ఏసీబీ వలలో కపిలేశ్వరపురం డీటీ
Published Tue, Jan 7 2014 2:39 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
కపిలేశ్వరపురం, న్యూస్‌లైన్ :కపిలేశ్వరపురం మండల డిప్యూటీ తహశీల్దారు (డీటీ) పి.శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. సోమవారం సాయంత్రం తహశీల్దారు కార్యాలయంలో కపిలేశ్వరపురానికి చెందిన ఓ రేషన్ షాపు డీలరు నుంచి రూ.ఐదు వేలు లంచం తీసుకుంటుండగా రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలోని బృందం వలపన్ని పట్టుకుంది. డీఎస్పీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సత్యసాయి మహిళా శక్తి సంఘం అధ్యక్షురాలు అనుకుల చిట్టిరత్నం 30వ నంబరు రేషన్‌షాపును నిర్వహిస్తున్నారు. సరుకుల పంపిణీ పూర్తయ్యాక స్టాకు రిజిస్టర్, మిగిలిన కూపన్లు,
సంబంధిత రిక్టారులను తహశీల్దారు కార్యాలయంలో జమ చేసి కొత్త సేల్స్ రిజిస్టర్ తీసుకోవడం ప్రతి నెలా జరిగే ప్రక్రియ. చిట్టిరత్నంకు జనవరి నెలకు సంబంధించిన కొత్త సేల్స్ రిజిస్టర్‌ను ఇచ్చేందుకు డిప్యూటీ తహశీల్దారు శ్రీనివాసరావు రూ.ఆరు వేలు లంచం డిమాండ్ చేశారు. దాంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వారి సూచనల మేరకు రూ.ఐదు వేలు లంచం ఇచ్చేందుకు అంగీకరించిన చిట్టిరత్నం తహశీల్దారు కార్యాలయానికి వెళ్లి ఆ మొత్తం ఇస్తుండగా పట్టుకున్నారు. ఈ దాడిలో ఇన్‌స్పెక్టర్లు సంజీవరావు, రాజశేఖర్ పాల్గొన్నారు. కాగా డిప్యూటీ తహశీల్దారు అవినీతికి పాల్పడిన సంఘటనపై విచారణ జరుపుతున్నామని డీఎస్పీ వెంకటేశ్వరరావు విలేకరులకు తెలిపారు. కార్యాలయంలో రసాయనిక పరీక్షలు జరిపామని, సంబంధిత రికార్టులను పరిశీలించామని, మండపేటలోని శ్రీనివాసరావు నివాసంలో కూడా సోదాలు చేస్తామని చెప్పారు. ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పర్చుతామన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే 94404 46160, 94404 46161, 94404 46163 నంబర్లకు తెలపాలని కోరారు.
మండలంలో పెచ్చుమీరిన అవినీతి
కపిలేశ్వరపురం మండలంలో రెవెన్యూ అధికారుల అవినీతి పెచ్చుమీరింది. ఏసీబీకి చిక్కిన శ్రీనివాసరావు 2012 ఆగస్టులో ఇక్కడ డిప్యూటీ తహ శీల్దారుగా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు అదే హోదాలో కాజులూరు మండలంలో పని చేశారు. లంక భూములు విస్తారంగా ఉన్న మండలంలో తరచూ మట్టి తవ్వకాలు జరగడం, లంక భూములు వివాదాల్లో ఉండటం తదితర కారణాల రీత్యా ఎవరు వచ్చినా ‘పై సంపాదన’ హెచ్చుగానే ఉంటోంది. 2013 జూన్ నాలుగున అప్పటి తహశీల్దారు వి.చిట్టిబాబు అంగరకు చెందిన ఓ చేనేత సహకార సంఘానికి కమ్యూనిటీ హాలు నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. చిట్టిబాబుకు ముందు తహశీల్దారుగా పనిచేసిన డి.నాగేశ్వరరావు కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
Advertisement