Sagubadi
-
జీ20 సదస్సుకు ఇద్దరు గిరిజన మహిళలు..ఆ కారణంగానే ఆహ్వానం
దేశాధినేతలు, పలువురు అధికారుల హాజరయ్యే జీ20 శిఖరాగ్ర సదస్సుకు సామాన్య గిరిజన మహిళలకు ఆహ్వానం లభించింది. గిట్టుబాటు ధరలేక, సకాలంలో వర్షాలు పడక తదితర కారణాల రీత్యా వ్యవసాయాన్ని వదిలేస్తున్న ఈ తరుణంలో సంప్రదాయరీతిలో తృణధాన్యాలను పండించి చూపించారు. ఎందరో రైతులకు మార్గం చూపించారు. వారి విజయగాథను జీ20లో వినిపించేందకు ఈ ఇద్దరికి ఆహ్వానించారు. వ్యవసాయరంగానికి సంబంధించిన ప్రదర్శనలో భారత్ తరుఫున ఒడిశా నుంచి ఈ ఇద్దరు మహిళలు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఇద్దరు సంప్రదాయ పద్ధతిలో తృణధాన్యాల సాగు గురించి ఆ సదస్సులో పాల్గొనే ప్రపంచనాయకులకు వివరిస్తారు. వాటి ప్రయోజనాలు, పోషక విలువలు గురించి కూడా వివరిస్తారు. ఇంతకీ అసలు ఈ ఇద్దరు మహిళలు ఎవరు?వారి విజయ గాథ ఏంటంటే.. రాయిమతి ఘివురియా కోరాపుట్ జిల్లాలోని కుంద్ర బ్లాక్‌కి చెందని రాయిమితి ఘివురియా 124 రకాల తృణధాన్యాలను భద్రపరిచారు. ప్రపంచ స్థాయి శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యి..తాను ఈ రంగంలో ఎలా విజయం సాధించిందో వివరించేందుకు జైపూర్‌లోని ఎంఎస్ స్వామినాథన్ పరిశోధనా కేంద్రం నుంచి శిక్షణ తీసుకుంది. ఆమె దాదాపు 72 రకాల దేశీ వరి వంగడాలను, ఆరు రకాల వివిధ తృణధాన్యాలను సంరక్షించి విజయవంతమైన మహిళగా నిరూపించుకుంది. సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ.. దాదాపు 2500 రైతులను ఈ వ్యవసాయంలోకి తీసుకొచ్చారు. ఈ వ్యవసాయంపై రైతులకు శిక్షణ ఇవ్వడం కోసం 2012లో తన భూమిలోనే అగ్రికల్చర్ స్కూల్‌ని కూడా ప్రారంభించారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఆమె చేసిన కృషికిగానూ ఆమెకు ఎన్నో సత్కారాలు, అవార్డులు వచ్చాయి. ఇప్పుడూ ఈ ప్రతిష్టాత్మక జీ20 సదస్సుకు ఆమెకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు మహిళా రైతు రాయిమితి ఘివురియా మాట్లాడుతూ..ఈ సదస్సులో పాల్గొనే అదృష్టం రావడం చాలా సంతోషంగా ఉంది. సేంద్రియ వ్యవసాయం దాని ప్రయోజనాలు గురించి వివరిస్తాను. గిరిజన మహిళగా ఈ శిఖరాగ్ర సమావేశంలో భాగం కావడం చాలా సంతోషం ఉందన్నారు రాయిమతి మరో మహిళా రైతు సుబాస మెహనత మయూర్భంజ్ జిల్లాలోని జాషిపూర్ బ్లాక్ పరిధిలోని గోయిలీ గ్రామంలో నివసించే సుబాస మోహనత కూడా ఆదివాసీ తెగకు చెందిన నిరుపేద మహిళ. ఒకప్పుడూ ఆమె గ్రామంలో వరి సాగు చేసేవారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల, ఇతర కారణాల వల్ల ఆ పంటలో విపరీతమైన నష్టాలను చూశారు అక్కడి ప్రజలు. ఇక వ్యవసాయ రంగాన్ని వదిలేద్దాం అనుకున్న సమయంలో ఒడిశా ప్రభుత్వం మిల్లెట్ మిషన్ తీసుకొచ్చింది. చాలమంది మిల్లెట్ సేద్యం పట్ల ఆసక్తి కనబర్చ లేదు అయినప్పటికి సుబాస వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వం ఇచ్చిన మిల్లెట్ మిషన్ పథకంలో పాల్గొని తృణధాన్యాలను పండించి ఇతర మహిళలకు ఆదర్శవంతంగా నిలిచేలా విజయం సాధించింది. 2018 నుంచి తృణ ధాన్యాలను సేంద్రియ పద్ధతుల్లో పండించడం ప్రారంభించారు. మంచి లాభాలు వచ్చాయి ఇక అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. ఆమె ఎకరం భూమిలో 250 గ్రాముల రాగులను విత్తించి, ఎనిమిది క్వింటాళ్లను పండించింది. అంతేగాదు ఆమె 2023 కల్లా ఆమె ఎనిమిది ఎకరాల భూమిని లీజుకు తీసుకుని 60 క్వింటాళ్ల రాగులను పండించాలని భావిస్తోంది. ఈ ఏడాది మార్చిలో తృణధాన్యాలపై జరిగిన ప్రపంచ సదస్సులో మొహంత కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రధాని మోదీతో ఆమె కొంతసేపు మాట్లాడే అరుదైన అవకాశం వచ్చింది. తాజాగా జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వనం వచ్చింది. కాగా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి ఈ ఏడాదిని అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో జీ-20 సదస్సులో మిల్లెట్స్‌కు ప్రాధాన్యం కల్పించడంతో అందులో విజయవంతమైన ఈ గిరిజన మహిళా రైతులిద్దర్నీ ఆహ్వానించారు. (చదవండి: ఎడారి ప్రాంతంలో సాగు...‘జాయ్’ఫుల్‌గా కరువుకు చెక్!) -
బొప్పాయిలో వైరస్ తెగుళ్లు.. నివారణ లేకపోతే నష్టమే
బొప్పాయి పంటను వైరస్ తెగుళ్లు ఆశించి రైతులు నష్టపోతున్నారు. ఆ తెగుళ్ల బారినపడి పంట దెబ్బతినకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి సీనియర్ ఉద్యాన శాస్త్రవేత్త శ్రీకృష్ణ రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు. వెర్రి తెగుళ్లు మొజాయిక్, రింగ్‌స్పాట్(ఉంగరాల) తెగులు, ఆకుముడత(క్రింకిల్) అనే మూడు రకాల వెర్రి తెగుళ్లు బొప్పాయి పంటను నాశనం చేసి దిగుబడులను గణనీయంగా తగ్గించడమే కాక పండు నాణ్యతను బాగా దెబ్బతీసి విపరీత నష్టాన్ని కలిగించడంతో పాటు కొన్ని సందర్భాల్లో చెట్లు కాపునకు రాకుండా గొడ్డు చెట్టుగా మారడం జరుగుతుంది. ఈ మహమ్మారి వెర్రి తెగుళ్లను తొలి దశ నుంచే యాజమాన్య పద్ధతులతో అరికట్టాలి. వెర్రి తెగులు తాలుకు వైరస్ కణాలు ఒకమారు మొక్కలో ప్రవేశిస్తే మొక్క క్షీణించే వరకు దాని జీవకణాలలోనే ఉండి రకరకాలుగా లక్షణాలు కలిగించి అనర్ధాలకు దారితీస్తుంది. మొజాయిక్ తెగులు మొజాయిక్ తెగులు ఆశిస్తే ఆకు సైజు తగ్గుతుంది. ఆకులపై అక్కడక్కడ పసుపు రంగు మచ్చలు ఈనెలు లేకుండా ఏర్పడతాయి. దూరం నుంచి ఆకులు పసుపు రంగుకు మారినట్లు కన్పిస్తాయి. అందుకే దీనిని పల్లాకు తెగులని కూడా అంటారు. తెగులు సోకిన ఆకులు పెళుసుగా మారతాయి. చెట్ల పెరుగుదల తగ్గి ఎదుగుదల ఉండదు. పంట దిగుబడి నాణ్యత గణనీయంగా తగ్గుతుంది. కాయలు గిడసబారి నాసిగా ఉంటాయి. విత్తనం మరియు పేనుబంక ద్వారా తెగులు వ్యాపిస్తుంది. ఉంగరాల(రింగ్‌స్పాట్) తెగులు ఈ తెగులు లక్షణాలు ఆకులు, కాడ, కాండం, పూత, పిందె, కాయ, పండ్లపై ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. లేత ఆకులు పచ్చదనం కోల్పోయి పసుపు పచ్చగా మారతాయి. ఆకుల ఈనెలు వంగి ముడుచుకుపోతాయి. దీంతో ఆకుల పరిమాణం తగ్గి సరైన మోతాదులో ఆహారాన్ని తయారు చేసుకోలేవు. కాండం పైభాగాన ఆకు తొడిమలపై ముదురాకు పచ్చని మచ్చలు, చారలు నూనె రాసినట్లు కన్పిస్తాయి. తెగులు తీవ్ర దశలో ఒక దానితో ఒకటి కలిసి మొక్క ఎదుగుదల తగ్గుతుంది. పూత, పిందె, కాయ, పండుపై గోధుమ రంగుతో ఉంగరాల్లాంటి రింగులు ఏర్పడతాయి. వీటి మధ్యభాగం ఆకుపచ్చగా ఉంటుంది. ఒక్కో పండుపై వీటి సంఖ్య వందల్లో ఉంటాయి. తెగులు సోకిన చెట్టు పూలు అంతగా పిందె కట్టవు. పిందెలు ఎదగవు. రింగులున్న కాయలు తొందరగా పండి మెత్తబడి నీరుకారుతాయి. నాణ్యత లోపిస్తుంది. దూరప్రాంతాల రవాణాకు పనికిరావు. విత్తనం మరియు పేనుబంక ద్వారా తెగులు వ్యాప్తి చెందుతుంది. ఆకుముడత(లీఫ్ క్రింకిల్ లేదా కర్ల్) తెగులు ఈ తెగులు సోకిన చెట్లలో ఎదుగుదల తగ్గుతుంది. ముడతలు పడి ఆకులు ముడుచుకుని బంతిలా మారతాయి. ఆకు తొడిమ వంకర టింకరగా తిరుగుతుంది. వికృతాకారంగా ఉంటుంది. చెట్టు తల ఆకారం మారుతుంది. పూత రాక గొడ్డు చెట్టుగా మారవచ్చు. తెల్లదోమ ద్వారా తెగులు వ్యాప్తి చెందుతుంది. తెగుళ్ల నివారణకు.. ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలు వాడాలి. విత్తన శుద్ధి తప్పనిసరి. నారు మొక్కలు ప్రధాన పొలంలో నాటేటప్పు డు వెర్రి తెగుళ్ల లక్షణాలుంటే తీసేయాలి. అంతర పంటగా మిరప, టమాటా, దోస పుచ్చ, గుమ్మడి లాంటివి సాగుచేయొద్దు. తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే తీసి నాశనం చేయాలి. సమతుల సమగ్రమైన ఎరువులను సకాలంలో అందించాలి. సూక్షధాతు మిశ్రమాన్ని 3, 4 నెలల వయస్సులో ఒకమారు చెట్లపై పిచికారి చేయాలి. కలుపు మొక్కలు పొలంలోను, పొలం గట్లపైన లేకుండా పరిశుభ్రతను పాటించాలి. తోటలో నీరు నిల్వకుండా జాగ్రత్త పడాలి. అంతర సేద్యం చేసేటప్పుడు చెట్ల వేర్లకు గాయాలు తగలకుండా చూడాలి. రసం పీల్చే పురుగులతోనే వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందుతాయి. పేనుబంక, తెల్లదోమ పురుగులను సకాలంలో నివారించాలి. వాటి ఉధృతిని నివారించాలంటే థైయోమిథాక్సిన్ 0.3 గ్రా, లేదా డైఫెన్త్యూరియాన్ 1 గ్రా, లేదా స్పినోస్యాడ్ 0.3 మి.లీ లేదా ఎసిఫెట్ 1.5 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వాటితో పాటు 5 మి.లీ వేప నూనె లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 15 రోజుల వ్యవధిలో పై మందులను మార్చుతూ రెండు, మూడు సార్లు పిచికారి చేసుకుంటే పురుగు వృద్ధి తగ్గుతుంది. బొప్పాయిలో వైరస్ తెగుళ్ల లక్షణాలు కన్పించిన మొక్కలను మొదట్లోనే పీకేయాలి. సరైన నీరు, పోషకాల యాజమాన్యం ద్వారా వైరస్ తెగుళ్లను అరికట్టవచ్చు. నీటి పోషకాల యాజమాన్యం సక్రమంగా లేకపోవడంతోనే తెగుళ్లు అధికంగా వస్తాయి. -
10 ఏళ్లుగా వ్యవసాయం..బైక్ ట్రాలీ వాడకంతో తగ్గిన కూలీల ఖర్చు
తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం కురుకూరు గ్రామానికి చెందిన జుజ్జవరపు సతీశ్ గత పదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. కొబ్బరి తోటలో ఐదంచెల సాగు ద్వారా ఎకరానికి ఏటా రూ.1,05,000 నికరాదాయం పొందుతున్నారు. మోటార్ బైక్‌తో నడిచే ట్రాలీని, బైక్‌తో నడిచే స్ప్రేయర్‌ను తానే తయారు చేయించుకోవటం ద్వారా కూలీల ఖర్చును భారీగా తగ్గించుకోవటం ఆయన ప్రత్యేకత. రైతుసాధికార సంస్థలో మాస్టర్ ట్రైనర్‌గా పనిచేస్తూ ఇతర రైతులకు మార్గదర్శకుడిగా మారారు. ఆయన స్ఫూర్తితో కురుకూరు గ్రామానికి చెందిన సుమారు పాతిక మంది రైతులు 300 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. రిటైర్డ్ ఐసిఏఆర్ ఉద్యోగుల సంఘం సి.హెచ్. రవీందర్‌రెడ్డి బెస్ట్ ఫార్మర్ అవార్డుతో సతీశ్‌ను ఇటీవల హైదరాబాద్‌లో సత్కరించటం విశేషం. కొబ్బరి తోటలో ఐదంచెల అంతర పంటలను ఆయన సాగు చేస్తున్నారు. మొదటి లేయర్‌గా 27“27 అడుగులకు కొబ్బరి, రెండో లేయర్‌గా కొబ్బరి చెట్ల మధ్యలో 13.5“10 అడుగులలో కోకో సాగు చేస్తున్నారు. మూడో లేయర్లో 7“7 అడుగులలో వక్క మొక్కలు వేశారు. నాలుగో లేయర్లో వక్క మొక్కలకు మిరియాలు పాకిస్తున్నారు. ఐడో లేయర్ గా ఎండ పడే చోట ఫైనాపిల్ మొక్కలు నాటారు. కొబ్బరి మొక్కలు లేని చోట్ల జాజికాయ మొక్కలు నాటారు. ప్రతి 10 రోజులకు జీవామృతం డ్రిప్ ద్వారా ఇస్తున్నారు. పిచికారీ కోసం టైప్ 2 సూపర్ జీవా మృతం వాడుతున్నారు. సాధారణంగా జీవామృతం తయారీకి ప్రతి సారీ ఆవు పేడ, మూత్రం అవసరం ఉంటుంది. అయితే, టైప్ 2 జీవామృతం తయారీకి ఒకసారి పేడ, మూత్రం వాడితే చాలు, ఆ తర్వాత 6 నెలల వరకు ఆ అవశేషాలకు 200 లీటర్ల నీటికి లీటరు జీవన ఎరువులతో పాటు బెల్లం జోడిస్తూ మళ్లీ మళ్లీ జీవామృతాన్ని తయారు చేసుకొని వాడటం వల్ల అదే ఫలితాలు వస్తున్నాయన్నారు. జీవామృతం వడపోతకు తాను రూపొందించిన ఆటోమేటిక్ ఫిల్టర్ సిస్టమ్‌ను మరో 20 మంది రైతులు 200 ఎకరాల తోటల్లో వాడుతున్నారని సతీశ్ (90107 42459) తెలిపారు. బైక్ ట్రాలీ ఖర్చు రూ. పది వేలు ద్విచక్ర మోటారు వాహనానికి వెనుక కట్టుకొని బరువులు లాక్కెళ్లేందుకు వీలుగా ఐదేళ్ల క్రితం సతీశ్ బైక్ ట్రాలీని సొంత ఆలోచనతో తయారు చేయించుకొని వినియోగిస్తున్నారు. ఎరువులు వేయటం వంటి పనులకు ఎకరానికి 8–10 మంది కూలీలు అవసరమవుతారని బైక్ ట్రాలీ ఉండటం మూలాన ఇద్దరు కూలీలతోనే వేగంగా పని పూర్తవుతోందని సతీశ్ తెలిపారు. బైక్ ఇంజన్‌తోనే జీవామృతం, పంచగవ్య, ఇతర ద్రావణాలు, కషాయాలను సైతం సులువుగా పిచికారీ చేయగలుగుతున్నానని తెలిపారు. బైక్ ట్రాలీ తయారీకి రూ. పది వేలు ఖర్చయ్యిందని, ఈ ఐదేళ్లలో దాని ద్వారా దాదాపు రూ. 2 లక్షల వరకు డబ్బు ఆదా అయ్యిందన్నారు. దీని ద్వారా ప్రకృతి వ్యవసాయం సులువు కావటం వల్ల ఇతర రైతులు సైతం స్ఫూర్తిని పొందుతున్నారన్నారు. తనను చూసి పాతిక మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టారన్నారు. జీవామృతాన్ని ఫిల్టర్ చేయటం, పిచికారీ చేయటం వంటి పనుల్లో కూడా మనుషుల ప్రమేయం తగ్గించే ఫిల్టర్ వ్యవస్థను నిర్మించటం వల్ల వడకట్టే పని సులువైపోయిందని, పిచికారీ చప్పున పూర్తవుతోందన్నారు. బైక్ స్ప్రేయర్ ద్వారా ఎకరంలో అర గంటలోనే పిచికారీ పూర్తవుతోందన్నారు. టైప్ 2 సూపర్ జీవామృతం తయారీ పద్ధతి రైతులకు వెసులుబాటుగా ఉందన్నారు. సేంద్రియ సాగుపై రైతు సదస్సులు ‘నాబార్డు’ సహకారంతో ‘రైతునేస్తం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో సేంద్రియ సాగు పద్ధతులు, కషాయాలు/ ద్రావణాల తయారీ, విలువ జోడింపుపై తెలంగాణలో రైతులకు అవగాహన సదస్సులు జరగనున్నాయి. 9న కరీంనగర్ జిల్లా చొప్పదండి మం., పెద్దకురుంపల్లిలోని మల్లిఖార్జున రెడ్డి తోటలో, 10న జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లోని ఎడమల మల్లారెడ్డి తోటలో, 11న పెద్దపల్లి జిల్లా రామగిరి మం., కల్వచర్లలోని యాదగిరి శ్రీనివాస్ తోటలో (ఉ.10 గం.–సా. 4 గం.) సదస్సులు జరుగుతాయి. పాల్గొనదలచిన రైతులు తప్పనిసరిగా ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. వివరాలకు.. 70939 73999 (వెంకట్‌రెడ్డి). అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. -
‘కొబ్బరి’లో ‘సుగంధా’ల గుబాళింపు!.. అంతర పంటలతో లాభాలు
ఉద్యాన తోటల్లో సైతం ఏదో ఒకే పంటపై ఆధారపడకుండా.. అంతర పంటల సాగు చేస్తేనే రైతులకు వ్యవసాయం గిట్టుబాటవుతుంది. కొబ్బరి రైతుల ΄ాలిట అంతరపంటల సేద్యం కల్పతరువుగా మారింది. దక్షిణ కోస్తా ఆంధ్రా జిల్లాల్లో వాతావరణం కొబ్బరి సాగుకు అనుకూలం. అందువల్లనే ఏపీ కొబ్బరి తోటల విస్తీర్ణంలో 50 శాతానికిపైగా పాత ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉంది. కొబ్బరి తోటల్లో ఉండే పాక్షిక నీడ వల్ల చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఆ వాతావరణం సుగంధ ద్రవ్య పంటల (స్పైసెస్)కు ఎంతో అనువైనది. ముదురు కొబ్బరి తోటల్లో అనేక సుగంధ ద్రవ్య పంటలను అంతర పంటలుగా సాగు చేస్తూ, నేరుగా మార్కెటింగ్ చేసుకుంటున్న రైతుల విజయగాథలెన్నో. విశేష ప్రగతి సాధిస్తున్న అటువంటి ఇద్దరు ప్రకృతి వ్యవసాయదారులు ఉప్పలపాటి చక్రపాణి, సుసంపన్న అనుభవాలను తెలుసుకుందాం.. గత ఐదారేళ్లుగా కొబ్బరిలో అంతర పంటలు సాగు చేస్తూ.. వీటి ద్వారా ప్రధాన పంటకు తగ్గకుండా అదనపు ఆదాయం పొందవచ్చని రైతు శాస్త్రవేత్త ఉప్పలపాటి చక్రపాణి రుజువు చేస్తున్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్క్ష్మీపురం గ్రామానికి చెందిన చక్రపాణి గత 13 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కొబ్బరి తోటలో వక్క, మిరియాలు, పసుపు అల్లం పండిస్తూ సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తున్నారు. కొబ్బరి తోటలో ఆరేళ్ల క్రితం నాటిన 2,500 వక్క చెట్లు చక్కని ఫలసాయాన్నిస్తున్నాయి. ఈ ఏడాది 700 వక్క చెట్లకు కాపు వచ్చింది. 2 టన్నుల ఎండు వక్కకాయల దిగుబడి ద్వారా రూ. 3 లక్షల 80 వేలు ఆదాయం వచ్చిందని చక్రపాణి వివరించారు. 300 కొబ్బరి చెట్లకు ఐదారేళ్ల క్రితం మిరియాల తీగలను పాకించారు. వీటిద్వారా 500 కిలోల ఎండు మిరియాల దిగుబడి వచ్చింది. కేజీ రూ.600 చొప్పున రిటైల్‌గా అమ్ముతున్నారు. గానుగ నూనెతో ఆరోగ్యం కొబ్బరి చెట్ల మధ్య వక్క చెట్లు పెంచి.. కొబ్బరి చెట్లకు అనేక ఏళ్ల క్రితమే మిరియం మొక్కల్ని పాకించడంతో చక్రపాణి కొబ్బరి తోట వర్టికల్ గ్రీన్ హెవెన్‌గా మారిపోయింది. కొబ్బరి చెట్లకు మిరియం మొక్కలు చుట్టుకొని ఉంటాయి కాబట్టి, మనుషులను ఎక్కించి కొబ్బరి కాయలు దింపే పద్ధతికి స్వస్తి చెప్పారు. కాయల్లో నీరు ఇంకిన తర్వాత వాటికవే రాలుతున్నాయి. రాలిన కాయలను అమ్మకుండా.. సోలార్ డ్రయ్యర్లో పూర్తిగా ఎండబెట్టి కురిడీలు తీస్తున్నారు. కురిడీలతో గానుగల ద్వారా సేంద్రియ కొబ్బరి నూనె తీసి నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. రెండేళ్లుగా తాము ఇంట్లో వంటలకు తమ సేంద్రియ కొబ్బరి నూనెనే వాడుతున్నామని, చాలా ఆరోగ్య సమస్యలు తీరటం గమనించామని చక్రపాణి సంతోషంగా చెప్పారు. పసుపు ఫ్లేక్స్ కొబ్బరి తోటలో వక్క, మిరియాలతో పాటు రెండేళ్లుగా అటవీ రకం పసుపును కూడా సాగు చేస్తున్నారు చక్రపాణి. ఈ రకం పసుపు వాసన, రంగు చాలా బాగుంది. పచ్చి పసుపు కొమ్ములను పల్చటి ముక్కలు చేసి, సోలార్ డ్రయ్యర్ లో ఎండబెట్టి, ఆ ఫ్లేక్స్‌ను అమ్ముతున్నారు. వాటి వాసన, రంగు, రుచి అద్భుతంగా ఉన్నాయని వాడిన వారు చెబుతున్నారన్నారు. సిలోన్ దాల్చిన చెక్క బెటర్ కొబ్బరిలో వక్క వేయడంతో పైకి తోట వత్తుగా కనిపించినా నేలపైన అక్కడక్కడా ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీల్లో గత ఏడాది నుంచి అటవీ పసుపుతో పాటు అల్లం, సిలోన్ దాల్చిన చెక్క, నట్మగ్లను సాగు చేస్తున్నామని చక్రపాణి తెలిపారు. సాధారణంగా మనం ఇళ్లలో వాడే దాల్చిన చెక్క విదేశాల నుంచి దిగుమతయ్యే సాధారణ రకం. సిలోన్ దాల్చిన చక్క రకం దీనికన్నా మెరుగైనది. ఇది పల్చగా ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా కోస్తా ఆంధ్రలో బాగా పండుతోందని చక్రపాణి వివ రించారు. కొబ్బరి, ΄ామాయిల్ తోటల్లో అంతర పంటల సాగు ద్వారా అధికాదాయం పొందేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు పెదవేగి మండల ఉద్యాన అధికారి ఎం. రత్నమాల తెలి΄ారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. – కొత్తపల్లి వినోద్‌కుమార్, సాక్షి, పెదవేగి, ఏలూరు జిల్లా కేరళ మాదిరిగా ఇక్కడా పండిస్తున్నా! రైతులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లోనే పంటలు పండించటం నేర్చుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో అప్లాండ్ ఏరియాలో ఉద్యాన తోటలకు అనువైన వాతావరణం ఉంది. ఇవి సారవంతమైన భూములు. ఇక్కడి నీరు కూడా మంచిది. నాలుగైదేళ్లుగా భూగర్భజలాలు పెరగడంతో నీటి సమస్య లేదు. కొబ్బరిలో అంతర పంటలకు అనుకూలంగా ఉండేలా ముందే తగినంత దూరంలో మొక్కలు నాటుకొని సాగు చేసుకోవచ్చు. అంతర పంటలద్వారా సూక్ష్మ వాతావరణం సృష్టించుకొని కేరళలో మాదిరిగా సుగంధ ద్రవ్య పంటలు సాగు చేసుకోవచ్చు. కేరళలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే మన దగ్గర 45 డిగ్రీల వరకు వస్తుంది. కొబ్బరిలో అంతర పంటల వల్ల బయటతో పోల్చితే పది డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఎండ, గాలిలో తేమ సమపాళ్లలో చెట్లకు అందుతున్నందున కేరళలో మాదిరిగా మిరియాలు, దాల్చిన చెక్క ఇక్కడ మా తోటలోనూ పండుతున్నాయి. – ఉప్పలపాటి చక్రపాణి (94401 88336), లక్ష్మీపురం, పెదవేగి మండలం, ఏలూరు జిల్లా -
బిజీగా ఉండే వాళ్లకి ఈ డివైస్‌తో గార్డెనింగ్ ఈజీ!
గార్డెనింగ్ అంటే ఇష్టం ఉండి, వాటి సంరక్షణ చూసుకునే తీరికలేని వాళ్లకు ఈ డివైస్ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ హైడ్రోపోనిక్స్ గార్డెనింగ్ సిస్టమ్.. పాలకూర, టొమాటో, బచ్చలికూర, కొత్తిమీర, గులాబీ, చామంతి వంటి నచ్చిన మొక్కల్ని పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. ఇందులో త్రీ లైట్స్ సెట్టింగ్ ఉంటుంది. రెడ్ కలర్ లైట్.. విత్తనాలు వేసినప్పుడు, బ్లూ లైట్ మొక్క ఎదుగుతున్నప్పుడు, సన్ లైక్ లైట్ పువ్వులు విరబూస్తున్నప్పుడు లేదా పండ్లు కాస్తున్నప్పుడు సెట్ చేసుకోవాలి. నీళ్లు ఏ మోతాదులో ఉన్నాయి, ఎంతకాలం వరకు సరిపోతాయో కనిపిస్తుంటాయి. నీళ్లు పోయడానికి ప్రత్యేకమైన హోల్ ఉంటుంది. అలాగే ప్రతి రెండు వారాలకు ఒకసారి న్యూట్రిన్ టాబ్లెట్స్ వేస్తూ ఉండాలి. ఈ గాడ్జెట్‌తో మొక్క 5 రెట్లు వేగంగా పెరుగుతుంది. ఇందులో సైలెంట్ పంప్‌తో కూడిన వాటర్ ట్యాంక్ ఉంటుంది. న్యూట్రియంట్ సొల్యూషన్స్, 24 సీడ్లింగ్ బ్లాక్స్, 12 ప్లాంటింగ్ బాస్కెట్స్ ఉంటాయి. డివైస్ లోపల నీటి పంపు ప్రతి గంటకు ముప్పై నిమిషాల పాటు ఆటోమెటిక్‌గా ఆన్ అవుతూ ఉంటుంది. ఈ డివైజ్‌ధర 69 డాలర్లు(రూ. 5661/-) (చదవండి: ఎడారి ప్రాంతంలో సాగు...‘జాయ్’ఫుల్‌గా కరువుకు చెక్!) -
ఎడారి ప్రాంతంలో సాగు...‘జాయ్’ఫుల్‌గా కరువుకు చెక్!
కరువు కాటకాలతో అల్లాడుతున్న ఆఫ్రికా దేశాల్లో దేశాల్లో ఎడారీకరణను ఎదుర్కొనేందుకు రైతులు వాన నీటి సంరక్షణకు అనేక పద్ధతులను అనుసరిస్తున్నారు. వాటిలో ‘అర్ధ చంద్రాకారపు గుంతలు’ తవ్వటం ఒక పద్ధతి. చెట్టు చేమ కరువైన ప్రదేశాల్లో అరుదుగా కురిసే కొద్దిపాటి వర్షపు నీటి ప్రవాహాన్ని నెమ్మదింపజేసి భూమిలోకి ఇంకింపజేయటంలో ఈ వినూత్న ఇంకుడు గుంతలు ఉపయోగపడుతున్నాయి. వెస్ట్ సహెల్‌లో రైతులు భూసారం కోల్పోయిన భూములను పునరుజ్జీవింపజేయటం కోసం, ఎడారీకరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ పద్ధతిలో లోతు తక్కువ గుంతలు తవ్వి సత్ఫలితాలు సాధించారు. వాలుకు అడ్డంగా అర్థ చంద్రాకారంలో గుంతలు తవ్వి, తవ్విన మట్టిని లోతట్టు వైపు గట్టుగా వేస్తే.. వర్షపు నీరు ఆ గుంతలో చేరి భూమిలోకి ఎక్కువగా ఇంకుతోంది. నీరు ఇంకడంతో పాటు నీటి ప్రవాహాన్ని అడ్డుకోవటం వల్ల భూమి పైపొర మట్టి కోతకు గురికాకుండా కాపాడుకున్నట్లు కూడా అవుతోంది. ఎడారీకరణ బారిన పడిన రైతుల మొహాల్లో ఆనందాన్ని నింపుతుండటంతో వీటికి ‘జాయ్ పిట్స్’ అని కూడా పేరొచ్చింది! ఖర్చు, శ్రమ తక్కువ.. ఫలితం ఎక్కువ! అర్థ చంద్రాకార గుంతలు నిర్మించడం సులభం, ఖర్చు స్వల్పం. వాలు ఐదు శాతం కంటే తక్కువగా ఉన్న భూముల్లో నేల కోతను నియంత్రించేందుకు, వాన నీటిని సమర్థవంతంగా సంరక్షించడానికి ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది. ఎత్తులో వ్యత్యాసం దాదాపుగా బెత్తెడు ఎక్కువ ఉంటే వాలు 5% కంటే ఎక్కువగా ఉంటుంది. నిర్మించేదెలా? మొదట భూమిపై వాలు వైపు తిరిగి నిలబడి అర్ధ చంద్రుని ఆకారాన్ని రెండు మీటర్ల వెడల్పుతో గీయాలి. రెండు పిడికిళ్ల (10 సెంటీమీటర్ల) లోతు మట్టిని తవ్వి, ఆ మట్టిని దిగువ వైపున కట్టగా వేయండి. కట్ట బలంగా ఉండాలంటే కట్ట కింది వైపు ఇరవై అంగుళాల వెడల్పు ఉండాలి. పైభాగం కనీసం సగం (10 అంగుళాల) వెడల్పు ఉండాలి. ఎత్తు అడుగు సరిపోతుంది. వర్షాకాలంలో చివరి నెలన్నరలో అర్ధ చంద్రాకార కందకాలను తవ్వాలి. అప్పుడు నేల తేమగా ఉంటుంది. తవ్వటం, గట్లు వేయటం సులభం అవుతుంది. ఎండా కాలంలో వానకు ముందు దీన్ని ఏర్పాటు చేయాలంటే కష్టం. అర్ధ చంద్రాకారపు గుంతలు తీయడానికి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. పార, పలుగు చాలు. – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: సుప్రీంకోర్టు నిషేధించిన కొర్రమీను డూప్లికేట్.. తిన్నారా? అంతే సంగతి!) -
కొర్రమీను చేపలు తింటున్నారా?తస్మాత్ జాగ్రత్త! క్యాన్సర్ ముప్పు
నిషిద్ధ ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్‌లను మన ప్రజలు ఇష్టంగా తినే కొర్రమీను చేపలుగా చూపి అక్రమంగా విక్రయిస్తున్న వారిపై, తరలిస్తున్న వారిపై మత్స్యశాఖ అధికారులు కేసులు పెడుతున్న సందర్భాలు అడపాదడపా మనం చూస్తున్నాం. అయితే, ఈ ఆఫ్రికన్/ అమెరికన్ క్యాట్ఫిష్లపై ఎందుకు నిషేధం విధించారు? ఇవి చేపల జీవవైవిధ్యానికి ఏ విధంగా విధ్వంసకరంగా పరిణమిస్తున్నాయి? ఇవి మన చేపల రైతులు, మత్స్యకారుల ఆదాయానికి గండికొట్టే ముప్పు పొంచి ఉందా? వీటిని అరికట్టే మార్గాలేమిటి?.. ఇటువంటి ప్రశ్నలకు సికింద్రాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మోలెక్యులర్ బయాలజీ (సిఎస్ఐఆర్–సిసిఎంబి) సీనియర్ ప్రధాన శాస్త్రవేత్త డా. జి.ఉమాపతి సమాధానాలు.. ‘సాక్షి సాగుబడి’ పాఠకుల కోసం ఆయన మాటల్లోనే... కొరమీనుకు డూప్లికేట్ వచ్చి పడింది. ఏదీ కొర్రమీనో.. ఏదీ దాని డూప్లికేటో తెలియకుండా కొనేస్తున్నారు కొందరు. సాధారణంగా చేపలు తింటే మంచిదని నిపుణులు చెబుతారు. చేపలు నీటిలో ఉండే నాటు..చిన్న చిన్న చేపల్ని పెద్ద చేపలు తిని పెరుగుతాయి. కానీ క్యాట్ ఫిష్‌లు మాత్రం అలా కాదు. కుళ్లిపోయిన జీవరాశుల కళేబరాలు..కుళ్లిన వ్యర్థాలు తిని భారీగా పెరిగిపోతాయి. అంతేకాదు క్యాట్ ఫిష్‌లు పెంచే చెరువుల్లో ప్రమాదవశాత్తు ఏమైనా జంతువులు గానీ దిగితే వాటిని కూడా క్యాట్ ఫిష్‌లు స్వాహా చేసేస్తాయి. దొరికితే మనుషుల్ని కూడా చంపి తినేస్తాయి. అంటే క్యాట్ ఫిష్‌లు ఓ రకమైన రాకాసి చేపలు అని చెప్పుకోవచ్చు. ఈ క్యాట్ ఫిష్‌లు మంచినీటిలోనే కాదు మురుగునీరు..ఆఖరికి డ్రైనేజీ నీటిలో కూడా పెరుగుతాయి. మన దేశపు నీటి వనరుల్లోకి చొరబడిన అమెరికన్, ఆఫ్రికన్ కాట్ ఫిష్‌ల వంటి విదేశీ జాతి చేపలు స్థానిక చేపల జాతుల మనుగడకు, జీవవైవిధ్యానికి, చేపల రైతులు/ మత్స్యకారుల జీవనోపాధికి గొడ్డలిపెట్టుగా పరిణమించాయి. ఈ విదేశీ చేపలు మన చెరువుల్లో, కాలువల్లో, వాగులు, వంకలు, సరస్సులు, నదుల్లోకి చేరిపోయి తమ సంతతిని ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నాయి. సాధారణంగా అమెరికన్, ఆఫ్రికన్ కాట్ ఫిష్‌లు విపరీతమైన మాంసాహారులు కాబట్టి, అవి మన చేపల గుడ్లు, చేపపిల్లలతో పాటు ఇతరత్రా జలచరాలను ఈ బకాసుర కాట్ఫిష్లే ఆరగించేస్తుంటాయి. ఆ విధంగా స్థానిక చేపల సంతతి బాగా తగ్గిపోతోంది. ఒక్కోసారి ఇవి పూర్తిగా అంతరించిపోయే ముప్పు కూడా ఉంది. అమెరికన్ / ఆఫ్రికన్ క్యాట్‌ఫిష్‌ల తీవ్రమైన ఆహారపు అలవాట్లు, భూమిని తవ్వి బొరియలు చేసే అలవాట్ల వల్ల నీటి మొక్కల పెరుగుదలను, నీటి ప్రవాహదారులు మారిపోతున్నాయి. జలచరాల ఆవాసాలు చెల్లాచెదురవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే స్థానిక జాతులను ఇవి చెలకట్టనియ్యట్లేదు. దుష్ప్రభావాలు విదేశీ జాతుల క్యాట్‌ఫిష్‌ల వల్ల చేపల రైతులు.. చెరువులు, సరస్సులు, జలాశయాల్లో చేపలపై ఆధారపడి జీవించే మత్స్యకారుల ఆదాయాలు తీవ్రంగా దెబ్బతింటాయి. మనోల్లాసం కోసం చేపలు పట్టడం వంటి వ్యాపకాల ద్వారా ఆదాయం తగ్గిపోతోంది. ఆ విధంగా చెరువులు, సరస్సులు, నదుల్లో స్థానిక చేప జాతుల జీవవైవిధ్యం నశిస్తుంది. కొన్నిసార్లు ఈ జాతులు అంతరించిపోనూవచ్చు. ఈ నష్టం ఆహార చక్రాల్లో, పర్యావరణ వ్యవస్థ అందించే సేవల్లో ప్రతికూల మార్పులు చోటుచేసుకొని, మొత్తంగా పర్యావరణ వ్యవస్థ గొలుసుకట్టు దుష్ప్రభావాలకు లోనవుతోంది. వీటి సంతతిని నియంత్రించడం లేదా నిర్మూలించడం అంత సులభసాధ్యమైన పని కాదు సరికదా, ఖరీదైనది కూడా. వీటి నిర్మూలనకు రసాయనాలు ప్రయోగించటం లేదా ఏరివేయటం వంటి సాంప్రదాయ నిర్వహణ పద్ధతుల వల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. అంతేకాదు, ఈ పనుల వల్ల పర్యావరణానికి అనుకోని రీతిలో హాని జరగొచ్చు. చెరువులు, జలాశయాలు, సరస్సుల్లో విధ్వంసక విదేశీ జాతుల చేపల జాడను ఈ–డిఎన్ఎ విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి గుర్తించటం, పర్యవేక్షించడం, వాటి సంతతిని అంచనా వేయడం వంటి పనులు చేయొచ్చు. ఈ విషయంలో సీసీఎంబీలోని జీవజాతులు అంతరించిపోకుండా సంరక్షించే ‘లకోన్స్’ విభాగం సహాయపడుతుంది. విదేశీ క్యాట్‌ఫిష్ జాతుల వల్ల ఉన్న ప్రమాదాల గురించి స్థానికులకు, ఆక్వా రైతులకు అవగాహన కల్పించడానికి ‘లకోన్స్’ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది. విదేశీ చేప జాతుల డేటాబేస్‌ను ఏర్పాటు చేసే వీలుంది. దేశవ్యాప్తంగా సమర్థవంతమైన పరిష్కారాలు వెతికేందుకు పరిశోధకులు, రైతుల మధ్య లకోన్స్ అనుసంధానం చేస్తుంది. విదేశీ జాతుల ఉనికిని క్షేత్రస్థాయిలో ముందస్తుగా గుర్తించే పరీక్షను అభివృద్ధి చేయడంలో ‘లకోన్స్’ సహాయపడుతుంది. మత్స్య శాఖ అధికారులకు, స్థానిక ఆక్వా రైతులకు శిక్షణ ఇవ్వటానికి కూడా ‘లకోన్స్’ సహాయపడుతుంది. జిల్లా స్థాయిలో నిఘా అవసరం చేపలు ఇతర జలచరాలకు సంబంధించిన చట్టాల్లోని నిబంధనలను స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలు అమలు చేయాలి. ఆక్వా చెరువులను తనిఖీ చేయటం (అక్రమ చెరువులను అరికట్టడం), విదేశీ చేప జాతుల ముప్పుపై అవగాహన కలిగించేలా ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం, జిల్లా స్థాయిలో నిఘా ఏర్పాటు చేయడం అవసరం. మత్స్య శాఖ పరిశోధనా సంస్థల సహకారంతో విదేశీ చేప జాతులను అరికట్టే పద్ధతులను అభివృద్ధి చేయవచ్చు. ఈ పద్ధతులను అనుసరించే రైతులు, మత్స్యకారులకు ప్రోత్సాహకాలను అందించవచ్చు. కొర్రమీను,క్యాట్‌ఫిష్ తేడా ఇదొక్కటే కొర్రమీనుకు క్యాట్ ఫిష్‌కు మధ్య చిన్న తేడా మాత్రమే ఉంటుంది. చూడటానికి రెండింటిలో ఒకటే తేడా.. ఈ క్యాట్ ఫిష్‌కు పొడగాటి మీసాలుంటాయి. నోరు కూడా చాలా పెద్దగా ఉంటుంది. అంతే, మిగిలిన అంతా సేమ్ టు సేమ్.చేపల్లో బాగా డిమాండ్ ఉండే కొర్రమీనును పోలి ఉండే ఈ చేపలను మీసాలు పీకేసి కొర్రమీను పేరుతో ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. కిలో కోరమీను రూ.700 నుంచి రూ.1000 వరకు పలుకుతుంది. క్యాట్ ఫిష్‌ను కిలో రూ.150లకే యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయనే వైద్యులు, డైటిషియన్ల సూచనలతో చాలా మంది చేపలను తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే పెద్ద పెద్ద నగరాల్లో దుకాణాల్లోనే కాకుండా సాధారణ, స్టార్ హోటళ్లలో కొర్రమీను పేరుతో క్యాట్ ఫిష్‌ను విక్రయిస్తున్నారు. ఆఫ్రికన్/అమెరికన్ క్యాట్‌ఫిష్‌లను నియంత్రించాలి మన దేశంలోని చేపల జాతులతో సంకరం చేసి కొత్త జాతులను అభివృద్ధి చేయడానికి పరిశోధనల నిమిత్తం ఆఫ్రికా, అమెరికా ఖండాల నుంచి క్యాట్‌ఫిష్‌లను కొన్ని దశాబ్దాల క్రితం మన దేశానికి తీసుకొచ్చారు. అయితే, కాలక్రమంలో అవి సహజ జలవనరుల్లోకి చేరిపోయి, ఇప్పుడు చేపల జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించాయి. వీటిని తింటే ఫలానా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పలేం. అయితే, ఆఫ్రికన్ / అమెరికన్ క్యాట్‌ఫిష్‌లు అత్యంత కలుషిత నీటి సరస్సుల్లో కూడా నిక్షేపంగా పెరుగుతాయి. కాబట్టి ఈ చేపలు అత్యంత కలుషితాలతో కూడి ఉంటాయి. ఇవి మన చేపల చెరువుల్లో, సరస్సులు, జలాశయాల్లో జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించినందున వీటి పెరుగుదలను నిశితంగా గమనిస్తూ, శాస్త్రీయ పద్ధతుల్లో నియంత్రించాల్సిన అవసరం ఉంది.∙ – వినయ్ కె నందికూరి, సంచాలకులు, సిఎస్ఐఆర్–సిసిఎంబి, సికింద్రాబాద్director@ccmb.res.in నిర్వహణ: పంతంగిరాంబాబు సాగుబడి డెస్క్ -
నేల సాగు కన్నా బ్యాగు సేద్యం మిన్న!
సేంద్రియ కూరగాయ పంటలను పొలంలో సాధారణ పద్ధతిలో నేలలో కన్నా.. ప్రత్యేకమైన బ్యాగుల్లో సాగు చేయటం ద్వారా రెట్టింపు కన్నా ఎక్కువగా దిగుబడి తీయవచ్చని తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా తునికిలోని డా. రామానాయుడు ఏకలవ్య సేంద్రియ కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి–జూలై నెలల మధ్య ప్రయోగాత్మక సాగులో రుజువైంది. ఈ పంటల సాగును శాస్త్రవేత్తలు ఆసాంతమూ సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసి, శాస్త్రీయంగా గణాంకాలను నమోదు చేశారు. నగరాలు, పట్టణాలకు దగ్గల్లోని భూసారం అంతగా లేని భూముల్లో, రసాయనాలతో కలుషితమైన లేదా చౌడు తదితర సమస్యాత్మక భూముల్లో బ్యాగు సేద్యం ద్వారా పెద్ద ఎత్తున సేంద్రియ కూరగాయల ఉత్పత్తి పొందడానికి, తద్వారా అన్‌సీజన్‌లో రైతులు అధికాదాయం పొందడానికి అవకాశం ఉన్నట్లు ఈ ప్రయోగం ద్వారా వెల్లడైందని కేవీకే అధ్యక్షుడు టి. వినోద్‌రావు తెలిపారు. సేంద్రియ రైతు శాస్త్రవేత్త ఎం.ఎస్. సుబ్రహ్మణ్యం రాజు మార్గదర్శకత్వంలో కేవీకే శాస్త్రవేత్తల బృందం బ్యాగు సాగులో అద్భుత దిగుబడులు రాబడుతోంది. ఎత్తు బెడ్లపై సేంద్రియ కాకర సాగు కాకరను వేసవి పంటగా నేలపై ఎత్తు బెడ్లపై ఏక పంటగా సాగు చేయగా.. ఎకరానికి 4,480 కిలోల (4.48 టన్నులు/ఎకరం) సేంద్రియ కాకర కాయల దిగుబడి వచ్చింది. తునికి కేవీకే ప్రాంగణంలోని 12.5 సెంట్ల భూమి (0.125 ఎకరం)లో సాధారణ పందిరి పద్ధతిలో 1,000 కాకర విత్తనాలను ఎత్తయిన బెడ్లపై ఫిబ్రవరి 25న విత్తారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో బిందు సేద్యం ద్వారా పండించారు. పంట కోత ఏప్రిల్ 17 నుంచి జూలై12 వరకు కాకర కాయలు కోశారు. ఈ వెయ్యి మొక్కల నుంచి∙560.5 కిలోల దిగుబడి వచ్చింది. ఒక్కో మొక్క నుంచి 0.56 కిలోల కాకర కాయల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన.. ఎత్తు బెడ్స్ పద్ధతిలో సగటున ఎకరానికి 4,480 కిలోల కాకర దిగుబడి రాగా, సగటున ఎకరానికి రూ. 1,92,000 ఖర్చయినట్లు (కౌలు కాకుండా) శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. బ్యాగుల్లో కాకర సాగు పక్క పొలంలోనే ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకర పంటను పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయగా.. సగటున ఎకరానికి 8,000 కిలోల (8 టన్నులు/ఎకరం) సేంద్రియ కాకర కాయల దిగుబడి వచ్చింది. 25 సెంట్ల భూమిలో 2023 ఫిబ్రవరి 2న 616 బ్యాగుల్లో, ఒక్కో బ్యాగులో రెండు చొప్పున, కాకర విత్తనాలను పెట్టి, మొక్కలను పందిరికి పాకించారు. విత్తిన 70 రోజులకు మొదలై 175 రోజుల (జూలై 25) వరకు కాయలు కోశారు. మొత్తం 2 టన్నుల కాకర కాయల దిగుబడి వచ్చింది. ఈ లెక్కన.. సగటున ఎకరానికి 8 టన్నుల కాకర దిగుబడి వచ్చింది. బ్యాగుల్లో కాకర సాగుకు సగటున ఎకరానికి (కౌలు కాకుండా) రూ. 2,40,000 ఖర్చయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కాకరతో పాటు.. అదే పొలంలో టొమాటో, పుదీనా, క్యాబేజీ కూడా.. ఎత్తు బెడ్ల సాగులో కాకర ఒక్కటే పంట సాగు చేయగా, బ్యాగు సాగులో కాకరతో పాటు మరికొన్ని బ్యాగుల్లో టొమాటో, పుదీనా, క్యాబేజీ పంటలు కూడా సాగు చేశారు. ఈ పంటల ద్వారా 3,640 కిలోల(3.64 టన్నులు/ఎకరం) దిగుబడి అదనంగా రావటం విశేషం. 25 సెంట్ల భూమిలో మొత్తం 1,566 బ్యాగులు పెట్టారు. అందులో 616 బ్యాగుల్లో రెండేసి కాకర మొక్కలు (2 టన్నుల దిగుబడి), 410 బ్యాగుల్లో రెండేసి క్యాబేజీ మొక్కలు (374 కిలోల దిగుబడి), 180 బ్యాగుల్లో రెండేసి టొమాటో మొక్కలు పెట్టారు. మరో 360 బ్యాగుల్లో ఒక్కోటి చొప్పున టొమాటో, పుదీనా మొక్కలు కలిపి నాటారు. మొత్తం 453 కిలోల టొమాటోలు, 83.6 కిలోల పుదీనా దిగుబడి వచ్చింది. బ్యాగుల్లో సేంద్రియ సాగు ఇలా.. అడుగున్నర ఎత్తు, అడుగు వెడల్పు ఉండే పాలిథిన్ బ్యాగులో 15 కిలోల పశువుల ఎరువు, 15 కిలోల ఎర్రమట్టి, 100 గ్రా. వేపపిండి కలిపిన మిశ్రమాన్ని నింపారు. జీవామృతం ప్రతి 10–15 రోజులకోసారి పాదుల్లో పోశారు. పంచగవ్య, రాజ్మాగింజల ద్రావణం, కొబ్బరి నీరు నాలుగైదు సార్లు పిచికారీ చేశారు. వేసవిలో కురిసిన అకాల వర్షాల వల్ల లీఫ్ బ్లైట్ వంటి తెగుళ్లు సోకినప్పటికీ సేంద్రియ పద్ధతుల్లోనే వాటిని నియంత్రించటం విశేషం. ఈ కేవీకేలో బ్యాగు సేద్యంపై (గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు) రెండు బ్యాచ్‌లలో ప్రయోగాలు పూర్తయ్యాయి. 10న నందిగామలో ప్రకృతి సేద్యంపై శిక్షణ సెప్టెంబర్ 10(ఆదివారం)న ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు విజయ్ రామ్ అవగాహన కల్పిస్తారు. ప్రవేశం ఉచితం. ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. 150 మందికి అవకాశం ఉంటుందని నిర్వాహకులు బాలకృష్ణారెడ్డి తెలిపారు. వివరాలకు.. 90281 85184, 64091 11427. వచ్చే నెల 4 నుంచి తేనెటీగల పెంపకంపై శిక్షణ ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని సకశేరుక చీడల యాజమాన్య విభాగం సెప్టెంబర్ 4 నుంచి 9వ తేదీ వరకు తేనెటీగల పెంపకంపై శిక్షణ ఇవ్వనుంది. తేనెటీగల పెంపకంపై ఆసక్తి ఉన్న రైతులు, నిరుద్యోగ యువత ఈ శిక్షణకు అర్హులని ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ వి. సునీత తెలిపారు. అభ్యర్థులకు ఉచిత భోజన వసతులు కల్పిస్తామన్నారు. వివరాలకు.. 94948 75941. (చదవండి: అర్బన్ కౌలు రైతుల పాట్లు!..కొద్దిపాటి స్థలంలోనే సిటీ ఫార్మింగ్! ) -
అర్బన్ కౌలు రైతుల పాట్లు!..కొద్దిపాటి స్థలంలోనే సిటీ ఫార్మింగ్!
అర్బన్ కౌలు రైతుల పాట్లు కనెక్టికట్.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటి. కనెక్టికట్ రాష్ట్రంలో అధిక జనసాంద్రత గల నగరం బ్రిడ్జ్‌పోర్ట్. జీవన వ్యయం దేశంలోనే అత్యధికంగా ఉండే కనెక్టికట్‌లో.. తాజా కూరగాయలు, పండ్లు అందుబాటులో లేని ప్రాంతాలకు ఆహారాన్ని స్థానికంగానే పండించి అందించడానికి అర్బన్ ఫార్మర్స్ కృషి చేస్తున్నారు. నగరీకరణ కారణంగా వ్యవసాయ భూములను పెద్ద ఎత్తున నివాస ప్రాంతాలుగా మార్చటం వల్ల నగరంలో పావు ఎకరం చోటు కౌలుకు దొరకటమే గగనంగా ఉందని బ్రిడ్జ్‌పోర్ట్ నగర రైతులు వాపోతున్నారు. అందుబాటులో ఉన్న చిన్న పాటి స్థలాలతోనే సిటీ ఫార్మింగ్ చేసే వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు సరిపెట్టుకుంటున్నారు. బ్రిడ్జ్‌పోర్ట్ యువరైతు ట్రావిస్ స్టీవర్ట్ 20 సెంట్ల పెరటి స్థలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. భారలోహాలతో కలుషితమైన నేల కావటంతో ఎత్తు మడుల్లో కూరగాయలను పండిస్తున్నాడు. అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ హైడ్రోపోనిక్ పద్ధతిలోనూ పంటలు పండించటంతో పాటు గుడ్లు పెట్టే కోళ్లను, చిన్నపాటి ట్యాంకుల్లో తిలాపియా వంటి చేపలను సైతం పెంచుతున్నాడు. ‘ఒకప్పుడు సరదాగా కూరగాయలు పెంచేవాడిని. ఇప్పుడు అదే నాకు ఉపాధిగా మారింది. ఇదొక జీవన విధానం అని నమ్ముతున్నా. దీంతో పాటు పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పుతున్నా’ అన్నాడు స్టీవర్ట్. షాన్ జోసెఫ్ అనే మరో యువ సిటీ ఫార్మర్ తన భాగస్వామి రిచర్డ్ మేయర్స్‌తో కలసి నగరంలోనే కౌలుకు తీసుకున్న అరెకరంలో వ్యవసాయం చేస్తున్నాడు. ఆయనకు ఏడేళ్ల ప్రాయం నుంచే తోట పని అలవాటుంది. అలాగని చదువుకోలేదనుకునేరు సుమా! నోగటక్ వ్యాలీ కమ్యూనిటీ కళాశాల నుంచి హార్టికల్చర్ డిగ్రీ పొందాడు. కార్పొరేట్ ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే మానుకోవాల్సి వచ్చింది. ఏడేళ్ల క్రితం ఒకామె తన ఇంటి పక్కన ఖాళీగా ఉన్న అరెకరం స్థలాన్ని కౌలుకు ఇవ్వటంతో అక్కడ ‘పార్క్ సిటీ హార్వెస్ట్’ పేరుతో సిటీ ఫార్మింగ్ మొదలుపెట్టారు. బ్రిడ్జ్పోర్ట్లో 20 సెంట్ల పెరటి స్థలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న అర్బన్ రైతు ట్రావిస్ స్టీవర్ట్ తమ ఉత్పత్తులను స్థానిక రైతు మార్కెట్లలో విక్రయిస్తుంటారు. అక్కడ ఏడాదికి 7 నెలలే ఆరుబయట పంటల సాగుకు అనుకూల వాతావరణం ఉంటుంది. అందుకని, ఇంట్లోనే చిన్న కంటెయినర్లలో ఏడాది పొడవునా పెరిగే మైక్రోగ్రీన్స్‌తో పాటు ఆలివ్ ఆయిల్, కొవ్వొత్తులు, మసాలా మిశ్రమాలు, హెర్బల్ టీ, హాట్ సాస్, ఊరగాయలు, దుస్తులను కూడా తమ వెబ్సైట్ ద్వారా అమ్ముతూ ఈ నల్లజాతి యువ సిటీ ఫార్మర్స్ ఆదాయం పొందుతున్నారు. జాతీయ వ్యవసాయ గణాంకాల సంస్థ ప్రకారం కనెక్టికట్ ప్రజల్లో మూడో వంతు మంది నల్లజాతీయులు, ఆదివాసులే. అయితే, అర్బన్ ఫార్మర్స్ సహా మొత్తం రైతుల్లో వీళ్లు 2 శాతం మంది మాత్రమే ఉన్నారు. భూ లభ్యత, శిక్షణ, వనరుల లేమి పెద్ద సవాళ్లుగా నిలిచాయి. వీరికి న్యాయబద్ధమైన వాటా మేరకు తాజా ఆహారాన్ని స్థానికంగా పండించి అందుబాటులోకి తేవడానికి అర్బన్ అగ్రికల్చర్, ఫుడ్ జస్టిస్ కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. అమెరికా వ్యవసాయ శాఖ పట్టణ వ్యవసాయానికి మద్దతు ఇచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కనెక్టికట్ వ్యవసాయ వ్యవస్థలో అర్బన్ ఫార్మర్స్ కీలకమైన భాగమని అందరూ అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో పండించే పంటల్లో అద్భుతమైన వైవిధ్యం ఉంది. ఆయా పంటలను సాగు చేసే వారి సంఖ్యను పెంపొందించాలి అని ప్రభుత్వమూ భావిస్తోంది. ఇష్టమైన పని.. ఆదాయం.. భారంగా అనిపించని ఇష్టమైన పనిని ఎంపిక చేసుకున్నాను. నాకు ముగ్గురు అబ్బాయిలు. వారికి నేను చూపించాలనుకున్నది, చెప్పాలనుకున్నది ఏమిటంటే.. తాము ఆనందంగా చేయగలిగిన పని ఏదో ఎవరికి వారు కనుగొనగలగాలి. ఆ పని ద్వారా ఆదాయం పొందే ఉపాయమూ చేయాలి. – షాన్ జోసెఫ్, అర్బన్ ఫార్మర్, బ్రిడ్జ్‌పోర్ట్ పతంగి రాంబాబు Prambabu.35@gmail.com (చదవండి: దేశీ వరి పరిరక్షకుడు డా.దేబల్ దేవ్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం!) -
దేశీ వరి పరిరక్షకుడు డా.దేబల్ దేవ్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం!
ప్రముఖ దేశీ వరి వంగడాల పరిరక్షకులు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ దేబల్ దేవ్‌కు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘ఐఫోమ్ ఆసియా ఆర్గానిక్ మెడల్ ఆఫ్ ఆనర్’ లభించింది. వంద దేశాల్లో సేంద్రియ వ్యవసాయదారుల సంఘాల సమాఖ్య (ఐఫోమ్) ఆర్గానిక్స్ ఆసియా విభాగం, చైనాలోని క్సిచాంగ్ కౌంటీ సంయుక్తంగా 2023వ సంవత్సరపు ఆర్గానిక్ మెడల్ ఆఫ్ ఆనర్ పురస్కారానికి డా. దేబల్ దేవ్‌ను ఎంపిక చేశాయి. వైవిధ్యభరితమైన 1,440కు పైగా అపురూపమైన భారతీయ వరి వంగడాలను సేకరించడంతో పాటు.. ఒడిషాలోని తన చిన్న పరిశోధనా క్షేత్రంలో ప్రతి ఏటా సాగు చేస్తూ పరిరక్షిస్తున్న డా. దేబల్ దేవ్ దశాబ్దాలుగా నిస్వార్థ సేవ చేస్తున్నారు. 5 వేల డాలర్ల నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం ప్రదానం చేస్తారు. డా. దేబల్ దేవ్ పరిరక్షిస్తున్న దేశీ వరి వంగడాల్లో వాతావరణ మార్పుల్ని తట్టుకొని నిలిచే వరి రకాలతో పాటు అత్యంత అరుదైన పౌష్టిక విలువలు కలిగిన రకాలు కూడా ఉండటం విశేషం. జీన్ బ్యాంకుల్లో ఉండే పురాతన వంగడాలు శాస్త్రవేత్తల పరిశోధనలకు మాత్రమే ఉపయోగపడతాయి. అయితే, రైతుల పొలాల్లో ఏటేటా సాగవుతూ దేశీ వరి వంగడాలు వాతావరణ మార్పులకు, సరికొత్త చీడపీడలకు దీటుగా తట్టుకుంటూ రాటుదేలుతూ రైతులకు అందుబాటులో ఉంటాయి. అందువల్లనే, ఆధునిక వంగడాలెన్ని వచ్చినా ఈ అపురూపమైన పురాతన వంగడాలను సాగు చేస్తూ పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రకృతి సేద్యానికి అనువైన ఈ వంగడాల ద్వారానే మన ఆహార సార్వభౌమత్వం నిలుస్తుందని డా. దేబల్ దేవ్ ‘సాక్షి సాగుబడి’తో అన్నారు. - సాక్షి సాగుబడి డెస్క్ -
ఎడారిలో పచ్చదనం కోసం కృషి చేస్తున్న స్కూల్ టీచర్.. ఇప్పటికే 4లక్షల మొక్కలు
నిజాయితీగా, విరామం లేకుండా కృషి చేస్తే విజయం తప్పక సాధిస్తామని నమ్మే ట్రీ టీచర్... అతిపెద్ద థార్ ఎడారిని సస్యశ్యామలం చేసేందుకు నిర్విరామంగా కృషిచేస్తున్నాడు. ఇసుకమేటలను పచ్చని అడవులుగా మార్చేందుకు తను తాపత్రయపడుతూ.. అందరిలో అవగాహన కల్పిస్తున్నాడు. ‘‘ప్రకృతిని తన కుటుంబంలో ఒకరిగా చూసుకుంటూ భూమాతను కాపాడుకుందాం రండి’’ అంటూ పచ్చదనం పాఠాలు చెబుతున్నాడు ట్రీ టీచర్ భేరారం భాఖర్. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా కుగ్రామం ఇంద్రోయ్‌కుచెందిన భేరారం భాఖర్ స్కూల్లో చదివే రోజుల్లో .. విద్యార్థులందర్నీ టూర్‌కు తీసుకెళ్లారు. ఈ టూర్లో యాభై మొక్కలను నాటడం ఒక టాస్క్‌గా అప్పగించారు పిల్లలకు. తన స్నేహితులతో కలిసి భేరారం కూడా మొక్కలను ఎంతో శ్రద్ధ్దగా నాటాడు. అలా మొక్కలు నాటడం తనకి బాగా నచ్చింది. టూర్ నుంచి ఇంటికొచ్చిన తరువాత మొక్కలు నాటి, వాటిని పరిరక్షించడం వల్ల ప్రకృతి బావుంటుంది అని తెలిసి భాఖర్‌కు చాలా సంతోషంగా అనిపించింది. మిగతా పిల్లలంతా మొక్కలు నాటడాన్ని ఒక టాస్క్‌గా తీసుకుని మర్చిపోతే భేరారం మాత్రం దాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు.‘‘ప్రకృతిని ఎంత ప్రేమగా చూసుకుంటే అది మనల్ని అంతగా ఆదరిస్తుంది. పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత’’అని నిర్ణయించుకుని అప్పటి నుంచి మొక్కలు నాటడం మొదలు పెట్టాడు. ట్రీ టీచర్‌గా... మొక్కలు నాటుతూ చదువుకుంటూ పెరిగిన భాఖర్‌కు ప్రభుత్వ స్కూల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది. దీంతో తనకొచ్చిన తొలిజీతాన్ని మొక్కల నాటడానికే కేటాయించాడు.‘మొక్కనాటండి, జీవితాన్ని కాపాడుకోండి’ అనే నినాదంతో తన తోటి టీచర్లను సైతం మొక్కలు నాటడానికి ప్రేరేపించాడు. ఇతర టీచర్ల సాయంతో బర్మార్ జిల్లా సరిహద్దుల నుంచి జైసల్మేర్, జోధర్, ఇంకా ఇతర జిల్లాల్లో సైతం మొక్కలు నాటుతున్నాడు. ఒకపక్క తన విద్యార్థులకు పాఠాలు చెబుతూనే, మొక్కల ప్రాముఖ్యాన్ని వివరిస్తూ ప్రకృతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. మొక్కలను ఉచితంగా సరఫరా చేస్తూ మొక్కలు నాటిస్తున్నాడు. తన స్కూలు విద్యార్థులకేగాక, ఇతర స్కూళ్లకు కూడా తన మోటర్ సైకిల్ మీద తిరుగుతూ మొక్కలు నరకవద్దని చెబుతూ ట్రీ టీచర్‌గా మారాడు భేరారం. అడవి కూడా కుటుంబమే... బర్మార్‌లో పుట్టిపెరిగిన భాఖర్‌కు అక్కడి వాతావరణ పరిస్థితులపై మంచి అవగాహన ఉంది. సరిగా వర్షాలు కురవకపోవడం, నీళ్లు లేక పంటలు పండకపోవడం, రైతుల ఆవేదనను ప్రత్యక్షంగా చూసి ఎడారిలో ఎలాగైనా పచ్చదనం తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడు. ఈ క్రమంలోనే... ‘ఫ్యామిలీ ఫారెస్ట్రీ’ పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. మొక్కను మన కుటుంబంలో ఒక వ్యక్తిగా అనుకుంటే దానిని కచ్చితంగా కాపాడుకుంటాము. అప్పుడు మొక్కలు పచ్చగా పెరిగి ప్రకృతితో పాటు మనమూ బావుంటాము అని పిల్లలు, పెద్దల్లో అవగాహన కల్పిస్తున్నాడు. భేరారం మాటలతో స్ఫూర్తి పొందిన యువతీ యువకులు వారి చుట్టుపక్కల ఖాళీస్థలాల్లో మొక్కలు నాటుతున్నారు. నాలుగు లక్షలకుపైగా... అలుపెరగకుండా మొక్కలు నాటుకుంటూపోతున్న భేరారం ఇప్పటిదాకా నాలుగు లక్షలకుపైగా మొక్కలు నాటాడు. వీటిలో పుష్పించే మొక్కలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలతో సహా మొత్తం లక్షన్నర ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడి మట్టిలో చక్కగా పెరిగే మునగ మొక్కలు ఎక్కువగా ఉండడం విశేషం. రాజస్థాన్‌లోని ఎనిమిది జిల్లాల్లో పన్నెండు లక్షల విత్తనాలను నాటాడు. 28వేల కిలోమీటర్లు బైక్ మీద తిరుగుతూ లక్షా ఇరవైఐదు వేలమందికి మొక్కల నాటడంతో పాటు, వాటి ప్రాముఖ్యం గురించి అవగాహన కల్పించాడు. మొక్కలే కాకుండా 25వేల పక్షులకు వసతి కల్పించి వాటిని ఆదుకుంటున్నాడు. గాయపడిన వన్య్రప్రాణులను సైతం చేరదీస్తూ పర్యావరణాన్ని పచ్చగా ఉంచేందుకు కృషిచేస్తున్నాడు. చంద్రయాన్ మిషన్ విజయవంతమైనట్టుగా.. భేరారం కృషితో ఎడారి ప్రాంతం కూడా పచ్చదనంతో కళకళలాడాలని కోరుకుందాం. -
రైతులకు మేలు చేసేలా..పురుగులకు కుటుంబ నియంత్రణ!
వ్యవస్థాపకుడు డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి పంట పొలాల్లో, పండ్ల తోటల్లో పురుగుల నియంత్రణకు పురుగుమందులు/కషాయాలు చల్లటం కన్నా.. అసలు ఆయా ప్రత్యేక జాతి పురుగుల సంతతినే పెరగకుండా అరికట్టగలిగితే రైతులకు శ్రమ, ఖర్చు తగ్గటంతో పాటు, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి కూడా మేలు జరుగుతుందంటున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు. వివిధ శాస్త్రవిభాగాల్లో పరిశోధనలు పూర్తిచేసిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే వినూత్నమైన ఫెరమోన్ ఆధారిత అప్లికేషన్లు, ఆవిష్కరణలను వెలువరించారు. కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి అగ్రికల్చర్ గ్రాండ్ ఛాలెంజ్ పురస్కారాన్ని అందుకున్న ఈ సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తేవడానికి శాస్త్రవేత్తలు హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో ఎటిజిసి బయోటెక్ అనే కంపెనీని నెలకొల్పారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఇటీవల నిర్వహించిన ‘ఎట్‌హోమ్ రిసెప్షన్ ’లో ఈ సంస్థ సహ–వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, హెచ్‌సియూ పూర్వ విద్యార్థి డాక్టర్ విజయ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన అందించిన వివరాల ప్రకారం ఈ వినూత్న సాంకేతికత వివరాలను పరిశీలిద్దాం.. పురుగుల సంతతిని అరికట్టే వ్యూహం ఆడ రెక్కల పురుగు సంతానోత్పత్తి దశలో మగ రెక్కల పురుగును ఆకర్షించడానికి ప్రత్యేకమైన వాసనతో కూడిన హార్మోన్ వంటి రసాయనాన్ని గాలిలోకి విడుదల చేస్తుంది. మగ పురుగు ఆ ఫెరమోన్ వాసనను బట్టి ఆడ పురుగు ఉన్న చోటుకు వెళ్లి కలుస్తుంది. ఈ కలయిక సజావుగా జరిగితే ఆడ పురుగు గుడ్లు పెడుతుంది. ఆ విధంగా పురుగుల సంతతి పంట పొలంలో స్వల్ప కాలంలోనే పదులు వందలుగా, వందలు వేలుగా పెరిగిపోయి పంటను ఆశించి దిగుబడిని నష్ట పరచటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే, ఆడ–మగ రెక్కల పురుగుల కలయికే జరగకుండా చూడటం ద్వారా సంతతి పెరుగుదలను అరికట్టడం ఇక్కడ వ్యూహం. ఈ వ్యూహాన్ని అమలుపరచడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధన శాస్త్రవేత్తలు రూపొందించిన వినూత్న పద్ధతి ఏమిటంటే.. కృత్రిమ ఫెరమోన్తో కూడిన ప్రత్యేక పేస్ట్‌ను రూపొందించటం. ఈ పేస్ట్‌ను పంట పొలంలో మొక్కలకు అక్కడక్కడా అంటిస్తే.. ఆ వాసనకు మగ రెక్కల పురుగు ఆడ పురుగు ఉందనుకొని మొక్కపై ఉన్న పేస్ట్ దగ్గరకు వస్తుంది. తీరా లేకపోయే సరికి తికమకకు గురవుతుంది. ఆడ రెక్కల పురుగులను కలిసే ప్రయత్నంలో నూటికి 90 సార్లు విఫలమవుతుంది. దాంతో ఆ పురుగు సంతానోత్పత్తి ఆ మేరకు పరిమితమవుతుంది. ఈ టెక్నిక్‌ను ఉపయోగించి పురుగు తొలి దశలోనే పేస్ట్‌ను పొలంలో అక్కడక్కడా మొక్కలకు పూస్తే చాలు. పురుగుల్ని నిర్మూలించకుండానే వాటి సంఖ్యను చాలా వరకు అదుపులోకి తేవటం ద్వారా పంట దిగుబడికి పెద్దగా నష్టం జరగకుండా చూసుకోవచ్చు. ఇది సరిగ్గా చేస్తే ఆ పురుగు నిర్మూలనకు రైతులు పురుగుమందు కొట్టే శ్రమ, ఖర్చు, కాలుష్యం ఉండదు. అయితే, పురుగుల తీవ్రతను తెలుసుకునేందుకు లింగాకర్షక బుట్టలు చాలా కాలంగా రైతులు వాడుతున్నారు. ఫెరమోన్ ఎర వాసనతో వచ్చి లింగాకర్షక బుట్టల్లో పడే మగ రెక్కల పురుగుల సంఖ్యను, పొలంలో అప్పుడు ఆ పురుగు తీవ్రతను గుర్తించి, పురుగు మందులు/కషాయాలు చల్లటం వంటి నియంత్రణ చర్యలను రైతులు చేపడుతున్నారు. ఈ లోగా పురుగుల సంతతి పెరిగిపోతోంది. అయితే, ఈ కొత్త పద్ధతి ద్వారా ఈ పురుగుల సంతతి పెరగకుండా ముందు నుంచే వాటి కలయికను నివారించవచ్చు. పురుగు ఉధృతిని ఎర ఉపయోగించి గమనించవచ్చు. పత్తిలో గులాబీ పురుగుకు చెక్ గులాబీ రంగు పురుగు వలన పత్తి రైతులు సగటున ఎకరానికి 6–7 క్వింటాళ్ల పత్తిని నష్టపోతున్నారు. పురుగులను సమర్థవంతంగా అరికట్టడానికి ఫెరొమోన్ పర్యవేక్షణ మాత్రమే సరిపోదు. ఇప్పుడు పర్యవేక్షణే కాకుండా ఫెరొమోన్ ఆధారిత నియంత్రణ విధానం అందుబాటులోకి వచ్చింది. ఇది ఎరను ఉపయోగించకుండా ఫెరొమోన్ పేస్ట్ ద్వారా పురుగులను అరికట్టే సరికొత్త పద్ధతని డాక్టర్ విజయభాస్కర్‌రెడ్డి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. ప్రస్తుతం బీటీ పత్తి పొలాల్లో విజృంభిస్తున్న గులాబీ లద్దె పురుగును అరికట్టేందుకు ప్రత్యేకమైన పేస్ట్‌ను తమ కంపెనీ రూపొందించిందన్నారు. పేటెంట్ కలిగిన ఈ టెక్నాలజీకి కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత రైతులకు అందుబాటులోకి తెచ్చిందన్నారు. పత్తి పంటలో 3 సార్లు.. ఎకరం పత్తి చేనులో అన్ని మొక్కలకూ పేస్ట్‌ను పెట్టక్కర లేదు. 400 మొక్కల (పొలంలో 7–8% మొక్కల)కు ఈ పేస్ట్‌ను బఠాణీ గింజంత అంటించాలి. మొక్క పై నుంచి 10–15 సెం.మీ. కిందికి, కాండం నుంచి కొమ్మ చీలే దగ్గర పెట్టాలి. ఒక సాలులో 4 మీటర్లకు ఒక మొక్కకు పెడితే చాలు. ఒక సాలులో మొక్కలకు పెట్టి, రెండు సాళ్లు వదిలేసి మూడో సాలుకు పెడితే సరిపోతుంది. ఎకరం మొత్తానికి 125 గ్రాముల పేస్ట్ సరిపోతుందని డా. రెడ్డి వివరించారు. ఒక్కో మొక్క కాండంపై 250 నుంచి 300 మిల్లీ గ్రాముల మేరకు పెట్టాలి. పత్తి పంట కాలంలో మొత్తం 3 సార్లు పేస్ట్ పెట్టాలి. విత్తనాలు వేసిన తర్వాత (పువ్వు/ గూడ ఏర్పడటానికి ముందు) ఇంచుమించుగా 30–35 రోజులకు మొదటిసారి, విత్తిన 60–65 రోజుల తర్వాత రెండోసారి, విత్తిన 90–95 రోజుల తర్వాత మూడవ సారి పెట్టాలి. తుది పంట కోసే వరకు ప్రతి 30–35 రోజుల వ్యవధిలో ఉపయోగించాలి. ఇలా చేస్తే పంట ఖర్చు తగ్గి, దిగుబడి, నాణ్యత పెరుగుతుంది. ఎకరానికి పేస్ట్ ఖర్చు మూడు సార్లకు రూ. 4 వేలు అయినప్పటికీ, రైతు రూ. 30 వేల వరకు అధికాదాయం పొందగలుగుతారని ఆయన అన్నారు. మిత్రపురుగులు సురక్షితం ఈ సాంకేతికతలో పురుగుమందులు /హానికరమైన రసాయనాలు లేనందున పర్యావరణానికి హాని కలిగించదని డా. విజయభాస్కర్‌రెడ్డి వివరించారు. నేల, గాలి, నీరు పురుగు మందుల అవశేషాలతో కలుషితం కావు. మిత్ర పురుగులకు, పరాన్న జీవులు వంటి సహజ శత్రువులకు సురక్షితంగా ఉంటాయి. తేనెటీగలు నశించవు. సహజ పరాగ సంపర్కం బాగుంటుంది. రైతుకు, కూలీలకు సురక్షితమైనది. మొక్కకు హాని కలిగించదు. పత్తి నాణ్యత, రంగు మెరుగ్గా ఉంటుంది. మంచి ధరను పొందే అవకాశం కలుగుతుంది అన్నారాయన. దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రయోగాల్లో 90% పైగా పత్తిలో గులాబీ పురుగును ఈ పేస్ట్ నియంత్రిస్తున్నట్లు నిరూపితమైందని ఆయన తెలిపారు. (ఇతర వివరాలకు.. టోల్‌ఫ్రీ నంబర్ 1800 121 2842) త్వరలో వంగకు కత్తెర పురుగుకు కూడా.. ప్రస్తుతానికి పత్తిలో గులాబీ పురుగును నియంత్రించేందుకు పేస్ట్‌ను రైతులకు అందుబాటులోకి తెచ్చాం. వంగ తోటల్లో కాయ/కాండం తొలిచే పురుగుల నియంత్రణకు ప్రత్యేక పేస్ట్‌ను కేంద్ర ప్రభుత్వ అనుమతుల తర్వాత 2–3 నెలల్లో విడుదల చేయబోతున్నాం. ఇది అందుబాటులోకి వస్తే వంగ రైతులకు పురుగు మందుల ఖర్చు, శ్రమ గణనీయంగా తగ్గుతుంది. అంతేకాక వినియోగదారులు పురుగుమందు అవశేషాలు లేని వంకాయలను తినటం సాధ్యమవుతుంది. ఇప్పటికే పండ్లు/కూరగాయ తోటల్లో నష్టం చేస్తున్న పండు ఈగను ఆకర్షించి చంపే జెల్ ల్యూర్ అందుబాటులో ఉంది. శ్రీ కొండా లక్షణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఉద్యాన శాఖ దీనిపై అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మొక్కజొన్న సహా అనేక పంటలకు నష్టం చేస్తున్న కత్తెర పురుగు నియంత్రణకు వినూత్న పద్ధతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. వీటి తయారీలో ఎలాంటి జన్యుమార్పిడి సాంకేతికతను వాడటం లేదు. రైతులు ఈ సాంకేతిక పద్ధతిని పురుగు ఉదృతి పెరిగినాక కాకుండా ముందు జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుంది. ఒక ప్రాంతంలో రైతులు కలసి వాడితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయి. – డా. విజయ భాస్కర్ రెడ్డి, ఎటిజిసి బయోటెక్ సహ–వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, జీనోమ్ వ్యాలీ, హైదరాబాద్. (చదవండి: -
ఎవరికి వారు పెంచుకునేలా..వెటరన్ ఇంటిగ్రేటెడ్ ఫామ్!
ఉద్యోగ విరమణ అనంతరం విశ్రాంత జీవితంలో తనకు నైపుణ్యం ఉన్న రంగంలో కృషిని కొనసాగించడం ఇటు తనకు, అటు సమాజానికి మేలు జరుగుతుందని నమ్మే వ్యక్తి వెస్లీ రొసారియో. తన నమ్మకాన్ని ఆచరణలో పెట్టి వాహ్ అనిపించుకుంటున్నారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన వెస్లీ చేపలు, రొయ్యల పెంపకంలో నిపుణుడు. బ్యూరో ఆఫ్ ఫిషరీస్ అండ్ ఆక్వాటిక్ రిసోర్సెస్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షుడిగా ఉన్నత స్థాయిలో సేవలందించి దగుపన్ నగరంలో మూడేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ బాధ్యతల రీత్యా బదిలీల వల్ల టపుయాక్ జిల్లాలోని తమ పూర్వీకుల ఇంటిని ఖాళీగా ఉంచాల్సి వచ్చింది. అక్కడ ఎవరూ లేకపోయేసరికి ఆ ఇంటితో పాటు వెయ్యి చదరపు మీటర్ల పెరడు కూడా నిరుపయోగంగా పాడు పడింది. రిటైరైన తర్వాత ఆయన ఇంటికి చేరుకొని కొద్ది నెలల్లోనే ఫిష్‌టెక్ అర్బన్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫార్మింగ్ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పటంతో ఇంటికే కాదు పెరటికి కూడా కళ వచ్చింది. ఇంటిపట్టునే కూరగాయలు, ఆకుకూరలు, కోళ్లతో పాటు చేపలను కూడా నిశ్చింతగా ఎవరికివారు పెంచుకొని ఇంటిల్లపాదీ పౌష్టికాహారాన్ని ఆస్వాదించవచ్చని వెస్లీ రొసారియో తన అర్బన్ ఇంటిగ్రేటెడ్ ఫామ్‌లో ఆచరించి చూపుతున్నారు. యూత్, సెకండ్ యూత్ అన్న తేడా లేకుండా బ్యాచ్‌ల వారీగా అందరికీ శిక్షణ ఇస్తున్నారాయన. ట్యాంకు నుంచి అజోలాను వెలికితీస్తున్న రొసారియో వెస్లీ రొసారియో పెరటి తోటలో మొత్తం ఎనిమిది (మీటరు వెడల్పు, మూడు మీటర్ల పొడవైన) చిన్న చెరువులు ఉన్నాయి. నేలపై తవ్విన చెరువుతో పాటు సిల్పాలిన్ షీట్, ఫైబర్‌తో చేసిన కృత్రిమ చెరువులు కూడా ఉన్నాయి. రీసర్కులేటరీ ఆక్వా చెరువు కూడా అందులో ఒకటి. కూరగాయలు, ఆకుకూరలు సాగయ్యే మడులతో పాటు కంటెయినర్లు ఉన్నాయి. హైడ్రోపోనిక్స్ వ్యవస్థలో ఆకుకూరలు, ఔషధ మొక్కలు పెంచుతున్నారు. ఆక్వాపోనిక్స్ వ్యవస్థ అదేవిధంగా ఆక్వాపోనిక్స్ వ్యవస్థ ఉంది. చేపల విసర్జితాలు, వాటికి వేసే మేత వ్యర్థాలతో కూడిన ఆ నీరు పోషకవంతమై ఆకుకూరలకు ఉపయోగపడుతోందని వెస్లీ రొసారియో తెలిపారు. నేలపై ఉన్న చెరువులో జెయింట్ గౌరామి, తిలాపియా, ఫంగాసియస్, క్యాట్‌ఫిష్‌లు పెరుగుతున్నాయి. నాటు కోళ్లు, బాతులకు ఆయన ప్రధానంగా అజోలాని పండించి మేతగా వేస్తున్నారు. అజోలాను నీటిలో వేస్తే చాలు, పెరుగుతుంది. ప్రాసెసింగ్ అవసరం లేదు. నేరుగా చేపలు, జంతువులకు, పక్షులకు మేతగా వేయొచ్చని ఆయన అన్నారు. అజోలా పెరిగే చెరువుల్లో దోమలు గుడ్లుపెట్టే అవకాశం ఉండబోదన్నారు. చెరువు నీటిలో చేపలు పెంచుతూనే, ఆ చెరువు నీటిపై తేలాడే మడు(ఫ్లోటింగ్ బెడ్)లను ఏర్పాటు చేసి అజోలాను పెంచుతుండటం విశేషం. సందర్శకులకు హైడ్రోపోనిక్స్ గురించి వివరిస్తున్న వెస్లీ రొసారియో చేపల తలలు, తోకలు, రెక్కలు, పొలుసులు, లోపలి భాగాలు వంటి వ్యర్థాలను సేకరించి మీనామృతం తయారు చేసి, పంటలపై పిచికారీ చేస్తే బలంగా పెరుగుతాయని రోసారియో తెలిపారు. వంకాయలు, మిరపకాయలు, బెండకాయకాయలు తదితర కూరగాయలను పండిస్తాం. బాతులు, నాటు కోళ్లు గుడ్లు పెడుతున్నాయి. పట్టణ ప్రజలు పెరట్లో చేపలు, కూరగాయలు పెంచుకోవడానికి శ్రద్ధ కావాలే గానీ పెద్దగా పెట్టుబడి అవసరం లేదు అంటున్నారు రొసారియో. అనుభవాలను పంచుకోవడం చాలా రిలాక్సింగ్‌గా ఉంది నేను పదవీ విరమణ తర్వాత జీవితం ఉండేలా చూడాలనుకున్నాను. నన్ను బిజీగా ఉంచుకోవడానికి ఏమి చేయాలో ముందుగానే ప్లాన్ చేసాను. నా వృత్తిపరమైన జీవితమంతా ఫిషరీస్‌లో పనిచేశాను కాబట్టి ఫిష్‌టెక్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫామ్‌ని ఏర్పాటు చేశాను. నా అనుభవాలను పంచుకోవడం చాలా రిలాక్సింగ్‌గా ఉంది. అలాగే, వచ్చి సలహాలు అడిగే మాజీ సహోద్యోగులతో సంబంధాలు కొనసాగటం సంతోషంగా ఉంది. – వెస్లీ రొసారియో, దగుపన్ నగరం, ఫిలిప్పీన్స్ (చదవండి: పెద్ద విస్తీర్ణంలో ప్రకృతి సేద్యం ఎలా చేయాలంటే..!) -
ఐఐటీ విద్యార్థులు.. పచ్చని కూరగాయలు పండిస్తున్నారు
బంజరు భూములలో కూడా బంగారాన్ని పండించవచ్చని నిరూపిస్తున్నారు ఐఐటీ–బాంబే గ్రాడ్యుయేట్స్ అభయ్ సింగ్, అమిత్ కుమార్‌లు. వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే క్లైమెట్ ప్రూఫ్ చాంబర్స్ ద్వారా రసాయన రహిత కూరగాయలను పచ్చగా పండిస్తున్నారు. ‘ఇకీ ఫుడ్స్’ స్టార్టప్‌తో ఈ మిత్రద్వయం అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది... అభయ్ సింగ్, అమిత్ కుమార్‌లు ఐఐటీ–బాంబేలో బెస్ట్ ఫ్రెండ్స్. చాలామంది స్నేహితులలాగా సినిమాలు, క్రికెట్ గురించి కంటే పర్యావరణం, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా మాట్లాడుకునేవారు. ‘కాలేజి రోజుల నుంచి సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించడం మా అలవాటు. రకరకాల ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుకునే వాళ్లం. క్లాస్ పూర్తయిన తరువాత ఎన్నో విషయాలపై మేధోమథనం చేసేవాళ్లం చదువుకున్నామా? ఉద్యోగాలు చేశామా? అని కాకుండా సమాజం కోసం మా వంతుగా ఏదైనా చేయాలనుకునే వాళ్లం. మన దేశంలో ఎంతో మంది వ్యవసాయరంగంలో పనిచేçస్తున్నారు. వారి కోసం ఏదైనా చేయాలనుకునేవాళ్లం. ఏదైనా సాధించాలనే తపన పుట్టినప్పుడు ఆత్మవిశ్వాసం మొదలవుతుంది. అది అనేక రకాలుగా శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. మా విషయంలోనూ ఇదే జరిగింది’ అంటాడు అమిత్. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అమిత్, అభయ్‌లు ఆ రంగానికి సంబంధించిన రకరకాల ప్రయోగాలు చేస్తూ స్థిరమైన, అనుకూలమైన, అందుబాటులో ఉండే సాంకేతికతను రైతులకు దగ్గర చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ‘జనాభా పెరుగుదల దృష్ట్యా మన దేశంలో ఆహార కొరత ఏర్పడనుంది. ఆహారంలో పోషక విలువలు కోల్పోనున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా, ఆరోగ్యానికి మేలు చేసేలా, వేగంగా ఉత్పత్తి చేసేలా కొత్త ఆవిష్కరణలు చేయాలనుకున్నాం’ అంటాడు అభయ్. తాము చర్చించుకున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని ‘ఇకీ ఫుడ్స్’ అనే అంకురాన్ని ప్రారంభించారు. ‘ఇకీ ఫుడ్స్’ మొదలు పెట్టినప్పుడు మొదటి మూడు సంవత్సరాలు పరిశోధన, అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టారు. వీరు సృష్టించిన సాంకేతికత ఎనభై శాతం నీటి వృథాను ఆరికడుతుంది. సంప్రదాయ పద్ధతుల్లో కంటే 75 శాతం వేగవంతమైన వృద్ధిరేటు ఉంటుంది. వివిధ రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే క్లైమెట్ ప్రూఫ్ చాంబర్స్ ద్వారా రసాయనరహిత కూరగాయలను పండిస్తున్నారు. గత సంవత్సరం తమ టెక్నాలజీకి సంబంధించిన పేటెంట్ రైట్స్ పొందారు. ‘ఎన్నో రకాల వ్యవసాయ పద్ధతులు ఉన్నా అవసరాలకు తగిన పద్ధతులు కనిపించడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వేగవంతమైన ఉత్పత్తి విధానాలకు ప్రాధాన్యత ఇచ్చాం. మట్టి నుంచి మొక్క మొలకెత్తడానికి నీరు. ఆక్సిజన్, పోషకాలు, సపోర్ట్ అవసరం అవుతాయి. ఈ నాలుగు ఆధారాలతో మట్టితో పని లేకుండా మొక్కలను సృష్టించాలనుకున్నాం. డెబ్బైశాతం తేమ ఉన్న గదిలో అవసరమైన పోషక మూలాలను స్ప్రే చేసి ప్రయోగాలు మొదలు పెట్టాం’ అంటాడు అమిత్. సంపన్న దేశాల వ్యవసాయ క్షేత్రాల హైడ్రోపోనిక్స్ సిస్టమ్‌లో ఉపయోగించే కూలర్లు, చిల్లర్లు, బ్లోయర్లు, ప్లాస్టిక్ ఎన్క్లోజర్లకు ఈ మిత్రద్వయం దూరంగా ఉండాలనుకుంటోంది. సౌరశక్తిలోని అద్భుతాన్ని ఉపయోగించుకొని సంప్రదాయ పద్ధతుల్లో కంటే ఎక్కువ దిగుబడి సాధించాలనుకుంటోంది. రాజస్థాన్‌లోని కోట కేంద్రంగా పని చేస్తున్న ‘ఇకీ ఫుడ్స్’ స్టార్టప్ ‘కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అగ్రికల్చర్’ను తన నినాదంగా, విధానంగా ఎంచుకుంది. రాబోయే రోజుల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలలో ‘ఇకీ ఫుడ్స్’ క్షేత్రాలకు శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నారు అమిత్, అభయ్‌లు. ఇకిగై అంటే... ఇకిగై అనేది జపనీస్ కాన్సెప్ట్. ఆరోగ్యవంతమైన. శక్తివంతమైన జీవన విధానాన్ని ప్రతిఫలించే మాట. జపనీస్ పదాలు ఇకీ (జీవితం), కై (ఫలితం, ఫలం) నుంచి పుట్టింది. స్ఫూర్తిదాయకమైన ‘ఇకిగై’ కాన్సెప్ట్ నుంచి తమ స్టార్టప్‌కు ‘ఇకీ ఫుడ్స్’ అని నామకరణం చేశారు అమిత్, అభయ్‌లు. కొత్త ఆలోచనలు వృథా పోవు. కాస్త ఆలస్యమైనా మంచి ఫలితం దక్కుతుంది. – అమిత్ కుమార్, ఇకీ–ఫుడ్స్, కో–ఫౌండర్ -
సాగుబడి లాభసాటి కావాలంటే...
న్యూఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో కూరగాయలమ్మే వ్యక్తి తాలూకు ఒక వీడియో వైరల్ అయ్యింది. దిగమింగుకోవడం కష్టమైపోయిన ఆయన కన్నీళ్లలో తన ఆర్థిక బాధ స్పష్టంగా కనిపించింది. జీవనోపాధి కోసం ఎక్కువ మంది ఆధారపడి ఉన్నందున, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే సవాలును ఆర్థికవేత్తలు స్వీకరించాలి. ఇప్పుడున్న ఆర్థిక నమూనాను ధిక్కరించయినా రైతుల చేతులకు ఎక్కువ ఆదాయాన్ని అందించాలి. వచ్చే ఐదేళ్లను పూర్తిగా వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి కేటాయించాలి. సంస్కరణలు ప్రారంభించినప్పటి నుండి పరిశ్రమలకు ఇచ్చినన్ని వనరులు, ప్రోత్సాహకాలు, ఆర్థిక ఉద్దీపనలను ఇప్పుడు వ్యవసాయానికి అందించాలి. ప్రతి రైతు, కూలీ కన్నీళ్లు తుడవడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. కొన్నిసార్లు మాటల కంటే నిశ్శబ్దం మరింత బిగ్గరగా మాట్లాడుతుంది. న్యూఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో ఓ కూరగాయల అమ్మకందారుపై తీసిన,గుండెను పిండేసే వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. పెరిగిన ధరలకు టమోటాలు కొనలేకపోతే ఖాళీ బండితో తిరిగి వెళతావా అని అడిగినప్పుడు, ఆయన మూగబోయాడు. అదే సమయంలో తన కన్నీళ్లను అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఆయన మౌనమే శక్తిమంతమైన సమాధానం అయింది. మార్కెట్లోకి వచ్చే కొత్త కార్ మోడళ్లు, సూపర్‌స్టోర్‌లను ముంచెత్తుతున్న సరికొత్త ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వెంటపడుతున్న దేశ ప్రజల సున్నిత హృదయాలకు ఆ చిన్న వీడియో షాక్ కలిగించింది. తాజా ఆటోమొబైల్స్ గురించి, సరికొత్త ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల గురించి టీవీ షోలు నిత్యం మోతమోగిస్తున్నప్పుడు, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గురించి ఎప్పటికప్పుడు నివేదికలు వెలువడుతున్న ప్పుడు, ఒక వీడియో క్లిప్... మధ్యతరగతిని మైకం నుంచి బయటకు లాగడమే కాకుండా కఠినమైన వాస్తవాలను వారి ముఖాముఖి తీసు కొచ్చింది. న్యూఢిల్లీకి చెందిన కూరగాయలమ్ముకునే రామేశ్వర్‌పై చిత్రించిన క్లిప్ సరిగ్గా అటువంటి ఉదాహరణే. దిగమింగుకోవడం కష్టమైపోయిన ఆయన కన్నీళ్లలో తన ఆర్థిక బాధ స్పష్టంగా కనిపించింది. ఎంత సంపాదించారని ప్రశ్నించగా, రోజుకు రూ.100–200కు మించి రావడం లేదన్నాడు. ఆయన సమాధానం భారతదేశ పేదరిక స్థాయిలనే కాకుండా, పెరుగుతున్న అసమానతల విస్ఫోటనాన్ని కూడా బయటపెట్టింది. అయితే మహారాష్ట్రలోని ఠిక్పుర్లీకి చెందిన 45 ఏళ్ల చెరకు రైతు, కూలీ గురించి చాలామందికి తెలియదు. భారతి పాటిల్ అనే ఆ రైతు, ఒక పరిశోధనా వేదికతో మాట్లాడుతూ, ‘‘గత ఐదేళ్లుగా మా కూలీలు పెద్దగా మారలేదు. నోట్ల రద్దుకు ముందు రోజుకు 100 రూపాయలు వచ్చేది, ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు పనిచేసినా మాకు రూ. 150 మాత్రమే చేతికి అందుతోంది’’ అని పేర్కొన్నారు. మరో మాటలో చెప్పాలంటే, ఒక సన్నకారు చెరకు రైతుకు ఒక రోజుకు దక్కుతున్న మొత్తాన్ని ఇది బయటపెడుతుండగా, మహారాష్ట్రలోని చక్కెర బెల్ట్‌లో రోజువారీ కూలీ గత ఐదేళ్లలో రూ.50 మాత్రమే పెరిగిందని కూడా వెల్లడవుతోంది. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నా సన్నకారు రైతులు, రైతు కూలీలు ఏటా అదే తక్కువ కూలీ మొత్తంతో ఎలా బతుకుతున్నారనేది జీర్ణించుకోవడం కష్టం. ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసినప్పుడు నిజమైన కూలీల పెరుగుదల సున్నాకు దగ్గరగానే ఉంది. ఏరకమైన అర్థవంతమైన పెరుగుదలా కనబడలేదు. వాస్తవానికి, కొన్ని అధ్యయనాలు 2013 –17 మధ్య నిజమైన వేతనాలు తగ్గుముఖం పట్టడం లేదా స్తబ్ధుగా ఉండటాన్ని సూచించాయి. దేశంలోని 90 కోట్ల మంది కార్మికులలో చాలా మంది అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల పట్ల భ్రమలు కోల్పోయారనీ, దీంతో వారు ఉద్యోగాల కోసం వెతకడం కూడా మానేశారనీ 2022 ఏప్రిల్‌లో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ఐఈ) పేర్కొంది. ఈ కారణం వల్లే 2021–22లో దేశ ఉపాధిలో 45.5 శాతంగా ఉన్న వ్యవసాయ రంగం వాటా, మహమ్మారి ముందు స్థాయికి చేరలేదని పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పేర్కొంది. అప్పుడు శ్రామిక శక్తిలో 42.5 శాతంతో వ్యవసాయరంగ జనాభా వాటా సాపేక్షంగా తక్కువగా ఉందని ఈ నివేదిక తెలిపింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించిన తర్వాత వారి గ్రామాలకు తిరిగి వచ్చిన 10 కోట్ల మంది కార్మికులలో గణనీయమైన భాగం మళ్లీ నగరాలకు తిరిగి రాలేదు. అదేవిధంగా, బంగ్లాదేశ్‌లో కూడా ఈ సంవత్సరం వ్యవసాయంపై ఆధారపడటం పెరిగింది. బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం, వ్యవసాయ రంగంలో సంవత్సర ప్రాతిపదికన చూసిన ప్పుడు 2023 ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అత్యధిక ఉద్యోగాల కల్పన జరిగింది. అదే సమయంలో నగరాల్లో అధికారిక ఉపాధి అవకాశాలు లేకపోవడాన్ని సూచిస్తున్నందున ఇది మంచి సంకేతం కాదని కొందరు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అసమానత ఎంత నిరుత్సాహకరంగా మారుతున్నదో ముందుగా చూద్దాం. ప్రపంచ స్థాయిలో అధ్వాన్నంగా పెరుగుతున్న అసమానతలను ‘వరల్డ్ ఇన్–ఈక్వాలిటీ రిపోర్ట్’ వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం, ప్రపంచ జనాభాలో అత్యంత సంపన్నులైన 10 శాతం మంది మొత్తం సంపదలో 76 శాతాన్ని కలిగి ఉన్నారు. అయితే దిగువ సగం మంది కేవలం 3 శాతం సంపద కలిగి ఉన్నారు. భారతదేశంలో కూడా అగ్రశ్రేణి 1 శాతం మంది, దేశ సంపదలో 40.5 శాతాన్ని కలిగి ఉన్నారని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ చెబుతోంది. ధనికులు సంపదను కూడబెట్టుకోవడం కొనసాగిస్తుండగా, పేదలు పేదరికంలోకి మగ్గిపోయేలా ఆర్థిక రూపకల్ప నను మన విధాన నిర్ణేతలు అల్లుకుంటూ వచ్చారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంత బలంగా పాతుకుపోయిందంటే, అసమానతలను అంతం చేయడంపై పెద్ద చర్చ జరుగుతున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి 500 మంది అత్యంత సంపన్నులు 2023 మొదటి ఆరు నెలల్లోనే తమ సంపదకు మరో 852 బిలియన్ డాలర్లను జోడించుకున్నారు. ప్రపంచ బ్యాంక్ ప్రమాణాల ప్రకారం, రోజుకు నాలుగు డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో బతుకుతున్న ‘బ్రిక్స్’ దేశాల జనాభాలో ఇండియా మొదటిస్థానంలో ఉంది. 91 శాతం జనాభా నిర్దేశిత ప్రమాణానికి కిందికి ఉంది. 50.3 శాతంతో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా కంటే కూడా ఇది ఎంతో ఎక్కువ. వ్యవసాయాన్ని అతి పెద్ద ఉపాధి కల్పనారంగంగా పరిగణనలోకి తీసుకుంటే, అసమానతలను తగ్గించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, వనరులను అవసరం ఉన్న చోట ఉపయోగించడమే. పైనుంచి కిందికి ప్రవహించే విఫల ‘ట్రికిల్ డౌన్’ ఆర్థిక వ్యవస్థను కొనసాగించ డానికి బదులుగా– దిగువ, మధ్య స్థాయులను పైకి తేవడం మీద దృష్టి పెట్టడమే అసలైన కర్తవ్యం కావాలి. భారతదేశం, బంగ్లాదేశ్‌లలో జీవనోపాధి కోసం ఎక్కువ భాగం వ్యవసాయంపై ఆధారపడి ఉన్నందున, గ్రామీణ పరిశ్రమలను ప్రోత్స హించడం ద్వారా వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే సవాలును ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు స్వీకరించాలి. దిగువ స్థాయి నుండి సంపదను పిండుకునే బదులు, ఇప్పుడున్న ఆర్థిక నమూనాను ధిక్క రించయినా రైతుల చేతులకు ఎక్కువ ఆదాయాన్ని అందించాలి. సజీవ వ్యవసాయం అనేది ఈ కాలపు అవసరం. ప్రతి రైతు, కూలీ కన్నీళ్లు తుడవడానికి ఇది తప్ప మరో మార్గం లేదు. వచ్చే ఐదేళ్లను వ్యవసాయాన్ని పునర్నిర్మించడానికి కేటాయించాలని నా సూచన. సంస్కరణలు ప్రారంభించినప్పటి నుండి పరి శ్రమలకు మనం ఇచ్చినన్ని వనరులు, ప్రోత్సాహకాలు, ఆర్థిక ఉద్దీపన లను ఇప్పుడు వ్యవసాయానికి అందించాలి. ఆరోగ్యకరమైన, సంప న్నమైన, పునరుత్పత్తి చేసే తదుపరి దశ సంస్కరణలకు నాంది పలికేందుకు కేవలం ఐదేళ్ల పాటు, చిన్న తరహా వ్యవసాయాన్ని, పర్యా వరణపరంగా స్థిరమైన వ్యవసాయాన్ని పునర్నిర్మించాలి. కేవలం ఐదేళ్లు – ఇంతమాత్రమే నేను అడుగుతున్నది! దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
ఉద్యాన పంటల సాగులో అనంతపురం టాప్.. తక్కువ ధరకే పండ్లు, కూరగాయలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా పేరుగాంచిన అనంతపురంలో ‘ఫల రాజసం’ అబ్బురపరుస్తోంది. అరుదైన పండ్లు, రుచికరమైన కూరగాయల ఉత్పత్తులకు కేరాఫ్‌గా నిలిచి రికార్డు సృష్టిస్తోంది. ఇక్కడ పండే బత్తాయి పండ్లు నిగనిగలాడుతాయి. ఎర్రగా మెరిసే డ్రాగన్ పండ్లు ఆకర్షిస్తాయి. అంజూర్ పండ్ల రాశులు మురిపిస్తాయి. ఎరుపు – పసుపు వర్ణం కలగలసిన దానిమ్మ పండ్లు నోరూరిస్తాయి. అన్నిటికీ మించి అరబ్ షేక్‌లను సైతం ఆకట్టుకున్న గ్రాండ్ 9 అరటి గెలలు మైమరిపిస్తాయి. ఖర్జూర ఫలాలను తెంపుతున్న మహిళా రైతు 32 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి.. రాష్ట్రంలో హార్టికల్చర్ హబ్ (ఉద్యాన పంటలకు కేంద్రం)గా అనంతపురం జిల్లా పేరుగాంచింది. చీనీ, అరటి తోటలు భూమికి ఆకుపచ్చటి రంగేసినట్టు కనిపిస్తుంటాయి. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే ఈ తరహా పంటలు ఇప్పుడు రైతుకు మంచి ఆదాయ వనరుగా మారాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 32 లక్షల మెట్రిక్ టన్నుల పండ్లు, కూరగాయలు ఈ జిల్లా నుంచే ఉత్పత్తి అయ్యాయి. అందులో సింహభాగం ఒక్క కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచే 10.85 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తవుతున్నాయి. మన కూరగాయలు భలే రుచి గురూ.. జిల్లాలో పండించే కూరగాయలు రుచికి, నాణ్యతకు పేరెన్నికగన్నవి. టమాట, పచ్చిమిరప, బెండకాయలు, ఎండు మిర్చి, గోరు చిక్కుడు, అనప, వంకాయలు అద్భుతమైన రుచికి ఆలవాలం. పైగా స్థానికంగా పండించే ఈ కూరగాయలు ధరలోనూ అసాధారణమేమీ కాదు. సరసమైన ధరలకు లభిస్తుండటంతో కొనుగోలుదారులకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉన్నాయి. ఇక్కడ ఉద్యాన పంటలన్నీ బోర్లకిందే ఉన్నాయి. గడిచిన నాలుగేళ్లుగా కరెంటు కోతలు లేకపోవడం, వర్షాలు సమృద్ధిగా పడటంతో మంచి ఫలసాయం రావడానికి కారణమైంది. విదేశాలకు ఎగుమతి.. జిల్లాలో 1,27,599 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. ఇక్కడ పండిన అరటి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ, మామిడి, సపోట, రేగు, జామ, నేరేడు, ద్రాక్ష, పుచ్చకాయ, మస్క్మొలన్ (ఢిల్లీ దోస), బొప్పాయి, టమాట, పచ్చిమిర్చి, బెండ, ఉల్లి పంట ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. విదేశాలకూ ఎగుమతి అనుకూలమైన వాతావరణమే అనంతపురం జిల్లాలో పండ్ల తోటలకు అనుకూలమైన వాతావరణం ఉంది. ఇక్కడ రైతులు కష్టపడే తత్వం ఎక్కువ. రాష్ట్రంలో అన్ని రకాల పండ్లను పండించే జిల్లాల్లో మొదటి స్థానం అనంతపురానిదే. ఈ తరహా పంటలు రైతులకు లాభదాయకంగా కూడా ఉంటాయి. – రఘునాథరెడ్డి, డిప్యూటీ డైరెక్టర్, హార్టికల్చర్ ఎకరాకు రూ.20 లక్షలు మూడు ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్స్ పంట పెట్టాను. తొలి ఏడాది ఎకరాకు రూ.3 లక్షల దాకా పెట్టుబడి వస్తుంది. ఆ తర్వాత తగ్గుతుంది. కాపుకొచ్చాక ఎకరాకు 20 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను ప్రస్తుతం రూ.లక్ష పలుకుతోంది. మరో ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఖర్జూర పెట్టాను. ఆ పంట ఇంకా కాపునకు రాలేదు. మన నేలలు ఏ ఫలాలకై నా అనుకూలంగానే ఉంటాయి. – కె.వి.రమణారెడ్డి, రైతు, మర్తాడు, గార్లదిన్నె మండలం -
పెద్ద విస్తీర్ణంలో ప్రకృతి సేద్యం ఎలా చేయాలంటే..!
సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ద్రావణాలు, కషాయాలను చిన్న, సన్నకారు రైతులు తయారు చేసుకొని వాడగలుగుతున్నారు. అయితే, ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రియ/ప్రకృతి సేద్యం చేసే పెద్ద రైతులకు వీటి తయారీ కష్టం కావటంతో జీవన ఎరువులు, జీవన పురుగుమందులను విరివిగా వినియోగిస్తున్నారు. రైతు శాస్త్రవేత్త, తునికిలోని ఏకలవ్య కేవీకే సలహాదారు, హార్ట్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఎం.ఎస్.సుబ్రహ్మణ్యం రాజు గత కొన్ని సంవత్సరాలుగా చిన్న, పెద్ద కమతాల్లో సాగు చేసే రైతులతో కలసి పనిచేస్తున్నారు. ఖరీఫ్/లేటు ఖరీఫ్ వరి సాగులో చిన్న కమతాల రైతులు, పెద్ద కమతాల రైతులు ఏయే ఉత్పాదకాలను, ఎంతెంత మోతాదులో వాడితే మంచి ఫలితాలు వస్తున్నాయన్న అంశాలను ఆయన ‘సాక్షి సాగుబడి’కి ఇలా వివరించారు. వరి నారుమడిని నీరు నిలవని విధంగా తయారు చేసుకోవాలి. విత్తనాన్ని ఒక రోజు ముందు ఎండబెట్టి మరునాడు విత్తన శుద్ధి చేయాలి. నిద్రావస్థ ఉన్న విత్తనాలను, నిద్రావస్థ తొలగించడానికి గోరువెచ్చని నీటిలో నానబెట్టి, అనంతరం విత్తనాలను నారుమడిపై వెదజల్లాలి. 2వ రోజు నీరు బయటకు తీయాలి. 5వ రోజు నీరు పెట్టాలి. తర్వాత తగినంత నీరు ఇస్తుండాలి. చాలా ప్రాంతాల్లో నారు 6 అంగుళాల సైజు నుంచి 10 అంగుళాల సైజు వచ్చినప్పుడు మాత్రమే ఊడ్పు/నాట్లు వేస్తుంటారు. నాట్లు వేసిన 7 రోజులకు.. చనిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ నాట్లు వేయాలి. ప్రధాన పొలాన్ని ఊడ్పుకు ముందు 20 రోజుల నుంచి దఫ దఫాలుగా వారానికి ఒకసారి దుక్కి దున్ని, చదును చేసుకోవాలి. ఎకరాకు 3 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు వెయ్యాలి. నాట్లతో పాటుగా వివిధ రకాల జీవన ఎరువుల (బ్యాక్టీరియాల) ను ఇవ్వాలి. మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం ఉండేలా వరి నాట్లు వేయాలి. మధ్యలో కాలి బాటలు తీయాలి. గట్లపై నువ్వుల విత్తనాలను చల్లుకుంటే నువ్వుల పువ్వులు ఎనాగరస్ అనే కీటకాన్ని ఆకర్షించటం ద్వారా తెల్లదోమ నివారణ జరుగుతుంది. సేంద్రియ వరి సాగులో చిన్న, పెద్ద రైతులకు అనువైన ఉత్పాదకాల పట్టిక! మోతాదు ఎంత? ఎకరం పంటకు సగటున 100–120 లీ. నీటిని పిచికారీ చేయాలి మీనామృతాన్ని నారుమడిపై లీ. నీటికి 5 ఎం.ఎల్., పైరు ఎదిగిన దశలో లీ. నీటికి / 10ఎం.ఎల్. చొప్పున కలిపి పిచికారీ చేయాలి బవేరియాను లీ. నీటికి /10 గ్రా. కలిపి పిచికారీ చేయాలి ∙మెటారైజమ్ లీ. నీటికి/ 10 గ్రా. వాడాలి ∙హ్యూమిక్ యాసిడ్ కిలో విత్తనాలకు/ 10 గ్రా. వాడాలి. ∙కిలో నేలవేము పొడిని 100 లీ. నీటిలో కలిపి కషాయం తయారు చేయాలి 1500 గ్రా. వావిలాకు పొడిని కషాయం చేసుకొని 100 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి ∙ఎకరానికి రకానికి ఒక కిలో చొప్పున జీవన ఎరువులు వాడాలి ∙లీ. నీటికి 10 ఎం.ఎల్. కొబ్బరి నీరు కలపాలి పంచగవ్య నారుమడిలో పిచికారీకి లీ. నీటికి 5 ఎం.ఎల్. కలపాలి. పైరు ఎదిగే దశలో పిచికారీకి లీ. నీటికి 20 ఎం.ఎల్. కలపాలి ∙అర కేజీ ఇంగువతో ద్రావణం చేసుకొని వంద లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి 200 గ్రా. పసుపును కషాయం చేసుకొని వంద లీ. నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి ∙2 కిలోల మొలకలతో ద్రావణం చేసుకొని వంద లీ. నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి ∙6 లీ. పుల్ల మజ్జిగను వంద లీ. నీటితో కలిపి పిచికారీ చేయాలి. ఆగ్నేయ అస్త్రం తయారీలో మిర్చి, అల్లం, వెల్లుల్లిలను అర కిలో చొప్పున తీసుకొని నూరి కషాయం తయారు చేసి వంద లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. (ఇతర వివరాలకు.. సుబ్రహ్మణ్యం రాజు మొబైల్: 76598 55588) బయోచార్‌తో సేంద్రియ ఇంటిపంటల సాగుపై శిక్షణ సేంద్రియ ఇంటిపంటల సాగుపై పట్టణ/నగర వాసులపై ఆసక్తి పెరుగుతోంది. బయోచార్ (బొగ్గుపొడి) కలిపిన మట్టి మిశ్రమంతో టెర్రస్ గార్డెన్లు, పెరటి తోటలు, బాల్కనీలలో కూరగాయల పెంపకంపై ఈ నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్ మలక్‌పేటలోని న్యూలైఫ్ ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనుంది. మిగులు పంట దిగుబడులను సోలార్ డ్రయ్యర్‌తో ఎండబెట్టే విధానం కూడా వివరిస్తామని న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివ షిండే తెలిపారు. వివరాలకు.. 81210 08002. 17న అమలాపురంలో ప్రకృతి సేద్యంపై శిక్షణ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 17న కోనసీమ జిల్లా అమలాపురంలోని (ముక్తేశ్వరం– కొత్తపేట రోడ్డు) శ్రీసత్యనారాయణ గార్డెన్స్‌లో ప్రకృతి వ్యవసాయంపై నిపుణులు విజయరామ్ రైతులకు అవగాహన కల్పిస్తారని నిర్వాహకులు నిమ్మకాయల సత్యనారాయణ తెలిపారు. ప్రవేశం ఉచితం. ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. వివరాలకు.. 64091 11427 (సా. 3 గం. నుంచి 6 గం. వరకు మాత్రమే). పతంగి రాంబాబు, సాగుబడి డెస్క్. (చదవండి: ఢిల్లీకి.. మా ఊరి బొప్పాయి! ప్యాకింగ్ మరింత స్పెషల్!) -
సాగుబడి: హైడ్రోపోనిక్స్ పద్ధతిలో గడ్డిసాగుతో మంచి ఆదాయం
ప్రపంచంలోనే అత్యధిక పాలను ఉత్పత్తి చేస్తున్న మన దేశంలో పచ్చిగడ్డి లభ్యత 11 శాతం తక్కువగా ఉందని భారతీయ గడ్డి నేలలు, పశుగ్రాస పరిశోధనా సంస్థ లెక్కగట్టింది. భూతాపం ప్రమాదకరమైన రీతిలో పెరుగుతున్న ప్రస్తుత కాలంలో పచ్చి గడ్డి సాగుకు హైడ్రోపోనిక్స్ పద్ధతి చక్కని ప్రత్యామ్నాయంగా మారుతోంది. ఈ పద్ధతిలో తక్కువ స్థలంలో, పది శాతం నీటితోనే ఏడాది పొడవునా మొలక గడ్డిని పెంచుకోవచ్చు. మొలక గడ్డిని పాడి ఆవులు, గొర్రెలు, మేకలకు మేపటం మన రాష్ట్రాల్లోనే కాదు.. రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంత పశుపోషకులను సైతం ఆకర్షిస్తోంది. అక్కడ ఏడాదిలో రెండు నెలలే వర్షం పడుతుంది. మండు వేసవిలో ఎండ వేడి 120 డిగ్రీల సెల్షియస్‌కు చేరుతుంటుంది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జీవించే థార్ ప్రాంత రైతులు, సంచార పశుపోషకులు స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్‌ల తోడ్పాటుతో ఇటీవల హైడ్రోపోనిక్ మొలక గడ్డి సాగు చేపట్టారు. సునాయాసంగా నాణ్యమైన పాల దిగుబడితో పాటు ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్‌లు ఎడారి ప్రాంత రైతులు, పశుపోషకుల కోసం హైడ్రోపోనిక్ మొలక గడ్డిని పెంచే షెడ్లను నెలకొల్పుతున్నాయి. రైతులే వాటిలో మొక్కజొన్నలు, గోధుమలను నానబెట్టి, వర్టికల్ గార్డెన్ మాదిరిగా అనేక దొంతర్లలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ ట్రేలలో మొలక గడ్డిని పెంచుతున్నారు. సాధారణంగా పొలంలో పచ్చి గడ్డిని పెంచడానికి 2 నెలలు పడుతుంది. మొలక గడ్డి 8 రోజుల్లో పెరుగుతుంది. ముఖ్యంగా పది శాతం నీటితోనే ఈ గడ్డి పెరగటం థార్ ఎడారి ప్రాంత రైతులు, పశుపోషకులకు ఉపయుక్తంగా మారింది. ఏడాది పొడవునా ఆదాయం స్వచ్ఛంద సంస్థ ఉర్ముల్ సీమంత్ సమితి, డిజర్ట్ రిసోర్స్ సెంటర్‌తో కలసి హైడ్రోగ్రీన్స్, బహుళ నేచురల్స్ స్టార్టప్‌లు మొలక గడ్డి ఉత్పత్తి యూనిట్లను థార్ ఎడారి గ్రామాల్లో ఏర్పాటు చేస్తుండటంతో కొందరు మహిళా రైతులు హాయిగా ఊపిరిపీల్చుకుంటున్నారు. బహుళ నేచురల్స్ వీరి వద్ద నుంచి దేశీ ఆవు పాలను, ఒంటె పాలను సేకరించి, విలువ జోడించి ఆన్లైన్లో విక్రయిస్తోంది. వెయ్యి మంది పాడి రైతులు, 4 వేల మంది పశుపోషకులు తమ ఆవులు, మేకలకు మొలక గడ్డిని మేపుకుంటూ ఏడాది పొడవునా స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. పశుపోషణ కోసం గొడ్డు చాకిరీ చేసే మహిళా రైతులకు మొలక గడ్డి అందుబాటులోకి రావటం గొప్ప ఊరటనిస్తోంది. మొలక గడ్డి మేపుతో దేశీ ఆవు పాల దిగుబడి మూడింట ఒక వంతు పెరగడంతో పాటు, నాణ్యత కూడా పెరిగిందని రాజస్థాన్‌లోని ఘంటియాలి గ్రామానికి చెందిన దళిత మహిళా పశుపోషకురాలు ‘పలు’, ఆమె భర్త హెమారామ్ సంతోషంగా చెబుతున్నారు. వీరికి 8 ఆవులు, మేకలు ఉన్నాయి. 4 మైళ్ల దూరంలో ఉన్న పొలానికి వెళ్లి గడ్డి కోసుకొని, ఎండలో నెత్తిన పెట్టుకొని మోసుకు రావటం ఆమెకు కనాకష్టంగా ఉండేది. రెండేళ్ల క్రితం ఇంటి పక్కనే మొలకగడ్డి ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నాక ఆ బాధ తప్పింది. మిగులు గడ్డిని, గోధుమ గడ్డి పొడిని అమ్ముతూ ఆదాయం పొందుతుండటం విశేషం. హైడ్రోపోనిక్స్.. ఎంత ఖర్చవుతుందంటే.. దూడలకు పెట్టే కాన్సంట్రేట్ మిక్చర్ దాణాను 75% తగ్గించి మొక్కజొన్న మొలక గడ్డిని మేపటం వల్ల మంచి ఫలితం కనిపించిందని బికనెర్ వెటరినరీ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.కె. ధురియా అన్నారు. హైడ్రోపోనిక్ మొలక గడ్డి వల్ల మేకల్లో జీర్ణశక్తి, పెరుగుదల బాగుందని సౌదీ అరేబియాలోని కింగ్ సౌద్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. మొలకగడ్డి యూనిట్ ఏర్పాటుకు రూ. 18 లక్షల నుంచి 25 లక్షల వరకు ఖర్చవుతోంది. అయితే, ఇసుక తుఫాన్లకు మొలకగడ్డి షెడ్లు దెబ్బతినటం వల్ల నష్టం జరుగుతోంది. అందుకని, మున్ముందు షిప్పింగ్ కంటెయినర్లలో మొలకగడ్డి ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయటమే దీనికి పరిష్కారమని బహుళ నేచురల్స్ భావిస్తోంది. లక్షల ఖర్చుతో కూడిన పని కావటంతో రైతులను బృందాలుగా ఏర్పాటు చేసి మొలకగడ్డి యూనిట్లను నెలకొల్పితే మేలు. అయితే, రూ. 17.500 ఖర్చుతో చిన్నపాటి మొలకగడ్డి యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చని హైడ్రోగ్రీన్స్ స్టార్టప్ చెబుతోంది. బయోచార్‌తో సేంద్రియ ఇంటిపంటల సాగుపై శిక్షణ సేంద్రియ ఇంటిపంటల సాగుపై పట్టణ/నగర వాసులపై ఆసక్తి పెరుగుతోంది. బయోచార్ (బొగ్గుపొడి) కలిపిన మట్టి మిశ్రమంతో టెర్రస్ గార్డెన్లు, పెరటి తోటలు, బాల్కనీలలో కూరగాయల పెంపకంపై ఈ నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్ మలక్‌పేటలోని న్యూలైఫ్ ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనుంది. మిగులు పంట దిగుబడులను సోలార్ డ్రయ్యర్‌తో ఎండబెట్టే విధానం కూడా వివరిస్తామని న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివ షిండే తెలిపౠరు. వివరాలకు.. 81210 08002. 17న అమలాపురంలో ప్రకృతి సేద్యంపై శిక్షణ శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 17న కోనసీమ జిల్లా అమలాపురంలోని (ముక్తేశ్వరం– కొత్తపేట రోడ్డు) శ్రీసత్యనారాయణ గార్డెన్స్‌లో ప్రకృతి వ్యవసాయంపై నిపుణులు విజయరామ్ రైతులకు అవగాహన కల్పిస్తారని నిర్వాహకులు నిమ్మకాయల సత్యనారాయణ తెలిపౠరు. ప్రవేశం ఉచితం. ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. వివరాలకు.. 64091 11427 (సా. 3 గం. నుంచి 6 గం. వరకు మాత్రమే). -
ఢిల్లీకి.. మా ఊరి బొప్పాయి! ప్యాకింగ్ మరింత స్పెషల్!
బొప్పాయి సీజన్ మొదలైంది. ఒకట్రెండు కాదు సుమారు ఆరునెలల పాటు సాగే సీజన్ కావడంతో తోటల్లో సందడి మొదలైంది. ఇటు రైతుల్లో.. అటు వ్యాపారుల్లో బొప్పాయి మాటే.. రేటే వినిపిస్తోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీకి తరలించే బొప్పాయి ప్యాకింగ్ మరింత స్పెషల్‌గా ఉంటుంది. మరి అన్నమయ్య బొప్పాయి గొప్పలేంటో చూద్దామా.. అదే అదే చదివేద్దామా! అన్నయమ్య జిల్లాలో పడమటి ప్రాంతాలైన పీలేరు,మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సాగు చేసిన బొప్పాయికి మంచి రోజులొచ్చాయి. ఇక్కడి బొప్పాయికి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. సీజన్లో వ్యాపారులే తోటల దగ్గరికొచ్చి కాయలను కొనుగోలు చేస్తుంటారు. ఫలితంగా ఇక్కడి రైతులు కూడా ఎక్కువ విస్తీర్ణంలో బొప్పాయి తోటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల పరిధిలో సుమారు 876 హెక్టార్లలో పంట సాగులో ఉన్నట్లు అంచనా. ఇక ప్రస్తుతం మార్కెట్లో కిలో బొప్పాయి ధర రూ.26 వరకు పలుకుతోంది. దీంతో ఢీల్లీ, ముంబై, రాజస్థాన్‌కు చెందిన బొప్పాయి వ్యాపారులు ఇక్కడే మకాం వేసి బొప్పాయిని తోటల వద్దే కొనుగోలు చేసి వారి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఆరునెలల పాటు ఇక్కడే మకాం బొప్పాయి ఎగుమతులు చేయడం కోసం వ్యాపారులు, ఏజెంట్లు సుమారు ఆరునెలల పాటు ఈ ప్రాంతంలో మకాం వేస్తారు. ముంబై , రాజస్థాన్‌కు తరలించే బొప్పాయిల కంటే దేశరాజధాని ఢిల్లీకి ఎగుమతి చేసే కాయల కటింగ్ కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. చెట్ల నుంచి కాయను జాగ్రత్తగా దించుతున్న కూలి, ఎగుమతి కాయల్ని పేపర్లో చూడుతున్న కూలీలు ఈ కాయల కటింగ్, ప్యాకింగ్ కోసం బీహార్,జార్ఖండ్ రాష్ట్రాల నుంచి సిద్ధహస్తులైన కూలీలను వ్యాపారులు ఇక్కడికి తీసుకొస్తుంటారు. ముందుగా ఎండుగడ్డితో లారీని లోపలంతా ఒక క్రమపద్ధతిలో ప్యాకింగ్ చేస్తారు. సాధారణంగా మన ప్రాంతంలో బొప్పాయి సగం రంగు వచ్చే వరకు కోత కోయరు. అయితే ఢిల్లీ కటింగ్‌లో తేడా ఉంటుంది. కటింగ్ కాయలు పచ్చిగా ఉండాలి, వారం రోజుల తరువాత వర్ణం వచ్చే కాయలనే తోటల్లో ఏరిమరీ కోస్తుంటారు. పైగా ఒక్క కాయ కూడా కింద పడకుండా చెట్టు నుంచే జాగ్రత్తగా కిందికి దించుతారు. ఇక్కడి నుంచి ఢీల్లీకి లోడ్ లారీ చేరుకోవాలంటే కనీసం ఆరురోజుల సమయం పడుతుంది. అప్ప టి వరకు కాయలు చెడిపోకుండా బందోబస్తు చేయ డం కూలీల ప్రత్యేకత. ఈ సీజన్లో వందలాది మంది కూలీలు బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతుండడం విశేషం. డిల్లీలో భలే డిమాండ్ ఢిల్లీలో ఇక్కడి బొప్పాయికి మంచి డిమాండ్ ఉంటోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ఏడాది వర్షాలకు బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి. దీంతో ఇక్కడి బొప్పాయికి మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో కిలో రూ.26వరకు ధరలు పలుకుతోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, రాజస్థాన్ మార్కెట్లలో కిలో రూ.80 నుంచి రూ.100 వరకు ధరలు పలుకుతుండడం గమనార్హం. అక్కడ బొప్పాయిని ఎక్కువగా బేకరీ ఐటం, హల్వా తయారీలో ఎక్కువగా వినియోగిస్తారని వ్యాపారులు తెలిపారు. లారీ లోపల నలువైపుల ఎండుగడ్డి నింపి బొప్పాయి లోడింగ్ చేస్తున్న దృశ్యం ఈ ఏడాదిలో ఇవే అత్యధిక ధరలు.. నిన్నామొన్నటి వరకు బొప్పాయికి సరైన ధరలు లేక రైతులు డీలా పడ్డారు. ప్రస్తుతం బొప్పాయి ధరలు మార్కెట్లో బాగా పుంజుకొన్నాయి. పదిరోజుల కిందట కిలో బొప్పాయి ధర రూ. 12 నుంచి 15 వరకు మాత్రమే పలికాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో బొప్పాయి ధర రూ.26 వరకు పలుకుతుండడం విశేషం. ఈఏడాదిలో బొప్పాయి ఇవే అత్యధిక ధరలు అని రైతులు అంటున్నారు. మార్కెట్లో ధరలు ఇలాగే నిలకడగా ఉంటే లాభాల పంట పండినట్లేనని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తోటల వద్దే కొనుగోలు చేస్తున్నారు బొప్పాయి తోటల వద్దకే వ్యాపారులు వచ్చి కాయల్ని కొనుగోలు చేస్తున్నారు. బయట రాష్ట్రాలకు చెందిన వ్యా పారులు ముందుగానే సంప్రదించి ధర నిర్ణయిస్తారు. ఢిల్లీకి తరలించే బొప్పాయిని జాగ్రత్తగా నైపుణ్యం కలిగిన కూలీల చేత కోయిస్తారు. వాటిని భద్రంగా ప్యాకింగ్ చేసి వాహనాల్లో లోడ్ చేసి తీసుకెళుతుంటారు. చెట్టు నుంచి కాయల్ని కింద పడనీయకుండా కోసి తరలిస్తుంటారు. – సుధాకర్ రెడ్డి, బొప్పాయి రైతు, చెరవుమొరవపల్లె ఐదు ఎకరాల్లొ సాగు చేశా ఈసీజన్లో నేను ఐదు ఎకరాల్లో బొప్పాయి సాగు చేశాను. ప్రస్తుతం తోటల వద్దకే వచ్చి వ్యాపారులు కిలో రూ.26 చొప్పున ధర ఇస్తున్నారు. కూలీ ఖర్చు, మార్కెట్‌కు తరలించడం వంటి అన్ని ఖర్చులు వ్యాపారులే భరిస్తారు. ప్రస్తుతానికి మంచి గిట్టుబాటు ధరలే ఉన్నాయి. ఇవే ధరలు నిలకడ ఉంటే లాభాలు చూడవచ్చు. – నరసింహారెడ్డి, బొప్పాయి రైతు, ఎగువతొట్టివారిపల్లి (చదవండి: ఆ ఐదు దేశాల్లో..ఎంత అర్బన్ అగ్రికల్చర్ ఉందో తెలుసా! ఏకంగా..) -
ఆ ఐదు దేశాల్లో..ఎంత అర్బన్ అగ్రికల్చర్ ఉందో తెలుసా!
ఆర్థికాభివృద్ధితో నిమిత్తం లేకుండా అభివృద్ధి చెందిన/చెందుతున్న/పేద దేశాలన్నిటిలోనూ ఏదో ఒక స్థాయిలో అర్బన్ అగ్రికల్చర్ ఊపందుకుంది. అయితే, అర్బన్ గార్డెన్లలో ఏ వనరులు వాడుతున్నారు? ఎంత ఆహారం పండిస్తున్నారు? వంటి గణాంకాలు లేకపోతే పాలకులు విధాన నిర్ణయాలు తీసుకోవటం కష్టం. ఈ లోటును పూడ్చడానికి ఐదు పాశ్చాత్య దేశాల్లో (ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా)ని 72 అర్బన్ వ్యవసాయ క్షేత్రాలను/గార్డెన్లను 15 మంది పరిశోధకులు అధ్యయనం చేయగా, పరిమితులకు లోబడి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో కొందరు స్వచ్ఛందంగా కలసి సాగు చేసుకుంటున్న గార్డెన్లు, ఇళ్ల దగ్గర ఖాళీల్లో గృహస్థులు సాగు చేసుకుంటున్నవి, కేవలం అమ్మకం కోసం సాగు చేస్తున్న అర్బన్ క్షేత్రాలు వీటిలో ఉన్నాయి. మట్టిలో సాగు చేసే గార్డెన్లకే పరిమితమై అధ్యయనం చేశారు. హైడ్రోపోనిక్స్ వంటì ‘ప్లాంట్ ఫ్యాక్టరీ’ల జోలికి పోలేదు. పరిశోధకులు స్వయంగా ఈ క్షేత్రాలను, గార్డెన్లను పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. అధ్యయనానికి ఎంపిక చేసిన గార్డెన్లు, అర్బన్ ఫామ్స్‌లో కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నవి వున్నాయి. ఫ్రాన్స్ గార్డెనర్లు సగటున 36 ఏళ్లుగా ఇంటిపంటలు పండించుకుంటున్నారు. కమ్యూనిటీ గార్డెన్ – ‘మెరైనర్స్ హార్బర్ ఫామ్’, న్యూయార్క్. కిలో పంటకు.. దిగుబడిలో గార్డెన్లను బట్టి చాలా హెచ్చుతగ్గులున్నాయి. గ్రామీణ పొలాలతో పోల్చితే అనుభవజ్ఞులు నిర్వహించే అర్బన్ గార్డెన్లలో ఉత్పాదకత అధికంగా ఉంది. సరదా కోసం నిర్వహించే లీజర్ గార్డెన్లలో దిగుబడి అంతంత మాత్రమే. కిలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు పండించడానికి సగటున 0.53 చదరపు మీటర్ల భూమి, 71.6 లీటర్ల నీరు, 5.5 కిలోల కంపోస్ట్ అవసరమని ఈ అధ్యయనంలో తేల్చారు. సొంతంగా నీరు పోసుకునే వ్యక్తిగత గార్డెన్లలో కన్నా డ్రిప్ వాడే గార్డెన్లలో ఎక్కువ నీరు ఖర్చవుతోంది! వ్యక్తిగత తోట – బోషుమ్, జర్మనీ చదరపు మీటరు స్థలంలో పండిస్తున్న ఉత్పత్తిలో వ్యత్యాసం చాలానే ఉంది. 0.2 నుంచి 6.6 కిలోల మధ్యలో ఉంది. నాన్‌టెస్ (ఫ్రాన్స్)లో అమ్మకం కోసం (గ్రీన్హౌస్ ఉంది) పంటలు పండిస్తున్న అర్బన్ ఫామ్‌లో చ.మీ. భూమిలో ఉత్పాదకత అత్యధికంగా 6.7 కిలోలు వస్తోంది. చ.మీ.కి ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తి 2,069 కేలరీల ఆహారాన్ని పండిస్తుంటే, పోలండ్‌లో ఓ గార్డెనర్ 52.8 కేలరీలు పండిస్తున్నారు. స్థానిక వాతావరణం, వ్యక్తిగత శ్రద్ధ తదితర అంశాలపై ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నది తెలిసిందే. అర్బన్ క్షేత్రం – కాలేజ్ పియర్ మెండెస్ ఫ్రాన్స్, పారిస్, ఫ్రాన్స్ పురుగు మందులు.. మొత్తం 128 రకాల పంటలు కనిపించాయి. ఒక పంట నుంచి 83 పంటలు సాగు చేసే గార్డెనర్లు, ఫామ్స్ ఉన్నాయి. సగటున 16–20 పంటలు ఎక్కువ మంది సాగు చేస్తున్నారు. వాటంతట అవే పెరిగే తినదగిన ఆకుకూరలు, ఔషధ మొక్కలు, పూలు అదనం. 40% గార్డెన్లు/అర్బన్ ఫామ్స్‌లో ఏ ఇంధనాన్నీ వాడకపోవటం విశేషం. ఈ పాశ్చాత్య అర్బన్ క్షేత్రాల్లో, గార్డెన్లలో సేంద్రియ ఎరువులతో పాటు, రసాయనాలను కూడా వినియోగిస్తున్నట్లు గమనించారు. కలెక్టివ్ గార్డెన్–యూకే, వ్యక్తిగత తోట – డార్ట్మాండ్, జర్మనీ 22% గార్డెనర్లు ..కంపోస్టుతోపాటు రసాయనిక ఎరువులు కూడా వాడుతున్నారు. 51% వ్యక్తిగత గార్డెన్లు, 22% అర్బన్ ఫామ్స్‌లో పురుగుమందులు కూడా వాడుతున్నారు. అయితే, సామూహిక అర్బన్ గార్డెన్లలో మాత్రం పురుగుమందులు అసలు వాడట్లేదు. విష రసాయనాల వల్ల కలిగే నష్టం గురించి వీటి నిర్వాహకులకు స్పష్టమైన అవగాహన, పట్టుదల ఉందని అర్థం చేసుకోవచ్చు. ఐదు దేశాల్లోని అధ్యయనం చేసిన గార్డెన్లు, అర్బన్ పొలాలు అర్బన్ ఫామ్ – మడ్లార్క్స్, యూకే(హెచ్) వ్యక్తిగత గార్డెన్ – లెస్ ఎగ్లాంటియర్స్, నాంటెస్, ఫ్రాన్స్ - పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాగుబడి డెస్క్ (చదవండి: ఆ విద్యార్థులు ఎందరికో స్ఫూర్తి..చిట్టి మొక్కలతో గట్టిమేలే చేస్తున్నారుగా!) -
భలేగా లాభాలు..బొప్పాయి సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు
బొప్పాయి సాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. రెండేళ్ల కాలపరిమితి పంటైనా సాగు చేసిన ఏడాదికే అన్నదాతలు లాభాలను ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం సైతం ప్రోత్సాహాన్ని అందిస్తూ సబ్సిడీపై మల్చింగ్ షీట్లు, తదితరాలను సమకూరుస్తుండటంతో సాగు చేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఆత్మకూరు: బొప్పాయి సాగు రైతుల పాలిట కల్పతరువుగా మారింది. అన్నదాతలు లాభాలు చవి చూస్తుండగా.. తింటున్న వారి ఆరోగ్యం బాగుపడుతుండటంతో బొప్పాయి అందరికీ అనుకూలంగా మారింది. జిల్లాలోని 11 మండలాల్లో 1500 హెక్టార్లలో బొప్పాయి సాగవుతోందని అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. ఏడు నెలలకే తొలి కాపు వాస్తవానికి రెండేళ్ల కాలపరిమితి గల బొప్పాయిని ఆధునిక పద్ధతుల్లో సాగుచేస్తూ ఏడాదికే లాభాలు గడిస్తున్నారు. రెండో పంటనూ వెంటనే చేపడుతున్నారు. ఈ కారణంగా కొంత ఖర్చయినా లాభాలు వస్తుండటంతో రెండేళ్ల కాలపరిమితిని రైతులు పాటించడంలేదు. ఏడు నెలలకే తొలి కాపు వచ్చే బొప్పాయి తోటల్లో అంతర్పంటగా బంతిని సాగుచేస్తూ అదనపు ఆదాయాన్ని గడిస్తున్నారు. కచ్చితమైన లాభాలు వస్తుండటంతో అధిక శాతం మంది బొప్పాయి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉద్యాన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుండటంతో బొప్పాయి సాగుకు పలువురు రైతులు ఆసక్తి చూపుతున్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రోత్సహిస్తూ.. మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా హెక్టార్‌కు 90 శాతం సబ్సిడీతో అందిస్తోంది. కలుపు నివారణకు మల్చింగ్ చేసేందుకు తొలి ఏడాది రూ.18,490, రెండో సంవత్సరం రూ.ఆరు వేలను రైతులకు అందిస్తున్నారు. మల్చింగ్ షీట్ల ఏర్పాటుతో వర్షాకాలంలో వేరుకుళ్లు తెగులు సోకదని, వీటితో సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సోలాపూర్ రకానికి ప్రాధాన్యం బొప్పాయిలో తైవాన్ రెడ్ లేడీ 786 రకానికి మరో పేరు సోలాపూర్ వైరెటీ. ఈ రకం సాగుకు రైతులు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. సోలాపూర్ వెళ్లి మొక్కలు తెస్తుండటంతో తైవాన్ రెడ్ లేడీ పేరు స్థానంలో ఈ పేరొచ్చిందని రైతులు తెలిపారు. ప్రస్తుతం అనంతపురం, రైల్వేకోడూరు నుంచి రైతులు ఈ రకం మొక్కలను తీసుకొస్తున్నారు. ఎకరాకు 1200 వరకు వేయాల్సి ఉన్నా, రైతులు 1050 మొక్కల చొప్పున సాగు చేస్తున్నారు. అధిక ధర సాధారణంగా కాయలను విడిగా రూ.8.50 చొప్పున రైతులు విక్రయిస్తుంటారు. అయితే గతేడాది ఒక్కో కాయను రూ.16 చొప్పున రైతుల వద్దే కొనుగోలు చేయడంతో ఎకరాకు రూ.నాలుగు లక్షలకుపైగా ఆదాయం సమకూరింది. ఈ ఏడాది రూ.పది చొప్పున విక్రయిస్తున్నామని వారు చెప్పారు. ప్రథమ స్థానంలో ఆత్మకూరు సెక్టార్ ఆత్మకూరు సెక్టార్లో 400 ఎకరాలకుపైగా బొప్పాయి సాగవుతూ ప్రథమ స్థానంలో ఉందని ఉద్యానాధికారులు తెలిపారు. చేజర్ల, ఏఎస్‌పేట, మర్రిపాడు, పొదలకూరు, మనుబోలు, కలువాయి, తదితర మండలాల్లోనూ అధికంగా సాగు చేస్తున్నారు. వైద్యుల సూచన మేరకు బొప్పాయి వినియోగం పెరగడంతో కొనుగోళ్లూ భారీగానే జరుగుతున్నాయి. ఎకరాకు 40 టన్నుల దిగుబడి మూడేళ్లుగా బొప్పాయి సాగు చేస్తున్నా. లాభాలు బాగానే ఉన్నాయి. మా తోటను చూసి సమీపంలోని పలువురు రైతులు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొక్కలను అనంతపురం నుంచి తెచ్చుకుంటున్నాం. కలుపు రాకుండా మల్చింగ్ షీట్లను సబ్సిడీలో పొందాం. – సుబ్బారెడ్డి, బొప్పాయి రైతు, బొమ్మవరం, అనంతసాగరం ఎకరాలో బొప్పాయి సాగుకు రూ.70 వేలు ఖర్చవుతోంది. కలుపు రాకుండా మల్చింగ్ షీట్ల ఏర్పాటు, డ్రిప్ ఇరిగేషన్, తదితర ఆధునిక పద్ధతులతో సాగు చేస్తే రూ.లక్ష వరకు అవుతోంది. మొక్కలు నాటిన అనంతరం ఏడు నెలల పది రోజులకే తొలి కాపు చేతికందుతుంది. తొలి కాపులో ఒక టన్ను నుంచి ఒకటిన్నర టన్నుల దిగుబడి.. 20 రోజుల అనంతరం రెండో కాపులో రెండు నుంచి మూడు టన్నులు.. మూడో కాపులో నాలుగు నుంచి ఐదు టన్నుల దిగుబడి వస్తోంది. ఏడాది పొడవునా కాపు ఉంటుందని రైతులు తెలిపారు. దీంతో ఎకరాకు రూ.మూడు లక్షలకుపైగా ఆదాయాన్ని గడిస్తున్నారు. -
మల్లేశ్వరమ్మ సహకార వెలుగులు
చిన్న, సన్నకారు మహిళా రైతులు సంఘటితమైతే ఆర్థికాభివృద్ధితో పాటు మంచి ఆహారం కూడా మారుమూల గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వస్తుందనటానికి శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘం ఓ తాజా ఉదాహరణ. వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లె మండలం ముసలిరెడ్డిగారిపల్లి కేంద్రంగా 2014లో ఈ సొసైటీ ఏర్పాటైంది. సుస్థిర వ్యవసాయ కేంద్రం ఈ సొసైటీకి ఆది నుంచి అండగా నిలుస్తోంది. మల్లేపల్లి తదితర పరిసర గ్రామాలకు చెందిన 301 మంది సన్న, చిన్నకారు మహిళా రైతు కుటుంబాలలో ఆర్థిక, ఆహార భద్రతా వెలుగులు నింపుతున్న ఈ సొసైటీకి సీనియర్ ఎన్‌పిఓపి సర్టిఫైడ్ సేంద్రియ రైతు వడ్డెమాని మల్లేశ్వరమ్మ అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. చదువు లేకపోయినా.. కఠోర శ్రమ, పట్టుదలతో సొసైటీ వార్షిక వ్యాపారాన్ని రూ.65 లక్షలకు పెంచగలిగిరామె. ఆమె కృషిని ‘నాబార్డు’ మెచ్చింది. నాబార్డు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ బాబు.ఎ., మార్కెటింగ్, సహకార శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి చేతుల మీదుగా ఇటీవల విజయవాడలో ఉత్తమ మహిళా రైతు పుస్కారాన్ని మల్లేశ్వరమ్మ అందుకోవటం విశేషం. సేంద్రియ సేద్యం ఇలా.. మల్లేశ్వరమ్మ, చంద్రశేఖరరెడ్డి దంపతులు ముసలిరెడ్డిగారిపల్లి పరిసరాల్లోని 4 చోట్ల ఉన్న 9 ఎకరాల వారసత్వ భూముల్లో సేంద్రియ సేద్యం చేస్తున్నారు. 2 ఎకరాల్లో మూడేళ్ల క్రితం బత్తాయి మొక్కలు నాటారు. అందులో అంతరపంటగా సాగు చేస్తున్న పత్తి ప్రస్తుతం కోతకు వచ్చింది. గతంలో వేరుశనగ తదితర ఆహార పంటలనే వేసే వారమని, అడవి పందుల బాధ పడలేక పత్తి వేశామని ఆమె తెలిపారు. ఆగస్టు ఆఖరుకు పత్తి తీత పూర్తవుతుంది. సగటున చెట్టుకు 35 కాయలు వచ్చాయి. ఎకరానికి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నారు. ఈ రెండెకరాల్లో పత్తికి ముందు పెసర, మినుము సాగు చేశారు. మరో రెండెకరాల్లో పూర్తిగా పత్తి సాగు చేస్తున్నారు. 4 ఎకరాలను బొప్పాయి నాటడానికి సిద్ధం చేశారు. ఊరికి ఆనుకొని ఉన్న ఎకరంలో 32 రకాల కూరగాయలను ఇటీవలే విత్తామని మల్లేశ్వరమ్మ తెలిపారు. సిఎస్ఎ క్షేత్ర సిబ్బంది తోడ్పాటుతో ఏ పంటైనా సేంద్రియంగానే సాగు చేస్తుండటం విశేషం. మూడేళ్లకోసారి దిబ్బ ఎరువు వేస్తారు. ప్రతి ఏటా టైప్ 2 ఘనజీవామృతం, వేపపిండి, కానుగ పిండి ఎరువుగా వేస్తున్నారు. అవసరాన్ని బట్టి ద్రవ జీవామృతం, దశపర్ణి కషాయం, వేపనూనె పిచికారీ చేస్తున్నారు. గుంటక, సైకిల్ వీడర్‌తో కలుపు సమస్యను కొంత మేరకు అధిగమిస్తున్నారు. ఈ 9 ఎకరాలు మెయిన్ కేసీ కెనాల్‌కు దగ్గర్లో ఉండటంతో భూగర్భ జలానికి కొదువ లేవు. ఒకే బోరుతో నీటిని తోడుతూ భూగర్భ పైపు లైను ద్వారా నాలుగు పొలాల్లోని పంటలకు డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. పెసర, మినుము, ధనియాలు, వాము, ఆవాలు, పత్తి, కంది, వేరుశనగ, గోధుమ తదితర పంటలు సీజన్‌కు అనుగుణంగా సాగు చేస్తున్నారు. సేంద్రియంగానే సంతృప్తికరమైన దిగుబడులు తీస్తున్నామని మల్లేశ్వరమ్మ వివరించారు. 48 మందికి సేంద్రియ సర్టిఫికేషన్ శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘంలో దాదాపు 11 గ్రామాలకు చెందిన 301 మంది మహిళా రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇందులో 48 మంది సేంద్రియ సేద్యం చేస్తున్నారు. మల్లేశ్వరమ్మ సహా పది మంది ఎన్‌పిఓపి థర్డ్‌పార్టీ సేంద్రియ సర్టిఫికేషన్ పొందారు. విదేశాలకూ ఎగుమతి చేయొచ్చు. మరో 40 మంది పీజీఎస్ సర్టిఫికేషన్ పొందారు. రైతులకు విత్తనాలు తదితర ఉత్పాదకాలను తెప్పించి తక్కువ ధరకు సొసైటీ అందిస్తుంది. దీనితో పాటు కొర్రలు, అండుకొర్రలు, వేరుశనగలు, తెల్లజొన్న, గోధుమలు, ధనియాలు, కందులు, పెసలను సుమారు 15 క్వింటాళ్ల వరకు సభ్య రైతుల నుంచి కొనుగోలు చేసి సొసైటీ నిల్వ చేసి, ఏడాది పొడవునా శుద్ధి చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతానికి రుణం తీసుకోకుండా సొసైటీ సొంత డబ్బుతోనే పరిమితంగా కొంటున్నామన్నారు. మల్లేశ్వరమ్మ తన సొంత ఇంటిలోనే కొన్ని గదులను కేటాయించి సొసైటీ ముడి ధాన్యాలను నిల్వ చేశారు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలను మరపట్టే యంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. డిమాండ్ మేరకు ధాన్యాలను శుద్ధి చేయించి సరసమైన ధరకు విక్రయిస్తున్నారు. కందులను సంప్రదాయ పద్ధతుల్లో పప్పుగా తయారు చేస్తున్నారు. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా పురుగు సమస్య ఉండదని తెలిపారు. ఇరుగు పొరుగు గ్రామాల వాళ్లు కూడా వచ్చి కొనుక్కెళ్తున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో ఉన్న కొందరికి కూడా పంపుతున్నామని మల్లేశ్వరమ్మ తెలిపారు. సోలార్ డ్రయ్యర్లతో ఒరుగులు, పొడులు టొమాటోలు, నిమ్మకాయల వంటి పంటలకు మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు కొనుగోలు చేసి, సోలార్ డ్రయ్యర్ల ద్వారా ఒరుగులు తయారు చేసి విక్రయించడం ఈ సొసైటీ చేస్తున్న మరో మంచి పని. రహేజా సోలార్ స్టార్టప్ సంస్థ 3 టన్నుల సామర్థ్యం గల 6 సోలార్ డ్రయ్యర్లను ఈ సొసైటీకి సిఎస్ఎ ద్వారా 80% సబ్సిడీపై 5 నెలల క్రితం అందించింది. గతంలో టొమాటో ఒరుగులు తయారు చేసి కిలో రూ. 340కి అమ్మినట్లు మల్లేశ్వరమ్మ తెలిపారు. 20 కిలోల టొమాటోలను ఎండబెడితే కిలో ఒరుగులు వస్తాయి. రెండోరకం టొమాటోలు కిలో రూ. 8 చొప్పున కొని ఎండబెట్టి రహేజా సంస్థకే అమ్మామని తెలిపారు. ఇప్పుడు నిమ్మకాయల ఒరుగులు చేస్తున్నారు. 11 కిలోలకు 1 కిలో ఒరుగులు వస్తున్నాయి. ధర రూ.340కి అమ్ముతున్నారు. కరివేపాకు, మునగాకులను సైతం ఈ డ్రయ్యర్లలో ఎండబెట్టి పొడులను ఆర్డర్లపై సరఫరా చేస్తున్నామని ఆమె వివరించారు. సొసైటీ పనులు చేసే మహిళా సభ్యులకు వేతనానికి అదనంగా రోజుకు రూ. 5లను వారి పేరున భవిష్యనిధిగా జమ చేస్తున్నామని మల్లేశ్వరమ్మ తెలిపారు. ఈ మహిళా రైతుల సహకార సంఘం సేవలు మరెందరికో స్ఫూర్తిదాయకం కావాలని ఆశిద్దాం. మంచి ఫుడ్డు అందిస్తున్నానన్న సంతృప్తి ఉంది పజలకు ఆదాయం ఉంది, డబ్బుంది. కానీ, మంచి ఫుడ్డు లేదు. ఈ ఆలోచనతోనే సేంద్రియ ఆహారాన్ని పండించి అందించాలన్న ఆలోచన వచ్చింది. రసాయనాల్లేకుండా పండించిన రాగి సంగటి, కొర్రన్నం, సింగిల్ పాలిష్ బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు ఇంటిల్లపాదీ తింటున్నాం. దీని వల్ల మా ఆరోగ్యం ఎంతో బాగుంది. మా ఊళ్లో వాళ్లు 60% మా దగ్గర కొంటారు. బెంగళూరు, హైదరాబాద్‌లలో 18 కుటుంబాలకు కూడా పార్శిల్ ద్వారా పంపుతున్నాం. మా కుటుంబానికి, ప్రజలకు కూడా మంచి ఫుడ్డు అందిస్తున్నానన్న సంతృప్తి చాలా ఉంది. ఈ కీర్తి చాలు. – వడ్డెమాని మల్లేశ్వరమ్మ (62815 06734), అధ్యక్షులు, శ్రీగాయత్రి మహిళా రైతుల పరస్పర సహకార పరపతి సంఘం, ముసలిరెడ్డిగారిపల్లి, వేంపల్లె మం., వైఎస్సార్ కడప జిల్లా. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ -
ఆహార సార్వభౌమత్వమే ఔషధం!
ఓక్లాండ్.. యూఎస్‌లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ పెద్ద నగరం. అర్బన్ అగ్రికల్చర్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న స్ఫూర్తి కథనాల్లో ఓ విలక్షణమైన కథ ఓక్లాండ్లో ఉంది. స్థానిక నల్లజాతీయులు, పేదల ఆహార, ఆరోగ్య, జీవన స్థితిగతులు.. వాటి లోతైన వలసవాద అణచివేత మూలాల గురించి సంవేదన, సహానుభూతి కలిగిన వైద్యులు, రైతులు, పెద్దలు, పర్యావరణవేత్తలు, విద్యావేత్తలు, కథకులు, యువకళాకారులు సమష్టిగా దీన్ని నడిపిస్తున్నారు. ఓక్లాండ్లోని టెమెస్కల్లో విశాలమైన ‘హోల్ ఫుడ్స్’ షాపింగ్ మాల్ ఉంది. దీని ఐదో అంతస్థు పైన (దాదాపు ఎకరం విస్తీర్ణం)లో అర్బన్ టెర్రస్ గార్డెన్ ఏర్పాటైంది. యువ వైద్యురాలు, సామాజిక కార్యకర్త డా. రూపా మర్య ‘డీప్ మెడిసిన్ సర్కిల్’ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థే ‘రూఫ్‌టాప్ మెడిసిన్ ఫామ్’ను రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసింది. 25 వేల చదరపు అడుగుల ఈ రూఫ్‌టాప్ మెడిసిన్ ఫామ్ వ్యవసాయ పనుల డైరెక్టర్‌గా అలైనా రీడ్, పర్యావరణ విషయాల డైరెక్టర్‌గా బెంజమిన్ ఫాహ్రేర్ పనిచేస్తూ మంచి దిగుబడి తీస్తున్నారు. లెట్యూస్, పాలకూర, ఆకుకూరలు, ఔషధ మొక్కలు, పూల మొక్కలు, టొమాటో, క్యారట్ సాగు చేస్తున్నారు. గార్డెన్ చుట్టూతా పొద్దుతిరుగుడు మొక్కలున్నాయి. మందులతో పాటు అమృతాహారం రూఫ్‌టాప్ మెడిసిన్ ఫామ్‌లో రసాయనాల్లేకుండా సేంద్రియంగా పండించిన ఆహారాన్ని అనేక మార్గాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఈ ఫామ్ పక్కనే ఉన్న పిల్లల వైద్యశాలకు వచ్చే తల్లులకు మందులతో పాటు సేంద్రియ ఆకుకూరలను పంచుతుండటం విశేషం. రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారం తినగా వచ్చిన జబ్బులను తగ్గించడానికి మందులు మాత్రమే చాలవు. అమృతాహారం కూడా తినాలి. అందుకే ఈ ఆహారాన్ని చిల్డ్రన్స్ క్లినిక్ ఫుడ్ ఫార్మసీ ద్వారా పిల్లల తల్లులకు ఉచితంగా ఇస్తున్నాం అంటున్నారు డా. రూప. ఫామ్‌లో పండించే ఆహారాన్ని పూర్ మ్యాగజైన్, మామ్స్ 4 హౌసింగ్ , అమెరికన్ ఇండియన్ కల్చరల్ డిస్ట్రిక్ట్, టెండర్లాయిన్ నైబర్‌హుడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, యుసిఎస్ఎఫ్ వంటి సామాజిక సేవా సంస్థల ద్వారా ఈస్ట్ ఓక్లాండ్లోని పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ అర్బన్ ఫామ్ ద్వారా పాత విత్తనాలతో మనదైన ఆహారాన్ని ఎలా పండించుకోవాలో నేర్పిస్తున్నారు. స్థానిక వ్యవసాయ సంస్కృతి మూలాలు, పర్యావరణం, భూమితో ఉన్న విడదీయరాని అనుబంధాన్ని చెప్పి యువతను, మహిళలను, పిల్లలను ఇంటిపంటల సాగుకు ఉపక్రమింపజేస్తోంది ఈ ఫామ్. అర్బన్ అగ్రికల్చర్లో విశేష కృషి చేస్తున్న 25 సంస్థలకు అమెరికా వ్యవసాయ శాఖ ఇటీవల 70 లక్షల డాలర్లను గ్రాంటుగా ఇచ్చింది. ఆ జాబితాలో రూఫ్‌టాప్ మెడిసిన్ ఫామ్ కూడా ఉంది. క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ పౌష్టిక విలువలతో కూడిన ఆహారం మానవులందరి హక్కు.. ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఆహారం సంపన్నులకు మాత్రమే అందుతోంది.. పేదవారికి దక్కుతున్నది విషరసాయన అవశేషాలతో కూడిన ‘ఆహారం’ మాత్రమే. ఇది వారి పొట్టలోని సూక్ష్మజీవులను నశింపజేసి క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్‌ని కలిగిస్తోందన్నారు డా. రూపా మర్య. మన ఆహార వ్యవస్థ విషతుల్యమైపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా రసాయనాల్లేని ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని నల్లజాతీయులకు అందించటం ద్వారా తరతరాల వివక్షను దేహంలో నుంచి, మనసు అంతరాల్లో నుంచి కూడా నయం చేయొచ్చు. ఆహార సార్వభౌమత్వం, సంఘీభాలకు ఆ ఔషధ శక్తి ఉంది. – డా. రూపా మర్య, రూఫ్‌టాప్ మెడిసిన్ ఫామ్ వ్యవస్థాపకురాలు,ఓక్లాండ్, యు.ఎస్.ఎ. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ prambabu.35@gmail.com -
ఇకపై మీ పంట వృథా కాదు, ఇంజనీర్ సృష్టించిన సోలార్ డ్రైయర్
ప్రకృతి చాలా చిత్రమైంది. ధాన్యాన్ని ఎండించి ఇస్తుంది. కాయగూరలను పండించి ఇస్తుంది. ధాన్యం ఏడాదంతా నిల్వ ఉంటుంది. కాయలు పండ్లకు రోజులే జీవిత కాలం. ఆ కాయలు పండ్లను కూడా ఎండబెడితే... అవి కూడా ఏడాదంతా నిల్వ ఉంటాయి. ముందు చూపు ఉంటే ఏదీ వృథా కాదు, దేని ధరా కొండెక్కదు... అని నిరూపించాడు ఇందోర్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ వరుణ్ రహేజా. రైతుల ఆత్మహత్యలు, టొమాటోలు కోసిన ధరలు కూడా రావని పంటను వదిలేయడం వంటి వార్తలు తనను కలచి వేశాయి. పంటను నిల్వ చేసుకోగలిగితే రైతుల నష్టాలు, మరణాలను నివారించవచ్చనుకున్నాడు. కరెంట్ లేని ప్రదేశాల్లో కూడా ఉపయోగకరంగా ఉండడానికి సూర్యరశ్మితో పనిచేసే సోలార్ డ్రైయర్‌ను రూపొందించాడు. గత వేసవిలో కిలో రెండున్నర రూపాయల చొప్పున సేకరించిన టొమాటోలను డ్రైయర్‌లో ఎండబెట్టి తన ప్రయోగ ఫలితాన్ని నిరూపించాడు వరుణ్. యువతలో సామాజిక స్పృహ మెండుగా ఉన్నప్పుడు, చదువుతో వచ్చిన జ్ఞానం తన ఉన్నతితో పాటు సామాజికాభివృద్ధికి కూడా దోహదం చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు సాధ్యమవుతాయి. వరుణ్ చేసిన ప్రయోగం వ్యవసాయరంగానికి మేలు చేస్తోంది. ఆలోచన... ఆసక్తి! ‘‘నేలలో నాటిన విత్తనం నుంచి ఒక చెట్టు మొలవడం, అది పెద్దయి... పూత పూసి కాయ కాచి అది పండే వరకు ప్రతిదీ ప్రకృతి చేసే అద్భుతమే. పంటను, పొలాన్ని సంరక్షించడంలో రైతు పడే కష్టాన్ని కొలవడానికి ఏ పరికరమూ ఉండదు. అలాంటిది పండించిన పంటను చేతులారా నేలపాలు చేసేటప్పుడు రైతు అనుభవించే ఆవేదన ఎలాంటిదో నాకు తెలియదు, కానీ ఆ పంట నేలపాలవుతుంటే నా మనసు మౌనంగా రోదించేది. పంటను నిల్వ చేసుకునే అవకాశం ఉంటే ఆ రైతు తన చేతులారా పండించిన పంటను అలా నేలపాలు చేయడు కదా అనిపించేది. ఈ ఆలోచనలు నేను మెకానికల్ ఇంజనీర్‌గా ఇంటర్న్న్షిప్ చేస్తున్న సమయంలో ఒక కొలిక్కి వచ్చాయి. పోషకాలు వృథా కాని విధంగా పండ్లు, కాయల్లోని తేమను సహజంగా తొలగించగలిగితే పంటను నిల్వ చేయవచ్చు. అది సౌరశక్తితో సాధ్యమని తెలిసిన తర్వాత నా ప్రయత్నాలను ముమ్మరం చేశాను. సోలార్ డ్రైయర్‌ను రూపొందించడంతోపాటు అన్ని రకాల రైతులకు అది అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రదేశంలో స్థిరంగా ఉండే పాలీ హౌస్‌తోపాటు ఇరవై కిలోల నుంచి వంద కిలోల కెపాసిటీ గలిగిన పోర్టబుల్ డ్రైయర్లను కూడా రూపొందించాను. వీటిని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. మేధ సమాజానికి ఉపయోగపడాలి! నేను చేసే పని నాకు నచ్చినదై ఉండాలి. ఒకరు చెప్పిన పని చేయడానికి నా మేధను పరిమితం చేయడం నాకిష్టం లేదు. నేను చేసే పని సమాజానికి ఉపయోగపడేదై ఉంటే అందులో లభించే సంతృప్తి అనంతం. టొమాటోల ధరలు వార్తల్లో ఉండడాన్ని చూస్తూనే పెరిగాను. రైతన్నల శ్రమకు ఫలితం కొనుగోలు చేసే వ్యాపారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటోంది. పండించిన రైతులు ఎప్పుడూ అనిశ్చితిలోనే ఉంటున్నారు. సప్లయ్ చైన్ దళారులతో నిండిపోయి, రైతుకు ఉపయుక్తంగా లేకపోవడమే ఇందుకు కారణం. పొలంలో పండిన పంట వంటగదికి చేరేలోపు వివిధ దశల్లో 30 నుంచి 40 శాతం వృథా అవుతోంది. ఆ వృథాని అరికట్టడం, పండించిన రైతుకు తన పంటకు తగిన ధర నిర్ణయించగలిగే స్థితి కల్పించడం నా లక్ష్యం. అందుకే పంటను ఎండబెట్టి నిల్వ చేసే ఇండస్ట్రీని స్థాపించాను’’ అన్నాడు తన ప్రయోగాల కోసం రహేజా సోలార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించిన వరుణ్ రహేజా. వరుణ్ కొత్త పరికరాల రూపకల్పనలో నిమగ్నమై ఉంటే, అతడు నెలకొల్పిన పరిశ్రమను తల్లి బబిత నిర్వహిస్తున్నారు. -
Earth Overshoot Day: ఇక ‘పర్యావరణ లోటు బడ్జెటే’ దిక్కు!
ఆర్థిక వనరులకు సంబంధించి వార్షిక బడ్జెట్లు, లోటు బడ్జెట్లు, అప్పులు ఉంటాయని మనకు తెలుసు. అయితే, పర్యావరణ వనరులకు కూడా బడ్జెట్టు ఉంటుందని మీకు తెలుసా? గ్లోబల్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్ తాజా అంచనా ప్రకారం.. ప్రపంచ దేశాల పర్యావరణ బడ్జెట్టు ఈ ఏడాదికి ఆగస్టు 2 నాటితో పూర్తిగా ఖర్చయిపోయింది. దీన్నే ‘వరల్డ్ ఎర్త్ ఆఫ్షూట్ డే’ అని పిలుస్తున్నారు. అంటే.. భూగోళానికున్న జీవశక్తి పరిమితి(బయోకెపాసిటీ) అంత వరకే. నేటి (ఆగస్టు 3) నుంచి ప్రపంచ ప్రజలు వాడేదంతా భూమాత తన మూలుగను కరిగించుకుంటూ కనాకష్టంగా సమకూర్చే అప్పు మాత్రమే. గత ఏడాది ఆగస్టు 1తోనే బడ్జెట్ అయిపోయింది. కొద్దోగొప్పో పర్యావరణ స్పృహ పెరిగింది కాబట్టి, డెడ్‌లైన్ ఈ ఏడాది ఒక్క రోజు వెనక్కి జరిగిందన్న మాట. 1.75 భూగోళాలు కావాలి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఇప్పుడు 175% మేరకు ప్రకృతి వనరులు వాడేస్తున్నాయి. అంటే.. మనకు అవసరమైన వనరులు సునాయాసంగా సమకూర్చాలంటే 1.75 భూగోళాలు కావాలన్నమాట. పర్యావరణ బడ్జెట్ 1971 వరకు భూగోళం ఇవ్వగలిగే పరిమితులకు లోబడి ఉండేదట. అంటే, 365 రోజులూ లోటు లేకుండా ఉండేదని గ్లోబల్ ఫుట్‌ప్రింట్ నెట్వర్క్ అంచనా వేసింది. ఆ తర్వాత నుంచి క్రమంగా ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరగడంతో పాటు వినియోగంలో విపరీత పోకడల వల్ల భూగోళంపై వత్తిడి పెరిగిపోయింది. అమెరికన్లలా జీవిస్తే 5 భూగోళాలు కావాలి ప్రకృతి వనరుల వినియోగం అన్ని దేశాల్లో ఒకేలా ఉండదు. సంపన్న దేశాలు ఎక్కువ వనరులను ఖర్చు చేస్తున్నాయి. ఉదాహరణకు.. అమెరికా వాసుల మాదిరిగా ప్రకృతి వనరులను వాడితే 5.1 భూగోళాలు పర్యావరణ సేవలు మనకు అవసరమవుతాయి. చైనీయుల్లా జీవిస్తే 2.4 భూగోళాలు కావాలి. అయితే, మన సంతోషించదగిన విషయం ఏమిటంటే.. ప్రపంచ పౌరులందరూ భారతీయుల్లా జీవిస్తే 0.8 భూగోళం చాలు. అంటే.. పర్యావరణ బడ్జెట్టు 20% మిగులులోనే ఉందన్న మాట. ఖతర్ బడ్జెట్ ఫిబ్రవరి 10నే ఖతం! ప్రపంచవ్యాప్తంగా సగటున తలసరి వార్షిక పర్యావరణ వనరుల లభ్యత (బయోకెపాసిటీ) 1.6 గ్లోబల్ హెక్టార్లు (బయోకెపాసిటీని, ఫుట్‌ప్రింట్‌ని ‘గ్లోబల్ హెక్టార్ల’లో కొలుస్తారు). దీనికన్నా ఎక్కువ ఖర్చు (ఫుట్‌ప్రింట్) ఎక్కువగా ఉంటే పర్యావరణ బడ్జెట్ అంత తక్కువ రోజుల్లోనే అయిపోతుంది. ఇది ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు భారత్‌లో తలసరి వార్షిక పర్యావరణ బడ్జెట్ 1.04 గ్లోబల్ హెక్టార్లు. లభ్యత కన్నా ఖర్చు తక్కువగా ఉంది కాబట్టి.. మనం 20% మిగులు బడ్జెట్లోనే ఉన్నాం. అందువల్లనే కంట్రీ ఓవర్‌షూట్ డేస్ జాబితాలో మన దేశం పేరు ఉండదు. అత్యంత సంపన్న ఎడారి దేశం ఖతర్ పర్యావరణ బడ్జెట్ ఫిబ్రవరి 10నే అయిపోయింది. కెనడా, యుఎఈ, అమెరికాల బడ్జెట్ మార్చి 13తో సరి. మే 1న చైనా, ఆగస్టు 12న బ్రెజిల్.. డిసెంబర్ 20న జమైకా బడ్జెట్లు ఖర్చయిపోతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలన్నీ ఇందుకే.. వనరులు సమకూర్చే శక్తి భూగోళానికి లేకపోయినా మనం వాడుకుంటూనే ఉన్నాం కాబట్టి భూగోళం అతలాకుతలమైపోతోంది. ఎన్నడూ ఎరుగనంత ఉష్ణోగ్రతలు, కుండపోత వార్షాలు, కరవు కాటకాలు.. ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ మనం అతిగా కొల్లగొడుతున్న దాని ఫలితమే. ఏం చేద్దాం..? పర్యావరణ లోటు బడ్జెట్టుతో అల్లాడుతున్న భూగోళాన్ని స్థిమితపరిచి మన భవిష్యత్తును బాగు చేసుకోవాలంటే.. అంటే.. పర్యావరణ బడ్జెట్టు 365 రోజులూ సరిపోవాలంటే.. మానవాళి మూకుమ్మడిగా జీవన విధానాన్ని మార్చుకోవాలి. వనరులను పొదుపుగా వాడాలి. ముఖ్యంగా ఐదు పనులు చేయాలి.. పర్యావరణ హితమైన ఇంధనాలు వాడాలి. ఆహారోత్పత్తి పద్ధతులను పర్యావరణ హితంగా మార్చుకోవాలి. నగరాల నిర్వహణలో ఉద్గారాలు, కాలుష్యం తగ్గించుకోవాలి. భూగోళంపై ప్రకృతి వనరులకు హాని కలిగించని రీతిలో పారిశ్రామిక కార్యక్రమాలు చేపట్టాలి. అన్నిటికీ మించి, జనాభా పెరుగుదలను అదుపులో ఉంచుకోవాలి. – పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ prambabu.35@gmail.com