Sagubadi
-
పచ్చదనంపై ప్రేమ, ఏకంగా డబుల్ డెక్కర్ గార్డెన్‌నే పెంచేస్తోంది
పచ్చదనంతో కళకళలాడే పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు. చాలామందికి చిన్నతనమంతా పల్లెల్లోనే గడుస్తుంది. ఇప్పటి పిల్లలకు ఆ అవకాశం లేదు. పల్లెటూళ్లంటే పండగలు, పబ్బాలు, సెలవలు గడపడానికి వెళ్లే పర్యాటక స్థలాలుగా భావిస్తున్నారు. అరవైపదుల వయసు వారు మాత్రం పల్లెల మట్టివాసనలు, పచ్చదనం పరిమళాలను ఇప్పటికీ కోరుకుంటూనే ఉన్నారు. ఈ కోవకు చెందిన నీలిమా దింగ్రా... తన చిన్ననాటి పచ్చదనాన్ని ఆస్వాదించేందుకు ఏకంగా డబుల్ డెక్కర్ గార్డెన్‌నే పెంచేస్తోంది. తనలాగా పచ్చదనాన్ని ఆస్వాదించాలనుకునేవారికీ సలహాలు సూచనలు ఇస్తూ వారితో మొక్కలు నాటిస్తోంది. అరవై ఏళ్ల వయసులో ఇవన్నీ చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది నీలిమా దింగ్రా. ఢిల్లీకి చెందిన నీలిమా దింగ్రా స్టాండర్డ్ సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటర్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్. దీని విలువ కోట్లలోనే ఉంటుంది. వ్యాపార భాగస్వామితో కలిసి, రూ.75 లక్షల పెట్టుబడితో నీలిమ దీనిని ప్రారంభించింది. కొద్దిసంవత్సరాల్లోనే కంపెనీని లాభాల బాట పట్టించింది. డిల్లీలో ప్రధాన కార్యాలయంతో పాటు, ముంబైలో మరో రెండు కార్యాలయాలు నిర్వహిస్తూ సక్సెస్‌పుల్ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది. ఇంతపెద్ద వ్యాపారం చూసుకునేవారికి ఏమాత్రం తీరిక దొరికినా.. వయసు రీత్యా కాస్త విశ్రాంతి తీసుకుంటారు. కానీ నీలిమ మాత్రం ఇంట్లో డబుల్ డెక్కర్ గార్డెన్‌ను పెంచుతూ అబ్బురపరుస్తోంది. చిన్నప్పటిలా ఉండాలని... నీలిమ చిన్నప్పుడు హర్యాణాలోని రోహ్తక్లో పెరిగింది. అక్కడ ఎటుచూసిన పచ్చదనమే కనిపించేది. స్కూలు నుంచి రాగానే జామ చెట్టు కింద కూర్చుని అన్నం, స్నాక్స్ వంటివి తినేది. ఆకుపచ్చని పరిసరాల్లో పెరగడం వల్ల మొక్కలపైన ఎనలేని మక్కువ ఏర్పడింది. పెద్దయ్యి చదువులు, పెళ్లితో పెద్దపట్టణంలో స్థిరపడింది. అభివృద్ధి పేరుతో ఎక్కడ చూసిన కాంక్రీట్ నిర్మాణాలే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ షో కోసం పెంచుతున్న ఒకటి రెండు మొక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. అందరికీ ప్రాణవాయువు ఇచ్చేంత పచ్చదనం మచ్చుకైనా కనిపించడంలేదు. పచ్చదనాన్ని ఇష్టపడే నీలిమ ఏ మాత్రం సమయం దొరికినా దగ్గర్లోని పార్క్‌కు వెళ్లేది. చల్లని సాయంత్రాల్లో పార్క్‌లో నడుస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉండేది తనకు. అయితే కొద్దిరోజులకు మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. దీంతో 2015 నుంచి పార్క్‌కు వెళ్లడం మానేసింది. పార్క్‌లో నడిచే సమయాన్నీ ఇంట్లో మొక్కలు నాటడానికి కేటాయించింది. ఇంట్లో ఒక మూలన కొద్దిపాటి స్థలంలో విత్తనాలు వేసింది. అవి చక్కగా మొలకెత్తడంతో ఆమె గార్డెన్‌ను విస్తరించడం మొదలు పెట్టింది. ఇలా విస్తరిస్తూ రెండు అంతస్తుల్లో పచ్చటి గార్డెన్‌ను అభివృద్ది చేసింది. ఈ డబుల్ డెక్కర్ టెర్రస్ గార్డెన్‌ను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో నిర్వహించడం విశేషం. ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ సమయం కేటాయిస్తూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అందమైన టెర్రస్ గార్డెన్‌ను నిర్వహిస్తోంది. పెంచుతూ పంచుతోంది.. తన డబుల్ డెక్కర్ గార్డెన్ పచ్చదనంతో కళకళలాడుతుండడం నీలిమకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ సంతోషంతో మొక్కలను ఇతరులకు ఉచితంగా అందించేది. తన గార్డెన్లో పెరిగిన మొక్కల పిలకలు, అంటుకట్టడం ద్వారా వచ్చిన కొత్త మొక్కలను తెలిసినవారికి, గుళ్లకు ఇస్తోంది. ఇలా ఇప్పటి దాకా వెయ్యికి పైగా మొక్కలను పంచింది. నీలిమ గార్డెన్ చూసిన వారంతా మొక్కలు చక్కగా పెరగాలంటే ఏంచేయాలంటూ అని అడిగి మరీ నీలిమ దగ్గర సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఆసక్తితో శాంతి... ఇతరులు చిట్కాలు, సూచనలు తీసుకోవడం గమనించిన నీలిమ గార్డెనింగ్ జ్ఞానాన్నీ మరింతమందికి పంచాలన్న ఉద్దేశంతో ‘శాంతి క్రియేషన్స్’ పేరిట యూ ట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి గార్డెనింగ్ చిట్కాలు చెబుతోంది. నెటిజన్లు అడిగే సందేహాలను నివృత్తి చేస్తోంది. ఎక్కువ స్థలం లేనివారు వర్టికల్ గార్డెన్‌ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, చీడపీడల నుంచి మొక్కలను ఎలా కాపాడుకోవాలి. తక్కువ ఖర్చులో అందమైన గార్డెన్‌ను ఎలా పెంచుకోవాలి, వంటి సందేహాలకు చక్కని సలహాలు ఇస్తోంది. ఆరుపదుల వయసులో పచ్చదనంతో బిజీగా ఉంటూ నేటియువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది. -
అంతరించిపోయే స్టేజ్‌లో బనానా!..శాస్త్రవేత్తలు స్ట్రాంగ్ వార్నింగ్
కాలుష్యం లేదా కొన్ని రకాల చీడపీడల కారణంగా పూర్వం నాటి ప్రముఖ పండ్లు, కూరగాయాలు అంతరించిపోవడం జరిగింది. వాటి విత్తనాలు సైతం కనుమరగవ్వడం. అందుబాటులో ఉన్న మొక్కల సాయంతోనే కొత్త రకాల వంగడాలను సృష్టించడం వంటివి చేశారు శాస్త్రవేత్తలు. ఇలా ఎందుకు జరుగుతుందని శాస్త్రవేత్తల మదిని తొలిచే చిక్కు ప్రశ్న. ఇప్పుడు ఆ స్టేజ్‌లోకి బనానాలు కూడా వచ్చేశాయి. ఔను!.. మనం ఎంతో ఇష్టంగా తినే అరటిపండ్లు అంతరించే పోయే ప్రమాదంలో ఉన్నాయని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఎందువల్ల అరటిపండ్లు అంతరించిపోతున్నాయి? రీజన్ ఏంటి? తదితరాల గురించే ఈ కథనం!. పేదవాడు సైతం కొనుక్కుని ఇష్టంగా తినగలిగే పండు అరటిపండు. అరటిపండులో ఉండే పోటాషియం వంటి విటమిన్లు ఎన్నో రకాల వ్యాధులను దరి చేరకుండా రక్షిస్తుంది. అలాంటి పోషకవిలువలు కలిగిన పండు ప్రస్తుతం కనుమరగయ్యే స్థితిలో ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ప్రజలు ఇష్టంగా తినే అరటి పండ్లలలో కావెండిష్ అరటిపండ్లు ఒకటి. ఇది వాణిజ్యం పరంగా అధికంగా ఎగుమతయ్యే అరటిపండు కూడా ఇదే. ఈ అరటిపండ్ల చెట్లకు పనామా అనే ఉష్ణమండల జాతికి చెందిన ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందని. ఇది చెట్టు మూలల్లో అటాక్ చేసి నాశనం చేస్తుందని చెబుతున్నారు. ఇది చెట్టు మొదలులోనే రావడంతో ముందుగా మొక్కను నీటిని గ్రహించనీయకుండా చేస్తుంది. తద్వారా కిరణజన్య సంయోగక్రియను చేసుకోలేని పరిస్థితి మొక్కలో ఏర్పడి చివరికి మొక్క చనిపోతుంది. దీంతో ఈ కావెండీష్ రకం అరటిపండ్లు అంతరించిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు అంతరించిపోయే దశలో ఉన్నట్లు వెల్లడించారు. సమస్యను పరిష్కరించలేని స్థితిలో ఉన్నామని "ది ఫేట్ ఆఫ్ ది ఫ్రూట్ దట్ చేంజ్ ది వరల్డ్" అనే పుస్తకంలో రచయిత డాన్ కోపెల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శాస్త్రవేతలు ఈ అరటిపండ్లకు ఈ ఫంగల్ తెగులుని తట్టుకునే విధంగా వ్యాధి నిరోధకతను పెంచేలా జన్యు మార్పులు చేసే పనిలో ఉన్నారన్నారు. రైతులు కూడా ఈ రకం అరటి సాగుకి సంబంధించి ప్రత్యామ్నాయా మార్గాలపై దృష్టిసారించడం లేదా ఈ పండ్ల సాగును మానేయడం వంటి పనులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నిజానికి ఈ కావెండిష్ రకం పండ్లను 1989లో తైవాన్‌లో గుర్తించారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు విస్తరించింది. అక్కడ నుంచి భారత్, చైనాలోకి ప్రవేశించి, ప్రధాన అరటి ఉత్పత్తిలో ఒకటిగా నిలిచింది. ఆఖరికి ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో కూడా ఈ రకం పండిస్తున్నారు. ఇటీవలే ఈ వ్యాధి దక్షిణాఫ్రికాలోని అరటి చెట్లలో కూడా కనిపించిందని క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ప్రోఫెసర్ జేమ్స డేల్ తెలిపారు. ఈ రకమైన వ్యాధి అరటి చెట్లకు ఒక్కసారి వస్తే వదిలించడం చాలా కష్టమని చెబుతున్నారు. ఇలానే గతంతో గ్రోస్ మిచెల్ అనే రకం అరటిపండుకి టీఆర్ 4 అనే తెగులు వచ్చింది. దీంతో రైతులు మరో రకం అరటిపళ్లను సాగు చేయడంపై దృష్టిసారించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ రకం అరటిపండు క్రమేణ కనుమరుగయ్యింది. దాని స్థానంలోనే ఈ కావెండిష్ రకం అరటిపళ్లు వచ్చాయి. అయితే ఇది గ్రోస్ మిచెల్లా కావెండిష్ రకం అరటిపళ్లు అంతరించడానికి టైం పడుతుందని, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తీవ్రమవ్వడానికి కనీసం దశాబ్దం పడుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈలోగా ఆ వ్యాధిని నివారించేలా జన్యుపరమైన మార్పులు చేయడం లేదా మొక్కల్లో వ్యాధినిరోధక స్థితిని పెంచి ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలిగేలా చేయగలమని కొందరూ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం. (చదవండి: పత్తి కేవలం వాణిజ్య పంటే కాదు ఆహార పంట కూడా..ఆఖరికి కొన్ని దేశాల్లో..) -
వేప తెగులు స్వల్పకాలికమే
సాక్షి, సాగుబడి డెస్క్ :వాతావరణంలో, వర్షపాతంలో చోటుచేసుకుంటున్న పెను మార్పులే వేప చెట్లకు శాపంగా మారినా, దీని వల్ల వేప కాయల ఉత్పత్తికి విఘాతం కలగటం లేదని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) ప్రాథమిక అధ్యయనంలో నిర్ధారణకు వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ప్రతి ఏటా వేప చెట్ల చిగుర్లు మాడిపోతుండటం, మరికొన్ని చోట్ల చెట్లు నిలువునా ఎండిపోతుండటం గత కొన్నేళ్లుగా రివాజుగా మారిన విషయం తెలిసిందే. టీ మస్కిటో పురుగు (టిఎంబి) సోకటం వల్ల కొన్ని నెలల పాటు (మే–సెప్టెంబర్) వేప చెట్ల కొమ్మలు ఎండిపోతూ.. తిరిగి వాటికవే తిప్పుకుంటున్నాయి. ఇది నైరుతి రుతుపవనాల కాలం ముగిసిన తర్వాత తగ్గిపోయే సమస్యేనని, దీని వల్ల వేప కాయల దిగుబడికి పెద్దగా నష్టం లేదని ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని ఐసీఏఆర్– కేంద్రీయ ఆగ్రోఫారెస్ట్రీ పరిశోధనా సంస్థ (సిఎఎఫ్‌ఆర్‌ఐ–కాఫ్రి) సంచాలకులు డా. ఎ. అరుణాచలం వెల్లడించారు. అయితే, క్రిమిసంహారక స్వభావం కలిగిన వేపను టిఎంబి గతమెన్నడూ లేనంతగా ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఆశిస్తోందన్న అంశంపై లోతైన అధ్యయనం జరగాల్సి ఉందన్నారు. గాలిలో అధిక తేమ వల్లనే పురుగు ఉధృతి ఆగ్రోఫారెస్ట్రీపై జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన ‘సాక్షి సాగుబడి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. మే నుంచి అకాల వర్షాలు, వర్షపాతంలో అసాధారణ మార్పుల వల్ల ఆయా రాష్ట్రాల్లో గాలిలో తేమ అధికంగా ఉండటం మూలంగా ట్రీ మస్కిటో పురుగు ఉధృతి పెరుగుతోందన్నారు. తెలంగాణలో కూడా కనిపించడం విచిత్రమే సముద్ర తీర రాష్ట్రాల్లో ఇది ప్రధాన సమస్యగా ఎదురవుతున్నదని, కానీ తెలంగాణలో కూడా ఇది తీవ్రంగా కనిపిస్తుండటం పట్ల ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారాయన. 96 దేశాల్లో వేప చెట్లు పెరుగుతున్నాయని, అయితే, టీ మస్కిటో పురుగు సోకుతున్నట్లు చైనా తప్ప మరే దేశమూ వెల్లడించలేదన్నారు. గాలి ద్వారానే టిఎంబి విస్తరిస్తోందని, ఒక ప్రదేశంలో దగ్గర దగ్గరగా ఉన్న చెట్లకు ఎక్కువగా సోకుతోందని, ఇది మనుషులకు హానికరం కాదని డా. అరుణాచలం అన్నారు. ఇలా అరికట్టవచ్చు పొటాషియం లోపించిన నేలల్లో పెరుగుతున్న వేప చెట్లకు టీఎంబీ ఎక్కువగా సోకుతున్నట్లు కొన్ని ప్రాంతాల్లో గుర్తించారు. పొటాషియం పుష్కలంగాఉన్న నేలల్లో చెట్లకు పెద్దగా సోకలేదు. పశువుల ఎరువులో ట్రైకోడెర్మా విరిడి కలిపి వేపచెట్లకు వేస్తే కొమ్మెండు సమస్యను సమర్థవంతంగా అరికట్టవచ్చని డా. అరుణాచలం వివరించారు. -
పురుగుల నివారణకు జిల్లేడు ఆకుల రసం
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగయ్యే వరి పొలాల్లో పిలక, చిరు పొట్ట దశలో ఏర్పడే సూక్ష్మ పోషకాలు/ పొటాష్ లోపాలతో పాటు రసంపీల్చే పురుగుల నివారణకు జిల్లేడు ఆకుల ద్రావణం సమర్థవంతంగా పనిచేస్తోందని రైతులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయ దారులు జిల్లేడు ద్రావణాన్ని విస్తృతంగా వాడుతూ ప్రయోజనం పొందుతున్నారు. జిల్లేడు ద్రావణం తయారీకి కావాల్సిన పదార్ధాలు: 200 లీటర్ల నీరు, 20 కేజీల జిల్లేడు ఆకులు, 10 లీటర్ల నాటు ఆవు మూత్రం. తయారీ విధానం: 200 లీటర్ల నీటిలో 20 కేజీల జిల్లేడు ఆకులు వేసి 10 లీటర్ల ఆవు మూత్రం కలపాలి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం కల΄ాలి. 3 రోజుల తరువాత వాడకానికి సిద్ధమవుతుంది. మోతాదు: 100 లీటర్ల నీటిలో 10 లీటర్ల జిల్లేడు ద్రావణం కలిపి పిచికారీ చెయ్యాలి. నిల్వ : 7 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. వివరాలకు: రైతు సాధికార సంస్థ ఉత్తరాంధ్ర సాంకేతిక అధికారి హేమసుందర్:80743 20481 -
ప్రకృతి సేద్యంతో తగ్గనున్న నిరుద్యోగం, రైతులకు అధికంగా ఆదాయం
రసాయనిక సేద్యం భూముల్ని బీళ్లుగా మార్చుతుంటే.. ప్రకృతి సేద్యం బీళ్లను సాగులోకి తెస్తుంది. ప్రకృతి సేద్యంతో 2050 నాటికి నిరుద్యోగం రేటు 31 నుంచి 7 శాతానికి తగ్గుతుంది. ప్రకృతి విపత్తులను దీటుగా తట్టుకోవడం ప్రకృతి సేద్యంతోనే సాధ్యం. దీనివల్ల రైతుల ఆదాయం అధికం అవుతుంది. జనాభా పెరుగుదల– ఉపాధి అవకాశాలు, ఆర్థిక పురోగతి– అసమానతలు, నేల వినియోగం, దిగుబడి – ఆహార ఉత్పత్తి తదితర కోణాల్లో రెండు విభిన్న సాగు పద్ధతుల్లో పొందే ఫలితాల్లో వ్యత్యాసాలను అధ్యయనం చేసి ఈ నివేదికలో పొందుపరిచారు. ►రసాయనాలతో కూడిన పారిశ్రామిక వ్యవసాయం ఇలాగే కొనసాగితే 2050 నాటికి రైతుల సంఖ్య సగానికి తగ్గుతుంది. నిరుద్యోగం రేటు 31 శాతం నుంచి 30 శాతానికి తగ్గుతుంది. అయితే, పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేపడితే రైతుల సంఖ్య కోటికి పెరుగుతుంది. నిరుద్యోగం రేటు 7 శాతానికి తగ్గుతుంది. ► ప్రకృతి వ్యవసాయం ద్వారా బంజరు భూములు కూడా సాగులోకి వస్తాయి. అధిక విస్తీర్ణం సాగులోకి వచ్చి అత్యధిక మంది రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు. తక్కువ పెట్టుబడితో ఏడాది పొడవునా రసాయన రహిత సురక్షిత పంటలు పండిస్తారు. అందువల్ల అధిక మార్కెట్ ధర పొందుతారు. ► ప్రకృతి వ్యవసాయ విధానంలో విత్తనాలు, నీటి వినియోగం, రసాయనాలు, ఇంధనం, అప్పులు, భారీ యంత్ర సామగ్రి తదితర ఖర్చుల విషయంలో రైతులకు ఎంతో డబ్బు ఆదా అవుతుంది. ఈ రైతులు పంట ఉత్పత్తులను విలువ జోడించి అమ్ముతారు కాబట్టి అధికాదాయం వస్తుంది. ► ప్రకృతి వ్యవసాయంలో నిరుద్యోగం తగ్గి, వ్యవసాయ–వ్యవసాయేతర వేతనాల్లో అంతరం తగ్గటం కారణంగా ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. ఆర్థిక వృద్ధి 6.5%కి చేరుకుంటుంది. ► రసాయనిక వ్యవసాయం కొనసాగిస్తే 2050 నాటికి ఇది 6.1 పైసలు మాత్రమే ఉంటుంది. ప్రకృతి వ్యవసాయంలో ప్రతి రైతు ఉత్పత్తి చేసిన ప్రతి కిలో కేలరీల ఆహారానికి 10.3 పైసల ఆదాయం పొందుతారు. ► రసాయనిక వ్యవసాయం కొనసాగిస్తే 2019లో 62 లక్షల హెక్టార్లున్న సాగు భూమి విస్తీర్ణం 2050 నాటికి 55 లక్షల హెక్టార్లకు తగ్గుతుంది. కొన్ని పంటలపై మాత్రమే దృష్టి కేంద్రీకరించే పారిశ్రామిక వ్యవసాయ విధానంలో బీడు భూముల విస్తీర్ణం 2019లో 24 లక్షల హెక్టార్ల నుంచి 2050 నాటికి 30 లక్షల హెక్టార్లకు పెరిగే ప్రమాదం ఉంది. ► ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో బీడు భూములు కూడా సాగులోకి వచ్చి 2019లో 62 లక్షల హెక్టార్లున్న సాగు భూమి 2050 నాటికి 80 లక్షల హెక్టార్లకు పెరుగుతుంది. పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగి ప్రస్తుత సవాళ్లను అధిగమించవచ్చు. ► రసాయన సేద్యంలో మొత్తం మీద తక్కువ భూమి, తక్కువ మంది రైతులు, అధిక సాగు ఖర్చులు, అధిక నిరుద్యోగ రేటుతో కలిపి వ్యవసాయ జివిఎ పెరుగుదల రేటు సగటున సంవత్సరానికి 4% నుంచి 3.5%కి తగ్గుతుంది. ► ప్రకృతి వ్యవసాయం నేల ఆరోగ్యాన్ని పెంపొందించి సారవంతమైన భూములను అందిస్తుంది. అనేక రకాల పంటలతో అధిక పంట సాంద్రత ఏర్పడుతుంది. ► ప్రకృతి వ్యవసాయం అనుసరిస్తున్న రైతులు దిగుబడిలో ఎలాంటి తగ్గుదల లేకపోవడమే కాకుండా, అధిక దిగుబడిని కూడా సాధిస్తున్నారు. వర్షాధార వ్యవసాయ భూముల్లోనూ పలు రకాల పంటల సాంద్రత వల్ల మరింత దిగుబడిని సాధిస్తున్నారు. మొత్తానికి ప్రకృతి వ్యవసాయంలో రైతులు 2019లో హెక్టారుకు రోజుకు 31,000 కిలో కేలరీల ఆహారాన్ని ఉత్పత్తి చేశారు. 2050 నాటికి అది 36,000 కిలో కేలరీలకు పెరుగుతుంది. ► రసాయనిక వ్యవసాయంలో 2050 నాటికి రైతులు రోజుకు హెక్టార్‌కు దాదాపు 44,000 కిలో కేలరీలు ఉత్పత్తి చేసినా.. ప్రకృతి సేద్యంలో పండే పంట ఉత్పత్తులు స్థూల,సూక్ష్మ పోషకాలు, పీచు పదార్ధంతో కూడిన బలవర్ధకమైన, సమతుల్యమైన ఆహారాన్ని అందిస్తాయి. ► రెండు విభిన్న పద్ధతుల్లో ఆహారోత్పత్తి, సాగు విస్తీర్ణం, వార్షిక దిగుబడులను అంచనా వేసి చూస్తే.. 2050లో ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండే ఆహారం రసాయనిక వ్యవసాయం (4050 కిలో కేలరీలు/తలసరి/రోజు)లో కంటే ప్రకృతి వ్యవసాయం (5000 కిలో కేలరీలు/తలసరి/రోజు)లో గణనీయంగా పెరుగుతుంది. అంతేగాక ప్రకృతి సేద్యంలో పండించిన పంట ఉత్పత్తులు రసాయనిక ఉత్పత్తుల కంటే మరింత సమతుల్యంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ► ప్రతికూల వాతావరణ పరిస్థితులకు తట్టుకొనే విధంగా వ్యవసాయ పంటల జీవ వైవిధ్యం పెరుగుతుంది. సేంద్రియ కర్బనం నేలల్లో వృద్ధి చెందుతుంది. తద్వారా వాతావరణ మార్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ► అధిక ఉష్ణోగ్రతలు, కరువు, తుపాన్లు, వరదలు వంటి వాతావరణ విపత్తులను తట్టుకోవడం రసాయనిక సేద్యంతో సాధ్యం కాదని నివేదిక స్పష్టం చేస్తోంది. పెట్టుబడి తగ్గటం, సురక్షిత నీటితో పాటు విస్తృత స్థాయిలో ΄ûష్టికాహారం అందించడం, పర్యావరణ పరిరక్షణ వల్ల రాష్ట్రం ‘రైతు అభివృద్ధి’కి దిక్సూచిగా మారుతుంది. -
మూడేళ్ల పాటు రీసెర్చ్.. ప్రకృతి వ్యవసాయంతోనే అది సాధ్యమవుతుంది
జలమే జీవం జలమే ఆహారం.. అనే నినాదంతో ఎఫ్ఎఓ ప్రపంచ ఆహార దినోత్సవం సోమవారం నిర్వహించింది. ఈ సందర్భంగా వెలువడిన ఓ తాజా నివేదిక ఆసక్తిని కలిగిస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయం అమలవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2031 నాటికి పొలాలన్నిటినీ పూర్తిగా ప్రకృతి సేద్యంలోకి మార్చాలన్నది సంకల్పం. అయితే, ప్రకృతి వ్యవసాయ ప్రభావం 2050 నాటికి ఎలా ఉంటుంది? రసాయనిక వ్యవసాయంలో కొనసాగితే ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఇవి ఆసక్తికరమైన ప్రశ్నలు. ఈ అంశాలను లోతుగా శోధిస్తూ క్షేత్రస్థాయి ప్రకృతి సేద్య ఫలితాల ఆధారంగా ‘ఆగ్రోఎకో 2050 ఫోర్‌సైట్ ప్రాజెక్టు’లో భాగంగా మూడేళ్ల పాటు విస్తృతంగా అధ్యయనం చేశారు. ఫ్రెంచ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (సిఐఆర్ఎడి)కు చెందిన సీనియర్ ఆర్థికవేత్త బ్రూనో డోరిన్, ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) వ్యవసాయ శాస్త్రవేత్త అన్నే సోఫి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖకు చెందిన రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్) ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ టి. విజయకుమార్ పలువురు శాస్త్రవేత్తలు, రైతులతో కలిసి 2019 నుంచి 2022 వరకు అధ్యయనం చేశారు. అంతర్జాతీయ శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ నివేదికను రూపొందించటం విశేషం. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల ఉన్నతాధికారులతో చర్చించిన తదనంతరం ‘ఆగ్రోఎకో 2050: ఆంధ్రప్రదేశ్‌లో ఆహార వ్యవస్థలపై పునరాలోచన– ప్రకృతి వ్యవసాయం భవిష్యత్తులో ఆహార సమృద్ధిని ఎలా సాధిస్తుంది’ అనే శీర్షికన అధ్యయన నివేదిక సిద్ధమైంది. నీతి అయోగ్ సభ్యులు (వ్యవసాయం) ప్రొఫెసర్ రమేశ్ చంద్ దీన్ని న్యూఢిల్లీలో ఇటీవల విడుదల చేశారు. పారిశ్రామిక (రసాయనిక) వ్యవసాయాన్ని, ప్రకృతి వ్యవసాయాన్ని పోల్చుతూ రెండు విభిన్న పరిస్థితుల్లో 2050 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయం, ఆహారం, పర్యావరణం, ఉపాధి, సంక్షేమం తదితర రంగాల్లో ఎలా ఉండబోతోంది అనే విషయంపై విశ్లేషణను ఈ నివేదిక వెల్లడిస్తోంది. రాష్ట్రంలో విస్తృతంగా అమలవుతున్న ప్రజల భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం సరికొత్త ఆహార వ్యవస్థల స్థాపనలో ఎలాంటి అవకాశాలను కలిగిస్తుంది అనే కోణంలో శోధించారు. ఆంధ్రప్రదేశ్‌లో 2020–21 నాటికి 7 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 2031 నాటికి ఈ రైతుల సంఖ్య 60 లక్షలకు చేరుకోవాలన్నది లక్ష్యం. ఆర్థిక, పర్యావరణ, పోషకాహార, సామాజిక సవాళ్లను సమీకృత పద్ధతిలో పరిష్కరించే హరిత వ్యవసాయానికి ఏపీ రాష్ట్రం నాయకత్వం వహిస్తుందనేది అధ్యయన బృందం అభిప్రాయం. ‘ప్రకృతి’ నేర్పుతున్న అసాధారణ నీటి పాఠాలు! ప్రకృతి వ్యవసాయం సాగు నీటి వినియోగ పద్ధతిని సమూలంగా మార్చివేస్తుంది. ప్రకృతి సేద్యంలో సాగయ్యే పంటలు నీటిని వినియోగించుకోవటం మాత్రమే కాదు, నీటిని ఉత్పత్తి చేసుకుంటాయి కూడా! నదుల్లో ఉండే నీటికి పది రెట్లు నీరు గాలిలో ఉంది. గాలి నుంచి నీటిని సంగ్రహించి ఉపయోగించుకోవడం ప్రకృతి వ్యవసాయంలోనే సాధ్యమవుతుంది. 365 రోజులు ఆకుపచ్చగా పంటలతో పొలాన్ని కప్పి ఉంచటం, అవశేషాలతో ఆచ్ఛాదన కల్పించటం వల్ల నేలలో నుంచి తేమ ఆవిరి కావటం తగ్గుతుంది. నేలలో సేంద్రియ పదార్థం, సేంద్రియ కర్బనం పెరుగుతుంది కాబట్టి నీటిని గాలి నుంచి గ్రహించి పట్టి ఉంచుకునే శక్తి ఈ పంటలకు సమకూరుతోంది. కురిసిన 100 చుక్కల్లో 50 చుక్కలు వాగుల్లోకి పోతున్నాయి లేదా ఆవిరవుతున్నాయి. ప్రకృతి సేద్యంలో ఈ నష్టం బాగా తగ్గి, భూమిలోకి నీరు ఎక్కువగా ఇంకుతుంది.నీటిని భౌతికశాస్త్ర కోణం నుంచి అర్థం చేసుకోవటమే ఇప్పటి వరకు చేశాం. ప్రకృతి వ్యవసాయం జీవశాస్త్ర కోణం నుంచి నీటిని చూడటం నేర్పుతోంది. ఈ అసాధారణ పాఠాలు మేం నేర్చుకుంటూ సరికొత్త పద్ధతులను అమల్లోకి తెస్తున్నాం. వర్షం కురవక ముందే విత్తనాలను గుళికలుగా మార్చి విత్తుతున్నాం. నెల తర్వాత కొద్దిపాటి జల్లులు పడినా పంటలు మొలకెత్తుతున్నాయి. ఒకటికి పది పంటలు వత్తుగా వేయటం వల్ల రైతులకు చాలా లాభాలు చేకూరుతున్నాయి. బంజరు భూములను దున్నే పని లేకుండా సాగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. పాదులు చేస్తూ ఒక్కో పాదులో ఐదారు రకాల విత్తనాలు వేస్తూ బంజరు భూములను సైతం రైతులు సాగులోకి తెస్తున్నారు. మన రైతుల అనుభవాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. – టి. విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, ఏపీ రైతు సాధికార సంస్థ -
ప్రకృతి ప్రకోపానికి మూల్యం... 12,300 కోట్ల డాలర్లు!
(సాక్షి, సాగుబడి డెస్క్) :: అధిక ఉష్ణోగ్రతలు, కరువు, వరదలు, తుపాన్లు, భూకంపం, కార్చిచ్చులు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులు పెను సవాళ్లు విసురుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి గతమెన్నడూ లేనంత ఎక్కువ సార్లు, తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. పంటలు, పశువులకు విపత్తుల నష్టం ప్రతి ఏటా 12,300 కోట్ల డాలర్లు! గత 30 ఏళ్లలో 3.8 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచ ఆహార దినోత్సవం(అక్టోబర్ 16) సందర్భంగా ‘వ్యవసాయం, ఆహార భద్రతలపై విపత్తుల ప్రభావం’పేరుతో వెల్లడించిన మొట్టమొదటి సమగ్ర నివేదికలో ఎఫ్ఏఓ ఈ వివరాలను తెలిపింది. ఎఫ్ఏఓ నివేదికలోని ముఖ్యంశాలివీ... పంటలు, పశువులకు గత (1991–2021) 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల వల్ల 3.8 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టం జరిగింది. ప్రధానంగా అధిక ఉష్ణోగ్రతలు (26%), కరువు (19%), వరదలు (16%) వల్ల వీటికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ప్రపంచవ్యాప్తంగా విపత్తుల వల్ల పంటలు, పశువులకు జరిగే ఆర్థిక నష్టంలో సగానికి సగం ఆసియా దేశాల్లోనే జరుగుతోంది. ఆసియా దేశాలు 45% (1,72,000 కోట్ల డాలర్లు), ఉత్తర, దక్షిణ అమెరికా దేశాలు 22% (82,800 కోట్ల డాలర్లు), యూరప్ దేశాలు 17% (65,900 కోట్ల డాలర్లు), ఆఫ్రికా దేశాలు 15% (57,800 కోట్ల డాలర్లు), ఓసియానియా 1% (5,500 కోట్ల డాలర్లు) నష్టపోయాయి. ప్రతి ఏటా సగటున నష్టం 12,300 కోట్ల డాలర్లు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి కనీసం 5% ప్రకృతి విపత్తుల వల్ల చిల్లుపడుతోంది. అంటే గత 30 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా పంటలు, పశువులకు జరిగిన నష్టం.. 2022లో బ్రెజిల్ జీడీపీకి సమానం! అల్పాదాయ దేశాలు, అల్ప–మధ్య ఆదాయ దేశాల్లో ఈ నష్టం అత్యధికంగా వాటి జీడీపీల్లో 10–15% వరకు ఉంటోంది. గత 30 ఏళ్లలో గణాంకాలను పరిశీలిస్తే.. విపత్తుల వల్ల సగటున ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా 6.9 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి చే జారిపోతోంది. 2021లో ఫ్రాన్స్‌లో ఉత్పత్తయిన మొత్తం ఆహార ధాన్యాలతో ఇది సమానం. ఏడాదికి 4 కోట్ల టన్నుల పండ్లు, కూరగాయలు, చెరకు ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతున్నాం. 2021లో వియత్నాం, జపాన్ ఉత్పత్తి చేసిన పండ్లు, కూరగాయలతో ఇది సమానం. మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్ల ఉత్పత్తిలో ఏటా 1.6 కోట్ల టన్నులు కోత పడుతోంది. 2021లో భారత్, మెక్సికో దేశాల్లో ఉత్పత్తయిన వాటికి ఇది సమానం. అయితే, వ్యవసాయ జీడీపీలో ఆసియా దేశాలు 4% విపత్తుల వల్ల కోల్పోతుంటే.. ఆఫ్రికా దేశాలు 8% వరకు కోల్పోతున్నాయి. పోషకాల పరంగా చూస్తే.. విపత్తుల వల్ల గత 30 ఏళ్లుగా ప్రతి రోజూ ఒక్కొక్కరు 147 కిలో కేలరీలను నష్టపోతున్నారు. విపత్తులతో కోల్పోతున్న ఆహారం ప్రతి రోజూ 40 కోట్ల మంది పురుషులు లేదా 50 కోట్ల మంది మహిళల ఆకలి తీర్చడానికి సరిపోతుంది. కార్చిచ్చుల వల్ల ఏటా 34–37 కోట్ల హెక్టార్ల భూమిలో పచ్చదనం దగ్ధమవుతోంది. ఒక్క 2021లోనే 2.5 కోట్ల అడవులు తగులబడ్డాయి. పంటలను రక్షించుకోవడానికి ఉపకరించే, వాతారణ మార్పుల్ని దీటుగా తట్టుకునే, ప్రకృతికి అనుగుణమైన వ్యవసాయ పద్ధతులను అమల్లోకి తేవాలి. వాతావరణ మార్పుల వల్ల ఇతర దేశాల నుంచి వచ్చిపడే సరికొత్త చీడపీడలు పంటలకు కలిగిస్తున్న నష్టం గురించి సమగ్రంగా అంచనా వేయగలిగే యంత్రాంగం, కొలమానం కొరవడ్డాయి. అయితే, ఈ నష్టం సంపన్న దేశాల్లో ఎక్కువగా ఉంటోంది. సాంకేతిక సహకారం, క్షేత్రస్థాయిలో ఉత్తమ సాగు పద్ధతులను అనుసరిస్తే వ్యవసాయంలో విపత్తుల నష్టాన్ని నివారించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తద్వారా వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకోవచ్చు. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలపై రూపాయి వెచ్చిస్తే రూపాయిల మేరకు ప్రయోజనం కలుగుతోందని అంచనా. -
పశువులకు అలాంటి గడ్డి వేస్తున్నారా? కాల్షియం లోపం వస్తుంది!
‘మేపు లోనే సేపు’ అని నానుడి. పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పూర్తి సామర్ధ్యం పొందాలంటే మేలైన, నాణ్యమైన పశుగ్రాసాలను పచ్చిమేతగా అందించాలి. దాణా కన్నా పచ్చని పశుగ్రాసాలను మేతగా అందిస్తే అధిక పాల దిగుబడి సాధించడంతో పాటు పాడి పశువుల్లో రోగ నిరోధక శక్తిని పెంచినవారమవుతాం. పాడి పరిశ్రమ లాభసాటి కావాలంటే ఖర్చు తగ్గాలి. ఇది తగ్గాలంటే మేలు జాతి పశుగ్రాసాలను పశువులకు మేతగా అందించాలి. దీనితో 40–50 శాతం ఖర్చు తగ్గటంతో పాటు పాల దిగుబడి 20 శాతం పెరుగుతోంది. రైతులు పశుగ్రాసాల్లో ఏదో ఒకటి లేదా రెండు రకాలను పెంచి పాడి పశువులకు మేపుతుంటారు. అలా కాకుండా కొన్ని రకాల పశుగ్రాసాలను పెంచి పశువులకు క్రమపద్ధతిలో మేపితే మరింత మేలు జరుగుతోంది. ఈ విధానాన్ని అమలాపురం ఏరియా పశు వైద్యశాల అధికారులు ప్రయోగాత్మకంగా అమలు చేసి చూపిస్తున్నారు. ఏరియా పశు వైద్యశాల వెనుక నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని చదును చేసి పదిహేను సెంట్ల స్థలంలో పది రకాల పశుగ్రాసాలను పెంచుతున్నారు. పశు సంవర్థక శాఖ సహాయ సంచాలకులు ఎల్.విజయ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనా క్షేత్రంలో సూపర్ నేపియర్, గిని గడ్డి, కనుమ గడ్డి, రెడ్ నేపియర్, గిని గ్రాస్, మోని, చంగల్ గడ్డి, బొబ్బర గడ్డి, సీవో4, సీవో 5 రకాల గడ్డిని పెంచుతున్నారు. ఔత్సాహికులైన పాడి రైతులకు పశుగ్రాసాల పెంపక విధానాన్ని వివరిస్తున్నారు. ప్రతి గడ్డిలో వైవిధ్యభరితమైన పోషకాలు ఉండటంతో అన్ని రకాలు మేపితే మంచి ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. కేవలం పేరా గ్రాస్ (ఇంగ్లీష్ గడ్డి) మాత్రమే మేపితే పశువుల్లో కాల్షియం లోపించే అవకాశముంది. చెంగల్ గడ్డి ‘రాగి సంగటి’తో సమానం. సూపర్ నేపియర్ ఐదేళ్లు పాటు మేత అందుతోంది. కాండం మెత్తగా ఉండడంతో పాటు ఇందులో అధిక పోషకాలుంటాయి. రెడ్ నేపియర్‌లో ప్రోటీన్, గినీ గడ్డిలో శక్తినిచ్చే పోషకాలు ఎక్కువ. వీటిని కలిపి అందించడం వల్ల అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అందుతాయి. దీని వల్ల పాల దిగుబడి పెరగడంతో పాటు పశువులు బలంగా ఉంటాయి. శాస్త్రీయ పద్ధతిలో పశు పోషణలో భాగంగా వివిధ పోషకాలున్న పశుగ్రాసాలను పరిచయం చేయటంతో పాటు వివిధ రకాల నేలలకు అనువైన పశుగ్రాసాల రకాల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. గడ్డి విత్తనాలు, కనుపులను ఉచితంగా అందజేస్తున్నారు. రైతులతో పాటు వెటర్నరీ విద్యార్థులకూ అవగాహన కల్పిస్తున్నారు. పదిహేను సెంట్లలో ఏడాదికి సగటున 2.5 టన్నుల పశు గ్రాసాన్ని రైతులు పొందనున్నారు. ఒక ఎకరం భూమిలో ఈ విధంగా పశుగ్రాసాలు పెంచితే 5 నుంచి 6 పాడి పశువులకు ఏడాది పొడవునా మేత అందించవచ్చు. వీటితో పాటు కలబంద, నల్లేరు, పసుపు, రణపాల, తులసి, తిప్పతీగ, ఇన్సులిన్ మొక్క వంటి ఔషధ మొక్కలను కూడా పెంచుతూ, సంప్రదాయ వైద్యంలో వాటి ఉపయోగాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు. ఒకటికి పది రకాల పశుగ్రాసాల పెంపకం వల్ల పాడి రైతుల ఆదాయం పెరుగుతోందంటున్నారు విజయ్‌రెడ్డి (98663 27067). – నిమ్మకాయల సతీష్ బాబు, సాక్షి, అమలాపురం 13 నుంచి సింహపురి సేంద్రియ మేళా గో–ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, సింహపురి సేంద్రియ వ్యవసాయదారుల సంఘం, మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు నెల్లూరులోని వి.ఆర్ కాలేజి గ్రౌండ్స్‌లో సేంద్రియ ఉత్పత్తులతో పాటు చేపలు, రొయ్యలు, పీతల ప్రదర్శన–అమ్మకం మేళా జరగనుంది. ఇతర వివరాలకు.. 81436 32488. 15,16 తేదీల్లో సేంద్రియ సేద్యంపై శిక్షణ ఆదిగురు భారత్ ఫౌండేషన్ అధ్వర్యంలో జనగాంలోని బానపురంలో గో΄ాల్ గోశాలలో ఈ నెల 15, 16 తేదీల్లో సేంద్రియ, గోఆధారిత వ్యవసాయంపై శిక్షణ ఉంటుంది. ద్రావణాలు, కషాయాలు, గానుగ నునెలు, నెయ్యి, ధూప్ స్టిక్‌లు తదితర ఉత్పత్తుల తయారీపై నిపుణులు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 70953 14226. -
నాన్‌బీటీ సేంద్రియ పత్తికి పునరుజ్జీవం!
నాన్‌బీటీ సేంద్రియ పత్తికి పునరుజ్జీవం!మన దేశంలో పత్తి సాగులో వాడుతున్నది 95% వరకు జన్యుమార్పిడి చేసిన పత్తి విత్తనాలే. నాన్‌బీటీ దేశీ పత్తి రకాలు దాదాపు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఈ నేపథ్యంలో నాన్‌బీటీ దేశీ, అమెరికన్ పత్తి రకాలను తిరిగి రైతులకు అందించే కృషికి అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయ స్వతంత్ర పరిశోధనా సంస్థలు శ్రీకారం చుట్టాయి. వచ్చే ఖరీఫ్ నుంచే తెలుగు రాష్ట్రాల్లో 3 వేల ఎకరాల్లో రైతులకు ఈ విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ పత్తి దినోత్సవం (అక్టోబర్ 7) సందర్భంగా ప్రత్యేక కథనం... సేంద్రియ పత్తి సాగు వల్ల భూతాపం పెరుగుదలను దీటుగా ఎదుర్కోవటం, ఆరోగ్యదాయకమైన దూది ఉత్పత్తిని పెంపొదించటం వంటి ప్రయోజనాలెన్నో ఉన్నాయి. సేంద్రియ పత్తి విస్తీర్ణాన్ని పెంపొందించాలంటే మొదట జన్యుమార్పిడి చేయని (నాన్ బీటీ) దేశీ, హైబ్రిడ్ రకాల పత్తి విత్తనాలను తొలుత స్థానికంగా రైతులకు అందుబాటులోకి తేవాలి. ఈ అసరాన్ని గుర్తించిన అనేక అంతర్జాతీయ సేంద్రియ వ్యవసాయ స్వతంత్ర పరిశోధనా సంస్థలు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనువైన నాన్ బీటీ సేంద్రియ పత్తి విత్తనోత్పత్తి కార్యక్రమాలను ఈ సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలోనే మన దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఆరు రాష్ట్రాల్లో నాన్ బీటీ సేంద్రియ పత్తి విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని నెదర్లాండ్స్‌కు చెందిన ఆర్గానిక్ కాటన్ యాక్సలరేటర్(ఒసిఎ), స్విట్జర్లాండ్‌కు చెందిన స్వతంత్ర సేంద్రియ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఎఫ్ఐబిఎల్) శ్రీకారం చుట్టాయి. ఈ సంస్థల తోడ్పాటుతో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాన్‌బీటీ సేంద్రియ పత్తి విత్తనోత్పత్తికి ఈ ఖరీఫ్ నుంచి కృషి ప్రారంభించింది. 30 నాన్ బీటీ పత్తి రకాల ప్రయోగాత్మక సాగు మన దేశంలో నాన్ బీటీ సేంద్రియ పత్తి విత్తనోత్పత్తికి సంబంధించి గత ఆరేళ్లుగా క్షేత్రస్థాయిలో వంగడాల ఎంపిక ప్రక్రియ స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ(ఎఫ్పిఓ)ల స్థాయిలో సాగుతోంది. ఈ క్రమంలో 30 నాన్ బీటీ రకాలు రైతులకు నచ్చే విధంగా ఫలితాలనిస్తున్నాయని గుర్తించారు. వీటిలో దేశీ పత్తి సూటి రకాలు, అమెరికన్ పత్తి సూటి రకాల తోపాటు అమెరికన్ హైబ్రిడ్ పత్తి రకాలు ఉన్నాయి. అయితే, ఈ 30 నాన్ బీటీ సూటి/హైబ్రిడ్ రకాల్లో ఏయే రకాలు ఏయే రాష్ట్రాల్లో ఉత్తమ ఫలితాలనిస్తున్నాయన్న క్షేత్ర స్థాయి అధ్యయనం ఈ ఖరీఫ్‌లో ప్రధానంగా పత్తి సాగయ్యే ఆరు రాష్ట్రాల్లో చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ప్రత్యేక జాగ్రత్తలతో సాగు చేస్తున్నారు. తెలంగాణలోని యాదాద్రి జిల్లా వెలమజాల గ్రామంలో నేలతల్లి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఒక ఎకరంలో 30 రకాల నాన్‌బీటీ పత్తి రకాలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తోంది. అదేవిధంగా, ఏపీలో నూజివీడుకు సమీపంలోని కొండపర్వలో గల కృష్ణ సుధ అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ ఆవరణలో ఒక ఎకరంలో 30 నాన్ బీటీ పత్తి రకాలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. జన్యు స్వచ్ఛత కోసం ఒక్కో రకానికి మధ్య జొన్న వరుసలు విత్తారు. ఈ రెండు క్షేత్రాలను సిఎస్ఎ శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారు. ఈ 30 రకాల్లో ఏ రకాలు మెరుగైన ఫలితాలనిస్తాయో పరిశీలించి, వచ్చే సంవత్సరాల్లో ఆయా రకాలను విస్తృతంగా సాగులోకి తెచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించనున్నాయని సిఎస్ఎ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, సీనియర్ శాస్త్రవేత్త డా. జి. రాజశేఖర్ చెప్పారు. వచ్చే ఖరీఫ్ నాటికి 3 వేల ఎకరాలకు అందుబాటులోకి నాన్‌బీటీ పత్తి విత్తనాలు ఇదిలా ఉండగా, 5 రకాల నాన్‌బీటీ పత్తి రకాల విత్తనోత్పత్తి ఆరు రాష్ట్రాల్లో రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా ఈ ఖరీఫ్‌లో మొత్తం 25 ఎకరాల్లో ్ర΄ారంభమైంది. ఇందులో భాగంగా, తెలంగాణలోని రెండు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు 5 నాన్ బీటీ పత్తి రకాల విత్తనోత్పత్తిని 5 ఎకరాల్లో చేపట్టాయి. వీటిల్లో ఆర్విజెకె–ఎస్జిఎఫ్1 అనే దేశీ పత్తి (అర్బోరియం) సూటి రకం ఒకటి. ఆర్విజెకె–ఎస్జిఎఫ్2, ఎన్డిఎల్హెచ్, సురక్ష అనే 3 రకాల అమెరికన్ (హిర్సుటం) సూటి రకాలతో΄ాటు.. వసుధ గోల్డ్ అనే హైబ్రిడ్ పత్తి రకాలను ఒక్కో రకాన్ని ఒక్కో ఎకరంలో జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలిలోని రాజోలి ఎఫ్పిఓ, జనగామ జిల్లాలోని ఆరద్శ ఎనబావి ఎఫ్పిఓలు సాగు చేస్తున్నాయి. ఈ విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని సిఎస్ఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, సీనియర్ శాస్త్రవేత్త డా. జి. రాజశేఖర్ పర్యవేక్షిస్తున్నారు. రైతులకు నచ్చే లక్షణాల తోపాటు మేలైన దిగుబడినిచ్చే ఈ నాన్ బీటీ రకాల సామర్ధ్యాన్ని రైతులకు ప్రత్యక్షంగా చూపించే లక్ష్యంతో పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నామని, వచ్చే ఖరీఫ్‌కు 3 వేల ఎకరాల్లో సాగుకు ఈ విత్తనాలు అందుబాటులోకి తెస్తామన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్లో ఈ నాన్ బీటీ పత్తి రకాలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే ఆసక్తి ఉన్న రైతులు ఈ విత్తన క్షేత్రాలను దసరా తర్వాత కాయ దశలో స్వయంగా సందర్శించి, విత్తనాలను బుక్ చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు తనను సంప్రదించాలని డా. రాజశేఖర్ (83329 45368) తెలిపారు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: పత్తి కేవలం వాణిజ్య పంటే కాదు ఆహార పంట కూడా..ఆఖరికి కొన్ని దేశాల్లో..) -
పత్తి ఆహార పంట కూడా! కొన్ని దేశాల్లో ఏకంగా..
పత్తి పంటను కేవలం నూలు వస్త్రాల ఉత్పత్తికి వాడే దూదిని వాణిజ్య పంటగానే సాధారణంగా మనం పరిగణిస్తుంటాం. కానీ, అంతర్జాతీయంగా దీన్ని వాణిజ్య పంటగానే కాకుండా ఆహార, చమురు పంటగా కూడా గుర్తిస్తున్నారు. అక్టోబర్ 7వ తేదీన ‘ప్రపంచ పత్తి దినోత్సవం’ సందర్భంగా అనేక అంతర్జాతీయ సంస్థలు వ్యాప్తిలోకి తెచ్చిన సమాచారంలో ఇదొక ముఖ్యాంశం. పత్తి గింజల నూనెను వంట నూనెగా వాడుతున్నాం. పత్తి గింజల చక్కను పశు దాణాలో కలిపి పాడి పశువులకు మేపుతున్నాం. కొన్ని దేశాల్లో పత్తి గింజల నూనెను జీవ ఇంధనం తయారీకి కూడా వాడుతున్నారు. ఆ విశేషాలు కొన్ని.. ప్రపంచంలో అత్యధికంగా పత్తి సాగు చేస్తున్న దేశం భారత్. 23% పత్తి మన దేశంలోనే పండుతోంది. 60 లక్షల మంది పత్తి సాగు చేస్తుండగా, మరో 40–50 లక్షల మంది పత్తి పరిశ్రమల్లో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్తి రైతులు 3 కోట్ల 20 లక్షలు. ఇందులో దాదాపుగా సగం మహిళా రైతులే. వీరిలో ఎక్కువ మంది పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల వారే. మన దేశంలో 65 శాతం పత్తి వర్షాధారంగానే సాగవుతోంది. అప్పుల పాలై ప్రాణాలు తీసుకునే రైతుల్లో మెట్ట ప్రాంతాల పత్తి రైతులే ఎక్కువ. 5 ఖండాల్లోని 80 దేశాల్లో 13 కోట్ల మందికి పైగా పత్తి ఆధారిత పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థల సమాచారం ప్రకారం.. కనీసం 18 దేశాల్లో పత్తి పొలాల్లో బాలకార్మికులతో పనులు చేయిస్తున్నారు. అంతర్జాతీయ పత్తి సలహా మండలి (ఐసిఎసి) అంచనా ప్రకారం రైతు పండించిన ఒక టన్ను పత్తి ఐదుగురికి ఏడాది పొడవునా ఉపాధిని కల్పిస్తోంది. కిలో పత్తిని పండించడానికి 20 వేల లీటర్ల నీరు అవసరమనే భావన ఉంది. అయితే, నిజానికి 1,200–2,000 లీటర్ల నీరు సరిపోతుందని ఐసీఏసీ చెబుతోంది. అందువల్లనే నిస్సారమైన భూములు, కరువులకు ఆలవాలమైన సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లో సాగు చేయదగిన అతి కొద్ది పంటల్లో పత్తి కూడా ఉందని ఐసీఏసీ వాదన. పత్తి పంట సాగు వల్ల భూతాపం కూడా పెరగడం లేదని ఐసీఏసీ చెబుతోంది. రసాయనిక సేద్యంలో కిలో పత్తి సాగుకు 1.7 కిలోల కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయని అంచనా. అయితే, దూదిలో 97% సెల్యులోజ్ ఉంటుంది. కాబట్టి, పండే ప్రతి కిలో దూది 2.2 కిలోల కర్బన ఉద్గారాలను పీల్చుకుంటుంది. అంటే.. ప్రతి కిలో పత్తికి 0.5 కిలోల ఉద్గారాలు నిజానికి వాతావరణంలో తగ్గుతున్నట్టేనని ఐసీఏసీ లెక్క చెబుతోంది. సేంద్రియ పద్ధతుల్లో సాగయ్యే కిలో దూదికి 0.9 కిలోల ఉద్గారాలు మాత్రమే విడుదలవుతున్నాయని ఐసిఎసి అంటోంది. సింథటిక్ ఫైబర్ బదులు పత్తిని వినియోగించడం ద్వారా భూతాపాన్ని తగ్గించవచ్చని, మైక్రోఫైబర్ కణాల కాలుష్యం నుంచి జలవనరులను, ఆహార చక్రాన్ని రక్షించుకోవచ్చని ఐసీఏసీ సూచిస్తోంది. పంట కాలం పూర్తయిన తర్వాత పత్తి చెట్టు మొత్తంలో 3% తప్ప వృథా అయ్యేదేమీ లేదు. పత్తి కట్టెతో బయోచార్ తయారు చేసుకొని సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చని ఐసీఏసీ అంటోంది. పెరుగుతున్న భూతాపం వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో పత్తి రైతులను ముఖ్యంగా మహిళా రైతులను వాతావరణ మార్పులు బహుముఖంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయని కాటన్‌కనెక్ట్ సంస్థ నిర్వహించిన అధ్యయనం చెబుతోంది. పొలం పనులు, పశుపోషణ, కుటుంబ పోషణ సమస్యలతో మహిళా రైతులు సతమతమవుతున్నారు. వాతావరణ మార్పులను తట్టుకునే ఉపాయాలపై మహిళా రైతులకు అవగాహన కల్పించడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని కాటన్ కనెక్ట్ నివేదిక తెలిపింది. మన దేశంలో సాగవుతున్న పత్తి విస్తీర్ణంలో 95% జన్యుమార్పిడి చేసిన వంగడాలే. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: అదిరేటి వంగడాలు ‘అంతరిక్షం’ నుంచి? చైనా మాదిరి స్పేస్ బ్రీడింగ్) -
వినూత్నంగా సెల్ఫోన్లో కూరగాయల వ్యాపారం, నిమిషాల్లో డోర్ డెలీవరీ
కూరగాయలు పండించడంలో పాత పద్ధతి పాటిస్తూ.. వాటిని విక్రయించడంలో మాత్రం కొత్త పోకడలు అవలంబిస్తున్నాడో రైతు. మార్కెట్‌కు వెళ్లే అవసరం లేకుండా, కూరగాయలు రాశిగా పోసి కొనుగోలు దారుల కోసం వేచి చూడాల్సిన అగత్యం లేకుండా సెల్‌ఫోన్ సాయంతో వ్యాపారం చేస్తున్నారు. ఇంటి నుంచే నిర్వహిస్తున్న ఈ వ్యాపారానికి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. నరసన్నపేట: వాట్సాప్ సాయంతో ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్న రైతు దాని ద్వారానే ఎంచక్కా వ్యాపారం నిర్వహిస్తున్నారు. నచ్చిన కూరగాయలు వాట్సాప్ లో బుక్ చేసిన కొన్ని గంటల వ్యవధిలో డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ తమకూ బాగుండడంతో వినియోగదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నరసన్నపేటలోని దేశవానిపేటకు చెందిన ఆదర్శ రైతు రావాడ మోహనరావు వినూత్న పద్ధతిలో వర్తకం చేస్తున్నారు.మోహనరావుకు ప్రకృతి వ్యవసాయంపై గురి బాగా కుదిరింది. దీంతో సారవకోట మండలంలోని పద్మపురంలో 20 ఎకరాల విస్తీర్ణంలో పురుగు మందులు వాడకుండా సహజ ఎరువులతో పంటలు పండిస్తున్నారు. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలతో కూరగాయల సాగు చేస్తున్నారు. వీటిని అందరిలా కాకుండా వాట్సాప్ ద్వారా విక్రయించాలని నిర్ణయించుకుని మన మార్ట్ ఆర్గానిక్ ఫార్మ్ అని పేరుతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి తనకు తెలిసిన మిత్రులను చేర్చారు. మొదట్లో 26 మందితో ఉన్న ఈ గ్రూపు ఇప్పుడు 540 మందికి చేరింది. ఈ వాట్సాప్ గ్రూపులో పండిన కూరగాయలు, దుంపలు, పళ్లు వాటి ధరలను ప్రదర్శిస్తున్నారు. నచ్చిన వారు తమకు కావాల్సిన కూరగాయలను ఆర్డర్ పెడుతున్నారు. కొన్ని గంటల్లో కూరగాయలు ఇంటికి చేర్చుతున్నారు. ఇప్పుడు నరసన్నపేటలో ఈ వ్యాపారం హాట్ టాపిక్ అయింది. రోజూ ఆకుకూరలు, కూరగాయలు వంద కిలోలకు పైగా విక్రయిస్తున్నారు. శమ తప్పింది నేను వృద్ధాప్యంలో ఉన్నాను. బజారుకు వెళ్లి కూరగాయలు కొనేందుకు నానా అవస్థలు పడేవాడిని. ఇప్పుడు కావాల్సిన కూరగాయలు వాట్సాప్‌లో ఆర్డర్ చేస్తున్నాం. తెచ్చి అందిస్తున్నారు. బాగుంది. కూరగాయలు నాణ్యతగా ఉంటున్నాయి. – కేఎల్ఎన్ మూర్తి, పుండరీకాక్ష కాలని, నరసన్నపేట తాజా కూరగాయలు వాట్సాప్‌లో కూరగాయలు చూసి ఆర్డర్ పెడుతున్నాం. గంట వ్యవధిలోనే ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. మాకు సమయం ఆదా అవుతోంది. కూరగాయలు కూడా తాజాగా ఉంటున్నాయి. తూకం కచ్చితంగా ఉంటుంది. – సాయి శ్రీనివాస్, టీచర్, నరసన్నపేట ఆదరించారు.. ప్రకృతి వ్యవసాయంపై మక్కువతో పలు ప్రాంతాల్లో తిరిగి ఏడాదిగా వివిధ పద్ధతుల్లో కూరగాయల సాగు చేస్తున్నాను. కొందరు మిత్రుల సలహాతో వాట్సాప్‌లో కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాను. మూడు నెలలుగా ఇది నిరంతరాయంగా సాగుతోంది. పండుతున్న కూరగాయలు ఏ రోజుకు ఆ రోజు అయిపోతున్నాయి. వినియోగదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – రావాడ మోహనరావు, ఆదర్శ రైతు, దేశవానిపేట -
ప్రకృతి సేద్యం.. దానిమ్మ తోటతో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు
ప్రకృతి వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం అందిస్తున్న మార్గదర్శకత్వంలో ప్రకృతి సేద్యం చేస్తూ దానిమ్మ తోటలో చక్కని దిగుబడిని పొందుతూ శభాష్ అని ప్రశంసలు అందుకుంటున్నారు రైతు రవి ప్రతాప్ రెడ్డి. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం కొత్తలం గ్రామానికి చెందిన రవి ప్రతాప్ రెడ్డి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తూ.చ. తప్పకుండా పాటిస్తూ 6 ఎకరాల్లో భగువ రకం దానిమ్మ పంటను సాగు చేసి తక్కువ ఖర్చుతోనే అధిక లాభాలు పొందుతున్నారు. 2021 ఫిబ్రవరిలో దానిమ్మ మొక్క రూ.40 చొప్పున కోనుగోలు చేసి, 12“12 అడుగుల దూరంలో ఎకరాకు 350–380 వరకు మొక్కలను నాటి డ్రిప్‌తో సాగు చేస్తున్నారు. గత ఏడాది మొదటి పంటలో రూ.10 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ప్రసుత్తం రెండున్నరేళ్ల వయసులో రెండో పంట కోతకు సిద్ధంగా ఉంది. చెట్ల నిండా కాయలు ఉండటంతో కన్నుల పండువగా ఉంది. రైతులు, వ్యాపారులతో పాటు జాతీయ, అంతర్జాతీయ పాత్రికేయులు, నిపుణులు సైతం ఈ తోటను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆరెకరాల్లో 40–42 టన్నుల దానిమ్మ దిగుబడి వస్తుందని, రూ. 45 లక్షల వరకు ఆదాయం రావచ్చని రవి ప్రతాప్ రెడ్డి ఆశిస్తున్నారు. అదే విధంగా, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 13 ఎకరాల్లో అల్లనేరేడు పంటను సాగు చేసిన ఆయన రూ.8 లక్షల ఆదాయం పొందారు. ఎకరానికి ఖర్చు రూ. 25 వేలు! రసాయనిక వ్యవసాయం చేసే దానిమ్మ తోటను తెగుళ్ల నుంచి రక్షించుకోవడానికి రోజు మార్చి రోజు ఏదో ఒక మందు కొడుతూనే ఉంటారు. దాంతో ఖర్చు ఎకరానికి ఏడాదికి రూ. 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ, తన తోటలో జీవామృతం, కషాయాలకు మొత్తంగా రూ. 25 వేలే ఖర్చయ్యిందని రవి ప్రతాప్ రెడ్డి తెలిపారు. చెట్టుకు 2 కేజీల ఘనజీవామృతం వేసిన తర్వాత నామాస్త్రం, సొంఠిపాల కషాయం, జీవామృతం అవసరం మేరకు క్రమం తప్పకుండా శ్రద్ధగా తయారు చేసుకొని అందిస్తున్నారు. నాలుగు నాటు ఆవుల పేడ, మూత్రం వినియోగిస్తున్నారు. కాయ కుళ్లు తెగులు వచ్చిందంటే రసాయనిక సేద్యం చేసే తోటల్లో కంట్రోల్ కాదు. అయితే, ప్రకృతి సేద్యంలో దీని నివారణకు సొంఠిపాల కషాయం సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఆరోగ్యంగా పెరగటం వల్లనే చీడపీడల బెడద కూడా లేదని ఆయన అన్నారు. ప్రకృతి వ్యవసాయ విభాగం మాస్టర్ ట్రైనర్ రమేష్, డీపీఎం లక్ష్మానాయక్ ప్రత్యేక శ్రద్ధతో ఎప్పటికప్పుడు అందిస్తున్న సూచనలు, సలహాలను పూర్తిగా పాటించటం వల్ల సత్ఫలితాలు పొందగలుగతున్నానని రైతు రవి ప్రతాప్ రెడ్డి తెలిపారు. మడకశిర డివిజన్ పరిధిలోని 134 గ్రామాల్లో 16,662 మంది రైతులు 32 వేల ఎకరాల్లో ప్రకృతి వ్వయసాయ పద్ధతుల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. గత నెలలో జర్నలిస్టులు ఢీల్లీకి చెందిన సునీతా నారాయణ్, క్రిస్టియన్ గ్రేప్తో పాటు జర్మనీకి చెందిన రాజ్ పటేల్, అమెరికాకు చెందిన ప్రణయ్ తదితరుల బృందం తన తోటను సందర్శించి ఆశ్చర్యచకితులయ్యారని ఆయన సంతోషంగా చెప్పారు. – ఎస్.క్రిష్ణారెడ్డి, సాక్షి, మడకశిర రూరల్, శ్రీసత్యసాయి జిల్లా చెప్పింది చెప్పినట్టు చేసే రైతు! ప్రకృతి వ్యవసాయంలో మెలకువలను చెప్పింది చెప్పినట్టు వంద శాతం పాటించే నిబద్ధత కలిగిన రైతు రవిప్రతాప్రెడ్డి. దానిమ్మ చెట్ల మధ్య 30 రకాల విత్తనాలను వానకు ముందే విత్తి(పిఎండిఎస్), పెరిగిన తర్వాత కోసి మల్చింగ్ చేస్తే మంచి ఫలితాలు వస్తున్నాయి. మడకశిర ప్రాంతంలో ఈ ఏడాది సగం కన్నా తక్కువ వర్షతపామే నమోదైంది. అయినా మంచి పంట దిగుబడి వచ్చింది. రెండున్నర ఏళ్ల దానిమ్మ తోటలో ఎకరానికి 7 టన్నుల దిగుబడిని అతి తక్కువ ఖర్చుతోనే రవిప్రతాప్రెడ్డి సాధించారు. – లక్ష్మణ్ నాయక్ (83310 57583), జిల్లా ΄జెక్టు మేనేజర్, ప్రకృతి వ్యవసాయ విభాగం, శ్రీసత్యసాయి జిల్లా ఓపికగా చెయ్యాలి ప్రకృతి సేద్యాన్ని శ్రద్ధగా, ఓపికగా చేయాలి. ముందుగానే ప్రణాళిక ప్రకారం జీవామృతం, కషాయాలను జాగ్రత్తగా తయారు చేసుకొని వాడాలి. జీవామృతం కలిపిన 8 రోజులు మురగబెట్టి వాడాలి. రోజూ రెండు పూటలు కలియదిప్పాలి. దీనికి వాడే శనగపిండి సొంతంగా మరపట్టించుకొని వాడాలి. మార్కెట్లో కొని వాడితే కల్తీ వల్ల ఫలితం సరిగ్గారాదు. నన్ను చూసి పది మంది రైతులైనా మారితే అదే నాకు సంతోషం. సొంతంగా తయారు చేసుకొని వాడే ద్రావణాలు, కషాయాలు చాలు మంచి దిగుబడులు పొందడానికి. కెమికల్స్, బయో/ఆర్గానిక్ ఉత్పత్తుల కొని వాడటం ప్రమాదకరం. – రవి ప్రతాప్‌రెడ్డి(93989 80129), దానిమ్మ రైతు, కొత్తలం, మడకశిర మండలం, శ్రీసత్యసాయి జిల్లా -
సరికొత్త వంగడాల అన్వేషణ..ఏకంగా అంతరిక్షం నుంచి!
భూతాపాన్ని, కరువును తట్టుకునే సరికొత్త వంగడాల కోసం అన్వేషణ ఇప్పుడు అంతరిక్షంలోకి చేరింది. అంతరిక్షంలో కాస్మిక్ కిరణాల రేడియేషన్‌లో కొన్ని నెలలు ఉంచిన విత్తనాలతో రూపొందించే (స్పేస్ ఇండ్యూస్డ్ మ్యుటేషన్ బ్రీడింగ్) వంగడాలు భూమ్మీద క్లైమెట్ ఎమర్జెన్సీని దీటుగా తట్టుకోగలుగు తాయని ఎఫ్.ఎ.ఓ. భావిస్తోంది. మొట్టమొదటిగా జొన్న విత్తనాలతో స్పేస్ బ్రీడింగ్ ప్రాజెక్టుకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో కలసి ఎఫ్.ఎ.ఓ. శ్రీకారం చుట్టింది. కేరళకు చెందిన శాస్త్రవేత్త డా. శోభా శివశంకర్ ఈ పరిశోధనలకు సారధ్యం వహిస్తుండటం విశేషం. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల (అక్టోబర్ 4–10) సందర్భంగా డా. శోభ ‘సాక్షి సాగుబడి’కి ఈ–మెయిల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. కరువును తట్టుకొని మంచి దిగుబడులు ఇచ్చే కొత్త వంగడాలు రూపొందించుకోవడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడు తుందని ఆమె ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. స్పేస్ బ్రీడింగ్ ద్వారా చైనా ఇప్పటికే 260 వంగడాలను తయారు చేసుకొని వాడుతుండటం విశేషం. అంతరిక్షంలో రేడియేషన్‌కు గురిచేసిన విత్తనాలతో రూపొందించే (స్పేస్ బ్రీడింగ్) వంగడాల వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? భూమిపై కరువు, అధిక ఉష్ణోగ్రతలు, నేల లవణీయత వంటి పర్యావరణ సంబంధమైన ఒత్తిళ్లు పంటలను వివిధ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పరిణామాత్మక ఉత్పరివర్తనాలు (ఎవల్యూషనరీ మ్యుటేషన్స్) చెందేందుకు ప్రేరేపిస్తాయి. అయితే, అంతరిక్షంలో కాస్మిక్ రేడియేషన్, మైక్రోగ్రావిటీ, విపరీతమైన ఉష్ణోగ్రతలు వంటి కఠినమైన పరిస్థితులు నెలకొని ఉంటుంది. అందువల్ల, అంతరిక్షం విత్తనాలపై పెను ఒత్తిడిని కలిగిస్తుంది. కఠిన పరిస్థితులను మరింత సమర్థవంతంగా తట్టుకునేలా పంట విత్తనాల్లో సాధారణం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా అత్యంత వేగవంతంగా సరికొత్త ఉత్పరివర్తనాలను ప్రేరేపించడానికి బహుశా అంతరిక్షం మంచి వాతావరణం కావచ్చు. అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన విత్తనాలతో సరికొత్త వంగడాలను రూపొందించే ప్రక్రియనే ‘స్పేస్ ఇండ్యూస్ మ్యుటేషన్ బ్రీడింగ్ లేదా స్పేస్ బ్రీడింగ్’ అంటాం. ప్రస్తుతం, స్పేస్ బ్రీడింగ్ ద్వారా విడుదలైన వంగడాల ద్వారా వచ్చిన ఫలితాలు కొన్ని మాత్రమే. అంతేకాదు, ఉత్పరివర్తనాలను ప్రేరేపించడానికి మొక్కల డిఎన్ఏపై అనంత విశ్వం చూపే ప్రభావాలేమిటో తెలియజెప్పే ప్రచురిత సమాచారం చాలా పరిమితమనే చెప్పాలి. స్పేస్ బ్రీడింగ్‌ను ఇప్పటి వరకు ఎన్ని దేశాలు, ఎన్ని పంటల్లో ఉపయోగిస్తున్నాయి? చైనా స్పేస్ బ్రీడింగ్‌లో ముందుంది. వివిధ పంటల విత్తనాలను అంతరిక్షంలోకి పంపి, అక్కడ కొన్నాళ్లు ఉంచి తిరిగి నేల మీదకు తెప్పించిన తర్వాత వాటిని పరీక్షించి, మెరుగైన ఫలితాలు ఉన్నట్లు గుర్తించిన చాలా రకాల పంటల వంగడాలను చైనా తమ దేశంలో రైతులకు అందించింది. ఈ జాబితాలో వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, నువ్వు, మిరప, టమోటో తదితర పంటలున్నాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రైతులు సాగు చేసే వరి, మిరప, పత్తి తదితర పంటలు అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకోవడంలో జన్యుమార్పిడి విత్తనాల కన్నా ‘అంతరిక్ష విత్తనాలు’ ఎలా మెరుగైనవి? పోల్చడం కష్టం. సాధారణంగా జన్యుమార్పిడి చేయడానికి అందుకు అవసరమైన ప్రత్యేక జన్యువును ముందుగా గుర్తించడం అవసరం. గుర్తించిన జన్యువును జన్యుమార్పిడి/జన్యు సవరణ సాంకేతికతలలో ఉపయోగించి తగిన ఫలితం పొందే అవకాశం ఉంది. అయితే, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ, ఐరాసకు చెందిన ఆహార– వ్యవసాయ సంస్థ వియన్నా (ఆస్ట్రియా) లో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘సెంటర్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నిక్స్ ఇన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్’లో ప్రత్యేక జన్యువులపై ముందస్తు అవగాహన లేకుండానే.. నేలపై ల్యాబ్‌లో మ్యుటేషన్ బ్రీడింగ్ ద్వారా ప్రత్యేక లక్షణాలను ఆశించి సరికొత్త పంట రకాలను అభివృద్ధి చేస్తుంది. ఎక్స్, గామా కిరణాల రేడియేషన్ ద్వారా జరిగే ఈ ప్రక్రియ విత్తనంలో పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలను సృష్టిస్తుంది. ఆ విత్తనాలను సాగు చేసి వాటిలో మనం ఆశించిన మార్పు వచ్చిందో లేదో జాగ్రత్తగా పరీక్షించి చూసుకోవాలి. ఈ స్క్రీనింగ్పైనే స్థిరమైన వ్యవసాయక పరిస్థితులకు అనువైన వంగడాల ఎంపిక ఆధారపడి ఉంటుంది. ఇప్పటికి 70కి పైగా దేశాలకు చెందిన 210కి పైగా వృక్ష జాతులతో పాటు అనేక ఆహార పంటలు, అలంకరణ మొక్కలు, చెట్లకు సంబంధించి మ్యూటేషన్ బ్రీడింగ్ జరిగింది. 3,400కి పైగా అధికారికంగా విడుదలైన ఉత్పరివర్తన రకాలు మా డేటాబేస్‌లో వున్నాయి. ‘ఆసియాలో విత్తనోత్పత్తిదారులు వైవిధ్యమైన వాతావరణంలో పనిచేసే చాలా మంది చిన్న రైతుల కోసం విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. కేవలం ఒకటి లేదా రెండు లక్షణాలను ఆశించి జన్యుమార్పిడి/సవరణ చేయడం వీరి అవసరాలను తీర్చదు. అధిక వేడిని, కరువును తట్టుకోవడం.. నిస్సారమైన/చౌడుబారిన నేలల్లో పెరిగే సామర్థ్యం వంటి మరింత సంక్లిష్టమైన గుణాలు కలిగిన వంగడాలు వారికి అవసరం. ఏదో ఒక జన్యువును మార్పిడి/సవరణ చేసే సాంకేతికతలతో ఇది సాధించలేం..’ అని మీరు ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. దయచేసి దీని గురించి వివరిస్తారా? ఒక జన్యువు లేదా కొన్ని జన్యువులతో సవరించగలిగే సాధారణ లక్షణాలు జన్యుమార్పిడి మార్పు లేదా జన్యు సవరణకు అనుకూలంగా ఉంటాయి. కరువును తట్టుకోవటం, దిగుబడిని పెంపొందించటం వంటివి అనేక జన్యువులతో సంబంధం ఉండే సంక్లిష్ట లక్షణాలు. ఇవి జన్యుమార్పిడి లేదా జన్యుసవరణతో సాధ్యం కావు. యావత్తు జన్యువ్యవస్థ వ్యాప్త మార్పులు(జీనోమిక్ వైడ్ ఛేంజెస్) అవసరం. ఇవి మ్యుటేషన్ బ్రీడింగ్‌తో లేదా ప్రకృతిలో ఆయా లక్షణాలున్న వంగడాల ఎంపిక (టార్గెటెడ్ సెలక్షన్) ద్వారానే సాధ్యం. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ (చదవండి: ‘అంతరిక్ష విత్తనాలు’ ఆదుకుంటాయా? ) -
ఏటీఎం మోడల్‌తో పంటల సాగు.. రైతులకు రూ.25 వేల వరకు లాభాలు
నంద్యాల(సెంట్రల్): పురుగు మందులు, రసాయనిక ఎరువులను వాడకుండా సాగుతున్న ప్రకృతి వ్యవసాయం ఓ సరికొత్త సామాజిక ఉద్యమంలా మారుతోంది. ఈ నూతన వ్యవసాయం జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయం నిజంగానే ‘రైతును రాజు’గా మార్చుతోంది. ఇందులో భాగంగా ఏటీఎం అనే కార్యక్రమం ద్వారా 20 సెంట్లలో అనేక రకాల కూరగాయలు, పండ్లు సాగు చేస్తూ ప్రతి నెలా కనీసం రూ.10–25 వేల ఆదాయం పొందే మార్గం ఉంది. చిన్న, సన్నకారు రైతులకే కాదు, భూమిలేని వ్యవసాయ కార్మికులకూ వరం లాంటిది. ఏటీఎం మోడల్ విధానంలో సాగు చేసిన పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసిన 45 రోజుల నుంచే దిగుబడి రావటం ప్రారంభమవుతుంది. ఏడాది పొడవునా రకరకాల కూరగాయలు వాటి పంట కాలం బట్టి దిగుబడి వస్తూ ఉంటాయి. ఫలితంగా నిత్యం కోతలే...రోజూ కాసుల గలగలలే వినిపిస్తుంటాయి. ప్రస్తుతం జిల్లాలో ఈ ఏటీఎం మోడల్లో డోన్, బేతంచెర్ల, ఆత్మకూరు, బనగానపల్ల్లె, మహానంది, చాగలమర్రితో పాటు పలు మండలాల్లో రైతులు కూరగాయ పంటలను సాగు చేసి లాభాల బాటలో పయనిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 96 ఏటీఎం మోడళ్లను రైతులు సాగు చేస్తున్నారు. ఏయే పంటలు సాగు చేస్తారంటే.. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 96 ఏటీఎం మోడల్ కూరగాయల పంటలు సాగులో ఉన్నాయి. ఈ ఏటీఎం మోడల్ కింద టమాట, వంగ, మటిక, మిరప, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్తో పాటు గోంగూర, పాలకూర, మెంతాకు, కొత్తిమీర వంటి ఆకుకూరలు పండిస్తారు. వీటితో పాటు తీగజాతి కూరగాయలైన బీర, కాకర, సొర, చిక్కుడు వంటివి సాగుచేస్తున్నారు. వీటిలో కొన్ని కూరగాయలు సాగు చేసిన 25 నుంచి 30 రోజులకు కోతలు ప్రారంభమవుతాయి. మరికొన్ని 45 రోజులకు ఇంకొన్ని 90 రోజులకు దిగుబడి వస్తుంది. ఇలా ఏడాదంతా కూరగాయలను పండించుకుంటూ డబ్బులను సంపాదిస్తున్నారు. ఉన్న ఊర్లోనే... తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన కాయగూరలు, ఆకుకూరలను తాము ఉన్న గ్రామంలోనే మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మార్కెట్ ధరలకు అనుగుణంగా కిలో చొప్పున వినియోగదారులకు అందిస్తున్నారు. వీటితో పాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం కషాయాలు, జీవామృతం, ఘనామృతంతోనే పండించే కూరగాయలు కావటంతో ప్రజలు వీటిని తీసుకునేందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారని రైతులు తెలిపారు. అందులోనూ ఉన్న ఊర్లోనే కళ్లెదుటే పండిన కూరగాయలు కాబట్టి తాజాగా ఉండటంతో అందరూ కొంటున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నాం జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన ఏటీఎం మోడళ్లలో సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులన్నీ ప్రాచీన ప్రకృతి సేద్య విధానంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తక్కువ విస్తీర్ణంలో సాగు...పైగా ఖర్చు కూడా తక్కువగా ఉండటంతో చాలా మంది సాగు చేస్తున్నారు. పలు దశల్లో ఉన్న ఈ పంటల ఫలితాలు అద్భుతంగా ఉంటున్నాయి. మేము కూడా సిబ్బందితో ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటిదాకా జిల్లా వ్యాప్తంగా 96 మోడళ్లు సాగులో ఉన్నాయి. – నరేంద్రారెడ్డి, ప్రాజెక్టు మేనేజర్, ప్రకృతి సేద్యం -
‘అంతరిక్ష విత్తనాలు’ ఆదుకుంటాయా?
భూమ్మీద అధిక ఉష్ణం, కరువు పరిస్థితులను ఎదుర్కొని సజావుగా పంట దిగుబడులు పొందాలంటే అందుకు తగినంత జన్యు దృఢత్వం కలిగిన వైవిధ్య భరితమైన వంగడాలు అవసరం. కానీ గడ్డు పరిస్థితులను తట్టుకొనే జన్యు దృఢత్వం తేవడం ఎలా అన్నది ప్రశ్న? అయితే అంతరిక్షంలో వేగంగా ఉత్పరివర్తనాలకు గురైన విత్తనాలతో భూమ్మీద ప్రతికూలపరిస్థితులను తట్టుకొనే వంగడాల తయారీ సాధ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఇందులో నిజం ఎంత? ఈ నెల 4 నుంచి 10 వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం. (సాక్షి, సాగుబడి డెస్క్) విత్తన జన్యువ్యవస్థను సంపూర్ణంగా ప్రభావితం చేసే స్పేస్ బ్రీడింగ్... జన్యుమార్పిడి/సవరణకన్నా మెరుగైన ఫలితాలను అందిస్తుందని కొందరు శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. 15 ఏళ్లుగా స్పేస్ బ్రీడింగ్ ద్వారా కొత్త వంగడాలు రూపొందిస్తూ బహుళ ప్రయోజనాలు పొందుతున్నట్లు చైనా చెబుతోంది. మరోవైపు తొలిసారిగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ), ఐక్యరాజ్య సమితి చెందిన ఆహార–వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) సంయుక్తంగా స్పేస్ బ్రీడింగ్ ప్రాజెక్టుకు 2022 నవంబర్ 7న శ్రీకారం చుట్టాయి. ‘నాసా’కు చెందిన వాల్లప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ రోదసీ నౌక ద్వారా భూమికి 175 మైళ్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తెల్లజొన్న విత్తనాలు, అరాబిడోప్సిస్ అనే ఆకుకూర విత్తనాలను అంతరిక్షంలోకి పంపాయి. కొన్ని విత్తనాలను అంతరిక్ష కేంద్రం లోపల భారరహిత స్థితిలో ఉంచగా మరికొన్నింటిని కేంద్రం బయట కాస్మిక్ రేడియేషన్‌కు గురిచేశాయి. ఆర్నెల్ల తర్వాత వాటిని 2022 ఏప్రిల్‌లో తిరిగి భూమిపైకి తీసుకొచ్చాయి. ఆ్రస్టియా రాజధాని వియన్నాలో ఏర్పాటైన ఐఏఈఏ, ఎఫ్ఏఓ ఉమ్మడి ప్రయోగశాలలోని పాలిహౌస్‌లో వాటిని ప్రయోగాత్మకంగా పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేరళకు చెందిన జన్యుశాస్త్ర నిపుణురాలు డా. శోభ శివశంకర్ సారథ్యం వహిస్తుండగా, మరో భారతీయ శాస్త్రవేత్త అనుపమ హింగనె ప్రయోగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అనేక సీజన్లపాటు సాగు చేసి వాటి జన్యుమార్పులను నిర్ధారించాక సరికొత్త వంగడాలను రైతులకు అందించనున్నాయి. చైనా పొలాల్లో 260 ‘అంతరిక్ష వంగడాలు’! అంతరిక్షంలోని రేడియేషన్‌లో కొన్నాళ్లు ఉంచి భూమిపైకి తెచి్చన విత్తనాల (స్పేస్ ఇండ్యూస్డ్ మ్యుటేషన్ బ్రీడింగ్ లేదా స్పేస్ బ్రీడింగ్)తో సరికొత్త వంగడాలను రూపొందిస్తూ చైనా కొన్ని దశాబ్దాలుగా ప్రయోజనం పొందుతోంది. చైనా వ్యవసాయ పరిశోధనా సంస్థ (సీఏఏఎస్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, చైనా అణు వ్యవసాయ శా్రస్తాల సంస్థ అధ్యక్షుడు కూడా అయిన డా. లూక్సియాంగ్ లియు చెబుతున్న మాట ఇది. ‘ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్’ న్యూస్‌లెటర్ 2023 జనవరి సంచికలో స్పేస్ బ్రీడింగ్ ప్రయోజనాలను వివరిస్తూ ఆయన ఓ వ్యాసం రాశారు. వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, నువ్వు, క్యాప్సికం, టొమాటో తదితర పంటలకు చెందిన 260 వంగడాలను ఇప్పటివరకు విడుదల చేసినట్లు డా. లియు ఆ వ్యాసంలో వెల్లడించారు. 2011లో విడుదల చేసిన ‘లుయుయాన్ 502’ గోధుమ వంగడంతో 12% దిగుబడి పెరగడంతోపాటు కరువును, ప్రధాన తెగుళ్లను తట్టుకుంటోందని పేర్కొన్నారు. హెక్టారుకు 12.18 టన్నుల గోధుమ దిగుబడినిస్తున్నదని డా. లియు చెప్పారు. 2016 తర్వాత 21 గోధుమ, 15 వరి, 7 మొక్కజొన్న వంగడాలను అధికారికంగా విడుదల చేశామన్నారు. మెరుగైన వంగడాల అభివృద్ధికి అవసరమే! అంతరిక్షంలో ఉత్పరివర్తనాలు(మ్యుటేషన్లు) ఎక్కువ సంఖ్యలో వస్తాయి. కాస్మిక్ ఎనర్జీ వల్ల విత్తనాల్లోని డిఎన్ఎలో పెనుమార్పులు సంభవిస్తాయి. కాంబినేషన్లు మారిపోతాయి. కొత్త వేరియంట్స్ ఆవిష్కరణకు, విస్తృతమైన జీవ వైవిధ్యానికి ఇది అవసరం. 1960వ దశకంలో ఎక్స్‌రేస్, గామారేస్‌తో మ్యుటేషన్ బ్రీడింగ్‌పై విస్తృత పరిశోధనాలు జరిగాయి. వరిలో జగన్నాద్ రకం అలా వచ్చిందే. అయితే, ఆ మ్యుటేషన్ల ద్వారా మనుగడలోకి వచ్చిన వంగడాలు చాలా తక్కువ. స్పేస్ బ్రీడింగ్ వల్ల లక్షల్లో మ్యుటేషన్లు వస్తే వాటిని స్థిరీకరించిన తర్వాత కొన్నయినా ఉపయోగపడొచ్చు. మ్యుటెంట్ లైన్స్‌ను ఉపయోగించుకొని పలు వాతావరణ పరిస్థితులకు అనువైన వాటిని స్థిరీకరించిన తర్వాత మెరుగైన వంగడాలను తయారు చేసుకోవడానికి స్పేస్ బ్రీడింగ్ ఉపయోగపడుతుంది. – డా. రాఘవరెడ్డి, మాజీ కులపతి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. రైతుల సమస్యలు తీరతాయనుకోవటం భ్రమే! మొక్కలు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సహజంగానే మారుతూ ఉంటాయి. అంతరిక్షంలో గాలి, వత్తిడి ఉండదు. కాస్మిక్ కిరణాలు పడతాయి. అటువంటి అంతరిక్షంలోకి పంపిన విత్తనాల్లో వచ్చే పెను మార్పులు మంచివి కావొచ్చు, చెడువి కావొచ్చు. కొన్నిటిని మాత్రమే మనం గుర్తించగలం. గుర్తించలేని మార్పుల వల్ల ఎటువంటి పరిణామాలుంటాయో తెలియదు. మారిన దాని ప్రభావం వల్ల ఎలర్జీ రావచ్చు, ఇంకేదైనా సమస్య రావచ్చు. జన్యుమార్పిడి మాదిరిగానే మ్యూటేషన్ బ్రీడింగ్ వల్ల కూడా జీవ భద్రతకు ముప్పు ఉంటుంది. దీని వల్ల ఉపయోగం 0.0001% మాత్రమే. దానికి పెట్టే ఖర్చుకు, పొందే ప్రయోజనానికి పొంతన ఉండదు. ఈ హై టెక్నాలజీ ఫలితాలు అకడమిక్ పరిశోధనలకు పరిమితం. దీంతో రైతుల సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందనుకోవటం భ్రమ. 60 ఏళ్లుగా మ్యూటేషన్ బ్రీడింగ్ అనుభవాలు చెబుతున్నది ఇదే. భూమ్మీదే సుసంపన్నమైన పంటల జీవవైవిధ్యం ఉంది. ప్రకృతిసిద్ధమైన వాతావరణంలో రెగ్యులర్ సెలక్షన్ ద్వారా వంగడాల ఎంపికపై ఆధారపడటమే మేలు. అధిక ఉష్ణాన్ని తట్టుకునే టొమాటో మొక్క భూమ్మీద దొరుకుతుంది. చంద్రుడి మీద దొరకదు కదా! – డా. జీవీ రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం, కృష్ణ సుధా అకాడమీ ఫర్ ఆగ్రోఎకాలజీ. -
పట్టణాల్లో ట్రెండీగా మారుతున్న 'శాశ్వత వ్యవసాయం'
పర్యావరణ అత్యవసర పరిస్థితులు చుట్టుముడుతున్న నేపథ్యంలో కాంక్రీటు అరణ్యాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వృత్తి నిపుణులు మేలుకొంటున్నారు. తిరిగి ప్రకృతి వైపు తెలివిగా అడుగులు వేస్తున్నారు. నగరాలు, పట్టణాల పరిసర ప్రాంతాల్లో కొద్దో గొప్పో సొంత భూమి సమకూర్చుకొని తాము తినాలనుకునే పంటలను తామే పండించుకొనే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. తెలుగు నాట కోవిడ్‌కు ముందే ప్రారంభమైన ఈ ట్రెండ్ ఇప్పుడు మరింత పుంజుకుంటోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో పర్మాకల్చర్ను అనేక కుటుంబాలు అనుసరిస్తున్నాయి. దాన్నే జీవనశైలిగా మార్చుకుంటున్నాయి. ప్రముఖ పర్మాకల్చర్ నిపుణులు డా. నరసన్న, పద్మ శిక్షణ ఇస్తున్నారు. శాశ్వత ఆహార, ఆరోగ్య, పర్యావరణ సేవలందించే సమగ్ర స్వీయ సేంద్రియ సేద్య విజ్ఞానపు వెలుగుదారులు పరుస్తున్నారు. ‘పర్మాకల్చర్’ అంటే..? పర్మనెంట్ + అగ్రికల్చర్. శాశ్వత ప్రయోజనాలను అందించే ఓ నూతన వ్యవసాయ విధానం. ఇంకా విడమర్చి చెప్పుకోవాలంటే.. పర్మాకల్చర్ (శాశ్వత వ్యవసాయం) కేవలం సీజనల్ పంటలను సేంద్రియంగా పండించే పద్ధతి మాత్రమే కాదు. భారతీయులకు, ముఖ్యంగా తెలుగు నేలకు, పర్మాకల్చర్ భావనను పరిచయం చేసిన కీర్తి శేషులు డాక్టర్ వెంకట్ మాటల్లో చెప్పాలంటే.. ‘పర్మాకల్చర్ అన్నది ఒక ప్రత్యామ్నాయ జీవన విధానం. జీవావరణంలో ఒక భాగమై దోపిడీకి గురికానివ్వని సహకార సంబంధాలపై ఇది ఆధారపడి ఉంటుంది. భూమి, ప్రజల సంరక్షణకు అవసరమైన సుస్థిర, నైతిక, మనగల వ్యవస్థల రూపకల్పనకు ఇది పనిచేస్తుంది!’ ఆస్ట్రేలియాలో పుట్టి.. అంతటా విస్తరించి.. శాశ్వత వ్యవసాయ భావన దాదాపు ఏభయ్యేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో పురుడుపోసుకుంది. ఒకటి రెండు దేశాలు మినహా ప్రపంచం అంతటా విస్తరించింది. 1970వ దశకం మొదట్లో ఆస్ట్రేలియాలోని తాస్మానియాకి చెందిన డా. బిల్ మాలిసన్ పర్మాకల్చర్కు రూపుకల్పన చేశారు. ఈ కృషిలో డేవిడ్ హోమ్గ్రెన్ కూడా భాగస్వామి. జీవావరణ విధ్వంసానికి, వనరుల విధ్వంసానికి కారణభూతమవుతున్న ఏకపంటల (మోనోకల్చర్) పారిశ్రామిక వ్యవసాయ పద్ధతికి ప్రత్యామ్నాయంగా దీన్ని రూపొందించినందుకు 1981లో ఆయనకు రైట్ లైవ్లీహుడ్ అవార్డు (దీన్ని ప్రత్యామ్నాయ నోబుల్ బహుమతి అని అంటారు) లభించింది. బిల్ మాలిసన్ అనేకసార్లు మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలో పర్యటించి పర్మాకల్చర్ భావనను చిన్న, సన్నకారు రైతుల కమతాలకు అనుసంధానం చేయటంపై ఆచరణాత్మక ప్రయోగాలు చేశారు. పేదరిక నిర్మూలన, వర్షాధార సేద్యం, పశువులను వ్యవసాయంతో అనుసంధానం చేయటం, చిన్న కమతాలను స్వయంపోషకంగా రూపొందించడం, పండ్ల తోటల్లో అంతర పంటల సాగు వంటి అంశాలపై కృషి చేశారు. బిల్ భావాలతో ప్రభావితులైన అరోరా, డాక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో పర్మాకల్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది. స్వయం సమృద్ధ జీవనం కేవలం వార్షిక పంటలు పండించటమే కాకుండా వ్యవసాయాన్ని శాశ్వత ప్రాతిపదికగా చేపట్టటానికి అవసరమైన చట్రంగా పర్మాకల్చర్ పద్ధతిని మొదట రూపొందించారు. బహువార్షిక చెట్లు, పొదలు, వార్షిక, ఆహార ధాన్యపు పంటలు, మూలికలు, కూరగాయలు, పుట్టగొడుగులు, దుంపలు వంటి పలు పంటలతో పాటు పశువుల పెంపకాన్ని ప్రయోజనకరంగా చేపట్టి.. కుటుంబ, గ్రామీణ స్థాయిలో ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడానికి తొలుత ఈ విధానాన్ని రూపొందించారు. అయితే, కాలక్రమంలో పర్మాకల్చర్ ఆచరణలో పరిపుష్టమవుతూ మరింత విస్తృత అర్థాన్ని సంతరించుకుంది. ఇప్పుడు పర్మాకల్చర్ అంటే కుటుంబ స్థాయిలో ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించటం మాత్రమే కాదు. భూమి, సమాచారం, ఆర్థిక వనరులు, ప్రజలకు అందుబాటులో లేకపోతే ఆహారంలో స్వయం సమృద్ధి సాధ్యం కాదు. ఈ పుడమిలోని సహజ వనరులను అంతరింపచేయకుండా, కలుషితం చేయకుండా, నాశనం చేయకుండా ప్రజలు తమ భౌతిక, ఇతర అవసరాలను తీర్చుకునేలాగా స్వయం సమృద్ధ, స్వయం నిర్వహిత విధానాలను రూపొందించుకోవటానికి.. భూమితో సహా అన్ని వనరులను ప్రజలు సమకూర్చుకోవటానికి వివిధ ఎత్తుగడలతో కూడిన సమగ్ర జీవన విధానం అన్న విస్తృతార్థాన్ని పర్మాకల్చర్ సంతరించుకుంది. భవిష్యత్తు తరాలపై భారం పడకుండా.. కేవలం వ్యవసాయం, ఆహారం గురించి మాత్రమే కాకుండా ప్రకృతి వనరులతో మానవులకు ఉండవలసిన సంబంధాలు, ఆ వనరులను నైతికబద్ధంగా, విజ్ఞతతో, జాగ్రత్తగా వాడుతూ మన బాధ్యతారహితమైన చర్యల వల్ల భవిష్యత్తు తరాలపై భారం పడకుండా చూడటమే పర్మాకల్చర్‌లో కీలకం అంటారు డాక్టర్ వెంకట్. మనం ఎంతటి జ్ఞానం.. సాంకేతిక విజ్ఞానం కనబరిచినా, సృజనాత్మకతను ప్రదర్శించినా వృక్ష జగత్తులోని సహజ, జీవ–పోషక ప్రక్రియలకు ప్రత్యామ్నాయాలను కనుగొనలేం. పునరుద్ధరించిన వ్యవసాయ జీవావరణంలో ఈ ప్రక్రియలు బలపడేలా చెయ్యటమే పర్మాకల్చర్ లక్ష్యం. వ్యవసాయం మానవ చర్య. కాబట్టి మన వ్యవసాయం ప్రకృతికి సాధ్యమైనంత దగ్గరగా ఉండాలి. ప్రకృతి నియమాలను అతిక్రమించకుండా ఉండాలని పర్మాకల్చర్ దృక్పథం చెబుతుంది. 24 ఏళ్ల ‘అరణ్యం వ్యవసాయ కుటుంబాల్లో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించిన కొప్పుల నరసన్న, పునాటి పద్మ తొలి దశలో జహీరాబాద్‌లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీలో రిసోర్స్ పర్సన్లుగా ఉంటూ రైతులతో పదేళ్లకు పైగా పనిచేశారు. బిల్ మాలిసన్, డా. వెంకట్ సాంగత్యంలో శాశ్వత వ్యవసాయాన్ని ఔపోశన పట్టిన నరసన్న, పద్మ అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థను ఏర్పాటు చేసి స్థానిక రైతాంగంలో పర్మాకల్చర్ వ్యాప్తికి శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం సమీపంలోని బిడకదిన్నె గ్రామంలో 1999లో 11.5 ఎకరాలను కొనుగోలు చేసి ‘అరణ్య శాశ్వత వ్యవసాయ క్షేత్రా’న్ని నెలకొల్పారు. తొలి దశలో టేకు సహా అనేక స్థానిక అటవీ జాతుల చెట్లతో పాటు పండ్లు, కలప జాతుల చెట్లను పెంచుతూ వచ్చారు. ఈ క్షేత్రం దేశంలోనే పర్మాకల్చర్ డిజైన్ కోర్సు (పీడీసీ) శిక్షణకు కేంద్ర స్థానంగా మారింది. కొప్పుల నరసన్న, పద్మ, స్నేహ బృందం ప్రతి రెండు నెలలకోసారి 15 రోజుల రెసిడెన్షియల్ పీడీసీ నిర్వహిస్తున్నారు. పొలంలోనే ఉంటూ, కలసి పనిచేస్తూ శాశ్వత వ్యవసాయాన్ని నేర్చుకోదలచిన వారికి, ముఖ్యంగా అంతకుముందు వ్యవసాయం తెలియని వారికి ‘అరణ్య’ క్షేత్రం మంచి సాగు‘బడి’. పర్మాకల్చర్ డిజైన్ అంటే? ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవటంతోపాటు ప్రత్యేక డిజైన్ ప్రకారం పంటల జీవవైవిధ్యం ద్వారా ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించే దారులను పర్మాకల్చర్ చూపుతుంది. భూసారం పెంపుదల.. వాన నీటి సంరక్షణకు కాంటూరు కందకాలు తీయటం.. పెనుగాలులు/గాడ్పుల నుంచి పంటలను కాపాడుకోవడానికి 12 రకాల అటవీ జాతి చెట్లను పొలం దక్షిణ సరిహద్దులో 6 మీటర్ల వెడల్పున పెంచటం.. గడ్డీ గాదం, ఆకులు అలములతో కంపోస్టు చేయటం.. ఇవన్నీ నరసన్న,పద్మ నెలకొల్పిన అరణ్య పర్మాకల్చర్ క్షేత్రం డిజైన్‌లో ముఖ్యాంశాలు. భూమిని అనేక జోన్లుగా విభజించి.. ఏడాది పొడవునా సీజనల్ పండ్లు, కూరగాయలను డ్రిప్‌తో సాగు చేస్తున్నారు. ఇతర జోన్లలో ఖరీఫ్, రబీ కాలాల్లో వర్షాధారంగా ధాన్యపు పంటలను పండిస్తున్నారు. జోన్ 1: ప్రధాన ద్వారం దగ్గర ఉండే జోన్ 1లో వంట గది, స్టోర్ రూమ్, వాలంటీర్ల గది, బావితో పాటు కొన్ని అటవీ జాతుల చెట్లు ఉంటాయి. అనేక రకాల పండ్ల మొక్కలను వృత్తాలు(సర్కిళ్లు)గా నాటి సాగు చేస్తున్నారు. వృత్తం చుట్టూతా మునగ, బొప్పాయి, అరటి, చెన్నంగి, చిలగడదుంప వంటి పంటలతో పాటు నిమ్మగడ్డి వంటి ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. జోన్ 2: నర్సరీ, కూరగాయల తోట ఉంటాయి. జోన్ 3: ధాన్యపు పంటల విభాగాలు 3, కూరగాయలు పండించే 3 విభాగాలు, వాన నీటి కుంట ఉంటాయి. జోన్ 4: పండ్ల చెట్లతో పాటు అటవీ జాతుల చెట్లు ఉంటాయి. బోదెలపై కూరగాయలు కూరగాయల విభాగంలో కాంటూరు ప్రకారం ఎస్ ఆకారంలో బోదెలు తోలి అనేక రకాల కూరగాయలు, పండ్ల మొక్కలు సాగు చేస్తున్నారు. కాంటూరు బోదెలను ఎస్ ఆకారంలో ఏర్పాటు చేయటం వల్ల ఎండ, గాలి, నీరు వంటి ప్రకృతి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవటానికి వీలవుతోంది. అరణ్య వ్యవసాయ క్షేత్రంలో కూరగాయలకు మాత్రమే డ్రిప్‌తో నీటిని అందిస్తున్నారు. జొన్న, శనగ, కంది తదితర పంటలను వర్షాధారంగానే సాగు చేస్తున్నారు. పంట మోళ్లతో కంపోస్టు పొలం లోపలి వనరులను సమర్థవంతంగా పునర్వినియోగించుకోవాలని, బయటి నుంచి ఎటువంటి ఎరువూ తెచ్చి పంటలకు వేయకూడదన్నది పర్మాకల్చర్‌లో మరో ముఖ్యసూత్రమంటారు నరసన్న. పొలంలో పంటల నుంచి వచ్చిన మోళ్లు, రాలిన ఆకులు, కొమ్మలు, రెమ్మలను మూలన ఒక గుంత తవ్వి కంపోస్టు తయారు చేసి పంటలకు వేస్తున్నారు. పర్మాకల్చర్ సాంఘిక బాధ్యతతో స్థానిక పంటల జీవవైవిధ్యాన్ని పరిరరక్షించటం నేర్పిస్తుందని నరసన్న అంటారు. సొంత తిండి పంటల విత్తనాలను నిలబెట్టుకోవటమే రైతులకున్న తొలి కర్తవ్యంగా పర్మాకల్చర్ నొక్కిచెబుతుంది. సొంత విత్తనాన్ని కోల్పోయిన రైతు, జాతి ఆహార సార్వభౌమత్వాన్ని కోల్పోయినట్టేనని ఆయన అంటారు. అందుకే, అన్నదాతా సుఖీభవకన్నా ముందు విత్తు దాతా సుఖీభవ అంటారాయన! కుటుంబానికి ఎంత క్షేత్రం కావాలి? శాశ్వత వ్యవసాయ పద్ధతుల్లో ఒక పొలం పూర్తిస్థాయిలో ఫలితాలను అందించాలంటే సారం కోల్పోయిన భూమి పునరుజ్జీవం పొందాలి. అందుకు తగినంత సమయం పడుతుంది. డిజైన్ ప్రకారం వాన నీటి సంరక్షణ, వివిధ స్థానిక జాతలు మొక్కలు నాటడం, కంపోస్టు తయారీ, అన్ని పనులనూ వ్యక్తిగత శ్రద్ధతో రైతు కుటుంబం స్వయంగా చేసుకుంటూ వెళితే 3–4 ఏళ్ల సమయం పడుతుంది. అన్ని వనరులూ సమకూర్చుకొని ముందడుగు వేయాలి. ఒక అంచనా ప్రకారం.. నలుగురైదుగురి కుటుంబానికి ఏడాది పొడవునా పండ్లు, కూరగాయలు అందించడానికి 1–2 ఎకరాల పర్మాకల్చర్ ఫామ్ చాలు. వీటితో పాటు ధాన్యాలు కూడా సమకూర్చుకోవాలంటే ఆ కుటుంబం కనీసం 4–5 ఎకరాల్లో ఫామ్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆలోచించుకొని స్థిరంగా అడుగులు వేస్తున్న కుటుంబాలు శాశ్వత వ్యవసాయ సత్ఫలితాలను అందుకుంటున్నాయి. పరిసరాలకు మధ్య సుహృద్భావ సంబంధం.. ప్రకృతిలోని జీవావరణ వ్యవస్థలను పోలిన వైవిధ్యం, స్థిరత్వం, ఆటుపోట్లను తట్టుకునే గుణం కలిగిన వ్యవసాయ ఉత్పాదక జీవావరణ వ్యవస్థలుగా వ్యవసాయ క్షేత్రాలను రూపొందించి, నిర్వహించటమే పర్మాకల్చర్. అది ప్రజలకు, వారి పరిసరాలకు మధ్య ఒక సుహృద్భావ సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ప్రజల ఆహార, ఆవాస, ఇంధన, ఇతర భౌతికమైన, భౌతికేతర అవసరాలను సుస్థిర పద్ధతిలో తీరుస్తుంది. – బిల్ మాలిసన్, పర్మాకల్చర్ పితామహుడు (‘పర్మాకల్చర్.. ఎ డిజైనర్స్ మాన్యువల్’ నుంచి) ఇంటిల్లిపాదీ ప్రకృతితో మమేకమై.. అబిద్ అలి.. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. 2019లో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం నారెగూడెంలో 18 ఎకరాల భూమిని కొనుగోలు చేసి సోదరుడు షబ్బర్, మరో నాలుగు కుటుంబాలతో కలసి జీవిస్తున్నారు. అనహద్ ఎకో కమ్యూనిటీ అని పేరుపెట్టారు. మట్టి ఇటుకలు, స్థానిక సామాగ్రితో పర్యావరణహితమైన ఇళ్లను నిర్మించుకొని పర్మాకల్చర్ పద్ధతుల్లో పంటలు పండించుకుంటూ జీవిస్తున్నారు. తమ పిల్లలకు తామే చదువు చెప్పుకుంటున్నారు. ఇంటి పక్కనే 3–4 ఎకరాల్లో పండ్ల చెట్లతో కూడిన అడవిని సాగు చేస్తున్నారు. ‘ఫుడ్ ఫారెస్ట్ కొద్ది సంవత్సరాల్లో పూర్తిస్థాయిలో పెరిగిన తర్వాత తరతరాలకు నిరంతరం పండ్లనిస్తుంది. మా ఆహారం మేము పండించుకుంటూ, ఆరోగ్యంగా, ఆనందంగా కలసిమెలసి ఇంటిల్లపాదీ ప్రకృతితో మమేకమై జీవించాలన్నదే ఆకాంక్ష’ అన్నారు అబిద్. పర్మాకల్చర్ జీవితాన్ని మార్చేసింది! విద్యారావు హైదరాబాద్‌కు చెందిన మాజీ నటి. వికారాబాద్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో చక్కని ఇల్లు నిర్మించుకొని పర్మాకల్చర్ పద్ధతిలో కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నారు. కోవిడ్ మహమ్మారికి ముందే పర్మాకల్చర్ నేర్చుకోవటం తమ కుటుంబానికి ఎంతో మేలు చేసిందన్నారు. వ్యవసాయం బొత్తిగా ఎరుగని తనకు పీడీసీ కోర్సు చాలా నేర్పిందన్నారు. ఆమె 16 దేశీ ఆవులను, నాటు కోళ్లను, తేనెటీగలను సైతం పెంచుతున్నారు. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి, జీవవైవిధ్యం సుసంపన్నతను తెలియజెప్పడానికి పర్మాకల్చర్ ఉపయోగకరమన్నారు. ప్రతి స్కూల్లోనూ పర్మాకల్చర్ ప్రాక్టికల్ పాఠాలు చెప్పాలన్నారు. విభిన్న వ్యక్తులను అర్థం చేసుకొని, సహనంతో, సామరస్యంగా జీవించడానికి పర్మాకల్చర్ అవసరమంటారు విద్యారావు. ఫారెస్ట్‌లో జరుగుతున్నదే.. అటవీ శాఖలో డీఎఫ్ఓగా పనిచేసి 2019లో రిటైరైన కోడూరి రవీందర్ కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం యల్లారం గ్రామంలో 11 ఎకరాల నల్లరేగడి భూమిలో పర్మాకల్చర్ వ్యవసాయం చేస్తున్నారు. ‘అడవిలో ప్రతి ఏటా విత్తనాలు రాలుతుంటాయి, వర్షం పడుతుంది, పశువులు, పక్షులు, కీటకాలు సహజంగానే సమతుల్యతతో జీవిస్తూ ఉంటాయి. ఫుడ్ ఫారెస్ట్‌ను కూడా ఇదే సూత్రాలతో నిర్మిస్తే సుస్థిరంగా ఫలితాలనిస్తుంది’ అంటారాయన. 3 ఏళ్లుగా ఏడెకరాల్లో పండ్ల చెట్లతో కూడిన 5 అంచెల్లో ఫుడ్ ఫారెస్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. 4 ఎకరాల్లో కందులు తదితర పంటలు సాగు చేస్తున్నారు. ‘మరో ఐదేళ్లలో తన క్షేత్రం పూర్తిస్థాయి ఫలితాలనిస్తుంది. 11 ఎకరాల్లో ఏడాదికి రూ. 25 లక్షల ఆదాయం వస్తుంద’ని రవీందర్ ఆశిస్తున్నారు. పర్మాకల్చర్ టూల్స్ మనకున్న భూమిలో మన ఆహారాన్ని మనం పండించుకోవటం ముఖ్యం. ప్రకృతి వనరులకు నష్టం కలగకుండా పంటలు పండించుకునే నేచర్ టూల్స్‌ని పర్మాకల్చర్ మనకు ఇస్తుంది. 2014లో తొలి బ్యాచ్‌లోనే నరసన్న దగ్గర పర్మాకల్చర్ కోర్సు చేశా. మా 5 ఎకరాల్లో కూరగాయలు, పండ్లు పండిస్తున్నాను. 12 బర్రెలు, 50 నాటు కోళ్లు స్వేచ్ఛగా పెరుగుతున్నాయి. మొరం నేలకు తగినట్లుగా కొన్ని స్థానిక పండ్ల చెట్లు పెంచుతున్నాను. భూమి ఆరోగ్యం బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతున్నా. వ్యవసాయం ఒక తపస్సు! – మలిపెద్ది రమేశ్‌రెడ్డి, పర్మాకల్చరిస్టు, కాచవానిసింగారం, ఘట్కేసర్ మండలం, మేడ్చల్ జిల్లా కందకాలలో వట్టివేరు మొక్కలు.. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ పర్మాకల్చర్ డిజైన్ కోర్సు పూర్తి చేసి అనంతపురం జిల్లాలోని తమ బీడు భూమిలో ఫుడ్ ఫారెస్ట్ అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉన్నారు. పెద్దవడుగూరు మండలం గుత్తి అనంతపురం గ్రామంలోని తన తల్లి మాలతికి ఏడెకరాల భూమి ఉంది. తువ్వ నేల కావటంతో భూసారం తక్కువగా ఉంది. వాలుకు అడ్డంగా కందకాలు తవ్వి, ఆ కందకాలలో వట్టివేరు మొక్కల్ని నాటారు. అవి పెరిగిన తర్వాత కత్తిరించి పండ్ల మొక్కల మొదళ్లలో ఆచ్ఛాదన చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, పర్మాకల్చర్ పద్ధతులను మిళితం చేసి 2 ఎకరాల్లో 10 రకాల పండ్ల మొక్కలు నాటామని మాలతి తెలిపారు. --పంతంగి రాంబాబు (చదవండి: కొబ్బరికాయ భూగర్భ జలాల జాడను కనిపెట్టగలదా? సైన్స్ ఏం చెబుతోంది..?) -
నాటుకోళ్ల పెంపకం.. నెలకు రూ.80వేలకు పైగా లాభాలు
పెరట్లో నాటు కోళ్ల పెంపకం ద్వారా చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు, ముఖ్యంగా మహిళా రైతులకు, ఏడాది పొడవునా స్థిరంగా ఆదాయంతో పాటు కుటుంబ స్థాయిలో పౌష్టికాహార లభ్యతను సైతం పెంపొందించవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి వాసన్ తదితర స్వచ్ఛంద సంస్థలు గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు ద్వారా నిర్థారణైంది. పెరటి కోళ్ల పెంపకం కొత్తేమీ కాదు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 70% కుటుంబాలు అన్నో ఇన్నో పెరటి కోళ్లు పెంచుకుంటూనే ఉంటాయి. అయితే, కోళ్లు పరిసర ప్రాంతాల్లో తిరిగి రావటంతో పాటు రాత్రుళ్లు చెట్ల మీదో, పందిళ్ల మీదో నిద్రించటం వల్ల కుక్కలు, పిల్లుల బారిన పడి మరణిస్తూ ఉంటాయి. ఈ సమస్యలను అధిగమించడానికి వాసన్ సంస్థ దేశవాళీ పెరటి కోళ్లను అరెకరం విస్తీర్ణంలో చుట్టూ ప్రత్యేకంగా కంచె వేసి అందులో స్థానికంగా లభించే జాతుల నాటు కోళ్లు పెంచటంపై ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల తోడ్పాటుతో అమలు చేస్తోంది. కోళ్లు రాత్రి పూట భద్రంగా విశ్రమించడానికి షెడ్డు నిర్మించటం.. చిరుధాన్యాలు, అజొల్లా, చెద పురుగులను మేపటం.. వ్యాక్సిన్లు వేయటం ద్వారా నాటు కోడి పిల్లల మరణాలను తగ్గించి, ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం కల్పించటం.. ప్రతి 25 కుటుంబాలకు ఒకటి చొప్పున స్థానిక మహిళా రైతు ద్వారానే బ్రీడింగ్ ఫామ్‌ను ఏర్పాటు చేయించటం.. వంటి చర్యల ద్వారా చక్కటి ఫలితాలు వస్తున్నాయని వాసన్ చెబుతోంది. అరెకరం పెరటి కోళ్ల నుంచి రూ. 70–80 వేలు, ఆ అరెకరంలో పండ్లు, కూరగాయలు, దుంప పంటల ద్వారా మరో రూ. 20 వేల వరకు రైతు కుటుంబానికి ఆదాయం వస్తున్నట్లు తమ అధ్యయనంలో తేలినట్లు వాసన్ తెలిపింది. ఏపీ గిరిజన ప్రాంతాల్లో మహిళా రైతుల అనుభవాలు దేశవ్యాప్తంగా అమలు చేయదగినవిగా ఉన్నాయని వాసన్ చెబుతోంది. ఈ అనుభవాలపై చర్చించేందుకు ఈ నెల 27వ తేదీన విశాఖలో వాసన్, ఏపీ ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చర్చాగోష్టి జరగనుంది. ఈ సందర్భంగా అరెకరంలో నాటు కోళ్లను పెంచుతూ ఏడాదికి దాదాపు రూ. లక్ష ఆదాయం గడిస్తున్న చిన్నమ్మి, చంద్రయ్య గిరిజన దంపతుల అనుభవాలను ఇక్కడ పరిశీలిద్దాం. చిన్నమ్మి నాటు కోళ్ల బ్రీడింగ్ ఫామ్ కుండంగి చిన్నమ్మి(58), చంద్రయ్య గిరిజన దంపతులది మన్యం పార్వతీపురం జిల్లా సీతంపేట మండలం చినరామ గ్రామం. వీరికి ముగ్గురు పిల్లలు. కుమారుడు రవికుమార్ డిగ్రీ వరకు చదువుకొని తల్లిదండ్రులతో కలసి గ్రామంలోనే వ్యవసాయం చేస్తున్నాడు. వారికి 70 సెంట్ల మాగాణి, ఎకరంన్నర మెట్ట పొలంతో పాటు 2 ఎకరాల కొండ పోడు భూములు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వాసన్ సంస్థ తోడ్పాటుతో అరెకరం పెరట్లో నాటు కోళ్ల పెంపకం చేపట్టారు. భర్త, కుమారుడు ఇతర పొలాల్లో పనులు చూసుకుంటూ ఉంటే చిన్నమ్మి పెరటి కోళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. మరో 25 కుటుంబాలకు కూడా కోడి పిల్లలను అందించే బ్రీడింగ్ ఫామ్‌ను చిన్నమ్మి నిర్వహిస్తుండటం విశేషం. అరెకరం స్థలంలో చుట్టూ 4 అడుగుల ఎత్తు గ్రీన్ మెష్‌తో పాటు కొండ చీపురు గడ్డి, వెదరు బొంగులతో గట్టి కంచెను ఏర్పాటు చేసుకున్నారు. 50 కోళ్లతో ప్రారంభించారు. ఇప్పుడు 80 కోళ్లు ఉన్నాయి. కొన్ని పందెం కోళ్లు కూడా పెంచుతున్నారు. 18“24 అడుగుల స్థలంలో 200 కోళ్లు రాత్రిళ్లు నిద్రించడానికి సరిపోయే రేకుల షెడ్‌ను 3 సెంట్లలో నిర్మించారు. వాసన్ అందించిన రేకులు తదితర సామగ్రిని ఉపయోగించారు. కోళ్లు ఆరుబయట తిరిగి మేస్తూ ఉంటాయి. అదనంగా తమ పొలాల్లో పండించిన చోళ్లు తదితర చిరుధాన్యాలు కోళ్లకు వేస్తున్నారు. చిన్న కుంటలో పెంచిన అజొల్లాను కోళ్లకు, మట్టి కుండల్లో పెంచిన చెద పురుగులను కోడి పిల్లలకు మేతగా వేస్తుండటంతో అవి బలంగా పెరుగుతున్నాయి. వారం కోడి పిల్లలకు విధిగా లసోట వాక్సిన్‌తో పాటు రెండు నెలలకోసారి ఇతర వాక్సిన్లు వేస్తున్నారు. ఈ అరెకరంలో కోళ్ల పెంపకంతో పాటు అదనపు ఆదాయం కోసం 43 రకాల పండ్లు, కూరగాయలు, దుంప పంటలను 5 దొంతర్లలో పండిస్తుండటం విశేషం. పసుపు, అల్లం, సీతాఫలాలు, బొప్పాయి, చింతపండుతో పాటు ఆగాకర తదితర తీగ జాతి కూరగాయలను సైతం పండిస్తున్నారు. కోడి మాంసం, గుడ్లు, కూరగాయలు, పండ్లను తాము తినటంతో పాటు విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. ఏడాదికి రూ. 70–80 వేల వరకు నాటుకోళ్లు, గుడ్ల ద్వారా, మరో రూ. 20 వేలు పంటల ద్వారా ఈ అరెకరం నుంచి ఆదాయం పొందుతున్నామని రవి(94915 42102) తెలిపారు. చిన్నమ్మి శ్రద్ధగా పనిచేస్తూ ఆదర్శ నాటుకోళ్ల బ్రీడింగ్ ఫామ్ రైతుగా గుర్తింపు పొందటం విశేషం. -
రొయ్యల రైతుకు చేదోడు.. చైన్ డ్రాగింగ్ బోట్!
చైన్ డ్రాగింగ్ బోట్’.. రొయ్యల సాగులో రైతులకు ఉపయోగపడే ఒక ఆవిష్కరణ ఇది. ఆక్వా సాగులో శారీరక కష్టం, ఖర్చు, వ్యాధుల బెడద తగ్గించడంతో పాటు రొయ్యల నాణ్యత పెంపొందించేందుకు ఈ చైన్ డ్రాగింగ్ బోట్ ఉపయోగపడుతుంది. చైన్ డ్రాగింగ్ అంటే? రొయ్యల పట్టుబడి పూర్తయిన తర్వాత చెరువును ఎండగడతారు. ఎండి నెర్రెలుబారిన ఆ చెరువులో మళ్లీ రొయ్యల సాగు ప్రారంభించడానికి చెరువులో నీరు నింపిన తర్వాత.. నేలను సిద్ధం చేసే క్రమంలో ఇనుప గొలుసులు చెరువు అడుగున వేసి, ఇద్దరు మనుషులు నడుములోతు నీటిలో నడుస్తూ లాగుతారు. దీన్నే చైన్ డ్రాగింగ్ అంటారు. తద్వారా చెరువు అడుగు మట్టిలో వ్యర్థాలు, విషవాయువులు బయటకు వెళ్లిపోవటంతో పాటు రొయ్యలకు సహజ ఆహారమైన ప్లవకాలు వృద్ధి చెందుతాయి. అయితే, మనుషులు నీటిలో నడుస్తూ చైన్ డ్రాగింగ్ చేయటం వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఈ పనిని సులువుగా, తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో చేయడానికి ఉపయోగపడే వినూత్నమైన పడవకు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడు డాక్టర్ తౌసీఫ్ అహ్మద్ రూపుకల్పన చేశారు. ఈ ‘చైన్ డ్రాగింగ్ బోట్’ఆక్వా రైతులకు ఎంతో ప్రయోజనకరంగా నిలుస్తోంది. గుంటూరు జిల్లా నిజాంపట్నం ప్రాంతంలోని ఆక్వా రైతుల కోరిక మేరకు నాలుగేళ్ల క్రితం డాక్టర్ ౖతౌసీఫ్ పరిశోధనలు ప్రారంభించారు. ఈ క్రమంలో యూనివర్సిటీలోని త్రీడీ ఎక్స్పీరియన్స్ ల్యాబ్‌లో ‘చైన్ డ్రాగింగ్ బోట్’ను డిజైన్ చేశారు. ఈ ఆవిష్కరణకు భారతీయ పేటెంట్ సంస్థ 2020లో డిజైన్ పేటెంట్‌ను మంజూరు చేసింది. 'చైన్ డ్రాగింగ్ బోట్’ లీటరు పెట్రోల్‌తో 2 గంటలు పనిచేస్తుంది. దీనితో అర గంట సమయంలోనే 10 ఎకరాల్లోని రొయ్యల చెరువుల్లో చైన్ డ్రాగింగ్ పనిని పూర్తి చేయవచ్చని డా. తౌసీఫ్ తెలిపారు. మనుషులు చేసిన దానికంటే అధిక సామర్థ్యంతో స్లడ్జ్ వంటి వ్యర్థాలను తొలగించటం, చెరువు అడుగు నేలను గుల్లబరచటంలో ప్రయోజనకారిగా నిలుస్తోందన్నారు. ‘ఆంగ్రూ’ ప్రోత్సాహం ‘చైన్ డ్రాగింగ్ బోట్’కు సంబంధించి డాక్టర్ వైఎస్సార్ ఏఎన్‌యూ ఇంజనీరింగ్ కళాశాలలోని త్రీడీ ఎక్స్పీరియన్స్ ల్యాబ్‌లో ప్రత్యేక డిజైన్‌ను రూపొందించిన డా. తౌసీఫ్ అహ్మద్.. అందుకు అనుగుణంగా మూడు ప్రత్యేక స్టీల్ ఫ్రేమ్‌లతో కూడిన బోట్‌ను తయారు చేయించారు. దానికి జీఎక్స్ 160 హోండా ఇంజన్‌ను, వెను చైన్‌ను అమర్చారు. పెట్రోల్‌తో నడిచే ఈ బోట్‌పై ఒకరు కూర్చుని నడపవచ్చు. దీని తొలి బోట్‌ను రైతులకు ఇచ్చి వాడిన తర్వాత వారి సూచనల మేరకు తగు మార్పులు చేశారు. చైన్ డ్రాగింగ్ బోట్ ప్రాజెక్టుకు తిరుపతిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్విద్యాలయం (ఆంగ్రూ) పోషన్ ఇంక్యూబేషన్ సెంటర్ రూ. 5 లక్షలను అందించింది. ఈ ఆవిష్కరణను న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి కిసాన్ మేళాలో కూడా ఇటీవల ప్రదర్శించారు. సబ్సిడి కోసం ప్రయత్నిస్తున్నాం.. చైన్ డ్రాగింగ్ బోట్ వాడకం వల్ల రొయ్యల నాణ్యత, సర్వయివల్ రేటు పెరుగుతుంది. ‘ఆంగ్రూ’ సహకారంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా సబ్సిడీపై ఆక్వా రైతులకు ఈ బోట్లను అందించేందుకు చర్యలు చేపడుతున్నాం. తౌషా టెక్నాలజీ ఇన్నోవేషన్ అనే స్టార్టప్ ద్వారా రైతులకు వారం రోజుల్లో తయారు చేయించి ఇస్తున్నాం. – డా. తౌసీఫ్ అహ్మద్ (98852 09780), ఆవిష్కర్త, నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, గుంటూరు రొయ్యలు పెరిగే కాలంలో కూడా.. ‘చైన్ డ్రాగింగ్ బోట్’కు ఆక్వా రైతుల నుంచి ఆదరణ లభిస్తోంది. డా. తౌసీఫ్ అహ్మద్ రెండు బోట్లను తయారు చేసి నిజాంపట్నం ప్రాంతంలోని ఆక్వా రైతులకు అందజేశారు. ఒకొక్క బోట్ తయారీ వ్యయం రూ. 80 నుంచి 90 వేలు ఉంటుందని, ఆర్డర్ ఇచ్చిన వారం రోజుల్లో తయారు చేసి ఇవ్వగలం. ఆక్వా రైతులకు అవగాహన కల్పించేందుకు ఒక బోట్‌ను విజయవాడలోని కృష్ణా నదీ తీరంలో ప్రదర్శనకు పెట్టారు. బోట్‌ను మనిషి గట్టు మీద నుంచే రిమోట్ పద్ధతిలో విద్యుత్తు బ్యాటరీ లేదా సౌర విద్యుత్తు ద్వారా నడిపించేందుకు పరిశోధనలు కొనసాగిస్తున్నానని డా. తౌసీఫ్ తెలిపారు. రొయ్యల సాగు ప్రారంభ దశలోనే కాకుండా, రొయ్యల పెంపకం జరిగే కాలంలో కూడా చైన్ డ్రాగింగ్ బోట్‌ను నడిపేందుకు ఆయన పరిశోధనలు కొనసాగిస్తున్నారు. పనిలో పనిగా డైనమిక్ ఎయిరేషన్ వ్యవస్థను కూడా ఈ బోట్‌కు అనుసంధానం చేస్తున్నామన్నారు. రొయ్య పిల్లలకు హాని కలగకుండా ఉండేలా అల్యూమినియం ప్రొపెల్లర్‌కు బదులు ఫైబర్ ప్రొపెల్లర్‌ను వినియోగించనున్నామని వివరించారు. – దాళా రమేష్ బాబు, సాక్షి ప్రతినిధి, గుంటూరు ఇన్పుట్స్: డా.ఎన్.అశోక్ కుమార్, సాక్షి, ఏఎన్‌యూ (చదవండి: కొబ్బరికాయ భూగర్భ జలాల జాడను కనిపెట్టగలదా? సైన్స్ ఏం చెబుతోంది..?) -
గిరి రైతుకు కలిసొచ్చిన రాజ్మా
సాక్షి,పాడేరు : ఏజెన్సీలో గిరి రైతుకు రాజ్మా సాగు లాభదాయకంగా మారింది. వాణిజ్య పంటగా ఎరుపు రకాన్ని సాగు చేస్తున్నారు. ప్రభుత్వం అన్నివిధాలుగా సహకారం అందించడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రభుత్వం 90 శాతం రాయితీపై 18,212 ఎకరాలకు అవసరమైన 4,555 క్వింటాళ్ల రాజ్మా విత్తనాలను ఈ ఏడాది ముందుగానే పంపిణీ చేసింది. సేంద్రియ విధానంలో మెట్ట, కొండపోడు భూముల్లో సాగు చేపట్టారు. రాజ్మా విత్తనం కిలో అసలు ధర రూ.154 కాగా ప్రభుత్వం రూ.15.40కు పంపిణీ చేసింది. ఎకరాకు 20 కిలోల విత్తనం అవసరం. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం సరఫరా చేసింది. ఈ సాగుపై సుమారు 7వేల మంది గిరి రైతులు ఆధారపడ్డారు. గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా.. గంజాయి సాగుకు ప్రత్యామ్నాయంగా పోలీసుశాఖ రాజ్మా సాగును పోత్సహిస్తోంది. పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, జీకేవీధి, చింతపల్లి మండలాల్లోని మారుమూల గ్రామాల గిరిజనులు ఇప్పటికే విత్తనాలు పొంది సాగు చేపట్టారు. మెట్ట ప్రాంతంలో పండించే రాజ్మా సాగుకు వాతావరణ పరిస్థితులు అనుకూలించాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఎంతగానే మేలు చేశాయి. మొక్కదశలో పైరు కళకళలాడుతోంది. నవంబర్ నెలాఖరు నుంచి డిసెంబర్ మొదటి వారంలోగా పంట దిగుబడి రావొచ్చని గిరి రైతులు అంచనా వేస్తున్నారు. దిగుబడి పెరిగే అవకాశం రాజ్మా గింజలకు మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నా యి. విత్తనాలు ముందుగానే సరఫరా చేయడంతో ఇప్పటికే చాలా చోట్ల సాగు చేపట్టారు. పైరు మొక్క దశలో కళకళలాడుతోంది. సేంద్రియ విధానంలో పండించడం వల్ల మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మెరుగైన ధర లభించే అవకాశం ఉంది. – ఎస్బీఎస్ నందు, జిల్లా వ్యవసాయాధికారి, పాడేరు రాయితీతో ఆదా ప్రభుత్వం 90 శాతం రాయితీపై విత్తనాలు సరఫరా చేయడం వల్ల పెట్టుబడి పరంగా ఎంతో ఆదా అవుతోంది. ప్రైవేటు మార్కెట్లో కిలో రూ.120 నుంచి రూ.150కు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం రాయితీ మినహాయించి కిలో రూ.15.40కు సరఫరా చేసింది. 50 కిలోల విత్తనం పొందా. ప్రస్తుతం మూడు ఎకరాల్లో సాగు చేపట్టా. – రేగం మంగ్లన్న, నేరేడివలస, గబ్బంగి, పాడేరు మండలం -
Live Stock Expo : పశు సంపద రంగానికి తగినంత గుర్తింపు రావాలి
ఎల్డిఎఫ్ ఇండియా, పశువులు, పాడి పరిశ్రమ మరియు మత్స్య పర్యావరణ వ్యవస్థలన్నింటిని ఒకే పైకప్పు కిందకు తీసుకువచ్చే భారతదేశపు మొట్టమొదటి ఎక్స్పో గురువారం హైటెక్స్‌లో ప్రారంభమైంది. ఆదివారం వరకు మూడురోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో సుమారు 80 స్టాల్స్ హైలైట్‌గా నిలవనున్నాయి. ఈ కార్యక్రమాన్ని హైటెక్స్, ఆక్వా ఫార్మింగ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ (AFTS) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. డాక్టర్ తరుణ్ శ్రీధర్, మాజీ యూనియన్ సెక్రటరీలతో పాటు పలువురు సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ వేడుకలో పాల్గిన్నారు. ఈ సందర్భంగా డా. తరుణ్ శ్రీధర్ మాట్లాడుతూ.. పశుసంపద సరైన గుర్తింపుకు నోచుకోలేదని, భారత్‌లో ఇప్పటికే చాలామంది గ్రామాల్లోనే నివసిస్తున్నారని తెలిపారు. అసలు పశువులతో సంబంధం లేకుండా ఏ రైతును చూడలేరన్నారు. భారతదేశం గణనీయమైన పశువుల జనాభాను కలిగి ఉందని, ప్రపంచ చేపల ఉత్పత్తి సహా పాల ఉత్పత్తి వినియోగంలో భారత్ ముందుందని పేర్కొన్నారు. ఎల్‌డిఎఫ్‌పై అంకితమైన ఎక్స్పో చాలా అవసరం. ఇది త్వరలో ప్రపంచ స్థాయిలో బోస్టన్ సీఫుడ్స్‌తో సమానంగా ఎదుగుతుందనన్నారు.ఇలాంటి ఎక్స్‌పోలు మన బలాన్ని ప్రదర్శించడమే కాకుండా విధి విధానాలను నిర్మించే ప్రభుత్వ అధికారులను మేల్కొల్పుతాయని అన్నారు డాక్టర్ తరుణ్ శ్రీధర్. 2022-23లో రికార్డు స్థాయిలో 174 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించింది. ఇది రూ.63,960 కోట్ల సీఫుడ్ ఎగుమతులను సాధించిందని, ఇంకా, భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారు అని భారతదేశంలోని చేపలలో 68% ఆక్వాకల్చర్ రంగం నుండి వస్తుందని తెలిపారు. పశువులు శక్తి. పశువులు ఎల్లప్పుడూ వ్యవసాయంలో అంతర్భాగంగా ఉంటాయి. కానీ ఇది చాలా మంచి సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, యువతకు ఆకర్షణీయంగా కనిపించదు. అయితే ప్రపంచం మొత్తం సహజ, సేంద్రియ, పున రుత్పత్తి వ్యవసాయం గురించి మాట్లాడుతున్నందున మంచి రోజులు వచ్చాయి. పశుసంవర్ధక రంగం ఇప్పుడు ఆహార భద్రత నే కాక, పోషకాహార భద్రతగానూ గొప్ప సంభావ్యత కలిగిన చాలా పెద్ద రంగంగా పరిగణించబడుతుంది. ప్రపంచ ఆకలి సూచీలో 121 స్థానాల్లో భారతదేశం 107 స్థానాల్లో ఉన్న నేపథ్యంలో పశు సంపదకు సంబంధించిన ఉత్పత్తులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మాంసం తినే జనాభాలో 70% కంటే ఎక్కువ భారతదేశం. 2050లో 18.1 MT తలసరి మాంసం వినియోగం 13.8 కిలోల అంచనాగా ఉందని NABARD చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల అన్నారు. గోదావరి కట్స్‌లో 25 కిలోల ఎల్లోఫిన్ ట్యూనా అనే అరుదైన చేపలను ప్రదర్శించారు. ఎల్లోఫిన్ ఆరు లేదా ఏడు సంవత్సరాల వరకు జీవించగలదు. ఇవి అధిక వలసలు, పసిఫిక్, అట్లాంటిక్ -హిందూ మహాసముద్రాల అంతటా కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద జీవరాశి అయిన ఎల్లో ఫిష్ ట్యూనా అంతరించిపోతోంది. భారత ప్రభుత్వంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అదనపు డెవలప్మెంట్ కమీషనర్ డి. చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. ''భారతదేశంలో 46 (23 మంది స్థానిక, 23 మంది స్థానికేతర) సూక్ష్మ, చిన్న వ్యాపారవేత్తలు పాల్గొనేందుకు మంత్రిత్వ శాఖ వీలు కల్పించింది. రిటైర్డ్ బ్యూరోక్రాట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయిన డబ్ల్యువిఆర్ రెడ్డి మాట్లాడుతూ మనమందరం చిన్నతనం నుండే పశువులతో ముడిపడి ఉన్నాం. కానీ మన యువత ఇప్పుడు దానిపై ఆసక్తి చూపడం లేదు. యువతను ఆకర్షించేందుకు వీలుగా ఈ రంగాన్ని బ్లూ కాలర్ లాంటి రంగంగా మార్చాలి. మీరు సాంకేతికతపరమైన ఆవిష్కరణలను తీసుకురావాలని ఆయన పిలుపునిచారు.దళిత బంధు లబ్ధిదారులు కూడా అవకాశాలను అన్వేషించడానికి ఎక్స్పోను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎక్స్‌పోలో కంట్రీ చికెన్ వంటి అనేక స్టాల్స్ ఉన్నాయి. దీనిని ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలు సాయికేష్ గౌండ్, మొహమ్మద్ సమీ ఉద్దీన్ స్థాపించారు. ఆధునిక,పరిశుభ్రమైన మాంసం దుకాణాలు అవసరమని చాలా మంది తెలియచేశారు. కూరగాయలకు మంచి, పరిశుభ్రమైన దుకాణాలు ఉన్నప్పటికీ, పరిశుభ్రమైన మాంసం దుకాణాలు ఎక్కువగా కనిపించవు. గడ్డకట్టిన చేపలను కొనడానికి ప్రజలు నిరాకరిస్తారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు అన్నీ క్రమంగా మారుతూ వస్తున్నాయి. అందరూ తమ వ్యాపారాలకి ప్రజలను ఆకర్షించే కొత్త దారులను వెతుకుతున్నారు. -
కొబ్బరికాయ భూగర్భ జలాల జాడను కనిపెట్టగలదా?
మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడే రైతులు తమ పొలాల్లో నీటి జాడలను కనిపెట్టేందుకు జియాలజిస్ట్‌లను పిలిపించలేరు. ఎందుకంటే వారు అంత డబ్బు వెంచ్చించలేరు. పైగా అంత సమయం కూడా ఉండదు. అందుకని రైతులు నీటి జాడలను కనిపెట్టే వారిపై ఆధారపడుతుంటారు. అయితే ఇది శాస్త్రీయమేనా? దీని గురించి సైన్సు ఏం చెబుంతుంది తదితరాల గురించే ఈ కథనం. చాలమంది రైతులు తమ పొలాల్లో బోర్లు వేయడానికి ఫీల్డ్ సర్వేయర్లను పిలుస్తారు. వారు చేతిలో కొబ్బరికాయ, వేప పుల్ల, నీళ్ల చెంబు తదితరాలను ఉపయోగించి నీటి జాడలను చెబుతారు. దీన్నే విశ్వసించి రైతులు వారు చెప్పిన చోట బోర్లు వేయించుకుంటారు. ఇటువంటి పద్ధతులు నిజానికి శాస్త్రీయమా? దీని గురించి రైతులు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏం అంటున్నారంటే.. మూడు పద్ధతుల్లో నీటి జాడను.. తనకు తెలిసిన పద్ధతుల్లో నీటిజాడలను గుర్తిస్తున్న వారిలో సురేందర్ రెడ్డి ఒకరు. ఆయన చిత్తూరు, తిరుపతి జిల్లాలో పలువురు రైతులకు వాటర్ పాయింట్లను ఈ పద్ధతిని అనుసరించే ఏర్పాటు చేశారు. ఆయన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పొలవరానికి చెందిన వారు. సుబ్బారెడ్డి నీటిని కనుగొనడానికి కొబ్బరికాయ లేదా వై ఆకృతిలోని వేప కర్ర లేదా కానుగ కర్ర, వాటర్ బాటిల్‌ని ఉపయోగిస్తారు. కొబ్బరి పీచులు వేళ్ల వైపు ఉండేలా కొబ్బరికాయను అరచేతిలో ఉంచుతారు. పొలంలో అలా చేతిలో కొబ్బరికాయ పెట్టకుని వెళ్తున్నప్పుడూ ఎక్కడ కొబ్బరికాయ నిటారుగా నిలబడితే అక్కడ నీటి జాడ ఉందని నమ్ముతారు. అదికాకపోతే అరచేతిలో వై ఆకారంలో ఉన్న వేప ఆకులతో ముందుకు వెళ్తారు. నీటి జాడ ఉన్న చోట పుల్ల పైకి లేస్తుంది లేదా మరీ ఎక్కువగా ఉంటే గిరిగిర తిరుగుతుంది. అదే నీళ్ల చెంబు పద్ధతి అయితే నీరు ఎక్కడ పక్కకు ఒరిగితే అక్కడ నీళ్లు వస్తాయని సురేందర్ రెడ్డి చెబుతున్నారు. ఇలానే ఎన్నో బోర్లు వేయించానని, ఈ పద్ధతిని తానే సొంతంగా నేర్చుకున్నట్లు తెలిపారు. కొబ్బరికాయను బట్టి నీరు ఎన్ని అడుగుల్లో ఉందో చెప్పేయొచ్చు అని అన్నారు. జియాలజిస్టులు యంత్రాల సాయంతో తనిఖీ చేసినా ఎంత నీరు పడుతుందనేది కచ్చితంగా చెప్పలేరని అన్నారు. తాను నీటి జాడను గుర్తించిన ప్రతి చోటు 99 శాతం విజయవంతమయ్యాయని సురేందర్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు. నీళ్లు ఉన్నప్పుడు ఇన్ని అడుగుల దగ్గర పుల్ల లేస్తుంది అనుకుంటాం. పుల్ల కానీ, టెంకాయ గానీ పైకి లేస్తుంది. రెండు మూడు లైన్లు కలిసే చోట ఎక్కువ తిరుగుతుంది. ఒక లైను పోయే చోట లేచి నిల్చుకుంటుంది. దీంతో ఇక్కడ జంక్షన్ ఉంది. ఏ వైపు ఎక్కువ నీళ్లు వస్తాయని అంచనాకు వస్తాం. మరీ ఫోర్స్‌గా లేస్తే ఎక్కువ నీళ్లు ఉంటాయి. మూడు లేదా నాలుగు అంగుళాలు పడతాయి. ఒక్కో చోట ఒకే లైన్ అయినా కూడా ఎక్కువ నీళ్లు వస్తాయన్నారు సురేందర్ రెడ్డి. శాస్త్రీయ పద్ధతిలోనే కనిపెట్టగలం.. కొబ్బరి వేపపుల్ల, వాటర్ బాటిళ్లతో నీటి జాడలను గుర్తించే పద్ధతులను అశాస్త్రీయమైనవని తిరుపతికి చెందిన జియాలజిస్టు, భూగర్భ జల మైనింగ్ కన్సల్టెంట్ సుబ్బారెడ్డి చెబుతున్నారు. టెంకాయ కాకుండా ఉత్తరేణిపుల్ల, వేప పుల్ల, రేగి చెట్టు పుల్ల, లాంటి వాటితో కూడా నీటిజాడలను గుర్తిస్తారు. వీటిని అశాస్త్రీయమైనవిగా పరిగణించాలన్నారు. అంతేగాదు కొందరి చేతుల్లో నీటి రేఖ ఉందని, తమ కలలో దేవుడు కనిపించి చెప్పాడని అంటుంటారు కానీ అవన్నీ సరైన పద్ధతులు కావని తేల్చి చెప్పారు. కేవలం శాస్త్రీయ పద్ధతుల్లోనే నీటి జాడను కచ్చితంగా కనిపెట్టగలమని చెప్పారు. నీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పుడూ ఏ పద్ధతిలోనైనా నీరు పడుతుంది. ఛాలెంజింగ్ ఏరియాల్లో..వెయ్యి అడుగులు బోరు వేసినా పడని ప్రాంతాలు ఉన్నాయి. అలాంటి చోట్ల ఈ పద్ధతులు విఫలమయ్యే అవకాశం ఉందని సుబ్బారెడ్డి అన్నారు. అలాంటి చోట భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు బోర్లు వేసి డబ్బులు వృథా చేసుకొవద్దని రైతులకు సూచిస్తామని చెప్పారు. శాస్త్రీయ పద్ధతుల్లో కచ్చితత్వం.. భూగర్భంలో నీటి జాడలను కనిపెట్టడంలో శాస్త్రీయ పద్ధతులు సమర్థవంతంగా పనిచేస్తాయని సుబ్బారెడ్డి చెబుతున్నారు. భూగర్భ జలాల జాడను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నా శాస్త్రీయ పద్ధతుల్లో ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ సర్వే ఒకటి అని సుబ్బారెడ్డి చెబుతున్నారు. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మీటర్ ద్వారా పరిశీలిస్తే..భూమి పొరలుగా ఉన్నట్లు కనిపిస్తుంది. రాళ్లు మట్టి కలిసి ఉంటాయి. భూమి పొరల రెసిస్టివిటీని అంచనావేసి నీటి జాడను నిర్థారిస్తాం అని సుబ్బారెడ్డి తెలిపారు. పూర్వీకుల నుంచే నీటి జాడలు కనిపెట్టే ప్రయత్నాలు జరిగాయని చెబుతున్నారు. భూమి భౌగోళిక లక్షణాల ప్రకారం కొందరూ నీటి జాడను అంచనా వేయగలరని చెప్పారు. వరహ మిహరుడు గ్రంథంలో నీటి అన్వేషణ.. భూగర్భ జల వనరులను ఎలా గుర్తించాలో వరాహ మిహిరుడు ఒక గ్రంథాన్ని రాశాడు. నీటి అన్వేషణ కోసం చెప్పిన టెక్నిక్‌లో బయో ఇండికేటర్లు గురించి కూడా ప్రస్తావించారు. నీరు ఉన్నచోట ఉడగ, రెల్ల, మద్ది, తంగేడు వంటి చెట్లు గుంపులుగా ఉంటాయని పూర్వీకులు ప్రగాఢంగా నమ్మేవారు. దీన్ని ఆధారం చేసుకునే భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు సైతం నీరు పడే అవకాశాలను చెబుతారని అన్నారు. నీటి కుంటలు ఉండే చోట కూడా నీరు పడుతుందని నిరూపితమైంది. జియాలజిస్ట్‌లు సైంటిఫిక్ పద్ధతుల తోపాటు వీటిని కూడా పరిగణలోని తీసుకుంటారని చెప్పారు. ఇక్కడ అనుభవం కీలకం... చిత్తూరు జిల్లాలో ఒక ప్రాంతంలో బోర్ పాయింట్‌ని గుర్తించాలంటే.. జిల్లాలో ఎంత లోతులో నీరు పడుతుందో, ఏ వైపు సర్వే చేస్తే బాగుంటుందో అవగాహన ఉండాలి. నేను పది సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టి, అది నాకు సులభం. అదే కొత్త ప్రాంతమైతే.. అక్కడి జియాలజిస్ట్ కమాండింగ్ చేస్తున్నాడు. అక్కడ నాకంటే ఆయనే ఎక్కువ విజయాలు సాధిస్తారు అని సుబ్బారెడ్డి అన్నారు. కొన్నిసార్లు ఆయా ప్రాంతాల్లో ఏపుగా పెరిగిన వేప చెట్లను కూడా పరిగణలోనికి తీసుకుని చెబుతారు. దీన్ని జీవ సూచికగా పరిగణిస్తారు. “వేప చెట్టు ఆరోగ్యంగా ఉండి, దాని కొమ్మలు మరియు ఆకులు ఒక వైపుకు వంగి ఉంటే... అటువంటి ప్రాంతాల్లో ఎక్కడో ఒక నీటి కాలువ ఉందని సూచిస్తుంది. అటువంటి ప్రాంతంలో పరికరాలు ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ముఖ్యం. ఇది ఆ ప్రాంతంలోని జియాలజిస్ట్ పరిజ్ఞానం, అనుభవంపై ఆధారపడి ఉంటుంది, ”అని సుబ్బారెడ్డి చెబుతున్నారు. కొన్నిసార్లు రాతి నిర్మాణాలు చాలా సవాలుగా ఉంటాయని, అలాంటి చోట భూగర్భ శాస్త్రవేత్తలు మాత్రమే నీటి వనరులను గుర్తించగలరని ఆయన అన్నారు. భూగర్భ జలాలను గుర్తించే సాంకేతికత 1910 నుంచి అభివృద్ధి చెందుతోందని, విమానంలో ప్రయాణిస్తూ కూడా నీటి జాడలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి సర్వేలు అందుబాటులో ఉన్నాయని సుబ్బారెడ్డి చెబుతున్నారు. (చదవండి: 130 వేల ఏళ్ల నుంచే మానవుల ఉనికి! వెలుగులోకి విస్తుపోయే విషయాలు!) -
‘బ్రౌన్’ హంగామా!
సాక్షి, విశాఖపట్నం: మత్స్యకారుల వలకు రొయ్యలు ఆశాజనకంగా చిక్కుతున్నాయి. వీటిలో బ్రౌన్ రకం రొయ్యలు అధికంగా ఉంటున్నాయి. గతేడాది కంటే ఇటీవల రొయ్యల లభ్యత బాగుండడంతో మత్స్యకారుల మోములు వికసిస్తున్నాయి. మత్స్యకారులు సాధారణంగా 10–15 రోజుల పాటు రొయ్యల వేట సాగిస్తుంటారు. రొయ్యల కోసం బోటులో సముద్రంలో దూరంగా వెళ్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో దూరంగా వెళ్లాల్సిన అవసరం లేకుండానే రొయ్యలు లభ్యమవుతున్నాయి. దీంతో నాలుగైదు రోజులకే ఒక్కో బోటుకు అర టన్ను నుంచి టన్ను వరకు దొరుకుతున్నాయి. దీంతో వేట సమయాన్ని నాలుగైదు రోజులకే కుదించుకుని హార్బర్‌కు చేరుకుంటున్నారు. దీనివల్ల రొయ్యలు తాజాగా ఉంటూ మంచి ధర కూడా లభిస్తోంది. అదే పది రోజులకు పైగా వేట కొనసాగిస్తే వలకు చిక్కిన రొయ్యలను ఐస్‌లో రోజుల తరబడి బోట్లలోనే నిల్వ ఉంచాల్సి వస్తోంది. దీనివల్ల రొయ్యల రంగు మారిపోయి, తాజాదనం కోల్పోయి తక్కువ ధర పలుకుతోంది. ఇది మత్స్యకారులకు లాభదాయకంగా ఉండడం లేదు. ఈ నేపథ్యంలో రొయ్యలు పుష్కలంగా లభిస్తున్నందున తక్కువ రోజుల వేటకే మొగ్గు చూపుతున్నారు. విరివిగా బ్రౌన్ రొయ్యలు కొన్నాళ్లుగా లభిస్తున్న రొయ్యల్లో బ్రౌన్ రకం రొయ్యలే అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుతం వీటికి కిలో రూ.350 ధర పలుకుతోంది. ఎగుమతి చేసే రొయ్యల తలలు తీసివేస్తారు. వీటిని హెడ్‌లెస్ ష్రింప్గా పేర్కొంటారు. వీటికి కిలోపై రూ.100 వరకు ధర అధికంగా ఉంటుంది. గత సంవత్సరం ఈ సీజనులో వీటి ధర ఒకింత బాగున్నా తక్కువగా లభ్యమయ్యేవి. కానీ ఈ సీజనులో ఇవి విరివిగా దొరుకుతుండడంతో ఊరటనిస్తోందని మత్స్యకారులు చెబుతున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో రొయ్యలు, చేపలను బాస్కెట్ల లెక్కన కొనుగోలు చేస్తుంటారు. రొయ్యల్లో టైగర్, ఫ్లవర్, గోల్డ్/వైట్, బ్రౌన్/పింక్ తదితర రకాలుంటాయి. ప్రస్తుతం కిలో టైగర్ రొయ్యలు రూ.1,100, ఫ్లవర్ రకం రూ.500, గోల్డ్/వైట్ రూ.300, బ్రౌన్ రకం రూ.350 చొప్పున ధర పలుకుతోంది. రొయ్యల కొనుగోలుదారులు, ఎగుమతిదారులు ఆశించినంతగా వీటిని కొనుగోలు చేయకపోయినా స్థానికంగానే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో 70 శాతానికి పైగా బోట్లు సమీపంలోనే రొయ్యల వేట సాగిస్తున్నారని, దీంతో నాలుగైదు రోజులకే తీరానికి చేరుకుంటున్నారని వైశాఖి డాల్ఫిన్ బోట్ ఆపరేటర్ల సంక్షేమ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సూరాడ సత్తిబాబు ‘సాక్షి’కి చెప్పారు. దీనివల్ల రొయ్యలు తాజాగా ఉండడంతో స్థానికంగా విక్రయాలు బాగా జరుగుతున్నాయని తెలిపారు. -
Papaya Farming: బొప్పాయి.. ఇలా పండిస్తే లక్షల్లో లాభాలు, ఫుల్ డిమాండ్
సంప్రదాయ పంటలతో విసిగిన రైతన్న ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. విటమిన్ ఏ సమృద్ధిగా ఉండే పండ్లలో బొప్పాయి ఒకటి. బొప్పాయి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లో గిరాకీ ఉన్న బొప్పాయి పంటను సాగు చేసేందుకు బాపట్ల జిల్లాలో రైతులు మొగ్గుచూపుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతికూల పరిస్థితులను అధిగమించి బొప్పాయి పంటను జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తూ లాభాల బాటలో నడుస్తున్నారు బొప్పాయి రైతులు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించి బొప్పాయిని సాగు చేసుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చని తద్వారా రైతులకు లాభాలు వస్తాయని ఉద్యానశాఖ అధికారిణి దీప్తి పేర్కొన్నారు. 324 ఎకరాల్లో బొప్పాయి సాగు జిల్లాలోని కొల్లూరు మండలంలో 9.02, భట్టిప్రోలులో 18.23, సంతమాగులూరులో 155.74, బల్లికురవ 45.54, మార్టూరు 12.85, యద్దనపూడి 11.79, జే.పంగులూరు 21.93, అద్దంకి 32.18, కొ రిశపాడు 16.74 ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తున్నారు. రెండు సంవత్సరాల పంటకాలంలో ఎకరాకు 90 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. పెట్టుబడి ఖర్చుపోను నికరంగా రూ.2లక్షల వరకు ఆదాయం రావడంతో జిల్లా రైతులు బొప్పాయి సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే గతంలో నామమాత్రంగా సాగు చేపట్టిన బొప్పాయి ఈ ఏడాది అత్యధికంగా 324 ఎకరాలకు పైగా సాగు చేపట్టారు. బొప్పాయి సాగులో రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టడం వలన పండిన పంట ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కాయలకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని రైతులు చెప్తున్నారు. అనుకూలమైన రకాలతో మంచి దిగుబడి జిల్లాలో సాగు చేపట్టాలనుకునే రైతులు రెడ్ లేడీ, వాషింగ్టన్, కో 1,2,3 రకాలు అనువైనవి. బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత ట్రైకోడెర్మావిరిడితో విత్తనశుద్ధి చేసుకోవాలి. మొక్కలు నాటే సమయంలో గుంతల్లో ప్రతి గుంతకూ 20 కిలోల పశువుల ఎరువు, 20 గ్రాముల అజోప్పైరిల్లమ్, 20 గ్రాముల ఫాస్ఫోబాక్టీరియా, 40 గ్రా ముల మైకోరైజాను బాగా కలుపుకొని వేసుకోవాలి. నాటే సమయం జూన్, జులై, అక్టోబర్, నవంబర్ మాసాల్లో నాటుకోవచ్చు. 40 నుంచి 60 రోజుల వయస్సున్న 15 సెంటీమీటర్ల పొడవు గల మొక్కలను సాయంత్రం సమయంలో నాటుకోవాలి. ఎరువుల యాజమాన్యం ప్రతి మొక్కకూ రెండు కిలోల నాడెప్ కంపోస్టు, ఒక కిలో వేపపిండి, అర కిలో ఘనజీవామృతం వేసుకొని మొక్కలను నాటుకోవాలి. తరువాత ప్రతి 20 రోజులకు ఒకసారి ద్రవ జీవామృతాన్ని పారించుకోవాలి. మొక్కలపై ప్రతి 15 రోజుల కొకసారి పంచగవ్యను పిచికారీ చేసుకోవాలి. ప్రతి 25 రోజులకు ఒకసారి శొంఠి పాల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. బొప్పాయిలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక లాభాలు సాధించవచ్చు. ప్రకృతి సాగు చేయడం వలన కాయలు బరువుగా నాణ్యత కలిగి ఉంటాయి. వేసవిలో కూడా బెట్టకు రాకుండా అధిక దిగుబడులు వస్తాయి. అలాగే పండుగ సమయాల్లో టన్ను రూ.22 వేల వరకు పలుకుతుంది. మార్కెట్లో కిలో బొప్పాయి రూ.90 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్ లేని సమయంలో కూడా టన్ను రూ.10 నుంచి 15 వేలు ధర పలుకుతుంది. – దీప్తి, ఉద్యానశాఖ అధికారిణి -
ప్రకతి వ్యవసాయం.. ఏటీఎం మోడల్‌తో ప్రతి నెల రూ.25వేల వరకు లాభాలు
‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయం నిజంగానే‘ రైతును రాజు’ గా మార్చుతుందంటున్నారు ఏపీ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్–చైర్మన్, ఎక్స్అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ టి. విజయకుమార్. ప్రపంచవ్యాప్తంగా రసాయనాల్లేకుండా జరుగుతున్న సాగు 1% కాగా, ఏపీలో 14% కావటం విశేషం. ఏటీఎం మోడల్లో 20 సెంట్లలో అనేక రకాల కూరగాయలు, పండ్లు సాగు చేస్తూ ప్రతి నెలా కనీసం రూ. 10–25 వేలు ఆదాయం పొందే మార్గం ఉంది. చిన్న, సన్నకారు రైతులకే కాదు, భూమిలేని వ్యవసాయ కార్మికులకూ ఇది వరం లాంటిదని ఆయన అంటున్నారు.. ప్రత్యేక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. సాక్షి సాగుబడి: ఆంధ్రప్రదేశ్‌లో తామర తంపరగా విస్తరిస్తున్న ప్రకృతి వ్యవసాయం విశేషాలు..? విజయకుమార్: ఏపీలో ప్రకృతి వ్యవసాయం ప్రభుత్వ సహకారం, మహిళా సంఘాల తోడ్పాటుతో విస్తృతంగా అమలవుతోంది. 2023 మార్చి నాటికి 3,800 గ్రామ పంచాయతీలు, 3 వేల రైతు భరోసా కేంద్రాల్లో విస్తరించింది. 8.5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలో పాల్గొంటున్నారు. అంటే, ఎన్రోల్ అయ్యారు. వీరిలో 2,70,000 మంది రైతులు పూర్తిగా రసాయనాలు వాడటం మానుకున్నారు. రైతుల ఎన్రోల్మెంట్ దృష్ట్యా మన దేశంలోనే ఇది అతిపెద్ద కార్యక్రమం. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలో పాల్గొనటం మరే దేశంలోనూ జరగటం లేదు. ప్రకృతి వ్యవసాయ వ్యాప్తి క్రమంగా జరిగే పని. ఒక రైతుకు రెండెకరాలు ఉంటే.. ముందు అరెకరంలో ప్రయత్నిస్తారు. ఏ రైతూ రిస్క్ తీసుకోరు. అరెకరాలో సక్సెస్ సాధిస్తే.. తర్వాత సంవత్సరం విస్తీర్ణం పెంచుతారు. ఎంత ఖర్చయ్యింది, ఎంత దిగుబడి వచ్చింది, నికరాదాయం ఎంత వచ్చింది, భూమిలో మార్పేమి వచ్చింది.. ఇవీన్న చూసుకొని విస్తీర్ణాన్ని పెంచుకుంటారు. సగటున మా అనుభవంలో రైతులు ప్రకృతి వ్యవసాయంలో అన్ని విషయాలు అనుభవపూర్వకంగా అలవాటు చేసుకోవడానికి 4 ఏళ్లు పడుతుంది. అందుకని ఆ నాలుగేళ్లు ప్రభుత్వం తరఫున మేం వారికి మద్దతుగా నిలుస్తున్నాం. ఈ విధంగా 2,70,000 మంది రైతులు దాదాపు 1,40,000 హెక్టార్లలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ►ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఏడాది 3 జైవిక్ ఇండియా పురస్కారాలు వచ్చాయి. వీటితో పాటు.. వ్యక్తిగతంగా మీకు ‘డా. ఎమ్మెస్ స్వామినాధన్ ప్రకృతి పరిరక్షణ పురస్కారం’ లభించిన శుభ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు... జైవిక్ ఇండియా పురస్కారాల ప్రాధాన్యం ఏమిటి? అంతర్జాతీయంగా ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించే సంస్థ ‘ఐఫోమ్’ ఈ జైవిక్ ఇండియా పురస్కారాలు ఇస్తుంటుంది. ఐఫోమ్కు ఐక్యరాజ్యసమితికి చెందిన ఎఫ్.ఎ.ఓ., తదితర సంస్థలతో సన్నిహిత సంబంధాలుంటాయి. ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహం, సాధించిన ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వానికి 2023లో ఉత్తమ రాష్ట్ర పురస్కారం ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళా రైతుకు, ఎఫ్‌పిఓకు కూడా ఇచ్చారు. ప్రభుత్వప్రోత్సాహం ఎలా ఉంది..? ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించటంలో ఏపీ ప్రభుత్వానికి చాలా ప్రత్యేకతలున్నాయి. రైతు భరోసా కేంద్రాలన్నిటి పరిధిలోనూ ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇప్పుడు 28% రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లోనూ ఈ కార్యక్రమం అమల్లో ఉంది. మున్ముందు గ్రామాలన్నిటికీ విస్తరించాలన్నది లక్ష్యం. ఏపీలో ప్రకృతి వ్యవసాయానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖనే సీఎం ఏర్పాటు చేయటం విశేషం. దీంతో మంచి ఊ΄÷చ్చింది. ప్రకృతి వ్యవసాయ విస్తరణలో మహిళా స్వయం సహాయక సంఘాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఏమిటి..? రీజనరేటివ్ అగ్రికల్చర్ అనండి, ఆర్గానిక్ అగ్రికల్చర్ అనండి.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నా ఇప్పటికీ చేస్తున్నది 1% మంది రైతులు మాత్రమే. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14% మంది రైతులు ఎంతో కొంత విస్తీర్ణంలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. తమకున్న పొలం మొత్తంలో పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు 5% ఉన్నారు. అందుకే ప్రపంచంలో ఏపీ అనుభవం ఎంతో విశిష్టమైనది. రైతులతో రసాయనాలు వాడే అలవాటు మాన్పించడం చాలా కష్టం. బలంగా ఉన్న మహిళా సంఘాల వ్యవస్థ ఇందులో పాల్గొనటం వల్ల రైతులకు క్షేత్రస్థాయిలో నైతిక మద్దతు ఇవ్వటం సాధ్యమైంది. ఈ సామాజిక తోడ్పాటు ఎంతో ఉపయోగపడుతోంది. సేద్యంలోనే కాదు, వైవిధ్యపూరితమైన ప్రకృతి పంటల దిగుబడులు కుటుంబాల ఆరోగ్యానికి చాలా అవసరమని మహిళలు గుర్తించటం కూడా ఇది వ్యాప్తి చెందడానికి ఉపయోగకరంగా ఉంది. ఏయే పంటల్లో అధిక దిగుబడి..? మా అనుభవంలో అన్ని పంటల్లోనూ ఫలితాలు బాగా వస్తున్నాయి. ఖర్చు తగ్గించడం, దిగుబడి పెంచటం, ఎక్కువ వర్షాలు పడినా/ వర్షాభావ పరిస్థితులొచ్చినా పంట తట్టుకునే శక్తి, చీడపీడలను తట్టుకునే శక్తి.. చాలా పంటల్లో అనుకున్న దానికన్నా దిగుబడులు రాబట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో రాగి పంట దిగుబడి ఎకరానికి వచ్చే దిగుబడి 400–600 కిలోల నుంచి 1200–1800 కేజీలకు పెరిగింది. ఖర్చు సగానికి సగం తగ్గింది. వరిలోనూ అంతర పంటలపై ప్రయోగాలు చేస్తున్నాం. గట్ల వెడల్పును పెంచి కూరగాయలు, పండ్ల మొక్కలు సాగు చేయమని.. పంటల వైవిధ్యం పెంచడానికి.. రైతులకు సలహా ఇచ్చాం. పవన్ సుఖదేవ్ అధ్యయనం గురించి..? పవన్ సుఖదేవ్ అంతర్జాతీయంగా పేరున్న పర్యావరణవేత్త. పర్యావరణంలో నోబెల్ వంటి టేలర్ అవార్డు గ్రహీత. వీరి జిస్ట్ సంస్థ స్వతంత్రంగా జరిపిన అధ్యయనంలో 11% అధిక దిగుబడి, 54% అధిక నికరాదాయం, పంటల వైవిధ్యం రెండింతలు పెరిగిందని వెల్లడైంది. మార్కెటింగ్‌లోకి అమూల్ ప్రవేశిస్తోందట..? అవును. ఏపీలో 80% విస్తీర్ణంలో పత్తి సహా 8 రకాల ఆహార పంటలు ప్రధానంగా సాగవుతున్నాయి. ఇప్పటికే టీటీడీ 12 రకాల ఆహారోత్పత్తుల్ని కొనుగోలు చేస్తోంది. బియ్యం, పప్పులు, వేరుశనగలు తదితరాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి అమూల్‌తో ఒప్పందం చేసుకోబోతున్నాం. మండల స్థాయిలో ప్రాసెసింగ్ సదుపాయాలు కూడా వస్తాయి. ఇది మార్కెటింగ్‌లో పెద్ద ముందడుగు అవుతుంది. ఏటీఎం మోడల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు ఎలా..? అవునండి.. నిజం. ప్రకృతి వ్యవసాయ విధానాలను సక్రమంగా అమలు చేస్తే రైతే రాజని రుజువు చేయొచ్చు. అది నిజంగా జరుగుతుంది. రైతులకు సంవత్సరానికి ఆదాయం ఒక్కసారే ఎందుకు రావాలి? ప్రతి రోజూ రావాలి.. ప్రతి వారం రావాలి.. అందుకు ఏటీఎం మోడల్ ఉపయోగపడుతుంది. అనంతపురం జిల్లాలో ఈ నమూనా తొలుత ప్రయత్నించి సత్ఫలితాలు సాధించాం. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాలకూ విస్తరింపజేస్తున్నాం. 85%గా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు, భూమి లేని వ్యవసాయ కార్మికులకు పెరటి తోటలు/ ఇంటి పంటలుగా సాగుకు కూడా ఏటీఎం మోడల్ ఒక వరం లాంటిది. 20 సెంట్లను కౌలుకు తీసుకొనైనా సాగు చేస్తే.. ప్రతినెలా ప్రతి రైతూ రూ.10,000 నుంచి 25,000 సంపాదించే అవకాశం ఉందని మా అంచనా. -
మొక్క పైనే పిచికారీ చేసే రోబో!
పంటలపై చీడపీడీలను అదుపు చేయడానికి పొలాల్లో విష రసాయనిక పురుగుమందులను పిచికారీ చేస్తుంటాం. అయితే, డ్రోన్ల ద్వారా చల్లినా, స్ప్రేయర్లతో చల్లినా.. పంట మొక్కలపైనే కాకుండా పొలం అంతటా నేలపైన కూడా పురుగుమందు పడుతూ ఉంటుంది. దీని వల్ల పురుగుమందు వృథా అవ్వటమే కాకుండా, భూసారం కూడా నాశనమవుతుంది. ఈ సమస్యలకు బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ నైకో రోబోటిక్స్ చక్కటి పరిష్కారం కనుగొంది. మొక్కలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి, వాటిపైన మాత్రమే పురుగుమందును పిచికారీ చేసే అధునాతన రోబోను రూపొందించింది. కృత్రిమ మేధతో నడిచే ఈ స్పాట్ స్ప్రేయర్ రోబోలపై ఆ సంస్థ పేటెంట్ కూడా పొందింది. తమిళనాడులో పుట్టిన జైసింహ అమెరికాలో బీటెక్ ఈసీఈ చదివి కువైట్‌లో ఏడేళ్లు పనిచేసి, స్వదేశానికి వచ్చేశారు. పిచికారీ పద్ధతులను ఆధునీకరిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని భావించి బెంగళూరు కేంద్రంగా 2015లో నైకో రోబోటిక్స్‌ను నెలకొల్పారు. ఈ రోబో ఎలా పనిచేస్తుందంటే..? ఈ రోబో ప్రత్యేకతలు ఏమిటంటే.. దీనికి 5 మీటర్ల పొడవైన రెక్కలు రెండు వైపులా ఉంటాయి. ఏకకాలంలో పది మీటర్ల వెడల్పున ఇది పిచికారీ చేయగలదు. ఈ రెక్కలకు కృత్రిమ మేధతో కూడిన కళ్లను అమర్చారు. ఈ కళ్లు మొక్కలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తిస్తాయి. మొక్కలు ఉన్న చోట రోబో రెక్కకు ఉన్న నాజిళ్లు తెరచుకొని పురుగుమందును పిచికారీ చేస్తాయి. మొక్క లేకుండా ఖాళీ నేల ఉన్న చోట రోబో రెక్కలకు ఉన్న నాజిళ్లు తెరచుకోవు. కాబట్టి అక్కడ పురుగుమందు పడదు. 60% పురుగుమందు ఆదా ఈ రోబోతో పిచాకారీ చేస్తే.. 60% పురుగుమందు ఆదా కావటంతో పాటు.. భూ/వాయు కాలుష్యం కూడా ఆ మేరకు తగ్గుతుందని సంస్థ చెబుతోంది. గత ఏడాది నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పత్తి, సోయాబీన్స్, మిర్చి వంటి పంట పొలాల్లో పురుగుమందులు చల్లుతున్న ఈ ఏఐ రోబోలు అక్కడి రైతుల మనసులు చూరగొన్నాయని చెబుతున్నారు. ఎకరానికి రూ.350ల చొప్పున అద్దె చెల్లించి రైతులు తమ పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేయించుకుంటున్నారు. అకోలాకు చెందిన పత్తి, సోయా రైతు యోగేశ్ రౌత్ తన 30 ఎకరాల్లో ఈ రోబో ద్వారా పురుగుమందులు పిచికారీ చేయించుకున్నారు. కూలీలతో పిచికారీ చేయిస్తే ఎకరానికి రూ.1200 ఖర్చయ్యేదని, ఈ రోబో ఉపయోగకరంగా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే 500 మంది రైతులు లక్ష ఎకరాల్లో అద్దె రోబోలు పిచికారీ చేశాయట. పురుగుమందులనే కాదు ద్రవరూప ఎరువులు, సేంద్రియ ద్రావణాల పిచికారీకి కూడా ఈ రోబోలు ఉపయోగకరమే. (చదవండి: జీ20 సదస్సుకు ఇద్దరు గిరిజన మహిళలు..ఆ కారణంగానే ఆహ్వానం)