-
అధికారిక నిర్ణయాలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి : అధికారిక విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదని సమాచార, పౌర సంబంధాల (ఐ అండ్ పీఆర్) శాఖ పూర్వ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. పబ్లిక్ సర్వెంట్‌గా విజయ్‌కుమార్ తన విధి నిర్వహణలో ఎలాంటి అనుచిత లబ్ధిపొందలేదని ఆయన తరఫు న్యాయవాది వేలూ రి మహేశ్వరరెడ్డి వివరించారు. నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని, పత్రికా ప్రకటనల్లో ఓ వర్గం మీడియాకు లబ్ధి చేకూర్చారంటూ ఏసీబీ ఆరోపిస్తోందని.. అయితే, ఇందుకు నిర్ధిష్ట ఆధారాలను మాత్రం చూపడంలేదన్నారు. విధి నిర్వహణలో విజయ్‌కుమార్‌రెడ్డి చర్యలేవీ కూడా నేరపూరిత దుష్ప్రవర్తన కిందకు రావని తెలిపారు. ఆయనెలాంటి అవినీతికి కూడా పాల్పడలేదని, అందుకు సంబంధించి ఎలాంటి ఆరోపణలు కూడా లేవని మహేశ్వరరెడ్డి కోర్టుకు వివరించారు. కక్ష, పక్షపాతం దురుద్దేశాలతో ఏసీబీ తన క్లయింట్‌పై తప్పుడు కేసు నమోదు చేసిందన్నారు. తప్పుడు కేసుల నుంచి అధికారులను రక్షించేందుకే అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్–17ఏను చేర్చారని.. కానీ, ప్రభుత్వం సెక్షన్–17ఏ కింద విచారణ చేసేందుకు అనుమతించడం సరికాదన్నారు. తన క్లయింట్ విచారణకు అనుమతినివ్వడం ద్వారా ఆ సెక్షన్‌ను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో దాన్ని ప్రభుత్వం కాలరాసిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దురుద్దేశంతోనే తన క్లయింట్‌పై ఉన్న ఆరోపణల పరిధిని ఏసీబీ పెంచిందన్నారు. రీడర్షిప్, సర్క్యులేషన్‌ను ప్రామాణికంగా తీసుకునే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రకటనలు ఇచ్చినట్లు మహేశ్వర్‌రెడ్డి స్పష్టంచేశారు. దీనిని కూడా అవినీతి అనడం దారుణమన్నారు. పరిపాలనపరమైన నిర్ణయాలకు నేరాన్ని ఆపాదించడం చెల్లదన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని విజయ్‌కుమార్‌రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మహేశ్వర్‌రెడ్డి కోర్టును అభ్యర్థించారు. ఏ షరతులు విధించినా కట్టుబడి ఉంటామన్నారు. విజయ్‌కుమార్‌రెడ్డి వాదనలు ముగియడంతో ఏసీబీ వాదనల నిమిత్తం విచారణ ఈనెల 23కి వాయిదా పడింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ప్రకటనల జారీ, బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఏసీబీ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ విజయ్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
రెక్కలు తొడిగి .. రెపరెపలాడి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆకాశ వీధిలో రెక్కల్ని రెపరెపలాడిస్తూ వేలాది కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే వేలాది పక్షులు కాకినాడ–అంబేడ్కర్ కోనసీమ జిల్లాల నడుమ గల కోరంగి అభయారణ్యంలో విడిది చేస్తున్నాయి. రష్యా, చైనా, మంగోలియా, సైబీరియా, యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి అనేక రకాల జాతి పక్షులు ఏటా అక్టోబర్, నవంబర్ మధ్య కాకినాడ తీరానికి వస్తుంటాయి. కోరింగ అభయారణ్యం, సముద్ర మొగ ప్రాంతాల్లో మూడు నెలలపాటు మకాం వేసి తిరుగు పయనమవుతాయి. ఇలా వలస వచ్చే పక్షుల్లో ఏ దేశాల నుంచి.. ఏయే జాతి పక్షులు ఎన్ని వచ్చాయి, వాటిలో అరుదైన జాతి పక్షులు ఏవైనా ఉన్నాయా వంటి లెక్కలు అటవీ శాఖలోని వివిధ విభాగాల పర్యవేక్షణలో శాస్త్రవేత్తలు, బర్డ్ వాచర్స్ బృందాలుగా ఏర్పడి ఏసియన్ వాటర్ బర్డ్ కౌంట్ (అంతర్జాతీయ నీటిపక్షుల గణన) చేస్తుంటారు. కోరంగి అభయారణ్యం, కోనసీమ ప్రాంతాలకు వివిధ దేశాల నుంచి వచ్చిన వలస పక్షుల సర్వే ఈ నెలలో ముగిసింది.ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలైన బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బీఎన్హెచ్ఎస్), వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ బయోడైవర్సిటీ సొసైటీ, యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీలకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు, సీనియర్ రీసెర్చ్ స్కాలర్స్ డాక్టర్ శివకుమార్, పాల్ ఆంథోనీ, శ్రీరామరెడ్డి తదితరుల సంయుక్త భాగస్వామ్యంతో వివిధ దేశాల నుంచి రెక్కలు కట్టుకుని వలస వచ్చిన పక్షులను లెక్కించారు.ఆ పక్షుల రాక సంతోషకరంఈ ఏడాది పక్షుల రాక కొంతమేర తగ్గినప్పటికీ.. అంతరించిపోయే పక్షి జాతుల జాబితాలో ఉన్న ఇండియన్ స్కిమ్మర్, గ్రేట్‌నాట్, రెడ్నాట్, యురేసియన్ ఆయుష్ క్యాచర్ జాతి పక్షులు ఈ సీజన్లో కోరంగి అభయారణ్యంలో ప్రత్యక్షం కావడం సంతోషం కలిగించే అంశంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రేట్‌నాట్ జాతి పక్షులు రష్యా, మంగోలియా, చైనా తదితర దేశాల నుంచి నాలుగైదేళ్ల తరువాత ఇక్కడ ప్రత్యక్షమయ్యాయి. ఈ జాతి పక్షి ఇక అంతరించిపోయినట్టేనని అనుకుంటున్న తరుణంలో రష్యా దేశపు ట్యాగ్‌తో ఈ సర్వేలో కెమెరాలకు చిక్కాయి. ఈ రెండు జాతుల పక్షులు కోరంగి అభయారణ్యంలోని భైరవపాలెం, హోప్ ఐలాండ్, ఏటిమొగ తదితర ప్రాంతాల్లో సర్వే బృందాల కెమెరాలకు కంటపడ్డాయి. యూరోపియన్ దేశాల నుంచి అరుదైన యురేసియన్ అయిస్ట్ క్యాచర్ జాతి పక్షులు కూడా ఈసారి అభయారణ్యంలో దర్శనమిచ్చాయి.సైబీరియన్ పక్షులదే మొదటిస్థానంకాకినాడ తీరానికి వచ్చిన మొత్తం విదేశీ విహంగాల్లో 5,144 పక్షులతో ‘లెసర్ సేండ్ ప్లోవర్’ అనే సైబీరియన్లు మొదటి స్థానంలో నిలిచాయి. 3,545 పసిఫిక్ గోల్డెన్ ఫ్లోవర్ జాతి పక్షులు రాగా.. వలస వచ్చిన పక్షుల్లో ఇవి ద్వితీయ స్థానాన్ని ఆక్రమించాయి. ఈ జాతి పక్షులు రష్యా, మంగోలియా, చైనా వంటి దేశాల నుంచి వలస వచ్చాయి. ఇవికాకుండా పులికాట్, కొల్లేరు ప్రాంతాలకు పెద్దఎత్తున వచ్చే గ్రేటర్ ఫ్లెమింగో జాతి పక్షులను కూడా గతం కంటే ఈ సీజన్లోనే ఎక్కువగా ఇక్కడ గుర్తించారు. ఈ పక్షులన్నీ కోరంగి అభయారణ్యంతో పాటు కోనసీమలోని మగసానితిప్ప, శాంక్రిమెంట్ ఐలాండ్, గచ్చకాయలపోర, పండి, పల్లం, ఎస్.యానాం, గాడిమొగ సముద్ర తీర గ్రామాల్లో సందడి చేస్తున్నట్టు గుర్తించారు.కడుపు నింపుకునేందుకే..వివిధ దేశాల్లోని పక్షుల ఆవాస ప్రాంతాలు మంచుతో కప్పివేయబడటంతో కడుపు నింపుకునేందుకు వేలాది కిలోమీటర్లు ప్రయాణించి వివిధ దేశాల నుంచి కోరంగి అభయారణ్యానికి విదేశీ పక్షులు వచ్చాయి. అరుదైన జాతి పక్షులను కూడా గుర్తించాం. ఇందులో అంతరించిపోయే జాతులకు చెందిన పక్షులు రావడం చాలా సంతోషకరం. – డి.మహేష్‌బాబు, రీసెర్చ్ సైంటిస్ట్, రాష్ట్ర కో–ఆర్డినేటర్, ఇండియన్ బర్డ్ కన్జర్వేషన్ నెట్వర్క్106 జాతులకు చెందిన 39,725 పక్షుల రాకఏటా వివిధ దేశాల నుంచి సీజనల్‌గా వచ్చే వలస పక్షులు ఈ సారి కాస్త వెనకడుగు వేశాయి. వరుస ప్రకృతి విపత్తులు ఇందుకు ఒక ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు విశ్లేషించి నివేదించారు. ఈ సీజన్లో వివిధ ఖండాల నుండి 106 జాతులకు చెందిన 39,725 పక్షులు వలస వచ్చాయని లెక్కలు కట్టారు.అరుదైన పక్షులొచ్చాయికోరంగి అభయారణ్యం పరిసర ప్రాంతాల్లో పక్షుల గణన కోసం 12 బృందాలు పనిచేశాయి. ఒక్కో బృందంలోశాస్త్రవేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు, బర్డ్‌వాచర్స్, విద్యార్థులతో కలిసి ఐదుగురున్నారు. జిల్లాఅటవీశాఖాధికారి రవీంద్రనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన బృందాల్లోని 60 మంది ఏకకాలంలో ఈ సర్వే నిర్వహించారు. అరుదైన జాతి పక్షులను కూడా ఈ సర్వేలో గుర్తించారు.– ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, అటవీ రేంజర్, వైల్డ్‌లైఫ్, కోరింగ -
పనిగంటల్లో మహిళను మరిచారా?
వారంలో ఎన్ని గంటలు పనిచేయాలి? ఈ మధ్య కాలంలో దేశం మొత్తమ్మీద విపరీతమైన చర్చ లేవనెత్తిన ప్రశ్న ఇది. ఏడాది క్రితం ‘ఇన్ఫోసిస్’ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి దేశం కోసం వారంలో 70 గంటలు పనిచేయాలని సూచించడంతో మొదలైందీ చర్చ. ఇది సద్దుమణిగేలోపు, ‘లార్సెన్ అండ్ టూబ్రో’ (ఎల్ అండ్ టీ) ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ వారంలో 90 గంటలు పని చేయాలని ఇచ్చిన సలహా మళ్లీ దుమారం రేకెత్తించింది. ‘ఆదివారాలు ఎంత సేపని మీ భార్యల ముఖాలు చూస్తూ కూర్చుంటారు, ఆఫీసులకు వచ్చి పనిచేయండి’ అని కూడా ఆయన చతుర్లు ఆడారు. ఈ సరదా వ్యాఖ్య కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. లక్షల జోకులు, మీమ్స్ పుట్టుకొచ్చాయి. నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యన్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు యథాలాపంగా చేసిన వ్యాఖ్యలను బట్టి వారిని జడ్జ్ చేయడం మంచిది కాదు. కానీ సుదీర్ఘ పనిగంటలను వారు సీరియస్‌గానే ప్రతిపాదిస్తున్నట్టు కనిపిస్తోంది.వ్యాపార రంగంలో వారిద్దరి నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసు కుని చూస్తే ఆ వ్యాఖ్యలకు మనం విలువ ఇవ్వాలి. దేశంలో ఇన్ఫర్మే షన్ టెక్నాలజీ విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి, ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీని నిలబెట్టిన వ్యక్తి నారాయణమూర్తి. ఎల్ అండ్ టీ చైర్మన్ కూడా ఆషామాషీ వ్యక్తి కాదు. 5,690 కోట్ల డాలర్ల విలువైన, ఫోర్బ్స్ జాబితాలో నమోదైన కంపెనీని నడిపిస్తున్నారు. కాబట్టి వీరి దృష్టి కోణాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఇంటి పని మాటేమిటి?నారాయణమూర్తి, సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యల నేపథ్యంలో కనిపించే ఒక అంశం ఏమిటంటే... వీరిరువురి భార్యలకు సొంతంగా ఉద్యోగాలేమీ లేకపోవడం. దీనివల్ల మన సంరక్షణ బాధ్యతలు చూసుకునే వ్యక్తులు మన అభివృద్ధిలో ఎంత మేరకు భాగస్వాములో తెలియకుండా పోతుంది. వీరిద్దరు చెప్పినట్లు వారానికి 70 లేదా 90 గంటలు పనిచేశామనుకోండి... మహిళలు ఉద్యోగాలు చేయడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు అంత ఎక్కువ పెరిగిపోతాయి కాబట్టి!ఉద్యోగాలు చేసే వారి పిల్లల సంరక్షణ కోసం దేశంలో ఇప్పటి వరకూ ఎలాంటి ఏర్పాట్లూ లేవు. ఇలా ఉండి ఉంటే తల్లులు కూడా ఎక్కువ సమయం ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో గడిపేందుకు అవకాశం ఏర్పడేది. వారంలో 70 లేదా 90 గంటలు పనిచేయాలన్న ఆలోచన వెనక ఆ ఉద్యోగి జీవిత భాగస్వామికి ఉద్యోగం ఏదీ లేదన్న నిర్ధారణ ఉండి ఉండాలి. పితృస్వామిక భావజాలం ఎక్కువగా ఉండే భారతదేశ నేపథ్యాన్ని లెక్కలోకి తీసుకుంటే... ఆ జీవిత భాగస్వామి మహిళే అయి ఉంటుంది. ఈ వ్యవహారంలో భార్య ప్రస్తావన వచ్చేందుకు ఇంకోటి కూడా కారణం. భార్యలు ఇంటిపట్టున తీరికగా ఉన్నారు అన్న అంచనా. ఇంకోలా చెప్పాలంటే... ఇంట్లో పని మొత్తం అంటే ఇల్లూడ్చడం, వంట, పిల్లల మంచిచెడ్డలు, వయసు మళ్లిన వారి బాగోగులన్నీ ఇతరులు ఎవరో చూసుకుంటున్నారన్నమాట. వాస్తవం ఏమిటంటే... ఇలా పనులు చేసిపెట్టే వారు ఏమీ అంత చౌకగా అందుబాటులో ఉండరు.ఈ దృష్ట్యా చూస్తే... ఈ ఇద్దరు ప్రముఖులు పని అంటే కేవలం ఇంటి బయట చేసేది మాత్రమే అన్న అంచనాతో మాట్లాడటం సమంజసం కాదు. ఇంటి పని కూడా చాలా శ్రమతో కూడుకున్నది, సమయం తీసుకునేదని వీళ్లు గుర్తించి ఉండాల్సింది. పైగా ఇంటి పనులు సాధారణంగా ఆడవారే చేస్తూంటారు. ప్రపంచవ్యాప్తంగా, ఇంకా ముఖ్యంగా భారతదేశంలో ఇదే ధోరణి కనిపిస్తుంది. ఇంట్లో ఆడవాళ్లు చేసే శ్రమ విలువ ఎంతో అర్థం చేసుకోవాలంటే ఆ మధ్య వచ్చిన మలయాళ సినిమా ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ ఒకసారి చూడాలి. మహిళ శ్రామిక శక్తి భాగస్వామ్యం ఎంత?ఈ నేపథ్యంలో దేశంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం ఎంత అన్న ప్రశ్నకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. అంతర్జాతీయంగా మహిళల భాగస్వామ్యం సగటున 51 శాతం ఉంటే భారత్‌లో గణనీయంగా తక్కువ ఉండేందుకు కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. అయితే, ఇటీవలి కాలంలో ఈ సంఖ్య కొంచెం ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం, మహిళల భాగస్వామ్యం 2017–18లో 23.3 శాతం మాత్రమే ఉంటే, 2023–24లో 41.7 శాతానికి పెరిగింది. పురుషుల భాగస్వామ్యం సుమారుగా 78.8 శాతం ఉండటం గమనార్హం. ఆర్థికవేత్తలు శమికా రవి, ముదిత్ కపూర్లు చేసిన ఒక అధ్యయనం ప్రకారం, దేశంలో శ్రమశక్తిలో పెళ్లయిన మగవారి భాగస్వామ్యం చాలా ఎక్కువ. అదే సమయంలో పెళ్లయిన మహిళల సంఖ్య చాలా తక్కువ. తల్లి లేదా తండ్రి ఉద్యోగస్తుడైతే ఆ యా కుటుంబాల్లో పిల్లలపై ప్రభావాన్ని కూడా పరిశీలించారు. తండ్రి ఉద్యోగస్తు డైతే ఆ ప్రభావం దాదాపు లేకపోయింది. మహిళల విషయానికి వస్తే పిల్లలున్న కుటుంబాల్లోని మహిళలు శ్రామిక శక్తిలో భాగం కావడం కేరళ వంటి రాష్ట్రాల్లో బాగా తగ్గిపోయింది. బిహార్, పంజాబ్, హరి యాణా వంటి రాష్ట్రాల్లో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం వరుసగా తక్కువగా నమోదవుతున్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. అసంఘటిత రంగం మాటేమిటి?పని గంటలు పెంచాలన్న అంశంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఏమాత్రం నియంత్రణ లేని అసంఘటిత రంగం పరి స్థితిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పని గంటలను అసాధారణంగా పెంచి చిన్న వ్యాపారులు ఉద్యోగుల శ్రమను దోపిడి చేసే అవకాశం ఉంది. నగర ప్రాంతాల్లో గిగ్ ఆర్థిక వ్యవస్థ చాలా ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. వీరికి పనివేళలు నిర్దిష్టంగా ఉంటాయి కానీ టార్గెట్లు ఎక్కువ ఇవ్వడం ద్వారా అధిక శ్రమకు గురి చేస్తూంటారు. ఇంటి పని చేసే వారి విషయంలోనూ పనివేళలు, వేత నాలపై ఎలాంటి నియంత్రణ లేదు. పనిగంటలపై మొదలైన చర్చ ఏయే రంగాల్లో నియంత్రణ వ్యవస్థల అవసరం ఉందన్నది గుర్తించేందుకు ఉపయోగపడవచ్చు. అయితే అసంఘటిత రంగంలో ఉన్న వారు తమంతట తామే పనివేళలను నిర్ధారించుకునే అవకాశం ప్రస్తుతానికైతే లేదన్నది విధాన నిర్ణేతలు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం వారంలో ఎన్ని గంటలు పనిచేయాలన్న విష యంపై మొదలైన చర్చ కొన్ని సానుకూల అంశాలను తెరపైకి తెచ్చింది. పని చేసే సమయం ముఖ్యమా? చేసిన పని తాలూకూ నాణ్యత ముఖ్యమా అన్నది వీటిల్లో ఒకటి. అదృష్టవశాత్తూ చాలా మంది కార్పొరేట్ బాసులు సమయం కంటే నాణ్యతకే ఓటు వేశారు. ఒక్కటైతే నిజం... నారాయణ మూర్తి, సుబ్రహ్మణ్యన్ వంటి తొలి తరం వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలపై ఏకాగ్ర చిత్తంతో పని చేయడం వల్లనే ఇప్పుడీ స్థితికి ఎదిగారు. అయితే విజయానికి మార్గాలు అనేకం. రతన్ టాటా వంటి వారు పారిశ్రామికంగా ఎదుగుతూనే ఇతర వ్యాపకాలను కూడా చూసుకోగలిగారు. అభివృద్ధి పథంలో మన సంరక్షకుల పాత్రను కూడా విస్మరించలేము. మొత్త మ్మీద చూస్తే ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలేమిటన్నది సంకుచిత దృష్టితో కాకుండా సమగ్రంగా చూడటం మేలు!సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
కృష్ణా జలాల్లో పాత వాటాలే..
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన కృష్ణా జలాలను ప్రస్తుత నీటి సంవత్సరంలో కూడా పాత వాటాల ప్రకారమే.. ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం (512 టీఎంసీలు), తెలంగాణకు 34 శాతం (299 టీఎంసీలు) చొప్పున పంపిణీ చేస్తామని కృష్ణా బోర్డు వెల్లడించింది. తెలంగాణలో కృష్ణా బేసిన్ 71 శాతం ఉందని, ఆ లెక్కన 71 శాతం వాటా తమకు రావాలని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకూ 50 శాతం వాటాను కేటాయించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసిందని.. ఆ ప్రాతిపదికనే ఆంధ్రప్రదేశ్‌కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం పంపిణీ చేస్తూ 2015, జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసిందని గుర్తుచేశారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకూ 66 : 34 వాటాల ప్రకారమే నీటిని పంపిణీ చేయాలని పునరుద్ఘాటించారు. దీంతో.. ఇరు రాష్ట్రాల అధికారుల వాదనలు విన్న కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ పాత వాటాల ప్రకారమే ఈ ఏడాది నీటిని పంపిణీ చేస్తామని తేల్చిచెప్పారు. నీటి అవసరాలు ఏవైనా ఉంటే త్రిసభ్య కమిటీలో చర్చించి, నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని జలసౌధలో మంగళవారం కృష్ణా బోర్డు కార్యాలయంలో చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన బోర్డు 19వ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు, తెలంగాణ సర్కారు తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్‌కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. టెలీమీటర్ల ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు..ప్రస్తుత నీటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వాటాకు మించి 76 శాతం నీటిని వాడుకుందని.. పెన్నా బేసిన్‌కు నీటిని తరలించిందని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ వివరించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌తోపాటు పెన్నా బేసిన్‌కు కృష్ణా జలాలను మళ్లించే 11 చోట్ల టెలీమీటర్లు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 833 టీఎంసీలు సముద్రంలో కలిశాయని.. వరద సమయంలో ఏ రాష్ట్రం మళ్లించినా ఆ నీటిని కోటాలో కలపకూడదని ఆది నుంచి తాము కోరుతూ వస్తున్నామని గుర్తుచేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దే టెలీమీటరు ఏర్పాటుచేశారని.. దాని దిగువన టెలీమీటర్లు ఏర్పాటుచేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తమ ప్రభుత్వంతో చర్చించి, నిర్ణయం చెబుతామని బోర్డు ఛైర్మన్‌కు చెప్పారు.శ్రీశైలం ప్రాజెక్టులకు అత్యవసర మరమ్మతులు..ఇక కృష్ణా నదికి 2009లో వచ్చిన వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ పూల్ దెబ్బతిందని.. తక్షణమే మరమ్మతు చేయకపోతే ఆ ప్రాజెక్టు భద్రతకే ప్రమాదమని తెలంగాణ అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ పూల్‌పై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో అధ్యయనం చేయించాలని నిర్ణయించామని.. అందులో వెల్లడైన అంశాల ఆధారంగా ఫ్లంజ్పూల్కు మరమ్మతులు చేస్తామని ఏపీ ఈఎన్సీ చెప్పారు. ఆలోగా శ్రీశైలం ప్రాజెక్టులో అత్యవసర మరమ్మతులను వచ్చే సీజన్‌లోగా పూర్తిచేస్తామన్నారు. మరోవైపు.. నాగార్జునసాగర్ నుంచి సీఐఎస్ఎఫ్ బలగాలను ఉపసంహరించుకుని, నిర్వహణ బాధ్యతను తెలంగాణకు అప్పగించాలని ఆ రాష్ట్ర అధికారులు కోరారు.రెండునెలలు చూస్తామని.. సాగర్ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు ఉత్పన్నం కాకపోతే అప్పుడు సీఐఎస్ఎఫ్ బలగాలను ఉపసంహరించే అంశాన్ని పరిశీలిస్తామని బోర్డు చైర్మన్ అతుల్‌జైన్ తెలిపారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని ఏపీ ఈఎన్సీ చేసిన ప్రతిపాదనకు జైన్ సానుకూలంగా స్పందించారు. 50 శాతం వాటా అసంబద్ధం..కృష్ణా జలాల్లో 50 శాతం వాటా తెలంగాణ అధికారులు కోరడం అసంబద్ధం. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512 టీఎంసీలను 2015లో కేంద్రం కేటాయించింది.ఇప్పుడు ఏ ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వొద్దని తెలంగాణ అధికారులు చెబుతారు? ఇదే అంశాన్ని కృష్ణా బోర్డుకు చెప్పాం. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ 66 : 34 నిష్పత్తిలోనే నీటిని పంపిణీ చేయాలని కోరగా బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. – ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ, ఏపీ జలవనరుల శాఖ -
గాజా.. చెదిరిన స్వప్నం!
పదిహేను నెలల భీకర యుద్ధం ధాటికి అంధకారమయమైన గాజా స్ట్రిప్ వీధుల్లో ఎట్టకేలకు శాంతిరేఖలు ప్రసరించినా యుద్ధంలో జరిగిన విధ్వంసఛాయలు తొలగిపోలేదు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంతో ఎట్టకేలకు తుపాకుల మోత, క్షిపణుల దాడులు ఆగిపోయాయి. అయినాసరే అశాంతి నిశ్శబ్దం రాజ్యమేలుతూనే ఉంది. మిస్సైల్స్ దాడుల్లో ధ్వంసమైన తమ ఇళ్లను వెతుక్కుంటూ వస్తున్న పాలస్తీనియన్లకు ఏ వీధిలో చూసినా మృతదేహాలే స్వాగతం పలుకుతూ నాటి మారణహోమాన్ని గుర్తుకు తెస్తున్నాయి. గాజా స్ట్రిప్‌పై వేల టన్నుల పేలుడుపదార్ధాలను కుమ్మరించిన ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల జనవాసాలను దాదాపు శ్మశానాలుగా మార్చేసింది. స్వస్థలాలకు కాలినడకన, గుర్రపు బళ్లలో చేరుకుంటున్న స్థానికులకు ఎటుచూసినా వర్ణణాతీత వేదనా దృశ్యాలే కనిపిస్తున్నాయి. లక్షలాది మంది ప్రజల ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాటికింద స్థానికుల జ్ఞాపకాలతో పాటు కలలు కూలిపోయాయి. కొందరు ఆత్మియులను పోగొట్టుకుంటే.. మరికొందరు సర్వస్వాన్ని కోల్పోయారు. ప్రతి ముఖం మీదా విషాద చారికలే. కుప్పకూలిన వ్యవస్థలు గాజా స్ట్రిప్ అంతటా ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సగం ఆస్పత్రులు ధ్వంసమయ్యాయి. మిగిలినవి సైతం పాక్షింకంగానే పని చేస్తున్నాయి. వాటిల్లోనూ సాధారణ సూదిమందు, బ్యాండేజీ, కాటన్ వంటి వాటినీ అత్యంత జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్యారోగ్య సంస్థలను మళ్లీ పునర్నిర్మించాల్సి ఉంది. రోడ్లు, మౌలిక సదుపాయాల పరిస్థితి మరీ అధ్వాన్నం. శిథిలాల తొలగించాక ఏర్పడిన కాలిబాటే ఇప్పడు అక్కడ రోడ్డుగా ఉపయోగపడుతోంది. సొంతిళ్లు బాంబుదాడిలో ధ్వంసమయ్యాక శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నాసరే పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ వైమానిక బలగాలు వదిలేయలేదు. క్యాంప్‌లపై బాంబుల వర్షం కురిపించడంతో కళ్లముందే కుటుంబసభ్యులను కోల్పోయిన వారు ఇప్పుడు ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్నారు.యుద్ధభయం వారిని ఇంకా వెన్నాడుతోంది. మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారిని పట్టించుకున్న నాథుడే లేడు. యుద్ధం ఆగాక సహాయక, అన్వేషణా బృందాలు అవిశ్రాంతంగా కష్టపడుతూ మరో శ్రామికయుద్ధం చేస్తున్నాయి. శిథిలాల కింద మృతదేహాల నుంచి వెలువడుతున్న దుర్వాసన మధ్యే వాళ్లు శిథిలా తొలగింపు పనులు చేస్తున్నారు. ‘‘వీధిని చక్కదిద్దేందుకు ఏ వీధిలోకి వెళ్లినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. కూలిపోయిన భవనాల కింద చాలా మంది చిక్కుకుని ఉండొచ్చు’’అని గాజా సిటీలోని 24 ఏళ్ల సివిల్ డిఫెన్స్ కార్మికుడు అబ్దుల్లా అల్ మజ్దలావి చెప్పారు. ‘నా కుటుంబం శిథిలాల కింద కూరుకుపోయింది, దయచేసి త్వరగా రండి’’అంటూ కాల్పుల విరమణ తర్వాత కూడా స్థానికుల నుంచి తమకు నిరంతరాయంగా ఫోన్‌కాల్స్ వస్తున్నాయ ని సహాయక ఏజెన్సీ తెలిపింది. పునర్నిర్మాణానికి చాలా సమయం ధ్వంసమైన పాలస్తీనా భూభాగంలో పునర్నిర్మాణ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని గాజాలోని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థి సంస్థ ఉన్వ్రా తాత్కాలిక డైరెక్టర్ సామ్ రోజ్ తెలిపారు. ‘‘గాజాలో ఆవాస వ్యవస్థ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. మళ్లీ కుటుంబాలు, కమ్యూనిటీలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. సహాయక చర్యలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నాం’’అని ఆయన పేర్కొన్నారు.ప్రజల అత్యవసర అవసరాలను తీర్చడానికి, గాజా ప్రజారోగ్య వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టేందుకు తొలి 60 రోజుల ప్రణాళిక ఉందని, వేలాది మంది జీవితాన్ని మార్చేసిన గాయాలను మాన్పేందుకు సిద్ధమవుతున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ హనన్ బాల్కీ ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా గాజా స్ప్రిప్లో ఆస్పత్రులకు మరమ్మత్తు చేయడం, దాడుల్లో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో తాత్కాలిక క్లినిక్‌లను ఏర్పాటు చేయడం, ప్రజల్లో పోషకాహార లోపాన్ని పరిష్కరించడం, అంటువ్యాధులు ప్రబలకుండా చూడటం వంటి వాటిపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని బాల్కీ వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్అణువణువునా విధ్వంసంయుద్ధం దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లను నిరాశ్రయులను చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 46,900 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,10,700 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. తమ సిబ్బందిలో 48 శాతం మంది ఇక ఈ ఘర్షణల బాధితులున్నారని, కొందరు మరణించగా, మరికొందరు గాయపడ్డారని, ఇంకొందరు నిర్బంధంలో ఉన్నారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. గాజాలోని 85 శాతం వాహనాలు ధ్వంసమయ్యాయి. తమ 17 కార్యాలయాలు దెబ్బతిన్నాయని గాజా సివిల్ డిఫెన్స్ తెలిపింది.ఆదివారం కాల్పుల విరమణ ప్రారంభం కావడంతో స్థానికుల ముఖాల్లో ఆనందం వచ్చిచేరినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూస్తే ఉన్న ఆ కాస్త ఆనందం కూరా ఆవిరయ్యే దుస్థితి దాపురించింది. గాజా అంతటా 60శాతం నిర్మాణాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని ఐక్యరాజ్యసమితి గతంలో అంచనా వేసింది. చాలా ఆలస్యంగా కుదిరిన శాంతి ఒప్పందం అమలయ్యే నాటికి మరింతగా దాడులు జరగడంతో నేలమట్టమైన నిర్మాణాల సంఖ్య మరింత పెరిగింది. కూలిన ఇళ్ల కింద 10,000కు పైగా మృతదేహాలు ఉండొచ్చని ఏజెన్సీ అంచనావేస్తోంది.నెమ్మదిగా మొదలైన సాయం కాల్పులు ఇరువైపులా ఆగిపోవడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ దాడుల నుంచి ఎలాగోలా తప్పించుకుని, గాయాలపాలుకాని స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిథిలాల కింద మృతులను అన్నింటినీ తొలగించడానికి కనీసం వంద రోజులు సమయం పడుతుందని అన్వేషణా బృందాలు అంచనావేస్తున్నాయి. శిథిలాల తొలగింపునకు అవసరమైన బుల్డోజర్లు ఇతర పరికరాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో వెలికితీత మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. దాడుల ధాటికి అన్ని వాణిజ్య సముదాయాలు మూతపడటంతో పని దొరకడం కూడా కష్టంగా ఉంది.స్థానికులకు ఆదాయం కాదు కదా ఆశ్రయం కూడా లేకపోవడంతో గాజాలో బతకడం కూడా పెద్ద అస్తిత్వ పోరాటంగా తయారైంది. కాల్పుల విరమణ జరిగిన వెంటనే ఆహారం, నిత్యావసర వస్తువులు, ఔషధాలను మానవతా సంఘాలు అందించడం మొదలెట్టాయి. ఒక్క ఆదివారం రోజే 630 లారీల నిండా సరకులు గాజాలోకి ప్రవేశించాయి. సోమవారం మరో 915 లారీలు గాజాలోకి వెళ్లాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే ఇంతటి భారీ స్థాయిలో మానవతా సాయం అందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
మన జీనోమ్ డేటా రెడీ
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు వైద్యుడి వద్దకు వెళ్తే మణికట్టు పట్టుకొని నాడీ కొట్టుకునే తీరును చూసి మన శరీరంలో అనారోగ్య సమస్య ఏమిటో చెప్పేవారు. ఇప్పుడు కాలం మారింది. కొత్త వ్యాధులు మనుషులపై దండెత్తుతున్నాయి. వాటికి విరుగుడుగా కొత్త మందులనూ శాస్త్రవేత్తలు కనిపెడుతూనే ఉన్నారు. మనకు భవిష్యత్తులో రాబోయే వ్యాధులేమిటో కూడా ముందుగానే చెప్పేసే టెక్నాలజీ వచ్చింది. అందుకు పునాది జీనోమ్ సీక్వెన్స్. జన్యు క్రమాన్ని విశ్లేషించటం ద్వారా మని షిలో రాబోయే దీర్ఘకాలిక అనారోగ్యాల గురించి తెలుసుకోవచ్చు. అందుకే జన్యు క్రమ విశ్లేషణ ప్రపంచవ్యాప్తంగా ప్రాధా న్యత పెరిగింది. అనేక దేశాలు తమ పౌరుల జన్యుక్రమాలను విశ్లేషించి డేటాను భద్రపరుస్తున్నాయి. అదే కోవలో భారత ప్రభుత్వం కూడా మనదేశంలోని జనాభా సమూహాల (పాపులేషన్ గ్రూప్స్) జన్యు క్రమాలను విశ్లేషించేందుకు ‘జీనోమ్ ఇండియా’ ప్రాజెక్టును చేపట్టింది. మొదటి దశలో భాగంగా 83 జనాభా సమూహాల జన్యువుల వివరాలు సేకరించి, ఆ డేటా ను హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉన్న ‘ఇండియన్ బయలాజికల్ డేటా సెంటర్’లో భద్రపరిచారు. మనదేశంలో దాదాపు 4,600 జనాభా సమూహాలున్నాయి. వీటిల్లో 83 అంటే 2% గ్రూపుల జన్యు వివరాల సేకరణ పూర్తయింది. ఈ డేటాను భారతీయ శాస్త్రవేత్తలతోపాటు ప్రపంచంలో ఏ పరిశోధకులైనా తమ పరిశోధన కోసం వాడుకొనేందుకు అందుబాటులో ఉంచారు. వ్యాధుల చికిత్సలో భారతీయులకు సరిపడే మందుల తయారీకి, కొత్త చికిత్సల రూపకల్పనకు ఈ డేటాబేస్ ఉపయోగపడుతుంది.భిన్నమైన జన్యు వేరియెంట్లుకేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగం మద్దతుతో చేపట్టిన జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా పరిశోధకులు 10 వేల మానవ జన్యువులను క్రోడీకరించారు. వీటిలో 2.7 కోట్ల అత్యంత అరుదైన వేరియెంట్స్‌ను గుర్తించి వివరాలు రికార్డు చేశారు. పైగా వాటిల్లోనూ 70 లక్షల వేరియెంట్స్ వివరాలు ప్రపంచంలో మరెక్కడా లేనివి. తాజా డేటాను విశ్లేషించి జన్యుపరంగా భారతీయులకే ప్రత్యేకంగా ఉన్న కొన్ని మొండి వ్యాధుల మూలాలను తెలుసుకోవచ్చు. అలాగే జన్యు ప్రత్యేకతల కారణంగా ఒక్కొక్కరిలో ఒక్కోలా వ్యక్తమయ్యే వ్యాధులకు చికిత్స కోసం ప్రత్యేక వ్యక్తిగత మందులను తయారుచేయవచ్చు. ‘ఈ జ్ఞానసంపద కేవలం వైజ్ఞానిక పరిశోధనలకే కాకుండా, ఇతరత్రా రంగాల్లో అత్యున్నత పరిశోధనలకూ, ప్రజలందరి ఆరోగ్య సంరక్షణకూ ఉపయోగపడుతుంది’ అని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్రసింగ్ పేర్కొన్నారు. నంబరింగ్‌తో రికార్డుమనదేశంలో భిన్న జాతులు, వర్గాలు, కులాల జనాభా జీవిస్తున్నారు. ఇది చాలా సున్నితమైన సామాజిక నిర్మాణం. అందుకే ఈ ప్రాజెక్టులో డేటాను జాతులు, కులాల పేర్లతో కాకుండా కొన్ని సాంకేతిక పదజాలాలు, అంకెలతో సూచించేలా ఏర్పాట్లు చేశారు. విస్తారంగా ఉన్న జనాభాలో ఇప్పటికి ఈ డేటాబేస్ కొద్ది గ్రూపుల తాలూకు వివరాలకే పరిమితమైనప్పటికీ, భవిష్యత్తులో సేకరించాల్సిన అనేక గ్రూపుల వివరాలకోసం ఓ ముందడుగు పడినట్లు అయ్యిందని నిపుణులు అంటున్నారు. దీన్ని జీనోమ్ డేటాబేస్ సేకరణలో మొదటి దశగా చెప్పవచ్చని, తర్వాత దేశం రెండో దశలో అడుగుపెట్టినట్లుగా భావించాలని పేర్కొంటున్నారు. గ్లోబల్ జీనోమ్ డేటాబేస్‌లో భారతీయుల వివరాలు అరకొరగానే ఉండటంతోకొత్తగా సేకరించిన ఈ వివరాలు మనకు చాలా కీలకంగా మారనున్నాయి. అందరూ వాడుకోవచ్చు జీనోమ్ ఇండియా ప్రాజెక్టు ‘డేటాబేస్’ను అందరికీ అందుబాటులో ఉంచారు. దీనిని ఉపయోగించుకోవాలని భావించే శాస్త్రవేత్తలు తమ పరిశోధన వివరాలను తెలుపుతూ ప్రతిపాదనలను పంపించాల్సి ఉంటుంది. ఆ దర ఖాస్తులను పరిశీలించేందు కు ఒక నిపుణుల పానెల్‌ను ఏర్పాటుచేశారు. ఆ ప్యానెల్ దరఖాస్తులను పరిశీలించి డేటాను వాడుకొనేందుకు అనుమతి ఇస్తుంది.ఇది మన బయోటెక్ సంపద.. జీనోమ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా సేకరించిన డేటా మన బయోటెక్ సంపద. ఇలాంటి డేటాబేస్ ఏర్పాటు చేసుకోవడం ఓ చారిత్రక పరిణామం. బయోటెక్నాలజీ ఆధారంగా రూపొందించే అనేక నూతన సాంకేతిక ఉపకరణాల తయారీకి, ఉత్పత్తులకు ఇది తోడ్పడుతుంది. – నరేంద్రమోదీ, ప్రధానమంత్రి.సుదీర్ఘ ప్రక్రియ..‘జీనోమ్ ఇండియా’ ప్రాజెక్టుకు అవసరమైన వనరులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చింది. ఈ ప్రాజెక్టు మొదటి దశను 2020లో ప్రారంభించారు. మొదటి దశ పూర్తి కావడంతో, ఇక ప్రాజెక్టు రెండో దశను మొదలుపెట్టాల్సి ఉంది. మొదటి దశలో పది వేల మంది వివరాలు సేకరించారు. రెండో దశలో పది లక్షల మంది జన్యువులను సేకరిస్తారు. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం వ్యాధులకు మెరుగైన ఔషధాలు తయారుచేయటమేనని అధికారులు తెలిపారు. రెండో దశ వివరాల సహాయంతో ప్రమాదకర క్యాన్సర్లకు చికిత్సలను కనిపెట్టడం, నాడీ సంబంధ వ్యాధులకు పరిష్కారాలు వెదకటం, అత్యంత అరుదుగా వచ్చే వ్యాధులకు చికిత్స వంటి అనేక అంశాలను చేపడుతారని సమాచారం. -
భవిష్యత్తు బంగారమేనా?
అనుకున్నదే అయింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తూనే డొనాల్డ్ ట్రంప్ తన మాటలు, చేతలు, చేష్టల ద్వారా సంచలనాలు సృష్టించారు. గతంలో దేశానికి 45వ అధ్యక్షుడిగా పనిచేసి, తాజాగా 47వ అధ్యక్షుడిగా సోమవారం పదవీ ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ తన తొలి ప్రసంగంలోనే ‘ఇక నుంచి అమెరికాకు స్వర్ణయుగం’ అంటూ అమెరికన్లలో ఆశలు, ఆకాంక్షలు పెంచారు. అయితే, ‘అమెరికాను మళ్ళీ ఘనమైన దేశంగా తీర్చిదిద్దాల’ని (మాగా) నినదిస్తూ ఆయన ప్రకటించిన కొన్ని చర్యలు ఆధిపత్య, విస్తరణవాదానికి ప్రతీకగానూ ప్రతిధ్వనించాయి. వర్తమాన ప్రపంచ అధికార క్రమాన్ని మార్చివేసే పలు చర్యలకు నడుం బిగి స్తున్న తీరు, అలాగే కోవిడ్, చైనాలను సాకుగా చూపుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి, అలాగే పర్యావరణ రక్షణపై ప్యారిస్ ఒప్పందం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ట్రంప్ పదవీ ప్రమాణ స్వీకారం పైకి సాదాసీదా అధికార మార్పిడిగా అనిపించవచ్చు. రాజకీయ ప్రత్యర్థులు సైతం చిరునవ్వులు చిందిస్తూ సౌహార్దం చూపుకుంటున్నట్టు కనిపించవచ్చు. అంతమాత్రాన అంతా మామూలే అనుకొంటే పొరపాటు. పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో దర్శనమిచ్చిన ఐక్యతకు భిన్నంగా ప్రత్యర్థులపై తుపాకులు ఎక్కుపెట్టిన తీరు ఆయన ప్రసంగంలో స్పష్టంగా వినిపించింది. కునారిల్లిన దేశాన్ని తాను మాత్రమే మళ్ళీ పునరుత్తేజితం చేయగలనన్న భావన కలిగించడంతో పాటు ఆయన ఒకటికి రెండు జాతీయ ఎమర్జెన్సీలు ప్రకటించడం పెను పర్యవసానమే. అలాగే, చైనా నుంచి పనామా కాలువను వెనక్కి తీసుకోవాలని పిలుపునివ్వడమూ వివాదాస్పదమే. బలప్రయోగం ద్వారా మాత్రమే సాధ్యమయ్యే అలాంటి పనుల ప్రస్తావన నిప్పుతో చెలగాటానికి సిద్ధమని స్పష్టం చేయడమే. ఇక, గద్దెనెక్కిన తొలిరోజునే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ను ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా ట్రంప్ ప్రకటించడంతో రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా మరెన్ని ఆశ్చర్యకర పరిణామాలు చోటుచేసుకుంటాయనే ఉద్విగ్నత నెలకొంది. పదవి చేపడుతూనే ట్రంప్ చకచకా సంతకాలు చేసిన పదుల సంఖ్యలోని కార్యనిర్వాహక ఆదేశాలు ఆసక్తికరం. పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేయడం, జన్మహక్కుగా సంక్రమించే పౌర సత్వంపై అమెరికా రాజ్యాంగాన్ని సైతం తోసిపుచ్చడం లాంటివి ఇట్టే మింగుడుపడే అంశాలు కావు. జాతీయతతో సంబంధం లేకుండా దేశంలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నవారికి పుట్టినబిడ్డలకు సైతం 150 ఏళ్ళ పైచిలుకుగా అమెరికా పౌరసత్వం దక్కుతూ వచ్చింది. కానీ, నెల రోజుల్లో అమలులోకి రానున్న తాజా ఆదేశం ఫలితంగా ఇప్పుడిక అలాంటి పిల్లలకు పౌరసత్వ పత్రాలివ్వరు. అదేమంటే, 1868లో చేసిన 14వ సవరణ కింద అమెరికా గడ్డపై పుడితేచాలు ఆ పిల్లలకు మారుమాట లేకుండా పౌరసత్వమివ్వాలనేమీ లేదనీ, సవరణను తప్పుగా వ్యాఖ్యానించారనీ ట్రంప్ వాదన. తాత్కాలిక వీసాలతో అమెరికాలో నివసిస్తూ, ఉద్యోగాధారిత గ్రీన్కార్డ్కై దీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న 10 లక్షల పైచిలుకు మంది భారతీయులకు ఈ కొత్త నిర్ణయం అశనిపాతమే. ఇప్పటికే కొన్నిచోట్ల ఇమ్మిగ్రేషన్ లాయర్లు కోర్టుకెక్కిన ఈ ఆదేశం గనక అమలైతే, తాత్కాలిక వర్క్ వీసాలు, టూరిస్ట్ వీసాలపై అగ్రరాజ్యంలో ఉంటున్నవారి సంతానానికి అక్కడి పౌరసత్వ ఆశలు అడుగంటినట్లే. 2022 నాటి అమెరికా జనాభా లెక్కలపై ప్యూ రిసెర్చ్ విశ్లేషణ ప్రకారం అమెరికాలో 48 లక్షల మంది భారతీయ అమెరికన్లుంటే, వారిలో మూడింట రెండొంతుల మంది వలసజీవులే. కేవలం 34 శాతం, మరో మాటలో 16 లక్షల మంది మాత్రం అగ్రరాజ్యంలోనే పుట్టారు. ఇక, చట్టవిరుద్ధమైన వలసల్ని అడ్డుకుంటాననీ, సరైన పత్రాలు లేని లక్షలాది వలస జీవుల్ని దేశం నుంచి పంపివేస్తాననీ ట్రంప్ చేసిన గర్జన కూడా లక్షలమందికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ జాబితాలో మెక్సికో (40 లక్షలు), ఎల్ సాల్వడార్ (7.5 లక్షలు) తర్వాత 7.25 లక్షల మంది భారతీయులదే మూడో స్థానం. ఫలితంగా, ట్రంప్ ప్రతి మాట, ప్రతి అడుగు మనవాళ్ళలో ఆదుర్దా పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ కొత్త ఏలుబడిలో భారత్‌తో బంధం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. మరోపక్క డెమోక్రాట్లను జనం బాధలు పట్టని కులీనులుగా చిత్రించి, సామాన్య పౌరుల సంరక్ష కుడిగా ఎన్నికల్లో తనను తాను చూపుకొన్న ట్రంప్‌ను అతిగా నమ్మి మోసపోయామనే భావన రేకెత్తడం సహజమే. చేతిలోని నియంత్రణ నిర్ణయాలే అండగా ఇటీవలే ఓ బ్రాండెడ్ క్రిప్టో టోకెన్ ద్వారా ఆయన వందల కోట్ల డాలర్ల లబ్ధి పొందాడనే విమర్శలూ గుప్పుమంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 80 ఏళ్ళ తర్వాత కీలక సమయంలో పగ్గాలు చేపట్టిన ట్రంప్ తన మద్దతుదారులకై ఏమైనా చేసేలా ఉన్నారు. 2021లో అమెరికా అధ్యక్ష భవనంపై దాడి చేసిన దాదాపు 1500 మంది దుండగులకూ ఆయన తక్షణం సామూహిక క్షమాభిక్ష ప్రసాదించడమే అందుకు తార్కాణం. నాలుగేళ్ళు విచారించి, శిక్షలు వేసిన న్యాయవ్యవస్థను అలా నూతన అధ్యక్షుడు పరిహసించినట్టయింది. ఆశ్రితులు, ఆర్థిక దాతలు, బంధు మిత్రులకై క్షమాభిక్ష వ్యవస్థను దుర్వినియోగం చేయడంలో నిన్నటి బైడెన్ నుంచి నేటి ట్రంప్ దాకా అందరూ ఒకే తాను గుడ్డలన్న మాట. కాలు మోపిననాడే కాపురం చేసే లక్షణం తెలిసిందన్నట్టు ట్రంప్ 2.0 హయాం ఆరంభమవు తూనే రోజులు ఎలా ఉండనున్నాయో తేటతెల్లమైంది. బహుళ ధ్రువ ప్రపంచం వైపు అంతర్జాతీయ అధికార క్రమం అడుగులేస్తున్న కాలంలో ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో సామాజిక, ఆర్థిక రంగాల్లో ట్రంప్ ఆధిపత్యభావ నిర్ణయాలు రానున్న నాలుగేళ్ళలో ప్రపంచాన్ని కుదిపేయడం ఖాయం. -
గెరిల్లా సేనాని చలపతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/చిత్తూరు అర్బన్/ మల్కన్‌గిరి: వరుస ఎన్కౌంటర్లతో కుదేలవుతున్న మావోయిస్టులకు ఊహించని షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్–ఒడిశా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి అలియాస్ ప్రతాప్‌రెడ్డి అలియాస్ అప్పారావు మరణించారు. కేంద్ర కమిటీ సభ్యుడు ఇలా ఎన్కౌంటర్లో మృతిచెందడం మావోయిస్టు పార్టీ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం. చలపతిపై రూ.కోటి రివార్డు ఉన్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఏపీలోని చిత్తూరు జిల్లాలో జన్మించి... ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మత్యం పైపల్లెకు చెందిన శివలింగారెడ్డి, లక్ష్మమ్మ దంపతుల మూడో కుమారుడు చలపతి. ఆయన తండ్రి సాధారణ రైతు. వారికి మత్యం పైపల్లెలో ఇప్పటికీ సొంతిల్లు ఉంది. ప్రస్తుతం ఆ ఇంట్లో చలపతి అన్న కుమారుడి కుటుంబం నివసిస్తోంది. ప్రాథమిక విద్యను మత్యంలోనే అభ్యసించిన చలపతి.. పదో తరగతి వరకు బంగారుపాళెం, డిగ్రీ ఒకేషనల్ కోర్సును చిత్తూరులో పూర్తిచేశారు. పీపుల్స్‌వార్ పార్టీకి ఆకర్షితుడై 1990–91లో అజ్ఞాతంలోకి వెళ్లారు. పోలీసు రికార్డుల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో మావోయిస్టు పార్టీ విస్తరణకు కృషి చేశారు. శ్రీకాకుళం– కోరాపుట్ డివిజన్ ఇన్చార్జిగా పనిచేసిన ఆయన.. గెరిల్లా వార్ఫేర్లో చూపిన ప్రతిభతో అనతి కాలంలోనే డివిజనల్ కమిటీ సభ్యుడిగా ఎదిగారు. 2000 నాటికి ఆంధ్రా– ఒడిశా బోర్డర్ (ఏఓబీ) స్పెషల్ జోనల్ కమిటీ, ఏవోబీ స్టేట్ మిలిటరీ కమిషన్లలో సభ్యుడి హోదా పొందారు. 2010లో తోటి మావోయిస్టు అరుణ అలియాస్ చైతన్యను వివాహం చేసుకున్నారు. 2012లో జరిగిన ఒక దాడిలో చలపతి పొరపాటు కారణంగా ఒక కామ్రేడ్ చనిపోవడంతో పార్టీ ఆయనను కొంతకాలం డీమోట్ చేసింది. చలపతి భార్య అరుణ 2019 మార్చిలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మృతి చెందారు. మహేంద్ర కర్మపై దాడితో మళ్లీ తెరపైకి... సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మపై 2015లో చేసిన దాడితో చలపతి మరోసారి వెలుగులోకి వచ్చారు. తరా>్వత మావోయిస్టు రీజనల్ కమిటీ చీఫ్ కుడుముల వెంకట రమణ అలియాస్ రవి ఎదురుకాల్పుల్లో మృతి చెందడం, గెమ్మెలి నారాయణరావు అలియాస్ జాంబ్రి 2017లో చనిపోవడంతో.. చలపతికి ప్రాధాన్యత దక్కింది. తర్వాతి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి చేరుకున్నారు. 2003లో దమాన్జోడి మైన్స్ కంపెనీపై దాడి, మాచ్‌ఖండ్ పోలీసుస్టేషన్‌పై దాడి, చిత్రకొండ సమితిలో సెల్ టవర్ల పేల్చివేత, 2009లో ఏపీ గ్రేహౌండ్స్‌పై చిత్రకొండ జలాశయంలో దాడి, 2018లో జరిగిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోముల హత్యను ప్లాన్ చేసినది చలపతేనని చెబుతారు. 2011లో చలపతి ఒడిశా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో కలెక్టర్ వినీల్‌కృష్ణను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఆర్కే సన్నిహితుడిగా.. హిడ్మాకు గురువుగా.. మావోయిస్టు పార్టీ మాస్టర్ మైండ్స్‌లో ఒకరిగా చలపతికి గుర్తింపు ఉంది. మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు అత్యంత సన్నిహితంగా చలపతి మెలిగారు. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ వన్ కమాండర్‌గా ఉన్న మడావి హిడ్మాకు చలపతిని గురువుగా పేర్కొంటారు. ఆయన ఎలా ఉంటారనేది చాలా కాలం పాటు పోలీసులకు తెలియలేదు. 2016లో ఓ మావోయిస్టు చనిపోగా.. అతడి ల్యాప్‌టాప్‌లో చలపతి, ఆయన సహచరి అరుణ సెల్ఫీ వీడియో లభించింది. -
Krishna River Water: మళ్లీ త్రిసభ్య కమిటీకే..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల తాత్కాలిక సర్దుబాటు బాధ్యతను మళ్లీ త్రిసభ్య కమిటీకే అప్పగిస్తూ కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయం తీసుకుంది. దీనికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు చైర్మన్ అతుల్‌జైన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ తరఫున నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా, ఈఎన్సీ జి.అనిల్‌కుమార్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఎస్ఈ విజయ్‌కుమార్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, బోర్డుసభ్యకార్యదర్శి డీఎం రాయ్‌పురే పాల్గొన్నారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల వాటా ఉండగా, 66:34 నిష్పత్తిలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలిక సర్దుబాటు పేరుతో 2015 జూన్‌లో కేంద్ర జలశక్తి శాఖ జరిపిన కేటాయింపులను ఇకపై కొనసాగించడానికి అంగీకరించమని రాహుల్ బొజ్జా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే త్రిసభ్య కమిటీ ఈసారి తెలంగాణకు కొంత వరకు కేటాయింపులు పెంచుతుందని బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారని రాహుల్»ొజ్జా తెలిపారు. సమావేశానంతరం ఈఎన్సీ జి.అనిల్‌కుమార్‌తో కలిసి ఆయన మీడియాకు ఆ వివరాలు వెల్లడించారు. కృష్ణానది 71శాతం తెలంగాణలో విస్తరించి ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి 71శాతం, ఏపీకి 29 శాతం జలాలను కేటాయించాలని తాము కృష్ణా ట్రిబ్యునల్–2లో వాదనలు వినిపించిన అంశాన్ని బోర్డుకు వివరించామన్నారు. ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చే వరకు 50:50 నిష్పత్తిలో తాత్కాలిక పంపిణీ జరపాలని డిమాండ్ చేశామని చెప్పారు. ఏపీ కొత్తగా ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు వివరాలను అందించాలని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు కోరామన్నారు. ప్రతి చుక్కను లెక్కించాల్సిందే.. పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు తరలించడాన్ని అడ్డుకోవాలని బోర్డును కోరామని రాహుల్‌బొజ్జా తెలిపారు. చెన్నైకి తాగునీరు మాత్రమే సరఫరా చేయాలని, సాగునీటి అవసరాలకు తరలించడం అక్రమమని వాదించామన్నారు. ఏటా 200 టీఎంసీలకు పైగా కృష్ణా జలాలను ఏపీ బేసిన్ వెలపలి ప్రాంతాలకు తరలిస్తోందని అభ్యంతరం తెలిపారు. పోతిరెడ్డిపాడు, బనకచర్లతోపాటు ఏపీలోని మొత్తం 11 అవుట్ లెట్ల ద్వారా తరలిస్తున్న ప్రతీ చుక్కను పక్కాగా లెక్కించడానికి 11 టెలీమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరామని రాహుల్ బొజ్జా తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి వంటి అనుమతి లేని ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయగా, ప్రస్తుతం వీటికి నీటి కేటాయింపులు ట్రిబ్యునల్ పరిధిలో ఉందని బదులిచ్చామన్నారు. కృష్ణా ట్రిబ్యునల్–1 ప్రాజెక్టుల వారీగా కాకుండా గంపగుత్తగా నీళ్లు కేటాయించిందని, దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లను కేటాయించుకునే హక్కు తమకు ఉంటుందన్నారు. సాగర్‌పై సీఆర్పీఎఫ్ బలగాల ఉపసంహరణ నాగార్జునసాగర్ ప్రాజెక్టుపై ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించాలని తాము కోరగా, ఏపీ సైతం అంగీకరించిందని రాహుల్‌బొజ్జా తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని పరిశీలించాక 2 నెలల తర్వాత ఉపసంహరిస్తామని బోర్డు చైర్మన్ హామీ ఇచ్చారన్నారు. కృష్ణా జలాల్లో వాటాలు తేలే వరకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోని తమ కాంపోనెంట్లతోపాటు హైడల్ పవర్ ప్రాజెక్టులను ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. ప్రమాదంలో శ్రీశైలం జలాశయం : తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ శ్రీశైలం జలాశయ ప్లంజ్‌పూల్ (నీళ్లు స్పిల్‌వే గేట్ల నుంచి దూకి కిందకు పడే ప్రాంతం) వద్ద 300–400 మీటర్ల లోతు వరకు భారీ గుంతలు ఏర్పడ్డాయని తెలంగాణ ఈఎన్సీ అనిల్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మరమ్మతులు చేయాలని ఏపీని కోరామన్నారు. టెలీమెట్రీల ఏర్పాటుకు రూ.6 కోట్లను భరిస్తామని తెలియజేశామన్నారు. ఈ ఏడాది 780 టీఎంసీల కృష్ణా జలాల లభ్యత ఉండగా, ఇప్పటికే ఏపీ 500 టీఎంసీలు(76శాతం) వాడుకోగా, తెలంగాణ కేవలం 180 టీఎంసీలు మాత్రమే వాడిందన్నారు. ఏపీ అధిక వినియోగానికి తగ్గట్టూ తెలంగాణకు వాటాలు పెంచాలని కోరామని చెప్పారు. బచావత్ కేటాయింపులకు రక్షణ కల్పించాలి : ఏపీ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వర్లు బచావత్ ట్రిబ్యునల్ (కృష్ణా ట్రిబ్యునల్–1) కేటాయింపుల ఆధారంగా ఏపీకి 66 శాతం, తెలంగాణకి 34 శాతం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కోరామని ఏపీ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్–2లో వాటాలు తేలే వరకు ఈ మేరకు కేటాయింపులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ట్రిబ్యునల్ నిర్ణయం వచ్చేవరకు త్రిసభ్య కమిటీ పరస్పర అంగీకారంతో నీళ్లను పంచుకుంటామన్నారు. టెలీమెట్రీల ఏర్పాటుపై తమ ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శ్రీశైలం జలాశయ ప్లంజ్‌పూల్‌కు మరమ్మతుల కోసం సీఎస్ఎంఆర్ఎస్ఈతో అధ్యయనం చేయిస్తున్నామని, కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) అధికారులతో చర్చించి మరమ్మతులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించాలని డిమాండ్ చేశారు. -
మా పేర్లు ఎందుకు లేవు?
సాక్షి నెట్వర్క్: లబ్ధిదారుల జాబితాలో మా పేరు లేదంటూ ఆయా జిల్లాల్లో ప్రజలు అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం రైతుభ రోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, తెల్లరేషన్‌కార్డుల పథకాల అమలుకు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలను ప్రకటించింది. వీటిపై అభ్యంతరాల స్వీకరణకు మూడు రోజులపాటు నిర్వహించే గ్రామసభలు మంగళవారం మొదలుకాగా మొదటి రోజు అభ్యంతరాలు వెల్లువెత్తాయి. అర్హులను కాదని అనర్హులను ప్రకటించారంటూ జిల్లాల్లో నిరసన వ్యక్తం చేశారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమ పేర్లు లేవంటూ ఆందోళన చేసిన వారే ఎక్కువగా ఉన్నారు. అయితే జాబితాలో పేర్లు లేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో ప్రజలు క్యూ కట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా: హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్న వారిని ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో చేర్చారని ఖమ్మం జిల్లా వెంకట్యాతండాలో ఎంపీడీఓను నిలదీశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం తండాలో అనర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటూ ప్రత్యేకాధికారి దేవరాజు తదితరులను స్థానికులు నిర్బంధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా : అర్హుల జాబితా అంతా తప్పుల తడకగా ఉందని, తమకు గ్రామసభ వద్దని గట్టుప్పల్ మండల కేంద్రంలో ప్రజలు ఆందోళనకు దిగారు. మూడు గంటల పాటు సభను అడ్డుకున్నారు. ఆత్మకూర్ (ఎం) మండలంలోని రహీంఖాన్‌పేటలో నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : చాలా చోట్ల తమ పేర్లు లేవని అధికారులను ప్రజలు నిలదీశారు. బెల్లంపల్లి పట్టణం కన్నాలబస్తీ ఒకటో వార్డులో రేషన్‌కార్డులకు అర్హులను ఎంపిక చేయడం లేదంటూ ఆందోళన చేపట్టారు. ఆర్డీవో హరికృష్ణను నిలదీశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా : ధర్మారం మండలం కమ్మరిఖాన్‌పేట గ్రామసభను బహిష్కరించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద గ్రామంలో కేవలం 52మంది లబ్ధిదారులనే ఎంపిక చేశారని, అందులో సగం మందికి వ్యవసాయ భూమలున్నాయని, అసలు గుంట భూమి లేని వారికి మాత్రం జాబితాలో చోటు కల్పించలేదంటూ పలువురు గ్రామసభను బహిష్కరించారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ కాలేదని బోయినపల్లి మండలం రత్నంపేట ప్రజాపాలన గ్రామసభలో పలువురు రైతులు అధికారులను నిలదీశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామంలో మహిళలు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డిని నిలదీశారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే తమ గ్రామానికి 10 ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చి నెరవేర్చలేదంటూ ఎమ్మెల్యేను అడిగారు. డిచ్పల్లి, ఇందల్వాయి, మోపాల్, ధర్పల్లి, నిజామాబాద్ రూరల్, జక్రాన్‌పల్లి, సిరికొండ తదితర మండలాల్లో రసాభాసగా సభలు జరిగాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా : ఆమనగల్లు మండలం కోనాపూర్ కార్యదర్శి గ్రామసభ నిర్వహిస్తున్న సమయంలో దరఖాస్తులు తీసుకోకుండా, ఓ పార్టీకి చెందిన నాయకులతో దాబాకు వెళ్లి విందు చేసుకున్నారని స్థానికులు ఆరోపించారు. ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్‌లో నిర్వహించిన వార్డు సభలు రసాభాసగా మారాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా: నవాబుపేట మండలం కొల్లూరు గ్రామసభలో జాబితాలో అర్హుల పేర్లు రాలేదని అధికారులను నిలదీశారు.మరికల్ మండలం రాకొండలో గ్రామసభ రసాభాసగా మారింది. ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురికి ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేర్లు రావడంతో గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. పహారా మధ్య గ్రామసభను కొనసాగించాల్సి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామసభ జరుగుతుండగా, అర్షం మనోజ్ వచ్చి... ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీంలో తాను లబ్ధిదారుల జాబితాలో ఉన్నానని, ఆ స్కీం తనకు వద్దంటూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.జనగామ మండలం శామీర్‌పేటలో నిర్వహించిన గ్రామసభకు వచ్చిన కలెక్టర్ రిజ్వాన్ బాషాను పలువురు ప్రశ్నించారు. రేషన్ కార్డులు, ఇతర పథకాలు వచ్చినోళ్లకే వస్తున్నాయి... మా సంగతేంటని ఓ వ్యక్తి కలెక్టర్‌ను నిలదీయగా, మరోసారి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.