అర్జీలకు అడ్డగోలుగా కత్తెర
అర్హత ఉన్నా 23 వేల మందిపింఛను తిరస్కరణ
జన్మభూమి కమిటీలదే పైచేయి
విజయవాడ : జిల్లాలో సంక్షేమ పథకాల్లో అడ్డగోలు కత్తిరింపులు మొదల య్యాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికార పార్టీ అనేక సాకులు చూపుతూ ఒక్కొక్కటిగా అటకెక్కిస్తోంది. ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛను ఇస్తానని విస్తృత ప్రచారం చేసిన చంద్రబాబు హామీలకు, జిల్లాలో పరిస్థితికి పొంతన కనిపించటం లేదు. అన్ని అర్హతలూ ఉన్నా రేషన్ కార్డు లేదని, ఆధార్ కార్డు లేదని, పొలం ఎక్కువ ఉందని, ఇంటికి ఒక్కటే పింఛను అని, వైకల్యం తక్కువగా ఉందని ఇలా అనేక అడ్డగోలు సాకులు చూపి జిల్లాలో వేలాది మందికి పింఛన్లు తిరస్కరించారు. దీంతోపాటు అధికార పార్టీ కనుసన్నల్లో ఉండే జన్మభూమి గ్రామ కమిటీలకు అర్హులు నచ్చకపోయినా పింఛను అందని దారుణ పరిస్థితులు
నెలకొన్నాయి.
5.79 లక్షల దరఖాస్తులు...
టీడీపీ అధికారంలోకొచ్చాక 2014 అక్టోబర్‌లో, 2015లో జూన్‌లో, ఈ ఏడాది జనవరిలో జన్మభూమి సభలు జరిగాయి. ఈ మూడు విడతల్లో వివిధ పథకాల కోసం ప్రజల నుంచి 5.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 5.75 లక్షల అర్జీలు పరిష్కరించినట్లు అధికారులు రికార్డుల్లో చూపారు. మిగిలిన 3,927 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు చూపించారు. అయితే ఈ ఏడాది జన్మభూమిలో అందిన దరఖాస్తుల్ని ఇంకా పూర్తి స్థాయిలో పరిశీలించి మండల కార్యాలయాల్లో అప్‌లోడ్ చేసే పనుల్లో ఉన్నారు. జిల్లాలో మొత్తం 3,35,715 పింఛన్లు ఉన్నాయి. గడిచిన రెండు జన్మభూమి సభల్లో కలిపి వికలాంగుల పింఛన్ల కోసం 74,871 దరఖాస్తులు అందగా, వాటిలో 11,291 తిరస్కరించారు. వైకల్యం 40 శాతం కంటే ఒక్క శాతం తక్కువున్నా పింఛనుకు అనర్హులేనని అధికారులు ప్రకటించినా, తిరస్కరణకు గురైన వారిలో అనేకమంది 40 శాతం కంటే ఎక్కువగా వైకల్యం ఉన్నవారే కావటం గమనార్హం. మరోపక్క వృద్ధాప్య పింఛన్ల అర్జీల్లో 12 వేల పైచిలుకు తిరస్కరించారు.
ఇంటికి ఒకటే పింఛను...
గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో 60 ఏళ్లు దాటినవారు ఎంతమంది ఉన్నా పింఛను మంజూరు చేసేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పింఛను మొత్తం పెంచి దానిని కత్తిరింపులో సర్దుబాటు చేశారు. ఇంటికి ఒకటే పింఛను అని తేల్చిచెప్పారు. దీంతో వేలాదిమంది వృద్ధులు పింఛన్లు పొందలేక నెలవారీ ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు.
పింఛను.. వంచన
Published Tue, Feb 9 2016 1:09 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM
Advertisement