చేపట్టవచ్చో స్పష్టంగా సూచిస్తాం. దీని ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించగలరని ఆశిస్తున్నానని ఎఫ్ఎఓ డైరెక్టర్ జనరల్ డొంగ్యు క్యూ ప్రకటించారు. (చదవండి: 'ప్రకృతి' పద్ధతిలో చీడపీడల యాజమాన్యం మేలు!) -
'ప్రకృతి' పద్ధతిలో చీడపీడల యాజమాన్యం మేలు!
సాక్షి, హైదరాబాద్: వాతావరణ మార్పుల నేపథ్యంలో మెట్ట పంటల సాగును తక్షణమే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చుకోవటం అత్యవసరమని పులివెందులలోని ఇండో–జర్మన్ ఆగ్రోఎకాలజీ అకాడమీ సీనియర్ కన్సల్టెంట్, జాతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ పూర్వ సంచాలకులు డాక్టర్ కె.ఎస్. వరప్రసాద్ అన్నారు. వర్షాధార ప్రాంతాల పొలాలకు సాగు నీటి సదుపాయం కల్పించటం కన్నా సాగు పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా సమూలంగా మార్చటం అవశ్యమని, ఆయన శనివారం నొక్కిచెప్పారు. పంటల ఆరోగ్య యాజమాన్యం– నవ్యత, సుస్థిరత అనే అంశంపై రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ సదస్సులో డా. వరప్రసాద్ ఆసియా పసిపిక్ ప్రాంతంలో సుస్థిర చీడపీడల యాజమాన్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనే అంశంపై ప్రసంగించారు. చీడపీడల యాజమాన్య పద్ధతులను పంటల వారీగా, పురుగుల వారీగా, తెగుళ్ల వారీగా వేర్వేరుగా చూస్తూ వేర్వేరు పరిష్కారాలను వెతకటం కన్నా.. స్థానిక వంగడాల జీవవైవిధ్యంతో కూడిన ప్రకృతి వ్యవసాయం ద్వారా వ్యవస్థాగత పరిష్కారం వెతకడమే మేలన్నారు. ఈ మేరకు నవీనీకరించిన సమీకృత సస్యరక్షణ సూత్రాలను అనుసరించాలని ఆయన సూచించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో కలసి వాసన్ సంస్థ మన దేశంలోని వర్షాధార ప్రాంతాల్లో సంప్రదాయ సాగు పద్ధతులపై నిర్వహించిన అధ్యయనంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయ అనుభవాలు కూడా ఈ విషయాన్ని ధృవపరుస్తున్నాయన్నారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ తెగుళ్ల శాస్త్రవేత్త డాక్టర్ పప్పు హనుమంతరావు రసాయనిక వ్యవసాయ దృష్టికి అతీతంగా ఈ ఫలితాలను శాస్త్రవేత్తలు గమనించాలని సూచించారు. అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని వర్షాధార ప్రాంతాల్లో ప్రకృతి వ్యవసాయ ఫలితాలు కొత్త పాఠాలు నేర్పుతున్నాయని, అంతర్జాతీయ బృందాలు ఈ నెల 26–29 తేదీల్లో ఏపీలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయని డా. వరప్రసాద్ తెలిపారు. స్థానిక ప్రకృతి వ్యవసాయదారుల అనుభవాల ఆధారంగా శాస్త్రవేత్తలు సాగు పద్ధతుల నుంచి చీడపీడల యాజమాన్యం వరకు ఉన్న అంశాలను సరికొత్త దృష్టితో, ముఖ్యంగా వర్షాధార వ్యవసాయం విషయంలో, పరిశీలించాల్సిన తరుణం ఆసన్నమైందని డా. వరప్రసాద్ తెలిపారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ తెగుళ్ల శాస్త్రవేత్త డాక్టర్ పప్పు హనుమంతరావు జీనోమ్ ఎడిటింగ్(జన్యు సవరణ) వంటి అత్యాధునిక సాంకేతికతల ద్వారా చీడపీడల యాజమాన్యంలో ప్రతిబంధకాలను అధిగమించవచ్చని, అనేక పంటలకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. జన్యు మార్పిడి సాంకేతికతపై మాదిరిగా జన్యు సవరణ సాంకేతికతపై అభ్యంతరాలు లేవన్నారు. పిజెటిఎస్ఎయు కీటక శాస్త్ర నిపుణుడు డా. ఎస్.జె. రహమాన్ ప్రసంగిస్తూ జీవన పురుగుమందులను క్షేత్రస్థాయిలో పునరుత్పత్తి చేసుకునే క్రమంలో నాణ్యతా ప్రమాణాలను పాటించటంలో ఖచ్చితత్వం కొరవడితే వ్యాధి కారక క్రిములతో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మార్కెట్లో నకిలీ పంచగవ్య వంటి ద్రావణాలను అధిక ధరలకు విక్రయిస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, నియంత్రణ యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. సుస్థిర వ్యవసాయాభివృద్ధే లక్ష్యం: సుస్థిర వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా పరిశోధనలకు శ్రీకారం చుట్టాలని, రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యంతో ప్రధాని మోదీ శాస్త్రవేత్తలకు ఈ మేరకు దిశానిర్దేశం చేశారని ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డా. ఉదమ్ సింగ్ గౌతమ్ అన్నారు. పంటల ఆరోగ్య యాజమాన్యం– నవ్యత, సుస్థిరత అనే అంశంపై నాలుగు రోజులుగా జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు ముగింపు సభలో శనివారం సాయంత్రం ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. పిపిఎఐ అధ్యక్షులు డా. బి. శరత్‌బాబు, అటారి డైరెక్టర్ డా. షేక్ మీరా తదితరులు పాల్గొన్నారు. ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్వర్ణోత్సవాల సందర్భంగా వెటరన్ శాస్త్రవేత్తలు డా. కృష్ణయ్య, డా. వరప్రసాద్‌లకు జీవన సాఫల్య పురస్కారాలను ప్రదానం చేశారు. (చదవండి: మంచి వ్యవసాయం పద్ధతులే మేలు! ఐసిఎఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ పిలుపు) -
మిగిలిపోయిన అన్నం, కూరల్ని మొక్కలకు పడేయండి
అన్నం, కూరలు మిగిలిపోతే పడేస్తుంటారు. అయితే ఆ పడేసేదేదో మొక్కల దగ్గర పడేస్తే వాటికి కావాల్సిన పోషకాలు అంది, అవి ఏపుగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ►మిగిలిపోయిన పప్పులో నీళ్లు కలిపి పలుచగా చేయాలి. ఈ పప్పు నీళ్లను మొక్కలకు పోయాలి. మజ్జిగ మరీ పుల్లగా అయితే తాగలేము. ఈ పుల్లటి మజ్జిగను బకెట్ నీళ్లల్లో పోసి కలపాలి. ఈ నీటిని మొక్కలకు పోయాలి. ► మిగిలిపోయిన అన్నాన్ని మెత్తగా గ్రైండ్ చేసి నీటిలో కలపాలి. ఈ నీటిని మొక్కలకు పోయాలి. బియ్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు కడిగిన నీటిని సింక్‌లో పోయకుండా మొక్కలకు పోస్తే మంచిది. ► ఉల్లిపాయ తొక్కలు, అరటి తొక్కలను పడేయకుండా నీటిలో నానబెట్టాలి. పదిగంటల తరువాత ఈ నీటిని మొక్కలకు పోయాలి. ఈ నీటి నుంచి నైట్రోజన్, పొటాషియం, ఫాస్పరస్‌లు మొక్కలకు పుష్కలంగా అందుతాయి. చూశారుగా... మిగిలిపోయినవి మొక్కలకు ఎంత మేలు చేస్తున్నాయో. ఇంకెందుకు ఆలస్యం మీ గార్డెన్ మరింత పచ్చగా కళకళలాడించేందుకు ప్రయత్నించండి. -
డ్రాగన్ ఫ్రూట్‌తో దిమ్మతిరిగే లాభాలు, మొదటి పంటలోనే 6లక్షలకు పైగా..
కర్నూలు(అగ్రికల్చర్): కరువులో డ్రాగన్ ఫ్రూట్ సాగు కలసివస్తోంది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. గతంలో ఒకరిద్దరి రైతులకే పరిమితమైన తోటలు ఏడాదికేదాది అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 300 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేసే రైతుకు గరిష్టంగా రూ.1.90 లక్షలు సబ్సిడీ ఇస్తోంది. గతంలో దిమ్మెలు పాతి దానిపై టైర్/బండి చక్రం అమర్చడం ద్వారా మొక్కలు పైకిపాకే ఏర్పాటు చేసేవారు. నేడు ట్రెల్లీస్ విధానంలో(దిమ్మెలపై టైరు/ బండి చక్రం అవసరం లేకుండా తీగలతో ) తోటలు అభివృద్ధి చేస్తున్నారు. మొదటి పంటలోనే రూ.6 లక్షల ఆదాయం దేవనకొండ మండలం వరిముక్కల గ్రామానికి చెందిన కంది రవీంద్రకుమార్ యాదవ్ ట్రెల్లీస్ విధానంలో డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేస్తున్నారు. ఈయన కేవలం 10వ తరగతి వరకు చదువుకున్నారు. మొదటి పంటలోనే రూ. 6 లక్షల ఆదాయం పొందారు. నరసరావు పేట నుంచి మొక్క రూ.60 ప్రకారం తెప్పించి 2021లో నాటుకున్నారు. సాలుకు, సాగుకు మధ్య 14 అడుగులు, దిమ్మెకు, దిమ్మెకు మధ్య 14 అడుగుల దారంలో పోల్స్ నాటుకున్నారు. పోల్స్‌కు విద్యుత్ లైన్ తరహాలో 4 వరుసలతో లైన్ వేశారు. పోల్స్ కింద ఒకదానిపైన ఒకటి ప్రకారం మూడు వైర్లు లాగారు. ఈ వైర్ల కింద అడుగు, అడుగు దూరంలో డ్రాగన్ ప్రూట్ మొక్కలు నాటుకున్నారు. మొక్కలు తీగ తరహాలో పైకి పెరుగుతూ... పైన వేసిన నాలుగు లైన్లు వేసి తీగలపై అల్లుకున్నాయి. దిమ్మెలపై టైరు/బండి చక్రం అవసరం లేకుండా పోయింది. ఎకరన్నర భూమిలో ఏకంగా 7వేల మొక్కలు నాటుకోగా.. పెట్టుబడి వ్యయం రూ.16 లక్షల వరకు వచ్చింది. అంతరపంటగా వేరుశనగ సాలుకు, సాలుకు మధ్య 14 అడుగులు ఉండటంతో ట్రాక్టరుతో సేద్యం చేసుకోవచ్చు. ప్రతి ఏటా అంతరపంటలు సాగు చేసుకునే అవకాశం ఏర్పడింది. డ్రాగన్‌ప్రూట్ మొక్కలకు ఆకులు రావు. తీగలపైనే అల్లుకుంటాయి. మధ్య ఖాళీగా ఉన్న భూమిలో అంతరపంటగా వేరుశనగ సాగు చేసి అదనపు ఆదాయం పొందుతున్నారు. డ్రాగన్‌ప్రూట్ తోటకు మల్చింగ్ సదుపాయం కూడా కల్పించుకున్నారు. దీంతో కలుపు సమస్య లేకుండా పోయింది. తేమ కూడా ఆరిపోదు.. ప్లాస్టిక్ షీట్లకు అడగు, అడుగు దూరంలో రంధ్రాలు వేసి మొక్కలు నాటారు. మల్చింగ్ వల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతోంది. ఏపీఎంఐపీ ద్వారా సూక్ష్మ సేద్యం కల్పించుకున్నారు. ఐదేళ్ల నుంచి పెరగనున్న దిగుబడులు పంటకు కేవలం పశువుల ఎరువులు మాత్రమే ఉపయోగిస్తున్నారు. నాటిని ఏడాదిలోపే 2022 అగస్టులో కాపు మొదలైంది. మొదటి పంటలో కేవలం 3 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. 2023లో దిగుబడి బాగా పెరిగింది. ఈ ఏడాది జూన్‌లో మొదలైన పంట నవంబరు నెలతో ముగింపునకు వస్తోంది. ఈ ఏడాది ఏకంగా 60 క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది. టన్ను రూ.లక్ష ప్రకారం విక్రయించారు. ఇప్పటి వరకు రూ.6 లక్షలకుపైగా ఆదాయం పొందారు. వచ్చే ఏడాది మొక్కకు 20 వరకు పండ్లు వస్తాయి. ఇవి 4 కిలోల వరకు ఉంటాయి. ఈ ప్రకారం 28 టన్నుల వరకు దిగుబడి పెరుగనుంది. నాటిన ఐదేళ్ల నుంచి దిగుబడి గరిష్టస్థాయికి చేరుతుంది. మూడు నెలలు అధ్యయనం చేశా డ్రాగన్న్ఫ్రూట్స్ సాగు చేసే ముందు మూడు నెలలు అధ్యయనం చేశా. ఒక అవగాహనకు వచ్చాక ట్రెల్లీస్ విధానంలో మొక్కలు నాటుకున్నా. మల్చింగ్, పోల్స్, వైర్లు, మొక్కలు తదితర వాటికి పెట్టుబడి కింద రూ.16 లక్షల ఖర్చు వచ్చింది. డ్రాగన్ ప్రూట్స్ సాగుకు ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం రూ.1.90 లక్షల సబ్సిడీ ఇచ్చింది. ఏపీఎంఐపీ కింద డ్రిప్ కూడా మంజూరైంది. – కంది రవీంద్రకుమార్ యాదవ్ సాగును ప్రోత్సహిస్తున్నాం డ్రాగన్ ఫ్రూట్ సాగును ప్రోత్సహిస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సన్న, చిన్నకారు రైతులకు గరిష్టంగా రూ.1.90 లక్షలు సబ్సిడీగా ఇస్తున్నాం. దేవనకొండ మండలం వరిముక్కల గ్రామానికి చెందిన రవీంద్రకుమార్ డ్రాగన్ ఫ్రూట్ సాగులో రాణిస్తున్నారు. – అమరనాథరెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్, డ్వామా -
మంచి వ్యవసాయం పద్ధతులే మేలు!
సాక్షి, హైదరాబాద్: మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో పురుగుమందులను తగుమాత్రంగా వినియోగిచడంతో పాటు పోషక విలువలతో కూడిన అధిక పంట దిగుబడులు తీసేందుకు మంచి వ్యవసాయ పద్ధతుల (గుడ్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్- జిఎపి)ను అనుసరించాల్సిన అవసరం ఉందని, ఇందుకు అనుగుణమైన కొత్త సాంకేతికతలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయాలని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (సస్యరక్షణ, జీవభద్రత) డాక్టర్ ఎస్.సి. దూబే పిలుపునిచ్చారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని పిజెటిఎస్ఎయు ఆడిటోరియంలో ‘సస్యరక్షణ యాజమాన్యంలో నవ్యత, సుస్థిరత’ అనే అంశంపై నాలుగు రోజుల అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో డా. దూబే గౌరవ అతిథిగా పాల్గొన్నారు. భారతీయ సస్యరక్షణ శాస్త్రవేత్తల సంఘం (పిపిఎఐ) స్వర్ణోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ఈ సమావేశంలో డా. దూబే ప్రసంగిస్తూ.. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో చీడపీడలు, తెగుళ్ల తీరుతెన్నుల్లో కూడా వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని, పురుగుమందుల వాడకాన్ని కనిష్టస్థాయికి తగ్గించే సరికొత్త సాంకేతికతలపై పరిశోధనలు చేపట్టాలన్నారు. నాణ్యమైన పరిశోధనా పత్రాల ద్వారా శాస్త్రవేత్తలు వ్యవసాయాభివృద్ధికి దోహదం చేయాలన్నారు. పాలకులు విధానాల రూపుకల్పనకు నేరుగా ఉపయోగపడేలా స్పష్టమైన సిఫారసులు అందించే శాస్త్రవేత్తల సదస్సుల వల్ల ప్రయోజనం చేకూరుతుందని డా. దూబే సూచించారు. జ్యోతిప్రజ్వలనం చేస్తున్న పిజెటిఎస్ఎయు ఉపకులపతి ఎం. రఘునందనరావు. చిత్రంలో ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ ఉపకులపతి డా. ఆర్. శారద జయలక్ష్మి దేవి తదితరులు. ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ కులపతి, వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి ఎం. రఘునందనరావు ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తూ శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణలు, సాంకేతికతలు ఏవైనా ఆహార భద్రత విషయంలో రాజీలేని రీతిలో ఉండాలన్నారు. భూసార క్షీణత, నీటికాలుష్యం వంటి సవాళ్లను ఎదుర్కొనేలా ప్రెసిసెషన్ అగ్రికల్చర్ పద్ధతులపై పరిశోధనలు చేపట్టాలని రఘునందనరావు శాస్త్రవేత్తలను కోరారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మీ దేవి ప్రసంగిస్తూ వాతావరణ మార్పులకు తోడు రసాయనిక ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం వల్ల పంటలతోపాటు మానవులు, పర్యావరణ ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతోందన్నారు. సస్యరక్షణలో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే పద్ధతులు, సాంకేతికతల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అవగాహన కొరవడటంతో 50% రైతులు నకిలీ పురుగుమందులను కొనుగోలు చేసి నష్టపోతున్నారని, అధికారులు చట్టబద్ధంగా నకిలీలను అరికట్టడంలో తాత్సారం చేస్తున్నారని ధనూక అగ్రిటెక్ లిమిటెడ్ చైర్మన్ ఆర్.జి. అగర్వాల్ అన్నారు. ఇంకా ఈ సదస్సులో జాతీయ జీవవైవిధ్య బోర్డు చైర్మన్ డా. అచలేంద్ర రెడ్డి, ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టరబి. శరత్‌బాబు, శ్రీబయోటెక్ ఈస్థటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో డా. కెఆర్కె రెడ్డి, పిజెటిఎస్ఎయు మాజీ కులపతి డా. ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. పలువురు శాస్త్రవేత్తలకు జీవన సాఫల్య పురస్కారాలు ప్రదానం చేశారు. (చదవండి: సహకార స్వర్ణయుగం రానుందా?!) -
ఇల్లే నందనవనం.. టెర్రస్ గార్డెనింగ్‌తో ఎన్నో ఉపయోగాలు
గేటు తీయగానే ఇంట్లో యజమాని కంటే ముందు మొక్కలు పలుకరిస్తాయి. ఎటుచూసినా సుగంధాలు వెదజల్లే వివిధ రకాల పూల మొక్కలు..కనువిందు చేసే రంగురంగుల పుష్పాలు.. సంపూర్ణ ఆరోగ్యానిచ్చే సేంద్రియ ఎరువులతో పండించిన కాయగూరలు, పండ్ల మొక్కలు దర్శనమిస్తాయి. రెండంతస్తుల భవనం..ఎటుచూసినా పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఒంగోలు సంతపేటలోని డి.విజయలక్ష్మి ఇంటి వద్ద కనిపించే దృశ్యాలు ఇవి. తొలి నాళ్లలో పూలమొక్కలు పెంచడం అలవాటు చేసుకున్న ఆమె సేంద్రియ ఎరువులతో సహజసిద్ధంగా రకరకాల కాయగూరలు,ఆకుకూరలు,పందిరి కాయగూరలు..వివిధ రకాల పండ్లను పండిస్తున్నారు. ఇంటి ముందున్న ఖాళీ స్థలం మొదలు భవనానికిరువైపులా ఉన్న స్థలంలో..మొదటి, రెండో అంతస్తుకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న మెట్ల పైన.. రెండో అంతస్తులో 1000 చదరపు అడుగుల స్థలంలో మొక్కలు పెంచుతూ నందన వనంగా మార్చేశారు. ఆమె భర్త చెంచురామిరెడ్డి. వృత్తి రీత్యా డాక్టర్. ఇంట్లో నిత్యం వండుకునే ఆకుకూరలు..కాయగూరలు అన్నీ మేము పండించేవే.. రోజూ పూసే పూలతో దేవుడి గది అంతా నిండిపోతుందని మురిసిపోతూ చెబుతున్నారు. ఇలా ఒక్క విజయలక్ష్మే కాదు నగరంలో వందలాది మంది ఇంటి పంటలపై ఆసక్తి చూపిస్తూ తమ పెరట్లో రకరకాల మొక్కలు పెంచుతున్నారు. సాక్షిప్రతినిధి, ఒంగోలు: ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటూ అనారోగ్యానికి దూరంగా ఉంటున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో చాలా ఇళ్లలో పెరటి సాగు కనిపిస్తుంది. కూరగాయల సాగు ఏర్పాటు చేసుకుని స్వయంగా కూరగాయలు పండించుకుంటున్నారు. ఈ ఒక్క ఆలోచన వారి కుటుంబానికి సరిపడా పౌష్టికాహారం అందిస్తోంది. ఇంటి పైనే కూరగాయలు, పూలు, పండ్లు పండిస్తూ వాటినే వినియోగిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, మహారాష్ట్ర, తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నర్సరీల నుంచి రకరకాల పూలు..పండ్ల మొక్కలను తెచ్చుకుంటున్నారు. అలాగే రకరకాల కాయగూరలకు సంబంధించిన విత్తనాలను వివిధ పట్టణాల నుంచి తెచ్చుకుంటున్నారు. ఇంటి పంటలపై ఆసక్తి ఉన్న హైదరాబాద్‌కు చెందిన తుమ్మేటి రఘోత్తమరెడ్డి నగరంలోని చాలా మందికి ఉచితంగా విత్తనాలను అందజేస్తున్నారు. అంతేకాకుండా మొక్కల పెంపకంపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇంటిపంటలో పెంచుతున్న మొక్కలు ఇవి.. నగరంలో చాలా మంది ఇళ్లలో ఎక్కువగా పూలు, ఆకు కూరలు, కూరగాయలు, రకరకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు. వివిధ రకాల క్రోటన్స్, మందారం, బంతి, మల్లి, సన్నజాజి, గులాబి, తులసి, పత్తి మందారం, సంపంగిలతో పాటు బొప్పాయి, జామ, అరటి, మామిడి, సపోట, దానిమ్మ, ఆపిల్‌ను పండిస్తున్నారు. అలాగే బెండ, అరటి, దొండ, బీర, కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ, టమోట, పచ్చిమిర్చి, గోరు చిక్కుడు, పందిరి చిక్కుడు, మునక్కాయలు తదితర కాయగూరలతో పాటు తోటకూర, మెంతికూరలను సైతం సాగుచేస్తున్నారు. ప్రతి రోజూ గంట నుంచి రెండు గంటల శ్రమ.. ఇంట్లో మొక్కలు పెంచడం కోసం ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం లేవగానే మొక్కలకు నీళ్లు పడతారు. మొక్కలకు ఏవైనా చీడ, పీడలు ఆశిస్తే వాటిని తొలగించి అవసరమైన చోట సహజసిద్ధ వనరులతో తయారు చేసిన మందులను స్ప్రే చేస్తారు. చాలా మంది సొంతంగా జీవామృతాన్ని, వేపనూనె, పిట్టు, పిడకలను తయారు చేసుకుంటున్నారు.మరికొందరు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నారు. అలాగే నగరంలోని గోశాల నుంచి ఆవు ఎరువు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గేదె ఎరువులను సేకరిస్తున్నారు. రెండు, మూడు నెలలకొకసారి మొక్కలన్నింటినీ అవసరమైన మందులు జల్లుతారు. ఈ ప్రక్రియ ఒకరోజు పడుతుంది. ఇలా చెట్లను సంరక్షిస్తూ తన ఇంటి పరిసరాలను ఆహ్లాదంగా ఉంచుతూ.. ఇంట్లోకి ఆరోగ్యకరమైన పండ్లను, కూరగాయలను పండించుకుంటున్నారు. సంతపేట విజయలక్ష్మి ఇంట్లో వివిధ రకాల మందారం మొక్కలు ఉన్నాయి. అందులో పత్తి మందారం వెరీ స్పెషల్. ఇది తెలుపు రంగులో పూస్తుంది. మధ్యాహ్నానికి లేత పింక్ కలర్లోకి మారుతుంది. సాయంత్రానికి ముదరు పింక్ కలర్లోకి మారుతుంది. ఇలాంటి ఆసక్తి కలిగించే పూల మొక్కలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఆపిల్.. ఆపిల్ మొక్కను పెంచేందుకు సుకన్య ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముందుగా ఆపిల్ విత్తనాలను 15 రోజుల పాటు ఫ్రిజ్డ్‌లో ఉంచారు. మొలక వచ్చాక వాటిని కోకోపిట్లో ఉంచి తర్వాత కుండీలో పెట్టారు. మూడు సంవత్సరాల నుంచి దీనిని పెంచుతున్నారు. దీనిని తొట్టెలోంచి తీసి భూమిలో పాతాలి. ఐదు నుంచి ఏడేళ్లు వచ్చాక కాయలు కాస్తుందని చెబుతున్నారు సుకన్య. ప్రకాశం మిద్దెతోటల పెంపకం గ్రూప్.. ఇంటి పంటలు పండించే వారి కోసం నగరంలో ‘ప్రకాశం మిద్దెతోటల పెంపకం’ అనే ప్రత్యేకమైన గ్రూపును ఏర్పాటు చేశారు. నగరంలోని మారుతీనగర్‌కు చెందిన ఆలపాటి సుకన్య అడ్మిన్‌గా ఉన్నారు. ఆమెతో పాటు సంతపేటకు చెందిన డి.విజయలక్ష్మి ప్రధానంగా ఉంటూ ఇంటి పంటలు పండించే వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ గ్రూప్‌లో ఇప్పటి వరకూ 130 మందికి పైగా సభ్యులు ఉన్నారు. వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. హైదరాబాద్ నుంచి రఘోత్తమరెడ్డి, రిటైర్డ్ బ్యాంకు ఆఫీసర్ అప్పారావు తదితరులను తీసుకువచ్చి సలహాలు సూచనలు ఇప్పిస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా ఈ గ్రూపు నడుస్తోంది. ఇంటి పంటలపై ఆసక్తిని పెంచేందుకు నిరంతరం సమావేశాలు నిర్వహిస్తామని అడ్మిన్ సుకన్య చెబుతున్నారు. ఐదేళ్ల నుంచి.. మొదట్లో పూల మొక్కలు పెంచా. ఆ తర్వాత సేంద్రియ ఎరువులతో ఇంట్లోనే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు పెంచుతున్న విధానాన్ని తెలుసుకున్నా. వాటి పెంపకంపై ఆసక్తి పెరిగింది. రకరకాల పూల మొక్కలతో పాటు కాయగూరలు, పండ్లను పెంచుతున్నా. రెండో అంతస్తులో వీటిని పెంచుతున్నా. తొలినాళ్లలో వీటిని సంరక్షించేదాన్ని. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంట్లో పనిచేస్తున్నా భార్య, భర్తలు ఇద్దరూ నాలుగు నెలలుగా మొక్కలు సంరక్షిస్తున్నారు. సహజసిద్ధమైన ఎరువులతో పండిస్తున్న కూరగాయలు తినడంతో సంతృప్తినిస్తోంది. – డి.విజయలక్ష్మి, సంతపేట, ఒంగోలు సొంతంగా ఎరువుల తయారీ.. మామగారు ఆలపాటి సత్యనారాయణ పొగాకు వ్యాపారి. ఆయన బెంగళూరు నుంచి రకరకాల పూల మొక్కలను తీసుకొచ్చేవారు. అలా ఇంట్లో మొక్కలు పెంచడం అలవాటైంది. క్రమంగా కాయగూరలు, పండ్ల మొక్కలు పెంచడం అలవాటు చేసుకున్నా. కిచెన్ వేస్ట్‌తో ఎరువులు తయారు చేస్తున్నా. జీవామృతాన్ని కూడా సొంతంగా తయారు చేసుకుంటున్నా. సేంద్రియ ఎరువులను సైతం తయారు చేస్తున్నా. అమెరికాలో ఉంటున్న కుమారుడు సైతం రకరకాల కాయగూరలను పెంచుతున్నారు. పెరటి మొక్కల పెంపకంపై నగరవాసులకు ఆసక్తిని పెంచేందుకు మూడేళ్ల కిందట ప్రత్యేక గూప్ను ఏర్పాటు చేశాం. ప్రసుతం 130 మంది సభ్యులు ఉన్నారు. రానున్న రోజుల్లో గ్రూప్‌ను మరింత విస్తరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నాం. – ఆలపాటి సుకన్య, మారుతీనగర్, ఒంగోలు ఎన్నో ఉపయోగాలు.. పూల మొక్కలతో పాటు సుందరీకరణ మొక్కలు పెంచడం ఆహ్లాదాన్ని ఇస్తుంది. కూరగాయల సాగు చేయడం ద్వారా రసాయనాలతో పండే కూరగాయలకు దూరంగా ఉంటూ మన చెట్లకు పండే కూరగాయలు తింటూ ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. పండ్ల మొక్కలు పెంచడం ద్వారా రసాయనాలు లేని పండ్లను తినొచ్చు. మార్కెట్లో దొరికే పండ్లలో రసాయనాలతోనే పెంచి రసాయనాలతోనే వారిని పండేలా చేస్తారు. దీంతో అందులో పోషకాలు అన్ని పోతాయి. ఇలా మన ఇంట్లో పండిన పండ్లను తినడం ద్వారా అందులో ఉండే పోషకాలన్నీ లభిస్తాయి. -
సహకార స్వర్ణయుగం రానుందా?!
ఉమ్మడి ఆర్థిక, సాంఘిక, సంస్కృతిక అవసరాలు తీర్చుకోవడానికి కొంతమంది తమ సమష్టి యాజమాన్యం ద్వారా ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామికంగా తామే నిర్వహించుకునే వ్యాపార, సేవా సంస్థలే సహకార సంఘాలు. వ్యక్తులు, ప్రైవేటు సంస్థలు లాభార్జనే ధ్యేయంగా చేసే వ్యాపారానికి భిన్నమైనది సహకార వ్యవస్థ. ప్రపంచీకరణ నేపథ్యంలో బహుళ జాతి సంస్థల కేంద్రీకృత ఆధిపత్య లాభార్జన ధోరణికి భిన్నంగా సమష్టి ప్రయోజనాల కోసం నానాటికీ విస్తరిస్తున్న ఈ వికేంద్రీకృత వ్యవస్థకు స్వయంపాలన, స్వావలంబనలే మూలస్తంభాలు. కరోనా మహమ్మారి నేర్పిన కొన్ని గుణపాఠాల నేపథ్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సహకార వ్యవస్థను మరింత విస్తరింపజేయాల్సిన ఆవశ్యకత ఉంది.(ఈ నెల 14 నుంచి 20 వరకు జరుగుతున్న 70వ జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా..) ఐక్యరాజ్యసమితి కూడా సహకార సంఘాల ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతూ.. 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా జరుపుకోవాలని ఇటీవలే తీర్మానం చేసింది. పుష్కర కాలం ముందు 2012లో కూడా అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని జరుపుకోవటం విశేషం. స్కాట్లండ్‌లోని ఫెన్విక్లో కీ.శ. 1761 మార్చి 14న ఏర్పాటైన ఫెన్విక్ చేనేత కార్మికుల సహకార సంఘమే తొట్టతొలి కోఆపరేటివ్ సొసైటీ. ప్రపంచంలో కనీసం 12% మంది ప్రజలు సహకారులే. సుమారు 30 లక్షల సహకార సంఘాలు ప్రపంచ దేశాల్లో లాభం కోసం కాకుండా విలువల కోసం పనిచేస్తున్నాయి. భారతీయ సహకారోద్యమం ప్రపంచంలోనే అతిపెద్ద సహకార వ్యవస్థ. దేశం వలస పాలనలో మగ్గిపోతున్న కాలంలో సివిల్ సర్వీసెస్ అధికారిగా పనిచేసిన సర్ ఫ్రెడరిక్ నికల్సన్ మన దేశంలో సహకార వ్యవస్థకు బీజం వేశారు. మొట్టమొదటి సహకార సంఘం 1904లో ప్రస్తుతం తమిళనాడులో తిరువళ్లూరు జిల్లాలోని తిరుర్ అనే గ్రామంలో ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలోని 8,54,355 సహకార సంఘాల్లో సుమారు 30 కోట్ల మంది సభ్యులున్నారు. మరో 2 లక్షల సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించి చురుగ్గా చర్యలు చేపట్టింది. మన దేశంలో వ్యవసాయ రుణాలిచ్చే సొసైటీల సంఖ్యే ఎక్కువ. కింది స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలతో మొదలుకొని చాలా రాష్ట్రాల్లో మూడంచెల సహకార వ్యవస్థ అమల్లో ఉంది. జిల్లా, రాష్ట్రస్థాయి సొసైటీల రిజిస్ట్రేషన్లు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. అనేక రాష్ట్రాల్లో వ్యాపార లావాదేవీలు, సేవలు అందించే సొసైటీల(మల్టీస్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు) రిజిస్ట్రేషన్ కేంద్ర సహకార రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తుంది. రెండేళ్ల క్రితం హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జాతీయ స్థాయిలో ప్రత్యేక సహకార మంత్రిత్వశాఖ ఏర్పాటు కావటంతో ఈ రంగంలో సరికొత్త కదలిక చోటుచేసుకుంది. జాతీయ సహకార విధానం రూపొందించేందుకు కసరత్తు జరుగుతోంది. పూర్వం నుంచి ఉన్న వ్యవసాయం, హౌసింగ్, ఉద్యోగుల సహకార సంఘాలు వంటి సంప్రదాయ రంగాలకు మాత్రమే పరిమితం కాకుండా.. ముఖ్యంగా యువతను భాగస్వాముల్ని చేసే విధంగా అనేక సేవా రంగాల్లో సొసైటీల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మన దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి పెంపొందించగల శక్తి సహకార రంగానికి ఉందని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారీ లక్ష్యాలతో మూడు వేర్వేరు మల్టీ స్టేట్ కోఆపరేటివ్‌లను కేంద్రం ఇటీవలే నెలకొల్పింది. మొదటిది మన ఉత్పత్తులను విదేశాలకు భారీస్థాయిలో ఎగుమతులను చేపట్టే లక్ష్యంతో ఏర్పాటైంది. సొసైటీల ద్వారా సర్టిఫైడ్/దేశీ విత్తనోత్పత్తి చేయటంతో పాటు విదేశాలకు ఎగుమతి చేయటమే లక్ష్యంగా రెండో సొసైటీ ఏర్పాటైంది. ఇక మూడోది మరింత ముఖ్యమైనది. వివిధ రాష్ట్రాల్లో ప్రకృతి సేద్యం చేసే రైతుల సొసైటీలు, ఎఫ్పిఓల నుంచి సేకరించి భారత్ ఆర్గానిక్స్ బ్రాండ్ పేరుతో ఆన్లైన్ ద్వారా, అవుట్లెట్ల ద్వారా దేశ విదేశాల్లో విక్రయించే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది. భారీ వాణిజ్య లక్ష్యాలతో పనిచేసే ఈ సొసైటీలకు వచ్చే లాభాల్లో సగాన్ని నేరుగా రైతులు, ఇతర ఉత్పత్తిదారులకు అందించబోతున్నారు. అనుకున్నట్లు యువతను సహకార వ్యాపార, సేవా రంగాల వైపు సమర్థవంతంగా ఆకర్షించగలిగితే భారతీయ సహకార రంగానికి స్వర్ణయుగం తధ్యమని చెప్పొచ్చు. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు (చదవండి: పంట చేనే ఏటీఎం! రైతులకు నిరంతరం ఆదాయం ఇచ్చేలా..!) -
పశువ్యాధులకు హోమియోపతి చికిత్సతో ప్రయోజనం
పాడి పశువులు రోగాల బారిన పడినప్పుడు రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ఖర్చుల కన్నా చికిత్స ఖర్చులు భారంగా మారుతుండటంతో పాడి రైతుల ఆదాయం తగ్గిపోతోంది. ఈ సమస్యకు సరైన పరిష్కారం హోమియో చికిత్సా విధానం. ఇది తక్కువ ఖర్చుతో వెంటనే ఫలితాన్ని ఇచ్చేదే కాకుండా సహజమైన, మానవీయమైన, సమర్థవంతమైన చికిత్సా పద్ధతి కూడా అంటున్నారు పశువైద్యాధికారి డాక్టర్.జి.రాంబాబు. కడపలోని పశువ్యాది నిర్ధారణ ప్రయోగశాలలో సేవలందిస్తున్న ఆయన హోమియో పశువైద్యంలో తన అనుభవాలను ‘సాక్షి సాగుబడి’తో పంచుకున్నారు.. సహజ రోగ నిరోధక శక్తికి ప్రేరణ కలిగించి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడమే హోమియో వైద్య విధానం లక్షణం. హోమియో విధానంలో వాడే ఔషధాలన్నీ కూడా సహజమైన మొక్కలు, లవణాలతో తయారు చేసినవే. ఈ వైద్య విధానానికి 200 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా యూరోపియన్, ఆసియా దేశాల్లో పశువ్యాధుల చికిత్సలో హోమియోపతి మందులు వాడుతున్నారు. మన దేశంలోనూ అక్కడక్కడా ఈ ప్రయత్నాలు జరుగుతుండటం ఆహ్వానించదగిన విషయం. పశువులకు హోమియో ప్రయోజనాలేమిటి? ►ఖర్చు తక్కువ. ఒక మందు ఖరీదు కేవలం రూ. 10 లోపే. అల్లోపతిలో ఈ ధరకు ఏ మందూ రాదు. ► సైడ్ ఎఫెక్ట్స్ /దుష్ప్రభావాలు ఉండవు. పరీక్షలు చేసి రోగ నిర్థారణ చేసే వరకు మందులు వాడకుండా ఉండాల్సిన పని లేదు. రోగ లక్షణాన్ని బట్టి చికిత్స చేస్తే చాలు. ► ఒకసారి పశువులకు, దూడలకు, ముఖ్యంగా శునకాలకు హోమియో (తీపి) మాత్రలు ఒకసారి ఇస్తే మళ్లీ అవే వచ్చి మందు అడుగుతాయి. ► హోమియో మందులు త్వరితగతిన పనిచేస్తాయి. ఇవి నెమ్మదిగా పనిచేస్తాయని చాలామంది అనుకుంటారు. అది అపోహ మాత్రమే. ► ఇతర వైద్య పద్ధతుల్లో మందుల మాదిరిగా భరించలేని వాసన ఈ మందులకు ఉండదు. ► డోసు కొద్దిగా ఎక్కువయినా ఇబ్బంది లేదు. అది మిగతా వైద్య పద్ధతుల్లో ఇది సాధ్యం కాదు. కాబట్టి, అవగాహన పెంచుకున్న రైతులు పశువులకు ఇంటి దగ్గరే ఈ వైద్యం చేసుకోవచ్చు. ► కొన్ని వ్యాధులకు అల్లోపతిలో లేని వైద్యం కూడా హామియోపతిలో ఉండటం విశేషం. ► ఈ మందుల వల్ల పర్యావరణం కలుషితం కాదు. హోమియో మందులతో పొదుగువాపు మాయం! రాథి ఆవు ఇది. రాజస్తాన్‌కు చెందిన జాతి. స్థానిక రైతు అక్కడి నుంచి కడప జిల్లాకు చూడి ఆవును తీసుకువచ్చారు. వారం తరువాత ఈనిన ఆవు కోడె దూడకు జన్మనిచ్చింది. పాలు ఇచ్చిన 5వ రోజు నుంచి రెండు చన్నుల నుంచి పాలతో పాటు రక్తం వచ్చింది. పశువైద్యునిగా పొదుగువాపును గుర్తించి యాంటి బయోటిక్ మందులతో చికిత్స ఇచ్చాను. 5 రోజులకు తగ్గింది. 7వ రోజు నుంచి మళ్లీ పొదుగువాపు వచ్చింది. ఆవు నుంచి తీసిన రక్తంతో కూడిన పాలను యాంటి బయోటిక్ సెన్సిటివిటి పరీక్షకు ప్రయోగశాలకు పంపించాం. పరీక్ష ఫలితాలు 3వ రోజున వస్తాయి. ఈ లోపు మళ్లీ కొత్త అల్లోపతి మందులు ఇవ్వడం కన్నా ఆయుర్వేద లేదా హామియో మందులు వాడుతుంటాం. ఈ ఆవుకు హోమియో మందులు వాడితే.. రెండు విధాలుగా ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. మొదటిది: పాల పరీక్ష ఫలితాల్లో మొత్తం 13 యాంటీ బయోటిక్ మందులకు నిరోధకత వచ్చింది. అంటే, ఆ ఆవుపై ఇక ఏ యాంటి బయోటిక్ మందూ పనిచేయదని అర్థం. రెండోది: ఈ లోగా హోమియో మందులు వాడటం వల్ల 3 రోజుల్లోనే ΄పొదుగువాపు తగ్గిపోయింది. అల్లోపతి మందులకు దాదాపుగా రూ. 2,200 ఖర్చు చేశాం. హోమియో మందుల ఖర్చు కేవలం రూ. 50 మాత్రమే. పొదుగువాపు తగ్గించడానికి ఫైటో లక్క, కొనియం, బెల్లడోన, ఫెర్రం ఫాస్ అనే హామియో మందులను వినియోగించాం. రెండు వారాలైనాతగ్గనిది.. హోమియోతో 2 రోజుల్లో తగ్గింది! ఒక హోటల్ యజమాని ఒంగోలు ఆవును కొన్నారు. మంచిదని హోటల్ దగ్గరే ఆవును కట్టేస్తున్నారు. గడ్డి తక్కువ వేస్తూ ఎక్కువ మొత్తంలో కూరగాయలు మేపేవారట. కొద్ది రోజులకే ఆవుకు సుస్తీ చేసింది. మేత తినటం దాదాపుగా ఆపేసింది. ఆకలి పెంచేందుకు పౌడర్లు, బీకాంప్లెక్స్ ఇంజక్షన్లు, లివర్ టానిక్‌లు, కసురు తాగించినా ఫలితం లేకపోవటంతో కడప పశువుల ఆసుపత్రికి తీసుకువచ్చారు. అల్లోపతి మందులతో దాదాపు 2 వారాల పాటు వైద్యం అందించినా, కొద్దిగా కూడా ఫలితం కనిపించ లేదు. ఆ దశలో నక్స్ వామిక, రుస్ టాక్స్ అనే హోమియో మందులు రెండు రోజులు ఇచ్చాం. 3వ రోజుకు సమస్య పూర్తిగా తగ్గిపోయింది. (పశువైద్యులు డాక్టర్ జి. రాంబాబును 94945 88885 నంబరులో సంప్రదించవచ్చు) -
పంట చేనే ఏటీఎం! రైతులకు నిరంతరం ఆదాయం ఇచ్చేలా..!
ప్రకృతి వ్యవసాయంలో సరికొత్త అధ్యాయం ఎనీ టైమ్ మనీ (ఏటీఎం) నమూనా. కొద్ది సెంట్ల భూమిలోనే ఏడాది పొడవునా రకరకాల కూరగాయ పంటల సాగు ద్వారా రైతుకు నిరంతర ఆదాయం ఇస్తున్న పంటల నమూనా ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ ద్వారా క్షేత్రస్థాయిలో రైతులతో ఏటీఎం సాగును చేపట్టి అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. కౌలు రైతు దూసరి పృథ్వీరాజ్ ఇందుకో నిదర్శనం. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలోని తూములూరు శివారు క్రిస్టియన్‌పాలెం పృథ్వీరాజ్ నివాసం. కౌలుకు తీసుకున్న ఎకరం 20 సెంట్ల రేగడి భూమిలో ఏటీఎం మోడల్‌ను గత రెండు నెలలుగా సాగు చేస్తున్నారు. నాలుగు అడుగుల వెడల్పుతో ఎత్తుమడులను ఏర్పాటు చేసుకొని పైన డిజైన్‌లో చూపిన విధంగా 20 కూరగాయ పంటలు వేశారు. ఘనజీవామృతం, జీవామృతం 15 రోజులకోసారి ఇస్తున్నారు. జిల్లాలో 40 మంది రైతులతో ఏటీఎం మోడల్‌ను ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తున్నామని డీపిఎం రాజకుమారి తెలిపారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి రెండు నెలల్లో రూ. పది వేల ఆదాయం! 2 నెలల క్రితం 20 సెంట్లలో ప్రకృతి వ్యవసాయం ఏటీఎం మోడల్లో పంటలు సాగు చేస్తున్నాను. 4 అడుగుల వెడల్పుండే 8 బెడ్స్‌లో 20 రకాల పంటలు వేశాం. గోంగూర, రెడ్ తోటకూర, పాలకూర, చుక్కకూర 20 రోజులకోసారి కోతకు వస్తున్నాయి. మరో ఐదారు బెడ్లలో ఆకుకూరలు కోయాల్సి ఉంది. బెండ, వంగ, బీర, గోరుచిక్కుడు, అనుములు, చెట్టుచిక్కుడు కోతకు వచ్చాయి. అన్నీ కలిపి ఇప్పటికి రూ. 10 వేల ఆదాయం వచ్చింది. చేలో ఒకే ఒక పంట వేసి చేతికొచ్చేవరకు ఆగకుండా రకరకాల పంటలను సాగు చేయటం ద్వారా ఎప్పటి కప్పుడు అధికాదాయం పొందుతున్నాం. ఏడాదికి 20 సెంట్లలో రూ. లక్షన్నర వరకు ఆదాయం వస్తుందనుకుంటున్నాం. భార్యాభర్తలు ఇద్దరం పంటలను కనిపెట్టుకుంటూ పనులను మేమే చేసుకుంటున్నాం. రసాయనాల్లేని ఆహారం తీసుకుంటూ తగిన ఆదాయం పొందుతున్నాం. – డి. పృథ్వీరాజ్ (63058 37151), క్రిస్టియన్‌పాలెం, గుంటూరు జిల్లా (చదవండి: ఇంటి పంటగా కుంకుమ పువ్వు!) -
పార్వతీపురం రైతుకు పేటెంట్ మంజూరు చేసిన భారత ప్రభుత్వం
బహుళ పంటలను ఒకేసారి విత్తుకునేందుకు అన్ని విధాలుగా రైతుకు ఉపయోగకరమైన వినూత్న పరికరం (డ్రమ్‌సీడర్)ను రూపొందించిన పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన గ్రామీణ ఆవిష్కర్త దమరసింగి బాబూరావుకు భారత ప్రభుత్వం పేటెంట్ మంజూరు చేసింది. తొలుత ఇనుముతో తయారు చేసిన ఈ పరికరంపై పేటెంట్‌కు 2015లోనే ఆయన దరఖాస్తు చేయగా, ఇటీవలే పేటెంట్ సర్టిఫికెట్ అందింది. తదనంతరం మరింత తేలిగ్గా ఉండాలన్న లక్ష్యంతో స్టెయిన్లెస్ స్టీల్‌తో తక్కువ బరువుతో ఉండేలా, ఎక్కువ కాలం మన్నిక ఉండేలా బాబూరావు దీన్ని మెరుగుపరిచారు. 2 ఎం.ఎం. సైజు నుంచి 16 ఎం.ఎం. సైజు వరకు ఎంత సైజు ఉన్న ఏ పంట విత్తనాలనైనా స్వయంగా రైతే స్వల్ప మార్పులు చేసుకోవటానికి, వరుసల మధ్య దూరాన్ని కూడా అనుకూలంగా సులువుగా మార్చుకోవటానికి ఈ డ్రమ్‌సీడర్ అనువుగా ఉంది. పత్తి, పెసలు, కందులు వంటి మూడు పంటలను ఒకేసారి విత్తుకోవడానికి ఈ ఆధునిక డ్రమ్‌సీడర్ ఉపయోగపడుతుండటం విశేషం. అన్ని రకాల చిరుధాన్యాలు, నువ్వులు, వేరుశనగ, బఠాణి, గోధుమ, వరి, పెసర, మినుము, పుల్లశనగ, పెద్ద బఠాణి, పెద్ద వేరుశనగలను సైతం దీనితో విత్తుకోవచ్చు. దీనికి ఏడు సీడ్ బాక్సులు అమర్చారు. రైతులే మార్పులు చేసుకోవచ్చు 2.5 అడుగులు (30 అంగుళాల) ఎత్తున ఇరువైపులా చక్రాలను అమర్చటం, 6 అంగుళాల వెడల్పు గల చక్రాలను అమర్చటంతో దీన్ని ఉపయోగించటం సులువు. పెద్ద చక్రాలను ఏర్పాటు చేయటం, పంటను బట్టి విత్తనం సైజును బట్టి, వరుసల మధ్య దూరాన్ని బట్టి మార్పులు చేసుకోవడానికి చక్రాలను ఇప్పి మార్పులు చేయాల్సిన అవసరం లేకుండా రెండు స్క్రూలు ఇప్పితే చాలు అవసరమైన మార్పులు మెకానెక్ అవసరం లేకుండా రైతే స్వయంగా చేసుకోవచ్చని, అందుకే ఈ డ్రమ్‌సీడర్ తక్కువ కాలంలోనే రైతుల ఆదరణ పొందిందని బాబూరావు ‘సాక్షి’తో చెప్పారు. నాలుగు వేరియంట్లు ఎకనామిక్ మల్టీపర్పస్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్ అని పిలుస్తున్నారు. ఇందులో నాలుగు వేరియంట్లను బాబూరావు రైతులకు అందుబాటులోకి తెచ్చారు. పొలంలో యంత్రాలు అవసరం లేకుండా ఇద్దరు మనుషులు సులువుగా లాగుతూ విత్తనాలు వేసుకునే విధంగా, జోడెడ్లకు కట్టి లాక్కెళ్లేలా, ట్రాక్టర్‌కు వెనుక బిగించే విధంగా, 6.5 హెచ్‌పి హోండా ఇంజన్‌తో అనుసంధానం చేసి ఒక మనిషి నడిపే విధంగా స్టెయిన్లెస్ స్టీల్‌తో డ్రమ్సీడర్లను ఆయన రూపొందించారు. వేరియంట్‌ను బట్టి దాని ధర, బరువు ఆధారపడి ఉంటుంది. మనుషులు లక్కెళ్లే దాని బరువు 25 కిలోలు ఉంటుంది. ట్రాక్టర్‌కు అనుసంధానం చేసేది 80 కిలోల బరువు ఉంటుంది. ‘ఆంగ్రూ’ పోషణ్ ఇంక్యుబేషన్ సెంటర్ బాబూరావుకు రూ. 4 లక్షల గ్రాంటు ఇవ్వటం విశేషం. పల్లెసృజన తోడ్పాటుతో రాష్ట్రపతి భవన్‌లోని ఇన్నోవేషన్ ఫెస్టివల్‌తో పాటు అనేక మేళాల్లో బాబూరావు (94409 40025) ఈ డ్రమ్‌సీడర్‌ను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ప్రకృతి సేద్యంపై ఎన్‌ఐపిహెచ్‌ఎం సర్టిఫికెట్ కోర్సు ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం చేపట్టదలచిన/ చేపట్టిన కనీసం ఇంటర్ చదివిన యువతకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖకు అనుబంధ సంస్థ, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ (ఎన్‌ఐపిహెచ్‌ఎం) సర్టిఫికెట్ కోర్సు నిర్వహించనుంది. ‘ప్రకృతి/సేంద్రియ వ్యవసాయంలో మొక్కల ఆరోగ్య యాజమాన్యం’ పేరుతో వచ్చే డిసెంబర్ నుంచి 3 నెలల సర్టిఫికెట్ కోర్సులో శిక్షణ ఇస్తారు. కోర్సు కాలపరిమితి డిసెంబర్ 6 నుంచి 2014 మార్చి 13 వరకు. యువతీ యువకులకు శిక్షణ ఇవ్వటం ద్వారా గ్రామస్థాయిలో మాస్టర్ ట్రైనర్లను తయారు చేయటం ఈ సర్టిఫికెట్ కోర్సు లక్ష్యం. తరగతి గదిలో పాఠాలతో పాటు పొలంలో పని చేస్తూ నేర్చుకునే పద్ధతులు కూడా ఈ కోర్సులో భాగం చేశారు. ఇంటర్ పూర్తి చేసిన లేదా వ్యవసాయ పాలిటెక్నిక్ పూర్తి చేసిన 18 ఏళ్లు నిండిన గ్రామీణ యువతకు ఈ కోర్సు అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు. కోర్సు ఫీజు రూ. 7,500. ఎన్‌ఐపిహెచ్‌ఎంలో ఉండి శిక్షణ పొందే రోజుల్లో ఉచిత వసతి కల్పిస్తారు. భోజన ఖర్చులు అభ్యుర్థులే భరించాల్సి ఉంటుంది. కోర్సు డైరెక్టర్‌గా డా. ఒ.పి. శర్మ వ్యవహరిస్తున్నారు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్ డా. కె. దామోదరాచారి (95426 38020)ని సంప్రదించవచ్చు. నవంబర్ 20లోగా ఫీజు చెల్లించి, దరఖాస్తులు పంపాలి. డిసెంబర్ 22 నుంచి ఏపీ పుష్ప ప్రదర్శన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి నాలుగో పుష్ప ప్రదర్శన, అమ్మకం కార్యక్రమాన్ని డిసెంబర్ 22 నుంచి 27 వరకు జరగనుంది. విజయవాడలోని (పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు) సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజి గ్రౌండ్లో జరుగుతుంది. వివరాలకు.. 93935 77018. -
ఇంటి పంటగా కుంకుమ పువ్వు!
కశ్మీర్‌లోని చల్లని ప్రదేశాల్లోనే సహజంగా ఆరుబయట పొలాల్లో కుంకుమ పువ్వు పండుతుంది. అయితే, కృత్రిమ శీతల వాతావరణం సృష్టించిన గదుల్లో కూడా ఈ పంటను పండిస్తున్నారు. నీలిరంగులో ఉండే పూలకు మధ్యలో ఈ ఎరట్రి దారాల్లాంటి కేసరాలు ఉంటాయి. వాటిని సేకరించి జాగ్రత్తగా నీడన ఎండబెట్టి భద్రపరిచి వాడుకోవచ్చు లేదా విక్రయించవచ్చు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉద్యోగం చేస్తున్న కె. శైలజారెడ్డి తన ఇంట్లోనే ఒక గదిలో కుంకుమ పువ్వును ఇంటిపంటగా పండిస్తున్నారు. అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం కుంకుమ పువ్వు. రోగనిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని అందించే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. గర్భవతులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగుతుంటారు. స్వీట్లు, ఖీర్, బిర్యానీ, ఫ్రూట్ సలాడ్లలో దీన్ని వాడుతుంటారు. శ్రీఅన్నమయ్య జిల్లా మదనపల్లిలో శ్రీనిధి అనే యువతి కుంకుమ పువ్వు సాగు చేస్తున్న వీడియోలు యూట్యూబ్‌లో చూసి స్పూర్తి పొందిన శైలజారెడ్డి తన ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు చేపట్టారు. ఇండియా మార్ట్ ద్వారా కుంకుమ పువ్వు విత్తనాలను కశ్మీర్ నుంచి తెప్పించారు. ప్రస్తుతం అక్కడ రైతులకు, విత్తనాలను సేకరించి అమ్మే వారికి మధ్య వివాదం రావడంతో ప్రభుత్వ అనుమతితోనే విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోందని శైలజారెడ్డి తెలిపారు. రూ. 4 లక్షల పెట్టుబడి శైలజారెడ్డి తన మూడు బెడ్రూమ్లతో కూడిన ఇంట్లోనే.. 12“12 అడుగుల విస్తీర్ణం ఉన్న ఒక గదిలో ఇనుప ర్యాక్‌లలో ఫైబర్ టబ్‌లు, కృత్రిమ వెల్తురు సదుపాయాలను సమకూర్చి కుంకుమ పువ్వు పండిస్తున్నారు. విత్తనాలకు, ఈ ఏర్పాట్లకు రూ. 4 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. చల్లని వాతావరణం కుంకుమ పువ్వు సాగుకు అనువైనది. మనం గదిలో కృత్రిమ శీతల వాతావరణాన్ని కల్పించి నిశ్చింతగా సాగు చేయవచ్చని శైలజారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గదిలో రాత్రిపూట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్షియస్ ఉండాలి. గాలిలో తేమ శాతం 80% ఉండాలి. ఇందుకోసం గదిలో చిల్లింగ్ యంత్రాన్ని, హ్యుమిడిఫయర్‌ను ఏర్పాటు చేశారు. కృత్రిమ కాంతితో కూడిన తగుమాత్రపు వేడి కోసం గదిలో 20 వరకూ గ్రోలైట్లు ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈ లైట్లు వెలిగిస్తే సరిపోతుంది. పూత దశలో తప్ప ఇతర కాలాల్లో గది పగటి ఉష్ణోగ్రత 16–17 డిగ్రీల వరకు ఉండొచ్చు. ఎయిరోపోనిక్స్ పద్ధతిలో కుంకుమ పువ్వును సాగు చేస్తున్న శైలజారెడ్డి ఇటీవలే తొలి పంట తీశారు. ఇప్పటి వరకూ 1441 పువ్వులు పూస్తే అందులో నుంచి 10 గ్రాముల కుంకుమ పువ్వు కేసరాల దిగుబడి వచ్చింది. గ్రాము రూ. ఏడు వందల చొప్పున ఆరు గ్రాములను అమ్మారు. మిగిలిన కుంకుమ పువ్వును తనతోపాటు పనిచేసే వారికి కొంచెం కొంచెం బహూకరించాలని నిర్ణయించుకున్నట్లు శైలజారెడ్డి చెప్పారు. తాను గతంలో ఆన్లైన్లో ఆర్డర్ చేసి కొనుగోలు చేసిన కుంకుమపువ్వును ఇప్పుడు తాను పండించిన కుంకుమ పువ్వుతో పోల్చి పరిశీలించినప్పుడు, అది కల్తీది అని స్పష్టంగా అర్థమైందన్నారు. గ్రోలైట్ల వెలుగులో కుంకుమ పూల సాగు వాడకానికి సిద్ధమైన కుంకుమ పువ్వు ఎయిరోపోనిక్స్..? కుంకుమ పువ్వు విత్తన దుంపలను ట్రేలలో పోసిన మట్టి మిశ్రమం (మట్టి 50%, ఇసుక 40%, వర్మీ కంపోస్టు పది మట్టి%)లో నాటుకొని పెంచుకోవచ్చు. మట్టి లేకుండా ఎయిరోపోనిక్స్ పద్ధతిలో కూడా సాగు చేయొచ్చు. అంటే.. విత్తన దుంపలను ట్రేలో పక్క పక్కనే పెడితే సరిపోతుంది. మట్టిలో గాని, నీటిలో గాని వాటిని పెట్టాల్సిన పని లేదు. గాలిలో తేమ 80%తో పాటు చల్లని వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ తేమతోనే మొక్క పెరిగి, 30–45 రోజుల్లో పూత వస్తుంది. వేరే పోషణ ఏమీ అవసరం లేదు. 7 గ్రాముల కన్నా ఎక్కువ బరువు ఉన్న విత్తన దుంపలు వాడితేనే ఆ సీజన్లో పూలు వస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఏరోపోనిక్స్ పద్ధతిలో పెంచే దుంపలను కూడా పూత కాలం పూర్తయిన తర్వాత మట్టి మిశ్రమంలో విధిగా నాటుకోవాల్సిందే. నవంబర్– డిసెంబర్లో మట్టి మిశ్రమంలో నాటుకోవాలని శైలజారెడ్డి వివరించారు. వారం/పది రోజులకోసారి నీటిని కొంచెం పిచికారీ చేస్తే సరిపోతుంది. నానో యూరియా లేదా ఎన్పికెను నెలకోసారి పిచికారీ చేస్తే చాలు. ప్రతి దుంపకు అనుబంధంగా మూడు, నాలుగు దుంపలు పుట్టుకొస్తాయి. ఏప్రిల్ నెల నుంచి జూన్ వరకు దుంపలు నిద్రావస్థలో ఉంటాయి. ఆ దశలో వాటికి ఆహారం, కాంతి, చల్లని వాతావరణం, గాలిలో 80% తేమ అవసరం లేదు. కుంకుమ పువ్వు దుంపలను జూలైలో మట్టిలో నుంచి తీసి 7 గ్రాములు అంతకన్నా ఎక్కువ బరువు ఉన్న పిల్ల దుంపలను వేరు చేసి, తిరిగి మట్టి మిశ్రమంలో నాటుకొని కుంకుమ పువ్వు సాగు చేయవచ్చు. లేదా విత్తన దుంపలను ట్రేలలో పెట్టుకొని ఏరోపోనిక్స్ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. అప్పటి నుంచి మళ్లీ నిద్రావస్థ వరకు నిరంతరాయంగా 8 నెలలు శీతల వాతావరణం ఉండేలా చూసుకుంటూ సాగు చేయాల్సి ఉంటుందని శైలజారెడ్డి వివరించారు. మొదటి ఏడాదే పెట్టుబడి! ఇంట్లోనే ఒక గదిలో కుంకుమ పువ్వు సాగు చేయడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి మొదటి సంవత్సరమే పెట్టుబడి అవసరమవుతుంది. రెండో సంవత్సరం నుంచి విత్తన ఖర్చు ఉండదు. నాలుగైదు సంవత్సరాల్లో పెట్టుబడి తిరిగి రావడంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. పెద్ద మొత్తంలో సాగు చేస్తే ఉపయోగం ఉంటుంది. కుంకుమ పువ్వు సాగును ఇంటిపంటగా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు రావడం ఖాయం. నాణ్యమైన కుంకుమ పువ్వును మనమే పండించుకోవచ్చు. ఈ అనుభవాలను ఇతరులకు పంచాలని ‘శాన్వి శాఫ్రన్ ఫార్మ్స్’ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ఏర్పాటు చేశాను. – కె. శైలజారెడ్డి, కుంకుమ పువ్వు సాగుదారు, తాడేపల్లి, గుంటూరు జిల్లా . మొబైల్: 94912 33492. (సా. 7 గం. తర్వాత ఫోన్ చేయొచ్చు) www.youtube.com/ @ShanviSaffronFarms – దాళా రమేష్ బాబు, సాక్షి, బ్యూరో ఇన్చార్జ్, గుంటూరు (చదవండి: టమోటాలు ఇలా కూడా పెంచవచ్చు!) -
టమోటాలు ఇలా కూడా పెంచవచ్చు!
ఇటీవల కాలంలో స్థలం లేకపోయినా మొక్కల పెంచుకునే సరికొత్త పద్ధతులు వస్తున్నాయి. ఆఖరికి ఫ్లాట్‌లోని బాల్కనీలో కూడా సులభంగా పెంచుకునే పద్ధతులను కూడా చూశాం. చిన్ని చిన్ని కుండీల్లోనే జామ, దానిమ్మ వంటి పళ్లు కాసే మొక్కలను పెంచి చూపించారు. ఇదంత ఒక ఎత్తైతే ఇప్పుడు ఏకంగా మొక్కలను తలకిందులుగా పెంచే సరికొత్త పద్ధతి మన ముందుకు వచ్చింది. పైగా దీని వల్ల ఎన్నో చీడ పీడలను కూడా నివారించొచ్చు, మంచి దిగుబడి కూడా వస్తుందంటున్నారు. అందులోనూ టమోటా మొక్కలను ఇలా పెంచితే స్థలం ఆదా అవ్వడమే గాక ఎక్కువ టమోటాలు పండించొచ్చు అంటున్నారు అగ్రికల్చర్ నిపుణులు. ఇంతకీ ఇదెలా సాధ్యం? ఎలా పెంచుతారంటే.. టమోటాలను తలకిందులుగా పెంచే పద్ధతిని ఎంచుకొనేటప్పుడూ అన్ని రకాల టమోటాలకు ఈ పద్ధతి మంచిది కాదనే విషయాన్ని గుర్తించుకోవాలి. ముఖ్యంగా చెర్రీ టమోటా వంటి కొన్ని రకాల టమాటాలకు మాత్రమే ఈ పద్ధతి సరైనది. ముందుగా వేలాడే మొక్కల కంటైనర్లను తీసుకోవాలి. ముఖ్యంగా చక్కగా వేలాదీయగల బకెట్ లేదా కుండిని తీసుకోవాలి దాని అడుగు భాగన రంధ్రం ఉండేలా చూసుకోండి. ఒకవేళ్ల రంధ్రం లేకపోతే మనం ఏర్పాటు చేసుకోవాలి. దీనికి మంచి ఎరువుతో కూడిన మట్టిని కుండీలో నింపి దానిలో టమోటా వితనాలు వేసి ఉంచాలి. ఆ విత్తనాలు మొలకెత్తిన వెంటనే..ఆ కుండీ పైభాగం కవర్ అయ్యేలా కవర్ లేదా ఏదైనా మూత వంటి వాటిని ఏర్పాటు చేసి తలకిందులుగా వేలాడదీసి ఆ రంధ్రంలో ఈ మొలకెత్తిన మొక్కను చొప్పించాలి. దీన్ని సూర్యరశ్మీ తగిలే చోట వేలాదీయండి. ఆ తర్వాత మొక్కగా మొలికెత్తిన ఈ టమోటా మొక్కను చక్కగా పెరిగేలా తీగల వంటి సపోర్టు ఏర్పాటు చేసుకుని సమయానికి నీరు అందించాలి. చక్కగా గాలికి ఎక్స్పోజ్అయ్యి మంచిగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే పరాగ సంపర్కం సులభతరమవుతుంది. ఇక ఈ పద్ధతిలో మొక్క మట్టికి బయటకు బహిర్గతం కావడం వల్ల నేల ద్వారా వచ్చే తెగుళ్లు, ఫంగస్, కట్‌వార్మ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువుగా ఉంటుంది. తలక్రిందులుగా వేలాడదీయడం వల్ల మొక్కలు ఎలాపడితే అలా వ్యాపించవు కాబట్టి చక్కగా నచ్చిన రీతీలో కట్ చేసుకుని ఆకర్షణీయంగా పెంచుకునే సౌలభ్యం ఉంటుంది. అంతేగాక వీటిని ఎండ తగిలే చోటికి తరలించుకుపోవడం సులభం, పైగా ఎక్కువ టమాటాలు కాస్తాయి కూడా. ముఖ్యంగా ఈ పద్ధతిలో పెంచాలనుకుంటే ఎంచుకునే బకెట్ లేదా కుండీ తోపాటు అందులో వేసే మట్టి, మనం వేసే మొక్కకు కాసే పళ్లని తట్టుకునే సామర్థ్యం తదితరాలు ఉన్నవాటినే ఎంచుకోవడం అత్యంత కీలకం. స్థలం సమస్యతో ఇబ్బంది పడే వాళ్లకు, ఇంటి పంటలంటే ఇష్టపడే వారికి ఈ విధానం చాలా బాగా ఉపయోగపడుతుంది. సులభంగా బాల్కనీల్లోనూ కిటికీల్లోనూ తలకిందులుగా టమాట మొక్కలను పెంచడమే గాక సమృద్ధిగా టమోటాలను పెంచగలుగుతారు కూడా. (చదవండి: ఇది గ్రీన్ పాలిటిక్స్ యుగం! రాజకీయ పార్టీలే గ్రీన్ పార్టీలుగా..!) -
ఇది గ్రీన్ పాలిటిక్స్ యుగం!
క్లైమెట్ పాటు పొలిటికల్ క్లైమెట్ కూడా గుణాత్మకంగా మారుతోంది. నిన్న మొన్నటి వరకు తోక పార్టీలుగా ఉన్న గ్రీన్ పార్టీలు ఇప్పుడు ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పే దశకు ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు నిపుణులు. పర్యావరణ చైతన్యంతో కూడిన ప్రజాస్వామిక రాజకీయాలతో పాటు శాంతి, అహింస, సామాజిక న్యాయంతో కూడిన సమాజం కోసం గ్రీన్ పార్టీలు కలలు కంటున్నాయి. ఈ క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో పారిశ్రామిక దేశాల రాజకీయాల తోపాటు మన రాజకీయాలు కూడా పర్యావరణ కేంద్రంగా ఇకనైనా మారేనా? పర్యావరణ సమస్యలపై సాంఘిక ఉద్యమాలు నిర్మించే సంఘాలు, సంస్థలే కాలక్రమంలో గ్రీన్ రాజకీయ పార్టీలుగా మారుతున్నాయి. యూరప్, అమెరికా ఖండాల్లోని సంపన్న దేశాల్లో ఎక్కువగా గ్రీన్ పార్టీలు పుట్టుకు రావటమే కాదు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి కూడా. 1960వ దశకంలో రాడికల్ సోషల్ యాక్టివిస్టులు, ముఖ్యంగా విద్యార్థుల నిరసనోద్యమాలు.. 1970–80 దశకాల్లో అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమాల నుంచి తొలినాటి గ్రీన్ పార్టీలు ఆవిర్భవించాయి. ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో గ్రీన్ పార్టీలకు ప్రాధాన్యం పెరుగుతూ వస్తోంది. కీలకమైన పార్లమెంటరీ స్థానాల్లో గెలుపొందటమే కాదు ముఖ్యమైన ప్రభుత్వ పదవులను సైతం చేపడుతుండటం విశేషం. క్లైమెట్ ఛేంజ్ వల్ల పర్యావరణ విపత్తులు గతమెన్నడూ ఎరుగని రీతిలో విరుచుకు పడుతున్న ప్రస్తుత తరుణంలో సంప్రదాయ రాజకీయ పార్టీల కూసాలు కదులుతుండగా గ్రీన్ పార్టీలకు ప్రజల్లో అంతకంతకూ ప్రాధాన్యం పెరుగుతోంది. 1972 నుంచి గ్రీన్ పార్టీల పుట్టుక తొలి రెండు గ్రీన్ పార్టీలు ఆస్ట్రేలియా (ద యునైటెడ్ తస్మానియా గ్రూప్), న్యూజిలాండ్ (ద వాల్యూస్ పార్టీ)లలో 1972లో ఏర్పాటయ్యాయి. 1973లో యునైటెడ్ కింగ్డమ్లో పీపుల్ (తర్వాత ద ఎకాలజీ పార్టీగా మారింది) పార్టీ పుట్టింది. 1979లో గ్రీన్ పార్టీ ఆఫ్ జర్మనీ రిజిస్టరైంది. 250 పర్యావరణ సంఘాలను ఏకం చేసి హెర్బర్ట్ గ్రూల్, పెట్రా కెల్లీ ఈ పార్టీని నెలకొల్పారు. 1983లో జాతీయ ఎన్నికల్లో ఈ పార్టీ ప్రతినిధి తొలుత గెలుపొందారు. 1998 నుంచి 2005 వరకు సోషల్ డెమోక్రటిక్ పార్టీతో కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. 2021 ఎన్నికల్లో అపూర్వమైన రీతిలో 15% ఓట్లు గెల్చుకుంది. గ్రీన్ పార్టీ అంటే..? ఫక్తు ఆధిపత్య రాజకీయాలకే పరిమితం కాకుండా పర్యావరణవాదం, సామాజిక నాయ్యం, అహింస తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించే రాజకీయ పార్టీలే గ్రీన్ పార్టీలు. సాధారణంగా ఇవి సోషల్ డెమోక్రటిక్ ఆర్థిక విధానాలను అనుసరిస్తూ వామపక్ష పార్టీలతో జత కడుతూ ఉంటాయి. ‘గ్లోబల్ గ్రీన్స్’ సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 87 గ్రీన్ పొలిటికల్ పార్టీలున్నాయి. ఈ పార్టీలన్నీ కలిసి 2001లో గ్లోబల్ గ్రీన్స్ పేరిట సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాయి. బ్రస్సెల్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థలో 87 గ్రీన్ రాజకీయ పార్టీలతో పాటు, 9 పర్యావరణ సంస్థలు కూడా సభ్యులుగా ఉన్నాయి. 12 మంది సభ్యులు గల స్టీరింగ్ కమిటీకి బాబ్ హలె, గ్లోరియా పొలాంకో 2020 నుంచి కన్వీనర్లుగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా సురేశ్ నాటియాల్ 2019లో నెలకొల్పిన ‘ఇండియా గ్రీన్స్ పార్టీ’కి కూడా ఈ సమాఖ్యలో సభ్యత్వం ఉంది. గ్లోబల్ గ్రీన్స్‌లోని పార్లమెంటేరియన్ నెట్‌వర్క్‌లో ప్రపంచవ్యప్తంగా విస్తరించిన 400కి పైగా గ్రీన్ పార్లమెంటు సభ్యులు టచ్‌లో ఉన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో 1992లో బ్రెజిల్‌లోని రియో డి జనీరో నగరంలో జరిగిన గ్రీన్ పార్టీల తొలి అంతర్జాతీయ సమావేశం గ్లోబల్ గ్రీన్స్ ప్రకటనను వెలువరించాయి. ‘గ్రీన్ పొలిటికల్ పార్టీలకు ప్రజలు ఓట్లు వేసినప్పుడే పర్యావరణ సమస్యలపై ప్రభుత్వాలు సీరియస్‌గా స్పందిస్తున్నాయని అనుభవాలు చెబుతున్నాయ’ని ఈ ప్రకటన పేర్కొంది. ఈ నేపథ్యంలో 2001లో తొలి ‘గ్లోబల్ గ్రీన్ పార్టీల కాంగ్రెస్’ కాన్బెర్రాలో జరిగింది. ఆ కాంగ్రెస్‌లోనే ‘గ్లోబల్ గ్రీన్స్ ఛార్టర్’ పేరిట పూర్తిస్థాయి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించాయి. ఆ తర్వాత 2012లో డకర్లో, 2017లో లివర్‌పూల్‌లో గ్రీన్ పార్టీల కాంగ్రెస్‌లు జరిగాయి. ఈ ఏడాది ఆగస్టులో దక్షిణ కొరియాలో జరిగిన కాంగ్రెస్‌లో గ్లోబల్ గ్రీన్స్ చార్టర్ అప్డేట్ చేశారు. 6 మూల సూత్రాలు పర్యావరణ జ్ఞానం, సాంఘిక న్యాయం, భాగస్వామ్య ప్రజాస్వామ్యం (పార్టిసిపేటరీ డెమోక్రసీ), అహింస, సుస్థిరత, వైవిధ్యానికి గౌరవం.. ఇవీ గ్లోబల్ గ్రీన్ పార్టీల మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు మూల సూత్రాలు. ‘భూమి జీవ శక్తి, వైవిధ్యం, సౌందర్యం మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం. వీటిని అంతరింపజేయకుండా, వీలైతే మెరుగుపరిచి, మన తరువాతి తరానికి అందించడం మన బాధ్యత’ అని దీని పీఠికలో తొలి వాక్యం చాటి చెబుతోంది. ‘పౌరులందరికీ తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కు ఉన్న ప్రజాస్వామ్యం కోసం కృషి చేస్తాం. వారి జీవితాలను ప్రభావితం చేసే పర్యావరణ, ఆర్థిక, సామాజిక, రాజకీయ నిర్ణయాలలో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు. స్థానిక, ప్రాంతీయ సమాజాలలో అధికారం, బాధ్యతలు కేంద్రీకృతమై ఉంటాయి. ఉన్నత స్థాయి పాలనకు అవసరమైన చోట మాత్రమే అధికారం, బాధ్యతలు పంపిణీ అవుతాయి..’ అని చార్టర్ భాగస్వామ్య ప్రజాస్వామ్యానికి భాష్యం చెప్తోంది. చారిత్రక బాధ్యత యూరప్, అమెరికా ఖండాల్లోని పారిశ్రామిక దేశాలు చాలా దశాబ్దాలుగా అతిగా కర్బన ఉద్గారాలను వెలువరిస్తూ భూగోళాన్ని అతిగా వేడెక్కిస్తూ పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఈ పనికి చారిత్రక బాధ్యతను సంపన్న దేశాలు ఇప్పటికైనా స్వీకరించాలి. భూతాపంతో వెల్లువెత్తుతున్న విపత్తులతో అన్ని దేశాలూ అతలాకుతలం అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇది మరీ స్పష్టమైపోయింది. అయితే, చేయని తప్పునకు పెను నష్టానికి గురవుతున్న అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలను నష్ట నివారణ సాంకేతికతను, నగదు తోడ్పాటును అందించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ, ప్రస్తుతానికి యూరప్, అమెరికా ఖండాలకే పరిమితమైన పర్యావరణ చైతన్యంతో కూడిన రాజకీయాలు ఈ ‘క్లైమెట్ ఎమర్జెన్సీ’ కాలంలో మనకు కూడా అవసరమే అనటంలో అతిశయోక్తి ఇసుమంతైనా లేదు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: ఈగలతో ప్రొటీన్ల సేద్యం! వ్యర్థాలకు చెక్..ఆదాయానికి ఆదాయం!) -
ఇంట్లోనే ఎరువు.. ఇలా చేస్తే మొక్కలు పచ్చగా కళకళలాడుతాయి
హోమ్మేడ్ ఎరువు ►గ్లాసు నీటిలో గుప్పెడు బియ్యం, స్పూను వంటసోడా వేసి కలపాలి. తరువాత అర టీస్పూను వెనిగర్ కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి స్ప్రే బాటిల్లో పోయాలి. జీవం కోల్పోయిన మొక్కలపై ఈ ద్రావణాన్ని చిలకరిస్తే.. మొక్కలు పచ్చగా కళకళలాడతాయి. ► ఉల్లిపాయ ముక్కలను నానబెట్టిన నీటిని మొక్కలకు పోస్తే మొక్కలకు మంచి ఎరువుగా పనిచేస్తుంది. వెనిగర్ కలిపిన నీళ్లు, సోయాబీన్ నీళ్లు, బీరు కలిపిన నీళ్లు కూడా మొక్కలకు బలాన్ని అందించి చక్కగా పెరిగేలా చేస్తాయి. ► కప్పు వేడినీటిలో స్పూను పంచదార, స్పూను వంట సోడా, స్పూను వెనిగర్ వేసి కలపాలి. కప్పు మీద మూత పెట్టి ఉంచాలి. 48 గంటల తరువాత ఈ నీటిని మొక్కలకు పోస్తే వేళ్లకు బలం అంది మొక్కలు చక్కగా పెరుగుతాయి. -
ఈగలతో ప్రొటీన్ల సేద్యం!
సేంద్రియ వ్యర్థాలను ఆహారంగా తిని పెరిగే బ్లాక్ సోల్జర్ ఫ్లై (బిఎస్ఎఫ్) పిల్ల పురుగు(లార్వా)లు కోళ్లతో పాటు చేపలు, రొయ్యలకు మంచి ప్రొటీన్లతో కూడిన మేతగా ఉపయోగపడుతున్నాయి. విదేశాల్లో విస్తారంగా జరుగుతున్న బిఎస్ఎఫ్ లార్వా సాగు ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ వ్యాపిస్తోంది. కుళ్లిన పండ్లు, కూరగాయలు, వంటింట్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలతో పాటు పశువుల పేడ, కోళ్లు, మేకలు, పందుల విసర్జితాలను తిని ఈ పిల్ల పురుగులు దాదాపు నెల రోజుల్లోనే పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. బిఎస్‌ఎఫ్‌పై పరిశోధనలు మన దేశంలో శైశవ దశలో ఉన్నాయి. ఐసిఎఆర్ గ్రాంటుతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం(పిజెటిఎస్ఎయు) ఏడాది క్రితమే వేస్ట్2వెల్త్ ప్రాజెక్టులో భాగంగా దీనిపై పరిశోధనలు చేపట్టింది. అంతేకాదు, శాస్త్రవేత్తలు, ఎంటర్ప్రెన్యూర్లు, రైతుల శిక్షణకు ఇటీవలే శ్రీకారం చుట్టింది. ఇన్నోవేటివ్ ఇన్సెక్ట్ ఫార్మింగ్ వివరాలతో ఆసక్తికర కథనం... ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన శాకాహార, మాంసాహారోత్పత్తుల్లో 60% మాత్రమే వినియోగమవుతోంది. పొలంలో 8%, మార్కెట్‌కు వెళ్లే దారిలో 14%, రిటైల్ అమ్మకందారుల వద్ద 7%, ఇళ్లలో వినియోగానికి ముందు 11% మేరకు ఆహారం వృథా అవుతోంది. 2021 యుఎన్ఇపి ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ ప్రకారం మన దేశంలో ఏటా 6.88 కోట్ల టన్నుల ఆహార వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఈ సేంద్రియ వ్యర్థాలను చెత్తకుప్పల్లో వేసే కంటే పునర్వినియోగించి ప్రయోజనం పొందటం తెలివైన పని. ఈ పనిని ఇతర పురుగుల కన్నా బ్లాక్ సోల్జర్ ఈగలు (బిఎస్ఎఫ్) సమర్థవంతంగా చేయగలవన్నది నిపుణుల మాట. పురుగుల సేద్యం చాలా వినూత్నమైనది, పర్యావరణ హితమైనది, ఆదాయాన్ని అందించేది కూడా. మన దేశంలో కొందరు వ్యాపారవేత్తలు, కోళ్ల రైతులు బ్లాక్ సోల్జర్ ఫ్లై (బిఎస్ఎఫ్) పిల్ల పురుగుల(లార్వా) ను సాగు చేయటం ఇటీవల ప్రారంభించారు. బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల ఉత్పతి కాలం వాటికి వేసే ఆహారాన్ని బట్టి మారుతుంది. ఒక బ్యాచ్ 20 రోజుల నుంచి 40 రోజుల వరకు పడుతుంది. ఆహారం మెత్తగా, త్వరగా జీర్ణించుకునే విధంగా ఉండి ప్రొటీన్లతో కూడి ఉన్నప్పుడు తక్కువ రోజుల్లోనే పురుగులు పెరుగుతాయి. లేయర్ కోళ్ల ఫారాల్లో ఇనుప కేజ్‌ల కింద పోగుపడే కోళ్ల పెంటపై బిఎస్ఎఫ్ ఈగల 5 రోజుల పిల్లలను వదిలితే చాలు.. ఆ వ్యర్థాలనే ఆహారంగా తింటూ 25–30 రోజుల్లోనే పిల్ల పురుగులు వృద్ధి చెందుతాయి. బిఎస్ఎఫ్ పెంపకం ద్వారా సేంద్రియ వ్యర్థాల పరిమాణాన్ని 15–25 రోజుల్లో 70–80% మేరకు కుదించవచ్చు. అందువల్లనే నగరాలు, పట్టణాల్లో పోగుపడే సేంద్రియ వ్యర్థాల సమర్థవంతమైన నిర్వహణకు ఇవి ఉపయోగపడుతున్నాయని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) చెబుతోంది. బిఎస్ఎఫ్ లార్వా(పిల్ల పురుగులు) బరువులో 40–45% వరకు ప్రొటీన్లు ఉన్నాయి. అందువల్ల కోళ్ల మేతలో, ఆక్వా మేతల తయారీలో సోయా చిక్కుళ్లు, ఫిష్ మీల్‌తో పాటుగా 10 శాతం వరకు బిఎస్ఎఫ్ పురుగుల పొడిని కలుపుతున్నారు. బతికి ఉన్న పిల్ల పురుగుల (వెట్ లార్వా)ను కోళ్లకు నేరుగా మేతగా వేస్తున్నారు. రోజువారీ మేతలో పది శాతం వరకు ఈ పిల్ల పురుగులను అందిస్తూ సత్ఫలితాలు పొందుతున్న కోళ్ల ఫారాలు తెలుగునాట ఇప్పటికే అనేకం ఉన్నాయి. పిజెటిఎస్‌ఎయులో పైలెట్ ప్రాజెక్టు అయితే, మన దేశంలో దీనిపై పరిశోధనలు ఇంకా శైశవ దశలోనే ఉన్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిజెటిఎస్ఎయు) ఈ దిశగా ముందడుగు వేసింది. దేశంలోనే మొట్టమొదటిగా బిఎస్ఎఫ్ పెంపకంపై పరిశోధన చేపట్టింది. నేషనల్ అగ్రికల్చర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ‘వేస్ట్2వెల్త్’ ప్రాజెక్టును మంజూరు పిజెటిఎస్ఎయుకు గత ఏడాది చేసింది. పిజెటిఎస్ఎయు పీజీ స్టడీస్ డీన్, కీటక శాస్త్ర ఆచార్యులు డా. వి. అనిత ఈ ప్రాజెక్టుకు నోడల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాజేంద్రనగర్‌లోని వర్సిటీ ఆవరణలో బ్లాక్ సోల్జర్ ఫ్లైల పెంపకం కమ్ శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పారు. కూరగాయలు, పండ్ల వ్యర్థాలు, మెస్‌లో మిగిలిన అన్నం, గోధుమ తవుడు మిశ్రమంతో బిఎస్ఎఫ్ పిల్ల పురుగులు పెంచుతున్నారు. పరిశోధక విద్యార్థులు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, కృషి విజ్ఞాన కేంద్రాల్లోని శాస్త్రవేత్తల మొదటి బ్యాచ్‌కు డా. అనిత ఇటీవలే శిక్షణ ఇచ్చారు. ఎంటర్ప్రెన్యూర్లు, రైతులకు కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు డా. అనిత ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. నగరాలు, పట్టణాల్లో వెలువడే సేంద్రియ ఆహార వ్యర్థాల కాలుష్యాన్ని తగ్గించడానికి, పనిలో పనిగా మంచి ప్రొటీన్‌ను అందుబాటులోకి తెచ్చుకోవడానికి బిఎస్ఎఫ్ లార్వాల పెంపకం ఉపయోగకరం. అన్నిటికీ మించి, సేంద్రియ వ్యర్థాల పరిమాణాన్ని 15–25 రోజుల్లోనే 70–80% మేరకు తగ్గించేంత ఆబగా తినగల శక్తి బిఎస్ఎఫ్ జాతికి వుంది. బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పెంపకానికి మన దేశపు వాతావరణం చాలా అనువైనదంటున్నారు డా.అనిత. ఎంటర్ప్రెన్యూర్లకు, రైతులకు శిక్షణ ఇస్తున్నాం! బ్లాక్ సోల్జర్ ఈగలు మనకు కొత్తవి కావు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 20వ శతాబ్దం నుంచి ఉన్నదే ఈ జాతి. కొత్త తెగుళ్లు వ్యాప్తి చెందుతాయన్న భయం లేదు. ఆహార వ్యర్థాలు, పశువుల విసర్జితాలను సాధ్యమైనంత మెత్తగా చేసి, సులభంగా జీర్ణించుకునేలా మార్చి ఈ పురుగులకు వేయాలి. అందులో ప్రొటీన్లు ఉండాలి. చిన్న పిల్లల ఆహారం లాగా ఉండాలి. కూరగాయలు, పండ్ల వ్యర్థాలను సేకరించి, మెత్తగా రుబ్బి.. దానితో పాటు మెస్‌లో మిగిలిపోయిన అన్నం, గోధుమ తవుడు కొంచెం కలిపి మా ప్రయోగశాలలో బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను పెంచుతున్నాం. వాటికి వేసే ఆహారాన్ని బట్టి, దానిలో పోషక విలువలను బట్టి, వాతావరణంలో వేడి, గాలిలో తేమను బట్టి.. అవి ఎన్ని రోజుల్లో, ఎంత బరువు పెరుగుతాయన్న విషయం ఆధారపడి ఉంటుంది. సేంద్రియ వ్యర్థాలను సమర్థవంతంగా నాణ్యమైన సేంద్రియ ఎరువుగా మార్చుకునే మార్గం ఇది. పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. మంచి ఆదాయమూ సమకూరుతుంది. రైతులకు, ఎంటర్ప్రెన్యూర్లకు శిక్షణ ఇస్తున్నాం. సేంద్రియ వ్యర్థాలను తినే అనేక జీవులుండగా బ్లాక్ సోల్జర్ ఫ్లైలనే ఎందుకు ఎంపిక చేసినట్లు? ఇదే ప్రశ్న డా. అనితను అడిగితే ఇలా బదులిచ్చారు... రోజుకు తన బరువుకు రెట్టింపు సేంద్రియ వ్యర్థాలను తిని, సేంద్రియ ఎరువును విసర్జించగల శక్తి బిఎస్ఎఫ్ పిల్ల పురుగులకు ఉంది. దీని అర్థం ఏమిటంటే.. చెత్త కుప్పలకు తరలివెళ్లే సేంద్రియ వ్యర్థాలు తగ్గిపోతాయి. మిథేన్ ఉద్గారాలు ఆ మేరకు తగ్గుతాయి. కుళ్లిన పండ్లు/కూరగాయలు,హోటళ్లు/ఇళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలతో పాటు పశువుల పేడ, కోళ్లు, మేకలు, పందుల విసర్జితాలు వంటి సేంద్రియ వ్యర్థాలను బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పెంపకానికి వాడొచ్చు. బిఎస్ఎఫ్ జీవిత చక్రం మొత్తం 42–55 రోజులు. గుడ్లు పెట్టిన 4–5 రోజులకు పిగులుతాయి. అవి 15–25 రోజుల్లో పిల్ల పురుగులా(లార్వా)గా ఎదుగుతాయి. ఈ దశలోనే వాటిని సేకరించి కోళ్లు, ఆక్వా మేతల్లో వాడుతున్నారు. అలాగే ఉంచితే, ప్యూపాగా రూపాంతరం చెంది, 17 రోజుల తర్వాత బ్లాక్ సోల్జర్ ఈగలు పుడతాయి. మగ ఈగ 4 రోజుల్లో ఆడ ఈగను కలిసిన తర్వాత చనిపోతుంది. ఆడ ఈగ 5–8 రోజుల్లో గుడ్లు పెట్టి చనిపోతుంది. గుడ్లను సేకరించి, అతి చిన్న పురుగులను తయారు చేయట కొంచెం క్లిష్టమైన ప్రక్రియ. 5 రోజుల పిల్లలకు తగిన సేంద్రియ ఆహారం అందిస్తే 15–25 రోజుల్లో పిల్ల పురుగులు(లార్వా)గా పెరుగుతాయి. ఆ దశలో చక్కని ప్రొటీన్లతో కూడిన ఆ పిల్ల పురుగులు కోళ్లు, చేపలు, రొయ్యలకు మేతగా వాడుకోవచ్చు. 5 రోజుల పిల్లలను కొనుక్కొని రైతులు 15–25 రోజుల్లో బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను లార్వా దశకు పెంచి, కోళ్లకు, చేపలు, రొయ్యలకు మేతగా వేసుకోవచ్చు లేదా కొనుగోలుదారులకు అమ్ముకోవచ్చు. స్వయం ఉపాధిగా యువకులు బిఎస్ఎఫ్ లార్వా సాగు చేపట్టవచ్చు. ఈ లార్వాను దాణా తయారీ కంపెనీలు, సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. లార్వా దశ దాటి ప్యూపా దశకు పెరిగితే దాణాల్లో వాడకానికి పనికిరాదు. సోయా చిక్కుళ్ల సాగులో సమస్యలు, సముద్రాల్లో చేపల సంతతి తగ్గిపోతుండటం వల్ల కోళ్లు, ఆక్వా మేతలతో పాటు, పెంపకపు కుక్కల మేతల్లో కూడా బిఎస్ఎఫ్ పిల్ల పురుగులను ప్రొటీన్ సప్లిమెంట్‌గా ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. దీంతో బిఎస్ఎఫ్ లార్వా సాగుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పిల్ల పురుగులే అధిక నాణ్యత గల ప్రొటీన్లతో కూడిన దాణాకు ముడి పదార్థం. కోళ్లు, చేపలు, రొయ్యలు, పందులు, పెంపుడు కుక్కలకు వేసే మేతలో బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పొడిని కలపవచ్చు. పిల్ల పురుగుల బరువులో 40–45% ప్రొటీన్‌తో పాటు ఎసెన్షియల్ అమినో యాసిడ్లు ఉంటాయి. సాధారణంగా మేతల్లో ప్రొటీన్లుగా వాడే సోయా చిక్కుడు గింజలు, ఫిష్మీల్ను కొంత తగ్గించి దీన్ని వాడుతున్నారు. కోళ్లకు రోజువారీ మేతలో పది శాతం మేరకు దీన్ని వాడుతున్నారు. పిల్ల పురుగులను బతికి ఉన్నప్పుడే ఫారం కోళ్లకు మేపవచ్చు. నాటు కోళ్లకూ ఇది మంచి ఆహారం. బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పెంపకం క్రమంలో వెలువడే విసర్జితాలే(ఫ్రాస్) పంటలకు అత్యంత విలువైన సేంద్రియ ఎరువుగా పనికి వస్తుంది. వర్మీకంపోస్టు, పశువుల ఎరువుల్లో కంటే అధిక పోషక విలువలు ఇందులో ఉంటాయని చెబుతున్నారు. విదేశాల్లో బిఎస్ఎఫ్ పిల్ల పురుగుల పొడిని బర్గర్లు, షేక్‌లలో కలుపుతున్నారు. దీని నుంచి వెలికితీసే నూనెను బయో ఇంధనంగా వాహనాలు, జనరేటర్లలో వాడుతున్నారు. బిఎస్ఎఫ్ లార్వా నుంచి వెలువడే పొలుసులు(కూటిన్) బయోడీగ్రేడబుల్ ప్యాకేజింగ్ ప్లాస్టిక్ తయారీకి వాడుతున్నారు. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలున్నందున వైద్య అవసరాలకు కూడా వినియోగిస్తున్నారు. వర్షాకాలంలో దీపం చుట్టూ చేరే ఉసుళ్లను వేపుకొని శనగపప్పుతో కలుపుకొని తినే అలవాటు మన దేశంలోనూ ఉంది. బిఎస్‌ఎఫ్‌తో పాటు మిడతలు, మీల్ వార్మ్స్, గొల్లభామలు, వంటి 1,900 జాతుల పురుగులను 113 దేశాల్లో 200 కోట్ల మంది తింటున్నారని ఎఫ్ఎఓ చెబుతోంది. --పతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: అంతరించిపోయే స్టేజ్‌లో అరటిపళ్లు!..శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్)